ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కొలొస్సియులకు వ్రాసిన లేఖ

 1. దేవుని సంకల్పమువలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడయిన పౌలు, మరియు మన సోదరుడైన తిమోతి,

2. క్రీస్తునందు విశ్వాసముగల కొలొస్సీలోని మన సోదరులైన పవిత్రులకు వ్రాయునది: మన తండ్రి అయిన దేవునినుండి మీకు కృప, శాంతి కలుగునుగాక!

3. మేము మీ కొరకు ప్రార్థించునపుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవునకు ఎల్లప్పు డును కృతజ్ఞతలు తెలుపుకొనుచుందుము.

4. ఏలయన, యేసుక్రీస్తుపట్ల మీకుగల విశ్వాసమును పవిత్రులయెడల మీకుగల ప్రేమనుగూర్చి మేము వినియున్నాము.

5. మీయొద్దకు వచ్చిన సత్య సందేశమైన సువార్తా బోధవలన మీరు ఆ నిరీక్షణను గూర్చి వినియున్నారు. అది మీ కొరకు పరలోకములో భద్రపరుచబడియున్నది.

6. మీరు దైవానుగ్రహమును గూర్చి మొట్టమొదట విని, అది వాస్తవముగా ఏమియో తెలిసికొనిన నాటినుండి, మీ విషయములో జరిగి నట్లే, సువార్త ఫలములను ఇచ్చుచు విశ్వమంతటను వ్యాప్తి చెందుచున్నది.

7. మన ప్రియతమ సహసేవకుడగు ఎపఫ్రానుండి దీనిని మీరు తెలిసికొంటిరి. అతడు క్రీస్తునకు విశ్వసనీయుడైన మనతోడి సేవకుడు.

8. అతడు ఆత్మయందలి మీ ప్రేమను గూర్చి మాకు చెప్పియున్నాడు.

9. ఈ కారణముచేత మేము మిమ్ములను గూర్చి విన్నప్పటినుండి మీ కొరకు ఎల్లప్పుడును ప్రార్థించు చున్నాము. మిమ్ములను దేవుని సంకల్పజ్ఞానముతోను, ఆయన ఆత్మ ఒసగు సమస్త వివేకముతోను, అవగాహనతోను, మూర్తీభవింప చేయవలసినదిగా మేము ఆయనను కోరుచున్నాము.

10. అపుడు మీరు ప్రభువు కోరిన విధముగా జీవింపగలరు. ఎల్లప్పుడును ఆయనకు సంతోషమును కలిగించెడి పనిని చేయుదురు. అన్ని విధములైన మంచికార్యములలోను మీ జీవితములు ఫలప్రదమగును. మీలో దేవుని గూర్చిన జ్ఞానము పెంపొందును.

11. ఆయన మహిమాన్విత శక్తివలన లభించెడి బలముతో మీరు బలవంతులు అయ్యె దరుగాక! అన్నిటిని సంతోషముతో కూడిన ఓర్పుతో సహించెదరుగాక!

12. తన పవిత్రుల వారసత్వములో వెలుగునందు భాగస్టులగుటకు మిమ్ములను యోగ్యుల నుగా చేసిన తండ్రికి, మీరు కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నారు.

13. ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియపుత్రుని సామ్రాజ్యము లోనికి సురక్షితముగ తోడ్కొని వచ్చెను.

14. ఆకుమా రుని మూలముగా మనకు స్వేచ్ఛ లభించినది. మన పాపములు క్షమింపబడినవి.

15. క్రీస్తు అదృశ్యుడైయున్న దేవుని యొక్క ప్రత్యక్ష రూపము. ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు.

16. ఏలన, దేవుడు ఆయనద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించెడి, కంటికి కనిపించని, అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువులను, పాలకులను, సింహాసనములను, అధికారులను కూడ సృజించెను. దేవుడు సమస్తవిశ్వమును ఆయనద్వారా ఆయన కొరకు సృష్టించెను.

17. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనయే సమస్తమునకు ఆధారభూతుడు.

18. ఆయన తన శరీరమైన శ్రీసభకు శిరస్సు. సమస్తమునను ఆయనయే ప్రథముడగుటకు ఆయన ఆదియైఉండి మృతుల నుండి లేచిన వారిలో ప్రథమ పుత్రుడు.

