1. “ఆకాశమా! నా మాటలు వినుము. భూమీ! నా పలుకులు ఆలింపుము
2. నా సందేశము వానచినుకువలె పడును. నా ఉపదేశము మంచువలె కురియును. నా పలుకులు లేబచ్చికపై జల్లులవలె లేబైరులపై తుప్పరలవలె దిగివచ్చును
3. నేను ప్రభువు నామమును స్తుతించెదను ఎల్లరు ఆయన మాహాత్మ్యమును ఉగ్గడింపుడు.
4. ప్రభువు మహాసంరక్షకుడు ఆయన యోగ్యుడు, న్యాయవంతుడు, విశ్వసనీయుడు, నిర్మలుడు, న్యాయమును ధర్మమును పాటించువాడు
5. యిస్రాయేలీయులు ఆయన పుత్రులుగా నుండక దుష్టులు, భ్రష్టులు, కపటాత్మలు, వక్రబుద్ధిగలవారైరి.
6. బుద్దిహీనులారా! మందమతులారా! ప్రభువునకు మీరు చేయు ప్రత్యుపకార మిట్టిదియా? ఆయన మీకు తండ్రి, మిమ్ము సృజించినవాడు. మిమ్మొక జాతిగా తీర్చిదిద్దినవాడు.
7. పూర్వకాలములను స్మరించుకొనుడు. ప్రాచీనయుగములను స్మృతికి తెచ్చుకొనుడు. మీ తండ్రులను అడిగి తెలిసికొనుడు. మీ వృద్ధులను ప్రశ్నించి వినుడు.
8. మహోన్నతుడు వివిధజాతులకు దేశములిచ్చినపుడు ఏ జాతులెచట వసింపవలయునో నిశ్చయించినపుడు యిస్రాయేలీయుల లెక్కనుబట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను
9. కాని యాకోబు సంతతిని మాత్రము ప్రభువు తన సొంత ప్రజలను చేసికొనెను
10. హోరుమను భీకరధ్వనిగల ఎడారిలో ప్రభువు వారిని కనుగొని, ఆయన తన కనుపాపనువలె వారిని సంరక్షించి పెంచి పెద్దజేసెను.
11. గరుడపక్షి పిల్లలనెగిరింపగోరి గూడురేపి తన పిల్లలపైని అల్లాడుచు వానిని చాచిన రెక్కలమీద సురక్షితముగా నిల్పుకొనునట్లే ప్రభువు యిస్రాయేలును కాచికాపాడెను.
12. యిస్రాయేలును నడిపించిన నాయకుడు ప్రభువేగాని అన్యదైవములుకారు.
13. ఆయన వారిని పీఠభూములకు పాలకులను చేసెను. పర్వతముల పంట వారికి భోజనమయ్యెను. కొండచరియలలోని తేనె వారికి ఆహారమయ్యెను. రాతినేలలో వారికి ఓలివుచెట్లు పెరిగెను
14. వారికి మందలనుండి పాలు పెరుగు లభించెను. మంచిమంచి గొఱ్ఱెలు మేకలు బాషాను ఎడ్లు దక్కెను. శ్రేష్ఠమైన గోధుమ మధురమైన ద్రాక్షసారాయము చేకూరెను.
15. యెషూరూను' మస్తుగా భుజించి, బలసిపోయి తిరుగుబాటునకు దిగెను. తమ్ము సృజించిన దేవుని విడనాడిరి. తమ రక్షకుని అనాదరము చేసిరి.
16. వారి విగ్రహారాధనము వలన ఆయనకు అసూయ పుట్టెను. వారి దుష్కార్యములు ఆయనకు కోపము రప్పించెను.
17. వారు దైవములు కాని దైవములకు బలులర్పించిరి. ఆ దైవములు మధ్యలో వచ్చిన క్రొత్త దైవములు, మన పితరులు మ్రొక్కని దైవములు.
18-19. ఆ ప్రజలు తమ సంరక్షకుని మరచిపోయిరి. తమ జీవనదాతను విస్మరించిరి. ఈ సంగతి గుర్తించి ప్రభువు తన కుమారులను కుమార్తెలను విడనాడెను.
20. “నేను వారికి సహాయము చేయను. విశ్వాసములేని ఆ కపటాత్ముల గతి యేమగునో చూతము” అని ఆయన అనుకొనెను. వారు వక్రబుద్ధిగల జాతి, విశ్వాసరహిత సంతానము.
21. వారి విగ్రహములు నాకు అసూయ గొల్పెను. ఆ దైవములుకాని దైవములు నా కోపమును రెచ్చగొట్టెను. నేనును జాతిగాని జాతివలన వారికి అసూయ పుట్టింతును. బుద్దిహీనుల వలన వారికి కోపము రప్పింతును.
22. నా కోపమునుండి చిచ్చుపుట్టును. అది భూమిని దానిమీది పచ్చదనమును దహించును. పాతాళము వరకు పయనము చేయును. పర్వత మూలములను కూడ కాల్చివేయును.
23. నేను వారిని సకల విపత్తులకు గురిచేయుదును. నా బాణములెల్ల వారిపై రువ్వెదను.
24. వారు కరవుతో, జ్వరముతో, ఘోరవ్యాధితో చత్తురు. నేను క్రూరమృగములను విషసర్పములను వారిమీదికి పంపుదును.
25. ఇంటి వెలుపల యుద్ధము వారిని హతము చేయును. ఇంటి లోపల భయము వారిని మట్టుపెట్టును. వారి యువతులు, యువకులు, చంటిబిడ్డలు, ముదుసలులు ఎల్లరు చత్తురు.
26. నేను వారిని సర్వనాశనముచేసి, నేలమీద వారి పేరు వినిపింపకుండ చేయుదుననుకొంటిని.
