ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Telugu Catholic Bible Mark chapter 15 || Telugu catholic Bible online || మార్కు సువార్త 15వ అధ్యాయము

 1. ప్రాతఃకాలమున ప్రధానార్చకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు, న్యాయస్థానాధిపతులందరును యేసును చంపుటకు ఆలోచనలు చేసిరి. వారు ఆయనను బంధించి తీసికొనిపోయి పిలాతునకు అప్పగించిరి.

2. “నీవు యూదుల రాజువా?” అని పిలాతు ప్రశ్నించెను. “నీవు అన్నట్లే” అని యేసు ప్రత్యుత్తరమిచ్చెను.

3. ప్రధానార్చకులు ఆయనపై అనేక నేరములు ఆరోపించిరి.

4. పిలాతు యేసును చూచి "నీపై వీరు ఎన్నినేరములు మోపుచున్నారో చూడుము. నీవు ఏమియును సమాధానము ఈయవా?” అనెను.

5. యేసు పల్లెత్తి మాటయిన పలుకకుండుట చూచి పిలాతు ఆశ్చర్యపడెను.

6. ఆ పండుగలో జనులు కోరుకొనిన ఒక ఖైదీని విడుదలచేయు ఆచారము పిలాతునకు కలదు.

7. విప్లవములు లేవదీయుచు, నరహత్యలు చేసినవారు కొందరు చెరసాలలో వేయబడి ఉండిరి. వారిలో బరబ్బ అనువాడు ఒకడు.

8. ప్రజలందరు గుమిగూడి పండుగ ఆనవాయితీ చొప్పున ఒక ఖైదీని విడుదల చేయుమని పిలాతును కోరిరి.

9. అందుకు పిలాతు “యూదుల రాజును విడుదల చేయమందురా?” అని వారిని ప్రశ్నించెను.

10. ఏలయన ప్రధానార్చకులు అసూయతో యేసును అప్పగించిరని అతడు ఎరిగి యుండెను.

11. కాని ప్రధానార్చకులు బరబ్బను విడుదల చేయుమని అడుగ వలసినదిగా జనసమూహమును ఎగద్రోసిరి.

12. “అటులయిన యూదుల రాజు అని మీరు చెప్పుచున్న అతనిని నన్ను ఏమి చేయుమందురు?” అని పిలాతు మరల ప్రశ్నించెను.

13. “అతనిని సిలువ వేయుడు” అని వారు కేకలు వేసిరి.

14. "ఆయన చేసిన నేరమేమి?" అని అడుగగా “అతనిని సిలువ వేయవలసినదే” అని మరింత బిగ్గరగా కేకలు వేసిరి.

15. అపుడు పిలాతు జన సమూహములను సంతృప్తిపరచుటకై బరబ్బను విడిపించి, యేసును కొరడాలతో కొట్టించి, సిలువ వేయుటకు వారలకు అప్పగించెను.

16. అపుడు సైనికులు ఆయనను రాజభవన అంతర్భాగమునకు తీసికొనిపోయిరి. సైనికులందరు సమావేశమైన పిమ్మట,

17. వారు యేసుకు ఊదా రంగు వస్త్రములను ధరింపజేసిరి. ముండ్ల కిరీటమును అల్లి, ఆయన తలపై పెట్టిరి.

18. “యూదులరాజా! నీకు జయము” అని ఆయనకు సమస్కరింపసాగిరి.

19. మరియు రెల్లుతో ఆయన తలపై మోది, మీద ఉమిసి, మోకరిల్లి నమస్కరించిరి.

20. వారు అటుల పరిహసించిన పిదప, ఊదా వస్త్రమును తీసివేసి, ఆయన వస్త్రములను ఆయనకు ధరింపజేసి, సిలువ వేయుటకై తీసికొనిపోయిరి.

21. పల్లెటూరినుండి ఆ మార్గమున వచ్చుచున్న కురేనియా గ్రామవాసి సీమోనును ఆయన సిలువను మోయుటకు బలవంతము చేసిరి (అతడు అలెగ్జాండరు, రూఫసుల తండ్రి).

22. 'కపాల' నామాంతరము గల 'గొల్గొతా' అను స్థలమునకు ఆయనను తీసికొని పోయిరి.

23. అచట ఆయనకు చేదుకలిపిన ద్రాక్షరసమును త్రాగుటకు ఇచ్చిరి. కాని ఆయన దానిని పుచ్చుకొనలేదు.

24. పిదప వారు ఆయనను సిలువ వేసిరి. చీట్లు వేసికొని ఆయన వస్త్రములను పంచుకొనిరి.

25. ఉదయము తొమ్మిది గంటలకు ఆయనను సిలువ పైకి ఎక్కించిరి.

26. ఆయన పైనుంచిన నిందారోపణ ఫలకముపై "యూదులరాజు” అని వ్రాయబడి ఉండెను.

