ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Telugu Catholic Bible Matthew chapter 1 || Telugu catholic Bible online || మత్తయి సువార్త 1వ అధ్యాయము

1. ఇది అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి.

2. అబ్రహాము ఈసాకు తండ్రి. ఈసాకు యాకోబు తండ్రి. యాకోబు యూదాకు, అతని సోదరులకు తండ్రి.

3. యూదా పెరెసుకు, జెరాకు తండ్రి. వారి తల్లి తామారు. పెరెసు ఎస్రోమునకు తండ్రి. ఎస్రోమునకు ఆరాము జన్మించెను.

4. ఆరామునకు అమ్మినాదాబు జన్మించెను. అమ్మినాదాబునకు నహస్సోను జన్మించెను. అతనికి సల్మోను జన్మించెను.

5. రాహాబు వలన సల్మోనునకు బోవజు జన్మించెను. రూతువలన బోవజునకు ఓబేదు జన్మించెను. ఓబేదునకు యిషాయి జన్మించెను.

6. యిషాయికి దావీదురాజు జన్మించెను. ఊరీయా అనువాని భార్యవలన దావీదునకు సొలోమోను జన్మించెను.

7. సొలోమోనునకు రెహబాము, అతనికి అబీయా, అబీయాకు ఆసా జన్మించిరి.

8. ఆసాకు యోషఫాత్తు, యోషాత్తుకు యోరాము, యోరామునకు ఉజ్జీయా జన్మించిరి.

9. ఉజ్జీయాకు యోతాము, యోతామునకు ఆహాసు, అతనికి హిజ్కియా జన్మించిరి.

10. హిజ్కియా కుమారుడు మనషే, అతనికి ఆమోను, ఆమోనునకు యోషియా జన్మించిరి.

11. యిస్రాయేలీయులు బబులోనియాకు కొనిపోబడిన కాలమున యోషియాకు యెకోనియ, అతని సోదరులు జన్మించిరి.

12. బబులోనియాకు కొనిపోబడిన పిదప యెకోనియకు షయలియేలు, అతనికి సెరుబ్బాబెలు జన్మించిరి.

13. సెరుబ్బాబెలునకు అబియూదు, అతనికి ఎల్యాకీము, అతనికి అజోరు జన్మించిరి.

14. అజోరునకు సాదోకు, సాదోకునకు అకీము, అకీమునకు ఎలియూదు జన్మించిరి.

15. ఎలియూదునకు ఎలియాసరు, ఎలియాసరునకు మత్తాను, మత్తానునకు యాకోబు జన్మించిరి.

16. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు 'క్రీస్తు' అనబడు యేసు జన్మించేను.

17. అబ్రాహామునుండి దావీదువరకు పదునాలుగు తరములును, దావీదునుండి బబులోనియా ప్రవాసము వరకు పదునాలుగు తరములును, బబులోనియా ప్రవాసమునుండి క్రీస్తువరకు పదునాలుగు తరములును గడచినవి.

18. యేసుక్రీస్తు పుట్టుకరీతి ఎట్టిదన: ఆయన తల్లియైన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయింపబడినది'. కాని వారు ఇరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావమువలన మరియమ్మ గర్భము ధరించినది.

19. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టములేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను.

20. యోసేపు ఇట్లు తలంచు చుండగా, ప్రభువు దూత కలలో కనిపించి, "దావీదు కుమారుడవగు యోసేపూ! నీ భార్యయైన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయన, ఆమె పవిత్రాత్మ ప్రభావమువలన గర్భము ధరించినది.

21. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు 'యేసు' అను పేరు పెట్టుము. ఏలయన ఆయన, తన ప్రజలను వారి పాపములనుండి రక్షించును" అని చెప్పెను.

22-23. "ఇదిగో! కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును. ఆయనను 'ఇమ్మానుయేలు' అని పిలిచెదరు” అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరునట్లు ఇదంతయు సంభవించెను. "ఇమ్మానుయేలు” అనగా “దేవుడు మనతో ఉన్నాడు" అని అర్థము.

24. నిదురనుండి మేలుకొనిన యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను.

25. కుమారుని ప్రసవించునంతవరకు ఆమెతో అతని కెట్టి శారీరక సంబంధములేదు. ఆ శిశువునకు అతడు 'యేసు' అను పేరు పెట్టెను.