ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రూతు

 1. న్యాయాధిపతులు పరిపాలనచేయు కాలమున దేశమున పెద్ద కరువు వచ్చెను. కనుక యూదా రాజ్యమునందలి బేత్లెహేములో నివసించునొకడు తన భార్యను, తన ఇద్దరు కుమారులను తీసికొని మోవాబు దేశమునకు వలసపోయెను.

2. అతని పేరు ఎలీమెలెకు. అతని భార్య పేరు నవోమి. కొడుకుల పేర్లు మహోను, కిల్యోను. వారు ఎఫ్రాతా తెగవారు. వారు మోవాబు దేశమున వసించుచుండగా

3. ఎలీమెలెకు చనిపోయెను. ఇక నవోమికి మిగిలినది ఇద్దరు కుమారులు మాత్రమే.

4. ఆ ఇరువురు మోవాబు యువతులను పెండ్లాడిరి. వారి పేర్లు ఓర్పా, రూతు. వారు ఆ దేశమున పదియేండ్లపాటు జీవించిరి.

5. ఆ పిమ్మట ఆ ఇద్దరు కుమారులు కూడ మరణించిరి. ఆ విధముగ భర్త, పుత్రులు గతింపగా నవోమి ఒంటరిగా మిగిలిపోయెను.

6. ప్రభువు యిస్రాయేలు ప్రజలను కరుణించి వారి దేశమున పంటలు పండించెనని విని ఆమెయు, ఆమె కోడండ్రును మోవాబు నుండి వెళ్ళగోరిరి.

7. కనుక ఆమెయు, ఆమె కోడండ్రులు పయనమై వారితో పయనమై యూదా రాజ్యమునకు పోవు బాటను పట్టిరి.

8. త్రోవలో ఆమె ఇద్దరు కోడండ్రతో "అమ్మలార! మీరిక తిరిగి మీ పుట్టినిండ్లు చేరుకొనుడు. మీరు నాయెడల, ఆ గతించిన వారియెడల మిగుల దయచూపిరి. ప్రభువు కూడ మిమ్ము కరుణతో చూచును గాక!

9. యావే అనుగ్రహము వలన మీరు మరల పెండ్లియాడి మీ కుటుంబములను నిలబెట్టుకొందురు గాక!” అని పలికి వీడ్కోలు సూచనగా వారిని ముద్దు పెట్టుకొనెను.

10. కాని ఆ కోడండ్రు పెద్దగా ఏడ్చుచు “మేమును నీతో పాటు మీ జనము వద్దకు వత్తుము” అనిరి.

11. కాని నవోమి వారితో “అమ్మ లారా! మీరు నావెంటరానేల? మిమ్ము మరల పెండ్లి యాడుటకు నాకింకను కుమారులున్నారు గనుకనా?

12. మీరిక తిరిగిపొండు. మరల వివాహమాడుటకు నేనా ప్రాయముచెల్లినదానను. ఒక వేళ నేను ఇంకను ఆశ కలదులే అనుకొని పెండ్లి చేసికొని ఈ రేయినే పెనిమిటినికూడి గర్భముతాల్చి కుమారులను కనినను,

13. ఆ పుత్రులు పెరిగి పెద్దవారగు వరకును పెండ్లి యాడకుండ కనిపెట్టుకొని ఉందురా? నాకు కలుగబోవు సుతులను నమ్ముకొని మీరు మరల వివాహమాడకుందురా? అట్లు జరుగరాదు. బిడ్డలారా! మిమ్ము చూడగా నా కడుపుతరుగుకొని పోవుచున్నది. ప్రభువు నన్నిట్లు శిక్షించెను. నేనేమి చేయుదును?” అని పలికెను.

14. ఆ మాటలకు వారు మరల వెక్కివెక్కి ఏడ్చిరి. అంతట ఓర్పా వీడ్కోలు సూచనగా అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయెను. కాని రూతు మాత్రము నవోమిని వదలిపెట్టదయ్యెను.

