Telugu Catholic Bible Mark chapter 10 || Telugu catholic Bible online || మార్కు సువార్త 10వ అధ్యాయము
1. యేసు ఆ స్థలమును వీడి యోర్దాను నదికి ఆవల నున్న యూదయా ప్రాంతమును చేరెను. జనులు గుంపులుగా ఆయనను చేరవచ్చిరి. అలవాటు ప్రకారము ఆయన వారికి బోధించుచుండెను.
2. పరీక్షార్థము పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి, “భార్యను పరిత్యజించుట భర్తకు తగునా?” అని ప్రశ్నించిరి.
3. అందుకు యేసు "మోషే మీకేమి ఆదేశించెను?”అని తిరిగి ప్రశ్నించెను.
4. “విడాకుల పత్రమును వ్రాసియిచ్చి భార్యను పరిత్యజింపతగునని మోషే అదేశించెను” అని వారు సమాధానమిచ్చిరి.
5. అందుకు యేసు “మీ హృదయకాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించెను.
6. కాని, సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులనుగా సృజించియున్నాడు.
7. ఈ హేతువు వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును.
8. వారిరువురు ఏకశరీరులై ఉందురు. కనుక వారు భిన్న శరీరులుకాక, ఏకశరీరులైయున్నారు.
9. దేవుడు జతపరచిన జంటను మానవుడు వేరుపరుపరాదు” అని యేసు వారితో పలికెను.
10. వారు ఇల్లు చేరిన పిదప ఈ విషయమును గూర్చి శిష్యులు ఆయనను ప్రశ్నించిరి.
11. అపుడు ఆయన వారితో “తన భార్యను పరిత్యజించి, వేరొక స్త్రీని వివాహమాడువాడు ఆమెతో వ్యభిచరించుచు న్నాడు.
12. అట్లే తన భర్తను పరిత్యజించి, వేరొక పురుషుని వివాహమాడు స్త్రీ వ్యభిచరించుచున్నది” అని పలికెను.
13. అంతట కొందరు తమ చిన్నారులను తాక వలెనని యేసు చెంతకు తీసికొనిరాగా, శిష్యులు వారిని గద్దించిరి.
14. దానిని గమనించిన యేసు శిష్యులపై కోపించి “చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు. వారిని ఆటంకపరపకుడు. ఏలయన అట్టివారిదే దేవుని రాజ్యము” అని పలికెను.
15. “మరియు ఈ పసిబిడ్డలవలె ఎవరు దేవునిరాజ్య మును అంగీకరింపరో వారు దేవునిరాజ్యములో ప్రవేశింపరని మీతో వక్కాణించుచున్నాను” అని,
16. ఆ చిన్నారులను ఎత్తి కౌగలించుకొని దీవించెను.
17. యేసు పయనమై పోవుచుండ మార్గ మధ్యమున ఒకడు పరుగెత్తుకొనివచ్చి, ఆయన ఎదుట మోకరించి, “సద్బోధకుడా! నిత్య జీవమును పొందుటకు నేను ఏమి చేయవలయును?" అని ప్రశ్నించెను.
18. అందుకు యేసు “సద్బోధకుడా” అని నన్ను ఏల సంబోధించెదవు? దేవుడు ఒక్కడే మంచివాడు, మరెవ్వరును కాదు.
19. దైవాజ్ఞలను నీవు ఎరుగు దువు గదా! నరహత్య చేయకుము. వ్యభిచరింప కుము. దొంగిలింపకుము. అసత్యమాడకుము. మోసగింపకుము. తల్లిదండ్రులను గౌరవింపుము” అనెను.
20. అందులకు అతడు "బోధకుడా! బాల్యమునుండి వీనిని అన్నింటిని పాటించుచునే ఉన్నాను” అనెను.
21. యేసు అతని వంక ప్రేమతో చూచి "అయితే నీవు చేయవలసినది ఇంకొకటి ఉన్నది. నీవు వెళ్ళి నీకు ఉన్నదంతయు వెచ్చించి, పేదలకు దానము చేయుము. పిమ్మట వచ్చి నన్ను అనుసరింపుము. పరలోకమందు నీకు ధనము చేకూరును" అనెను.
22. ఆ యువకుడు అధిక సంపద గలవాడగుటచే, ఈ మాట విని మొగము చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయెను.
23. యేసు చుట్టుచూచి, తనశిష్యులతో "ధనవంతులు దేవునిరాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము!" అనెను.
24. ఈ మాటలు ఆలకించిన శిష్యులు ఆశ్చర్యపడిరి. యేసు ఇంకను వారితో ‘బిడ్డలారా! దేవునిరాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము!
25. ధనవంతుడు దేవునిరాజ్యమున ప్రవే శించుటకంటె, ఒంటె సూదిబెజ్జములో దూరిపోవుట సులభము” అనెను.
26. ఈ మాటలు విని శిష్యులు మరింత ఆశ్చర్యపడి, “అట్లయిన ఇక ఎవడు రక్షణ పొందగలడు?" అని గుసగుసలాడుకొనిరి.
27. యేసు వారితో, “మానవులకు ఇది అసాధ్యము. కాని, దేవునకు సమస్తమును సాధ్యమే” అనెను.
28. అపుడు పేతురు ఆయనతో “ఇదిగో! అంతయు విడిచిపెట్టి మేము మిమ్ము అనుసరించి తిమి” అనెను.
