ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Telugu Catholic Bible Matthew chapter 7 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 7వ అధ్యాయము

 1. “పరులను గూర్చి మీరు తీర్పుచేయకుడు. అప్పుడు మిమ్ము గూర్చి అట్లే తీర్పుచేయబడదు.

2. ఎందుకనగా మీరు పరులను గూర్చి తీర్పుచేసినట్లే మీకును తీర్పు చెప్పబడును. మీరు ఏ కొలతతో కొలిచెదరో, ఆ కొలతతోనే మీకును కొలువబడును.

3. నీ కంటిలోని దూలమును గమనింపక, నీ సహోదరుని కంటిలోని నలుసును వేలెత్తి చూపెదవేల?

4. 'నీ కంటిలోని నలుసును తీసివేయనిమ్ము' అని, సోదరుని నీవెట్లు అడుగగలవు? నీ కంటిలో దూలమున్నదిగదా!

5. కపట భక్తుడా! ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసికొనుము. అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టము గానుండును.

6. పవిత్రమైన దానిని కుక్కలపాలు చేయవలదు. వెలగల ముత్యములను పందులకు పారవేయవలదు. అవి కాళ్ళతో తొక్కి నీ పైబడి నిన్ను చీల్చివేయును.

7. “అడుగుడు మీ కొసగబడును; వెదకుడు మీకు దొరకును; తట్టుడు మీకు తెరువబడును.

8. ఏలయన, అడిగిన ప్రతివానికి లభించును. వెదకిన ప్రతివానికి దొరకును. తట్టిన ప్రతివానికి తెరువబడును.

9. కుమారుడు రొట్టెనడిగిన, మీలో ఎవడైన వానికి రాయి నిచ్చునా?

10. చేపనడిగిన పామునిచ్చునా?

11. మీరెంత చెడ్డవారైనను మీ పిల్లలకు మంచి బహుమానాలు ఇచ్చుట మీకు తెలియునుగదా! పరలోక మందున్న మీ తండ్రి అడిగినవారికి ఇంకెట్టి మంచి వస్తువులనిచ్చునో ఊహింపుడు.

12. ఇతరులు మీకేమి చేయవలెనని మీరు కోరుదురో, దానిని మీరు పరులకు చేయుడు. ఇదియే మోషే ధర్మశాస్త్రము; ప్రవక్తల ప్రబోధము.

13. “ఇరుకైన ద్వారమున ప్రవేశింపుడు. ఏలయనగా విశాలమైన ద్వారము, సులభముగానున్న మార్గము వినాశనమునకు చేర్చును. అనేకులు ఆ మార్గమున పయనింతురు.

14. జీవమునకు పోవు ద్వారము ఇరుకైనది. మార్గము కష్టమైనది. కొలది మందియే ఈ మార్గమును కనుగొందురు.

15. "కపట ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడుడు. వారు లోలోపల క్రూరమైన తోడేళ్ళయియుండి, గొఱ్ఱెలచర్మము కప్పుకొని మీయొద్దకు వచ్చెదరు.

16. వారి క్రియలనుబట్టి మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలనుండి ద్రాక్షపండ్లు, తుప్పలనుండి అత్తిపండ్లు లభించునా?

17. మంచి చెట్టు మంచి పండ్లను, చెడు చెట్టు చెడు పండ్లను ఇచ్చును.

18. మంచి చెట్టు చెడుపండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఈయలేదు.

19. మంచి పండ్లనీయని ప్రతి చెట్టును నరికి మంటలో పడవేయుదురు.

20. కావున వారి ఫలములవలన వారిని మీరు తెలిసికొనగలరు.”

21. "ప్రభూ! ప్రభూ! అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడు! కాని, పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోకరాజ్యమున ప్రవేశించును.

22. కడపటి రోజున అనేకులు 'ప్రభూ! ప్రభూ! నీ నామమున గదా మేము ప్రవచించినది, పిశాచ ములను పారద్రోలినది, అద్భుతములు అనేకములు చేసినది' అని నాతో చెప్పుదురు.

23. అపుడు వారితో నేను 'దుష్టులారా! నానుండి తొలగిపొండు. మిమ్ము ఎరుగనే ఎరుగను' అని నిరాకరింతును,

24. “నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతిపునాదిపై తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియున్నాడు.

25. జడివానలు కురిసి, వరదలు వెల్లువలై పారి, పెనుగాలులు వీచి నను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడుటచే కూలి పోలేదు.

26. నా బోధనలను ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియున్నాడు.

27. జడివానలు కురిసి, వరదలు వెల్లువలైపారి, పెనుగాలులు వీచినపుడు ఆ యిల్లు కూలి నేలమట్టమయ్యెను. దాని పతనము చాల ఘోరమైనది.”

28. అంతట యేసు తన బోధనలు ముగింపగా, ఆ జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి.

29. ఏలయన, వారి ధర్మశాస్త్ర బోధకులవలె గాక అధికారము కలవానివలె యేసు బోధించెను.