1. ఇది అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి.
2. అబ్రహాము ఈసాకు తండ్రి. ఈసాకు యాకోబు తండ్రి. యాకోబు యూదాకు, అతని సోదరులకు తండ్రి.
3. యూదా పెరెసుకు, జెరాకు తండ్రి. వారి తల్లి తామారు. పెరెసు ఎస్రోమునకు తండ్రి. ఎస్రోమునకు ఆరాము జన్మించెను.
4. ఆరామునకు అమ్మినాదాబు జన్మించెను. అమ్మినాదాబునకు నహస్సోను జన్మించెను. అతనికి సల్మోను జన్మించెను.
5. రాహాబు వలన సల్మోనునకు బోవజు జన్మించెను. రూతువలన బోవజునకు ఓబేదు జన్మించెను. ఓబేదునకు యిషాయి జన్మించెను.
6. యిషాయికి దావీదురాజు జన్మించెను. ఊరీయా అనువాని భార్యవలన దావీదునకు సొలోమోను జన్మించెను.
7. సొలోమోనునకు రెహబాము, అతనికి అబీయా, అబీయాకు ఆసా జన్మించిరి.
8. ఆసాకు యోషఫాత్తు, యోషాత్తుకు యోరాము, యోరామునకు ఉజ్జీయా జన్మించిరి.
9. ఉజ్జీయాకు యోతాము, యోతామునకు ఆహాసు, అతనికి హిజ్కియా జన్మించిరి.
10. హిజ్కియా కుమారుడు మనషే, అతనికి ఆమోను, ఆమోనునకు యోషియా జన్మించిరి.
11. యిస్రాయేలీయులు బబులోనియాకు కొనిపోబడిన కాలమున యోషియాకు యెకోనియ, అతని సోదరులు జన్మించిరి.
12. బబులోనియాకు కొనిపోబడిన పిదప యెకోనియకు షయలియేలు, అతనికి సెరుబ్బాబెలు జన్మించిరి.
13. సెరుబ్బాబెలునకు అబియూదు, అతనికి ఎల్యాకీము, అతనికి అజోరు జన్మించిరి.
14. అజోరునకు సాదోకు, సాదోకునకు అకీము, అకీమునకు ఎలియూదు జన్మించిరి.
15. ఎలియూదునకు ఎలియాసరు, ఎలియాసరునకు మత్తాను, మత్తానునకు యాకోబు జన్మించిరి.
16. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు 'క్రీస్తు' అనబడు యేసు జన్మించేను.
17. అబ్రాహామునుండి దావీదువరకు పదునాలుగు తరములును, దావీదునుండి బబులోనియా ప్రవాసము వరకు పదునాలుగు తరములును, బబులోనియా ప్రవాసమునుండి క్రీస్తువరకు పదునాలుగు తరములును గడచినవి.
18. యేసుక్రీస్తు పుట్టుకరీతి ఎట్టిదన: ఆయన తల్లియైన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయింపబడినది'. కాని వారు ఇరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావమువలన మరియమ్మ గర్భము ధరించినది.
19. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టములేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను.
20. యోసేపు ఇట్లు తలంచు చుండగా, ప్రభువు దూత కలలో కనిపించి, "దావీదు కుమారుడవగు యోసేపూ! నీ భార్యయైన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయన, ఆమె పవిత్రాత్మ ప్రభావమువలన గర్భము ధరించినది.
21. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు 'యేసు' అను పేరు పెట్టుము. ఏలయన ఆయన, తన ప్రజలను వారి పాపములనుండి రక్షించును" అని చెప్పెను.
22-23. "ఇదిగో! కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును. ఆయనను 'ఇమ్మానుయేలు' అని పిలిచెదరు” అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరునట్లు ఇదంతయు సంభవించెను. "ఇమ్మానుయేలు” అనగా “దేవుడు మనతో ఉన్నాడు" అని అర్థము.
24. నిదురనుండి మేలుకొనిన యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను.
1. హేరోదురాజు పరిపాలనాకాలమున యూదయా సీమయందలి బేత్తెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పుదిక్కు నుండి యెరూషలేము నకు వచ్చి,
2. “యూదుల రాజుగా జన్మించిన శిశు వెక్కడ? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి" అని అనిరి.
3. ఇది విని హేరోదు రాజును, యెరూషలేము నగరవాసులందరును కలతచెందిరి.
4. అంతట రాజు ప్రజల ప్రధానార్చకులను, ధర్మశాస్త్ర బోధకులను సమావేశ పరచి "క్రీస్తు ఎచట జన్మించును?” అని ప్రశ్నించెను.
5. “యూదయ సీమయందలి బేత్లహేమునందు" అనివారు సమాధానమిచ్చిరి.
6. "యూదయ సీమయందలి బేత్లహేమా! నీవు యూదయా పాలకులలో ఎంత మాత్రమును అల్పమైనదానవు కావు. ఏలయన నా యిస్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలోనుండి వచ్చును" అని ప్రవక్త వ్రాసియుండెను.
7. అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి, నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలిసికొనెను.
8. పిమ్మట అతడు వారిని బేత్లహేమునకు పంపుచు, "మీరు వెళ్ళి, జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియ జేయుడు. నేనును వెళ్ళి అతనిని ఆరాధింతును" అనెను.
9. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరి. అదిగో! తూర్పుదిక్కున వారి ముందు నడిచిన నక్షత్రము మరల కనిపించి వారికి మార్గ దర్శినియై, ఆ శిశువు ఉన్న స్థలము పైకి వచ్చి నిలిచెను.
10. వారు నక్షత్రమును చూచినప్పుడెంతో ఆనందించిరి.
11. అంతట వారు ఆ గృహమున ప్రవేశించి, తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి, సాష్టాంగపడి ఆరాదించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువు నకు బంగారము, సాంబ్రాణి, పరిమళద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి.
12. హేరోదు చెంతకు మరలిపోరాదని స్వప్న మున దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి.
13. వారు వెళ్ళినపిదప ప్రభువుదూత యోసేపునకు కలలో కనిపించి, “శిశువును చంపుటకు హేరోదు వెదకబోవుచున్నాడు. కావున నీవు లేచి, బిడ్డను తల్లిని తీసికొని, ఐగుప్తునకు పారిపోయి, నేను చెప్పువరకు అచటనే యుండుము" అని ఆదేశించెను.
14. అంతట యోసేపులేచి, ఆ బిడ్డను, తల్లిని తీసికొని, ఆ రాత్రి యందు ఐగుప్తునకు వెళ్ళి,
15. హేరోదు మరణించు నంతవరకు అచటనే ఉండెను. "ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని" అని ప్రవక్త ద్వారాప్రభువు పలికిన ప్రవచనము నెరవేరుటకు అట్లు జరిగెను.
16. ఆ జ్ఞానులు తనను మోసగించిరని హేరోదు భావించి మండిపడెను. కనుక జ్ఞానులు తెలిపిన కాలమునుబట్టి బేత్లహేమునందును, ఆ పరిసరములందును ఉన్న రెండేండ్లును, అంతకంటే తక్కువ ప్రాయముగల మగశిశువులనందరిని చంపుడని అతడు ఆజ్ఞాపించెను.
17-18. “రామాయందు ఒక ఆర్తనాదము వినపడెను. అది ఒక మహారోదనము. రాహేలు తన బిడ్డలకొరకై విలపించుచుండెను. వారి మరణమువలన కలిగిన దుఃఖమునుండి ఆమె ఓదార్పు పొందకుండెను" - అని యిర్మీయా ప్రవక్త పలికినవాక్కు నెరవేరెను.
