ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అపోస్తలుల కార్యములు | Telugu Catholic Bible

 1. ఓ తెయోఫిలూ! నా మొదటి గ్రంథమున యేసు చేసిన పనులను, బోధించిన విషయములను అన్నిటిని గూర్చి వ్రాసితిని.

2. ఆయన పరలోకమునకు చేర్చుకొనబడిన దినమువరకు తాను ఎన్నుకొనిన అపోస్తలులకు, పవిత్రాత్మద్వారా కొన్ని ఆజ్ఞలను ఇచ్చెను.

3. యేసు మరణించినపిదప, నలువది దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు, తాను సజీవుడనని వారికి పలువిధముల ఋజువుపరచు కొనెను, దేవుని రాజ్యమును గూర్చి వారికి బోధించెను.

4. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: “మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరచినట్టి, నాతండ్రి చేసిన వాగ్దానము కొరకు వేచియుండుడు.

5. ఏలయన, యోహాను నీటితో బప్తిస్మమును ఇచ్చెను గాని కొన్ని దినములలో మీరు పవిత్రాత్మచేత జ్ఞానస్నానమును పొందుదురు.”

6. అపోస్తలులు యేసుతో ఉన్నప్పుడు, “ప్రభూ! ఇప్పుడు మీరు యిస్రాయేలునకు రాజ్యమును పునరుద్దరించెదరా?” అని అడుగగా,

7. యేసు వారితో, “కాలములును, సమయములును నా తండ్రి తన అధికారమున ఉంచుకొనియున్నాడు. వాటిని గూర్చి తెలిసికొనుట మీ పని కాదు.

8. అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చునప్పుడు, మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను, యూదయా, సమరియా సీమలయందు అంతటను, భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉండెదరు" అనెను.

9. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు ఎత్తబడెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండ, ఒక మేఘము ఆయనను కొనిపోయెను.

10. ఆయన వెళ్ళుచుండగా, వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని దుస్తులను ధరించిన ఇద్దరు మనుష్యులు వారియొద్ద నిలిచి,

11. “గలిలీయులారా! మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో, అట్లే ఆయన మరలవచ్చును” అని వారితో చెప్పిరి.

12. అప్పుడు అపోస్తలులు ఓలీవు వనము అనబడు కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు దాదాపు విశ్రాంతిదినమున నడువగలిగినంత దూరమున కలదు.

13. వారు యెరూషలేమున ప్రవేశించి, తాము నివసించుచుండిన మేడ గదిలోనికి వెళ్ళిరి. వారు ఎవరనగా- పేతురు, యోహాను, యాకోబు, అంద్రియ, ఫిలిప్పు, తోమా, బర్తలో మయి, మత్తయి, అల్పయి కుమారుడు యాకోబు, మతాభిమానియగు సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు.

14. వీరందరు, వీరితోపాటు కొందరు స్త్రీలు, యేసు తల్లియగు మరియమ్మయు, ఆయన సోదరులును ఒక చోటచేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి.

15. ఆ దినములలో పేతురు సహోదరులమధ్య లేచి నిలబడి ఇట్లనెను: (అచట రమారమి నూట ఇరువది మంది సహోదరులు సమావేశమైరి)

16. “సోదరులారా! యేసును పట్టుకొనినవారికి దారి చూపిన యూదాను గూర్చి, పవిత్రాత్మ పూర్వము దావీదు నోట పలికిన పరిశుద్ధ గ్రంథ ప్రవచనము నెరవేరవలసియుండెను.

17. అతడు మనలో ఒకడై యుండి ఈ పరిచర్యయందు పాలుపంచుకొనెను.”

18. యూదా ఇస్కారియోతు గురుద్రోహము వలన సంపాదించిన రూకలతో ఒక పొలమును కొనెను. అతడు తలక్రిందుగా పడగా, పొట్టపగిలి లోపల ఉన్న ప్రేవులన్నియు బయటపడెను.

19. ఈ విషయము యెరూషలేములో నివసించు వారందరకు తెలిసెను. కనుక, ఆ పొలము వారి మాతృభాషలో 'అకెల్దామ' అని పిలువబడెను. దానికి 'రక్తభూమి' అని అర్ధము.

20. పేతురు ఇంకను వారితో, “ఏలయన, 'అతని ఇల్లు నిర్జనమగునుగాక! దానిలో ఎవడును నివసింపకుండునుగాక! వేరొకడు అతని ఉద్యోగమును తీసికొనును గాక!' అని కీర్తనల గ్రంథములో వ్రాయబడియున్నది.

21. కాబట్టి మన ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్షిగా ఉండుటకు మనతో మరియొకడు చేరవలసి ఉన్నది. ఆ చేరవలసినవాడు,

22. యోహాను బప్తిస్మమును ఇచ్చినది మొదలుకొని యేసు ప్రభువు పరలోకమునకు కొనిపోబడిన దినమువరకును, ఆయన మనమధ్య సంచరించిన కాలమున మనతో ఉండినవాడై ఉండవలయును” అనెను.

23. కావున వారు, యూస్తు అను మారు పేరుగల బర్నబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇరువురిని ముందు నిలువబెట్టి ఇట్లు ప్రార్థించిరి:

24. “ఓ ప్రభువా! మీకు అందరి హృదయములు తెలియును. తన దారిన పోవుటకు యూదా విసర్జించిన ఈ పరిచర్యలోను, అపోస్తలత్వములోను,

25. పాలు పొందుటకు వీరిద్దరిలో ఎవరిని మీరు ఎన్నుకొంటిరో మాకు తెలియజేయుడు” అని ప్రార్థించిన పిమ్మట,

26. వారిద్దరిలో ఒకరిని ఎన్నుకొనుటకు చీట్లు వేసిరి. అప్పుడు మత్తీయ ఎన్నిక అయ్యెను. కనుక అతడు పదునొకొండుగురు అపోస్తలులతో లెక్కింపబడెను, 

 1. పెంతెకోస్తు పండుగదినము వచ్చినప్పుడు, వారందరు ఒకచోట కూడియుండిరి.

2. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి ఒక ధ్వని ఆకాశమునుండి. అకస్మాత్తుగా వారు కూర్చుండి యుండిన ఇల్లంతయు నిండెను.

3. అప్పుడు అగ్నిజ్వాలలు నాలుకలవలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరిమీద నిలుచుట వారికి కనబడెను.

4. వారందరు పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్చక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్యభాషలలో మాట్లాడసాగిరి.

5. ఆకాశము క్రిందనుండు ప్రతిదేశము నుండి వచ్చిన దైవభక్తులగు యూదులు, యెరూషలేములో నివసించుచుండిరి.

6. ఆ శబ్దము విని అక్కడకు వచ్చిన జనసమూహములోని ప్రతి వ్యక్తియు, తమతమ సొంతభాషలో వారు మాట్లాడుట విని, కలవరపడిరి.

7. వారు విస్మయ మొంది ఆశ్చర్యముతో, ఇట్లు మాట్లాడుచున్న వీరందరు గలిలీయులుకారా? ఇదేమి!

8. వీరు మాట్లాడునది మనమందరము, మన సొంతభాషలో వినుచున్నామే?

9. పార్తియ, మాదియా, ఏలాము, మెసపొటామియా, యూదయా, కపదోకియా, పొంతు, ఆసియా వాసులు,

10. ఫ్రిసియా, పంఫీలియ, ఐగుప్తు, సిరేనె దగ్గర లిబియా ప్రాంతములనుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన సందర్శకులు,

11. యూదులు, యూదమతమున ప్రవేశించినవారు, క్రేతీయులు, అరబ్బీయులు మున్నగు మనమందరము దేవుడు చేసిన మహత్తర కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా, మన సొంత భాషలలో వినుచున్నాము”

12. అని విభ్రాంతినొంది, తబ్బిబ్బుపడుచు, 'ఇదేమి చోద్యమో!' అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి.

13. కాని కొందరు, “వీరు క్రొత్త మద్యముతో నిండియున్నారు” అని అపహాస్యము చేసిరి.

14. అప్పుడు పేతురు, ఆ పదునొకొండుగురు అపోస్తలులతో లేచి నిలుచుండి, ఆ ప్రజాసమూహ మును ఉద్దేశించి, బిగ్గరగా ఇట్లు చెప్పనారంభించెను: “యూదయా జనులారా! యెరూషలేములో నివసించు చున్న సమస్తజనులారా! నేను చెప్పనున్న దానిని చెవియొగ్గి ఆలకింపుడు.

15. మీరు అనుకొనుచున్నట్లు వీరు మద్యపానము చేయలేదు. ఇప్పుడు ఉదయము తొమ్మిదిగంటల' సమయమేగదా!

16. యోవేలు ప్రవక్త చెప్పిన విషయమేమనగా:

17. 'అంత్యదినములయందు ఇట్లు జరుగునని దేవుడు చెప్పుచున్నాడు: మానవులందరిమీద, నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులును, కుమార్తెలును ప్రవచించెదరు. మీ యువకులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కనెదరు.

18. అవును, ఆ రోజులలో నా దాసుల మీదను, దాసురాండ్ర మీదను, నేను నా ఆత్మను కుమ్మరించెదను. కనుక వారు ప్రవచించెదరు.

19. పైన ఆకాశమందున అద్భుతములను, క్రింద భూమిపై ఆశ్చర్యకార్యములను, రక్తమును, అగ్నిని, దట్టమయిన పొగను చూపెదను.

20. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు, సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మారును.

21. అప్పుడు ప్రభువు నామమును బట్టి జపించెడివారు రక్షింపబడుదురు.”

22. “యిస్రాయేలు ప్రజలారా! ఈ మాటలను ఆలకింపుడు. నజరేయుడైన యేసును అద్భుతముల ద్వారా, మహత్కార్యములద్వారా, సూచకక్రియల ద్వారా దేవుడు మీకు రూఢి ఒనర్చెను. ఇది మీకై మీరు మీ గ్రహించునట్లుగా దేవుడు వానిని ఆయన ద్వారా మధ్యనే చేసెను.

23. దేవుని సంకల్పమును అనుస రించియు, ఆయన భవిష్యజ్ఞానమును అనుసరించియు, అప్పగింపబడిన ఈ యేసును మీరు న్యాయరహితుల చేతులగుండా సిలువవేయించి చంపించితిరి.

24. మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము కనుక, దేవుడు మరణవేదనలను తొలగించి, ఆయనను మృతులలోనుండి లేపెను.

25. ఏలయన, ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను: . 'నేను ఎల్లప్పుడు ప్రభువును నా ఎదుట చూచుచుంటిని. ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు. కనుక నేను చలనమొందను.

26. అందువలన నా హృదయము ఆనందించినది. నా నాలుక ఆనందముతో నిండియున్నది. నేను మర్త్యుడనైనను ఆశతో నిరీక్షింతును.

27. ఏలయనగా, నీవు నాఆత్మను పాతాళమున విడిచి పెట్టవు. పరిశుద్ధుడగు నీ సేవకుని క్రుళ్ళిపోనీయవు.

28. నీవు నాకు జీవమార్గములను తెలిపియున్నావు. నీవు నీ దర్శనమును అనుగ్రహించి, నన్ను ఆనందముతో నిం పెదవు.'

29. “సహోదరులారా! మన పితరుడగు దావీదును గూర్చి, నేను మీతో తేటతెల్లముగా మాట్లాడవలెను. అతడు చనిపోయి సమాధిచేయబడెను. నేటివరకును అతని సమాధి మనమధ్య ఉన్నది.

30. అతడు ఒక ప్రవక్తయైయుండి తమ వంశస్తులలో ఒకని రాజుగా చేయుదునని, దేవుడు చేసిన వాగ్దానమును ఎరిగి యుండెను కనుక,

31. 'క్రీస్తు పాతాళములో విడువబడలేదు. ఆయన శరీరము క్రుళ్ళిపోలేదు' అని దావీదు ముందుగా తెలిసికొని, ఆయన పునరు త్థానమును గూర్చి చెప్పెను.

32. ఈ యేసును దేవుడు సమాధినుండి లేపెను. జరిగిన ఈ విషయమునకు, మేము అందరము సాక్షులము,

33. ఆయన దేవుని కుడిప్రక్కకు చేర్చబడి, తన తండ్రి వాగ్దానము ప్రకారము పవిత్రాత్మను పొంది, మీరిపుడు చూచుచు, వినుచున్న ఆత్మను కుమ్మరించియున్నాడు.

34. ఏలయన, దావీదు తనంతట తాను పరలోకమునకు పోలేదుకాని అతడు ఇట్లనెను:

35. 'నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచువరకు, నీవు నా కుడి ప్రక్కన కూర్చుండుము అని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను.'

36. మీరు సిలువపై చంపిన ఈ యేసునే, దేవుడు ప్రభువుగాను, క్రీస్తుగాను నియమించెను. కనుక దీనిని యిస్రాయేలు జనులందరు తప్పనిసరిగా తెలిసికొనవలయును!” అని చెప్పెను.

37. అప్పుడు ఆ ప్రజలు దీనిని విని, హృదయ ములో నొచ్చుకొని, “సహోదరులారా! మేము ఏమి చేయవలెను?” అని పేతురును, అపోస్తలులను అడుగగా పేతురు,

38. “మీరు హృదయపరివర్తన చెంది మీ పాపపరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున, జ్ఞానస్నానము పొందవలయును. అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు.

39. ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, దూరస్థులందరకును, అనగా, ప్రభువైన దేవుడు తనయొద్దకు పిలుచు వారందరకును చెందును” అని వారితో చెప్పెను.

40. ఇంకను పలు విధములైన మాటల ప్రేరణతో, “దుర్మార్గులగు ఈ జనులనుండి వేరై రక్షణ పొందుడు” అని పేతురు వారిని హెచ్చరించెను.

41. అతని ప్రబోధము విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్నానము పొందిరి. ఆ దినమున రమారమి మూడువేలమంది చేర్చబడిరి.

42. వీరు అపోస్తలుల బోధయందును, వారి సహవాసమందును, రొట్టెను త్రుంచుటయందును, ప్రార్థించుటయందును ఎడతెగక ఉండిరి.

43. అప్పుడు ప్రతివ్యక్తిపై భయము ఆవహించెను. అపోస్తలుల ద్వారా, అనేక అద్భుతములు, ఆశ్చర్య కార్యములు జరుగుచుండెను.

44. విశ్వసించిన వారందరు కలిసి, సమష్టిగా జీవించుచు తమకు కలిగినదానిలో అందరు పాలుపంచుకొనుచుండిరి.

45. మరియు వారు తమ స్థిరచరాస్తులను అమ్మి, అందరకును వారివారి అవసరములను బట్టి పంచి పెట్టిరి.

46. వారు ప్రతి రోజు కూటముగా దేవాలయములో కలిసికొనుచు, తమ ఇండ్లలో అందరు కలిసి రొట్టెను త్రుంచుచు,

47. సంతోషము, వినయముగల హృదయములతో భుజించుచు, దేవుని స్తుతించుచు, ప్రజలకందరకును ప్రీతిపాత్రులైరి. రక్షణ పొందుచున్న వారిని, ప్రభువు ప్రతిరోజు వారితో చేర్చుచుండెను. 

 1. ఒకనాడు ప్రార్థనా సమయమగు మధ్యహ్నము మూడుగంటల వేళకు పేతురు, యోహాను దేవాలయమునకు వెళ్ళిరి.

2. ఆ దేవాలయమునకు “అందమయినది” అని పిలువబడెడు ఒక ద్వారము కలదు. ఆ ద్వారము వద్ద పుట్టుకుంటివాడు ఒకడు ఉండెను. దేవాలయము లోనికి పోవువారినుండి భిక్షము అడుగుకొనుటకై ఆ కుంటివానిని ప్రతిదినము జనులు ఆ అందమైన ద్వారమువద్దకు మోసికొని వచ్చుచుండెడివారు.

3. ఆనాడు పేతురు, యోహానులు దేవాలయములోనికి పోవుచున్నప్పుడు, ఆ కుంటివాడు వారిని భిక్షమడిగెను.

4. అప్పుడు పేతురు సూటిగా అతని వంక చూచి, పిమ్మట యోహానుతో పాటు “మా వైపు చూడుము” అని వానితో చెప్పగా,

5. వాడు వారేమైన ఇచ్చెదరేమో నని ఆశతో వారి వంక చూచెను.

6. అప్పుడు పేతురు “నా దగ్గర వెండి, బంగారమేమియు లేదు. నాకు ఉన్నదానిని నీకు ఇచ్చెదను. నజరేయుడగు యేసుక్రీస్తు పేరిట నీవు నడువుము” అని పలికి

7. వాని కుడిచేతిని పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు, మడమలు బలపడగా,

8. వాడు ఎగిరిగంతువేసి, నిలువబడి, అటునిటు నడువసాగెను. అంతట వాడు నడుచుచు, గంతులు వేయుచు, దేవుని స్తుతించుచు వారితో కలసి దేవాలయములోనికి పోయెను.

9. అప్పుడు అచటనున్న జనసమూహమంతయు ఆ కుంటివాడు నడచుటను, దేవుని స్తుతించుటను చూచిరి.

10. ఈ దేవాలయపు అందమయిన ద్వారమువద్ద కూర్చుండిన బిచ్చగాడు వీడే అని వారు గుర్తుపట్టి, జరిగినదానిని గూర్చి విస్మయము చెంది పరవశులైరి.

11. పేతురు, యోహానులను అతడు అంటిపెట్టుకొనియుండగా, ప్రజలందరు ఆశ్చర్యపడి సొలోమోను మంటపమువద్దకు పరుగెత్తివచ్చిరి.

12. పేతురు వారిని చూచి, “యిస్రాయేలు ప్రజలారా! మీరేల దీనికి ఇంత ఆశ్చర్యపడుచున్నారు? మీరేల ఇట్లు రెప్పవేయక మావైపు చూచుచున్నారు? మేము మా స్వశక్తిచేతగాని, భక్తిచేతగాని ఈ మనుష్యుని నడిపించితిమని అనుకొనుచున్నారా?

13. అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవుడు అనగా మన పూర్వుల దేవుడు, తన సేవకుడైన యేసును మహిమపరచి యున్నాడు. ఆ యేసునే మీరు అధికారుల చేతికి అప్పగించితిరి. పిలాతు ఆయనను వదలి పెట్ట నిశ్చయించినప్పటికిని, మీరు అతనియెదుట ఆయనను నిరాకరించితిరి.

14. ఆయన పవిత్రుడు, నీతిమంతుడు అయిన యేసును విడుదల చేయుమనుటకు బదులు మీరు నరహంతకుని విడుదల చేయుమని అడిగితిరి.

15. కనుక, మీరు జీవనకర్తను చంపి యున్నారు. అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. మేము దీనికి సాక్షులము.

16. ఆయన నామమునందలి విశ్వాసము మూలమున, ఆయన నామమే, మీరు చూచి ఎరిగియున్న వీనిని బలపరచినది. ఆయనవలన కలిగిన విశ్వాసమే మీ అందరియెదుట వీనికి ఈ పూర్ణస్వస్థత కలుగచేసెను.

17. సోదరులారా! మీరు, మీ నాయకులు యేసుకు చేసిన ద్రోహము మీ అజ్ఞానము వలననే జరిగినదని నాకు ఇప్పుడు తెలియును.

18. కాని తన మెస్సయా బాధలు పడవలెనని ప్రవక్తలందరి ద్వారా దేవుడు పూర్వమే ఎరిగించిన దానిని ఈ విధముగా నెరవేర్చెను.

19. మీరు హృదయపరివర్తన చెంది, దేవునివైపు మరలిన యెడల, ఆయన మీ పాపములను తుడిచివేయును. అప్పుడు ప్రభువు సమక్షమునుండి ఆధ్యాత్మికమగు విశ్రాంతికాలములు వచ్చునట్లు,

20. మీ కొరకు నియమింపబడిన క్రీస్తు అనబడు. యేసును ఆయన మీకు పంపును.

21. పూర్వము దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తలద్వారా పలికినది అంతయు నెరవేర్చుకాలము వచ్చువరకు యేసు పరలోకమందు ఉండవలెను.

22. ఏలయన. 'ప్రభువైన మీ దేవుడు నన్ను పంపినట్లుగా మీ సొంత ప్రజలనుండి ఒక ప్రవక్తను పంపును. అతడు చెప్పునదంతయు మీరు వినవలెను.

23. ఆ ప్రవక్త చెప్పెడు దానిని విననివాడు ఎవడైనను, దైవప్రజల నుండి వెలివేయబడి నాశనము చేయబడును' అని మోషే చెప్పెను.

24. సమూవేలు, అతని తరువాత వచ్చిన ప్రవక్తలందరును, ఈ దినములను గురించి ముందే ఎరిగించి ఉండిరి.

25. దేవుడు మీ కొరకే తన ప్రవక్తలద్వారా వాగ్దానములు చేసెను. దేవుడు మీ పూర్వులతో గావించిన నిబంధనయందు మీరు వారసులు. 'నీ సంతానము ద్వారా, నేను లోకములో ఉన్న ప్రజలందరిని ఆశీర్వదింతును', . అని దేవుడు అబ్రహాముతో ఒప్పందము చేసికొనెను.

26. కనుక, మీలో ప్రతివాడు తన దుష్టత్వము నుండి మరలునట్లు మిమ్ములను దీవించుటకు దేవుడు ఎన్నుకొన్న తన సేవకుని మొదట మీ యొద్దకు పంపియున్నాడు” అని వారితో చెప్పెను.

 1. పేతురు, యోహాను జనులతో ఇంకను మాట్లాడుచుండగా అర్చకులును, దేవాలయపు అది . పతియు, సద్దూకయ్యులును వారిపైకి వచ్చిరి.

2. చనిపోయినవారు మరల జీవముతో లేతురను సత్యమునకు నిదర్శనముగా, యేసు మృతులలోనుండి లేచెనని ఆ ఇద్దరు అపోస్తలులు ప్రజలకు బోధించుట చూచి, ఆ అధికారులు మండిపడిరి.

3. వారిని పట్టి బంధించి, అప్పటికే సాయంకాలమైనందున మరునాటి వరకు, ఆ అధికారులు వారిని చెరసాలయందు ఉంచిరి.

4. అయినను వాక్కును విన్న పలువురు విశ్వసించిరి. అప్పుడు వారిలో పురుషుల సంఖ్య రమారమి ఐదువేలయ్యెను.

5. మరునాడు యూదుల నాయకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు యెరూషలేములో సమావేశమైరి.

6. ప్రధానయాజకుడైన అన్నా, కైఫా, యోహాను, అలెగ్జాండరు ప్రధానయాజకుని కుటుంబమునకు చెందినవారందరు వారితో ఉండిరి.

7. వారు ఈ ఇద్దరు అపోస్తలులను వారి ఎదుట నిలువబెట్టి, “మీరు ఏ శక్తితో, ఎవరి నామమున దీనిని చేసితిరి?” అని వారిని ప్రశ్నింపగ,

8. పేతురు పవిత్రాత్మతో పూరితుడై “ప్రజానాయకులారా! పెద్దలారా!

9. ఈ కుంటివానికి జరిగిన మేలునుగూర్చి అతడు ఎట్లు బాగుచేయబడెనని మీరు ఈనాడు మమ్మును ప్రశ్నించుచున్నారు.

10. మీరును, యిస్రాయేలు ప్రజలందరును తెలుసుకొనవలసినది ఇదియే: మీచేత నిలువ వేయబడినవాడును, మృతులలోనుండి దేవునిచేత లేపబడినవాడునైన నజరేయుడగు యేసుక్రీస్తు నామముననే ఈ మనుష్యుడు పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిలిచియున్నాడు.

11. ఇల్లు కట్టు వారైన మీరు పనికిరాదని త్రోసివేసిన రాయి ఈయనయే. అదియే ఇంటికి మూలరాయి అయినది.

12. ఆయన యందు తప్ప వేరొకనియందు రక్షణము లేదు. ఏలయన, ఆకాశముక్రింద రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు” అని వారికి సమాధాన మిచ్చెను.

13. చదువురాని ఈ సాధారణ మనుష్యులగు పేతురు, యోహానులు అంత ధైర్యముగా సమాధాన మిచ్చుటచే ఆ సభాసభ్యులు ఆశ్చర్యపడిరి. వారిద్దరు నిజముగా యేసు యొక్క సహచరులై ఉండిరని అప్పుడు వారు గ్రహించిరి.

14. ఆ స్వస్థపరుపబడిన వాడు పేతురు, యోహానులతో అక్కడే నిలువబడి ఉండుట చూచి, ఆ అధికారులు ఏమియు ఎదురు చెప్పలేక పోయిరి.

15. కనుక ఆ అధికారులు వారిని బయటకు పొమ్మని చెప్పి, వారిలో వారు చర్చించుకొనసాగిరి.

16. “మనము వీరిని ఏమి చేయుదము? వీరు చేసిన ఈ అసాధారణమైన అద్భుతము యెరూషలేములో నివసించు ప్రతివానికి తెలియును. మనము దీనిని కాదనలేము.

17. అయినను ఈ విషయము ఇకపై ప్రజలలోనికి ప్రాకిపోకుండ వారు ఇంకెన్నడును యేసు పేరిట ఎవరితోను మాట్లాడరాదని హెచ్చరింతము” అని నిశ్చయించిరి.

18. కనుక వారు వారిని లోనికి పిలిపించి, యేసు పేరిట వారు ఎంత మాత్రము మాట్లాడరాదనియు, బోధింపరాదనియు ఆజ్ఞాపించిరి.

19. “మేము మీ మాటను పాటింపవలయునా? లేక దేవుని మాట పాటింపవలయునా? దేవుని దృష్టిలో ఏది సమంజసమో మీరే నిర్ణయింపుడు.

20. ఏలయన, మేము మా కన్నులార చూచినదానిని గూర్చి, చెవులార విన్నదానిని గూర్చి మాట్లాడకుండ ఉండలేము” అని పేతురు, యోహానులు వారికి బదులు పలికిరి.

21. ఆ కుంటివానికి జరిగిన అద్భుతమునకై ప్రజలందరు దేవుని స్తుతించుచుండుటచే సభవారు ప్రజలకు భయపడి వారిని శిక్షించు విధమేమియు కనుగొనలేక వారిని మరింత గట్టిగా బెదరించి వదలిపెట్టిరి.

22. అద్భుతమువలన స్వస్తుడైన ఆ కుంటివాని  ప్రాయము నలువది సంవత్సరములకు పైబడియుండెను.

23. విడుదల చేయబడిన వెంటనే పేతురు, యోహానులు తమ మిత్రుల వద్దకు వెళ్ళి ప్రధానార్చకులు, పెద్దలు తమతో చెప్పిన మాటలను వారికి తెలిపిరి.

24. అది విని వారందరుకలని దేవుని ఇట్లు ప్రార్థించిరి: “పరలోకమును, భూలోకమును, సముద్రమును వానిలోనుండు సమస్తమును సృష్టించిన ఓ ప్రభూ!

25. పవిత్రాత్మ మూలమున నీ సేవకుడును, మా తండ్రియునైన దావీదు ద్వారా నీవు ఇట్లు చెప్పియుంటివి: 'అన్య జనులు ఏల కోపమున చెలరేగుచుండిరి? వ్యర్ధమైన విషయములను గూర్చి జనులు ఏల యోచించుచుంటిరి?

26. ప్రభువునకు, ఆయన అభిషిక్తునకు విరుద్ధముగా భూలోకములోని రాజులు లేచిరి. అధికారులు ఒక్కుమ్మడిగా కూడిరి'.

27. నీవు అభిషేకించిన నీ పావన సేవకుడైన యేసుకు విరోధముగా అన్యజనులతోను, యిస్రా యేలు ప్రజలతోను హేరోదును, పొంతిపిలాతులు నిజముగా ఈ నగరమందు ఏకమైరి.

28. నీవు నీ హస్తముతోను, సంకల్పముతోను ఇదివరకే నిర్ణయించినది చేయుటకై వారు ఇట్లు ఏకమైరి.

29. ఓ ప్రభూ! వారు చేసిన ఈ బెదిరింపులను గమనింపుము. నిండు ధైర్యముతో నీ సందేశమును గూర్చి మాట్లాడుటకు నీ సేవకులమైన మమ్ము అనుమతింపుము.

30. స్వస్థపరచుటకై నీ హస్తమును చాపుము. మీ పావన సేవకుడైన యేసు పేరిట అద్భుతములను ఆశ్చర్య కార్యములను చేయుటకు అనుగ్రహింపుము.”

31. వారు ఇలా ప్రార్థింపగా, వారు ఉన్న ఆ స్థలము కంపించెను. అప్పుడు వారందరు, పవిత్రాత్మతో నింవబడి ధైర్యముతో దేవునివాక్కును గూర్చి మాట్లాడసాగిరి.

32. విశ్వసించిన వారందరు ఒకే మనస్సుతోను, ఒకే హృదయముతోను జీవించుచుండెను. వారికి చెందిన ఆస్తిపాస్తులను 'ఇది నా సొంతము' అని ఎవడును చెప్పుకొనుటలేదు. వారికి ఉన్నదానిని అందరు పంచుకొనుచుండిరి.

33. ప్రభువైన యేసు పునరుత్థానమునుగూర్చి అపోస్తలులు మహాశక్తితో సాక్ష్యములిచ్చిరి. సర్వేశ్వరుడు తన దైవకృపను సమృద్ధిగా వారిపై కుమ్మరించెను.

34. వారిలో ఏ ఒక్కనికిని కొరతలేదు. ఏలయన, పొలముగలవారు, ఇండ్లుగలవారు వానిని అమ్మి, వచ్చిన పైకమును,

35. అపోస్తలుల పాదములయొద్ద వుంచుచుండిరి. ఆ పైకము వారివారి అవసరములకు తగినట్లు పంచి పెట్టుచుండిరి.

36. సైప్రసు దేశమున జన్మించిన లేవీయుడగు యోసేపు అనువాడు ఒకడు ఉండెను. వానిని అపోస్తలులు 'బర్నబా' అని పిలుచుచుండిరి. (బర్నబా అనగా, 'ఉత్సాహపరచువాడు' అని అర్థము)

37. అతడు తన సొంతభూమిని అమ్మి, వచ్చిన పైకమును తెచ్చి అపోస్తలుల పాదములచెంత పెట్టెను. 

 1. అక్కడ అననియా అను పేరుగలవాడు ఒకడు గలడు. అతని భార్య పేరు సఫీర. అతడు తమకు చెందిన ఆస్తిని అమ్మెను.

2. తరువాత అతడు తన భార్యతో కూడబలుకుకొని ఆస్తిని అమ్మగా వచ్చిన పైకములో కొంతభాగమును దాచుకొని మిగిలిన పైకమును మాత్రమే అపోస్తలుల పాదములచెంత అర్పించెను.

3. అప్పుడు పేతురు వానితో, “అననియా! నీవు ఆస్తిని అమ్మగా వచ్చిన పైకములో కొంత భాగమును దాచుకొని పవిత్రాత్మను మోసపుచ్చుటకు నీ హృదయమును ఏల సైతానుకు స్వాధీనపరచితివి?

4. నీవు ఆస్తిని అమ్మక పూర్వము అది నీ సొంతమే గదా! అమ్మిన పిమ్మట వచ్చిన పైకమును నీ అధీనమే గదా! మరి నీవు నీ హృదయమున ఇట్లు చేయ నిర్ల యించితివేల? నీవు మనుష్యులతో కాదు, దేవునితో అబద్దమాడియున్నావు” అని పలుకగా,

5. ఇది విన్న అననియా నేలకూలి ప్రాణములు విడిచెను. దీనిని గూర్చి విన్నవారందరు భయముతో నిండిపోయిరి.

6. అంతట యువకులు లోనికి వచ్చి, వాని శరీరమును వస్త్రముతో చుట్టివేసి, బయటకు తీసికొనిపోయి సమాధి చేసిరి.

