ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

2nd Peter chapter 2 || Telugu Catholic Bible || పేతురు వ్రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము

1. గతమున ప్రజలలో అసత్య ప్రవక్తలు గోచరించిరి. అట్లే మీలో అసత్య బోధకులు కాననగుదురు. వారు వినాశకరములును, అసత్యములును అగు సిద్ధాంతములను ప్రవేశ పెట్టెదరు. తమ్ము రక్షించిన యజమానుడినే వారు నిరాకరింతురు. కనుకనే త్వరలో ఆత్మవినాశనమును కొని తెచ్చుకొందురు.

2. అయినను పెక్కుమంది అవినీతికరమగు వారి మార్గములను అనుసరింతురు. వారు ఒనర్చు కృత్యములవలన ప్రజలు సత్యమార్గమును దూషింతురు.

3. పేరాశ వలన ఈ అసత్య ప్రచారకులు మీకు కట్టుకథలను చెప్పుచు వానిద్వారా లాభమును ఆర్జింతురు. వారికి పూర్వమునుండి విధింపబడిన తీర్పురాకపోదు. వారి వినాశకర్త మెలకువగనే ఉన్నాడు.

4. ఏలయన, పాపులైన దేవదూతలనే దేవుడు వదలలేదు. వారు పాపము చేసినప్పుడు ఆయన వారిని పాతాళమునందలి చీకటి బిలములోనికి త్రోసి, తీర్పు దినమువరకు కావలియందుంచెను.

5. ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, దుషా త్ముల లోకమును జలప్రళయమున ముంచివేసెను. రక్షింపబడిన వారు నీతి ప్రబోధకుడగు నోవా, మరి ఏడుగురు మాత్రమే.

6. సొదొమ, గొమొఱ్ఱా నగరములను దేవుడు శపించెను. వానిని భస్మమొనర్చి దుష్టులకు ఏమి సంభవింపనున్నదో చూపుటకు ఉదాహరణము నొసగెను.

7. దుర్మార్గుల అవినీతికరమగు ప్రవర్తనలగూర్చి వ్యధనొందిన సత్పురుషుడగు లోతును ఆయన కాపాడెను.

8. ఏలయన, ఆ సత్పురుషుడు ప్రతినిత్యము వారి మధ్య జీవించెను గదా! అతడు వినినవి, కనినవి అగు వారి దుశ్చేష్టలు అతని ఉత్తమ హృదయమును పీడించినవి.

9. కనుకనే బాధలనుండి భక్తులను ఎట్లు విడిపింపవలయునో దేవునకు ఎరుకయే. అట్లే తీర్పు దినమునకై దుష్టులను ఎట్లు శిక్షలో ఉంచవలసినదియు దేవునకు తెలియును.

10. అందును విశేషించి, రోతపుట్టించు శారీరక వ్యామోహములనే అనుసరించుచు, దేవుని అధికారమునే తృణీకరించువారిని ఎట్లు శిక్షింపవలెనో ఆయనకు తెలిసినదే. ఈ అసత్య బోధకులు సాహసశీలురు, గర్వితులు. అంతేకాక దివ్యజీవులకు ఎట్టి గౌరవమును చూపక, వారిని అవమానింతురు.

11. దేవదూతలు ఈ అసత్వ బోధకుల కంటే మహాబలవంతులును, ధీశాలురునుగదా! కాని ఆ దేవదూతలు కూడ, దేవుని సమక్షమున వారిని అవమానకరమగు పలుకులతో నిందింపరు.

12. వేటాడి చంపబడుటకై జనించిన అడవి జంతువు నలవలె వారు ప్రకృతి సిద్ధమగు పశుబుద్ధితో ప్రవర్తింతురు, తాము గ్రహింపలేని వానిని వారు అవమానింతురు, ఆ అడవి జంతువులవలెనే వారును చంపబడుదురు.

13. ఇతరులకు కలిగించిన బాధలకు ప్రతిఫలముగ వారు బాధింపబడుదురు. తమ శారీరక తృష్ణలకు తృప్తి కలిగించు ఎట్టిపనినైనను పట్టపగలే వారు ఒనర్తురు. అది వారికి ఒక ఆనందము. వారు సదా నికృష్టమార్గముననే ఆనందించుచుందురు. కనుక మీ విందులలో వారు పాల్గొనుట అవమానకరము. మీకు తలవంపు.

14. వారు స్త్రీలవంక ఎప్పుడు కామేచ్చతో చూచుదురు. వారి పాపతృష్ణ తీరునది కాదు. బలహీనులను వారు కపటోపాయములతో చిక్కించు కొందురు. వారి హృదయములు అత్యాశకు అలవాటు పడినవి. వారు దైవ శాపగ్రస్తులు!

15. వారు ఋజు మార్గమును విడిచి త్రోవ తప్పినవారు. బెయోరు కుమారుడైన బలాము మార్గమునే వారు అనుసరించినారు. ఆ బిలాము దుష్కార్య సముపార్జితమగు ధనమునే మోహించెను.

16. అందుచేతనే తన అతిక్రమణకు అతడు దండింపబడెను. ఏలయన, ఒక నోరులేని గాడిద మానవవాణితో మాట్లాడి, ఆ ప్రవక్త పిచ్చి చేష్టలను మాన్పెను.

17. వారు ఎండిపోయిన ఊటల వంటివారు. తుఫాను తీవ్రతకు కొట్టుకొనిపోయిన మేఘములను పోలినవారు. గాఢాంధకారమున దేవుడు వారికి ఒక స్థలమును ఏర్పరచెను.

18. వారు డాంబికమైన వ్యర్ధ ప్రకటనలతో దోషమార్గమునుండి తప్పుకొన ప్రయత్నించుచు, సందిగ్ధతలోనున్న వారిని లోబరచుకొనుటకు కామాతురతతో కూడిన శారీరక తృష్ణలను ఎరగా చూపుదురు.

19. ఏలయన, వారే వినాశకరములగు అలవాట్లకు బానిసలైయుండియు, స్వేచ్చను ఇత్తుమని వాగ్దానమొనర్తురు. మానవుడు దేనివలన జయింప బడునో దానికే దాసుడగును కదా!

20. మన ప్రభువును, రక్షకుడును అగు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానము వలన ప్రచండమగు లౌకికశక్తులనుండి కొందరు తప్పించుకొనిరనుకొనుడు. కాని ఆ శక్తులచే మరల చిక్కి పరాజితులైనచో వారు ముందున్న దానికంటె చివరకు మరింత దురవస్థకు లోనగుదురు.

21. వారు సన్మార్గమును గ్రహించి వారికనుగ్రహింపబడిన పవిత్రాత్మను స్వీకరించిన పిదప విముఖులైనట్లే గదా? దానికంటే వారు సన్మార్గమును ఎరుగకయే ఉన్నచో వారిస్థితి కొంత బాగుండెడిది.

22. “తాను కక్కిన కూటికి కుక్క ఆశించును.” “స్నానము చేయించినంత మాత్రమున పంది బురదగుంటలో పొర్లాడక మానునా?" అను ఈ లోకోక్తులు సత్యములే అని వారి వృత్తాంతము నిరూపించుచున్నది.