Telugu Catholic Bible Mark chapter 16 || Telugu catholic Bible online || మార్కు సువార్త 16వ అధ్యాయము
1. విశ్రాంతి దినము గడచిన తరువాత మగ్దలా మరియమ్మ, యాకోబుతల్లి మరియమ్మ, సలోమియమ్మ యేసు భౌతికదేహమును అభిషేకించుటకై సుగంధ ద్రవ్యములను కొని, 2. ఆదివారము వేకువజామున బయలుదేరి సూర్యోదయసమయమునకు సమాధిని చేరిరి. 3. "సమాధి ద్వారమునుండి ఆ బండను తొలగింప మనకు ఎవరు తోడ్పడుదురు?” అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి. 4. అది ఒక పెద్దరాయి. కాని వారు వెళ్ళి చూచునప్పటికే ఆ రాయి తొలగింపబడి ఉండుట చూచిరి. 5. వారు సమాధిలోనికి పోగా, తెల్లనివస్త్రములు ధరించి సమాధి కుడి ప్రక్కన కూర్చుండియున్న ఒక యువకుని చూచి ఆశ్చర్యచకితులైరి. 6. అతడు వారితో “మీరు భయపడకుడు. సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు. ఆయన పునరుత్థానుడయ్యెను. ఇక్కడ లేడు. వచ్చి ఆయనను ఉంచిన స్థలమును చూడుడు. 7. మీరు వెళ్ళి పేతురునకు, తక్కిన శిష్యులకు 'ఆయన మీకంటె ముందు గలిలీయకు వెళ్ళుచున్నాడు. తాను చెప్పినట్లు మీరు ఆయనను అచట చూచెదరు' అని చెప్పుడు” అనెను. 8. వారు ఆశ్చర్యముతోను, భయముతోను బయటకు వచ్చి అచటనుండి పరుగెత్తిరి. వారు భయ పడినందున ఎవ్వరితో ఏమియు చెప్పలేదు. 9. ఆదివారము ప్రాతఃకాలమున పునరుత్థనుడైన యేసు, తాను ఏడు దయ్యములను వెళ్ళగొట్టిన మ...