1. సౌలు మరణించెను. దావీదు అమాలెకీయులను తునుమాడి సిక్లాగు నగరమునకు తిరిగివచ్చి అచట రెండుదినములు గడపెను.
2. మూడవనాడు సౌలు పోరాడిన యుద్ధభూమినుండి దూత ఒకడు వచ్చెను. అతడు బట్టలు చించుకొనెను. తలపై దుమ్ముపోసికొనెను. దావీదు ఎదుటకు రాగానే దూత నేలమీదికివంగి దండము పెట్టెను.
3. “నీ వెచటనుండి వచ్చితివి?" అని దావీదు ప్రశ్నించెను. అతడు “నేను యిస్రాయేలీయుల శిబిరమునుండి వచ్చితిని. బ్రతికి బయటపడితిని” అనెను.
4. దావీదు అచటనేమి జరిగినదో చెప్పుమనెను. అతడు “మనవారు యుద్ధము నుండి పారిపోయిరి. చాలమంది కూలిరి. సౌలు, అతని కుమారుడు యోనాతాను మడిసిరి” అని చెప్పెను.
5. “సౌలు, యోనాతాను మడిసిరని నీకెట్లు తెలియును?" అని దావీదు ఆ సైనికుని అడిగెను.
6. అతడు “నేను అపుడు గిల్బోవ కొండమీద నుంటిని. సౌలు తన యీటె మీద ఆనుకొనియుండెను.
7. అంతలోనే శత్రువుల రథములు, రౌతులు అతనిని చుట్టుముట్టెను. సౌలు చుట్టును పరికించి కొండపై నున్న నన్ను చూచి కేకవేసెను. నేను 'చిత్తము ప్రభూ!' అంటిని.
8. అతడు నీవెవ్వరవని నన్నడిగెను. నేను అమాలెకీయుడనని బదులుపలికితిని.
9. అతడు 'నీవు ఇచ్చటికి వచ్చి నన్ను చంపివేయుము. నా బొందిలో ఇంకను ప్రాణమున్నదిగాని నేను మాత్రము సొమ్మసిల్లి పడిపోవుచున్నాను' అనెను.
10. అంతట నేను సౌలు వద్దకుపోయి సొమ్మసిల్లి పడిపోవువాడు ఇక బ్రతుక జాలడుగదా అనుకొని అతనిని సంహరించితిని. అటు పిమ్మట సౌలు ధరించిన కిరీటమును, హస్తకంకణము గైకొని ఏలినవారి వద్దకు తీసికొనివచ్చితిని” అనెను.
11. ఆ మాటలువిని దావీదు బట్టలుచించు కొనెను. అతని కొలువువారును అట్లే చేసిరి.
12. సౌలు, అతని తనయుడగు యోనాతాను, యావే ప్రజలగు యిస్రాయేలీయులు కత్తివాతబడిరని వారందరు సాయంకాలము వరకు వారిని గురించి శోకించి ఉపవాసముండిరి.
13. దావీదు, 'నీవెవడవు' అని ఆ సైనికుని ప్రశ్నించెను. అతడు “నేను అమాలెకీయుడను. నా తండ్రి మీ దేశమున పరదేశిగా బ్రతికెను” అని చెప్పెను.
14. దావీదు అతనితో “నీవు అదరుబెదరు లేక యావే అభిషిక్తుని మీద ఎటుల చేయి చేసి కొంటివి?” అనెను.
15. అంతట అతడు తన సైనికుని ఒకనిని పిలిచి వీనిని వధింపుమనెను. అతడు అమాలెకీయుని మీదపడి వానిని చంపెను.
16. దావీదు “నీ అపరాధమునకు నీవే బాధ్యుడవు. నేను ప్రభువు అభిషిక్తుని చంపితినన్న నీ నోటిమాటలే నీ దోషమునకు సాక్ష్యములు” అని చెప్పెను.
17-18. దావీదు సౌలు, యోనాతానులపై శోకగీతికను రచించెను. యూదా జనులకు నేర్పుటకై ఆ గీతికను 'యాషారు' అను నీతిమంతులగ్రంథమున లిఖించి ఉంచిరి.
19. “యిస్రాయేలు తేజస్సును యూదా కొండలపై మట్టుపెట్టిరి. మహావీరులు కూలిరిగదా!
20. ఈ సుద్దులు గాతున చాటవలదు. అష్కేలోను పురవీధులలో ప్రకటింపవలదు. ఈ వార్తలు విందురేని ఫిలిస్తీయ వనితలు సంతసింతురు. సున్నతిలేని వారి ఆడుపడుచులు ప్రమోదమొందుదురు.
21. ఓ గిల్బోవా కొండలారా! మీపై వాన, మంచు కురియకుండును గాక! ప్రథమఫలార్పణమునకు తగిన పైరుగల పొలము లేకపోవునుగాక! అధర్మ యుద్ధరంగమా! నీవు వీరుల డాలు వమ్ముచేసితివిగదా! తైలముచేత అభిషేకింపబడని వానిదైనట్టు సౌలు బల్లెము పారవేయబడెను.
22. రణమున ఎదుర్కొనిన వారి నెత్తురులు ఒలికింపనిదే, యోధుల క్రొవ్వు భేదింపనిదే, యోనాతాను విల్లు వెనుదిరిగెడిదా? సౌలు ఖడ్గము మొక్కవోయెడిదా?
23. సౌలు యోనాతానులు సుందరమూర్తులు, ప్రియతములు. వారు బ్రతుకునవోలె చావునగూడ విడివడనివారు. డేగకంటె వడిగలవారు. సింగముకంటె తేజుగలవారు.
24. ఓ యిస్రాయేలు కుమార్తెలారా! మీకు రక్తవర్ణపు పట్టుబట్టలు నొసగి, బంగరు సొమ్ములు పెట్టినవాడు మీ సౌలు కొరకు విలపింపుడు!
25. రణరంగమున మహావీరులు కూలిరిగదా!
26. సహోదరుడా యోనాతానూ! నీ చావువలన నేను తీరని వ్యధనొందితిని. నీవు నాకు ఇష్టసఖుడవు, నీవు నాపట్ల చూపిన ప్రేమ వనితల వలపుకంటె గాఢమైనది.
27. మహావీరులు కూలిరిగదా! వారి ఆయుధములు వమ్మైపోయెను గదా!”
1. అటుపిమ్మట దావీదు యావేను సంప్రతించి “ప్రభూ! నన్ను యూదా పట్టణములకు వెడలి పొమ్మందువా” అనియడిగెను. ప్రభువు పొమ్మనెను. దావీదు మరల, 'ఏ పట్టణమునకు పొమ్మందువు' అని అడుగగా, యావే 'హెబ్రోనునకు పొమ్ము' అని చెప్పెను.
2. కనుక దావీదు తన ఇద్దరు భార్యలతో అనగా యెస్రెయేలునుండి వచ్చిన అహీనోవముతో, కర్మేలునకు చెందిన నాబాలు భార్యయగు అబీగాయీలుతో హెబ్రోను చేరెను.
3. అతడు తన అనుచరులను కూడ వారివారి కుటుంబములతో వెంట గొనిపోయెను. వారందరును హెబ్రోనుననే వసించిరి.
4. యూదా జనులు అచటికి వచ్చి దావీదును యూదాకంతటికి రాజుగా అభిషేకించిరి.
5. యాబేషుగిలాదు పౌరులు సౌలు శవమును పాతి పెట్టిరి. కనుక దావీదు యాబేషుగిలాదునకు దూతలనంపి “మీరు సౌలురాజును ఖననము చేయించి పుణ్యముకట్టుకొంటిరి. యావే మిమ్ము దీవించుగాక!
6. ప్రభువు మిమ్ము కరుణించి మీకు ప్రత్యుపకారము చేయుగాక! నేను మీకు మేలు చేసెదను.
7. మీరందరు ధైర్యముపూని వీరులవలె మెలగుడు. మీ ప్రభువైన సౌలు గతించెను. యూదా ప్రజలందరు నన్ను రాజుగా అభిషేకించిరి” అని కబురు పెట్టించెను.
8. సౌలు సైన్యాధిపతియు నేరు కుమారుడునగు అబ్నేరు సౌలు పుత్రుడైన ఈష్బోషెతును మహనాయీమునకు కొనివచ్చెను.
9. అతనిని గిలాదు, ఆష్షేరు, యెస్రెయేలు, ఎఫ్రాయీము, బెన్యామీను మండలములకును యిస్రాయేలుకు అంతటికిని రాజును చేసెను.
10. సౌలు కుమారుడగు ఈష్బోషేతు యిస్రాయేలీయులకు ఏలిక అగునప్పటికి నలువదియేండ్ల వాడు. అతడు రెండేండ్లు ఏలెను.
11. కాని యూదీయులు దావీదును ఎన్నుకొనిరి. అతడు హెబ్రోనున రాజై ఏడేండ్లు ఆరుమాసములు యూదీయులను పరిపాలించెను.
12. నేరు కుమారుడగు అబ్నేరు, ఈష్బోషెతు అనుచరులును మహనాయీము నుండి గిబ్యోనునకు వచ్చిరి.
13. సెరూయా కుమారుడు యోవాబు, దావీదు అనుచరులు దండులతో వచ్చి గిబ్యోను నీటిగుంట దగ్గర వారినెదిరించి నిల్చిరి. కొలనుకు ఆ వైపున ఒకపక్షము ఈ వైపున ఒక పక్షము శిబిర ములు నిలిపిరి.
14. అబ్నేరు “ఇరువైపుల నుండి యవ్వనస్తులు ముందుకు వచ్చి బలాబలములు ప్రదర్శింతురుగాక!” అనెను. యోవాబు దానికి అంగీకరించెను.
15. కనుక సౌలు కుమారుడైన ఈష్బోషెతు పక్షమున పన్నిద్దరు బెన్యామీనీయులు పందెమునకు వచ్చిరి. దావీదు పక్షమున పన్నిద్దరు ప్రోగై ముందుకువచ్చిరి.
16. కాని ఆ మల్లులలో ప్రతివాడు తన పగవాని జుట్టు పట్టుకొని కత్తితో ప్రక్కలో పొడువగా అందరు ఒక్క మారే పందెమున కూలిరి. కావుననే గిబ్యోనులోనున్న ఆ తావుకు “హెల్కత్ హస్సూరీము” అనగా “కత్తుల పొలము” అని పేరు వచ్చెను.
17. ఆ రోజున పోరు ముమ్మరముగా సాగెను. అబ్నేరు, యిస్రాయేలీయులును దావీదు దళముల ముందు నిలువజాలక కాలికి బుద్ధి చెప్పిరి.
18. సెరూయా పుత్రులు యోవాబు, అబీషాయి, అసాహేలు మువ్వురును యుద్ధమున పోరాడుచుండిరి. వారిలో అసాహేలు అడవి లేడివలె చంగున పరుగిడును.
19. అతడు అబ్నేరును వెన్నాడజొచ్చెను. త్రోవను కుడి ఎడమలకు కదలక పగతుని పట్టుకోవలయునని పూనికతో పరుగెత్తుచుండెను.
20. అబ్నేరు వెనుదిరిగి చూచి "నన్ను వెన్నంటి వచ్చునది అసాహేలేనా?” అని అడిగెను. అతడు “అవును, నేనే” అనెను.
21. అబ్నేరు “నీవు కుడికో ఎడమకో తొలగి బంటును ఎవ్వనినైన పట్టుకొని వాని ఆయుధములు కొల్లగొనుము. నా వెంటబడనేల?” అనెను. కాని అసాహేలు అతనిని విడనాడలేదు.
22. అబ్నేరు మరల అసాహేలుతో “నన్ను తరుముటమాని వెళ్ళిపొమ్ము, లేదేని నిన్ను నేలగూల్తూను. కాని నీవు పడినపిదప నీ అన్న యోవాబు మొగము చూడజాలను గదా?” అనెను.
23. ఎన్ని చెప్పినను అసాహేలు అబ్నేరును విడువలేదు. అందుచే అబ్నేరు ఈటెగొని వెనుకతట్టుగా అసాహేలు పొట్టలో పొడిచెను. అది అతని వీపు చీల్చి వెలుపలికి వచ్చెను. అతడక్కడనే నేలకొరగి విలవిల తన్నుకొని ప్రాణములు విడచెను. దావీదు సైనికులు అసాహేలు పడినతావు చేరగనే దిఢీలున ఆగిపోయిరి.
24. అంతట యోవాబు, అబీషాయి అబ్నేరును వెన్నంటిరి. వారు గిబ్యోను మైదానమునకు పోవు త్రోవ వెంట గియా పట్టణమునకు ఎదుటనున్న 'అమ్మా' అను కొండకడకు వచ్చిరి. అంతలో చీకటి పడెను.
25. బెన్యామీను యోధులు అబ్నేరునంటి వచ్చి కొండ పైకెక్కి ఒక్కటిగా గూమిగూడినిల్చిరి.
26. అబ్నేరు యోవాబును కేకవేసి పిలిచి “ఈ సైనికులందరు కత్తివాదరకు ఎరగావలసినదేనా?మీరీరీతిగా తరుము కొనివచ్చిన చివరకేమగునో తెలియునా? మీ సోదరులను వెన్నాడవలదని నీ జనమును ఆజ్ఞాపింపక ఇంకను జాగుచేయుదువా?” అనెను.
27. యోవాబు "సజీవుడైన యావేతోడు! నీవు వలదంటివిగాని లేకున్న ఆ జనులు ప్రొద్దుపొడిచిన వరకు తమ సోదరులను తరిమికొట్టెడివారే సుమా!” అనెను.
28. అంతట యోవాబు బాకానూదగా యూదీయులు పోరాటమును విరమించి యిస్రాయేలీయులను తరుముటయు, వారితో యుద్ధము చేయుటయు మానిరి.
29. అబ్నేరు అతని బలగము రేయెల్ల యోర్దాను మైదానమున పయనము చేసిరి. నది దాటి ప్రొద్దుటి పూట గూడ నడకసాగించి మహనాయీము చేరిరి.
30. యోవాబు అబ్నేరును తరుముట చాలించి సైన్యమును ప్రోగుచేసికొనెను. దావీదు పక్షమున పందొమ్మిదిమంది వీరులును, అసాహేలును కూలిరి.
31. కాని దావీదు సైనికులు బెన్యామీనీయులైన అబ్నేరు బంటులను మూడువందల అరువది మందిని మట్టుపెట్టిరి.
32. వారు అసాహేలును కొనిపోయి బేత్లెహేమున అతని తండ్రిని పూడ్చివేసిన తావుననే పాతి పెట్టిరి. పిమ్మట యోవాబు అనుచరులను తీసికొని రేయంతయు ప్రయాణముచేసి ప్రొద్దు పొడు చునప్పటికి హెబ్రోను చేరుకొనెను.
1. దావీదు పక్షము వారికిని సౌలు పక్షము వారికిని నడుమ చాలనాళ్ళు పోరునడచెను. కాని రోజు రోజుకు దావీదు పక్షమువారు బలాఢ్యులు కాగా సౌలు పక్షము వారు దుర్బలులైపోయిరి.
2. దావీదునకు హెబ్రోనున కొడుకులు కలిగిరి. వారిలో పెద్దవాడు యెస్రెయేలుకు చెందిన అహీనోవమునకు పుట్టిన అమ్నోను.
3. రెండవవాడు కర్మేలు పట్టణమున నాబాలు భార్యయగు అబీగాయీలునకు జన్మించిన కిల్యాబు. మూడవవాడు గెషూరురాజు టల్మయి కుమార్తె మాకా కనిన అబ్షాలోము.
4. నాలుగవవాడు హగ్గీత్తునకు పుట్టిన అదోనియా, ఐదవవాడు అబీటాలునకు జన్మించిన షెపట్యా.
5. ఆరవవాడు ఎగ్లాకు పుట్టిన ఈత్రేయాము.
6. దావీదు తరపువారు, సౌలు తరపువారు తమమధ్య పోరు కొనసాగించుచుండిరి. సౌలు పక్షమున అబ్నేరు సర్వాధికారయ్యెను.
7. సౌలుకు రిస్పా అను ఉంపుడుకత్తె కలదు. ఆమె అయ్యా కుమార్తె. ఈష్బోషెతు “నా తండ్రి ఉంపుడుకత్తెతో ఏల శయనించితివి?” అని అబ్నేరును ప్రశ్నించెను.
8. అబ్నేరు ఉగ్రుడై “నేనేమి యూదా కుక్కతలననుకొంటివా? నేటి వరకు నేను నీ తండ్రి సౌలు కుటుంబమును, అతని సోదరులను, స్నేహితులను కనురెప్పవలె కాపాడుచు వచ్చితిని. నిన్ను దావీదు వశము చేయనైతిని. నేడు ఈ ఉంపుడుకత్తె మూలమున నాపై నేరము మోపెదవా?
9-10. ఇక, ఈ రాజ్యమును సౌలుకుటుంబము నుండి తొలగింతుననియు దాను నుండి బెర్షెబా వరకు యిస్రాయేలీయులకును, యూదీయులకును దావీదునే రాజుగా నియమింతుననియు యావే దావీదునకు చేసిన బాసను సఫలము చేయనేని నా పేరు అబ్నేరు కాదు” అని పరుషముగా పలికెను.
11. ఈష్బోషెతు అబ్నేరుకు భయపడుటచే అతని మాటలకు మారు పలుకలేదు.
12. అబ్నేరు దూతలనంపి “ఈ దేశము ఎవరిది? నీవు నాతో ఒప్పందము చేసినయెడల నేను నీకు సహాయముచేసి, యిస్రాయేలీయులు అందరిని నీ పక్షమునకు మరల్చెదను” అని కబురు పెట్టించెను.
13. దావీదు “మంచిది. నేను నీతో ఒడంబడిక చేసికొందును. కాని నీవు నా చెంతకు వచ్చునపుడు సౌలు కూతురు మీకాలును వెంటగొనిరావలయును. లేదేని నీవు నా మొగము చూడజాలవు” అని తెలియ జేసెను.
14. దావీదు సౌలు కుమారుడు ఈష్బోషెతు వద్దకు దూతలను పంపి “నా భార్య మీకాలును నా కడకు పంపింపుము. నూరుమంది ఫిలిస్తీయుల చర్మాగ్రములు సమర్పించి ఆమెను బడసితిని” అని ఆజ్ఞ ఇచ్చెను.
15. కనుక ఈష్బోషెతు లాయీషు కుమారుడు ఫల్తీయేలు ఇంటినుండి మీకాలును పిలిపించెను.
16. మీకాలు భర్త బావురుమని ఏడ్చుచు బహురీము వరకు ఆమె వెనువెంట వచ్చెను. కాని అబ్నేరు ఇక వెడలిపొమ్మని ఆజ్ఞాపింపగా అతడు వెనుదిరిగి పోయెను.
17. అబ్నేరు యిస్రాయేలు పెద్దలతో సంప్రదించి “మీరు చాలకాలము నాడే దావీదును రాజుగా ఎన్నుకోగోరి యుంటిరిగదా!
18. నా సేవకుడగు దావీదు ద్వారా ఫిలిస్తీయుల నుండి ఇతర శత్రువుల నుండి యిస్రాయేలీయులను రక్షించెదనని ప్రభువు పలికెను గనుక మీరు దావీదు వైపున చేరవలయును” అని చెప్పెను.
19. అతడు బెన్యామీనీయులతో కూడ సంప్రదించిన పిమ్మట హెబ్రోనున దావీదును కలిసి కొనెను. పై రెండు తెగలవారు సమ్మతించిరని విన్నవించెను.
20. అబ్నేరు ఇరువదిమంది అనుచరులను వెంటనిడుకొని హెబ్రోనున దావీదును చూడబోయెను. దావీదు అబ్నేరుకు అతని తోడి బలగమునకు విందుచేసెను.
21. అతడు దావీదుతో “ఏలిక సెలవైన నేనిక వెడలిపోయెదను. యిస్రాయేలీయులనందరను మీ పక్షమునకు కొనివచ్చెదను. వారు మీతో ఒడంబడిక చేసికొందురు. ఇక మీరు అభిలషించిన రీతిని అందరి మీదను పరిపాలనము నెరపవచ్చును” అనెను. దావీదు అబ్నేరును సాగనంపగా అతడు సురక్షితముగా వెడలి పోయెను.
22. దావీదు సైనికులు శత్రువులపై దాడి చేయబోయిరి. వారు విస్తారమైన కొల్లసొమ్ము గైకొని అప్పుడే యోవాబుతో తిరిగివచ్చిరి. దావీదు అబ్నేరును సాగ నంపెనుగదా! అతడు రాజును వీడ్కొని హెబ్రోను నుండి సురక్షితముగా వెడలిపోయెను.
23. కాని తోడి బంటులతో తిరిగివచ్చిన యోవాబు, నేరు కుమారు డగు అబ్నేరు రాజువద్దకు వచ్చెననియు రాజు అతనిని నిరపాయముగా సాగనంపెననియు వినెను.
24. అతడు వెంటనే రాజు వద్దకు వచ్చి "ఏమిపనిచేసితివి? అబ్నేరు నీ యొద్దకు రాగా ఊరకే వెడలి పోనిత్తువా? ద్రోహి జారిపోయెనుగదా?
25. నేరు కుమారుడు అబ్బేరును నీవెరుగవా? అతడు నిన్ను మోసగించి నీ గుట్టుమట్టు తెలిసికొనగోరియే ఇక్కడకి వచ్చెను” అనెను.
26. అటుపిమ్మట యోవాబు దావీదును వీడ్కొని వెడలిపోయి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపెను. వారు సిరా నూతి దగ్గర అతనిని కలిసికొని యోవాబు వద్దకు కొనివచ్చిరి. కాని యీ సంగతి యేమియు దావీదునకు తెలియదు.
27. అబ్నేరు మరల హెబ్రోను చేరిన పిమ్మట యోవాబు అతనితో రహస్యముగా మాట్లాడగోరినట్లే నటించుచు నగర ద్వారము వద్దకు తోడ్కొనిపోయెను. తన తమ్ముడు అసాహేలును చంపినందుకు పగ తీర్చుకోగోరి యోవాబు అబ్నేరును అచట కత్తితో పొట్టలో పొడవగా అతడు ప్రాణములు విడిచెను.
28. తరువాత దావీదు ఈ సంగతి తెలిసికొనెను. అతడు "నేరు కుమారుడు అబ్నేరు చావునకు యావే సమక్షమున నేను నా రాజ్యము బాధ్యులము కాము.
29. ఈ అపరాధమునకు యోవాబు అతని కుటుంబము వారు ఉత్తర వాదులు అగుదురుగాక! యోవాబు కుటుంబమున ఎప్పుడు ఎవడో ఒకడు రక్తస్రావరోగియో, కుష్ఠరోగియో, వీడి వాడో, కత్తివాతబడువాడో, అడుగుకొని బ్రతుకువాడో అగునుగాక!” అనెను.
30. అబ్నేరు గిబ్యోను యుద్ధమున అసాహేలును చంపెనుగదా! అందుకే యోవాబు అతని తమ్ముడు అబీషాయి, అబ్నేరుపై పగతీర్చుకొనిరి.
31. దావీదు యోవాబును, అతని అనుచరులను చూచి “మీరు బట్టలుచించుకొని, గోనెలుతాల్చి అబ్నేరు ఎదుట విలపింపుడు” అని చెప్పెను. రాజు స్వయముగా అబ్నేరు పాడెవెంట నడచెను.
