1వ అధ్యాయము + - 1. న్యాయాధిపతులు పరిపాలనచేయు కాలమున దేశమున పెద్ద కరువు వచ్చెను. కనుక యూదా రాజ్యమునందలి బేత్లెహేములో నివసించునొకడు తన భార్యను, తన ఇద్దరు కుమారులను తీసికొని మోవాబు దేశమునకు వలసపోయెను. 2. అతని పేరు ఎలీమెలెకు. అతని భార్య పేరు నవోమి. కొడుకుల పేర్లు మహోను, కిల్యోను. వారు ఎఫ్రాతా తెగవారు. వారు మోవాబు దేశమున వసించుచుండగా 3. ఎలీమెలెకు చనిపోయెను. ఇక నవోమికి మిగిలినది ఇద్దరు కుమారులు మాత్రమే. 4. ఆ ఇరువురు మోవాబు యువతులను పెండ్లాడిరి. వారి పేర్లు ఓర్పా, రూతు. వారు ఆ దేశమున పదియేండ్లపాటు జీవించిరి. 5. ఆ పిమ్మట ఆ ఇద్దరు కుమారులు కూడ మరణించిరి. ఆ విధముగ భర్త, పుత్రులు గతింపగా నవోమి ఒంటరిగా మిగిలిపోయెను. 6. ప్రభువు యిస్రాయేలు ప్రజలను కరుణించి వారి దేశమున పంటలు పండించెనని విని ఆమెయు, ఆమె కోడండ్రును మోవాబు నుండి వెళ్ళగోరిరి. 7. కనుక ఆమెయు, ఆమె కోడండ్రులు పయనమై వారితో పయనమై యూదా రాజ్యమునకు పోవు బాటను పట్టిరి. 8. త్రోవలో ఆమె ఇద్దరు కోడండ్రతో "అమ్మలార! మీరిక తిరిగి మీ పుట్టినిండ్లు చేరుకొనుడు. మీరు నాయెడల, ఆ గతించిన వారియెడల మిగుల దయచూపిరి. ప్రభువు కూడ మిమ్ము కరుణతో చూచును గాక! 9. య...