19. దేవుని సొంత నిర్ణయమును అనుసరించియే ఈ కుమారునిలో దేవుని సంపూర్ణ స్వభావము మూర్తీభవించినది.

20. ఈ కుమారునిద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధాన పరచుకొనుటకు దేవుడు నిశ్చయించెను. పరలోక, భూలోకములయందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని సిలువ బలిద్వారా తనతో సమాధాన పరచుకొనెను.

21. ఒకప్పుడు మీరు దేవునికి చాల దూరముగా ఉంటిరి. మీ దుష్టకార్యములద్వారా, దురాలోచనల ద్వారా ఆయనకు విరోధులైతిరి.

22. కాని ఇప్పుడు తన కుమారుని భౌతికమరణముద్వారా దేవుడు మిమ్ములను తన సమక్షములో పవిత్రులుగను, నిర్దోషులుగను, నిరపరాధులుగను చేయుటకు సమాధానపరచుకొనెను.

23. అయితే మీరు దృఢముగ, నిశ్చలముగ, విశ్వాసముతో కొనసాగుతూ ఉండవలెను. మీరు ఈ సువార్త వినినపుడు మీకు కలిగిన నమ్మకమును మీరు సడలించుకొనరాదు. ఈ సువార్త ఆకాశము క్రిందనున్న ప్రతి ప్రాణికి బోధింపబడినది. ఈ సువార్త నిమిత్తమై పౌలునైన నేను సేవకుడనైతిని.

24. మీ కొరకు నేను పొందిన శ్రమలకు ఇప్పుడు నాకు ఆనందముగా ఉన్నది. క్రీస్తు తన శరీరమైన శ్రీసభ కొరకు పడిన బాధలలో కొదువగా ఉన్నవానిని నా శ్రమలద్వారా పూర్తి చేయుచున్నాను.

25. నేను దేవునిచే శ్రీసభకు సేవకుడనుగా చేయబడితిని. మీకు మేలుచేయుట కొరకు ఆయన నాకు ఈ కార్యమును అప్పగించెను. ఆయన సందేశమును పూర్తిగా ప్రక టించుటకు సంబంధించిన కార్యమిది.

26. ఈ సందేశమును, ఆయన గతమున అన్ని యుగములలోను మానవాళికినుండి రహస్యముగా ఉంచెను. అయితే ఇపుడు దానిని తన పవిత్రులకు తెలియజేసాడు.

27. ఏలయన అన్యజనులలో తన వద్దగల రహస్యము యొక్క మహిమైశ్వర్యము ఇట్టిదని తన ప్రజలందరకు తెలియజేయుట దేవుని ప్రణాళిక. ఆ రహస్యము ఏమనగా క్రీస్తు మీలో ఉన్నాడు. అనగా మీరు దేవుని మహిమలో పాలుపంచుకొనగలరు.

28. ఇట్లు మేము ప్రజలందరికి క్రీస్తును గురించి బోధించెదము. ప్రతి వ్యక్తిని క్రీస్తునందు పరిణతినొందిన వానినిగా దేవుని సమక్షములోనికి తెచ్చుటకొరకు మేము సాధ్యమైన వివేచనతో ప్రతివ్యక్తిని హెచ్చరించి బోధించెదము.

29. దీనిని నెరవేర్చుటకు క్రీస్తు నాకు ప్రసాదించిన మహత్తరమైన శక్తిని నేను వినియోగించుకొనుచు పాటు పడుచున్నాను.

 1. మీ కొరకును, లవోదికయలోని ప్రజల కొరకును, నాకు వ్యక్తిగతముగ తెలియని వారందరి కొరకును, నేను ఎంత తీవ్రముగ పాటుపడినది మీకు చెప్పనిండు.

2. వారి హృదయములు ధైర్యముతో నిండగలవనియు, వారు ప్రేమతో సన్నిహితులు కాగల రనియు, సరియైన అవగాహనవలన లభించు సకల సంపదలను పొందగలరనియు నేను అటుల చేయు చున్నాను. అలాగున వారు దేవుని రహస్యమును గ్రహింపగలరు. ఆ రహస్యమే క్రీస్తు.

3. ఆయన యందు దేవుని వివేక విజ్ఞానముల సంపదలన్నియు గుప్తమైయున్నవి.

