Telugu Catholic Bible Mark chapter 14 || Telugu catholic Bible online || మార్కు సువార్త 14వ అధ్యాయము
1. పాస్క పులియని రొట్టెల పండుగకు రెండు దినములు ముందు ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు కపటోపాయముచే యేసును ఏ విధముగా బంధించి చంపుదుమా అని సమాలోచనము చేయ సాగిరి.
2. కాని ప్రజలలో అలజడి కలుగునని, అది పండుగలో చేయతగదని తలంచిరి.
3. యేసు బెతానియా గ్రామమున కుష్ఠరోగియగు సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉండగా ఒక స్త్రీ విలువైన పరిమళ తైలము గల పాత్రతో వచ్చి, ఆ పాత్రను పగులగొట్టి, దానిని ఆయన శిరస్సుపై పోసెను.
4. అది చూచిన కొందరు కోపపడి “ఈ వృథా వ్యయము ఎందులకు?
5. దీనిని మూడువందల దీనారములకంటె ఎక్కువధరకు అమ్మి పేదలకు దానము చేయవచ్చునుగదా!” అని ఆమెను గూర్చి సణుగుగొనసాగిరి.
6. యేసు అది గ్రహించి వారితో “ఈమె జోలికి పోవలదు, ఈమెను మీరేల నొప్పించెదరు? నా పట్ల ఈమె మంచిపనియే చేసినది.
7. పేదలు మీతో ఎల్లప్పుడును ఉందురు. మీ ఇష్టము వచ్చినప్పుడెల్ల వారికి మీరు సహాయపడవచ్చును. కాని, నేను మీతో ఎల్లప్పుడు ఉండను.
8. ఈమె తన శక్తికొలది చేసినది. భూస్థాపనార్దము నా శరీరమును ముందుగానే ఈమె పరిమళముతో అభిషేకించినది.
9. ప్రపంచము నందంతట ఈ సువార్త ఎచ్చట బోధింపబడునో అచ్చట ఈమె చేసినది, ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” అనెను.
10. పన్నిద్దరిలో ఒకడగు యూదా ఇస్కారియోతు యేసును పట్టియిచ్చుటకై ప్రధానార్చకులవద్దకు వెళ్ళెను.
11. అది విని వారు మిగుల సంతసించి వానికి కొంత రొక్కమును ఇచ్చుటకు వాగ్దానము చేసిరి. కనుక వాడు ఆయనను పట్టియిచ్చుటకు కాచుకొని యుండెను.
12. పాస్కబలి సమర్పించు పులియని రొట్టెల పండుగ మొదటిదినమున శిష్యులు యేసువద్దకు వచ్చి “మేము మీకు ఎచ్చట పాస్కభోజనమును సిద్ధపరుప గోరుచున్నారు?” అని అడిగిరి.
13. అప్పుడు ఆయన ఇద్దరు శిష్యులను పంపుచు “మీరు పట్టణములోనికి పొండు. అచట కడవతో నీటిని తీసికొనివచ్చు ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును.
14. మీరు అతనిని వెంబడించి అతడు ప్రవేశించిన ఇంటికి వెళ్ళి ఆ యింటి యజమానునితో “నా శిష్యులతో నేను పాస్క భోజనము భుజింపవలసిన అతిథిశాల ఎక్కడ? అని మా గురువు అడుగుచున్నాడు” అని చెప్పుడు.
15. అప్పుడు అతడు మేడపై సిద్ధపరుపబడిన విశాలమైన గదిని మీకు చూపును. అందు మనకు పాస్కభోజన మును సిద్ధపరపుడు” అని చెప్పెను.
16. అంతట ఆశిష్యులు బయలుదేరి నగరములో ప్రవేశించి, యేసు చెప్పినట్లు కనుగొని పాస్కభోజనమును సిద్ధపరచిరి.
17. సాయంసమయమున పన్నిద్దరు శిష్యులతో యేసు అచ్చటకు వచ్చెను.
