1. యిస్రాయేలు రాజును, దావీదు కుమారుడునగు సొలోమోను చెప్పిన సామెతలు.
2. విజ్ఞానమును, ఉపదేశమును ఆర్జించుటకును, నిశిత దృష్టికి సంబంధించిన విషయములను ఎరుగుటకును,
3. తెలివితేటలతో మెలగుటకును, నీతిన్యాయములతో ప్రవర్తించుటకును,
4. జ్ఞానములేని వారికి తెలివిగరపుటకును, యువకులకు విజ్ఞాన విచక్షణ నేర్పుటకును,
5. జ్ఞానులు మరింత అధికముగా విజ్ఞానము బడయుటకును, వివేకవంతులు హితోపదేశము పొందుటకును,
6. ఉపమానములు, నీతికథలు అర్థము చేసికొనుటకును, సుభాషితములను, పొడుపు కథలను గ్రహించుటకును ఈ సామెతలు ఉద్దేశింపబడినవి.
7. దేవునిపట్ల భయభక్తులు కలిగియుండుటయే విజ్ఞానమునకు మొదటిమెట్టు. కాని మూఢులు విజ్ఞానోపదేశములను లెక్కచేయరు
8. కుమారా! నీ తండ్రి ఉపదేశము నాలింపుము. నీ తల్లి బోధను అనాదరము చేయకుము.
9. వారి బోధలు నీ తలకు సొగసైన పాగాగను, నీ కంఠమునకు హారముగను శోభిల్లును.
10. కుమారా! దుర్మార్గులు నిన్ను మభ్య పెట్టినచో నీవు వారి ప్రలోభములకు లొంగవలదు
11. వారు నిన్ను చూచి "నీవును మాతో రమ్ము, మనమెవరినైన హత్య చేయుదము. అమాయకులకెవరికైన ఉచ్చులు పన్నుదము.
12. పాతాళలోకము ఉన్నవారిని ఉన్నట్లుగా కబళించినట్లే మనమును వారిని సజీవులుగా మ్రింగివేయుదము
13. వారిని మట్టుపెట్టినచో మనకు బహుసంపదలు దక్కును. కొల్లసొమ్ముతో మనయిండ్లను నింపుకోవచ్చును.
14. రమ్ము, నీవును మాతో కలియుము. మనమందరమును కలిసియే దొంగసొమ్మును పంచుకొందము” అని అనినచో,
15. కుమారా! నీవు వారి మార్గమున నడువకుము. వారి త్రోవనుండి వైదొలగుము.
16. వారు దుష్టపథమున పోవువారు, ఎల్లపుడును హత్యకు పాల్పడువారు.
17. పక్షి చూచునప్పుడు వలపన్నినచో ఫలితము దక్కదుకదా!
18. దుర్మార్గులు తమకు తామే వలపన్నుకొందురు. తమ ఉరులలో తామే చిక్కుకొందురు.
19. ఆశబోతుల అందరి గతి అట్టిదే. దానిని స్వీకరించు ప్రాణమును అది తీయును.
20. విజ్ఞానము వీధులలో బిగ్గరగా అరచుచున్నది. సంత వీధులలో పెద్దగా కేకలిడుచున్నది.
21. త్రోవ మలుపులలో గొంతెత్తి అరచుచున్నది. కూడలిలో ఇట్లు కేకలిడుచున్నది:
22. “అజ్ఞానులారా! ఎంత కాలము మీ అజ్ఞానమున మునిగియుందురు? ఎంతకాలము విజ్ఞానమున పహసింతురు? మందమతులారా! .మీరు తెలివి తెచ్చుకొనునదెప్పుడు?
23. మీరు నా హెచ్చరికలను ఆలకింపుడు. నా ఉపదేశమును వినుడు. నా విజ్ఞానమును గ్రహింపుడు.
24. నేను పిలిచినను మీరు విన్పించుకొనుటలేదు. నా పలుకులను మీరు ఆలకించుటలేదు.
25. మీరు నా హిత వచనములను త్రోసిపుచ్చితిరి. నా హెచ్చరికలను పాటింపరైతిరి.
26. కనుక నేను మీ ఆపదలను చూచి నవ్వుదును. మీ భయములనుగాంచి మిమ్ము వెక్కిరింతును.
27. ఇడుములు తుఫానువలె మీ మీదికి దిగివచ్చినపుడు, సుడిగాలివలె మిమ్మును కూలద్రోసినపుడు, మీరు కష్టములలో చిక్కి దుఃఖార్తులయినపుడు
28. నా వద్దకు వత్తురుగాని నేను మీ మొరను ఆలింపను. నన్ను వెదకుదురుగాని నేను మీకు దొరకను.
29. మీరు విజ్ఞానమును ఆదరింపరైతిరి. దేవునిపట్ల భయభక్తులు చూపరైతిరి.
30. నా ఉపదేశమును లెక్కచేయరైతిరి. నా హెచ్చరికల పాటింపరైతిరి.
31. కనుక మీరు మీ దుష్కార్యముల ఫలమును అనుభవింతురు. మీ దుష్టచేష్టలనే, కుత్తుక నిండినవరకు భుజింతురు.
32. బుద్దిహీనుల వెట్టిపనులు వారికి మరణము తెచ్చి పెట్టును. మూఢుల అవివేకము వారిని నాశనము చేయును
33. నా పలుకులు ఆలకించువాడు సురక్షితముగా జీవించును. కీడును తప్పి శాంతిసౌఖ్యములతో అలరారును”.
1. కుమారా! నా పలుకులు శ్రద్ధగా వినుము. నా ఆజ్ఞలు ఎంతమాత్రము విస్మరింపకుము.
2. విజ్ఞానవాక్కులను జాగ్రత్తగా ఆలింపుము. వివేకమును చక్కగా గ్రహింపుము.
3. నీవు జ్ఞానము నార్జింపుము. తెలివికొరకు ప్రాకులాడుము.
4. జ్ఞానమును వెండినివలె వెదకుము. భూమిలో దాగియున్న నిధినివలె గాలింపుము.
5. అప్పుడు దేవునిపట్ల భయభక్తులననేమో, దైవజ్ఞానమననేమో నీకు తెలియును.
6. ప్రభువు వివేకమునిచ్చును. తెలివియు, జ్ఞానమును ఆయన నోటినుండే వచ్చును.
7. ధర్మాత్ములకు సాయము నొసగువాడు పుణ్యజనులను డాలువలె కాపాడువాడు ఆయనే.
8. న్యాయమును పాటించువారిని సంరక్షించువాడు, భక్తజనులను పరిరక్షించువాడు ఆయనే.
9. నా మాటలు ఆలకింతువేని నీవు ధర్మమును, నీతిన్యాయములను గ్రహింతువు. సత్పురుషుల మార్గమున పయనింతువు.
10. విజ్ఞానము నీ హృదయములోనికి ప్రవేశించును. వివేకము నీకు ప్రమోదమును చేకూర్చును.
11. తెలివి నిన్ను సంరక్షించును. విచక్షణత నిన్ను కాపాడును.
12. అవి నిన్ను దుష్టుల మార్గమునుండి పరిరక్షించును. కల్లలాడు నరులనుండి కాపాడును.
13. దుర్మార్గులు ధర్మపథమును విడనాడి తమోమార్గమున పయనింతురు.
14. దుష్ట కార్యములపట్ల ప్రీతి చూపుదురు. వక్రబుద్ధిని ప్రదర్శించి ఆనందింతురు.
15. కుటిలమార్గమున నడతురు. పెడదారులు పట్టుదురు.
16. నీవు నా పలుకులాలింతువేని, మృదువచనములతో నిన్ను ప్రలోభపెట్టు పరస్త్రీ నుండి తప్పుకొందువు.
17. ఆ వనిత తాను యుక్తవయస్సున పెండ్లియాడిన భర్తను పరిత్యజించెను. తన పాతివ్రత్యమును మంటగలిపెను.
18. ఆమె గృహమునకు వెళ్ళువాడు మృత్యుముఖము కేగినట్లే. మృతలోక ద్వారము చేరినట్లే.
19. ఆమె వద్దకేగువాడు మరలిరాడు. జీవన పథమునకు తిరిగిరాడు.
20. నీవు సజ్జనుల మార్గమున నడువుము. ధర్మాత్ముల పథమున పయనింపుము.
21. ధర్మాత్ములు మన ఈ నేలమీద వసింతురు. పుణ్యపురుషులు మన ఈ నేలమీద జీవింతురు.
22. కాని దేవుడు దుష్టులను ఈ నేల మీది నుండి తుడిచివేయును. పాపులను ఈ భూమి మీదినుండి పెరికివేయును.
1. కుమారా! నీవు నా ఉపదేశము మరువకుము. నా ఆజ్ఞలు జాగ్రత్తగా పాటింపుము.
2. నా చట్టములను చేకొందువేని దీర్ఘాయుష్మంతుడవగుదువు. శాంతి సౌఖ్యములతో అలరారుదువు.
3. నీవు కరుణను, విశ్వసనీయతను ఆలవరచుకొమ్ము వానిని దండలవలె నీ మెడలో ధరించుము. నీ హృదయ ఫలకముపై వ్రాసికొనుము.
4. ఇట్లు చేయుదువేని దేవునికిని, నరులకును ప్రీతిపాత్రుడవగుదువు.
5. నీవు మనస్పూర్తిగా దేవుని నమ్ముము. నీ తెలివితేటలమీద ఆధారపడకుము,
6. నీ కార్యములన్నిటను ప్రభువును స్మరింపుము. అతడు నీ పనులను సులభతరము చేయును.
7. నేనే తెలివైనవాడను అనుకొనకుము. దైవభక్తితో దుష్కార్యములనుండి వైదొలగుము.
8. అది నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువను చేకూర్చిపెట్టును.
9. నీకున్న సిరిసంపదలతో దేవుని పూజింపుము. నీకు పండిన పంటలో మొదటిపాలు అతనికి అర్పింపుము.
10. అప్పుడు నీ కొట్లు ధాన్యముతోను, నీ బానలు ద్రాక్షసారాయముతోను నిండును.
11. కుమారా! ప్రభువు క్రమశిక్షణను తృణీకరింపకుము. ఆయన మందలింపులను అశ్రద్ధచేయకుము.
12. తండ్రి తనకిష్టుడైన కుమారుని శిక్షించినట్లే ప్రభువు తనకు ప్రీతిపాత్రుడైన నరుని చక్కదిద్దును విజ్ఞానము సంతోషము నొసగును
13. విజ్ఞానము నార్జించువాడు ధన్యుడు. వివేకము నలవరచుకొనువాడు కృతార్థుడు.
14. వెండి బంగారములు చేకూర్చుకొనుటకంటె విజ్ఞానమును ఆర్జించుట మేలు.
15. అది పగడములకంటె విలువైనది. రులు కోరుకొనునది ఏదియును దానికి సాటిరాదు.
16. విజ్ఞానము కుడిచేత దీర్ఘాయువు ఉండును. ఎడమచేత సంపదలు, కీర్తి ఉండును.
17. అది నీ జీవితమును ఆనందమయము చేయును. నీ మనుగడకు సంతృప్తిని ఒసగును.
18. విజ్ఞానము తనను స్వీకరించువారికి జీవనవృక్షమగును. దానిని పొందువారు సంతోషముతో జీవించుదురు.
19. ప్రభువు విజ్ఞానముతోనే భూమికి పునాదులెత్తెను వివేకముతోనే ఆకాశమును నెలకొల్పెను .
20. ఆయన జ్ఞానమువల్లనే సముద్రములు పొంగుచున్నవి. మబ్బులు మంచు కురియించుచున్నవి.
21. కుమారా! విజ్ఞాన వివేకములు అలవరచుకొనుము వానిని ఏనాడును ఆశ్రద్ధ చేయకుము.
22. అవి నీకు జీవము నొసగును. నీ కంఠమునకు అలంకారములగును.
23. విజ్ఞాన వివేకములతో నీవు సురక్షితముగా నడతువు. నీ అడుగులెచ్చటను తడబడవు.
24. నీవు శయనించునపుడు భయపడక నిశ్చింతగా నిద్రపోదువు.
25. దుర్మార్గులకు వచ్చినట్లుగా, ఆకస్మాత్తుగా ఏమి ఉపద్రవములు వచ్చిపడునో అని నీవు భయపడవు.
26. నిన్ను కాపాడువాడు ప్రభువు కనుక ఆయన నిన్ను ఏ బంధములలోను చిక్కుకొననీయడు
27. నీకు శక్తికలదేని ఇతరులు అడిగిన ఉపకారము చేయుటకు వెనుకాడకుము.
28. పొరుగువానికి సత్వరమే సాయము చేయగలవేని చేసి పెట్టుము. “మరల రమ్ము రేపు చేసి పెట్టెదను” అని జాప్యము చేయకుము.
29. నిన్ను నమ్మి నీ ప్రక్కనే కాపురముండు నీ తోటివానికి అపకారము చేయుకుము.
30. నీకు ఏ అపకారమును తలపెట్టని నరుని మీదికి నిష్కారణముగా కయ్యమునకు కాలు దువ్వకుము.
31. దౌర్జన్యపరుల లాభమునుజూచి అసూయపడకుము నీవు వారివలె ప్రవర్తింపబోకుము.
32. ఎందుకన ప్రభువు దుర్మార్గులను ఏవగించుకొని, సన్మార్గులను తన మిత్రులునుగా చేసికొనును.
33. ఆయన దుష్టులకుటుంబములను శపించి, సత్పురుషుల గృహములను దీవించును.
34. తనను అపహాసము చేయువారిని , అపహాసము చేయును. వినయవంతులకు మాత్రము తన కృపను దయచేయును.
35. జ్ఞానులకు కీర్తి అబ్బును. మూఢులు మాత్రము అవమానమున మునుగుదురు. నరుడు విజ్ఞానమును ఎన్నుకోవలయును
1. కుమారులారా! మీ తండ్రి ఉపదేశమును ఆలింపుడు. సావధానముగా విని, విజ్ఞానమును ఆర్జింపుడు.
2. నేను మీకు సదుపదేశము చేయుదును కనుక నా బోధ పెడచెవిని పెట్టకుడు.
3. నేనును ఒక తండ్రికి కుమారుడను. మాయమ్మకు ఒక్కడనైన ముద్దుబిడ్డడను.
4. అప్పుడు మా తండ్రి నాకిట్లు బోధ చేసెడివాడు: “నాయనా! నా పలుకులు శ్రద్ధగా వినుము. నా ఆజ్ఞలు పాటింతువేని నీవు బ్రతికి పోయెదవు.
5. విజ్ఞానవివేకములను ఆర్జింపుము. నా పలుకులు మరువకుము, ఆశ్రద్ధచేయకుము.
6. నీవు విజ్ఞానమును విడనాడకుందువేని అది నిన్ను కాపాడును. ఆ విజ్ఞానమును ప్రేమింతువేని అది నిన్ను సంరక్షించును.
7. విజ్ఞానమును ఆర్జించుట అన్నిటికంటే ముఖ్యమైనది. నీకు ఉన్నవన్నియు వెచ్చించియైన , దానిని బడయుము.
8. వివేకమును ప్రేమింతువేని అది నిన్ను గొప్పవానిని చేయును. దానిని ఆప్యాయముగా చూచెదవేని అది నీకు కీర్తి గడించి పెట్టును.
9. అది నీ తలకు పూలదండ చుట్టును, మేలిమి కిరీటము పెట్టును.”
10. కావున కుమారా! నా పలుకులు జాగ్రత్తగా వినుము. నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు.
11. నేను నీకు విజ్ఞానమును ఉపదేశింతును. సత్పథమును చూపెదను.
12. నీవు విజ్ఞానమార్గమున నడతువేని నీకేదియు అడ్డురాదు. నీ పాదములు తొట్రిల్లవు.
13. నీవు నేర్చుకొనిన క్రమశిక్షణను విడనాడకుము. దానిని పాటించినచో అది నీకు జీవము నొసగును.
14. దుష్టుల మార్గమున ఏనాడును పయనింపకుము. దుర్జనుల బాటలో సంచరింపకుము.
15. దుష్టపథమును మానివేయుము. దానినుండి వైదొలగి ప్రక్కగా తొలిగిపొమ్ము.
16. దుష్కార్యములు సల్పిననేగాని దుష్టులకు నిద్రపట్టదు. ఎవరికైన హాని చేసిననేగాని వారి కంటికి కునుకురాదు.
17. వారు దుష్టవర్తనమునే భోజనముగా స్వీకరింతురు దౌర్జన్యమునే పానీయముగా సేవింతురు.
18. సత్పురుషుల మార్గము వేకువ వెలుగువంటిది. దాని ప్రకాశము పట్టపగలగువరకును క్రమముగా వృద్ధిచెందును.
19. దుర్మార్గుల మార్గము మాత్రము ఆ రాత్రివలె తమోమయముగా నుండును. ఏది తగిలిపడిపోవుదురో వారికే తెలియదు.
20. కుమారా! నా పలుకులు ఆలింపుము, నా మాటలు శ్రద్ధగా వినుము.
21. వానిని ఏనాడును మరువక నీ ఎదలో పదిలపరచుకొనుము.
22. నా పలుకులు గైకొనువారికి అవి జీవనదాయకములగును. సంపూర్ణ ఆరోగ్యమునొసగును.
23. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును పదిలము చేసికొనుము. నీ జీవనగతికి మూలాధారమదియే.
24. నీ నోటితో అబద్దములు చెప్పకుము. నీ పెదవులతో వంచన వాక్కులను పలుకకుము.
25. ధైర్యముతో ముందునకు చూచి నడువుము. నీ దృష్టిని ఎప్పుడు ముందరికి ప్రసరింపనిమ్ము.
26. నీవు చేయనున్న కార్యములకు జాగ్రత్తగా సిద్ధముకమ్ము. అప్పుడు నీ పనులన్నింట నీకు విజయము సిద్ధించును.
27. చెడును విడనాడి ఋజుమార్గమున నడువుము. కుడి ఎడమలకు బెత్తెడైనను జరుగకుము.
1. కుమారా! నా విజ్ఞానబోధను ఆలింపుము. నా వివేకవచనములను వినుము.
2. అప్పుడు నీకు విచక్షణను అలవడును. నీ పలుకులలో తెలివి ఉట్టిపడును.
3. పరస్త్రీ పెదవులు తేనెలొలుకుచుండును. ఆమె పలుకులు ఓలివు తైలము వలె మృదువుగా నుండును.