27. వారు ఆయనకు కుడి ఎడమల ఇరువురు దొంగలను సిలువవేసిరి.

28. “ఆయన అపరాధులలో ఒకడుగా ఎంచబడెను” అను లేఖనము ఇట్లు నెరవేరెను.

29. పిదప, ఆ మార్గమున వచ్చిపోవువారు తలలు ఊపుచు “ఆహా! దేవాలయమును పడగొట్టి మూడుదినములలో మరల నిర్మించువాడా!

30. సిలువనుండి దిగిరమ్ము. నిన్ను నీవు రక్షించుకొనుము” అని పరిహాసములు ఆడిరి.

31. ఇట్లే ప్రధానార్చకులును, ధర్మశాస్త్ర బోధకులును పరిహాసము చేయుచు,“ఈయన ఇతరులను రక్షించెనుగాని, తనను తాను రక్షించుకొనలేడాయెను” అని పలికిరి.

32. “యిస్రాయేలు రాజగు క్రీస్తును దిగిరానిమ్ము, అప్పుడు మనము చూచి విశ్వసింతుము” అని హేళన చేసిరి. ఆయనతోపాటు సిలువ వేయబడిన ఆ ఇద్దరును అట్లే ఆయనను నిందించిరి.

33. మధ్యాహ్నము నుండి మూడుగంటలవరకు భూమండలమెల్ల చిమ్మచీకటులు క్రమ్మెను.

34. పగలు మూడుగంటల సమయమున, “ఎలోయీ, ఎలోయీ లామా సబక్తాని?” అని యేసు బిగ్గరగా కేక పెట్టెను. “నా దేవా! నా దేవా! నన్ను ఏల విడనాడితివి?” అని దీని అర్థము.

35. దగ్గర నిలిచిన వారిలో కొందరు అది విని, “ఇతడు ఏలీయాను పిలుచుచున్నాడు” అనిరి.

36. ఒకడు పరుగెత్తిపోయి నీటిపాచి తీసికొని వచ్చి, పులిసిన ద్రాక్షరసములో ముంచి, ఒక కోలకు తగిలించి, ఆయనకు త్రాగుటకు ఇచ్చి, “తాళుడు, ఏలీయా ఇతనిని సిలువ నుండి దింపవచ్చునేమో చూతము" అని పలికెను.

37. యేసు బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను.

38. అపుడు దేవాలయపు తెర పైనుండి క్రిందివరకు రెండుగా చినిగెను.

39. ఇట్లు యేసు ప్రాణము విడుచుటను చూచి అచట నిలచి యున్న శతాధిపతి “నిస్సందేహముగా ఈయన దేవుని కుమారుడే” అని పలికెను.

40. అప్పుడు కొందరు స్త్రీలు అల్లంత దూరమునుండి చూచు చుండిరి. వారిలో మగ్ధలా మరియమ్మ, చిన్న యాకోబు, యోసేపుల తల్లి మరియమ్మ, సలోమియమ్మ అనువారు ఉండిరి.

41. వారు యేసు గలిలీయసీమయందు ఉన్నప్పుడు ఆయనను వెంబడించి ఉపచారము చేసినవారు. వీరితోపాటు ఆయనను అనుసరించి యోరూషలేమునకు వచ్చిన స్త్రీలు చాలమంది ఉండిరి.

42. అది ఆయత్త దినము. అనగా విశ్రాంతి దినమునకు ముందటి దినము,

43. కనుక సాయం కాలమున మహాసభ సభ్యుడును దేవునిరాజ్యమునకై నిరీక్షించుచున్నవాడును, అరిమత్తయి నివాసియగు యోసేపు సాహసించి, పిలాతు వద్దకు వెళ్ళి, యేసు భౌతిక దేహమును కోరెను.

44. యేసు అంతత్వరగా మరణించెను అని విని, పిలాతు ఆశ్చర్యపడి సేనాపతిని పిలిపించి "ఆయన అప్పుడే మరణించెనా?”అని అడిగెను.

45. అది నిజమేనని అతనివలన విని పిలాతు, యేసు భౌతిక దేహమును కొనిపోవ యోసేపునకు అనుమతి ఇచ్చెను.

46. యోసేపు ఒక నార బట్టను కొనివచ్చి, యేసు భౌతికదేహమును సిలువనుండి దింపి, దానిని ఆ వస్త్రముతో చుట్టి, రాతిలో తొలిపించిన సమాధియందు ఉంచెను, సమాధి ద్వారమునకు అడ్డముగా పెద్దరాతిని దొర్లించెను.

47. మగ్దలా మరియమ్మయు, యోసేపు తల్లి మరియమ్మయు ఆయనను సమాధిచేసిన స్థలమును గుర్తుంచుకొనిరి.