32. అతనిని హెబ్రోనున పాతి పెట్టిరి. రాజు అబ్నేరు సమాధిచెంత పెద్దగా ఏడ్చెను. పౌరులును విలపించిరి.
33-34. అపుడు రాజు దుఃఖముతో క్రింది శోకగీతికను వినిపించెను: “అబ్నేరు పిచ్చివానివలె చనిపోయెనుగదా! మిత్రమా! నీ కాలుసేతులను కట్టివేయలేదు అయినను మోసగాండ్ర చేజిక్కిన వానివలె మడిసితివిగదా!" ఆ మాటలువిని ప్రజలందరు మరల విలపించిరి.
35. అప్పటికింకను ప్రొద్దుక్రుంకలేదు. ప్రజలందరు దావీదును ఆహారము తినుమని బ్రతిమాలిరి. కాని దావీదు “సూర్యుడు అస్తమింపకముందు ఆహారము ముట్టుకొందునేని దేవుడు నన్ను శపించుగాక!” అని ఒట్టు పెట్టుకొనెను.
36. ప్రజలు ఆ మాటలకు సంతసించిరి. అసలు రాజు చేసిన ప్రతి పనియు ప్రజలకు నచ్చెను.
37. నేరు కుమారుడు అబ్నేరును చంపుట రాజునకు సమ్మతముకాదని యిస్రాయేలీయులందరు నాడు తెలిసికొనిరి.
38. రాజు తన ఉద్యోగులతో “నేడు యిస్రాయేలీయులందు రాజవంశీయుడగు మహావీరుడొకడు గతించెను.
39. నేను రాజుగా అభిషిక్తుడనైనను దుర్భలుడను. ఈ సెరూయా కుమారులు నాకు లొంగుటలేదు. కీడు చేసిన దుర్మార్గులను ప్రభువే ఉచితరీతిగా శిక్షించునుగాక!” అనెను.
1. హెబ్రోనున అబ్నేరును చంపిరని వినగనే ఈష్బోషెతునకు గుండెచెదరెను. యిస్రాయేలీయులు కూడ ధైర్యము కోల్పోయిరి.
2. ఈష్బోషెతు కొలువున ఇరువురు ఉద్యోగులుండిరి. వారి పేర్లు రేకాబు, బానా. బెయేరోతు నివాసి, బెన్యామీనీయుడునగు రిమ్మోను వారి తండ్రి. (బెయేరోతు కూడ బెన్యామీను మండలమునకు చెందినదే.
3. బెయేరోతు పౌరులు గిత్తాయీమునకు పారిపోయి నేటివరకు అచ్చటనే పరదేశులుగా బ్రతుకుచున్నారు.)
4. సౌలు కుమారుడైన యోనాతానునకు కుంటి వాడైన కొడుకు ఒకడు కలడు. అతడు ఐదేండ్లవాడై యుండగా సౌలు యోనాతాను యుద్ధమున కూలిరని యెస్రెయేలు నుండి వార్తలు వచ్చెను. వెంటనే దాది అతనిని తీసికొని వడివడిగా పరుగిడుచుండగా వాడు పడి కుంటివాడయ్యెను. ఆ బాలుని పేరు మెఫీబోవెతు.
5. బెయేరోతు పౌరుడైన రిమ్మోను కుమారులు రేకాబు, బానా అనువారు ప్రయాణమై వచ్చి ఈష్బోషెతు ఇల్లు చేరిరి. అది మిట్టమధ్యాహ్నము. సూర్యుడు నిప్పులు చెరుగుచుండెను. ఎండవేడిమికి విశ్రాంతి గైకొనుచు ఈష్బోషెతు పడుకపై పరుండియుండెను.
6. ద్వారపాలిక గోధుమలు కడుగుచు కునుకుపాటున తూగుచుండెను.
7. రేకాలు, వాని తమ్ముడు బానా మెల్లమెల్లగా ఇల్లు సొచ్చి ఈష్బోషెతు పరుండియున్న పడుక గదిలో ప్రవేశించిరి. అతనిని వధించి తల నరికిరి. ఆ తల తీసికొని రాత్రియంతయు యోర్దాను లోయవెంట ప్రయాణము చేసిరి.
8. వారు హెబ్రోను చేరి ఈష్బోషెతు శిరస్సును దావీదునకు సమర్పించిరి. “నీ ప్రాణములు తీయుటకు సిద్ధపడిన సౌలు కుమా రుడు ఈష్బోషెతు శిరస్సిదిగో! నేడు ప్రభువు పక్షమున యావే సౌలుమీదను, అతని కుమారునిమీదను పగతీర్చుకొనెను” అనిరి.
9. కాని దావీదు ఆ అన్నదమ్ములను చూచి “నన్ను సకల ఆపదల నుండి కాపాడిన యావే జీవము తోడు!
10. మునుపొకడు సౌలు మరణవార్తలతో వచ్చి నాకు శుభవార్తలు కొనివచ్చితిననుకొనెను. కాని నేను సిక్లాగున వాని తలతీయించితిని. ఆ రీతిగా వాని శుభవార్తలకు సంభావన జరిగినది.
11. ఇక నేడు బందిపోటు దొంగలు నిర్దోషిని ఒకనిని, అతని ఇంటనే పండుకొన్న పడుకమీదనే వధించిరనిన నేను వారిని మాత్రము సంభావింపకుందునా? మీ దోషమునకు మీరే బాధ్యులు కనుక మీ అడపొడ కానరాకుండ చేసెదను” అనెను.
12. అంతట దావీదు ఆనతినీయగా సైనికులు ఆ మనుష్యుల మీదబడి వారిని తునుమాడిరి. వారి కాలుసేతులు తెగనరికి మొండెములను హెబ్రోను కొలనుచెంత వ్రేలాడగట్టిరి. ఈష్బోషెతు శిరస్సును మాత్రము హెబ్రోనునందు అబ్నేరు సమాధిలోనే పాతి పెట్టిరి.
1. అంతట యిస్రాయేలీయుల తెగలన్ని హెబ్రోనున దావీదు కడకు వచ్చి “మేమందరము నీ ఎముకనంటినవారము, రక్తసంబంధులము.
2. పూర్వము సౌలు పరిపాలించినపుడు యిస్రాయేలు సైన్యములను నడిపించిన వాడవునీవే. యావే 'నీవు నా ప్రజలకు కాపరివి, నాయకుడవు అయ్యెదవు' అని నిన్ను గూర్చియే సెలవిచ్చెను” అనిరి.
3. పెద్దలందరు హెబ్రోనుకు రాగా దావీదు యావే సమక్షమున వారితో ఒడంబడిక చేసికొనెను. అంతట పెద్దలు అతనిని యిస్రాయేలీయులకు రాజుగా అభిషేకించిరి.
4. దావీదు రాజగునప్పటికి ముప్పదియేండ్లవాడు. అటు తరువాత నలువదియేండ్లు పరిపాలించెను.
5. అతడు హెబ్రోనున ఏడున్నరయేండ్లు యూదీయులను పాలించెను. యెరూషలేమున ముప్పది మూడేండ్లు యిస్రాయేలు యూదా వారలందరిమీద పాలించెను.
6. దావీదు బలగముతోపోయి యెరూషలేమును ముట్టడించి ఆ నగరము నేలుచున్న యెబూసీయుల నెదుర్కొనెను. యెబూసీయులు దావీదును చూచి “నీవు ఈ నగరమును పట్టుకోజాలవు. కుంటివారును, గ్రుడ్డివారును పట్టణమును కాపాడగలరు” అనిరి. అనగా పురము అతని వశము కాదని వారి భావము.
7. అయినను దావీదు సియోను దుర్గమును పట్టు కొనెను. ఈ పురమునకే దావీదునగరమని పేరు.
8. ఆ రోజున దావీదు తన అనుచరులతో “సొరంగము గుండ పోయి యెబూసీయులను తునుమాడువారందరు నీటికాలువ పైకి వెళ్ళి దావీదునకు అసహ్యమైన గ్రుడ్డివారిని, కుంటివారిని హతము చేయవలెనని చెప్పెను..” ఈ హేతువునుబట్టి గ్రుడ్డివారును, కుంటివారును ఉన్నారు. అతడు ఇంటిలోనికి రాలేడు అను సామెత పుట్టెను.
9. దావీదు యెరూషలేము దుర్గమున వసింప మొదలిడెను. దానికి దావీదు నగరమని పేరిడెను. అతడు పురముచుట్టు ప్రాకారము కట్టించెను. అది మిల్లో అను చోటినుండి నగరము దిగువవరకు పోవును.
10. సైన్యములకు అధిపతి యగు యావే దావీదునకు చేదోడువాదోడుగా నుండెను గనుక అతడు నానాటికి పెంపుచెందెను.
11. తూరు రాజగు హీరాము దేవదారు కలపతో, వడ్రంగులతో, కాసెపనివాండ్రతో దావీదువద్దకు దూతలను పంపెను. వారు దావీదుకొక ప్రాసాదము నిర్మించిరి.
12. దావీదు యావే తనను యిస్రాయేలీయుల మీద రాజుగా పాదుకొల్పెననియు, ఆయన తన ప్రజల మేలుకొరకు రాజ్యమును వృద్ధిచేసెననియు గ్రహించెను.
13. హెబ్రోను వీడి యెరూషలేమున స్థిరపడిన పిదప దావీదు మరల భార్యలను, ఉంపుడుకత్తెలను స్వీకరించెను. అతనికి ఇంకను కుమారులు, కుమార్తెలు కలిగిరి.
14-16. యెరూషలేమున పుట్టిన బిడ్డలు వీరు: షమ్మా, షోబాబు, నాతాను, సొలోమోను, ఇభారు, ఎలీషువా, నేపెగు, యాఫీయా, ఎలీషామా, ఎల్యాదా, ఎలీఫేలెటు.
17. దావీదు యిస్రాయేలీయులమీద రాజుగా అభిషిక్తుడయ్యెనని విని ఫిలిస్తీయులందరు ఒక్కపెట్టున ఎత్తివచ్చి అతనిమీదబడిరి. ఆ సంగతివిని దావీదు కొండదుర్గములోనికి చేరెను.
18. ఫిలిస్తీయులు వచ్చి రెఫాయీము లోయయంతట నిండిరి.
19. దావీదు యావేను సంప్రతించి “నేను వెడలిపోయి ఫిలిస్తీయులను ఎదుర్కొనవచ్చునా? నీవు వారిని నా వశము చేయుదువా?” అనెను. యావే “వెడలిపొమ్ము. నేను ఫిలిస్తీయులను తప్పక నీకప్పగించెదను” అని చెప్పెను.
20. అతడు బాలుపెరాసీము వద్ద ఫిలిస్తీయులను ఎదిరించి వారిని తుడిచినట్టుగ తునుమాడెను. ఏటి పొంగు నదిఒడ్డులనుకోసి కూల్చివేసినట్లే ప్రభువు శత్రువుల మీదబడి వారి సైన్యములను కూల్చివేసెనను కొని దావీదు ఆ చోటికి బాల్పెరాసీము' అని పేరు పెట్టెను.
21. ఫిలిస్తీయులు తొందరపాటువలన తమ గృహదేవతావిగ్రహములను అక్కడే వదలివేసిరి. దావీదు అతని అనుచరులు వానిని అటనుండి తీసి వేసిరి.
22. ఫిలిస్తీయులు మరల దావీదుపై దండెత్తి వచ్చి రెఫాయీము లోయ పొడుగున నిండిరి.
23. దావీదు యావేను సంప్రతింపగా ప్రభువు “ఈమారు ఫిలిస్తీయులనెదురుగా పోయి పోరాడవలదు. వెనుక వైపు నుండి వచ్చి కంబలిచెట్ల తోపు వద్ద వారిమీద పడుము.
24. కంబలిచెట్ల కొనలమీద అడుగుల చప్పుడు వినిపించినపుడు పోయి ఫిలిస్తీయులను తాకుము. శత్రువులను సంహరించుటకై ప్రభువే నీకు ముందుగా నడచుచున్నాడని గ్రహింపుము” అని చెప్పెను.
25. దావీదు యావే ఆజ్ఞాపించినట్లే చేసి శత్రువులను గెబా నుండి గేసేరువరకు తరిమికొట్టెను.
1. దావీదు యిస్రాయేలీయులనుండి ముప్పది వేలమంది వీరులను ఎన్నుకొనెను.
2. వారిని వెంటనిడుకొని కెరూబుదూతలమధ్య నివసించు, సైన్యములకు అధిపతియగు యావే పేర వెలయు మందసమును కొనివచ్చుటకై యూదానందలి బాలాకు పయనమై పోయెను.
3. వారు మందసమును క్రొత్త బండి మీదికెక్కించి కొండమీది అబీనాదాబు ఇంటినుండి తరలించుకొని వచ్చిరి.
4. అబీనాదాబు పుత్రులగు ఉస్సా, అహ్యో బండి తోలించుచుండిరి. ఉస్సా బండి ప్రక్కన, అహ్యో బండిముందట నడచుచుండిరి.
5. వాద్యకారులు సితారా, మృదంగము, తంబుర, స్వరమండలము, తాళములను వాయించుచుండగా దావీదు, యిస్రాయేలీయులు తన్మయులై యావే ముందట నాట్యమాడిరి.
6. వారు నాకోను కళ్ళము వద్దకు వచ్చిరి. అచట ఎడ్లు బండిని గతుకులలోనికి ఈడ్చుటచే మందసముజారి క్రిందపడబోయెను. కనుక ఉస్సా చేయిచాచి దానిని పట్టుకొనెను.
7. కాని యావే ఉగ్రుడై ఉస్సా నేరము సహింపక, ఉన్నవానిని ఉన్నట్లు శిక్షించెను. అతడు మందసము ప్రక్కన కూలి ప్రాణము విడిచెను.
8. ఆ రీతిగా యావే ఉస్సా మీద పడినందుకు దావీదు ఆ తావునకు పేరెస్ ఉస్సా ' అని పేరు పెట్టెను. నేటికిని ఆ తావు అదే పేరుతో పిలువబడుచున్నది.
9. నాడు దావీదు యావేకు భయపడి, దైవమందసమును ఇంటికి కొనిపోవుట మేలాయని అనుమానపడెను.
10. కనుక అతడు మందసమును దావీదుపురమునకు కొనిపోవుట చాలించి గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటికి చేర్చెను.
11. అతని ఇంట మందసము మూడుమాసములు ఉండెను. యావే ఓబేదెదోమును, అతని కుటుంమును చల్లనిచూపు చూచెను.
12. మందసము మూలముగా యావే ఓబేదెదోము కుటంబమును, అతని ఆస్తిపాస్తులను వృద్ధిచేసెనని దావీదు వినెను. అతడు సంతసముతో మందసమును తన నగరికి కొనివచ్చెను.
13. మందసమును మోయువారు ఆరేసి అడుగులు వేసినపిదప దావీదు కోడెను, బలసిన పొట్టేలును బలిఅర్పించెను.
14. రాజు, యాజకులు ధరించు నారబట్టతాల్చి యావే ముందు తన్మయుడై నాట్యమాడెను.
15. అతడును, యిస్రాయేలీయులును కొమ్మునూదుచు, పెద్ద పెట్టున నాదములు చేయుచు, యావే మందసమును కొనివచ్చిరి.
16. మందసము నగరము ప్రవేశించుచుండగా సౌలు కూతురు మీకాలు కిటికీనుండి చూచెను. దావీదు మందసము ముందు గంతులు వేయుచు నాట్యమాడు చుండెను. మీకాలు దావీదును గాంచి ఏవగించుకొని అతనిని చిన్నచూపుచూచెను.
17. జనులు మందసమును కొనివచ్చి, దావీదు ముందుగనే సిద్ధముచేసిన గుడారున ప్రతిష్ఠించిరి. రాజు దహనబలులు, సమాధానబలులు సమర్పించెను.
18. బలులు ఒసగిన పిమ్మట సైన్యములకు అధిపతియైన యావే పేర ప్రజలను దీవించెను.
19. స్త్రీలు, పురుషులనక యిస్రాయేలీయులందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రొట్టెను, కొంత మాంసమును, ఎండిన ద్రాక్షపండ్లను పంచి పెట్టెను. అంతట అందరు తమతమ ఇండ్లకు వెళ్ళి పోయిరి.
20. దావీదు తన కుటుంబమును కూడ దీవింప వచ్చెను. సౌలు కూతురు మీకాలు అతనికి ఎదురుపడి “నేడు యిస్రాయేలు రాజు బట్టలు వూడిన కూడ పనికత్తెల ఎదుట పిచ్చివానివలె నాట్యమాడి ఎంత గౌరవము తెచ్చుకొనెను!” అని ఎత్తిపొడిచెను.
21. అతడు “నేను యావే ఎదుట నాట్యమాడితిని. ప్రభువు నీ తండ్రిని, అతని కుటుంబమును కాదని తన ప్రజలైన యిస్రాయేలీయులకు నన్ను నాయకునిగా నియమించెను. ఆ ప్రభువు ఎదుట నేను నాట్యము చేయవలదా?
22. నేనింతకంటె ఎక్కువగా అగౌరవము పాలయ్యెదనుగాక! నీ కంటికింకను చులుకన అయ్యెదనుగాక! కాని నీవు పేర్కొనిన ఆ పనికత్తెలు మాత్రము నన్ను మన్నన చేయకపోరు” అనెను.
23. సౌలు కూతురు మీకాలునకు మాత్రము చనిపోవువరకును సంతానము కలుగలేదు.
1. దావీదు తన నగరమున సురక్షితముగా జీవించుచుండెను. ప్రభువు అనుగ్రహమువలన ఇరుగు పొరుగు శత్రువులెవ్వరును అతనిని బాధింపరైరి.
2. అతడు నాతాను ప్రవక్తతో “నేను దేవదారు ప్రాసాద మున వసించుచున్నాను. ప్రభు మందసము మాత్రము డేరాలో పడియున్నది” అనెను.
3. ప్రవక్త అతనితో “నీవు నిశ్చయించుకున్న కార్యమును నెరవేర్పుము. ప్రభువు నీకు తోడైయుండును” అని చెప్పెను.
4. కాని ఆ రాత్రియే ప్రభువాక్కు నాతానుతో ఇట్లు చెప్పెను.
5. "నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభువు ఈ విధమున సెలవిచ్చుచున్నాడని చెప్పుము. 'నీవు నేను నివసించుటకు ఒక మందిరమును నిర్మింతువా?'
6. నేను యిస్రాయేలీయులను ఐగుప్తునుండి తరలించుకొని వచ్చిన నాటినుండి నేటి వరకు గుడారమున పయనించుచు వచ్చితినేకాని మందిరమున వసించితినా?
7. నేను యిస్రాయేలీయులకు అధిపతులనుగా నియమించిన తెగనాయకులతో నాకు దేవదారు మందిరము నిర్మింపరైతిరి గదాయని నా సంచారములందెన్నడైన పలికియుంటినా?
8. కనుక నీవు నా సేవకుడైన దావీదుతో సైన్యములకు అధిపతియగు యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడని వచింపుము. నీవు పొలమున గొఱ్ఱెలు కాచుకొను చుండగా నేను నిన్ను కొనివచ్చి నాప్రజలైన యిస్రాయేలీయులకు నాయకుని చేసితిని.
9. నీవు శత్రువులమీదికి పోయినపుడెల్ల నేను నీకు అండగా నిలిచి నీ పగవారిని కడతేర్చితిని. భూమిమీది మహారాజులకెంతటి ప్రఖ్యాతి కలుగునో నీకును అంతటి ప్రసిద్ధి లభించునట్లు చేసితిని.
10. నా ప్రజలైన యిస్రాయేలీయులకు ఒక స్థలము సిద్ధము చేసితిని. వారినటనెలకొల్పెదను. నా జనులు తమతావున సురక్షితముగా జీవింతురు. పూర్వము నేను వారిని న్యాయాధిపతుల ఆధీనమున ఉంచినప్పటివలె దుర్మార్గులగు శత్రువులు వారిమీదికి ఒంటికాలిమీద ఇకరారు.
11. నేను నిన్ను శత్రువుల బారినుండి తప్పింతును. నేనే నీకొక ఇంటిని నిర్మింతును.
12. నీవు రోజులునిండి నీ పితరులను కలిసికొనిన పిమ్మట నీ మేనినుండి వెలువడిన తనయునే నా రాజ్యమునకు అధిపతిని చేసెదను. అతని యేలుబడిని ధ్రువ పరచెదను.
13. అతడు నాకు మందిరము నిర్మించును. నేను అతని సింహాసనమును కలకాలము స్థిరపరచెదను.
14. నేను అతనికి తండ్రినయ్యెదను. అతడు నా కుమారుడగును. అతడు తప్పు చేసెనేని, నరులు బిడ్డలను బెత్తముతో మోది శిక్షించునట్లే శిక్షింతును.
15. నిన్ను నియమించుటకై మునుపు నేను కరుణింపక నిరాకరించిన సౌలునకువలె గాక అతనికి నా కృపను ఎల్లప్పుడు చూపుదును.
16. నీ కుటుంబము, నీ రాజ్యము కలకాలము నా కనుసన్నలమనును. నీ సింహాసనము నిత్యము నెలకొనియుండును.”
17. ఈ రీతిగా దేవుడు దర్శనమున తెలియజేసిన సంగతులనన్నిటిని నాతాను దావీదునకు ఎరుకపరచెను.
18. అపుడు దావీదురాజు డేరాలోనికి ప్రవేశించి యావే ఎదుట కూర్చుండి ఇట్లు ప్రార్థించెను. "ప్రభూ! నీవు నన్నింతగా పెద్ద చేయుటకు నేనేపాటివాడను? నా కుటుంబము ఏపాటిది?
19. అయినను నీ దృష్టికి ఇదేమియు గొప్పగాదు. నీ వాగ్దానము పెక్కు తరముల వరకు ఈ సేవకుని కుటుంబమునకు వర్తించును.'
20. నీవు ఈ సేవకుని కరుణించితివి. ఇక నేను విన్నవించుకో తగ్గదేమున్నది?
21. నాకు ఘనత కూర్పనెంచియేగదా ఇంతటి వానిని చేసితివి! నీ సంకల్పము నెరవేర్చుకొంటివి.
22. కనుకనే నీవు మహాదేవుడవు. నీవంటివాడేడి? నీవు తప్ప వేరొకదేవుడు లేనే లేడని మా పెద్దలవలన వింటిమి. అది ముమ్మాటికి నిజమే.
23. యిస్రాయేలీయులు నీ ప్రజలు. నీవు వారిని తరలించుకొని వచ్చితివి. నీ స్వంత ప్రజలుగా చేసి కొంటివి. వారి తరపున మహాకార్యములు చేసి గొప్ప పేరు తెచ్చుకొంటివి. వారిని ఎదిరించు శత్రుజాతు లను, ఆ జాతుల దైవములను తరిమివేసితివి. భూమిపై నీ ప్రజలవంటి ప్రజలింకెవరైనను ఉన్నారా?
24. ఈ జనులను కలకాలమువరకు నీ వారినిగా ఎన్నుకొంటివి. నీవే వీరికి దేవుడవైతివి.
25. ప్రభూ! నీ యీ సేవకునకు, ఇతని కుటుంబమునకు నీవు చేసిన వాగ్దానమును యుగయుగములవరకు నిల బెట్టుకొనుము. నీవు చెప్పిన ప్రకారమే చేయుము.
26. సైన్యములకధిపతియగు యావే యిస్రాయేలీయుల దేవుడని ప్రజలు నిన్ను ఎల్లప్పుడును సన్నుతింతురు గాక! నీ సేవకుడు దావీదు కుటుంబము నీ ప్రాపున కలకాలము నిలుచును.