7. రమారమి మూడుగంటల సమయము గడిచిన పిదప అతని భార్యలోనికి వచ్చెను. జరిగిన సంగతి ఆమెకు తెలియదు.

8. అప్పుడు పేతురు “మీరు ఆ భూమిని ఇంత వెలకే అమ్మితిరా? చెప్పుము”  అని ఆమెను ప్రశ్నింపగా ఆమె “అవును, ఇంత వెలకే అని ప్రత్యుత్తరమిచ్చెను. పిమ్మట పేతురు,

9. “నీవును. నీ భర్తయు ప్రభువు ఆత్మను పరీక్షింప పూనుకొంటిరా? నీ భర్తను సమాధిచేసి వచ్చిన మనుష్యులు గుమ్మము వద్దనే ఉన్నారు. నిన్నుకూడ వారు బయటకు మోసికొనిపోవుదురు” అని ఆమెతో పలికిన వెంటనే.

10. ఆమె అతని పాదములముందు పడి మరణించెను. కనుక యువకులు లోనికి వచ్చి ఆమె చనిపోయి ఉండుట చూచి ఆమెను మోసికొనిపోయి ఆమె భర్త ప్రక్కనే సమాధిచేసిరి.

11. సంఘమంతయు, దీనిని గూర్చి విన్నవారందరును మహాభయముతో నిండి పోయిరి.

12. ప్రజలమధ్య అపోస్తలులు అనేకమైన అద్భుతములు, , సూచకక్రియలు చేయుచుండిరి. వారందరు ఏకమనస్కులై సొలోమోను మంటపములో చేరిరి.

13. వారితో చేరుటకు మరెవ్వరును సాహసించ లేదు. అయితే ప్రజలు వారిని గూర్చి గొప్పగా చెప్పు కొనిరి.

14. పురుషులును, స్త్రీలును అనేకులు మరి ఎక్కువగ విశ్వాసులై ప్రభువు పక్షమున చేరిరి.

15. పేతురు నడచిపోవునపుడు కనీసము అతని నీడ అయినను కొందరిపై పడగలదను ఆశచేత వారు జబ్బుగా ఉన్నవారిని చాపల మీదను, పరుపుల మీదను పెట్టుకొని, మోసికొనివచ్చి వీధులలో ఉంచిరి.

16. మరియు యెరూషలేము చుట్టుపట్టులనున్న పట్టణ ములనుండి జనులు వ్యాధిగ్రస్తులను దయ్యము పట్టిన వారిని తీసికొని వచ్చుచుండిరి. అటుల తీసికొని రాబడిన వారందరును స్వస్థతపొందిరి.

17. అప్పుడు ప్రధానార్చకుడు అతనితో ఉన్న వారందరును అనగా సద్దూకయ్యులవర్గము వారును లేచి అపోస్తలులపై అసూయపడి వారిపై చర్య తీసికొన వలెనని నిశ్చయించిరి.

18. అందుచేత వారు అపోస్తలు లను బంధించి పట్టణపు చెరసాలలో వేయించిరి.

19. కాగా ఆ రాత్రియందే ప్రభువుదూత ఆ చెరసాల తలుపులను తెరచి అపోస్తలులను బయటకు నడిపించు కొనిపోయి వారితో,

20. “మీరు దేవాలయములో నిలువబడి ఈ నూతనజీవమును గూర్చినదంతయు ప్రజలకు తెలియచెప్పుడు”అనెను.

21. అది విన్న అపోస్తలులు పోయి తెల్లవారునప్పటికి దేవాలయమున ప్రవేశించి బోధింప మొదలుపెట్టిరి. అంతట ప్రధానార్చ కుడును ఆయనతో ఉన్నవారును వచ్చి మహాసభ వారిని, యూదుల పెద్దలనందరిని సమావేశపరచిరి. పిమ్మట అపోస్తలులను వారియెదుటకు తీసికొని రావలెనని వారు చెరసాల అధికారులకు ఆజ్ఞాపించిరి.

22. కాని అధికారులు వెళ్ళి చూచినప్పుడు చెరసాలలో అపోస్తలులు కనబడకుండుటచే వారు తిరిగి విచారణ సభలోనికి పోయి,

23. “మేము చెరసాల వద్దకుపోయి చూడగా దానికి తాళము బిగింపబడియుండెను. ద్వారములవద్ద కావలివారు కాపలా కాయుచుండిరి. మేము చెరసాల తలుపులు తెరచి లోనికి పోయి చూచితిమికాని, లోపల మాకు ఎవరును కనిపింప లేదు” అని తెలియజేసిరి.

24. దేవాలయపు అధిపతి, ప్రధానార్చకులు దీనిని విని విస్మయముచెంది అది ఏమై ఉండునో అని ఆశ్చర్యపడిరి.

25. అప్పుడు ఒకడు సభలోనికి వచ్చి, “మీరు చెరసాలలో వేసినవారు దేవాలయ ములో నిలుచుండి ప్రజలకు బోధించుచున్నారు” అని వారితో చెప్పెను.

26. అది విని, అధికారి తన పరివారముతో అక్కడకు వెళ్ళి అపోస్తలులను మరల తీసికొనివచ్చెను. ప్రజలు రాళ్ళతో కొట్టుదురేమో అని భయపడి వారు అపోస్తలులకు ఏమాత్రము హింస తలపెట్టలేదు.

27. వారు అపోస్తలులను లోనికి తీసికొనివచ్చి విచారణసభ ఎదుట నిలువబెట్టిరి. తరువాత ప్రధాన యాజకుడు.

28. “మీరు యేసు పేరిట బోధింపరాదని మేము ఖండితముగా ఆజ్ఞాపించితిమి. అయినను మీరు యెరూషలేమునందంతటను మీ బోధనలను వ్యాపింపజేసితిరి. యేసు రక్తపాతమునకు మమ్ములను బాధ్యులను చేయుటకు మీరు ఉద్దేశించుచున్నారు” అని వారితో పలికెను.

29. అందుకు పేతురు, తదితర అపోస్తలులు వారితో, “మేము మనుష్యులకు కాక దేవునికి విధేయులము కావలెను.

30. మీరు యేసును మ్రానుపై వ్రేలాడదీసి చంపితిరి. అయినను మన పితరుల దేవుడు ఆయనను మృతులనుండి లేపెను.

31. యిస్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపపడు అవకాశమును కల్పించుట కును, వారి పాపములు క్షమింపబడుటకును దేవుడు ఆయనను వారికి నాయకునిగ, రక్షకునిగ చేసి తన కుడి ప్రక్కన కూర్చుండ బెట్టుకొనెను.

32. దేవుడు తనపట్ల విధేయత చూపువారికి అనుగ్రహించిన పవిత్రాత్మయును, మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము" అని బదులు పలికిరి.

33. విచారణ సభలోని సభ్యులు ఇది విని, మండిపడి, అపోస్తలులను చంపదలచిరి.

34. అప్పుడు వారిలో ఒకడు, ధర్మశాస్త్ర బోధకుడును, ప్రజలందరిచే మిక్కిలి గౌరవింపబడువాడును, గమాలియేలు అను పేరుగల ఒక పరిసయ్యుడు, ఆ సభలో నిలువబడి అపోస్తలులను కొంత సేపు బయటకు తీసికొని పొమ్మని ఆజ్ఞాపించి ఆ విచారణసభను ఉద్దేశించి,

35. “యిస్రాయేలు ప్రజలారా! మీరు వీరికి చేయబోవు దానినిగురించి జాగ్రత్తగా మెలగుడు.

36. కొంతకాలము క్రిందట 'తెయోదాస్' అనువాడు కనబడి తాను ఒక గొప్పవాడనని చెప్పుకొనియుండెను. అది విని రమారమి నాలుగు వందలమంది అతని పక్షమున చేరిరి. తరువాత అతడు చంపబడగా, వాని శిష్యులు చెల్లాచెదరైపోయిరి. అంతటితో అతని ప్రయత్నము నశించెను.

37. ఇది జరిగిన తరువాత జనాభా లెక్కల కాలములో 'యూదా' అను పేరుగల గలిలీయుడు కనబడెను. అతడును ఒక గుంపును తన వైపునకు ఆకర్షించెను. పిమ్మట వాడునూ చంపబడగా, వాని శిష్యులు చెల్లాచెదరై పోయిరి.

38. కాబట్టి ఇప్పుడు ఈ విషయములో ఈ మనుష్యులను గురించి వ్యతిరేకముగా ఏ చర్యయు తీసికోరాదని చెప్పుచున్నాను. వారిని వారి ఇష్టమునకు వదలివేయుడు. ఏలయన, వీరు చేయునది మానవ ప్రయత్నమైనచో, అది అంతరించి పోవును.

39. అది దైవప్రయత్నమైనచో, వారిని ఎదిరింప మీకు సాధ్యము కాదు. అంతియేకాక, అది దేవునికి వ్యతిరేకమైన పోరాటము కాగలదు” అని చెప్పగా, ఆ న్యాయసభ గమాలియేలు సలహాను పాటించెను.

40. పిమ్మట వారు అపోస్తలులను లోనికి పిలిపించి కొరడాతో కొట్టించి, మరల యేసు పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదలివేసిరి.

41. యేసు నామము కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమి అనివారు సంతోషముతో ఆ విచారణసభ నుండి వెడలిపోయిరి.

42. ప్రతిరోజు వారు దేవాలయములోను, ప్రజల ఇండ్లలోను ప్రబోధించుచు మెస్సయాయైన యేసును ప్రకటించుట మానలేదు. 

 1. కొంతకాలము గడచిన పిదప, శిష్యుల సంఖ్య పెరిగెను. అనుదిన పరిచర్యలో తమలోని వితంతువులు నిర్లక్ష్యము చేయబడుచున్నారని గ్రీకు మాట్లాడేడి యూదులు, హెబ్రీయుల మీద సణుగసాగిరి

2. అందుచే పన్నిద్దరు అపోస్తలులు శిష్యుల సంఘమంతటిని కూడ పిలిచి, “దేవుని వాక్కును నిర్లక్ష్యము చేయుచు, ఈ ఆహార పరిచర్యల యందు నిమగ్నులమై ఉండుట మాకు యుక్తము కాదు.

3. కావున సోదరులారా! మీలో పవిత్రాత్మతో నిండినవారిని, జ్ఞానము గలవారిని, మంచిపేరు గలవారిని ఏడుగురిని ఎన్నుకొనుడు. మేము వారికి ఈ పరిచర్యను అప్పజెప్పెదము.

4. అపుడు మేము మా సమయమును అంతయు, ప్రార్థించుటకును, వాక్యపరిచర్యకు నిరంతరముగ ఉపయోగించేదము" అని చెప్పిరి.

5. ఆ ప్రతిపాదనకు ఆ సంఘమంతయు సమ్మతించెను. అటు తరువాత విశ్వాసముతోను, పవిత్రాత్మతోను నిండిన స్తెఫాను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తిమోను, పర్మెనాసు, యూదుల మతావలంబకుడును, అంతియోకియాకు చెందిన వాడైన నికోలా అనువారిని ఎన్నుకొనిరి.

6. సంఘస్థులు వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టగా, అపోస్తలులు ప్రార్థనచేసి వారిపై చేతులుంచిరి.

7. దేవుని వాక్కు వ్యాపించెను. యెరూషలేములో శిష్యుల సంఖ్య అమితముగా పెరిగెను. యాజకులు కూడ పెద్దసంఖ్యలో విశ్వసించిరి.

8. సైఫాను దైవానుగ్రహముతోను, శక్తితోను నిండినవాడై ప్రజలమధ్య గొప్ప అద్భుతములను, సూచకక్రియలను చేయుచుండెను.

9. అప్పుడు ప్రార్ధనా మందిరానికి చెందిన “స్వతంత్రులు” అనబడువారి సమాజములో కొందరు, కురేనీయుల సమాజములో కొందరు, అలెగ్జాండ్రియుల సమాజములో కొందరు, సిలీషియా ఆసియాలనుండి వచ్చిన మరికొందరు సైఫానుతో వాదింప మొదలు పెట్టిరి.

10. మాటలా డుటయందు అతడు కనపరచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి.

11. పిమ్మట “ఇతడు మోషే మీదను, దేవుని మీదను దూషణ వాక్యములు పలుకుచుండుట మేము వింటిమి” అని చెప్పుటకై వారు కొందరిని కుదుర్చుకొనిరి.

12. ఈ రీతిగా వారు ప్రజలను, పెద్దలను, ధర్మశాస్త్ర బోధకులను అతనికి వ్యతిరేకముగా పురికొల్పిరి. అప్పుడు వారు స్తెఫానువద్దకు వచ్చి బంధించి అతనిని న్యాయసభ ఎదుటకు తీసికొనివచ్చిరి.

13. అతనిని గురించి అబద్ధపు సాక్ష్యములు చెప్పించుటకు వారు కొందరిని తెచ్చిరి. అప్పుడు వారు “ఇతడు ఎల్లప్పుడు మన పవిత్ర దేవాలయమునకు, మోషే చట్టమునకు వ్యతిరేకముగా మాటలాడుచున్నాడు.

14. ఎట్లన, నజరేతుకు చెందిన యేసు దేవాలయమును కూలగొట్టుననియు, మోషే వద్దనుండి మనకు పారంపర్యముగా వచ్చిన ఆచారములను మార్పుచేయు ననియు చెప్పుచుండ మేము వింటిమి” అని వారితో చెప్పించిరి.

15. అక్కడ ఆ న్యాయసభలో కూర్చున్న వారందరు స్తెఫానువైపు తేరిచూడగా అతని ముఖము దేవదూత ముఖమువలె వారికి కనిపించెను. 

 1. పిమ్మట ప్రధానార్చకుడు “ఇది నిజమేనా?” అని ప్రశ్నింపగా

2. సైఫాను ఇట్లు పలికెను: “సోదరులారా! తండ్రులారా! నేను చెప్పుదానిని ఆలకింపుడు. మహిమగల దేవుడు మన పూర్వీకుడగు అబ్రహాము హారానుకు వెళ్ళక పూర్వము మెసపొటామియాలో నివసించుచున్నప్పుడు, అతడికి అగుపడి

3. 'నీవు నీ దేశమును నీ బంధువులను వీడి నేను చూపింపబోవు దేశమునకు వెళ్ళుము' అని తెలిపెను.

4. కనుక అతడు కల్దీయుల దేశమును వదలి హారానులో నివసించుటకు పోయెను. అబ్రహాము తండ్రి మరణించిన తరువాత దేవుడు అతనిని ఇప్పుడు మీరు నివసించుచున్న భూమికి తరలివచ్చునట్లు చేసెను.

5. దేవుడు అబ్రహామునకు తన సొంతభూమిగా ఒక అడుగైనను ఇవ్వలేదు. కాని అతనికిని, అతని తరువాత అతని సంతానమునకును దానిని ఇచ్చెదనని వాగ్దానము చేసెను. అయితే దేవుడు ఈ వాగ్దానమును చేయు నప్పటికి అబ్రహామునకు సంతానము లేదు.

6. దేవుడు అబ్రహాముతో 'నీ సంతతివారు విదేశములో నివసించుచు అక్కడవారు నాలుగువందల సంవత్సరములపాటు బానిసలై బాధలకు గురియగుదురు.

7. అయినను వారిని బానిసలుగా చేసిన జనులకు నేను తీర్పు తీర్చెదను. తరువాత వారు ఆ దేశము వీడి ఇక్కడ నన్ను ఆరాధించెదరు' అని పలికెను.

8. దేవుడు తాను చేసిన నిబంధనకు గురుతుగా అబ్రహామునకు సున్నతి ఆచారమును ఒసగెను. అంతట : అబ్రహామునకు ఈసాకు జన్మించెను. జన్మించిన ఎనిమిదవ దినమున ఈసాకునకు అబ్రహాము సున్నతి చేసెను. అట్లే ఈసాకునకు యాకోబును, యాకోబునకు పండ్రెండు గోత్ర కర్తలునుజన్మించిరి.

9. గోత్రకర్తలు యోసేపుపై అసూయ పడి ఐగుప్తునకు అతనిని బానిసగా అమ్మివేసిరి. కాని దేవుడు అతనికి తోడైయుండి

10. కష్టములన్నిటి నుండి అతనిని కంటికి రెప్పవలె కాపాడెను. దేవుడు యోసేపును ఐగుప్తురాజైన ఫరోకు ప్రీతిపాత్రునిగా చేసి, అతనికి తగిన జ్ఞానమును ఒసగెను. అందుచే ఫరో అతనికి తన దేశము పైనను, తన ఇంటి పైనను పెత్తనమును ఇచ్చెను.

11. అటుపిమ్మట ఐగుప్తు దేశమంతటను, కనాను దేశమంతటను, పెను బాధలకు కారణమైన కరువు వచ్చెను. అప్పుడు మన పితరులకు తినుటకు ఏమియు దొరకలేదు.

12. కావున ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని, అతడు మన పితరులను మొదటిసారిగా అక్కడకు పంపెను.

13. వారు రెండవసారి వచ్చినపుడు యోసేపు తన సోదరులకు తనను తెలియజేసుకొనెను. అపుడు ఫరో యోసేపు కుటుంబమునుగూర్చి తెలిసి కొనెను.

14. అంతట కుటుంబ సమేతముగా ఐగుప్తునకు తరలిరావలసినదిగా యోసేపు తనతండ్రి యాకోబునకు వర్తమానము పంపెను. వారు మొత్తము డెబ్బదియైదుగురు.

15. యాకోబు ఐగుప్తునకు తరలి వచ్చెను. అతడును తదితరులగు మన పితరులును అచటనే మరణించిరి.

16. అచట నుండి వారి శరీరములు షెకెమునకు తీసికొని రాబడెను. అచట హమోరు కుమారులనుండి అబ్రహాము కొనిన సమాధిలో వారు భూస్థాపితము చేయబడిరి.

17. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసిన కాలము సమీపింపగా ఐగుప్తులో జనులసంఖ్య మిక్కిలి వృద్ధియయ్యెను.

18. చిట్టచివరకు యోసేపును ఎరుగని రాజు ఒకడు ఐగుప్తును పాలింపసాగెను.

19. వాడు మన పూర్వుల యెడల కపటముగా ప్రవర్తించి, తమ శిశువులు బ్రతుకకుండునట్లు వారిని బయట పార వేయవలయునని మన పితరులను బలవంతపరచెను.

20. ఆ సమయములోనే మోషే జన్మించెను. అతడు చక్కనివాడు. దేవునికి ప్రియమైనవాడు. మూడు మాసముల వరకును అతడు తనతండ్రి ఇంటనే పెంచబడెను.

21. పిమ్మట అతడుకూడ బయట వదలివేయబడగా, ఫరో కుమార్తె వానిని తీసికొని, సొంత కొడుకువలె పెంచుకొనెను.

22. అతడు ఐగుప్తుదేశపు శాస్త్రములన్నియు నేర్చుకొని మాటల లోను చేతలలోను ఆరితేరి ఘటికుడాయెను. -

23."మోషేకు నలువదియేండ్ల ప్రాయము వచ్చినప్పుడు తన ప్రజలైన యిస్రాయేలీయులను అతడు చూడ నిశ్చయించుకొనెను. అక్కడ వారిలో ఒకనికి

24. ఐగుప్తు దేశీయునిచే అన్యాయము జరుగుచుండుటను చూచి, మోషే వానికి సహాయపడుటకై వెళ్ళి, ఆ ఐగుప్తుదేశీయుడిని చంపి ప్రతీకారమొనర్చెను.

25. దేవుడు తనద్వారా వారికి స్వాతంత్య్రమును ఈయ నున్నాడని తన ప్రజలు గ్రహింతురని మోషే తలంచెను. కాని వారు ఆ విషయమును అర్థము చేసికొనలేదు.

26. ఆ మరునాడు ఇద్దరు యిస్రాయేలీయులు పోట్లాడుకొనుచుండిరి. అదిచూచి మోషే “అయ్యలారా! మీరు సహోదరులుగదా! మరి మీరు ఏల కొట్టుకొను చున్నారు?" అని వారిద్దరిని సమాధానపరచుటకై ప్రయత్నించెను.

27. కాని, తన పొరుగువానికి అన్యాయము చేయుచున్నవాడు మోషేను ఒక ప్రక్కకు నెట్టివేసి, 'నిన్ను ఎవరు మా అధికారిగను, తీర్పరిగను నియమించిరి?

28. నిన్న నీవు ఐగుప్తు దేశీయుని చంపినట్లుగా నన్నును చంపవలెనని అనుకొనుచున్నావా?' అనెను.

29. మోషే అది విని ఐగుప్తు నుండి పారిపోయి, మిద్యాను సీమలో నివసింపసాగెను. అక్కడ అతనికి ఇరువురు కుమారులు కలిగిరి.

30. “నలువది సంవత్సరములు గడచిన తరువాత ఒకనాడు సీనాయి పర్వతపు ఎడారియందు మండుచున్న పొదలో మోషేకు ఒక దేవదూత కనబడెను.

31. అది చూచి మోషే ఆశ్చర్యపడి ఇంకను బాగుగా చూడవలెనని దగ్గరకు పోగా,

32. 'నేను నీ పూర్వులగు అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవుడను' అని ప్రభువు స్వరము వినబడెను. అది విని మోషే భయముతో గడగడవణకెను. అందుచే మరల ఆ వైపు కన్నెత్తి చూచుటకు అతనికి ధైర్యము చాలలేదు.

33. అప్పుడు ప్రభువు అతనితో, 'నీవు నీ పాదరక్షలను విడిచివేయుము. ఏలయన, నీవు నిలుచున్న ఈ స్థలము పవిత్రమైనది.

34. ఐగుప్తులో నా జనులు పడుచున్న క్రూరమైన బాధలను నేను చూచితిని. వారి మొర నాకు వినబడినది. కనుక, వారిని రక్షించుటకు నేను దిగివచ్చితిని. రమ్ము, నేను నిన్ను ఐగుప్తునకు పంపెదను' అని పలికెను.

35. “ప్రజలచే నిరాకరింపబడిన మోషే ఇతడే. 'నిన్నెవరు మా అధికారిగను, తీర్పిరిగను నియమించిరి?” అని ఆ ప్రజలు ప్రశ్నించిన వానినే దేవుడు మండుచున్న పొదలో కనబడిన దేవదూత ద్వారా అధికారిగను, విమోచకునిగను నియమించి పంపెను.

36. అతడు ఐగుప్తులోను, రెల్లు సముద్రము వద్దను, నలువది సంవత్సరముల పాటు ఎడారిలోను, మహత్కార్యము లను, సూచకక్రియలను చేసి వారిని తరలించుకొని వచ్చెను.

37. 'నన్ను పంపినట్లే మీ సొంతజనుల నుండి దేవుడు మీ కొరకు ఒక ప్రవక్తను పంపును' అని యిస్రాయేలు ప్రజలతో పలికినది ఇతడే.

38. ఎడారిలో సంఘమందు యిస్రాయేలు ప్రజలతో ఉండినవాడు ఇతడే. ఇతడు మన పూర్వులతోను, సీనాయి పర్వతముపై తనతో మాటలాడిన దేవదూత తోను అచట ఉండెను. ఇతడు మనకు ఇచ్చుటకుగాను దేవుని జీవవాక్కులను పొందెను.

39. కాని మన పూర్వులు ఇతనికి విధేయులు కాక, ఇతని మాటలు వినక తిరస్కరించి, మరల ఐగుప్తునకు పోవలెనని వాంఛించిరి.

40. అందుచే వారు అహరోనుతో, ఐగుప్తునుండి మమ్ము తీసికొని వచ్చిన మోషే ఏమయ్యెనో మాకు తెలియదు. మా ముందుండి నడిపించుటకు కొందరు దేవుళ్ళను చేయుము' అనిరి.

41. అప్పుడు వారు ఆవుదూడ ఆకారముగానొక విగ్రహమును చేసి దానికి బలిని అర్పించి తమ చేతులతో చేసిన దానిని గూర్చి సంతోషముతో పండుగ చేసికొనిరి.

42. అందుచే దేవుడు విముఖుడై ఆకాశములోని నక్షత్రములను పూజించుటకు వారిని వదలివేసెను. ప్రవక్త గ్రంథములో, 'యిస్రాయేలు ప్రజలారా! మీరు నలువది సంవత్సరములపాటు ఎడారిలో గడిపినపుడు జంతు బలులను, నైవేద్యములను నాకు సమర్పించితిరా!

43. మీరు మోలెకు అను దేవుని గుడారమును, రెఫాను అను దేవుని నక్షత్రమును భుజములపై మోసికొని పోయితిరి. మీరు చేసిన విగ్రహములను మాత్రమే మీరు ఆరాధించితిరి. కావున నేను మిమ్ములను బబులోనియా ఆవలకు ప్రవాసులనుగా పంపివేసెదను' అని వ్రాయబడియున్నది.

44. “ఎడారిలో ఉన్నప్పుడు మన పూర్వులు తమ వద్ద దైవసమక్షపు గుడారములను కలిగియుండిరి. తనకు చూపబడిన నమూనా ప్రకారము దేవుడు తనకు చెప్పినట్లు మోషే దానిని చేసియుండెను.

45. మన పితరులు కూడ దానిని యెహోషువతో పాటు వెంట తీసికొనిపోయిరి. అనంతరము వారు దేవునిచే తరిమి వేయబడిన జనులనుండి భూభాగమును స్వాధీన మొనర్చుకొనిరి. దావీదు కాలమువరకును దైవసమక్షపు గుడారము అచటనే ఉండెను.

46. అతడు దేవుని అభిమానమును పొందినవాడై, యాకోబు దేవునికి ఒక ఆలయమును కట్టుటకు అనుమతిని అడిగెను.

47. కాని దేవునికి ఆలయమును నిర్మించినవాడు సొలోమోను.

48. అయినప్పటికిని మహోన్నతుడైన సర్వే శ్వరుడు మానవులచే కట్టబడిన ఇండ్లలో నివసింపడు. అందులకే ప్రవక్త చెప్పినదేమనగా: .

49. 'ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. నా కొరకు మీరు ఎటువంటి ఇల్లు కట్టెదరు? నా విశ్రాంతి స్థలము ఎక్కడ?

50. ఇవి అన్నియు చేసినది నేను కాదా?” అని ప్రభువు చెప్పుచున్నాడు.

51. మీరు ఎంత మూర్చులు! దేవుని సందేశ మును తిరస్కరించు మీ హృదయములందును, మీ చెవులయందును సున్నతిలేని వారివలె ఉన్నారు. మీ పితరులవలెనే మీరు కూడ ఎల్లప్పుడు పవిత్రాత్మను ఎదిరించుచున్నారు.

52. మీ పితరులు హింసింపని ప్రవక్త ఎవడు? ఆ నీతిమంతుని రాకడను గూర్చి ముందుగా తెలిపినవారిని వారు చంపివేసిరి. ఇప్పుడు మీరు ఆయనను శత్రువులకు పట్టియిచ్చి చంపితిరి.

53. దేవదూతల ద్వారా అందింపబడిన దేవుని చట్టమును పొందిన మీరే దాని ప్రకారముగా నడచుటలేదు!”

54. ఆ విచారణసభలోని సభ్యులు సైఫాను చెప్పినది విని మండిపడి, అతనివంక చూచి కోపముతో పండ్లు పటపట కొరికిరి.

55. అయినను స్తెఫాను పవిత్రాత్మతో నిండినవాడై, పరలోకమువైపు చూడగా, అతనికి దేవుని మహిమయు, దేవుని కుడి పక్కన యేసు నిలువబడి ఉండుటయు కనబడెను,

56. అప్పుడు అతడు “చూడుడు! పరలోకము తెరువబడియున్నట్లు నాకు కనబడుచున్నది. మరియు మనుష్యకుమారుడు  దేవుని కుడి ప్రక్కన నిలువబడియున్నాడు" అని పలికెను.

57. ఇది విని వారందరును కేకలువేయుచు చెవులు మూసికొనిరి. పిమ్మట వారందరు ఒక్కుమ్మడిగా అతనిపై విరుచుకొనిపడిరి.

58. అతనిని నగరము బయటకు తరుముకొనిపోయి, రాళ్ళతో కొట్టిరి. సాక్షులు తమ పైవస్త్రములను తీసివేసి సౌలు అను యువకుని పాదములచెంత వానిని ఉంచిరి.

59. వారు ఇంకను రాళ్ళతో కొట్టుచుండగా సైఫాను “యేసుప్రభూ! నా ఆత్మను గైకొనుము” అని ప్రార్థించెను.

60.ఆపై మోకరిల్లి బిగ్గరగా "ప్రభూ! ఈ పాపము వీరిపై మోపకుము” అని పలికి మరణించెను. సౌలు అతని మరణమును ఆమోదించెను.

 1. ఆనాటి నుండి యెరూషలేములోని సంఘము క్రూరమైన హింసలపాలయ్యెను. అపోస్తలులు తప్ప విశ్వాసులందరు, యూదయా, సమరియా ప్రాంతముల నలుమూలలకు చెల్లాచెదరైరి.

2. కొందరు భక్తులు స్తెఫానును సమాధిచేసి, అతని కొరకై గొల్లుమని ఏడ్చిరి.

3. కానీ, సౌలు సంఘమును నాశనముచేయ ప్రయ త్నించుచు ఇంటింట జొరబడి స్త్రీ పురుషులను బయ టకు ఈడ్చుకొనిపోయి వారిని చెరసాలలో వేయించు చుండెను.

4. చెల్లాచెదరైపోయిన వారు సువార్తను ఎల్లెడల బోధించుచుండిరి.

5. ఫిలిప్పు సమరియా నగరమునకు పోయి క్రీస్తునుగూర్చి అచటి ప్రజలకు ప్రకటించు చుండెను.

6. ప్రజాసమూహములు ఫిలిప్పు బోధించు విషయమును శ్రద్ధతో వినుచుండెను. వారందరు అతని ఉపదేశమును ఆలకించుచు అతడు చేయుచున్న సూచకక్రియలను కన్నులార కాంచుచుండిరి.

7. పలువురు ప్రజలనుండి అపవిత్రాత్మలు బిగ్గరగా అరచుచు బయటకు వచ్చెను. పక్షవాతరోగులు, కుంటివారుకూడ బాగు చేయబడిరి.

8. అందుచే ఆ నగరములోని జనులు ఎంతో సంతోషించిరి.

9. అప్పుడు ఆ నగరములో సీమోను అను పేరుగలవాడు ఒకడు నివసించుచుండెను. కొంత కాలముపాటు అతడు తన మంత్రవిద్యచే సమరియా దేశమంతటిని మిక్కిలి ఆశ్చర్యములో ముంచెత్తెను, అతడు తానొక గొప్పవాడనని చెప్పుకొనుచుండెను.

10. అందుచే ఆ నగరమునందలి పిన్నలు, పెద్దలందరు అతడు చెప్పిన దానిని శ్రద్ధతో వినుచుండిరి. 'మహాశక్తి అనబడు దేవుని శక్తి వీడే' అని వారు చెప్పుకొను చుండిరి.

11. అతడు తన మాయలచే వారికి ఎంతో కాలము ఆశ్చర్యమును కలిగించుటచే వారు అతనిని శ్రద్ధతో ఆలకించిరి.

12. కాని ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్తను ప్రకటించుచుండగా వారు, అతనిని నమ్మి, పురుషులును, స్త్రీలును జ్ఞానస్నానము పొందిరి.

13. ఆ బోధను విని, సీమోను కూడ విశ్వసించెను. అందుచే అతడు జ్ఞానస్నానమును పొంది ఫిలిప్పు చెంతనే ఉండెను. ఫిలిప్పు చేయుచుండిన సూచకక్రియలను, గొప్ప అద్భుతములను చూచి నివ్వెరపడెను.

14. సమరియాలోని ప్రజలు దేవుని వాక్కును అంగీకరించిరని యెరూషలేమునందలి అపోస్తలులు విని పేతురును, యోహానును ఆ ప్రజలవద్దకు పంపిరి.

15. వీరు అక్కడకు చేరుకొని, వారు పవిత్రాత్మను పొందునట్లుగా ప్రార్థించిరి.