4. తప్పుడు వాదములతో ఎవ్వరును మిమ్ము మోసము చేయకుండునట్లును చూచుకొనవలెనని చెప్పుచున్నాను.

5. శరీరరీత్యా దూరము గానున్నను, నేను ఆత్మరీత్యా మీతో ఉన్నాను. క్రీస్తు నందు విశ్వాసముకలిగి మీరు కలిసికట్టుగా దృఢసంకల్పముతో కృతనిశ్చయులైయుండుట చూచి నేను ఆనందించుచున్నాను.

6. మీరు యేసుక్రీస్తును ప్రభువుగా స్వీకరించితిరి కనుక ఆయన సాహచర్యములో ఉండుడు.

7. ఆయ నను ఆధారముగా చేసికొని, మీ జీవితమును నిర్మించు కొనుడు. మీకు బోధించిన విధముగా విశ్వాసమును నానాటికి పెంపొందించుకొనుడు. అమితముగ కృత జ్ఞులై ఉండుడు.

8. ఎవడును తమ మోసకరమగు నిరర్థక వాదములతో మిమ్ము వశపరచుకొనకుండ చూచుకొనుడు. ఆ తత్త్వవాదములు క్రీస్తునకు చెందినవి కావు. అవి మనుష్యుల సంప్రదాయములకు, ప్రాపంచిక ప్రాథమిక నియమములకు చెందినవి.

9. దివ్య స్వభావపు పరిపూర్ణత్వము క్రీస్తునందు ఆయన మానవత్వములో ఉన్నది.

10. ఆయన సహచర్యముతో మీకు పూర్ణజీవితము ప్రసాదింపబడినది. సర్వపాలనకు, సర్వాధికారమునకు ఆయన శిరస్సు.

11. ఆయనయందు మీరు సున్నతి పొందితిరి. ఆ సున్నతి మానవులచేగాక క్రీస్తుచే ఏర్పరుపబడినది. అది శరీరేచ్చలతో కూడిన శక్తినుండి మిమ్ము విముక్తి చేయును.

12. మీరు జ్ఞానస్నానము పొందినప్పుడు మీరు క్రీస్తుతోపాటు భూస్థాపితము చేయబడితిరి. జ్ఞానస్నానమునందు క్రీస్తుతోపాటు మీరుకూడ లేపబడితిరి. దేవుని క్రియాశక్తి పట్ల మీకుగల విశ్వాసము వలన ఇది జరిగినది. దేవుడే క్రీస్తును మరణమునుండి లేవనెత్తెను.

13. మీరు మీ పాపకార్యములవలనను, శరీరమందు సున్నతి చేయబడక పోవుటవలనను, ఒకప్పుడు మీరు ఆధ్యాత్మికముగ మరణించి ఉంటిరి. కాని దేవుడు ఇప్పుడు మీకు క్రీస్తుతోపాటు ప్రాణము నిచ్చెను. దేవుడు మన పాపములను అన్నిటిని క్షమించెను.

14. వ్రాతపూర్వకమైన ఆజ్ఞలవలన మన మీద ఋణముగాను, మనకు విరుద్దముగాను ఉండిన పత్రమును ఆయన తన సిలువ మరణము ద్వారా మనకు అడ్డము లేకుండ తొలగించెను.

15. ఆ సిలువపైన క్రీస్తు ప్రధానులను, అధిపతులను నిరాయుధులను చేసెను. వారిని బందీలుగా చేసి, తన విజయయాత్రలో నడిపించి అందరకును ఆయన బహిరంగముగా ప్రదర్శించెను.

16. కనుక మీరు ఏమి భుజింపవలెనో, ఏమి త్రాగవలెనో, శాసించుటకుగాని లేక పండుగ దినముల విషయమును గూర్చి నిర్ణయించుటకు గాని లేక క్రొత్త చంద్రోత్సవమును గూర్చి చెప్పుటకుగాని, విశ్రాంతి దినమును గూర్చి నిర్ణయించుటకుగాని, ఎవ్వరును మీకు తీర్పు తీర్చకుండ చూచుకొనుడు.

17. ఇవి అన్నియును భవిష్యత్తులో రాబోవువానికి ఛాయలు మాత్రమే. కాని మూలాధారము క్రీస్తుకే చెందుతుంది.