19. హేరోదు రాజు మరణానంతరము ఐగుప్తు నందున్న యోసేపునకు ప్రభువుదూత కలలో కనిపించి,
20. 'లెమ్ము, బిడ్డను, తల్లిని తీసికొని యిస్రాయేలు దేశమునకు తిరిగిపొమ్ము. ఏలయన, బిడ్డను చంప వెదకిన వారు మరణించిరి" అని తెలిపెను.
21. యోసేపు లేచి, ఆ బిడ్డను తల్లిని తీసికొని యిస్రాయేలు దేశమునకు తిరిగిపోయెను.
22. హేరోదు స్థానమున అతని కుమారుడు అర్కెలాసు యూదయా దేశాధిపతి అయ్యెనని విని అచటికి వెళ్ళుటకు యోసేపు భయపడెను. కలలో హెచ్చరింపబడిన ప్రకారము, యోసేపు గలిలీయ సీమకుపోయి,
23. నజరేతు నగరమున నివాస మేర్పరచుకొనెను. “అతడు నజరేయుడు అనబడును" అను ప్రవక్తల ప్రవచనము నెరవేరునట్లు ఇది జరిగెను.
1. ఆ రోజులలో స్నాపకుడగు యోహాను యూదయా దేశపు ఎడారిలో బోధించుచు,
2. “పరలోకరాజ్యము సమీపించినది, మీరు హృదయపరివర్తనము చెందుడు" అని పలికెను.
3. " 'ప్రభు మార్గమును సిద్ధము చేయుడు, ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు' అని ఎడారిలో ఒక వ్యక్తి ఎలుగెత్తి పలుకుచుండెను” అని ఈ యోహానును గూర్చియే యెషయా ప్రవక్త పలికెను.
4. అతడు ఒంటె రోమముల కంబళి ధరించి, నడుమునకు తోలుపట్టెను కట్టి, మిడుతలను భుజించుచు, పుట్టతేనెను త్రాగుచు జీవించుచుండెను.
5. యెరూషలేము నుండియు, యూదయా అంతట నుండియు, యోర్దాను నదీ పరిసర ప్రదేశముల నుండియు ప్రజలు అతనిని దర్శింపవచ్చిరి.
6. వారు తమతమ పాపములను ఒప్పుకొనుచు యోహానుచే యోర్దాను నదిలో బప్తిస్మము పొందుచుండిరి.
7. తన వద్ద బప్తిస్మము పొందుటకు పరిసయ్యులు,సదూకయ్యులు అనేకులు వచ్చుట చూచి యోహాను వారితో “ఓ సర్పసంతానమా! రానున్న కోపాగ్నినుండి పారిపొమ్మని మిమ్ము హెచ్చరించినదెవరు?
8. మీరిక హృదయపరివర్తనమునకు తగిన పనులుచేయుడు.
9. 'అబ్రహాము మా తండ్రి' అని మీరు గర్వింపకుడు. దేవుడు ఈ రాళ్ళనుండి సైతము అబ్రహామునకు సంతానమును కలుగజేయగలడు.
10. వృక్షములను వేళ్ళతోసహా నరికివేయుటకు గొడ్డలి సిద్ధముగా నున్నది. కనుక మంచి పండ్లనీయని ప్రతి వృక్షము నరకబడి అగ్నిలో పారవేయబడును.
11. హృదయ పరివర్తన నిమిత్తము నేను మీకు నీటితో స్నానము చేయించుచున్నాను. కాని, నా తరువాత రానున్నవాడు మీకు పవిత్రాత్మతోను, అగ్నితోను స్నానము చేయించును. ఆయన నా కంటె శక్తిమంతుడు. నేను ఆయన పాదరక్షలు మోయుటకైనను యోగ్యుడను కాను.
12. తూర్పారబట్టుటకు ఆయన చేతియందు చేట సిద్ధముగానున్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పారబట్టి గింజలను గిడ్డంగులయందు భద్రపరచి, పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును” అనెను.
13. అపుడు యేసు గలిలీయసీమనుండి యోర్దాను తీరముననున్న యోహాను వద్ద బప్తిస్మము పొందుటకై వచ్చెను.
14. యోహాను యేసును వారించుచు, "నేనే నీచేత బప్తిస్మము పొందవలసినవాడను. అట్టి నా యొద్దకు నీవు వచ్చుటయా?” అనెను.
15. అందుకు యేసు “ఇపుడిట్లే జరుగనిమ్ము. దేవుని సంకల్పమును అంతటిని మనము ఈ రీతిగా నెరవేర్చుట సమంజ సము” అని సమాధానమీయగా యోహాను అంగీకరించెను.
16. యేసు బప్తిస్మముపొంది నీటినుండి వెంటనే వెలుపలకు వచ్చెను. అప్పుడు అదిగో! ఆకాశము తెరువ బడగా దేవుని ఆత్మపావురము రూపమున దిగివచ్చి తనపై నిలుచుటను చూచెను.
17. అప్పుడు ఆకాశమునుండి ఒక దివ్యవాణి “ఈయన నాప్రియమైన కుమారుడు. ఈయనను గూర్చి నేను అధికముగా ఆనందించుచున్నాను” అని వినిపించెను.
1. అంతట యేసు సైతానుచే శోధింపబడుటకై ఆత్మవలన ఎడారికి కొనిపోబడెను.
2. నలువది రేయింబవళ్ళు ఉపవాసములతో గడిపిన పిదప, ఆయన ఆకలిగొనెను.
3. అంతట సైతాను ఆయన వద్దకువచ్చి “నీవు దేవునికుమారుడవైనచో ఈ రాళ్ళను రొట్టెలుగా మారునట్లు ఆనతినిమ్ము" అని అనెను.
4. “మానవుడు కేవలము రొట్టెవలననే జీవింపడు కాని దేవుని నోటినుండి వచ్చు ప్రతి మాటవలన జీవించును' అని వ్రాయబడియున్నది” అని యేసు ప్రత్యుతర మిచ్చెను.
5. పిమ్మట సైతాను ఆయనను పరిశుద్ధ నగరములోని దేవాలయ శిఖరమున నిలిపి,
6. “నీవు దేవుని కుమారుడవైనచో క్రిందికి దుముకుము. ఏలయన.. ఇట్లు వ్రాయబడియున్నది: 'నిన్ను గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును. నీ పాదమైనను రాతికి తగలకుండ నిన్ను వారు తమచేతులతో ఎత్తిపట్టుకొందురు” అని పలికెను.
7. అందుకు యేసు " 'ప్రభువైన నీ దేవుని నీవు శోధింపరాదు' అని లేఖనమున వ్రాయబడియున్నదిగదా!" అని పలికెను.
8. తిరిగి సైతాను యేసును మిక్కిలి ఎత్తయిన పర్వతశిఖరమునచేర్చి, భువియందలి రాజ్య ములనన్నిటిని, వాటి వైభవమును చూపి,
9. “నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించినయెడల నీకు ఈ సమస్తమును ఇచ్చెదను” అనెను.
10. "సైతాను! పొమ్ము ! 'ప్రభువైన నీ దేవుని ఆరాధింపుము ఆయనను మాత్రమే నీవు సేవింపుము' అని వ్రాయబడియున్నది” అని యేసు పలికెను.
11. అంతట సైతానువెడలి పోగా, దేవదూతలు వచ్చి యేసుకు పరిచర్యలు చేసిరి.
