ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Telugu Catholic Bible Mark chapter 8 || Telugu catholic Bible online || మార్కు సువార్త 8వ అధ్యాయము

 1. మరియొకమారు మహా జనసమూహము ఆయన యొద్దకు వచ్చెను. కాని, వారు భుజించుటకు ఏమియు లేనందున, ఆయన తనశిష్యులను పిలిచి, వారితో,

2. “నేటికి మూడుదినములనుండి వీరు నాయెద్ద ఉన్నారు. వీరికి భుజించుటకు ఏమియులేదు. అందు వలన నాకు జాలి కలుగుచున్నది.

3. పస్తులతో వీరిని పంపివేసినచో వీరు మార్గమధ్యమున సొమ్మసిల్లి పోవుదురు. ఏలయన, వీరిలో కొందరు చాలదూరము నుండి వచ్చిరి” అని పలికెను.

4. అందులకు ఆయన శిష్యులు, “ఈ ఎడారిలో మనము ఎక్కడనుండి కావలసిన రొట్టెలను తెచ్చి వీరిని సంతృప్తి పరచగలము?" అని ప్రత్యుత్తర మిచ్చిరి.

5. "మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవి?" అని ఆయన ప్రశ్నింపగా, “ఏడు రొట్టెలున్నవి” అని వారు సమాధానమిచ్చిరి.

6. అంతట యేసు ఆ జనసమూహ మును అచటకూర్చుండ ఆజ్ఞాపించి, ఆ ఏడురొట్టెలను అందుకొని దేవునికి కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి, వానిని త్రుంచి, వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారట్లే వడ్డించిరి.

7. వారియొద్దనున్న కొన్ని చిన్న చేపలను ఆయన ఆశీర్వదించి, వానినికూడ వడ్డింప ఆజ్ఞాపించెను.

8. వారెల్లరు సంతృప్తిగా భుజించిన పిమ్మట శిష్యులు మిగిలిన ముక్కలను ప్రోగుచేసి, ఏడుగంపలు నింపిరి.

9. ఆ భుజించినవారు రమారమి నాలుగు వేలమంది.

10. పిమ్మట ఆయన వారిని పంపివేసి, వెంటనే ఒక పడవను ఎక్కి శిష్యులతో 'దల్మనూతా' ప్రాంతమునకు వెళ్ళెను.

11. కొందరు పరిసయ్యులు యేసువద్దకు వచ్చి ఆయనను శోధించుచు “పరలోకమునుండి ఒక గురుతును చూపుము” అని ఆయనతో వాదింప సాగిరి.

12. అందులకు ఆయన వేదనతో నిట్టూర్చి, “ఈ తరమువారు ఏల ఒక గురుతును కోరుచున్నారు? వారికి ఎట్టి గురుతును ఈయబడదని నిశ్చయముగ చెప్పుచున్నాను" అనెను.

13. ఆయన అచటనుండి పడవనెక్కి సరస్సు ఆవలితీరమునకు సాగిపోయెను.

14. శిష్యులు తమవెంట రొట్టెలను తెచ్చు కొనుటను మరచిపోయిరి. పడవలో వారియొద్ద ఒక్క రొట్టె మాత్రమే ఉండెను.

15. "పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు, హేరోదు పులిసినపిండిని గూర్చియు, జాగరూకులై ఉండుడు” అని యేసు శిష్యులను హెచ్చ రించెను.

16. “మనయొద్ద రొట్టెలు లేనందున ఆయన ఇట్లు పలికెనేమో” అని వారు తమలోతాము అను కొనిరి.

17. యేసు దానిని గ్రహించి, “రొట్టెలులేవని మీరు ఏల విచారించుచున్నారు? మీరింకను గ్రహింప లేదా? తెలుసుకొనలేదా? మీరు హృదయకాఠిన్యము గలవారైయున్నారా?

18. మీరు కనులుండియ చూడరా? చెవులుండియు వినరా? జ్ఞప్తికి తెచ్చుకోలేరా?

19. ఐదు రొట్టెలను ఐదువేలమందికి పంచి పెట్టినప్పుడు మిగిలిన ముక్కలతో మీరు ఎన్నిగంపలు నింపితిరి?” అని ప్రశ్నింపగా, “పండ్రెండు గంపలు నింపితిమి” అని వారు సమాధానమిచ్చిరి.

