1వ అధ్యాయము + - 1. సౌలు మరణించెను. దావీదు అమాలెకీయులను తునుమాడి సిక్లాగు నగరమునకు తిరిగివచ్చి అచట రెండుదినములు గడపెను. 2. మూడవనాడు సౌలు పోరాడిన యుద్ధభూమినుండి దూత ఒకడు వచ్చెను. అతడు బట్టలు చించుకొనెను. తలపై దుమ్ముపోసికొనెను. దావీదు ఎదుటకు రాగానే దూత నేలమీదికివంగి దండము పెట్టెను. 3. “నీ వెచటనుండి వచ్చితివి?" అని దావీదు ప్రశ్నించెను. అతడు “నేను యిస్రాయేలీయుల శిబిరమునుండి వచ్చితిని. బ్రతికి బయటపడితిని” అనెను. 4. దావీదు అచటనేమి జరిగినదో చెప్పుమనెను. అతడు “మనవారు యుద్ధము నుండి పారిపోయిరి. చాలమంది కూలిరి. సౌలు, అతని కుమారుడు యోనాతాను మడిసిరి” అని చెప్పెను. 5. “సౌలు, యోనాతాను మడిసిరని నీకెట్లు తెలియును?" అని దావీదు ఆ సైనికుని అడిగెను. 6. అతడు “నేను అపుడు గిల్బోవ కొండమీద నుంటిని. సౌలు తన యీటె మీద ఆనుకొనియుండెను. 7. అంతలోనే శత్రువుల రథములు, రౌతులు అతనిని చుట్టుముట్టెను. సౌలు చుట్టును పరికించి కొండపై నున్న నన్ను చూచి కేకవేసెను. నేను 'చిత్తము ప్రభూ!' అంటిని. 8. అతడు నీవెవ్వరవని నన్నడిగెను. నేను అమాలెకీయుడనని బదులుపలికితిని. 9. అతడు 'నీవు ఇచ్చటికి వచ్చి నన్ను చంపివేయుము. న...