ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Luke chapter 15 || Telugu catholic Bible || లూకా సువార్త 15వ అధ్యాయము

 1. సుంకరులు, పాపులు అందరును యేసు బోధలు వినుటకు ఆయనవద్దకు వచ్చుచుండిరి.

2. అది చూచి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు “ఇతడు పాపులను చేరదీయుచు, వారితో కలిసి భుజించుచున్నాడు” అని సణుగుకొనసాగిరి.

3. అపుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను:

4. “ఒకడు తనకు ఉన్న నూరు గొఱ్ఱెలలో ఒకటి తప్పిపోయినచో, తక్కిన తొంబది తొమ్మిదింటిని ఆ అరణ్యముననే విడిచి పెట్టి, దానిని వెదకుటకై పోవునుగదా!

5. అది దొరికినపిమ్మట వాడు సంతోషముతో దానిని భుజములపై వేసికొని, ఇంటికి తీసికొని వచ్చి,

6. తన మిత్రులను, ఇరుగు పొరుగు వారలను పిలిచి, 'తప్పిపోయిన నా గొఱ్ఱె దొరకినది. నాతోపాటు ఆనందింపుడు' అని చెప్పును.

7. అట్లే హృదయపరివర్తనము లేని తొంబది తొమ్మిది మంది నీతిమంతులకంటె, హృదయపరివర్తనము పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండునని నేను మీతో నిశ్చయ ముగా చెప్పుచున్నాను.

8. “పది వెండినాణెములున్న స్త్రీ అందులో ఒకటి పోగొట్టుకొనినయెడల, దీపము వెలిగించి, ఇల్లు ఊడ్చి, అది దొరకునంతవరకు పట్టుదలతో వెదకదా?

9. అది దొరకగనే స్నేహితురాండ్రను, ఇరుగుపొరుగు స్త్రీలను చేరబిలిచి 'నాతో పాటు ఆనందింపుడు. నేను పోగొట్టుకొనిన నాణెము దొరకినది' అని చెప్పును.

10. అట్లే హృదయపరివర్తనము చెందు ఒక పాపాత్ముని విషయమై దేవదూతలు సంతోషింతురు అని మీతో చెప్పుచున్నాను.”

11. యేసు ఇంకను వారితో ఇట్లనెను: “ఒకనికి ఇద్దరు కుమారులుండిరి.

12. వారిలో చిన్నవాడు తండ్రితో,  తండ్రీ ఆస్తిలో నా భాగము నాకు పంచి పెట్టుము' అనెను. తండ్రి అట్లే వారిరువురికి ఆస్తిని పంచియిచ్చెను.

13. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసికొని దూరదేశమునకు వెళ్ళెను. అక్కడ భోగవిలాసములతో ఆ ధనమంతయు దుర్వినియోగము చేసి,

14. తన ఆస్తిని అంతటిని మంట కలిపెను. అపుడు అచట దారుణమైన కరువు దాపురించుటచే వాడు ఇబ్బందులు పడెను.

15. అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమానుని ఆశ్రయింపగా, అతడు వానిని తన పొలములో పందులను మేపుటకు పంపెను.

16. వాడు పందులుతిను పొట్టుతో పొట్ట నింపుకొన ఆశపడుచుండెను. కాని ఎవరును ఏమి యును ఇయ్యలేదు.

17. అపుడు అతనికి కనువిప్పు కలిగి తనలోతాను ఇట్లు అనుకొనెను: “నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనము లభించు చున్నది. కాని నేను ఇక్కడ ఆకలికి మలమలమాడు చున్నాను.

18. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, 'తండ్రీ! నేను పరలోకమునకు విరోధముగాను, నీ యెదుటను పాపము చేసితిని.

19. ఇప్పుడు నేను నీ కుమారుడను అనిపించుకొనదగను. నీ పని వారలలో ఒకనిగా పెట్టుకొనుము అని చెప్పెదను' అని తలచి,

20. వాడు లేచి, తన తండ్రి వద్దకు బయలు దేరెను. కాని వాడు ఇంకను దూరమున ఉండగనే తండ్రి అతనిని చూచి మనసుకరిగి, పరుగెత్తి వెళ్ళి, కుమారుని మెడమీద పడి ముద్దుపెట్టుకొనెను.

21. కుమారుడు తండ్రితో 'తండ్రీ! నేను పరలోకమునకు విరోధము గాను, నీ యెదుటను పాపము చేసితిని ఇక నేను నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను' అని పలికెను.

22. కాని తండ్రి సేవకులతో 'త్వరగా వీనికి మేలివస్త్రములను కట్టబెట్టుడు. వ్రేలికి ఉంగరమును, పాదములకు చెప్పులను తొడుగుడు.

23. క్రొవ్విన కోడెదూడను వధింపుడు. మనము విందారగించి, వేడుక చేసికొందము.

24. ఏలయన, మరణించిన ఈ నా కుమారుడు మరల బ్రతికెను. పోయినవాడు తిరిగి దొరకెను' అని చెప్పెను. పిమ్మట వారు విందు చేసికొనసాగిరి.

25. అతని పెద్ద కుమారుడు పొలమునుండి ఇంటికి వచ్చుసరికి సంగీతనృత్యముల ధ్వని వినిపించెను.

26. అతడు ఒక పనివానిని పిలిచి 'ఇది అంతయు ఏమిటి?' అని అడిగెను.

27. 'నీ తమ్ముడు వచ్చెను. కుమారుడు క్షేమముగ తిరిగివచ్చినందుకు నీ తండ్రి క్రొవ్వినకోడెదూడను కోయించెను' అని అతడు చెప్పెను.

28. అందుకు పెద్దకుమారుడు మండిపడి, లోపలకు అడుగు పెట్టుటకు ఇష్టపడ కుండెను. తండ్రి వెలుపలకు వచ్చి అతనిని బ్రతిమాల సాగెను.

29. అందుకు పెద్దకుమారుడు తండ్రితో 'ఇదిగో! నేను ఇన్ని సంవత్సరములనుండి నీ పని పాటులను చేయుచున్నాను. ఎన్నడును నీ ఆజ్ఞను మీరి ఎరుగను. అయినను నేను నా మిత్రులతో విందు జరుపుకొనుటకు నీవు ఎన్నడును ఒక్క మేకపిల్లనైనను ఇచ్చియుండలేదు.

30. కాని, నీ సంపదను వేశ్యలతో పాడుచేసిన ఈ నీ కుమారుడు తిరిగివచ్చినంతనే, వాని కొరకు నీవు క్రొవ్వినకోడెదూడను కోయించితివి' అనెను.

31. తండ్రి అందులకు బదులుగా "కుమారా! నీవు ఎల్లప్పుడును నాతో ఉన్నావు. నాకు ఉన్నదంతయు నీదే కదా!

32. మనము విందు జరుపుకొనుట యుక్తమే. ఏలయన, చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను. తప్పిపోయినవాడు మరల దొరికెను” అని అతనితో చెప్పెను.