1. పిమ్మట తండ్రికి జబ్బు చేసినదని యోసేపునకు వార్తవచ్చెను. అతడు తన కుమారులైన మనష్షేను, ఎఫ్రాయీమును వెంటబెట్టుకొని తండ్రి కడకు వెళ్ళెను.
2. కుమారుడు యోసేపు వచ్చుచున్నాడని యాకోబునకు తెలిసెను. తన బలమంతయు కూడగట్టుకొని అతడు మంచముమీద లేచి కూర్చుండెను.
3. యాకోబు కుమారుని చూచి "కనాను దేశమందలి లూజులో సర్వశక్తిమంతుడగు దేవుడు నాకు ప్రత్యక్షమై నన్నాశీర్వదించెను.
4. దేవుడు నాతో 'యాకోబూ! నీవు పెంపొందునట్లు చేయుదును. ఒక మహాజాతిగా అవతరింప నీ సంతతిని విస్తరిల్లచేయుదును. ఈ దేశమును నీ తరువాత నీ సంతతికి శాశ్వత భుక్తి యగునట్లు ప్రసాదింతును' అనెను.
5. యోసేపూ! నేను రాకముందు ఐగుప్తుదేశములో నీకు పుట్టిన కుమారులిద్దరు నా కుమారులే అగుదురు. రూబేను షిమ్యోనుల మాదిరిగా మన్మ, ఎఫ్రాయీములుగూడ నా సొంతపుత్రులే.
6. వారి తరువాత పుట్టినవారు మాత్రము నీ సంతానమే. కాని వారు నివసించు ప్రదేశములనుబట్టి పిలువవలసి వచ్చినపుడే వారు తమ అన్నల పేరులతో పిలువబడుదురు.
7. పద్దనారాము నుండి వచ్చుచున్నప్పుడు కనాను దేశములో ఎఫ్రాతాకు ఇంకా కొంతదూరమున నుండగా త్రోవలో రాహేలు చనిపోయినది. బేత్లెహేము అను ఎఫ్రాతా నగరమార్గ మున ఆమెను పాతి పెట్టితిని” అనెను.
8.పిమ్మట యిస్రాయేలు యోసేపు కుమారులను చూచి 'వీరెవరు?” అని అడిగెను.
9. “వీరు నా కుమారులు. ఈ దేశమున దేవుడు వీరిని నాకు ప్రసాదించెను” అని యోసేపు చెప్పెను. అంతట యాకోబు “వీరిని నా దగ్గరకు తీసికొనిరమ్ము, దీవింతును” అనెను.
10. ముసలితనముచేత యిస్రాయేలునకు చూపుమందగించినది. అతడు మనుమలను చూడలేకపోయెను. అందుచేత యోసేపు తండ్రికి దగ్గరగా కుమారులను తీసికొని వెళ్ళెను. యాకోబు వారిని కౌగలించుకొని ముద్దాడెను.
11. యాకోబు యోసేపుతో “మరల నిన్ను చూచెదనని కలలోకూడ అనుకోలేదు. కాని దేవుని దయచేత నిన్నేకాదు, నీ కుమారులనుకూడ చూడగలిగితిని” అనెను.
12. అప్పుడు కుమారులను తండ్రి ఒడినుండి తీసికొని యోసేపు అతనికి సాష్టాంగనమస్కారము చేసెను.
13. అతడు యిస్రాయేలునకు ఎడమ ప్రక్కగా ఉండునట్లు ఎఫ్రాయీమును తన కుడిచేతితో పట్టు కొనెను. యిస్రాయేలునకు కుడితట్టుగా ఉండునట్లు మనష్పేను తన ఎడమచేతితో పట్టుకొనెను. ఈ విధముగా పట్టుకొనిన కుమారులను ఇద్దరిని తండ్రికి దగ్గరగా తీసికొనివచ్చెను.
14. యాకోబు తన కుడి చేతినిచాచి, చిన్నవాడైన ఎఫ్రాయీము తలమీద ఉంచెను. కుడిచేతిమీదుగా ఎడమచేతినిచాచి, పెద్ద వాడైన మనష్షే తలమీద పెట్టెను.
15-16. ఈ విధముగా చేతులుంచి యాకోబు యోసేపును ఆశీర్వదించుచు, . “నా తాతతండ్రులైన అబ్రహాము, ఈసాకు త్రికరణశుద్ధిగా కొలిచినదేవుడు, పుట్టినది మొదలు ఈ నాటివరకును నన్ను కాపాడిన దేవుడు, ఎల్లకీడులనుండి నన్ను తప్పించిన దేవదూత, ఈ బాలురను ఆశీర్వదించునుగాక! వీరు నా పేరును, నా పితరులైన అబ్రహాము, ఈసాకుల పేరును నిలబెట్టుదురుగాక! వీరు పెక్కుమంది పిల్లలను కని మహాజాతిగా విస్తరిల్లుదురుగాక!” అనెను.
17. ఎఫ్రాయీము తలమీద తండ్రి తన కుడి చేతిని ఉంచుట యోసేపునకు కష్టము కలిగించెను. అతడు తండ్రి చేతిని పట్టుకొనెను. దానిని ఎఫ్రాయీము తల మీదినుండి తీసి మన ష్నే తలమీద పెట్టనెంచి,
18. "తండ్రీ! ఇదేమి? వీడు పెద్దవాడుకదా! నీ కుడి చేతిని వీని తలమీదఉంచుము” అనెను.
19. దానికి యాకోబు ఒప్పుకొనలేదు. అతడు "కుమారా! తెలిసి తెలిసి ఇట్లు చేసితిని. మనప్పే గొప్పవాడగును. అతని సంతతి కూడా విస్తరిల్లును. కాని అతని తమ్ముడు ఎఫ్రాయీము అతనికంటె కూడ గొప్పవాడు అగును. ఎఫ్రాయీము సంతతి ఒక మహాజాతిగా పరిణ మించును” అనెను.
20. అంతట యాకోబు వారిని ఆశీర్వదించి, “యిస్రాయేలీయులు తమవారిని దీవించునపుడు “మీరును ఎఫ్రాయీము మనష్షేలంతటి వారగుదురుగాక!' అని పలుకుదురు మీకు నా దీవెనలు” అనెను. ఈ విధముగా యాకోబు ఎఫ్రాయీమును మనష్షేకంటె పెద్దచేసెను.
21. యిస్రాయేలు ఇంకను యోసేపుతో “నాయనా! నేను చనిపోవుచున్నాను. దేవుడు మీకు తోడుగా ఉండును. మీ తాతదండ్రుల భూమికి మిమ్ము మరల తీసికొనిపోవును.
22. సోదరులకంటె ఎక్కువగా ఒక భాగము నీకిచ్చితిని. అది కత్తిని, వింటిని చేపట్టి అమోరీయులనుండి నేను స్వయముగా సంపాదించిన షెకెము”' అనెను.