16. ఏలయన, అప్పటికి ఇంకను వారిలో ఎవరి మీదికిని పవిత్రాత్మ వచ్చియుండలేదు. ప్రభువైన యేసునామమున వారు జ్ఞానస్నానమును మాత్రమే పొందియుండిరి.

17. అప్పుడు పేతురు, యోహానులు వారిపై చేతులు ఉంచగా వారు పవిత్రాత్మను పొందిరి.

18. అపోస్తలులు వారిపై చేతులు ఉంచగా ఆత్మ వారికి ఒసగ బడుటను సీమోను చూచి పేతురుకు యోహానుకు కొంత డబ్బును ఇచ్చి,

19. “నేను ఎవరిపై చేతులు చాచెదనో వారు పవిత్రాత్మను పొందునట్లుగా నాకును ఈ శక్తిని ఈయుడు” అని వారిని కోరెను.

20. అందుకు పేతురు, “దేవుని వరమును నీవు డబ్బుతో కొనదలంచుచున్నావా? నీవు నీ డబ్బుతో పాటు నాశనమగుదువుగాక!

21. మా పనిలో నీకు భాగముగాని, ప్రవేశముగాని లేదు. ఏలయన, దేవుని దృష్టిలో నీ హృదయము సరిగాలేదు.

22. కనుక నీ దుష్టత్వమునకై పశ్చాత్తాపపడి దేవుని ప్రార్థింపుము. ఈ నీ దురాలోచనను దేవుడు క్షమింపవచ్చును.

23. ఏలయన, నీవు పైత్యపు చేదువంటి దుర్బుద్ధితో పాపమునకు బందీవైతివి అని నాకు తోచుచున్నది” అని బదులు పలికెను.

24. అందుకు సీమోను వారితో “మీరు నన్నుగూర్చి పలికిన వానిలో ఏదియును జరుగ కుండునట్లుగా నాకొరకు ప్రభువును ప్రార్థింపుడు” అని మనవి చేసికొనెను.

25. పేతురు యోహాను సాక్ష్యమిచ్చి, ప్రభువు సందేశమును అందించిన పిదప తిరిగి యెరూషలేమునకు పోయిరి. అటుపోవుచు వారు సమరియాలోని అనేక గ్రామములలో సువార్తను ప్రకటించిరి.

26. ప్రభువు దూత ఫిలిప్పుతో “నీవు లేచి దక్షిణముగా యెరూషలేమునుండి గాజాకు పోవు మార్గమున వెళ్ళుము” అని చెప్పెను. అది ఎడారి ప్రాంతము.

27. ఫిలిప్పు సిద్ధపడి అట్లే వెళ్ళెను. అపుడు నపుంసకుడగు ఇతియోపియా నివాసి ఒకడు తన ఇంటికి పోవుచుండెను. అతడు ఒక ముఖ్యమైన ఉద్యోగి. ఇతియోపియా రాణియైన కాందాసికి కోశాధికారి. దేవుని ఆరాధించుటకై అతడు యెరూషలేమునకు వచ్చెను.

28. అతడు తిరిగిపోవుచు తనరథముపై కూర్చొని ప్రవక్తయైన యెషయా గ్రంథమును చదువు చుండెను.

29. అప్పుడు పవిత్రాత్మ ఫిలిప్పుతో “నీవు ఆ రథమువద్దకు పోయి దానిని కలిసికొనుము” అని చెప్పగా,

30. ఫిలిప్పు వెంటనే అక్కడకు పరుగెత్తుకొని పోయి అతడు యెషయా ప్రవక్త గ్రంథమును చదువు చుండుట వినెను. అందుచే ఫిలిప్పు “నీవు చదువు చున్నది నీకు అర్థమగుచున్నదా” అని అతనిని ప్రశ్నింపగా,

31. “నాకు ఎవరైన వివరింపనియెడల నేను ఎట్లు అర్థము చేసికొనగలను?” అని ఆ ఉద్యోగి పలికెను. అంతట రథమునెక్కి తన ప్రక్కన కూర్చుండు మని అతడు ఫిలిప్పును ఆహ్వానించెను.

32. అప్పుడు అతడు చదువుచుండిన పరిశుద్ధ గ్రంథములోని భాగము ఏదన: “వధింపబడుటకు తీసికొనిపోబడిన గొఱ్ఱెవలెను, ఉన్ని కత్తిరించి వేయబడునప్పుడు మౌనముగా ఉండు గొఱ్ఱెపిల్లవలెను అతడు నోరు తెరువడు.

33. అతడు అవమానింపబడెను. న్యాయము అతనికి నిరాకరింపబడెను. అతని సంతతినిగూర్చి ఎవరును పలుకజాలరు. ఏలయన, అతని జీవము భూమిమీద నుండి తీసివేయబడినది.”

34. అప్పుడు ఆ ఉద్యోగి ఫిలిప్పుతో “ప్రవక ఎవరిని గురించి ఈ విషయమును చెప్పుచున్నాడు? తనను గూర్చియా? లేక మరియొకనిని గూర్చియా?” అని ప్రశ్నించెను.

35. అప్పుడు ఫిలిప్పు ఆ లేఖన మును అనుసరించి, యేసును గురించి అతనికి బోధింపనారంభించెను.

36. వారు అట్లు సాగిపోవుచు నీరుగల ఒక ప్రదేశమును చేరిరి. అప్పుడు “ఇదిగో! ఇక్కడ నీరున్నదిగదా! నేను జ్ఞానస్నానమును పొందుటకు ఆటంకమేమి?”అని నపుంసకుడు ఫిలిప్పును ప్రశ్నించెను.

37. అప్పుడు ఫిలిప్పు “నీవు నీ పూర్ణహృదయముతో విశ్వసించినయెడల జ్ఞాన స్నానము పొందవచ్చును” అని అతనితో పలికెను. అప్పుడు అతడు “యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాను” అని బదులు పలికెను.

38. ఆ ఉద్యోగి రథమును ఆపివేయనాజ్ఞాపించి తానును ఫిలిప్పును నీటిమడుగులోనికి దిగిరి. అక్కడ ఫిలిప్పు అతనికి జ్ఞానస్నానమును ఇచ్చెను.

39. వారు ఆ నీటిమడుగునుండి బయటకు వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును తీసికొనిపోయెను. ఆ నపుంసకుడు మరల ఫిలిప్పును చూడలేకపోయినను, సంతోషముతో తన ప్రయాణమును కొనసాగించెను.

40. అయితే, ఫిలిప్పు ఆజోతులో కనబడెను. అక్కడనుండి అన్ని పట్టణములందును సువార్తను బోధించుచు, కైసరియాను చేరుకొనెను. 

 1. ఇంతలో ప్రభువు శిష్యులను చంపవలెనని సౌలు వారిని బెదరించుచు దౌర్జన్యము చేయుచుండెను. అతడు ప్రధానార్చకునియొద్దకు వెళ్ళి,

2. ఇంకను ఈ మార్గమును అవలంబించుచున్న పురుషులు, స్త్రీలు ఎవరు దొరికినను వారిని పట్టుకొని యెరూషలేమునకు చేర్చుటకై దమస్కులోని యూదుల ప్రార్థనా మందిరము లకు పరిచయపత్రములను ఇమ్మని అతనిని అర్ధించెను.

3. అతడు బయలుదేరి దమస్కు నగరమును సమీపించినప్పుడు ఆకాశమునుండి ఒక వెలుగు అకస్మాత్తుగా అతని చుట్టును ప్రకాశించెను.

4. అప్పుడు అతడు నేలమీద పడిపోగా సౌలూ! సౌలూ! నీవేల నన్ను హింసించుచున్నావు?” అను స్వరము అతనికి వినబడెను.

5. "ప్రభూ! నీవెవరు?” అని అతడు ప్రశ్నించెను. “నీవు హింసించుచున్న యేసును నేనే.

6. నీవు లేచి నగరములోనికి పొమ్ము . అక్కడ నీవు ఏమి చేయవలయునో తెలుపబడును” అని ఆ స్వరము పలికెను.

7. అప్పుడు సౌలుతో ప్రయాణమై వచ్చినవారు నిశ్చేష్టులై నోటమాట లేకుండిరి. వారు ఆ స్వరమును వినిరి కాని వారికి ఏమియు కన్పింప లేదు.

8. తదుపరి సౌలు నేలపైనుండి లేచి కండ్లు తెరచెను. కాని అతడు ఏమియును చూడలేక పోయెను. అందుచే వారు అతని చేయిపట్టుకొని దమస్కు నగరములోనికి నడిపించుకొని వచ్చిరి.

9. మూడురోజులవరకు అతడు ఏమియు చూడలేక పోయెను. ఆ మూడు దినములు అతడు అన్న పానీయములు ముట్టలేదు. ,

10. దమస్కులో అననియా అను పేరుగల ఒక శిష్యుడు ఉండెను. అతనికి ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో అతనికి ప్రభువు కనబడి "అననియా!” అని పిలిచెను. అప్పుడు అనని, “ప్రభూ! నేను ఇచ్చటనే ఉన్నాను” అని బదులుపలికెను.

11. అంతట ప్రభువు “నీవు లేచి 'తిన్ననిది' అనబడు వీధికి వెళ్ళుము. అచ్చట యూదా ఇంటిలో తార్సుపుర వాసియైన సౌలు అను పేరుగల వ్యక్తి కొరకు అడుగుము. అతడు ఇప్పుడు ప్రార్ధన చేయుచున్నాడు.

12. తనకు మరల చూపుకలుగునట్లు అననియా అను ఒక మనుష్యుడు తనపై హస్తములుంచినట్లు సౌలు ఒక దర్శనములో చూచుచున్నాడు” అని అతనితో చెప్పెను.

13. అందుకు అననియా, “ప్రభూ! ఈ మనుష్యుడు యెరూషలేములోని నీ జనులకు ఎంతో కీడు కావించి యున్నాడని చాలామంది. అతనిని గురించి నాకు చెప్పియున్నారు.

14. మరియు నీ నామమున వేడు కొను వారందరిని పట్టి బంధించుటకై అతడు ప్రధానార్చ కులనుండి అధికారమును పొంది, దమస్కు పట్టణము నకు వచ్చియున్నాడు” అని ప్రభువుతో పలికెను.

15. ప్రభువు మరల అతనితో, “నీవు వెళ్ళుము. ఏలయన, అన్యులకు, రాజులకు, యిస్రాయేలు ప్రజలకు నా నామమును తెలియ జేయుటకు నేను అతనిని సాధనముగా ఎన్నుకొంటిని.

16. మరియు అతడు నా నామము నిమిత్తము ఎన్ని బాధలు పడవలయునో నేను అతనికి చూపించెదను” అని చెప్పెను.

17. అననియా వెళ్ళి సౌలు ఉన్న ఇంటిలో ప్రవేశించి అతనిపై చేతులుంచి, "సౌలు సోదరా! నీవు ఇక్కడకు వచ్చునపుడు దారిలో నీవు చూచిన ప్రభువైన యేసే నన్ను పంపెను. నీవు మరల చూపును పొంది, పవిత్రాత్మతో నింపబడుటకుగాను నన్ను ఆయన పంపియున్నాడు” అని పలికెను.

18. అప్పుడు ఒక్కసారిగా సౌలు కన్నులనుండి పొరలవంటివి రాలి క్రిందపడగా అతనికి మరల చూపువచ్చెను. వెంటనే అతడు లేచి నిలువబడి జ్ఞానస్నానమును పొందెను.

19. తరువాత ఆహారమును పుచ్చుకొని బలము పొందెను. సౌలు దమస్కులో కొన్నిదినములు శిష్యులతో ఉండెను.

20. అతడు సరాసరి ప్రార్థనా మందిరము లోనికి వెళ్ళి, “యేసు దేవుని కుమారుడు” అని బోధింప మొదలుపెట్టెను.

21. అది విన్న వారందరు అబ్బురపడుచు, “ఈ నామమును ఉచ్చరించు వారంద రిని యెరూషలేములో చంపించుచుండిన వాడు ఇతడే కదా? వారిని పట్టి బంధించి ప్రధానార్చకుల కడకు తీసి కొనిపోవుటకే కదా ఇతడు ఇచటికి వచ్చినది!" అని చెప్పుకొనసాగిరి,

22. కాని, సౌలు మరి ఎక్కువగా బలపడి, ఈయనయే క్రీస్తు అని ఋజువుపరచుచు దమస్కులో ఉన్న యూదులను కలవరపరచెను.

23. చాల దినములు గడచిన తరువాత యూదులు ఒకచోట చేరి సౌలును చంపుటకు కుట్రపన్నిరి.

24. కాని వారు చేయబోవు కుతంత్రము అతని చెవిని పడెను. సౌలును చంపుటకై వారు రేయింబవళ్ళు నగర ద్వారములను కావలి కాయుచుండిరి.

25. అది కనిపెట్టి, సౌలు శిష్యులు ఒకరాత్రి అతనిని తీసుకొని పోయి, గంపలో కూర్చుండబెట్టి, గోడమీదనుండి అవతలకు దింపివేసిరి.

26. సౌలు యెరూషలేమునకు చేరిన పిదప శిష్యులను కలసికొనుటకు ప్రయత్నించెను. ఇతడు కూడ శిష్యుడైనాడు అను సంగతిని వారు నమ్మలేకుండిరి. అందుచే అతడన్నచో వారికి గుండెదడ పుట్టుచుండెను.

27. అప్పుడు బర్నబా సౌలుకు సహాయపడుటకై వచ్చి, అతనిని అపోస్తలుల వద్దకు తీసికొనిపోయి, సౌలు  మార్గమధ్యములో ఎట్లు ప్రభువును గాంచినదియు, ఆయన అతనితో ఎట్లు మాట్లాడినదియు, సౌలు దమస్కులో యేసు నామమును ఎట్లు ధైర్యముగా ప్రసంగించినదియు వారికి పూసగ్రుచ్చినట్లు వివ రించెను.

28. అప్పటినుండి సౌలు వారితో కలసి యెరూషలేమునందు అంతటను తిరుగుచు ప్రభువు నామమున ధైర్యముగా ప్రసంగించుచుండెను.

29. అతడు గ్రీకుభాష మాట్లాడు యూదులతో గూడ మాట్లాడుచు, వాదించుచుండుటచే వారు అతనిని చంప ప్రయత్నించుచుండిరి.

30. ఈ విషయమును ఎరిగిన సోదరులు సౌలును కైసరియాకు తీసికొని పోయి, అక్కడనుండి అతనిని తార్సునకు పంపివేసిరి.

31. అందుచే యూదయా, గలిలీయ, సమరియా సీమలందంతట శాంతి చేకూరెను. వారు దేవుని యెడల భయభక్తులతోడను, పవిత్రాత్మ సహాయము తోడను జీవించుచు అధిక సంఖ్యలో దినదినాభివృద్ధి చెందుచుండిరి.

32. పేతురు అంతటను పర్యటించుచు ఒకసారి లిద్దాలో ఉన్న పరిశుద్ధులను చూచుటకై వెళ్ళెను.

33. అక్కడ ఎనిమిది సంవత్సరములనుండి పక్షవాత రోగముతో బాధపడుచు, పడకనుండి లేచుటకైనను శక్తిలేని ఎనియా అను పేరుగల వానిని చూచి,

34. “ఎనియా! యేసుక్రీస్తు నిన్ను బాగుచేసియున్నాడు. నీవు లేచి నీ పడకను ఎత్తుకొనుము” అని చెప్పగా, అతడు వెంటనే లేచెను.

35. లిద్దాలోను, షారోనులోను నివసించుచున్న వారందరును అదిచూచి ప్రభువును నమ్మిరి.

36. యొప్పాలో తబీత అను పేరుగల ఒక శిష్యురాలుండెను. గ్రీకుభాషలో ఆమె పేరు దోర్మా (అనగా జింక). ఆమె తన కాలమునంతటిని సత్కార్యములు చేయుటలోను, పేదలకు సాయపడుట లోను గడిపెను.

37. ఆ సమయములో ఆమెకు జబ్బు చేయుటచే మరణించెను. ఆమె దేహమునకు స్నానము చేయించి పై అంతస్తులోనున్న ఒక గదిలో ఉంచిరి.

38. లిద్దా యొప్పాకు దగ్గరలో నుండుటచే యెప్పాలోఉన్న శిష్యులు, పేతురు లిద్దాలో ఉన్న సంగతి విని, ఇద్దరు మనుష్యులను అతని యొద్దకు పంపుచు “నీవు ఆలస్యము చేయక త్వరగా మా వద్దకు రమ్ము" అని అర్ధించిరి.

39. పేతురు సిద్ధపడి వారితో అక్కడకు వెళ్ళెను. అక్కడకు చేరుకొనగానే వారు అతనిని పై అంతస్తులో ఉన్న గదిలోనికి తీసికొనిపోయిరి. అక్కడ విధవరాండ్రు అందరు అతని చుట్టూ చేరి ఏడ్చుచు దోర్కాతాను జీవించిన కాలములో సిద్దపరచిన చొకా లను, అంగీలను ఆయనకు చూపించిరి.

40. పేతురు వారిని అందరను గది నుండి బయటకు పంపించి తాను మోకరిల్లి ప్రార్థించెను. పిమ్మట అతడు ప్రేతము వైపునకు తిరిగి “తబీత! లెమ్ము" అని పలుకగానే ఆమె కన్నులు తెరచి, పేతురును చూచి లేచి కూర్చుండెను.

41. ఆమె లేచి నిలువబడుటకు పేతురు సహాయపడెను. అప్పుడు అతడు ఆ పరిశుద్ధులను, విధవరాండ్రను పిలిచి సజీవురాలైన ఆమెను వారి ఎదుట ఉంచెను.

42. ఈ విషయము యొప్పా యందంతటను ప్రాకిపోవుటచే చాలమంది జనులు ప్రభువును విశ్వసించిరి.

43. పేతురు యొప్పాలో సీమోను అను పేరుగల ఒక చర్మకారుని వద్ద చాలదినములపాటు ఉండెను.

 1. కైసరియా పట్టణములో ఉన్న “ఇటాలియా పటాలము"నకు శతాధిపతియైన కొర్నేలి అనువాడు ఒకడు ఉండెను.

2. అతడు అతని కుటుంబములోని వారందరును దేవునియందు భక్తిశ్రద్ధలు కలిగియుండిరి. అతడు పేదసాదలకు దానధర్మములు చేయుచు సదా దేవుని ప్రార్థించుచుండెను.

3. ఒకనాటి పగలు ఇంచుమించు మూడుగంటల వేళ అతడు ఒక దర్శనమందు దేవదూత అతనివద్దకు వచ్చి “కొర్నేలీ!” అని పిలుచుటను స్పష్టముగా చూచెను.

4. అప్పుడు అతడు భయముతో దూతవైపు పారచూచి, “ఏమి ప్రభూ?” అని అడిగెను. అందుకు దేవదూత, “నీ ప్రార్థనలు ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్దముగ చేరినవి.

5. కనుక ఇప్పుడు నీవు కొందరు మనుష్యులను యొప్పా నగరమునకు పంపి, పేతురు అని మారుపేరు గల సీమోనును పిలిపింపుము.

6. అతడు సీమోను అను ఒక చర్మకారుని ఇంట అతిథిగా ఉన్నాడు. అతని ఇల్లు సముద్రతీరమున ఉన్నది” అని చెప్పెను.

7. దూత వెడలిపోగ కొర్నేలి తన పనివారిలో ఇద్దరిని మరియు తనకు సన్నిహితుడు, దైవభక్తుడైన ఒక సైనికుని పిలిచి,

8. జరిగినదంతయు వారికి -వివరించి వారిని యొప్పాకు పంపెను.

9. మరునాడు వారు పయనించుచు యొప్పా నగర సమీపమునకు వచ్చుచుండిరి. అంతలో మధ్యాహ్న సమయమున ప్రార్థన చేసికొనుటకు పేతురు మిద్దెపైకి ఎకెను.

10. అతడు ఆకలిగొనియుండుటచే, భుజింప దలచెను. భోజనము సిద్ధము చేయబడుచుండ అతనికి ఒకదర్శనము కలిగెను.

11. పరలోకము తెరచుకొనగా పెద్ద దుప్పటి వంటిది నాలుగు మూలలతో భూమి మీదికి దింపబడుటను అతడు ఆ దర్శనమందు కాంచెను.

12. దానిలో అన్ని రకముల భూచరములగు జంతువు లును, ప్రాకెడిప్రాణులును, ఆకాశపక్షులును ఉండెను.

13. అప్పుడు, “పేతురూ! లెమ్ము! వీనిని చంపితినుము” అను ఒక స్వరము అతనికి వినిపించెను.

14. అందుకు పేతురు, "ప్రభూ! వలదు. నేనెన్నడును నిషిద్ధమును, అపరిశుద్ధమునైనది ఏదియు తినలేదు” అని సమాధానమిచ్చెను.

15. అందుకు రెండవమారు ఆ స్వరము “దేవుడు పవిత్రపరచిన దానిని నీవు అపవిత్రమైనదని పలుకరాదు” అని వినిపించెను.

16. ముమ్మారు ఇట్లు జరిగిన పిదప అది పరలోకమునకు తీసికొని పోబడెను.

17. ఆ దర్శనమునకు అర్థము ఏమై ఉండునో అని పేతురు లోలోపల ఆశ్చర్యపడుచుండెను. ఇంతలో కొర్నేలిచే పంపబడినవారు సీమోను ఇల్లు ఎక్కడనో అడిగి తెలిసికొని ఆ ఇంటి గుమ్మము ఎదుట నిలువబడి ఉండిరి.

18. అప్పుడు వారు, "పేతురు అనబడు సీమోను ఇచ్చట ఉన్నాడా?” అని అడిగిరి.

19. పేతురు దర్శనము యొక్క అర్థమును గ్రహింప ప్రయత్నించుచు ఇంకను ఆలోచించుచుండెను. పవిత్రాత్మ అతనితో “పేతురూ! వినుము. ఇక్కడ ముగ్గురు మనుష్యులు నీ కొరకు వెదకుచున్నారు.

20. కాబట్టి నీవు లేచి, వారితో వెళ్ళుటకు సందేహింపకుము. ఏలయన, వారిని నేను పంపియున్నాను” అని పలుకగా,

21. పేతురు క్రిందకు పోయి, వారితో “మీరు వెదకుచున్న వాడను నేనే. మీరు ఏల ఇచ్చటకు వచ్చితిరి?” అని అడిగెను.

22. అందుకు వారు. “కొర్నేలి అను శతాధిపతి మమ్ము పంపినాడు. అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, అంతేగాక యూదులచేత గొప్పగా గౌరవింప బడుచున్నవాడు. నీవు చెప్పదలచిన దానిని తెలిసికొను టకు నిన్ను తన ఇంటికి ఆహ్వానించుటకు ఒక దేవ దూతచే అతడు ఆదేశింపబడెను” అని పలికిరి.

23. అది విని పేతురు వారిని లోపలకు తీసికొనిపోయి అతిథి సత్కారము చేసెను. మరునాడు అతడు సిద్ధపడి వారివెంట వెళ్ళెను. యొప్పాకు చెందిన సోదరులు కూడ కొందరు అతనివెంట వెళ్ళిరి.

24. ఆ మరునాటికి అతడు కైనరియా చేరుకొనెను. అక్కడ కొర్నేలి తన బంధువులను, ప్రాణ స్నేహితులను ఆహ్వానించి, పేతురు కొరకై ఎదురు చూచుచుండెను.

25. పేతురు లోనికి వచ్చుచున్నప్పుడు కొర్నేలి ఎదురేగి, పేతురు పాదముల వద్ద సాగిలపడి నమస్కరించెను.

26. పేతురు అతనితో, “లెమ్ము, నేనును ఒక మనుష్యుడనే” అని పలికెను.

27. పేతురు కొర్నేలితో మాటలాడుచు లోనికి వెళ్ళి, అచ్చట అనేకులు కూడియుండుట చూచెను.

28. పేతురు వారితో "యూదుడు తన మతానుసారము అన్యులను దర్శించుట లేక వారితో చెలిమిచేయుట తగదని మీకు బాగుగా తెలియునుగదా! కాని ఏ మనుష్యునైనను నిషేధింపబడినవాడని, అపరిశుద్దుడని నేను భావింప రాదని దేవుడు నాతో చెప్పియున్నాడు.

29. కనుక, మీరు నా కొరకు మనుష్యులను పంపినపుడు, ఎట్టి సంకోచమును లేక నేను వచ్చితిని. నన్ను మీరు పిలిపించిన కారణమేమి?" అని ప్రశ్నించెను.

30. అప్పుడు కొర్నేలి, “నాలుగుదినముల క్రిందట ఇదే సమయములో పగలు మూడుగంటల వేళ, నేను నా ఇంటిలో ప్రార్థన చేసికొనుచుంటిని. హఠాత్తుగా కాంతిమంతమైన దుస్తులను ధరించిన ఒక మనుష్యుడు నా ఎదుట నిలువబడి,

31. 'కొర్నేలీ! దేవుడు నీ ప్రార్థనను ఆలకించెను. నీ ధర్మకార్యములను గుర్తించెను.

32. పేతురు అనబడు సీమోనును పిలిపించుటకు ఒకనిని యొప్పాకు పంపుము. అతడు చర్మకారుడగు సీమోను ఇంటిలో బస చేయుచున్నాడు. అతని ఇల్లు సముద్రతీరమున ఉన్నది' అని నాకు తెలిపెను.

33. వెంటనే నేను నీకొరకు మనుష్యులను పంపితిని. నీవు దయతో ఇక్కడకు వచ్చితివి. ఇప్పుడు మేము అందరము దేవుని సమక్షములో ఉన్నాము. ప్రభువు నీకు ఆనతిచ్చిన దానిని ఆలకించుటకై వేచి యున్నాము” అని పేతురునకు తెలియజెప్పెను.

34. అంతట పేతురు నోరుతెరచి ఇట్లు ప్రసంగింప నారంభించెను: “దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరిని సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించితిని.

35. దేవునికి భయపడుచు, సత్ప్రవర్తన కలవాడు ఏ జాతివాడైనను దేవునికి అంగీకారయోగ్యుడే.

36. అందరికి ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవుడు యిస్రాయేలు ప్రజలకు శాంతి సువార్తను  ప్రకటించుట మీరు ఎరిగినదే కదా!

37. యోహాను బోధించిన బప్తిస్మానంతరము గలిలీయలో ప్రారంభమై యూదయా అంతటను వ్యాపించిన మహత్తర సంఘటన మీ అందరకు తెలిసినదే.

38. పవిత్రాత్మతోను, శక్తి తోను, దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినదియు మీకు తెలియును. ఆయన అంతటను పర్యటించుచు, మేలు చేయుచు, పిశాచ శక్తికి లోబడిన వారందరిని స్వస్థపరచెను. ఏలయన, దేవుడు ఆయనతో ఉండెను.

39. యూదుల దేశములోను, యెరూషలేములోను ఆయన చేసిన వానికి అన్నిటికిని మేము సాక్షులము. వారు ఆయనను సిలువ వేసిరి.

40. అయినను దేవుడు ఆయనను మూడవనాడు మృతులనుండి లేపి, మరల మాకు కనబడునట్లు చేసెను.

41. దేవునిచే ముందుగా ఎన్నుకొనబడి, ఆయనకు సాక్షులమైయున్న మాకు మాత్రమేగాని ఆయన ఇతరులకు కనిపింపలేదు. దేవుడు ఆయనను మృతులనుండి లేపిన తరువాత మేము ఆయనతో అన్నపానీయములు పుచ్చుకొంటిమి.

42. జీవితులకును, మృతులకును తీర్పరిగా దేవుడు నియమించినవాడు ఈయనయే అని ప్రజల ఎదుట ప్రకటింపవలెననియు, సాక్ష్యమీయవలెననియు దేవుడు మమ్ము ఆజ్ఞాపించెను.

43. ఈయన యందు విశ్వాసముంచిన వారందరి పాపములు ఈయన నామమున క్షమింపబడునని ప్రవక్తలందరు పలికినది ఈయనను గురించియే.”

44. పేతురు ఇంకను మాట్లాడుచుండగ ఆ సందేశమును ఆలకించుచున్న వారందరిపై పవిత్రాత్మ దిగివచ్చెను.

45. పేతురుతో యొప్పానుండి వచ్చిన సున్నతి పొందిన విశ్వాసులు, అన్యులపై కూడ దేవుడు తన వరమైన పవిత్రాత్మను కుమ్మరించుట చూచి ఆశ్చర్యపడిరి.

46. ఏలయన, ఆ అన్యులును క్రొత్త భాషలో మాట్లాడుచు దేవుని స్తుతించుటను వారు చూచిరి.

47. పేతురు, “ఇప్పుడు మనవలెనే పవిత్రాత్మను పొందిన వీరు నీటితో జ్ఞానస్నానమును పుచ్చుకొను టను ఎవరైనను వారింపగలరా” అనుచు,

48. “యేసుక్రీస్తు పేరిట మీరు జ్ఞానస్నానమును పొందుడు” అని వారిని ఆజ్ఞాపించెను. కొన్ని దినములు తమవద్ద ఉండవలసినదిగా పేతురును వారు కోరిరి. 

 1. అన్యులు కూడ దేవుని వాక్కును అంగీకరించిరని, యూదయా నీమలో ఉన్న అపోస్తలులు, సోదరులు వినిరి.

2. పేతురు యెరూషలేమునకు వచ్చినపుడు అన్యులకు సున్నతి అవసరమని వాదించు యూదులు అతనిని విమర్శించిరి.

3. "సున్నతి పొందని అన్యుల ఇంటికి నీవు అతిథిగాపోయి, వారితో కలిసి ఏల భుజించితివి?” అని పేతురును వారు ప్రశ్నించిరి.

4. అందుచే పేతురు అక్కడ జరిగిన దర్శన సంఘటన గూర్చి మొదటినుండి చివరివరకు వివరింపసాగెను:

5. "నేను యొప్పా నగరములో ప్రార్థన చేసికొను చుండగా, తన్మయత్వములో నాకు ఒక దర్శనము కలిగినది. ఆ దర్శనములో పరలోకమునుండి నాలుగు కొంగులతో క్రిందకు దింపబడుచున్న ఒక పెద్ద దుప్పటివంటి దానిని చూచితిని. అది నా ఎదుటకు వచ్చి ఆగినది.

6. నేను పరిశీలించి చూడగా అందులో చతుష్పాద జంతువులు, అడవి మృగములు, ప్రాకెడి ప్రాణులు, ఆకాశపక్షులు నాకు కనిపించినవి.

7. అప్పుడు 'పేతురూ! లెమ్ము, వీనిని చంపుకొని తినుము' అను ఒక స్వరము నాకు వినబడెను.

8. కాని నేను 'ప్రభూ! వలదు నేను ఎప్పుడైనను నిషిద్ధమైనదియు, అపరిశుద్ధమైనదియు తినలేదు' అని బదులు పలికితిని.

9. మరల ఆకాశమునుండి ఆ స్వరము 'దేవుడు శుద్ధమైనదని ప్రకటించిన దానిని నీవు నిషిద్ధముగా భావింపరాదు' అని వినిపించెను.

10. ముమ్మారు అట్లు జరిగిన పిదప అది అంతయు పరలోకమునకు తీసికొనిపోబడెను.

11. ఆ సమయములోనే, క్రైసరియా నుండి నా కొరకు పంపబడిన ముగ్గురు మనుష్యులు నేను ఉండిన ఇంటియొద్దకు వచ్చిరి.

12. సందేహింపక వారితో వెళ్ళుము' అని ఆత్మ నాతో చెప్పెను. ఈ ఆరుగురు సోదరులును నాతో కైసరియాకు వచ్చిరి. మేమందరము కొర్నేలి ఇంటికి వెళ్ళితిమి.

13. 'నీవు యొప్పాకు మనుష్యుని పంపి పేతురు అనబడు సీమోనును పిలిపింపుము.