4. కాని కడన ఆమె విషముష్టివలె చేదుగొల్పును. రెండంచుల కత్తివలె బాధ కొనితెచ్చును.
5. ఆ వనిత నిన్ను మృతలోకమునకు చేర్చును. ఆమె నడిచిన మార్గము పాతాళమునకు పోవును.
6. ఆమె జీవనమార్గమున నిలువక చపలచిత్తముతో ఎక్కడెక్కడనో తిరుగాడును.
7. కుమారా! నా పలుకులాలింపుము. నా మాటలు త్రోసిపుచ్చకుము.
8. రంకులాడికి సాధ్యమైనంత దూరమున ఉండుము ఆమె ఇంటిగుమ్మము చెంతకుకూడ పోవలదు.
9. ఈ ఆజ్ఞ మీరెదవేని నీ గౌరవమును కోల్పోయెదవు. క్రూరులకు జిక్కి అకాల మృత్యువువాత బడెదవు.
10. పరులు నీ సొత్తును స్వాధీనము చేసికొందురు. నీవు శ్రమచేసి సాధించినదెల్ల అన్యులపాలగును.
11. నీవు మృత్యుశయ్యను చేరెదవు. నీ దేహము క్షీణించిపోవును. నీవు ఈ విధముగ అంగలారువు:
12. “నేనితరుల హితోపదేశములను ఆలింపనైతిని. ఇతరుల మందలింపులను పాటింపనైతిని.
13. నా గురువుల బోధలను పెడచెవిని పెట్టితిని. వారి ఉపదేశములను లెక్కచేయనైతిని.
14. ఇప్పుడు కష్టములపాలయి పదిమంది దృష్టిలో నగుబాట్లు తెచ్చుకొంటిని.”
15. నీ సొంతబావినుండి మాత్రమే నీరు త్రాగుము. నీ జలధారనుండి మాత్రమే స్వచ్ఛమైన నీరు సేవింపుము.
16. నీ చెలమలోని నీటితో ఇతరుల పొలము తడుపకుము. నీ జలధారలను వీధులలోనికి పారనీయకుము.
17. నీ జలములు నీవే గాని అన్యులతో పంచుకొనుటకుగాదు.
18. నీ ఊట దీవెన పొందునుగాక! నీవు యవ్వనమున పెండ్లియాడిన భార్యతో సంతోషముగా ఉండుము.
19. ఆమె అతి ప్రియమైన వనిత. ఆమె అందమైన దుప్పి. ఆమె రొమ్ముల వలన నీ వెల్లపుడు తృప్తినొందుచుండుము. ఆమె ప్రేమకు నిత్యము బద్దుడవై ఉండుము.
20,. కుమారా! నీవు పరస్త్రీ వ్యామోహమున తగుల్కొననేల? అన్యస్త్రీ ఆలింగనమున పరవశుడవు కానేల?
21. ప్రభువు నరుల చేష్టలనెల్ల కనిపెట్టుచుండును. అతని నడకలనెల్ల పరిశీలించును.
22. దుష్టుడు తన దుష్కార్యములు అను ఉరులలోనే తగుల్కొనును. తన పాపమను బోనులోనే చిక్కుకొనును.
23. క్రమశిక్షణకు లొంగలేదు కనుక అతడు నశించును. అతని మూర్ఖత్వమే అతనికి చావు తెచ్చిపెట్టును.
1. నాయనా! నీవు పొరుగువానికి హామీగా ఉన్నచో, తోడివానికి పూచీపడినచో
2. నీ నోటి మాటవలన నీవు చిక్కుబడి ఉందువు. నీ నోటి మాటవలన పట్టుబడెదవు.
3. నీవు పరుని చేతికి చిక్కితివి గనుక ఇట్లు చేయుము: శీఘ్రమే అతనివద్దకు పోయి నిన్ను మన్నింప వేడుకొనుము.
4. నీవు రెప్పవాల్చి నిద్రపోకూడదు. నీ కంటికి కునుకు రాకూడదు.
5. వేటగాని చేతినుండి లేడి తప్పించుకొనునట్లుగా, బోయ చేతినుండి పక్షి తప్పించుకొనునట్లుగా, నీవును బోనునుండి తప్పించు కోవలయును.
6. సోమరీ! చీమలను చూడుము. వాని జీవితము చూచి బుద్దితెచ్చుకొనుము.
7. వానికి నాయకుడు లేడు, పర్యవేక్షకుడును లేడు, అధికారియు లేడు.
8. అయినను అవి వేసవిలో ఆహారము చేకూర్చుకొనును. కోతకాలమున ధాన్యమును సేకరించుకొనును.
9. సోమరీ! నీ వెంతకాలము పడుకొందువు? ఎప్పుడు నిద్ర మేల్కొందువు?
10. ఇంకను కొంచెము సేపు కన్నుమూసి, కొంచెము నిద్రించి, కొంచెము చేతులు ముడిచి, విశ్రాంతి తీసికోగోరెదవు కాబోలు!
11. కాని ఇంతలోనే దారిద్ర్యము దోపిడికారునివలె నీ మీదికి వచ్చును. పేదరికము ఆయుధ హస్తమువలె నీ మీదికెత్తివచ్చును.
12. కొరగాని దుర్మార్గుడు కల్లలాడుచు, తిరుగాడుచుండును.
13. అతడు కన్నుగీటి, కాలుకదపి, చేతులుత్రిప్పి నరులను వంచించును.
14. అతడు కపట హృదయుడు, కుట్రలు పన్నువాడు, జగడములు తెచ్చి పెట్టువాడు.
15. కావుననే అతడు తలవని తలంపుగా నాశనమగును అకస్మాత్తుగా, మరల కోలుకోని రీతిగా హతుడగును
16. ప్రభువు అసహ్యించుకొను కార్యములు ఆరు కలవు. ఏడింటిని అతడు ఏవగించుకొనును.
17. గర్వపు చూపు, అబద్దములాడు నాలుక, నిర్దోషులను చంపు చేతులు,
18. కుట్రలుపన్ను హృదయము, చెడును చేయుటకు పరుగిడు పాదములు,
19. సాక్ష్యమున మాటిమాటికి బొంకులాడుట, అన్నదమ్ములలో జగడములు పెంచుట.
20. కుమారా! నీ తండ్రి ఉపదేశమును ఆలింపుము. నీ తల్లి బోధను పాటింపుము.
21. వారి ఉపదేశమును నీ హృదయములో పదిలపరుచుకొనుము. నీ కంఠమున హారమువలె ధరింపుము.
22. అది నీవు పయనము చేయునపుడు నిన్ను నడిపించును. నీవు నిద్రించునపుడు నిన్ను కాపాడును. నీవు మేల్కొనినపుడు నీకు హితబోధ చేయును.
23. నీ తండ్రి ఉపదేశము నీకు దీపముగా, నీ తల్లి బోధ నీకు వెలుగుగా ఉండును. నీ తల్లిదండ్రుల శిక్షణార్థమైన గద్దింపులు జీవమార్గములు.
24. వారి దిద్దుబాటులు నిన్ను దుష్టురాలినుండి కాపాడును. పరుని ఆలి యిచ్చకపు మాటలనుండి నిన్ను రక్షించును.
25. పరకాంత సొగసునకు నీవు భ్రమయవలదు. ఆమె కంటిచూపునకు నీవు సమ్మోహితుడవు కావలదు.
26. వేశ్యకు కొద్దిపాటి సొమ్ము చెల్లించిన చాలును. కాని పరునిభార్యతోడి రంకు నీ విలువైన ప్రాణమును వేటాడును.
27. నిప్పులను రొమ్ముమీద పెట్టుకొన్నచో బట్టలు కాలకుండునా?
28. అగ్నిమీదనడచినచోపాదములు మాడకుండునా?
29. అన్యుని భార్యను కూడువాడును అంతియే. ఆమెను స్పృశించిన వానికి శిక్ష తప్పదు.
30. ఆకలిగొనినవాడు పొట్టకూటికొరకు దొంగిలించినచో జనులు అతనినంతగా దూషింపరు
31. పట్టుబడినచో అతడు ఏడురెట్లు నష్టపరిహారము చెల్లించి తనకున్నదంతయు అప్పగింపవలసినదే.
32. కాని పరుని సతితో వ్యభిచరించువానికి అసలు బుద్దిలేదు. అతడు తన చావును తానే కొనితెచ్చుకొనును.
33. అతనికి గాయములు, అవమానములు కలుగును. అతని అపకీర్తి తొలగింపబడదు.
34. అసూయకు గురియైన భర్త రౌద్రముతో మండిపడును కరుణమాని ప్రతీకారమునకు పూనుకొనును.
35. అతడు అపరాధపు సొమ్మును అంగీకరింపడు. ఎన్ని బహుమతులర్పించినను శాంతింపడు.
1. కుమారా! నా పలుకులాలింపుము. నా ఉపదేశమును నిధినివలె భద్రపరచుకొనుము.
2. నా సూక్తులను పాటింతువేని నీకు జీవనము అబ్బును. నా బోధను కంటిపాపనువలె జాగ్రత్తగా చూచుకొనుము.
3. ఈ ఉపదేశములను నీ ముందట ఉంచుకొనుము. నీ హృదయ ఫలకముపై లిఖించుకొనుము.
4. విజ్ఞానమును నీ సోదరినిగను, తెలివిని నీ చెలికత్తెనుగను భావింపుము.
5. జ్ఞానము నిన్ను పరస్త్రీలనుండి కాపాడును. వారి మోసపు మాటలనుండి నిన్ను రక్షించును.
6. నేను మా ఇంటి గవాక్షమునుండి వీధివైపు పారజూడగా
7. అచట లోకజ్ఞానములేని యువకులనేకులు కన్పించిరి. వారిలో ఒకనికి బుద్ధి యిసుమంతయును లేదు.
8. అతడు వీధి వెంట బోవుచు ఆ మలుపున వసించు ఒకానొక వనిత ఇంటి దగ్గరికి వచ్చెను.
9. అది సందెవేళ, రేయి చిమ్మచీకట్లు క్రమ్మినవి.
10. ఆ కాంత అతనిని కలిసికొనినది. ఆమె వేశ్యవలె దుస్తులు ధరించి పన్నుగడలతో వచ్చినది.
11. ఆమెకు సాహసము మెండు, సిగ్గులేదు, ఇంటిలో కాలు నిలువదు.
12. వీధిలోను, రచ్చపట్టునను తిరుగాడుచు, . మూలమూలను విటులకొరకు గాలించుచుండును
13. ఆ ఉవిద అతనిని కౌగిలించుకొని ముద్దాడెను. సిగ్గుమాలిన ముఖముతో అతనివైపు చూచి ఇట్లనెను:
14. “నేను నేడు బలియర్పించి వ్రతములను చెల్లించితిని.
15. ఇప్పుడు వెలుపలికి వచ్చి నీ కొరకు గాలించితిని. నేను నిన్ను వెదకరాగా నీవు నా కంటబడితివి.
16. ఐగుప్తునుండి కొనివచ్చిన చిత్రవర్ణ వస్త్రములతో శయ్యనలంకరించితిని.
17. సుగంధతైలములను చిలుకరింపగా పడక సువాసనలు గుబాళించుచున్నవి.
18. కావున రమ్ము, మనము వేకువవరకు ప్రేమ జలధిలో మునిగితేలుదము. తృప్తిదీర సుఖము ననుభవింతము.
19. మగడు ఇంట లేడు. దూరదేశమునకు వెడలిపోయెను.
20. రూకల సంచులుగూడ తీసికొనిపోయెను. కనుక పున్నమి వరకు తిరిగిరాడు.”
21. ఆ రీతిగా ఆమె అతనిని ప్రలోభపెట్టెను. వలపుమాటలతో అతనిని లోపరచుకొనెను.
22. ఇకనేమి, కోడె వధ్యస్థానమునకు పోయినట్లు, లేడి ఉచ్చులలో తగుల్కొనబోయినట్లు అతడు ఆ ఉవిద వెంటపోయెను.
23. పక్షి ఉరివద్దకు త్వరపడునట్లు తన ప్రాణమును హరించునని తెలియక తన గుండెను అంబు చీల్చువరకు అతడు దానిననుసరించును
24. కనుక కుమారా! నా పలుకులు ఆలింపుము. నా మాటలను శ్రద్ధగా వినుము.
25. నీ హృదయమును అట్టి వనితకు అర్పింపవలదు నీవామె వెంటపోవలదు.
26. ఆ కాంత చాలమందికి ముప్పుతెచ్చును. ఆమె చేతచిక్కి చచ్చిన వారనేకులు కలరు.
27. ఆమె ఇంటికి పోవుటయనగా పాతాళలోకమునకు పోవుటయే. మృత్యుద్వారము చేరుకొనుటయే.
1. అదిగో! విజ్ఞానము పిలుచుచున్నది. వివేకము ఆహ్వానించుచున్నది.
2. కొండమీదను, వీధిలోను, నాలుగు త్రోవలు కలియుచోటను,
3. నగరద్వారములచెంతను, రచ్చపట్టులలోను నిలుచుండి విజ్ఞానమిట్లనును:
4. “నరులారా! నేను మిమ్ము ఆహ్వానించుచున్నాను. నేలమీద జనులందరికి విజ్ఞప్తి చేయుచున్నాను.
5. అజ్ఞానులారా! మీరు విజ్ఞానమునెరుగుడు. మందమతులారా! మీరు వివేకమును అలవరచుకొనుడు.
6. నేను ఉదాత్త సత్యములను బోధింతును. నా పెదవులనుండి సత్యవాక్కులే వెలువడును.
7. నేను నిజము చెప్పుదానను. కల్లలాడుట నాకు గిట్టదు.
8. నా పలుకులన్నియు సత్యములు. అబద్దములు, వక్రభాషణములు నా నోటివెంటరావు
9. తెలివి కలవానికి నా పలుకులు తేటతెల్లములు. జ్ఞానము కలవానికి నా మాటలు సుబోధకములు.
10. మీరు వెండిని విడనాడి నా ఉపదేశమును అంగీకరింపుడు. మేలిమి బంగారమును వదలుకొని విజ్ఞానమును బడయుడు.
11. విజ్ఞానమునైన నేను ముత్తెముకంటెను మెరుగైన దానను. నాతో సరిసమానమైనదేదియు మీకు లభింపదు. విజ్ఞానము రాజులను నడిపించును
12. విజ్ఞానమునైన నాకు వివేకము కలదు. మంచిచెడ్డలు విచారించు విచక్షణశక్తి కలదు.
13. దేవునిపట్ల భయభక్తులు చూపుటయనగా దుష్టత్వమును అసహ్యించుకొనుటయే. అహంకారము, తననుతాను గొప్పగా ఎంచుకొనుట దుర్మార్గపు పనులు, బొంకులు నాకు గిట్టవు.
14. హితోపదేశము, మంచి చెడ్డలు ఎరుగు శక్తి నా సొమ్ము. తెలివితేటలు, బలము నాసొత్తు.
15. నా సహాయముతో ప్రభువులు చక్కగా పాలింతురు రాజులు న్యాయసమ్మతమైన నాలు విధులను నెలకొల్పుదురు.
16. లోకములో ప్రతి పాలకుడును నా సాయముతోనే పాలించును. మరి రాజనీతిజ్ఞులు, అధికారులు నా తోడ్పాటుతోనే ఏలుదురు.
17. నన్ను ప్రేమించువారిని నేను ప్రేమింతును. నన్ను వెదకువారికి నేను దొరకుదును.
18. నావద్ద భోగభాగ్యములు, కీర్తి ప్రతిష్ఠలు, అక్షయసంపదలు నీతిన్యాయములు కలవు.
19. మేలిమి బంగారముకంటెను, మెరుగైన వెండికంటెను నేనొసగు ఫలములు మిన్నయైనవి.
20. నేను ధర్మపథమున నడతును. న్యాయమార్గమున సంచరింతును.
21. నన్ను ప్రేమించువారిని నేను సంపన్నులను చేయుదును. వారి కోశములను సంపదలతో నింపుదును. విజ్ఞానము సృష్టి చేయును
22. ప్రభువు నన్ను ప్రప్రథమమున కలిగియుండెను. తాను పూర్వమే కలిగించిన వానియన్నిటిలో నన్ను మొదటిదానినిగా కలిగియుండెను.
23. ఆయన అనాదికాలమున, పుడమికంటెను ముందుగా నన్ను నియమించెను.
24. నేను నియమింపబడినప్పుడు జలనిధులు లేవు. నీరములు, ఉబుకు నీటి బుగ్గలును లేవు.
25. పర్వతములు రూపొందకమునుపే, తిప్పలు నెలకొనకముందే నేను ఆవిష్కరించబడితిని.
26. ప్రభువు భూమిని, మైదానములను చేయకముందే ప్రథమ భూరేణువులను, కలిగింపకమునుపే నేను ఉంటిని.
27. ఆయన అంతరిక్షమును నిర్మించినపుడు, సముద్రమునకు సముద్రమునకు చెలియలి కట్టను చుట్టినపుడు,
28. ఆకాశమున మేఘములను పాదుకొల్పినపుడు, సముద్రగర్భమున చెలమలను నెలకొల్పినపుడు,
29. జలమునకు ఎల్లలు నిర్మించి నీళ్ళు తన ఆజ్ఞమీరి పొంగిపొర్లకూడదని శాసించినపుడు, భూమికి పునాదులెత్తినపుడు నేనుంటిని.
30. నేను ప్రధానశిల్పినై ఆయనచెంత నిలిచియుంటిని. నిత్యము ఆయన సన్నిధిలో ఆటలాడుకొనుచుంటిని
31. ఆయన చేసిన పుడమిమీద క్రీడించుచు ప్రమోదముతో మానవాళి మధ్య మనుచుంటిని.
32. కనుక కుమారులారా! నా పలుకు లాలింపుడు. నా విధానములు పాటించువాడు సుఖములు బడయును.
33. మీరు నా హితోపదేశము ఆలించి విజ్ఞానము అలవరచుకొనుడు. ఆ విజ్ఞానమును అనాదరము చేయకుడు.
34. నా ఉపదేశములను వినువాడు, ప్రతిదినము నా ఇంటి గుమ్మములచెంత కాచుకొనియుండువాడు, నా గృహద్వారములచెంత వేచియుండెడివాడు, సుఖములు బడయును.
35. నన్ను సంపాదించినవానికి జీవనమబ్బును. అతడు ప్రభువు అనుగ్రహమునకు నోచుకొనును.