12. యోహాను చెరసాలలో బంధింపబడెనని విని, యేసు గలిలీయ సీమకు వెళ్ళెను.
13. ఆయన నజరేతును వీడి సెబూలూను, నష్టాలి సీమలలోని సరస్సు తీరముననున్న కఫర్నామునకు వచ్చి నివాస మేర్పరచుకొనెను.
14-16. "సెబూలూను, నఫాలి ప్రాంతములు, గలిలీయ సరస్సు తీరము, యోర్దాను నదికి ఆవలిదిక్కున అన్యులు నివసించు గలిలీయ సీమయందు అంధకారమున నివసించు ప్రజలు గొప్పవెలుగును చూచిరి, మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను” అను యెషయా ప్రవక్త ప్రవచనము నెరవేరునట్లు ఇది జరిగెను.
17. "హృదయపరివర్తనము చెందుడు. పరలోక రాజ్యము సమీపించియున్నది” అని యేసు అప్పటి నుండి జనులకు బోధింపనారంభించెను.
18. గలిలీయ సరస్సు తీరమున యేసు నడచుచు, వలవేసి చేపలనుపట్టు పేతురు అను పేరుగల సీమోనును, అతని సోదరుడగు అంద్రెయను చూచెను. వారు జాలరులు.
19. “మీరు నన్ను అనుసరింపుడు. మిమ్ము మనుష్యులను పట్టువారినిగా చేసెదను” అని యేసు వారితో పలికెను.
20. వెంటనే వారు తమ వలలను అచట విడిచి పెట్టి ఆయనను వెంబడించిరి.
21. అచటనుండి పోవుచు యేసు జెబదాయి కుమారులైన యాకోబు, యోహాను అను మరి ఇద్దరు సోదరులను చూచెను. వారు, తమ తండ్రితోపాటు పడవలో తమ వలలను చక్కబెట్టుకొనుచుండిరి. యేసు వారిని పిలువగా,
22. వెంటనే వారు పడవను, తమ తండ్రిని వదలిపెట్టి ఆయనను వెంబడించిరి.
23. యేసు గలిలీయ ప్రాంతమంతట పర్యటించుచు, వారి ప్రార్థనా మందిరములలో బోధించుచు, పరలోకరాజ్యపు సువార్తను గూర్చి ప్రసంగించుచు, ప్రజల వ్యాధి బాధలనెల్ల పోగొట్టుచుండెను.
24. ఆయన కీర్తి సిరియా దేశమంతటను వ్యాపించెను. అనేక విధములగు వ్యాధులతోను, వేదనలతోను పిడింపబడువారిని, పిశాచగ్రస్తులను, మూర్ఛ రోగులను, పక్షవాత రోగులను ప్రజలు ఆయన వద్దకు తీసికొనిరాగా, వారిని ఆయన స్వస్థపరచెను.
25. గలిలీయ, దెకపొలి, యెరూషలేము, యూదయా ప్రాంతములనుండి యోర్డాను నది ఆవలి దిక్కు నుండి ప్రజలు తండోపతండములుగా యేసును వెంబడించిరి.
1. యేసు ఆ జనసమూహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టుచేరిరి.
2. ఆయన నోరువిప్పి ఉపదేశింప ఆరంభించెను:
3. "దీనాత్ములు ధన్యులు దైవరాజ్య ము వారిది.
4. శోకార్తులు ధన్యులు వారు ఓదార్పబడుదురు.
5. వినమ్రులు ధన్యులు వారు భూమికి వారసులగుదురు.
6. నీతి నిమిత్తము ఆకలిదప్పులు గలవారు ధన్యులు వారు సంతృప్తి పరుపబడుదురు.
7. దయామయులు ధన్యులు వారు దయను పొందుదురు.
8. నిర్మలహృదయులు ధన్యులు వారు దేవుని దర్శింతురు.
9. శాంతి స్థాపకులు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు.
10. ధర్మార్ధము హింసితులు ధన్యులు దైవరాజ్యము వారిది.
11. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినపుడు, హింసించినపుడు, నిందారోపణ గావించినపుడు మీరు ధన్యులు.
12. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బహుమానము గలదు. కావున మీరు ఆనందపడుడు, మహానందపడుడు.
13. "మీరు భూమికి ఉప్పువలెనున్నారు. ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయినయెడల దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే తొక్కబడుటకేగాని, మరెందుకును పనికిరాదు.
14. మీరు లోకమునకు వెలుగైయున్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగైయుండజాలదు.
15. ఇంటనున్న వారికి అందరికి వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభము పైననే ఉంచెదరు గాని కుంచము క్రింద ఉంచరుగదా!
16. ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారియెదుట ప్రకాశింపనిండు.”
17. "నేను ధర్మశాస్త్రమును, ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చితినని తలంపవలదు. నేను వచ్చినది వానిని సంపూర్ణమొనర్చుటకే గాని, రద్దు చేయుటకుకాదు.
18. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములోని ఒక అల్పాక్షరమైనను, ఒక పొల్లు అయినను వ్యర్థముగాక అంతయు నెరవేరునని నొక్కి వక్కాణించుచున్నాను.
19. కాబట్టి ఎవరైన ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరచి, అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోకరాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును. ఎవడు ఈ ధర్మశాస్త్రమును ఆచరించి, అట్లు జనులకు బోధించునో అట్టివాడు వరలోక రాజ్యమున అత్యధికునిగా పరిగణించబడును.
20. ధర్మశాస్త్ర బోధకులకంటె, పరిసయ్యులకంటె మీరు నీతిమంతమైన జీవితము జీవించిననేతప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను.
21. “నరహత్య చేయరాదు. నరహత్య కావించు వాడు తీర్పునకు గురియగునని పూర్వులకు శాసింపబడిన మాట మీరు వినియున్నారుగదా!
22. నేను ఇప్పుడు మీతో చెప్పునదేమనగా: తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. అదే విధముగా తన సోదరుని 'వ్యర్ధుడా!' అని అవమానపరచినవాడు న్యాయసభ ముందుకు తేబడును. తన సోదరుని 'మూర్ఖుడా' అని అనువాడు నరకాగ్నిలో మ్రగ్గును.
23. కనుక, బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినపుడు నీ సోదరునికి నీపై మనస్పర్థయున్నట్లు నీకు స్పురించినచో,
24. ఆ కానుకను పీఠము చెంతనే వదలిపెట్టి, పోయి, మొదట నీ సోదరునితో సఖ్యపడి, తిరిగివచ్చి నీ కానుకను చెల్లింపుము.
25. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగనే అతనితో సత్వరము సమాధానపడుము. లేనిచో నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును. న్యాయాధిపతి నిన్ను పరిచారకునికి అప్పగించును. అంతట నీవు చెరసాలలో వేయబడుదువు.
26. నీవు చెల్లింపవలసిన ఋణములో కడపటి కాసు చెల్లించువరకు నీవు చెరసాలలోనే ఉందువు అని నొక్కి వక్కాణించు చున్నాను.
27. " 'వ్యభిచరింపరాదు' అను శాసనమును మీరు వినియున్నారుగదా!
28. నేను నొక్కి వక్కాణించు నదేమనగా, కామేచ్చతో స్త్రీని చూచు ప్రతివాడును ఆ క్షణముననే తన హృదయములో ఆమెతో వ్యభిచరించి యున్నాడు.
29. కనుక, నీ కుడికన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయుము. నీ దేహమంతయు నరకములో త్రోయబడుటకంటె నీ అవయవములలో ఒకదానిని కోల్పోవుట మేలు.