29. అందుకు యేసు “అది వాస్తవమే. నా కొరకు, నా సందేశము కొరకు ఇంటిని, అన్న దమ్ములను, అక్కచెల్లెండ్రను, తండ్రిని, తల్లిని, బిడ్డలను, భూములను త్యజించువాడు
30. ఈ లోకముననే నూరంతలుగా ప్రతిఫలమును పొందును. ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, తండ్రులను, తల్లులను, బిడ్డలను, భూములను సమృద్ధిగా పొందును. అట్లే హింసలను అనుభవించును. పరలోక ములో శాశ్వతజీవమును పొందును.
31. అయినను మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు. కడపటివారు అనేకులు మొదటివారు అగుదురు” అనెను.
32. అంతట వారు యెరూషలేమునకు పయనము కాగా యేసు అందరికంటే ముందుగా సాగిపోవుచుండెను. అందుచేత వారిని వెంబడించుచున్న శిష్యులు ఆశ్చర్యపడిరి. ప్రజలు భయపడిరి. యేసు పన్నిద్దరు శిష్యులను తనయొద్దకు పిలిచి, తనకు జరుగనున్న సంఘటనలనుగూర్చి వివరింపసాగెను:
33. “ఇదిగో! మనము యెరూషలేము వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధానార్చకుల, ధర్మశాస్త్ర బోధకుల చేతులకు అప్పగింపబడును. వారు ఆయనకు మరణ దండన విధించి, అన్యుల చేతులకు అప్పగింతురు.
34. వారు ఆయనను అవమానింతురు. ఆయనపై ఉమ్మివేయుదురు. కొరడాలతో మోది చంపుదురు. కాని మూడుదినముల పిదప ఆయన పునరుత్థానుడు అగును.”
35. అంతట జెబదాయి పుత్రులగు యోహాను, యాకోబులు యేసును సమీపించి “బోధకుడా! మాదొక మనవి. అనుగ్రహింపుడు” అని వేడుకొనిరి.
36. అందుకాయన “నేను మీకేమి చేయగోరుచున్నారు?” అని వారినడిగెను.
37. వారు “మీరు మీ రాజ్యములో మహిమాన్విత సింహాసనముపై ఆసీనులైనపుడు మమ్ము మీ కుడిఎడమల కూర్చుండ అనుగ్రహింపుడు” అని ప్రార్థించిరి.
38. అందులకు యేసు “మీరు కోరున దేమియో మీరు ఎరుగురు. నేను పానముచేయు పాత్రమునుండి మీరు పానము చేయగలరా? నేను పొందబోవు బప్తిస్మమును మీరును పొందగలరా?” అనెను.
39. “అవును” అని వారు పలికిరి. యేసు వారితో “నేను పానముచేయు పాత్రమునుండి మీరు పానము చేసెదరు. నేను పొందబోవు బప్తిస్మమును మీరును పొందెదరు.
40. కాని, నా కుడిఎడమల మిమ్ము కూర్చుండబెట్టునది నేను కాదు. నా తండ్రి ఏర్పరచిన వారికే అది లభించును” అని పలికెను.
41. తక్కిన పదుగురు శిష్యులు దీనిని విని నప్పుడు యోహాను, యాకోబులపై కినుకు వహించిరి.
42. యేసు శిష్యులను కూడబిలిచి, వారితో ఇట్లనెను: “అన్యజాతి ప్రజలలో పాలకులు పాలితులను నిరంకుశముగా పరిపాలించుచున్నారు. పెద్దలు వారిపై పెత్తనము చలాయించుచున్నారు.
43. మీకు ఇది తగదు. మీలో ఎవడైన గొప్పవాడు కాదలచిన అతడు మీకు పరిచారకుడై ఉండవలెను.
44. మీలో ఎవడైన ప్రముఖుడుగా ఉండదలచిన అతడు మీకు బానిసయె ఉండవలెను.
45. ఏలయన మనుష్యకుమారుడు సేవించుటకేగాని, సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును ధారపోయుటకు వచ్చెను.
46. పిదప, వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. అచటనుండి యేసు తనశిష్యులతోను, గొప్ప జన సమూహముతోను యెరికోపట్టణము దాటి వెళ్ళు చుండగా 'బర్తిమయి' అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవప్రక్కన కూర్చుండియుండెను. అతడు 'తిమయి' కుమారుడు.
47. నజరేతు నివాసియగు యేసు ఆ మార్గమున వచ్చుచున్నాడని విని, అతడు “దావీదుకుమారా! యేసు ప్రభూ! నన్ను కరుణింపుము” అని కేకలిడసాగెను.
48. “ఊరకుండుము” అని అనేకులు వానిని గద్దించిరి. కాని వాడుమాత్రము "దావీదుకుమారా! నన్ను కరు జింపుము” అని మరింత బిగ్గరగా కేకలు పెట్టెను.
49. అంతట యేసు నిలిచి, “వానిని ఇటకు పిలువుడు” అనగా, వారు వానియొద్దకు వెళ్ళి “ఓరి, లెమ్ము, ధైర్యముగానుండుము. ఆయన రమ్మనుచున్నాడు” అని పిలిచిరి.
50. అంతట వాడు తనవస్త్రమును పారవేసి, వెంటనే లేచి యేసువద్దకు వచ్చెను.
51. అప్పుడు యేసు “నేను ఏమి చేయగోరుచున్నావు?” అని వానిని అడుగగా, వాడు “బోధకుడా! నాకు చూపు దయ చేయుము” అని వేడుకొనెను.
52. “నీవు వెళ్ళుము. నీ విశ్వాసము నీకు స్వస్థత చేకూర్చినది” అని యేసు అనినంతనే వాడు దృష్టిని పొంది, త్రోవవెంట ఆయనను అనుసరించెను.