18. బూటకపు అణకువను చూపుచు, దేవదూతల ఆరాధనలను చేయకోరుచు తాను చూచిన దృశ్యములను గూర్చి మాట్లాడుచు శరీర సంబంధమైన మనసుతో వ్యర్థముగా ఉప్పొంగిపోవుచు ఉండు ఎవడును మిమ్ము ఏమార్చక ఉండునుగాక!

19. అతడు శిరస్సు అయిన క్రీస్తుపై ఆధారపడడు. ఆ శిరస్సు మూలముగ శరీరము అంతయు పోషింపబడి కీళ్ళ చేతను, నరముల చేతను కూర్చబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి చెందుచున్నది..

20. మీరు క్రీస్తుతోపాటు మరణించితిరి. కనుకనే భౌతిక శక్తులనుండి విముక్తులైతిరి. అయినచో మీరు లౌకికులవలె జీవనమును ఏల గడుపుచున్నారు?

21. “దీనిని చేపట్టకుడు”, “దానిని చవి చూడకుడు”, “వేరొకదానిని తాకకుడు” అనెడి ఇట్టి నియమములను మీరు ఏల పాటించుచున్నారు?

22. ఇవి అన్నియు వాడుకొనుటచే నశించిపోవును. ఇవి మానవుడు చేసిన నియమములు, బోధలు మాత్రమే.

23. అవి స్వయముగా కల్పించుకొని ఆచరించు భక్తికృత్యములయందును, బూటకపు నమ్రతయందును, శరీరమును హింసించుకొనుట యందును విజ్ఞత ఉన్నట్లు కనిపింపవచ్చును. కాని శరీరేచ్ఛలను అదుపులో పెట్టుటకు అవి పనికిరావు. 

 1. మీరు క్రీస్తుతోపాటు సజీవులుగ లేవనెత్త బడితిరి. కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షించుడు. అచ్చట దేవుని కుడిప్రక్కన క్రీస్తు తన సింహాసనముపైన అధిష్ఠించి ఉండును.

2. మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీదగాక, అచ్చట పరలోకమునందుగల వస్తువులపైన లగ్నము చేయుడు.

3. ఏలయన, మీరు మరణించితిరి. మీ జీవితము క్రీస్తుతోపాటు దేవునియందు గుప్తమై ఉన్నది.

4. మనకు జీవమైయున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడ మహిమ యందు కనబడుదురు.

5. జారత్వము, అపవిత్రత, మోహము, దురాశ, ధనాపేక్షవంటి ప్రాపంచిక వ్యామోహములను మీరు తుదముట్టించవలెను. ధనాపేక్ష విగ్రహారాధనకు మారు రూపం.

6. ఇటువంటి వానివలన అవిధేయులపై దేవుని ఆగ్రహము వచ్చును.

7. ఒకప్పుడు మీ జీవితములు ఈ కోర్కెలతో ప్రభావితమైయున్నప్పుడు మీరు ఇటువంటి మనుష్యులతో నడుచుకొనెడివారు.

8. కాని ఇప్పుడు మీరు కోపము, మోహము, ఈర్ష్య అనువానినుండి విముక్తులు కావలెను. మీరు ఎప్పుడును దుర్భాషలాడరాదు. అవమానించెడి మాటలను, నిందించెడి మాటలను పలుకరాదు.

9. అబద్దములు ఆడరాదు. ఏలయన, మీ పాత స్వభావమును దాని అలవాట్లతో పాటు త్యజించి,

10. క్రొత్త స్వభావమును ధరించినారు కదా! తనను గూర్చి మీరు సంపూర్ణముగా తెలిసికొనుటకై మానవుని సృష్టికర్తయైన దేవుడు తన ప్రతిబింబముగా తీర్చిదిద్దుచున్న నూతన మానవుడు ఇతడు.

11. అందుచేత యూదులని, యూదేతరులని, సున్నతి చేయబడినవారని, చేయ బడనివారని, ఆటవికులని, అనాగరికులని, సేవకులని, స్వతంత్రులని ఎవరును లేరు. క్రీస్తే సర్వస్వము. అందరియందును క్రీస్తు ఉన్నాడు.

12. మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు. ఆయనకు పరిశుద్దులును, ప్రియులును అయినవారు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వి కత, ఓర్పు అలవరచుకొనుడు.