1. “పరులను గూర్చి మీరు తీర్పుచేయకుడు. అప్పుడు మిమ్ము గూర్చి అట్లే తీర్పుచేయబడదు.
2. ఎందుకనగా మీరు పరులను గూర్చి తీర్పుచేసినట్లే మీకును తీర్పు చెప్పబడును. మీరు ఏ కొలతతో కొలిచెదరో, ఆ కొలతతోనే మీకును కొలువబడును.
3. నీ కంటిలోని దూలమును గమనింపక, నీ సహోదరుని కంటిలోని నలుసును వేలెత్తి చూపెదవేల?
4. 'నీ కంటిలోని నలుసును తీసివేయనిమ్ము' అని, సోదరుని నీవెట్లు అడుగగలవు? నీ కంటిలో దూలమున్నదిగదా!
5. కపట భక్తుడా! ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసికొనుము. అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టము గానుండును.
6. పవిత్రమైన దానిని కుక్కలపాలు చేయవలదు. వెలగల ముత్యములను పందులకు పారవేయవలదు. అవి కాళ్ళతో తొక్కి నీ పైబడి నిన్ను చీల్చివేయును.
7. “అడుగుడు మీ కొసగబడును; వెదకుడు మీకు దొరకును; తట్టుడు మీకు తెరువబడును.
8. ఏలయన, అడిగిన ప్రతివానికి లభించును. వెదకిన ప్రతివానికి దొరకును. తట్టిన ప్రతివానికి తెరువబడును.
9. కుమారుడు రొట్టెనడిగిన, మీలో ఎవడైన వానికి రాయి నిచ్చునా?
10. చేపనడిగిన పామునిచ్చునా?
11. మీరెంత చెడ్డవారైనను మీ పిల్లలకు మంచి బహుమానాలు ఇచ్చుట మీకు తెలియునుగదా! పరలోక మందున్న మీ తండ్రి అడిగినవారికి ఇంకెట్టి మంచి వస్తువులనిచ్చునో ఊహింపుడు.
12. ఇతరులు మీకేమి చేయవలెనని మీరు కోరుదురో, దానిని మీరు పరులకు చేయుడు. ఇదియే మోషే ధర్మశాస్త్రము; ప్రవక్తల ప్రబోధము.
13. “ఇరుకైన ద్వారమున ప్రవేశింపుడు. ఏలయనగా విశాలమైన ద్వారము, సులభముగానున్న మార్గము వినాశనమునకు చేర్చును. అనేకులు ఆ మార్గమున పయనింతురు.
14. జీవమునకు పోవు ద్వారము ఇరుకైనది. మార్గము కష్టమైనది. కొలది మందియే ఈ మార్గమును కనుగొందురు.
15. "కపట ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడుడు. వారు లోలోపల క్రూరమైన తోడేళ్ళయియుండి, గొఱ్ఱెలచర్మము కప్పుకొని మీయొద్దకు వచ్చెదరు.
16. వారి క్రియలనుబట్టి మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలనుండి ద్రాక్షపండ్లు, తుప్పలనుండి అత్తిపండ్లు లభించునా?
17. మంచి చెట్టు మంచి పండ్లను, చెడు చెట్టు చెడు పండ్లను ఇచ్చును.
18. మంచి చెట్టు చెడుపండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఈయలేదు.
19. మంచి పండ్లనీయని ప్రతి చెట్టును నరికి మంటలో పడవేయుదురు.
20. కావున వారి ఫలములవలన వారిని మీరు తెలిసికొనగలరు.”
21. "ప్రభూ! ప్రభూ! అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడు! కాని, పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోకరాజ్యమున ప్రవేశించును.
22. కడపటి రోజున అనేకులు 'ప్రభూ! ప్రభూ! నీ నామమున గదా మేము ప్రవచించినది, పిశాచ ములను పారద్రోలినది, అద్భుతములు అనేకములు చేసినది' అని నాతో చెప్పుదురు.
23. అపుడు వారితో నేను 'దుష్టులారా! నానుండి తొలగిపొండు. మిమ్ము ఎరుగనే ఎరుగను' అని నిరాకరింతును,
24. “నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతిపునాదిపై తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియున్నాడు.
25. జడివానలు కురిసి, వరదలు వెల్లువలై పారి, పెనుగాలులు వీచి నను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడుటచే కూలి పోలేదు.
26. నా బోధనలను ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియున్నాడు.
27. జడివానలు కురిసి, వరదలు వెల్లువలైపారి, పెనుగాలులు వీచినపుడు ఆ యిల్లు కూలి నేలమట్టమయ్యెను. దాని పతనము చాల ఘోరమైనది.”
28. అంతట యేసు తన బోధనలు ముగింపగా, ఆ జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి.
29. ఏలయన, వారి ధర్మశాస్త్ర బోధకులవలె గాక అధికారము కలవానివలె యేసు బోధించెను.
1. బోధను ముగించి పర్వతముపైనుండి దిగి వచ్చిన యేసును గుంపులు గుంపులుగా జనులు వెంబడించిరి.
2. ఆ సమయమున కుష్ఠరోగియొకడు వచ్చి, ప్రభువుముందు మోకరించి “ప్రభూ! నీకు ఇష్టమైనచో నన్ను శుద్దుని చేయగలవు" అని పలికెను.
3. అంతట యేసు తన చేయిచాపి, అతనిని తాకి “నాకిష్టమే. నీకు శుద్ధికలుగునుగాక”! అని పలికెను. వెంటనే వాని కుష్ఠముపోయి వాడు శుద్దుడాయెను.
4. యేసు అతనితో “ఈ విషయమును ఎవరితోను చెప్పవలదు. నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము. నీ స్వస్థతను వారికి నిరూపించుటకై మోషే ఆజ్ఞానుసారము కానుకను సమర్పింపుము" అని పలికెను.
5. యేసు కఫర్నాములో ప్రవేశించుచుండగా, శతాధిపతి యొకడు ఆయనను సమీపించి,
6. "ప్రభూ! నా ఇంట సేవకుడొకడు పక్షవాతముతో విపరీతమైన బాధపడుచు మంచము పట్టియున్నాడు” అని తెలుపగా,
7. “నేను వచ్చి వానిని స్వస్థపరతును” అని యేసు ఆ శతాధిపతితో పలికెను.
8. ఆ శతాధిపతి ఆయనతో “ప్రభూ! నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడనుకాను. నీవు ఒక్కమాట పలికిన చాలును. నా సేవకుడు స్వస్తత పొందును.
9. నేను అధికారము గలవాడను. నా అధీనమందున్న ఏ సైనికుడినైనా నేను 'రమ్ము' అనిన వచ్చును; 'పొమ్ము' అనిన పోవును నా సేవకుడు నేను చేయుము' అనిన దానిని చేయును అని సవినయముగా పలికెను.
10. అది విని యేసు ఆశ్చర్యపడి, తన వెంటవచ్చుచున్న వారితో "యిస్రా యేలు ప్రజలలో సైతము నేను ఇట్టి విశ్వాసమును చూడలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నాను.
11. తూర్పు పడమరలనుండి అనేకులు వచ్చి పరలోక రాజ్యమందున్న అబ్రహాము, ఈసాకు, యాకోబుల పంక్తిలో కూర్చుందురు.
12. కాని, రాజ్యమునకు వారసులు' వెలుపల చీకటి గదిలోనికి త్రోయ బడుదురు. అచట వారు విలపించుచు, పండ్లు కొరుకు కొందురు” అని పలికెను.
