ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

JOB CHAPTER 21

 1. తరువాత యోబు ఇట్లనెను:

2. “మీరు నా పలుకులను సావధానముగా విన్నచో నన్ను ఓదార్చునంత పుణ్యము.

3. మీరు మొదట ఓర్పుతో నా వచనములు ఆలింపుడు అటుపిమ్మటనా మాటలకు నవ్విన నవ్వుదురుగాక!

4. నేను వాదమాడునది నరులతోగాదు. నేను తాల్మిని కోల్పోవుటకు కారణమున్నది.

5. నా మాటలను బాగుగా విన్నచో మీరు విస్తుపోయి నోటిమీద వ్రేలు వేసికొందురు.

6. నాకు జరిగిన సంగతులను చూచి నేనే భీతిచెంది, కంపించుచున్నాను.

7. దుర్మార్గుల జీవితము కొనసాగనేల? వారి ఆయుస్సుతోపాటు వారి సంపదలుకూడా పెరుగుటలేదా?

8. వారి సంతానము వృద్ధి చెందుచున్నది. వారి పిల్లలు వారి కన్నులెదుటనే పెరుగుచున్నారు

9. వారి కుటుంబములకు ఎట్టి ప్రమాదము కలుగుటలేదు. దేవుని దండము వారిమీద పడుటలేదు.

10. వారి ఎడ్లు దాటగా తప్పక చూలు కలుగును. ఆ ఆవులు చూడితప్పక దూడలను ఈనుచున్నవి

11. వారి పిల్లలు గొఱ్ఱె పిల్లలవలె పరుగిడుచు, ఆటలాడి నాట్యము చేయుచున్నారు.

12. తంత్రీవాద్యములు మీటుచు, పిల్లనగ్రోవుల నూదుచు, ఆ బాలబాలికలు ఆడిపాడుచున్నారు.

13. వారు తమ దినములను సమృద్ధిగా గడుపుదురు. సమాధానముతో పాతాళమునకు పోవుదురు.

14. అయినను ఈ దుర్మార్గులు దేవుని అలక్ష్యము చేసిరి ఆయన ఆజ్ఞలు పాటించుటకు నిరాకరించిరి.

15. దేవుని సేవింపనక్కరలేదనియు, ఆయనకు ప్రార్థనచేసిన ఫలితము దక్కదనియు భావించిరి.

16. వారు స్వీయశక్తితోనే విజయము సాధించితిమనుకొనిరి. కాని వారి వాదమును నేను ఎంతమాత్రము అంగీకరింపను.

17. అయినను తరచుగా దుర్జనుల దీపము ఆరిపోదేల? వారికి వినాశనము దాపురింపదేల? దైవకోపము వారిని నాశనము చేయదేల?

18. వారు గాలికి గడ్డిపోచవలె, సుడిగాలికి కల్లములోని పొటువలె కొట్టుకొని పోరేల?

19. 'దేవుడు తండ్రి తప్పులకు తనయుని శిక్షించును' అని మీ వాదము. అటులకాదు, తప్పుచేసినవాడే శిక్షను అనుభవింపవలయును

20. దుర్మార్గుడు తన వినాశమును తాను కన్నులార చూడవలయును. దేవుని కోపాగ్నికి తాను స్వయముగా గురికావలయును.

21. నరుడు చనిపోయిన తరువాత తన తనయులు సౌఖ్యముగా ఉన్నారా లేదా అని విచారించునా?

22. కాని మనము దేవునికి బోధచేయు నంతటివారలమా? ఆయన దేవదూతలకుగూడ తీర్పు విధించునుకదా!

23-24. కొందరు చనిపోవువరకు ఆరోగ్యముగా నుందురు." సంతోషముగా కాలము వెళ్ళబుచ్చుచు, కండబలముతో పుష్టిగా ఉండి, నిరాయాసముగా కడన ప్రాణము విడతురు.

25. కాని కొందరు సుఖములకు నోచుకోక, సంతాపముతో ప్రాణములు విడనాడుదురు.

26. అయినను ఆ ఇరుతెగలవారిని ప్రక్కప్రక్కనే పాతి పెట్టెదరు. ఆ రెండు వర్గముల వారిని అవే పురుగులు తినివేయును.

27. మీ మనసులో ఏమేమి భావములు మెదలుచున్నవో, మీరు నాతో ఏమేమి వాదింపగోరెదరో నేనెరుగుదును.

28. 'పేరు ప్రఖ్యాతులతో వెలిగిపోవు వాని భవనమేమైనది? పాపి నివాసము ఇప్పుడెచటనున్నది?” అని మీరడుగుదురు.

29. మీరు దేశదేశములు తిరుగు ప్రయాణికులతో మాట్లాడలేదా? వారి కథనము వినియుండలేదా?

30. ఉగ్రత దినమున నరులను శిక్షించునపుడు దేవుడు దుర్మార్గుని మాత్రము వదలివేయునా?

31. కనుక దుష్టుని నిలదీసి అడుగు వాడెవడులేడు. అతని దుష్కార్యములకు తగినట్లుగా అతనికి బుద్ధిచెప్పువాడును లేడు.

32. దుర్జనుని పాతి పెట్టుటకు కొనిపోయినపుడు చాలామంది అతని సమాధివద్ద ప్రోగవుదురు.

33. వేలాది ప్రజలు అతనికి ముందు వెనుకల నడతురు. అతనిమీద మట్టి పెళ్ళలనుగూడ మృదువుగానే విసరుదురు.

34. కనుక మీరు నన్ను ఓదార్చుటకు వెఱ్ఱివాదములు చేసితిరి. మీ మాటలన్ని పచ్చి అబద్ధములని రుజువైనదికదా?”