13. ఎవడైనను మరియొకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న యెడల ఒకనిని ఒకడు సహించుచు క్షమింపవలెను. మిమ్ములను ప్రభువు క్షమించినట్లుగానే మీరు ఒకరి నొకరు క్షమింపవలెను.

14. వీనికంటె అధికముగ ప్రేమను అలవరచుకొనుడు. అది అన్నిటిని పరి పూర్ణమైన ఐక్యముగా ఉంచగలదు.

15. క్రీస్తు ప్రసాదించెడి శాంతి మీ హృదయములను పరిపాలింపనిండు. ఏలయన, ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరముగ ఉండ పిలువబడితిరి. కనుక కృతజ్ఞులై ఉండుడు.

16. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృ ద్ధిగా ఉండవలెను. పూర్తి విజ్ఞతతో ఒకరినొకరు బోధించుకొనుచు బుద్ది చెప్పుకొనుడు. కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుడు. మీ హృదయాంతరాళములనుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానము చేయుడు.

17. మీరు చేసెడి ప్రతికార్యమును లేక మీరు చెప్పెడి ప్రతిమాటను, తండ్రియైన దేవునకు యేసు ప్రభువు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభువు పేరిట చేయవలెను.

18. భార్యలారా! మీరు మీ భర్తలకు విధేయులుగా ఉండుడు. క్రీస్తుకు చెందినవారుగ మీరు చేయవలసిన కార్యమిది.

19. భర్తలారా! మీరు మీ భార్యలను ప్రేమింపుడు. వారిపట్ల కఠినముగా ప్రవర్తింపకుడు.

20. బిడ్డలారా! మీరు మీ తల్లిదండ్రులకు అన్ని విషయములలోను విధేయులగుడు. ఇట్టిది క్రీస్తుకు ప్రీతిపాత్రము.

21. తల్లిదండ్రులారా! మీరు మీ పిల్లలకు కోపము పుట్టింపకుడు. ఏలయన, వారికి అధైర్యము కలుగవచ్చునుగదా!

22. దాసులారా! మీరు మీ మానవ యజమానుల ఆదేశములను పాటింపుడు. వారి అనుగ్రహము పొందుటకొరకు, వారు గమనించు చున్నప్పుడు మాత్రమేకాక, దేవునియందు భక్తి కలిగి ఎప్పుడును మీ యజమానుల ఆదేశములను చిత్తశుద్ధితో పాటింపుడు.

23. మీరు ఏ పని చేసినప్పటికిని దానిని చిత్తశుద్ధితో మనుష్యులకొరకు చేయుచున్న కార్యము వలెగాక, దేవుని కార్యముగా భావించి చేయుడు.

24. దేవుడు మీకు ప్రతిఫలము ఇచ్చునను విషయమును గుర్తుంచుకొనుడు. ఆయన తన ప్రజలకొరకు ఉంచిన దానిని మీరు పొందగలరు. మీరు ప్రభువైన క్రీస్తును సేవించుచున్నారు.

25. తప్పుడు పనులు చేయువారు ఎవరైనప్పటికిని, అట్టి తప్పిదములకు ఫలితము అనుభవింపగలరు. ఏలయన, దేవుని యందుపక్షపాతముండదు

 1. యజమానులారా! మీరును మీ సేవకుల యెడల సక్రమముగా న్యాయముగా ప్రవర్తింపుడు. పరలోకములో మీకు కూడ ఒక యజమానుడు కలడను విషయము గుర్తుంచుకొనుడు

2. ప్రార్థనను పట్టుదలతో చేయుడు. ప్రార్థన చేయునపుడు జాగరూకతతో ఉండుడు. దేవుని ఎడల కృతజ్ఞతాభావము కలిగియుండుడు.

3. ఇదే సమయములో మాకొరకు కూడ ప్రార్థింపుడు. దేవుని సందేశమును బోధించుటకును క్రీస్తు రహస్యమును వివరించుటకును దేవుడు మాకు మంచి అవకాశము ఇవ్వవలెనని ప్రార్థింపుడు. అందులకే నేను ఇప్పుడు కారాగారమునందు ఉన్నాను.

4. ఆ విషయమును నేను స్పష్టముగా వివరించు సామర్థ్యము నాకు కలుగునట్లు ప్రార్ధింపుడు.