36. నన్ను సంపాదింపనివానికి కీడువాటిల్లును. నన్ను అనాదరము చేయువాడు మృత్యువువాతబడును.
1. విజ్ఞానమను స్త్రీమూర్తి తన భవనమును నిర్మించి, ఏడుస్తంభములు నెలకొల్పెను.
2. ఆమె వేట మాంసమువండి, సుగంధ ద్రవ్యములు కలిపిన ద్రాక్షారసము సిద్ధముచేసి, భోజనపదార్ధములు తయారుచేసెను.
3. ఆమె తన పరివారమును నగరములోనికి పంపగా వారు ఉన్నత ప్రదేశమున నిలుచుండి,
4. “జ్ఞానములేనివారు ఇచటకు రండు” అని జనులను ఆహ్వానించిరి. వివేకహీనునకు ఆమె ఇట్లు కబురు పంపించెను:
5. “రమ్ము, నేను తయారుచేసిన , భోజనమును ఆరగింపుము. నేను సిద్ధముచేసిన ద్రాక్షారసమును సేవింపుము.
6. మూర్ఖత్వమును విడనాడెదవేని నీవు జీవింతువు. నీవు విజ్ఞాన పథమున నడువుము.”
7. మూర్ఖుని మందలించువాడు నవ్వులపాలగును. దుష్టుని హెచ్చరించువాడు అవమానము కొనితెచ్చుకొనును.
8. నీవు మూర్ఖుని మందలించినచో అతడు నిన్ను ద్వేషించి తీరును. కాని జ్ఞానిని మందలించినచో అతడు నిన్ను అభిమానముతో చూచును.
9. విజ్ఞానికి బోధించినచో అతని జ్ఞానము పెరుగును. ధర్మాత్మునికి ఉపదేశించినచో అతని తెలివి ఎక్కువగును.
10. దేవునిపట్ల భయభక్తులు చూపుట విజ్ఞానమునకు మొదటిమెట్టు. పవిత్రుడైన ప్రభుని తెలిసికొనుటయే వివేకము.
11. నా వలన నీ ఆయుష్కాలము పెరుగును.
12. విజ్ఞానివైనచో నీకు లాభము కలుగును. మూర్ఖుడవైనచో నష్టపోవునది నీవే.
13. మూర్ఖత్వమను స్త్రీమూర్తికి నిలకడలేదు. ఆమె మూర్ఖురాలు, ఏమియు తెలియనిది.
14. ఆమె తన ఇంటి గుమ్మముచెంత, నగరమున ఎత్తయిన తావున కూర్చుండి
15-16. సొంత పనులమీద దారి వెంట అటునిటు తిరుగువారిని జూచి “ జ్ఞానము లేనివారు ఇచటికి రండు" అని పిలుచును. వివేక హీనునితో ఆమె ఇట్లనును:
17. “దొంగలించిన నీరు మిక్కిలి తీయగానుండును. దొంగలించిన భోజనము మిక్కిలి రుచిగానుండును”.
18. కాని ఆమె ఇల్లు మృత్యువునకు నిలయమనియు, ఆమె అతిథులు పాతాళలోకమునకు చేరుదురనియు, ఆ వివేకహీనునకు తెలియదు.
1. సొలోమోను సామెతలు: విజ్ఞుడైన కుమారుడు తండ్రికి ఆనందము చేకూర్చును. మూర్ఖుడైన పుత్రుడు తల్లికి దుఃఖము తెచ్చిపెట్టును.
2. అన్యాయముగా గడించిన సొమ్ము ఆనందమును ఈయజాలదు. కాని న్యాయబద్ధముగా జీవించువాడు మృత్యువు నుండి తప్పుకొనును.
3. ప్రభువు ధర్మాత్ముని ఆకలిబాధకు గురిచేయడు. కాని అతడు దుష్టుని కోరికలు మాత్రము తీర్పడు.
4. సోమరిపోతు లేమిని అనుభవించును. కష్టించి పనిచేయువాడు సంపదలు బడయును.
5. వివేకి పంట పండినపుడు కోతకు పూనుకొనును. కోతకాలమున కునుకు తీయువాడు నగుబాట్లు తెచ్చుకొనును.
6. ధర్మాత్ముడు దేవుని దీవెనలు పొందును. దుర్మార్గుల మాటలు హింసతో నిండియుండును.
7. జనులు పుణ్యపురుషులను స్మరించుకొని దీవెనలు పలుకుదురు. కాని దుర్మార్గులను ఎవరును జ్ఞప్తికి తెచ్చుకొనరు.
8. విజ్ఞుడు ఉపదేశమును ఆలించును. ఊరక వదరు వెఱ్ఱివాడు నాశనము తెచ్చుకొనును.
9. సత్యవర్తనుడు భద్రముగా బ్రతుకును. కాని కుటిలవర్తనుడు విరోధికి దొరికిపోవును.
10. కను సైగ చేయువాడు వ్యధ పుట్టించును. పనికిమాలిన వదరుబోతు నశించును.
11. సజ్జనుని మాటలు జీవపు ఊటవంటివి. దుష్టుని పలుకులు హింసతో నిండియుండును.
12. ద్వేషము తగవులను కొనితెచ్చును. ప్రేమ అపరాధములను కప్పిపెట్టును.
13. తెలివిగల వారి మాటలలో విజ్ఞానము ఉట్టిపడును. కాని మూర్ఖుని వీపు కఱ్ఱ దెబ్బలకు గురియగును.
14. వివేకి జ్ఞానము కూడబెట్టుకొనును. ఆ కాని అవివేకి తన మాటలవలననే వినాశనము తెచ్చుకొనును.
15. ధనవంతుని సంపద అతనిని సంరక్షించును. పేదవాని లేమి అతనిని క్రుంగదీయును.
16. సత్కార్యములు చేసినందులకు ప్రతిఫలము జీవనము. దుష్కార్యములు చేసినందులకు ప్రతిఫలము వినాశనము.
17. దిద్దుబాటుకు లొంగువాడు , జీవనపథమున నడచును. మందలింపులను లక్ష్యము చేయనివాడు అపమార్గము పట్టును.
18. అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్దీకుడు నిందలను ప్రచారము చేయువాడు మూర్ఖుడు.
19. అతిగా ప్రేలినచో తప్పుదొరలక తప్పదు. మౌనము వహించువాడు వివేకి.
20. పుణ్యపురుషుని పలుకులు మంచి వెండివంటివి. దుష్టుని భావములు చెత్తవంటివి.
21. ధర్మాత్ముని పలుకులు చాలమందికి లాభము చేకూర్చును. మూఢుని మూర్ఖత అతనికే చావు తెచ్చిపెట్టును.
22. దేవుని దీవెనవలన సిరులబ్బును. స్వయంకృషివలననే సంపదలు కలుగవు.
23. దుష్కార్యములవలన మూర్ఖునికి వినోదము కలుగును. కాని జ్ఞానార్జనమువలన జ్ఞానికి ప్రమోదము కలుగును.
24. దుష్టుడు దేనికి భయపడునో అదియే అతనికి సంభవించును. కాని ధర్మాత్ముని కోరికలు ఫలించును.
25. తుఫాను లేచినపుడు దుర్మార్గుడు నిర్మూలమగును కాని సత్పురుషుడు దృఢముగా నిలుచును.
26. పంటికి పులుపు, కంటికి పొగ ఎట్టులో సోమరి తనను పనికి పంపినవానికట్లుండును.
27. దేవునిపట్ల భయభక్తులు చూపువాడు దీర్ఘాయుష్మంతుడు అగును. దుష్టుడు అల్పాయుష్కుడగును.
28. ధర్మాత్ముల కోరికలు ఆనందము చేకూర్చును. కాని దుష్టుల కోరికలు వమ్మగును.
29. ప్రభువు పుణ్యాత్మునకు రక్షణదుర్గము వంటివాడగును. కాని ఆయన దుష్టాత్ముని కూలద్రోయును.
30. ధర్మాత్ముడు భద్రముగానుండునుగాని దుష్టుడు నేలమీద నిలువడు.
31. సజ్జనుడు విజ్ఞాన వాక్యములు పలుకును. కల్లలాడు నాలుక పెరికివేయబడును.
32. సత్పురుషుడు కరుణపూరిత వాక్యములు పలుకును. కాని దుష్టుడు కపటపు మాటలు పలుకును.
1. తప్పుడు తూనికలను ప్రభువు అసహ్యించుకొనును. నిండు తూనికలవలన ఆయన ప్రమోదము చెందును.
2. పొగరుబోతునకు అవమానము తప్పదు. వినయవంతునకు విజ్ఞానము అలవడును.
3. సత్య సంధులను సత్యమే నడిపించును. మోసగాండ్రను మోసమే నాశనము చేయును.
4. మరణము ఆసన్నమైనపుడు సంపదలు రక్షింపలేవు. కాని సత్యనిష్ఠవలన మృత్యువునుండి తప్పుకోవచ్చును.
5. సజ్జనుని ధర్మనిష్ఠ అతని మార్గమును సుగమము చేయును. కాని దుష్టుడు తన దౌష్ట్యమువలననే కూలిపోవును.
6. సత్పురుషుని సచ్చీలమతడిని ఆపదలనుండి కాపాడును. కాని మోసగాడు తన దుర్వాంఛలవలననే బంధితుడు అగును.
7. దుర్మార్గుని ఆశలు అతని మరణముతోనే అంతరించును. దుష్టుని కోరికలు ఫలింపజాలవు.
8. పుణ్యజనుడు కష్టములను తప్పించుకొనును. కాని యిక్కట్టులు దుష్టునిమెడకు చుట్టుకొనును.
9. దుష్టుడు తన మాటల ద్వారా తోడివారిని నాశనము చేయును. కాని సజ్జనుడు తన విజ్ఞానముద్వారా పొరుగువారిని రక్షించును.
10. సత్యసంధుడు వృద్దిలోనికి వచ్చినపుడు నగరము సంతసించును. దుర్మార్గుడు నశించినపుడు ప్రజలు ఆనందింతురు.
11. సత్పురుషుని దీవెనలుపొంది నగరము వృద్ధిచెందును. కాని దుర్మార్గుని మాటలవలన పట్టణము పాడగును.
12. ఇతరులను చులకనచేయుట అవివేకి లక్షణము. విజ్ఞతకలవాడు మౌనము వహించును.
13. కొండెగాడు రహస్యములను వెల్లడిచేయును. కాని నమ్మదగినవాడు రహస్యములను దాచియుంచును.
14. హితోపదేశములేని ప్రజలు నశింతురు. పెక్కుమంది హితోపదేశకులున్నచో భద్రత కల్గును.
15. ఇతరులకు హామీగా ఉండువాడు. దుఃఖము పాలగును అన్యులకు పూచీపడని వానికి చీకుచింతలేదు.
16. నెనరుగల స్త్రీ ఘనతను తెచ్చుకొనును. కాని బలిష్ఠుడు ఐశ్వర్యమును సంపాదించుకొనును
17. దయాపరుడు తనకుతానే మేలు చేసికొనును. కాని క్రూరుడు తనకుతానే కీడు చేసికొనును.
18. దుష్టుడు గడించు సొత్తు మోసకరము. ధర్మమను విత్తన సేద్యము చేయువాడు సత్పలితమును పొందును.
19. ధర్మాత్ముడు జీవమును బడయును. దుష్టాత్ముడు చావును కొని తెచ్చుకొనును.
20. ప్రభువు దుష్టవర్తనులను అసహ్యించుకొనును. కాని ఆయన సద్వర్తనులను ప్రీతితో చూచును.
21. దుష్టునికి శిక్ష తప్పదనుట పరమసత్యము. కాని సజ్జనుడు శిక్షను తప్పించుకొనును.
22. వివేకములేని సుందరమైన స్త్రీ పందిముక్కుకు ఉన్న బంగారుకమ్మివంటిది.
23. మంచివాని కోరికలు మంచినే చేకూర్చి పెట్టును. కాని దుష్టుల కార్యములు వమ్మగును.
24. కొన్నిమారులు ఉదారముగా ఖర్చు చేయువాని సంపదలు పెరుగును, మితముగా ఖర్చు చేయువాని సంపదలు తరుగును.
25. ఉదారముగా నిచ్చువాడు వృద్ధిచెందును, నీళ్ళు పోయువానికి దేవుడు నీళ్ళు పోయును.
26. ధాన్యమును నిల్వచేయువానిని జనులు శపింతురు దానిని పదిమందికి అమ్మువానిని నరులు దీవింతురు.
27. మంచికి పూనుకొనువానికి దేవుని అనుగ్రహము లభించును. చెడును పూనుకొనువానికి , ఆ చెడుయే దాపురించును.
28. తమ కలిమిని నమ్ముకొనువారు పండుటాకువలె రాలిపోవుదురు. కాని సజ్జనులు పచ్చని ఆకువలె పెంపుచెందుదురు
29. దూబారా ఖర్చులతో సంసారమును నాశనము చేసికొనువానికి ఏమియు మిగులదు. అవివేకి జ్ఞానికి దాసుడు అగును.
30. ధర్మవర్తనము అను ఫలమునుండి జీవవృక్షము ఎదుగును. కాని జ్ఞానము కలవారు ఇతరులను రక్షించుదురు.
31. నీతిమంతులకు ఈ లోకముననే అన్న ప్రతిఫలము లభించును. దుష్టులు, పాపకర్ములు మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురుకదా?
1. దిద్దుబాటును అంగీకరించువాడు విజ్ఞానమును అభిలషించును. మందలింపులను అంగీకరింపనివాడు మూర్ఖుడు.
2. ప్రభువు సజ్జనుని ప్రీతితో చూచును. తంత్రములు పన్నువానిని నిరసించును.
3. దౌష్ట్యమువలన ఎవరికిని భద్రత కలుగదు. ధర్మమువలన నరుడు వ్రేళ్ళుపాతుకొనిన చెట్టువలె నిల్చును.
4. యోగ్యురాలైన భార్య తనభర్తకు కిరీటము వంటిది కాని మగనికి అపఖ్యాతి తెచ్చునది అతని ఎముకలలో పుట్టిన కుళ్ళు వంటిది.
5. సజ్జనుల ప్రణాళికలు ధర్మయుక్తములై ఉండును. కాని దుర్జనుల పన్నుగడలు మోసముతో నిండియుండును.
6. దుష్టుల మాటలు చావును తెచ్చిపెట్టును. సత్పురుషుల పలుకులు ఆపదలనుండి కాపాడును.
7. దుర్జనులు గతించిన తరువాత వారి సంతానము నిలువదు. సత్పురుషులు దాటిపోయిన తరువాత వారి కుటుంబములు కొనసాగును.
8. నరుని విజ్ఞానమును బట్టి అతనికి కీర్తి అబ్బును. మూర్ఖుని ప్రజలు నిర్లక్ష్యము చేయుదురు.
9. గొప్పవానివలె తిరుగుచు ఆకలితో చచ్చుటకంటె సామాన్యునివలె బ్రతుకుచు కడుపు కూడు సంపాదించుకొనుట మేలు.
10. సత్పురుషుడు తన పశువులను , దయతో చూచును. కాని దుష్టుడు వానిపట్ల నిర్దయతో ప్రవర్తించును.
11. ఒడలువంచి పొలము దున్నువానికి కరువులేదు. వ్యర్థ కార్యములతో కాలము వెళ్ళబుచ్చువానికి మతిలేదు.
12. దుష్టులు దుష్కార్యములనే చేయగోరుదురు. సజ్జనులు వ్రేళ్ళు పాతుకొనిన చెట్టువలె నిల్తూరు.
13. దుష్టుడు తన మాటలవలననే డుడు వలలో చిక్కుకొనును. కాని సజ్జనుడు చిక్కులనుండి బయటపడును.
14. నరుడు తన పలుకులవలన సంపదలు బడయును పనినిబట్టి ఫలితముండును.
15. మూర్ఖునికి తన కార్యమే మంచిదిగా తోచును. కాని జ్ఞాని ఇతరుల సలహాను వినును.
16. మూర్ఖుడు అవమానమును పొందినవెంటనే ఆ కోపము ప్రదర్శించును. కాని నీతిమంతుడు తనకు కలిగిన అవమానమును లెక్కచేయడు.
17. సత్యము చెప్పుటనగా న్యాయమును జరిగించుట బొంకులాడుటనగా అన్యాయమును పెంచుట.
18. కొందరి మాటలు బాకులవలె గ్రుచ్చుకొనును. కాని బుద్ధిమంతుల పలుకులు ఔషధమువలె మేలుచేయును.
19. సత్యము కలకాలము నిలుచును, అబద్ధము క్షణకాలము మాత్రము నిలుచును.
20. కుట్రలు పన్నువారు తమను తామే వంచించుకొందురు. మంచిని పెంచువారు ఆనందము పొందుదురు.
21. సన్మార్గులకు ఆపదలు వాటిల్లవు. దుర్మార్గులకు మాత్రము తిప్పలు తప్పవు.
22. అబద్దములాడు నరుని దేవుడు అసహ్యించుకొనును. నిజము పలుకువానిని ప్రీతితో చూచును.
23. బుద్ధిమంతుడు తన విద్యను బయటికి కన్పింపనీయడు. కాని శుంఠ తన అజ్ఞానమునెల్లరికి వెల్లడిచేయును.
24. కష్టించి పని చేయువాడు అధికారి అగును. కాని సోమరిపోతు బానిసయగును.
25. విచారమువలన నరుడు సంతోషము కోల్పోవును. కరుణాపూరిత వచనములవలన ఆనందము చేకూరును.
26. సజ్జనుడు తోడివానికి దారిచూపును. దుష్టునిత్రోవ వానినే పెడదారి పట్టించును.
27. సోమరిపోతునకు వేట చిక్కదు. శ్రమించి పనిచేయువానికి ఫలితమబ్బును.
28. ధర్మపథము జీవమునకు చేర్చును. దుష్టపథము మృత్యువునకు కొనిపోవును.
1. విజ్ఞత కలిగిన కుమారుడు తండ్రి దిద్దుబాటును అంగీకరించును. కాని పొగరుబోతు మందలింపును లెక్కచేయడు.
2. మంచివాడు తన వాక్కువలన సత్ఫలము అనుభవించును, చెడ్డవాడు దౌర్జన్యము చేయుటకే కాచుకొనియుండును.
3. నోటిని అదుపులో పెట్టుకొనెడివాడు జీవమును బడయును. తెగవాగెడివాడు బ్రతుకును కోల్పోవును.
