ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Roman catholic Bible in Telugu || Ephesians Chapter-5 || ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము

 1. మీరు దేవుని ప్రియమైన బిడ్డలు కనుక, ఆయనను పోలి జీవింపుడు.

2. క్రీస్తు మనలను ప్రేమించినందుచేతనే దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణగను, బలిగను మనకొరకై తన ప్రాణములను సమర్పించెను. అట్లే మీరును ప్రేమతో నడుచుకొనుడు.

3. మీ మధ్య జారత్వము, అపవిత్రత, లోభితనము అనునవి పేరుకైనను ఎత్తకూడదు. ఇదే పవిత్రులకు తగినది.

4. అంతేకాక, అసహ్యకరములును, అవివేక పూరితములును, అపవిత్రములునైన పదములనువాడుట మనకు తగదు. మీరు దేవునికి కృతజ్ఞులై ఉండవలెను.

5. మీరు ఈ విషయము దృఢముగ నమ్మవచ్చును. వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, లోభియైనను (అనగా విగ్రహారాధకుడును), క్రీస్తు రాజ్యములో, దేవునిరాజ్యములో వారసత్వము పొందడు.

6. ఎవరును మిమ్ము వ్యర్థపుమాటలతో మోస పుచ్చకుండ చూచుకొనుడు. ఈ కారణము వలననే, ఆయనకు అవిధేయులైన వారిపై దేవుని ఆగ్రహము వచ్చును.

7. కనుక అట్టి వారితో ఏ సంబంధమును పెట్టుకొనకుడు.

8. ఒకప్పుడు మీరును చీకటిలో ఉండినవారే. కాని ఇపుడు ప్రభువు నందు మీరు వెలుగులో ఉన్నారు. వెలుగునకు సంబంధించిన ప్రజల వలె మీరు జీవింపవలెను.

9. ఏలయన వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి. సత్యము అనువానియందు కనపడును.

10. ప్రభువును ఆనందపరచునది ఏదియో గ్రహించుటకు ప్రయత్నింపుడు.

11. చీకటికి సంబంధించిన నిష్ప్రయోజనములగు పనులు చేయు వారితో ఎట్టి సంబంధమును కలిగి ఉండరాదు. అంతేకాక వారిని కూడ వెలుగులోనికి తెండు.

12. వారు రహస్యముగ చేయు పనులనుగూర్చి మాట్లాడుటకు కూడ చాల సిగ్గు కలుగుచున్నది.

13. సమస్తమును వెలుగులోనికి తీసికొని రాబడినప్పుడు అంతయు గోచరమగును. గోచరమగు నట్లు చేయునది వెలుగే.

14. కనుకనే, “నిద్రితుడా! మేల్కొనుము, మృతులలోనుండి లెమ్ము! క్రీస్తు నీపై ప్రకాశించును” అని చెప్పబడినది.

15. కనుక, మీరు ఎట్లు జీవించుచున్నారు అను దానిని గూర్చి శ్రద్ధవహింపుడు. జ్ఞాన హీనులవలె జీవింపకుడు. వివేకవంతులవలె జీవింపుడు.

16. ఇవి చెడుదినములు కనుక దొరికిన ప్రతి అవకా శమును సద్వినియోగము చేసికొనుడు.

17. మూర్ఖులు కాక, మీరేమి చేయవలెనని దేవుని చిత్తమో గ్రహించు టకు ప్రయత్నింపుడు.

18. మద్యపానముతో మత్తిల్లకుడు. అందునుండే జారత్వమును కలుగును. దానికి బదులుగా ఆత్మ పూరితులుకండు.

19. ఒకరితో ఒకరు కీర్తనలతోను, స్తోత్రములతోను, పవిత్రగీతములతోను సంభాషింపుడు. హృదయపూర్వకముగ పొగడ్తలతో ప్రభువునకు కీర్తనలను, స్తోత్రములను పాడుడు.

20.మన ప్రభువగు యేసు క్రీస్తు ద్వారా ప్రతి విషయమును గూర్చి తండ్రియగు దేవునకు సర్వదా కృతజ్ఞతలను అర్పించుకొనుడు.

21. క్రీస్తునందుగల గౌరవముచే, పరస్పరము విధేయులై ఉండుడు.

22. భార్యలారా! ప్రభువునకు విధేయులైనట్లే, మీ భర్తలకును విధేయులై ఉండుడు.

23. భర్తకు భార్య పై గల అధికారము క్రీస్తునకు శ్రీసభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహమగు శ్రీసభ యొక్క రక్షకుడు.

24. కనుక శ్రీసభ క్రీస్తునకు విధేయత చూపునట్లే భార్యలుకూడ తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను.

25. భర్తలారా! క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించి దానికొరకై తన ప్రాణములు అర్పించెనో, మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు.

26. ఆమెను వాక్కుచే కడిగి, శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అటుల చేసెను.

27. మచ్చకాని, ముడుతకాని, మరేది కాని లేకుండ ఆమెను తనకు దివ్యముగా సమర్పించు కొనుటకును, ఆమె పవిత్రముగను నిర్దోషిగను ఉండుటకును ఆయన అటుల చేసెను.

28. తమ దేహములను తాము ప్రేమించునట్లే పురుషులు తమ భార్యలనుకూడ ప్రేమింపవలెను. ఏలయన, తన భార్యను ప్రేమించువ్యక్తి తనను తాను ప్రేమించుకొనును.

29. ఎవడును తన దేహమును ద్వేషింపడుగదా! దానికి బదులుగా క్రీస్తు శ్రీసభ విషయములో వర్తించునట్లే, వాడు దానిని పోషించుచు, దాని విషయమై శ్రద్ధవహించును.

30. ఏలయన, మనము ఆయన శరీరములో సభ్యులమే కదా!

31. “ఇందువలననే, పురుషుడు తన తల్లిదండ్రులను వదలి భార్యతో ఐక్యమగును. వారు ఇరువురును ఏకశరీరులగుదురు.” అని లేఖనము పలుకుచున్నది.

32. ఈ వచనమున ఒక గొప్ప నిగూఢసత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకును, శ్రీసభకును వర్తించునని నా భావన.

33. కాని అది మీకును అన్వయించును. ప్రతి భర్తయు తన భార్యను తననుగానే ప్రేమింపవలయును. అట్లే ప్రతి భార్యయు తన భర్తను గౌరవింపవలయును.