13. అంతట యేసు ఆ శతాధిపతితో “నీవిక పొమ్ము. నీవు విశ్వసించినట్లు నీకు అగునుగాక!" అని పలికెను. ఆ క్షణముననే శతాధిపతి సేవకుడు స్వసతపొందెను.
14. ఆ తరువాత యేసు పేతురు ఇంటికి వెళ్ళి, అచట జ్వరపీడితయై మంచము పట్టియున్న అతని అత్తను చూచి
15. ఆమె చేతిని తాకినంతనే జ్వరము ఆమెను వీడిపోయెను. అంతట ఆమె లేచి ఆయనకు పరిచర్య చేసెను.
16. ఆ సాయం సమయమున పిశాచ పీడితులగు పలువురిని యేసువద్దకు తీసికొనిరాగా ఒక్కమాటతో ఆయన పిశాచములను పారద్రోలి, రోగులనందరిని స్వస్థపరచెను.
17. “ఆయన మన బలహీనతలను తనపై వేసికొనెను. మన రోగములను తానే భరించెను" అని యెషయా ప్రవక్త పలికిన పలుకులు ఈ రీతిగా నెరవేరెను.
18. యేసు తన చుట్టుప్రక్కలనున్న గొప్ప జనసమూహములను చూచి వారిని ఆవలి ఒడ్డునకు వెళ్ళుడని ఆజ్ఞాపించెను.
19. అపుడు ధర్మశాస్త్ర బోధకుడొకడు యేసును సమీపించి, “బోధకుడా! నీవు ఎక్కడకు వెళ్ళినను నీ వెంట వచ్చుటకు సంసిద్ధుడను” అనగా
20. యేసు, “నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు. మనుష్యకుమారునకు మాత్రము తలవాల్చుటకైనను చోటులేదు” అని ప్రత్యుత్తరమిచ్చెను.
21. మరియొక శిష్యుడాయనతో "ప్రభూ! మొదట నా తండ్రిని సమాధిచేసి వచ్చెదను; అనుమతి దయచేయుడు” అని కోరగా,
22. యేసు “నీవు నన్ను వెంబడింపుము. మృతులను సమాధి చేయు విషయము మృతులనే చూచుకొననిమ్ము" అని పలికెను.
23. అంతట యేసు పడవనెక్కగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి.
24. హఠాత్తుగా గాలి వాన క్రమ్మి, పడవను ముంచెత్తునంతటి అలలు ఆ సముద్రములో చెలరేగెను. ప్రభువు ఆ సమయమున నిదురించుచుండెను.
25. శిష్యులు అపుడు ఆయనను మేలుకొలిపి “ప్రభూ! మేము నశించుచున్నాము. రక్షింపుము" అని ప్రార్థింపగా,
26. యేసు వారితో “ఓ అల్ప విశ్వాసులారా! మీరు భయపడెదరేల?” అని పలికి, లేచి గాలిని సముద్రమును గద్దించెను. వెంటనే ప్రశాంతత చేకూరెను.
27. “గాలి, సముద్రము సయితము ఈయన ఆజ్ఞకు లోబడినవి. ఈయన ఎంతటి మహానుభావుడు!" అని వారు ఆశ్చర్యపడి చెప్పుకొనిరి.
28. ఆవలి తీరమందలి గదరేనీయుల ప్రాంత మునకు యేసు చేరగా, దయ్యములు పట్టిన వారిద్దరు సమాధులలో నుండి వెలుపలికి వచ్చిరి. వారు ఉగ్ర స్వరూపులు. వారున్న ఆ మార్గమున పోవుటకు ఎవరికి ధైర్యము చాలకుండెను.
29. “దేవుని కుమారుడా! మాతో నీకేమి పని? సమయము ఆసన్నము కాక మునుపే మమ్ము శిక్షింపవచ్చితివా?” అని, వారిద్దరు బిగ్గరగా కేకలు వేసిరి.
30. ఆ సమీపముననే ఒక పెద్ద పందులమంద మేత మేయుచుండెను.
31. “మమ్ములను ఇచట నుండి పారద్రోలదలచినయెడల, ఆ పందుల మందలోనికి పోనిమ్ము” అని ఆ దయ్యములు యేసును కోరగా,
32. ఆయన “అట్లే పొండు” అని సెలవిచ్చెను. అంతట అవి వారిని విడిచి పెట్టి పందులలోనికి ప్రవేశించెను. వెంటనే నిట్టనిలువుననున్న ఆ మిట్టనుండి ఆ పందులమంద సముద్రములోపడి మునిగి ఊపిరాడక చచ్చెను.
33. ఆ మంద కాపరులు పట్టణములోనికి పరుగెత్తి, జరిగిన విషయములనెల్ల ప్రజలకు వినిపించిరి. దయ్యములు పట్టిన వారి విషయము కూడా తెలిపిరి.
34. అంతట ఆ పట్టణవాసులెల్లరును వచ్చి, యేసును కలిసి, తమ ప్రాంతమును విడిచిపొమ్మని ఆయనను బ్రతిమాలిరి.
1. అంతట యేసు పడవనెక్కి సరస్సును దాటి తన పట్టణమునకు చేరెను.
2. అపుడు పడకపై పడియున్న పక్షవాత రోగిని ఒకనిని, కొందరు ఆయన యొద్దకు తీసికొనివచ్చిరి. వారి విశ్వాసమును గమనించి, ఆ రోగితో “కుమారా! ధైర్యము వహింపుము. నీ పాపములు పరిహరింపబడినవి" అని యేసు పలికెను.
3. అపుడు ధర్మశాస్త్ర బోధకులు కొందరు, “ఇతడు దైవదూషణము చేయుచున్నాడు” అని తమలో తాము అనుకొనిరి.
4. వారి తలంపులను గ్రహించిన యేసు, “మీకు ఈ దురభిప్రాయములు ఏల కలిగెను?
5. నీ పాపములు మన్నింపబడినవనుటయా? లేక నీవులేచి నడువుమనుటయా? ఈ రెండింటి లోను ఏది సులభతరము?
6. ఈ భూమి మీద మనుష్యకుమారునకు పాపములనుక్షమించు అధికారము కలదని మీకిపుడే తెలియును” అని పలికి, ఆ రోగితో “నీవు ఇక లేచి, నీ పడకను ఎత్తుకొని యింటికి పొమ్ము” అనెను.
7. అతడు వెంటనే లేచి తన యింటికి పోయెను.
8. అది చూచిన జనసమూహములు భయపడి మానవులకు ఇట్టి అధికారమును ఇచ్చిన దేవుని స్తుతించిరి.
9. తరువాత యేసు అటనుండి వెళ్ళుచు, సుంకపు మెట్టుకడ కూర్చున్న 'మత్తయి' అనువానితో “నన్ను అనుసరింపుము” అనెను. అతడు అట్లే లేచి ఆయనను అనుసరించెను.
10. ఆ ఇంటిలో యేసు భోజనమునకు కూర్చుండినపుడు సుంకరులును, పాపులును అనేకులు వచ్చి ఆయనతోను, ఆయన శిష్యులతోను పంక్తియందు కూర్చుండిరి.
11. అది చూచిన పరిసయ్యులు “మీ బోధకుడు ఇట్లు సుంకరులతో, పాపులతో కలిసి భుజించుచున్నాడేమి?" అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి.
12. ఆ మాటలను ఆలకించిన యేసు, “వ్యాధిగ్రస్తులకేగాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు గదా!
