ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Telugu Catholic Bible Matthew chapter 4 || Telugu Catholic Bible online || మత్తయి సువార్త 4వ అధ్యాయము

 1. అంతట యేసు సైతానుచే శోధింపబడుటకై ఆత్మవలన ఎడారికి కొనిపోబడెను.

2. నలువది రేయింబవళ్ళు ఉపవాసములతో గడిపిన పిదప, ఆయన ఆకలిగొనెను.

3. అంతట సైతాను ఆయన వద్దకువచ్చి “నీవు దేవునికుమారుడవైనచో ఈ రాళ్ళను రొట్టెలుగా మారునట్లు ఆనతినిమ్ము" అని అనెను.

4. “మానవుడు కేవలము రొట్టెవలననే జీవింపడు కాని దేవుని నోటినుండి వచ్చు ప్రతి మాటవలన జీవించును' అని వ్రాయబడియున్నది” అని యేసు ప్రత్యుతర మిచ్చెను.

5. పిమ్మట సైతాను ఆయనను పరిశుద్ధ నగరములోని దేవాలయ శిఖరమున నిలిపి,

6. “నీవు దేవుని కుమారుడవైనచో క్రిందికి దుముకుము. ఏలయన.. ఇట్లు వ్రాయబడియున్నది: 'నిన్ను గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును. నీ పాదమైనను రాతికి తగలకుండ నిన్ను వారు తమచేతులతో ఎత్తిపట్టుకొందురు” అని పలికెను.

7. అందుకు యేసు " 'ప్రభువైన నీ దేవుని నీవు శోధింపరాదు' అని లేఖనమున వ్రాయబడియున్నదిగదా!" అని పలికెను.

8. తిరిగి సైతాను యేసును మిక్కిలి ఎత్తయిన పర్వతశిఖరమునచేర్చి, భువియందలి రాజ్య ములనన్నిటిని, వాటి వైభవమును చూపి,

9. “నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించినయెడల నీకు ఈ సమస్తమును ఇచ్చెదను” అనెను.

10. "సైతాను! పొమ్ము ! 'ప్రభువైన నీ దేవుని ఆరాధింపుము ఆయనను మాత్రమే నీవు సేవింపుము' అని వ్రాయబడియున్నది” అని యేసు పలికెను.

11. అంతట సైతానువెడలి పోగా, దేవదూతలు వచ్చి యేసుకు పరిచర్యలు చేసిరి.

12. యోహాను చెరసాలలో బంధింపబడెనని విని, యేసు గలిలీయ సీమకు వెళ్ళెను.

13. ఆయన నజరేతును వీడి సెబూలూను, నష్టాలి సీమలలోని సరస్సు తీరముననున్న కఫర్నామునకు వచ్చి నివాస మేర్పరచుకొనెను.

14-16. "సెబూలూను, నఫాలి ప్రాంతములు, గలిలీయ సరస్సు తీరము, యోర్దాను నదికి ఆవలిదిక్కున అన్యులు నివసించు గలిలీయ సీమయందు అంధకారమున నివసించు ప్రజలు గొప్పవెలుగును చూచిరి, మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను” అను యెషయా ప్రవక్త ప్రవచనము నెరవేరునట్లు ఇది జరిగెను.

17. "హృదయపరివర్తనము చెందుడు. పరలోక రాజ్యము సమీపించియున్నది” అని యేసు అప్పటి నుండి జనులకు బోధింపనారంభించెను.

18. గలిలీయ సరస్సు తీరమున యేసు నడచుచు, వలవేసి చేపలనుపట్టు పేతురు అను పేరుగల సీమోనును, అతని సోదరుడగు అంద్రెయను చూచెను. వారు జాలరులు.

19. “మీరు నన్ను అనుసరింపుడు. మిమ్ము మనుష్యులను పట్టువారినిగా చేసెదను” అని యేసు వారితో పలికెను.

20. వెంటనే వారు తమ వలలను అచట విడిచి పెట్టి ఆయనను వెంబడించిరి.

21. అచటనుండి పోవుచు యేసు జెబదాయి కుమారులైన యాకోబు, యోహాను అను మరి ఇద్దరు సోదరులను చూచెను. వారు, తమ తండ్రితోపాటు పడవలో తమ వలలను చక్కబెట్టుకొనుచుండిరి. యేసు వారిని పిలువగా,

22. వెంటనే వారు పడవను, తమ తండ్రిని వదలిపెట్టి ఆయనను వెంబడించిరి.

23. యేసు గలిలీయ ప్రాంతమంతట పర్యటించుచు, వారి ప్రార్థనా మందిరములలో బోధించుచు, పరలోకరాజ్యపు సువార్తను గూర్చి ప్రసంగించుచు, ప్రజల వ్యాధి బాధలనెల్ల పోగొట్టుచుండెను.

24. ఆయన కీర్తి సిరియా దేశమంతటను వ్యాపించెను. అనేక విధములగు వ్యాధులతోను, వేదనలతోను పిడింపబడువారిని, పిశాచగ్రస్తులను, మూర్ఛ రోగులను, పక్షవాత రోగులను ప్రజలు ఆయన వద్దకు తీసికొనిరాగా, వారిని ఆయన స్వస్థపరచెను.

25. గలిలీయ, దెకపొలి, యెరూషలేము, యూదయా ప్రాంతములనుండి యోర్డాను నది ఆవలి దిక్కు నుండి ప్రజలు తండోపతండములుగా యేసును వెంబడించిరి.