1. మొదటి నిబంధన ఆరాధన నియమములను, భూలోక సంబంధమైన పవిత్రస్థలమును కలిగియుండెను.
2. ఎట్లన మొదట ఒక గుడారము ఏర్పరుపబడెను. దానియందు దీపస్తంభమును, బల్లయు, దేవునికి అర్పింప బడిన రొట్టెలును ఉండెను. దానికి పవిత్రస్థలమని పేరు.
3. రెండవ తెరవెనుక అతిపవిత్రస్థలమను గుడారము ఉండెను.
4. దానియందు ధూపమిచ్చుటకు బంగారు పిఠమును, బంగారుమయమగు నిబంధన మందసమును ఉండెను. ఆ మందసమునందు మన్నా గల బంగారుపాత్రయు, చిగురించిన అహరోను దండమును, నిబంధన వ్రాయబడిన రెండు రాతిపలకలును ఉండెను.
5. కరుణాపీఠమును మహిమాన్వితమైన కెరూబుదూతలు తమ రెక్కలతో కప్పుడు ఆ మందసము పై ఉండిరి. కాని వీనిని గూర్చి ఇప్పుడు సవిస్తరముగ వివరించుటకు వీలుపడదు. .
6. ఈ ఏర్పాటు చేయబడిన పిమ్మట, ప్రతి దినమును తమ కర్తవ్యములను నిర్వర్తించుటకు యాజకులు మొదటి గుడారమున ప్రవేశింతురు.
7. రెండవ గుడారము లోనికి కేవలము ప్రధానయాజ కుడు మాత్రమే ప్రవేశించును. అది సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే. తన కొరకును, ప్రజలు తెలియక చేయు పాపముల కొరకును, తాను తీసికొనివచ్చిన రక్తమును దేవునికి అర్పించును.
8. ఈ ఏర్పాట్లను బట్టి, మొదటి గుడారము నిలిచి ఉన్నంతకాలము అతి పవిత్ర ప్రదేశములోనికి మార్గము ఇంకను తెరువబడలేదని పవిత్రాత్మ స్పష్టముగ బోధించుచున్నది.
9. ఈ గుడారము ప్రస్తుత కాలమును సూచించు సంకే తము. దేవునికి అర్పింపబడు కానుకలును, బలులును ఆరాధకుని అంతఃకరణమును పరిపూర్ణము చేయజాలవని ఈ సంకేతము తెలుపుచున్నది.
10. అవి కేవలము అన్నపానములకును, శుద్ధిచేయు కర్మలకును సంబంధించినవి. అవి అన్నియు బాహ్యములే. దేవుడు సమస్తమును సరిదిద్దువరకు మాత్రమే అవి వర్తించును.
11. కాని క్రీస్తు ఇటనున్న సద్విషయములకు ప్రధానయాజకుడుగ వచ్చి గుడారమున ప్రవేశించెను. మరింత శ్రేష్ఠమును సంపూర్ణమునైన అది మానవ నిర్మితము కాదు. అనగా ఇహలోక సృష్టికి చెందినది కాదు.
12. క్రీస్తు ఈ గుడారమున ప్రవేశించి, అతి పవిత్రస్థలమును శాశ్వతముగ చేరినపుడు, బలిని అర్పించుటకుగాను మేకలయొక్కయు, దూడలయొక్కయు రక్తమును తీసికొనిపోలేదు. తన రక్తమునే తీసికొని పోయి మనకు శాశ్వత రక్షణను సంపాదించెను.
13. మేకలయొక్కయు, ఎద్దులయొక్కయు రక్తమును, దహింపబడిన దూడబూడిదను మైలపడిన వారిపై చల్ల బడినపుడు అవి వారికి శరీర శుద్ధికలుగునట్లు పవిత్రులనుగా చేయును.
14. అటులైనచో ఇక నిత్యుడగు ఆత్మద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించు కొనిన క్రీస్తు రక్తము, నిర్జీవక్రియలను విడిచి సజీవ దేవుని సేవించుటకు మన అంతఃకరణములను ఇంకను ఎంతగానో శుద్ధిచేయునుగదా!
