1. నీవు ధనము మీద ఆధారపడకుము. డబ్బుతో "నాకు స్వయం సమృద్ధి" కలదని, అన్ని కలవు" అని తలపకుము.
2. నీవు కోరుకొనినదెల్ల సంపాదించు యత్నము చేయకుము. నీ హృదయ వాంఛల ప్రకారము ప్రవర్తింపకుము.
3. "నా మీదెవరికి అధికారము కలదు?” అని ఎంచకుము. అట్లు ఎంచెదవేని ప్రభువు నిన్ను శిక్షించును.
4. నేను పాపము చేసినను శిక్ష పడలేదుకదా అనుకొనకుము. ప్రభువు దీర్ఘకాలముసహించి ఊరకుండును.
5. దేవుడు క్షమింపక పోడులే అని యెంచి పాపముమీద పాపము మూట గట్టుకోవలదు.
6. "ప్రభువు మహా కృప గలవాడు. కనుక నేనెన్ని పాపములు చేసినను క్షమించునులే” అని తల పకుము. ఆయన కృపను, కోపమును గూడ ప్రదర్శించును. పాపులను కఠినముగా దండించును.
7. కనుక నీవు రోజుల తరబడి జాప్యము చేయక శిఘ్రమే దేవుని యొద్దకు మరలిరమ్ము ప్రభువు కోపాగ్ని నీ మీద దిడీలున రగుల్కొన వచ్చును. అప్పుడు ఆయన శిక్ష వలన నీవు సర్వనాశమయ్యెదవు.
8. అన్యాయార్జితమైన ధనమును నమ్మకుము. నాశము సంభవించినపుడు అది నిన్ను కాపాడలేదు.
9. ప్రతిగాలికి తూర్పార పట్టవద్దు. ప్రతిత్రోవ త్రోక్కవద్దు. చిత్తశుద్ధిలేని పాపులకది చెల్లును.
10. నీవు నమ్మినదానికి కట్టువడి ఉండుము. నీ పలుకులలో నిజాయితి చూపెట్టుము.
11. ఇతరులు మాటలాడినపుడు జాగ్రత్తగా వినుము. కాని నిదానముగా ఆలోచించి జవాబు చెప్పుము.
12. నీకు తెలియనేని బదులుచెప్పుము. లేదేని మౌనము వహింపుము.
13. నీ మాటలవలననే నీకు ఖ్యాతి, అపఖ్యాతికూడ కలుగును. నీ నాలుక వలననే నీవు నాశము తెచ్చుకొందువు.
14. నీవు చాడీలుచెప్పుటలో దిట్టవనిపించుకోవలదు. నీ నాలుకతో ఉచ్చులు పన్నువద్దు. దొంగలు అవమానమునకు గురియైనట్లే అసత్య వాదులు తీవ్రనిందకు పాత్రులగుదురు.
15.పెద్ద తప్పులను, చిన్న తప్పులనుకూడ మానుకొనుము.