ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సోలోమోను జ్ఞానగ్రంధము

 1. లోకమునేలు రాజులారా! మీరు న్యాయమును పాటింపుడు. మీ హృదయములను ప్రభువుమీద లగ్నము చేసికొనుడు. చిత్తశుద్ధితో ఆయనకొరకు గాలింపుడు.

2. తనను పరీక్షకు గురిచేయని వారికి, తనను శంకింపని వారికి ఆయన దర్శనమిచ్చును.

3. దురాలోచనము కలవారికి దేవుడు దొరకడు. దేవుని పరీక్షించుటకు సాహసించువారిని ఆయన శక్తి పిచ్చివారినిగా చేయును.

4. జ్ఞానము కపటాత్ముని వరింపదు. అది పాపి హృదయమున వసింపదు.

5. ఉపదేశమునొసగు పవిత్రాత్మము కపటమును అంగీకరింపదు, అది మూర్ఖతను సహింపదు, అన్యాయమును మెచ్చుకొనదు.

6. జ్ఞానము నరులతో స్నేహము చేయు ఆత్మము. కాని, అది దేవుని నిందించువారిని సహింపదు. దేవుడు నరుని అంతరంగమును పరిశీలించును. అతని హృదయాలోచనలను పరీక్షించును, అతని పలుకులను వినును.

7. దేవుని ఆత్మము ప్రపంచమునంతటిని ఆవరించియున్నది. అది ఈ లోకమునంతటిని ఒక్కటిగా ఐక్యపరచుచున్నది నరుడు పలుకు ప్రతి పలుకును ఆ ఆత్మకు తెలియును.

8. అన్యాయమును సమర్థించువాడు తప్పించుకోజాలడు అతనికి న్యాయసమ్మతమైన శిక్ష ప్రాప్తించితీరును.

9. భక్తిహీనుని ఆలోచనలు పరిశీలింపబడును, అతని పలుకులు దేవునికి తెలియజేయబడును, అతడు తన నేరములకు తగిన శిక్ష ననుభవించును.

10. దేవుడు నరుల పలుకులన్నిటిని జాగ్రత్తగా వినును. వారు తన మీద చేయు ఫిర్యాదులన్ని ఆయన చెవినబడును.

11. కనుక దేవునిమీద వట్టిగనే నిందలుమోపవద్దు. ఆయనను గూర్చి నిష్ఠురములాడవద్దు. మనము రహస్యముగా పలికిన పలుకులకుగూడ ప్రతిఫలముండును. అబద్దములాడువాడు నాశనమైపోవును.

12. దుష్కార్యములుచేసి చావును తెచ్చుకోవలదు. చెడుపనులవలన మృత్యువును ఆహ్వానింపవలదు

13. మృత్యువును దేవుడు కలిగింపలేదు, ప్రాణులు చనిపోవుటను చూచి ఆయన సంతసింపడు.

14. ఆయన ప్రతి ప్రాణిని జీవించుటకొరకే సృజించెను. ఆయన చేసిన ప్రాణులన్నియు ఆయురారోగ్యములతో అలరారుచున్నవి. జీవులలో మరణకరమైన విషయమేమియు లేదు. మృత్యువు ఈ లోకమున రాజ్యము చేయదు.

15. న్యాయమునకు మరణము లేదు. దుష్టులు జీవితమును సరిగా అర్ధము చేసుకొనరు

16. కాని దుష్టులు తమ వాక్కియల ద్వారా మృత్యువును ఆహ్వానించిరి. చావును తమ నేస్తురాలినిగా భావించి దానితో పొత్తు కుదుర్చుకొనిరి. తాము దానికి తగిన స్నేహితులైరి.

 1. దుష్టులు మూర్ఖబుద్ధితో ఇట్లు తలంచిరి: “మన ఈ జీవితము స్వల్పకాలికమైనది, శోకమయమైనది. ఈ మరణము ఆసన్నమైనపుడు డెవడును తప్పించుకోజాలడు. కులం మృత్యులోకమునుండి తిరిగివచ్చిన వాడెవడునులేడు. 

2. మనము కేవలము యాదృచ్చికముగా పుట్టితిమి, మరణము తరువాత మన ఉనికి ఏమియు మిగులదు. మన ఊపిరి పొగవంటిది. మన బుద్ధిశక్తి కేవలము హృదయస్పందనము వలన పుట్టిన రవ్వ

3. ఈ రవ్వ ఆరిపోగానే మన దేహము బుగ్గియగును, మన ఊపిరి గాలిలో కలిసిపోవును.

4. కాలక్రమమున మన పేరు మాసిపోవును. మనము సాధించిన కార్యములనెవరును గుర్తుంచుకొనరు. మన బ్రతుకులు మబ్బులవలె మాయమైపోవును. ఎండ వేడిమి సోకిన పొగమంచువలె కరిగిపోవును.

5. ఈ నేలమీద మన బ్రతుకులు నీడలవలె గతించును. మనమెవరమును మృత్యువును నిరోధింపజాలము. నరులెల్లరికి చావు విధింపబడినది. ఎవరును దానిని తప్పించుకోజాలరు.

6. కనుక ఈలోకమున సుఖభోగములు అనుభవించుచు యువకులవలె కాలము గడుపుచు సుఖింతము.

7. విలువగల మద్యములను, లేహ్యములను సేవింతము. వసంతకాల పుష్పములన్నిటిని వాడుకొందము. 

8. వాడిపోకమునుపే గులాబీలను కోసి అలంకరించు కొందము. మనలోనెవడును మన పాలబడిన భోగములను విడనాడకూడదు.

9. మనమనుభవించిన ఆనందములను జ్ఞప్తికి తెచ్చు గురుతులను ఎల్లతావుల నిలుపుదము. విలాసజీవితము మన భాగధేయము.

10. “దరిద్రుడును, నీతిమంతుడునైన నరుని పట్టి పీడింతము. వితంతువులను తలనెరసిన ముదుసలులను అనాదరము చేయుదము.

11. మనబలమే మనగొప్ప. లోకములో దౌర్బల్యమునకు తావులేదు.

12. నీతిమంతుడైన నరుని పీడను వదిలించుకొందము. ఉచ్చులుపన్ని అతనిని కూలద్రోయుదము, అతనికి మన కార్యములు గిట్టుటలేదు. మనము ధర్మశాస్త్రములను, పూర్వాచారములను పాటించుటలేదని అతడు మనలను నిందించుచున్నాడు .

13. తాను దేవుని అనుభవమునకు తెచ్చుకొనెననియు, తాను దేవుని బిడ్డడననియు అతడు చెప్పుకొనుచున్నాడు.

14. అతని పోకడలు మన భావములకు విరుద్ధముగానున్నవి కావున అతనినెంత మాత్రము సహింపరాదు.

15. అతడు ఇతరుల వంటివాడుకాదు. వాని చెయిదములు చోద్యముగానున్నవి.

16. అతని దృష్టిలో మనము చలామణికాని నాణెముల వంటి వారలము. మన కార్యములు అశుద్ధమువలె నింద్యములైనవి. పుణ్యపురుషులు ఆనందముతో మరణింతురని అతని వాదము. దేవుడు తనకు తండ్రియని అతడు గొప్పలు చెప్పుకొనుచున్నాడు.

17. అతని పలుకులు యదార్ధమేనేమో పరిశీలింతము. అతని మరణము ఏ తీరున ఉండునో చూతము.

18. నీతిమంతుడు దేవుని కుమారుడౌనేని దేవుడతని కోపు తీసికొనును.  శత్రువులబారినుండి అతనిని కాపాడును.

19. కనుక అతనిని క్రూరముగా అవమానించి, హింసించి, పరీక్షకు గురిచేయుదము. అతని శాంత భావమేపాటిదో, సహనభావమెంత గొప్పదో, పరీక్షించి చూతము.

20. అతనిని నీచమైన చావునకు గురిచేయుదము. దేవుడే తనను రక్షించునని అతడు చెప్పుకొనుచున్నాడుకదా!” అది ఎంత నిజమో చూతుము.

21. దుష్టుల భావములు ఇట్లులుండును, కాని వారు పొరపాటు చేసిరి. వారు తమ దుష్టత్వము వలననే మూర్ఖులైరి.

22. కాని వారికి దేవుని మర్మములు తెలియవు. పవిత్రమును, నిర్మలమైన జీవితమునకు బహుమతి కలదనియు వారికి తెలియదు.

23. దేవుడు నరుని అమరునిగా చేసెను. అతనిని తనవలె అమరునిగా చేసెను.

24. కాని పిశాచము అసూయవలన మృత్యువు లోకములోనికి ప్రవేశించెను. పిశాచపక్షమును అవలంబించువారు . చావును చవిజూతురు.

 1. సజ్జనులను దేవుడు కాచి కాపాడును, వారేనాడును వ్యధలకు గురికారు.

2. అజ్ఞానులకు వారు చనిపోయినట్లే కనిపించిరి. తమ మరణానంతరము అపజయము , పొందినవారివలెను

3. నాశనమునకు గురి అయిన వారివలెను చూపట్టిరి. కాని వారు శాంతిని అనుభవించుచున్నారు.

4. ఆ సత్పురుషులు శిక్షను అనుభవించిన వారివలె చూపట్టినను అమరత్వము పొందెదమను నమ్మకము వారికి కలదు.

5. వారి బాధ కొద్దిపాటిది, బహుమతి మాత్రము చాల పెద్దది. " ప్రభువు వారిని పరీక్షించి చూచి, వారు తన సన్నిధిలో ఉండుటకు యోగ్యులని తలంచెను.

6. బంగారమును పుటము వేసినట్లుగా దేవుడు వారిని పరీక్షించెను. దహనబలి నంగీకరించినట్లుగా, వారి ప్రాణములనంగీకరించెను.

7. ప్రభువు పుణ్యపురుషులకు బహుమానము ఈయవచ్చినపుడు వారు ఎండుగడ్డిని కాల్చు రవ్వలవలె మండుచూ దుష్టులను కాల్చివేయుదురు.

8. వారు నానా జాతులకు తీర్పు విధించి వారిని పరిపాలింతురు. ప్రభువే నిరతము వారికి పాలకుడగును.

9. ప్రభువును నమ్మినవారికి ఆయన సత్యము తెలియును. ఆయన భక్తులు ఆయన ప్రేమను చూరగొందురు. ఆయన తానెన్నుకొన్నవారికి కరుణను, వరప్రసాదమును దయచేయును.

10. కాని దుష్టుల దురాలోచనలకుగాను వారికి శిక్షపడును. వారు ప్రభువును నిరాకరించి న్యాయమును అనాదరము చేసిరి.

11. జ్ఞానమును, ఉపదేశమును నిరాకరించువారు దౌర్భాగ్యులు, వారి ఆశలు వమ్మగును, కృషి వ్యర్థమగును, వ్యాపారములు నిష్ఫలమగును. 

12. వారి భార్యలు బాధ్యతారహితులుగా ప్రవర్తింతురు, వారి పుత్రులు దుర్మార్గులగుదురు, వారి వంశజులు శాపగ్రస్తులగుదురు.

13. వ్యభిచారమునకు పాల్పడక, నిర్మల జీవితము గడపిన స్త్రీ గొడ్రాలయినను ధన్యురాలే. న్యాయనిర్ణయ దినమున ఆమె సంతానమునెల్లరును చూడవచ్చును.

14. ప్రభువును గూర్చి దుష్టాలోచనములు చేయనివాడును, ధర్మశాస్త్రమును మీరని వాడునగు నపుంసకుడును ధన్యుడు. అతని భక్తికిగాను ప్రభువతనికి విశిష్టవరమునొసగును అతడు ప్రభువు దేవాలయమున ప్రవేశమునొంది తగు స్థానమును బడయును.

15. కష్టించి పనిచేసినచో సత్ఫలితములు పడయవచ్చును. విజ్ఞానవృక్షమూలము ఎండిపోక పిలకలువేయును.

16. కాని వ్యభిచారమున పుట్టిన బిడ్డలు పెంపుచెందరు. పాపమున పుట్టిన వారు నశించి తీరుదురు.

17. అట్టి వారు దీర్ఘకాలము జీవించినను ఫలితముండదు కడన ముసలిప్రాయమున వారినెవరును గౌరవింపరు

18. ఒకవేళ వారు లేత వయసుననే చనిపోయినచో న్యాయనిర్ణయదినమున ఎట్టి ఆనందమును అనుభవింపజాలరు.

19. దుర్మార్గులకు పట్టు దుర్గతి అట్టిది.

 1. సుగుణములతో కూడిన సంతానలేమియే మిన్నయైనది. ఎందుకన సుగుణముల యొక్క మననము అమరమైనది. అది దేవుని చేతను, మానవులచేతను ఘనముగా యెంచబడునది.

2. నీతి అనునది చూపట్టినపుడు ప్రజలెల్లరును దానిని అనుసరింప గోరుదురు. అది చూపట్టనపుడు ఎల్లరును దానికొరకు అఱ్ఱులు చాతురు. ఎల్లపుడును నరునికి నీతియే ఉత్తమ బహుమతి. నీతికిమించిన సద్గుణము లేదు.

3. వ్యభిచారమున పుట్టిన బిడ్డలెందరైన ఫలితము లేదు. వారు లోతుగా వేరు పాతుకొననందున స్థిరముగా నిలువజాలని చెట్టువంటి వారగుదురు. 

4. వ్రేళ్ళులేని చెట్టువలె వారు కొన్ని కొమ్మలు వేయుదురుగాని గాలికి అల్లల్లాడుదురు. పెనుగాలికి పెళ్ళున కూలిపోవుదురు.