4. సోమరిపోతు అన్నమును అశించునుగాని వానికి తిండి దొరకదు. కష్టించి పనిచేయువానికి అన్నియు సమృద్ధిగా లభించును.
5. సత్పురుషునకు కల్లలు గిట్టవు. కాని దుష్టుని పలుకులు అసహ్యముగాను అవమానకరముగాను ఉండును.
6. ధర్మము సజ్జనుని కాపాడును. అధర్మము దుష్టుని నాశనము చేయును.
7. కొందరు ఏమియు లేకున్నను సంపన్నులవలె నటింతురు. కొందరు చాల సిరిసంపదలున్నను పేదలవలె చూపట్టుదురు.
8. ధనవంతుడు స్వీయప్రాణమును కాపాడుకొనుటకు తన సొత్తును వెచ్చింపవలసియుండును. కాని పేదవాడు అట్టి బెదిరింపునే వినడు.
9. పుణ్యపురుషుని దీపము దేదీప్యమానముగా వెలుగును. దుష్టుని దీపము ఆరిపోవును.
10. పొగరుబోతుతనము తగవులను తెచ్చును. విజ్ఞతగలవాడు సలహానడుగును.
11. సులువుగా సొమ్ము చేసికొనువాడు త్వరలోనే పోగొట్టుకొనును. కష్టించి డబ్బు చేసికొనువాడు అధికముగా కూడబెట్టుకొనును.
12. కోరిక భగ్నమైనపుడు హృదయము క్రుంగిపోవును. కోరిక సిద్ధించినపుడు జీవనవృక్షము ఫలించినట్లగును.
13. ఉపదేశమును చిన్నచూపు చూచువాడు స్వీయనాశనమును తెచ్చుకొనును. దానిని పాటించువాడు భద్రముగా మనును.
14. జ్ఞానుల ఉపదేశములు జీవమొసగు జలధారవంటివి. వారి బోధలు మనలను మృత్యుపాశమునుండి రక్షించును.
15. విజ్ఞత మన్ననబడయును. విశ్వాసహీనత వినాశనము తెచ్చును.
16. విజ్ఞుడు ఆలోచనలతో పనిచేయును. మూర్ఖుడు తన అజ్ఞానమునెల్లరికిని ప్రదర్శించును
17. నమ్మగూడని రాయబారివలన కీడులు వాటిల్లును కాని విశ్వసనీయుడైన దూత మేలును చేకూర్చిపెట్టును,
18. దిద్దుబాటును ఒల్లనివానికి పేదరికము, అవమానము ప్రాప్తించును. మందలింపును పాటించువానికి గౌరవము చేకూరును.
19. కోరికలు ఫలించిన సంతసము కలుగును. దుష్కార్యములనుండి వైదొలగుట మూర్ఖునికి ఏవగింపు.
20. జ్ఞానితో చెలిమిచేయువాడు జ్ఞానియగును. మూర్ఖునితో స్నేహము చేయువాడు నాశనమగును.
21. ఆపదలు దుర్మార్గుల వెంటబడును, సత్పురుషులు శుభములు బడయుదురు.
22. సత్పురుషుని ఆస్తి తరతరములవరకు అతని వంశజులకే దక్కును. దుష్టుని సొమ్ము పుణ్యపురుషులకు దక్కును.
23. సేద్యము చేయని భూములలో పేదలు పంట పండించుకోవచ్చును. కాని అన్యాయపరులు ఆ పొలములను సాగుచేయనీయరు.
24. బెత్తమువాడని తండ్రి పుత్రుని ప్రేమించినట్లుకాదు తనయుని ప్రేమించు తండ్రి వానిని శిక్షించితీరును
25. పుణ్యపురుషుడు కడుపునిండ తినును. దుష్టుడు ఆకలితో చచ్చును.
1. వివేకవతులైన స్త్రీలు గృహములను నిర్మింతురు. కాని అవివేకవతులు వానిని కూల్చివేయుదురు.
2. సత్యవర్తనుడు దేవునికి భయపడును. దుష్టవర్తనుడు దేవుని లక్ష్యము చేయడు.
3. మూర్ఖుడినోట పొగరు అనెడి బెత్తము కలదు. కాని బుద్ధిమంతుని పెదవులు అతడికి కాపుదల అగును.
4. ఎడ్లు దున్ననిచో గాదెలు నిండవు. బలముగల ఎడ్లు దున్నినచో పంటలు సమృద్ధిగా పండును.
5. సత్యవాదియైన సాక్షి బొంకులాడడు, అబద్ధపు సాక్షి నిరతము కల్లలే పలుకును.
6. భక్తిహీనునకు జ్ఞానము అబ్బదు. వివేకికి సులువుగా విజ్ఞానము అలవడును.
7. మూర్ఖునకు దూరముగా నుండుము. అతని నుండి నీవు విజ్ఞానమును ఆర్జింపజాలవు.
8. తానేమి చేయవలయునో తనకు తెలియుటలోనే విజ్ఞుని విజ్ఞత ఉన్నది. కాని మూర్ఖుని అజ్ఞానము వానిని పెడత్రోవ పట్టించును.
9. మూర్ఖుడు తప్పుచేసియు పశ్చాత్తాపపడడు. కాని సత్పురుషుడు మన్నింపును పొందగోరును.
10. ఎవరి వ్యధ వారికే తెలియును. ఒకరి సంతోషమును అన్యులు పంచుకోజాలరు.
11. దుష్టుని ఇల్లు కూల్చివేయబడును. సజ్జనుని ఇల్లు దృఢముగా నిలుచును.
12. మంచి మార్గమువలె కన్పించునదికూడ కడకు మృత్యులోకమునకు కొనిపోవచ్చును.
13. మన సంతోషములోగూడ విషాదము మిళితమైయుండును. ఆనందము తరువాత దుఃఖము వచ్చును.
14. దుష్టుడు తన కార్యములకు తగిన ఫలమునే బడయును. సజ్జనుడు తన పనులకు బహుమతిని పొందును.
15. అమాయకుడు ఇతరులు చెప్పినదెల్లనమ్మును. తెలివిగలవాడు మంచిచెడ్డలు అరసిగాని అడుగువేయడు.
16. జ్ఞాని ముందుగనే జాగ్రత్తపడి అపాయమునుండి తప్పుకొనును. కాని మూర్ఖుడు నిర్లక్ష్యమువలన ప్రమాదమున చిక్కుకొనును.
17. కోపస్వభావుడు వెట్టిపనులు చేయును. కాని జ్ఞాని ప్రశాంత మనస్కుడుగా ఉండును.
18. మూర్ఖునకు మూర్ఖత్వమే దక్కును. కాని బుద్ధిమంతునికి విజ్ఞానకిరీటము అబ్బును.
19. దుష్టుడు శిష్టునికి దండము పెట్టవలయును. దుర్మార్గుడు సజ్జనుని ద్వారమువద్ద వేచియుండవలయును.
20. పేదవానిని ఇరుగుపొరుగువారు చీదరించుకొందురు. కలిమి కలవానికి చాలమంది మిత్రులు ఉందురు
21. పొరుగువానిని చిన్నచూపు చూచువాడు పాపము కట్టుకొనును. పేదసాదలను కరుణించువాడు సంతోషము అనుభవించును.
22. కీడు తలపెట్టువారు తప్పున కూరుదురు. మేలు తల పెట్టువారికి ఆదరాభిమానములు ప్రాప్తించును.
23. కష్టించి పనిచేసినచో సత్పలితము కలుగును. కబుర్లతో కాలము వెళ్ళబుచ్చిన లేమి అబ్బును.
24. జ్ఞానికి విజ్ఞానమే కిరీటము. మూర్ఖునికి మూర్ఖత్వమే శిరోభూషణము.
25. సత్యవాదియగు సాక్షి ప్రాణములు రక్షించును. అసత్యసాక్షి ప్రజలను మోసగించును.
26. దేవునిపట్ల భయభక్తులు కలవానికి చీకుచింత లేదు. అతని సంతతిని కూడ ప్రభువే రక్షించును.
27. దైవభయము జీవజలధారవంటిది. దానివలన మృత్యుపాశమునుండి తప్పించుకోవచ్చును.
28. ఎక్కువమందిని ఏలువాడు గొప్పరాజు. ప్రజలు లేనిచో రాజు చెడును.
29. శాంతమనస్కుడు జ్ఞాని. తొందరపాటు మనిషి వట్టిమూర్ఖుడు.
30. శాంతగుణమువలన ఆయురారోగ్యములు కలుగును. అసూయ ఎముకలలో పుట్టిన కుళ్ళువంటిది.
31. పేదవానిని పీడించువాడు అతనిని కలిగించిన సృష్టికర్తను అవమానించును. దరిద్రుని కరుణించువాడు దేవుని గౌరవించును.
32. దుష్టుడు తనదుష్కార్యములవలననే పతనమగును సజ్జనుని అతని ఋజువర్తనమే రక్షించును.
33. వివేకి హృదయములో విజ్ఞానము నెలకొనియుండును. కాని మూఢుని యెదలో జ్ఞానము నిలువదు.
34. ధర్మమువలన ప్రజలు వృద్ధిచెందుదురు. అధర్మమువలన అపకీర్తి తెచ్చుకొందురు.
35. సమర్థుడైన సేవకుడు రాజు మన్నన పొందును. కాని అసమర్థుడు ప్రభువు శిక్షకు గురియగును.
1. మృదువుగా మాట్లాడినచో కోపము చల్లారును. కటువుగా పలికినచో ఆగ్రహము హెచ్చును.
2. విజ్ఞుడు జ్ఞానముపట్ల ఆకర్షణ కలుగునట్లు మాట్లాడును. కాని మూర్ఖుడు మూర్ఖతనొలుకుచు మాట్లాడును.
3. ప్రభువు సమస్తమును పరికించును. నరులుచేయు మంచిచెడ్డలను గూడ గమనించును.
4. కరుణాపూరితముగా మాటలాడు జిహ్వ జీవవృక్షము వంటిది. కటువుగా మాట్లాడు నాలుక హృదయమును క్రుంగదీయును.
5. జనకుని మందలింపులను త్రోసిపుచ్చువాడు మూర్ఖుడు. అతని దిద్దుబాటును అంగీకరించువాడు వివేకి.
6. సజ్జనుని సంపదలు నిలుచును. కష్టకాలమున దుష్టుని సొత్తు నాశనమగును.
7. జ్ఞానమును వెదజల్లునది విజ్ఞులుగాని, మూర్ఖులు కాదు.
8. ప్రభువు దుష్టుని బలిని అసహ్యించుకొనును. సజ్జనుని ప్రార్థనవలన ప్రీతిచెందును.
9. దుష్టుని పోకడలు ప్రభువునకు నచ్చవు. ధర్మాత్ముని అతడు మెచ్చుకొనును.
10. సన్మార్గము తప్పిన వానికి కఠినమైన శిక్ష పడును. దిద్దుపాటును అంగీకరింపనివానికి చావుమూడును
11. ప్రభువు పాతాళలోకమునుగూడ పరిశీలించి చూచుననినచో నరుల హృదయములను పరీక్షింపడా!
12. భక్తిహీనుడు మందలింపులను అంగీకరింపడు, జ్ఞానిని సలహా అడుగడు.
13. ఆనందహృదయుని మనసు సంతోషముగానుండును దుఃఖ మనస్కుని వదనము దిగులుగానుండును.
14. వివేకి విజ్ఞానమును ఆర్జింపగోరును మూడునికి మౌడ్యము చాలును.
15. అభాగ్యునకు ప్రతిదినము కష్టదినమే. సంతోషచిత్తునికి సదా ఆనందపు విందే.
16. శ్రీమంతుడవైయుండి ఆందోళనకు గురియగుటకంటె, పేదవాడివై యుండి దైవభయము కలిగియుండుట మేలు.
17. ద్వేషముతో వడ్డించిన మెరుగైన మాంసాహారముకంటె ప్రేమతో పెట్టిన కందమూలములు మేలు.
18. కోపశీలుడు వివాదమును పెంచును. శాంతికాముడు కలహమును అణచును.
19. సోమరిపోతునకు మార్గమునిండ ముండ్లుండును. క్రియాశీలుని బాట రాచబాట.
20. విజుడైన కుమారుడు తండ్రికి ఆనందము చేకూర్చును. మూర్ఖుడైన పుత్రుడు తల్లిని తిరస్కరించును.
21. మూర్ఖునికి మూర్ఖత్వము నచ్చును. కాని జ్ఞానిధర్మము నాచరించును.
22. హితోపదేశము లేనిదే పథకములు ఫలింపవు. పెక్కుమంది హితబోధకులున్నచోట కార్యములు నెరవేరును.
23. అవసరమునకు తగిన జవాబు చెప్పినచో ఆనందము కలుగును. సమయోచితమైన సమాధానము సంతోషమును చేకూర్చును.
24. జ్ఞాని జీవమునకు చేర్చు, ఊర్ధ్వపథమున పోవునేగాని, పాతాళమునకు కొనిపోవు అధోమార్గమున పోడు.
25. ప్రభువు పొగరుబోతుని ఇల్లు నేలమట్టము చేయును. కాని ఆయన వితంతువు , పొలము గట్టులను కాపాడును.
26. ప్రభువు కుట్రలు పన్నువారిని అసహ్యించుకొనును. మనం సజ్జనుని సద్వాక్యములు ఆయనకు ప్రీతిని కలిగించును.
27. దురాశతో సొమ్ము చేసికొనువాని కుటుంబమునకు ఆపద తప్పదు. లంచము పుచ్చుకొననివాడు జీవము బడయును.
28. ధర్మాత్ముడు ఆలోచించిగాని మాట్లాడడు. ఆలోచనలేని దుష్టుని పలుకుల వలన ముప్పువచ్చును.
29. ప్రభువు దుష్టునికి దూరముగా నుండునుకాని అతడు సజ్జనుని వేడుకోలును ఆలకించును.
30. కన్నులకాంతి హృదికి సంతోషము కలిగించును. చల్లని వార్త ఎముకలకు పుష్టినిచ్చును.
31. దిద్దుపాటును అంగీకరించువాడు బుద్ధిమంతుల వర్గమున చేరును.
32. మందలింపును అంగీకరింపనివాడు తనకుతానే కీడు చేసికొనును. దిద్దుబాటును అంగీకరించువాడు వివేకము బడయును.
33. దైవ భయము వలననే విజ్ఞానమబ్బును. వినయమువలననే గౌరవము కలుగును.
1. నరుడు పథకములను సిద్ధము చేసికోవచ్చుగాక! ప్రత్యుత్తర మొసగునది మాత్రము ప్రభువే.
2. మన కార్యములు మనకు మంచివిగానే కన్పింపవచ్చును. కాని ప్రభువు మన ఉద్దేశములను పరిశీలించిచూచును.
3. దేవుని నీ కార్యక్రమములను దీవింపుమని వేడికొందువేని నీకు తప్పక విజయము కలుగును.
4. ప్రభువు ప్రతికార్యమును ఏదేనియొక ఉద్దేశముతోనే చేసెను. దుష్టుని శిక్షించినపుడును అతని ఉద్దేశము వమ్ముకాదు.
5. పొగరుబోతును ప్రభువు చీదరించుకొనును. అతడు దైవదండనము తప్పించుకోజాలడు.
6. దయ, విశ్వసనీయత ఉండెనేని దేవుడు తప్పులు మన్నించును. దైవభయము కలవాడు పాపమునుండి వైదొలగును
7. ప్రభువు ఎవనివలన ప్రీతిచెందునో వానికి శత్రువులుగూడ మిత్రులగునట్లు చేయును.
8. అన్యాయ మార్గమున చాలసొమ్మును ఆర్జించుట కంటె న్యాయమార్గమున కొంచెమే గడించుటమేలు.
9. నరుడుపథకములను సిద్ధము చేసికోవచ్చునుగాక! అతని కార్యక్రమములను నడిపించునది మాత్రము ప్రభువే.
10. రాజు దైవాధికారముతో తీర్పుచెప్పును. అతని తీర్పు తప్పు కాజాలదు.
11. తూనికలు కొలతలు సక్రమముగా నుండవలెనని ప్రభువు కోరిక. సక్రమముగా సరుకులను అమ్మవలెనని ఆయన ఆశయము.
12. చెడుచేయుట రాజులకు గిట్టదు. న్యాయము వలననే సింహాసనములు నిలుచును.
13. రాజు సత్యభాషణను కోరును. నిజము పలుకువానిని అతడాదరముతో చూచును.
14. రాజు కోపము మరణమును తెచ్చి పెట్టును కాని జ్ఞాని అతని ఆగ్రహమును ఉపశమింపచేయును.
15. రాజు ప్రసన్నుడయ్యెనేని జీవనమబ్బును. అతని అనుగ్రహము మధుమాస వర్షము వంటిది.
16. బంగారంకంటె విజ్ఞానమును ఆర్జించుట మెరుగు. వెండికంటె వివేకమును బడయుట మేలు.
17. సత్పురుషులు చెడుకు దూరముగా నడతురు. తన క్రియలను పరిశీలించి చూచుకొనువాడు ప్రాణములు కాపాడుకొనును.
18. పొగరుబోతుతనము వెనుక వినాశము నడచును. పతనమునకు ముందు గర్వము నడచును.
19. గర్విష్ఠుడైయుండి కొల్లసొమ్మును పంచుకొనుటకంటె వినయవంతుడైయుండి పేదగా బ్రతుకుట మేలు.
20. ఉపదేశమును ఆలించువాడు విజయమును చేపట్టును, ప్రభుని నమ్మువాడు సుఖములు బడయును.
21. విజ్ఞుడు వివేకశీలి అనబడును. మృదుభాషణములకు ఆకర్షణమెక్కువ.
22. జ్ఞానికి విజ్ఞానమే జీవమొసగెడి జలధార. మూర్ఖునికి మూర్ఖత్వమే శిక్ష.
23. విజ్ఞాని ఆలోచించిగాని మాట్లాడడు. కనుక అతని సంభాషణ ఆకర్షణీయముగా నుండును.
24. కరుణగల పలుకులు తేనెపట్టు వంటివి. అవి తీపిని, ఆరోగ్యమును చేకూర్చి పెట్టును.
25. నరులు సత్పలితమని నమ్మినదే కడకు మృత్యువునకు చేర్చును.
26. పనివాని ఆకలి అతనిని ప్రేరేపించును. ఆకలి తీర్చుకొనగోరి అతడు పనికి పూనుకొనును.