27. సైన్యములకధిపతివై, యిస్రాయేలీయుల దేవుడవైన నీవే 'నేను నీకొక మందిరమును నిర్మింతును' అని ఈ దాసునకు తెలియ పరచితివి. కనుకనే నేడు నీ ఎదుట నేను ఈ ప్రార్ధన చేయసాహసించితిని.
28. ప్రభూ యావే! నీవు యథార్థముగా దేవుడవు. నీ పలుకులు పరమసత్యములు. నీ సేవకుని గూర్చి ఈ మేలిమాట పలికితివి.
29. కావున నీవు ఈ దాసుని వంశమును దీవింతువేని నా కుటుంబమువారు కలకాలము నీ ఎదుట బ్రతికి పోవుదురు. ప్రభూ! నీవు మాట ఇచ్చితివి. ఇక, నీ దీవెనవలన ఈ దాసునివంశము సదా వర్ధిల్లుగాక!”
1. దావీదు ఫిలిస్తీయులను జయించి లోబరచుకొనెను. మెతెగమ్మాను వారిచెంతనుండి గైకొనెను.
2. అతడు మోవాబీయులను కూడ జయించెను. వారిని వరుసగా నేలపై పరుండబెట్టి ఆ వరుసపొడవును త్రాటితో కొలిపించెను. ప్రతి రెండు త్రాళ్ళ పొడవువారిని మట్టు పెట్టించి, ప్రతియొక త్రాటిపొడవున ఉన్న వారిని ప్రాణములతో వదలివేసెను. మోవాబీయులు దావీదునకు సామంతులై కప్పము కట్టిరి.
3. రేహోబీయుడును, సోబా రాజైన హదదెసెరు యూఫ్రటీసు నదీతీరమును జయించుటకై దాడికి వెడలుచుండగా త్రోవలో దావీదు అతనిని ఎదిరించి ఓడించెను.
4. ఆ రాజు సైన్యములనుండి పదునేడు వందల గుఱ్ఱములను, వేయిమంది సైనికులను పట్టు కొనెను. కాని వందగుఱ్ఱములను మాత్రము తన నగరమున వాడుకొనుటకు ఉంచుకొని, మిగిలిన అన్నిటికి గురి కాలినరములు తెగగొట్టించెను.
5. సోబారాజుకు సాయపడుటకై అర్మీయులు ప్రోగైవచ్చిరి. కాని దావీదు వారినెదుర్కొని ఇరువది రెండువేల మందిని మట్టు పెట్టెను. వారి దేశమున పటాలములను కూడనిల్పెను.
6. ఆ రీతిగా అర్మీయులు దావీదునకు లోబడి కప్పము చెల్లించిరి. దావీదు పోరాడినచోటులనెల్ల యావే విజయము ప్రసాదించెను.
7. అతడు హదదెసెరు అంగరక్షకులు మోయు బంగారు డాళ్ళనుగైకొని యెరూషలేమునకు కొని వచ్చెను.
8. ఆ రాజునకు చెందిన బేతా, బెరోతయి నగరములనుండి పెద్ద మొత్తము ఇత్తడిసొమ్మును కూడ తీసికొనివచ్చెను.
9. హమాతు రాజు తోయి, దావీదు హదదెసెరు సైన్యమును ఓడించెనని విని అతనిని అభినందించు టకు తన కుమారుడైన హదోరామును పంపెను.
10. హదదెసెరు తోయికి శత్రువు. హదోరాము బంగారు, వెండి, ఇత్తడి పనిముట్లను కొనివచ్చి దావీదునకు కానుకగా ఇచ్చెను. దావీదు వానిని యావేకు సమర్పించెను.
11-12. దావీదు అంతకుముందే తనకు లొంగిపోయిన ఎదోమీయులు, మోవాబీయులు, అమ్మోనీయులు, ఫిలిస్తీయులు, అమాలేకీయులు మొద లగు జాతులనుండి గైకొనిన వెండిబంగారు వస్తువు లను, రెహోబీయుడును సోబారాజగు హదదె సెరు నుండి చేకొనిన కొల్లసొమ్మును యావేకు సమర్పించెను.
13. దావీదు యుద్ధమునుండి తిరిగివచ్చిన తరువాత ఉప్పులోయలో ఎదోమీయులను ఎదుర్కొనెను. పదునెనిమిదివేల మందితో వచ్చిన వారి సైన్యము నంతటిని చికాకుపరచెను.
14. ఎదోము మండలమున పటాలములనుంచెను. వారు అతనికి లొంగి పోయిరి. దావీదు పేరు నేల నాలుగు చెఱగులకు ప్రాకెను. ఈ రీతిగా దావీదు పోరాడిన చోట్లనెల్ల యావే విజయము ప్రసాదించెను.
15. దావీదు యిస్రాయేలీయులనందరిని పరిపాలించెను. తన ప్రజలందరకు చక్కని తీర్పుతీర్చి న్యాయమును, సమానత్వమును కాపాడెను.
16. సెరూయా కుమారుడు యోవాబు అతని సైన్యాధిపతి. అహీలూదు పుత్రుడు యెహోషాపాతు లేఖకుడు
17. అహీటూబు తనయుడు సాదోకు, అహీమెలెకు కొడుకు అబ్యాతారు యాజకులు. సెరాయా కార్యదర్శి.
18. యెహోయాదా కుమారుడు బెనాయా రాజునకు అంగరక్షకులైన కెరెతీయులకు, పెలెతీయులకు నాయకుడు. దావీదు కుమారులును యాజకులైరి.
1. దావీదు “సౌలు కుటుంబమువారు ఇంకెవరైన మిగిలియున్నారా? యోనాతానును స్మరించుకొని వారిని కరుణింతును” అనెను.
2. సౌలు కుటుంబమునకు సేవచేయు దాసుడు సీబా అనునతడు ఒకడు కలడు. అతనిని దావీదు చెంతకు పిలవనంపిరి. రాజు అతనిని చూచి “సీబావు నీవేనా?” అని అడుగగా వాడు “చిత్తము నేనే” అని పలికెను.
3. రాజు “సౌలు కుటుంబము వారెవరును బ్రతికియుండలేదా? యావే పేర నేను వారికి ఉపకారము చేసెదను” అని అడిగెను. సీబా "యోనాతాను పుత్రుడొకడు మిగిలియున్నాడు. అతడు కుంటివాడు” అని చెప్పెను.
4. అతడెక్కడ ఉన్నాడని దావీదు మరల అడుగగా సీబా “లోదెబారున, అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఇంట వసించు చున్నాడు” అని విన్నవించెను.
5. కావున రాజతనిని లోదెబారు నందలి మాకీరు ఇంటినుండి పిలిపించెను.
6. సౌలు మనుమడును యోనాతాను కుమారుడునగు మెఫీబోషెతు దావీదు సమక్షమునకు రాగానే సాగిలపడి దండము పెట్టెను. దావీదు అతనిని “మెఫీబోషెతూ” అని పిలచెను. అతడు “చిత్తము ప్రభూ!” అనెను.
7. దావీదు “భయపడకుము. నీ తండ్రి యోనాతానును స్మరించుకొని నీపై దయ చూపెదను. నీ పితరుడైన సౌలు భూములన్నింటిని నీకు తిరిగి ఇప్పింతును. నీవు ఇకమీదట నా సరసన కూర్చుండి భోజనము చేయుము” అని చెప్పెను.
8. మెఫిబోషేతు మరల దండము పెట్టి “ఏలిక ఈ దాసునికెంతటి ఆదరము చూపెను! నేనేపాటివాడను? చచ్చిన కుక్కవంటివాడను గదా!” అనెను.
9. దావీదు సీబాతో “సౌలు కుటుంబమునకు చెందిన ఆస్తిపాస్తులను మీ యజమానుని పుత్రుని వశము చేసెదను.
10. నీవును, నీ కుమారులును, నీ దాసులును మీ యజమానుని పొలములు సాగుచేయుడు. పంట సేకరించి మెఫీబోషెతు కుటుంబమునకు ధాన్యము సమకూర్పుడు. మీ యజమానుని కుమారుడు మెఫీబోషెతు మాత్రము ప్రతిదినము నా ఇంటనే భుజించును” అని చెప్పెను. సీబాకు పదునైదుగురు కుమారులు, ఇరువదిమంది దాసులు కలరు.
11. అతడు రాజుతో “ఏలిక ఆనతిచ్చిన తీరునే ఈ సేవకుడు అంతయు చక్కబెట్ట గలడు” అని విన్నవించెను.
12. మెఫిబో షెతు రాజపుత్రులవలె దావీదు ఇంటనే భుజించెను. అతనికి మీకా అను బిడ్డడు కలడు. సీబా కుటుంబమువారందరు అతనికి సేవకులైరి.
13. మెఫీబోషెతు యెరూషలేముననే వసించి రాజగృహమున భుజించెను. అతని రెండుకాళ్ళు కుంటివి.
1. అమ్మోనీయుల రాజు చనిపోయెను. అతని కుమారుడు హానూను రాజ్యమునకు వచ్చెను.
2. దావీదు “నాహాషు నన్నాదరించినట్లే, నేను నాహాషు కుమారుడైన హానూనును ఆదరింతును” అనుకొని “నీ తండ్రి మృతి నొందినందులకు మిక్కిలి సంతాపము చెందుచున్నాను” అని దూతలద్వారా వార్తనంపెను.
3. కాని దావీదు రాయబారులు రాగానే అమ్మోనీయ నాయకులు తమ రాజును చేరి “దావీదు దూతలతో సంతాపవార్తలు పంపినది నీ తండ్రి పట్లగల గౌరవము చేతనే అనుకొంటివా? వేగు నడపి మన నగరమును ముట్టడించుటకే అతడు చారులను పంపెనని నీకు అనిపించుటలేదా” అనిరి.
4. హానూను వారి మాటలు నమ్మెను. దావీదు రాయబారులను పట్టుకొని వారి గడ్డములనొకచెంప పూర్తిగా గొరిగించి, ఉడుపులను నడిమికి పిరుదుల వరకు కత్తిరించి పంపివేసెను.
5. దావీదు ఈ సంగతిని వినెను. సిగ్గున మ్రగ్గిపోవు తన రాయబారులను కలిసికొనుటకై దూతలనంపి “మీరు గడ్డములు పెరిగినదాక యెరికో నగరముననే ఉండి అటుపిమ్మట మరలిరండు" అని వార్త పంపెను.
6. అమ్మోనీయులు దావీదును రెచ్చగొట్టితిమని గ్రహించి బెత్రేహోబు, సోబా మండలముల నుండి అరామీయుల కాలిబంటులను ఇరువది వేలమందిని జీతములిచ్చి పిలిపించుకొనిరి. మాకా రాజు వేయి మందిని పంపెను. టోబు నుండి పండ్రెండువేలమంది వచ్చిరి.
7. దావీదు ఈ సంగతి తెలిసికొని తన తాత్కాలిక సైన్యముతో, స్థిర సైన్యములతో యోవాబును అమ్మోనీయుల మీదకు పంపెను.
8. అమ్మోనీయులు నివాసములు వెడలివచ్చి నగరద్వారము వద్ద వరుసలు తీరిరి. సోబా, రెహోబు, మాకా, టోబు రాజ్యముల నుండి వచ్చిన వీరులు అమ్మోనీయుల ఊరికి కొంచెము దూరముగా బయలున వ్యూహము పన్నిరి.
9. ఆ తీరు చూచి యోవాబు ముందు వెనుకల కూడ పోరు నడపవలయునని గ్రహించెను. అతడు యిస్రాయేలీయులలో శూరులనెన్నుకొని అరామీయులకు ఎదురుగా నిలిపెను.
10. మిగిలిన వారిని తన తమ్ముడైన అబీషాయికి అప్పగించెను. అతడు వారిని అమ్మోనియులకు ఎదురుగా నిలిపెను.
11. యోవాబు తమ్మునితో “అరామీయులు మమ్ము మించి గెలువజూతురేని నీవు వచ్చి నాకు సాయపడుము. అమ్మోనీయులు నిన్ను గెలువజూతురేని నేను వచ్చి నీకు తోడ్పడెదను.
12. ధైర్యముతో నుండుము. మన ప్రజలకొరకు మన దేవుని పట్టణముల కొరకు పరాక్రమముతో పోరాడుదము. అటుపిమ్మట యావే తన యిచ్చవచ్చిన రీతిని చేయునుగాక!” అని పలికెను.
13. యోవాబు తన వీరులతో అరామీయులను ఎదుర్కొనగా వారతని ముందు నిలువజాలక పారిపోయిరి.
14. అరామీయులు పారిపోవుట చూచి అమ్మోనీయులు కూడ అబీషాయి ఎదుటినుండి పలాయనమై నగరమున జొరబడిరి. అంతట యోవాబు అమ్మోనీయులను వీడి యెరూషలేమునకు మరలెను.
15. అరామీయులు యిస్రాయేలీయులకు ఓడిపోయితిమిగదా అని వగచి తమ వారినందరను ప్రోగుచేసికొనిరి.
16. హదదెసెరు దూతలనంపి యూఫ్రటీసు నదికి ఆవలిదరినున్న అరామీయులను కూడ విలువనంపెను. వారందరు ప్రోగైవచ్చి హదదె సెరు సైన్యాధిపతి షోబాకు నాయకత్వమున హేలాము నొద్దదిగిరి.
17. దావీదు ఈ ఉదంతము విని యిస్రాయేలీయులనందరను సమకూర్చుకొని యోర్దానునది దాటి హేలాము చేరుకొనెను. అరామీ యులు బారులుతీరి దావీదు నెదుర్కొనిరి.
18. కాని వారు దావీదు దెబ్బలకు తాళలేకపోయిరి. అతడు వారి రథికులను ఏడు వందలమందిని, అశ్వికబలము నలువదివేల మందిని మట్టుపెట్టెను. వారి సైన్యాధిపతి షోబాకు గాయపడి రణరంగముననే మడిసెను.
19. ఈ రీతిగా హదదెసెరుసామంతులెల్ల యిస్రాయేలీయు లకు లొంగిపోయిరి. వారితో సంధిచేసికొని కప్పము కట్టిరి. అటుతరువాత అరామీయులు అమ్మోనియులకు సాయపడుటకు జంకిరి.
1. వసంతకాలము రాజులు యుద్ధమునకు వెడలుటకు అనువైనకాలము. దావీదు కోరిక పై యోవాబు, రాజు అంగరక్షకులతోను, యిస్రాయేలు సైన్యములతోను బయల్వెడలి అమ్మోనీయుల మండలముపై దాడిసల్పి రబ్బాను ముట్టడించెను. రాజు మాత్రము యెరూషలేముననే ఉండెను.
2. ఒకనాటి సాయంకాలము దావీదు నిద్ర మేల్కొని ప్రాసాదము మీదికిపోయి ఇటునటు పచారు చేయుచు ప్రక్క ఇంట స్నానమాడు స్త్రీ నొకతెను చూచెను. ఆమె మిక్కిలి అందగత్తె.
3. అతడు సేవకులను పిలిచి ఆ స్త్రీ ఉదంతము అడుగగా వారు ఆమె యెలీయాము కూతురు, హితీయుడైన ఊరియా భార్య బత్పైబ అని చెప్పిరి.
4. రాజు సేవకులనంపి బత్పైబను పిలిపింపగా ఆమె అతని యొద్దకు వచ్చెను. బత్పైబ ముట్టుతయై అప్పుడే శుద్ది చేసికొనుచుండెను. దావీదు ఆమెతో శయనించెను. అటుపిమ్మట బత్పైబ ఇంటికి వెడలిపోయెను.
5. ఆమెకు నెలతప్పగా, నేను గర్భవతినైతినని ఇంటనుండి దావీదునకు కబురు పంపెను.
6. దావీదు హితీయుడైన ఊరియాను నా ఎదుటికి పంపుమని యోవాబునకు దూతద్వారా వార్త పంపెను. అతడట్లే చేసెను.
7. ఊరియా తన ఎదుటికి రాగానే దావీదు యోవాబును గూర్చి, యిస్రాయేలు సైన్యములనుగూర్చి, కుశలమడిగి, పోరెట్లు నడచు చున్నదని ప్రశ్నించెను.
8. అతనితో మాటలాడి చాలించిన పిమ్మట, ఇక ఇంటికిపోయి సేద దీర్చుకొమ్మని చెప్పెను. ఊరియా దావీదును వీడి వెడలి పోవగనే రాజు అతని ఇంటికి భోజనపదార్థములను పంపించెను.
9. కాని ఊరియా ఇంటికిపోక, తన ఏలినవారి సేవకులతో పాటు రాజప్రాసాదద్వారమున నిదురించెను.
10. దావీదు ఊరియా ఇంటికి వెళ్ళలేదని వినెను. అతనిని పిలువనంపి “నీవు దూరప్రయాణము చేసి వచ్చితివికదా? ఇంటికి వెళ్ళవా?” అని ప్రశ్నించెను.
11. ఊరియా “మందసమును, యిస్రాయేలు యూదా సైన్యములును గుడారములలో వసించుచుండగను, నా అధిపతియైన యోవాబును నా ప్రభువగు నీ సేవకులును బయట దండులో నుండగను, నేను తిని, త్రాగి ఆలిని కూడుటకు ఇంటికి పోదునా? నీతోడు, నీ జీవము తోడు, నేను ఆలాగు చేయువాడను కాను” అని దావీదుతో అనెను.
12. దావీదు అతనితో "నేడిచటనే యుండుము. రేపు వెళ్ళవచ్చును” అని చెప్పెను. కనుక ఊరియా నాడును యెరూషలేముననే గడపెను.
13. అంతట దావీదు ఊరియాను తనతో భోజనముచేయుటకు పిలిపించెను. అతడు బాగా తిని, త్రాగిన తరువాత దావీదు అతనిని మత్తునిగా చేసెను. ఆ రేయికూడ ఊరియా తన ఏలినవారి సేవకులమధ్య పడకమీద పండుకొనెనేగాని ఇంటికి పోలేదు.
14. మరునాడు ఉదయము దావీదు 'ఊరియా కొట్టబడి హతమగునట్లు అతనిని పోరు ముమ్మరముగా జరుగుచోట ముందటివరుసలో నిల్పి నీవు అతనియొద్ద నుండి వెళ్ళిపొమ్ము ' అని
15. యోవాబునకు ఒక లేఖ వ్రాసి ఊరియా చేత పంపించెను.
16. యోవాబు పట్టణమును ముట్టడించి, వీరులు హోరాహోరిగా పోరు సల్పుదురని తెలిసిన నెలవుననే ఊరియా నుంచెను.
17. అమ్మోనీయులు నగరము వెడలివచ్చి యోవాబును ఎదుర్కొనిపోరాడిరి. దావీదు సైనికులలో కొందరుకూలిరి. వారితోపాటు హితీయుడైన ఊరియా కూడ మడిసెను.
18. యోవాబు దావీదునకు యుద్ధవార్తలు విని పించుటకు దూతనంపెను.
19-20. అతడు దూతతో “నీవు యుద్ధవార్తలు వినిపించిన పిమ్మట రాజు కోపము తెచ్చుకొని 'మీరు పోరు జరుగుచుండగా పట్టణము దాపునకు ఏలపోయితిరి? శత్రువులు కోట గోడల మీదినుండి బాణములు గుప్పింతురని తెలియదా?
21. యెరూబ్బెషెతు కుమారుడైన అబీమెలెకును ఎవరు చంపిరి? తేబేసున ఒక ఆడుది ప్రాకారము మీదినుండి తిరుగటిరాతిని జారవిడుచుటచే గదా అతడు మ్రగ్గిపోయినది? మరి మీరు ప్రాకారము చెంతకేల పోయితిరి?” అని ప్రశ్నించినచో, నీ సేవకుడు ఊరియాకూడ గతించెనని చెప్పుము' ” అని వివరించెను.
22. దూత దావీదునొద్దకు వచ్చి యోవాబు చెప్పుమన్న సంగతులన్నియు పూసగ్రుచ్చినట్లు విన్న వించెను. దావీదు యోవాబుపై కోపము తెచ్చు కొని దూతతో “మీరు కోటగోడల దగ్గరకేల వెళ్ళితిరి? శత్రువులు గోడలమీది నుండి బాణములు విసరుదురని యెరుగరా? యెరూబ్బెషెతు కుమారుడు అబీమెలెకు నెవరు చంపిరి? తేబేసున ఒక ఆడుది ప్రాకారము మీదినుండి తిరుగటి రాతిని జారవిడుచుటచే గదా అతడు మ్రగ్గిపోయినది? మరి మీరు ప్రాకారము చెంతకేలపోయితిరి?” అనెను.
23. దూత “శత్రువులు మామీదపడి నగరమువెలుపలి వరకును నెట్టివేసిరి. మేము వారినెదిర్చి మరల నగరద్వారము వరకును నెట్టుకొనిపోతిమి.
24. అపుడు కోట ప్రాకారము మీదినుండి విలుకాండ్రు మీ సేవకులపై బాణములు విసరిరి. మనవారు కొందరుకూలిరి. హిత్తీయుడైన ఊరియా కూడ గతించెను” అని చెప్పెను.
25. దావీదు సేవకుని చూచి "యోవాబుతో నా మాటగా ఇటుల పలుకుము. 'జరిగిన దానికి వగవకుము. కత్తి ఇచట ఒకనిని అచట నొకనిని బలిగొనుచుండునుగదా! యుద్ధము తీవ్రముచేసి పట్టణమును సాధింపుము. ధైర్యము వహింపుము' " అని నుడివెను.
26. బత్షెబ భర్త చనిపోయెనని విని అతనికొరకు శోకించెను.
27. శోకదినములు గడచిన తర్వాత దావీదు సేవకులను పంపి, బత్షెబను నగరమునకు రప్పించుకొని పెండ్లి చేసికొనెను. అటుతరువాత ఆమె బిడ్డను కనెను. కాని దావీదు చేసిన పని యావేకు కోపము రప్పించెను.
1. అంతట యావే నాతానును పంపగా వచ్చి దావీదుతో ఇట్లు నుడివెను: “ఒక నగరమున ఇరువురు మనుషులు కలరు. వారిలో ఒకడు సంపన్నుడు, వేరొకడు పేదవాడు.
2. సంపన్నునకు గొఱ్ఱెలమందలును, గొడ్లమందలును సమృద్ధిగాగలవు.
3. పేద వానికి ఒక చిన్న గొఱ్ఱె కొదమ మాత్రము కలదు. అతడే దానిని కొనితెచ్చి పెంచెను. అది అతని బిడ్డలతో పాటు పెరుగుచు వచ్చెను. ఆ గొఱ్ఱె పిల్ల యజమానుని కంచమున తినుచు పాత్రమున త్రాగుచు అతని రొమ్ము మీద పరుండెడిది. అతనికి కూతురువలె ఉండెడిది.
4. ఇట్లుండగా ఒకనాడు సంపన్నుని ఇంటికి అతిథి వచ్చెను. కాని అతడు తన మందలనుండి చుట్టము కొరకు వేటను కోయించుటకు అంగీకరింపక, పేద వాని గొఱ్ఱెపిల్లను గైకొని భోజనము తయారు చేయించెను.”
5. ఆ మాటలు విని దావీదు కోపమువలన ఒడలుమండగా “యావేతోడు. ఇట్టి పాడుపనికి పాల్పడినవాడు నిక్కముగా వధింపతగినవాడు.