14. అతడు నీకు కొన్ని మాటలు చెప్పును. ఆ ఉపదేశముచే నీవు నీ కుటుంబ మును రక్షింపబడుదురు' అని ఒక దేవదూత తన ఇంటిలో కనిపించి చెప్పినదంతయు అతడు మాకు వినిపించెను.

15. నేను మాట్లాడుటకు ప్రారంభించినప్పుడు మొదట మనపై దిగివచ్చినట్లుగానే, పవిత్రాత్మ వారిపైనను దిగివచ్చెను.

16. 'యోహాను నీటితో బషిస్మమిచ్చెను. కాని మీరు పవిత్రాత్మతో జ్ఞానస్నానము పొందుదురు' అని ప్రభువు చెప్పిన విషయము అపుడు నాకు జ్ఞాపకము వచ్చినది.

17. మనము ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు దేవుడు మనకు ఇచ్చిన వరమునే అన్యులకును ఇచ్చెను. ఆయనను కాదనుటకు నేను ఎవడను?” అని పేతురు వారికి తెలియజెప్పెను.

18. వారు ఇది విని విమర్శించుట మానివేసి 'పశ్చాత్తాపపడి, నిత్యజీవము పొందుటకు దేవుడు అన్యులకు కూడ అవకాశము కల్పించెను' అని దేవుని స్తుతించిరి.

19. సైఫాను చంపబడినపుడు జరిగిన హింసా కాండవలన చెల్లాచెదరైన వారిలో కొందరు దేవుని వాక్కును యూదులకు మాత్రమే బోధించుచు ఫినీషియా, సైప్రసు, అంతియోకియాల వరకు వెళ్ళిరి.

20. కాని సైప్రసు, సిరేనినుండి వచ్చిన కొందరు అంతియోకియానకు వెళ్ళి ప్రభువైన యేసును గూర్చి గ్రీకులకును ప్రసంగింప మొదలిడిరి.

21. ప్రభువు హస్తము వారికి తోడైయుండెను. కనుక అనేకులు విశ్వసించి ప్రభువు వైపు తిరిగిరి. .

22. ఈ వర్తమానము యెరూషలేములోని క్రీస్తు సంఘమునకు తెలిసి వారు బర్నబాను అంతియోకియా నకు పంపిరి.

23. అతడు అక్కడకు వెళ్ళి దేవుని కృపను చూచి సంతోషించి, ప్రభువుయెడల హృదయ పూర్వకముగా విశ్వాసపాత్రులై ఉండుడని వారిని ప్రోత్సహించెను.

24. ఈ బర్నబా మంచివాడు. అతడు పవిత్రాత్మతోను, విశ్వాసముతోను నిండియుండెను. ప్రభువును విశ్వసించు వారి సంఖ్య అధికమయ్యెను.

25. పిదప బర్నబా సౌలును వెదకుటకై తార్సుకు వెళ్ళెను.

26. అక్కడ అతడు సౌలును కనుగొని అతనిని అంతియోకియానకు తీసికొనివచ్చెను. ఒక ఏడాది వారిద్దరు అచటి సంఘమును కలసికొని అనేకులకు బోధించిరి. అంతియోకియాలోనే శిష్యులు మొట్టమొదటి సారిగా 'క్రైస్తవులు' అని పిలువబడిరి.

27. ఆ రోజులలో " కొందరు ప్రవక్తలు యెరూషలేమునుండి అంతియోకియానకు పోయిరి.

28. వారిలో అగాబు అనువాడు లేచి నిలువబడి భూలోకమంతటను గొప్ప కరువు రానున్నదని ఆత్మ శక్తిచే ప్రవచించెను. ఆ కరువు కౌదియా చక్రవర్తి కాలములో సంభవించెను.

29. అందుచే శిష్యులు తమ శక్తి కొలది యూదయాలో నివసించుచున్న సోదరులకు సాయము పంపవలెనని నిర్ణయించు కొనిరి.

30. వారట్లు చేసి బర్నబా, సౌలుల ద్వారా ఆ డబ్బును సంఘపు పెద్దలకు పంపించిరి. 

 1. ఈ సమయములో హేరోదు రాజు సంఘములోని కొందరిని హింసింపసాగెను.

2. యోహాను సోదరుడగు యాకోబును అతడు కత్తితో చంపించెను.

3. ఇది యూదులను సంతోషపరచెనని తెలిసికొని అతడు పేతురును గూడ పట్టి బంధించెను. (ఇది పులియని రొట్టెల పండుగరోజులలో జరిగెను)

4. పేతురు బంధింపబడి చెరసాలలో పెట్టబడెను. జట్టుకు నలుగురు చొప్పున నాలుగు జట్ల సైనికులు అతనిని కాపలాకాయుచుండిరి. పాస్కపండుగ గడిచిన తరువాత హేరోదు అతనిని ప్రజల ఎదుటకు తీసికొని రాదలచెను.

5. అందువలన పేతురు చెరసాలలో ఉంచ బడెను. కాని సంఘము పేతురు కొరకు పట్టుదలతో దేవుని ప్రార్ధించుచుండెను."

6. హేరోదు అతనిని ప్రజల ఎదుటకు తీసికొని రాదలచిన నాటిముందటి రాత్రి పేతురు ఇద్దరు కావలి వారి మధ్య నిద్రించుచుండెను. అతడు రెండు గొలుసులతో బంధింపబడి ఉండెను. ఆ చెరసాల ముఖ ద్వారము వద్ద బంట్రోతులు కాపలా కాయుచుండిరి.

7. హఠాత్తుగా ప్రభువు దూత అక్కడ ప్రత్యక్షము కాగా, చెఱసాలయందలి గదిలో ఒక వెలుగు ప్రకాశించెను. ఆ దేవదూత పేతురు ప్రక్కను తట్టి, అతనిని మేల్కొలిపి, “త్వరగా లెమ్ము” అని పలికెను. వెంటనే అతని చేతి సంకెళ్ళు ఊడి క్రిందపడెను.

8. అప్పుడు ఆ దూత అతనితో, “నీవు నీ నడుము దట్టిని గట్టిగా బిగించి, నీ చెప్పులు తొడుగుకొనుము” అని చెప్పగా, పేతురు అట్లే చేసెను. మరల ఆ దూత, “నీ పై వస్త్రమును కప్పుకొని నాతో రమ్ము" అని పలుకగా, పేతురు దూత చెప్పినట్లు చేసి,

9. అతనిని అనుసరించి చెరసాల బయటకు వచ్చెను. దూత చేయుచున్న పని నిజమని తెలియక తాను ఒక దర్శనమును చూచుచున్నట్లు భావించెను.

10. వారు మొదటి కాపలాను పిమ్మట రెండవ కాపలాను దాటి నగరములోనికి పోవుటకు ఇనుప ద్వారము వద్దకు వచ్చిరి. వారు అచటకు వచ్చినపుడు ఆ ద్వారము దాని అంతట అది తెరవబడగా వారు బయటకుపోయిరి. అటుల వారు ఒక వీథిలో కొంతవరకు నడచిపోగా, ఆ దూత పేతురును విడిచి అదృశ్యుడయ్యెను.

11. అంతట పేతురు, తెలివి తెచ్చుకొని 'జరిగినది అంతయు వాస్తవము అని ఇప్పుడు నాకు రూఢిగా తెలియును. ప్రభువు తన దూతను పంపి హేరోదు బారినుండి, యూదా ప్రజలు నాకు తలపెట్టిన వానినన్నింటినుండి నన్ను తప్పించెను అని తెలిసికొంటిని' అనుకొనెను. .

12. అతడు అట్లు తెలిసికొని మార్కు అను మారుపేరు గల యోహాను తల్లియగు మరియమ్మ ఇంటికి పోయెను. అక్కడ చాలమంది ప్రజలు చేరి ప్రార్ధించు చుండిరి.

13. పేతురు బయట గుమ్మమువద్ద తలుపు తట్టుచుండగా రోదా అను సేవకురాలు తలుపు తీయుటకు వచ్చెను.

14. ఆమె పేతురు కంఠస్వరమును గుర్తించి, పట్టరాని సంతోషముతో తలుపు తెరువకయే మరల లోనికి పరుగెత్తుకొనిపోయి పేతురు బయట తలుపువద్ద నిలువబడియున్నాడు అని తెలియజేసెను.

15. “నీవు వెఱ్ఱిదానవు” అని లోపలివారు ఆ బాలికతో అనిరి. కాని ఆమె తాను చెప్పినది ముమ్మాటికి నిజమే అనెను. వారు 'అది. అతని దూతయై ఉండును' అని బదులు పలికిరి.

16. పేతురు ఇంకను తలుపు తట్టుచునే ఉండెను. వారు తలుపు తెరచి, పేతురును. చూచి అబ్బురపడిరి.

17. అతడు నిశ్శబ్దముగా ఉండుడని వారికి చేసైగ చేసెను. తరువాత ప్రభువు ఎట్లు తనను చెరసాలనుండి విడిపించెనో వారికి వివరించి చెప్పెను. “ఈ సంగతిని యాకోబునకు, సోదరులకును తెలియజేయుడు” అని చెప్పి వారిని వీడి వేరొక చోటికి వెళిపోయెను. "

18. తెల్లవారిన పిదప పేతురు ఏమయ్యెనో తెలియక కావలి వారిలో తీవ్రమైన కలవరము రేగెను.

19. హేరోదు పేతురును వెదకుటకై ఆజ్ఞను ఇచ్చెను. కాని పేతురును కనుగొనలేకపోయెను. కావున హేరోదు కావలివారిని ప్రశ్నించి వారు చంపబడవలెనని ఆజ్ఞాపించెను. పిమ్మట హేరోదు యూదయానుండి వెళ్ళి కైసరియాలో కొంతకాలము గడిపెను.

20. హేరోదుకు తూరు, సీదోను ప్రజలపై ఆగ్రహము కలిగినందున వారు గుంపుగా హేరోదు వద్దకు పోయిరి. మొదట వారు రాజభవనముపై అధికారి అగు బ్లాస్తుని తమ పక్షమున చేర్చుకొని హేరోదు వద్దకు వెళ్ళి, అతనితో సంధిచేసికొన గోరిరి. ఏలయన, వారి దేశము ఆహార పదార్థముల సరఫరాకై హేరోదు రాజ్యముపై ఆధారపడియుండెను.

21. ఒక నిర్ణీత దినమున హేరోదు , రాజ వస్త్రములను ధరించి, సింహాసనముపై కూర్చుండి ప్రసంగించెను.

22.. ప్రజలు అది విని, “ఇది దేవుని స్వరము, మానవులది కాదు” అని బిగ్గరగా పలికిరి.

23. హేరోదు దేవుని మహిమపరచనందున ప్రభువు దూత వెంటనే అతనిని మొత్తెను. అందువలన అతడు పురుగులు పడి చనిపోయెను.

24. దేవుని వాక్యము అంతటను వ్యాపించుచు వృద్ధియగుచుండెను.

25. బర్నబా, సౌలులు తమపనిని పూర్తిచేసుకొని మార్కు అను మారు పేరుగల యోహానును వెంట బెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వెళ్లిరి. 

 1. అంతియోకియాలోని క్రైస్తవ సంఘమున కొందరు ప్రవక్తలు, బోధకులు ఉండిరి. వారు ఎవరనగా: బర్నబా, నీగెరు అని పిలువబడు చుండిన సిమియోను, సిరేనీయుడైన లూసియా, పాలకుడగు హేరోదుతో కూడ పెంచబడిన మనాయేను, సౌలు.

2. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయు చుండగా పవిత్రాత్మవారితో, “నేను నియమించిన పనికై బర్నబాను, సౌలును నాకొరకు ప్రత్యేకింపుడు” అని పలికెను.

3. వారు ఉపవాసము చేసి, ప్రార్ధించి వారిపై చేతులు ఉంచి, వారిని పంపివేసిరి.

4. పవిత్రాత్మచే పంపబడిన బర్నబాను, సౌలును సెలూసియాకు వెళ్ళి అక్కడనుండి ఓడనెక్కి పయనించి, సైప్రసుకు వచ్చిరి.

5. వారు సలామిసు చేరుకొని అక్కడ యూదుల ప్రార్ధనామందిరములలో దేవుని వాక్యమును బోధించిరి. యోహాను అను ఉపచారకుడు వారికి తోడ్పడుచుండెను.

6. వారు ఆ దీవిని అంతటిని పర్యటించి పాఫోసు వరకు వెళ్ళిరి. అక్కడ వారు 'బారుయేసు' అని పిలువ బడిన ఒక మాంత్రికుని కలిసికొనిరి. అతడు యూదుడు. తానొక ప్రవక్తనని చెప్పుకొనుచుండెను.

7. ఆ దీవిని పాలించువాడును, వివేకవంతుడును అయిన సెర్జియ పౌలునకు అతడు మిత్రుడు. ఆ పాలకుడు దేవుని వాక్యమును వినగోరి బర్నబాను, సౌలును తన యొద్దకు పిలిపించుకొనెను.

8. కాని మాంత్రికుడైన ఎలిమా (ఎలిమా అనగా మాంత్రికుడు అని అర్థము) వారిని ఎదిరించెను. వాడు ఆ పాలకుని విశ్వాసము నుండి మరలింప ప్రయత్నించెను.

9. అప్పుడు పౌలు అని పిలువబడుచున్న సౌలు పవిత్రాత్మతో నిండినవాడై సూటిగా మాంత్రికుని వంకచూచి,

10. "సైతాను పుత్రుడా! నీవు అన్ని విధములైన కపటములతోను, మోసములతోను నిండియున్నావు. నీతికి నీవు విరోధివి. ప్రభువు ఋజుమార్గములను వక్రగతులు పట్టించుట నీవు మానవా?

11. ఇప్పుడు ప్రభువు హస్తము నీపై పడనున్నది. నీవు కొంతకాలము వరకు గ్రుడ్డివాడవై సూర్యకాంతిని చూడలేకపోవుదువు” అని పలికిన వెంటనే అతని కన్నులకు మంచుతెర, చీకటి పొర క్రమ్మెను. అందుచే అతడు తన చేయిపట్టుకొని నడిపించు కొని పోవువారికై చుట్టును తారాడు చుండెను.

12. దానిని చూచి ఆ పాలకుడు విశ్వసించి ప్రభువును గురించిన బోధను విని మిక్కిలి ఆశ్చర్య పడెను.

13. పౌలును అతని తోటివారును పాఫోసునుండి సముద్రయానము చేసి, పంఫీలియాలోని పెర్గాకు వచ్చిరి. కాని యోహాను వారిని అక్కడ దిగవిడిచి, యెరూషలేమునకు తిరిగిపోయెను.

14. వారు పెర్గానుండి పిసీదియా యందలి అంతియోకియాకు వెళ్ళిరి. అక్కడ వారొక విశ్రాంతిదినమున ప్రార్ధనా మందిరము లోనికి పోయి కూర్చుండిరి.

15. మోషే ధర్మశాస్త్రమునుండి ప్రవక్తల రచనలనుండి పఠనము అయిన తదుపరి ప్రార్థనామందిరపు అధికారులు, “సోదరులారా! ప్రజలను ప్రోత్సహించు సందేశమేమైన ఉన్నచో దానిని వినిపింపుడు” అని వర్తమానము పంపిరి.

16. అప్పుడు పౌలు నిలిచి నిశ్శబ్దముగా ఉండుడని వారికి చేసైగ చేసి, ప్రసంగింప నారంభించెను: “యిస్రాయేలు ప్రజలారా! దేవుని యందు భయభక్తులు గలవారలారా! వినుడు.

17. ఈ యిస్రాయేలు ప్రజల దేవుడు మన పితరులను ఎన్నుకొని వారు ఐగుప్తుదేశములో ఉన్నప్పుడు వారిని గొప్పవారిని చేసెను. పిదప దేవుడు వారిని తన గొప్ప శక్తిచే ఐగుప్తునుండి బయటకు తీసికొనివచ్చెను.

18. ఎడారిలో నలువదియేండ్లు వారిని సహించెను.

19. “ఆయన కనాను సీమలో ఏడు జాతుల వారిని నాశనము చేసి నాలుగువందల ఏబదియేండ్ల వరకు ఆ భూమిని వారికి వారసత్వముగా ఇచ్చెను.

20. తదుపరి సమూవేలు ప్రవక్త కాలము వరకు వారికి ఆయన న్యాయాధిపతులను ఒసగెను.

21. రాజు కావలెనని వారు కోరినపుడు బెన్యామీను తెగకు చెందిన కీసు కుమారుడైన సౌలును నలువది సంవత్సరములు రాజుగా ఉండుటకై ఆయన వారికి ఇచ్చెను.

22. అతనిని తొలగించిన తరువాత, దేవుడు దావీదును వారికి రాజుగా చేసెను. దేవుడు అతనిని గురించి చెప్పిన దేమన: 'యీషాయి కుమారుడైన దావీదు నాకు ప్రియమైనవాడని కనుగొంటిని. ఏలయన, అతడు నా చిత్తమును సంపూర్ణముగ నెరవేర్చును'.

23. దేవుడు తాను వాగ్దానము చేసిన ప్రకారముగా దావీదు వంశీయుడైన యేసును యిస్రాయేలు ప్రజలకు రక్షకునిగా చేసెను.

24. యేసు రాకడకు పూర్వము పాపములనుండి మరలి బప్తిస్మమును పొందుడు అని యోహాను యిస్రాయేలు ప్రజలందరకు బోధించెను.

25. మరియు యోహాను తన పనిని ముగించుచు, జనులతో, “నేను ఎవరినని మీరు తలంచుచున్నారు? మీరు ఎదురుచూచుచున్న వ్యక్తిని నేను కాను. ఇదిగో! ఆయన నా తరువాత రాబోవుచున్నాడు. ఆయన కాలిచెప్పులను విప్పుటకైనను నేను యోగ్యుడను కాను” అనెను.

26. "సోదరులారా! అబ్రహాము వంశస్థులారా! దేవునియందు భయభక్తులు కలిగినవారలారా! ఈ రక్షణ సందేశము పంపబడినది మన కొరకే.

27. ఏలయన, యెరూషలేములో నివసించు ప్రజలు, వారి నాయకులు ఆయన రక్షకుడని గ్రహింపలేదు. వారు ప్రతి విశ్రాంతిదినమున చదువబడుచున్న ప్రవక్తల వచనములను అర్థము చేసికొనలేదు. అంతియేగాక వారు యేసును శిక్షించుట ద్వారా ప్రవక్తల ప్రవచనములను ధ్రువపరచిరి.

28. మరియు మరణశిక్షకు తగిన కారణమేదియు కనబడకున్నను, ఆయనను చంపింపవలసినదిగా వారు పిలాతును కోరిరి.

29. ఆయనను గురించి వ్రాయబడినది అంతయు వారు చేసిన పిమ్మట, వారు ఆయనను “మ్రానుమీదినుండి దించి సమాధిలో ఉంచిరి.

30. కాని, దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను.

31. మరియు చాల రోజుల వరకు గలిలీయనుండి యెరూషలేము వరకు తనతో ప్రయాణము చేసిన వారందరకు ఆయన కనబడెను. ఇప్పుడు వారు ఆయనను గూర్చి ప్రజల ఎదుట సాక్షులై ఉన్నారు.

32. ఇప్పుడు మీకు ఈ శుభవర్తమానమును ఇచ్చుచున్నాము. దేవుడు మన పూర్వులకు చేసిన వాగ్దానమును,

33. వారి సంతతివారమైన మన కొరకు ఇప్పుడు యేసును సజీవుడుగా లేపుటవలన నెరవేర్చియున్నాడు. రెండవ కీర్తనలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది: 'నీవు నా కుమారుడవు, ఈ దినమున నేను నిన్ను కంటిని.”

34. మరల ఎన్నటికిని క్రుళ్ళి నశించిపోవు స్థితికి రానీయక, ఆయనను మృతులలోనుండి లేపుటను గురించి దేవుడు చెప్పినది ఏమన: “నేను దావీదుకు వాగ్దానము చేసిన, పవిత్రమైన, నిశ్చయమైన ఆశీర్వాదములను మీకు ఇచ్చెదను.'

35. మరియొకచోట ఆయన చెప్పినది ఏమన: 'నీవు నీయందు భక్తి గల సేవకుని . క్రుళ్ళి నశించిపోనీయవు'.

36. “ఏలయన, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరమువారికి సేవచేసి మరణింపగా అతడును, అతని పూర్వుల దగ్గరనే సమాధి చేయబడి క్రుళ్ళిపోయెను.

37. కాని దేవునిచే మృతులలోనుండి లేపబడినవాడు క్రుళ్లిపోలేదు.

38. సోదరులారా! యేసు ద్వారానే పాప క్షమాపణను గూర్చిన సందేశము మీకు ప్రకటింపబడినదని మీరు అందరు నిజముగా తెలిసికొనవలయును.

39. మోషే చట్టమువలన ఏ విషయములలో మీరు నీతిమంతులుగా తీర్చబడలేక పోతిరో ఆ విషయములన్నింటిలో, విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడునని మీరు తెలుసుకొనుడు!

40. ప్రవక్తలు చెప్పినది మీకు జరుగకుండునట్లుగా జాగ్రత్తపడుడు. అదేమనగా,

41. 'నిరసించెడి వారలారా! ఆశ్చర్యపడుడు, నాశనము చెందుడు. ఏలయన, మీ కాలములో నేను ఒక పనిని చేయుదును. దానిని గూర్చి ఎవరు వివరించినను, మీరు విశ్వసింపరు.' "

42. వారు ప్రార్థనామందిరమును విడిచిపోవునపుడు ఇంకను ఈ విషయములను గురించి తెలియ జెప్పుటకై, మరుసటి విశ్రాంతి దినమున తిరిగి రండని, ఆ ప్రజలు వారిని అర్థించిరి.

43. సమావేశము ముగిసిన తరువాత చాలమంది యూదులు, యూద మతమును స్వీకరించినవారు, పౌలును, బర్నబాను అనుసరించిరి. అపోస్తలులు వారితో సంభాషించి, దేవుని కృపయందు జీవింపుడని వారిని ప్రోత్సహించిరి.

44. మరుసటి విశ్రాంతిదినమున దాదాపు పట్టణములోని ప్రతివ్యక్తియు ప్రభువు వాక్కును వినుటకు వచ్చెను.

45. ఆ జనసమూహమును చూచినప్పుడు, యూదులకు అసూయచే కన్నుకుట్టెను. అందుచే వారు పౌలు మాటలకు విరుద్ధముగా మాట్లాడుచు ధిక్కరించిరి.

46. అయినను పౌలు, బర్నబా మిక్కిలి ధైర్యముతో ఎలుగెత్తి ఇట్లనిరి: “దేవుని వాక్కు మొదట మీకు చెప్పబడవలసియుండెను. కాని మీరు దానిని తిరస్కరించి మిమ్ము మీరు నిత్యజీవ మునకు అయోగ్యులనుగా చేసికొనుటచే మేము మిమ్ము విడిచి అన్యులయొద్దకు వెళ్ళుచున్నాము.

47. ఏలయన, ప్రభువు మాకు ఈ ఆజ్ఞను ఇచ్చియున్నాడు: 'మీరు అన్యులకు వెలుగైయుండుటకును, ప్రపంచమంతటికిని రక్షణమార్గమై యుండుటకును నేను మిమ్ములను , నియమించియున్నాను.. ”

48. అన్యులు దీనిని విని ఎంతో సంతోషించి, దేవుని వాక్కును ప్రస్తుతించిరి. నిత్యజీవమునకు నియమితులైన వారందరు విశ్వాసులైరి.

49. ప్రభువు వాక్కు ఆ ప్రదేశములందంతటను వ్యాప్తి చెందెను.

50. యూదులు గొప్పవర్గమునకు చెందిన భక్తులగు స్త్రీలను, ఆ నగరములోని ప్రముఖులను వారిద్దరిపైకి పురికొల్పిరి. అందుచే వారు పౌలునకు, బర్నబాకు విరుద్ధముగా హింసాకాండను ప్రారంభించి వారిని ఆ ప్రాంతమునుండి తరిమివేసిరి.

51. అపోస్తలులు తమ కాలిధూళిని వారికి నిరసనగా దులిపివేసి, ఇకోనియాకు వెళ్ళిరి.

52. శిష్యులు సంతోషముతోను, పవిత్రాత్మతోను నిండియుండిరి. 

1. ఇకోనియాలో కూడ అట్లే జరిగెను. పౌలు, బర్నబా యూదుల ప్రార్థనామందిరములో ప్రవేశించి బోధించినందున ఎందరో యూదులును, గ్రీసు దేశస్తులును విశ్వసించిరి.

2. కాని విశ్వసింపని యూదులు సోదరులకు విరుద్ధముగా అన్యులను పురికొల్పి వారి మనస్సులను మార్చివేసిరి.

3. అపోస్తలులు చాలకాలము అక్కడనే ఉండి, ప్రభువును గూర్చి ధైర్యముగా బోధించిరి. ఆయన సూచక క్రియలను, ఆశ్చర్యకార్యములను చేయుటకు వారికి శక్తి నిచ్చి తన అనుగ్రహమును వెల్లడించువారి సందేశము నిజమేయని రుజువుపరచెను.

4. నగరములోని జనులు కొందరు యూదుల పక్షమున, మరి కొందరు అపోస్తలుల పక్షమునుచేరి రెండు వర్గములుగా చీలిపోయిరి.

5. అప్పుడు అన్యులు, యూదులు ఇరువురును వారి నాయకులతో కలసి అపోస్తలులను బాధించి రాళ్ళతో కొట్టుటకు ప్రయత్నించిరి.

6. అపోస్తలులు ఈ విషయమును తెలిసికొని లికోనియాలోని పట్టణ ములైన లిస్తా, దెర్బె మరియు చుట్టుపట్టు ప్రాంతముల కును పారిపోయి,

7. అక్కడ సువార్తను బోధించిరి.

8. లిస్త్రాలో నడువశక్తిలేని కుంటివాడు ఒకడు కూర్చుండియుండెను. అతడు పుట్టుకతోనే కుంటివాడు. ఎన్నడును నడువలేదు.

9. అతడు పౌలు మాటలను ఆలకించుచుండెను. పౌలు వానిని గమనించి ఆరోగ్యము పొందదగిన విశ్వాసము గలవాడని గ్రహించియుండుటచే సూటిగా వానివంక చూచి,

10. “నీవు లేచి నీ కాళ్ళపై నిలువబడుము” అని బిగ్గరగా పలికెను. వెంటనే అతడు గంతులు వేసి నడువనారంభించెను.

11. పౌలు చేసిన ఆ పనిని చూచి అక్కడ జనసమూహములు “దేవుళ్ళు ఈ మనుష్యుల రూపములో మన వద్దకు దిగివచ్చిరి" అని లికోనియా భాషలో బిగ్గరగా అరవ నారంభించిరి.

12. అప్పుడు వారు బర్నబాకు 'ద్యుపతి' అనియు, పౌలు ప్రధాన ఉపదేశకుడు కావున అతనికి 'హెర్మే' అనియు పేర్లు పెట్టిరి.

13. ఆ పట్టణమునకు ఎదురుగా బృహస్పతి ఆలయము ఒకటి కలదు. అచటి పూజారి వట్టణ ముఖద్వారమువద్దకు గిత్తలను, పూల మాలలను తీసికొనివచ్చి జనులతో కలిసి బలిని అర్పింపతలచెను.

14. అది విని బర్నబా, పౌలులు తమ దుస్తులను చింపుకొని, జనసమూహము మధ్యకు పరుగెత్తు కొనివచ్చి,

15. “ఓ ప్రజలారా! మీరు ఎందులకిట్లు చేయుచున్నారు? మేము కూడ మీ వలే మానవమాత్రులమేగదా! ఆకాశమును, భూమిని, సముద్రమును వానిలో ఉండు సమస్తమును సృష్టించిన సజీవుడైన దేవుని వైపునకు ఈ ప్రయోజనము లేని మూఢాచారములనుండి మిమ్మును మరలించి, సువార్తను మీకు ప్రకటించుటకు మేమిచ్చటకు వచ్చి ఉన్నాము.

16. "పూర్వకాలములో దేవుడు సమస్త జాతులనువారి ఇష్టానుసారము జీవింపనిచ్చెను.

17. ఆయన ఆకాశమునుండి వర్షమునొసగి సకాలములో పంటలను పండించి మీకు ఆహారమునిచ్చి, మీ హృదయములను ఆనందముతో నింపుట మొదలగు మేలులు చేయుట ద్వారా తనకు తాను సాక్ష్యమును ఇచ్చియుండెను” అని ఎలుగెత్తి పలికిరి.

18. ఈ మాటలతో అపోస్తలులు ఆజనసమూహములను తమకు బలి నర్పించు యత్నము నుండి అతికష్టము మీద మరల్పగలిగిరి.

19. అంతియోకియానుండి, ఇకోనియానుండి వచ్చిన యూదులు కొందరు ఆ జనసమూహములను తమ కైవనము గావించుకొని, పౌలును రాళ్ళతో కొట్టి అతడు మరణించియుండెనని భావించి, పట్టణము బయటకు ఈడ్చివేసిరి.

20. కాని శిష్యులు అతని చుట్టును చేరగా, అతడు లేచి పట్టణములోనికి వెళ్ళెను. మరునాడు అతడు బర్నబాతో దెర్బెకు ప్రయాణమై పోయెను.

21. పౌలు, బర్నబా దెర్బెలో సువార్తను బోధించి, అనేకులను తమ శిష్యులుగా చేసికొనిరి. వారు తిరిగి లిస్త్రాకు, ఇకోనియాకు, పిసీడియాలోని అంతియోకియానకు పోయిరి.

22. అక్కడ శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలెనని వారిని ప్రోత్సహించిరి. “మనము దేవుని రాజ్యములో ప్రవేశించుటకు పెక్కు శ్రమలను అనుభవింపవలెను” అని వారికి బోధించిరి.

23. ప్రతి క్రీస్తు సంఘము నందును వారు పెద్దలను నియమించి, వారు విశ్వసించిన ప్రభువునకు ప్రార్ధనలతోను, ఉపవాసములతోను వారిని అప్పగించిరి.

24. పిసీదియా భూభాగము మీదుగా పోవుచు, వారు పంఫీలియాకు వచ్చిరి.

25. పెర్గాలో దేవుని వాక్కును బోధించి, అతాలియాకు వెళ్ళిరి.

26. అక్కడ నుండి ఓడనెక్కి అంతియోకియాకు తిరిగివచ్చిరి. వారు నెరవేర్చిన పనికై ఇంతకు ముందు దేవుని అనుగ్రహము నకు అప్పగింపబడిన స్థలము ఇదియే.

27. వారు అంతియోకియానకు చేరుకొని అక్కడి క్రీస్తు సంఘములోని ప్రజలను ఒకచోట ప్రోగుచేసి, దేవుడు వారితో ఉండి చేసినదంతయు, అన్యులు విశ్వసించుటకు, ఆయన ద్వారమును ఎట్లు తెరచిన దియు వారికి తెలియజేసిరి.

28. అక్కడ వారు ఆ విశ్వాసులతో చాలకాలము ఉండిరి.  

 1. యూదయానుండి కొందరు మనుష్యులు అంతియోకియానకు వచ్చి, సోదరులకు, “మోషే చట్ట ప్రకారము సున్నతి పొందిననే తప్ప మీకు రక్షణ లేదు” అని బోధింపసాగిరి.

2. ఈ విషయమును గూర్చి వారికిని, పౌలు, బర్నబాలకును తీవ్రమైన వాదప్రతి వాదములు జరిగెను. అందుచే పౌలు, బర్నబా, మరికొందరు, యెరూషలేమునకు వెళ్ళి ఈ విషయమును గురించి అపోస్తలులతోను, పెద్దలతోను మాట్లాడవలెనని నిశ్చయించిరి.

3. క్రైస్తవ సంఘముచే పంపబడి, వారు ఫినీషియా, సమరియాల మీదుగా వెళ్ళి అన్యులు దేవుని పక్షమున చేరిన విషయమును వారికి తెలియపరచిరి. ఈ వర్తమానము సోదరులకందరకు చాల సంతోషమును కలిగించెను.

