1వ అధ్యాయము + - 1. ఇది ఓబద్యాకు కలిగిన దర్శనము. దేవుడైన ప్రభువు ఎదోమును గురించి చెప్పిన సంగతి: 2. ప్రభువు జాతులచెంతకు దూతను పంపెను. అతని సందేశమును మేము ఆలించితిమి. “మనము ఎదోముమీదికి యుద్ధమునకు పోవుదము. మీరెల్లరును సిద్ధముకండు” అని ఆ సందేశము. ప్రభువు ఎదోముతో ఇట్లనుచున్నాడు: ఇదిగో! నేను నీ జనమును నాశనము చేయుదును. ఎల్లరును నిన్ను నిర్లక్ష్యము చేయుదురు. 3. నీ పొగరు నిన్ను అపమార్గము పట్టించినది. నీ నివాసము కొండసందులలోనున్నది. నీవు ఎత్తయిన పర్వతముపై వసించుచున్నావు. కావున నిన్నెవరును కూలద్రోయలేరని నీనమ్మకము. 4. నీవు గరుడపక్షివలె ఎంత ఎత్తున వసించుచున్నను, చుక్కలనడుమ ఇల్లు కట్టుకొనియున్నను నేను నిన్ను కూలద్రోయకమానను. 5. రేయి దొంగలుపడి దోచుకొనినచో తమకు కావలసిన వస్తువులు మాత్రమే కొనిపోవుదురు. జనులు ద్రాక్షపండ్లు కోయునపుడు పరిగెలేరు వారికి కొన్ని పండ్లు వదలివేయుదురు. కాని నీ శత్రువులు నిన్ను ఊచముట్టుగా కొల్లగొట్టిరి. 6. ఏసాపు వంశజులారా! మీరు దోచుకొనిన సొత్తును విరోధులు దోచుకొనిరి. 7. నీ మిత్రవర్గము నిన్ను మోసగించెను. నీ దేశమునుండి నిన్ను తరిమివేసెను. నీతో పొత్తు చేసికొనినవారే నిన్నోడించిరి....