27. కాని వారి శత్రువులు మాత్రము విఱ్ఱవీగకుందురుగాక! 'మాయంతట మేమే ప్రభువు ప్రజలను జయించితిమి. యావే అనుగ్రహమువలన కాదని పలుకకుందురుగాక!
28. యిస్రాయేలీయులు ఎంతటి మందమతులు! ఎంతటి బుద్దిహీనులు!
29. వారెందుకు ఓడిపోయిరో గ్రహింపజాలకున్నారు. ఏమి జరిగినదో తెలిసికోజాలకున్నారు.
30. తమ ఆశ్రమదుర్గము వారిని అమ్మివేయని ఎడల, యావే వారిని అప్పగింపని ఎడల ఒక్కడు వేయిమందిని పారద్రోలుట ఎట్లు? ఇద్దరు పదివేలమందిని తరిమికొట్టుట ఎట్లు?
31. కాని, వారి దేవుడు మన దేవుని వంటివాడుకాడు, మన శత్రువులు బుద్ధిహీనులు.
32. వారు సొదొమ గొమొఱ్ఱాలవలె దుష్టులు. చేదైన విషఫలములు ఫలించు ద్రాక్షలవంటివారు.
33. భయంకరమైన సర్పములఘోరవిషముతో చేయబడిన ద్రాక్షసారాయము వంటివారు.
34. కాని యిస్రాయేలీయులు ప్రభువునకు ప్రీతిపాత్రులు అమూల్యులు కాదా!
35. ప్రభువు శత్రువులమీద పగతీర్చుకొనును. వారు తప్పక పతనము చెందుదురు. వారికి వినాశము దాపురించినది,
36. ప్రభువు తన ప్రజలకు న్యాయము జరిగించును. తన సేవకులమీద కరుణజూపును. ఆయన వారి నిస్సహాయతను గుర్తించును. వారెల్లరును నాశనమగుచున్నారని తెలిసికొనును.
37. అప్పుడు ప్రభువు తన ప్రజలను చూచి, “మీరు నమ్మిన ఆ మహాదైవములేరీ?
38. మీరా దైవములకు బలులొసగలేదా? వారిచే ద్రాక్షరసము త్రాగింపలేదా? వారినిప్పుడు మిమ్ము కాచి కాపాడుమనుడు, మిమ్మాదుకొనుటకు రమ్మనుడు” అని అడుగును.
39. 'నే నొక్కడనే ప్రభుడను. నేను తప్ప మరియొక దేవుడు లేడు జీవమునకు మరణమునకు కర్తను నేనే. గాయపరచునదియు నేనే నయముచేయునదియు నేనే. నా కెవ్వరును అడ్డురాజాలరు.
40. నేను సజీవుడనైన దేవుడను గనుక చేయెత్తి ప్రమాణము చేయుచున్నాను
41. తళతళలాడు నా కత్తికి పదును పెట్టి, న్యాయము జరిగింతును. నా శత్రువులమీద పగతీర్చుకొందును. నన్ను ద్వేషించువారిని శిక్షింతును
42. నా బాణములు శత్రువుల నెత్తురు గ్రోలును. నా ఖడ్గము వారి తనువులను భుజించును. నన్నెదిరించు వారెవ్వరు బ్రతుకజాలరు. గాయపడినవారును, బందీలును చత్తురు.'
43. సమస్త జాతుల ప్రజలారా! ప్రభువును స్తుతింపుడు. ప్రభు ప్రజతోపాటు సంతసింపుడు. ఆయన తన భక్తులను వధించిన వారిని శిక్షించును. తన శత్రువులమీద పగతీర్చుకొనును. తన దేశముకొరకును, తన ప్రజలకొరకును ఆయన ప్రాయశ్చిత్తము చేయును.
44. మోషేయు, నూను కుమారుడైన యెహోషువయు ప్రజలు వినుచుండగ పై గీతమును వినిపించిరి.
45. మోషే పై గీతమును వినిపించిన తరువాత ప్రజలతో,
46. “మీరు ఈ ఉపదేశములెల్ల చేకొనుడు. అవి మిమ్ము ఖండించుచు సాక్ష్యమిచ్చును. మీ పిల్లలు ఈ ఆజ్ఞలెల్ల పాటింపవలయునని చెప్పుడు.
47. ఈ ఉపదేశములు వ్యర్ధప్రసంగములు కావు. ఇవియే మీకు జీవము. వీనిని పాటింతురేని మీరు యోర్దానునకు ఆవల స్వాధీనము చేసికొనబోవు నేలమీద చిరకాలము జీవింతురు.”
48-49. ప్రభువు ఆ రోజే మోషేతో “నీవు మోవాబు దేశమున యెరికో పట్టణము చెంతనున్న అబారీముకొండలకు వెళ్ళుము. అట నెబో కొండనెక్కి నేను యిస్రాయేలీయులకు ఈయనున్న కనాను మండలమును పారజూడుము.
50. నీ అన్న అహరోను హోరు పర్వతముమీద చనిపోయి నీ పితరులను కలిసికొనినట్లే, నీవును ఆ కొండమీద చనిపోయి నీ పితరులను చేరుకొందువు.
51. మీరిరువురును యిస్రాయేలు సమక్షమున నన్ను పవిత్రపరపరైరి. మీరు సీను ఎడారిలోని కాదేషు నగరము చెంతనున్న మెరిబా జలములయొద్ద నున్నపుడు ప్రజలు చూచుచుండగా నన్ను అగౌరవపరచితిరి.
52. కనుక నీవు దూరము నుండి మాత్రము ఆ మండలమును పారజూతువు. నేను యిస్రాయేలీయులకు ఈయనున్న ఆ నేలమీద నీవు అడుగు మోపజాలవు” అని చెప్పెను.