27. దుష్టుడు ఇతరులకు కీడుచేయు మార్గమును వెదకును. అతని పలుకులుకూడ నిప్పువలె కాల్చును.
28. కొండెగాడు కలహములు పెంచి మిత్రులను విడదీయును.
29. దుష్టుడు తోడివారిని మోసగించి అపమార్గము పట్టించును.
30. కన్నులు మూసికొనువాడు చెడును తల పెట్టును, పెదవులు కదపనివాడు కీడెంచును.
31. పుణ్యపురుషులు దీర్ఘాయుష్మంతులగుదురు. తలనెరయుట గౌరవప్రదమైన కిరీటమును బడయుటయే.
32. ఓర్పుగలవాడు వీరునికంటె ఘనుడు. నగరమును జయించుటకంటె తననుతాను గెలుచుట లెస్స.
33. దైవచిత్తము నెరుగుటకు ఓట్లు వేయుటకద్దు. కార్యనిర్ణయము చేయునది మాత్రము ప్రభువే.
1. జగడములతో కూడిన ఇంట పంచభక్ష్యములను ఆరగించుటకంటె, సమాధానముతో పిడికెడు పచ్చడి మెతుకులు తినుటమేలు.
2. కొడుకు కొరగానివాడైనచో తెలివిగల దాసుడు యజమానుడై తండ్రి ఆస్తిలో భాగము పంచుకొనును.
3. వెండిబంగారములను కుంపటి పరీక్షించును. నరుని హృదయమును ప్రభువు పరీక్షించును.
4. దుష్టులు దుష్టభావములను ఆలకింతురు. అబద్దీకుడు అసత్యభాషణములు వినును.
5. పేదవానిని గేలిచేయుట అతనిని సృజించిన దేవుని గేలిచేయుటయే. పరుల కష్టములనుచూచి సంతసించువాడు శిక్షను పొందును.
6. మనుమలు వృద్ధులకు గౌరవము, కుమారులకు తండ్రులే గౌరవము.
7. మూర్ఖుడు సుభాషితములు పలుకలేడు. ఉదాత్తునకు అబద్దమాడుట తగదు.
8. లంచము మంత్రమువలె పనిచేయును. అది సాధించి పెట్టని కార్యములేదు.
9. అన్యుని తప్పు కప్పియుంచువాడుమన్నన పొందును, ఆ తప్పును వెల్లడిచేయువాడు మిత్రులను విడదీయును.
10. మూర్ఖుడు నూరుదెబ్బలు కొట్టినను నేర్చుకొనలేనియంత, వివేకశీలి ఒక్కసారి మందలించినంతనే నేర్చుకొనును.
11. దుష్టుడు తిరుగుబాటునకే పూనుకొనును. కనుక క్రూరదూత వానిమీదికి వచ్చును.
12. పిల్లలను కోల్పోయిన ఎలుగుబంటినైన సమీపింపవచ్చుగాని మూర్ఖతతో తిరుగాడు మూడుని సమీపింపరాదు.
13. ఉపకారికి అపకారము చేయువాని ఇంటికి కీడు చుట్టుకొనును.
14. వివాదమునకు పూనుకొనుట, కట్టలో గండిపడుట వంటిది. దానిని మొదటనే ఆపివేయుట మేలు.
15. నిర్దోషులను దండించుట, దోషులను విడచిపుచ్చుట అను రెండు చెయిదములను ప్రభువు అసహ్యించుకొనును.
16. మూర్ఖునిచేత ధనమున్నను ప్రయోజనములేదు. తెలివిలేమిచే వాడా సొమ్ముతో విజ్ఞానమును ఆర్జింపడు.
17. స్నేహితుడు ఎల్లవేళల ఆదరముతో ప్రవర్తింపవలెను. ఆపదలలో ఆదుకొనుటకుగాకున్న సోదరుడు ఇక ఎందులకు?
18. తోడి నరునికి హామీగా ఉండువానికి బుద్ది ఇసుమంతయునులేదు.
19. వివాదమును కోరువాడు పాపమును కోరుకొనినట్లే. ఎల్లప్పుడు గొప్పలు చెప్పుకొనువాడు ఆపదలు తెచ్చుకొనును.
20. కుటిల హృదయునికి ఫలితమేమియుదక్కదు. మోసపుమాటలు పలుకువానికి నాశనము తప్పదు.
21. మూఢుని కనిన తండ్రి దుఃఖపూరితుడు అగును. మూర్ఖుని తండ్రికి సంతోషము ఎక్కడిది?
22. సంతోషచిత్తము మందువలె ఆరోగ్యమును చేకూర్చును. విషాద స్వభావము ఆరోగ్యమును నాశనము చేయును.
23. దుర్మార్గుడు దొంగచాటుగా లంచముపట్టి న్యాయము చెరచును.
24. వివేకశీలి తెలివితో పనికి పూనుకొనును. కాని బుద్దిహీనుని కన్నులు భూదిగంతములలో ఉండును.
25. మూర్ఖుడైన పుత్రుడు తండ్రి కడుపున చిచ్చుపెట్టును.తల్లికి దుఃఖము తెచ్చిపెట్టును.
26. నిరపరాధికి అపరాధము విధించుట న్యాయము కాదు. సత్పురుషుని శిక్షించుట ధర్మముకాదు.
27. తెలిసినవాడు అధికముగా మాట్లాడడు. వివేకి కోపమును అణచుకొనును.
28. మౌనముగానున్నచో అవివేకియు విజ్ఞునివలె చూపట్టును. పెదవులు విప్పనిచో మూర్ఖుడును వివేకివలె కన్పించును.
1. ఇతరులతో కలియక తనకు తాను జీవించువాడు స్వార్థపరుడు. అతడు ఇతరుల సలహాలను అంగీకరింపడు
2. మూర్ఖునికి విషయమును అర్థముచేసికోవలెనన్న కోర్కెలేదు. స్వీయజ్ఞానమును ప్రదర్శించుటకు మాత్రము సిద్ధముగా ఉండును.
3. దుష్టుడు రాగానే తిరస్కారము వచ్చును. అవమానము రాగానే నిందవచ్చును.
4. సముద్రమువలె అగాధమున పారు ఏరువలె నిర్మలమునై నరుని పలుకులు విజ్ఞాన సంభరితములై ఉండును.
5. దుష్టునికి పక్షపాతము చూపి, నిర్దోషికి న్యాయము జరిగింపకుండుట , ధర్మముకాదు.
6. వివాదమునకు పాల్పడిన మూర్ఖుడు దెబ్బలనాహ్వానించును.
7. మూఢుని పలుకులు స్వీయనాశనమును తెచ్చును. అతని మాటలే అతనికి ఉరులగును.
8. కొండెగాని మాటలు మధుర భక్ష్యములవలె సులువుగా మ్రింగుడుపడును.
9. పనిచేయని సోమరిపోతు వినాశమూర్తికి సాక్షాత్తు సోదరుడు.
10-11. ప్రభువు దివ్యనామము కోటవంటిది. పుణ్యపురుషులు దానిలోనికి ప్రవేశించి రక్షణము బడయుదురు. ధనవంతులుమాత్రము తమ సంపద తమను ఉన్నతమైన ప్రాకారమువలె సంరక్షించునని భ్రాంతిపడుదురు.
12. గర్వితునికి నాశనము తప్పదు. వినయమువలన గౌరవము అబ్బును.
13. ఇతరులు చెప్పునది సావధానముగా విని కాని జవాబు చెప్పకూడదు. . అటుల చేయనివాడు మూర్ఖుడు, పరులనవమానించిన వాడగును.
14. ఉత్సాహశక్తి కలవాడు వ్యాధిబాధలను సహించును. కాని ఆ శక్తియే నశించినచో ఇక జీవితమును భరించుటెట్లు?
15. వివేకికి తెలివి అబ్బును. జ్ఞాని సదా విజ్ఞానార్జనముకొరకు ఎదురు చూచుచుండును.
16. బహుమతివలన కార్యములు సమకూరును. దాని సాయముతో గొప్పవారినికూడ కలిసికోవచ్చును.
17. వివాదములో మొదట మాట్లాడినవాని పలుకులు న్యాయముగనే చూపట్టును. కాని ప్రత్యర్థి అతనిని ప్రశ్నింపగానే విషయము భిన్నముగా కన్పించును.
18. చీట్లు వేయుటచేత వివాదములు మానును. అది తీవ్ర కలహకారుల మధ్య పరిష్కారము చూపును.
19. తోడివాని సాయమును పొందినవాడు కోటవలె అభేద్యుడగును. కాని తోడివానితో కలహించినవాడు అతని సాయము పొందలేడు.
20. నాలుకను బట్టియే నరుని జీవితముండును. జిహ్వనుబట్టియే నరుని జీవిత విధానముండును.
21. జీవమును, మరణమునుగూడ నాలుక అధీనములోనున్నవి. నరుడు దానినెట్లు వాడుకొనునో అట్టి ఫలితమునే బడయును.
22. భార్యను బడసినవాడు పెన్నిధిని బడసినట్లే, ప్రభువు అనుగ్రహమును సంపాదించినట్లే.
23. పేదవాడు అడుగునపుడు దీనముగా బ్రతిమాలవలయును. కాని సంపన్నుడు జవాబు చెప్పునపుడు కర్కశముగా మాట్లాడును.
24. కొందరు మిత్రులు మనకు కీడుతెచ్చెదరు. కాని కొందరు సోదరులకంటె ఎక్కువ హితము చేకూర్చెదరు.
1. కల్లలాడు మూర్ఖునికన్న చిత్తశుద్ధితో జీవించు పేద మేలు.
2. ఆలోచనలేని ఉత్సాహము మంచిదికాదు. తొందరపడువాడు దారితప్పును.
3. కొందరు తెలివిలేమిచే తమకుతామే చెడిపోవుదురు అతని హృదయము ప్రభువునకు విరుద్ధముగా కోపగించుకొనును.
4. ధనవంతునికి ఎందరో మిత్రులు కలుగుదురు. పేదవానికున్న ఒక్క మిత్రుడు కూడ వీడిపోవును.
5. కూటసాక్షికి శిక్ష తప్పదు. అబద్దములాడువాడు తప్పించుకోలేడు.
6. అనేకులు ధర్మదాత కటాక్షముకొరకు వెదకుదురు. బహుమానములు ఇచ్చువానికి అందరును స్నేహితులే.
7. పేదవాని తోబుట్టువులే అతనిని చీదరించుకొందురనిన ఇక మిత్రులతనికి ఎంత దూరముగానుందురో వేరుగా చెప్పవలయునా?
8. విజ్ఞానము నార్జించువాడు తనకు తాను ఉపకారము చేసికొనును. వివేకమును బడయువాడు విజయము సాధించును.
9. కూటసాక్షికి శిక్ష తప్పదు, అబద్దములాడువానికి చావుమూడును.
10. మూర్ఖుడు సిరిసంపదలతో వైభవముగా జీవింపరాదు దాసుడు రాకుమారులను పాలించరాదు.
11. వివేకశాలి కోపము అణచుకొనును. ఇతరులు చేసిన అపకారమును విస్మరించుటయే అతడి గొప్ప.
12. రాజు కోపము, సింహగర్జనమువలె ఉండును. కాని అతని అనుగ్రహము గడ్డిమీద కురిసిన మంచువలెనుండును.
13. మూర్ఖుడైన పుత్రునివలన తండ్రి పేరు చెడును. భార్య సణుగుడు ఇంటికప్పులోనుండి కారు నీటిబొట్లవలెనుండును.
14. ఇల్లు, వాకిలి, ఆస్తిపాస్తులు తండ్రి తాతలనుండి వచ్చును. కాని వివేకవతియైన ఇల్లాలు ప్రభువు ప్రసాదించు వరము.
15. సోమరితనము నిద్రతెచ్చును. సోమరిపోతునకు ఆకలితప్పదు.
16. ప్రభువు ఉపదేశమును పాటించువాడు బ్రతుకును దానిని అనాదరము చేయువాడు మృత్యువు వాతబడును.
17. పేదలనాదుకొన్నచో ప్రభువుకే అప్పిచ్చినట్లు, ఆ అప్పును ఆయన తప్పక తీర్చును.
18. ప్రవర్తన మార్చుటకు కుమారుని శిక్షింపవలయును. కాని అతని నాశనమును కోరరాదు.
19. కోపస్వభావుడు తన శిక్షను తానే తెచ్చుకొనును. అతనిని ఆదుకొన్నచో నీకును తిప్పలువచ్చును.
20. పరుల హితోపదేశమును, దిద్దుబాటును అంగీకరించువాడు ఒకనాటికైనను జ్ఞానియై తీరును.
21. నరులు ప్రణాళికలు వేసికోవచ్చునుగాక, కాని దేవుని సంకల్పము నెరవేరితీరును.
22. మనిషిలో విశ్వసనీయత మెచ్చదగినది. అసత్యములు పలుకుటకంటె నిరుపేదగా ఉండుట మేలు.
23. దైవభీతిగల నరునికి జీవనమబ్బును. అతడు శాంతి సౌఖ్యములతో అలరారి కీడులనుండి వైదొలగును.
24. సోమరిపోతు భోజనపాత్రములో చేయిపెట్టునేగాని అందలి అన్నమును ఎత్తి నోట బెట్టుకొను యత్నమైనను చేయడు.
25. అహంకారిని శిక్షించినచో మూర్ఖులకు బుదివచ్చును. దిద్దుబాటువలన వివేకి జ్ఞానము తెచ్చుకొనును.
26. తండ్రిని బాధించువాడు, తల్లిని ఇంటినుండి గెంటివేయువాడు సిగ్గుమాలినవాడు, అపకీర్తి తెచ్చుకొనువాడుకూడ.
27. కుమారా! నీవు విజ్ఞానమును ఆర్జించుటను మానుకొందువేని పూర్వము నేర్చుకొన్నదికూడ అశ్రద్ధ చేయుదువు.
28. అన్యాయము తలపెట్టిన సాక్షి , న్యాయమును చెరచును. దుర్మార్గులకు దుష్టవర్తనమనిన పరమప్రీతి.
29. భక్తిహీనులకు తీర్పు తప్పదు. మూర్ఖుని వీపునకు దెబ్బలు తప్పవు.
1. ద్రాక్ష సారాయమువలన మత్తెక్కి వదరుబోతుతనము కలుగును. మూర్ఖులు దానిని మితిమీరి సేవించుదురు.
2. రాజు ఆగ్రహము సింహగర్జనమువలె ఉండును. రాజు కోపమును రెచ్చగొట్టువాడు తనచావును తానే తెచ్చుకొనును.
3. అల్పుడెవడైన జగడము లాడగలడు. తగాదాకు దూరముగా ఉండువాడే ఘనుడు.
4. ఋతువు వచ్చినను సేద్యము చేయనివాడు పంటకాలమున ఏమియు కోసికోజాలడు.
5. నరుని హృదయములోని ఆలోచనలు లోతుననున్న నీళ్ళవంటివి కాని వివేకి వానిని వెలికి తీయగలడు.
6. ఎల్లరును మేము నమ్మదగిన వారలమనియే చెప్పుకొందురు. కాని యథార్ధముగా విశ్వసనీయులైన వారెందరు?
7. ధర్మవర్తనుడైన పుణ్యపురుషుని బిడ్డలు నిక్కముగా ధర్మాత్ములు.
8. రాజు ధర్మాసనముమీద కూర్చుండి దౌష్ట్యమును నిర్మూలనము చేయును.
9. నా హృదయమును శుద్ధిచేసికొంటిని, "నా పాపములు వదిలించుకొంటినని ? ఏ నరుడు చెప్పగలడు.
10. దొంగ తూకములకు, దొంగ కొలతలకు పాల్పడువారిని ప్రభువు అసహ్యించుకొనును.
11. పసిబాలుడుకూడ తన చర్యలద్వారానే తాను మంచివాడగునో కాదో తెలియజేయును.
12. వినెడి చెవిని, కనెడి కంటిని ప్రభువే ప్రసాదించెను.
13. నిద్రాప్రియుడు దరిద్రుడగును. మేల్కొని పనికి పూనుకొనువానికి కడుపునిండ తిండి దొరకును.
14. కొనువాడు అమ్మువానితో అయ్యా! దీని వెల అధికమనును. కాని అతడే నేను లాభసాటి బేరముచేసితినని" పదిమందితో గొప్పలు చెప్పుకొనును.
15. బంగారమున్నది, ముత్తెములున్నవి. కాని జ్ఞానవాక్కే సుభూషణము.
16. అన్యునికి హామిగా ఉన్నవాని బట్టలు విప్పి ఆ అన్యుని తరపున కుదువసొమ్ముగా ఉంచుకోవలెను.
17. అన్యాయముగా సంపాదించిన సొమ్ము మొదట తీయగానే ఉండును. కాని అటుతరువాత అది ఇసుకను నమలినట్లుగానుండును.
18. నీ ప్రణాళికనుగూర్చి ఇతరులతో సంభాషింపుము. ముందుగా పథకము వేసికొనిగాని యుద్ధమునకు పోరాదు.
19. వాచాలుడు రహస్యములను దాచలేడు. వదరుబోతుకు దూరముగా ఉండుము.
20. తల్లిదండ్రులను శపించువాని దీపము కటిక చీకటిలో ఆరిపోవును.
21. సులువుగా ఆర్జించిన సొమ్ము కడన వంటబట్టదు.
22. అపకారికి ప్రత్యపకారము తలపెట్టవలదు. ప్రభుని నమ్మినచో అతడే నిన్ను కాపాడును.
23. దొంగతూకములకు, దొంగ కొలతలకు పాల్పడువారిని ప్రభువు అసహ్యించుకొనును.
24. నరుని నడిపించువాడు ప్రభువే! కానిచో మనుజునికి త్రోవ ఎట్లు తెలియును.
25. దేవునికి కానుకలిత్తునని బాస చేయకమునుపే జాగ్రత్త పడవలెను. లేనిచో ప్రమాణముచేసి పిదప చింతింపవలసివచ్చును.
26. తెలివిగల రాజు దుష్టులను సజ్జనులనుండి వేరుపరచి కఠినముగా దండించును.
27. మనలోని అంతరాత్మ దేవుడు పెట్టిన దీపము. అది మన అంతరంగమును పరిశీలించిచూచును
28. దయ విశ్వసనీయత రాజును కాపాడును. అతని సింహాసనము దయమీదనే నిల్చును.
29. యువకులకు గౌరవము బలము. వృద్ధులకు గౌరవము తలనెరపు.