15. నవోమి కోడలిని "అమ్మా! నీ తోడి కోడలు తన బంధువుల యొద్దకు వెళ్ళిపోయినది. ఆమె తన జాతిజనులదేవుని కొలుచును. మరి నీవుకూడ వెళ్ళి పోరాదా?” అని అడిగెను.

16-17. కాని రూతు అత్తతో, “నీవు నన్ను వెళ్ళిపొమ్మని నిర్బంధ పెట్టవలదు. నేనును నీ వెంటవత్తును. నీవు వెళ్ళుచోటునకే నేనును వత్తును. నీవు వసించుచోటనే నేనును వసింతును. నీ బంధువులు నా బంధువులగుదురు. నీ దేవుడు నా దేవుడగును. నీవు మరణించు చోటుననే నేనును మరణింతును. నిన్ను పాతిపెట్టు చోటుననే నన్నును పాతిపెట్టుదురు. మృత్యువు తప్ప మరియొకటి , మనలను వేరుపరచినచో ప్రభువు నాకు ఎంతటి కీడైనను చేయునుగాక!” అని పలికెను.

18. నవోమి కోడలు తనతోవచ్చుటకు నిశ్చయించుకొన్నదని గ్రహించి ఆమెను వారింపదయ్యెను.

19. ఆ మీదట వారిరువురును ప్రయాణము సాగించి బేత్లెహేము చేరుకొనిరి. నవోమి తిరిగి వచ్చినదని విని ఆ నగరవాసులందరు వారి సంగతులే చెప్పుకొనిరి. ఆ ఊరి స్త్రీలు నవోమిని చూచి “ఈమె నిజముగా నవోమియేనా?" అని విస్తుపోయిరి.

20-21. ఆమె “నన్ను నవోమి అనవలదు, మారా' అని పిలువుడు. సర్వశక్తిమంతుడైన ప్రభువు నన్ను దారుణముగా శిక్షించెను. నేనిచట నుండి పిల్లజల్లలతో వెడలిపోతిని. కాని ప్రభువు నన్ను ఏకాకిని చేసి యిటకు మరల్చుకొనివచ్చెను. యావే నన్ను దోషినిగా నిర్ణయించి ఆపదలపాలుచేయగా మీరిపుడు నన్ను నవోమి అని పిలువనేల?" అనెను.

22. నవోమి, ఆమెకోడలు మోవాబీయుల ఆడపడుచునగు రూతు, తిరిగివచ్చిన వైనమిది. వారు యవపంట కోతకు వచ్చు కాలమున బేత్లెహేము చేరుకొనిరి. 

 1. నవోమికి బోవసు అను బంధువు కలడు. అతడామె భర్తయగు ఎలీమెలెకు కుటుంబమునకు దగ్గరివాడు.

2. రూతు నవోమితో “నేను పొలమునకు పోయి పరిగలేరుకొని వత్తును. ఎవరైన నన్ను కరుణించి తమ చేనిలో కోతముగిసిన పిమ్మట జారిపోయిన కంకులు ఏరుకొననీయకపోరు” అనెను. నవోమి వెళ్ళుము అని రూతుకు సెలవిచ్చెను.

3. రూతు పొలమున వెళ్ళి కోతకాండ్ర వెనుక తిరుగాడుచు వారు వదలిపెట్టిన వెన్నులు ఏరుకొనెను. పొలములో ఆమె తిరుగాడిన భాగము ఎలీమెలెకు బంధువగు బోవసునకు చెందినది.

4. కొంత సేపటికి బోవసు బేత్లెహేము నుండి వచ్చెను. అతడు “ప్రభువు మీకు తోడై ఉండునుగాక!” అనుచు కోత కాండ్రను పలుకరించెను. వారు “యావే నిన్ను దీవించునుగాక!” అని బదులు పలికిరి.

5. బోవసు కోతకాండ్ర మీద పెత్తనము చేయునతనిని చూచి “ఆ పడుచు ఎవరిది?” అని అడిగెను.

6. అతడు యజమానునితో “ఆమె మోవాబు నుండి నవోమితో వచ్చిన మోవాబీయురాలు.