20. “అట్లే ఏడు రొట్టెలను నాలుగువేలమందికి పంచి పెట్టినపుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్నిగంపలకు ఎత్తితిరి?" అని అడుగగా, “ఏడు గంపలకు” అని సమాధాన మిచ్చిరి.

21. “అంతమాత్రము అర్థము కాలేదా?” అని యేసు శిష్యులను మందలించెను.

22. అంతట వారు బెత్సయిదా గ్రామము చేరిరి. అచట కొందరు ప్రజలు ఒక గ్రుడ్డివానిని యేసువద్దకు తీసికొనివచ్చి, వానిని తాకవలయునని ఆయనను ప్రార్థించిరి.

23. యేసు వానిని చేయిపట్టుకొని, ఊరి వెలుపలకు తీసికొనిపోయి, వాని కన్నులను ఉమ్మి నీటితో తాకి, తన చేతులను వానిపై ఉంచి, “నీవు చూడగలుగుచున్నావా?” అని ప్రశ్నించెను.

24. వాడు కనులెత్తి “నాకు మనుష్యులు కని పించుచున్నారు. కాని, నా దృష్టికి వారు చెట్లవలెయుండి నడచుచున్నట్లు కనిపించుచున్నారు” అని సమాధానమిచ్చెను.

25. యేసు మరల వానికన్నులను తాకి సూటిగా వానివైపు చూడగా, వాడు స్వస్థుడై అంతయు స్పష్టముగా చూడగలిగెను.

26. "తిరిగి ఆ ఊరు వెళ్ళవద్దు” అని యేసు వానిని ఆజ్ఞాపించి ఇంటికి పంపివేసెను.

27. యేసు శిష్యులతో కైసరయాఫిలిప్పు ప్రాంత మునకు వెళ్ళుచు, మార్గమధ్యమున “ప్రజలు నేను ఎవరినని చెప్పుకొనుచున్నారు?" అని వారిని అడిగెను.

28. అందుకు వారు, “కొందరు స్నాపకుడగు యోహాను అనియు, మరికొందరు ఏలియా అనియు, లేదా మరియొక ప్రవక్త అనియు చెప్పుకొనుచున్నారు” అనిరి.

29. అప్పుడు యేసు “మరి నన్నుగూర్చి మీరు ఏమను కొనుచున్నారు?” అని వారిని ప్రశ్నింపగా, పేతురు, “నీవు క్రీస్తువు” అని ప్రత్యుత్తరమిచ్చెను.

30. అంతట ఆయన తాను ఎవరైనది ఇతరులకు తెలుపరాదని వారిని ఆదేశించెను.

31. యేసు శిష్యులకు “మనుష్యకుమారుడు అనేక శ్రమలను అనుభవించి, పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి, చంపబడి. మూడవదినమున ఉత్థానమగుట అగత్యము" అని ఉపదేశించి,

32. వారికి ఈ విషయమును తేట తెల్లము చేసెను. అంతట పేతురు ఆయనను ప్రకకు తీసికొనిపోయి, “అటుల పలుకరాదు” అని వారింప సాగెను.

33. యేసు శిష్యులవైపు తిరిగి పేతురును చూచి, "సైతానూ! నీవు నా వెనుకకు పొమ్ము. నీ భావములు మనుష్యులకు సంబంధించినవే కాని, దేవునికి సంబంధించినవికావు” అనెను.

34. అంతట యేసు జనసమూహములను, శిష్యులను చేరబిలిచి, “నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని, తన సిలువను మోసికొని, నన్ను అనుసరింపవలయును.

35. తన ప్రాణమును కాపాడుకొనచూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము, తన ప్రాణమును ధారపోయు వాడు దానిని దక్కించుకొనును.

36. మానవుడు లోకమంతటిని సంపాదించి, తన ఆత్మను కోల్పోయిన, వానికి ప్రయోజనమేమి?

37. తన ఆత్మకు తుల్యముగా మానవుడు ఏమి ఈయగలడు?

38. నన్నుగూర్చి నా సందేశమునుగూర్చి ఈ పాపిష్టి వ్యభిచారతరములో సిగ్గుపడువానినిగూర్చి, మనుష్య కుమారుడు కూడ దేవదూతల సమేతముగ తన తండ్రి మహిమతో వచ్చునపుడు సిగ్గుపడును" అని పలికెను.