ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజుల దినచర్య మొదటి గ్రంధము 26వ అధ్యాయము || Roman Catholic Bible in Telugu

 1. దేవాలయ ద్వారసంరక్షకులుగా నియమింపబడిన లేవీయులు వీరు: కోరా వంశమునుండి ఆసాపు కుటుంబమునకు చెందినవాడును, కోరె కుమారుడైన మెషెలెమ్యా.

2-3. ప్రాయము క్రమములో అతని ఏడుగురు కుమారులు వీరు: జెకర్యా, యెదీయేలు, సెబద్యా, యత్నీయేలు, ఎలాము, యెహోహానాను, ఎల్యోయేనయి.

4-5. ప్రభువు ఓబేదెదోమును దీవించి అతనికి ఎనిమిదిమంది కుమారులను దయచేసెను. ప్రాయము క్రమములో వారు షెమయా, యెహోసాబాదు, యోవా, సాకరు, నెతనేలు, అమ్మీయేలు, యిస్సాఖారు, పెయుల్లెతయి.

6-7. షెమయాకు ఆరుగురు కుమా రులు కలిగిరి, వారు ఒత్ని, రెఫాయేలు, ఓబేదు, ఎల్సాబాదు, ఎలీహు, సెమక్యా. వీరందరు పరాక్రమ శాలులు, సమర్థవంతులు.

8. ఓబేదెదోము కుటుంబము నుండి దేవాలయ ద్వారసంరక్షణకు ఉపకరించిన వారు మొత్తము అరువదియిద్దరు.

9. మెషెలెమ్యా కుటుంబము నుండి పనికి ఉపకరించినవారు పదునెనిమిది మంది.

10. మెరారి సంతతికి చెందిన హోసాకు నలుగురు తనయులుండిరి. షిమ్రీ జ్యేష్ఠుడు కాకపోయినను తండ్రి అతనికి జ్యేష్ఠవంతును ఇచ్చెను.

11. మిగిలిన ముగ్గురు హిల్కియా, తెబల్యా, జెకర్యా, హోసా కుటుంబమునుండి పనికి నియమింపబడినవారు మొత్తము పదముగ్గురు.

12. దేవాలయ ద్వారసంరక్షకులను వారి వారి కుటుంబముల ననుసరించి కొన్ని బృందములుగా విభజించిరి. ఇతర లేవీయులకువలెనే వారికిని దేవాలయమున పని నియమింపబడెను.

13. కొద్ది వారేమి, ఎక్కువవారేమి వారి పితరుల ఇంటి వరుసను బట్టి వారందరు చీట్లు వేసికొని ఏ ద్వారమును ఎవరు సంరక్షింపవలయునో నిర్ణయించుకొనిరి.

14. షెలెమ్యాకు తూర్పు ద్వారము వచ్చెను. అతని కుమారుడు జెకర్యా మంచిసలహాదారుడు. అతనికి ఉత్తరద్వారము వచ్చెను.

15. ఓబేదెదోమునకు దక్షిణద్వారము, అతని కుమారులకు వస్తుసంభారములు ఉన్న గదులు వచ్చెను.

16. షుప్పీమునకు, హోసానునకు పడమటి దిక్కున రాజ మార్గమునకుపోవు షల్లెకెతు గుమ్మమునకు కావలియుండు చీటిపడెను. నియమితకాలము ప్రకారము ద్వారసంరక్షకులు మారుచుండిరి.

17. తూర్పు ద్వారమునకు రోజుకు ఆరుగురు సంరక్షకులు, ఉత్తర ద్వారమునకు నలుగురు, దక్షిణ ద్వారమునకు నలుగురు, వస్తుసంభారములున్న రెండు గదులకు ఒక్కొక్కదానిలో ఇద్దరు కాపుండిరి.

18. పడమటి భవనమునకు ఇద్దరు, దాని చెంతనున్న మార్గమునకు నలుగురు కాపుండిరి.

