Sirach Chapter 16 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 16వ అధ్యాయము
1. దుర్మార్గులైన తనయులు చాలమంది ఎందులకు? భక్తిహీనులైన పుత్రులవలన ప్రమోదము కలుగదుకదా!
2. దైవభక్తిలేని బిడ్డలెంతమంది ఉన్నను, వారిని చూచి సంతృప్తి చెందకుము.
3. ఆ బిడ్డల భవిష్యత్తు శుభప్రదమగుననియు, వారు దీర్ఘకాలము జీవింతురనియు ఆశింపకుము. వేయిమంది పుత్రులకంటె ఒక్కడు మెరుగు. భక్తిహీనులైన బిడ్డలను కనుటకంటె , అసలు బిడ్డలు లేకుండ చనిపోవుటే మేలు.
4. ఒక్కని విజ్ఞతవలన నగరపు జనసంఖ్య పెరుగును. దుర్మార్గుల తెగ మాత్రము నాశనమగును.
5. ఇట్టి ఉదంతములను నేను పలుమార్లు చూచితిని. వీనికంటె గొప్ప సంఘటనలను నా చెవులతో వింటిని.
6. పాపాత్ముల సమాజమున ప్రభువు కోపాగ్ని రగుల్కొనును. అవిధేయుల బృందమున ఆయన క్రోధము గనగనమండును.
7. ప్రాచీనకాలపు రాక్షసజాతివారు తమ బలమును చూచుకొని , దేవునిమీద తిరుగబడగా ఆయన వారిని క్షమింపడయ్యెను.
8. లోతుతో కలిసి జీవించిన ప్రజల గర్వమునకుగాను ప్రభువు వారిని చీదరించుకొని శిక్షకు గురిచేసెను.
9. ఆయన పాపము చేసిన జాతిని నాశనము చేయ సంకల్పించుకొనెను. దానిమీద కరుణ చూపడయ్యెను.
10. ఎడారి ప్రయాణమున ఆరు లక్షలమంది ఏకమై మూర్ఖముగా తనమీద తిరుగబడగా వారిని కనికరింపడయ్యెను.
11. పెడసరి బుద్ధికల వాడొక్కడే ఉండినను ఆ ఒక్కడుకూడ శిక్ష తప్పించుకోజాలడు. ప్రభువు కృపాకోపములు రెండింటిని ప్రదర్శించును ఆయన క్షమించుటకు, కోపించుటకును కూడ సమర్థుడు.
12. ఆయన కృప ఎంత గొప్పదో శిక్షయు అంత తీవ్రమైనది. నరులు చేసిన క్రియలబట్టి, ఆయన వారికి తీర్పుచెప్పును.
13. పాపాత్ముడు తాను దోచుకొనిన దానికి , శిక్షననుభవింపక తప్పదు. పుణ్యపురుషుని శ్రమకు ఫలితమును దక్కకపోదు
14. దేవుడు అపార కృపకలవాడు. అయినను ప్రతివానికి వాని క్రియలకు తగినట్లే ప్రతిఫలమిచ్చును.
15. ప్రభువు ఐగుప్తు రాజు గుండెను రాయిచేసెను. కనుక రాజు ప్రభువును అంగీకరింపడయ్యెను. అందువలన ప్రభువుని మహాకార్యములు లోకమునకు వెల్లడి అయ్యెను.
16. ప్రభువు తాను చేసిన సృష్టికంతటికిని దయ జూపును. ఆయన చీకటినుండి వెలుతురును విడదీసెను.
17. "నేను ప్రభువు కంటబడకుండ దాగుకొందును. ఆకాశముననున్నవాడు నన్ను పట్టించుకొనునా? ఇంతమందిలో ఆయన నన్ను గుర్తుపట్టునా? '' ఇంతటి మహాప్రపంచములో నేనేపాటివాడను” అని ఎంచకుము.
18. ప్రభువు విజయము చేయుటను చూచి ఆకాశమును, దానిమీద మహాకాశమును, సముద్రమును, భూమియు భీతితో కంపించును
19. ప్రభువు తమవైపుచూడగా కొండలును, నేలపునాదులును గడగడ వణకును.
20. కాని ఈ అంశములను పట్టించుకొనువాడెవడు? ప్రభువు కార్యరీతులను అర్థము చేసికొను వాడెవడు?
21. తుఫాను గాలి కంటికి కన్పింపదు. అట్లే ప్రభువు కార్యములను గూడ కంటితో చూడజాలము.
22. మన కార్యములకు తీర్పు జరుగునో లేదో ఎవరు చెప్పగలరు? ప్రభువు తీర్పుకొరకు ఎవడుకాచుకొనియుండును? ఆయన నిర్ణయించిన మరణదినము ఇప్పటిలో రాదు కదా అని
23. అల్పబుద్ధియు, పెడదారిలో పోవునట్టివాడునగు నరుడు భావించు చుండును.
24. కుమారా! నా పలుకులు విని విజ్ఞానము పొందుము. ఆ నా మాటలను సావధానముగా ఆలకించుము.
25. నేను నీకు జాగ్రత్తగా ఉపదేశము చేయుదును. నికరమైన పద్దతిలో నీకు విజ్ఞానమును బోధింతును
26. ఆదిలో భగవంతుడు సృష్టి చేసినపుడు ప్రతి వస్తువునకు దాని స్థానమును నియమించెను
27. ఆయన తాను చేసిన వస్తువులన్ని కలకాలము మనునట్లు చేసి, వానికి శాశ్వతగతి కల్పించెను. ఆ వస్తువులకు ఆకలి కలుగదు. అవి అలసిపోవు, తమ పనులను విరమించుకొనవు
28. అవి ఒక దానితోనొకటి ఒరసికొనవు. ఆ ప్రభువాజ్ఞ ఇసుమంతయును మీరవు.
29. ఈ వస్తువులన్నిటిని చేసిన తరువాత ప్రభువు నేలమీదికి పారజూచి దానిని ఉత్తమ ప్రాణులతో నింపెను.
30. అతడు నానావిధ ప్రాణులను మంటిమీద నెలకొల్పెను. అవి అన్నియు మరల మంటిలోనే కలిసిపోవును.