18. వారు భోజనము చేయుచుండ ఆయన వారితో “ఇక్కడ నాతో భుజించుచున్న మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగించునని మీతో నిజముగా చెప్పుచున్నాను” అనెను.
19. అందుకు వారు మిగులచింతించి “నేనా? నేనా?” అని ఒక్కొక్కరు అడుగసాగిరి.
20. అందుకు ఆయన “పన్నిద్దరిలో ఒకడు నాతో ఈ పాత్రలోనే రొట్టెను అద్దుకొనువాడే.”
21. “మనుష్యకుమారుని గూర్చి వ్రాయబడినట్లు ఆయన మరణించును. కాని, మనుష్యకుమారుని అప్పగించువానికి అయ్యో అనర్గము! అతడు జన్మింపకుండిన అతనికి మేలుగా ఉండెడిది” అనెను.
22. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని, ఆశీర్వదించి, త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు “దీనిని మీరు తీసికొని భుజింపుడు. ఇది నా శరీరము” అనెను.
23. తరువాత ఆయన పాత్రమును అందుకొని కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి వారికి అందించెను. దానినుండి వారు అందరు త్రాగిరి.
24. యేసు వారితో “ఇది అనేకుల కొరకు చిందబడనున్న నూతననిబంధన యొక్క నా రక్తము.
25. ఇది మొదలు దైవరాజ్యములో ద్రాక్షరసమును నూతన ముగా పానముచేయు దినమువరకు దీనిని ఇక త్రాగనని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను” అనెను.
26. వారొక స్తుతిగీతము పాడిన పిదప ఓలివుకొండకు వెళ్ళిరి.
27. అప్పుడు యేసు వారితో “మీరు నన్ను విడిచి పోయెదరు. ఏలయన 'నేను గొఱ్ఱెల కాపరిని కొట్టుదును, గొఱ్ఱెలన్నియు చెల్లాచెదరగును' అని వ్రాయబడియున్నది.
28. కాని నేను సజీవునిగా లేపబడిన పిదప మీకంటె ముందుగా గలిలీయసీమకు వెళ్ళెదను” అని పలికెను.
29. “అందరు మిమ్ము విడిచివెళ్ళినను నేను మాత్రము మిమ్ము విడిచి వెళ్ళను" అని పేతురు పలికెను.
30. అందుకు యేసు “ఈ రాత్రి కోడి రెండవమారు కూయకమునుపే నీవు నన్ను ఎరుగను అని ముమ్మారు బొంకెదవు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అనెను.
31. అప్పుడు పేతురు ఆయనతో “మీతో మరణింపవలసివచ్చినను నేను మిమ్ము ఎరుగను అని బొంకను” అని నొక్కి పలికెను. అటులనే శిష్యులందరును పలికిరి.
32. అంతట యేసు తనశిష్యులతో గెత్సెమని తోటకు వచ్చి, “నేను ప్రార్థనచేసికొని వచ్చువరకు మీరు ఇచట కూర్చుండుడు” అని చెప్పెను.
33. పేతురును, యాకోబును, యోహానులను తనతో వెంటబెట్టుకొని పోయెను. అప్పుడు ఆయన ఆవేదనపడుచు చింతాక్రాంతుడాయెను.
34. ఆయన వారితో “నా ఆత్మ మరణవేదన పడుచున్నది. మీరు ఇచటనే ఉండి జాగరణచేయుడు” అని పలికెను.
35. ఆయన కొంత దూరము వెళ్ళి, నేలపై సాగిలపడి, సాధ్యమైనయెడల ఆ గడియ తననుండి తొలగిపోవలయునని ప్రార్థించెను.
36. “అబ్బా! తండ్రీ! నీకు అసాధ్యమైనది ఏదియు లేదు. ఈ పాత్రమును నానుండి తొలగింపుము. అయినను, నా ఇష్టము కాదు. నీ చిత్తమే నెరవేరనిమ్ము” అని ప్రార్థించెను.