19. కోరా సంతతివారికి, మెరారీయులకు దేవాలయ ద్వారసంరక్షణకు ఇట్లు వంతులు ఏర్పరచబడెను.

20. మరియు లేవీయులనుండి అహీయా అను వాడు దేవాలయమునందలి కోశాగారమును, దేవునికి నివేదింపబడిన కానుకలను భద్రపరచు గదులను కాయుటకు నియమింపబడెను.

21. గెర్షోము కుమారులలో ఒకడైన లదాను, చాలా వంశములకు  మూలకర్త. తన కుమారుడైన యెహీయేలు వంశమునకు ఇతడే మూలకర్త.

22. యెహీయేలు ఇద్దరు కుమారులు సేతాము, అతని సోదరుడైన యోవేలు దేవాలయ కోశాగారమునకు కాపుండిరి.

23. అమ్రాము, ఇసాహారు, హెబ్రోను, ఉజ్జీయేలు సంతతి వారికి పైన తెలిపిన పనులు అప్పగింపబడినవి.

24. మోషే మనుమడును, గెర్షోము కుమారుడునైన షెబూవేలు దేవాలయ కోశాగారమునకు ప్రధానాధికారి.

25. గెర్షోము సోదరుడైన ఎలియెజెరు ద్వారా అతడు షెలోమీతుకు చుట్టమయ్యెను. షెలోమీతునకు తండ్రి సిక్రి, సిక్రి తండ్రి యోరాము, యోరాము తండ్రి యెషయా, యెషయా తండ్రి రెహబ్యా, రెహబ్యా తండ్రి ఎలియెజెరు.

26. ప్రభువు ఆలయమును వైభవముగా కట్టించుటకై దావీదురాజు, ఆయా కుటుంబముల నాయకులు, సహస్రాధిపతులు, శతాధిపతులు, సైనికాధిపతులు,

27. వారు యుద్దములలో తాము కొల్లగొట్టిన దానిలో దేవునికి నివేదించిన సొమ్ము గల కోశాగారములకు షెలోమీతు అతని సోదరులు సంరక్షులుగా నుండిరి.

28. దీర్ఘదర్శి సమూవేలును, కీషు కుమారుడైన సౌలు రాజును, నేరు కుమారుడైన అబ్నేరును, సెరూయా కుమారుడైన యోవాబును దేవాలయమునకు అర్పించిన కానుక లకు కూడ షెలోమీతు మరియు అతని కుటుంబ సభ్యులే సంరక్షకులు.

29. ఇసాహారు వంశజుల పనులివి: కెనన్యా, అతని కుమారులకు దేవాలయమునకు వెలుపలి పనులు అప్పగించిరి. వారు లేఖకులు, ప్రజల తగవులు తీర్చువారు.

30. హెబ్రోను వంశమునుండి హషబ్యాను, అతని బంధువులు పదునేడు వందలమందిని ఎన్ను కొనిరి. వారందరు శూరులు. వారిని యోర్దానునకు పడమరనున్న యిస్రాయేలీయులకు అధిపతులుగా నియమించిరి. వారు ఆ ప్రజల మత, ఆర్థిక సమస్య లను చక్కదిద్దిరి.

31. యెరీయా వారికందరికి నాయకుడు. దావీదు పరిపాలనాకాలము నలువదియవయేట హెబ్రోను వంశపువారిని గూర్చి పరిశీలన చేయగా శూరులైన అతని సంతతివారు కొందరు గిలాదు నందలి యాసేరు మండలమున వసించుచున్నారని తెలియవచ్చెను.

32. దావీదు యెరీయా బంధువుల నుండి ఇరువదియేడు వందలమంది శూరులైన కుటుంబ అధిపతులను ఎన్నుకొని వారిని రూబేను, గాదు, మనష్షే అర్ధ తెగలవారికి నాయకులుగా నియమించెను. వారు ఆ తెగలవారి మత, ఆర్థిక సమస్యలను చక్కదిద్దిరి.