6. అతడు జాలిలేక ఇట్టి చెడుకు పూనుకొనుటచే ఆ గొఱ్ఱెపిల్లకు ప్రతిగా నాలుగు గొఱ్ఱెపిల్లలను నష్టపరిహారముగా చెల్లించి తీరవలయును” అనెను.
7. అంతట నాతాను దావీదును చూసి “నీవే ఆ మనుష్యుడవు. యిస్రాయేలు ప్రభువైన యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడు. 'నేను నిన్ను యిస్రాయేలీయులకు రాజుగా నియమించితిని. సౌలు బారినుండి నిన్ను కాపాడితిని.
8. నీ యజమానుని భార్యలను, నీ కౌగిట చేర్చి యిస్రాయేలువారిని, యూదావారిని నీకు అప్పగించితిని. ఇది చాలదందువేని, ఇంకను నీవు కోరిన కోర్కెలన్నిటిని తీర్చెడివాడనుగదా!
9. ఇట్టి దుష్కార్యము చేసి యావే ఆజ్ఞను తిరస్కరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? నీవు ఊరియాను కత్తితో చంపించితివి. అతని ఇల్లాలిని నీ ఆలిని చేసికొంటివి. అతనిని అమ్మోనీయుల కత్తితో పొడిపించితివి.
10. నీవు నన్ను అలక్ష్యముచేసి హిత్తీయుడైన ఊరియా భార్యను చేపట్టితివి. కావున వినుము. కత్తి ఇక నీ కుటుంబమును ఎప్పటికిని విడువదు.
11. నీ కుటుంబము వారినుండియే నీకు కీడు మూడునట్లు చేసెదను. నీ భార్యలను నీ కన్నుల ఎదుటనే ఇంకొకని వశము చేసెదను. అందరు చూచుచుండగనే అతడు నీ భార్యలతో శయనించును.
12. నీవు ఈ పనిని రహస్యమున చేసితివి. కాని నేను ఈ కార్యమును యిస్రాయేలీయుల అందరి యెదుట బట్టబయలుగనే చేసెదను' అని పలుకుచున్నాడు” అనెను.
13. దావీదు నాతానుతో “నేను యావేకు ద్రోహముగా పాపము చేసితిని” అనెను. నాతాను “ప్రభువు నీ పాపము క్షమించెను. నీవు చావుకు తప్పి బ్రతుకుదువు.
14. కాని ఈ దుష్కార్యము చేసి యావేను తిరస్కరించితివి కనుక, నీకు పుట్టిన బిడ్డడు మరణించును” అనెను.
15. నాతాను దావీదు కడనుండి వెడలిపోయెను. ఊరియాభార్య దావీదునకు కనిన శిశువు ప్రభు శిక్ష వలన జబ్బుపడెను.
16. దావీదు శిశువు తరపున యావేను వేడుకొనెను. అతడు పస్తుండెను. రేయి కటిక నేలపై పరుండెను.
17. గృహనిర్వాహకులు దావీదు చుట్టుమూగి అతనిని నేలమీది నుండి లేపజూచిరి గాని రాజు లేవనులేదు, పస్తు విడువనులేదు.
18. ఏడవనాడు బిడ్డడు చనిపోయెను. కాని సేవకులు శిశుమరణమును దావీదున కెరిగింపవెరచిరి. వారు “పసికందు బ్రతికియుండగా రాజును బ్రతిమాలితిమి. కాని అతడు వినిపించుకోలేదు. ఇపుడు పాపడు చని పోయెనని ఎట్లు చెప్పగలము? అతడేమి అకార్యమునకు పాల్పడునో” అని మథనపడజొచ్చిరి.
19. సేవకులు ఈ రీతిగా గుసగుసలాడుకొనుట చూచి రాజు బిడ్డ చనిపోయెనని గ్రహించెను. అతడు “శిశువు మరణించెనా?” అని అడుగగా వారు “అవును” అనిరి.
20. దావీదు నేలనుండి లేచి స్నానముచేసి, తైలము పూసికొని, క్రొత్త ఉడుపులు తాల్చి, యావే దేవాలయమునకు పోయి చేతులు జోడించి సాగిలపడెను. ఇంటికి వచ్చి సేవకులచే వడ్డెన చేయించుకొని ఆహారము తినెను.
21. రాజు అనుచరులు దావీదుతో “చంటివాడు బ్రతికుండగా వస్తుండి విలపించితివి. బిడ్డ చనిపోయినపిదప లేచి భుజించితివి. ఈ విపరీత కార్యమేమి?" అనిరి.
22. అతడు వారితో "యావే నాపై జాలిగొని బిడ్డను బ్రతికింపకపోడా అనుకొని శిశువు సజీవుడైయుండగా పస్తుండి శోకించితిని.
23. కాని ఇప్పుడు బిడ్డ కన్నుమూసెను. ఇక నేను పస్తుండి మాత్రము ఏమి లాభము? ఆ పసికందును మరల తీసికొని రాగలనా? నేను వాని యొద్దకు వెళ్ళవలసినదే కాని, వాడు నాయొద్దకు రాడుగదా!” అనెను.
24. దావీదు బత్షెబను ఊరడించి ఆమెతో శయనించెను. ఆమె మరల గర్భవతియై బిడ్డను కని సొలోమోను అని పేరు పెట్టెను. ఆ శిశువును యావే ప్రేమించెను.
25. ప్రభువు నాతాను ప్రవక్తను పంపి తన ఇష్టము చొప్పున బాలునికి “యెదీద్యా”' అని పేరు పెట్టించెను.
26. యోవాబు అమ్మోనీయుల నగరమైన రబ్బాను ముట్టడించి జలాశయమును స్వాధీనము చేసికొనెను.
27. అతడు దావీదు నొద్దకు దూతలనంపి “నేను రబ్బాను ముట్టడించి జలాశయమును ఆక్ర మించితిని.
28. కనుక మిగిలిన సైన్యములను ప్రోగు చేసికొని వచ్చి వ్యూహముపన్ని నగరమును పట్టుకొనుము. నేనే పట్టణమును స్వాధీనము చేసికొనినచో అది నా పేర పిలువబడును”అని కబురుపంపెను.
29. కనుక దావీదు సైన్యములన్నిటిని ప్రోగు చేసికొని వచ్చి రబ్బాను ముట్టడించి వశపరచుకొనెను.
30. అతడు వారి రాజు శిరస్సున నున్న కిరీటము గైకొనెను. అది మిక్కిలి బరువు కలది. దానిలో పొదుగబడియున్న అమూల్యరత్నము దావీదు శిరస్సును అలంకరించెను. అతడు నగరము నుండి విస్తారమైన కొల్లసొమ్మును గూడకొనివచ్చెను.
31. రాజు ఆ నగరవాసులను చెరపట్టి తీసికొనివచ్చి రంపములతో కొయ్యలు కోయుటకును, రకరకముల ఇనుప పనిముట్లతో పనులు చేయుటకును, ఇటుకలు కాల్చుపనులకును వినియోగించెను. అమ్మోనీయుల నగరములనుండి కొనివచ్చిన వారందరితోనిట్లే ఊడిగము చేయించెను. రబ్బా లోబడినపిదప దావీదు సైన్యముతో యెరూషలేమునకు తిరిగి వచ్చెను.
1. అటుపిమ్మట ఈ క్రింది సంఘటన జరిగెను. దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారు అను చెల్లెలు కలదు. ఆ బాలిక మిక్కిలి అందగత్తె. దావీదు కుమారుడు అమ్నోను ఆమెపై వలపుగొనెను.
2. అతడు మారుచెల్లెలు తామారును పదేపదే తలంచు కొని మనోవ్యాధికి గురయ్యెను. తామారు మగవాని పొందెరుగని కన్య గనుక ఆమెను ఏ నెపమున పొందవలయునా అని అతడు మథనపడజొచ్చెను.
3. అమ్నోనునకు యోనాదాబు అను మిత్రుడు కలడు. అతడు దావీదు సోదరుడైన షిమ్యా కుమారుడు జిత్తులమారి.
4. యోనాదాబు అమ్నోనుతో “నీవు నానాటికి కృశించిపోవుచున్నావు. కారణమేమో నాతో చెప్పరాదా?” అనెను. అతడు “నా తమ్ముడు అబ్షాలోము చెల్లెలు తామారుపై నాకు కోరిక కలిగినది” అనెను.
5. యోనాదాబు అమ్నోనుతో “నీవు జబ్బుపడినట్లు నటన చేయుచు పాన్పుపై పరుండుము. రాజు నిన్ను చూడ వచ్చినపుడు 'చెల్లెలిని ఒకమారు ఇచ్చటికి పంపుడు. ఆమె నాకు భోజనము పెట్టవలయునని చెప్పుడు. నా కన్నుల ఎదుటనే తామారు భోజనము సిద్ధము చేయవలయును. తన చేతితోనే వడ్డింప వలయును' అని చెప్పుము” అని బోధించెను.
6. అమ్నోను జబ్బు పడినవానివలె మంచము పట్టెను. రాజు అతనిని చూడ వచ్చెను. అమ్నోను రాజుతో “చెల్లెలు తామారును ఒకసారి యిటకు రమ్మనుడు. నా కన్నులెదుటనే రెండు మూడు రొట్టెలు కాల్చి పెట్టుమని చెప్పుడు. చెల్లెలే నాకు వడ్డింపవలెను” అనెను.
7. దావీదు తామారు నకు కబురుపెట్టి “నీ అన్న అమ్నోను ఇంటికి వెళ్ళి భోజనము సిద్ధముచేయుము” అని చెప్పెను.
8. కనుక తామారు అన్న ఇంటికి వచ్చెను. అమ్నోను పడుకపై పరుండియుండెను. ఆమె అతని కనులెదుటనే పిండి తీసికొని పిసికి రొట్టెలు కాల్చెను.
9. కాలినరొట్టెలు పెనము మీదనుండి తీసి అమ్నోను ముందిడెను. కాని అతడు భుజింపనొల్లక “ఇచ్చటనున్న వారందరు బయటికి వెళ్ళిపొండు” అనెను. అందరు వెడలి పోయిరి.
10. అమ్నోను తామారుతో “రొట్టెలను లోపలి గదిలోనికి కొనిరమ్ము. నీవే నాకు వడ్డింప వలయును” అనెను. కనుక తామారు రొట్టెలు తీసికొని లోపలిగదిలోనున్న అన్నయొద్దకు పోయెను.
11. తామారు వడ్డింపబోవు చుండగా అమ్నోను ఆమెను పట్టుకొని “చెల్లీ! నాతో శయనింపుము” అనెను.
12. కాని ఆ బాలిక “అన్నా! నన్ను నిర్బంధింపకుము. యిస్రాయేలీయులలో ఈ ఆచారము లేదు. ఇట్టిపనికి పాల్పడకుము.
13. ఇక నేనెక్కడికి పోయినను ఈ సిగ్గుమాలిన పనివలన మ్రగ్గిపోయెదను. మరి నీ విషయములో యిస్రాయేలీయులు దుర్మార్గుని క్రింద జమకట్టెదరు. కనుక నీవు రాజుతో మాట్లాడుము. నాయన నన్ను నీకీయకపోడు” అనెను.
14. కాని అమ్నోను తామారు మాట విన్పించుకొనక బలాత్కారముగా మీదపడి చెరచెను.
15. అటుపిమ్మట అమ్నోనునకు తామారుపై కొండంత ద్వేషముపుట్టెను, అంతకు ముందటి వలపు కంటె అధికమైనద్వేషము పెచ్చు పెరిగెను. అతడు తామారుతో “ఇక లేచి పొమ్ము” అనెను.
16. కాని ఆమె “అన్నా! నన్ను వెళ్ళగొట్టెదవా? నీవిప్పుడు చేసిన ద్రోహముకంటె ఇది పెద్ద ద్రోహముకదా!" అని పలికెను. కాని అతడామె మొర చెవినిబెట్టక,
17. తన సేవకుని పిలిచి "దీనిని బయటకుగెంటి తలుపులు మూసి వేయుము” అనెను.
18. తామారు పొడుగు చేతుల నిలువుటంగీని తొడుగుకొనియుండెను. ఆ రోజులలో రాజకన్యలట్టి ఉడుపులనే తాల్చెడివారు. సేవకుడామెను బయటకు నెట్టి తలుపులు బిగించెను.
19. తామారు తలపై దుమ్ము పోసికొనెను. తాను తొడుగుకొనిన పొడుగుచేతుల నిలువుటంగీని చీలికలు పేలికలు చేసికొనెను. చేతులతో తలబాదు కొనుచు, పెద్దపెట్టునయేడ్చుచు వెడలిపోయెను.
20. అబ్షాలోము సోదరిని చూచి “నీ అన్న అమ్నోను నిన్ను కూడినాడుకదా? చెల్లీ! కొంచెము ఆలోచించుకొనుము. వాడు నీ అన్నగదా! దానికింతగా బాధపడకుము” అని ఓదార్చెను. కావున తామారు చెరుపబడినదై తన అన్నయగు అబ్షాలోము ఇంట వసించెను.
21. దావీదు ఈ సంగతి అంతయు విని బహుగ మండిపడెను. అయినను అతడు అమ్నోనును శిక్షింప లేదు. అతడు రాజునకిష్టుడు, జ్యేష్ఠపుత్రుడు.
22. అబ్షాలోము మాత్రము అమ్నోనుతో మంచిచెడ్డ మాట్లాడుటగూడ మానివేసెను. తన చెల్లెలు తామారును చెరచుటచే లోలోపల అమ్నోనుపై పండ్లు కొరుకు చుండెను.
23. రెండేండ్లు గడచెను. అబ్షాలోము ఎఫ్రాయీము చెంతనున్న బల్హచ్చోరున గొఱ్ఱెల ఉన్ని కత్తిరించుచు రాజు కుటుంబమును విందునకు ఆహ్వానించెను'.
24. అతడు రాజు వద్దకు వెళ్ళి “నేను గొఱ్ఱెల ఉన్ని కత్తిరింపబోవుచున్నాను. కనుక రాజు పరివారముతో విచ్చేయవలయును” అని బతిమాలెను.
25. కాని రాజు అతనితో “మేమందరము వత్తుమేని నీకు మిక్కిలి భారమగును” అని పలికెను. అబ్షాలోము “మీరు తప్పక రావలయును” అని పట్టుబట్టెను గాని రాజు అతని మాట వినిపించుకొనక దీవించి పంపి వేయబోయెను.
26. కాని అబ్షాలోముమరల “మీరు రానిచో అన్న అమ్నోనైనా వచ్చునా?” అని అడిగెను. దావీదు “వాడునురాడు పొమ్ము” అనెను.
27. కాని అబ్షాలోము మరిమరి బతిమాలుటచే రాజు అమ్నోనును మిగిలిన రాజతనయులను విందునకు పోనిచ్చెను.
28. అబ్షాలోము రాజవైభవముతో విందు సిద్ధముచేయించెను. అతడు సేవకులతో “నా మాటలు జాగ్రత్తగా వినుడు. అమ్నోను త్రాగి మైమరవగనే చంపుడని మీకు ఆజ్ఞ యిత్తును. మీరు వెంటనే వానిని వధింపుడు. భయపడకుడు. ఇది నా ఆజ్ఞ. ధైర్యముతో, పరాక్రమముతో కార్యము నిర్వహింపుడు” అని చెప్పెను.
29. అబ్షాలోము మాట చొప్పుననే సేవకులు అమ్నోనును వధించిరి. హత్యజరుగుట చూచి రాజ తనయులు అందరు వడివడిగా గాడిదలనెక్కి పలాయితులైరి.
30. వారు త్రోవలో ఉండగనే అబ్షాలోము రాజ తనయులనందరిని ఒక్కని గూడ మిగుల నీయకుండ మట్టుపెట్టెనను వదంతులు రాజు చెవినిబడెను.
31. అతడు శోకముతో బట్టలు చించుకొని నేలపై చతికిలబడెను. రాజు కొలువుకాండ్రును బట్టలు చించుకొనిరి.
32. కాని దావీదు సోదరుడగు షిమ్యా పుత్రుడైన యోనాదాబు రాజుతో “వారు రాజకుమారులను అందరిని వధించిరని తలపకుడు. అమ్నోనును ఒక్కనినే చంపిరి. అమ్నోను తన చెల్లెలిని చెరిచిననాటినుండి అబ్షాలోము మోము చిన్నవోయియున్నది.
33. రాజ కుమారులనందరిని మట్టు పెట్టిరన్నమాట నమ్మదగి నది కాదు. అమ్నోను మాత్రమే గతించెను” అని చెప్పెను.
34. అయితే అబ్షాలోము పారిపోయెను. అంతట నగరమునకు కాపరియగు పడుచువాడు బహూరీము, మార్గమున కొండమలుపు మీదుగా జనసమూహము వచ్చుటచూచి రాజునకు విన్నవించెను.
35. యోనాదాబు రాజుతో “నేను విన్నవించినట్లే రాజపుత్రులు విచ్చేయుచున్నారు” అనెను.
36. అతడిట్లు పలుకుచుండగనే రాజతనయులు వచ్చిరి. వారు రాజును చూచి బోరున ఏడ్చిరి. రాజు, అతని పరిచారకులుగూడ బిగ్గరగా విలపించిరి.
37. అబ్షాలోము గెషూరు రాజగు అమ్మీహూదు కుమారుడు తల్మయి చెంతకు పారిపోయెను. దావీదు తన కుమారుని కొరకు దినదినము విలపించెను. అబ్షాలోము గెష్షూరు నకు వెళ్ళి మూడునంవత్సరములు అచటనే యుండెను.
38-39. కాలక్రమమున రాజు అమ్నోను మరణమును తలంచుకొని చింతించుట మానుకొనెను. అతనికి అబ్షాలోము మీది కోపము కూడ చల్లారెను.
1. సెరూయా కుమారుడైన యోవాబు దావీదు హృదయము అబ్షాలోముపై నెలకొనియున్నదని గ్రహించెను.
2. అతడు తెకోవా నగరమునుండి తెలివితేటలు గల స్త్రీ నొకతెను పిలిపించి “నీవు దుఃఖించు చున్నదానివలె నటింపుము. శోకవస్త్రములు ధరింపుము. తలకు చమురు రాచుకొనకుము. చాలకాలము నుండి చనిపోయిన వారికొరకు విలపించుచున్న దానివలె కనుపింపుము.
3. రాజు సమ్ముఖమునకు పోయి నేను చెప్పిన రీతిగా మాట్లాడుము” అని పలికెను. రాజు ఎదుట ఆమె యేమి చెప్పవలయునో తెలిపెను.
4. తెకోవా స్త్రీ రాజు వద్దకు పోయి సాగిలపడి దండము పెట్టి “ప్రభూ! రక్షింపుము, రక్షింపుము” అని అరచెను.
5. రాజు “అమ్మా! ఏమి జరిగినదో చెప్పుము”అనెను. ఆమె “రాజా! ఏమి చెప్పుకొందును. నా భర్త చనిపోయెను.
6. నీ దాసురాలికి ఇరువురు కొడుకులు కలరు. వారొకనాడు పొలమున పోట్లాడు కొనిరి. అచట వారి తగవు తీర్చువారు ఎవరును లేరైరి. ఒకడు రెండవవానిని కొట్టిచంపెను.
7.. ఇప్పుడు మా కుటుంబమంతయు నా మీదికి వచ్చి 'నీ కొడుకును మా కప్పగింపుము. తోబుట్టువును చంపి నందులకు ప్రతీకారముగా వానిని కూడ చంపివేయుదుము. నీకెవ్వరిని మిగులనీయకుండ చేసెదము' అనుచున్నారు. నాకు మిగిలియున్నది వాడొక్కడే. ఈ నిప్పురవ్వను కూడ ఆర్పివేసినచో ఇక ఈ నేలమీద నా పెనిమిటి పేరు నిలువదు. అతని వారసుడు మిగులడు” అని పలికెను.
8. రాజు “నీవిక ఇంటికి వెళ్ళవచ్చును. నీ తగాదాను పరిష్కారము చేసెదను” అనెను.
9. కాని ఆ మహిళ రాజుతో "ప్రభూ! ఈ పాపము నన్ను, నా కుటుంబమును బాధించుగాక! ఏలికను అతని రాజ్యమును సోకకుండుగాక!” అనెను.
10. రాజు ఆమెతో “నిన్ను బెదిరించువానిని నా యొద్దకు కొనిరమ్ము. అతడిక నీకు కీడు తలపెట్ట కుండునట్లు చూచెదను” అని చెప్పెను.
11. ఆమె రాజుతో “నెత్తురు చిందించినందులకు బంధువులు నా కుమారునిపై పగతీర్చుకోగోరుచున్నారు. వారిని నా కొడుకును ముట్టుకోనీయనని నీవు కొలుచు దేవుని పేర సెలవిమ్ము" అని వేడుకొనగా, రాజు “సజీవుడైన యావే తోడు! నీ కొడుకుపై ఈగవాలదు పొమ్ము ” అనెను.
12. తెకోవా స్త్రీ “ఈ దాసురాలిని ఇంకొకమారు మాటాడనిండు” అనెను. అతడు “చెప్పుము” అనెను.
13. ఆమె "ప్రభూ! నీవును దైవప్రజకిట్టి కీడునే తలపెట్టుచున్నావుకదా! నీవు దేశమునుండి వెడల గొట్టిన అతనిని తిరిగి యేలరప్పింపవు?
14. మన మందరము చనిపోవలసినదే గదా! ఒలికిపోయిన నీటిని మరల ప్రోగుచేయజాలము. మన బ్రతుకుకూడ అంతే. దేవుడు చనిపోయినవారిని మరల జీవముతో లేపడుకదా! కనుక ఈ దేశమునుండి బహిష్కృతుడై దూరముగా పోయిన వానిని మరల నీ సన్నిధికి రప్పింపుము" అని పలికెను.
15. ఆమె మరల "ప్రజలు నన్ను బెదిరించిరి. కనుక నేను ఏలిక చెంతకు వచ్చి ఈ సంగతులన్నియు విన్నవించుకొంటిని. 'నేను రాజుచెంతకు పోయి నా గోడు తెల్పుకొందును. ఆయన నా మనవిని ఆలింపక పోడనుకుంటిని!'
16. నన్నును, నా కుమారుని, యిస్రాయేలీయుల నేలమీదనుండి తుడిచివేయనెంచిన పగవారి బారినుండి యేలిక నన్ను కాపాడకపోడు.
17. నీవు నాకు అభయమిచ్చితివి. నీ మాటయే నాకు పెట్టనికోట. ప్రభువు దేవదూతవలె మంచిచెడులను ఇట్టే పసికట్టగలవాడు. ప్రభువైన యావే నీకు చేదోడు వాదోడుగానుండుగాక!" అనెను.
18. రాజు ఆమెతో “నేనడుగు ప్రశ్నకు తప్పుకొనక జవాబు చెప్పెదవా?” అనెను. ఆ మహిళ “దేవర అడుగవచ్చును" అనెను.
19. రాజు “నిన్నీ పనికి ప్రేరేపించినది యోవాబు కదా?" అని అడిగెను. ఆమె “ఏలికతోడు! దేవర ప్రశ్నింపగా ఎవ్వరు తప్పించు కోగలరు? అవును, యోవాబు ప్రేరణము వలననే నేనీ పనికి పూనుకొంటిని. అతడే నాకీమాటలన్ని నూరి పోసెను.
