1. ఆ సమయమున కొందరు, గలిలీయ దేశీయులు బలులు సమర్పించునప్పుడు పిలాతు వారిని చంపిన విషయమును యేసుతో చెప్పిరి.
2. అందుకు యేసు, “అటుల చంపబడిన ఈ గలిలీయ వాసులు తక్కిన గలిలీయవాసులకంటె ఎక్కువ పాపులని మీరు తలంచుచున్నారా?
3. కాదు. హృదయ పరివర్తనము చెందనిచో మీరు అందరును అట్లే నాశన మగుదురని మీతో చెప్పుచున్నాను.
4. సిలోయము అను బురుజు కూలి, దాని క్రిందపడి మరణించిన పదునెనిమిదిమంది, తక్కిన యెరూషలేము నివాసుల కంటె ఎక్కువ అపరాధులని ఎంచుచున్నారా?
5. కాదు, హృదయ పరివర్తనము చెందనిచో మీరందరును అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను" అని పలికెను.
6. పిమ్మట యేసు ఈ ఉపమానమును చెప్పెను: “ఒకడు తన ద్రాక్షతోటలో అంజూరపుచెట్టు నాటించెను. అతడు ఆ చెట్టు పండ్లకొరకు చూచెను. కాని అతనికి ఏమియు దొరకలేదు.
7. అపుడు అతడు తోటమాలితో 'ఇదిగో! నేను మూడేండ్ల నుండి ఈ అంజూరపు చెట్టు పండ్ల కొరకు వచ్చుచున్నాను. కాని నాకు ఏమియు దొరకలేదు. దీనిని నరికివేయుము. ఇది వృథాగా భూమిని ఆక్రమించుట ఎందుకు?' అనెను.
8. అందులకు తోటమాలి 'అయ్యా! ఇంకొక యేడు ఓపిక పట్టుడు. నేను దీని చుట్టు పాదుచేసి, ఎరువు వేసెదను.
9. ముందుకు ఫలించిన సరి. లేనిచో కొట్టి పారవేయుడు' అని పలికెను.”
10. యేసు విశ్రాంతిదినమున ప్రార్థనా మందిరము నందు ఉపదేశించుచుండెను.
11. అక్కడ పదు నెనిమిది సంవత్సరములనుండి అపవిత్రాత్మచే పీడింపబడుచున్న ఒక స్త్రీ ఉండెను. ఆమె నడుము వంగిపోయి తిన్నగ నిలబడలేకుండెను.
12. యేసు అది చూచి ఆమెను పిలిచి, “ ఓ స్త్రీ! నీవు రోగమునుండి విముక్తి పొందితివి” అని చెప్పి
13. ఆమెపై తన చేతు లుంచగా, తక్షణమే ఆమె తిన్నగ నిలబడి దేవుని స్తుతించెను.
14. యేసు విశ్రాంతిదినమున స్వస్థపరచి నందులకు ప్రార్థనామందిరాధికారి మండిపడి, అచట ఉన్న వారితో “పనిచేయుటకు ఆరు దినములు ఉన్నవి. ఆ దినములలో వచ్చి స్వస్థత పొందుడు. విశ్రాంతి దినమున కాదు” అని చెప్పెను.
15. అందుకు యేసు, “కపట భక్తులారా! విశ్రాంతి దినమున మీలో ప్రతివాడు తన ఎద్దునుగాని, గాడిదనుగాని విప్పి, నీళ్ళు పెట్టుటకు తోలుకొని పోవుటలేదా?
16. ఈమె అబ్రహాము పుత్రిక. పదునెనిమిది సంవత్సరముల నుండి సైతాను బంధములో ఉన్న ఈమెను విశ్రాంతి దినమున స్వస్థపరచుట తగదా?" అనెను.
17. ఈ మాటలకు ఆయన విరోధులందరు సిగ్గుపడిరి. కాని, తక్కిన వారందరును ఆయన అద్భుతకార్యములకు సంతసించిరి.
18. యేసు మరియొక ఉపమానము చెప్పెను: “పరలోకరాజ్యము దేనితో పోల్చదగును?