7. ఆమె మన కోతకాండ్ర వెంట నడచుచు పరిగలేరుకొందునని నన్ను బ్రతిమాలెను. పాపము ప్రొద్దుటి నుండి ఇప్పటివరకు శ్రమపడినది. ఇప్పుడే కొంచెము నీడపట్టున కూర్చున్నది” అని చెప్పెను.

8. బోవసు ఆమెతో "అమ్మా! నా మాటవినుము. నీవు ఇంకెక్కడికిని వెళ్ళనక్కరలేదు. మా పొలముననే పరిగలేరుకొనుము. మా పనికత్తెల దగ్గర ఉండిపొమ్ము.

9. వారు పంటకోసిన తావున వారి వెను వెంటవచ్చి కంకులేరుకొనుము. నిన్ను బాధింపవలదని మా పనివాండ్రకు ఆజ్ఞయిచ్చితిని. నీకు దప్పిక అయినపుడు వారు చేదుకొని వచ్చిన కుండలనుండి నీరు త్రాగుము” అని చెప్పెను.

10. రూతు శిరస్సు నేలమోపి దండము పెట్టి “అయ్యా! నీవు నా పట్ల ఎంత దయచూపితివి? పరదేశీయురాలనైన నన్ను ఇంతగా కరుణింపవలయునా?" అని అనెను.

11. బోవసు ఆమెతో “నీవు నీ మగడు చనిపోయిన పిదప మీ అత్తకు నీవు ఎంత ఉపకారముచేసితివో నేను వింటిని. నీ తల్లిదండ్రులను, నీ జన్మదేశమును విడనాడి ముక్కుమొగము తెలియని ఈ క్రొత్త ప్రజల చెంతకు వచ్చితివి.

12. నీ మంచితనమునకు గాను ప్రభువు నిన్ను ఆశీర్వదించునుగాక! నీవు యిస్రాయేలు దేవుని నమ్మి ఆయనను శరణుజొచ్చితివి. ఆ ప్రభువు నిన్ను దండిగా దీవించునుగాక!” అని అనెను.

13. రూతు "అయ్యా! నేను నీ దయకు నోచుకొంటిని. నీవు నాతో కలుపు గోలుతనముగా మాటలాడి నాకు ధైర్యము కలిగించితివి. నా మట్టుకు నేను నీ పనికత్తెలలో ఒక్కతెకు గూడ సాటిరాను” అని పలికెను.

14. భోజనసమయమున బోవసు రూతుతో “అమ్మా! నీవు మాతోపాటు అన్నము తినుము. నీ రొట్టెనుగూడ ఈ ద్రాక్షసారాయములో అద్దుకొమ్ము” అనెను. రూతు పనికత్తెలతో భోజనము చేయుటకు కూర్చుండెను. బోవసు ఆమెకుకూడ దోసెడు వేపుడు ధాన్యము పంచియిచ్చెను. రూతు ఆకలి తీరువరకు భుజింపగా ఇంకను కొంత ధాన్యము మిగిలిపోయెను.

15. వెన్నులేరుకొనుటకు ఆమె మరల వెళ్ళిపోయెను. బోవసు పనివాండ్రతో “మన కట్టలున్నచోటగూడ ఆమెను పరిగలేరుకొననిండు. మీరామెను బాధింపవలదు.

16. మరియు మీరు కట్టలనుండి కూడ కొన్ని వెన్నులను లాగి ప్రక్కన పడవేయుడు. ఆమె వానిని ఏరుకొనునపుడు ఆమెను మందలింపవలదు” అని చెప్పెను.

17. ఆ రీతిగా రూతు సాయంత్రము వరకు పరిగలు ఏరుకొని వెన్నులు నలిపిచూడగా కుంచెడు ధాన్యమయ్యెను.

18. ఆమె నగరమునకు వెడలిపోయి తాను సేకరించుకొని తెచ్చిన ధాన్యమును అత్తకు చూపెను. తాను తినగా మిగిలిన వేపుడు ధాన్యమునుగూడ అత్తకిచ్చెను.

