ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Telugu Catholic Bible Matthew chapter 12 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 12వ అధ్యాయము

 1. పిమ్మట యేసు ఒక విశ్రాంతి దినమున పంటపొలముగుండా పోవుచుండ శిష్యులు ఆకలిగొని వెన్నులను త్రుంచి, తినసాగిరి.

2. పరిసయ్యులు అది చూచి, “ఇదిగో! నీ శిష్యులు విశ్రాంతిదినమున నిషేధింపబడిన పనిని చేయుచున్నారు” అని యేసుతో పలికిరి.

3. అందుకు ఆయన వారితో " దావీదును అతని అనుచరులును ఆకలిగొనినపుడు ఏమి చేసినది మీరు చదువలేదా?

4. దేవుని మందిరములో ప్రవేశించి, అర్చకులు తప్ప తానుకాని, తన అనుచరులుకాని తినకూడని అచటనుండు నైవేద్యపు రొట్టెలను అతడును, అతని అనుచరులును తినిరిగదా!

5. దేవాలయములో యాజకులు విశ్రాంతిదినమున, విశ్రాంతినియమమును ఉల్లంఘించియు నిర్దోషులగుచున్నారని ధర్మ శాస్త్రమందు మీరు చదువలేదా?

6. దేవాలయము కంటెను అధికుడగువాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను.

7. 'నేను కనికరమును కోరుచున్నాను, బలిని కాదు.' అను వాక్యమునందలి భావమును మీరు ఎరిగినయెడల నిర్దోషులను మీరిట్లు నిందింపరు.

8. ఏలయన మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకు కూడ అధిపతి” అనెను.

9. తరువాత ఆయన ఆ స్థలమును విడిచి, వారి ప్రార్థనామందిరమున ప్రవేశించెను.

10. అచ్చట ఊచచేయిగలవాడు ఒకడుండెను. కొందరు యేసుపై నేరమును మోపదలచి "విశ్రాంతిదినమున స్వస్థ పరుచుట చట్టబద్ధమైనదా?” అని ఆయనను ప్రశ్నించిరి.

11. అందుకాయన “ఏమీ! మీలో ఎవడైన విశ్రాంతి దినమున తన గొఱ్ఱె గోతిలో పడినచో దానిని పట్టి వెలుపలకు తీయడా?

12. గొఱ్ఱె కంటె మనుష్యుడు ఎంతో విలువగలవాడు కదా! కాబట్టి విశ్రాంతి దినమున మేలుచేయుట తగును” అని సమాధాన మిచ్చెను.

13. పిమ్మట యేసు ఆ ఊచచేయి వానితో “నీ చేయి చాపుము” అనెను. అతడట్లే చాపెను. దానికి స్వస్థత చేకూరి రెండవ చేయివలె నుండెను.

14. పరిసయ్యులంతట వెలుపలికి వెళ్ళి, “ఆయనను ఎటు అంత మొందింతుమా!,” అని కుట్ర చేయసాగిరి.

15. యేసు అది గ్రహించి, అచట నుండి వెడలి పోయెను. అనేకులు ఆయనను వెంబడించిరి. రోగుల నెల్ల ఆయన స్వస్థపరచి,

16. తననుగూర్చి తెలుప వలదని వారిని ఆజ్ఞాపించెను.

17. యెషయా ప్రవచనము ఇట్లు నెరవేరెను. అది ఏమన:

18. " ఇదిగో ఇతడు నా సేవకుడు, నేను ఎన్నుకొన్నవాడు, నాకు ప్రియమైనవాడు. ఇతనిని గూర్చి నేను ఆనందించుచున్నాను. ఇతనిపై నా ఆత్మను నిలిపెదను. ఇతడు జాతులకు నా న్యాయమును ప్రకటించును.

19. వివాదములాడడు, కేకలువేయడు, వీధులలో ఎవరును అతని స్వరమును వినరు.

20. అతడు నలిగిన రెల్లును విరువడు. మకమకలాడుచున్న దీపమునార్పడు. న్యాయమునకు విజయము చేకూర్చునంతవరకు పట్టువిడువడు.

21. జాతులు అతని నామమునందు విశ్వసించును.”

22. అంతట పిశాచగ్రస్తుడగు ఒక గ్రుడ్డి, మూగ వానిని యేసు వద్దకు జనులు తీసికొని వచ్చిరి. యేసు అతనిని స్వస్థపరుపగా మాటలాడుటకు, చూచుటకు, అతడు శక్తిగల వాడాయెను.

23. అచటి ప్రజలెల్ల విస్మయమొందిరి. “ఈయన దావీదు కుమారుడు కాడా?” అని చెప్పుకొనుచుండిరి.

24. పరిసయ్యులు ఆ మాట విని, “ఇతడు దయ్యములకు అధిపతియగు బెల్జబూలు వలననే దయ్యములను వెడలగొట్టు చున్నాడు” అనిరి.

25. యేసు వారి తలంపులను గ్రహించి “అంతఃకలహములతో విభక్తమయిన ఏ రాజ్యమయినను నాశనమగును; ఏ పట్టణమయినను, ఏ కుటుంబమయినను స్థిరముగా నిలువజాలదు.

26. అట్లే సైతానునే సైతాను వెడలగొట్టినచో స్వధర్మ విరుద్ధముగా విభక్తమయినట్లే గదా! అట్లయిన, వాని రాజ్యము ఎట్లు నిలుచును?

27. నేను బెల్జబూలు వలన దయ్యములను వెడలగొట్టినచో, మీ కుమారులు ఎవరి సాయముతో వానిని వెడలగొట్టుచున్నారు? కావున ఇందు వారే మీకు న్యాయకర్తలు.