4. వారు యెరూషలేమునకు చేరుకొనగానే క్రైస్తవసంఘము, అపోస్తలులును, పెద్దలును వారికి స్వాగతమిచ్చిరి. దేవుడు తమతో ఉండి, చేసినదంతయు వారు వీరికి తెలిపిరి.

5. కాని పరిసయ్యుల పక్షమునకు చెందిన కొందరు విశ్వాసులు లేచి, “వారు సున్నతి చేయించు కొనవలెను. మోషే చట్టమునకు విధేయత చూప వలెను” అని పలికిరి.

6. అందుచే అపోస్తలులును, పెద్దలును ఈ సమస్యను గురించి ఆలోచించుటకు సమావేశమైరి.

7. పెద్ద చర్చ జరిగిన పిదప పేతురు నిలువబడి, “సోదరులారా! అన్యులు సువార్తా సందేశమును విని విశ్వసించుటకు, వారికి ప్రసంగించుటకై ఆరంభముననే దేవుడు నన్ను మీనుండి ఎన్నుకొనెనని మీకు తెలియును.

8. మానవుల హృదయములను ఎరిగిన దేవుడు తాము మనకు ఒసగినట్లే అన్యులకును పవిత్రాత్మను ప్రసాదించుట ద్వారా, తన సమ్మతిని వెలిబుచ్చియున్నాడు.

9. మనకును, వారికిని మధ్య ఎట్టి భేదమును ఆయన చూపలేదు. వారు విశ్వసించిరి. కనుక వారి విశ్వాసమును బట్టి వారి హృదయములను శుద్ది చేసెను.

10. కనుక మనముగాని, మన పూర్వీకులుగాని మోయలేని కాడిని విశ్వాసులపై మోపి, మీరు ఎందుకు దేవుని ఇప్పుడు పరీక్షింప ప్రయత్నించెదరు?

11. ప్రభువైన యేసు అనుగ్రహము వలన రక్షింపబడుదుమని మనము విశ్వసింతుము. అట్లే వారును రక్షణము పొందుదురు” అనెను.

12. అన్యుల మధ్య దేవుడు తమ ద్వారా చేసిన సూచకక్రియలను ఆశ్చర్యకార్యములను గూర్చి బర్నబా, పౌలులు తెలియజెప్పగా, ఆ సభ అంతయు విని కిమ్మనకుండెను.

13. మాట్లాడుట పూర్తియైన పిదప యాకోబు లేచి, “సోదరులారా! ఆలకింపుడు.

14. ఎట్లు దేవుడు మొదట అన్యులపై శ్రద్ధచూపి, అందు కొందరను తన సొంత ప్రజలుగా చేసికొనెనో సీమోను వివరించియున్నాడు.

15. ప్రవక్తల ప్రవచనములు ఈ విషయమున పూర్తిగా సరిపోవుచున్నవి. ఏలయన, ఇట్లు వ్రాయబడినది:

16. 'దీని తరువాత నేను మరల వచ్చి, పడిపోయిన దావీదు గుడారమును లేపెదను. దాని శిథిలములను కూడదీసి, మరల దానిని నిర్మించెదను.

17. నేను నా సొంత జనులై యుండుటకు పిలిచియున్న సమస్త జాతులును, తదితర ప్రజలందరును ప్రభువును వెదకెదరు.

18. ప్రారంభముననే దీనిని తెలియజేసిన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు.'

19. “ఇది నా అభిప్రాయము, కావున దేవుని వైపునకు మరలుచున్న అన్యులను కష్టపెట్టరాదు.

20. దీనికి బదులు, విగ్రహములకు అర్పింపబడుటచే అపరిశుద్ధమగు ఎట్టి ఆహారమును భుజింపరాదనియు, జారత్వమునకు దూరముగా ఉండవలెననియు, గొంతు పిసికి చంపిన ఏ జంతువును తినరాదనియు,రక్తమును తాగరాదనియు, వారికి మనము వ్రాయవలయును.

21. ఏలయన, ప్రతి విశ్రాంతిదినమున ప్రార్థనా మందిరములలో చాలకాలమునుండి మోషేధర్మ శాస్త్రము చదువబడుచుండెను. మరియు అతని వాక్కులు ప్రతి పట్టణమునందును ప్రసంగింపబడు చున్నవి” అని పలికెను.

22. అప్పుడు అపోస్తలులు, పెద్దలు క్రీస్తు సంఘములోని వారందరితో కలసి వారిలోనుండి కొందరను ఎన్నుకొని, పౌలు, బర్నబాలతో అంతియోకియానకు పంప నిశ్చయించుకొనిరి. సోదరులలో గొప్పగా గౌరవింపబడు బర్నబాసు అనబడు యూదాసును, సిలాసును వారు ఎన్నుకొనిరి.

23. వారు వారికి ఇట్లు వ్రాసి పంపిరి: “అంతియోకియా, సిరియా, సిలీషియాలలో నివసించుచున్న అన్యులగు సోదరులకందరకు, సోదరులము, అపోస్తలులము, పెద్దలము అయిన మేము శుభాకాంక్షలు పంపుచున్నాము.

24. మా సంఘములోని వారు కొందరు మీ వద్దకు వచ్చి, మీకు ఏదో చెప్పి, మిమ్ము కష్టపెట్టి కలవర పెట్టిరని మేము వినియున్నాము. దీనిని గూర్చి వారు ఏ మాత్రము మా ఉత్తరువులను పొందియుండలేదు.

25. అందుచే మేమందరము సంప్రదించి అందరి అంగీకారముతో కొందరు రాయబారులను ఎన్నుకొని, మీ వద్దకు పంపదలచితిమి.

26. మన ప్రభువైన యేసుక్రీస్తు సేవలో తమ జీవితములను అర్పించుటకు సాహసించిన మా ప్రియమిత్రులగు బర్నబా, పౌలులతో వారు వచ్చెదరు.

27. మేము యూదాసును, సిలాసును మీ వద్దకు పంపుచున్నాము. మేము వ్రాయుచున్న విషయము లను స్వయముగా వీరే మీకు చెప్పెదరు.

28. ఎందుకనగా, ఈ అవసరమైన నియమములు తప్ప వేరే భారమును దేనిని మీపై పెట్టరాదని పవిత్రాత్మకును, మాకును తోచినది.

29. కనుక విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును మీరు భుజింపకుడు. రక్తపానము చేయకుడు. గొంతు పిసికి చంపిన జంతువును భుజింపకుడు. జారత్వమునకు దూరముగా ఉండుడు. ఈ పనులు మీరు చేయకుండుట మీకు మేలు. మీకు శుభమగుగాక!”

30. ఆ రాయబారులు అంతియోకియానకు పంపబడిరి. వారు అక్కడ విశ్వాసులసంఘమునంతటిని సమావేశపరచి, వారికి ఆ లేఖను అందించిరి.

31. ఆ ప్రజలు ఉత్తరమును చదువుకొని, ప్రోత్సాహకరమైన ఆ సందేశము వలన ఆనందభరితులైరి.

32. యూదాసు, సిలాసు ప్రవక్తలై ఉండుటచే వారికి ధైర్యమును, బలమును ఇచ్చుచు, ఎంతో కాలము వారితో ముచ్చటించిరి.

33. కొంత కాలము అక్కడ గడిపిన పిదప సోదరులు వారిని ప్రశాంతముగా సాగనంప, వారు తిరిగి వారిని పంపినవారి యొద్దకు వెళ్ళిరి.

34. కాని సిలాను అక్కడే ఉండుటకు నిశ్చయించుకొనెను.

35. పౌలు, బర్నబాలు అంతియోకియాలో కొంతకాలము గడిపి, ఇతరులతో కలిసి ప్రభువు వాక్కును బోధించుచుండిరి.

36. తరువాత పౌలు బర్నబాతో “మనము ప్రభువు వాక్కును గూర్చి ప్రసంగించిన ప్రతి పట్టణమునకు, మరలపోయి అక్కడ మన సోదరులు ఎట్లు ఉన్నారో చూతము” అనెను.

37. బర్నబా తమతో మార్కు అను మారుపేరు గల యోహానును తీసికొనిపోగోరెను. కాని, పౌలు అతనిని తీసికొని పోవుట మంచిదికాదని తలంచెను.

38. ఏలయన, వారి సువార్తా ప్రచారములో అతడు చివరి వరకు వారితో ఉండక, వారిని పంఫీలియాలో విడిచిపెట్టి వెనుకకు మరలిపోయెను.

39. అందుచేత వారిద్దరి మధ్య ఈ విషయముపై తీవ్రమైన తర్జనభర్జనలు జరిగెను. కనుక వారు విడిపోయిరి. బర్నబా మార్కును తీసికొని ఓడనెక్కి సైప్రసునకు పోయెను,

40. పౌలు సిలాసును ఎన్నుకొని, సోదరులచే దేవుని కృపకు అప్పగింపబడి ఆ ప్రాంతమును విడిచి,

41. సిరియా, సిలీషియా మీదుగా వెళ్ళుచు, అక్కడ ఉన్న క్రీస్తు సంఘములను బలపరచెను. 

 1. పౌలు దెర్బె, లిస్తాలకు ప్రయాణము చేసెను. అక్కడ తిమోతి అను పేరుగల శిష్యుడు ఒకడు ఉండెను. అతని తల్లికూడ విశ్వాసురాలే. ఆమె యూదా జాతికి చెందినది. కాని అతని తండ్రి గ్రీసు దేశస్థుడు.

2. లిస్త్రా, ఇకోనియాలలో ఉన్న సోదరులకు తిమోతి యెడల సద్భావము ఉండెను.

3. పౌలు, తిమోతిని తన వెంట తీసికొనిపోదలచి . అతనికి సున్నతి కావించెను. ఏలయన, తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రాంతములలో ఉన్న యూదులకు తెలియును.

4. వారలు ఆ పట్టణముల మీదుగా పోవుచు యెరూషలేములోని అపోస్తలులచేత, పెద్దలచేత నిర్ణయింపబడిన నిబంధనలను వారికి తెలియజేసి, వాటిని పాటింపవలెనని చెప్పిరి.

5. కనుక, అక్కడ ఉన్న క్రైస్తవ సంఘములు విశ్వాసమునందు దృఢపడి దిన దినాభివృద్ధి చెందుచుండెను.

6. వారు ఉగియా, గలతియా ప్రాంతముల మీదుగా పయనించిరి. పవిత్రాత్మ వారిని ఆసియా మండలములో దేవుని సందేశమును వినిపింపనీయ లేదు.

7. వారు మిసియా సరిహద్దును చేరుకొని, బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నించిరి. కాని యేసు ఆత్మ వారికి అనుమతిని ఈయలేదు.

8. అందుచే వారు కుడివైపుగా, మిసియా మీదుగా పయనించి, త్రోయకు పోయిరి.

9. ఆ రాత్రి పౌలుకు ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో, మాసిడోనియా మనుష్యుడొకడు కనిపించి, “మాసిడోనియాకు వచ్చి, మాకు సహాయపడుడు” అని పౌలును బ్రతిమాలు కొనెను.

10. ఈ దర్శనము కలిగిన వెంటనే, మేము మాసిడోనియాకు పోవుటకు సిద్ధపడితిమి. ఏలయన, అక్కడ ఉన్న ప్రజలకు సువార్తను ప్రకటించుటకు దేవుడు మమ్ములను పిలిచెనని మేము నిశ్చయించుకొంటిమి.

11. మేము ఆ ప్రాంతమును వీడి, త్రోయలో ఓడనెక్కి తిన్నగా సమోత్రాకు పయనించితిమి, మరునాడు నెయాపొలికి వెళ్ళితిమి.

12. అక్కడ నుండి, మాసిడోనియాయొక్క మొదటి మండలములోని నగరమైన ఫిలిప్పీకి వెళ్ళితిమి. అది రోమీయులకు ప్రవాసస్థానముగ ఉండెను. ఆ నగరములో మేము కొన్నిదినములు గడిపితిమి.

13. ఒక విశ్రాంతి దినమున ఆ నగరము వెలుపలనున్న నదీతీరమున ప్రార్థన జరుగునని తెలిసికొని అచటకి వెళ్ళి కూర్చుండి అక్కడకు వచ్చిన స్త్రీలతో మాట్లాడితిమి.

14. మా బోధలు విన్న వారిలో తియతైర నగరమునుండి వచ్చిన లిదియా అను స్త్రీ గలదు. ఆమె ధూమ్రవర్ణము గల వస్తువులను అమ్ముకొను వ్యాపారస్థురాలు, దైవభక్తురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరచి, పౌలు బోధను సావధానముగా వినునట్లు చేసెను.

15. అప్పుడు ఆమెయు, ఆమె ఇంటివారలును, జ్ఞాన స్నానమును పొందిరి. “నేను ప్రభువునందు నిజమైన విశ్వాసముగలదాననని, మీరు నిశ్చయించియున్నచో, మా ఇంటికి వచ్చి బసచేయుడు” అని ఆమె ప్రాధేయ పడగా మేము అందులకు సమ్మతించితిమి.

16. ఒకనాడు మేము ప్రార్థనాస్థలమునకు వెళ్ళుచున్నప్పుడు ఒక బానిస బాలికను కలిని కొంటిమి. ఆమె భూతావిష్ణురాలై సోదెచెప్పుచు తన యజమానులకు చాల డబ్బు సంపాదించి పెట్టు చుండెను.

17. ఆమె పౌలును, మమ్మును వెంబడించి, “ఈ మనుష్యులు మహోన్నతుడైన సర్వేశ్వరుని సేవకులు. మీరు ఎట్లు రక్షింపబడగలరో, వీరు మీకు తెలియజేయుదురు” అని బిగ్గరగా అరచుచుండెను.

18. ఆమె చాల రోజులు అట్లే అరచుచుండెను. పౌలు విసుగుచెంది వెనుకకు తిరిగి, “యేసుక్రీస్తు నామమున, నీవు ఈమెనుండి వెడలిపొమ్ము అని నేను ఆజ్ఞాపించు చున్నాను” అని ఆ దయ్యముతో చెప్పగా తక్షణమే అది ఆమెను వీడిపోయెను.

19. అందుచే, అప్పుడు ఆమె యజమానులు దీని వలన ఇక తాము డబ్బు సంపాదించు అవకాశము పోయెనని తెలిసికొని, పౌలును సిలాసును పట్టుకొని, ప్రజాన్యాయస్థానము లోని అధికారుల వద్దకు ఈడ్చుకొనిపోయిరి.

20. వారు, వారిని న్యాయమూర్తుల సమక్షమునకు తెచ్చి, “యూదులైన వీరు, మన వగరములోని కలతలకు కారకులైయున్నారు.

21. వీరు మన చట్టమునకు విరుద్దమైన ఆచారములను ప్రచారము చేయుచున్నారు. మనము రోమీయులము కనుక ఆచారములను అనుసరింపలేము” అని ఫిర్యాదు చేసిరి.

22. అపుడు జనసమూహమును, వారితో కలిసి, వీరికి వ్యతిరేకముగా లేచిరి. ఆ న్యాయమూర్తులు పౌలు, సిలాసుల దుస్తులను చింపివేసి, వారిని బెత్తముతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి.

23. అట్లు క్రూరముగా కొట్టిన పిమ్మట, వారిని చెరలోనికి నెట్టిరి. తాళము గట్టిగా బిగింపుమని చెరసాల అధికారికి ఆజ్ఞాపించిరి.

24. ఈ ఆజ్ఞానుసారము అతడు వారిని చెరసాల గుహలోపలకు త్రోసి, వారి కాళ్ళను రెండు కొయ్యదుంగల మధ్య బంధించెను.

25. దాదాపు అర్ధరాత్రివేళ పౌలు, సిలాసులు ప్రార్థించుచు, దైవస్తుతి గీతములను పాడుచుండగా, తక్కిన ఖైదీలు వాటిని వినుచుండిరి.

26. అప్పుడు హఠాత్తుగా గొప్ప భూకంపము కలుగగా, ఆ చెరసాల పునాదులు కంపించి, ఒక్కసారిగా తలుపులన్నియు తెరచుకొనెను. అందలి బంధితుల సంకెళ్ళు భళ్ళున తెగి క్రిందబడెను.

27. చెరసాల అధికారి దిగ్గున మేల్కొని చెరసాల తలుపులన్నియు తెరచుకొనుట చూచి ఖైదీలందరు తప్పించుకొని పారిపోయి యుందురని భావించెను. అందుచే అతడు తన కత్తిని ఒరనుండి లాగి, తనను తాను చంపుకొనబోయెను.

28. అది చూచి పౌలు ఎలుగెత్తి, “ఓయీ! నీవు ఏ హానియు చేసికొనవలదు. మేమందరము ఇక్కడనే ఉన్నాము” అని బిగ్గరగా అనెను.

29. అప్పుడు ఆ చెరసాల అధికారి దీపమును తెప్పించి, లోనికి పరుగెత్తి, గడగడ వణకుచు పౌలు, సిలాసుల పాదముల వద్ద పడెను.

30. అతడు వారిని బయటకు తీసికొని వచ్చి, "అయ్యలారా! రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలెను?” అని అడుగగా,

31. “నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును రక్షింపబడుదురు” అని చెప్పిరి.

32. వారు అతనికిని, అతని ఇంటిలోని వారికిని ప్రభువు వాక్కును బోధించిరి.

33. ఆ రాత్రివేళనే చెరసాల అధికారి వారిని తీసికొని వెళ్ళి, వారి గాయములను కడిగివేసెను. వెంటనే అతడును, అతని కుటుంబమును జ్ఞానస్నానమును పొందిరి.

34. అతడు పౌలును, సిలాసును ఇంటి లోపలకు తీసికొనిపోయి వారికి భోజనము పెట్టెను. దేవుని విశ్వసించినందుచే అతడు కుటుంబసమేతముగా సంతోషభరితుడయ్యెను.

35. మరునాటి ఉదయమున న్యాయమూర్తులు. “ఆ మనుష్యులను పోనిండు” అని రక్షకభటులకు ఆజ్ఞాపించిరి.

36. కావున చెరసాల అధికారి పౌలుతో, “నిన్నును, సిలాసును విడుదలచేయుడని న్యాయమూర్తులు ఆజ్ఞ పంపియున్నారు. కనుక మీరు ప్రశాంతముగా వెళ్ళిపొండు” అని తెలిపెను.

37. కాని, పౌలు ఆ రక్షకభటులతో, “తీర్పు విధింపకయే రోము పౌరులమైన మమ్ము వారు బహిరంగముగ కొరడాలతో కొట్టి, చెరలో వేసిరి. ఇప్పుడు మమ్ము రహస్యముగా పంపివేయదలచుచున్నారా? అది ఏ మాత్రము వీలులేదు. వారే స్వయముగా ఇక్కడకు వచ్చి మమ్ము బయటకు తీసికొనిపోవలెను” అని చెప్పెను.

38. రక్షకభటులు ఈ మాటలను న్యాయ మూర్తులకు నివేదించిరి. పౌలు, సిలాసు రోము పౌరులని విన్నప్పుడు ఆ న్యాయమూర్తులు భయపడి,

39. అక్కడకు వెళ్ళి వారిని క్షమాపణ వేడుకొని, చెరసాలనుండి వెలుపలకు తీసికొనివచ్చి, నగరమును విడిచిపొండని బ్రతిమాలుకొనిరి.

40. అప్పుడు పౌలు, సిలాసులు చెరసాలను విడిచి లిదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ వారు సోదరులను కలిసికొని, వారిని ప్రోత్సహించి అటనుండి వెళ్ళిపోయిరి.

 1. వారు అంఫిపోలి, అపొలోనియాల మీదుగా పయనించి, తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల ప్రార్థనా మందిరము ఒకటి కలదు.

2. పౌలు తన అలవాటు చొప్పున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను.

3. మెస్సియా బాధలను అనుభవింప వలెననియు, ఆయన మృతులలోనుండి లేపబడవలె ననియు పౌలు అక్కడ వరుసగా మూడు విశ్రాంతి దినములు పరిశుద్ధ గ్రంథమునుండి వివరించుచు, నిరూపించుచు, “నేను మీకు ప్రకటించుచున్న ఈ యేసే మెస్సియా” అని నొక్కి వక్కాణించెను.

4. వారిలో కొందరు అతడు చెప్పిన దానిని విశ్వసించి పౌలు, సిలాసులతో చేరిరి. అట్లే దేవుని ఆరాధించు చాల మంది గ్రీసు దేశస్థులు, ప్రముఖులైన స్త్రీలు పలువురు వారి పక్షమున చేరిరి.

5. అది చూచి యూదులకు కన్నుకుట్టుటచే, వీధులలో తిరుగు దుష్టులను కొందరను ప్రోగుచేసి నగరమునంతటిని అల్లకల్లోలమున ముంచిరి. పిదప వారు యాసోను ఇంటిని ముట్టడించి పౌలును, సిలాసును బయటకు లాగి, ప్రజలయెదుట పెట్టుటకై ప్రయత్నించిరి.

6. కాని, వారు కనబడకపోవుటచే యాసోనును, ఇతర సోదరులను కొందరను నగర అధికారుల వద్దకు ఈడ్చుకొని వచ్చి, “ఎల్లెడల కల్లోలము కలిగించిన వీరు మన నగరమునకు వచ్చి యున్నారు.

7. యాసోను వీరిని తన ఇంట చేర్చుకొనినాడు. యేసు అను మరియొక రాజు మనకు ఉన్నాడని చెప్పుచు, వీరు చక్రవర్తి శాసనములను మిరుచున్నారు” అని అరచిరి.

8. ఈ మాటలతో వారు ఆ జనసమూహము, నగర అధికారులు గందర గోళమునకు గురిచేసిరి.

9. అప్పుడు ఆ నగరాధికారులు యాసోనును, తదితరులను జామీనుపై విడుదల చేసిరి.

10. సోదరులు, చీకటి పడగానే పౌలును, సిలాసును బెరయాకు పంపివేసిరి. వారు బెరయాకు చేరుకొని యూదుల ప్రార్థనామందిరమునకు వెళ్ళిరి.

11. అక్కడి ప్రజలు తెస్సలోనికలోని ప్రజల కంటె విశాలహృదయులు. వారు సందేశమును గొప్ప ఆపేక్షతో ఆలకించి, అనుదినము పవిత్రలేఖనము లను చదువుకొనుచు, పౌలు చెప్పినది నిజమా కాదా అని పరిశీలించుచుండిరి.

12. వారిలో పలువురు విశ్వసించిరి. ఉన్నత వర్గమునకు చెందిన గ్రీకు దేశపు స్త్రీలును, పురుషులును విశ్వాసులైరి.

13. కాని, పౌలు బెరయాలోకూడ దేవుని వాక్కును బోధించెనని విని, తెస్సలోనికలోని యూదులు అచటకు వచ్చి జన సమూహములను రెచ్చగొట్టి కలవరపరచిరి.

14. అందుచే వెంటనే సోదరులు పౌలును సముద్ర తీరమునకు పంపివేసిరి. కాని సిలాసు తిమోతీలు ఇరువురును బెరయాలోనే నిలిచిపోయిరి.

15. పౌలును తీసికొనిపోవు వారు ఏతెన్సు వరకును అతని వెంట వెళ్ళిరి. పిమ్మట సిలాసు తిమోతీలు సాధ్యమైనంత త్వరలో తనను చేరవలెనని పౌలు ఆజ్ఞాపించగా, ఆ ఉత్తరువులతో వారు వెనుదిరిగి బెరయాను చేరుకొనిరి.

16. పౌలు ఏతెన్సులో తిమోతీ, సిలాసుల కొరకు ఎదురు చూచుచుండెను. ఆ నగరము ఎట్లు , విగ్రహములతో నిండియుండెనో పౌలు గమనించి చాల కలతచెందెను.

17. కావున అతడు ప్రార్ధనా మందిరములో యూదులతోను, దైవభక్తిపరులతోను. సంత వీధులలో ప్రతిదినము గుమికూడు ప్రజలతోను వాదించుచుండెను.

18. భోగపరాయణులు, విరాగులు అగు తత్వవేత్తలు కొందరు పౌలుతో వాదోపవాదములు గావించిరి. కొందరు “అవివేకియగు ఈ వాచాలుడు చెప్పునదేమి?” అని పలికిరి. మరికొందరు “ఇతడు అన్యుల దేవుళ్ళను గూర్చి మాట్లాడుచున్నట్లున్నది” అని చెప్పుకొనిరి. ఏలయన, పౌలు యేసును గూర్చియు, ఆయన పునరుత్థానమునుగూర్చియు బోధించుచుండెను.

19. కనుక వారు పౌలును అరెయోపాగసు అను సభకు తీసికొనివచ్చి, “నీవు చేయుచున్న ఈ క్రొత్త బోధననుగూర్చి మేము తెలిసికొన గోరుచున్నాము.

20. నీవు చెప్పెడు కొన్ని సంగతులను వినగా, మాకు వింతగా ఉన్నది. వాటి అర్థమేమిటో, తేటతెల్లముగా తెలిసికొనవలెనని మేము ఆశించు చున్నాము” అని పలికిరి.

21. ఏలయన, ఏతెన్సులోని పౌరులకు, అచట నివసించెడు పరదేశస్థులకు, నూతన విషయములను గూర్చి చెప్పుటలో, వినుటలో కాలము వెళ్ళబుచ్చుట వారికొక వేడుక.

22. అప్పుడు పౌలు అరెయోపాగసు అను సభ యెదుట నిలువబడి “ఏతెన్సు పౌరులారా! మీరు మిక్కిలి భక్తిపరులని నాకు తోచుచున్నది.

23. ఏలయన, నేను మీ నగరములో నడచి పోవునప్పుడు మీ పూజా ప్రతిమలను చూచుచుండగా, ఒక పీఠము కూడ నాకు కనపబడెను. దానిపై 'తెలియని దేవునకు అని వ్రాయబడియున్నది. కనుక మీరు ఇప్పుడు ఆరాధించుచున్న ఆ తెలియని దేవుని గూర్చియే నేను మీకు ప్రకటించుచున్నాను.

24. ఈ ప్రపంచమును దానిలోని సమస్తమును సృష్టించిన దేవుడే, పరలోకము నకు, భూలోకమునకు ప్రభువు. ఆయన మానవ నిర్మితమైన ఆలయములో నివసింపడు.

25. ప్రజలకు అందరకు జీవమును, శ్వాసమును సమస్తమును ఇచ్చు ఆయన, మానవుల చేతులతో సేవింపబడువాడు కాదు.

26. ఒక్క పురుషునినుండియే ఆయన అన్ని జాతుల జనులను కలిగించి, భూలోకమంతట వారిని నివసింప జేసెను. ఆయన ముందుగానే వారివారి కాల పరిమితులను, వారి వారి నివసించుసలముల సరి హద్దులను స్థిరపరచి,

27. వారు ఆయన కొరకు ఆకాంక్షతో అన్వేషిస్తూ ఆయనను కనుగొనుటకై ఆయన ఇట్లు చేసెను. అయినను దేవుడు నిజముగా మనలో ఏ ఒక్కరికి దూరముగా లేడు.

28. ఏలయన 'ఆయనయందే మనము జీవించుచు, సంచరించుచున్నాము, ఉనికిని కలిగియున్నాము.' మీలో కొందరు కవులు చెప్పినట్లుగా: 'మనమును ఆయన బిడ్డలమే.'

29. “దేవుని బిడ్డలమైన మనము దైవస్వభావ మును, మనుష్యుల కల్పనా కౌశలము వలన మలచ బడిన బంగారముతోగాని, వెండితోగాని పోల్చవచ్చు నని భావింపరాదు.

30. మానవులు అజ్ఞానులుగా ఉన్న కాలములో దేవుడు వారినిగూర్చి పట్టించుకొన లేదు. కాని ఇప్పుడు ఎల్లెడల ప్రజలందరును హృదయపరివర్తన చెందవలెనని ఆజ్ఞాపించుచున్నాడు.

31. ఏలయన, ఆయన ఎన్నుకొనియున్న ఒక మనుష్యుని మూలమున ప్రపంచమునంతటిని నీతి ప్రకారము తీర్పుచేయుటకు ఒక దినమును నిర్ణయించియున్నాడు, ఆయన ఆ మనుష్యుని మృతులలోనుండి లేపుట ద్వారా ఈ విషయమును గూర్చి అందరకును దృఢ పరచెను” అని పలికెను. -

32. పౌలు చెప్పిన మృతుల పునరుత్థానమును గురించి విన్నప్పుడు కొందరు అతనిని ఎగతాళి చేసిరి. కాని కొందరు “ఈ విషయమును మరల వినవలయు నని కోరుచున్నాము” అనిరి.

33. తరువాత పౌలు వారిని వీడి వెళ్ళిపోయెను.

34. కొందరు అతడు చెప్పినది విని విశ్వసించి అతని పక్షమున చేరిరి. వారిలో అరెయోపాగసులో డెమారిసు అను పేరుగల శీయును, పట్టణసభ్యుడైన డయోనీసియసును, మరి కొందరును కలరు. 

 1. తరువాత పౌలు ఏతెన్సును వీడి కొరింతు నగరమునకు వెళ్ళెను.

2. అక్కడ అతడు పొంతులో పుట్టిన అక్విలా అను పేరుగల యూదునికలిసికొనెను. అతడు తన భార్యయగు ప్రిసిల్లాతో అప్పుడే ఇటాలియా నుండి వచ్చియుండెను. ఏలయన, క్లోరియా చక్రవర్తి యూదులందరును రోము నగరమును వదలి వెళ్ళవలయునని శాసించియుండెను.

3. పౌలు వారిని చూచుటకు పోయి తానును వారివలె గుడారములను చేయువాడు కనుక వారితో నివసించుచు పని చేయుచుండెను.

4. అతడు ప్రతి విశ్రాంతిదినమున ప్రార్ధనా మందిరములో తర్కించుచు యూదులను, గ్రీను దేశీయులను ఒప్పించుటకు ప్రయత్నించుచుండెను.

5. సిలాసు, తిమోతిలు మాసిడోనియానుండి వచ్చినప్పుడు, యేసే మెస్సియా అని పౌలు సాక్ష్యమిచ్చుచు, దేవుని వాక్కును యూదులకు బోధించుటకే తన సమయమునంతను వినియోగించు చుండెను.

6. కాని, వారు అతనిని ఎదిరించుచు అతనిని గురించి చెడుగా మాట్లాడుటచే అతడు తన దుస్తులను దులుపుచు, “మీరు పెడదారిన పోయినచో మీ రక్తము మీమీద ఉండునుగాక! దానికి నేను నిర్దోషిని. ఇక నుండి నేను అన్యుల వద్దకు పోయెదను” అని హెచ్చ రించెను.

7. అంతట వారిని వీడి తీతుయుస్తు అను పేరుగల దైవభక్తుని ఇంటికి వెళ్ళెను. అతని ఇల్లు ప్రార్థనామందిరము ప్రక్కనే ఉండెను.

8. ప్రార్ధనా మందిరమునకు అధికారియైన క్రిస్పు, అతని కుటుంబ ములోని వారందరు ప్రభువును విశ్వసించెను. ఇంకను కొరింతు నగరములోని ఇతరులు చాలమంది దేవుని వాక్యమును విని విశ్వసించి జ్ఞానస్నానమును పొందిరి,

9. ఒకనాటి రాత్రి పౌలునకు ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో ప్రభువు, “నీవు భయపడ వలదు. నీవు ఇంకను దేవుని వాక్కును బోధించుచునే ఉండుము. ఆ పనిని ఆపకుము.

10. ఏలయన, నేను నీతో ఉన్నాను. కావున నీకు ఎవరును హాని చేయలేరు. ఈ నగరములో నా ప్రజలు అనేకులు ఉన్నారు” అని చెప్పెను.

11. పౌలు ఆ ప్రజలకు దేవుని వాక్కును బోధించుచు అచట పదునెనిమిది మాసములు ఉండెను.