19. నవోమి కోడలితో “ఈ దినమెక్కడ పరిగలేరితివి? ఎవరి పొలమున తిరుగాడితివి? నిన్ను లక్ష్యపెట్టిన పుణ్యాత్ముని ప్రభువు దీవించును గాక!” అని అనెను. రూతు తాను ఆనాడు బోవసు అనువాని పొలమున పరిగలేరుకొని వచ్చితినని చెప్పెను.

20. ఆ మాటలకు అత్త “సజీవులను, మృతులను కూడ కరుణించు ప్రభువు బోవసును దీవించునుగాక! అతడు మనకు దగ్గరి చుట్టము. మన సంగతి' చూడవలసినది కూడ అతడే!" అని నుడివెను,

21. మోవాబీయురాలైన రూతు అత్తతో “అతడు కోత ముగియువరకు నేను తన పనికత్తెలతో కలిసి తన పొలముననే వెన్నులేరు కోవచ్చునని చెప్పెను” అని పలికెను.

22. నవోమి కోడలితో “అవును, నీవు బోవసు పనికత్తెలతో చేరుటయే మేలు. ఇతరుల పొలమునకు పోయెదవేని అచట ఎవరైనను నిన్ను పీడింపవచ్చును” అని పలికెను.

23. ఆ రీతిగా రూతు యవపంట, గోధుమ పంట ముగియువరకు బోవసు పనికత్తెలతో కూడి వెన్నులేరుకొనెను. అత్త ఇంటనే వసించెను. 

 1. అంతట నవోమి కోడలితో "తల్లీ! నిన్నొక యింటిదానిని చేయవలసినదానను నేనేకదా.

2. నీవు బోవసు పనికత్తెలతోకూడి వెన్నులేరుకొనుచున్నావు గదా! అతడు మన బంధువు. నేటిరేయి అతడు కళ్ళమున ధాన్యము తొక్కించును.

3. కనుక నీవు స్నానము చేసి అత్తరు పూసుకొని మంచి దుస్తులుతాల్చి కళ్ళము నొద్దకు వెళ్ళుము. కాని బోవసు అన్నపానీయములు సేవించువరకు నీవు అతని కంటబడరాదు.

4. అతడెక్కడ పండుకొనునో గుర్తుంచుకొనుము. అతనికి నిద్రపట్టిన తరువాత నీవతని పాదములమీద వస్త్రమును తొలగించి అతని ప్రక్కన పరుండుము. తరువాత నీవేమిచేయవలసినది అతడే చెప్పును” అనెను.

5. రూతు అత్తతో “నీవు చెప్పినట్లే చేసెదను” అనెను.

6. ఆమె కళ్ళముకడకు వెళ్ళి అత్త చెప్పినట్లే చేసెను.

7. బోవసు అన్నపానీయములు సేవించి తృప్తి చెంది వెళ్ళి ధాన్యరాశిచెంత పరుండెను. రూతు మెల్లగా వచ్చి అతని పాదములమీది వలువను తొల గించి అచట అతని చేరువనే పరుండెను.

8. బోవసు నడిరేయి ఉలిక్కిపడి నిద్రమేల్కొని ప్రక్కకు మరలి చూడగా పాదములచెంత ఒక స్త్రీ పరుండియుండెను.

9. అతడు నీవెవ్వరవని ప్రశ్నించెను. ఆమె "అయ్యా! నేను నీ దాసురాలనైన రూతును. నీవు మాకు దగ్గరి చుట్టము. మా సంగతి విచారింపవలసినవాడవు నివే. కనుక నన్ను దేవరన్యాయమున పెండ్లియాడుము. ఈ నీ దాసురాలిపై నీ వస్త్రము కప్పుము" అని వేడుకొనెను.

10. బోవసు “అమ్మా! నీవు యావే దీవెననొందినదానవు. నీవు ధనవంతునిగాని, దరిద్రుని గాని, మరియొక యువకుని కోరుకొనక నా యొద్దకే వచ్చితివి. నీవు మునుపు మెలగిన తీరుకంటెను ఇప్పుడు మెలగిన తీరు నీకు అధిక గౌరవమును చేకూర్చును.