37. అంతట ఆయన తన శిష్యులయొద్దకు వచ్చి, వారు నిద్రించుటను చూచి, పేతురుతో, “సీమోనూ! నిద్రించుచున్నావా? ఒక గంట సేపయినను మేల్కొని ఉండలేకపోతివా?” అని,
38. వారితో “మీరు శోధనకు గురికాకుండుటకై మేల్కొని ప్రార్థింపుడు. ఆత్మ ఆసక్తి కలిగియున్నను, దేహము దుర్బలముగా ఉన్నది” అనెను.
39. ఆయన మరల రెండవమారు వెళ్ళి, అట్లే ప్రార్థించెను.
40. తిరిగివచ్చి, వారి నేత్రములు నిద్రాభారముచే మూతబడుచుండుట చూచెను. ఆయనకు ఏమి చెప్పవలెనో వారికి తోచలేదు.
41. ఆయన మూడవవర్యాయము వచ్చి, వారితో “మీరు ఇంకను నిద్రించుచు, విశ్రమించుచున్నారా? ఇక చాలును. గడియ సమీపించినది. ఇదిగో! ఇప్పుడే మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగింపబడబోవుచున్నాడు.
42. రెండు, పోదము రండు. నన్ను పట్టియిచ్చువాడు సమీపించుచున్నాడు” అనెను.
43.ఆయన ఇట్లు మాటలాడుచుండగా పన్నిద్దరిలో ఒకడగు యూదా వచ్చెను. ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రజల పెద్దలు పంపిన జనసమూహము కత్తులను, బడితలను చేతబూని అతనితో వచ్చెను.
44. “నేను ఎవరిని ముద్దు పెట్టుకొందునో అతడే ఆయన. అతనిని పట్టి బంధించి, భద్రముగా తీసికొని పొండు” అని ఆ గురుద్రోహి వారికి ఒక గురుతును ఇచ్చెను.
45. అతడు యేసు వద్దకు వచ్చిన వెంటనే 'రబ్బీ' అని ఆయనను ముద్దు పెట్టుకొనెను.
46. వారు ఆయనను పట్టి బంధించిరి.
47. వెంటనే అచట నిలిచియున్న వారిలో ఒకడు తన కత్తిని తీసి, ప్రధానా ర్చకుని సేవకునికొట్టి వాని చెవి తెగనరికెను.
48. యేసు వారలతో “మీరు నన్ను పట్టుకొనుటకు కత్తులను, బడితలను తీసికొని దొంగ పైకి వచ్చినట్లు వచ్చితిరా?
49. ప్రతిదినము నేను దేవాలయములో మీమధ్య ప్రసంగించుచుంటిని, మీరు అపుడు నన్ను పట్టుకొనలేదు. కాని, లేఖనములు ఇట్లు నెరవేరవలసి ఉన్నవి” అనెను.
50. అపుడు శిష్యులు అందరు ఆయనను విడిచి పారిపోయిరి.
51. యువకుడు ఒకడు తన దిగంబర శరీరముపై నారవస్త్రము వేసికొని యేసును అనుసరించుచుండెను. వారు అతనిని పట్టుకొనిరి.
52. కాని అతడు నార వస్త్రము విడిచి దిగంబరుడై పారిపోయెను.
53. వారు యేసును బంధించి, ప్రధానార్చకుని యొద్దకు తీసికొనిపోయిరి. అచట ప్రధానార్చకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు అందరు సమావేశమైరి.
54. పేతురు దూరదూరముగ యేసును అనుసరించుచు ప్రధానార్చకుని గృహప్రాంగణమును ప్రవేశించి పరిచారకులతో కలసి చలిమంటయే కూర్చుండెను.
55. ప్రధానార్చకులు, న్యాయస్థానాధిపతులందరు యేసుకు మరణశిక్ష విధించుటకై అబద్ధపు సాక్ష్యములు వెదుకనారంభించిరి. కాని వారికి ఏమియు లభింపలేదు.