5. వారి కొమ్మలు పెరగక మునుపే విరిగిపోవును. వారి ఫలములు సరిగా పక్వము కాలేదు కనుక తినుటకు పనికిరావు.

6. న్యాయనిర్ణయదినము వచ్చినపుడు వ్యభిచారమున పుట్టిన బిడ్డలు తమ తల్లిదండ్రుల తప్పును ఎత్తిపొడుతురు.

7. యవ్వనమున చనిపోయినను, పుణ్యపురుషునికి విశ్రాంతి లభించును.

8. దీర్ఘకాలము జీవించుట వలననే గౌరవము కలుగదు. పెక్కుఏండ్లు బ్రతుకుట వలననే జీవితము సార్థకము కాదు.

9. జ్ఞానార్జనమే తల నెరయుటకు గురుతు. నిర్మలజీవితమే వృద్ధత్వమునకు చిహ్నము.

10. ప్రభువునకు ప్రీతి కలిగించిన పుణ్యపురుషుడొకడు కలడు. ఆ ప్రభువు అతనిని ప్రేమించెను. మ న అతడు పాపాత్ముల నడుమ వసించుచుండగా ప్రభువతనిని పరమునకు కొనిపోయెను.

11. చెడుగు ఆ సజ్జనుని మనసును పాడుచేసెడిదే, దుష్టత్వము ఆ సత్పురుషుని హృదయమును చెరచెడిదే, కనుక ప్రభువతనిని ముందుగనే తీసుకొనిపోయెను.

12. చెడుగు నరులను మభ్యపెట్టి, వారు మంచిని గుర్తింపకుండునట్లు చేయును. వ్యామోహములు మంచివారి హృదయములను కూడ చెరచును.

13. కాని ఆ సజ్జనుడు స్వల్పకాలముననే సిద్ధినిపొంది దీర్ఘకాలము జీవించినవాడాయెను.

14. ప్రభువు ఆ సత్పురుషుని వలన ప్రీతిచెంది, అతడిని పాప ప్రపంచము నుండి సత్వరమే కొనిపోయెను. ప్రజలకు అతని మరణమును గూర్చి తెలిసినను, వారు విషయమును అర్ధము చేసికోలేదు, సత్యము వారి తలకెక్కలేదు.

15. ప్రభువు తన భక్తులకు కృపను, కరుణను దయచేయుననియు, వారిని కాచి కాపాడుననియు ప్రజలు గ్రహింపరైరి.

16. చనిపోయిన పుణ్యపురుషుడు బ్రతికియున్న దుర్మార్గుని ఖండించును. స్వల్పకాలములో సిద్ధిని పొందిన యువకుడు దీర్ఘకాలము జీవించు వృద్ధపాపిని పరిహాసము చేయును.

17. జ్ఞాని యవ్వనముననే చనిపోవుటను దుష్టులు చూతురు. కాని ప్రభువతనికి ఏమి ఉద్దేశించెనో వారు గ్రహించజాలరు. అతనికెట్టి భద్రత కలిగించెనో అర్థము చేసికోజాలరు

18. జ్ఞాని మరణమునుచూచి దుర్మార్గులు నవ్వుదురు. ప్రభువు మాత్రము వారిని గేలిచేయును. ఆ దుష్టులు చచ్చినపుడు వారిని గౌరవప్రదముగా పాతి పెట్టరు.మృతులుకూడ వారిని సదా చీదరించుకొందురు.

19. ప్రభువు వారిని క్రిందికి బడద్రోయగా వారి నోట మాటలురావు. వారు పునాదులు కదలిన భవనమువలె కూలి నాశనమగుదురు. నానా యాతనలకు గురియగుదురు. ఎల్లరును వారిని విస్మరింతురు.

20. తమ పాపములకు లెక్కనొప్పజెప్పవలసిన న్యాయనిర్ణయ దినమున ఆ దుర్మార్గులు గడగడవణకుదురు. వారి దుష్కార్యములే వారిని దోషులుగా నిరూపించును

 1. ఆ రోజున పుణ్యపురుషుడు ధైర్యముగా లేచి నిలుచుండును. పూర్వము తనను హింసించి, తన బాధను అనాదరము చేసినవారిని అతడు ఎదుర్కొనును.

2. ఆ దుర్మార్గులు అతనిని చూచి భయముతో కంపింతురు. తాము ఊహింపని రీతిగా అతడికి భద్రత లభించినందుకు ఆశ్యర్యము చెందుదురు.

3. వారు తాము చేసిన దుష్టకార్యమునకుగాను పశ్చాత్తాపపడి, బాధతో మూలుగుచు, ఒకరితోనొకరిట్లు చెప్పుకొందురు:

4. “పూర్వము మనము ఇతడిని చూచి నవ్వితిమి, గేలిచేసితిమి. కాని మనమే పిచ్చివారలము. ఇతనిది వట్టి వెట్టి జీవితము అనుకొంటిమి.ఇతడు నికృష్టమైన చావు చచ్చెననుకొంటిమి.

5. కాని ఎందుకు ఇప్పుడితడు దేవుని పుత్రుడుగా గణింపబడుచున్నాడు? ఎందుకు ప్రభువు భక్తుడుగా లెక్కింపబడుచున్నాడు?

6. కాని మనము సత్యమార్గమునుండి వైదొలగితిమి. ధర్మజ్యోతి మనమీద ప్రకాశింపనేలేదు. నీతిసూర్యుని పొడుపునుమనమసలు దర్శింపనేలేదు

7. మనము నడచినవి దుష్టమార్గములు, వినాశ పథములు. త్రోవలులేని ఎడారులందెల్ల తిరుగాడితిమి. కాని దైవమార్గమును మాత్రము విస్మరించితిమి.

8. మన అహంకారము వలన ప్రయోజనమేమి? మన సంపదలవలనను, దర్పమువలనను మనకొరిగినదేమి?

9. “అవియెల్ల ఇపుడు నీడలవలె గతించినవి. వదంతులవలె దాటిపోయినవి.

10. అలలు చెలరేగిన సముద్రముగుండ ఓడ సాగిపోవుటవలె అది వెడలిపోయిన పిదపగాని దాని జాడతెలియరాదు.

11. పక్షి గాలిలో ఎగురునట్లు అది తన రెక్కలతో తేలికయైన గాలిని దబదబ బాదును. ఆ గాలిని పాయలుగా చీల్చివేసి వేగముగల రెక్కలతో ముందునకు దూసికొనిపోవును. అది వెడలిపోయిన తరువాత దాని జాడ తెలియరాదు.

12. లక్ష్యమును గురిచూచి బాణము వేయుదుము, అమ్ము వెడలుటకు తావిచ్చిన గాలి తిరిగి కలిసికొనును. అటు పిమ్మట ఆ బాణము ఏ మార్గమున పోయెనో చెప్పజాలము.

13. మన సంగతియు ఇంతియే. మనము పుట్టగనే చచ్చితిమి. మనము చేసిన పుణ్యకార్యములేమియు లేవు. మన దుష్టత్వమే మనలను నాశనము చేసినది”.

14. దుష్టుల ఆశ గాలితగిలిన పొట్టువలె ఎగిరిపోవును. సముద్రపు నురగవలె చెదరిపోవును. పొగవలె తేలిపోవును. ఒక్కరోజు మాత్రము ఉండి వెళ్ళిపోయిన అతిథినిగూర్చిన స్మరణమువలె మాసిపోవును.

15. కాని పుణ్యపురుషులు మాత్రము శాశ్వతముగా జీవింతురు. ప్రభువు వారిని బహూకరించును, మహోన్నతుడు వారిని కాపాడును.

16. ప్రభువు వారికి రాజవైభవములు అబ్బునట్లు చేయును. సుందరములైన కిరీటములను ఒసగును. తన దక్షిణ హస్తముతో వారిని కాపాడును. తన బాహుబలముతో సంరక్షించును.

17. ప్రభువు తన దృఢనిశ్చయమునే కవచముగా ధరించి, ఈ సృష్టిని ఆయుధముగా తాల్చి, తన శత్రువులతో యుద్ధమునకు పోవును.

18. అతడు తన ధర్మమును వక్షస్త్రాణముగాను, తీర్పును శిరస్త్రాణముగాను ధరించును.

19. తన పావిత్య్రమును గెలువరాని డాలుగాను ధరించి కఠోర కోపమును ఖడ్గముగా నూరుకొనును.

20. ప్రకృతిశక్తులన్నియు ప్రభువుతో వెడలివచ్చి, ఆయనను ఎదిరింపబూనిన సాహసికులతో పోరాడును.

21. అతడు మేఘములనెడు ధనుస్సునెక్కుపెట్టి, బాణములను గుప్పించుచున్నాడో అన్నట్లు మెరుపులు వచ్చి దుష్టులను తాకును.

22. వడిసెలనుండి వచ్చిన రాళ్ళవలె వడగండ్లు వారిమీదికి ఉగ్రముగా దిగివచ్చును. సముద్రము వారిమీదికి పొంగిపారును. నదులు వారిని నిర్దయతో ముంచివేయును.

23. పెనుగాలివాన వీచి వారిని పొట్టువలెనెగరగొట్టును అధర్మవర్తనము ప్రపంచమునంతటిని తుడిచిపెట్టును. దుష్టవర్తనము రాజులను సింహాసనము మీదినుండి కూలద్రోయును.

 1. రాజులారా! నా పలుకులాలించి విషయమునర్ధము చేసికొనుడు. విశాల ప్రపంచమునేలు పాలకులారా! నా హెచ్చరికలు పాటింపుడు.

2. మీరు వేలాది ప్రజలను పరిపాలింతురు. మేము చాలమందిని ఏలేదమని గర్వింతురు.

3. ప్రభువే మీకు ఈ పెత్తనము నొసగెను. మహోన్నతునినుండే మీకు ఈ రాజ్యా ధికారము లభించినది. అతడు మీ పరిపాలనా విధానములను మీ ఉద్దేశములను పరిశీలించి చూచును.

4. మీరు దేవునితరపున అతని రాజ్యమును పరిపాలించువారు. కాని మీరు ధర్మయుక్తముగా పాలింపలేని, న్యాయము పాటింపరేని, దైవచిత్తమును అనుసరింపలేని,

5. అతడు దిఢీలున మీ మీదపడి కును మిమ్ము ఘోరముగా శిక్షించును. ఉన్నతాధికారులకు కఠినమైన శిక్ష ప్రాప్తించును.

6. ప్రభువు అల్పులను కరుణతో వదలివేయును. కాని ఘనులను నిశితముగా దండించును.

7. అందరికిని యజమానుడైన ప్రభువు , ఎవరికిని తలయెగ్గడు. ఆయన ఘనులను చూచి భయపడడు. అల్పులను, అధికులను కూడ ఆయనే చేసెను. అందరిని ఆయనే పోషించును.

8. కాని ఆయన పాలకులకు మాత్రము కఠినమైన తీర్పు తీర్చును.

9. కనుక రాజులారా! నా హెచ్చరికలు మీకొరకే, మీరు జ్ఞానమును బడసి మీ తప్పులను దిద్దుకొనుట కొరకే.

10. పవిత్రమైన కార్యములను పవిత్రముగా నిర్వహించువారు పవిత్రులుగా గణింపబడుదురు. ఈ పాఠమును మీరు చక్కగా నేర్చుకొందురేని న్యాయనిర్ణయదినమున మిమ్ము మీరు రక్షించుకోగలుగుదురు.

11. కనుక నా బోధల కొరకు ఆశతో కనిపెట్టుకొని ఉండుడు, కోరికతో వేచియుండుడు. అవి మీకు ఉపదేశము చేయును.

12. జ్ఞానము కాంతితో ప్రకాశించునే కాని కొడిగట్టదు. తనను ప్రేమించువారికది సులువుగనే లభించును. తనను వెదుకు వారికి అది సులువుగనే దొరకును.

13. తనను అభిలషించు వారికది వెంటనే సాక్షాత్కరించును.

14. పెందలకడనే లేచి జ్ఞానముకొరకు గాలించినచో తిప్పలుండవు. అది తనంతట తానే వచ్చి మీ తలుపుచెంత కూర్చుండును.

15. జ్ఞానముగూర్చి ఆలోచించిన, పరిపూర్ణమైన విజ్ఞత కలుగును. దానికొరకు గాలించినచో చిత్తశాంతి లభించును.

16. విజ్ఞానమే తనకు తగినవారికొరకు వెదకుచుండును దయతో వారి రోజువారిపనులలో వారికి సాక్షాత్కరించును. వారి ఆలోచనలన్నిట వారికి ప్రత్యక్షమగును.

17. విజ్ఞానమునార్జింపవలెనన్న దానిమీద నిజమైన కోరిక ఉండవలెను. విజ్ఞానమును కోరుకొనుట అనగా దానిని ప్రేమించుటయే.

18. విజ్ఞానమును ప్రేమించుట అనగా దాని ఆజ్ఞలను పాటించుటయే. విజ్ఞానపుటాజ్ఞలను పాటించినచో అమరత్వము కలుగును.

19. అమరత్వము నరులను దేవునికి సన్నిహితులుగా చేయును.

20. ఈ రీతిగా జ్ఞానాభిలాషమిమ్ము రాజ్యములేలుటకు సంసిద్ధులను చేయును.

21. కావున బహుజాతులనేలు రాజులారా! మీరు మీ సింహాసనమును, రాజ దండమును విలువతో చూతురేని, జ్ఞానమును సన్మానింతురేని, అప్పుడు మీరు శాశ్వతముగా రాజ్యము చేయుదురు.

