1. నేను ప్రభువునకు బిగ్గరగా మొరపెట్టెదను, స్వరమెత్తి మొరపెట్టెదను, ఆయన నా వేడుకోలును ఆలించును. 2. నేను ఆపదలో చిక్కి ప్రభువునకు మనవి చేసితిని. రేయెల్ల చేతులెత్తి ఎడతెగక ప్రార్థన చేసితిని. అయినను ఉపశాంతిని బడయజాలనైతిని. 3. నేను దేవుని స్మరించుకొని నిట్టూర్పు విడుచుచున్నాను ఆయనను మననము చేయుచు నా ఆత్మ నీరసించిపోయినది. 4. ప్రభువు నా కంటికి కునుకు పట్టనీయలేదు. నేను వ్యాకులముచెంది మాట్లాడజాలనైతిని. 5. నేను పురాతన కాలమును జ్ఞప్తికి తెచ్చుకొంటిని. గతకాలము నాకు గుర్తునకు వచ్చెను. 6. రేయెల్ల ధ్యానముచేసి ఆలోచించి చూచితిని. ఆ మీదట నన్నునేను ఆత్మలో అన్వేషించుకొంటిని. 7. “ప్రభువు నన్ను సదా చేయి విడచునా? ఇక నన్ను ఎప్పటికిని ఆదరింపడా? 8. ఇక నన్ను ప్రేమతో చూడడా? ఆయన వాగ్దానములిక చెల్లవా? 9. దేవుడు తన కరుణను విస్మరించెనా? ఆయన కోపము ఆయన జాలిని అణచివేసెనా?” 10. అంతట నేనిట్లు భావించితిని. 'మహోన్నతుని కుడిహస్తము మారిపోయినది. ఈ విషయము నాకు మిగుల బాధకలిగించుచున్నది.' 11. ప్రభూ! నేను నీ మహాకార్యములను స్మరించుకొందును. పూర్వము నీవు చేసిన అద్భుతములను జ్ఞప్తికి తెచ్చుకొందును. 12. నీ చెయిదములను గూర్చి చింతిం...