20. అసలు సంగతి కప్పిపెట్టుటకే అతడు ఈ పన్నాగము పన్నెను. కాని ప్రభువునకు దేవదూతకు సాటియైన తెలివితేటలు కలవు. కనుకనే ఈ భూమి మీద జరుగు సమస్తవిషయములు దేవరకు తెలియును" అని పలికెను.
21. అంతట రాజు యోవాబుతో “నీ కోరిక తీర్చితిని. పోయి ఆ పడుచువాడు అబ్షాలోమును కొనిరమ్ము" అని చెప్పెను.
22. యోవాబు సాష్టాంగముగా పడి వందనముచేసి రాజును దీవించి “నీవు నా విన్నపమును ఆలించితివి. కనుక నేను నీ మన్ననకు పాత్రుడనైతినని రుజువైనది” అనెను.
23. అతడు వెంటనే గెషూరునకు పయనమైపోయి అబ్షాలోమును యెరూషలేమునకు తోడ్కొని వచ్చెను.
24. కాని రాజు “అబ్షాలోమును తన ఇంటికి వెళ్ళుమనుము. వాడు నా మొగము చూడకూడదు” అనెను. కనుక అబ్షాలోము తన ఇంటికి వెడలిపోయెను. అతడు రాజును దర్శింప లేదు.
25. యిస్రాయేలీయులలో అబ్షాలోము వలె మెచ్చుకోదగ్గ అందగాడెవడునులేడు. అరికాలి నుండి నడినెత్తివరకును అతనిని వేలెత్తి చూపుటకు వీలులేదు.
26. అతని తల వెంట్రుకలు దట్టముగా పెరిగెడివి. వానిని ఏడాదికి ఒకమారు కత్తిరింపు వేయించెడివాడు. ఆ జుట్టు రాజతులామానము ప్రకారము రెండువందల తులముల బరువుండెడిది.
27. అబ్షాలోమునకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు పుట్టిరి. ఆ చిన్నదాని పేరు తామారు. ఆమె చాల సొగసైనది.
28. అబ్షాలోము యెరూషలేమున రెండేండ్లు ఉండెను. కాని తండ్రి అతనికి మొగము చూపలేదు.
29. కనుక అబ్షాలోము యోవాబును రాజునొద్దకు పంపనెంచెను. అతనిని పిలిపించెను. కాని రెండు సారులు కబురు పెట్టినను యోవాబు అతని ఇంటికి రాలేదు.
30. అబ్షాలోము సేవకులను పిలిచి “మన పొలముప్రక్కనే యోవాబు పొలమున్నది గదా! దానిలో యవధాన్యము పండియున్నది. మీరు దానికి నిప్పు పెట్టుడు” అని చెప్పెను. వారు యోవాబు చేను తగుల బెట్టిరి.
31. అంతట యోవాబు అబ్షాలోము ఇంటికి వచ్చి 'నీ సేవకులు నా పొలమునకు ఏల నిప్పంటించిరి?" అని అడిగెను.
32. అతడు యోవాబుతో “నీవు నన్ను గూర్చి రాజునకు ఈ వార్త వినిపింపవలయునని నిన్ను పిలిపించితిని. నేను గెషూరు నుండి ఇచ్చటికి వచ్చుట వలన ఏమి ఫలము? అచటనే ఉండిపోయిన బాగుగా నుండెడిదిగదా! నేను రాజదర్శనము చేసికో గోరెదను. నాయందు ఏదేని నేరము కనిపించినచో రాజు నన్ను చంపివేయవచ్చును” అనెను.
33. యోవాబు వెళ్ళి రాజునకు ఆ వార్త చెప్పెను. దావీదు కుమారుని పిలిపించెను. అబ్షాలోము రాజు ఎదుటికి వచ్చి సాష్టాంగ నమస్కారము చేసెను. రాజతనిని ముద్దు పెట్టుకొనెను.
1. అటుపిమ్మట అబ్షాలోము రథమును, గుఱ్ఱములను సమకూర్చుకొనెను. ఆ రథమునకు ముందుగా కేకలిడుచు పరుగిడుటకు ఏబదిమంది బంటులను ప్రోగుచేసికొనెను.
2. అతడు వేకువనే లేచి నగరద్వారమునకుపోవు త్రోవప్రక్కన నిలుచుండెడి వాడు. ఎవడైన తగాదాపడి తీర్పు కొరకు రాజు వద్దకు వచ్చినచో అబ్షాలోము అతనిని ప్రక్కకు పిలిచి “ఏ ఊరినుండి వచ్చితివి?” అని అడుగును. అతడు “ఈ దాసుడు యిస్రాయేలున ఫలానా మండలమువాడను” అని చెప్పును.
3. అబ్షాలోము “నీ వ్యాజ్యెము సబబైనది. న్యాయసమ్మతమైనది కూడ. అయినను నీ మాట పట్టించుకొనుటకు రాజు తగు వకల్తా నేర్పరచలేదు” అని చెప్పును.
4. అతడింకను “నన్నీ రాజ్యమున న్యాయమూర్తిగా నియమించిన ఎంత బాగుగా నుండును. ఫిర్యాదులతో, వ్యాజ్యెములతో వచ్చిన వారికి నేను తీర్పుచెప్పుదునుగదా!” అనును.
5. ఎవరైనను అబ్షాలోము దగ్గరకు వచ్చి అభివందనము చేయబోయినచో అతడు తన చేతులు చాచి, వానిని దగ్గరకు తీసుకుని స్నేహితునివలె ఆదరముతో ముద్దాడును.
6. తీర్పుకొరకు రాజు నొద్దకు వచ్చిపోవు యిస్రాయేలీయులందరియెడను అబ్షాలోము ఈ రీతిగనే ప్రవర్తించెడివాడు. ఇట్టి ప్రవర్తనము వలన అతడు యిస్రాయేలీయుల మనసులను దోచుకొనెను.
7-8. నాలుగేండ్లు గడచిన తరువాత అబ్షాలోము రాజుతో "నేను హెబ్రోనునకు వెళ్ళి యావేకు చేసిన మ్రొక్కుబడి చెల్లించుకొని వచ్చెదను. నేను అరాము నందలి గెషూరున ఉన్నపుడు, యావే నన్ను సురక్షిత ముగా యెరూషలేమునకు కొనివచ్చెనేని హెబ్రోనున ప్రభువును కొలిచెదనని మ్రొక్కుకొంటిని” అని చెప్పెను.
9. రాజు “సుఖముగా వెళ్ళిరమ్ము” అనెను. అతడు హెబ్రోనునకు వెడలిపోయెను.
10. అబ్షాలోము యిస్రాయేలు రాజ్యమందంతట సేవకులను పంపి “మీరు బాకానాదము వినబడగనే హెబ్రోనున అబ్షాలోము రాజయ్యెనని ప్రకటింపుడు” అని చెప్పెను.
11. అబ్షాలోముతోపాటు రెండువందల మంది జనులు యెరూషలేము నుండి హెబ్రోనునకు వెళ్ళిరి. వారు అబ్షాలోము పిలువగా వెళ్ళిరే గాని అతని కపటోపాయమును ఎరుగరు.
12. అబ్షాలోము దావీదునకు మంత్రాంగము నెరపువాడును, గిలోనీయుడగు అహీతోఫేలును గిలో నగరమునుండి పిలిపించు కొనెను. యావేకు అర్పణములు అర్పించునపుడు అతనిని తన చెంతనే ఉంచుకొనెను. నానాటికి అతనిని బలపరచువారు ఎక్కువగుటచే అబ్షాలోముపన్నాగము పండినది.
13. పరిచారకుడు దావీదు నొద్దకు వచ్చి యిస్రాయేలీయులు అబ్షాలోము పక్షమున చేరి పోయిరని చెప్పెను.
14. దావీదు యెరూషలేమున నున్న తన పరిజనులతో “మనము వెంటనే పారి పోవుదము. లేదేని అబ్షాలోము బారినుండి తప్పించుకోజాలము. మీరు వెంటనే సిద్ధము కావలయును. అతడు హఠాత్తుగా దాడిచేసి మనలను ఓడించి నగరమును కత్తివాదరకు ఎరజేయవచ్చును” అనెను.
15. అందుకు రాజు పరిజనులు “నీ దాసులమైన మేము మా ఏలికయు, రాజవునగు నీవు సెలవిచ్చినట్లే చేయుటకు సిద్ధముగా ఉన్నాము” అనిరి.
16. దావీదు పరివారముతో వెడలిపోయెను. ప్రాసాదమును చూచు కొనుటకు పదిమంది ఉంపుడుకత్తెలను మాత్రము నగరునవిడిచి రాజు కాలినడకన బయలుదేరెను.
17. రాజు తోటివారితో సాగిపోవుచు నగరమునందలి చివరి ఇంటికడ ఆగెను.
18. రాజోద్యోగులు అందరు అతనికిరుప్రక్కల నిలిచిరి. కెరేతీయులు, పెలేతీయులు, గాతు నుండి వచ్చిన ఆరువందలమంది గిత్తీయులును రాజునకు ముందుగా నడచుచుండిరి.
19. దావీదురాజు గిత్తీయుడైన ఇత్తయితో “నీవు పరదేశివి. నీ దేశము వీడి వచ్చి ఇక్కడ ప్రవాసిగానున్న వాడవు. నీవు నాతో రానేల? వెనుదిరిగిపోయి రాజు నున్న తావుననే ఉండుము.
20. నీవు నిన్న వచ్చి నా కొలువున చేరితివి. నేడు నిన్ను నాతో తిరుగాడ తీసికొని పోవుటకు మనసు రాదు. నేనెక్కడికి పోవలయునో నాకే తెలియదు. కావున నీ అనుచరులతో తిరిగిపొమ్ము. ప్రభువు నిన్ను ఆదరముతో, దయతో కాపాడుగాక!” అనెను.
21. కాని ఇత్తయి “యావే జీవముతోడు! నా ఏలికవు ప్రభువునగు నీ తోడు! చావుగాని, బ్రతుకుగాని నా ఏలికయు, ప్రభువునగు రాజెచ్చట ఉండునో ఈ దాసుడును అచ్చటనేయుండును” అనెను.
22. దావీదు అతనితో “సరియే! ముందు నడువుము” అని పలికెను. గిత్తీయుడైన ఇత్తయి అనుచరులతో సేవకులతో ముందుగా కదలిపోయెను.
23. పురజనులందరు రాజును చూచి గోడుగోడునఏడ్చిరి. రాజు కీద్రోనులోయ ప్రక్కన నిలుచుండెను. అతని పరివారమంతయు ఎడారికెదురుగా పయనించెను.
24. అపుడు సాదోకు, లేవీయులు మందసమును దావీదుకడకు మోసికొని వచ్చిరి. దానిని అబ్యాతారు ప్రక్కన దింపి పరిజనులందరు పట్టణమునుండి సాగి పోవువరకును వేచియుండిరి.
25. దావీదు సాదోకుతో “మందసమును నగరమునకు కొనిపొండు. నేను యావే మన్ననకు పాత్రుడనయ్యెదనేని నగరమునకు తిరిగివచ్చి మందసమును, తన నివాసస్థానమును ఆయన నాకు చూపించును.
26. యావే మన్ననకు పాత్రుడనుగానేని, ఆయన నన్ను తన ఇష్టము వచ్చినట్లు చేయునుగాక! నేను ప్రభువు చేతిలోనివాడను” అని పలికెను.
27. మరియు అతడు యాజకుడగు సాదోకుతో “నీవును, అబ్యాతారును నిశ్చింతగా పట్టణమునకు వెడలిపొండు. నీ కుమారుడు అహీమాసును, అబ్యాతారు కుమారుడు యోనాతానును గూడ తీసికొని పొండు.
28. నీ యొద్దనుండి వార్తలు వచ్చువరకు నేను ఎడారి మైదానముననే మసలెదను” అని చెప్పెను.
29. కనుక సాదోకు, అబ్యాతారు మందసముతో యెరూషలేము నకు వెడలిపోయి అచ్చటనే ఉండిపోయిరి.
30. దావీదు ఓలివుకొండమీదుగా ఎక్కిపోయెను. అతడు తలమీద ముసుగువేసికొని ఏడ్చుచు వట్టికాళ్ళతో నడచిపోయెను. అతని అనుచరులును తలపై ముసుగు వేసికొని కన్నీరు కార్చుచు కొండమీదుగా వెడలి పోయిరి.
31. అపుడు అహీతోఫెలు కూడ అబ్షాలోము కుట్రలో చేరెనని దావీదు చెవినిపడగా, అతడు “ప్రభువు అహీతోఫెలు ఉపదేశములను వెట్టి తలపోతలనుగా చేయునుగాక!” అని ప్రార్ధించెను.
32. దావీదు కొండకొమ్ముననున్న దేవుని ఆరాధించు స్థలమునొద్దకు రాగానే అర్కీయుడైన హూషయి అతనిని కలిసికొనుటకు వచ్చెను. హూషయి దావీదు మిత్రుడు. అతడు బట్టలు చించుకొనెను. తలమీద దుమ్ము పోసికొనెను.
33. దావీదు అతనితో “నీవు నా వెంటవత్తువేని నాకు భారమగుదువు. కనుక నీవు పట్టణమునకు తిరిగిపొమ్ము.
34. అబ్షాలోముతో “రాజా! నేను నీ దాసుడను. ఇంతకు ముందు నీ తండ్రికి ఊడిగము చేసినట్లే ఇపుడు నీకు కొలువు చేసెదను' అని పలుకుము. అతని కొలువున చేరి అహీతోఫెలు ఉపదేశములను వమ్ముచేసి నాకు మేలు చేయుము.
35. యాజకులగు సాదోకు, అబ్యాతారు నీకు తోడుగా నుందురు. నీవు ప్రాసాదమున విన్న వార్తలు వారి కెరిగింపుము.
36. సాదోకు కుమారుడు అహీమాసు, అబ్యాతారు కుమారుడు యోనాతాను తమ తండ్రులచెంతనే ఉందురు. వారిరువురిద్వారా నీవు విన్న వార్తలన్నింటిని నాకు వినిపింపుము” అని చెప్పెను.
37. అబ్షాలోము యెరూషలేము ప్రవేశించుచుండగనే హూషయి కూడ సరిగా ఆ సమయములోనే పట్టణము చేరుకొనెను.
1. దావీదు కొండకొనమీదుగా కొంచెము దూరము నడచిపోవగానే మెఫీబోషెతు దాసుడగు సీబా వచ్చెను. అతడు రెండుగాడిదలకు జీనులు కట్టి వానిపై రెండువందల రొట్టెలు, నూరు ఎండిన ద్రాక్షపండ్ల గుత్తులు, నూరు అంజూరపుపండ్లు, ఒక తిత్తెడు ద్రాక్షసారాయము కొనితెచ్చెను.
2. రాజు “ఇవి యన్నియుదేనికి” అని అడుగగా, సీబా “ఈ గాడిదలు రాజకుటుంబము వారు ఎక్కిపోవుటకు. రొట్టెలు, పండ్లు సైనికులకొరకు. ద్రాక్షసారాయము ఎడారిలో అలసిపోయినవారికి” అనెను.
3. దావీదు “నీ యజమానుని కుమారుడేడి?” అని అడిగెను. సీబా “అతడు యెరూషలేముననేయున్నాడు. నేడు యిస్రాయేలీయులు తన తండ్రి రాజ్యమును తిరిగి తనకు ఇప్పింతురని అనుకొనుచున్నాడు” అని చెప్పెను.
4. దావీదు “ఇంతవరకు మెఫీబోషెతు అధీనమున నున్న ఆస్తిపాస్తులన్నింటిని ఇకమీదట నీవు అనుభవింపుము” అనెను. సీబా “ప్రభూ! నేను నీ మన్ననకు పాత్రుడనైన చాలును, అదియే పదివేలు” అని బదులు చెప్పెను.
5. దావీదు బహూరీము చేరెను. సౌలు కుటుంబమునకు చెందిన గేరా కుమారుడైన షిమీ పట్టణము వెడలివచ్చి దావీదును శపింపమొదలిడెను.
6. అతడు దావీదుమీద, అతని పరిజనముమీద రాళ్ళురువ్వెను. సైనికులు, యోధులు దావీదునకిరువైపుల ఉండిరి. అతని పొగరు తగ్గలేదు.
7. షిమీ “నీవు నెత్తురు ఒలికించిన దుర్మార్గుడవు. శీఘ్రమే ఇటనుండి వెడలి పొమ్ము!
8. నీవు సౌలురాజ్యమును అపహరించితివి. అతని కుమారులను రూపుమాపితివి. కావున నేడు యావే నీపై పగ తీర్చుకొనెను. నీవు దోచుకొనిన రాజ్యమును నీ కుమారుడు అబ్షాలోము వశముచేసెను. నీవు రక్తపాతమునకు ఒడిగట్టితివి కనుక, నీ అపరాధమే నిన్నిపుడు నాశనము చేసినది” అని దావీదును చెడ దిట్టెను.
9. ఆ తిట్టులాలించిన సెరూయా పుత్రుడగు అబీషయి రాజుతో “ఈ చచ్చినకుక్క యేలికను శపించుటయా! ప్రభువు సెలవిచ్చిన నేను వీని తలనెగుర గొట్టెదను” అనెను.
10. కాని రాజు “మనము ఇతని మాటలు పట్టించుకోనేల? వానిని శపింపనిమ్ము. ఒకవేళ ప్రభువే ఇతనికి దావీదును శపింపుమని సెలవిచ్చెనేమో! వలదనుటకు మనమెవ్వరము?” అని బదులు పలికెను.
11. మరియు దావీదు అబీషయితో, పరిజనులతో “నా కడుపున పుట్టిన బిడ్డడే నా ప్రాణములు తీయగోరుచున్నాడు. ఇక ఈ బెన్యామీనీయుడు ఊరకుండునా? ప్రభువే షిమీనిట్లు పురికొల్సెనేమో! ఇతనిని శపింపనిండు.
12. ఒకవేళ యావే నా దైన్యమును గుర్తించి ఇతని తిట్టులకు మారుగా నాకు దీవెనలే ఇచ్చునేమో!” అని పలికెను.
13. దావీదు, అతని అనుచరులు సాగిపోయిరి. కాని షిమీ దావీదుపై రాళ్ళురువ్వుచు, శపించుచు, దుమ్మెత్తి పోయుచు కొండప్రక్కగా కదలిపోయెను.
14. రాజు, అతని అనుచరులు పయనము సాగించి అలసి పోవువరకు నడిచి, యోర్దానున విశ్రమించి బడలిక తీర్చుకొనిరి.
15. అబ్షాలోము యిస్రాయేలీయులతో యెరూషలేమున ప్రవేశించెను. అహీతోఫెలు కూడ అతనితో వచ్చెను.
16. దావీదు మిత్రుడును అర్కీయుడైన హూషయి అబ్షాలోమును కలిసికొని “రాజునకు దీర్ఘాయువు!” అని దీవించెను.
17. కాని అబ్షాలోము “ఓయి! స్నేహితునిపట్ల నీ ప్రేమ ఈ పాటిదేనా? నీవు నీ మిత్రునితో ఏల వెళ్ళవైతివి?” అని అడిగెను.
18. హూషయి అతనితో “యావే, ఈ ప్రజలు, యిస్రాయేలీయులు ఎవరిని కోరుకొందురో నేనును అతని బంటునే. నేను అతనికడనే పడియుందును.
19. పైపెచ్చు, దావీదు కుమారునికి గాక ఇంకెవరికి ఊడిగము చేయుదును? నేను నీ తండ్రిని కొలిచినట్లే నిన్నును కొలిచెదను” అనెను.
20. అబ్షాలోము అహీతోఫెలుతో “మాకు మంచి ఆలోచన చెప్పుము. ఇప్పుడేమి చేయుదము?” అనెను.
21. అతడు “నీ తండ్రి నగరమున మంచిచెడ్డలు అరయుటకు తన ఉంపుడుగత్తెలను విడిచిపోయెను గదా! నీవు వారినికూడుము. దానితో యిస్రాయేలీయులందరు నీవు తండ్రిని అవమానపరచితివని గ్రహించి ధైర్యముగా నీ పక్షమును బలపరుతురు” అని చెప్పెను.
22. కనుక మిద్దెపై అబ్షాలోమునకు డేరా వేసిరి. యిస్రాయేలీయులందరు చూచుచుండగనే అతడు ఆ గుడారమున తండ్రి ఉంపుడుగత్తెలతో శయనించెను.
23. ఆ రోజులలో అహీతోఫెలు ఇచ్చిన ఉపదేశము యావే తనను సంప్రదించిన వారికిచ్చిన ఉపదేశము వలె నుండెడిది. దావీదుగాని, అబ్షాలోముగాని అతని ఉపదేశమును అంత ఆదరముతో స్వీకరించెడివారు.
1. అహీతోఫెలు అబ్షాలోముతో “నేను ఈ రాత్రియే పండ్రెండువేల మంది సైనికులను వెంట నిడుకొని దావీదు మీదపడెదను.
2. అతడలసిసొలసి శక్తివోయి ఉండును. కనుక నన్ను చూచి భయపడును. అనుచరులును అతనిని వీడి పారిపోవుదురు. నేను రాజును మాత్రమే చంపెదను.
3. వధువును వరుని చెంతకు తరలించుకొని వచ్చినట్లే దావీదు అనుచరుల నందరినీ నీ చెంతకు తోడ్కొని వచ్చెదను. నీవొక్కని ప్రాణము మాత్రమే కోరుకొందువు. అతడు తప్ప మిగిలిన వారెవ్వరును నశింపరు” అనెను.
4. ఈ ఉపదేశము అబ్షాలోమునకు యిస్రాయేలు పెద్దలకును మిగులనచ్చెను.
5. తరువాత అబ్షాలోము “అర్కీయుడైన హూషయిని గూడ పిలువుడు. అతడేమి చెప్పుతో విందము” అనెను.
6. హూషయి కొలువులోనికి రాగానే అబ్షాలోము “అహీతో ఫెలు మాకిట్లు ఉప దేశించెను. ఈ ఉపదేశము చొప్పున నడుచుకొందమా; లేక నీవేమైన ఆలోచన చెప్పెదవా?” అని అడిగెను.
7. హూషయి అబ్షాలోముతో "అయ్యా! అహీతో ఫెలు చెప్పిన ఉపాయము ఈ పట్టున పాటింపదగినది కాదు.
8. నీ తండ్రియు, అతని అనుచరులును వీరులే గాని వట్టి దద్దమ్మలు కారు. వారిపుడు పిల్లలను కోల్పోయిన అడవిఎలుగు బంటువలె కోపస్వభావులె చెలరేగి ఉందురు. నీ తండ్రి పోరున కాకలుతీరిన యోధుడు. అతడు సైన్యముల చెంత నిద్రించును అనుకొంటివా?
9. ఈ క్షణముననే ఏ గుంతలోనో, బొరియలోనో దాగికొనియుండును. ప్రథమ ప్రయత్నము ననే వారు మనవారిపై దెబ్బతీసెదరేని, ఈ వార్తలు విన్న వారెల్ల అబ్షాలోము అనుచరులకు తగిన శాసి జరిగినదని నవ్విపోదురు.
10. అపుడు సింగపు గుండెగల మన మహావీరులు కూడ శక్తిచెడి అధైర్య పడరా? నీ తండ్రి మహావీరుడని, అతని తోడివారు పేరుమోసిన శూరులని యిస్రాయేలీయులందరును ఎరుగుదురు.