30. తప్పు చేసినవానికి దెబ్బలు మంచి శిక్ష. దెబ్బలవలన నరుల మనసులోని బుద్ధులు మారును. అది మన సనీయత రామమీదనే నిల్చును
1. రాజు హృదయము పంటకాలువవలె ప్రభుని అధీనములోనుండును. దేవుడు దానిని తన ఇష్టము వచ్చినట్లు త్రిప్పును.
2. ఎవని కార్యములు వానికి ఉచితముగనే కన్పింపవచ్చును. కాని మనుష్యుని ఉద్దేశములను పరిశీలించి చూచువాడు ప్రభువు.
3. బలినర్పించిన దానికంటెగూడ అధికముగా నీతి న్యాయములవలన ప్రభువు ప్రీతిచెందును.
4. గర్వపుచూపు, అహంకారపు హృదయము దుష్టుల పాపములనవలెను.
5. జాగ్రత్తగా ఆలోచించి పనిచేసినచో చాలలాభము కలుగును. త్వరపడినచో ఫలితమబ్బదు.
6. అబద్దములాడి సొమ్ము చేసికొనినచో లాభములేదు అట్టిపనికి పూనుకొనువాడు చావుకోరలలో చిక్కుకొనును
7. దుష్టులు న్యాయమును పాటింపరు. కనుక తమ దౌష్ట్యమువలన తామే నాశనమగుదురు.
8. దుష్టుని మార్గము వక్రముగా ఉండును. సత్పురుషుని పథము ఋజువుగా ఉండును.
9. గొణిగెడు భార్యతో ఇంటిలో వసించుటకంటె ఇంటిమీద ఒక ప్రక్కన పడియుండుట మేలు.
10. దుర్మార్గునికెల్లపుడు చెడును చేయవలెననియే కోరిక. అతనికి తోడినరుని మీద దయపుట్టదు.
11. పొగరుబోతును శిక్షించినపుడు సామాన్యునికి కూడ బుద్ధివచ్చును. బుద్ధిమంతుడు ఉపదేశమునుండి జ్ఞానము నార్జించును.
12. దుష్టుల ఇండ్లలో ఏమి జరుగుచున్నదో న్యాయమూర్తియైన ప్రభువునకు తెలియును. ఆయన వారిని సర్వనాశనము చేయును.
13. పేదవాని మొరనాలకింపనివాడు అంత స్వయముగా మొర పెట్టినపుడు ఎవరును వినరు.
14. కోపపడిన వానికి చాటుగా బహుమానమిచ్చినచో ఆ కోపమెల్ల చల్లారును. ఒడిలోనుంచబడిన కానుక మహాక్రోధమును శాంతపరచును.
15. న్యాయము జరిగినప్పుడు. సత్పురుషుడు సంతసించునుండు కాని దుష్టుడు నిరాశ చెందును.
16. వివేకమార్గమును విడనాడువాడు మృతలోకమును చేరుకొనును.
17. సుఖప్రియులు దరిద్రులగుదురు. మద్యమును విశిష్ట భోజనమును కోరుకొనువాడు సంపన్నుడు కాలేడు.
18. ప్రభువు సజ్జనులను వదలి దుష్టులను శిక్షించును ఋజువర్తనులను వదలి మోసగాండ్రను దండించును.
19. కోపముతో సణుగుకొను భార్యతో కాపురము చేయుటకంటె ఎడారిలో వసించుట మేలు.
20. బుద్ధిమంతులు ధనధాన్యములను చేకూర్చుకొందురు. మూర్ఖులు దుబారా ఖర్చులతో సొమ్ము వ్యయము చేయుదురు.
21. దయను, సత్యమును పాటించువానికి దీర్ఘాయువు, పరులమన్నన, న్యాయము లభించును
22. బుద్ధిమంతుడు శత్రుసేనలు రక్షించు నగరమును స్వాధీనము చేసికొని, వారికాశ్రయములైయున్న ప్రాకారములను కూలద్రోయును.
23. నోటినదుపులో పెట్టుకొనువాడు ఆపదలనుండి తప్పించుకొనును.
24. పొగరుబోతునకు గర్వము, తలబిరుసుతనము ఎక్కువ. అతడు మిన్నంటిన అహంకారముతో తిరుగాడును.
25. సోమరిపోతు కోరికలే వానిని చంపివేయును. అతడు కష్టించి పనిచేయుటకు అంగీకరింపడు.
26. దుర్మార్గుడు నిరతము దురాశలలో మునిగి తేలుచుండును. సత్పురుషుడు మాత్రము ఉదారముగా ఇచ్చుచుండును.
27. దుష్టుడర్పించు బలిని భగవంతుడు అసహ్యించుకొనును. దుష్టవాంఛలతో అర్పించిన దానిని చీదరించుకొనును.
28. కూటసాక్షి కూలిపోవును సత్యము పలుకువాని మాటలను జనులు నమ్ముదురు.
29. దుర్మార్గుడు నటనచేసిగాని జనులను నమ్మింపలేడు. సత్పురుషునికి ఆత్మవిశ్వాసముండును.
30. దేవుడు అనుగ్రహించని విజ్ఞానము, వివేకము, హితోపదేశము ఎందుకును కొరగావు.
31. నరుడు గుఱ్ఱమును యుద్ధమునకు కు సిద్ధము చేయవచ్చుగాక, విజయము నొసగునది మాత్రము ప్రభువే.
1. మహాసంపదలకంటెను మంచిపేరు మిన్న. వెండి బంగారములు ఆర్జించుటకంటె ప్రజల గౌరవమును బడయుటమేలు.
2. దరిద్రులకు, ధనికులకు సామాన్య లక్షణము ఒకటి కలదు. ఆ యిరువురిని కూడ ప్రభువే సృజించెను.
3. వివేకి ఆపదను ముందుగనే పసిగట్టి దానినుండి తప్పించుకొనును. అవివేకి ఆపదలో కాలుపెట్టి తత్పలితమును అనుభవించును.
4. వినయము, దైవభీతి కలవాడు సంపదలు, గౌరవము, దీర్ఘాయువు బడయును.
5. దుష్టుని త్రోవ ముండ్లతో, ఉరులతో నిండియుండును. జీవితముపై ఆశగలవాడు ఆ త్రోవ తొక్కరాదు.
6. బాలునికి తాను నడువవలసిన మార్గమునుగూర్చి బోధించినచో పెరిగి పెద్దవాడైన పిదపగూడ ఆ త్రోవను విడనాడడు.
7. ధనికుడు పేదవానిని బానిసగా ఏలును, అప్పుపుచ్చుకొన్నవాడు ఇచ్చినవానికి తొత్తగును.
8. అన్యాయమును విత్తువాడు వినాశమునే కోసికొనును. అతడు సల్పు దుడ్డు కర్రవంటి పరపీడనము అంతమొందును.
9. తన భోజనమును పేదలకుగూడ వడ్డించు కరుణామయుడు దేవుని దీవెనలు పొందును.
10. పొగరుబోతును బహిష్కరించినచో జగడములు, వివాదములు, దూషణములు సమసిపోవును.
11. నిర్మల హృదయుని ప్రభువు ప్రేమించును. సంభాషణా చతురుడు రాజునకు స్నేహితుడగును.
12. ప్రభువు అసత్యవాదుల పలుకులను భంగపరచి సత్యమును భద్రముగా కాపాడును.
13. బయట సింహమున్నది, అది నన్ను వీధిలో చంపును అని సోమరిపోతు ఇల్లు కదలడు.
14. వ్యభిచారిణి సంభాషణము లోతైన గొయ్యివంటిది ప్రభువు చీదరించుకొనువాడు దానిలో కూలును.
15. బాలుని హృదయములో మూర్ఖత్వము సహజముగనే ఉండును. బెత్తమును ఉపయోగించినచో అది తొలగిపోవును.
16. దరిద్రులను పీడించి ధనవంతుడగువాడును . తన సంపదలను ధనవంతులకు ఒసగువాడును నష్టపోవును.
17. జ్ఞానుల సూక్తులను సావధానముగా వినుము. వారి బోధలను జాగ్రత్తగా గ్రహింపుము.
18. వీనిని జ్ఞప్తియందుంచుకొని కంఠత నేర్చుకొందువేని నీకు ఆనందము చేకూరును.
19. నీవు ప్రభువును విశ్వసించుటకుగాను నేను ఈ సూక్తులను ఇపుడు నీకు బోధింపబూనితిని.
20. విజ్ఞానమును, హితోపదేశమును ఒసగు సూక్తులను ముప్పదింటిని నేను నీ కొరకు లిఖించితిని.
21. ఈ వాక్యములు నీకు సత్యమును బోధించును. వీని సాయముతో నిన్ను పంపినవారికి నీవు తృప్తికరముగా జవాబు చెప్పగలవు. అవి ఇవి:
22. పేదవానికి అండలేదుగదా అని వానిని మోసగింపకుము. రచ్చబండ వద్ద నిస్సహాయుడై నిలిచియున్న దరిద్రుని అణగదొక్కకుము.
23. ప్రభువు పేదలకోపు తీసికొనును. వారిని పీడించువారిని తాను పీడించును.
24. కోపస్వభావునితో చెలిమి చేయవలదు. ఉగ్రస్వభావునితో కలిసి తిరుగవలదు.
25. అటు చేయుదువేని నీవు కూడ వాని అవలక్షణము అలవరచుకొని వినాశనము తెచ్చుకొందువు.
26. నీవు ఇతరులకు హామీగా ఉండవలదు ఇతరుల బాకీలకు నీవు పూచీపడవలదు.
27. నీవు ఆ ఋణములను చెల్లింపజాలవేని ఋణకర్తలు నీ పడకనుగూడ కొనిపోయెదరు.
28. పూర్వులు పాలించిన గట్టురాళ్ళను కదలింపకుము.
29. తన పనిని నైపుణ్యముతో చేయువాడు రాజులకు పరిచారకుడగునేగాని సామాన్య జనులను సేవింపడు.
1. నీవు గొప్పవానితో భోజనము చేయబోవునపుడు నీయెదుటనున్న భక్ష్యములను జాగ్రత్తగా గమనింపుము.
2. నీవు భోజన ప్రియుడవేని నిన్ను నీవు అదుపులో పెట్టుకొనుము.
3. నీవతని రుచికరమైన పదార్ధములకు అమితముగా ఆశపడవద్దు. అవి మోసపుచ్చు ఆహారములు.
4. ధనమును కూడబెట్టుకొనుటకు అమితముగా శ్రమింపవలదు. వివేకముతో ప్రవర్తింపుము.
5. నీవు చూచుచుండగనే నీ సొత్తు నిమిషములో వెళ్ళిపోవును. రెక్కలు వచ్చి లేచిపోయిన గరుడపక్షివలె ఎగిరిపోవును
6. పిసినిగొట్టువాని ఇంట విందు ఆరగింపవలదు, అతని ప్రశస్త భోజనమును ఆశింపవలదు.
7. అతడు ఇంకను కొంచెము భుజించుమని ఇచ్చకములు పలుకునేగాని వాని మాటలలో నిజము లేదు. అతడు తన గొప్పతనమును గూర్చి తాను తలంచుకొనుచుండును.
8. నీవు వాని ఇంట తిన్నదికూడ వెళ్ళగ్రక్కుకొందువు. అతనిపై నీవు కురియించిన పొగడ్తలు వ్యర్థమగును.
9. మూర్ఖునికి బోధింపగోరి నీ పలుకులను వ్యర్ధము చేసికోవలదు. నీ విజ్ఞాన వాక్యములను అతడు మెచ్చుకొనడు.
10. పూర్వులు పాతిన గట్టురాళ్ళను కదలింపకుము. అనాథల పొలములను ఆక్రమించుకొనకుము.
11. బలాడ్యుడైన ప్రభువు వారికోపు తీసికొనును. నిన్ను కాదని వారిని సమర్థించును.
12. ఉపదేశములను జాగ్రత్తగా వినుము. విజ్ఞాన వాక్యములను శ్రద్ధతో ఆలింపుము.
13. బాలుని శిక్షించుటకు వెనుకాడవలదు. బెత్తముతో కొట్టినచో వాడు చనిపోడు.
14. బెత్తముతో దండించినచో వానిని మృత్యులోకమునుండి తప్పింపవచ్చును.
15. కుమారా! నీవు జ్ఞానమును ఆర్జించినచో నేను ఆనందింతును.
16. నీవు సత్యవాక్యములు పలికినచో నా అంతరంగము ప్రమోదము చెందును.
17. దుష్టులను చూచి అసూయచెందకుము. ఎల్లవేళల నీవు దైవభక్తితో మెలగుము.
18. ఇట్లు చేయుదువేని భవిష్యత్తనునది ఉన్నది. కనుక నీ ఆశలు వమ్ముగావు.
19. కుమారా! నా పలుకులాలించి విజ్ఞానమును బడయుము. నీ జీవితవిధానమునుగూర్చి ఆలోచించి చూచుకొనుము.
20. నీవు త్రాగుబోతులతో కలియవద్దు. భోజనప్రియులతో కూడవద్దు.
21. త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులగుదురు. తిని, త్రాగి, తూలువారికి చీలికలు పేలికలు తప్పవు.
22. నీకు పుట్టుకనిచ్చిన తండ్రి పలుకులాలింపుము. నీ తల్లి వృద్దురాలైనపుడు ఆమెను ఆదరముతో చూడుము.
23. సత్యము, విజ్ఞానము, వివేకమనునవి ఆదరముతో కొనదగినవి, కాని చులకనచేసి అమ్మదగినవి కావు.
24. ధర్మాత్ముని కనిన జనకుడు సంతోషించును. జ్ఞానికి పుట్టుకనిచ్చిన తండ్రి ప్రమోదము చెందును.
25. నీవు నీ తండ్రికి ఆనందమును, నీ తల్లికి సంతసమును చేకూర్చుదువుగాక!
26. కుమారా! నా పలుకు లాలింపుము. నా ఉపదేశమును జాగ్రత్తగా వినుము.
27. కులట లోతయిన గొయ్యివంటిది. వ్యభిచారిణి బయటికెక్కి రాలేని బావివంటిది.
28. ఆమె నీ కొరకు దొంగవలె పొంచియుండును. ఆమె వలన మోసపోయిన వారనేకులు కలరు.
29. మందభాగ్యులును, విచారగ్రస్తులును ఎవరు? తగవులాడువారును, సంతృప్తి లేనివారును ఎవరు? అనవసరముగా దెబ్బలు తినువారెవరు? జేగురించిన కన్నులు కలవారెవరు?
30. నిరతము మితిమీరి మద్యమును సేవించువారు, సుగంధము కలిపిన మద్యమును గ్రోలువారు.
31. అది పానపాత్రమున ఎఱ్ఱగా నిగనిగలాడుచున్నను, సులువుగా గొంతులోనికి దిగి జారిపోవునదైనను నీవు దానికి భ్రమసి పోవలదు.
32. అంతయు అయిన తరువాత అది పామువలె కరచును. విషనాగమువలె కాటువేయును.
33. నీ కంటికి వింత దృశ్యములు కన్పించును. నీవు పిచ్చిమాటలు పలుకుదువు
34. నీకు సముద్రపుటలలమీద ఉయ్యాలలూగినట్లు ఓడలోని తెరచాప కొయ్యమీద తూలియాడినట్లు తోచును.
35. “వారు నన్ను కొట్టిరి కాబోలు, అయినను నాకు బాధ కలుగలేదు. నన్ను మోదిరి కాబోలు, అయినను నాకు జ్ఞప్తి లేదు నేను ఎప్పుడు మేలుకొందును? మేల్కొనగనే మరల గ్రుక్కెడు త్రాగెదను” అని నీవు ఏమేమో పలవరింతువు.
1. నీవు దుష్టులను చూచి అసూయ చెందవలదు వారితో చెలిమి చేయవలదు.
2. హింసకు పాల్పడవలెననియే వారి కోరికలు. దుష్కార్యములకు పూనుకోవలెననియే వారి పలుకులు.
3. ఇల్లు కట్టవలెనన్న విజ్ఞానము అవసరము. పునాదులెత్తవలెనన్న వివేకము ఉండవలెను.
4. ఇంటి గదులను అరుదైన ప్రశస్త వస్తువులతో నింపవలెనన్న తెలివితేటలు ఉండవలెను.
5. బలాఢ్యునికంటె జ్ఞాని మేలు. సత్తువకంటె తెలివి మిన్న.
6. మంచియత్నమువలన యుద్ధము గెలువవచ్చును. మంచి సలహా వలన విజయము సిద్ధించును.
7. విజ్ఞాన వాక్యములను మూర్ఖుడు అర్థము చేసికోలేడు. అతడు సభలో నోరువిప్పి మాట్లాడలేడు.
8. చెడును చేయుటకు పథకము వేయువానిని వంచకాగ్రేసరుడు అందురు.
9. మూర్ఖుడు పాపకార్యములుతప్ప మరేమియు తలపెట్టడు. ఇతరులను అపహసించు వానిని ప్రజలు అహ్యించు కొందురు.
10. ఆపదలో ధైర్యము కోల్పోవువాడు నిజముగా దుర్భలుడే.
11. అన్యాయముగా మరణశిక్షను పొందినవానిని విడిపించుటకు, వధకు కొనిపోవు వారిని రక్షించుటకు యత్నము చేయకుము.
12. అతడెవరో నాకు తెలియదని నీవు పలుకవచ్చును. కాని హృదయజ్ఞానియైన దేవుడు, నీ మనసును కనిపెట్టకపోడు. ఆయన నిన్ను పరిశీలించి చూచును, నిన్నెరుగును. నీ కార్యములను బట్టియే ఆయన నిన్ను బహూకరించును.
13-14. కుమారా! తేనెను భుజింపుము. అది తీయగానుండును. మన మధుకోశమునుండి చిమ్ము తేనె ? నాలుకకు రుచించినట్లే విజ్ఞానముకూడ హృదయమునకు ఇంపుగా నుండును. దానిని బడయుదువేని నీ భవిష్యత్తు బంగారుబాట అగును.
15. సజ్జనుని ఇల్లు దోచుకొనుటకై పొంచియుండు దుర్మార్గునివలె నీవు ప్రవర్తింపవలదు.
16. మంచివాడెన్నిసార్లు పడినా మరల పైకిలేచును. కాని దుర్మార్గుడు ఆపద వచ్చినపుడు సర్వనాశనమగును.
17. నీ శత్రువు పడిపోయినపుడు నీవు సంతసింపవలదు. అతడు కూలిపోయినపుడు నీవు పొంగిపోవలదు.