13. 'నాకు కారుణ్యము కావలయునుగాని, బలి అవసరము లేదు' అను లేఖనమునందలి అర్థమును మీరు గ్రహింపుడు. నేను పాపులను పిలువవచ్చితిని కాని, నీతిమంతులను పిలుచుటకు రాలేదు” అని పరిసయ్యులకు ప్రత్యుత్తరమిచ్చెను.
14. యోహాను శిష్యులు యేసును సమీపించి, “మేము, పరిసయ్యులు కూడ తరచుగా ఉపవాసము ఉందుము గాని, మీ శిష్యులు ఎన్నడును ఉపవాసము ఉండరేల?” అని ప్రశ్నింపగా,
15. "పెండ్లికుమారుడు ఉన్నంతకాలము పెండ్లికి వచ్చినవారు ఏల శోకింతురు? పెండ్లికుమారుడు వారి వద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును. అపుడు వారు ఉపవాసము చేయుదురు.
16. పాత గుడ్డకు మాసికవేయుటకు క్రొత్తగుడ్డను ఎవడు ఉపయోగించును? అట్లు ఉపయో గించిన క్రొత్తగుడ్డ క్రుంగుటవలన ఆ ప్రాతగుడ్డ మరింత చినిగిపోవును.
17. క్రొత్త ద్రాక్షరసమును ప్రాతతిత్తులలో ఎవరు పోయుదురు? అటుల పోసిన యెడల అవి పిగులును; ఆ ద్రాక్షరసము నేల పాలగును; తిత్తులు నాశనమగును. అందువలన, క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్తతిత్తులలో పోయుదురు. అపుడు ఆ రెండును చెడిపోకుండును” అని యేసు సమాధాన మొసగెను.
18. ఇట్లు మాట్లాడుచున్న యేసు వద్దకు పాలనాధికారి ఒకడు వచ్చి, ఆయన ముందు మోక రించి, “నా కుమార్తె ఇపుడే మరణించినది. కాని, నీవు వచ్చి నీ హస్తమును ఆమెపైనుంచిన ఆమె బ్రతుకును” అని ప్రార్థించెను.
19. అపుడు యేసు లేచి, శిష్య సమేతముగా అతనిని వెంబడించెను.
20. అప్పుడు పండ్రెండేండ్లనుండి యెడతెగక రక్తస్రావమగుచు బాధపడుచున్న ఒక స్త్రీ వెనుకనుండి వచ్చి యేసు అంగీ అంచును తాకెను.
21. ఏలయన, “ఆయన వస్త్రమును తాకినంత మాత్రమున నేను ఆరోగ్యవతిని అగుదును” అని ఆమె తనలో తాను అనుకొనెను.
22. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, “కుమారీ! ధైర్యము వహింపుము. నీ విశ్వాసము నిన్ను స్వస్థ పరచెను” అని పలుకగా ఆమె ఆ క్షణముననే ఆరోగ్యవంతురాలాయెను.
23. పిమ్మట యేసు, ఆ పాలనాధికారి ఇంటికి వెళ్ళెను. అచట పిల్లనగ్రోవిని ఊదెడివారిని, అలజడిగ నున్న జనసమూహమును చూచి,
24. “మీరందరు ఆవలికిపొండు. ఈ బాలిక మరణించలేదు, నిదురించుచున్నది” అని పలికెను. అందులకు వారందరు ఆయనను హేళనచేసిరి.
25. మూగియున్న జన సమూహమును వెలుపలకు పంపి యేసు లోపలకు వెళ్ళి ఆ బాలిక చేతిని పట్టుకొనగా ఆ బాలిక లేచెను.
26. ఆ వార్త ఆ ప్రాంతము అంతట వ్యాపించెను.
27. అంతట యేసు ఆ ప్రాంతమును వీడిపోవు చుండగా, ఇద్దరు గ్రుడ్డివారు. ఆయన వెంటబడి “దావీదు కుమారా! మమ్ము కరుణింపుము" అని మొర పెట్టుకొనిరి.
28. యేసు ఇంట ప్రవేశించినపుడు ఆ గ్రుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. అపుడు యేసు వారిని “నేను ఈ పని చేయగలనని మీరు విశ్వసించు చున్నారా? అని ప్రశ్నింపగా, వారు "అవును ప్రభూ!” అని పలికిరి.
29. అంతట ఆయన వారి నేత్రములను తాకి “మీరు విశ్వసించినట్లు జరుగునుగాక!” అని పలికెను.
30. వెంటనే వారు దృష్టిని పొందిరి. దీనిని ఎవరికిని తెలియనీయవలదని వారిని యేసు ఆజ్ఞాపించెను.
31. కాని, వారు పోయి యేసు కీర్తిని దేశమంతట ప్రచారము గావించిరి.
32. వారు పోవుచుండగా, పిశాచము పట్టి నోటిమాట పడిపోయిన మూగవానిని ఒకనిని, కొందరు యేసువద్దకు కొనివచ్చిరి.
33. దయ్యము వెడలగొట్టబడినంతనే ఆ వ్యక్తి మాటలాడసాగెను. అపుడు అచటి ప్రజలు ఎల్లరు ఆశ్చర్యపడుచు, “యిస్రాయేలు జనులలో ఇట్టిది మేము ఎన్నడును ఎరుగము” అనిరి.
34. కాని పరిసయ్యులు, “పిశాచముల నాయకుని సహాయముతో ఇతడు పిశాచములను వెడలగొట్టుచున్నాడు” అని ఈసడించిరి.
35. యేసు అన్ని పట్టణములను, గ్రామ ములను తిరిగి, ప్రార్థనామందిరములలో బోధించుచు, పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు, జనుల వ్యాధిబాధలనెల్ల పోగొట్టు చుండెను.
36. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు, కాపరిలేని గొఱ్ఱెలవలె చెదరియున్న జనసమూహమును చూచి, ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను.
37. అపుడు యేసు తన శిష్యులతో "పంట మిక్కుటము; కాని కోతగాండ్రు తక్కువ.
38. కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు” అని పలికెను.
1. యేసు తన పన్నిద్దరు శిష్యులను చెంతకు పిలిచి, దుష్ట ఆత్మలను పారద్రోలుటకు, సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు, వారికి అధికారమును ఇచ్చెను.
2. ఆ పన్నిద్దరు అపోస్తలుల పేర్లు ఇవి: అందు మొదటివాడు పేతురు అనబడు సీమోను, తదుపరి అతని సోదరుడగు అంద్రెయ, జెబదాయి కుమారుడగు యాకోబు, అతని సోదరుడగు యోహాను,
3. ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరియగు మత్తయి, అల్పయి కుమారుడగు యాకోబు, తద్దయి,
4. కనానీయుడగు సీమోను, ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియోతు.
5. యేసు ఈ పన్నిద్దరు శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: “అన్య జనులుండు ప్రదేశములలో ఎచ్చటను అడుగు మోపవలదు. సమరీయుల ఏ పట్టణమునను ప్రవేశింపరాదు.
6. కాని, చెదరిపోయిన గొఱ్ఱెలవలెనున్న యిస్రాయేలు ప్రజలయొద్దకు వెళ్ళి,
7. వరలోకరాజ్యము సమీపించినదని ప్రకటింపుడు,
8. వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను ఎల్లగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి. ఉచితముగానే ఒసగుడు.
9. మీతో బంగారమును గాని, వెండిని గాని, రాగిని గాని కొనిపోవలదు.