11. కనుక నా మట్టుకు నేనీ ఉపాయము చెప్పెదను. దానునుండి బేరైబావరకు గల యిస్రాయేలీయులందరును ప్రోగై కడలి ఒడ్డునగల ఇసుక రేణువులవలె లెక్కకందని రీతిగా నిన్ను అనుసరించి రావలయును. నీవే స్వయముగా నాయకుడవై వారిని పోరునకు కొనిపోవలయును.
12. ఈ రీతిగా పోయి దావీదు ఎక్కడ కనుపించిన అక్కడనే అతనిమీద పడు దము. వేయేలమంచు నేలపై దిగివచ్చునట్లుగా శత్రువు మీద పడెదము. అతడుగాని, అతని అనుచరులుగాని ఒక్కడును మిగులకుండునట్లు ఎల్లరను కండతుండె ములు చేయుదము.
13. దావీదు పారిపోయి ఏదేని పట్టణమున తలదాచుకొనెనేని, యిస్రాయేలీయులు అందరు త్రాళ్ళుకొనివచ్చి ఆ నగరమును రాయిరప్ప గూడ మిగులకుండునట్లు క్రింది నదిలోనికి లాగివేయ వలయును” అని పలికెను.
14. ఆ మాటలు ఆలించి అబ్షాలోము, యిస్రాయేలీయులు, “అహీతో ఫెలు ఉప దేశముకంటె అర్కీయుడైన హూషయి ఆలోచనయే బాగుగానున్నది” అనిరి. యావే అబ్షాలోమును నాశ నము చేయనెంచి అహీతో ఫెలు చెప్పిన ఉపాయమే మేలైనదైనను దానిని భంగపరచెను. -
15. అంతట హూషయి యాజకులగు సాదోకు అబ్యాతారులతో "అహీతో ఫెలు నా కంటే ముందు ఈ రీతిగా ఉపాయము చెప్పెను. నేనీరీతిగా చెప్పితిని.
16. కనుక మీరు శీఘ్రముగా దావీదునకు కబురంపి 'నేటి రేయి యేరు దాటు స్థలములలో మసలవలదు. వెంటనే అవలకు సాగిపొండు. లేదేని రాజు తన సైన్యములతో సర్వనాశనమగును' అని చెప్పింపుడు" అని వక్కాణించెను.
17. యోనాతాను, అహీమాసు ఎర్డోగీలు చెలమ వద్దనుండిరి. పట్టణమునకు వచ్చుటకు వారికి ధైర్యము చాలలేదు. కనుక ఒక పనికత్తె పోయి వారికి వార్తలు ఎరిగింపవలయుననియు, వారు పోయి దావీదును హెచ్చరింపవలెననియు నిర్ణయించిరి.
18. అయినను ఒక పనివాడు ఆ వేగువాండ్రను చూచి అబ్షాలోమునకు తెలియజేసెను. కనుక వారిరువురు పరుగుపరుగున పోయి బహూరీమున ఒక గృహస్తుని ఇంట జారబడిరి. ఆ ఇంటి పెరటిలో ఒక బావి కనిపింపగా దానిలోనికి దిగి దాగికొనిరి.
19. ఆ ఇంటి ఇల్లాలు గోనె గైకొని బావి పై కప్పి దానిమీద దంచిన ధాన్యమును ఎండబోసెను. కనుక వారి జాడెవరికిని తెలియలేదు.
20. అబ్షాలోము భటులు ఆ గృహిణి వద్దకు వచ్చి "అహీమాసు, యోనాతాను ఏరి?” అని అడిగిరి. ఆమె “అల్లదిగో! ఆ మడుగు మీదుగా వెళ్ళిపోయిరి” అని చెప్పెను. భటులు వారిని గాలించి, కనుగొన జాలక యెరుషలేమునకు తిరిగిపోయిరి.
21. వారు వెడలిపోగానే అహీమాసు, యోనాతాను బావి వెడలి వచ్చి దావీదు వద్దకు పోయి “నీవు శీఘ్రమే బయలుదేరి నది దాటుము. అహీతో ఫెలు నిన్ను గూర్చి ఈ లాగున ఉపదేశము చెప్పెను” అని హెచ్చరించిరి.
22. కనుక దావీదు సైన్యములతో కదలి యోర్దాను నదిదాటెను. ప్రొద్దుపొడుచునప్పటికి నదికీవలి ఒడ్డున ఒక్క పురుగు కూడ మిగులలేదు.
23. అచట యెరూషలేములో అబ్షాలోము అహీతోఫెలు ఉపాయమును పాటింపలేదు. అది చూచి అహీతోఫెలు మనసునొచ్చుకొని గాడిదకు జీనువేసి పయనము కట్టెను. నేరుగా స్వీయనగరము చేరుకొని ఇంటికిపోయెను. తన ఇల్లు చక్కపెట్టుకొని ఉరివేసికొని చనిపోయెను. అతనిని తండ్రి సమాధిలోనే పాతి పెట్టిరి.
24. దావీదు మహనాయీము చేరుకొనెను. అబ్షాలోము యిస్రాయేలుదండుతో వచ్చి యోర్దాను నది దాటెను.
25. అతడు యోవాబునకు బదులుగా అమాసా అనువానిని సైన్యాధిపతిని చేసెను. ఈ అమాసా యిష్మాయేలీయుడైన యిత్రి కుమారుడు. అతని తల్లి అబీగాయీలు. ఆమె నాహషు కూతురు, యోవాబు తల్లియగు సెరుయా చెల్లెలు.
26. అబ్షాలోము యిస్రాయేలీయులతో గిలాదున గుడారములెత్తెను.
27. దావీదు మహనాయీము చేరగనే అమ్మోనీయుల రబ్బా నగరమున నుండి నాహాషు కుమారుడు షోబి, లోదెబారు నుండి అమ్మయేలు కుమారుడు మాఖీరు, రోగెలీము నుండి గిలాదీయుడు బర్సిల్లయి అతనిని చూడవచ్చిరి.
28. వారు పరుపులు, కంబళ్ళు, పళ్ళెరములు, గిన్నెలు, గోధుమలు, యవలు, వేగించిన ధాన్యములు, పిండి, చిక్కుడు గింజలు, ఆకు కూరలు, తేనె, పెరుగు, వెన్న, గొఱ్ఱెలు, ఎడ్లను కొనివచ్చి దావీదునకును, అతని అనుచరులకును సమర్పించిరి.
29. దావీదు జనులు ఎడారిలో ఆకలిదప్పులవలన అలసిసొలసి ఉందురు గదా అని వారు ఆ కానుకలు కొనితెచ్చిరి.
1. దావీదు తన సైన్యములను లెక్కించి వేయి మందికి, నూరుమందికి అధిపతులను నియమించెను.
2. అతడు సేనలను మూడుభాగములుచేసి యోవాబును ఒక భాగమునకు, అతని తమ్ముడు అబీషయిని ఇంకొక భాగమునకు, గిత్తీయుడు ఇత్తయిని వేరొక భాగమునకు నాయకులను చేసెను. తానుగూడ దండులతో పోరునకు పోవ సమకట్టెను.
3. కాని అతని దళములు "నీవు రావలదు. మేము ఓడిపోయినచో ఎవరికిని బాధ కలుగదు. మాలో సగముమంది గతించినను ఎవరికిని దిగులు పుట్టదు. కాని నీ వాక్కడివే మాబోటివాండ్రు పదివేలమందికి సరిసమానుడవు. పైగా నీవు పట్టణముననే ఉన్నచో ఎప్పటికప్పుడు మాకు క్రొత్తదళములను పంపుచుండవచ్చును” అని అనిరి.
4. రాజు “సరియే, మీరు చెప్పినట్లే కానిండు” అనెను. అంతట వందలమందితో, వేలమందితో సైన్యములు కదలి పోవుచుండగా దావీదు నగరద్వారమువద్ద నిలుచుండి వీక్షించెను.
5. అతడు యోవాబు, అబిషయి, ఇత్తయిలతో “నా మొగము చూచియైన ఆ పడుచువాడు అబ్షాలోముపై చేయిచేసికొనకుడు” అని ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేనానాయకులకు ఇట్టి ఆజ్ఞ ఇచ్చెనని సైనికు లందరును తెలిసికొనిరి.
6. దావీదు సైన్యములు యిస్రాయేలీయుల మీదికిపోయెను. ఎఫ్రాయీము అడవిలో ఇరువైపులవారికి పోరుజరిగెను.
7. దావీదు దండులు యిస్రాయేలీయులను తునుమాడెను. వారి పక్షమున ఇరువదివేలమంది కూలిరి.
8. అడవియందంతట పోరునడచెను. కత్తివాదర కెరయైన వారికంటె ఆ కారడవిలో చిక్కి మడిసిన వారే ఎక్కువ.
9. అడవిలో దావీదు అనుచరులకు అబ్షాలోము ఎదురుపడెను. అతడు ఒక కంచర గాడిదనెక్కి వచ్చు చుండెను. ఆ కంచరగాడిద దట్టముగా ఎదిగియున్న పెద్ద సింధూరపు చెట్టు కొమ్మల క్రిందుగా సోగిపోయెను. అబ్షాలోము తల గజిబిజిగా ఎదిగియున్న సింధూరము కొమ్మలలో చిక్కుకొనెను. అతడు మింటికి మంటికి మధ్య వ్రేలాడ జొచ్చెను. అతడెక్కిన కంచరగాడిద కదలిపోయెను.
10. అపుడొక సైనికుడు అబ్షాలోమును చూచి యోవాబుతో “అబ్షాలోము సింధూరము నుండి వ్రేలాడుచున్నాడు” అని చెప్పెను.
11. యోవాబు అతనితో “నీవు అబ్షాలోమును చూచి చావబొడిచి నేలమీద కూలద్రోయకేల విడిచితివి? నేను నీకు పదివెండినాణెములు, నడికట్టు బహూకరించి యుండెడివాడనుగదా” అనెను.
12. కాని ఆ సైనికుడు “పదిగాదుగదా వేయివెండికాసుల నిచ్చినను నేను రాజకుమారునిపై చేయిచేసికొనను. మేము వినుచుండగనే రాజు నిన్ను, అబీషయిని, ఇత్తయిని పడుచువాడైన అబ్షాలోమును ముట్టుకోవలదని ఆజ్ఞాపించెనుగదా?
13. కపటబుద్ధితో నేను అతనిని పొడిచియుందునేని, రాజు తప్పక తెలిసికొనెడివాడు. అపుడు రాజు దగ్గర నీవుకూడా నాకు విరోధివియగుదువుకదా!” అని పలి కెను.
14. యోవాబు ఇపుడు నీతో కాలయాపనము చేయనేల అని పలికి మూడు బల్లెములను గైకొని చెట్టున ప్రాణములతో వ్రేలాడెడి అబ్షాలోము గుండెలో పొడిచెను.
15. వెంటనే యోబు అంగరక్షకులు పదిమంది అబ్షాలోముపై పడి అతనిని మట్టుపెట్టిరి.
16. అంతట యోవాబు బాకానూది పోరు చాలింపుడని తన అనుచరుల నాజ్ఞాపించెను. వారు యిస్రాయేలీయులను వెన్నాడుటమానిరి.
17. యోవాబు భటులు అబ్షాలోము శవమును అడవిలో ఒక లోతైన గోతిలో పడవేసిరి. దానిమీద పెద్ద రాళ్ళగుట్ట నిలిపిరి. యిస్రాయేలీయులు పారిపోయి తమతమ గుడారములలో జొరబడిరి.
18. అబ్షాలోము బ్రతికియుండగనే తన జ్ఞాపకార్దముగా రాజు లోయలో ఒక స్తంభము నిలిపెను, అతడు “నా పేరు నిలబెట్టుటకు కుమారులెవరును లేరుగదా!” అనుకొని ఆ కంబమునకు తన పేరు పెట్టుకొనెను. నేటికిని అది అబ్షాలోము కంబమనియే పిలువబడుచున్నది.
19. సాదోకు కుమారుడగు అహీమాసు యోవాబుతో “నేను పరుగెత్తుకొనిపోయి రాజునకు శుభవార్త వినిపింతును. యావే రాజు శత్రువులను రూపుమాపెనని విన్నవింతును” అనెను.
20. కాని యోవాబు “ఓయి! నేడేమి శుభవార్తలు వినిపింపగలవు? మరియొకనాడు వినిపించిన వినిపింప గలవేమోగాని నేడు మాత్రము శుభవార్తలేమియు లేవు. రాజపుత్రుడు కాలముచేసెనుగదా!” అనెను.
21. ఇట్లని యోవాబు కూషీయుని ఒకనిని పిలిచి “వెళ్ళి నీవు కన్నది రాజునకు ఎరిగింపుము” అనెను. అతడు యోవాబునకు దండము పెట్టి రివ్వున పరుగుతీసెను.
22. సాదోకు కుమారుడు అహీమాసు మరల యోవాబుతో “ఆరు నూరైనను నూరారైనను కూషీయునితో పాటు నేను కూడ పరుగిడవలసినదే” అనెను. యోవాబు “ఓయీ! నీవు ఊరకే పరుగిడనేల. నీ వార్తలకు నేడు ప్రతిఫలమేమియు ముట్టదుసుమా!” అని చెప్పెను.
23. అతడు మరల “ఏమైనను కానిమ్ము. నేనిపుడు దౌడు తీయకతప్పదు” అని పలికెను. యోవాబు “సరియే పొమ్ము” అనెను. అహీమాసు పొలమునకు అడ్డముగాపడి పిక్కబలముతో కూషీయుని కంటె ముందుగా పరుగుతీసెను.
24. దావీదు నగర జంటగుమ్మముల నడుమ కూర్చుండియుండెను. నగరమునకు కావలికాయువాడు గుమ్మము పైబురుజు మీదికెక్కి మోచేయి అడ్డము పెట్టుకొని పారజూడగా, ఒంటరిగా పరుగెత్తుకొనివచ్చు వాడొకడు కంటపడెను.
25. వెంటనే అతడు రాజునకు ఆ సంగతి గొంతెత్తి విన్నవించెను. రాజు “అతడు ఒంటరిగా వచ్చుచుండెనేని మేలివార్త కొని వచ్చుచుండును” అనెను. అంతలో ఆ పరుగిడువాడు దగ్గరకు వచ్చెను.
26. అపుడు కావలివాడు పరుగువెట్టు వానిని వేరొకడును చూచి అదిగో మరియొకడు ఒంటరిగా పరుగెత్తుకుని వచ్చుచున్నాడని ద్వారరక్షకుని తట్టు తిరిగి చెప్పగా, దావీదు "అతడును మేలి వార్తలనే గొనివచ్చుచుండును” అనెను.
27. కావలి బంటు “నేను ముందట ఉరుకు వానిని గుర్తుపట్టితిని. సాదోకు కొడుకు అహీమాసువలె ఉన్నాడు” అనెను. దావీదు “అతడు చాల మంచివాడు కనుక మంచి కబురులే కొనివచ్చుచుండును” అనెను.
28. అహీమాసు దావీదు దగ్గరకు వచ్చి “రాజా! శుభము” అని నేలమీదికి సాష్టాంగ నమస్కారము చేసి “రాజుపై తిరుగబడినవారిని మనవశము చేసిన యావే దేవుడు స్తుతింపబడునుగాక!" అని పలికెను.
29. రాజు “పడుచువాడు అబ్షాలోము క్షేమముగానున్నాడా?” అని అడిగెను. అహీమాసు “యోవాబు నన్నిచటకు పంపుచుండగా అక్కడ కలకలమొకటి వినిపించినది. కాని దాని భావమేమో నాకుతెలియదు” అనెను.
30. రాజు “నీవు ప్రక్కకు తొలగినిలువుము” అనెను. అతడట్లే తొలగినిలచెను.
31. అంతట కూషీయుడును వచ్చి “ప్రభువుల వారికి శుభము. దేవరమీద తిరుగబడినవారిని రూపుమాపి యావే నేడు నీ తరపున శత్రువులపై పగతీర్చు కొనెను” అని పలికెను.
32. రాజు "కుఱ్ఱడు అబ్షాలోము కుశలమేగదా!” అని ప్రశ్నించెను. కూషీయుడు “రాజు శత్రువులకు, రాజుపై తిరుగబడి అతనికపకారము చేయబూనిన దుర్మార్గులకు ఆ పడుచువానికి పట్టిన గతియే పట్టునుగాక!” అనెను.
1. ఆ మాటలువిని రాజు మిగుల దుఃఖించెను. అతడు గుమ్మము మీదిగదిలోనికి వెళ్ళి శోకము పట్టజాలక “హా! కుమారా అబ్షాలోమూ! నా కుమారా అబ్షాలోమూ! నీకు బదులుగా నేనే ప్రాణములు కోల్పోయిన ఎంత బాగుగానుండెడిది! హా! కుమారా అబ్షాలోమూ!” అని విలపించెను.
2. దావీదు అబ్షాలోము కొరకు విలపించుచున్నాడని యోవాబు వినెను.
3. రాజు ఆ రీతిగా శోకించుచుండుటచే సైన్యములకు ఆ రోజు విజయము శోకముగా మారిపోయెను.
4. సైనికులు యుద్ధమున ఓడిపోయిన వారి వలె చిన్నబోయిన మొగములతో చాటు చాటుగా వచ్చి పురమున జొరబడిరి.
5. రాజు మొగముపై ముసుగు వేసికొని “హా! కుమారా అబ్షాలోమూ! కుమారా అబ్షాలోమూ!” అని ఏడ్చుచుండెను.
6. యోవాబు రాజు విలపించుచున్న గదిచొచ్చి "సైనికులు నేడు నిన్ను, నీ పుత్రీపుత్రులను, నీ భార్యలను, ఉంపుడుకత్తెలను ప్రాణములతో కాపాడిరిగదా! కాని నీవు వారికి తలవంపులు తెచ్చిపెట్టుచున్నావు.
7. నిన్ను ద్వేషించిన వారి పట్ల గాఢప్రేమను, ప్రేమించినవారిపట్ల గాఢద్వేషమును కనబరచుచున్నావు. ఈ సేనాధిపతులన్నను, సైనికులన్నను నీకసలు అభిమానమే లేదు. అబ్షాలోము బ్రతికియుండి మేమందరము చచ్చినయెడల నీవు మిగుల సంతసించెడివాడవని ఇపుడు తేటతెల్లమైనది.
8. ప్రభూ! ఇక లేచిరమ్ము. ఈ సైన్యములకు ఉత్సా హము కలుగునట్లు నాలుగు మాటలు చెప్పుము. యావే తోడు! నీవిపుడు వీరిని మెచ్చుకోవైతివేని ఈ రేయి నీ పక్షమున ఒక్కడును మిగులడు. బాల్యము నుండి నేటివరకును నీకు సంభవించిన విపత్తులు అన్నిటికంటెను ఇదియే పెద్ద విపత్తు కాగలదని భావింపుము” అని హెచ్చరించెను.
9. కనుక రాజు లేచి నగరద్వారము నొద్దకు వచ్చి నిలుచుండెను. రాజు ద్వారముచెంత ఆసీనుడయ్యెనని సైనికులు గుసగుసలు వోయిరి. వెంటనే వారందరు సమావేశమై రాజునకు కనిపించుకొనిరి.
10. అప్పటికి యిస్రాయేలీయులు తమ గుడారములకు పారిపోయిరిగదా! వారిలో వారికి భేదాభిప్రాయములు పుట్టెను. వారు “రాజు మనలను శత్రువుల బారినుండి, ఫిలిస్తీయుల బెడదనుండి కాపాడెను గదా! ఇపుడతడే అబ్షాలోమునకు వెరచి దేశమునుండి పారిపోవలసివచ్చెను.
11. మనము అభిషేకించిన అబ్షాలోము రణమున మడిసెను. కనుక రాజును మరల కొనివచ్చుట శ్రేయముగదా!” అనుకొన జొచ్చిరి. యిస్రాయేలీయులు ఈ రీతిగా మథనపడు చున్నారని రాజు వినెను.
12. వెంటనే దావీదు యాజకులు సాదోకు, అబ్యాతారులకు కబురుపంపి “యూదా పెద్దలతో ఇట్లు నుడువుడు. 'రాజును కొనివచ్చిన వారిలో మీరు చివరి వారు అనిపించుకోనేల?
13. మీరు నాకు ఎముక నంటినట్టియు, మాంసమునట్టినయు సహోదరులు రాజును కొనివచ్చుటకు మీరెందులకు ఆలస్యము చేయుచున్నారు?'
14. మరియు అమాసాతో ఇట్లు చెప్పుడు. నీవు నాకు ఎముకనంటిన బంధుడవు, మాంసమునంటిన బంధుడవు కాదా? యోవాబునకు బదులుగా నిన్నే సైన్యాధిపతిగా నియమింపనేని యావే నాకు కీడు తలపెట్టునుగాక!” అని చెప్పించెను.
15. ఆ మాటలాలించి యూదీయులందరు ఒక్కుమ్మడిగా దావీదుతో కలిసిపోయిరి. వారు “రాజు బలగములతో వెంటనే తిరిగిరావలెను” అని దావీదునకు వార్తపంపిరి.
16. రాజు యెరూషలేమునకు పయనమై యోర్దాను చేరుకొనెను. అతనిని కలిసికొని నది దాటించుటకై వచ్చిన యూదీయులు కూడ గిల్గాలు చేరిరి.
17. గేరా కుమారుడు, బెన్యామీనీయుడు, బహూరీము పురవాసియునగు షిమీ కూడ యూదీయులతో వచ్చి రాజును కలిసికొనెను. అతనితో వేయి మంది బెన్యామీనీయులు కూడవచ్చిరి.
18. సౌలు కుటుంబమునకు ఊడిగముచేయు సీబా కూడ తన పదునైదుగురు కుమారులతో, ఇరువదిమంది దాసులతో వచ్చి రాజు యెదుట యోర్ధాను దాటిరి.
19. వారు రాజు దృష్టికి అనుకూలమైనదానిని చేయుటకు రాజ కుటుంబమును నది దాటించి మెప్పువడసిరి.
20. రాజు నది దాటగనే గేరా కుమారుడు షిమీ అతని కాళ్ళమీదపడి “ప్రభువులవారు నా తప్పు మన్నింపవలయును. ఏలిక యెరూషలేమును వీడిన నాడు ఈ దాసుడు చేసిన అవమానమును ప్రభువు విస్మరించుగాక! అసలా సంగతియే ప్రభువుల వారి స్మృతికి రాకుండుగాక! ఈ దాసుడు అపరాధము చేసిన మాటనిజమే.
21. కనుకనే నేడు నేను యోసేపు తెగలందరిలోను మొట్టమొదటవచ్చి రాజును కలిసి కొంటిని” అని విన్నవించుకొనెను.
22. అపుడు సెరూయా పుత్రుడు అబీషయి "నాడు జంకుబొంకు లేక యావే అభిషిక్తుని శపించిన ఈ షిమీ నిక్కముగా వధార్హుడు” అనెను.
23. కాని దావీదు “సెరూయా పుత్రులారా! మీరీ సంగతి పట్టించుకోవలదు. ఇపుడు నన్నెదిరింపవలదు. ఇంతటి శుభ దినమున యిస్రాయేలీయునొకనిని చంపుటయా? నిశ్చయముగా నేడు నేను యిస్రాయేలీయులకు రాజునుగదా!” అనెను.
24. అతడు షిమీతో “నిన్ను చంపను” అని ఒట్టు వేసికొనెను.