12. గల్లియో, అకయాకు అధిపతిగా ఉన్నపుడు యూదులు ఒకచోట కూడి పౌలును చుట్టుముట్టి, పట్టుకొని అతనిని న్యాయపీఠమునకు తీసికొని వచ్చి,

13. “ఈ మనుష్యుడు చట్టమునకు వ్యతిరేకముగా దేవుని ఆరాధింపుడని ప్రజలను ప్రేరేపింప యత్నించు చున్నాడు” అని ఫిర్యాదు చేసిరి.

14. పౌలు అప్పుడు మాట్లాడబోవుచుండగా గల్లియో యూదులతో, "ఇది ఏదైన దోషముగాని, ఘోరమైన నేరముగాని అయిన యెడల యూదులగు మీరు చెప్పుదానిని విని, నేను మిమ్ము సహించుట న్యాయమే.

15. కాని ఇవి మీ సిద్దాంతములకు, బిరుదములకు న్యాయ సూత్రము లకు సంబంధించిన ప్రశ్నలైనచో అవి మీరే చూచుకొనుడు. అట్టి విషయములలో నేను జోక్యము కలిగించుకొనను" అని పలికి,

16. వారిని న్యాయస్థాన మునుండి బయటకు గెంటివేసెను.

17. అప్పుడు వారు వెంటనే ప్రార్థనామందిరపు అధికారియగు సోస్తనీసును పట్టుకొని ఆ న్యాయస్థానము ముందే కొట్టిరి. కాని గల్లియో దానిని లక్ష్య పెట్టలేదు.

18. పౌలు మరి కొంతకాలము కొరింతులో గడిపిన పిదప, అచటి సోదరులను వీడ్కొని, ప్రిసిల్లా, అక్విలాలతో ఓడనెక్కి సిరియాకు పయనించెను. ప్రయాణమునకు ముందు కెంక్రేయలో చేసికొన్న మ్రొక్కుబడి ప్రకారము తల క్షౌరము చేయించుకొనెను.

19. వారు ఎఫెసును చేరిరి. అచట పౌలు ప్రిసిల్లా, అక్విలాలను విడిచిపెట్టి ప్రార్థనా మందిరమునకు వెళ్లి, యూదులతో చర్చించెను.

20. మరికొంత కాలము తమతో ఉండుమని వారు అతనిని ప్రాధేయపడినను అతడు సమ్మతింపలేదు.

21. అతడు వారిని విడిచి వెళ్ళునపుడు, “దేవుని చిత్తమైనచో, మరల నేను మీ యొద్దకు వచ్చెదను” అని చెప్పి ఎఫెసు నుండి ఓడనెక్కి పోయెను.

22. అతడు కైసరియా చేరుకొని, యెరూషలేమునకు వెళ్ళి అక్కడ ఉన్న క్రైస్తవ సంఘమునకు శుభాకాంక్షలు చెప్పి, తరువాత అంతియోకియానకు పోయెను.

23. అక్కడ కొంతకాలము గడిపిన పిదప, మరల ప్రయాణమై, గలతియా, ఫ్రిసియా ప్రాంతముల మీదుగా పోయి విశ్వాసులందరను దృఢపరచెను.

24. అలెగ్జాండ్రియాలో జన్మించిన అజల్లో అను పేరుగల యూదుడు ఒకడు ఎఫెసు నగరమునకు వచ్చెను. అతడు మంచి వక్త, లేఖనములందు క్షుణ్ణమయిన జ్ఞానము గలవాడు.

25. అతడు ప్రభువు మార్గములో ఉపదేశమును పొంది, యేసును గూర్చిన సత్యములను గొప్ప ఉత్సాహముతో బోధించు చుండెను. అతనికి యోహాను బప్తిస్మమును గురించి మాత్రమే తెలియును.

26. అతడు ధైర్యముగా ప్రార్థనా మందిరములలో ప్రసంగించుటకు మొదలిడెను. ప్రిసిల్లా, అక్విలాలు అతని బోధన విని, అతనిని వారి ఇంటికి తీసికొనిపోయి, దేవుని మార్గమును గూర్చి ఇంకను ఎక్కువగా అతనికి వివరించి చెప్పిరి.

27. అపోలో గ్రీసుదేశమునకు పోవుటకు నిశ్చయించుకొని నందున, ఎఫెసులోని విశ్వాసులు అతనిని ప్రోత్సహించి, గ్రీసు దేశములోని తమ సోదరులకు, అతనికి స్వాగత మిండని ఉత్తరములు వ్రాసి పంపిరి. అతడు అక్కడకు చేరి, దేవుని దయవలన విశ్వాసులైయుండిన వారలకు తోడ్పడెను.

28. ఏలయన, బహిరంగ వేదికలపై చేయ బడిన చర్చలలో అతడు తన బలీయమైన వాదము లచే, యేసే మెస్సియా అని లేఖనముల నుండి నిరూపించుచు యూదులను వాదములందు ఓడించెను. 

1. తరువాత పౌలు ఏతెన్సును వీడి కొరింతు నగరమునకు వెళ్ళెను.

2. అక్కడ అతడు పొంతులో పుట్టిన అక్విలా అను పేరుగల యూదునికలిసికొనెను. అతడు తన భార్యయగు ప్రిసిల్లాతో అప్పుడే ఇటాలియా నుండి వచ్చియుండెను. ఏలయన, క్లోరియా చక్రవర్తి యూదులందరును రోము నగరమును వదలి వెళ్ళవలయునని శాసించియుండెను.

3. పౌలు వారిని చూచుటకు పోయి తానును వారివలె గుడారములను చేయువాడు కనుక వారితో నివసించుచు పని చేయుచుండెను.

4. అతడు ప్రతి విశ్రాంతిదినమున ప్రార్ధనా మందిరములో తర్కించుచు యూదులను, గ్రీను దేశీయులను ఒప్పించుటకు ప్రయత్నించుచుండెను.

5. సిలాసు, తిమోతిలు మాసిడోనియానుండి వచ్చినప్పుడు, యేసే మెస్సియా అని పౌలు సాక్ష్యమిచ్చుచు, దేవుని వాక్కును యూదులకు బోధించుటకే తన సమయమునంతను వినియోగించు చుండెను.

6. కాని, వారు అతనిని ఎదిరించుచు అతనిని గురించి చెడుగా మాట్లాడుటచే అతడు తన దుస్తులను దులుపుచు, “మీరు పెడదారిన పోయినచో మీ రక్తము మీమీద ఉండునుగాక! దానికి నేను నిర్దోషిని. ఇక నుండి నేను అన్యుల వద్దకు పోయెదను” అని హెచ్చ రించెను.

7. అంతట వారిని వీడి తీతుయుస్తు అను పేరుగల దైవభక్తుని ఇంటికి వెళ్ళెను. అతని ఇల్లు ప్రార్థనామందిరము ప్రక్కనే ఉండెను.

8. ప్రార్ధనా మందిరమునకు అధికారియైన క్రిస్పు, అతని కుటుంబ ములోని వారందరు ప్రభువును విశ్వసించెను. ఇంకను కొరింతు నగరములోని ఇతరులు చాలమంది దేవుని వాక్యమును విని విశ్వసించి జ్ఞానస్నానమును పొందిరి,

9. ఒకనాటి రాత్రి పౌలునకు ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో ప్రభువు, “నీవు భయపడ వలదు. నీవు ఇంకను దేవుని వాక్కును బోధించుచునే ఉండుము. ఆ పనిని ఆపకుము.

10. ఏలయన, నేను నీతో ఉన్నాను. కావున నీకు ఎవరును హాని చేయలేరు. ఈ నగరములో నా ప్రజలు అనేకులు ఉన్నారు” అని చెప్పెను.

11. పౌలు ఆ ప్రజలకు దేవుని వాక్కును బోధించుచు అచట పదునెనిమిది మాసములు ఉండెను.

12. గల్లియో, అకయాకు అధిపతిగా ఉన్నపుడు యూదులు ఒకచోట కూడి పౌలును చుట్టుముట్టి, పట్టుకొని అతనిని న్యాయపీఠమునకు తీసికొని వచ్చి,

13. “ఈ మనుష్యుడు చట్టమునకు వ్యతిరేకముగా దేవుని ఆరాధింపుడని ప్రజలను ప్రేరేపింప యత్నించు చున్నాడు” అని ఫిర్యాదు చేసిరి.

14. పౌలు అప్పుడు మాట్లాడబోవుచుండగా గల్లియో యూదులతో, "ఇది ఏదైన దోషముగాని, ఘోరమైన నేరముగాని అయిన యెడల యూదులగు మీరు చెప్పుదానిని విని, నేను మిమ్ము సహించుట న్యాయమే.

15. కాని ఇవి మీ సిద్దాంతములకు, బిరుదములకు న్యాయ సూత్రము లకు సంబంధించిన ప్రశ్నలైనచో అవి మీరే చూచుకొనుడు. అట్టి విషయములలో నేను జోక్యము కలిగించుకొనను" అని పలికి,

16. వారిని న్యాయస్థాన మునుండి బయటకు గెంటివేసెను.

17. అప్పుడు వారు వెంటనే ప్రార్థనామందిరపు అధికారియగు సోస్తనీసును పట్టుకొని ఆ న్యాయస్థానము ముందే కొట్టిరి. కాని గల్లియో దానిని లక్ష్య పెట్టలేదు.

18. పౌలు మరి కొంతకాలము కొరింతులో గడిపిన పిదప, అచటి సోదరులను వీడ్కొని, ప్రిసిల్లా, అక్విలాలతో ఓడనెక్కి సిరియాకు పయనించెను. ప్రయాణమునకు ముందు కెంక్రేయలో చేసికొన్న మ్రొక్కుబడి ప్రకారము తల క్షౌరము చేయించుకొనెను.

19. వారు ఎఫెసును చేరిరి. అచట పౌలు ప్రిసిల్లా, అక్విలాలను విడిచిపెట్టి ప్రార్థనా మందిరమునకు వెళ్లి, యూదులతో చర్చించెను.

20. మరికొంత కాలము తమతో ఉండుమని వారు అతనిని ప్రాధేయపడినను అతడు సమ్మతింపలేదు.

21. అతడు వారిని విడిచి వెళ్ళునపుడు, “దేవుని చిత్తమైనచో, మరల నేను మీ యొద్దకు వచ్చెదను” అని చెప్పి ఎఫెసు నుండి ఓడనెక్కి పోయెను.

22. అతడు కైసరియా చేరుకొని, యెరూషలేమునకు వెళ్ళి అక్కడ ఉన్న క్రైస్తవ సంఘమునకు శుభాకాంక్షలు చెప్పి, తరువాత అంతియోకియానకు పోయెను.

23. అక్కడ కొంతకాలము గడిపిన పిదప, మరల ప్రయాణమై, గలతియా, ఫ్రిసియా ప్రాంతముల మీదుగా పోయి విశ్వాసులందరను దృఢపరచెను.

24. అలెగ్జాండ్రియాలో జన్మించిన అజల్లో అను పేరుగల యూదుడు ఒకడు ఎఫెసు నగరమునకు వచ్చెను. అతడు మంచి వక్త, లేఖనములందు క్షుణ్ణమయిన జ్ఞానము గలవాడు.

25. అతడు ప్రభువు మార్గములో ఉపదేశమును పొంది, యేసును గూర్చిన సత్యములను గొప్ప ఉత్సాహముతో బోధించు చుండెను. అతనికి యోహాను బప్తిస్మమును గురించి మాత్రమే తెలియును.

26. అతడు ధైర్యముగా ప్రార్థనా మందిరములలో ప్రసంగించుటకు మొదలిడెను. ప్రిసిల్లా, అక్విలాలు అతని బోధన విని, అతనిని వారి ఇంటికి తీసికొనిపోయి, దేవుని మార్గమును గూర్చి ఇంకను ఎక్కువగా అతనికి వివరించి చెప్పిరి.

27. అపోలో గ్రీసుదేశమునకు పోవుటకు నిశ్చయించుకొని నందున, ఎఫెసులోని విశ్వాసులు అతనిని ప్రోత్సహించి, గ్రీసు దేశములోని తమ సోదరులకు, అతనికి స్వాగత మిండని ఉత్తరములు వ్రాసి పంపిరి. అతడు అక్కడకు చేరి, దేవుని దయవలన విశ్వాసులైయుండిన వారలకు తోడ్పడెను.

28. ఏలయన, బహిరంగ వేదికలపై చేయ బడిన చర్చలలో అతడు తన బలీయమైన వాదము లచే, యేసే మెస్సియా అని లేఖనముల నుండి నిరూపించుచు యూదులను వాదములందు ఓడించెను.  

 1.ఈ అల్లకల్లోలము అణగిన తరువాత, పౌలు విశ్వాసులనందరను చేరబిలిచి, వారిని ప్రోత్సహించి, వారి యొద్ద సెలవు తీసికొని, మాసిడోనియాకు వెళ్ళెను.

2. అతడు ఆ ప్రాంతముల మీదుగా పోవుచు, అకయా ప్రజలను ప్రోత్సహించుచు,

3. గ్రీసు దేశమునకు వచ్చి మూడు మాసములు ఉండెను. తరువాత సిరియా వెళ్ళుటకు సిద్ధపడుచుండగా యూదులు అతనిపై కుట్రపన్నుచుండుటను పసికట్టి, మాసిడోనియా మీదుగా వెనుకకు పోవలెనని నిశ్చయించుకొనెను.

4. బెరయాకు చెందిన పిఱుసు కుమారుడైన సొపాతేరు అతని వెంట వెళ్ళెను. మరియు తెస్సలోనిక నుండి వచ్చిన అరిస్టార్కుసు, సెకుందుసు, దెర్బె నుండి వచ్చిన గాయు, తిమోతి, ఆసియా మండలమునుండి వచ్చిన తుకికు, త్రోఫిము

5. అను వీరు ముందుగా వెళ్ళి, త్రోయలో మా కొరకు వేచియుండిరి.

6. పులియని రొట్టెల పండుగ తరువాత, ఫిలిప్పీనుండి ఓడనెక్కి పయనించి ఐదురోజుల అనంతరము త్రోయలో వారిని కలిసికొని అచట ఏడుదినములు గడిపితిమి.

7. అదివారము మేము భుజించుటకు ఒక చోట చేరితిమి. మరునాడు తాను వారిని వదలి వెళ్ళవలసియున్నందున, పౌలు నడిజామువరకు ప్రజలతో మాట్లాడుచునే ఉండెను.

8. మేము సమావేశమైన పై అంతస్తు గదిలో చాలా దీపములు వెలుగుచునే యుండెను.

9. యూతికూసు అను పేరుగల యువకుడు ఒకడు కిటికీలో కూర్చుండి ఉండెను. పౌలు ఇంకను మాట్లాడుచుండగా అతడు కునికిపాట్లు పడి, గాఢనిద్రపట్టగా, ఆ నిద్రలో మూడవ అంతస్తు నుండి క్రింద పడిపోయెను. వెంటనే వారు అతనిని లేవనెత్త బోగా, అతడు అప్పటికే ప్రాణములు విడిచెను.

10. కాని పౌలు క్రిందకు దిగి, అతనియొద్దకు వెళ్ళి, వానిపై వంగి, కౌగిలించుకొని, “విచారపడకుడు. ఇతడు ఇంకను బ్రతికియే ఉన్నాడు” అని పలికెను.

11. అప్పుడు పౌలు తిరిగి పై అంతస్తు లోనికి పోయి, రొట్టెను త్రుంచి భుజించెను. ప్రొద్దుపొడుపువరకు అతడు చాలసేపు మాట్లాడిన పిదప పౌలు వారిని వీడి వెళ్ళెను.

12. వారు ఆ యువకుని సజీవునిగా ఇంటికి తీసికొని వచ్చి ఎంతో ఊరట పొందిరి.

13. మేము ఓడనెక్కి అస్సోసునకు పయ నించితిమి. పౌలును కూడ ఓడలో ఎక్కించుకొన దలచితిమి. కాని అతడు భూమార్గమున తాను అటకు వెళ్లుటకు ఏర్పాటు చేసికొనెను.

14. అస్సోసులో మమ్ములను అతడు కలిసికొనినప్పుడు మేము అతనిని ఓడలో ఎక్కించుకొని మితిలేనుకు వెళ్లితిమి.

15. అక్కడ నుండి మేము ఓడలో పయనించి, మరునాటికి కియోసును చేరుకొంటిమి. ఒక దినము గడచిన తరువాత మేము సామొసుకు వచ్చి, మరుసటి రోజున మిలేతు చేరితిమి.

16. ఆసియా మండలములో ఏమాత్రము కాలహరణము చేయకూడదనుకొని నందున పౌలు ఎఫెసు దాటిపోవ నిశ్చయించుకొనెను. ఎందుకనగా, సాధ్యమైనంతవరకు పెంతెకోస్తు పండుగ నాటికి అతడు యెరూషలేమునకు చేరుకొన వలెనని తొందరపడుచుండెను.

17. క్రైస్తవ సంఘపు పెద్దలు తనను కలిసి కొనవలెనని పౌలు మిలేతు నుండి ఎఫెసునగరము నకు వర్తమానమును పంపెను.

18. వారు అచ్చటికి వచ్చి సమావేశమైనప్పుడు పౌలు వారితో “ఆసియా మండలములో అడుగిడిన మొదటిదినమునుండి నా సమయమంతయు నేను మీతో ఎట్లు గడిపితినో మీరు ఎరుగుదురు.

19. యూదుల కుతంత్రమువలన నాకు కలిగిన కష్టకాలములో నేను ప్రభువు సేవకునిగా నా పనిని సంపూర్ణ దీనత్వముతోను, కన్నీటితోను నెరవేర్చి తిని.

20. నేను బహిరంగముగా మీ ఇండ్లయందు ప్రసంగించి బోధించినప్పుడు మీకు అన్ని విధముల సాయపడుటకు నేను వెనుదీయలేదు.

21. పాపముల నుండి దేవుని వైపునకు మరలవలెనని, మన ప్రభువైన యేసును విశ్వసింపవలెనని యూదులను, అన్యులను ఒకే రీతిగా నేను తీవ్రముగా హెచ్చరించితిని.

22. మరి ఇప్పుడు పవిత్రాత్మకు విధేయుడనైన నేను యెరూషలేమునకు పోవుచున్నాను. అక్కడ నాకు ఏమి జరుగనున్నదో తెలియదు.

23. చెరసాలయు, కష్టములును నా కొరకై వేచియున్నవని పవిత్రాత్మ ప్రతి నగరమునను నన్ను హెచ్చరించుట మాత్రమే నాకు తెలియును.

24. దేవుని అనుగ్రహమును గూర్చిన సువార్తను ప్రకటించుటయే ప్రభువైన యేసు నాకు నియమించిన పని. కనుక, ఆ పనిని నేను పూర్తి చేయుటయే నా కర్తవ్యము. అంతకు మినహా నా జీవితము ప్రయో జనకరమని నేను భావించుట లేదు.

25. దేవుని రాజ్యమును గూర్చి ప్రసంగించుచు, నేను మీ అందరి మధ్యలో సంచరించియున్నాను. మీలో ఎవరును నన్ను మరల చూడరని ఇప్పుడు నాకు తెలియును.

26. కాబట్టి ఈ దినమే దీనిని మీకు ఎరుక చేయుచున్నాను. మీలో ఎవరు నశించినను దానికి నేను దోషిని కాను.

27. ఏలయన, దేవుని సంకల్పమును మీకు ఎరిగించుటలో, నేను వెనుకంజ వేయలేదు.

28. మీ విషయమై జాగ్రత్త పడుడు. పవిత్రాత్మ మీకు అప్పగించిన మందను జాగ్రత్తగా చూచుకొనుడు. దేవుడు తన సొంత కుమారుని రక్తము ద్వారా, తన సొత్తుగా చేసికొనిన దైవసంఘమునకు కాపరులుగా ఉండుడు.

29. ఏలయన, మేము మిమ్ములను విడిచిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును. అవి మందను వదలిపెట్టవు.

30. మీలో నుండియే కొందరు అబద్ద ములు చెప్పి, శిష్యులను తమ పక్షమునకు మరల్చు కొను కాలము వచ్చును.

31. జాగ్రత్తగా ఉండుడు. మూడు సంవత్సరముల పర్యంతము నేను రేయింబ వళ్ళు మీలో ఒక్కొక్కరికి బోధించుచు కన్నీరు కార్చితి నని మీరు గుర్తుంచుకొనుడు.

32. “ఇప్పుడు దేవునికి, ఆయన కృపావాక్కు నకు మిమ్ము అప్పగించుచున్నాను. ఇదియే మిమ్ములను నిర్మించుచు, శుద్ధులైన వారందరిలో వారసత్వమును కల్పించును.

33. ఎవరి వెండినైనను, బంగారము నైనను, వస్త్రములనైనను నేను ఆశింపలేదు.

34. నేను ఈ నా సొంతచేతులతోనే పనిచేసి నాకును, నా సహచరులకును కావలసిన దానిని సమకూర్చియుంటినని మీకు తెలియునుగదా!

35. 'పుచ్చుకొనుటకంటె, ఇచ్చుట ధన్యము' అని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకముంచుకొని కష్టించి, కృషిచేయుట ద్వారానే బలహీనులకు సహాయపడవలెనని నేను అన్ని విషయములలో మీకు ఆదర్శము ఇచ్చితిని” అని పలికెను.

36. పౌలు ఇట్లు చెప్పి ముగించి, వారందరితో తానుగూడ మోకరిల్లి ప్రార్థించెను.

37. వారు వీడుకోలు సూచనగా పౌలును కౌగిలించుకొనుచు, ముద్దుపెట్టుకొనుచు అందరును కన్నీరు కార్చిరి.

38. మరల వారు ఎన్నటికిని అతనిని చూడబోరని, అతడు చెప్పినమాటలను తలంచుకొని వారు కంటికిమంటికి ఏకధారగా ఏడ్చిరి. అంతటవారు ఓడవరకు అతనిని సాగనంపిరి. 

 1. మేము వారికి వీడుకోలు చెప్పి వెళ్లితిమి. తరువాత మేము తిన్నగా ఓడ ప్రయాణము సాగించి కోసుకు వచ్చితిమి. ఆ మరునాడు రోదు చేరితిమి. అక్కడ నుండి పతరాకు వెళ్ళితిమి.

2. అక్కడ ఫినీసియాకు పోనున్న ఒక ఓడ కనబడగా, మేము దానిలో ఎక్కి ప్రయాణము చేసి,

3. సైప్రసుకు దాదాపుగా వచ్చి, తదుపరి దక్షిణముగా సిరియాకు ప్రయాణము సాగించితిమి. ఆపైన, ఓడ సరకులు దింపవలసియున్న తూరు రేవుకు వెళ్ళితిమి.

4. అక్కడ కొందరు విశ్వాసులను కనుగొని ఏడు రోజులు వారితో ఉంటిమి. వారు పవిత్రాత్మ ప్రేరేపితులై పౌలును యెరూషలేమునకు వెళ్ళవలదని చెప్పిరి.

5. కాని, ప్రయాణమునకు సమయము కాగా మేము వారిని వీడి బయలువెడలితిమి. వారందరు ఆలుబిడ్డలతో, నగరము వెలుపలవరకు మా వెంట వచ్చిరి. అక్కడ సాగరతీరమున మేము అందరము మోకరిల్లి ప్రార్థించితిమి.

6. అప్పుడు మేము ఒకరికి ఒకరము వీడుకోలు చెప్పుకొని ఓడను ఎక్కితిమి. వారు వెనుదిరిగి ఇండ్లకు పోయిరి.

7. మేము తూరు నుండి సముద్ర ప్రయాణము కొనసాగించి షోలమాయిసు వెళ్ళితిమి. అక్కడ మేము సోదరులకు శుభవచనములు పలికి వారితో ఒక దినము గడిపితిమి.

8. ఆ మరుసటిదినము మేము వారిని వీడ్కొని కైసరియాకు చేరుకొని, అక్కడ సువార్తా బోధకుడు ఫిలిప్పు ఇంటనుంటిమి. యెరూషలేములో ఎన్నుకొనబడిన ఏడుగురిలో అతడు ఒకడు.

9. అతనికి అవివాహితులగు కుమార్తెలు నలుగురు కలరు. వారును దేవుని వాక్కును ప్రవచించుచుండిరి.

10. అక్కడ మేము కొన్నిదినములు ఉండగా యూదయా నుండి 'అగాబు' అను ఒక ప్రవక్త వచ్చెను.

11. అతడు మాయొద్దకు వచ్చి, పౌలు నడుమునకు కట్టుకొను త్రాటిని తీసికొని దానితో తన కాళ్ళను చేతులను గట్టిగా బంధించుకొని, “ఈ త్రాడు గలవాడు యెరూషలేములో యూదులచే ఈ విధముగా బంధింప బడి అన్యులకు అప్పగింపబడునని పవిత్రాత్మ చెప్పు చున్నాడు” అని పలికెను.

12. దీనిని విని మేమును, అక్కడ ఉన్న ప్రజలును పౌలును యెరూషలేమునకు వెళ్ళవలదని బతిమాలితిమి. .

13. కాని, పౌలు, “మీరు చేయుచున్నదేమి? మీరు ఇట్లు ఏడ్చుచు నా హృదయమును బద్దలు చేయు చున్నారు. నేను యెరూషలేములో బంధింపబడుటకే కాదు, ప్రభువైన యేసు కొరకు ప్రాణములను అర్పించుటకు సిద్ధముగా ఉన్నాను” అని మాతో పలికెను.

14. మేము అతనిని ఒప్పింపలేక పోయి తిమి కనుక, “దేవుని చిత్తము నెరవేరునుగాక!” అని మా ప్రయత్నమును విరమించితిమి.

15. అక్కడ కొంతకాలము గడిపిన పిదప మేము మా సామగ్రిని సిద్ధపరచుకొని యెరూషలేము వెళ్ళి తిమి.

16. కైసరియాకు చెందిన శిష్యులు కొందరు మా వెంటవచ్చి, ప్రారంభమునుండి, విశ్వాసియైన సైప్రసు దేశస్తుడగు మ్నాసోను అనువాని యింటికి బసచేయుటకై మమ్మును తీసికొనిపోయిరి.

17. మేము యోరూషలేమునకు చేరినప్పుడు అక్కడి సోదరులు సంతోషముతో మాకు స్వాగతము పలికిరి.

18. ఆ మరునాడు పౌలు యాకోబును చూచుటకై మాతో వెడలెను. అప్పుడు క్రైస్తవ సంఘపు పెద్దలు అందరును అక్కడ హాజరైరి.

19. పౌలు వారికి శుభము పలికి, దేవుడు తన పని ద్వారా, అన్యుల మధ్యలో చేసిన వానిని అన్నింటిని క్షుణ్ణముగా వివరించెను.

20. అతడు చెప్పినది విని వారందరు దేవుని స్తుతించిరి. వారు పౌలుతో, “సోదరా! వేలకు వేలు యూదులు ఎట్లు విశ్వాసులై ఉన్నారో వారు అందరు ఎట్లు మోషే చట్టము ఎడల మిక్కిలి ఆసక్తి కలిగి ఉన్నారో నీకు తెలియును.

21. అన్యుల దేశములలో నివసించుచున్న యూదులకు మోషే చట్టమును విడనాడమనియు తమ బిడ్డలకు సున్నతి చేయవలదనియు, యూదుల ఆచారమును పాటింప వలదనియు, నీవు బోధించుచున్నట్లు ఇచ్చటి యూదులు వినియున్నారు.

22. ఇప్పుడు ఏమి చేయుదము? నీవు ఇచ్చటకు వచ్చియున్నావని తప్పక వారు తెలిసి కొందురు.

23. కనుక మేము చెప్పినట్లు చేయుము. ఇక్కడ మ్రొక్కుబడి చేసికొనిన నలుగురు మనుష్యులు ఉన్నారు.

24. నీవు వారితో వెళ్ళి, వారితో కలిసి, శుద్దీకరణ సంస్కారమునందు పాల్గొని, తల థైరము చేయించుకొనుటకు వారికి అగు ఖర్చులను చెల్లింపుము. ఇట్లు చేసినచో నిన్ను గురించి విన్న వానిలో ఏదియు నిజము కాదనియు, నీవు కూడ మోషే చట్టమును పాటించుచున్నావనియు వారు భావించెదరు.

25. విశ్వాసులై ఉన్న అన్యులకు, విగ్రహములకు సమర్పిం చిన ఆహారముగాని, రక్తముగాని, గొంతు పిసికి చంపిన జంతువు యొక్క మాంసముగాని, భుజింపరాదనియు, జారత్వమునుండి దూరముగా ఉండవలెననియు మా నిర్ణయమును గూర్చి వ్రాసియున్నాము" అనిరి.

26. అప్పుడు పౌలు ఆ నలుగురు మనుష్యులను తీసికొని పోయి మరుసటి దినమున వారితోపాటు శుద్ధిచేసికొని దేవాలయములో ప్రవేశించి, వారిలో ప్రతివ్యక్తి తరపున బలి అర్పణ జరుగువరకు శుద్ధీకరణము నెరవేర్చు దము అనెను.

27. దాదాపు ఏడు దినములు పూర్తియగు చుండగా ఆసియా మండలపు యూదులు కొందరు పౌలు దేవాలయమందుండుట చూచిరి. అప్పుడు వారు జనసమూహమును రెచ్చగొట్టి వెంటనే పౌలును పట్టుకొనిరి.

28. “యిస్రాయేలు ప్రజలారా! సహాయ పడుడు. ఈ మనుష్యుడే అన్ని ప్రాంతములందు సంచరించుచు, యిస్రాయేలు ప్రజలందరకు మోషే చట్టమునకు ఈ దేవాలయమునకు వ్యతిరేకముగా బోధించుచున్నాడు. ఇప్పుడు ఇతడు కొందరు అన్యు లను గూడ దేవాలయము లోనికి తీసికొనివచ్చి, ఈ పావన స్థలమును అపవిత్రము చేసియున్నాడు” అని అరచిరి.

29. ఎఫెసు నగరమునుండి వచ్చిన త్రిపాము, పౌలుతో నగరమునందుండగా చూచి, పౌలు వానిని దేవాలయములోనికి తీసికొని వచ్చెనని తలంచి వారు ఇట్లు పలికిరి.

30. ఈ గందరగోళము నగరమంతయు వ్యాపించిపోయెను. ప్రజలందరు పరుగెత్తుకొనిపోయి, ఒక్కుమ్మడిగా పౌలును పట్టుకొని అతనిని దేవాలయము నుండి ఈడ్చుకొని వచ్చిరి. వెంటనే దేవాలయపు తలుపులు మూయబడెను.

31. యెరూషలేమంతయు అల్లకల్లోలముగా ఉన్నదను వార్త సైన్యాధిపతికి అందునప్పటికే, ఆ అల్లరిమూక పౌలును చంప ప్రయత్నించుచుండెను.

32. వెంటనే సైన్యాధిపతి కొందరు సైనికులను శతాధిపతులను తీసికొని దేవాలయమువద్దకు పరుగున వచ్చెను. సైనికులతో కూడివచ్చిన అతనిని చూచి, వారు పౌలును హింసించు టను నిలిపివేసిరి.

33. ఆ సైన్యాధిపతి వచ్చి పౌలును పట్టుకొని రెండు గొలుసులతో గట్టిగా బంధింపుడని ఆజ్ఞాపించెను. అతడు వారిని, “ఇతడు ఎవరు? ఏమి చేసెను?” అని ప్రశ్నించెను.

34. ఆ అల్లరి గుంపులో కొందరు ఒకటి, మరికొందరు మరొకటి, తలకొక రీతిగా కేకలు పెట్టిరి. ఆ కోలాహలములో సైన్యాధిపతి నిజముగా జరిగినదేమియో తెలిసికొనలేకపోయెను. కావున, పౌలును కోటకు తీసికొనిపొండని అతడు సైనికులకు ఆజ్ఞాపించెను.