22. జ్ఞానమనగానేమో, అదెట్లు పుట్టినదో వివరింతును నేను మీనుండి రహస్యములేమియు దాచను నేను జ్ఞానపు చరిత్రను మొదటినుండి విశదీకరింతును. దానినిగూర్చి ఎల్లరికిని స్పష్టముగా తెలియజేయుదును. నేను సత్యమును మరుగుపరచను.

23. అసూయకు లొంగి నాకు తెలిసిన దానిని దాచను. అట్టి దృక్పథమును విజ్ఞానము అంగీకరింపదు.

24. జ్ఞానులు అధికముగానున్నచో లోకమునకు మేలు కలుగును. విజ్ఞతగల రాజువలన ప్రజలకు భద్రత సిద్దించును.

25. కనుక నా ఉపదేశము నేర్చుకొని లాభమును బడయుడు.

 1. నరులందరివలె నేనును మర్త్యుడనే. నేనును మట్టినుండి పుట్టిన మొదటి మనిషి నుండి జన్మించినవాడనే. నేను నా తల్లి గర్భములో రక్తమాంసములతో తయారైతిని.

2. స్త్రీతో సుఖము ననుభవించిన పురుషుని వీర్యమునుండి నేనుద్భవించితిని. పది నెలల పాటు నా తల్లి గర్భమునందలి నెత్తురులో నా దేహము రూపముతాల్చెను.

3. పుట్టినప్పుడు అందరు పీల్చుగాలినే నేనునూ పీల్చితిని. అందరిని భరించు నేలమీదనే నన్ను కూడ పరుండబెట్టిరి. అందరివలె నేనును ఏడ్పుతోనే నా మొదటి శబ్దమును చేసితిని.

4. నన్ను పొత్తి గుడ్డలలో చుట్టి జాగ్రత్తగా సాకిరి.

5. ఏ రాజును ఇంతకంటే భిన్నమైన జీవితము జీవించియుండడు.

6. నరులెల్లరు ఒక్క రీతిగనే పుట్టి, ఒక్క రీతిగనే చత్తురు.

7. కనుక నేను ప్రార్థన చేయగా దేవుడు నాకు వివేకమొసగెను. నేను మనవి చేయగా జ్ఞానాత్మము నామీదికి దిగి వచ్చెను.

8. సింహాసనము కంటెను, రాజదండము కంటెను అధికముగా నేను జ్ఞానమును అభిలషించితిని. సంపదలు దానితో సరితూగజాలవని గ్రహించితిని.

9. అమూల్య మణులేవియు దానికి సాటిరావని తెలిసికొంటిని. జ్ఞానముతో పోల్చినచో లోకములోని బంగార మంతా వట్టి ఇసుకముద్ద,వెండి అంత వట్టి మట్టి పెళ్ళ.

10. నేను ఆరోగ్యము కంటే, సౌందర్యము కంటే, జ్ఞానము నెక్కువగా కోరుకొంటిని. దాని కాంతి ఏనాడును తరిగిపోదు. కనుక వెలుతురు కంటే కూడ దానిని అధికముగా అభిలషించితిని.

11. జ్ఞానము నా చెంతకు వచ్చినపుడు సమస్త ప్రశస్తవస్తువులను గూడ తీసికొనివచ్చెను. బహుసంపదలను కూడ తెచ్చెను.

12. జ్ఞానమే కొనివచ్చెను కనుక నేనా వస్తువులను చూచి ఆనందించితిని. ఆ వస్తువులకెల్ల జ్ఞానమే ఆధారమని పూర్వము నాకు తెలియదు.

13. నేను చిత్తశుద్ధితో సంపాదించిన జ్ఞానమును గూర్చి మీకును నిశ్చింతగా తెలియజేసెదను. అది నాకు తెచ్చిపెట్టిన లాభములను నేనొక్కడనే దక్కించుకోను.

14. జ్ఞానము తరుగని నిధివంటిది. దానిని సంపాదించువారు దేవునికి స్నేహితులగుదురు. దాని ఉపదేశమును ఆలించువారిని ఆయన మెచ్చుకొనును.

15. నేను దేవుని చిత్తప్రకారము సంభాషింతునుగాక! నేను నేర్చుకొనిన సంగతులకు అనుగుణముగా మాట్లాడెదనుగాక! ఈ భాగ్యమును దయచేయవలయునని ప్రభువును వేడుకొనుచున్నాను. జ్ఞానమును నడిపించువాడును, జ్ఞానులను చక్కదిద్దువాడును ప్రభువే.

16. మనమును, మన పలుకులును, మన జ్ఞానమును, నైపుణ్యమును ఆయన ఆధీనమున నుండును.

17. నరులకు ఆయా వస్తువుల జ్ఞానమును దయచేసిన వాడు ఆయనే. ప్రపంచ నిర్మాణమును గూర్చియు, పంచభూతములను గూర్చియు,

18. కాలపుటారంభమును, మధ్యమమును, అంతమును గూర్చియు, సూర్యగతిని గూర్చియు, ఋతుక్రమములను గూర్చియు,

19. గ్రహములను, యుగములను గూర్చియు,

20. ప్రాణులను, వన్యమృగములను గూర్చియు, వాయువులను గూర్చియు, నరుల ఆలోచనావిధానమును గూర్చియు, పలురకములైన మొక్కలను గూర్చియు, వాని మూలికలతో చేయు మందులను గూర్చియు నాకు తెలియ జేసినవాడు ఆయనే.

21. నరులకు స్పష్టముగా తెలిసినవియు,  తెలియనివిగూడ నేను నేర్చుకొంటిని. అన్నిటికిని అస్తిత్వమొసగిన జ్ఞానమే నాకును బోధ చేసెను.

22. విజ్ఞానము యొక్క ఆత్మము తెలివికలది, పవిత్రమైనది. ఒక్కటియయ్యు బహుముఖముల చూపట్టునది సూక్ష్మమైనది, చలనాత్మకమైనది, స్పష్టమైనది, పరిశుభ్రమైనది, స్వచ్చమైనది, బాధింపరానిది, మేలుచేయునది, చురుకైనది,

23. ఎదిరింప శక్యముకానిది, ఉపకారము చేయునది, నరులతో స్నేహము చేయునది, స్థిరమైనది, నమ్మదగినది, విచారమునకు లొంగనిది, సర్వశక్తికలది, సర్వమును పరీక్షించునది, జ్ఞానాత్మకములును, పునీతములును, సూక్ష్మములునైన ప్రాణులన్నిటి లోనికి ప్రవేశించునది.

24. జ్ఞానము కదలిక కంటె గూడ త్వరగా కదలును. అది పవిత్రమైనది గనుక అన్ని వస్తువులలోనికి ప్రవేశించును.

25. అది దైవశక్తి యొక్క శ్వా సము. ప్రభువు మహిమ యొక్క స్వచ్చమైన ప్రవాహము. మలినమైనదేదియు దానిలోనికి ప్రవేశింపజాలదు

26. అది శాశ్వత జ్యోతికి ప్రతిరూపము. దేవుని క్రియాశక్తిని ప్రతిబింబించు నిర్మలపుటద్దము. దేవుని మంచితనమునకు ప్రతిబింబము.

27. అది ఒంటరిగా పనిచేసినను అన్నిటిని నిర్వహించును తాను మారకయే అన్నిటిని నూత్నీకరించును. అది ప్రతి తరమునను కొందరు భక్తులలోనికి ప్రవేశించి వారిని దేవుని స్నేహితులుగను, ప్రవక్తలుగను మార్చివేయును.

28. జ్ఞానమును చేపట్టినవానిని మాత్రమే ప్రభువు ప్రేమించును.

29. అది సూర్యునికంటె తేజోవంతమైనది. నక్షత్రరాసులకంటె, కాంతిమంతమైన వెలుతురుకంటె గూడ మెరుగైనది.

30. వెలుతురు చీకటికి లొంగిపోవును, కాని చెడుమాత్రము జ్ఞానమును జయింపజాలదు.

 


1. దాని మహాశక్తి ప్రపంచమంతట వ్యాపించియుండును. అది సమస్తమును క్రమపద్ధతిలో నడిపించి సద్వినియోగము చేయును.

2. నేను విజ్ఞానమును ప్రేమించితిని. బాల్యమునుండియు దానికొరకు గాలించితిని. దానిని నా వధువును గావించుకోగోరితిని. దాని సౌందర్యమునకు ముగ్ధుడనైతిని.

3. అది దేవునిసన్నిధిలో వసించుటచే, దాని విశిష్ట పుట్టుక మరింతవన్నెకెక్కెను. అన్నిటికిని అధిపతియైన ప్రభువు దానిని ప్రేమించెను. .

4. దానికి దేవుని రహస్యములు తెలియును. ఆయనను క్రియలకు పురికొల్పునదియును అదియే

5. ఈ జీవితమున సంపదలు ఆశింపదగినవైనచో, జ్ఞానమునకు మించిన సంపద లేదు. అన్నిటిచేతను పని చేయించునది అదియే.

6. బుద్ధి శక్తి అభిలషింపదగిన దైనచో, జ్ఞానమునకు మించిన బుద్ధిశక్తి యేమి కలదు? లోకములోని వస్తువుల నన్నిటిని నిర్మించినదదియే.

7. పుణ్యము కోరుకోదగినదైనచో, పుణ్యములన్నియు జ్ఞానముయొక్క కృషినుండియే పుట్టుచున్నవి. నిగ్రహము, వివేకము, న్యాయము, ధైర్యము మొదలైన వానినన్నిటిని జ్ఞానమే మనకు బోధించును. ఈ జీవితమున వీనికంటె విలువగలవి ఏమియు లేవు.

8. విస్తృతమైన అనుభవము ఆశింపదగినదైనచో జ్ఞానము భూతకాలము నెరుగును, భవిష్యత్తును పసికట్టును. అది సూక్తులను వివరించును, సమస్యలను పరిష్కరించును. దేవుడు చేయు అద్భుతములను ముందుగనే గ్రహించును. రానున్న యుగములను, కాలములను ముందుగనే వివరించును.

9. కనుక నేను జ్ఞానమును నాతో మా ఇంటికి తీసుకొనిరాగోరితిని. అది సంపదలు కలిగినపుడు నాకు సలహా యిచ్చుననియు, చింతలువంతలు వచ్చినప్పుడు నన్ను ఓదార్చుననియు నాకు తెలియును.

10. నేనిట్లు తలంచితిని: జ్ఞానమువలన నాకు సభలలో మర్యాద కలుగును. నేను యువకుడనైనను పెద్దలు నన్ను గౌరవింతురు.

11. నేను తీర్పులు చెప్పునపుడు తెలివితో మెలగుదును. పాలకులు నన్ను మెచ్చుకొందురు.

12. నేను మౌనముగానున్నప్పుడు జనులు నా పలుకుల కొరకు ఎదురుచూతురు. నేను మాట్లాడినపుడు ఆదరముతో విందురు. నేను సుదీర్ఘముగా మాటలాడినను వారు శ్రద్ధగా విందురు.

13. జ్ఞానమువలన నాకు అమరత్వము కలుగును. భావితరముల వారు నన్ను కలకాలము స్మరించుకొందురు.

14. నేను బహుప్రజలను పరిపాలింతును. పలుజాతులు నాకు లొంగును.

15. నా పేరు వినగనే భయంకరులైన నియంతలునుకూడ గడగడలాడుదురు. నేను నా ప్రజలను చక్కగా పరిపాలింతును. యుద్ధ రంగమున నా శూరత్వమును ప్రదర్శింతును.

16. నేను ఇంటికి తిరిగివచ్చినపుడు జ్ఞానమువలన నాకు శాంతి కలుగును. అది నన్ను దుఃఖ పెట్టదు. దానితో కలిసి జీవించువారికి సుఖసంతోషములేగాని విచారమెన్నటికి కలుగదు.

17. ఇట్లూహించి నా హృదయమునందు ఇట్లు భావించితిని: జ్ఞానముతో కలిసి జీవించినచో నేను అమరుడనయ్యెదను.

18. దానితో చెలిమిచేసినచో నాకు పరిపూర్ణానందము కలుగును. దాని పనులను చేసినచో అనంత సంపదలు సమకూరును. దాని సాంగత్యమువలన తెలివి అబ్బును. దానితో సంభాషించుట వలన గౌరవము కలుగును. కనుక నేను జ్ఞానమును బడయుట ఎట్లాయని ఆలోచించితిని.

19. బాల్యమునుండియు నేను సంతోషచిత్తుడనుగా ఉండెడివాడను. దేవుడు నాకు మంచియాత్మను దయచేసెను.

20. లేదా, నేను మంచివాడను గనుక ఆయన నా ఆత్మమొక నిర్మలదేహమున వసించునట్లు చేసెను.

21. అయినను దేవుడు అనుగ్రహించిననేతప్ప నాయంతట నేను జ్ఞానమును ఆర్జింపజాలనని నాకు తెలియును. ఆ వరమును దేవుడే ఈయవలెనని తెలిసికొనుటయు తెలివియే. కనుక నేను ప్రభువునకు మనవి చేసితిని. నా హృదయములో నుండి ఆయనకిట్లు విన్నవించుకొంటిని.

 1. “మా పితరుల దేవుడవును, కరుణా మయుడవునైన ప్రభూ! నీ వాక్కు ద్వారా నీవు సమస్తము సృజించితివి.