25. సౌలు మనుమడు మెఫీ బోషెతుకూడ రాజునకు ఎదురుకోలు చేయబోయెను. రాజు వెడలిపోయిన నాటినుండి తిరిగివచ్చువరకు మెఫీబోషెతు తన కాలుసేతుల సంగతి పట్టించుకోలేదు. గడ్డము చక్కదిద్దుకోలేదు. దుస్తులు శుభ్రము చేసికోలేదు.
26. అతడు యెరూషలేము నుండి బయలుదేరి వచ్చి రాజును కలిసికొనగనే రాజు “ఓయి! నీవు నాతో రావైతివేల?” అని అడిగెను.
27. మెఫీబోషెతు “ప్రభూ! నా దాసుడు నన్ను మోసగించెను. నేను కుంటివాడను గదా! 'నాకు గాడిదపై జీను వేయుము. నేనును రాజుతో పోయెదను' అని సేవకునికి చెప్పితిని.
28. అతడు నన్ను గూర్చి యేలికకు కల్లబొల్లికబురులు చెప్పెను. అయినను ప్రభూ! నీవు దేవదూతవంటి వాడవు. ఇక నీకు సబబనిపించినట్లే చేయుము.
29. మా కుటుంబమువారందరు నీ చేజిక్కి మడియుటకే నోచుకొనిరి. అయినను ఈ దాసుని నీ సరసన కూర్చుండి భోజనము చేయుమంటివి. నేనిక నీకు విన్నవించుకోనేల?” అనెను.
30. రాజు “ఓయి! నీవిక చెప్పనక్కరలేదు. సీబా, నీవు ఆ ఆస్తిని సమముగా అనుభవింపుడు. ఇది నా ఆజ్ఞ” అని వక్కాణించెను.
31. మెఫీబోషెతు “ఆ పొలముపుట్ర వానినే అను భవింపనిమ్ము. ప్రభువు సురక్షితముగా నగరము చేరుకొనెను. నాకు అదియే పదివేలు" అని బదులు పలికెను.
32. గిలాదీయుడగు బర్సిల్లయి కూడ రోగెలీము నుండి పయనమైపోయి దావీదుతో కొన్నాళ్ళు గడపి అతనిని యోర్దాను వరకు సాగనంపుటకు వచ్చెను.
33. అతడు ఎనుబది యేండ్ల పండుముసలి. రాజు మహనాయీమున ఉన్నంత కాలము అతడే వెచ్చము లిచ్చి పోషించెను. బర్సిల్లయి సిరిసంపదలతో తుల తూగువాడు.
34. రాజు అతనితో “నీవును నా వెంట యెరుషలేమునకు రమ్ము. ఈ ముసలిప్రాయమున నిన్ను నా ఇంట ఉంచుకుని నా పెట్టుపోతలతో అలరింతును” అని అనెను.
35. కాని బర్సిల్లయి రాజును చూచి “నీతో యెరూషలేము వచ్చుటకు నేనింకను ఎన్నేండ్లు బ్రతుకుదును?
36. నాకిప్పటికి ఎనుబదియేండ్లు. మంచిచెడ్డలు గుర్తింపగల శక్తి సమసిపోయినది. అన్నపానీయముల రుచినశించినది. గాయనీగాయకులు పాడుపాటలు చెవులకు వినిపింపవు. ఇట్టి నేను నీ వెంట వచ్చిన, నీకు భారమగుట తప్ప ప్రయోజనమేమి లేదు.
37. ఈ దాసుడు నది దాటువరకు నీ వెంట వచ్చును. యెరూషలేమునకు తోడ్కొని పోవునంతటి సత్కారము నాకేల?
38. నేను మా ఇంటికి వెడలిపోయి నా తల్లిదండ్రుల సమాధి చెంతనే కన్నుమూసెదను. కాని, ఇడుగో! నీ దాసుడు కింహాము! వీనిని నీ వెంట గొనిపోయి నీకు తోచిన రీతి నాదరింపుము" అని పలికెను.
39. రాజు “కింహామును నా వెంట పంపుము. అతనికి మేలుచేసి నీకు ప్రియము కలిగింతును. నిన్ను చూచి అతనికి నీవు కోరిన ఉపకారమెల్ల చేయుదును” అనెను.
40. అంతట రాజు, పరిజనులందరు యోర్ధాను దాటిరి. దావీదు బర్సిల్లయిని ముద్దిడుకొని దీవించెను. ఆ వృద్ధుడు తన స్థలమునకు వెడలిపోయెను.
41. రాజు గిల్గాలు చేరుకొనెను. కింహాము కూడ రాజుతో పోయెను. యూదీయులందరు రాజును అనుసరించి వెళ్ళిరి. యిస్రాయేలీయులలో సగము మంది మాత్రము అతని వెంటపోయిరి.
42. యిస్రాయేలీయులు ఒక్కుమ్మడిగా రాజు నొద్దకువచ్చి “మా సోదరులైన ఈ యూదీయులు మాత్రమే ప్రభువును కుటుంబముతో, పరిజనులతో ఏరు దాటింపనేల?” అని అడిగిరి.
43. యూదీయులు 'రాజు మాకు దగ్గరి చుట్టము గదా! దీనికి మీరింతగా అసూయపడనేల? మేమేమి రాజు సొమ్ము తెగదింటిమా? అతడు మాకేమైన ఈడవలు బాడవలు పంచియిచ్చెనా?” అనిరి.
44. యిస్రాయేలీయులు యూదీయులతో "మేము మీకంటె పదిరెట్లు ఎక్కువగనే రాజు క్షేమము నభిలషింతుము. పైపెచ్చు మేము మీకు జ్యేష్ఠులము. మీరా మమ్ము చిన్నచూపు చూచువారు? అసలు మొదట రాజును మరల కొనివత్తమన్నదెవరు? మీరా? మేమా?” అని వాదించిరి. కాని యూదీయులు యిస్రాయేలీయులకంటె పెద్దగా గొంతెత్తి అరచుచు ప్రతివాదము చేసిరి.
1. యిప్రాయేలీయులలో షెబ అను దుర్మార్గుడు ఒకడు కలడు. అతడు బెన్యామీనీయుడైన బిక్రి కుమారుడు. షెబ బాకానూది: “మనకు దావీదు సొత్తులో పాలులేదు, యిషాయి కుమారుని వారసులతో పొత్తులేదు. కావున యిస్రాయేలీయులారా! మన నివాసములకు వెడలిపోవుదము రండు!” అని కేకలిగెను.
2. ఆ మాటలాలించి యిస్రాయేలీయులు దావీదును విడనాడి షెబ వెంటబోయిరి. కాని యూదీయులు మాత్రము దావీదును వదలక యోర్దానునుండి యెరూషలేమువరకు అతని వెంట నంటిపోయిరి.
3. దావీదు యెరూషలేములోని తన పురము చేరుకొని ప్రాసాదమున ప్రవేశించెను. అతడు ఆ ప్రాసాదమును పరామర్శించుటకని వదలి పోయిన పదిమంది ఉంపుడుగత్తెలనొక ఇంటనుంచి వెచ్చము లిచ్చి పోషించెను. దావీదు వారిని మరల కన్నెత్తియైన చూడలేదు. కనుక వారు చనిపోవువరకు విధవలవలె జీవించిరి.
4. రాజు అమాసాతో “నీవు వెళ్ళి యూదీయులను మూడుదినములలో ప్రోగుచేసి కొనిరమ్ము! నీవు స్వయముగా వారితో రమ్ము" అని చెప్పెను.
5. అమాసా యూదీయులను గుంపుగూర్చుటకు వెడలిపోయెను. కాని అతడు దావీదు పెట్టిన గడువులోపల రాలేక పోయెను.
6. రాజు అభిషయితో “ఈ బిక్రి కుమారుడు షెబ మనలను అబ్షాలోముకంటె ఎక్కువగా ముప్పు తిప్పలు పెట్టును. కనుక నీవు రాజు సంరక్షకభటులను తీసికొనిపోయి షెబను వెన్నాడుము. అతడు సురక్షిత పట్టణములు ప్రవేశించెనేని ఇక మన చేతికి చిక్కడు” అని చెప్పెను.
7. కనుక యోవాబు వారును, కెరెతీయులును, పెలెతీయులును మరియు మహావీరులు యెరూషలేము నుండి అభీషయితో పయనమై బిక్రి కుమారుడు షెబను పట్టుకొన బోయిరి.
8. గిబ్యోను చెంతనున్న పెద్ద రాతిబండ దగ్గరకు రాగానే ఆమాసా వారికెదురుగా వచ్చెను. యోవాబు నిలువుచొక్కాయి ధరించి నడికట్టు కట్టుకొని యుండెను. ఆ నడికట్టు మీదినుండి ఒరలో కత్తి కట్టుకునియుండగా ఆ ఒర వదులై కత్తి నేలబడెను.
9. యోవాబు “తమ్ముడా అమాసా! క్షేమమేగదా!” అనుచు ముందటికి వచ్చి, ముద్దిడుకొను వానివలె కుడిచేతితో అతని గడ్డము పట్టుకొనెను.
10. అమాసా యోవాబు చేతనున్న కత్తిని గమనింపనేలేదు. యోవాబు ఆ కత్తితో అమాసాను కడుపున పొడువగా అతని ప్రేవులుజారి నేలపైబడెను. రెండవపోటుతో అవసరము లేకయే అమాసా అసువులు బాసెను. అంతట అభీషయి, యోవాబు బిక్రి కుమారుడు షెబను పట్టుకొనుటకై చెరచెర సాగిపోయిరి.
11. యోవాబు సైనికుడొకడు అమాసా చేరువ నిలిచి "యోవాబు, దావీదుల పక్షము అవలంబింపగోరువారు యోవాబును అనుసరించి వెళ్ళుడు" అని చెప్పుచుండెను.
12. అమాసా త్రోవనడుమ నెత్తుటి మడుగులో పడియుండెను. ఆ త్రోవవెంట వచ్చు యోధులందరను అచట ఆగి నిశ్చేష్టులై చూచుచుండిరి. అది గాంచి ఒక సైనికుడు అమాసా శవమును ప్రక్క పొలము లోనికి లాగివేసి దానిమీద ఒక వస్త్రము కప్పెను.
13. అటు పిమ్మట యోధులందరు బిక్రి కుమారుడైన షెబను పట్టుకొనుటకై నేరుగా యోవాబును అనుసరించి వెళ్ళిరి.
14. షెబ యిస్రాయేలు రాజ్యమంతట తిరిగి చివరకు ఆబేలుబెత్మాకా నగరము ప్రవేశించెను. బిక్రీయులు అతనిననుసరించి వెళ్ళిరి.
15. షెబ పట్టణమున ప్రవేశింపగనే అతనిని వెన్నాడివచ్చినవారు నగర ప్రాకారమెత్తు వరకు కట్టపోసి ప్రాకారమును కూలద్రోయదొడగిరి.
16. అపుడు వివేకవతియగు వనిత ఒకత్తే ప్రాకారముపై నుండి “అయ్యలారా! ఒక్క మాటవినుడు. యోవాబును ఇచ్చటికి పిలిపింపుడు. నేనాయనతో మాట్లాడవలయును” అని పలికెను.
17. యోవాబు ముందటికి వచ్చెను. ఆమె “యోవాబువు నీవేనా?” అని అడుగగా అతడు “అవును నేనే” అని చెప్పెను. ఆమె “ఈ దాసురాలి పలుకులాలింపుము” అనెను. అతడు “ఆలించుచునే యున్నాను చెప్పుము” అనెను.
18. “ 'యిస్రాయేలు పెద్దల ఆచారములు అడుగంటి పోయెనేని ఆబేలు, దాను పట్టణములను చూచి మరల నేర్చుకొనుడు' అని పూర్వమొక సామెత యుండెడిది.
19. యిస్రాయేలు దేశమున శాంతియుతులును యదార్దవంతులును వశించు పట్టణమిది. మీరీ పట్టణమును, ఈ మాతృనగరమును నాశనము చేయబోవుచున్నారు. నాయనలార! ప్రభువు సొత్తయిన ఈ పురమునే కూలద్రోయుదురా?” అని పలికెను.
20. యోవాబు “అమ్మా! ఇవి ఏటి మాటలు? ఈ నగరమును ఆక్రమించుకోవలయుననిగాని, నాశనము చేయవలయుననిగాని నాకు కోరికలేదు.
21. ఉన్న మాట వినుము. ఎఫ్రాయీము కొండకోనకు చెందిన బిక్రి కుమారుడగు షెబ మన రాజు దావీదుపై తిరుగుబాటు చేసెను. అతనినొక్కనిని మాకు పట్టి యిత్తురేని వెంటనే మీ నగరమును వీడి వెడలిపోయెదము” అనెను. ఆమె “దానికేమి, ఈ గోడమీద నుండి అతని తలను మీ కడకు విసరివేసెదము” అని చెప్పెను.
22. ఇట్లు చెప్పి ఆమె నగరములోనికి వెడలిపోయి తన తెలివితేటలతో పురజనులను ఒప్పించెను. వారు బిక్రి కుమారుడు షెబ తల నరికి గోడమీది నుండి యోవాబు ఎదుటకు విసరివేసిరి. వెంటనే యోవాబు బాకానూదెను. అతని అనుచరులు పోరు చాలించి తమ తమ గుడారములు చేరుకొనిరి. యోవాబు యెరూషలేమునకు వెడలిపోయెను.
23. యోవాబు దావీదు పటాలములన్నింటికిని నాయకుడు. యెహోయాదా పుత్రుడైన బెనాయా కెరెతీయులకును, పెలెతీయులకును నాయకుడు,
24. అదోరాము వెట్టిచారికి చేయు నిర్బంధ సైనికులకు అధిపతి. అహీలూదు కుమారుడు యెహోషాఫాత్తు లేఖకుడు.
25. షెవా కార్యదర్శి, సాదోకు, అబ్యాతారు యాజకులు.
26. యాయీరు నివాసి యీరా కూడ దావీదునకు యాజకుడు.
1. దావీదు పరిపాలన కాలమున మూడేండ్ల పాటు కాటకము సంభవించెను. దావీదు ప్రభువును సంప్రదించెను. అందుకు ప్రభువు “సౌలు, అతని కుటుంబమువారు గిబియోనీయులను వధించి పాపము కట్టుకొనిరి. ఆ పాపము మిమ్ము వేధించుచున్నది” అని వక్కాణించెను.
2. గిబియోనీయులు యిస్రాయేలీయుల సంబంధులుకారు. అమోరీయుల జాతిలో శేషించినవారు. వీరిని రక్షింతుమని యిస్రాయేలీయులు మొదట బాసచేసిరి. కాని సౌలు యూదా, యిస్రాయేలీయులయందు ఆసక్తి గలవాడై గిబియోనీయులను రూపుమాపనెంచెను.
3. కనుక రాజు గిబియోనీయులను పిలువనంపి “నన్నిపుడేమి చేయమందురు? కోపము చల్లారి మరల మీరు ఈ యిస్రాయేలీయులను దీవింపవలెనన్న నేనేమి ప్రాయశ్చిత్తము చేసికొనవలయునో చెప్పుడు” అని అడిగెను.
4. గిబియోనీయులు “అయ్యా! సౌలు కుటుంబము వారికి, మాకు వెండి బంగారములతో సమస్య పరిష్కారము కాదు. ఈ యిస్రాయేలీయులను మా కొరకు బలిపెట్టవలయునని మేము కోరుకొనము” అనిరి. రాజు “అటులయిన నన్నేమిచేయుమందురో చెప్పుడు. మీ కోరిక తప్పక తీర్చెదను” అని పలికెను.
5. వారతనితో “మమ్ము యిస్రాయేలు నేలపై నుండి తుడిచివేయవలెనని మమ్ము సర్వనాశనము చేయుటకు పాల్పడినవాడే మాకు జవాబుదారి కావలయును.
6. కనుక అతని సంతతివారిని ఏడుగురిని మాకు పట్టి యిమ్ము. వారిని మాత్రము యావే ఎన్నుకొనిన గిబియా పట్టణములో యావే సన్నిధిని మేము ఉరి తీసెదము" అని అనిరి. దావీదు "సరియే, ఆ ఏడుగురిని మీకు అప్పగింతును” అనెను.
7. అతడు యావే ఎదుట యోనాతానుతో చేసికొనిన ఒడంబడికను అనుసరించి యోనాతాను పుత్రుడును, సౌలు మనుమడును అయిన మెఫీబోషెతును వదలివేసెను.
8. కాని అతడు అయ్యా పుత్రిక రిస్పా సౌలునకు కనిన ఇద్దరు కుమారులు ఆర్మోని, మెఫీబోషెతులను, సౌలు కూతురు మేరబు మహోలతీయుడును బర్సిల్లయి కుమారుడైన అద్రియేలునకు కనిన ఐదుగురు పుత్రులను గిబియోనీయుల వశము చేసెను.
9. గిబియోనీయులు వారిని కొండ మీద యావే ఎదుట బలిఇచ్చిరి. ఆ ఏడుగురు ఒక్కుమ్మడి గనే ప్రాణములు విడిచిరి. పంటకారు తొలినాళ్ళలో, యవధాన్యము కోతకు వచ్చియున్నపుడు వారిని యావేకు బలిఇచ్చిరి.
10. యవపంట కోయుకాలము నుండి వానలు కురిసి శవములను తడుపు నాటివరకు అయ్యా పుత్రికయగు రిస్పా గోనెపట్ట పరచుకొని కొండమీద కాపు ఉండెను. ఆమె పగటిపూట ఆకాశపక్షులనుగాని, రాత్రివేళ అడవి మృగములను గాని శవముల మీదికి రానీయలేదు.
11. అయ్యా పుత్రిక, సౌలు ఉంపుడుగత్తెయునగు రిస్పా యీ రీతిగా శవములకు కావలికాయుచుండెనని దావీదు వినెను.
12. అతడు యాబేషు గిలాదు నాయకులనుండి సౌలు యోనాతానుల అస్థికలను కొనివచ్చెను. ఫిలిస్తీయులు సౌలును గిల్బోవా యుద్ధమున ఓడించినపుడు శత్రువుల మృతదేహములను బేత్ షాను వీధిలో వ్రేలాడగట్టిరి గదా! గిలాదు పౌరులు ఆ దేహములను దొంగలించు కొనివచ్చిరి.
13-14. దావీదు తాను కొనివచ్చిన సౌలు యోనాతానుల అస్థికలను కొండపై బలియైన వారి ఎముకలతో చేర్చి వానినన్నింటిని బెన్యామీను మండలమున సేలా నగరముననున్న సౌలు తండ్రి కీషు సమాధిలో పూడ్పించెను. రాజు ఆజ్ఞాపించినట్లే సర్వకార్యములు నిర్వహింపబడెను. అటుపిమ్మట ప్రభువు ప్రజలమొర ఆలించి దేశమున వానలు కురిపించెను.
15. ఫిలిస్తీయులు మరల యిస్రాయేలీయులపైకి దండెత్తివచ్చిరి. దావీదు తన సేవకులతో పోయి గోబు వద్ద గుడారు పన్ని ఫిలిస్తీయులతో పోరాడెను. అతడు పోరున అలసిపడిపోయెను. ఆ రోజులలో రాఫా వంశీయుడగు
16. ఈష్బిబెనోబు అను ఫిలిస్తీయుడు మొనగాడయ్యెను. అతని యీటె మూడువందల తులముల ఇత్తడితో చేసినది. అతడు క్రొత్త కత్తి ఒకటి చేపట్టి దావీదును చంపెదనని విఱ్ఱవీగుచు వచ్చెను.
17. కాని సెరూయా పుత్రుడు అబీషయి దావీదు తరపున పోరాడి ఫిలిస్తీయుని గెలిచెను. నాడు దావీదు అనుచరులు “నీవిక మాతో యుద్ధమునకు రాదగదు. యిస్రాయేలీయుల దీపము ఆరిపోరాదు' అని ఆన పెట్టిరి.
18. అటుపిమ్మట ఫిలిస్తీయులు మరల చెలరేగి గోబు వద్ద పోరు మొదలిడిరి. హూషా నివాసి సిబేకాయి, రాఫా వంశీయుడు సఫును మట్టుపెట్టినది ఈ యుద్ధముననే.
19. ఫిలిస్తీయులు మరల కయ్యమునకు కాలు దువ్వి గోబు వద్ద పోరు ప్రారంభించిరి. బేత్లెహేము వాసియగు యాయీరు పుత్రుడు ఎల్షానాను, గాతు నివాసియగు గొల్యాతును వధించినది ఈ యుద్ధముననే. ఆ గొల్యాతు ఈటె సాలెవాని చాపు బద్దవలె ఉండెడిది.
20. గాతు వద్ద మరియొక పోరు జరిగెను. అచట ఆజానుబాహుడైన ఫిలిస్తీయుడు ఒకడుండెను. అతని కాలు సేతులకు ఒక్కొక్క దానికి ఆరేసి వ్రేళ్ళ చొప్పున ఇరువదినాలుగు వ్రేళ్ళుకలవు. వీడును రాఫా వంశీయుడే.
21. ఈ ఫిలిస్తీయుడు యిస్రాయేలీయులను సవాలు చేయగా దావీదు సోదరుడు షిమ్యా పుత్రుడు యోనాతాను వానిని వధించెను.
22. ఈ నలుగురు గాతు నివాసియైన రాఫా వంశీయులు. దావీదు, అతని అనుచరులు వీరిని హతమార్చిరి.
1. యావే తనను సౌలు చేతులోనుండియు, తన శత్రువులందరి చేతిలోనుండియు తప్పించినందులకు కృతజ్ఞతగా దావీదు ఈ క్రింది గీత పదములతో యావేను స్తుతించెను.
2. “ప్రభువు నాకు దుర్గము, శిల, రక్షణము.
3. అతడే నా దుర్గము కనుక నేనతని దాపుసొచ్చెదను. అతడే నా డాలు, నా ప్రాపు, నన్ను కాచి కాపాడు రక్షణదుర్గము. యావే శత్రువులనుండి నన్ను కాపాడును.
4. నేను యావే శరణుజొచ్చితిని, ఆయన ప్రశంసనీయుడు, శత్రువులనుండి నన్ను కాపాడువాడు.
5. మృత్యువు యొక్క అలలు నా చుట్టు ఉవ్వెత్తుగ లేచినవి. దుష్టప్రవాహములు నన్ను ముంచివైచినవి.
6. మృతలోకపాశములు నన్ను బంధించినవి. మరణపుటురులు నన్ను గట్టిగా బిగింపజొచ్చినవి.
7. నా ఇక్కట్టులలో యావేకు మొర పెట్టితిని. ప్రభువును ఎలుగెత్తి పిలిచితిని. తన ఆలయమునుండి ఆయన నా మొర వినెను. నా గోడు యావే చెవినిబడెను.
8. ప్రభువు కోపమునుచూచి నేల అదరి దద్దరిల్లెను. ఆకాశపునాదులు కంపించి గడగడ వణకెను.
9. యావే ముక్కుపుటలనుండి పొగలు పుట్టెను. ఆయన నోటినుండి నిప్పుకణికలు రాలి మంటలు లేచెను.
10. ప్రభువు ఆకాశమును చిందరవందర చేయుచు దిగివచ్చెను. కారుచీకట్లు ఆయన పాదములను కమ్ముకొనెను.
11. యావే కెరూబు దూత పైనెక్కి స్వారిచేసెను. వాయువు రెక్కలపై కూర్చుండి. విజయము చేసెను.
12. ప్రభువు చీకటులతో ఒక గుడారము పన్నుకొనెను. ఆకాశమునందలి దట్టపు నీటిమబ్బులు ఆయనను గొడుగువలె కప్పివైచెను.
