ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Telugu Catholic Bible Mark chapter 9 || Telugu catholic Bible online || మార్కు సువార్త 9వ అధ్యాయము

 1. మరియు ఆయన వారితో, “దేవునిరాజ్యము శక్తిసహితముగ సిద్ధించుట చూచువరకు ఇక్కడ ఉన్న వారిలో కొందరు మరణించరని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను” అని పలికెను.

2. ఆరు రోజులు గడచిన పిదప యేసు పేతురు, యాకోబు, యోహానులను మాత్రము వెంటతీసికొని ఒక ఉన్నతపర్వతము పైకి వెళ్ళెను. అచ్చట వారి యెదుట ఆయన దివ్యరూపమును ధరించెను.

3. ఆయన వస్త్రములు వెలుగువలె ప్రకాశించెను. ఈ లోకములో ఎవడును చలువ చేయజాలనంత తెల్లగా ఉండెను.

4. ఏలీయా, మోషే కనిపించి యేసుతో సంభాషించుటను వారు చూచిరి.

5. అపుడు పేతురు “బోధకుడా! మనము ఇచటనే ఉండుట మేలు. మీకు, మోషేకు, ఏలియాకు మూడు పర్ణశాలలు నిర్మింతుము” అని,

6. తనకు తెలియకయే పలికెను. శిష్యులు భయభ్రాంతులైరి.

7. అపుడు ఒక మేఘము వారిని ఆవరించెను. ఆ మేఘమండలమునుండి “ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనను ఆలకింపుడు” అని ఒక వాణి వినిపించెను.

8. అంతట వారు చూడగా, వారికి యేసు తప్ప మరెవ్వరును కనిపించలేదు.

9. వారు పర్వతమునుండి దిగివచ్చుచుండ యేసు వారితో, “మనుష్యకుమారుడు మృతులనుండి పునరుత్థానమగువరకు మీరు ఈ వృత్తాంతమును ఎవ్వరితోను చెప్పరాదు” అని ఆజ్ఞాపించెను.

10. కనుక దీనిని ఎవరితో చెప్పక, ఈ పునరుత్థాన అంతరార్థము ఏమైయుండునో అని వారు ఒకరినొకరు ప్రశ్నించు కొనసాగిరి.

11. పిమ్మటవారు “ఏలియా ముందుగా రావలయునని ధర్మశాస్త్ర బోధకులు ఏల చెప్పు చున్నారు?” అని యేసును ప్రశ్నించిరి.

12. అందుకు ఆయన “అంతయు సిద్ధపరచుటకు ఏలియా ముందుగా రావలసిన మాట వాస్తవమే. అట్లయిన, మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి, తృణీకరింపబడునని వ్రాయబడియున్నదేల?

13. ముందు వ్రాయబడినట్లు ఏలియా ఇదివరకే వచ్చియున్నాడు. కాని, ప్రజలు అతనియెడల తమకు ఇచ్చవచ్చినట్లు ప్రవర్తించిరి అని మీతో చెప్పుచున్నాను” అని పలికెను.

14. వారు తక్కిన శిష్యులను చేరుకొని అచ్చట పెద్ద జనసమూహము కూడియుండుట చూచిరి. ధర్మశాస్త్ర బోధకులు కొందరు శిష్యులతో తర్కించు చుండిరి.

15. యేసును చూడగనే ప్రజలు మిగుల ఆశ్చర్యపడి, పరుగున వచ్చి ఆయనకు నమస్కరించిరి.

16. “వారితో మీరు ఏ విషయమునుగూర్చి తర్కించు చున్నారు?” అని యేసు శిష్యులను ప్రశ్నించెను.

17. జనసమూహములో ఒకడు “బోధకుడా! మూగ దయ్యము పట్టిన నా కుమారుని తమయొద్దకు తీసికొనివచ్చితిని.

18. భూతము వీనిని ఆదేశించి నపుడెల్ల నేలపై పడవేయును. అప్పుడు వీడు నోటి వెంట నురుగులు క్రక్కుచు పండ్లు కొరుకుచు, కొయ్య బారిపోవును. ఈ దయ్యమును పారద్రోల మీ శిష్యులను కోరితిని. అది వారికి సాధ్యపడలేదు” అని విన్నవించెను.

19. యేసు వారితో “మీరు ఎంత అవిశ్వాసులు! నేను ఎంతకాలము మీ మధ్యనుందును? ఎంతవరకు మిమ్ము సహింతును? ఆ బాలుని ఇచటకు తీసికొని రండు” అనగా,

20. వారు అట్లే వానిని తీసికొని వచ్చిరి. యేసును చూచినవెంటనే ఆ దయ్యము వానిని విలవిలలాడించి నేలపై పడవేసి, అటుఇటు దొర్లించి, నురుగులు క్రక్కించెను.

21. “ఈ దుర్బరావస్థ ఎంత కాలమునుండి?" అని యేసు ఆ బాలుని తండ్రిని అడిగెను. “పసితనమునుండి” అని అతడు బదులుచెప్పి,

22. “అనేక పర్యాయములు ఆ భూతము వీనిని నాశనము చేయవలెనని నీళ్ళలోను, నిప్పులలోను పడవేయుచున్నది. తమకిది సాధ్యమగునేని మాపై కరుణించి సాయముచేయుడు” అని ప్రార్థించెను.

23. అందుకు యేసు “ 'సాధ్యమగునేని' అనుచున్నావా! విశ్వసించు వానికి అంతయు సాధ్యమే” అని పలికెను.

