ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

JOB CHAPTER 40

1. యావే దేవుడు యోబుతో మరియు ఇట్లనెను:
2. “ఆక్షేపణలు చేయుజూచువాడు సర్వశక్తిమంతుడగు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇపుడు ప్రత్యుత్తరమీయవలయును.”
3. అంతట యోబు ప్రభువుతో ఇట్లనెను:
4. “చిత్తగించుము, నేను నీచుడను, నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చెదను? నా నోటిమీద నా చేతిని ఉంచుకొందును.
5. నేనొకసారి మాటాడితిని మరల మాట్లాడను. ఒక్కసారి కంటే అధికముగా సంభాషింపను.”
6. ప్రభువు సుడిగాలిలో నుండి యోబుతో ఇట్లు పలికెను
7. “ఓయి! నీవు ధైర్యముతో నిలిచి నా ప్రశ్నలకు జవాబు చెప్పుము.
8. నేను న్యాయము పాటింపలేదని నీవు రుజువు చేయుదువా? నాది తప్పని, నీది ఒప్పని నిరూపింతువా?
9. నీవు నాయంతటి బలాఢ్యుడవా? నీ వాక్కు నా వాక్కువలె గర్జింపగలదా?
10. అట్లయినచో గౌరవప్రతిష్ఠలతో నిలువుము. నీ వైభవప్రాభవములను చూపింపుము.
11. నీ కోపమును ప్రజ్వలింపజేసి, గర్వాత్ములను మన్ను గరపింపుము.
12. వీక్షణ మాత్రమున వారి పొగరు అణగింపుము. దుష్టులను ఉన్నవారినున్నట్లు నాశనము చేయుము
13. ఆ దుర్మార్గులనందరిని నేలలో పాతి పెట్టుము వారినెల్లరిని మృతలోకమున బంధించియుంచుము
14. నీ దక్షిణహస్తమే నిన్ను రక్షించినదని, నీవే స్వయముగా విజయము సాధించితివని నేను ఒప్పుకొందును.
15. నీటి గుఱ్ఱమును అవలోకింపుము. అది ఎద్దువలె గడ్డిమేయును.
16. దాని శక్తి దాని నడుములో ఉన్నది. దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది.
17. దాని తోక దేవదారు కొయ్యవలె బిరుసుగా నుండును దాని తొడలనరములు దిట్టముగా సంధింపబడి యున్నవి.
18. దాని ఎముకలు ఇత్తడివలె గట్టిగానుండును. కాళ్ళు ఇనుప కడ్డీలవలె నుండును.
19. అది దేవుడు సృష్టించిన ప్రాణులలో గొప్పది. దానిని సృష్టించిన దేవుడే ఖడ్గమును దానికి ఇచ్చుటలో దేవుని సృష్టిలోని వైవిధ్యమునకు నాంది అయ్యెను.
20. పర్వతములలో దానికి మేత లభించును. అరణ్య జంతువులన్ని అచట ఆడుకొనును.
21. కనుక అది నీటిలోని ముండ్లపొదలలో ఉండిపోవును. మడుగులలోని తుంగల మరుగున దాగుకొనును.
22. జలములలోని ముండ్లపొదలు దానికి నీడనిచ్చును నీటి ఒడ్డున ఎదుగు చెట్లనీడ దానిని కాపాడును.
23. నదులు పొంగి పారినను దానికి భయము లేదు. యోర్డానునది తన నెత్తిన విరుచుకొనిపడిన అది జంకదు.
24. ఆ మృగము కనులుగప్పి దానిని ఎవరైన పట్టగలరా? దాని ముట్టెనెవరైన బోనులో బంధింపగలరా?