ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ద్వితియోపదేశకాండము 29

1. మోషే యిస్రాయేలీయులందరిని ప్రోగుచేసి ఇట్లనెను: “ప్రభువు ఐగుప్తురాజు ఫరోను, అతని ఉద్యోగులను, అతని దేశమును ఏమిచేసెనో మీరు కన్నులార చూచితిరికదా!

2. ప్రభువు పంపిన ఘోర వ్యాధులు, సూచకక్రియలు, అద్భుతకార్యములు మీరెల్లరును చూచితిరికదా!

3. కాని మీరు చూచిన సంఘటనలను అర్థము చేసికొను శక్తిని మాత్రము ఆయన నేటివరకును మీకు ప్రసాదింపలేదు.

4. నేను మీ దేవుడైన యావేనని మీరు తెలుసు కొనునట్లు నలువదియేండ్లపాటు మిమ్మును ఎడారిలో నడిపించితిని. అంతకాలము మీ శరీరముమీది బట్టలు చినిగిపోలేదు. మీ కాలిచెప్పులు అరిగిపోలేదు.

5. అప్పుడు మీకు తినుటకు భోజనము దొరకలేదు. త్రాగుటకు ద్రాక్షసారాయము గాని, ఘాటైన మద్యము గాని లభింపలేదు. అయినను ప్రభువు మీ అవసరముల నెల్ల తీర్చెను. దానివలన ప్రభువే మీ దేవుడని వెల్లడియైనది.

6. మనము ఈ తావు చేరుకొనినపుడు హెష్బోను రాజగు సీహోను, బాషాను రాజగు ఓగు మనమీద యుద్ధమునకు వచ్చిరి. కాని మనము వారిని జయించితిమి.

7. వారి దేశమును స్వాధీనము చేసికొని రూబేను, గాదు, మనష్షే అర్ధ తెగవారికి పంచియిచ్చితిమి.

8. మీరు ఈ నిబంధనపు షరతులన్నిటిని పాటింతురేని తప్పక వర్ధిల్లుదురు.

9-10. నేడు మీరు ప్రభువు ఎదుట ప్రోగైతిరి. మీ తెగనాయకులు, పెద్దలు, అధికారులు, స్త్రీలు, పిల్లలు, మీ చెంతవసించుచు మీకు వంటచెరకు నీళ్ళు మోసికొనివచ్చు పరదేశులెల్లరును ఇచట సమావేశ మైతిరి.

11. మీరు నేడు ప్రభువు మీతో చేసికొనబోవు నిబంధనను అంగీకరింపనున్నారు.

12. ఆయన పూర్వము మన పితరులైన అబ్రహాము, ఈసాకు, యాకోబులకు మాట ఇచ్చినట్లే నేడు మనలను, తన సొంత ప్రజలుగా స్వీకరించును. తాను మనకు దేవుడగును.

13. నేడు ప్రభువు మీతో మాత్రమే ఈ నిబంధనము చేసికొనుటలేదు. మీరు మాత్రమే దాని బాధ్యతలను అంగీకరించుటలేదు.

14. నేడు తన సమక్షమున సమావేశమైన మనతోచేసినట్లు, సమావేశము కాని మన సంతానముతో కూడ ప్రభువు ఈ నిబంధనము చేసికొనుచున్నాడు.

15. ఐగుప్తున జీవించుటయనగా ఎట్టిదో, ఇతర జాతుల దేశములగుండా పయనముచేయుట యనగా నెట్టిదో మీకు తెలియును.

16. ఆ ప్రజలు కొయ్యతో, రాతితో, వెండిబంగారములతో చేసికొనిన హేయమైన విగ్రహములను మీరు చూచిరి.

17. కనుక నేడిట ప్రోగైనవారిలో ఏ స్త్రీ గాని, ఏ పురుషుడుగాని, ఏ కుటుంబముగాని, ఏ తెగగాని ప్రభువును విడనాడి అన్యజాతుల దైవములను కొలవకుండునుగాక! మూలము మొలకెత్తి చేదైన విషఫలములు ఫలింపకుండునుగాక!

18.  ఈ నియమములన్నిటిని ఆలకించిన పిదపగూడ మీలో ఎవడైన తన హృదయ కాఠిన్యతను బట్టి కన్నుమిన్ను గానక, మద్యము చేత దాహము తీర్చుకొనువానివలె, 'నా ఇష్టము వచ్చినట్లు నేను ప్రవర్తించిన నష్టమేమి లేదులే' అని తలంచుచూ, ప్రభువు నన్ను ఆశీర్వదించునని అనుకొనును.

19. అట్టి ఆలోచనలు కలవానిని ప్రభువు క్షమింపడు. అసూయతో కూడిన ప్రభువు కోపము వానిని దహించివేయును. ఈ గ్రంథమున పేర్కొనబడిన శాపములన్నియు అతని మెడకు చుట్టుకొనును. ప్రభువు అతని పేరును ఆకాశము క్రింద కానరాకుండ చేయును.

20. ఈ ధర్మశాస్త్రమున లిఖింపబడిన నిబంధనపు శాపముననుసరించి ప్రభువు యిస్రాయేలు తెగలనుండి అతనిని వేరుచేసి నాశమునకు గురిచేయును.

21. భవిష్యత్తులో రానున్న మీ సంతానము, దూరదేశమునుండి వచ్చిన అన్యజాతి ప్రజలు, ప్రభువు మీ దేశముమీద పంపనున్న రోగములను, అరిష్టములను చూతురు.

22. మీ దేశమంతయు గంధకముతోను, ఉప్పుతోను నిండిన మరుభూమి అగును. అచట ఎవ్వడును పైరువేయడు, అసలు గడ్డి కూడ మొలవదు. పూర్వము ప్రభువు మహోగ్రుడై నాశనము చేసిన సొదొమ గొమొఱ్ఱాలవలె, ఆద్మా సెబోయీముల వలె మీ దేశము భస్మమైపోవును.

23. అప్పుడు సకలజాతులు “ప్రభువు ఈ నేలకింతకీడు చేయనేల? ఆయన ఇంతగా కోపింపనేల?” అని ప్రశ్నింతురు.

24. అందులకు జనులు, “ఈ ప్రజలు తమ పితరుల దేవుడైన ప్రభువు నిబంధనమును కాలదన్నిరి. వీరిని ఐగుప్తునుండి తోడ్కొని వచ్చినపుడు దేవుడు వీరితో చేసికొనిన నిబంధనమును అతిక్రమించిరి.

25. వీరు ప్రభువు అంగీకరింపని అన్యదైవములను సేవించి వాటికి నమస్కరించిరి.

26. కనుక యావే మహోగ్రుడై ఈ ప్రజలను ఈ గ్రంథమున లిఖింపబడిన శాపములన్నిటికి బలి కావించెను.

27. ప్రభువు మహారోషముతో మహాక్రోధముతో వీరిని స్వీయదేశమునుండి పెల్లగించివేసి, అన్యదేశములలో విసరివేసెను. నేటికిని వీరచటనే పడియున్నారు” అని బదులుచెప్పుదురు.

28. రహస్యవిషయములన్నియు ప్రభువునకే తెలియును. కాని ఆయన మనకును, మన సంతతికిని తన శాసనములను శాశ్వతముగా వెల్లడిచేసెను. కనుక మనము ఈ యాజ్ఞలనెల్ల పాటింపవలయును.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services