2. నీ జ్ఞానము ద్వారా నరుని నీ సృష్టికంతటికి అధిపతిని చేసితివి.

3. అతడు పావిత్య్రముతోను, నీతితోను, లోకమును పాలించునట్లును, ధర్మబద్దముగా న్యాయము చెప్పునట్లును చేసితివి.

4. నీ సింహాసనము ప్రక్కన కూర్చుండియుండు జ్ఞానమును నాకు దయచేయుము. నన్ను నీ తనయులలో ఒకనిగా స్వీకరింపుము.

5. నేను నీ దాసుడను, నీ దాసురాలి బిడ్డడను, అల్ప మానవుడను, స్వల్పకాలము. మాత్రము జీవించువాడను, ధర్మశాస్త్రమును, న్యాయమును సరిగా తెలియనివాడను

6. పరిపూర్ణుడైనవాడు కూడ, నీనుండి వచ్చు జ్ఞానము పొందడేని నిష్ప్రయోజకుడగును.

7. నీవే నన్ను నీ ప్రజలకు రాజుగా నియమించితివి. నీ పుత్రులకు, పుత్రికలకు న్యాయాధిపతిని చేసితివి.

8. నీ పవిత్రపర్వతము మీద దేవళము కట్టుమని నన్నాజ్ఞాపించితివి. నీవు వసించు నగరమున బలిపీఠమును నిర్మింపుమని చెప్పితివి. అది నీవు అనాదికాలము నుండియు సిద్ధము చేసియుంచిన పవిత్రదేవాలయమునకు నమూనాగా ఉండవలెనని నిర్ణయించితివి.

9. జ్ఞానము నీ చెంతనుండును, దానికి నీ కార్యములు తెలియును. . నీవు లోకమును సృజించునపుడు అది నీ దాపుననుండెను. నీకు ప్రీతి కలిగించునది ఏదియో, నీ ఆజ్ఞలకేది అనుకూలముగా ఉండునో దానికి తెలియును.

10. కనుక పరమపవిత్రమైన ఆకాశమునుండి, మహిమాన్వితమైన నీ సింహాసనమునుండి జ్ఞానమును నా యొద్దకు పంపుము. అది నాతో కలిసి పనిచేయునుగాక! దాని సాయమున నీకు ప్రియమగునది ఏదియో నేను తెలిసికొందునుగాక!

11. అది అన్నిటిని నెరుగును, అన్నిటిని అర్థము చేసికొనును. అది నేను చేయుపనులన్నింటను తెలివితో నాకు మార్గముచూపును. దాని శక్తి నన్ను కాపాడును

12. అప్పుడు నా కార్యములు నీకు ప్రీతిని గూర్చును, నేను నీ ప్రజలను న్యాయయుక్తముగా పాలింపగలుగుదును. నా తండ్రి సింహాసనమున ఆసీనుడనగుటకు యోగ్యుడనగుదును.

13. దేవుని ఆలోచనలెవరికి తెలియును? ఆయన చిత్తమును ఎవరు గ్రహింపగలరు?

14. నరులబుద్ది బలహీనమైది. మా ఆలోచనలు మమ్ము పెడత్రోవ పట్టించును.

15. నశ్వరమైన మా దేహము మా ఆత్మమును క్రుంగదీయును. ఈ మట్టి శరీరము ఆలోచనాత్మకమైన మా బుద్దిశక్తిని మందగింపచేయును.

16. ఈ భూమి మీది వస్తువులను తెలిసికొనుటయే మాకు కష్టము. చుట్టుపట్లనున్నవానిని గ్రహించుటకే మేము యాతన పడవలయును. ఇక పరమండల విషయములను అర్థము చేసికోగలవాడెవడు?

17. నీవు నీ జ్ఞానమును దయచేసిననేతప్ప, పైనుండి నీ పవిత్రాత్మమును పంపిననేతప్ప, నీ చిత్తమునెవడు తెలిసికోగలడు?

18. ఈ రీతిగా నీవు దయచేయు జ్ఞానము ద్వారా భూమిమీది నరులు, ఋజుమార్గమున నడచుచున్నారు. నీకు ప్రీతికరమైన కార్యమేదియో తెలుసుకొనుచున్నారు రక్షణ పొందుచున్నారు."

 1. లోకమునకు పితయు, దేవునిచే మొదటిగా రూపొందింపబడినవాడును తానొక్కడే సృష్టింపబడినపుడు, అది అతనిని స్వీయ అతిక్రమమునుండి కాపాడెను.

2. అతనికి అన్నిటిని పాలించు బలమునిచ్చెను.

3. ఒక పాపాత్ముడు కోపముతో, జ్ఞానమును తృణీకరించెను. కనుక అతడు ఆగ్రహముతో సోదరుని హత్యకు పాల్పడి నశించెను.

4. అతని పాపమువలన భూమి జలప్రళయమున మునిగిపోగా, జ్ఞానము ధరణిని మరల కాపాడెను. అదియొక పుణ్యపురుషుని , చిన్న కొయ్యపడవపై నడిపించెను.

5. అన్యజాతులు దుష్కార్యములుచేసి అవమానమున మునిగియున్నపుడు, జ్ఞానమొక ధర్మాత్మునెన్నుకొని అతడు దేవుని సమక్షమున నిర్దోషిగామనునట్లు చేసెను. ఆ పుణ్యాత్మునికి మనోధైర్యము నొసగి అతడు తన పుత్రుని కొరకు పరితపింపకుండునట్లు చేసెను.

6. దుర్మార్గులెల్ల నాశమగునపుడు జ్ఞానమొక సజ్జనుని కాపాడెను. పంచనగరములను దహించు అగ్నినుండి అతడు తప్పించుకొనెను.

7. ఆ నగరముల దుష్కార్యములకు సాక్ష్యముగా నేటికిని అచటి పొలములు పంటపండక, పొగ వెళ్ళగ్రక్కుచున్నవి. అచటి చెట్లు కాయలు కాయునేగాని అవి పండవు. దేవుని నమ్మని వ్యక్తికి సాక్ష్యముగా అచటనొక ఉప్పుకంబము నిలిచియున్నది.

8. ఆ పట్టణముల పౌరులు జ్ఞానమును అనాదరము చేసిరి. కనుక మంచిని గుర్తింపజాలరైరి. మరియు వారు తమ తెలివితక్కువతనమునే తమకు గుర్తుగా వదలిపోయిరి. వారి తప్పిదములను లోకము ఏనాడును మరచిపోదు.

9. కాని జ్ఞానము తన భక్తులను ఆపదలనుండి కాపాడును.

10. తన అన్న కోపమునకు వెరచి పారిపోవు పుణ్యశీలుని జ్ఞానము ఋజుమార్గమున నడిపించెను. అది అతనికి దైవరాజ్యమును చూపించెను. పరిశుద్ధవస్తువులను గూర్చి తెలియజేసెను. అతని కార్యములు విజయవంతములై సత్ఫలితము నొసగునట్లు చేసెను.

11. ఆశపోతులు అతని సొత్తు దోచుకొనబోగా జ్ఞానమతనికి అండగా నిలిచి అతనిని సంపన్నుని చేసెను.

12. అది అతనిని శత్రువుల నుండి కాపాడెను. విరోధులు పన్నిన ఉచ్చులనుండి అతనిని రక్షించెను. ఘోరమైన పోరాటమున అతనికి విజయము నొసగెను. దైవభక్తికిమించిన శక్తి లేదని అతడు గ్రహించునట్లు చేసెను.

13. వినయాత్ముడొకడు బానిసగా అమ్ముడుపోగా జ్ఞానమతనిని విడనాడదయ్యెను. పాపము నుండి అతనిని కాపాడెను.

14. అది అతనితోపాటు చెరలోనికి వెళ్ళెను. అతనికి సంకెళ్ళు పడినపుడు అతనిని పరిత్యజింపదయ్యెను. అతనికి రాజ్యాధికారము సంపాదించి పెట్టెను. అతనిని పీడించిన జనులపై అతనికి అధికారము దయచేసెను. ఆ పుణాత్మునిపై నేరము మోపినవారు దుష్టులని నిరూపించి, అతనికి శాశ్వత కీర్తిని సంపాదించి పెట్టెను.

15. జ్ఞానము పవిత్రులును, నిర్దోషులైన ప్రజలను పీడకులబారినుండి కాపాడెను,

16. అది ఒక దైవభక్తుని హృదయములోనికి ప్రవేశించి తన అద్భుతముల ద్వారా భయంకరులైన రాజులను ఎదిరించెను.

17. పునీతులైన ప్రజలకు వారి కష్టములకు తగిన ఫలితమొసగెను. వారిని అద్భుతమార్గమున నడిపించెను. పగటిపూట వారికి వెలుగునొసగెను. రేయి నక్షత్రకాంతి నొసగెను.

18. వారిని ఎఱ్ఱసముద్రముగుండ నడిపించెను. మహాజలరాశిగుండ ముందునకు కొనిపోయెను.

19. ఆ ప్రజల శత్రువులను మాత్రము మ్రింగివేసి, వారిని మరల సముద్రగర్భము నుండి బయటికి వెళ్ళగ్రక్కెను.

20. ఆ రీతిగా పుణ్యాత్ములు దుష్టులను దోచుకొనిరి. ప్రభూ! ఆ సజ్జనులు నీ దివ్యనామమును స్తుతించిరి. తమను కాపాడినందులకుగాను. నిన్ను ఏకకంఠముతో కొనియాడిరి.

21. జ్ఞానము మూగవారికి పలుకులొసగెను. చంటిబిడ్డలు కూడ మాటలాడునట్లు చేసెను.

1. జ్ఞానము పవిత్రప్రవక్తద్వారా యిస్రాయేలీయులకు విజయమును ఒసగెను.

2. వారలు నరులువసింపని మరుభూమిగుండ ప్రయాణము చేసిరి. జనసంచారము లేని తావులలో విడిదిచేసిరి.

3. తమ శత్రువుల నెదిరించి పోరాడిరి.

4. ప్రభూ! ఆ ప్రజలు దప్పిక గొనినపుడు నీకే మనవిచేసిరి. నీవు శిఖరాగ్రము నుండి వారికి నీరొసగితివి. కఠినశిల నుండి వెలువడిన నీటివలన వారికి దప్పికతీరెను.

5. యిస్రాయేలు శత్రువులకేది శిక్షకు కారణమయ్యెనో అదియే యిస్రాయేలీయులకు ఆపదలలో రక్షణ కారణమయ్యెను.

6-8. యిస్రాయేలీయుల పిల్లలను చంపమను శాసనమునకు ప్రతిగా నీవు వారికి సజీవ నీటి బుగ్గకు బదులుగా రక్తముతో కలుషితమైన నీరు ఇచ్చితివి. నీవు తలవనితలంపుగా పుష్కలమైన నీటిని ఇచ్చి, ఎడారిలో నీ ప్రజలకు కలిగిన దప్పిక తీర్చుట ద్వారా నీవు శత్రువులు దప్పికనొందజేసి ఎట్లు శిక్షించితివో వారు గ్రహించునట్లు చేసితివి.

9. నీవు నీ ప్రజలను పరీక్షలకు గురిచేసితివి. అవి నీ కరుణను ప్రదర్శించు దండనములు మాత్రమే. కాని నీవు కోపించినపుడు శత్రువులను క్రూరముగా శిక్షింతువని, ఆ పరీక్షల ద్వారానే యిస్రాయేలీయులు గ్రహించిరి.

10. నీవు నీ ప్రజలను తండ్రివలె పరీక్షించి హెచ్చరించితివి. కాని శత్రువులను కఠినుడైన రాజువలె పరిశీలించి శిక్షించితివి.

11-12. ఆ శత్రువులు తాము నీ ప్రజలకు దగ్గరగానున్నను, దూరముగానున్నను ఘోరశ్రమలను అనుభవించిరి, వారి యాతనలు రెట్టింపయ్యెను. వారు తమకు కలిగిన కష్టములను జ్ఞప్తికి తెచ్చుకొని అంగలార్చిరి.

13. తమ శిక్షవలన యిస్రాయేలీయులకు ఆనందము కలిగెనని గ్రహించి నీ వలన అదియెల్ల జరిగెనని అర్థము చేసికొనిరి.

14. పూర్వము వారెవరిని నిరాకరించి బయటికి గెంటివేసిరో, ఎవరిని ఎగతాళి చేసిరో, అట్టివారిని గాంచి ఇపుడు ఆశ్చర్యపడిరి. అవును, దుష్టుల దప్పిక పుణ్యపురుషుల దప్పిక వంటిదికాదు.

15. ఆ విరోధులు తమ దుష్టత్వము వలన మూర్చులై జ్ఞానములేని సర్పములను, హేయములైన మృగములను కొలిచిరి. కనుక నీవును జ్ఞానరహితములైన ప్రాణులద్వారానే వారిని శిక్షించి,

16. ఎట్టి పాపమునకు అట్టి శిక్ష ప్రాప్తించునని వారికి నేర్పితివి.

17. ప్రభూ! రూపరహితమైన పదార్థమునుండి ఈ జగత్తును సృజించిన మహాశక్తిమంతుడవు నీవు అట్టి నీవు తోడేళ్ళమందనో, లేక క్రూరసింహములనో ఆ శత్రువులమీదికి పంపి వారిని శిక్షించి యుండవచ్చును.

18. లేదా నీవు నూత్నమృగములను సృజింపగా అవి ఉగ్రరూపము తాల్చి ముక్కు పుటములనుండి అగ్నికణములేగజిమ్మి, భీకరముగా గర్జించి, పొగలు వెడలగ్రక్కి, నేత్రముల నుండి నిప్పురవ్వలు చిమ్మెడివి.