18. శత్రుపరాభవమునకు సంతసింతువేని ప్రభువు నిన్ను మెచ్చుకొనడు. అతడు నీ శత్రువును దండింపక వదలివేయవచ్చును గూడ.
19. దుష్టులనుచూచి సహనము కోల్పోవలదు. దుర్మార్గులను చూచి అసూయ చెందవలదు.
20. దుష్టునికి మంచి రోజులు లేవు. అతని దీపము గుప్పున ఆరిపోవును.
21. కుమారా! దేవునిపట్ల, రాజు పట్ల భయభక్తులు అలవరచుకొనుము. వారిద్దరిని ధిక్కరించరాదు.
22. అట్టివారు క్షణములో నాశనమగుదురు. దేవుడు, రాజు తమ విరోధులను సర్వనాశనము చేయుదురు.
23. ఈ క్రింది వాక్కులు కూడ విజ్ఞుల సూక్తులే: న్యాయాధిపతికి పక్షపాతము తగదు.
24. దోషిని నిర్దోషినిగా ప్రకటించినచో ఎల్లరును అతనిని అసహ్యించుకొందురు.
25. కాని దుష్టులను శిక్షించు న్యాయాధిపతులు అభ్యుదయమును, దీవెనలను బడయుదురు.
26. సత్యము చెప్పుట స్నేహమును పాటించితిమనుటకు గుర్తు.
27. మొదట నీ పొలములను సిద్ధము చేసికొని వానినుండి జీవనాధారము బడయుము. అటుపిమ్మట ఇల్లు కట్టుకొని కాపురముండుము.
28. తేలికగా తోడివానికి వ్యతిరేకముగా సాక్ష్యము పలుకవద్దు. అతనినిగూర్చి అపార్థము కలుగునట్లు మాట్లాడవలదు.
29. అతడు నాయెడల ప్రవర్తించినట్లే నేను వానియెడల ప్రవర్తింతును. వానికి తగిన శాస్తి చేసెదనని పలుకవలదు.
30. సోమరిపోతు, మూర్ఖుడైన ఒకానొక నరుని పొలము ప్రక్కగాను, ద్రాక్షతోట ప్రక్కగాను నేను నడచివెళ్ళితిని.
31. ఆ పొలమునిండ ముండ్లు, కలుపు . ఎదిగియుండెను దానిచుట్టునున్న రాతిగోడ కూలిపోయెను.
32. నేను ఆ పొలమును చూచి ఆలోచింప మొదలిడితిని.ఆ పొలము వైపు చూడగా నాకు ఈ గుణపాఠము తట్టినది.
33. కొంచెము సేపు నిద్రింపుము, కొంచెము సేపు కునికిపాట్లు పడుము, కొంచెము సేపు చేతులు ముడుచుకొని విశ్రాంతి తీసికొనుము.
34. ఈ మధ్యలో దారిద్య్రము దొంగవలెను, సాయుధుడైన దోపిడికానివలెను వచ్చి నీ మీద పడును.
1. ఈ క్రిందివి కూడ సొలోమోను సూక్తులే. వీనిని యూదా రాజగు హిజ్కియా ఆస్థాన పండితులు ఎత్తి వ్రాసిరి:
2. విషయములను మరుగుచేయుట దేవుని మహిమ. సంగతులను శోధించుట రాజుల ఘనత.
3. ఉన్నతమైన ఆకాశమువలె, అగాధమైన భూమివలె రాజుల హృదయములుకూడ ఎరుగశక్యముకానివి.
4-5. వెండినుండి మష్ఠు తొలగించినచో అది శుద్ధిని పొంది తళతళలాడును. రాజు కొలువులోనుండి దుర్మార్గులను తొలగించినచో అతని రాజ్యము ధర్మబద్దమై వెలయును.
6-7. రాజు ఎదుట గొప్పవాడవుగా కన్పింపవలదు. అధికుని యెదుట మీ గొప్పలు ప్రదర్శింపవలదు. నీవు ఇటు పైకిరమ్మని పిలిపించుకొనుట గౌరవము. కాని నీ ఆసనమును మరియొకనికిమ్మని అనిపించుకొనుట అవమానకరము.
8. నీవు నీ కంటితో ఏ కార్యమునైన చూచినచో త్వరపడి న్యాయస్థానమున అభియోగము తేవలదు. అచటెవరైన సాక్షి నిన్ను ప్రతిఘటించినచో నీవేమి చేయుదువు?
9-10. నీవును నీ పొరుగువాడును కలహించినచో మీ వాదములు మీరు పరిష్కరించుకోవలయునేగాని నీవతని ఇతర రహస్యములను పొక్కనీయరాదు. లేనిచో రహస్యములు దాచలేనివాడవని లోకులు నిన్ను నిందింతురు.
11. ఉపయుక్తముగా పలుకబడిన మాట వెండిపళ్ళెరమున ఉంచబడిన బంగారు పండ్లవలెనుండును.
12. వినయవిధేయతలు గలవారికి పెద్దవారి మందలింపులు బంగారపు ఉంగరమువలెను, శ్రేష్ఠమైన సువర్ణాభరణమువలెను విలువైనవి.
13. కోతకాలపు బెట్టలో కురిసిన మంచువలె నమ్మదగిన దూత తనను పంపినవారికి ఆహ్లాదము చేకూర్చును.
14. నరుడు వాగ్దానముచేసి వస్తువులను ఈయకుండుట మబ్బు గాలి ఆర్బాటము చేసియు వాన కురియకుండుట వంటిది.
15. శాంతవచనములతో రాజునుగూడ ఒప్పింపవచ్చును. మృదువైన జిహ్వ గట్టియెముకనుగూడ విరుగగొట్టును.
16-17. తేనెనుగూడ మితము మీరి భక్షింపరాదు. భక్షించినచో వాంతి అగును. అట్లే పొరుగువాని ఇంటికి కూడ మాటిమాటికి వెళ్ళరాదు. వెళ్ళినచో అతనికి విసుగెత్తి నిన్ను చీదరించుకొనును.
18. తోడివారి మీద అబద్దసాక్ష్యములు చెప్పువాడు కత్తివలె, గదవలె, వాడి బాణమువలె హానికరుడు.
19. ఆపదలో నమ్మగూడని వానిమీద ఆధారపడుట పిప్పిపంటితో నములుట వంటిది, కుంటికాలితో నడచుట వంటిది,
20. విచారముగా ఉన్నవానియెదుట పాటలు పాడుటవంటిది, చలిగానున్నపుడు చొక్కాయిని తీసివేయుటవంటిది, పుండుమీద కారము చల్లుటవంటిది.
21-22. నీ శత్రువులు ఆకలిగొనియున్నచో అన్నము పెట్టుము. దప్పికగొనియున్నచో దాహమిమ్ము. . అటులచేసినచో నీవతనిని అవమానమున ముంచినట్లగును. ప్రభువు నిన్ను బహూకరించును.
23. ఉత్తరపుగాలివలన వాన తప్పకవచ్చును. చాడీలు చెప్పుటవలన కోపము తప్పకకలుగును.
24. సణుగుకొను భార్యతో కాపురము చేయుటకంటె ఇంటిమిద్దెమీద ఒకప్రక్కన పడియుండుట మేలు.
25. దప్పికగొనినవానికి చల్లని నీరెట్లో, దూరదేశమునుండి వచ్చిన చల్లని కబురట్లు
26. సత్పురుషుడు దుష్టునికి చిక్కి భ్రష్టుడగుట చెలము ఎండిపోవుట వంటిది, బావి మలినమగుట వంటిది.
27. తేనెను మితముమీరి ఆరగించుట మంచిదికాదు. అధికముగా పొగడ్తను బడయుటకూడ మేలుకాదు.
28. తనను తానదుపులో పెట్టుకోలేనివాడు, ప్రాకారములు లేకుండ రక్షణను కోల్పోయిన నగరము వంటివాడు.
1. ఎండ కాలమునకు మంచును, పంటకాలమునకు వానయు తగనట్లే మూర్ఖునకు గౌరవమర్యాదలు తగవు.
2. దోషులుకానివారి మీద కురిపించిన శాపవచనములు దాటిపోవు పిచ్చుకలు, వాన కోవెలలవలె ఎగిరిపోవునేగాని హానిచేయవు.
3. గుఱ్ఱమునకు కొరడా, గాడిదకు కళ్ళెము, మూర్ఖుని వీపునకు బెత్తమవసరము.
4. మూర్ఖుడడిగెడి మూర్ఖపు ప్రశ్నలకు జవాబు చెప్పకూడదు. చెప్పినచో మనమును వాని వంటి వారలము అగుదుము.
5. మూర్ఖుడడిగెడి వెఱ్ఱి ప్రశ్నలకు వెఱ్ఱి జవాబులనే చెప్పవలయును. లేకున్నచో వాడు తాను తెలివైనవాడననుకొని విఱ్ఱవీగును.
6. మూర్ఖుని దూతగా పంపువాడు తనకుతానే కాళ్ళు విరుగగొట్టుకొని విషము గ్రోలినట్లు.
7. కుంటివాడు తన కాళ్ళను వినియోగించుకోలేనట్లే మూఢుడు సుభాషితమును ఉపయోగించుకోలేడు.
8. మూర్ఖుని పొగడుట ఒడిసెలలో రాతిని గట్టిగ బిగించుట వంటిది.
9. మూర్ఖుని నోట సుభాషితము త్రాగుబోతు చేతికి ముల్లు గ్రుచ్చుకొనినట్టులు.
10. మూర్ఖుని వినియోగించుకొను యాజమానుడు దారిన పోవువారినెల్ల బాణములతో కొట్టు విలుకాని వంటివాడు.
11. కుక్క తాను కక్కిన కూటికివలె, మూర్ఖుడు తన మూర్ఖపు పనులకు మరలును.
12. నేను తెలివికలవాడను అనుకొను వానికంటె తిక్కలవాడు మెరుగు.
13. సోమరిపోతు "దారిలో సింహమున్నది, వీధిలో సింహమున్నది” అని పలుకును.
14. తలుపు తన బందులమీద తిరిగినట్లే సోమరిపోతును పడుకమీద దొర్లును.
15. సోమరిపోతు కంచములో చేయిపెట్టును కాని, అన్నమునెత్తి నోటబెట్టుకొనుట కష్టమనుకొనును.
16. సహేతుకముగా జవాబుచెప్పు జ్ఞానులు ఏడుగురికంటె, సోమరిపోతు తానధికుడను అనుకొనును.
17. ఇతరుల తగవులలో తలదూర్చుట దారినబోవు కుక్క చెవులను పట్టుకొనుట వంటిది.
18-19. పొరుగువానిని మోసగించి నవ్వులాటకు అటుల చేసితినిలే అనెడివాడు మరణప్రదమైన బాణములను, నిప్పుకొరవులను విసరెడి పిచ్చివానితో సమానము.
20. కట్టెలు లేనిచో మంటలారిపోవును. కొండెగాడు లేనిచో కలహములు అంతరించును.
21. నిప్పులకు బొగ్గులు, మంటలకు కట్టెలు, జగడములకు కలహప్రియుడును అవసరము.
22. కొండెగాని పలుకులు రుచిగల పదార్ధములవలె శ్రోతలకు సులువుగా మ్రింగుడుపడును.
23. దుష్టహృదయుని పెదవులు రంగుపూసిన మట్టికుండవలె బయటికి నిగనిగలాడును.
24. కపటాత్ముడు తన హృదయములోని ద్వేషమును ఇచ్చకపు మాటలతో కప్పివేయును.
25. అట్టివాని మాటలు సొంపుగావున్నను వానిని నమ్మకూడదు. అతడి యెదలో దుష్టత్వము గూడుకట్టుకొనియుండును.
26. అతడు తన ద్వేషమును మోసముతో కప్పిపుచ్చవచ్చుగాక! వాని దుష్కార్యములను మాత్రమెల్లరును గ్రహింతురు
27. ఎవడు త్రవ్విన గోతిలో వాడే పడును. ఎవడు దొర్లించిన రాయి వానిమీదికే దొర్లును.
28. ఎవనికి కల్లలు చెప్పుదుమో వానిని ద్వేషించినట్లు. ముఖస్తుతి మాటలు వినాశనమునే తెచ్చిపెట్టును.
1. రేపటి దినమునుగూర్చి ప్రగల్భములు పలుకవలదు. నేడేమి జరుగనున్నదో నీకు తెలియదు.
2. ఇతరులు నిన్ను పొగడవచ్చు. కాని నిన్ను నీవే పొగడుకోగూడదు. పరులు నిన్ను స్తుతింపవచ్చును. కాని ఆత్మస్తుతి పనికిరాదు.
3. రాయి బరువు, ఇసుక భారము. కాని మూర్ఖుని వలన కలుగు బాధ మరింత ఎక్కువ బరువు ఉండును.
4. కోపము, క్రూరత్వము వినాశప్రదమైనవి. కాని అసూయ వానికంటె ఘోరమైనది.
5. బయటికి కన్పింపనీయని ప్రేమకంటె బహిరంగముగా మందలించుట మెరుగు.
6. మిత్రుడు కొట్టి, గాయపరచినను పరవాలేదు. కాని శత్రువు ముద్దు పెట్టినను నమ్మకూడదు.
7. కడుపు నిండిన తరువాత తేనె కూడ సహింపదు. ఆకలిగా ఉన్నపుడు చేదు కూడ తీయగా ఉండును.
8. ఇంటినుండి ఎక్కడికైన వెళ్ళినవాడు గూటినుండి ఎగిరిపోయిన పక్షితో సమానము.
9. సుగంధ ద్రవ్యములు, పరిమళతైలము ముదము చేకూర్చును. కాని ఆపదలు హృదయశాంతిని నాశనముచేయును.
10. నీ స్నేహితునిగాని, నీ తండ్రి స్నేహితునిగాని విస్మరింపవలదు. ఈ అపదలు వచ్చినపుడు నీ సోదరునివద్దకు పరుగెత్తవలదు. దూరమున ఉన్న సోదరునికంటె దగ్గరున్న మిత్రుడు మెరుగు.
11. నాయనా! నీవు విజ్ఞానము నార్జించినచో నా హృది సంతసించును. నన్ను విమర్శించువారికి ధైర్యముగా జవాబు చెప్పగలుగుదును.
12. జ్ఞాని ఆపదను ముందుగానే పసికట్టి దానినుండి తప్పుకొనును. కాని మూర్ఖుడు ఆపదలో కాలుబెట్టి, నాశనము తెచ్చుకొనును.
13. అన్యునికి హామీగా ఉన్నవాని బట్టలువిప్పి, ఆ అన్యుని తరపున కుదువ సొమ్ముగా ఉంచుకోవలెను.
14. ప్రాతఃకాలమున బిగ్గరగా పొరుగువానిని దీవించువాని దీవెన వానికి శాపముగా యెంచబడును.
15-16. గయ్యా ళి భార్య సణుగుడు, వానరోజున ఎడతెగక చినుకులు పడినట్లుగా ఉండును. గాలిని ఆపుటగాని, చమురును గుప్పిట పట్టుటగాని ఎంత కష్టమో ఆమె నోరు మూయించుటయు అంత కష్టము.
17. ఇనుమునకు ఇనుముతో పదును పెట్టినట్లే నరుడు తోడినరుని పరిచయము వలన సునిశితుడగును.
18. అత్తిచెట్టును పెంచినవాడు దానిపండ్లను ఆరగించును. యజమానుని సేవించు 'బంటుకు ఘనత చేకూరును.
19. నీటిలో ముఖము ఎట్లు ప్రతిబింబించునో అట్లే ఒకని మనస్సు ఎదుటివాని మనస్సునకు కనబడును.
20. పాతాళలోకమునకు, నాశనమునకు తృప్తిలేదు. నరుని ఆశలకును అంతములేదు.
21. వెండి బంగారములను కుంపటిలో పరీక్షింతుము. నరుని పొగడ్త ద్వారా పరీక్షింతుము.
22. మూర్ఖుని రోటిలో పెట్టి దంచినను వాని మూర్ఖత్వము తొలగింపజాలము.
23-27. నీ గొఱ్ఱెల మందలను జాగ్రత్తగా చూచుకొనుము. నీ పశుల మందలను చక్కగా కాపాడుకొనుము. సంపదలు కలకాలము నిలువవు. రాజ్యములుకూడా శాశ్వతముగా కొనసాగవు. మొదట నీ పొలములోని గడ్డి కోసికొనుము. అది మరల పెరుగుచుండగా కొండ ప్రక్కనున్న గడ్డి కోసుకొనుము. గొఱ్ఱెల ఉన్నినుండి నీవు బట్టలు నేసికోవచ్చును. కొన్ని మేకలను అమ్మి పొలము కొనవచ్చును. మిగిలిన మేకల పాలు నీకును, .నీ కుటుంబమునకును, నీ పనికత్తెలకునుగూడ సరిపోవును.
1. ఎవరు తరుమక పోయినను దుష్టుడు పరుగెత్తును. కాని సత్పురుషుడు సింహమువలె ధైర్యముగా ఉండును.
2. దేశమున తిరుగుబాటువలన రాజు తరువాత రాజు రాజ్యమేలుదురు. తెలివిగల నాయకుడు దొరకినపుడు రాజ్యము స్థిరపడును.
3. పేదలను పీడించు పేదవాడు ఉధృతముగా కురిసి పంటలను నాశనముచేయు వానవంటివాడు.
4. ధర్మవిధులను పాటింపనివాడు దుష్టుల కోపు తీసికొనును. పాటించువాడు వారిని నిరాకరించును.
5. దుష్టులకు న్యాయమనగానేమో తెలియదు. ప్రభువుపట్ల భయభక్తులు కలవారికి న్యాయము బాగుగా తెలియును.
6. ధనికుడుగానుండి అధర్మపరుడు అగుటకంటె పేదవాడుగానుండి ధర్మాత్ముడగుట మెరుగు.
7. వివేకియైన కుమారుడు ధర్మశాస్త్రమును పాటించును. భోజన ప్రియులతో చెలిమిచేయు పుత్రుడు తండ్రికి అపకీర్తి తెచ్చును.
8. వడ్డీలతో సొమ్ము చేసుకొనువాని సొత్తు అన్యుని పాలుకాగా అతడు దానిని పేదలకు వెచ్చించును.
9. ధర్మశాస్త్రమును విననొల్లనివాడు ప్రార్థననుకూడ అసహ్యించుకొనును.