28. నేను దేవుని ఆత్మవలన దయ్యములను వెడలగొట్టుచున్న యెడల దేవునిరాజ్యము మీయొద్దకు వచ్చియున్నది అని గ్రహింపుడు.

29. ఎవడేని, బలవంతుని మొదట బంధించిననే తప్ప, వాడు ఆ బలశాలి ఇంటిలో ప్రవేశించి సామగ్రిని దోచుకొనజాలడు. నిర్బంధించిన పిమ్మట గదా కొల్ల గొట్టునది!

30. “నా పక్షమున ఉండనివాడు నాకు ప్రతి కూలుడు. నాతో ప్రోగుచేయనివాడు చెదరగొట్టువాడు.

31. అందువలన, మానవులు చేయు సర్వపాపములు, దేవదూషణములు క్షమింపబడునుగాని, ఎవ్వడేని పవిత్రాత్మను దూషించినయెడల వానికి క్షమాభిక్ష లభింపదు.

32. ఎవ్వడైనను మనుష్య కుమారునకు వ్యతిరేకముగా మాట్లాడిన క్షమింపబడునుగాని, పవిత్రాత్మకు ప్రతికూలముగా పలికిన వానికి ఈ జీవితమందైనను, రాబోవు జీవితమందై నను మన్నింపులేదని మీతో నిశ్చయముగా వక్కాణించు చున్నాను.

33. "పండు మంచిదైన చెట్టు మంచిదనియు, పండు చెడుదైన చెట్టు మంచిదికాదనియు చెప్పుదురు. పండునుబట్టి చెట్టు స్వభావమును తెలిసికొందురు.

34. ఓ సర్పసంతానమా! దుష్టులైన మీరు మంచిని ఎట్లు మాట్లాడగలరు? హృదయ పరిపూర్ణత నుండి కదా నోటిమాట వెలువడునది!

35. మంచివాడు తమ మంచి నిధినుండి మంచి విషయములను తెచ్చును; చెడ్డవాడు తన చెడు నిధినుండి చెడు విషయములను తెచ్చును.

36. తీర్పుదినమున ప్రతియొక్కడు తాను పలికిన ప్రతి వ్యక్తమైన మాటకు సమాధానము యివ్వవలసియున్నదని నేను మీతో చెప్పుచున్నాను.

37. నీ మాటలనుబట్టి నీవు దోషివో, నిర్దోషివో కాగలవు.”

38. “బోధకుడా! నీవు ఒక గుర్తును చూపవలెనని మేము కోరుచున్నాము” అని కొందరు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు యేసుతో పలికిరి.

39. అప్పుడు యేసు ప్రత్యుత్తరముగా "దుష్టులు, దైవభ్రష్టులునగు వీరు ఒక గుర్తును కోరుచున్నారు. కాని, యోనా ప్రవక్త చిహ్నముకంటె వేరొకటి వీరికి అనుగ్రహింపబడదు.

40. యోనా ప్రవక్త మూడు పగళ్ళు, మూడు రాత్రులు తిమింగిల గర్భములో ఉన్నట్లు, మనుష్యకుమారుడును మూడుపగళ్ళు, మూడు రాత్రులు భూగర్భములో ఉండును.

41. నీనెవె పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయపరివర్తనము చెందిరి. కనుక, తీర్పుదినమున వారు ఈ తరము వారి యెదుట నిలిచి వీరిని ఖండింతురు. ఇదిగో! యోనా కంటె గొప్ప వాడొకడు ఇచట ఉన్నాడు.

42. తీర్పుదినమున దక్షిణదేశపు రాణి ఈ తరము వారి ఎదుట నిలిచి వీరిని ఖండించును. ఏలయన, ఆమె సొలోమోను విజ్ఞానమును గూర్చి వినుటకై దూరప్రాంతమునుండి పయనించి వచ్చెను. ఇదిగో! ఆ సొలోమోను కంటె గొప్పవాడు ఒకడు ఇచట ఉన్నాడు!

43. “దుష్టాత్మ ఒక మనుష్యుని విడిచిపోయినపుడు అది నిర్జన ప్రదేశములందు సంచరించుచు, విశ్రాంతి స్థలమునకై వెదకును. అది దొరకనప్పుడు,

44. 'నేను విడిచి వచ్చిన నా యింటికి తిరిగిపోదును' అని పలుకును. వచ్చి చూడగా ఆ ఇల్లు నిర్మానుష్యమై, శుభ్రపరుపబడి, సక్రమముగా అమర్చబడియుండెను.

45. అపుడది పోయి తనకంటె దుష్టులైన మరి ఏడు ఆత్మలను కూర్చుకొని వచ్చి, లోపల ప్రవేశించి, నివాస మేర్పరచుకొనును. ఈ కారణముచే ఆ మనుష్యుని పూర్వపు స్థితికంటె తదుపరి స్థితి హీనముగా ఉండును. ఇట్లే ఈ దుష్టసంతతి వారికిని సంభవించును” అని పలికెను.

46. యేసు ఇంకను జనసమూహముతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు, ఆయన సోదరులును అచటికివచ్చి ఆయనతో సంభాషింపకోరి, వెలుపల నిలిచియుండిరి.

47. అప్పుడు ఒకడు “మీ తల్లియు, సోదరులు వచ్చి మీతో మాటలాడుటకై వెలుపల వేచి యున్నారు” అని చెప్పెను.

48. యేసు అతనితో ప్రత్యుత్తరముగా, “నా తల్లి యెవరు? నా సోదరులు ఎవరు?" అని,

49. తన శిష్యులవైపు చూపుచు “వీరే నా తల్లి, సోదరులు” అని చెప్పెను.

50. మరియు “పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు, నా సోదరి, నా తల్లి” అని పలికెను.