35. వారు అతనితో మెట్ల సమీపమునకు చేరిరి. కాని అల్లరిమూక విపరీతముగా ఉండుటచే అక్కడనుండి సైనికులు అతనిని మోసికొని పోవలసివచ్చెను.

36. ఎందుకన, వారందరు అతని వెంటబడి, “వీనిని చంపుడు! చంపుడు!" అని కేకలు వేయుచుండిరి. ,

37. వారు పౌలును కోటలోనికి తీసికొని పోవు నప్పుడు అతడు సైన్యాధిపతితో “నేను మీతో కొంత మాట్లాడవచ్చునా?” అని అడిగెను. అందుకతడు “నీకు గ్రీకు భాష తెలియునా?

38. అటులైన కొంతకాలము క్రిందట తిరుగుబాటును లేవదీసి, నాలుగువేలమంది నరహంతలను ఎడారిలోనికి నడిపించుకొని పోయిన ఆ ఐగుప్తీయుడవు నీవు కావా?” అని ప్రశ్నించెను.

39. అప్పుడు పౌలు, “నేను యూదుడను. సిలీషియా లోని తార్సులో జన్మించితిని. ముఖ్యమైన నగర పౌరుడను. నన్ను ప్రజలతో మాట్లాడనీయుము” అని మనవి చేసెను.

40. సైన్యాధిపతి అట్లే సెలవీయగా, పౌలు మెట్లపై నిలబడి నిశ్శబ్దముగా ఉండుడు అని ప్రజలకు సైగచేసి, వారు ప్రశాంతముగా ఉండగా వారితో హీబ్రూ భాషలో ఇట్లు మాట్లాడెను: 

 1. "సోదరులారా! తండ్రులారా! నా పక్షమున నేను చెప్పుకొనబోవు మాటలను ఆలకింపుడు”.

2. అతడు హీబ్రూ భాషలో మాట్లాడుట విని వారు మొదటి కంటె ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడు పౌలు ఇట్లు మాట్లాడసాగెను.

3. “నేను సిలీషియాలోని తార్సు నగరములో జన్మించిన యూదుడను. కాని ఇక్కడ యెరూషలేమునందే పెరిగి, గమాలియేలు వద్ద విద్యాభ్యానము గావించితిని. మన పూర్వుల చట్టమును గూర్చి, గట్టి ఉపదేశము పొందితిని. ఈనాడు ఇటనున్న మీరు అందరును దేవునకు మిమ్ము మీరు అంకితము కావించుకొనినట్లే నేనును నన్ను నేను అంకితము కావించుకొంటిని.

4. ప్రభు మార మును అనుసరించిన ప్రజలను మరణము పాలగు నట్లు హింసించితిని. స్త్రీలను పురుషులను పట్టి బంధించి వారిని చెరసాలలో పడవేయించితిని.

5. ప్రధానార్చకుడును, విచారణసభలోని సభ్యులు అందరును నేను చేసిన దానికి సాక్షులు. నేను వారియొద్దనుండి దమస్కులో ఉన్న సోదరులకు ఉత్తరములను తీసికొనివచ్చి, యెరూషలేములో శిక్షించు నిమిత్తము ఆ విశ్వాసులను బంధించి, తీసికొని వచ్చుటకై అటకు వెళ్ళితిని.

6. "అట్లు నేను పయనించి, దమస్కు సమీపించి నప్పుడు మధ్యాహ్న సమయమున ఆకాశమునుండి అకస్మాత్తుగా ఒక కాంతివంతమైన వెలుగు నా చుట్టును ప్రకాశించినది.

7. అప్పుడు నేను నేలమీద పడిపోగా, 'సౌలూ! సౌలూ! నీవు ఏల నన్ను హింసించుచున్నావు?” అని ఒక స్వరము నాకు వినిపించినది.

8. నేను 'ప్రభువా! నీవు ఎవరవు?” అని అడిగితిని. 'నేను, నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును' అని ఆయన నాతో చెప్పెను.

9. అప్పుడు నా వెంటనున్నవారు వెలుగును చూచిరి గాని, నాతో మాట్లాడుచుండినవాని స్వరమును మాత్రము వినలేదు.

10. 'ప్రభూ! నేను ఏమి చేయవలెను?' అని ప్రశ్నింపగా, ఆయన, 'లేచి దమస్కుపురమునకు పొమ్ము. నీవు ఏమి చేయవలెనని దేవుడు నిశ్చయించెనో అది అంతయు అక్కడ నీకు తెలుపబడును' అని నాతో పలికెను.

11. కన్నులు మిరుమిట్లు గొలుపు ఆ కాంతిని కాంచుటచే, నేను ఏదీ చూడలేకపోతిని. అందుచే నా సహచరులు నా చేతిని పట్టుకొని దమస్కులోనికి నడిపించుకొని పోయిరి.

12. “అచ్చట, మన ధర్మశాస్త్రమునకు విధేయు డగు అననియా అను ఒక భక్తుడు ఉండెను. యూదులు అందరును అతడు మంచివాడు అని చెప్పుకొందురు.

13. అతడు నాయొద్దకు వచ్చి, నా ప్రక్కన నిలబడి, “సౌలు సోదరా! నీ చూపును మరల పొందుము' అని చెప్పిన తక్షణమే నేను దృష్టిని పొంది, అతని వంక చూచితిని.

14. 'మన పూర్వుల దేవుడు తన చిత్తమును తెలిసికొనుటకు, నీతిమంతుడగు తన సేవకుని చూచుటకు, తన సొంత స్వరముతో చెప్పుదానిని వినుటకు, నిన్ను ఎన్నుకొనియున్నాడు.

15. ఏలయన, నీవు చూచిన దానిని, విన్నదానిని జనులకందరకు తెలియజెప్పుటకు ఆయనకు నీవు సాక్షివై ఉందువు.

16. ఇక ఆలస్యమేల? లేచి జ్ఞానస్నానము పొంది, ఆయన నామమును ఉచ్చరించుచు నీ పాపములను , కడిగివేసికొనుము' అని ఉపదేశించెను.

17. “నేను తిరిగి యెరూషలేమునకు వెళ్ళి, దేవాలయములో ప్రార్థించుకొనుచుండగ పరవశుడ నైతిని.

18. అప్పుడు ప్రభువు కనిపించి, 'త్వరపు డుము. వెంటనే లేచి యెరూషలేమును విడిచి వెళ్ళుము. ఏలయన, ఇచ్చటనున్న ప్రజలు నన్నుగూర్చి నీవు ఇచ్చు సాక్ష్యమును అంగీకరింపరు!' అని నాతో చెప్పెను.

19. 'ప్రభువా! నేను ప్రతి ప్రార్థనామందిర మునకు వెళ్ళి, నిన్ను విశ్వసించినవారిని పట్టి హింసించితి నని వారికి బాగుగా తెలియును.

20. నీ సాక్షియైన స్తెఫాను చంపబడినప్పుడు నేను అచ్చటనే ఉండి ఆ హత్యను ఆమోదించుచు, ఆ హంతకుల వస్త్రములకు కావలియుంటిని' అని మారు పలికితిని.

21. అందుకు ఆయన 'నీవు పొమ్ము. చాల దూరముగా అన్యుల యొద్దకు నిన్ను పంపుచున్నాను' అని ఆదేశించెను.”

22. ఇంత వరకు ప్రజలు వినిరి. కాని, పౌలు, ఈ విషయమును చెప్పగనే వారు, “ఇటువంటివాడు భూమిమీద ఉండకూడదు. అతను జీవించి ఉండ కూడదు” అని పెద్దగా కేకలు వేయ నారంభించిరి.

23. వారు అటుల కేకలువేయుచు వారి పై వస్త్రము లను గాలిలో ఊపుచు దుమ్మెత్తి పోయుచుండిరి.

24. సైన్యాధిపతి పౌలును కోటలోనికి తీసికొనిపోవ బంట్రోతులకు ఆనతిచ్చి, యూదులు ఎందుకు అటుల అరచుచున్నారో తెలిసికొనుటకు, పౌలును కొట్టుటకు ఆజ్ఞాపించెను.

25. పౌలును బంధించి కొరడాలతో కొట్టనున్నప్పుడు, అక్కడ నిలుచుండి చూచుచున్న శతాధిపతితో పౌలు “విచారణ చేయకయే రోము పౌరుని కొరడాలతో కొట్టించుట న్యాయసమ్మతమా?" అని ప్రశ్నించెను.

26. ఆ శతాధిపతి అది విని సైన్యాధిపతి వద్దకు పోయి “మీరేమి చేయుచున్నారు? ఆ మనుష్యుడు రోము పౌరుడట!” అని తెలియజేసెను.

27. అందుచే ఆ సైన్యాధిపతి పౌలు వద్దకు వచ్చి, “నీవు రోము పౌరుడవేనా? చెప్పుము” అని ప్రశ్నింపగా, “ఔను” అని పౌలు జవాబిచ్చెను.

28. ఆ సైన్యాధిపతి, “నేను చాల డబ్బుఖర్చుపెట్టి రోము పౌరుడనైతిని” అని పలుకగా పౌలు “కాని నేను పుట్టుకతోనే రోము పౌరుడను” అని బదులు పలికెను.

29. పౌలును ప్రశ్నింపబోవు మనుష్యులు వెంటనే వెనుకకు తగ్గిరి. పౌలు రోము పౌరుడని తెలిసికొని సంకెళ్ళతో బంధించినందుకై, ఆ సైన్యాధిపతి కూడ భయపడెను.

30. యూదులు పౌలుపై మోపిన నేరము ఏమిటో కచ్చితముగా తెలిసికొనవలెనని తలచి, ఆ సైన్యాధిపతి మరుసటిరోజు పౌలు సంకెళ్ళు తీసి వేయించి, ప్రధానార్చకులను, విచారణసభను సమావేశము కావలెనని ఆజ్ఞాపించెను. పిమ్మట పౌలును తీసికొనివచ్చి ఆ సభ ఎదుట నిలువబెట్టెను. 

 1. అప్పుడు పౌలు సభ వారి వంక తిన్నగా చూచి, "సోదరులారా! నేను నేటివరకు దేవుని సమక్షములో, మంచి మనస్సాక్షిగలవాడనై జీవించితిని" అని పలికెను.

2. అది విని ప్రధానార్చకుడైన అననియా పౌలు నోటిపై కొట్టుడని దగ్గర నిలువబడి ఉన్నవారికి ఆజ్ఞాపించెను.

3. పౌలు అననియాతో, “సున్నముకొట్టిన గోడా! దేవుడు నిన్ను కొట్టును. నీవు చట్ట ప్రకారము నన్నుగూర్చి న్యాయవిచారణ చేయుటకు కూర్చుండియున్నావు. కాని, నన్ను కొట్టుమని ఆ పించి ఆ చట్టమును ఉల్లంఘించుచున్నావు” అని పలికెను.

4. అప్పుడు పౌలుకు దగ్గరలో ఉన్నవారు, “నీవు దేవుని ప్రధానార్చకుని అవమానించుచున్నావా?” అనగా పౌలు,

5. "సోదరులారా! అతడు ప్రధానార్చకు డని నాకు తెలియదు. ఏలయన, 'నీవు నీ ప్రజాపాలకుని గూర్చి చెడుగా మాట్లాడరాదు' అని వ్రాయబడియున్నది” అని వారికి బదులుపలికెను.

6. ఆ సభలోని వారిలో కొందరు సదూకయ్యులని, మరికొందరు పరిసయ్యులని గ్రహించి పౌలు వారితో, “సోదరులారా!' నేను పరిసయ్యుడను, పరిసయ్యుల కుమారుడను, మరణించినవారు మరల జీవముతో లేతురని నా నమ్మకము. అందువలననే నేనిపుడు విచారింపబడుచున్నాను” అనెను.

7. అది వినగానే పరిసయ్యులు, సదూకయ్యులు కలహించు కొనసాగిరి. ఆ సభ రెండు పక్షములుగా చీలిపోయెను.

8. ఏలయన సదూకయ్యులు మృతుల పునరుత్థానము లేదని, దేవదూతగాని, ఆత్మగాని లేదని చెప్పుదురు. కాని పరిసయ్యులు ఇవి కలవని నమ్ముదురు.

9. అందుచే కేకలింకను పెద్దవైనవి. పరిసయ్యుల పక్షమునకు చెందిన ధర్మశాస్త్ర బోధకులు కొందరు లేచి, “ఈ మనుష్యునిలో మాకు ఏమియు దోషము కనిపించుటలేదు. బహుశః ఆత్మగాని, దేవదూతగాని నిజముగా ఇతనితో మాట్లాడియుండవచ్చును” అని గట్టిగా వ్యతిరేకించిరి.

10. వాదము తీవ్రము కాగా, వారు పౌలును ముక్కలు ముక్కలుగా చీల్చి వేయుదురేమో అని సైన్యాధిపతి భయపడి, తన సైనికులకు సభలో ఉన్న పౌలును దూరముగా తీసికొనిపోయి కోట లోపల ఉంచుడని ఆజ్ఞాపించెను.

11. మరునాటి రాత్రి ప్రభువు పౌలు ప్రక్కన నిలువబడి, “ధైర్యముగా ఉండుము. ఇచట యెరూషలేములో, నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చినట్లే నీవు రోమునందు కూడ చేయవలెను” అని పలికెను.

12. మరుసటి దినమున యూదులు ఒకచోట కలిసికొని కుతంత్రముచేసి, పౌలును చంపువరకును అన్నపానీయములు ఏవియు ముట్టకూడదని శపథము చేసిరి.

13. ఈ కుట్రలో పాల్గొనిన వారు మొత్తము నలువది మందికి పైగా ఉండిరి.

14. అప్పుడు వారు ప్రధాన అర్చకులయొద్దకు, పెద్దలయొద్దకు పోయి, “పౌలు ప్రాణములు తీయువరకు అన్నపానీయములు ముట్టరాదని మేము ఒక శపథము చేసికొంటిమి.

15. కనుక ఇప్పుడు మీరును, విచారణ సభయు పౌలును మీ వద్దకు తీసికొని రావలసినదిగా సైన్యాధి పతికి వర్తమానము పంపుడు. అతనిని గూర్చి మీరు ఇంకను లోతుగా విచారింపవలసి ఉన్నట్లు నటింపుడు. అతడు ఇచ్చటకు చేరకమునుపే అతనిని సంహరించు టకు మేము సిద్ధముగా ఉందుము” అని వారితో చెప్పిరి.

16. పౌలు సోదరి కుమారుడు ఈ కుట్రను గురించి విని కోటలోనికి పోయి, ఈ విషయమును పౌలుతో చెప్పెను,

17. అప్పుడు పౌలు శతాధిపతు లలో ఒకనిని పిలిచి, “ఈ యువకుని సైన్యాధిపతి చెంతకు తీసికొని పొమ్ము. ఇతడు అతనికేదో చెప్పవలసి ఉన్నది” అనెను.

18. శతాధిపతి ఆ యువకుని సైన్యాధిపతియొద్దకు తీసికొనిపోయి “బంధితుడగు పౌలు నన్ను పిలిచి ఈ యువకుని మీయొద్దకు తీసికొనిపొమ్మని కోరినాడు. ఇతడు మీకు చెప్పవలసిన విషయమేదో ఉన్నది” అని అతనితో చెప్పెను.

19. సైన్యాధిపతి అతని చేయిపట్టుకొని తానే స్వయముగా ప్రక్కకు తీసికొనిపోయి, “నీవు చెప్పదలచినదేమి?” అని ప్రశ్నింప,

20. ఆ యువకుడు సైన్యాధిపతితో, “పౌలును గురించి సరియైన సమాచారము తెలిసికొన వలెను అను నెపముతో అతనిని రేపు న్యాయసభలోనికి రప్పింపవలెనని, యూదులు మిమ్ము అడుగ నిశ్చయించుకొనినారు.

21. కాని, మీరు వారి మాట వినవలదు, ఏలయన, నలువదిమందికి పైగా వారిలోని వారు పౌలుకొరకు పొంచి కాచుకొనియున్నారు. వారందరు పౌలును చంపువరకు అన్నపానీయములు ముట్టరాదని శపథము చేసి మీ నిర్ణయమునకై నిరీక్షించుచున్నారు” అని మనవి చేసెను.

22. సైన్యాధిపతి ఆ యువకునితో, “ఈ విషయమును నీవు నాకు తెలియపరచినట్లు ఎవరికిని చెప్పవలదు" అని హెచ్చరించి పంపివేసెను.

23. అప్పుడు సైన్యాధిపతి ఇద్దరు శతాధి పతులను పిలిచి, వారితో, “ఈ రాత్రి తొమ్మిది గంటలకు కైసరియాకు వెళ్ళుటకు రెండువందల మంది సైనికులను, వారితో కూడ డెబ్బదిమంది ఆశ్వికులను రెండువందల మంది కాల్బలమును సిద్ధపరుపుడు.

24. పౌలు కొరకు కొన్ని గుఱ్ఱములను సిద్ధము చేయుడు. అతనిని అధిపతియైన ఫెలిక్సు వద్దకు క్షేమముగా చేర్చుడు” అని ఆజ్ఞాపించి,

25. ఫెలిక్సుకు ఈ విధముగా ఉత్తరము వ్రాసెను:

26. "గౌరవనీయులగు ఫెలిక్సు అధిపతికి కౌదియా లీసియా అభివందనములు.

27. ఈ మనుష్యుని యూదులు చుట్టుముట్టి పట్టుకొని చంప బోవుచుండ, ఇతడు రోము పౌరుడని నేను తెలిసికొని నా సైనికులతో వెడలి అతనిని తప్పించితిని.

28. ఇతని మీద వారు ఏమి నేరము మోపిరో తెలిసికొన వలెనని నేను ఇతనిని వారి విచారణ సభకు తీసికొని వెళ్ళితిని.

29. కాని, ఇతడు చెరసాలకుగాని లేదా మరణశిక్షకుగాని తగిన నేరమేమియు చేయలేదని నేను గ్రహించితిని. వారి ధర్మశాస్త్రమునకు సంబంధించిన నేరములు కొన్ని ఇతనిపై మోపబడినవి.

30. మరియు యూదులు ఇతనిపై కుట్ర పన్నుచున్నారను సమాచారము నాకు చేరగానే నేను ఇతనిని మీ చెంతకు పంప నిశ్చయించితిని. ఇతనికి వ్యతిరేకముగా వారి ఫిర్యాదులు ఏమైన ఉన్నచో వాటిని మీ ముందు ఉంచవచ్చునని నేను ఆ నేరారోపకులకు చెప్పితిని, మీకు శుభమగుగాక!”

31. సైనికులు వారికి ఈయబడిన ఆజ్ఞలను శిరసావహించి పౌలును ఆ రాత్రి యందే అంతిపత్రికి తీసికొనిపోయిరి.

32. మరునాడు ఆశ్వికులను అతనికి రక్షణగా ఉంచి కాల్బలము వెనుదిరిగి కోటకు వచ్చెను.

33. వారు అతనిని కైసరియాకు తీసికొనిపోయి అధిపతికి లేఖను అందించి పౌలును అతనికి అప్పగించిరి.

34. అధిపతి ఆ లేఖను చదువుకొని “నీవు ఏ ప్రదేశమునుండి వచ్చినవాడవు?” అని పౌలును ప్రశ్నించి, అతడు సిలీషియా వాడని తెలిసికొని,

35. “నీపై నేరము మోపినవారు వచ్చిన తరువాత, నిన్ను విచారించెదను" అని పలికెను. పిదప, పౌలును హేరోదు మందిరములో కావలివారి సంరక్షణలో ఉంచుడని ఆజ్ఞాపించెను.

 1. ఐదురోజుల పిదప, ప్రధానార్చకుడగు అననియా, కొందరు పెద్దలతోను తెర్తులు అను ఒక న్యాయవాదితోను, కైసరియాకు వెళ్ళెను. వారు అధిపతి సమక్షమునకు పోయి పౌలుకు విరుద్ధముగా ఫిర్యాదు చేసిరి.

2. అప్పుడు తెర్తుల్లు పౌలుపై ఈ విధముగా నిందారోపణ కావింప మొదలిడెను, “శ్లాఘనీయులగు ఫెలిక్సు ప్రభూ! మీ వలన మేము శాంతి సౌభాగ్యములను అనుభవించుచున్నాము. ఈ దేశ సంక్షేమమునకై మీరు ముందుచూపుతో పెక్కు సంస్కరణములను కావించుచున్నారు.

3. మేము అన్ని ప్రాంతములందును అన్ని విధముల మీకు కృతజ్ఞులము.

4. నేను మీ సమయము వృధాచేయను. మాపై కటాక్షించి, సంక్షిప్తముగా మా విన్నపమును ఆలకింపుడు.

5. ఈ మనుష్యుడు మాకొక వినాశకారిగా ఉన్నాడు. ఇతడు ప్రపంచవ్యాప్తముగా ఉన్న యూదులలో సంక్షోభము లేవదీయుచున్నాడు. మరియు ఇతడు నజరేయుల పక్షమునకు నాయకుడై

6. దేవాలయ మును కూడ అపవిత్రము చేయుటకు ప్రయత్నించినాడు. అందుచే మేము ఇతనిని పట్టి బంధించితిమి. (మేము మా ధర్మశాస్త్రము ప్రకారము ఇతనిని తీర్పు చేయవలె నని ఆలోచించితిమి.

7. కాని, లిసీయా సేనాధిపతి లోపలకు వచ్చి ఇతనిని మా యొద్ద నుండి బలవంతముగా తీసికొనిపోయెను.

8. తరువాత ఇతనిపై నేరము మోపదలచిన వారు మీ ఎదుటకు రావలెనని ఆజ్ఞ ఇచ్చెను.) మీరు ఈ మనుష్యుని అడిగి చూచినచో మేము ఇతని మీద మోపు నేరములు అన్నియు మీరే స్వయముగా తెలిసికొనగలరు."

9. అదంతయు నిజమే అని యూదులును ఆ ఆరోపణములను బలపరచిరి. ఫెలిక్సు సమక్షములో పౌలు సమాధానము .

10. అప్పుడు అధిపతియైన ఫెలిక్సు పౌలును మాట్లాడుమని సైగ చేయగా అతడు ఇట్లు చెప్పెను: “అనేక సంవత్సరములనుండి, మీరు ఈ ప్రజలకు న్యాయమూర్తులుగా ఉన్నారని నేను ఎరుగుదును. కనుక నా పక్షమున నేనే సంతోషముగా వాదింతును.

11. నేను దేవుని ఆరాధించుటకై యెరూషలేమునకు వెళ్ళి పండ్రెండు రోజులకన్న ఎక్కువ కాలము కాలేదని మీరే స్వయముగ తెలిసికొన గలరు.

12. నేను దేవాలయములోగాని, వారి ప్రార్థనామందిరములలోగాని, నగరములో మరెక్కడ గాని, ఎవరితోనైనను వాదించుట, లేక ప్రజలను పురికొల్పుట వీరు ఎవరును చూడలేదు.

13. ఇప్పుడు నాకు విరుద్ధముగా మీ ఎదుట వారు ఆరోపించిన నేరములను వారు నిరూపింపలేదు.

14. నా పూర్వుల దేవుని పూజించుచు వీరు భిన్నమని భావించు మార్గమును వెంబడించితిని. అది అంగీకరింతును. కాని మోషే చట్టమునందు ప్రవక్తల రచనల యందు వ్రాయబడిన విషయములను అన్నిటిని నేను నమ్ముదును.

15. నీతిపరులు, అవినీతిపరులు మృతుల నుండి మరల ఉత్థానమగుదురని వీరు నమ్మినట్లే నేనును దేవునియందు నమ్మకము కలిగియున్నాను.

16. కావున దేవుని ఎదుటను, మానవుల ఎదుటను స్వచ్చమైన మనస్సాక్షి కలిగియుండుటకు ఎప్పుడును శక్తివంచనలేక కృషి చేయుచున్నాను. -

17. “అనేక సంవత్సరముల తరువాత, నా సొంత జనులకొరకు, దానమును తెచ్చుటకు, కానుక లను అర్పించుటకు యెరూషలేమునకు వెళ్ళితిని.

18. శుద్ధీకరణ సంస్కారమునకు పిమ్మట నేను ఇట్లు చేయుచుండ వారు నన్ను దేవాలయమునందు చూచిరి. అప్పుడు నాతో ఎట్టి జనసమూహమును లేదు. ఎట్టి అల్లరియు జరుగలేదు.

19. కాని, ఆసియా మండలమునుండి వచ్చిన యూదులు కొందరు ఉండిరి. వారు ఏదైనా నాకు వ్యతిరేకముగా నిందలను మోపదలచినచో, వారే మీ ఎదుటకు రావలెను.

20. 'మరణించినవారు మరల లేపబడుదురు అను సత్యమును నమ్మినందుననే ఈనాడు మీచేత నేను తీర్పుచేయబడుచున్నాను' అని

21. నేను వారి ఎదుట పలుకుట తప్పవిచారణసభ ఎదుట నేనొనర్చిన నేరము ఇంకేదైనా ఉన్నచో వీరినే చెప్పనిండు” అని పలికెను.

22. ఈ మార్గమును గురించి బాగుగా ఎరిగిన ఫెలిక్సు, “ఆ సైన్యాధిపతి లిసీయా వచ్చిన పిదప మీ విషయమును విచారించెదను” అని వారిని పంపివేసెను.

23. పౌలును కాపలాలో ఉంచి కొంత స్వేచ్చను మాత్రము ఒసగి, అతని మిత్రులు అతని అవసరములు తీర్చుటకు అనుమతినిమ్మని శతాధి పతిని ఆజ్ఞాపించెను.

24. కొన్నాళ్ళ తరువాత ఫెలిక్సు తన భార్యయైన ద్రుసిల్లాతో వచ్చెను. ఆమె ఒక యూద స్త్రీ. అతడు పౌలును పిలిపించుకొని యేసుక్రీస్తునందు విశ్వాస మును గురించి అతడు చెప్పిన దానిని ఆలకించెను.

25. కాని, పౌలు నీతిని గురించియు, ఇంద్రియ నిగ్రహమును గురించియు. రానున్న తీర్పుగూర్చియు చర్చించి చెప్పినప్పుడు ఫెలిక్సు భయపడి, “ఇప్పుడు నీవు వెళ్ళవచ్చును. నాకు వీలున్నప్పుడు నేను నిన్ను మరల పిలిపించెదను” అని చెప్పెను.

26. ఆ సమయమున పౌలు తనకు కొంత డబ్బును ఇచ్చునని అతడు ఆశించెను. కనుక అతడు పౌలును తరచుగా పిలిపించుకొనుచు, అతనితో మాట్లాడుచుండెను.

27. రెండేండ్లు గడిచిన పిదప పోర్నియు ఫెసు, ఫెలిక్సు స్థానములో అధిపతిగ నియమింపబడెను. ఫెలిక్సు యూదుల అభిమానమునకై అభిలషించెను. కనుక అతడు పౌలును చెరసాలలోనే ఉంచెను. 

1. ఫెస్తు దేశాధికారమునకు వచ్చిన మూడు దినముల పిమ్మట క్రైసరియా నుండి యెరూషలేము నకు వెళ్ళెను.

2. అక్కడ ప్రధానార్చకులు, యూదుల నాయకులు పౌలుకు విరుద్ధముగా ఫిర్యాదులు తీసికొని వచ్చిరి.

3. వారు ఒక కుట్ర పన్ని పౌలును దారిలోనే చంపదలంచినందున, పౌలును యెరూషలేమునకు పంపి తమకు ఉపకారము చేయవలెనని వారు ఫెస్తును బతిమాలిరి.

4. అప్పుడు ఫెసు, “పౌలు కైసరియాలోనే ఖైదీగా ఉంచబడినవాడు. మరి నేను కూడ త్వరలోనే అచటకు వెళ్ళుచున్నాను.

5. మీ నాయకులు నాతో కూడ క్రైసరియాకు వచ్చి అతడు ఏదైనా నేరముచేసి ఉండినచో వానిని గూర్చి నిందా రోపణము చేయవచ్చును” అని , వారికి సమాధాన మిచ్చెను.

6. ఫెసు వారితో ఇంకను ఎనిమిది లేక పది దినములు గడిపి కైసరియాకు వెళ్ళెను. ఆ మరుసటి దినము అతడు న్యాయసభలో కూర్చుండి పౌలును లోనికి తీసికొనిరండని ఆజ్ఞాపించెను.

7. పౌలు సభలోనికి వచ్చినపుడు యెరూషలేమునుండి వచ్చిన యూదులు అతని చుట్టును చేరి, అతనికి వ్యతిరేకముగ పెక్కు తీవ్రమైన నేరములను మోపిరి. కాని, వానిని రుజువు చేయలేకపోయిరి.

8. పౌలు, “నేను యూదుల చట్టమునకుగాని, దేవాలయమునకుగాని, రోము చక్రవర్తికిగాని విరుద్ధముగా ఏ నేరమును చేసియుండ లేదు” అని చెప్పి తన తరపున వాదించెను.

9. ఫెస్తు యూదుల అభిమానమును పొందగోరి, “యెరూషలేములో నా యెదుటనే, ఈ నేరములు విచారింపబడుట నీకు ఇష్టమేనా?” అని పౌలును ప్రశ్నించెను.

10. అందుకు పౌలు, “నేను చక్రవర్తి న్యాయస్థానములోనే నిలబడి ఉన్నాను. ఇచ్చటనే నేను విచారింపబడవలెను. నేను యూదుల యెడల ఏ నేరమును చేయలేదు. అది మీకు బాగుగా తెలియును.

11. నేను చట్టమును ఉల్లంఘించి గాని, లేక మరణశిక్షకు తగిన నేరము చేసిగాని, నన్ను రక్షింపుమని మిమ్ములను బతిమాలుటలేదు. కాని నాపై మోపబడిన నేరములలో సత్యము లేకపోయి నచో నన్ను ఎవరును వారికి అప్పగింపలేరు. నేను ఈ విషయమును చక్రవర్తికి విన్నవించుకొందును” అని పలికెను.

12. అప్పుడు ఫెసు అతని సలహాదారు లతో సంప్రతించిన పిమ్మట, “నీవు చక్రవర్తికి చెప్పుకొన దలచితివిగాన నిన్ను చక్రవర్తి యొద్దకే పంపెదము” అని బదులు పలికెను.

13. కొంతకాలము గడిచిన పిదప అగ్రిప్పరాజు, బెర్నీసు, కైసరియాలోని ఫెస్తునకు స్వాగతము చెప్పుటకు వచ్చిరి.

14. అక్కడ వారు చాల దినములు ఉన్న పిదప ఫెసు పౌలు పరిస్థితిని అగ్రిప్పరాజునకు ఇట్లు వివరించెను: “ఇచ్చట ఫెలిక్సుచే ఖైదీగా ఉంచబడినవాడు ఒకడున్నాడు.

15. నేను యెరూషలేమునకు వెళ్ళినపుడు యూదుల ప్రధాన అర్చకులు, యూదుల పెద్దలు అతనికి వ్యతిరేకముగా నిందారోపణ చేసి, అతనిని శిక్షింపుడని కోరిరి.

16. ముద్దాయి తనపై నేరారోపణ కావించువారిని ముఖా ముఖిగా కలిసికొని తన పక్షమున తాను వాదించుకొనక పూర్వమే అతనిని ఇతరులకు అప్పగించు పద్ధతి రోమీయులకు లేదని నేను వారితో చెప్పితిని.

17. వారందరు ఇచటకు వచ్చినపుడు నేను కాలము వృధాచేయక మరుసటి దినముననే న్యాయసభలో కూర్చుండి, ఆ మనుష్యుని లోనికి తీసికొని రమ్మని ఆజ్ఞాపించితిని.

18. అప్పుడు అతని విరోధులు లేచి నిలుచుండి, వారు ఆరోపింతురని నేను అనుకొనిన నేరము ఏదియు అతనిపై మోపలేదు.

19. వారు తమ మతమును గూర్చి , పౌలుచేత సజీవుడని చెప్పబడు మృతుడగు యేసును గూర్చి మాత్రమే వాదులాడిరి.

