ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఓబద్యా

 1. ఇది ఓబద్యాకు కలిగిన దర్శనము. దేవుడైన ప్రభువు ఎదోమును గురించి చెప్పిన సంగతి:

2. ప్రభువు జాతులచెంతకు దూతను పంపెను. అతని సందేశమును మేము ఆలించితిమి. “మనము ఎదోముమీదికి యుద్ధమునకు పోవుదము. మీరెల్లరును సిద్ధముకండు” అని ఆ సందేశము. ప్రభువు ఎదోముతో ఇట్లనుచున్నాడు: ఇదిగో! నేను నీ జనమును నాశనము చేయుదును. ఎల్లరును నిన్ను నిర్లక్ష్యము చేయుదురు.

3. నీ పొగరు నిన్ను అపమార్గము పట్టించినది. నీ నివాసము కొండసందులలోనున్నది. నీవు ఎత్తయిన పర్వతముపై వసించుచున్నావు. కావున నిన్నెవరును కూలద్రోయలేరని నీనమ్మకము.

4. నీవు గరుడపక్షివలె ఎంత ఎత్తున వసించుచున్నను, చుక్కలనడుమ ఇల్లు కట్టుకొనియున్నను నేను నిన్ను కూలద్రోయకమానను.

5. రేయి దొంగలుపడి దోచుకొనినచో తమకు కావలసిన వస్తువులు మాత్రమే కొనిపోవుదురు. జనులు ద్రాక్షపండ్లు కోయునపుడు పరిగెలేరు వారికి కొన్ని పండ్లు వదలివేయుదురు. కాని నీ శత్రువులు నిన్ను ఊచముట్టుగా కొల్లగొట్టిరి.

6. ఏసాపు వంశజులారా! మీరు దోచుకొనిన సొత్తును విరోధులు దోచుకొనిరి.

7. నీ మిత్రవర్గము నిన్ను మోసగించెను. నీ దేశమునుండి నిన్ను తరిమివేసెను. నీతో పొత్తు చేసికొనినవారే నిన్నోడించిరి. నీ సరసన కూర్చుండి భోజనము చేసినవారే నీకు ఉరులు పన్నిరి. నీ తెలివి వమ్మయిపోయినదని పలికిరి.

8. ఆ దినమున ఏసావు పర్వతములలో విమోచన లేకపోవునట్లు నేను ఎదోములోని జ్ఞానులను నాశనము చేయుదును.

9. తేమాను వీరులు భీతిచెందుదురు. ఎదోము సైనికులెల్ల చంపబడుదురు.

10. నీవు నీ సోదరులైన యాకోబు వంశజులను దోచుకొని మట్టు పెట్టితివి. కావున నీవు అవమానమునకు గురియై శాశ్వతనాశనమును తెచ్చుకొందువు.

11. శత్రువులు యాకోబువంశజుల నగరద్వారములను ప్రవేశించినదినమున, నీవు ప్రక్కన నిలుచుండియుంటివి. యెరూషలేము సంపదలను దోచుకొనిపోయి తమలోతాము చీట్లువేసి పంచుకొనుటకు నీవును దుష్టురాలవై అన్యజాతులవారిలో నొకదానివైతివి.

12. యూదాలోని నీ సోదరుల ఆపదలను చూచి నీవు సంతోషించియుండరాదు. వారు నాశనముచెందిన రోజున నీవు ఆనందము చెందియుండరాదు. వారి విపత్తులనుచూచి నీవు నవ్వియుండరాదు.

13. నా జనులు కష్టముల పాలయిన దినమున నీవు వారి నగరమును ప్రవేశించియుండరాదు. వారి శ్రమలను చూచి సంతసించియుండరాదు. వారి సొత్తును అపహరించియుండరాదు.

14. ఆనాడు నీవు అడ్డుత్రోవలో నిలిచి వారిలో తప్పించుకొనినవారిని మట్టుపెట్టియుండరాదు. వారు కడగండ్ల పాలయిన దినమున నీవు వారిలో శేషించినవారిని పగవారికి పట్టించియుండరాదు. దేవుడు అన్యజాతులకు తీర్పు విధించును

15. ప్రభుడనైన నేను ఎల్లజాతులకును తీర్పువిధించు దినము వచ్చుచున్నది. ఎదోమూ! నీవు నీ దుష్కార్యములకు ప్రతిఫలము అనుభవింతువు. నీ దుష్కృత్యములు నీ నెత్తిమీదికే వచ్చును.

16. నా ప్రజలు నా పవిత్రపర్వతముపై శిక్షాపాత్రములోని పానీయమును త్రాగిరి. ఈ రీతినే ఎల్లజాతులును శిక్షాపాత్రమునుండి పానీయమును త్రాగును, తప్ప త్రాగును. త్రాగి అడపొడ కానరాకుండ పోవును.

17. కాని సియోనుకొండమీద కొందరు తప్పించుకొందురు. అది పవిత్రస్థలమగును. యాకోబు వంశజులు తమ భూమిని స్వాధీనము చేసికొందురు.

18. యాకోబు వంశజులు అగ్గిఅగుదురు. యోసేపు వంశజులు మంటయగుదురు. నిప్పు దుబ్బలవలె వారు ఎదోమును దహింతురు. ఎదోము వంశజులలో ఎవరును మిగులరు. ఇది ప్రభుడనైన నా వాక్కు

19. యూదా దక్షిణ భాగపు ప్రజలు ఎదోమును ఆక్రమించుకొందురు. పల్లపు ప్రాంతములవారు ఫిలిస్తియాను వశము చేసికొందురు. యిస్రాయేలీయులు ఎఫ్రాయీము, సమరియా మండలములను స్వాధీనము చేసికొందురు. బెన్యామీను వంశజులు గిలాదును గెల్తురు.

20. ప్రవాసమునందలి యిస్రాయేలు సైన్యములు తిరిగివచ్చి సారెఫతు వరకును కనాను దేశమును ఆక్రమించును. తను సెఫారాదునందుగల యెరూషలేము ప్రవాసులు యూదా దక్షిణ నగరములను ఆక్రమించుకొందురు.

21. ఏసావు కొండకు తీర్పుతీర్చుటకై సియోను కొండమీద రక్షకులు పుట్టుదురు. అప్పుడు రాజ్యము ప్రభువుదియగును. బెన్యామీను వంశజులు గిలాదును గెల్తురు.