ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Philippians chapter 2 || Telugu catholic Bible online || ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము

 1. క్రీస్తునందలి మీ జీవితము మిమ్ము బలపరచు చున్నచో, ఆయన ప్రేమ మిమ్ము ఊరడించుచున్నచో, ఆత్మ సహవాసము మీకు లభించుచున్నచో, మీలో ఒకరియెడల ఒకరికి దయకనికరములు ఉన్నచో,

2. ఒకే మనసు, ఒకే ప్రేమ, ఒకే భావము కలిగి ఒక్కదాని యందే మనసు నిలిపి నా సంతోషమును పరిపూర్తి చేయుడు.,

3. స్వార్దముతోగాని, అహంభావముతో గాని ఎట్టి పనియు చేయకుడు. వినయాత్ములై ఇతరులను మీకంటె అధికులుగా భావింపుడు.

4. ప్రతి ఒక్కరు కేవలము స్వార్ధమునే చూచుకొనక, పరస్పరము ఉపకారులై ఉండవలెను.

5. క్రీస్తుయేసునందు మీదైన ఈ మనస్తత్వమును మీ మధ్య ఉండనిండు:

6. ఆయన ఎల్లప్పుడును. దైవస్వభావమును కలిగిఉన్నను, దేవునితో తన సమానత్వమును స్వార్ధబుద్ధితో పట్టుకొని వ్రేలాడలేదు. ఇది గ్రహింపవలసిన విషయము.

7. కాని ఆయన తన్నుతాను రిక్తుని చేసికొని, సేవక రూపమును దాల్చి మానవమాత్రుడుగా జన్మించెను.

8. ఆయన అన్నివిధముల మానవమాత్రుడై ఉండి, అంతకంటె వినయముగలవాడై, మరణమువరకును, సిలువపై మరణము వరకును, విధేయుడాయెను.

9. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటె ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను.

10. అందువలననే పరలోక భూలోక పాతాళలోకములయందలి సమస్త జీవులును క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను.

11. పితయగు దేవుని మహిమార్థమై, యేసు క్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను.

12. కనుక ప్రియ మిత్రులారా! నేను మీతో ఉన్నపుడు మీరు నాకు విధేయులై ఉన్నదానికంటె, నేను మీకు దూరముగా ఉన్న ఇప్పుడు మీరు నాకు విధేయులైయుండుట అత్యవసరము. భయముతోను వణుకుతోను మీ రక్షణముకై శ్రమింపుడు.

13. ఏలయన, ఆయన ఉద్దేశమునకు, మీరు విధేయులై సమ్మతించునట్లు చేయుటకు దేవుడు మీయందు కార్యసిద్ధిని కలిగించుచున్నాడు.

14. మీరు అన్ని పనులను సణుగుకొనక, వివాదములు లేకుండ చేయుడు.

15. అప్పుడు నీచు లును, వక్రబుద్దులుగల ఈ లోకములో, మీరు దేవుని సుపుత్రులవలె నిరపరాధులుగను, పరిశుద్ధులుగను ఉందురు.

16. మీరు జీవవాక్కునకు అంటిపెట్టుకొని వారిమధ్య ప్రకాశవంతమైన దీపికలవలె వెలుగొందు దురు. మీరు అటుల చేసినచో క్రీస్తుదినమున మిమ్ము గూర్చి నేను గర్వించుటకు కారణము ఉండును. ఏలయన నా ప్రయత్నముగాని, కృషిగాని వ్యర్థము కాలేదని అది నిరూపించును.

17. ఒకవేళ మీ విశ్వాసమనెడు బల్యర్పణపై నన్ను నేను ఒక పానబలిగా ధారపోయవలసినప్పటికిని, నేను ఆనందించి మీ అందరితో కూడ సంతోషింతును.

18. అటులనే మీరును ఆనందించి నాతో సంతోషింపుడు.

19. మీ సమాచారము తెలిసికొని సంతోషించుటకు తిమోతిని త్వరలోనే మీవద్దకు పంపగలనని యేసు ప్రభువునందు నేను నమ్ముచున్నాను.

20. మీ యందు నిజముగ శ్రద్ధగలవాడును, నా భాగములో పాలుపంచుకొనువాడును అతనొక్కడే.

21. ఇతరు లందరును ఎవరిపనులు వారు చూచుకొందురు. యేసుక్రీస్తు కార్యమునందు శ్రద్ధలేదు.

22. తిమోతి తన యోగ్యతను ఎట్లు నిరూపించెనో మీరు ఎరుగు దురు. తండ్రికి కుమారుడు సేవచేయునట్లు అతడు సువార్తకొరకై నాతో కలిసి పనిచేసెను.

23. నా విషయము ఎట్లుండగలదో తెలిసినంతనే, అతనిని మీ వద్దకు పంపగలనని అనుకొనుచున్నాను.

24. నేనే త్వరలో మిమ్ము చేరగలనని ప్రభువునందు నాకు నమ్మకము కలదు.

25. మరియు నా సోదరుడు, తోటి పనివాడు, యోధుడు, మీ దూతయు, నా అవసరమునకు ఉపక రించిన వాడైన ఎపప్రోదితును, ఇప్పుడు మీ వద్దకు తిరిగిపంపుట అవసరమని తోచినది.

26. మిమ్ము అందరిని చూడవలెనని అతనికి చాల కోరికగ ఉన్నది. అతని అనారోగ్యస్థితిని గూర్చి మీరు వినియున్నారని కలవరపడుచున్నాడు.

27. అతడు నిజముగా వ్యాధితో మరణావస్థలో ఉన్నాడు. కాని దేవుడు అతనిపై కనికరము వహించినాడు. అతని పైననే కాదు, నా మీదను కృప చూపినాడు. అధికమగు దుఃఖమునుండి నన్ను కాపాడినాడు.

28. కనుకనే అతనిని మీ వద్దకు తిరిగి పంపవలెనని మరింత గాఢముగ అభిలషించుచు న్నాను. అతనిని చూచి మీరు సంతోషింపగలరు. నా విచారము కూడ ఉపశమించును.

29. కనుక ప్రభువు నందు సంతోషముతో అతనికి స్వాగతమిండు. అట్టి వారిని గౌరవింపుడు.

30. ఏలయన, మీరు చేయలేని సాయమును అతడు నాకు చేసి, క్రీస్తు కార్యార్ధమై తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక చావసిద్ధమైనాడు.