Sirach Chapter 28 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 28వ అధ్యాయము
1. ప్రభువు నరుని పాపములనెల్ల గమనించును. పగతీర్చుకొను నరునిమీద ఆయన పగ తీర్చుకొనును.
2. నీవు తోడి నరుని అపరాధములను మన్నించినచో నీవు మొర పెట్టినపుడు దేవుడు నీ అపరాధములను మన్నించును.
3. నీవు తోడినరుని మీద కోపముగానున్నచో, నిన్ను క్షమింపుమని భగవంతుని ఎట్లడుగగలవు?
4. తోడినరుని మన్నింపనివాడు, తన తప్పిదములను మన్నింపుమని దేవుని ఎట్లు వేడుకొనగలడు?
5. నరమాత్రుడైనవాడు కోపమును అణచుకోజాలనిచో ఇక అతని తప్పిదములను ఎవడు మన్నించును?
6. నీవు చనిపోవుదువని జ్ఞప్తికి తెచ్చుకొని నీ పగను అణచుకొనుము. నీవు చనిపోగా నీ దేహము క్రుళ్ళిపోవునని గ్రహించి దైవాజ్ఞలు పాటింపుము.
7. దేవుని ఆజ్ఞలను స్మరించుకొని పొరుగు వాని మీద కోపము మానుకొనుము. దేవుని నిబంధనమును తలచి అన్యుని తప్పిదములను మన్నింపుము.
8. కలహములను పరిహరింతువేని నీ పాపములు తగ్గును. కోపము వలన కలహములు పెరుగును.
9. దుష్టుడు స్నేహితుల మధ్య తగవులు పెట్టి కలిసియున్న వారిని విడదీయును.
10. కట్టెకొలది మంటలు, మొండితనము కొలది కలహములు. నరుడు బలవంతుడును, ధనవంతుడైన కొలది. అతని కోపము రెచ్చిపోవును.
11. దిడీలున పుట్టుకొనివచ్చు కలహము ఉద్రేకమును పెంచును. ఆ త్వరపడి కలహించువారు, రక్తపాతమునకు ఒడిగట్టుదురు.
12. నిప్పురవ్వ మీద ఊదినచో మంటలేచును. దానిమీద ఉమ్మి వేసినచో అది ఆరిపోవును. ఈ రెండు క్రియలను మనము నోటితోనే చేయుదుము.
13. కల్లలాడువారును, అపనిందలు పుట్టించువారును శాపగ్రస్తులు. అందుకు డల అట్టివారు శాంతియుతముగా జీవించువారిని అనేకులను నాశనము చేయుదురు.
14. అపదూరులు మోపువారు చాలమందిని నాశనము చేసిరి. తావునుండి తావునకు తరిమికొట్టిరి. ఆ దుష్టులు బలమైన పట్టణములను కూల్చివేసిరి. ప్రముఖుల గృహములను కూలద్రోసిరి.
15. ఇంకను వారు యోగ్యురాండ్రయిన ఇల్లాండ్రకు విడాకులిప్పించిరి. వారి కష్టార్జితములను అపహరించిరి.
16. అపదూరులుమోపు వాని మాటలు నమ్మువాడు శాంతిని, విశ్రాంతిని కోల్పోవును
17. కొరడాదెబ్బ ఒడలిమీద బొబ్బలు పొక్కించును. కాని దుష్టజిహ్వ ఎముకలనుగూడ విరుగగొట్టును
18. కత్తివాత పడి చాలమంది చచ్చిరి. కాని నాలుక వాతబడి చచ్చినవారు ఇంకను ఎక్కువ.
19. నాలుక ఉపద్రవమునకు లొంగనివాడు, దాని ఆగ్రహమునకు గురికానివాడును, దాని కాడిని మెడమీద పెట్టుకొని మోయనివాడును దాని గొలుసులచే బంధింపబడనివాడును ధన్యుడు
20. నాలుకకాడి యినుపకాడి, దానిగొలుసులు ఇత్తడిగొలుసులు.
21. అది తెచ్చిపెట్టు చావు ఘోరమైన చావు. నాలుక కంటె పాతాళలోకము మెరుగు.
22. కాని నాలుక భక్తులను జయింపలేదు, దాని మంటలు వారిని తాకజాలవు.
23. ప్రభువును విడనాడిన వారినే జిహ్వ బాధించును. ఆరని మంటలతో వారిని దహించివేయును. అది సింహమువలె వారి మీదికి దూకును. చిరుతపులివలె వారిని చీల్చివేయును.
24. నీ పొలమునకు ముళ్ళకంచె వేయుదువుకదా! నీ ధనమును పెట్టెలో పెట్టి . తాళము వేయుదువుకదా!
25. అట్లే నీ ప్రతిపలుకును తక్కెడలో పెట్టి తూచుము. నీ నోటికి తలుపు పెట్టి గడె బిగింపుము.
26. నీ నాలుకవల్లనే నీవు నాశనమై పోకుండునట్లును, నీ పతనమును ఆశించువాని ఎదుట నీవు వెల్లకిల పడకుండునట్లును, జాగ్రత్త పడుము.