13. యావే ముందట ఒకమంట గుప్పించి ఎగసెను. నిప్పు కణికలు మిలమిల మెరసెను.
14. యావే ఆకాశము నుండి గర్జించెను. మహోన్నతుడైన దేవుడు సింహనాదము చేసెను.
15. ఆయన బాణములు విసరి జలములను చెల్లాచెదరు చేసెను. మెరుపులు విసరి నీళ్ళను కకావికలు చేసెను.
16. యావే గద్దింపగా, ముక్కు రంధ్రముల నుండి శ్వాస వడిగా వదలగా, నీళ్ళన్నియు తొలగిపోయి కడలిగర్భము కాన్పించెను. నేలపునాదులు బయటపడెను.
17. ప్రభువు ఆకసమునుండి దిగివచ్చి నన్నుచేకొనెను. నీళ్ళ నడుమనుండి నన్ను పైకిలేపెను.
18. బలవంతులగు శత్రువులనుండి, నాపై బడిన పగవారినుండి, ప్రభువు నన్ను కాపాడెను.
19. ఆ చెడుదినమున గిట్టనివారు నన్నెదిరించిరి. అయినను ప్రభువు నన్ను ఆదుకొనెను.
20. యావే నన్ను ఒడ్డు చేర్చెను. నా యందు ఆయన ఆనందించెను గనుక యావే నాయందు కూర్మితో నన్నాదరించెను.
21. నా నీతిని చూచి యావే నన్ను సంభావించెను, నా విశుద్ధవర్తనమును చూచి నన్ను బహుమానించెను.
22. నేను ప్రభువు చట్టములు పాటించితిని. యావే కట్టడలు జవదాటనైతిని.
23. ప్రభుశాసనములు నా కన్నుల ఎదుట నిలుపుకొంటిని. ప్రభువు ఆజ్ఞలను అశ్రద్ధ చేయనైతిని.
24. ఆయన ఎదుట నేను నిర్దోషిని అనిపించుకొంటిని. నేను పాపము చెంతకుపోనైతిని.
25. నా నీతిని చూచి, నా విశుద్ధవర్తనమును చూచి యావే నాకు ప్రతిఫలమిచ్చెను.
26. ప్రభూ! నీవు విశ్వసనీయులతో విశ్వసనీయుడవుగా, ఉత్తములతో ఉత్తముడవుగా వర్తింతువు.
27. ఋజువర్తనులతో ఋజువర్తనుడవుగా, కపటాత్ములతో కపటముగా ప్రవర్తింతువు.
28. నీవు వినయవంతులను రక్షింతువు. తల బిరుసుతనముతో తిరుగు గర్వాత్ములను అణగదొక్కుదువు.
29. యావే! నా దీపము నీవే నా త్రోవను వెలిగించువాడవు నీవే.
30. నీవు తోడైయుండగా నేను శత్రు సైన్యముల నెదిరింతును. నీవు బాసటయై యుండగా పగవారి కోటలు దాటుదును.
31. ప్రభుమార్గము ఉత్తమమైనది. ఆయన వాక్కు నమ్మదగినది. యావే తన్నాశ్రయించిన వారిని డాలువలె కాచి కాపాడును.
32. యావే తప్ప దేవుడెవడు? యావే తప్ప మనకు ఆశ్రయదుర్గమెవడు?
33. ప్రభువు నాకు బలమొసగును. నా కార్యములను నిర్దోషముగ తీర్చిదిద్దును.
34. ప్రభువు నన్ను కొండకొమ్మున సురక్షితముగ నిలుపును. కొండబండ మీద నిలిచిన లేడి గిట్టలవలె నా పాదములను గట్టిగా నిల్పును.
35. యావే నన్ను పోరునకు తర్పీదు చేయును. నా చేతులు కంచువింటినైనను ఎక్కుపెట్టగలవు.
36. ప్రభూ! నీవు నన్ను డాలువలె కాచి కాపాడుదువు. నన్ను కరుణతో మనిచి పెద్దచేయుదువు.
37. నా పాదములకు వలసినంత చోటు చూపుదువు. నా అడుగులు తడబడనీయకుండ కాపాడుదువు.
38. నా శత్రువులను వెన్నాడి తునుమాడెదను. నా పగవారిని తుదముట్టించువరకు తిరిగిరాను.
39. నేను శత్రువులను పడగొట్టెదను. నా విరోధులిక లేవలేరు. వారు నా పాదముల క్రింద పడిపోయిరి.
40. ప్రభూ! శత్రువులతో పోరాడుటకై నాకు బలమొసగితివి. నాపైకి ఎత్తివచ్చిన వారిని నాకు లోబరచితివి.
41. నీ కృపవలన వైరులు వెన్నిచ్చి పారిపోయిరి. నన్ను ద్వేషించిన పగవారినెల్ల మట్టుపెట్టితిని.
42. వైరివర్గము ఆర్తనాదము చేసెనుగాని వారిని రక్షించు నాథుడెవ్వడును లేడయ్యెను. వారు యావేకు మొరపెట్టినను బదులు రాలేదు.
43. శత్రువులను నలుగగొట్టి భూధూళివలె పొడిచేసితిని. త్రోవలోని మట్టిప్రోవువలె అణగదొక్కితిని.
44. తిరుగుబాటు చేసిన ప్రజల నుండి నీవు నన్ను కాపాడితివి. వివిధ జాతులకు నన్ను ప్రభుని చేసితివి. కనివిని ఎరుగని జనులుకూడ నాకు దాసులైరి.
45. అన్యప్రజలు నా మన్ననలు పొందుటకై వత్తురు. నా మాట వినగానే దాసులమని కైమోడ్పులు అర్పింతురు.
46. నా పేరు చెప్పగనే వారి గుండెలు దడదడలాడును. వారు గడగడవణకుచు దుర్గములను వీడి నన్ను చూడవత్తురు.
47. యావే సజీవుడు! నా దుర్గము స్తోత్రార్హుడు! నా రక్షకుడైన ప్రభువునకు స్తుత్యంజలులు!
48. నా శత్రువులపై పగతీర్చుకొని వారిని నా వశము చేసినది ఆ ప్రభువే.
49. శత్రువులనుండి నన్ను కాచి కాపాడినది ఆ ప్రభువే. విరోధుల చేజిక్కకుండ నన్ను రక్షించునది ఆ ప్రభువే. నాపై ఎత్తివచ్చిన వారి బారినుండి నన్ను కాపాడునది ఆ ప్రభువే.
50. కావున ప్రభూ! సమస్త జాతుల ఎదుట నేను నిన్ను స్తుతింతును. నీ నామమును ఎలుగెత్తి పాడెదను.
51. ప్రభువు తన రాజునకు మహావిజయము ప్రసాదించును. తన అభిషిక్తుని ఆదరమున చూచును. దావీదును అతని సంతతివారిని సదాజీవింపజేయును.”
1. దావీదు తుదిమాటలివి: యాకోబు దేవునిచే అభిషిక్తుడై ఉచ్చదశ నందుకొని యిస్రాయేలు పాటలు పాడిన యిషాయి కుమారుడైన దావీదు పలికిన ప్రవచనములివి:
2. “యావే ఆత్మ నా మూలమున మాటలాడును. ప్రభువు మాట నా నాలుకపై నిలిచినది. యాకోబు దేవుడు, యిస్రాయేలు దుర్గమైన ప్రభువు నాతో ఇట్లనెను:
3-4. మనుష్యులను పాలించు ఒకడు పుట్టును. ఉదయకాలపు సూర్యోదయ కాంతివలెను, మబ్బులులేనినాడు ఉదయించిన సూర్యునివలెను, వర్షము కురిసి వెలిసినప్పటి నిర్మలమైనకాంతి లేబచ్చికను మిలమిల మెరయజేసినట్లే అతడు తన ప్రజను నీతితో పరిపాలించును, దైవభక్తితో యేలును.
5. ప్రభువు నా వంశమును దృఢముగా నిల్పును. యావే నాతో నిత్యనిబంధనము చేసికొనును. సమస్తము చక్కదిద్దబడినది. ప్రభువిక నాకు రక్షణమొసగి నా కోర్కెలు తీర్చును.
6-7. దేవుని విడనాడు భక్తిహీనులు ఎడారియందలి ముండ్లతుప్పలవలె మాయమగుదురు. వానినెవ్వడు చేతతాకడు, ఇనుప పనిముట్లతోనో, కొయ్యకోలతోనో పొడిచి, నిప్పున కాలురేగాని, వాని నెవ్వడును చేతముట్టడు”.
8. దావీదు వీరుల పేర్లివి. యోషెబ్బ - షెబెత్తు అను ప్రముఖుడగు తాక్మోనీయుడు. ఇతడు ముగ్గురు మొనగాండ్ర జట్టుకు నాయకుడు. అతడు గండ్రగొడ్డలి చేపట్టి ఎనిమిది వందలమందిని ఒక్క పెట్టున మట్టుపెట్టెను.
9. ఇతని తరువాత అహోహీయుడును దోదో కుమారుడగు ఎలియెజెరు ముగ్గురు మొనగాండ్రలో ఒకడు. ఫిలిస్తీయులు ప్రోగైవచ్చి పాస్ధామీము వద్ద యిస్రాయేలీయులను ఎదిరించి తరిమి కొట్టినపుడు అతడు దావీదుతో నుండెను.
10. కాని ఎలియెజెరు ఫిలిస్తీయుల నెదిరించెను. చేయి తిమ్మిరిగొని కత్తికి కరచుకొని పోవువరకును శత్రువులను నిశ్శేషముగా తునుమాడెను. ఆనాడు యావే యిస్రాయేలీయులకు విజయము ప్రసాదించెను. పోరు ముగిసిన పిదప యిస్రాయేలు ప్రజలు చచ్చిన వారి వస్త్రములూడ్చుటకు మాత్రము ఎలియెజెరు వెంటబోయిరి.
11. ఇతని తరువాత హరారీయుడును ఆగే కుమారుడైన షమ్మా ముగ్గురు మొనగాండ్రలో మూడవవాడు. ఫిలిస్తీయులు లేహీవద్ద మోహరించి ఉండిరి. అచట ఏపుగా పెరిగిన పప్పుధాన్యము చేను కలదు. యిస్రాయేలీయులు ఫిలిస్తీయులకు ఓడిపారి పోజొచ్చిరి.
12. కాని షమ్మా రొమ్ము విరుచుకొని పొలము నడుమ నిలబడి ఫిలిస్తీయులను అటనుండి తరిమికొట్టెను. నాడు యావే యిస్రాయేలీయులకు గొప్ప గెలుపు దయచేసెను.
13. ఫిలిస్తీయులు రేఫాయీము లోయలో దండు దిగిరి. దావీదు వీరులగు ముప్పదిమంది ఒక జట్టు. ఆ జట్టునుండి ముగ్గురు వీరులు పయనమైపోయి పంటకారున అదుల్లాము గుహలో తమ రాజును కలిసికొనిరి.
14. దావీదు అపుడు బొరియలో దాగియుండెను. ఫిలిస్తీయుల పటాలము బేత్లెహేమును చుట్టుముట్టియుండెను.
15. దావీదు “బెత్లెహేము ద్వారము చెంతనున్న బావినుండి ఎవరైన నాకు గుక్కెడు నీళ్ళు కొనివచ్చిన బాగుగానుండును” అనెను.
16. ఆ మాటలాలించి ముగ్గురు వీరులు ఫిలిస్తీయుల దండులగుండ దారిచేసి కొనిపోయి బెత్లెహేము ద్వారము చెంతనున్న బావి నుండి నీళ్ళుతోడి తెచ్చి దావీదునకిచ్చిరి. కాని అతడా నీళ్ళు ముట్టుకొనక యావేకు ధారవో సెను.
17. “ప్రభూ! నేను ఈ నీళ్ళుముట్టుకొనిన ఒట్టు. ఈ వీరులు ప్రాణములకు తెగించి బేత్లెహేము పోయిరి. ఇది వారి నెత్తురుసుమా!” అనెను. కనుక అతడానీళ్ళు ముట్టు కోలేదు. ఆ ముగ్గురు వీరులు అంత సాహసము చూపిరి.
18. సెరూయా కుమారుడును యోవాబు తమ్ముడైన అబీషయి ముప్పదిమంది వీరుల జట్టుకు నాయకుడు. అతడు బల్లెముతో మూడు వందల మందిని పొడిచిచంపి ఆ ముప్పదిమందిలో పేరు మోసెను.
19. అతడు ఆ ముప్పదిమంది కంటె ప్రసిద్ధుడై వారికి మొనగాడయ్యెను. అయినను మొదటి ముగ్గురు మొనగాండ్రకు సమానుడు కాడయ్యెను.
20. యెహోయాదా కుమారుడు, కబ్సేలు నగరవాసియైన బెనాయా పెక్కు వీరకార్యములు చేసెను. మోవాబు పందెగాండ్రనిద్దరను మట్టుపెట్టెను. ఒకనాడు మంచు కురియుచుండగా పోయి గోతిలో నున్న సింగమును చావమోయెను.
21. అతడు ఆజాను బాహుడైన ఐగుప్తీయుని ఒకనిని హతమార్చెను. ఆ ఐగుప్తీయుడు ఈటె చేపట్టి వచ్చెను. బెనాయా చేతి కఱ్ఱతో పోయి ఐగుప్తీయుని మీదపడి అతని యీటె లాగుకొనెను. దానితోనే వానిని పొడిచిచంపెను.
22. యెహోయాదా పుత్రుడు బెనాయా ఇట్టి సాహస కార్యములతో ముప్పదిమంది వీరులలో గణనకెక్కెను.
23. అతడా ముప్పదిమంది వీరులకంటె ప్రసిద్ధుడయ్యెను గాని మొదటి ముగ్గురు మొనగాండ్ర వంటివాడు కాలేకపోయెను. దావీదు బెనాయాను తన అంగరక్షకు లకు నాయకుని చేసెను.
24-39. దావీదు వీరులు వీరు: యోవాబు తమ్ముడు అసాహేలు, బేత్లెహేమీయుడును దోదో కుమారుడైన ఎల్హానాను, హారోదువాడు షమ్మా, హారోదు వాడు ఎలీకా, పల్తీయుడు హేలేసు, తెకోవా వాసియు ఇక్కేషు కుమారుడైన ఈరా, అనతోతు వాడగు అబియేసేరు, హూషావాడగు మెబున్నాయి, ఆహోవాడగు సల్మోను, నెటోఫావాడగు మహరాయి, నెటోఫావాడగు బానా కుమారుడు హేలెబు, బెన్యామీనీయుల గిబియాకు చెందిన రీబయి కుమారుడు ఇత్తయి, పిరతోనువాడగు బెనాయా, గాషులోయకు చెందిన హిద్దాయి, అర్బాతీయుడు అబీయల్బోను, బహూరము వాడగు అస్మావేత్తు, షాల్లోనువాడగు ఎలియాబా, యాషేను కుమారులు, హారారునకు చెందిన షమ్మా కుమారుడు యోనాతాను, హారారునకు చెందిన షారారు కుమారుడు అహియాము, మాకాకు చెందిన అహస్బాయి కుమారుడు ఎలీఫేలేటు, గిలోకు చెందిన అహీతోఫెలు కుమారుడు యెలీయాము, కర్మేలు వాడగు హెస్రో, ఆరబు వాడగు పారాయి, సోబాకు చెందిన నాతాను కుమారుడు ఈగాలు, గాదీయుడగు బానీ, అమ్మోనీయుడగు సెలెకు, సెరూయా కుమారుడగు యోవాబు అంగరక్షకుడును, బేరోతీయుడగు నహరాయి, ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారెబు, హిత్తీయుడగు ఊరియా. వీరందరు కలసి ముప్పది యేడుగురు.
1. ప్రభువు మరల యిస్రాయేలీయుల పై కోపము తెచ్చుకొనెను. ఆయన దావీదును వారిపై పురికొల్పనెంచి అతనితో “పొమ్ము! యిస్రాయేలు వారిని, యూదా వారిని లెక్కించుము అని ఆజ్ఞ ఇచ్చెను.”
2. కనుక రాజు యోవాబుతోను, అతనితో నున్న సైనికోద్యోగులతోను, “దాను నుండి బేర్షేబా వరకు గల యిస్రాయేలు తెగలన్నింటిని చుట్టివచ్చి జనాభా లెక్కలు తయారుచేయుడు. మన ప్రజలెందరో నేను తెలిసికోవలయును” అని వక్కాణించెను.
3. యోవాబు రాజుతో “ప్రజల సంఖ్య ఎంతయున్నను నీవు బ్రతికియుండగానే యావే మన జనమును నూరంతలుగా వృద్ధిచేయగ చూచి, కన్నులపండువుగ సంతసింతువుగాక! కాని నా రాజువగు మీకు ఈ కోరిక ఏల పుట్టెను?” అని అనెను.
4. అయినను రాజు యోవాబునకు అతని తోడి సైనికోద్యోగులకు ఆజ్ఞ ఇచ్చెను. కనుక వారు యిస్రాయేలీయులను లెక్కించుటకై వెడలిపోయిరి.
5. వారు యోర్దానునది దాటిపోయి అరో యేరున దిగి, లోయ మధ్యనున్న నగరమునుండి లెక్క మొదలిడి, గాదుమీదుగా యాసేరు మండలములకు వెడలిపోయిరి.
6. ఆ తరువాత గిలాదు వెళ్ళి అట నుండి హిత్తీయుల సీమలోని కాదేషుకు వెళ్ళిరి. అట నుండి కదలి దాను, సీవోను ప్రాంతములకు పోయిరి.
7. ఆ పిమ్మట తూరు దుర్గమును ముగించుకొని హివ్వీయులు, కనానీయులు వసించు నగరమును కూడ చుట్టి వచ్చి దక్షిణ దిక్కున ఉన్న బేర్షెబవద్ద గల యూదా పల్లెపట్టులతో లెక్క ముగించిరి.
8. ఈ రీతిగా దేశ మంతటిని లెక్కపెట్టి తొమ్మిదినెలల ఇరువది రోజులు గడచినపిదప తిరిగి యెరూషలేము చేరుకొనిరి.
9. యోవాబు జనాభాలెక్క రాజునకు సమర్పించెను. కత్తి చేపట్టి పోరు నెరపగల యోధులు యిస్రాయేలీయులందు ఎనిమిది లక్షలమంది, యూదీయులందు ఐదులక్షలమంది ఉండిరి.
10. కాని దావీదు ప్రజలను లెక్కపెట్టిన తరువాత అంతరాత్మ అతనిని బాధించెను. అతడు “ప్రభూ! నేను మహాపాపము కట్టుకొంటిని. నా అపరాధము మన్నింపుము. ఇట్టి తెలివిమాలినపని చేసితిని” అనెను.
11-12. కాని మరునాటి వేకువన దావీదు నిద్ర మేల్కొనగనే ప్రభువువాణి దావీదునకు దార్శనీకుడును, ప్రవక్తయునైన గాదుతో “నీవు దావీదు నొద్దకు వెళ్ళి ఇట్లనుము. నేను నీకు మూడుకార్యములు నిర్ణయించితిని. వానిలో నీ ఇష్టము వచ్చిన దానిని ఎన్నుకొనుము. దానిని మాత్రమే జరుపుదును” అని చెప్పెను.
13. కనుక గాదు దావీదునొద్దకు వెళ్ళి “ఈ దేశమున ఏడేండ్ల పాటు కరువువచ్చుటకు ఒప్పు కొందువా? శత్రువులు మూడునెలల పాటు నిన్ను తరుముచుండగా పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమున మూడుదినములు అంటురోగము అలముకొనుటకు ఒప్పుకొందువా? ఈ మూడింటిలో ఏది కావలయునో జాగ్రత్తగా ఆలోచించి చెప్పుము. నన్నిటకు పంపిన దేవునికి నేను తిరిగి బదులుచెప్పవలయును” అనెను.
14-15. దావీదు “నాకేమి తోచని చిక్కుల లోబడితిని. కాని నరుని చేతికి చిక్కుటకంటె యావే చేతికి చిక్కుటమేలు. ప్రభువు మిక్కిలి దయాపరుడు” అని పలికి అంటురోగమునే ఎన్నుకొనెను. అది పంటకాలము. ప్రభువు నాటి ప్రొద్దుటినుండి నియమితకాలము ముగియువరకు అంటురోగము పంపెను. దాను నుండి బేర్షెబా వరకు డెబ్బదివేలమంది చచ్చిరి.
16. యావే దూత యెరూషలేము మీదబడి నగరమును నాశనము చేయబోవుచుండెను. కాని యావే పరితాపము చెంది నాశనముచేయు దూతతో “ఇక చాలు, నగరముమీదికి పోవలదు” అనెను. అప్పుడు దేవదూత యెబూసీయుడగు ఆరౌనా కళ్ళము చెంతనుండెను.
17. ఆ రీతిగా దేవదూత జనులను పీడించుట చూచి దావీదు యావేతో “పాపము చేసి అపరాధము కట్టుకొనినది నేను. ఈ ప్రజలు అన్నెము పున్నెము ఎరుగరు. వీరిని విడిచి పెట్టి నన్నును, నా కుటుంబ మును శిక్షింపుము" అని మనవి చేసికొనెను.
18. ఆ రోజు గాదు దావీదు నొద్దకు వచ్చి “యెబూసీయుడగు ఆరౌనా కళ్ళమున యావేకొక బలిపీఠము నిర్మింపుము" అని చెప్పెను.
19. గాదు చెప్పిన ప్రకారం దావీదు యావే ఆజ్ఞ పాటించుటకు వెడలిపోయెను.
20. అపుడు ఆరౌనా కళ్ళమున గోధుమలు తొక్కించుచుండెను. అతడు మీది నుండి చూడగా దావీదు అతని కొలువుకాండ్రు వచ్చుచుండిరి. కనుక ఆరౌనా రాజునకెదురేగి సాష్టాంగ నమస్కారము చేసెను.
21. అతడు “ప్రభువు ఈ దాసుని చెంతకు విచ్చేయనేల?” అనెను. దావీదు “ఈ కళ్ళపు నేలను కొని యావేకొక బలిపీఠము కట్టవలయును. అపుడు గాని ఈ అంటురోగము ఆగిపోదు” అనెను.
22. అతడు “ప్రభూ! ఈ పొలము గైకొనుము. నీకు యోగ్యమనిపించిన కానుకలతో యావేకు బలి అర్పింపుము. దహనబలికి ఎడ్లు ఇవిగో! కట్టెలు కావలయునేని కళ్ళమునూర్చు మ్రాను, ఎద్దులకాడి ఇవిగో!
23. వీనినన్నిటిని నీకు సమర్పించితిని. ప్రభువు నీవు సమర్పించు బలిని అంగీకరించుగాక!” అనెను.
24. కాని దావీదు “ఓయి! పొలమును వెల ఇచ్చియే పుచ్చుకొందును. నేను డబ్బు చెల్లింపలేని దహనబలిని యావేకు సమర్పించువాడను కాను సుమా!" అని పలికెను. అతడు ఆరౌనా పొలమునకు, ఎడ్లకు ఏబది వెండికాసులు చెల్లించెను.
25. దావీదు అచట యావే నామమున బలిపీఠము నిర్మించి దహనబలి, సమాధానబలి సమర్పించెను. యావే దేశము కొరకు చేయబడిన విన్నపములను ఆలకింపగ అంటురోగము యిస్రాయేలీయులను విడిచిపోయెను.