24. అప్పుడు ఆ బాలుని తండ్రి “నేను నమ్ముచున్నాను. నాకు అవిశ్వాసము లేకుండునట్లు తోడ్పడుము” అని ఎలుగెత్తి పలికెను.

25. అంతట జనులు గుమికూడి తనయొద్దకు పరుగెత్తుకొనివచ్చుట చూచి యేసు “మూగ చెవిటి దయ్యమా! ఈ బాలుని విడిచిపొమ్ము, మరెన్నడును వీనిని ఆవహింపకుము” అని శాసించెను.

26. అప్పుడు ఆ భూతము ఆర్భటించుచు, బాలుని విలవిలలాడించి వెళ్ళిపోయెను. బాలుడు పీనుగువలె పడిపోయెను. అనేకులు వాడు చనిపోయెననిరి.

27. కాని, యేసు వాని చేతిని పట్టి లేవనెత్తగా వాడులేచి నిలుచుండెను.

28. యేసు ఇంటికి వెళ్ళిన పిదప శిష్యులు ఏకాంతముగ ఆయనతో “ఈ దయ్యమును పారద్రోల మాకు ఏల సాధ్యపడలేదు?” అని ప్రశ్నించిరి.

29. అందుకు ఆయన వారితో, “ప్రార్థనవలనతప్ప మరే విధమునను ఇట్టి దయ్యములను పారద్రోల సాధ్య పడదు” అని చెప్పెను.

30. వారు ఆ స్థలమును వీడి గలిలీయ ప్రాంత మునకు వెళ్ళిరి. తాను ఎచటనున్నది ఎవ్వరికిని తెలియకూడదని ఆయన కోరిక.

31. ఏలయన, “మనుష్యకుమారుడు శత్రువుల చేతికి అప్పగింప బడును. వారు ఆయనను చంపుదురు కాని మరణించిన మూడవదినమున ఆయన పునరుత్థానుడగును” అని యేసు తనశిష్యులకు బోధించుచుండెను.

32. శిష్యులు దీనిని గ్రహింపలేకపోయిరి. అయినను ఆయనను అడుగుటకు భయపడిరి.

33. అంతట వారు కఫర్నామునకు వచ్చిరి. అందొక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను "మార్గమధ్యమున మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచుంటిరి?” అని అడిగెను.

34. తమలో గొప్పవాడెవ్వడని మార్గమధ్యమున వాదించు కొనియుండుటచే వారు ప్రత్యుత్తరమీయలేక ఊర కుండిరి.

35. అప్పుడు యేసు కూర్చుండి పన్నిద్దరు శిష్యులను చేరబిలిచి, “ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరివాడై, అందరకు సేవకుడుగా ఉండవలయును” అని పలికెను.

36. మరియు ఆయన ఒక చిన్నబిడ్డను చేరదీసి వారి మధ్యనుంచి, వానిని ఎత్తి కౌగలించుకొని శిష్యులతో,

37. "ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట స్వీకరించువాడు నన్ను స్వీకరించినవాడగును. నన్ను స్వీకరించినవాడు నన్ను కాదు, నన్ను పంపినవానిని స్వీకరించుచున్నాడు” అనెను.

38. అంతట యోహాను యేసుతో "బోధకుడా! మనలను అనుసరింపని ఒకడు నీ పేరిట దయ్యములను పారద్రోలుట మేముచూచి వానిని నిషేధించితిమి” అని పలికెను.

39. అందుకు యేసు “మీరు అతనిని నిషేధింపవలదు, ఏలయన, నా పేరిట అద్భుతములు చేయువాడు వెంటనే నన్నుగూర్చి దుష్ప్రచారము చేయజాలడు.

40. మనకు విరోధికానివాడు మన పక్షమున ఉండువాడు.

41. మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి, ఎవ్వడు మీకు నా పేరిట చెంబెడు నీళ్ళు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును తప్పక పొందును అని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను” అనెను.

42. "నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఏ ఒక్కడైన పాపి అగుటకు కారకుడగుటకంటె, అట్టివాడు తన మెడకు పెద్దతిరుగటిరాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు.

43. నీ చేయి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము.

44. రెండు చేతులతో నిత్యనరకాగ్నిలోనికి పోవుటకంటె ఒక్క చేతితో నిత్యజీవము పొందుట మేలు.

45. నీ కాలు నీకు పాపకారణమైనచో, దానిని నరికి పార వేయుము.

46. రెండు కాళ్ళతో నరకాగ్నిలోనికి పోవుట కంటె ఒక్క కాలితో నిత్యజీవమున ప్రవేశించుట మేలు.

47. నీ కన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయుము. రెండు కన్నులతో నీవు నరకాగ్నిలోనికి పోవుటకంటె ఒక కంటితో దేవునిరాజ్యమున ప్రవే శించుట మేలు.

48. నరకలోకమున పురుగు చావదు, అగ్ని చల్లారదు.

49. ప్రతి ఒక్కనికి ఉప్పదనము అగ్నివలన కలుగును.

50. ఉప్పు మంచిదే కాని అది తన ఉప్ప దనమును కోల్పోయిన, తిరిగి మీరు ఎట్లు దానిని సారవంతము చేయగలరు? కావున, మీరు ఉప్ప దనమును కలిగి ఒకరితో ఒకరు సమాధానముతో ఉండుడు” అనెను.