ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Telugu Catholic Bible Mark chapter 4 || Telugu catholic Bible online || మార్కు సువార్త 4వ అధ్యాయము

 1. యేసు మరల గలిలీయ సరస్సు తీరమున బోధింపనారంభించెను. జనులు గుంపులు గుంపులుగా ఆయనయొద్దకు వచ్చుటవలన ఆయన ఒక పడవ నెక్కి కూర్చుండెను. జనసమూహము సరస్సు ఒడ్డున నుండెను.

2. ఆయన వారికి అనేక విషయములు ఉపమానములతో ఇట్లు బోధించెను:

3. “వినుడి, విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు బయలు దేరెను.

4. అట్లు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కన పడెను. అప్పుడు పక్షులు వచ్చి వానిని తినివేసెను.

5. మరికొన్ని చాలినంత మట్టిలేని రాతి నేలపై పడెను. అందుచే అవి వెంటనే మొలకెత్తెను కాని,

6. ఎండ వేడిమికి మాడి వేరు దిగనందున ఎండిపోయెను.

7. మరికొన్ని ముండ్లపొదలలో పడెను. ఆ పొదలు ఎదిగి వానిని అణచివేసెను. కనుక అవి ఫలింపలేదు.

8. ఇంక కొన్ని సారవంతమగు నేలలో పడి మొలిచి, పెరిగి పెద్దవై ముప్పదంతలుగను, అరువ దంతలుగను, నూరంతలుగను ఫలించెను.

9. వినుటకు వీనులున్నవాడు వినునుగాక!” అని చెప్పెను.

10. యేసు ఏకాంతముగా ఉన్నపుడు ఉపమాన మును విన్న కొందరు పన్నిద్దరు శిష్యులతో ఆయన యొద్దకు వచ్చి, దానిని వివరింపుమని అడిగిరి.

11. “దైవరాజ్యము రహస్యము మీకు మాత్రమే అనుగ్రహింప బడినది.

12. 'కాని, ఎంతగా చూచినను గమనింపకుండునట్లును, ఎంతగా వినినను గ్రహింపకుండునట్లును, హృదయపరివర్తనతో పాపపరిహారమును పొందకుండునట్లుండిరి. కనుక ఈ విషయములన్నియు ఇతరులకు ఉపమానముల ద్వారా బోధింపబడుచున్నవి” అని పలికెను.

13. “ఈ ఉపమాన భావమును మీరు గ్రహింప లేదా? అట్లయిన ఇక తక్కిన ఉపమానములను మీరు ఎట్లు గ్రహింతురు?

14. ఆలకింపుడు. విత్తువాడు దైవవాక్కు అను విత్తనమును విత్తుచున్నాడు.

15. కొందరు త్రోవప్రక్కనపడిన విత్తనములను పోలిన వారు. దేవుని వాక్కు అను విత్తనము వారియందు విత్తబడుచున్నది. కాని వారు దానిని వినిన వెంటనే సైతాను వచ్చి, దానిని ఎత్తుకొని పోవును.

16. కొందరు రాతినేల పైబడిన విత్తనములను పోలిన వారు. వారు దేవుని వాక్కును వినిన వెంటనే సంతోషముతో స్వీకరింతురు.

17. కాని, వారిలో వేరు లేనందున వారు కొలది కాలము మాత్రమే నిలుతురు. ఆ వాక్కు నిమిత్తమై శ్రమయైనను, హింసయైనను వచ్చినపుడు వెంటనే పతనమగుదురు.

18. కొందరు ముండ్లపొదలలో పడిన విత్తనములను పోలినవారు. వారు వాక్కును విందురు. కాని,

19. లౌకిక విచారము, ధనాశ, తదితర వ్యామోహములు వానియందు ప్రవేశించి వాక్కును అణచివేయును. కనుక, వారు ఫలమునీయరు.

