1. ఫిలిస్తీయులు యిస్రాయేలీయుల మీదికి యుద్ధమునకు వచ్చిరి. యిస్రాయేలీయులు రణము నుండి పారిపోవుచుండగా ఫిలిస్తీయులు వారిని వెన్నాడి గిల్బోవా కొండమీద వధించిరి.
2. శత్రువులు సౌలును, అతని కుమారులను చుట్టుముట్టిరి. యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువ అను సౌలు కుమారులను సంహరించిరి.
3. సౌలు చుట్టూ పోరు ముమ్మరమయ్యెను. కొందరు విలుకాండ్రు అతనిని బాణములతో కొట్టి గాయపరచిరి.
4. అతడు తన అంగరక్షకునితో “నీ బాకుతో నన్ను పొడిచిచంపుము, లేదేని సున్నతి సంస్కారము లేని ఈ ఫిలిస్తీయులు నా మీదబడి కసిదీర్చుకొందురు” అనెను. కాని అంగరక్షకుడు అతనిని చంపుటకు భయపడెను. సౌలు తన బాకును తీసి దానిమీదపడి ప్రాణములు విడచెను.
5. అటుల సౌలు చనిపోవుటచూచి అతని అంగ రక్షకుడు తానును తన కత్తిమీద తానే పడి అసువులు వీడెను.
6. ఆ రీతిగా సౌలు అతని ముగ్గురు కుమారులును గతించిరి. అతని కుటుంబము నాశనమయ్యెను.
7. క్రిందిలోయలో వసించు యిస్రాయేలీయులు తమ సైన్యము పారిపోయెననియు, సౌలు, అతని కుమారులు పోరున కూలిరనియు విని తమ నగరములను విడిచి పారిపోయిరి. అంతట ఫిలిస్తీయులు ఆ పట్టణములను ఆక్రమించుకొని వానిలో వసింపమొదలిడిరి.
8. మరునాడు ఫిలిస్తీయులు శవములను దోచుకొనుటకురాగా గిల్బోవా కొండమీద సౌలు, అతని కుమారుల శవములు కనిపించెను.
9. వారు సౌలు తల తెగనరికిరి. అతని ఆయుధములను ఊడదీసిరి. వానిని ఫిలిస్తీయ దేశము నలుమూలలకు పంపి తమ దేవతలకును ప్రజలకును విజయ వార్తలను చాటించిరి.
10. వారు సౌలు ఆయుధములను తమ దేవళమున భద్రపరచిరి. అతని తలను దాగోను మందిరమున వ్రేలాడగట్టిరి.
11. గిలాదునందలి యాబేషు పౌరులు ఫిలిస్తీయులు సౌలుకు అపకారము చేసిరని వినిరి.
12. వారి వీరులందరును పయనమై వచ్చి సౌలు శవమును, అతని తనయుల శవములను, యాబేషుకు కొనివచ్చిరి. ఒక సింధూరపువృక్షము క్రింద వారి అస్థులను పాతిపెట్టి ఏడుదినములు ఉపవాసముండిరి.
13. ప్రభువును లక్ష్యము చేయలేదు కనుక సౌలు చచ్చెను. అతడు ప్రభుని ఆజ్ఞను త్రోసిపుచ్చెను. చనిపోయినవారి భూతములను ఆవాహము చేయు వారిని సంప్రదించెను.
14. ప్రభువును సంప్రదింపడయ్యెను కనుక ప్రభువు సౌలును సంహరించి అతని రాజ్యమును యిషాయి కుమారుడైన దావీదు వశము చేసెను.