20. ఈ విషయములను గురించిన సమాచారమును ఎట్లు పొందగలనో నిర్ణయించు కొనలేక పౌలును యెరూషలేముకు పోయి ఈ నిందారోపణలపై అచ్చట విచారింపబడుట తనకిష్టమేనా అని అడిగితిని.

21. కాని పౌలు, తనను సంరక్షణలో ఉంచి, తన విషయమును చక్రవర్తినే నిర్ణయింపనిండు అని నన్ను కోరెను. అందుచే అతనిని చక్రవర్తియొద్దకు పంపెడు వరకు సంరక్షణలో ఉంచవలెనని నేను ఆజ్ఞాపించితిని” అనెను.

22. అది విని అగ్రిప్పు, “ఇతడు చెప్పెడు దానిని నేను స్వయముగా వినదలచి తిని” అని ఫెస్తుతో చెప్పగా, “సరే, రేపు మీరు వినవచ్చును” అని ఫెస్తు బదులు పలికెను. -

23. మరుసటి రోజు అగ్రిప్ప, బెర్నీసు, సైన్యాధి పతులతోను, పుర ప్రముఖులతోను రాజ లాంఛన ములతోను దర్బారులో ప్రవేశించిరి. పౌలును లోనికి తీసికొనిరమ్మని ఫెసు ఆజ్ఞాపింపగా అతడు లోనికి తీసికొని రాబడెను.

24. ఫెస్తూ ఇట్లు చెప్పనారంభించెను: “అగ్రిప్పరాజా! ఇచట మాతో ఉన్నవారలారా! ఈ మనుష్యుని మీరు చూచుచున్నారు కదా! ఇక్కడను, యెరూషలేములోని యూదజనులందరును ఇతనికి వ్యతిరేకముగ నావద్దకు ఫిర్యాదులు తెచ్చిరి. ఇతడు ఇంకేమాత్రము బ్రతికియుండరాదని అరచిరి.

25. కాని మరణశిక్ష విధింపబడుటకు తగిన నేరము ఏదియు ఇతడు చేయలేదు అని నేను గ్రహించితిని. మరియు ఇతడు చక్రవర్తి యొద్దకు పోవలెనని కోరు కొన్నప్పుడు నేను ఇతనిని అక్కడకే పంపవలెనని నిర్ణయించుకొంటిని.

26. కాని, ఇతనిని గురించి చక్రవర్తికి ఏమి వ్రాసిపంపవలెనో నాకు సరిగా తెలియుటలేదు. అందుచే ఇతనిని మీ ఎదుటకు, అగ్రిప్పరాజా! ప్రత్యేకముగా ఇతనిని మీ సమక్షమునకు తెచ్చితిని. కనుక, ఇతనిని విచారించిన పిదప, చక్రవర్తికి వ్రాయుటకు ఏదైన కొంతవిషయము దొరక వచ్చును.

27. ఏలయన, ముద్దాయికి వ్యతిరేకముగ ఆరోపింపబడిన నేరములను స్పష్టము చేయకయే ఇతనిని అక్కడకు పంపుట ఉచితము కాదని నాకు తోచుచున్నది” అనెను.  

 1. అంతట అగ్రిప్ప పౌలుతో, “నీవునీ తరపున వాదించుకొనుటకు నేను అనుమతించుచున్నాను” అనెను. పౌలు తన చేయిచాచి తన పక్షమున ఇట్లు వాదించుకొనసాగెను:

2.“అగ్రిప్పరాజా! యూదులు నా మీద మోపిన వాటిని అన్నింటిని గూర్చి మీ ముందు నా తరపున నేను వాదించుకొనుటకు నేనెంతో ధన్యుడను.

3. మీకు సమస్తయూదుల ఆచారములును, వివాదములును కొట్టినపిండియే గదా! అందుచే నేను చెప్పుకొను దానిని ఓర్పుతో వినుడని మిమ్ము బతిమాలుకొనుచున్నాను.

4. నేను నా బాల్యమునుండి ఎట్లు జీవించు చున్నానో, యూదులందరు ఎరుగుదురు. మొదటి నుండి నా జీవితము అంతయు నా మాతృభూమి లోను, యెరూషలేములోను గడిపితినని వారికి తెలియును.

5. వారు సాక్ష్యమీయదలచినచో నేను మొదటినుండియు నిష్ఠాగరిష్ఠమైన మా మతవర్గములో సభ్యుడనుగా పరిసయ్యుడనుగా జీవించిన విషయము వారు ఎరిగినదే.

6. మా పూర్వులకు దేవుడు చేసిన వాగ్దానమునందు నాకు నమ్మకము ఉండుటచే ఇప్పుడు నేను విచారింపబడుటకు ఇచ్చట నిలువబడి ఉన్నాను.

7. ఈ వాగ్దానమును పొందు నమ్మకముతో మా పండ్రెండు గోత్రముల ప్రజలు రేయింబవళ్లు దేవుని ఆరాధించుచున్నారు. ఓ రాజా! ఆ నమ్మకము కొరకే నేను యూదులచే నేరస్థునిగా ఎంచబడితిని.

8. దేవుడు మృతులను జీవముతో లేపుటను యూదు లగు మీరు ఏల నమ్మలేదు? ,

9.“ఒకప్పుడు నేను నజరేయుడగు యేసు నామమునకు వ్యతిరేకముగా ఎంతో చేయవలెనని తల పెట్టితిని.

10. యెరూషలేములో నేను అట్లే చేసితిని. నేను ప్రధాన అర్చకులనుండి అధికారమును పొంది, పవిత్ర ప్రజలను అనేకులను చెరసాలలో వేసితిని. వారికి మరణదండన విధింపబడినప్పుడు దానికి సమ్మతించితిని,

11. ప్రార్థనామందిరము లన్నింటియందును వారిని పలుమారులు శిక్షించితిని. వారు వారి విశ్వాసమును విడనాడునట్లు ప్రయత్నించి తిని. వారిపై ఆగ్రహించి హింసించుటకై వారిని ఇతర నగరములకు కూడ వెన్నంటి తరిమితిని.

12. “నేను ఒకసారి అదే పనిమీద ప్రధాన యాజకులనుండి ఉత్తరువులను పొంది, అధికార ముతో దమస్కు నగరమునకు వెళ్ళితిని.

13. ఓ రాజా! మార్గమధ్యమున, మధ్యాహ్న సమయమున ఆకాశమునుండి నాకు ఒక వెలుగు కనబడినది. అది సూర్యుని కాంతికన్న మిన్నగా ఉండి నన్నును, నా వెంట వచ్చువారిని ఆవరించినది.

14. మేమంద రము క్రిందపడిపోయితిమి. అప్పుడు 'సౌలూ! సౌలూ! ఎందుకు నన్ను హింసించుచున్నావు? ములుకోలకు ఎదురు తన్నుట నీకే కష్టముగదా!' అని హీబ్రూ భాషలో ఒక స్వరము నాతో పలికెను.

15. 'ప్రభూ! నీవు ఎవరవు?” అని నేను అడిగితిని. అందుకు ప్రభువు, 'నీవు హింసించుచున్న యేసును నేనే.

16. నీవు లేచి నిలువబడుము. ఇప్పుడు నీవు చూచిన దానిని గూర్చి, చూడనున్న దానిని గూర్చి సాక్ష్యమిచ్చుటకు నిన్ను నా సేవకునిగా నియమించుకొనుటకై నీకిపుడు ప్రత్యక్ష మైతిని.

17. నేను నిన్ను యిస్రాయేలు ప్రజలనుండి, అన్యులనుండి కాపాడెదను. వారి కొరకు నిన్ను నేను ఇపుడు పంపుచున్నాను.

18. నీవు వారికి కనువిప్పు కలిగించి అంధకారమునుండి వెలుగులోనికి, పిశాచ ప్రభావమునుండి దేవుని వైపునకు, వారిని మరలింప వలెను. అప్పుడు నాయందలి విశ్వాసము వలన వారి పాపములు క్షమింపబడును. వారు ఎన్నుకొనబడిన దేవుని ప్రజలలో లెక్కింపబడుదురు' అని పలికెను.

19. “కనుక ఓ అగ్రిప్పరాజా! నేను పరలోకము నుండి చూచిన ఆ దర్శనమునకు అవిధేయుడను కాలేదు.

20. మొదట దమస్కులోనివారికి, యెరూషలేములోనివారికి, తరువాత యూదయా దేశమునందంతటను ఉన్నవారికి, అన్యులకు, వారి పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడి దానికి తగినట్టి క్రియలను చేయుచు, దేవుని వైపునకు మరలవలెనని బోధించితిని.

21. ఈ కారణము చేతనే నేను దేవాలయములో ఉన్నప్పుడు యూదులు నన్ను పట్టు కొని చంపప్రయత్నించిరి.

22. కాని ఈనాటివరకు నాకు దేవుడు తోడ్పడుచున్నాడు. నేను ఇక్కడ నిలుచుండి పిన్న, పెద్దలందరకు సాక్ష్యమిచ్చుచున్నాను. జరుగ బోవు దానిని గూర్చి మోషే చెప్పినది, ప్రవక్తలు వెల్లడించినది, నేను చెప్పుచున్నది ఒక్కటియే.

23. అదేమన: మెస్సియా శ్రమలు అనుభవింపవలెను. ప్రథముడుగా మృతులలోనుండి లేచి యూదులకు అన్యులకు రక్షణ జ్యోతిని వెల్లడింపవలెను.”

24. ఈ విధముగా పౌలు తన తరపున వాదించుచుండగా ఫెస్తు “పౌలు! నీవు వట్టి పిచ్చి వాడవు. నీవు నేర్చుకొన్న గొప్ప విద్యయే నిన్ను పిచ్చివానిగా చేయుచున్నది” అని బిగ్గరగా అరచెను.

25. అందుకు పౌలు “ఘనమైన ఫెస్తూ! నేను పిచ్చివాడను కాను. నేను చెప్పుచున్న మాటలు యథార్గములు.

26. రాజుకు ఈ సంగతులు తెలియును గనుక నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటియు అతని నుండి దాచబడలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మారుమూల జరిగిన విషయము కాదు."

27. “అగ్రిప్పరాజా! మీరు ప్రవక్తలను నమ్ముచున్నారా? మీరు నమ్ముచున్నారని నాకు తెలియును” అనెను.

28. అగ్రిప్పరాజు పౌలుతో, “ఇంత స్వల్పకాలములోనే నన్ను క్రైస్తవునిగా చేయదల చుచున్నావా?" అని పలుకగా, పౌలు,

29. “స్వల్ప కాలము కానిండు, దీర్ఘకాలము కానిండు. ఈనాడు నేను చెప్పునది వినుచున్న మీరును, ఇచ్చటనున్న ఇతరులును, ఈ నా సంకెళ్ళు మినహా నా వలె కావలె నని, నేను దేవుని ప్రార్ధించుచున్నాను” అనెను.

30. అప్పుడు అగ్రివ్పరాజు, బెర్నీను, అధిపతియగు ఫెసు, మిగిలిన వారందరును లేచిరి.

31. వారు అచ్చటనుండి పోవుచు, “ఇతడు చంపబడు టకుగాని, లేదా, చెరలో బంధింపబడుటకుగాని తగిన నేరమేదియు చేసియుండలేదు” అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి.

32. అగ్రిప్పరాజు ఫెసుతో, “చక్రవర్తికి నివేదించుకొందును అని పలుక కుండినచో, ఇతడు విడుదలచేయబడి ఉండెడివాడే” అనెను. 

1. మేము ఓడనెక్కి ఇటాలియాకు పోవలెనని నిర్ణయింపబడగా, వారు పౌలును, ఇతర ఖైదీలను జూలియసు అనువానికి అప్పగించిరి. ఇతడు చక్రవర్తి పటాలములో ఒక శతాధిపతి.

2. ఆసియా రాష్ట్రపు ఓడరేవులకు బయలుదేరుటకు సిద్ధముగా ఉన్న అదైమిత్తియము నుండి వచ్చిన ఓడనెక్కి ప్రయా ణము కావించితిమి. 'తెస్సలోనికనుండి వచ్చిన 'ఆరిస్టార్కు' అను మాసిడోనియా నివాసి మా వెంట ఉండెను.

3. మరునాడు మేము సీదోను చేరుకొంటిమి. పౌలు యెడల జూలియసు జాలిగల వాడైనందున, తన మిత్రులను చూచుటకు, వారు అతనికి కావలసి నది ఇచ్చుటకు అనుమతిని ఇచ్చెను.

4. అట నుండి సాగిపోయి గాలి ఎదురుగా వీచుచుండుటచేత సైప్రసు ద్వీపమును చాటుగా చేసికొని మేము పయనించితిమి.

5. సిలీషియా పంఫీలియాల మీదుగా మేము సముద్ర మును దాటుచు లిసియాలోని మీరాకు వచ్చితిమి.

6. అప్పుడు అలెగ్జాండ్రియా నుండి ఇటాలియాకు పోవుచున్న ఓడను కనుగొని, దళాధిపతి మమ్ములను దానిలో ఎక్కించెను.

7. మేము నెమ్మదిగా అనేక దినములు ఓడ ప్రయాణము చేసి, ఎట్టకేలకు అతి కష్టముతో క్నీదు పట్టణమును చేరుకొంటిమి. గాలి ఆ దిశలో మమ్ము లను ఏ మాత్రము ముందుకు పోనీయలేదు. అందుచే మేము సల్మోను అగ్రము మీదుగా క్రీటు ద్వీపమును చాటుగా చేసికొని సాగిపోయితిమి.

8. తీరము వెంట పయనించి అతి కష్టముపై మేము లిసీయా పట్టణ మునకు చేరువనున్న 'భద్రమైన రేవులు' అను చోటునకు వచ్చితిమి.

9. అచ్చట మేము చాలకాలము గడిపితిమి. అప్పటికి ఉపవాసదినము కూడ గడిచిపోయెను. మరల మా సముద్ర ప్రయాణము అపాయకరముగా ఉండెను. కావున పౌలు వారికి సలహాను ఇచ్చుచు,

10. “మిత్రులారా! ఇచ్చటనుండి మన సముద్ర ప్రయాణము అపాయకరముగా కనబడుచున్నది. ఓడకు, ఓడలోని సరకులకే గాక, మన ప్రాణములకు గూడ పెనుముప్పు రానున్నది” అని హెచ్చరించెను.

11. కాని ఆ శతాధిపతి పౌలు సలహాను పెడచెవిని బెట్టి, నావికు డును, ఓడ యజమానుడును చెప్పిన దానినే వినెను.

12. శీతకాలము గడపుటకు ఆ ఓడరేవు అనుకూలమైనది కాదు. కాబట్టి, సాధ్యమైన యెడల ఫినిక్సుకు చేరుకొన వలెనని మాలో చాలమంది సుముఖులై ఉన్నందున అటు పయనము సాగించితిమి. క్రీటు ద్వీపము లోనున్న ఈ రేవు నైఋతి వాయవ్య దిశలకు ఎదురుగా ఉన్నది. అచ్చటనే వారు శీతకాలమును గడపగలము అనుకొనిరి.

13. పిదప దక్షిణ దిశనుండి సన్నని గాలి వీచసాగెను. అందుచే వారు అనుకొనినట్లే జరుగునని లంగరును ఎత్తి వీలైనంత సమీపముగా క్రీటు దీవి తీరము వెంబడి ఓడ ప్రయాణము కావించిరి.

14. కాని త్వరలోనే 'ఈశాన్య పవనము' అను ఒక పెద్ద సుడిగాలి వీచసాగెను.

15. అది ఓడకు తీవ్రముగా తగులుటచే ఆ ఓడ గాలిలో చొచ్చుకొని ముందుకు పోవ సాధ్యపడక పోయెను. అందుచే మేము మా ప్రయత్నమును విరమించి గాలి వాలుకు ఓడను వదలివేసితిమి.

16. అట్లు మేము 'కౌదా' అను చిన్న ద్వీపము చాటునకు చేరితిమి. అచ్చట ఓడకుగల పడవను అతి కష్టముతో భద్రపర్చ గలిగితిమి,

17. వారు దానిని ఓడపైకి లాగి, ఓడను గట్టిగా త్రాళ్లతో బంధించిరి. సూర్తిసు ఇసుక దిబ్బలకు కొట్టుకొందు మేమో అని భయపడిరి. వారు తెర చాపలను దింపి వేసి, ఓడను గాలికి కొట్టుకొని పోవ వదలివేసిరి.

18. తుఫాను గాలి కొనసాగుటచే, ఆ మరుసటి దినమున వారు ఓడలోని సరకులను సముద్రములో పడవేసిరి.

19. మరునాడు వారు ఓడ సామగ్రిని కూడ చేతులార నీటిపాలు కావించిరి.

20. చాల రోజుల వరకు సూర్యుడుగాని, నక్షత్రములుగాని కనిపింపలేదు. గాలి తీవ్రముగా వీచుచునే ఉండెను. చిట్టచివరకు ప్రాణములు దక్కించు కొనగలము అను ఆశను గూడ వదలుకొంటిమి.

21. ఎంతోకాలము వారు ఆహారము భుజింప కుండినందున, పౌలు లేచి, వారి ఎదుట నిలువబడి, “ప్రజలారా! నేను చెప్పినట్లుగ మీరు విని, క్రీటు దీవి నుండి ఓడ ప్రయాణము చేయకుండిన యెడల, మనము ఈ కష్టనష్టముల నుండి తప్పించుకొని ఉండెడివారము.

22. అయినను ఇప్పుడు ధైర్యముగా ఉండుడని నేను కోరుచున్నాను. ఓడ నష్టము తప్ప మీలో ఎవరికిని ప్రాణనష్టము కలుగదు.

23. ఏలయన నేను ఎవరికి చెందినవాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత, గతరాత్రి నా చెంతకు వచ్చి,

24. 'పౌలు! నీవు భయపడవలదు. నీవు చక్రవర్తి ఎదుట నిలువబడవలసియున్నది. అందుచే దయామయుడగు దేవుడు, నీతో కూడ ఓడ ప్రయాణము చేయుచున్న వారి ప్రాణములను నీకు అనుగ్రహించియున్నాడు' అని తెలియపలికెను.

25. కనుక ప్రజలారా! ధైర్యముగా ఉండుడు. ఏలయన నాకు చెప్పబడినట్లు జరుగునని దేవునియందు నాకు నమ్మకము ఉన్నది.

26. కాని మనము ఒక దీవి దరికి కొట్టుకొనిపోవలసి ఉన్నది” అని పలికెను.

27. పదునాలుగవ నాటి రాత్రికి మేము తుఫాను గాలిచే అద్రియ సముద్రమునందు కొట్టుకొని పోవు చుంటిమి. ఇంచుమించు అర్ధరాత్రి సమయమునకు మేము ఒక భూమి చేరువకు చేరుకొనుచున్నట్లు నావికులు గ్రహించిరి.

28. అందుచే వారు, లోతు తెలిసికొనుటకై బరువును కట్టిన ఒక త్రాటిని నీటిలోనికి జారవిడిచి, అచ్చట నీటిలోతు నూటయిరువది అడుగులున్నదని కనుగొనిరి. మరికొంత దూరము పోయిన పిదప వారు అట్లే చేసి, తొంబది అడుగుల లోతున్నదని తెలిసికొనిరి.

29. తమ ఓడ రాతి గుట్టలకు కొట్టుకొనునేమో అని వారు భయపడిరి. అందుచే వారు ఓడ వెనుక భాగము నుండి నాలుగు లంగరులను దింపి, ప్రొద్దు పొడుపునకై ప్రార్థించిరి.

30. నావికులు తప్పించుకొన ప్రయత్నించుచు,  పడవను నీటిలోనికి దింపుచు, ఓడ ముందు భాగము నుండి లంగరును వేయుచున్నట్లు నటించిరి.

31. పౌలు అది కనిపెట్టి శతాధిపతితో, సైనికులతో, “ఈ నావికులు ఓడపై నుండక పోయినచో మీరు రక్షింప బడలేరు” అని హెచ్చరిక చేసెను.

32. అందుచే సైనికులు పడవకు కట్టిన త్రాళ్లను కోసివేసి దానిని నీటిలో పడనిచ్చిరి.

33. తెల్లవారుచుండగా భుజింపుడని పౌలు వారిని ఇట్లు బతిమాలెను: “మీరు పదునాలుగు రోజుల నుండి నిరీక్షించుచు ఇప్పటివరకు ఏమియు భుజింప లేదు.

34. కనుక ఇప్పుడైన మీరు భుజింపవలెను. మీకు బలము కలుగును. మీ తలవెంట్రుకలలో ఒకటైనను రాలిపోదు”

35. అని చెప్పి పౌలు రొట్టెను తీసికొని వారందరి ముందు దేవునికి స్తోత్రములు సమర్పించి, దానిని త్రుంచి భుజింపసాగెను.

36. వారందరును ధైర్యమును తెచ్చుకొని భుజించిరి.

37. ఓడలో మొత్తము రెండు వందల డెబ్బది ఆరు మందిమి ఉంటిమి.

38. అందరు చాలినంత , భుజించిన పిదప ఓడలోని గోధుమలను సముద్రములో పారబోసి ఓడను తేలిక చేసిరి.

39. తెల్లవారిన పిదవ వారికి ఒక ఒడ్డు కనబడెను. కాని అది ఏ తీరమో వారు గుర్తు పట్టలేకపోయిరి.. ఆ ఒడ్డు వెంబడి ఒక సముద్రపు పాయను చూచి, సాధ్యమైనచో ఓడను అటు తీరము చేర్చవలెనని నిర్ణయించుకొనిరి.

40. అందుచే వారు లంగరును ట్రెంచి, దానిని నీటిలో వదలివేసి, అదే సమయములో చుక్కాని దండెమునకు కట్టబడియున్న త్రాళ్లను విప్పివేసిరి. పిదప వారు ఓడ ముందు భాగమున ఉన్న తెరచాపను పైకెత్తినందుచే గాలివీచగా, ఓడ ముందుకు సాగి తీరమును చేరుటకు వీలు పడెను.

41. రెండు ప్రవాహములు కలిసినచోట ఆ ఓడ ఒక ఇసుక దిబ్బ యొద్దకు కొట్టుకొనిపోయి ఇసుకలో దిగబడెను. అట్లు ఓడ ముందుభాగము ఇసుకలో కూరుకొని పోవుటచే వెనుక భాగము అలల ధాటికి ముక్కచెక్కలయ్యెను.

42. బందీలు ఒడ్డునకు ఈదుకొని పారిపోవు దురని ఊహించి, ఆ సైనికులు వారిని చంపదలచిరి.

43. కాని ఆ శతాధిపతి పౌలును రక్షింపగోరి వారిని అట్లు చేయవలదని వారించెను. దానికి బదులు ఈదగలిగిన వారు మొదట ఓడ నుండి దుమికి తీరమును చేరవలెనని ఆజ్ఞాపించెను.

44. మిగిలిన వారిలో కొందరు చెక్కలపై, మరికొందరు విరిగిపోయిన ఓడ భాగములపై ఒడ్డునకు పోవలెననెను. ఈ విధముగా చేసి మేము అందరము క్షేమముగా ఒక తీరమును చేరితిమి.  

 1. మేము సురక్షితముగా ఒడుకు చేరినపుడు అది మాల్టా దీవి అని తెలిసికొంటిమి.

2. ఆ దీవిలో నివసించువారు మా యెడ ప్రత్యేక సానుభూతిని చూపిరి. అప్పుడు వర్షము కురియుచు, చలిగా నుండుటచే వారు చలిమంటలు వేసి, మాకు అచ్చట స్వాగతమిచ్చిరి.

3. పౌలు మోపెడు పుల్లలను ప్రోగు చేసి, వాటిని మంటలో వేయుచుండగా ఆ వేడికి ఒక విషసర్పము బయటికివచ్చి పౌలు చేతిని చుట్టుకొనెను.

4. పౌలు చేతినుండి ఆ విషసర్పము వ్రేలాడుచుండుట చూచి ఆ దీవి వాసులు, “ఇతడు నిజముగా నరహంత కుడే; ఇతడు సముద్రము నుండి తప్పించుకొని బ్రతికి బయటపడినను, న్యాయము వీనిని బ్రతుకనీయలేదు” అని తమలో తాము చెప్పుకొనిరి.

5. కాని, పౌలు ఆ విషసర్పమును మంటలోనికి విదిలించి ఏ హాని లేక నిమ్మకు నీరెత్తినట్టు ఉండెను.

6. అతని శరీరము ఉబ్బిపోవునని, లేక వెంటనే అతడు క్రిందబడి మరణించునని వారు వేచియుండిరి. అటుల ఎంత వేచియున్నను అతనికి ఏ హానియు జరుగకుండుట చూచి, వారు తమ అభిప్రాయమును మార్చుకొని అతడు ఒక దేవుడని చెప్పుకొనిరి.

7. పుబ్లియు అనువాడు ఆ దీవిలో ప్రముఖుడు. అతనికి ఆ ప్రాంతమున కొంత పొలము కలదు. అతడు మాకు స్వాగతమిచ్చి మూడు రోజుల వరకు ఆతిథ్య మొసగెను.

8. అప్పుడు పుబ్లియు తండ్రి జ్వరముతోను, రక్త విరేచనములతోను మంచము పట్టి ఉండెను. పౌలు అతనిని సందర్శించి, ప్రార్ధించి, అతనిపై చేతులుంచి వానిని స్వస్థపరచెను.

9. ఇది జరిగిన తరువాత ఆ దీవిలోనున్న వ్యాధిగ్రస్తులందరు వచ్చి పౌలు వలన స్వస్థత పొందిరి.

10. వారు మాకు అనేక బహుమతులను ఇచ్చిరి. మరల మేము ఓడ ప్రయాణమునకు బయలుదేరినప్పుడు మాకు కావల సిన వస్తువులను వారు అందించిరి.

11. అలెగ్జాండ్రియాకు చెందిన 'అశ్విని చిహ్నము'గా గల ఓడ ఒకటి శీతకాలమంతయు ఆ దీవియందే ఉండుటచే మూడునెలల తరువాత మేము దానిపై పయనించితిమి.

12. తరువాత మేము 'సిరకు సె'ను చేరుకొంటిమి. అక్కడ మూడు రోజు లుంటిమి.

13. అచ్చట నుండి రెజీయుము నగరము నకు వచ్చితిమి. మరుసటిదినమున దక్షిణ దిశకు గాలి వీచసాగెను. రెండవదినము మేము పుతెయోలిపురము చేరితిమి.

14. అచ్చట మాకు కొందరు సోదరులు కనబడి ఏడురోజులవరకు వారియొద్ద ఉండుమని కోరిరి. పిదప మేము రోము నగరమునకు వచ్చితిమి.

15. రోములో ఉన్న సోదరులుమేము వచ్చిన సంగతిని విని మమ్ము కలిసికొనుటకై, అప్పియ సంత వరకును, మూడు సత్రములవరకును వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతావందనములు చెల్లించి ధైర్యము వహించెను.

16. మేము రోము చేరుకొనినప్పుడు, ఒక సైనికుని కాపలాలో పౌలు ఒంటరిగా నివసింప అను మతింపబడెను.

17. మూడు రోజుల పిదప పౌలు స్థానిక యూదుల నాయకులను సమావేశమునకు పిలి పించెను. వారు సమావేశమైనప్పుడు పౌలు వారితో, “సోదరులారా! నేను మన జనులకును, మన పూర్వుల నుండి పొందిన ఆచారములకును వ్యతిరేకముగా ఏమియు చేయకపోయినను, యెరూషలేములో ఖైదీగా పట్టుకొనబడి, రోమీయులకు అప్పగింపబడితిని.

18. వారు నన్ను పరీక్షించిన తరువాత నన్ను వదిలివేయ గోరిరి. ఎందుకన నేను చంపబడుటకు తగిన నేరమేమియు చేసి ఉండలేదని వారు గ్రహించిరి.

19. కాని, యూదులు దీనికి వ్యవతిరేకించినపుడు నేను చక్రవర్తికి ఫిర్యాదు చేసికొందునని చెప్పవలసివచ్చెను కాని, నా సొంత జనముపై నేరము మోపుటకు నేను అటుల చేయలేదు.

20. అందుచే నేను మిమ్ము చూచి, మీతో మాట్లాడవలెనని పిలిపించితిని. ఏలయన, యిస్రాయేలు ప్రజలు ఎవరికొరకు నిరీక్షించు చున్నారో, ఆయన నిమిత్తమే నేను ఈ సంకెళ్లతో బంధింపబడి ఉన్నాను” అని పలికెను.

21. అప్పుడు వారు, “మాకు నిన్ను గురించి, యూదయానుండి ఎట్టి వర్తమానములు అందలేదు. ఇచ్చటకు వచ్చిన సోదరులలో ఎవరును నిన్ను గురించి ఫిర్యాదులు చేయుటగాని, చెడుగా మాట్లాడుటగాని జరుగలేదు.

22. కాని, నీవు ఏ పక్షమునకు చెందియున్నావో ఆ పక్షమునకు వ్యతిరేకముగా ప్రజలందరును చెప్పుకొను చుండుటచే నీ నుండియే నీ అభిప్రాయములను వినగోరుచున్నాము” అని వారు పలికిరి.

23. కావున, పౌలుతో మాట్లాడుటకై వారు ఒక దినమును నిర్ణయించి, వారిలో చాలమంది ఆ దినమున పౌలు నివసించుచున్న ఇంటికి వచ్చిరి. ప్రొద్దు పొడిచినది మొదలుకొని ప్రొద్దుక్రుంకెడి వరకు పౌలు వారికి వివరించుచు దేవునిరాజ్యమును గూర్చి సందేశమొసగెను. మోషే చట్టమునుండియు, ప్రవక్తల గ్రంథములనుండియు నిదర్శనములు చూపుచు అతడు యేసును గురించి వారిని ఒప్పింప ప్రయత్నించెను.

24. వారిలో కొందరు అతడి మాటలను అంగీక రించిరి. మరికొందరు అంగీకరింపకపోయిరి.

25. అందుచే వారిలో వారికి పొత్తు కుదరక, అచ్చటనుండి పోవుచుండ పౌలు ఇట్లు చెప్పెను: “యెషయా ప్రవక్త ద్వారా పవిత్రాత్మ మీ పూర్వులకు ఎంత చక్కగా చెప్పెనో ఆలకింపుడు.

26. ఎట్లన: “నీవు పోయి, ఈ ప్రజలతో ఇట్లు చెప్పుము. ఎంతగా విన్నను మీరు గ్రహింపరు. ఎంతగా చూచినను. మీరు గమనింపరు.

27. ఈ ప్రజల బుద్ధి మందగించుటచే వారు చెవులను మూసికొనిరి. కన్నులను కప్పివేసికొనిరి. లేకున్నచో వారి కన్నులు చూడగలిగెడివి. వారి వీనులు వినగలిగెడివి. వారి బుద్ధులు అర్థము చేసికొనగలిగెడివి. వారు నా వైపునకు తిరిగి యుండెడివారు. అపుడు నేను వారికి స్వస్థత కలిగించియుండెడివాడను'. అని దేవుడు చెప్పెను. దీనిని వారితో చెప్పుము” అని ఆయన పలికెను.

28. ఇట్లు చెప్పి పౌలు మరల, “దేవుని రక్షణ సందేశము అన్యులకు పంపబడినది కనుక వారు ఆలకించెదరు అని మీరు తెలిసికొనుడు” అని పలికెను.

29. ఇది విన్న పిదప యూదులు వారిలో వారు తీవ్రముగా వాదించుకొనుచు వెళ్ళిపోయిరి.

30. పౌలు తాను అద్దెకు తీసికొనిన ఇంటిలో రెండు సంవత్సరములపాటు ఉండి తనను చూడవచ్చిన వారందరిని స్వీకరించుచుండెను.

31. అతడు బహిరంగముగా, నిరాటంకముగా దేవునిరాజ్యమును గురించి ప్రభువైన యేసుక్రీస్తు గురించి వారికి బోధించుచుండెను.