19. ఆ ఘోరమృగములు శత్రువుల మీదపడి వారిని చంపనక్కరలేదు. వాని ఘోరాకారమును గాంచిన వెంటనే వారు భయపడి చచ్చెడివారు.

20. అసలు ఈ మృగములతో గూడ అవసరము లేకుండగనే కేవలము నీ శ్వాస మాత్రమే వారిని మట్టుపెట్టి యుండెడిది. నీ న్యాయము, నీ శక్తి వారిని హతమార్చియుండెడిది కాని నీవట్లు చేయవు, నీవు చేయు కార్యములనెల్ల కొలిచి, లెక్కపెట్టి, తూచి చేయుదువు.

21. నీవు నీ మహాశక్తిని ఏ క్షణముననైన ప్రదర్శింపగలవు. నీ మహాబలమును ఎదిరించగలవాడెవడు?

22. నీ దృష్టిలో ఈ సర్వ ప్రపంచమును తక్కెడ సిబ్బినిగూడ వాల్చజాలని చిన్న ఇసుకరేణువు వంటిది. ఉదయము నేలమీద రాలిన మంచుబిందువు వంటిది.

23. అయినను నీవన్నిటిని చేయగలవు. కనుక అందరిని దయతో జూతువు. నీవు నరుల తప్పిదములను ఉపేక్షించి వారికి పశ్చాత్తాపపడుటకు అవకాశమునిత్తువు.

24. ఉనికిలో నున్న వానినెల్ల నీవు ప్రేమింతువు. నీవు కలిగించిన వానిని దేనిని నీవు అసహ్యించుకొనవు. అసహ్యించుకొనువాడవైనచో వానిని పుట్టించియే యుండవు.

25. నీవు సృజింపనిదే ఏ ప్రాణి ఉనికిలో ఉండగలదు? నీవు అంగీకరింపనిదే ఏ జీవి మనగలదు?

26. అన్ని ప్రాణులు నీవే కనుక నీవు ప్రతి ప్రాణిని కృపతో చూతువు. ప్రభూ! నీవు బ్రతికియున్న ప్రాణులన్నిటిని ప్రేమింతువు. 

 1. నాశనము లేని నీ ఆత్మము ప్రతి ప్రాణిలోను నెలకొనియున్నది.

2. కనుక నీకు ద్రోహము చేసినవారిని నీవు మెలమెల్లగా చక్కదిద్దుదువు. వారిని హెచ్చరించి వారు తమ తప్పిదములను తాము గ్రహించునట్లు చేయుదువు. కావున వారు పాపమును విడనాడి నిన్ను ఆశ్రయింతురు.

3-4. పూర్వము నీ పవిత్రదేశమున వసించిన వారు హేయమైన కార్యములు చేసిరి. కనుక నీవు వారినసహ్యించుకొంటివి. వారు మంత్రవిద్యకును, అపవిత్ర ఆరాధనమునకును పాల్పడిరి.

5. క్రూరబుద్ధితో తమ శిశువులను చంపిరి. ఉత్సవములలో నరమాంసమును, నరరుధిరమును ఆరగించిరి. రహస్యారాధనములు జరుపుటకు ఉపదేశముబడసి

6. ఆ ఆరాధనలములలో నిస్సహాయులైన తమ బిడ్డలనే బలియిచ్చిరి. నీవు మా పితరుల ద్వారా వారిని నాశనము చేయనెంచితివి.

7. అప్పుడు దేశములన్నిటిలోను పవిత్రమైన ఈ దేశము నీ ప్రజలకనువైన నివాసస్థలమగునని భావించితివి.

8. కాని ఆ ప్రజలును నరులే కనుక నీవు వారిపట్ల కరుణ జూపితివి. నీ సైన్యములకు ముందుగా కందిరీగలను పంపి ఆ శత్రుజాతిని నిదానముగా నాశనము చేసితివి.

9. నీ అనుమతిపై సజ్జనులు ఆ దుష్టులను యుద్ధమున వధించి యుందురు. లేదా, నీవు వన్యమృగములతోగాని, కఠినమైన నీ ఆజ్ఞతోగాని, వారిని తక్షణమే హతమార్చియుందువు.

10-11. కాని నీవు ఆ దుష్టులను నిదానముగా శిక్షించి, పశ్చాత్తాపపడుటకు వారికి సమయమునొసగితివి. వారు దుష్ట జాతిలో పుట్టిరి కనుక సహజముగనే దుర్మార్గులనియు, వారి దుర్బుద్దులెంత మాత్రమును మారవనియు వారి జాతి శాపగ్రస్తమైనదనియు తెలిసియుండియు నీవు వారిని కరుణించితివి. నీవు ఆ అపరాధులను శిక్షింపకుండ వదలి వేసినది ఇతరులకు భయపడికాదు.

12. ఆ దుర్మార్గులను నీవే సృజించితివి.  వారిని నాశనముచేసినను నిన్నెవడు ప్రశ్నించును? వారిని మట్టుపెట్టినను నీ మీద ఎవడు తప్పుమోపును? “నీవు ఆ కార్యమునెందుకు చేసితివి” అని నిన్నడుగు వాడెవడు? నీ నిర్ణయమును సవాలు చేయువాడెవడు?

13. అన్ని ప్రాణులను కాపాడునది నీవే. నీవుతప్ప మరొకదైవము లేడు. కనుక నీ తీర్పు న్యాయమైనదేయని నీ వెవరికిని నిరూపింపనక్కరలేదు.

14. నీవు ఆ దుర్మార్గులను అన్యాయముగా శిక్షించితివని ఏ రాజును, ఏ పాలకుడును నీ మీద నింద మోపజాలడు.

15. నీతిమంతుడవైన నీవు అందరిని నీతితోనే పరిపాలింతువు. శిక్షార్హుడు కాని వానిని శిక్షించుట నీ ప్రభావమునకు తగదని నీవు భావింతువు.

16. నీ నీతికి నీ బలమే కారణము. నీవందరికి అధిపతివి కనుక అందరిని దయతో కాపాడుదువు.

17. నీ శక్తిని సందేహించువారికి నీ బలమును చూపింతువు. నీ శక్తి తెలిసియు నిన్ను ధిక్కరించువారిని నీవు దండింతువు.

18. నీవు మహాబలవంతుడవు అయినను, కరుణగల న్యాయాధిపతివి. నీవు కోరుకొనిన వెంటనే దండింపగల శక్తికల వాడవు. అయినను నీవు మమ్ము ఓర్పుతో సహించి ఊరకుందువు.

19. సజ్జనులు ఇతరులకు దయజూపవలెనని ఈ నీ చెయిదముల ద్వారానే నీ ప్రజలకు బోధింతువు. పాపము చేసినవారికి పశ్చాత్తాపపడుటకు అవకాశము నొసగెదవను నమ్మకమును గూడ నీ ప్రజలకు కలిగింతువు.

20. నీ ప్రజల శత్రువులను శిక్షించునపుడు నీవు ఇంత దయను, సహనమును చూపితివి. వారు మరణమునకు పాత్రులైయున్నను, తమ దుష్టగుణమును వదలుకొనుటకు నీవు వారికి అవకాశమును వ్యవధిని నొసగితివి.

21. కాని నీవు నీ సొంత ప్రజలకు మాత్రము కఠినముగ తీర్పుతీర్చితివి. . నీవు పూర్వము వారి పితరులతో నిబంధనము చేసికొని, వారికి మేలు చేయుదునని బాసచేసిన వాడవైనను వారిపట్ల కఠినముగనే మెలగితివి.

22. నీవు మమ్ము శిక్షించినదానికంటే మా విరోధులను పదివేల రెట్లు అదనముగా శిక్షింతువు. కనుక మేము ఇతరులను దండించునపుడు నీ మంచితనమును గుర్తింపవలెను. నీవు మమ్ము దండించునపుడు  మేము నీ కరుణను నమ్మవలెను.

23. బుద్ధిని కోల్పోయి దుష్టకార్యములు చేయువారిని, ఆ దుష్టకార్యములతోనే నీవు కఠినముగా శిక్షించితివి.

24. ఆ జనులు సత్యమార్గము నుండి పూర్తిగా వైదొలగి నీచములు, హేయములైన మృగములను దైవములుగా కొలిచిరి.

25. కనుక నీవు వారి మూర్ఖతకు వారిని శిక్షింపగా వారు నిజముగనే మూర్ఖులని రుజువయ్యెను.

26. మూర్ఖులను పరిహాసముచేయు ఆ శిక్షనుండి గుణపాఠము నేర్చుకొనని వారికి దేవుని కఠోర దండన ప్రాప్తించును.

27. ఆ దుష్టులు ఏ ప్రాణులను దైవములుగా భావించి కొలిచిరో ఆ ప్రాణుల ద్వారానే తమకు శిక్ష ప్రాప్తింపగా, నిరుత్సాహపడి తాము పూర్వమేవనిని కొలువ నిరాకరించిరో  ఆయనే నిజమైన దేవుడని గ్రహించిరి. కనుకనే వారికి కటువైన అంతిమశిక్షకూడ ప్రాప్తించెను.

 1. దేవుని తెలిసికోవాలని వారు నిక్కముగా మందమతులు. ఆ వారు తమ చుట్టునున్న సృష్టి వస్తువులను గాంచియు సజీవుడైయున్న దేవుని గుర్తింపకున్నారు. ఆ శిల్పి చేసిన వస్తువులను చూచియు ఆయనను ఎరుగకున్నారు.

2. వారు అగ్ని, వాయువు, తుఫాను, నక్షత్రరాశి, ప్రవాహజలము, గగన జ్యోతులు ఈ లోకమును పరిపాలించు దేవతలని యెంచిరి.

3. వారు ఆ వస్తువుల సౌందర్యమునకు ముగ్దులై అవి దేవతలని తలపోసిరి. కాని ఆ వస్తువులను కలిగించిన ప్రభువు వానికంటె అధికుడనియు సౌందర్యకారకుడైన ప్రభువే వానిని సృజించెననియు వారు గ్రహించియుండవలసినది.

4. ఆ వస్తువుల శక్తిని, అవి పనిచేయు తీరును చూచి ఆ జనులాశ్చర్యపడినచో, వానిని చేసిన దేవుడు వానికంటెను శక్తిమంతుడని వారు గ్రహించి యుండవలసినది.

5. సృష్టి వస్తువుల మహత్త్వమును సౌందర్యమును చూచి సృష్టికర్త యెట్టివాడో గ్రహింపవచ్చును.

6. కాని ఆ ప్రజలు దేవుని మక్కువతో వెదకుటలోనే తప్పు త్రోవపట్టి యుండవచ్చును. గనుక వారినంతగా నిందింపనవసరములేదేమో.

7. వారు తమ చుట్టునుగల సృష్టి వస్తువుల మధ్య జీవించుచు, వానిని మాటిమాటికి పరిశీలించి చూచుచు, వాని అందమునకు భ్రమసి, వెలుపలి ఆకారము వలననే మోసపోయిరి.

8. అయినను ఆ ప్రజల అవివేకమును మన్నింపరాదు

9. వారు లోకస్వభావమును గూర్చి సిద్ధాంతములు చేయగలిగియు, లోకనాథునెన్నటికిని తెలిసికొనకుండుటకు కారణమేమి?

10. కాని నిర్జీవములైన ప్రతిమలను నమ్మువారు నిక్కముగా దౌర్భాగ్యులు. వారు నరులు చేసిన వస్తువులను దైవములని పిల్తురు. అవి వెండి బంగారములతో అందముగా మలచిన మృగముల రూపములు, లేదా పూర్వమెవడో చెక్కిన నికృష్ట శిలలు.

11. నిపుణుడైన వడ్రంగి అనువైన చెట్టును నరికి దాని బెరడునంతటిని ఒలిచివేసి దాని మొండెము నుండి రోజువారి పనులకు ఉపయోగపడు పనిముట్టు నొకదానిని నేర్పుతో తయారుచేయును.

12. మిగిలిన ముక్కలను వంటచెరకుగా వాడుకొని అన్నము వండుకొని ఆరగించును.

13. కాని ఆ మిగిలిన వానిలోనే పనికిమాలిన ముక్క యొకటి అతని కంట బడును. అది వంకరపోయి ముళ్ళతో నిండియుండును. అతడు దానిని తీసికొని తీరిక వేళలలో నేర్పుతో చెక్కును, నిదానముగా మనుష్యాకృతిగల బొమ్మగా మలచును.

14. లేదా నీచమైన మృగముగా తయారుచేయును. ఆ బొమ్మకు, ఎఱ్ఱరంగు పూసి, దాని నెఱ్ఱెలను కప్పివేయును.

15. తరువాత గోడలో ఒక గూడు తయారుచేసి ఆ గూటిలో ఇనుప చీలలతో దానిని గట్టిగా బిగగొట్టును.

16. అది జారిపడకుండునట్లు జాగ్రత్త పడును. అది వట్టి బొమ్మ కనుక తనంతటతాను నిలువజాలదనియు, ఇతరులు దానిని ఆదుకోవలెననియు అతనికి తెలియును.

17. అయినను ఈ నిర్జీవ ప్రతిమకు ప్రార్థనచేయుటకు అతనికి సిగ్గులేదు. తన పెండ్లి, పిల్లలు, సంపదలనుగూర్చి అతడు దానికి మనవిచేయును. ఆ బొమ్మ సామర్థ్యము లేనిది. అయినను ఆరోగ్యముకొరకు అతడు దానికి మనవిచేయును.