56. జనులు అనేకులు ఆయనకు విరుద్ధముగా తప్పుడు సాక్ష్యములు చెప్పిరి. కాని వారి సాక్ష్యములు ఒకదానితో ఒకటి పొసగలేదు. ,
57. అపుడు కొందరులేచి ఆయనకు విరుద్దముగా సాక్ష్యము ఇచ్చుచు,
58. “మానవనిర్మితమగు ఈ దేవాలయమును ధ్వంసముచేసి తిరిగి మూడు దినములలో మానవనిర్మితము కాని వేరొక దేవాలయమును నిర్మింపగలనని ఇతడు చెప్పుచుండగా మేము స్వయముగా వింటిమి” అనిరి.
59. కాని, ఈ సాక్ష్యము కూడ సరిపడలేదు.
60. అపుడు ప్రధానార్చకుడు లేచి సభామధ్యమున నిలువబడి యేసును చూచి, “నీపై మోపబడిన నేరమునకు ఏమి సమాధానము ఇచ్చెదవు?” అని ప్రశ్నించెను.
61. ఆయన బదులు పలుకక మౌనము వహించెను. మరల ప్రధానార్చకుడు ఆయనను “దేవుని కుమారుడవు అగు క్రీస్తువు నీవేనా?” అని ప్రశ్నించెను.
62. అందుకు యేసు “అవును, నేనే. సర్వశక్తిమంతుని కుడిప్రక్కన మనుష్యకుమారుడు కూర్చుండియుండు టయు, ఆకాశమున మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూడగలరు” అని సమాధానము ఇచ్చెను.
63. అపుడు ప్రధానార్చకుడు మండిపడుచూ, తన వస్త్రములను చింపుకొని “ఇప్పుడు ఇక మనకు సాక్షులతో పనియేమి?
64. ఇతని దేవదూషణ మీరును వింటిరికదా! మీ ఉద్దేశమేమి?” అని అడిగెను. వారందరు ఏకకంఠముతో “ఇతడు మరణదండనకు పాత్రుడు” అని నిర్ణయించిరి.
65. కొందరు ఆయనపై ఉమినిరి. మరి కొందరు ఆయన ముఖమును మూసి, గ్రుద్దుచు, “నిన్ను గ్రుద్దినవారెవరు? ప్రవచింపుము!” అని హేళన చేసిరి. భటులు ఆయనను పిడికిళ్ళతో గ్రుద్దిరి.
66. పేతురు ఆ గృహప్రాంగణమున ఉండగా ప్రధానార్చకుని దాసీలలో ఒకతె వచ్చి,
67. చలి కాచుకొనుచున్న పేతురును చూచి "నీవు కూడ నజరేతు నివాసియగు యేసు వెంట ఉన్నవాడవుకావా?” అని ప్రశ్నించెను.
68. అందుకు అతడు “నేను ఏమియు ఎరుగను. నీవు ఏమి చెప్పునది నాకు తెలియుట లేదు” అని బొంకుచు, పంచలోనికి వెళ్ళిపోయెను. వెంటనే కోడికూసెను.
69. అచట ఉన్న దాసి అతనిని చూచి దగ్గర నిలిచియున్నవారితో “ఈతడు వారిలోని వాడే” అని పలికెను.
70. అతడు మరల బొంకెను. ఆ పిదప, అచట ఉన్నవారు పేతురును చూచి, “నీవు నిశ్చయముగా వారిలోని వాడవే, నీవును గలిలీయ నివాసివే" అనిరి.
71. అందుకు పేతురు శపించుకొనుచు, ఆనపెట్టి “మీరు చెప్పుచున్న ఆ మనుష్యుని ఎరుగనే ఎరుగను” అని పలికెను.
72. అంతలో రెండవ పర్యాయము కోడికూసెను. “కోడి రెండు పర్యాయములు కూయకమునుపే ముమ్మారు నీవు నన్ను ఎరుగనని పలుకుదువు” అని యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము రాగా పేతురు వెక్కివెక్కి ఏడెను.