1. ఎస్తేరు రాణి కూడ మరణభయము వలన క్రుంగిపోయి ప్రభువును ఆశ్రయించెను.
2. ఆమె తన వైభవోపేతములైన వస్త్రములను తొలగించి, శోకవస్త్రములను తాల్చెను. సుగంధతైలములకు బదులుగా తలమీద బూడిద, పేడ అలముకొనెను. ఆమె దేహము దీనాకృతిని పొందెను. పూర్వము తాను అందముగా అలంకరించుకొనిన అవయవములను ఇప్పుడు విడిపోయిన కురులతో కప్పుకొనెను.
3-4. ఆమె యిస్రాయేలు ప్రభువైన దేవునకిట్లు మనవి చేసెను: “ప్రభూ! నీవే మా రాజువు. ఏకాకినై దిక్కుమాలి ప్రాణాపాయ స్థితిలోనున్న నన్ను కరుణింపుము. నీవు కాక నాకు సహాయకుడెవ్వడు?
5. సకలజనులనుండియు, నీవు యిస్రాయేలీయులనే ఎన్నుకొంటివనియు, సకలజాతుల మూలపురుషుల నుండియు, మా పితరులనే నీ జనముగా, స్వీకరించితివనియు, నీవు చేసిన ప్రమాణములెల్ల నిలబెట్టుకొంటివనియు బాల్యమునందే మావారు నాకు విన్పించిరి.
6-7. కాని మా ప్రజలు నీకు ద్రోహము చేసి అన్యజాతుల దైవములను కొలువగా నీవు మమ్ము ఆ జాతులకు బానిసలుగా చేసితివి. ప్రభూ! నీ శిక్ష సముచితముగనేయున్నది.
8-9. కాని మా శత్రువులు మా దీనదాస్యమువలన సంతృప్తి చెందరైరి. వారు నీ నిర్ణయములను రద్దుచేతుమనియు, నిన్ను స్తుతించు మా నోళ్ళు మూయింతుమనియు, మహిమాన్వితమైన నీ దేవాలయమును, బలిపీఠమును నిర్మూలింతుమనియు, తాము కొలుచు దైవములకు బాసచేసిరి.
10. వ్యర్ధములైన ఆ విగ్రహములను కీర్తింపుడని, వారు అన్యజాతులను పురికొల్పిరి. మానవమాత్రుడైన ఒక రాజును నిరతము సన్నుతించుటకు పాల్పడిరి.
11. ప్రభూ! నీవు మాత్రము ఈ వ్యర్ధములైన విగ్రహములకు నీ పాలితులను లొంగనీయకుము. శత్రువులు మా పతనమును చూచి నవ్వకుందురుగాక! వారు త్రవ్విన గోతిలో వారే పడుదురు గాక! ఈ కుతంత్రము పన్నిన నాయకుడే కూలి పోవునుగాక!
12. ప్రభూ! మమ్ము జ్ఞప్తికి తెచ్చుకొనుము. నీ బలసామర్థ్యము చూపి ఆపదలో చిక్కిన మమ్ము ఆదుకొనరమ్ము!
13. సర్వశక్తిమంతుడవు, దేవుడవునైన ప్రభూ! నా మట్టుకు నాకు ధైర్యము ప్రసాదింపుము. సింహపు గుహలో అడుగిడనున్న నాకు సముచితముగా మాట్లాడు శక్తిని దయచేయుము. ఆ రాజు కోపమును మా శత్రువు మీదికే మరల్పుము. ఆ పగతుడును, అతని బలగమును, అణగారిపోవునట్లు చేయుము.
14. ప్రభూ! నీ హస్తబలముతో మా ప్రజను కాపాడుము. నీవు తప్ప ఇతర ఆశ్రయమెరుగని ఏకాకిని నన్ను కరుణింపుము.
15. నీవు అన్నీ ఎరుగుదువు. అన్యజాతి వైభవము నాకు నచ్చదు. సున్నతి సంస్కారములేని అన్యజాతివాని పొందు నాకసహ్యము కలిగించును.
16. పదవీ సూచకముగా రాజదర్బారున నేను ఫాలభాగమున దాల్చు పట్టిక నాకు ఏవగింపు పుట్టించును. మురికిబట్టతో సమానముగా నెంచి ఏకాంతముగా నున్నపుడు నేను దానిని అంటనొల్లను.
17. హామాను చేసిన విందులో నీ దాసురాలనైన నేను పాల్గొనలేదు. రాజు విందును నేనంగీకరింపలేదు. అతడు దేవతలకు అర్పించిన ద్రాక్ష సారాయమును నేను సేవింపలేదు.
18. ఇచటికి వచ్చినప్పటినుండి నేటివరకు అబ్రహాము దేవుడవైన నిన్ను ధ్యానించుటతప్ప నాకు మరియొక ఆనందమే లేదు.
19. ప్రభూ! నీవు అందరికంటె బలవంతుడవు. ఈ దీనుల మొరలు ఆలింపుము. దుష్టాత్ములనుండి మమ్ము కాపాడుము. ఈ భయమును బాపి నన్ను బ్రోవుము.”