18. అది నిర్జీవమైనది, అయినను జీవముకొరకు అతడు దానికి మనవి చేయును. అది శక్తిలేనిది, అయినను సహాయముకొరకు అతడు దానికి మనవి చేయును. అది పాదమునైనను కదపజాలనిది, అయినను ప్రయాణ సాఫల్యము కొరకు అతడు దానికి మనవి చేయును.

19. ఆ బొమ్మ చేతులకు శక్తిలేదు, అయినను తనకు లాభము కలుగవలెనని, తాను డబ్బు చేసికోవలెనని, తన వృత్తి సఫలము కావలెనని అతడు దానికి మనవి చేయును.

 1. అలలు చెలరేగిన సముద్రములో ఓడ నడుపు నావికుడు తన ఓడమీది కొయ్య బొమ్మకు దండము పెట్టుకొనును.  పడవకున్న దారుడ్యము కూడ ఆ బొమ్మకు లేదు.

2. లాభకాంక్షతో నరుడు పడవను కనిపెట్టెను. చేతిపని వాడొకడు నేర్పుతో దానిని చేసి పెట్టెను.

3. కాని తండ్రీ! దూరదృష్టితో ఆ పడవను నడుపువాడవు నీవే. నీవు సముద్రతరంగములగుండ దానికి సురక్షితమార్గము కల్పింతువు.

4. ఆపాయముల నుండి రక్షింతువు. నీవున్నావు కనుకనే నేర్పు చాలనివారుకూడ సముద్రయానము చేయుచున్నారు.

5. నీవు విజ్ఞానముతో చేసిన వస్తువులు నరులకు ఉపయోగపడవలెననియే నీ కోరిక. కనుకనే నరులు చిన్న కొయ్యముక్కను నమ్ముచున్నారు చిన్న కొయ్య పడవపై మహాసముద్రములు దాటి సురక్షితముగా తీరము చేరుచున్నారు.

6. పూర్వము గర్వాత్ములైన రాక్షసజాతి నరులు నాశనమగునపుడు, లోకమెవరి మీద ఆశ పెట్టుకొని యుండెనో ఆ నరులు, ఒక చిన్న పడవనెక్కి తమ ప్రాణములు కాపాడుకొనిరి. నీవే ఆ పడవను రక్షించితివి. కనుక ఆ ప్రజలు లోకమునకు నూత్ననరజాతిని ప్రసాదింపగలిగిరి,

7. నీతిమంతులను రక్షించిన ఆ కొయ్య దీవెనలు పడయునుగాక!

8. కాని నరుడు చేసిన కొయ్య విగ్రహము, దానిని చేసిన నరుడుకూడ శాపగ్రస్తులగుదురుగాక! అతడు నశించునదైన వస్తువును చేసి, దానిని దేవుడని పిలుచుచున్నాడు.

9. దుష్టులను, వారు చేసిన దుష్టవస్తువులనుగూడ ప్రభువు ద్వేషించును.

10. పనివానిని, వాడు చేసిన పనిని గూడ దేవుడు శిక్షించును.

11. అన్యమతస్తుల విగ్రహములకు దేవుడు తీర్పు తీర్చును. అవి దేవుడు కలిగించిన సృష్టివస్తువులైనను, హేయములయ్యెను. ప్రజలు గోతిలో పడుటకును, మూర్ఖులు బంధములలో చిక్కుకొనుటకును కారణమయ్యెను.

12. విగ్రహములు పొడచూపుట వలన వ్యభిచారము పుట్టెను. అవి బయలు దేరినప్పటినుండి నరుని జీవితము భ్రష్టమయ్యెను.

13. విగ్రహములు ఆదినుండియు లేవు, కలకాలమును ఉండబోవు.

14. నరుని అహంకారము వలన అవి లోకము లోనికి వచ్చెను. కనుక అవి స్వల్పకాలముననే గతించును.

15. పూర్వము ఒక తండ్రి తన పుత్రుడు తలవనితలంపుగా చనిపోగా ఘోర వ్యాకులత నొంది ఆ కుమారుని బొమ్మను చేసెను. నిన్న చచ్చిన నరుని, నేడు దేవునిగా చేసి పూజించెను అతడు తన క్రింది వారికిని ఆ దేవుని పూజించువిధానమును, రహస్యారాధన పద్ధతులును నేర్పిపోయెను.

16. కాలక్రమమున ఆ దుష్టకార్యము బలపడి నియమముగా మారిపోయెను. రాజుల శాసనము ద్వారా బొమ్మలు ఆరాధ్యదైవములు అయ్యెను.

17. దూరముగా నున్న రాజును తమ ముందట గౌరవింపగోరిన ప్రజలు అతని ఆకారమును ఊహించుకొని ప్రతిమను తయారుచేయుదురు. దూరమున వున్నవానిని దగ్గరలోనున్నవానినివలె, ముఖస్తుతి చేయవలెనని వారి ఆశయము.

18. ఈ బొమ్మలను చేసిన దురాశాపరుడైన కళాకారుడు ఆ రాజు గూర్చి ఏమాత్రము తెలియని వారినిగూడ అతని ఆరాధనకు పురికొల్పును. 

19. అతడు రాజు మెప్పు బడయగోరి మిగులనేర్పుతో రాజుకంటె అతని ప్రతిమను సుందరముగా మలచును.

20. సామాన్యులు ఆ ప్రతిమ సౌందర్యమునకు మురిసిపోయి, పూర్వము తాము నరునిగా నెంచి గౌరవించినవానినే ఇపుడు ఆరాధించుటకు పూనుకొందురు.

21. ఈ రీతిగా ప్రజలు గోతిలో పడసాగిరి. వారు యాతనలను అనుభవించుటవలననో, లేక రాజాజ్ఞకు బద్దులగుట వలననో, ఏ వస్తువునకును చెల్లని దివ్యత్వమును ఒక కొయ్యకో, బండకో అంటగట్టి వానిని పూజింపమొదలిడిరి.

22. వారు భగవంతుని గూర్చి సరిగా తెలిసికొనకపోవుట మాత్రమే కాదు, అజ్ఞానమను పోరాటమున గూడ చిక్కిరి. ఆ పోరాటము శాంతికి నిలయమని భ్రమపడిరి.

23. వారు రహస్యారాధనలకు పాల్పడి, తమ బిడ్డలను బలి యిచ్చిరి. ఆ ఆరాధనలలో వెఱ్ఱి ఆవేశముతో ఘోరకార్యములు చేసిరి.

24. అపవిత్రముగా జీవించి, అపవిత్రముగా వివాహములు చేసికొనిరి. ద్రోహబుద్దితో పరస్పరము చంపుకొనిరి. లేదా పరస్త్రీలను చెరచిరి.

25. ఎక్కడ చూచినను రక్తపాతము, చౌర్యము, మోసము, లంచము, ద్రోహము, అలజడి, అబద్దము.

26. సజ్జనులను బాధించుట, కృతఘ్నత, నైతిక పతనము, అసహజమైన లైంగిక ప్రక్రియలు, భగ్నవివాహములు, వ్యభిచారములు.

27. విగ్రహముల పేరు కూడ ఎత్తకూడదు. అట్టివాని పూజ ఎల్ల అనర్థములకు కారణము, ప్రారంభము, పర్యవసానము కూడ.

28. విగ్రహారాధకులు వెఱ్ఱి ఆవేశముతో పొలికేకలు వేయుదురు, లేదా అబద్ద ప్రవచనములు పలుకుదురు, లేదా దుష్టజీవితము గడుపుదురు, లేదా మాట తప్పుదురు.

29. వారు కొలుచు విగ్రహములు నిర్జీవములు కనుక తాము అబద్ద ప్రమాణములు చేసినను ఎట్టి హాని కలుగదని భావింతురు.

30. కాని రెండు కారణముల వలన ఆ దుష్టులకు శిక్ష తప్పదు. మొదటిది: వారు విగ్రహములను కొలిచినందున, దేవుని గూర్చి తప్పుగా నెంచిరి. రెండవది: వారు పరిశుద్ధుడైన దేవుని లెక్కచేయక కల్లలాడి నరులను మోసగించిరి.

31. దుర్మార్గులు తప్పు చేసినపుడు వారు చేసిన ప్రమాణములలోని శక్తికాక, వారికి ప్రాప్తింపనున్న పాపశిక్షయే . వారిని వెంటబడి దండించును.

 1. మా దేవుడవైన ప్రభూ! నీవు దయగలవాడవు, విశ్వసనీయుడవు, సహన శీలుడవు, ఈ విశ్వమునంతటిని కరుణతో పరిపాలించువాడవు.

2. మేము పాపము చేసినను, నీ శక్తిని అంగీకరింతుము కనుక మేము నీవారలమే. కాని, మేము నీవారలమని గ్రహించి పాపము చేయకుందుము.

3. నిన్ను తెలిసికొనుటయే సంపూర్ణనీతి. నీ శక్తిని గుర్తించుటయే అమరత్వము.

4. నరులు మాయతో చేసిన దుష్టవస్తువుల వలనగాని, ఏ కళాకారుడో చిత్రించిన , నిరర్ధక చిత్రముల వలనగాని, పలురంగులు పూసిన విగ్రహముల వలనగాని మేము తప్పుదారి పట్టలేదు.

5. అట్టి వస్తువులను చూచి మూర్ఖులు ఆశపడుదురు. వారు చచ్చి నిర్జీవముగానున్న ప్రతిమలను సేవింతురు

6. అట్టి వస్తువులను తయారుచేయువారు, వానిని పూజించువారు దుష్టత్వమును అభిలషించుచున్నారు. వారు తమ నమ్మకమునకు తగిన ఫలితమునే బడయుదురు.

7. కుమ్మరి మెత్తనిమట్టిని మలచి మనకు ఉపయోగపడు పరికరములను జాగ్రత్తగా తయారుచేయును. అతడు ఒక్కటే రకపు మట్టితో ఒకటే రకపు పాత్రలు చేయును.  అయినను నరులు వానిలో కొన్నిటిని గౌరవప్రదమైన కార్యములకును, కొన్నింటిని నీచమైన కార్యములకును వినియోగింతురు. ఏ పాత్రమును ఏ కార్యములకు  వాడవలెనో కుమ్మరియే నిర్ణయించును.

8. ఆ కుమ్మరి కొలదికాలము క్రితమే మట్టినుండి చేయబడినవాడు. కొలదికాలమైన పిదప, తనకీయబడిన ఆత్మను తిరిగి దేవునికి అప్పగింపవలసిన సమయము వచ్చినపుడు అతడు ఆ మట్టిలోనే కలిసిపోవును. అట్టివాడు అట్టిమట్టినే తీసికొని వ్యర్థప్రయాసతో నిరర్ధకమైన దైవమును మలచును.

9. ఆ కుమ్మరి కొలది కాలము మాత్రమే జీవించి, త్వరలోనే చనిపోవువాడు. కాని అతడు ఆ విషయమును ఏమాత్రము వివేచింపడు. అతడు బంగారము, వెండి, ఇత్తడి పనివారలతో పోటీపడి వారివలె తానును బొమ్మలు చేయగోరును తాను చేసినవి నకిలీ వస్తువులైనను వానిని చూచి గర్వించును. అతని హృదయము బూడిదప్రోవువంటిది.

10. అతని ఆశ మురికికంటెను హేయమైనది. అతని జీవితము మట్టికంటెను నీచమైనది.

11. అతడు క్రియాశీలకమును, ప్రాణమయమునైన ఆత్మను తనలోనికి ఊది, తనను మలచిన దేవుని అర్థము చేసికోడయ్యెను

12. అతడు నరజీవితము ఒక ఆట అనుకొనెను. డబ్బు సంపాదించు అంగడి అనుకొనెను. దుష్టమార్గముననైన సరే నరుడు సొమ్ము చేసికోవలెనని యెంచెను.

13. ఒకే మట్టి నుండి విగ్రహములను, పగిలిపోవు పాత్రలను గూడ చేయువాడు, తాను చేయునది పాపకార్యమని తప్పక గ్రహించునుకదా!

14. కాని ప్రభూ! పూర్వము నీ ప్రజలను పీడించిన శత్రుజాతి, నరులలోకెల్ల మూర్ఖులు, శిశువులకంటేకూడ అజ్ఞానులు.

15. వారు తాము కొలుచు అన్యజాతుల విగ్రహములెల్ల దైవములని నమ్మిరి. అవి తమ కంటితో చూడజాలవు. ఆ నాసికతో గాలి పీల్చుకోజాలవు. చెవులతో వినజాలవు. వేళ్ళతో తాకి చూడజాలవు. కాళ్ళతో నడువజాలవు.

16. మానవమాత్రుడొకడు వానిని చేసెను. తనలోని శ్వాసను ఎరవు తెచ్చుకొనిన వాడొకడు వానిని మలచెను. ఏ నరుడును తనకు సరిసమానమైన వేల్పును చేయజాలడు.

17. మర్త్యుడు తన పాపపు చేతులతో చేయు బొమ్మలు కూడ చచ్చినవే. నరుడు పూజించు ప్రతిమల కంటెను నరుడే ఘనుడు. అతనికి జీవము కలదు. కాని అతడు కొలుచు బొమ్మలు ఏనాడును జీవింపవు.

18. నరులు హేయములైన మృగములనుకూడ, ఆ మృగములలోను జ్ఞానమే మాత్రములేని వానినికూడ పూజింతురు.

