ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Telugu Catholic Bible Mark chapter 7 || Telugu catholic Bible online || మార్కు సువార్త 7వ అధ్యాయము

 1. అంతట యెరూషలేమునుండి వచ్చిన కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి.

2. వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుగుకొనకయే భోజనము చేయుటను చూచిరి.

3. పూర్వుల సంప్రదాయము ప్రకారము యూదులకు, ముఖ్యముగా పరిసయ్యులకు చేతులు కడుగు కొనక భుజించు ఆచారములేదు.

4. అంగటినుండి కొనివచ్చిన ఏ వస్తువునైనను వారు శుద్ధిచేయక భుజింపరు. అట్లే పానపాత్రలను, కంచుపాత్రలను శుభ్రపరుపవలయునను ఆచారములు ఎన్నియో వారికి కలవు.

5. కనుక పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు “తమ శిష్యులు పూర్వుల సంప్రదాయములను లెక్క చేయక మలినహస్తములతో భుజించుచున్నారేమి?” అని యేసును ప్రశ్నించిరి.

6. అందుకు ఆయన వారితో "కపట భక్తులారా! మిమ్ముగూర్చి యెషయా ప్రవక్త ఎంతసూటిగా ప్రవచించెను. ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు కాని వీరి హృదయములు నాకు దూరముగానున్నవి.

7. మానవులు ఏర్పరచిన నియమములను దైవప్రబోధములుగా బోధించుచున్నారు. కావున వారుచేయు ఆరాధన వ్యర్ధము.

8. దేవుని ఆజ్ఞను నిరాకరించి, మానవనియమ ములను అనుసరించుచున్నారు”అని పలికెను.

9. మరియు ఆయన వారితో “ఆచారముల నెపముతో మీరు దేవుని ఆజ్ఞలను నిరాకరించుచున్నారు.

10. 'తల్లిదండ్రులను గౌరవింపుడు, తల్లిదండ్రులను దూషించువాడు మరణదండనకు గురియగును' అని మోషే ఆజ్ఞాపించెనుగదా!

11. ఎవ్వడేని తన తండ్రితోగాని, తనతల్లితోగాని 'నానుండి మీరు పొందవలసినది దైవార్పితమైనది' అని చెప్పినచో

12. అట్టి వాడు తనతండ్రినిగాని, తల్లినిగాని ఆదుకొను అవసరములేదని మీరు బోధించుచున్నారు.

13. ఈ రీతిని మీరు పూర్వసంప్రదాయమును అనుసరించు నెపమున దైవవాక్కునే అనాదరము చేయుచున్నారు. ఇట్టివి అనేకములు మీరు చేయుచున్నారు” అని చెప్పెను.

14. పిదప, ఆయన జనసమూహమును తిరిగి పిలిచి “మీరు విని, గ్రహించుకొనగలరు.

15. వెలుపల నుండి లోపలికిపోయి మనుష్యుని అపవిత్రునిగా చేయ గలిగినది ఏదియును లేదు. కాని, లోపలినుండి బయలువెళ్ళునవే మనుష్యుని అపవిత్రునిగా చేయును.

16. వినుటకు వీనులున్నవారు విందురుగాక!” అని అనెను.

17. ఆయన ఆ జనసమూహమును వీడి గృహమున ప్రవేశించినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమాన భావమును వివరింపమని అడిగిరి.

18. అంతట యేసు శిష్యులను చూచి, “మీరును ఇంతటి మందమతులా? మానవుడు భుజించునది ఏదియు అతనిని మాలిన్య పరచదు.

19.ఏలయన, అది హృదయములో ప్రవేశింపక ఉదరములో ప్రవేశించి, ఆ పిమ్మట విసర్జింపబడు చున్నది. అన్ని పదార్ధములు భుజింపదగినవే” అని ఆయన పలికెను.

20. “మానవుని మాలిన్యపరచునది వాని అంతరంగమునుండి వెలువడునదియే.

21. ఏలయన, హృదయమునుండి దురాలోచనలు, వేశ్యాసంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము,

22. దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్స ర్వము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును.

23. ఇట్టి చెడుగులు అన్నియు మానవుని అంతరంగమునుండియే వెలువడి అతనిని మలిన పరచును” అని పలికెను.

24. అపుడు ఆయన ఆ స్థలమునువీడి, తూరు, సీదోను ప్రాంతములకు వెళ్ళెను. ఆయన ఒక గృహమున ప్రవేశించి, అచట ఎవ్వరికి తెలియకుండ ఉండగోరెను. కాని అది సాధ్యపడలేదు.

25. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తెగల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వచ్చి, ఆయన పాదములపై బడెను.

26. దయ్యము పట్టిన తన కుమార్తెను స్వస్థపరుప ప్రార్ధించెను. ఆమె గ్రీసు దేశీయురాలు, సిరో పెనిష్యాలో పుట్టినది.

27. అందుకు యేసు “పిల్లలు మొదట తృప్తిచెందవలెను. పిల్లల రొట్టెను తీసి కుక్కపిల్లలకు వేయుట తగదు” అని పలికెను.

28. అప్పుడు ఆమె “అది నిజమే స్వామీ! కాని, పిల్లలు పడవేయు రొట్టెముక్కలను భోజనపు బల్లక్రింద ఉన్న కుక్కపిల్లలును తినునుగదా!” అని బదులు పలికెను.

29.అందుకు ఆయన, నీ సమాధానము మెచ్చదగినది. నీ కుమార్తె స్వస్థత పొందినది. ఇక నివు పోయిరమ్ము” అని చెప్పెను.

30. అంతట ఆమె  ఇంటికి వెళ్ళి దయ్యము వదలిపోయినందున తన కుమార్తె ప్రశాంతముగా పరుండియుండుటను చూచెను.

31. పిమ్మట యేసు తూరు ప్రాంతమునువీడి, సీదోను, దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలీయ సరస్సు తీరమును చేరెను.

32. అపుడు అచటిజనులు మూగ,చెవిటివానిని ఆయనయొద్దకు తీసికొనివచ్చి, వాని మీద ఆయన హస్తమునుంచుమని ప్రార్థించిరి.

33. యేసు వానిని జనసమూహమునుండి ప్రక్కకు తీసికొనిపోయి, వాని చెవులలో తన వ్రేళ్ళు పెట్టి, ఉమ్మి నీటితో వానినాలుకను తాకి,

34. ఆకాశమువైపు కన్నులెత్తి, నిట్టూర్చి “ఎప్పతా” అనెను. అనగా “తెరువ బడుము” అని అర్థము.

35. వెంటనే వాని చెవులు తెరువబడెను. నాలుక పట్టుసడలి వాడు తేలికగా మాటాడసాగెను.

36. “ఇది ఎవరితో చెప్పరాదు” అని ఆయన వారిని ఆదేశించెను. ఆయన వలదన్నకొలది మరింత ఎక్కువగా దానిని వారు ప్రచారముచేసిరి.

37. “చెవిటివారు వినునట్లుగా, మూగవారు మాటాడు నట్లుగా సమస్తమును ఈయన చక్కపరచియున్నాడు” అని అందరును మిక్కిలి ఆశ్చర్యపడిరి.