11. ఇక నీవు విచారింపవలదు. నీవు అడిగినందంతయు నీకు చేసెదను. బేత్లెహేములోని వారందరు నీవు యోగ్యురాలవని ఒప్పుకొందురు.

12. నేను నీకు దగ్గరి చుట్టమునే. కాని నాకంటె దగ్గరిచుట్టము మరియొకడు ఉన్నాడు.

13. నీవు ఈరాత్రికి ఇచటనే యుండుము. రేపు ప్రొద్దున ఈ సంగతి విచారింతము. అతడు దేవరన్యాయమున నిన్నుచేపట్టినా మేలు. లేదా ఆ బాధ్యతను నేనే వహింతును. యావే తోడు నీవు వేకువజాము వరకు ఇచటనే పరుండుము” అని చెప్పెను.

14. కనుక రూతు తెల్లవారువరకు అతని పాదముల చెంతనే నిదురించెను. ఇంకను కొంచెము చీకటి ఉండగనే బోవసు మేల్కొనెను. రూతు అచటికి వచ్చిన సంగతి ఇతరులకు తెలియగూడదని అతని తలంపు.

15. బోవసు రూతుతో “అమ్మా! నీ పై ఉత్తరీయము ఇటుచాపుము” అనెను. ఆ బట్టలో ఆరు కుంచెముల ధాన్యముపోసి మూటగట్టి ఆమెకిచ్చెను. రూతు ఆ ధాన్యముతో నగరమునకు వెళ్ళిపోయెను.

16. ఆమె ఇల్లు చేరుకొనగానే నవోమి “బిడ్డా! ఏమి జరిగినది?” అని అడిగెను. రూతు జరిగిన సంగతి అంతయు అత్తకు విన్నవించెను.

17. “అతడు ఈ ఆరుకుంచముల ధాన్యముకూడ ఇచ్చెను. నీవు వట్టిచేతులతో మీ అత్తవద్దకు వెళ్ళకూడదని నాతో నుడివెను” అని పలికెను.

18. నవోమి కోడలితో “తల్లీ! కొంచెము ఓపికపట్టుము. ఈ కథ ఎట్లు నడచునో చూతము. బోవసు ఈ వ్యవహారమును నేడే పరిష్కరించి తీరును” అనెను. 

 1. బోవసు వెళ్ళి నగరద్వారము చెంత రచ్చబండ వద్ద కూర్చుండెను. అంతలో మునుపు బోవసు పేర్కొనిన ఎలీమెలెకు దగ్గరిబంధువు ఆ త్రోవన పోవు చుండెను. బోవసు అతనిని పిలిచి, ఇటువచ్చి కూర్చుండుమని చెప్పెను. అతడు వచ్చి రచ్చపట్టున కూర్చుండెను.

2. బోవసు నగరమునుండి పదిమంది పెద్దలను పిలిచి వారిని తన దాపున కూర్చుండబెట్టు కొనెను.

3. బోవసు ఆ దగ్గరిచుట్టముతో “నవోమి మోవాబునుండి తిరిగివచ్చినదికదా! ఆమె మన బంధువైన ఎలీమెలెకునకు చెందిన పొలమును అమ్మ గోరుచున్నది.

4. ఈ సంగతి నీకు ఎరిగింపవలయును అనుకొంటిని. నీకు వలయునేని ఈ పెద్దల సమక్షమున ఆ భూమిని సంపాదించుకొనుము. ఆ పొలమును విడిపింపవలసిన బాధ్యత మొదటనీది. అటు తరువాత నాది. నీకు అక్కరలేదేని ఆ మాట కూడ చెప్పుము” అనెను. అతడు "నేను విడిపించెదను” అని పలికెను.

5. బోవసు మరల “నీవు నవోమి చేతినుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయినవారి పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరుచునట్లు, చనిపోయినవాని భార్యయైన రూతు అను మోవాబీయురాలు యొద్దనుండి దానిని సంపాదించుకొనవలెను” అని అనెను.