19. అవి కేవలము మృగములు కనుక వానినెవరును గణనచేయరు. పూర్వము ప్రభువు తాను చేసిన సృష్టిని మెచ్చుకొని దీవించినపుడు ఆ మృగములను పట్టించుకోడయ్యెను

 


1. కాబట్టి ఆ శత్రుజాతి క్షుద్రప్రాణుల వలన తగినవిధముగా పీడింపబడెను. ఆ ప్రాణులు గుంపులు గుంపులుగా వచ్చి వారిని బాధించెను.

2. శత్రువుల కట్టి శిక్ష ప్రాప్తింపగా ప్రభూ! నీవు నీ ప్రజల మీద కరుణ జూపితివి. వారు ఆకలితీర భుజించుటకు రుచికరమై, అరుదుగా దొరకు పూరేడు పిట్టలనొసగితివి.

3. ఆ విగ్రహారాధకులు నాడు ఆకలిగొనియున్నను, తమ పాలబడిన అసహ్యప్రాణులను గాంచి ఏవగింపుజెంది వానిని భుజింపనొల్లరైరి. నీ ప్రజలు కొద్దికాలము మాత్రమే ఆకలికి గురియై అటుపిమ్మట ప్రశస్తాహారమును భుజించిరి.

4. నీ భక్తులను పీడించినవారికి ఘోరమైన ఆకటి బాధ అవసరమే. , దానివలన నీ ప్రజలు తమ శత్రువులకెట్టి బాధ వాటిల్లెనో తెలిసికొనిరి.

5. భయంకరములైన ఘోరసర్పములు నీ ప్రజలకు హాని చేసి తమ విషపు కోరలతో వారిని నాశనము చేయుచుండగా, నీవు దీర్ఘ కోపముతో వారిని హతము చేయలేదు.

6. ఆ ప్రజలను హెచ్చరించుటకుగాను స్వల్పకాలముమాత్రమే వారిని విపత్తునకు గురిచేసి అటుపిమ్మట ఒక రక్షణచిహ్నమునొసగితివి. వారు ధర్మశాస్త్రమును పాటింపవలెనని తెలుపుటకే దానిని ఒసగితివి.

7. ఆ చిహ్నమువైపు చూచిన వాడెల్ల బ్రతికెను. కాని తాను చూచిన ప్రతిమవలన గాదు. నరులెల్లరిని రక్షించు నీ వలననే అతడు రక్షణము పొందెను.

8. ప్రజలను సకల ఆపదలనుండి కాపాడువాడవు నీవే అని ఈ క్రియ ద్వారా నీవు మా శత్రువులకు తెలియజేసితివి.

9. మిడుతలు, విషపు ఈగలు కరవగా మా శత్రువులు చచ్చిరి. ఆ చావునుండి వారిని కాపాడుట దుర్లభమయ్యెను. అట్టి క్షుద్రప్రాణులద్వారా చచ్చుట వారికి తగియేయున్నది.

10. కాని విషసర్పముల కోరలు గూడ నీ తనయులను నాశనము చేయలేదు. నీవే కరుణతో వారినాదరించి కాపాడితివి.

11. ఆ ప్రజలు సర్పములు కరవగా శీఘ్రమే విషము విరిగి బ్రతికిరి. వారు నీ ఆజ్ఞలను జ్ఞప్తికి తెచ్చుకొనుటకే నీవు ఆ ఉపద్రవమును తెచ్చిపెట్టితివి. లేదేని వారు నిన్ను విస్మరించి నీ కరుణను కోల్పోయెడివారే.

12. మూలికలుగాని, మందుకట్టులు గాని వారి జబ్బును నయము చేయలేదు. ప్రభూ! ఎల్లరి వ్యాధిని నయము చేయు నీ వాక్కే వారికి ఆరోగ్యము దయచేసెను.

13. జీవము మీదను, మరణముమీదను నీకు అధికారము కలదు. నీవు నరుని మృత్యుద్వారము చెంతకుని కొనిపోయెదవు. అచటినుండి మరల వెనుకకు గొనివత్తువు.

14. నరుడు దుష్టబుద్ధితో మరియొక నరుని వధింపవచ్చును, కాని అతడు చచ్చినవానిని బ్రతికింపలేడు. పాతాళమున చిక్కిన వానిని మరల బయటికి కొనిరాలేడు.

15. ఎవడును నిన్ను తప్పించుకోజాలడు.

16. నిన్నంగీకరింపని దుష్టులను నీవు మహాబలముతో శిక్షించితివి. ఘోరమైన వడగండ్లవాన వారిని వెన్నాడెను. పిడుగుల అగ్ని వారిని దహించివేసెను.

17. ఆశ్చర్యకరమైన సంగతి యేమనగా, అన్నిటిని చల్లార్చు నీటిలోనే అగ్ని ఉధృతముగా మండెను. పుణ్యపురుషులను రక్షించుటకు ప్రకృతి శక్తులు కూడ పోరాడును.

18. ఒక పర్యాయము ఆ నిప్పు చల్లారిపోయి దుష్టశిక్షణకై పంపబడిన మృగములను సంహరింపదయ్యెను. ఈ చర్య ద్వారా దైవశిక్ష తమను వెన్నాడుచున్నదని ఆ దుష్టులు గుర్తించిరి.

19. కాని మరియొక పర్యాయము చుట్టును జలములావరించియున్నను, ఆ అగ్ని మామూలు నిప్పుకంటెను ఉజ్జ్వలముగా మండి దుష్టుల పంట పొలములను కాల్చివేసెను.

20. కాని నీ ప్రజలకెట్టి విపత్తు వాటిల్లలేదు. నీవు వారికి దేవదూతల ఆహారమును ఒసగితివి. వారెడ్డి శ్రమ చేయకున్నను నీవు వారికి ఈ ఆకాశము నుండి సిద్ధాన్నము నొసగితివి. అది అన్ని రుచులు కలిగి అందరి అభిరుచులకు సరిపోయెను.

21. నీ ప్రజలనిన నీకిష్టమని ఆ భోజనము రుజువు చేసెను. ఆ ఆహారము ప్రతి నరుని రుచికనుగుణముగా మారిపోయి ప్రతివాని కోరికెను తీర్చెను.

22-23. ఆ భోజనము మామూలుగా మంచువలె కరగునదైనను ఇప్పుడు నిప్పునకుగూడ కరగదయ్యెను. జోరుగా వానకురిసి వడగండ్లు పడునపుడు కూడ శత్రువుల పంటపొలములను కాల్చివేసిన అగ్ని, ఇపుడు తన శక్తిని తాను మరచిపోయి నీ తనయులకు భోజన సదుపాయమును కలిగించెనని ఈ సంఘటనల వలన నీ ప్రజలు గ్రహింపగలిగిరి.

24. సృష్టి తనను కలిగించిన నీకు విధేయమైయుండి తన శక్తిని కూడగట్టుకొని దుర్మార్గులను శిక్షించుటకు పూనుకొనును. కాని నిన్ను నమ్మిన సజ్జనులయెడల శాంతము వహించి వారికి మేలుచేయును.

25. ఈ రీతిగా సృష్టి బహురీతులమారి అక్కరలోనున్నవారిని నీవు నెనరుతో ఆదుకొందువని రుజువు చేయుచున్నది.

26. ప్రభూ! ఈ సంఘటన వలన పొలములో పండిన పంటలు తమను పోషింపజాలవనియు, నిన్ను నమ్మినవారిని నీ వాక్కే పోషించుననియు నీ అనుంగు పిల్లలు గుర్తింతురు.

27. అగ్నిగూడ నాశనము చేయలేని ఆ ఆహారము, సూర్యుని ప్రథమ కిరణముల వేడిమి సోకినంతనే కరగిపోయెను.

28. మేము ప్రొద్దు పొడవక మునుపే మేల్కొని నీకు వందనములర్పింపవలెననియు వేకువనే నీకు ప్రార్ధన చేయవలెననియు దీనిని బట్టియే విశదమగుచున్నది.

29. కృతజ్ఞతలేని నరుని ఆశలు పొగమంచువలె కరగిపోవును. వాడక వదలి వేసిన నీటివలె ఇంకిపోవును.

 1. ప్రభూ! నీ నిర్ణయములు మహత్తరమైనవి, విశదీకరింపశక్యము కానివి, కనుకనే వానియందు శిక్షణ పొందనివారు పెడత్రోవబట్టిరి.

2. ఆ దుర్మార్గులు నీ పవిత్ర ప్రజలను బందీలను జేసితిమనుకొనిరి. కాని వారే సుదీర్ఘమైన రాత్రి కల్పించిన చీకటిలో బందీలైరి. వారు తమ ఇండ్లలోనే యుండినను నీ నిత్యరక్షణను కోల్పోయిరి.

3. వారు తమ పాపములు , రహస్యముగానున్నవని భావించిరి. మతిమరుపు అను తెర వానిని కప్పివేసినది అని అనుకొనిరి. కాని ఇప్పుడు వారు ఘోర భయమున చిక్కిరి. భీకర దృశ్యములను గాంచి భీతిజెందిరి.

4. వారు దాగుకొనిన చీకటి మూలలు వారిని భయమునుండి కాపాడవయ్యెను. వారికి నలువైపుల భీషణఘోషణములు విన్పించెను. విచారవదనములతో గూడిన భయంకరపిశాచములు దర్శనమిచ్చెను.

5. ఎట్టి అగ్నియు వారికి వెలుగును ప్రసాదింపజాలదయ్యెను. ఉజ్జ్వలముగా ప్రకాశించు నక్షత్రములుకూడ ఆ భయానక రాత్రిలో కాంతిని ప్రసరింపజాలవయ్యెను.

6. స్వయముగా మండు ఒక భీకరాగ్ని మాత్రము వారికి కన్పించెను. వారు భయభ్రాంతులై యుండిరి కనుక తాము చూచినట్లు భ్రాంతిపడిన మిథ్యావస్తువులకంటె గూడ వాస్తవిక జగత్తు ఇంకను ఘోరముగానుండునేమో అనుకొని వెరగొందిరి.

7. వారి మాంత్రికవిద్యలన్నియు వమ్మయ్యెను. వారికి గర్వకారణమైన విజ్ఞానమంతయు వ్యర్ధమయ్యెను.

8. రోగుల భయములు, జబ్బులు తొలగింపబూనిన వారే హాస్యాస్పదములైన భయములకు లొంగిపోయిరి.

9. ప్రమాదకరమైన సంఘటనలేమియు జరుగకున్నను వారు పాములు బుసకొట్టుచున్నవనియు, మృగములు తమ మీదికి దుముకుచున్నవనియు తలంచి భయమొందిరి.

10. ఆ రీతిగా వారు భయభ్రాంతులై నేలమీద కూలిరి. కన్నులు తెరచి చూచుటకు భయపడిరి. అయినను నేత్రములువిప్పి చూడకుండ ఉండజాలరైరి.

11. దుష్టత్వము పిరికిది, తన శిక్షను తానే కొనితెచ్చుకొనునది. అంతరాత్మ తనను నిందింపగా అది ఆయా సంఘటనలు యథార్థముగా చూపట్టిన దానికంటె ఘోరముగానున్నట్లు తలచును.

12. బుద్ధిశక్తి దయచేయు సాయమును వినియోగించుకొనకపోవుటయే భయకారణము.

13. బుద్ధిశక్తిమీద ఆధారపడు ధైర్యములేని నరుడు అజ్ఞానము తెచ్చిపెట్టు భయమునకు లొంగిపోవును.

14. ఆ జనులు ఆ రాత్రియెల్ల నిద్రపట్టక వెతజెందిరి. అసలారాత్రికి వారిని బాధించు శక్తి ఏమియు లేదు. శక్తి ఏమాత్రము లేని పాతాళమునుండియే ఆ రేయి పుట్టినది.

15. అపుడు భయంకరాకృతులు ఆ దుర్మార్గులను వెన్నాడెను. వారు తలవని తలంపుగా గలిగిన భయమునకు లొంగి బలముడిగి నిశ్చేష్టులై పోయిరి.

16. వారు నేలమీద కొరిగి, కేవలము తమ భయమే సృజించిన గోడలులేని చెరలో బందీలై యుండిపోయిరి.

17. రైతులు, కాపరులు, శ్రామికులు ఎల్లరును తప్పించుకోజాలని దుర్గతికి జిక్కిరి. ఒక్క అంధకార శృంఖలమే ఎల్లరిని బంధించెను.

18-19. రెపరెప గాలివీచినను, చెట్టు కొమ్మలలోనుండి పక్షులుకూసినను, నీరు జలజల ప్రవహించినను, కొండచరియ విరిగిపడినను, ఏవేవో జంతువులు తమకు కన్పింపకుండనే అటునిటు పరుగెత్తినను, వన్యమృగములు భయంకరముగా అరచినను, పర్వతమునుండి ప్రతి ధ్వనులు వినవచ్చినను వారు భయభ్రాంతులై నిశ్చేష్టులైరి.

20. అపుడు ప్రపంచమంత పగటి వెలుగుతో తళతళలాడుచుండెను. ప్రజలు తమ పనులు తాము నిరాటంకముగా చేసికొనుచుండిరి.

21. ఆ దుష్టులను మాత్రమే గాఢాంధకారము కమ్ముకొనెను. అది వారు ప్రవేశింపనున్న పాతాళ అంధకారమునకు చిహ్నముగానుండెను. కాని ఆ ప్రజలు తమకు తామే భారమైపోయిరి. అది ఆ అంధకారముకంటెను భారముగానుండెను

 1. కాని ప్రభూ! నీ పవిత్ర ప్రజలకు మాత్రము గొప్ప వెలుగు ప్రకాశించెను. శత్రుజనులు నీ ప్రజల స్వరములు వినిరిగాని వారి ఆకారములను చూడజాలరైరి నీ ప్రజలు బాధలకు చిక్కలేదు కనుక విరోధులు వారు ధన్యులని భావించిరి.