10. ప్రయాణమునకై జోలెనుగాని, రెండు అంగీలనుగాని, పాదరక్షములనుగాని, చేతికర్రను గాని తీసికొని పోవలదు. ఏలయన, పనివాడు తన బత్తెమునకు అర్హుడు.
11. ఏ పట్టణమునుగాని, ఏ పల్లెనుగాని మీరు ప్రవేశించినపుడు అందు యోగ్యుడగు వానిని వెదకి కొనుడు. అచటినుండి వెడలిపోవు వరకు వాని ఇంటనే ఉండుడు.
12. మీరొక యింటిలోనికి ప్రవేశించి నపుడు, ఆ యింటిని దీవింపుడు,
13. ఆ ఇల్లు యోగ్య మైనదైతే మీ శాంతి దాని మీదికి వచ్చును. లేనిచో మీ శాంతి మిమ్ము తిరిగిచేరును.
14. ఎవడైనను మిమ్ము ఆహ్వానింపక, మీ ఉపదేశములను ఆలకింపక పోయినచో, ఆ ఇంటినిగాని, పట్టణమునుగాని విడిచి పొండు. మీ పాదధూళిని సైతము అచటనే విదిలించి పొండు.
15. తీర్పు దినమున ఆ పురవాసుల గతికన్న సొదొమ గొమొర్రా ప్రజల గతియే మెరుగుగా నుండును అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
16. ఇదిగో! తోడేళ్ళ మధ్యకు గొఱ్ఱెలను పంపినట్లు మిమ్ము పంపుచున్నాను. కనుక సర్పముల వలె యుక్తులై, పావురములవలె నిష్కపటులై మెలగుడు.
17. మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడు. వారు మిమ్ము న్యాయస్థానములకు అప్పగించి, ప్రార్థనా మందిరములలో కొరడాలతో కొట్టించెదరు. వారిని మెలకువతో గమనించి ఉండుడు.
18. మీరు రాష్ట్ర పాలకుల చెంతకును, రాజుల చెంతకును కొనిపోబడి నా నిమిత్తము అచట వారి ఎదుటను, అన్యుల ఎదుటను సాక్ష్యమొసగుదురు.
19. మీరు న్యాయ స్థానములకు అప్పగింపబడినపుడు ఎట్లు మాట్లాడ వలయునో, ఏమి చెప్పవలయునో, అని కలతచెంద కుడు. సమయోచితముగా చెప్పవలసినదెల్ల మీకు అపుడు అనుగ్రహింపబడును.
20. మీరు మాట్లాడు మాటలు మీవి కావు; మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడును.
21. సోదరుడు తన సోదరుని, తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగింతురు. బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపించెదరు.
22. నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరు ద్వేషింతురు; కాని, చివరివరకు సహించి నిలిచినవాడే రక్షింపబడును.
23. మిమ్ము ఒక పట్టణమున హింసించినపుడెల్ల వేరొక పట్టణమునకు పారిపోవుడు. మనుష్యకుమారుడు వచ్చునప్పటికి యిస్రాయేలు పట్టణములన్నిటిని మీరు చుట్టి రాజాలరు అని మీతో చెప్పుచున్నాను.
24. శిష్యుడు గురువు కంటెను అధికుడు కాడు. సేవకుడు యజమానుని కంటెను అధికుడు కాడు.
25. గురువువలె శిష్యుడు, యజమానునివలె సేవకుడు అయిన చాలును, ఇంటి యజమానుడు 'బెల్జబూలు' అని పిలువబడిన యెడల, అతని ఇంటి వారు ఇంకెంత హీనముగా పిలువబడుదురోకదా!”
26. “కాబట్టి మనుష్యులకు భయపడకుడు. దాచబడినది ఏదియు బయలుపడకపోదు. రహస్యమైనదేదియు బట్టబయలు కాకపోదు.
27. చీకటిలో నేను మీకు బోధించు ఈ విషయములనెల్ల మీరు వెలుతురులో బోధింపుడు. చెవిలో మీకు చెప్పబడిన దానిని ఇంటి మీదినుండి ప్రకటింపుడు.
28. శరీరమును మాత్రము నాశనము చేయగలిగి, ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడరాదు. ఆత్మను, శరీరమును కూడ నరక కూపమున నాశనము చేయ గలవానికి ఎక్కువగా భయపడుడు.
29. ఒక కాసుతో మీరు రెండు పిచ్చుకలను కొనగలుగుదురు; కాని, మీ తండ్రి సంకల్పములేనిదే వానిలో ఏ ఒక్కటియు నేలకు ఒరగదు.
30. ఇక మీ విషయమున మీ తల వెంట్రుకలన్నియు లెక్కింపబడియేయున్నవి.
31. కావున భయపడకుడు. మీరు అనేక పిచ్చుకలకంటె అతి విలువైనవారు.
32. "కనుక ప్రజలయెదుట నన్ను అంగీకరించు ప్రతివానిని, పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును అంగీకరింతును.
33. అటులగాక, ప్రజల యెదుట నన్ను తిరస్కరించు ప్రతివానిని పరలోక మందున్న నా తండ్రి సమక్షమున నేనును తిరస్కరింతును.
34. “ప్రపంచమున శాంతిని నెలకొల్పుటకు నేను వచ్చినట్లు భావింపవలదు. ఖడ్గమునే కాని, శాంతిని నెలకొల్పుటకు నేను రాలేదు.
35. నా రాక, తండ్రిని కుమారుడు, తల్లిని కుమార్తె, అత్తను కోడలు ప్రతిఘటించునట్లు చేయును.
36. తన కుటుంబము వారే తనకు శత్రువులు అగుదురు.
37. తన తండ్రిని గాని, తల్లిని గాని నా కంటె మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడుకాడు. తన కుమారునిగాని, కుమార్తెను గాని నా కంటె మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడుకాడు.
38. తన, సిలువనెత్తుకొని నన్ను అనుసరింపనివాడు నాకు యోగ్యుడుకాడు.
39. తన ప్రాణమును దక్కించుకొన యత్నించువాడు దానిని కోల్పోవును; నా కొరకు తన ప్రాణమును కోల్పోవువాడు దానిని దక్కించుకొనును.
40. “మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు.
41. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు, ప్రవక్త బహుమానమును పొందును. నీతిమంతుని నీతిమంతుడుగా గుర్తించి స్వీకరించు వాడు, నీతిమంతుని బహుమానమును పొందును.
42. నా శిష్యుడని ఈ చిన్నవారలలో ఒకనికి ఎవడేని ఒక గ్రుక్కెడు మంచి నీరొసగువాడు తన బహుమానమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”
1. యేసు పండ్రెండుమంది శిష్యులకు తన ఆదేశములను ఒసగిన పిదప, ఆయా పట్టణములలో బోధించుటకును, ప్రసంగించుటకును బయలుదేరెను.
2. చెరసాలలోనున్న యోహాను, క్రీస్తు కార్యకలాపములను గూర్చి విని, శిష్యులను ఇద్దరిని ఆయన వద్దకు పంపెను.
3. "రాబోవు వాడవు నీవా! లేక మేము మరియొకని కొరకు ఎదురు చూడవలెనా?" అని యోహాను ఆజ్ఞ ప్రకారము వారు ప్రశ్నించిరి.
4. వారితో యేసు, “పోయి, మీరు వినుచున్న దానిని, చూచుచున్న దానిని యోహానుకు తెలుపుడు.
5. గ్రుడ్డివారు దృష్టిని పొందుచున్నారు. కుంటివారు నడుచు చున్నారు. కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు. చెవిటి వారు వినుచున్నారు. మృతులు పునరుత్థానులగు చున్నారు. పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది.