10. మంచివారిని మభ్య పెట్టి వారిచే దుష్కార్యము చేయించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును. సత్పురుషులు సంపదలను బడయుదురు.
11. ధనవంతుడు తాను తెలివికలవాడను అనుకొనును. కాని వివేకముగల పేదవాడు వాని గుట్టు బయటపెట్టును.
12. ధర్మాత్ములు అధికారములోనికి వచ్చినపుడు ప్రజలు సంతసింతురు. కాని దుష్టులు పాలించునపుడు ప్రజలు భయముతో దాగుకొందురు.
13. తన పాపములను కప్పిపెట్టుకొనువాడు బాగుపడడు ఆ పాపములను ఒప్పుకొని వానిని పరిత్యజించువాడు . దేవుని దయ పొందును.
14. దేవునిపట్ల భయభక్తులు కలవాడు సుఖము బడయును. గుండె రాయిచేసికొనువాడు నాశనమగును.
15. గర్జించు సింహమును, ఎరకొరకు తిరుగులాడు ఎలుగును ఎట్టివో పేదలమీద అధికారమునెరపు దుష్టపాలకుడట్టివాడు
16. అవివేకియైన పాలకుడు ప్రజలను పీడించి పిప్పిచేయును. అధర్మమును ఏవగించుకొనువాడు చిరకాలము పాలించును.
17. నరుని హత్య చేసినవాడు . తన సమాధిని తానే త్రవ్వుకొనును. అతడికెవరును అడ్డము పోనక్కరలేదు.
18. ధర్మబద్దముగా జీవించువాడు సురక్షితముగా మనును. అధర్మపరుడు పతనమైపోవును,
19. కష్టపడి సేద్యము చేయువానికి కడుపునిండ కూడు దొరకును. సోమరితనముతో కాలము వెళ్ళబుచ్చువాడు పేదరికమున మ్రగ్గును.
20. చిత్తశుద్ధిగల నరుడు దీవెనలు బడయును. త్వరత్వరగా డబ్బు కూడబెట్టుకోగోరువారు శిక్షననుభవింతురు.
21. పక్షపాతము చూపుట ధర్మముకాదు. కొందరు రొట్టెముక్క కొరకే అన్యాయము చేయుదురు.
22. ఆశపోతు త్వరత్వరగా డబ్బు కూడబెట్టుకోగోరును. కాని లేమి తన వెంటబడుచున్నదని అతనికి తెలియదు.
23. ఇతరుని మందలించువాడు . తుదకు అతనిని పొగడినవానికంటె ఎక్కువ మన్ననబడయును.
24. తల్లిదండ్రుల సొత్తును అపహరించుటలో తప్పులేదనుకొను సుతుడు దోచుకొనువానితో సమానము.
25. ఆశపోతులు కలహములు తెచ్చుదురు. ప్రభువును నమ్మువాడు అభ్యుదయములు బడయును.
26. తన అభిప్రాయముల ప్రకారము పోవువాడు మందమతి. జ్ఞానుల బోధనలను చేకొనువాడు సురక్షితముగా మనును.
27. పేదలకు ఇచ్చువాడు లేమికి గురికాడు. ఆ దరిద్రులను కన్నెత్తి చూడని వానిని దున ఎల్లరును శపింతురు.
28. దుర్మార్గులు పాలించునపుడు ప్రజలు భయముతో దాగుకొందురు ఆ దుష్టులు పడిపోగానే ఈ ధర్మాత్ముల సంఖ్య పెరిగి మరల రాజ్యమేలుదురు.
1. ఎన్నిసార్లు మందలించినను, హృదయము మార్చుకొననివాడు తలవని తలంపుగ, మరల కోలుకొనని రీతిగ నాశనమగును.
2. సత్పురుషులు పాలనము చేయునపుడు , ప్రజలు సంతసింతురు కాని దుష్టులు పాలించునపుడు జనులు మూలుగుదురు.
3. విజ్ఞాన ప్రియుడైన పుత్రుడు తండ్రిని సంతసింపజేయును వేశ్యలవెంట తిరుగువాడు సొమ్ము వ్యర్ధముచేయును
4. రాజు న్యాయము పాటించునేని రాజ్యము స్థిరపడును అతడు దోచుకొనువాడు అయ్యెనేని రాజ్యము గుల్ల అగును.
5. ప్రక్క వానిని పొగడువాడు, అతడి కాళ్ళకు వల పన్నుకొనును.
6. దుర్మార్గులు తాముతవ్విన గోతిలో తామేకూలుదురు నీతిమంతులు సంతోషముతో మనుదురు.
7. సత్పురుషుడు పేదవాని అక్కరలను గుర్తించును. కాని దుర్మార్గునకు ఆ పరిజ్ఞానము ఉండదు.
8. దుష్టులు పట్టణమంతట కలవరము పుట్టింతురు కాని జ్ఞానులు ప్రజల కోపమునణచి శాంతిని నెలకొల్పుదురు.
9. విజ్ఞుడు మూర్ఖుని మీద నేరము తెచ్చినచో గెలువజాలడు. మూర్ఖుడు అతనిని అపహసించి దూషించును.
10. నరహంతలు సత్పురుషుని ద్వేషింతురు. కాని సజ్జనులు అతనిని అభిమానింతురు.
11. మూర్ఖుడు తన కోపమును బయటికి చూపును. కాని విజ్ఞుడు శాంతముతో దానినణచుకొనును.
12. రాజు నీలివార్తలు వినువాడైనచో మంత్రులెల్లరు కొండెములు పలుకుదురు.
13. పేదవానికి, వానిని పీడించువానికిగూడ కనులకు వెలుగునిచ్చువాడు ప్రభువే.
14. పేదలకు న్యాయము జరిగించు భూపతి బహుకాలము పాలనము చేయును.
15. దండనము, మందలింపు బాలునికి బుద్దిగరపును. విచ్చలవిడిగా తిరుగు కుఱ్ఱడు తల్లికి అపకీర్తి తెచ్చును.
16. దుర్మార్గులు పాలించినపుడు పాపము విజృంభించును. కాని ధర్మాత్ములు ఆ దుష్టుల పతనమును కన్నులార చూతురు.
17. నీ కుమారుని చక్కదిద్దినచో నీకతడివలన సంతృప్తి కలుగును. అతనిని చూచి నీవు సంతసింతువు.
18. దైవోక్తి లేని తావును ప్రజలు హద్దుమీరి ప్రవర్తింతురు. దైవాజ్ఞలను పాటించు నరులు ధన్యులు
19. బానిస వట్టి మాటలకు లొంగడు. వాడు మన మాటను అర్థము చేసికొనినను దానిని పాటింపడు.
20. ఆలోచన లేక త్వరపడి మాట్లాడువానికంటె, పరమ మూర్ఖుడు మెరుగు.
21. బానిసను చిన్నప్పటినుండి గారాబముగా పెంచినచో తుదకు కుమారుడుగానెంచబడును.
22. కోపిష్టి తగవులు తెచ్చి పాపము పెంచును.
23. గర్వాత్ముడు మన్నుగరుచును. వినయాత్ముడు గౌరవమును బడయును.
24. దొంగతో పోవు తోడిదొంగ తనకుతానే శత్రువు, వాడు ఇతరుల శాపవచనములు ఆలకించియు నిజము చెప్పజాలడు.
25. లోకమునకు భయపడువాడు చేటు తెచ్చుకొనును. ప్రభువును నమ్మినవాడు సురక్షితముగా మనును.
26. అందరు రాజు మన్నన కోరుదురు. కాని న్యాయము జరిపించువాడు దేవుడు ఒక్కడే.
27. సత్పురుషులు దుష్టులను అసహ్యించుకొందురు. అట్లే దుష్టులును సత్పురుషులను చీదరించు కొందురు.
1. మస్సా నివాసియు, యాకె కుమారుడైన ఆగూరు సూక్తులు: ఆ మనుష్యుడు ఈతీయేలునకు, ఈతీయేలు దక్కాలునకు చెప్పిన మాట.
2. నేను పశువువలె మూర్ఖుడనైతిని. నరునికి ఉండవలసిన జ్ఞానము నాకు లేదయ్యెను.
3. నేను విజ్ఞానమును ఆర్జింపనైతిని. పరిశుద్ధ దేవుని జ్ఞానమును బడయనైతిని.
4. ఆకాశమునకు ఎక్కిపోయి మరల దిగివచ్చిన వాడెవ్వడు? గాలిని గుప్పిటపట్టిన వాడెవ్వడు.? తాను తొడిగిన అంగీతో నీటిని మూటగట్టిన వాడెవ్వడు? నేలకు ఎల్లలు నెలకొల్పిన వాడెవ్వడు? ఆయన పేరేమిటి? ఆయన తనయుని పేరేమిటి? నీకు తెలియునా?
5. దేవుని వాక్కులలో అసత్యము ఉండదు. ఆయన తన్నాశ్రయించువారిని డాలువలె రక్షించును.
6. ఆయన పలుకులకు నీవేమి చేర్పవలదు. చేర్చెదవేని అతడు నిన్ను వంచకునిగా గణించును.
7. దేవా! నేను నిన్ను రెండు వరములడిగెదను. నేను మరణింపకమునుపే వీనిని నాకు ప్రసాదింపుము.
8. నేనెంత మాత్రము అబద్దములు ఆడకుండునట్లు చేయుము. నన్ను సంపన్నుని చేయవద్దు, పేదవానిని చేయవద్దు, నాకు కావలసినంత తిండి మాత్రము దయచేయుము.
9. సంపదలిచ్చినచో నిన్ను ధిక్కరించి “ప్రభువెవడు”అని పలుకుదునేమో? లేమి కలిగినచో దొంగిలించి నా దేవుడవైన నీకు అపఖ్యాతి తెత్తునేమో!
10. సేవకుని తప్పులనుగూర్చి యజమానునికి చెప్పకుము. చెప్పినచో ఆ దాసుడు నిన్ను శపించును. నీకు కీడు చుట్టుకొనును.
11. కొందరు తమ తండ్రులను శపింతురు. తమ తల్లులను గౌరవముతో చూడరు.
12. కొందరు తాము పవిత్రులమని ఎంచుదురుగాని తమలోని మాలిన్యమును మాత్రము తొలగించుకొనరు
13. కొందరు కళ్ళునెత్తికివచ్చి గర్వపు చూపులు చూతురు
14. కొందరికి తమ దంతములే ఖడ్గములు, తమ దౌడలే కత్తులు. ఈ క్రూరులు పేదసాదలను పీడించి పిప్పిచేసి నేలమీద వారి అడపొడ కానరాకుండ చేయుదురు.
15. జలగకు కుమార్తెలిద్దరు కలరు. “నాకిమ్ము నాకిమ్ము” అనే వారి పలుకులు. ఏనాడు తృప్తి చెందనివి మూడు. ఎప్పుడు మాకు చాలును అని పలకనివి నాలుగు కలవు.
16. అవి పాతాళలోకము, బిడ్డలనుకనని గర్భము, నీరు చాలని నేల, అదుపు తప్పి “చాలు” అనని మండు అగ్ని.
17. తండ్రిని ఎగతాళి చేయువాడు లేదా ముసలి తల్లిని అనాదరము చేయువాడు ఎవ్వడో, వాని శవమును రాబందులు పొడుచుకొని తినును వాని కళ్ళను అడవి కాకులు పీకివేయును.
18. నాకు ఆశ్చర్యకరమైనవి మూడు, అర్థము కాని సంగతులు నాలుగుకలవు.
19. అవి, గరుడపక్షి ఆకసమున ఎగురు తీరు, పాము రాతిపై ప్రాకు తీరు, ఓడ నడికడలిలో నడచుతీరు, పురుషుడు యువతిని వలచుతీరు.
20. వ్యభిచారిణి యొక్క ధోరణియు అట్టిదే. ఆమె తిని, మూతి తుడుచుకొని నేను ఏ కానిపనియు చేయలేదు అనును.
21. భూమిని వణికించు ఘోరకార్యములు మూడు, పుడమి భరింపజాలని నాలుగు అంశములు కలవు.
22. అవి: బానిస రాజగుట, మూర్ఖునికి కడుపునిండ కూడు దొరకుట,
23. దుష్టురాలికి పెండ్లియగుట, దాసి యజమానురాలి స్థానమును ఆక్రమించుకొనుట
24. నాలుగు ప్రాణులు పరిమాణమున చాలచిన్నవి కాని తెలివిలో మిక్కిలి గొప్పవి
25. చీమలకు బలము తక్కువకాని అవి వేసవిలో ఆహారము చేకూర్చుకొనును.
26. చిన్న కుందేళ్ళకు సత్తువలేదు, అయినను అవి కొండలమీద వసించును
27. మిడుతలకు రాజు లేడు. అయినను అవి దండుగా పయనించును.
28. బల్లిని పట్టి చేతిలో పెట్టుకొనవచ్చుగాక అయినను అది రాజప్రాసాదములలోనుండును.
29. గంభీరముగ నడుచునవి మూడు కలవు, ఠీవితో నడుచునవి నాలుగు కలవు.
30. అవి: సింహము మృగములలోకెల్ల బలిష్ఠమైనది అది దేనిని చూచియు వెరవదు.
31. కోడిపుంజు ఠీవితోను, మేకపోతు గంభీరముగాను నడచును. రాజు ధైర్యముతో సైన్యమును నడుపును.
32. నీవు గర్వముతో, బుద్దిహీనతతో దుష్టకార్యములను చేయబూనినచో నీ చేతితో నోరు మూసికొనుము.
33. పాలను చిలికినచో వెన్నవచ్చును. ముక్కుమీద కొట్టినచో నెత్తురు వచ్చును. కోపమును రెచ్చగొట్టినచో కలహము పుట్టును.
1. మస్సారాజయిన లెమూవేలు సూక్తులివి. ఆ రాజు తల్లియే ఈ సూక్తులతనికి నేర్పించెను:
2. నాయనా! నీవు నా కడుపున పుట్టిన గారాల బిడ్డవు, నా నోముల పంటవు. నేను నీకేమి బోధింపగలను!
3. నీ బలసంపదను పూర్తిగా స్త్రీలకు అర్పించుకోవలదు. మగువలు రాజులను నాశనము చేయుదురు.
4. నాయనా! లెమూవేలూ! రాజులు ద్రాక్షారసమును సేవింపరాదు, మద్యపానాసక్తి అధిపతులకు తగదు.
5. వారు త్రాగియున్నపుడు ధర్మవిధులను విస్మరించి పేదసాదల హక్కులను భంగపరతురు.
6. మరణము ఆసన్నమైనవారికి, తీవ్రవేదనలో ఉన్నవారికి మాత్రమే మద్యము తగును.
7. వారు దానిని సేవించి తమ బాధలను, విషాదమును విస్మరింతురు.
8. నీవు నోరు లేనివారి పక్షమున మాట్లాడుము. నిస్సహాయుల కోపు తీసికొనుము.
9. అనాథల పక్షమున వాదించి వారికి న్యాయము కలుగునట్లుగా తీర్పు చెప్పుము. పేదసాదలను అక్కరలో ఉన్నవారినాదరించి వారి హక్కులను నిలబెట్టుము. .
10. యోగ్యురాలైన గృహిణి ఎచట దొరకును? ఆమె పగడములకంటెను విలువైనది.
11. ఆమె పెనిమిటి ఆమెను విశ్వసించును. ఆమె వలన అతనికి చాల లాభము కలుగును.
12. ఆమె జీవించినంత కాలము అతడికి మేలునేగాని కీడుచేయదు.
13. ఆ గృహిణి నిత్యము ఉన్నిని, నారను వడకును. నిరంతరము ఆసక్తితో పనిచేయును.
14. వాణిజ్య నౌకవలె దూరప్రాంతములనుండి భోజనపదార్థములను తెప్పించును.
15. వేకువనే నిద్రలేచి తన కుటుంబమునకు భోజనము సిద్ధము చేయును. పనికత్తెలకు పనులు ఒప్పగించును.
16. ఆమె ఒక పొలమును చూచి దానిని వెలకు కొనును. స్వార్జితముతోనే అందు ద్రాక్షలు నాటించును.
17. ఆ ఉవిద కష్టపడి పనిచేయును, ఆమె చేతులు మిగుల బలము కలవి.
18. ఆమె కృషికి సత్పలమబ్బును. రేయెల్ల ఆమె ఇంట దివ్వె వెలుగుచునే ఉండును.
19. ఆ గృహిణి తన నూలు తాను వడకుకొని, తన బట్టలు తాను నేసికొనును.
20. పేదసాదలకు దానధర్మములు చేయుటకు సంసిద్ధముగా ఉండును.
21. మంచు కురిసినను ఆమె వెరువదు. ఆమె ఇంటివారెల్ల వెచ్చని బట్టలు ధరింతురు.
22. ఆమె తన పరుపులు తాను తయారు చేసికొనును, తాను మేలైన ఎఱ్ఱని నారబట్టలు తాల్చును.
23. ఆమె పెనిమిటి సభలో పెద్ద మనుష్యులనడుమ కూర్చుండి ఎల్లరిమన్నన పొందును.
24. ఆమె నారబట్టలు, నడికట్టులు తయారుచేసి వర్తకులకు అమ్మును.
25. ఆ గృహిణి బలవంతురాలు. ఆమె ఎల్లరినుండి గౌరవమును బడయును. భవిష్యత్తును గూర్చి ఆందోళన చెందదు.
26. విజ్ఞాన వాక్యములు పలుకును. మృదువుగా మాట్లాడును.
27. సోమరితనమునకు ఎంతమాత్రము తావీయక, కుటుంబపరిస్థితులను మెలకువతో చక్కదిద్దుకొనును. పనిచేయకుండ ఆమె భోజనము చేయదు.
28. ఆమె తనయులు ఆమెను ధన్య అని కొనియాడుదురు. పెనిమిటి ఆమెను మెచ్చుకొనును.
29. అతడు “యోగ్యురాండ్రయిన ఇల్లాండ్రు చాలమంది కలరు. వారెల్లరిలోను నీవు ఉత్తమురాలివి” అని పలుకును
30. తళుకు బెళుకులు నమ్మరానివి. అందము నిలుచునదికాదు. ప్రభువుపట్ల భయభక్తులుగల మహిళ మెచ్చుకోదగినది.
31. ఆ గృహిణి మంచి పనులకుగాను ఆమెను కీర్తింపవలయును. ఆమె కృషి పదిమందిలోను ప్రశంసలు పొందునుగాక!