15. ఈ కారణము వలననే దేవుని పిలుపును పొందినవారు, దేవునిచే వాగ్దానము చేయబడిన శాశ్వ తమైన వారసత్వమును పొందుటకు గాను, క్రీస్తు ఒక క్రొత్త నిబంధనపు మధ్యవర్తిగా ఉన్నాడు. మొదటి నిబంధన కాలమున ప్రజలు చేసిన దోషములనుండి వారిని విముక్తులను చేయగల ఒకానొక మరణము సంభవించినందున ఇది సాధ్యమే.
16. వీలునామా ఉన్నచోట దాని కర్త మరణించెనని నిరూపింపవలసియున్నది.
17. వీలునామా వ్రాసినవాడు బ్రతికి ఉన్నంతకాలమును ఆ వీలునామాకు విలువలేదు. అతని మరణానంతరమే అది అమలులోనికి వచ్చును.
18. అందువలననే, మొదటి నిబంధన కూడ రక్తములేకుండ ప్రతిష్ఠింపబడలేదు.
19. ధర్మశాస్త్రపు ఆజ్ఞలను అన్నిటిని మొదట ప్రజలకు మోషే వినిపించెను. పిమ్మట నీటితో కూడ దూడల, మేకల రక్తమును తీసికొని గ్రంథముపైన, జనసమూహములపైన దర్భపోచతోను, ఎఱ్ఱనిగొఱ్ఱె ఉన్నితోను చల్లెను.
20. అప్పుడు అతడు ఇట్లు చెప్పెను: “దేవుడు మీకు శాసించిన నిబంధనను ఈ రక్తము ధ్రువపరచుచున్నది.”
21. అదే విధముగా గుడారముపైనను, ఆరాధనకు ఉపయోగించు అన్ని వస్తువులపైనను కూడ రక్తమును చల్లెను.
22. నిజమునకు ధర్మశాస్త్రమును అనుసరించి దాదాపు సమస్తవస్తువులును రక్తముచే శుద్ధి చేయబడును. రక్తము చిందకయే పాపక్షమాపణ లభింపదు.
23. పరలోక వస్తువులను పోలిన ఈ వస్తువులు ఇట్టి బలులవలన శుద్ధి చేయబడవలసి ఉండెను. కాని, పరలోక వస్తువులు ఇంత కంటె మేలైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను.
24. నిజమైన పవిత్ర స్థలమును పోలిన మానవనిర్మితమగు పవిత్రస్థలమున క్రీస్తు ప్రవేశింపలేదు. పరలోకముననే ప్రవేశించి మన పక్షమున దేవుని సన్నిధిలో నిలిచియున్నాడు.
25. యూదుల ప్రధానయాజకుడు, జంతు రక్తముతో పవిత్ర ప్రదేశములోనికి ప్రతిసంవత్సరము ప్రవేశించును. కాని క్రీస్తు పెక్కుమార్లు తనను తాను అర్పించుకొనుటకు అందు ప్రవేశింపలేదు.
26. అటులైనచో ప్రపంచము సృష్టింపబడినప్పటినుండి, అనేక పర్యాయములు, ఆయన బాధనొందవలసి ఉండెడిది. అటులకాక, తనను తానే బలిగా అర్పించుకొనుటవలన పాప నివారణ చేయుటకై యుగాంతమున ఇప్పుడు ఒకే ఒకసారి జన్మించెను.
27. ప్రతి వ్యక్తియు ఒక్కసారియే మరణించి తదుపరి దేవునిచే తీర్పు పొందవలెను,
28. అదే విధముగా అనేకుల పాపపరిహారమునకై క్రీస్తుకూడ ఒక సారే బల్యర్పణముగ సమర్పింపబడెను. పాపమును గూర్చి విచారించుటకు గాక, తనకొరకై వేచియున్నవారిని రక్షించుటకు ఆయన రెండవ మారు వచ్చును.