1. నేను ప్రాకారము నిర్మించి, ద్వారములు నిలిపి, ద్వారసంరక్షకులును, లేవీయులను, పాటలు పాడు వారిని నియమించిన పిమ్మట,
2. యెరూషలేమును పాలించుటకు నా సహోదరుడు హనానీకిని మరియు కోటను సంరక్షించుచున్న హనన్యాకును అధికారమిచ్చితిని. హనన్యా నమ్మదగినవాడు, అందరికంటె అధికమైన దైవభయము కలవాడు.
3. నేను వారితో ఉదయము ప్రొద్దెక్కువరకు నగరద్వారములు తెరవరాదనియు, సాయంకాలము ప్రొద్దుగ్రుంకక మునుపే వానిని మరల మూసి గడెలు బిగింపవలెననియు ఆజ్ఞాపించితిని. యెరూషలేమున వసించువారిని కొందరిని రక్షకభటులుగా నియమింపుడని ఆదేశించితిని. వారిలో కొందరు కొన్ని తావులందు, మరికొందరు వారివారి యింటిపట్టులందు వంతులచొప్పున కాపుండ నియమింపవలెనని చెప్పితిని.
4. యెరూషలేము పట్టణము విశాలముగా ఉన్నదిగాని అందువసించువారు మాత్రము కొద్దిమందియే. ఇంకను ఇళ్ళు కట్టబడలేదు.
5. కనుక ప్రజలను, వారి నాయకులను ప్రోగుజేసి ఆయా కుటుంబముల జనాభా లెక్కలు సరిచూడవలెనను ప్రేరణను దేవుడు నాకు కలిగించెను. ప్రవాసము నుండి మొట్టమొదట తిరిగివచ్చినవారి జాబితాలు దొరకినవి. ఆ వివరములు ఇవి.
6. ఈ క్రింది ప్రజలు యూదా రాజ్యవాసులు. బబులోనియా రాజగు నెబుకద్నెసరు వారిని బందీలుగా కొనిపోయెను గదా! వారిప్పుడు ప్రవాసము నుండి తిరిగివచ్చి యెరూషలేము యూదా దేశములోని తమ తమ నగరములు చేరుకొనిరి.
7. ఇట్లు తిరిగి వచ్చిన వారి నాయకులు సెరుబ్బాబెలు, మేషూవ, నెహెమ్యా, అసర్యా, రామాయా, నహమని, మొర్దేకయి, బిల్షాను, మిస్పేరెతు, బిగ్వయి, నెహూము, బానా.
8-25. ప్రవాసమునుండి తిరిగివచ్చిన వివిధ కుటుంబములు, వారి సంఖ్యలివి: పరోషు -2172; షేపట్య-372; ఆర-652; పహత్మోవబు (యేషూవ, యేవాబు వంశజులు)-2818; ఏలాము-1254; సత్తు-846; జక్కయి-760; బిన్నుయి-648; బేబై-628; అస్గాదు-2322; అదోనీకాము-667; బిగ్వయి-2067; ఆదీను-655; హిజ్కియా అనబడు ఆతేరు-98; హాషూము-328; బేసయి-324; హారీఫు-112; గిబ్యోను-95.
26-38. ఈ క్రింది నగరములకు చెందినవారు ప్రవాసము నుండి తిరిగివచ్చిరి. వారి సంఖ్యలివి: బేత్లహేము, నెటోఫా-188; అనాతోతు-128; బేతస్మావేతు-42; కిర్యత్యారీము, కేఫిరా, బేరోతు-743; రామా, గేబా-621; మిక్మాసు-122; బేతేలు, ఆయి-123; రెండవ నెబో-52; రెండవ ఏలాము -1254; హారిము-320; యెరికో-345; లోదు, హాదిదు, ఓనో-721; సేనా-3930.
39-42. ప్రవాసము నుండి తిరిగివచ్చిన యాజక కుటుంబములు, వారి సంఖ్యలివి: యేషూవ వంశజుడగు యెదాయా-973; ఇమ్మేరు-1052; పషూరు-1247; హారిము-1017.