19. అది ఒకడు తన తోటలో వేసిన ఆవగింజను పోలియున్నది. అది మొలకెత్తి పెరిగి పెద్దదయ్యెను. ఆకాశపక్షులు వచ్చి, ఆ చెట్టు కొమ్మలలో గూడు కట్టుకొని నివసించెను.”
20. ఆయన ఇంకను ఇట్లనెను: “నేను పరలోక రాజ్యమును దేనితో పోల్చెదను?
21. “అది ఒక స్త్రీ పులిసిన పిండిని మూడంతలు పిండిలోనుంచగా, అంతయు పులియబారిన పిండిని పోలియున్నది.”
22. యేసు వాడవాడల, పల్లెపల్లెల పర్యటించుచు, బోధించుచు యెరూషలేము దిక్కుగ పోవు చుండగా,
23. “రక్షణపొందువారు కొలదిమంది మాత్రమేనా?” అని ఒకడు ఆయనను అడిగెను.
24. అందుకు యేసు, “ఇరుకైన మార్గమున ప్రవేశింపుము. అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప ప్రయత్నింతురు. కాని, అది వారికి సాధ్యపడదు.
25. గృహ యజమానుడు ద్వారము మూసివేసినపుడు మీరందరు వెలుపల నిలువబడి తలుపు తట్టుచు 'అయ్యా! తలుపు తీయుడు' అని అందురు. 'మీరు ఎచ్చటనుండి వచ్చితిరో నేను ఎరుగను' అని అతడు సమాధానము ఇచ్చును.
26. అపుడు 'మేము మీతో అన్న పానీయములు పుచ్చుకొంటిమి. మా వీధులలో మీరు బోధించి తిరి' అని మీరు చెప్పనారంభింతురు.
27. కాని, అతడు మీతో 'మీరు ఎచ్చటనుండి వచ్చితిరో నాకు తెలియదు. దుష్టులారా! నా నుండి తొలగిపొండు' అని చెప్పును.
28. అబ్రహాము, ఈసాకు, యాకోబులు, ప్రవక్తలందరును పరలోకరాజ్యమునయుండుట చూచి, మీరు మాత్రమే వెలుపలకు గెంటివేయబడినపుడు మీరు ఏడ్చుచు, పండ్లు కొరుకుకొందురు.
29. తూర్పు పడమరల నుండి, ఉత్తరదక్షిణములనుండి ప్రజలువచ్చి దైవరాజ్య మున విందునకు కూర్చుందురు.
30. కడపటివారు మొదటి వారగుదురు. మొదటివారు కడపటి వారగుదురు” అని చెప్పెను.
31. ఆ క్షణమున కొందరు పరిసయ్యులు వచ్చి యేసుతో “మీరు ఇక్కడనుండి వెళ్ళిపొండు. ఏలయన, హేరోదు మిమ్ములను చంపచూచుచున్నాడు” అని చెప్పిరి.
32. ఆయన వారితో “మీరు వెళ్ళి ఆ నక్కతో ఇట్లని చెప్పుడు: 'నేను నేడు, రేపు దయ్యములను పారద్రోలెదను, రోగులను స్వస్థపరచెదను, మూడవ దినమున నా పని పూర్తిచేసెదను.
33. నేడు, రేపు, మరునాడు నేను నాపనిని కొనసాగింపవలయును. ఏలయన, ప్రవక్త యెరూషలేమునకు వెలుపల చంపబడుట సంభవింపరాదు' అని చెప్పెను.
34. “ఓ యెరూషలేమా! యెరూషలేమా! నీవు ప్రవక్తలను చంపి దేవుడు పంపిన ప్రతినిధులపై రాళ్ళు రువ్వుచున్నావు. కోడి రెక్కలను చాపి తన పిల్లలను కాపాడుకొనునట్లు నేను ఎన్ని పర్యాయములు నీ బిడ్డలను చేరదీయ గోరినను, నీవు అంగీకరింపకపోయితివి.
35. ఇదిగో నీ గృహము నిర్మానుష్యమగును. 'ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక!' అని చెప్పువరకు మీరు నన్ను చూడజాలరు అని మీతో చెప్పుచున్నాను” అని పలికెను.