6. ఆ మాటలకు ఆ దగ్గరి బంధువు “అటులయినచో నేను ఆ పొలమును విడిపింపలేను. క్రొత్తసంతానము వలన నా పిల్లలకు దక్కవలసిన ఆస్తి తగ్గిపోవును. కనుక నీవే ఆ భూమిని తీసికోవచ్చును” అని పలికెను.

7. వెనుకటి రోజులలో యిస్రాయేలీయులలో ఒక ఆచారము ఉండెడిది. పొలమును అమ్మునపుడుగాని, మారకము వేయునవుడుగాని బేరము ముగిసినదనుటకు గుర్తుగా వారిలో ఒకడు తన చెప్పు తీని అవతలివానికి ఇచ్చెడి వాడు.

8. కనుక దగ్గరిచుట్టము బోవసుతో నీవే ఆ భూమిని తీసికొమ్మని పలికి కాలి చెప్పు విడిచెను.

9. బోవసు అచట సమావేశమైన పెద్దలతోను మరి యితరులతోను “వినుడు, నేడు నేను ఎలీమెలెకు, కిల్యోను, మహ్లోనులకు చెందిన ఆస్తినంతటిని నవోమి నుండి కొంటిననుటకు మీరే సాక్షులు.

10. మహ్లోను భార్యయు మోవాబీయురాలైన రూతును నేను పెండ్లి యాడుదును. ఆమెకు కలిగిన సంతానము ఎలీమెలెకు పొలమునకు వారసులగుదురు. ఈ రీతిగా గతించిన ఎలీమెలెకు కుటుంబము మన జనమందును, మన నగరమందును వర్ధిల్లును. మీరందరు దీనికి సాక్షులు” అనెను.

11. అచట ప్రోగైన పెద్దలు మరియు ఇతరులు “మేమందరము ఈ ఉదంతమునకు సాక్షులము. నీ ఇంట అడుగుపెట్టనున్న ఈ యిల్లాలు కూడ, పూర్వము యాకోబునకు పెక్కుమంది బిడ్డలను కనిన రాహేలు, లేయాలవలె ప్రభువు కృపవలన సంతానవతి అగును గాక! నీవు ఎఫ్రాతా తెగనందు సంపన్నుడవగుదువు గాక! బేత్లెహేమున సుప్రసిద్ధుడవగుదువుగాక!

12. ప్రభువు నీకును ఈ యువతికిని ప్రసాదించు సంతానము వలన పూర్వము యూదా తామారులు కనిన పెరెసు కుటుంబమువలె నీ కుటుంబమును కీర్తి కెక్కును గాక!” అని దీవించిరి.

13. అంతట బోవసు రూతును పెండ్లియాడెను. అతడు రూతును కూడగా ఆమె గర్భముతాల్చి బిడ్డను కనెను.

14. ఆ ఊరి స్త్రీలు నవోమితో “ప్రభువు స్తుతింపబడునుగాక! అతడు నీకొక మగకందును ప్రసాదించెను. ఈ బిడ్డడు యిస్రాయేలున సుప్రసిద్ధుడు అగును గాక!

15. నీ కోడలికి నీవన్న ప్రాణముకదా! ఆమె నీకు ఏడుగురు కుమారులకంటెను మిన్న. నేడు ఆమెకనిన ఈ శిశువువలన నీకు ఆనందము కలుగును. నీ ముసలితనమున ఇతడు నిన్ను ఆదుకొనును” అని పలికిరి.

16. నవోమి ఆ బిడ్డను రొమ్మునకు అదుముకొనెను. తానే ఆ శిశువునకు దాది అయ్యెను.

17. ఇరుగుపొరుగు స్త్రీలు ఆ శిశువునకు ఒబెదు అని పేరు పెట్టిరి. నవోమికి బిడ్డకలిగెనని ఊరంతయు చెప్పుకొనిరి. ఇతడే దావీదు తండ్రియైన యిషాయికి జనకుడు.

18-22. పెరెసునుండి దావీదువరకు గల వంశ వృక్షమిది: పెరెసు, హెస్రోను, రాము, అమ్మినాదాబు, నహస్సోను, సల్మోను, బోవసు, ఒబెదు, యిషాయి, దావీదు.