43. లేవీయకుటుంబములు, వారి సంఖ్యలివి: కద్మీయేలు వంశజులైన యేషూవ, హోదవ్యా -74.
44. ఆసాపు వంశజులైన దేవాలయ గాయకులు-148.
45. షల్లూము, ఆతీరు, తల్మోను, అక్కూబు, హతీతా, షోబయి కుటుంబములకు చెందిన దేవాలయద్వార సంరక్షకులు-138.
46-56. ప్రవాసము నుండి తిరిగివచ్చిన దేవాలయ పనివాండ్రు (నెతీనీయులు); సీహా, హసూఫా, టబ్బావోతు, కెరోసు, సియా, పాదోను, లెబనా, హగాబా, షల్మయి, హానాను, గిద్దేలు, గహారు, రెయాయ, రెసీను, నెకోదా, గస్సాము, ఉజ్జా, పాస్యా, బెసాయి, మెవూనీము, నెఫూషేసిము, బక్బూకు, హకూఫా, హర్హురు, బస్లీతు, మెహీదా, హర్షా, బర్కోసు, సీసెరా, తేమ, నెసీయా, హతీఫా.
57-59. ప్రవాసమునుండి తిరిగివచ్చిన సొలోమోను సేవకులు: సోటయి, సోఫెరెతు, పెరీదా, యాలా, దర్కోను, గిద్దెలు, షెఫట్య, హత్తీలు, పోకెరెతు, హస్సెబాయీము, ఆమోను.
60. దేవాలయ పనివాండ్రు, సొలోమోను బంటులు మొత్తము కలసి-392.
61-62. దెలాయా, తోబియా, నెకోదా కుటుంబములకు చెందినవారు 642 కలరు. వీరు తెల్మేలా, టెల్హర్షా, కెరూబు, అద్ధోను, ఇమ్మేరు నగరములనుండి తిరిగివచ్చిరి. కాని వీరు తాము యిస్రాయేలు వంశజులని ఋజువు చేసికోలేకపోయిరి.
63-65. హోబయా, హక్కోసు, బెర్సిల్లయి అను కుటుంబములకు చెందిన యాజకులు వారి మూల పురుషులను చూపలేకపోయిరి. బెర్సిల్లయి కుటుంబపు మూలపురుషుడు గిలాదునందలి బర్సిల్లయి కుటుంబమునకు చెందిన ఆడపడుచును పెండ్లియాడి తన మామ కుటుంబనామమును స్వీకరించెను. వారు తమ పూర్వుల నామముల కొరకు జాబితాలు గాలించిరి గాని, ఆ పేర్లు దొరకలేదు. కనుక వారిని శుద్ధిగల వారిగా యాజకులుగా గణింపలేదు. వారిని గూర్చి ఉరీము తుమ్మీము ధరించుకొని దైవచిత్తమును తెలిసికొను యాజకుడెవరైన ఏర్పడువరకు వారు పవిత్ర నైవేద్యములు భుజింపరాదని అధికారి కట్టడచేసెను.
66-69. ప్రవాసమునుండి తిరిగివచ్చినవారు మొత్తము -42360. వారి మగబానిసలు, ఆడుబానిసలు-7337. పాటలు పాడువారు, ఆడువారు, మగవారు కలిసి-245. గుఱ్ఱములు-736, కంచర గాడిదలు-245, ఒంటెలు-435, గాడిదలు-6720.
70-72. నాయకులు చాలమంది వనికి విరాళములిచ్చిరి. ఆ వివరములివి: అధికారి: 1000 బంగారు నాణెములు, 50 అర్చన పాత్రలు, 530 యాజక వస్త్రములు. ఆయాకుటుంబాల పెద్దలు: 20000 బంగారు నాణెములు, 2200 వెండి కాసులు. మిగిలిన ప్రజలు: 20000 బంగారు నాణెములు, 2000 వెండి నాణెములు, 67 యాజక వస్త్రములు.
73. యాజకులు, లేవీయులు, దేవాలయ ద్వారసంరక్షకులు, గాయకులు, దేవాలయ పరిచారకులు, సామాన్య జనులు మొదలైన యిస్రాయేలీయులందరు తమతమ నగరములలో స్థిరపడిరి.