20. ఇక, కొందరు మంచి నేలపై బడిన విత్తనములను పోలినవారు. వారు వాక్యమును విని, అంగీకరించి, ముప్పదంతలుగ, అరువదంతలుగ, నూరంతలుగ ఫలమును ఇత్తురు” అని చెప్పెను.

21. మరల ఆయన వారితో ఇట్లనెను: “ఎవడైనను దీపమును వెలిగించి, దీపస్తంభముపై ఉంచునుగాని, కుంచము క్రిందగాని, మంచము క్రిందగాని ఉంచడు గదా!

22. దాచబడినది ఏదియు బట్టబయలు కాకపోదు. బయలు పరచుటకేగాని ఏదియు దాచబడ లేదు.

23. కనుక వినుటకు వీనులున్న వాడు వినును గాక!

24. “మీరు శ్రద్ధతో ఆలకింపుడు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలువ బడును. అంతకంటే అధికముగా కొలువబడును.

25. ఉన్నవానికే మరింత ఒసగబడును. లేనివానియొద్ద నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును.”

26. ఆయన ఇంకను వారితో ఇట్లనెను: “దేవుని రాజ్యము ఇట్లున్నది. విత్తువాడొకడు తన పొలములో విత్తనములను వెదజల్లి,

27. రాత్రింబవళ్ళు నిద్ర పోవుచు, మేల్కొనుచుండగా, వానికి తెలియకయే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవగుచుండెను.

28. భూమినుండి మొదట మొలకలు, వెన్ను అటుపిమ్మట కంకులు పుట్టును.

29. పంట పండినపుడు కోత కాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలితో కోయనారంభించును.”

30. యేసు మరల ఇట్లనెను: “దేవుని రాజ్య మును దేనితో పోల్చదగును? ఏ ఉపమానముతో దానిని వర్ణింపవచ్చును?

31. అది ఒక ఆవగింజను పోలియున్నది. అది భూమిలో నాటబడినపుడు, అన్ని విత్తనములకంటె చిన్నదైనను

32. పెరిగి పెద్దదైనపుడు, మొక్కలన్నిటికంటే పెద్దదై, కొమ్మలతో, రెమ్మలతో ఒప్పుచుండును. ఆకాశపక్షులు దాని కొమ్మలలో గూళ్ళుకట్టుకొని నివసించును.

33. ప్రజలు గ్రహింపగలిగినంతవరకు అనేక ఉపమానముల ద్వారా యేసు వారికిట్లు బోధించెను.

34. ఉపమానములు లేక ఆయన ఏమియు బోధింప లేదు. కాని,ఏకాంతముగా ఉన్నపుడు ఈ ఉపమానముల అర్ధమును ఆయన తన శిష్యులకు సుస్పష్టముగ తెలిపెను.

35. ఆ దినము సాయం సమయమున, “మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోవుదము రండు” అని యేసు శిష్యులతో చెప్పెను.

36. అంతట శిష్యులు ఆ జనసమూహమును వీడి యేసును పడవలో తీసికొని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను.

37. అపుడు పెద్ద తుఫాను చెలరేగెను. అలలు పెద్ద ఎత్తున లేచి, పడవను చిందరవందర చేయుచు, దానిని ముంచివేయునట్లుండెను.

38. అపుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించు చుండెను. శిష్యులు అపుడు ఆయనను నిద్రలేపి “గురువా! తమకు ఏ మాత్రము విచారములేనట్లున్నది. మేము చనిపోవుచున్నాము” అనిరి.

39. అపుడు యేసు లేచి, గాలిని గద్దించి, “శాంతింపుము” అని సముద్రముతో చెప్పగా, గాలి అణగి గొప్ప ప్రశాంతత కలిగెను.

40. “మీరింత భయపడితిరేల? మీకు విశ్వాసము లేదా?” అని వారిని మందలించెను.

41. అంతట శిష్యులు మిక్కిలి కలవరపడుతూ “గాలియు, సముద్రము సయితము ఈయనకు లోబడుచున్నవి ఈయన ఎవరో!” అని తమలో తామనుకొనిరి.