Sirach Chapter 31 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 31వ అధ్యాయము
1. సంపదలు కలవాడు జాగరణలు చేయుచు తన బరువును కోల్పోవును. సొత్తును గూర్చిన ఆందోళన అతని నిద్రను చెరచును. 2. సొమ్ము చేసికోవలెనను చింత, ఘోరవ్యాధివలె అతని నిద్రను పాడుచేయును. 3. ధనికుడు కష్టించి డబ్బు విస్తారముగా ప్రోగుజేసికొనును. తరువాత విశ్రాంతి తీసికొనుచు సుఖములు అనుభవించును. 4. దరిద్రుడు కష్టించి స్వల్పాదాయము గడించును. అతడు విశ్రాంతి తీసికొనునపుడు చేతిలో పైసా ఉండదు. 5. ధనాశ గలవాడు సత్పురుషుడు కాజాలడు. డబ్బు చేసికోగోరువాడు పాపమును కట్టుకొనును. 6. డబ్బువలన చాలమంది నాశనమైరి. ధనమువలన వారు వినాశనమునకు చిక్కిరి. 7. ధనమువలన సమ్మోహితుడగు వానికది ఉరియగును. మూర్ఖులు ఆ ఉరిలో తగుల్కొందురు. 8. పాపమార్గమున డబ్బు కూడబెట్టనివాడును, నిర్దోషియైన ధనికుడును ధన్యుడు. 9. అట్టివాడు దొరకెనేని అతనిని అభినందింపవలెను అతడు ధనికులెవ్వరును చేయలేని అద్భుతమును చేసెను. 10. ఈ పరీక్షలో నెగ్గినవాడు నిక్కముగా గర్వింపవచ్చును. పాపము చేయగలిగినా చేయనివాడును, పరుని మోసగింపగలిగినా మోసగింపనివాడును, ఎవడైనగలడా? 11. అట్టి వాడెవడైన వున్నచోఅతని సంపదలు స్థిరముగా నిలుచునుగాక! ప్రజలెల్లరు అతని మంచితనమును సన్నుతింతురు. 12. విందును ఆరగి...