2. తాము పూర్వము చేసిన అపరాధములకు యిస్రాయేలీయులు ప్రతీకారము చేయలేదు. కనుక వారిని అభినందించిరి. తాము పూర్వము ప్రదర్శించిన విరోధమును మన్నింపుడని వేడుకొనిరి.

3. శత్రువులకు కలిగిన చీకటికి బదులుగా నీ ప్రజలకు అగ్నిస్తంభమును ఒసగితివి. అది వారికి తెలియని క్రొత్తత్రోవగుండ నడిపించెను. ఆ స్తంభము లేత ఎండ కాయు ప్రొద్దువలెనుండి ఆ సుప్రసిద్ధ ప్రయాణమున నీ ప్రజలకు, ఎట్టి హానియు చేయదయ్యెను.

4. కాని శత్రు ప్రజలు మాత్రము వెలుగును కోల్పోయి చీకటిలో బందీలగుట తగియేయున్నది ఎందుకన, నీవు ఏ ప్రజలద్వారా నశింపని ధర్మశాస్త్రజ్యోతిని ప్రపంచమునకు అనుగ్రహింపబూనితివో ఆ ప్రజలనే వారు బందీలను చేసిరి.

5. శత్రువులు నీ పవిత్ర ప్రజల శిశువులను చంపబూనికొనినపుడు ఏటిలో విడనాడబడిన బిడ్డ యొక్కడు చావును తప్పించుకొనెను. అపుడు నీవు శత్రువుల బిడ్డలను చాలమందిని చంపి వారిని శిక్షించితివి. వారి ప్రజలను పొంగిపొరలు సముద్రములో ముంచి నాశము చేసితివి.

6. కాని నీవు ఆ రాత్రి జరుపనున్న సంగతిని మా పితరులకు ముందుగనే తెలిపితివి కనుక వారు నీవు చేసిన ప్రమాణములను నమ్మి ధైర్యముగానుండిరి.

7. నీవు సజ్జనులను కాపాడుదువనియు, శత్రువులను సంహరింతువనియు నీ ప్రజలెరుగుదురు.

8. ఏకకార్యము ద్వారానే  నీవు మా శత్రువులను శిక్షించితివి, మమ్ము నీ చెంతకు పిలిపించుకొని మాకు కీర్తిని కలిగించితివి.

9. అప్పుడు ఈ పుణ్యప్రజలలోని భక్తులు , రహస్యముగా బలులర్పించిరి. వారు, మనము దేవుని ధర్మశాస్త్రమును పాటింతము. మన పాలబడు దీవెనలు, కష్టములనుగూడ అందరమును సరిసమానముగా పంచుకొందమని ఒకరికొకరు పవిత్రమైన ఒప్పందము చేసికొనిరి. అపుడే వారు తమ పూర్వులు స్తుతికీర్తనలను గూడ పాడిరి.

10. అదే సమయమున నీ శత్రువుల ఆర్తనాదము విన్పించెను. వారు హతులైన తమబిడ్డలకొరకు చేయు శోకాలాపములు మిన్నులు ముట్టెను.

11. యజమానులకును, బానిసలకును అదే శిక్ష ప్రాప్తించెను. రాజునకును, సామాన్యునకును అదే నష్టము వాటిల్లెను.

12. అందరి ఇండ్లలో చచ్చినవారు కన్పించిరి. మృతులసంఖ్య లెక్కలకు అందదయ్యెను. అదే మృత్యువు అందరిని మట్టుపెట్టెను. చచ్చినవారిని పాతిపెట్టుటకు బ్రతికినవారు చాలరైరి శత్రువుల బిడ్డలలో శ్రేష్ఠులైన వారు ఒక్క క్షణములోనే చచ్చిరి.

13. మాంత్రిక విద్యలను నమ్మి నీ హెచ్చరికలను లెక్కచేయని అన్యప్రజలు తమ జ్యేష్ఠసంతానము నశింపగా జూచి యిస్రాయేలీయులు దేవుని సంతానమని విశ్వసించిరి.

14. రాత్రిలో సగభాగము శీఘ్రముగా గడచిపోయెను. అంతా సద్దుమణిగి ప్రశాంతముగా నుండెను.

15. అపుడు సర్వశక్తిగల నీ వాక్కు ఆకాశములోని నీ సింహాసనము మీది నుండి క్రిందికి దుమికి వినాశనమునకు గురికానున్న దేశముమీద పడెను.

16. అది ఎదిరింపనలవి కాని యోధునివలె వచ్చెను. భయంకరమైన ఖడ్గమును చేతబట్టి దృఢమైన నీ ఆజ్ఞను అమలుపరచుచు, దేశమునంతటిని మృతమయము గావించుచు, కాళ్ళు నేలమీద మోపి, శిరస్సు ఆకాశమునంటునట్లుగా నిలుచుండెను.

17. అపుడు భయమునకు గురికానున్న వారికి పీడకలలు వచ్చెను. వారిని తలవని తలంపుగా భయము ఆవహించెను

18. వారు ఎల్లయెడల సగము చచ్చికూలిపడిరి. తామెందుకు చనిపోవుచున్నారో గూడ ఎల్లరికి విశదము చేసిరి.

19. వారు తమకు కలిగిన స్వప్నముల ద్వారా తమ చావులకు కారణము తెలిసికొనిరి. కనుక కారణము తెలియకుండచావరైరి.

20. ధర్మాత్ములైన ప్రజలకు మృత్యువు సిద్దించెను. ఎడారిలో పయనించినపుడు వారిలో చాలమంది చచ్చిరి. ప్రభూ! నీ కోపము దీర్ఘకాలము నిలువలేదు.

21. పుణ్యపురుషుడొకడు శీఘ్రమే వారి కోపు తీసికొనెను అతడు వారి పక్షమున యాజకత్వమును నెరపెను ప్రార్థనలర్పించుట, పాపపరిహారార్థము సాంబ్రాణి పొగవేయుట అను సాధనముల ద్వారా అతడు నీ కోపమునాపి, విపత్తును తొలగించెను.

22. స్వీయబలము వలనగాని, సైన్యబలము వలనగాని అతడు ఆ ఘోరమైన విపత్తును తొలగింపలేదు. ప్రార్థనము ద్వారా అతడు శిక్షకుని శాంతింపచేసెను. నీవు మా పితరులతో ప్రమాణముచేసి వారితో నిబంధన చేసికొంటివని విన్నవించి శిక్షను తప్పించెను.

23. మృతదేహములప్పటికే కుప్పలుగా పడియుండెను. కాని అతడు ముందునకు వచ్చి నీ కోపమును శాంతింపజేసి బ్రతికియున్న వారి ప్రాణములు కాపాడెను.

24. పొడవుగా నున్న అతని అంగీమీద ఈ విశ్వమంతయు చిత్రీకరింపబడియుండెను. మా పితరుల గౌరవార్థము వారి నామములు చెక్కిన మణుల వరుసలు నాలుగు అతని వక్షఃస్థలమున అమరియుండెను. అతని తలపాగా మీది ఫలకము నీ మహిమను ప్రదర్శించుచుండెను.

25. ఈ గురుతులను చూచి వినాశకుడు భయమునొంది, వెనుకకు తగెను. ఆ ప్రజలు నీ కోపమును కొలదిగా మాత్రమే చవిజూచిరి కాని అది చాలును.

 1.కాని ఆ దుష్టులు వినాశనము చెందు వరకు నీ కఠోర కోపమునకు గురియైరి. వారేమి చేయుదురో నీకు ముందుగనే తెలియును.

2. వారు నీ ప్రజలు వెళ్ళిపోవుటకు అనుమతించి పంపివేసిరి.  కాని వారు వెడలిపోయిన పిదప మనసు మార్చుకొని మరల వారి వెంటబడిరి.

3. ఆ దుష్టులు తమ మృతులను పాతి పెట్టుచు సమాధులచెంత విలపించుచునే వారిని వెన్నాడి పట్టుకోవలెనని బుద్ధిహీనమైన నిర్ణయము చేసికొని, పూర్వము తాము బ్రతిమాలి బలవంతంగా వెళ్ళిపోనిచ్చిన వారివెంట బడిరి.

4. ఆ దుష్టులకు ప్రాప్తింపనున్న శిక్షయే వారు పూర్వము జరిగిన కార్యములెల్ల విస్మరించి ఇట్టి చెయిదమునకు పాల్పడునట్లు చేసెను. కనుక వారు ఆ తరువాత రానున్న శిక్షలనుకూడ అనుభవించుటకు యోగ్యులైరి.

5. కావుననే నీ ప్రజలు అద్భుతవిధమున పయనము చేయగా ఆ దుర్మార్గులు మాత్రము అనూహ్యమైన చావు చచ్చిరి.

6. నీ ఆజ్ఞపై ప్రకృతి మార్పుచెంది నీ ప్రజలకు కీడు వాటిల్లకుండునట్లు చేసెను.

7. వారు తమ శిబిరముమీద మేఘము క్రమ్మియుండుట గాంచిరి. పూర్వము జలము ఆవరించియున్నచోట ఇప్పుడు పొడినేల కన్పించెను. అలలు పొంగిపొరలెడు తావున ఇపుడు గడ్డి మైదానము చూపట్టెను. కనుక వారు ఎఱ్ఱసముద్రమును సునాయాసముగా దాటగలిగిరి.

8. ఆ ప్రజలు నీ అద్భుతములను తిలకించుచు, నీ రక్షణబలముతో కడలిని దాటిరి.

9. వారు మేతకుబోవు గుఱ్ఱములవలె గంతులు వేయుచు బోయిరి. గొఱ్ఱెపిల్లలవలె దుముకుచు బోయిరి. తమను రక్షించు ప్రభుడవైన! నిన్ను కీర్తించుచుబోయిరి

10. పూర్వము తమ దాస్యకాలమున పరిస్థితులెట్టులుండెనో వారు మరచిపోలేదు. ఆ దేశమున భూమినుండి పశువులకు మారుగా దోమలు పుట్టెను. నదినుండి చేపలకు మారుగా కప్పలు విస్తారముగా పుట్టెను.

11-12. అటు తరువాత వారు ఆకలిగొని మంచి భోజనము కొరకు గాలింపగా సముద్రము నుండి పూరేడు పిట్టలు వచ్చి వారి ఆకలిని తీర్చెను. అంతకు ముందెన్నడును వారు ఆ పక్షులను చూచియుండలేదు.

13. ఆ దుర్మార్గులు శిక్షకు గురియైరి. ఆ శిక్ష ప్రాప్తింపక మునుపే భీకరమైన ఉరుములు వారిని హెచ్చరించెను. వారు తమ అపరాధమునకు తగిన దండనను అనుభవించిరి. వారు పరదేశులపట్ల మహాద్వేషము చూపిరి.

14. పూర్వము అన్యజాతివారు, అజ్ఞాత ప్రజలు తమ చెంతకు రాగా వారిని ఆహ్వానింపరైరి. కాని వీరు తమకు మేలుచేసిన అతిథులనే బానిసలను చేసిరి.

15. ఆ అన్యులు పరదేశులను మొదటినుండియు ద్వేషించిరి. ఈ విషయమున వారు కొంచెము మెరుగేనని చెప్పవలయును.

16. కాని ఈ ప్రజలు అటులగాదు, వీరు పూర్వము నీ ప్రజలను ఉత్సవవినోదములతో ఆహ్వానించిరి. వారికి తమతో సరి సమానమైన హక్కుల నొసగిరి. కాని అటుపిమ్మట వారిని వెట్టిచాకిరితో పీడించిరి.

17. పుణ్యపురుషుని ఇంటి తలుపుచెంతకు వచ్చిన అన్యులు గ్రుడ్డివారైరి. అంధకారము వారి చుట్టును క్రమ్మెను. వారిలో ప్రతివాడు తన తలుపును తాను వెదకజొచ్చెను అట్లే వీరికిని అంధత్వము ప్రాప్తించెను.

18. సితారా వాద్యములో ఏ తంత్రి స్వరస్థాయి దానిదే, కాని ఆ స్వరములన్నియు కలిసి వేరువేరు రాగములగును. అట్లే ఇపుడు ప్రకృతి శక్తులు కూడ ఒండొరులతో కలిసి భిన్నరీతుల మార్పుచెందెను. నాడు జరిగిన సంఘటనలు ఈ విషయమును రుజువు చేయును.

19. భూచరములు, జలచరములుకాగా జలచరములు భూచరములాయెను.

20. అగ్ని జలములలో మండెను. నీరు నిప్పును ఆర్పదయ్యెను.

21. అగ్ని జ్వాలలు తమలోనికి ప్రవేశించిన బలహీనపు ప్రాణుల శరీరములను కాల్చివేయవయ్యెను. మామూలు పరిస్థితులలో మంచువలె కరిగిపోవు అమృతాహారమును ఆ నిప్పు మంటలెంత మాత్రమును కరిగింప జాలవయ్యెను.

22. ప్రభూ! నీవు నీ ప్రజలను బహురీతుల అధికులను జేసి సంపన్నులను గావించితివి. నీవు వారిని ఏనాడును అనాదరము చేయక ఎల్లవేళల, ఎల్లతావుల ఆదుకొంటివి.