5. అవిశ్వాసులగు వారితో వ్యవహరించునప్పుడు మీరు, మీకు గల ప్రతి అవకాశమును చక్కగా వినియోగించుకొనుచు వివేకముతో ప్రవర్తింపుడు.

6. మీ సంభాషణ ఎల్లప్పుడును, దయాపూరితముగాను, ఉప్పువేసినట్లుగా రుచికరముగాను ఉండవలెను. ప్రతి వ్యక్తికి సరియైన సమాధానము ఎట్లు చెప్పవలెనో మీకు తెలిసి ఉండవలెను.

7. ప్రియ సోదరుడును, నమ్మకమైన పరిచారకుడును, ప్రభువు కార్యమందు తోడి సేవకుడునైన 'తుకికు' మీకు నన్ను గురించిన అన్ని వార్తలను తెలుపును.

8. ఇందుకొరకే మేము అందరమును ఎట్లు ఉన్నదియు మీకు వివరించి మీ హృదయములను ప్రోత్సాహపరచుట కొరకే నేను అతనిని మీ వద్దకు పంపుచున్నాను.

9. అతనితో పాటు మీ బృందమునకు చెందిన విశ్వసనీయుడైన ప్రియతమ సోద రుడు 'ఒనేసిము' కూడ వచ్చును. ఇచ్చట జరుగుచున్న వానిని అన్నింటిని వారు మీకు చెప్పగలరు.

10. నాతో పాటు కారాగారము నందున్న 'అరిస్టార్కు', బర్నబాకు దగ్గర బంధువైన మార్కు మీకు శుభాకాంక్షలు తెలుపుచున్నారు. (అతడు మీ వద్దకు వచ్చినచో అతనికి స్వాగతము చెప్పవలసినదిగా, అతనిని గురించి మీరు ఇదివరకే ఉత్తరువులు పొందియున్నారు).

11. 'యుస్తు' అనెడి 'యోషువా' కూడ శుభాకాంక్షలు తెలుపుచున్నాడు. సున్నతి పొందిన వీరు మాత్రమే దేవుని రాజ్యము కొరకు నాతో కలిసి పనిచేయుచున్నారు. వీరు నాకు చాల సాయ పడుచున్నారు.

12. మీ బృందమునకు చెందిన మరొక సభ్యు డును, యేసుక్రీస్తు సేవకుడునైన 'ఎపఫ్రా' కూడ అభినందనలు తెలుపుచున్నాడు. మీరు ఎల్లపుడును దృఢముగా నిలబడగలుగునట్లు పరిణతి పొందగలుగునట్లు, దేవుని సంకల్పమునకు సంపూర్ణ విధేయతతో దృఢవిశ్వాసము కలిగి ఉండునట్లును, అతడు దేవుని సర్వదా ప్రార్ధించుచున్నాడు.

13. మీ కొరకును లవోదికయ, హిరాపోలిలలోని ప్రజల కొరకును అతడు పడుచున్న కఠినమైన శ్రమను నేను స్వయముగ ధ్రువపరుపగలను.

14. మన ప్రియతమ వైద్యుడు 'లూకా' మరియు 'డెమాసు' కూడ మీకు శుభాకాంక్షలు తెలుపుచున్నారు.

15. లవోదికయలోని సోదరులకును, నుంఫాకును, ఆమె యింట కూడుచుండు దైవసంఘమునకును నా శుభాకాంక్షలు తెలుపుడు.

16. మీరు ఈ లేఖను చదివిన పిమ్మట ఇది లవోదికయలోని సంఘములో కూడ తప్పనిసరిగా చదువబడునట్లు శ్రద్ధ వహింప గలరు. ఇదే సమయములో లవోదికయ మీకు పంపగల జాబును సైతము చదువవలెను.

17. “దేవుని సేవయందు నీకు అప్పగింపబడిన పరిచర్య పూర్తియగునట్లు శ్రద్ధవహింపుము” అని 'అర్కిప్పు'నకు చెప్పగలరు.

18. పౌలునైన నేను స్వహస్తముతో ఈ శుభాకాంక్షలను వ్రాయుచున్నాను. నా సంకెళ్ళను మరువకుడు! కృప మీకు తోడై ఉండునుగాక!