1. యోసేపు వచ్చి ఫరోరాజుతో “మా తండ్రి, సోదరులు కనానుదేశమునుండి వచ్చిరి. ఆలమందలతో గొఱ్ఱెలగుంపులతో సమస్తవస్తువులతో వచ్చి వారిపుడు గోషెనులో ఉన్నారు” అని చెప్పెను. 2. పిదప అతడు తన సోదరులలో ఐదుగురిని ఫరోరాజు సముఖమునకు కొనివచ్చెను. 3. ఫరోరాజు “మీ వృత్తి యేమి?” అని వారినడిగెను. అంతటవారు “దొరా! మేము గొఱ్ఱెలకాపరులము. మా తాతముత్తాతలు కూడ మావంటివారే. 4. మేము ఈ దేశములో కొన్నాళ్ళపాటు బ్రతుకవచ్చితిమి. క్షామమునకు బలియైన కనానుదేశములో మందలకు మేతలేదు. గోషేను మండలములో మేముండుటకు దేవరవారు సెలవు దయచేయవలయునని, ఈ దాసులు వేడుకొనుచున్నారు” అనిరి. 5. ఫరోరాజు యోసేపుతో “నీ తండ్రి, నీ సోదరులు నీ దగ్గరకు వచ్చిరన్నమాట! 6. ఈ ఐగుప్తుదేశమంతయు నీ ముందున్నది! సారవంతమైనచోటికి వారిని చేర్పుము. వారు గోపెనులో ఉండవచ్చును. వారిలో సమర్థులను మా మందలకు నాయకులుగా చేయుము” అనెను. 7. తరువాత యోసేపు తన తండ్రిని ఫరోరాజు సముఖమునకు గొనివచ్చెను. యాకోబు ఫరోరాజును దీవించెను. 8. “నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని?” అని ఫరోరాజు యాకోబును అడిగెను. 9. యాకోబు రాజుతో “నా ఇహలోకయాత్ర నూట ముప్పదియేండ్ల నుండి సాగుతున్నది. నాకు ఎన్నో ఏండ్లు లేవు. అవియ...