6. నన్ను ఆటంకముగా భావింపనివాడు ధన్యుడు” అని ప్రత్యుత్తరమిచ్చెను.
7. ఆ శిష్యులు తిరిగిపోయిన పిదప యేసు యోహానును గూర్చి జనసమూహముతో, “మీరు ఏమి చూడవలెనని ఎడారికి పోయితిరి? గాలికి కదలాడు రెల్లునా?
8. మరేమి చూడబోయితిరి? మృదు వస్త్రములు ధరించిన మనుష్యుడినా? మృదువస్త్రములను ధరించు వారు రాజభవనములలో నుందురుగదా!
9. మరి ఎందులకుపోయితిరి? ప్రవక్తను చూచుటకా? అవును, ప్రవక్తకంటే గొప్పవాడిని” అని నేను మీతో నుడువు చున్నాను.
10. ఇతనిని గురించి: 'ఇదిగో! నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను. అతడు నీ మార్గమును సిద్ధపరచును' అని వ్రాయబడినది.
11."మానవులందరిలో స్నాపకుడగు యోహాను కంటె అధికుడగువాడు ఎవ్వడు పుట్టలేదని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యమున అత్యల్పుడు అతని కంటె గొప్పవాడు.
12. స్నాపకుడగు యోహాను కాలమునుండి నేటివరకును పరలోకరాజ్యము హింసకు గురియగుచున్నది. మరియు దుష్టులు దౌర్జన్యముతో కబళింప యత్నించుచున్నారు.
13. యోహాను కాలమువరకు ప్రవక్తలందరు దీనినే ప్రవచించిరి. ధర్మశాస్త్రము దీనినే బోధించెను.
14. వీనిని అంగీకరింప మీకు సమ్మతమైనచో, రాబోవు ఏలియా ఇతడే.
15. వీనులున్నవాడు వినునుగాక!
16. ఈ తరము వారిని ఎవ్వరితో పోల్చెదను? వారు అంగడి వీధులలో కూర్చుండియున్న పసిపిల్లల వలె ఉన్నారు.
17. వారు ఒకరినొకరు పిలుచుకొనుచు 'మేము మీ కొరకు వాయిద్యములు మ్రోగించితిమి; కాని మీరు నాట్యమాడరైతిరి. విలపించితిమి; కాని మీ రొమ్ములను బాదుకొనరైతిరి' అనుచుందురు.
18. యోహాను అన్నపానీయములు పుచ్చుకొనకపోవుటచే, అతనికి దయ్యము పట్టినదని వారు పలుకుచున్నారు.
19. మనుష్యకుమారుడు అన్నపానీయములు పుచ్చు కొనుటచే 'అతడు భోజనప్రియుడు, మద్యపానరతుడు, సుంకరులకు, పాపాత్ములకు మిత్రుడు' అని అనుచున్నారు. దైవజ్ఞానము దాని క్రియలనుబట్టి నిరూపింపబడును."
20. అపుడు యేసు తాను అనేక అద్భుతములను గావించిన పట్టణములను ఖండింపనారంభించెను. ఏలయన, ఆ పట్టణవాసులలో పరివర్తన కలుగలేదు.
21. "అయ్యో! ఓ కొరాజీను పురమా! అయ్యో! బెత్సయిదా పురమా! మీయందు చేయబడిన అద్భుత కార్యములు తూరు, సీదోను పట్టణములలో జరిగియుండినచో, ఆ పురజనులెపుడో గోనెపట్టలు కప్పుకొని, బూడిద పూసికొని హృదయ పరివర్తనమును పొందియుండెడివారే!
22. కాని నేను మీతో చెప్పునదేమనగా, తీర్పుదినమున మీ స్థితికంటె తూరు, సీవోను వాసుల స్థితియే మేలైనదిగానుండును.
23. ఓ కఫర్నాము పురమా! నీవు ఆకాశమునకు ఎత్తబడవలెనని ఆశింప లేదా? నీవు పాతాళమునకు పడద్రోయబడెదవు. నీయందు చేయబడిన అద్భుత కార్యములు సొదొమ పురమందు చేయబడియున్నచో, అది నేటి వరకును నిలచియుండెడిది.
24. కాని నేను నీతో చెప్పున దేమనగా, తీర్పు దినమున నీ స్థితి కంటె, సొదొమ వాసుల స్థితియే మేలైనదిగా ఉండును.”
25. ఆ సమయమున యేసు ఇట్లనెను: “పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రీ! విజ్ఞులకు, వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి. కనుక నిన్ను స్తుతించుచున్నాను.
26. అవును తండ్రీ! ఇది నీ అభీష్టము.”
27. 'నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి యున్నాడు. తండ్రి తప్ప మరెవ్వరును కుమారుని ఎరుగరు. కుమారుడు తప్ప మరెవ్వరును తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఉద్దేశించునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు.”
28. “భారముచే అలసిసొలసియున్న సమస్త జనులారా! నా యొద్దకు రండు. మీకు విశ్రాంతి నొసగెదను.
29. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధు శీలుడననియు, వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అపుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు.
30. ఏలన, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది.”
1. పిమ్మట యేసు ఒక విశ్రాంతి దినమున పంటపొలముగుండా పోవుచుండ శిష్యులు ఆకలిగొని వెన్నులను త్రుంచి, తినసాగిరి.
2. పరిసయ్యులు అది చూచి, “ఇదిగో! నీ శిష్యులు విశ్రాంతిదినమున నిషేధింపబడిన పనిని చేయుచున్నారు” అని యేసుతో పలికిరి.
3. అందుకు ఆయన వారితో " దావీదును అతని అనుచరులును ఆకలిగొనినపుడు ఏమి చేసినది మీరు చదువలేదా?
4. దేవుని మందిరములో ప్రవేశించి, అర్చకులు తప్ప తానుకాని, తన అనుచరులుకాని తినకూడని అచటనుండు నైవేద్యపు రొట్టెలను అతడును, అతని అనుచరులును తినిరిగదా!
5. దేవాలయములో యాజకులు విశ్రాంతిదినమున, విశ్రాంతినియమమును ఉల్లంఘించియు నిర్దోషులగుచున్నారని ధర్మ శాస్త్రమందు మీరు చదువలేదా?
6. దేవాలయము కంటెను అధికుడగువాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను.
7. 'నేను కనికరమును కోరుచున్నాను, బలిని కాదు.' అను వాక్యమునందలి భావమును మీరు ఎరిగినయెడల నిర్దోషులను మీరిట్లు నిందింపరు.
8. ఏలయన మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకు కూడ అధిపతి” అనెను.
9. తరువాత ఆయన ఆ స్థలమును విడిచి, వారి ప్రార్థనామందిరమున ప్రవేశించెను.
10. అచ్చట ఊచచేయిగలవాడు ఒకడుండెను. కొందరు యేసుపై నేరమును మోపదలచి "విశ్రాంతిదినమున స్వస్థ పరుచుట చట్టబద్ధమైనదా?” అని ఆయనను ప్రశ్నించిరి.
11. అందుకాయన “ఏమీ! మీలో ఎవడైన విశ్రాంతి దినమున తన గొఱ్ఱె గోతిలో పడినచో దానిని పట్టి వెలుపలకు తీయడా?
12. గొఱ్ఱె కంటె మనుష్యుడు ఎంతో విలువగలవాడు కదా! కాబట్టి విశ్రాంతి దినమున మేలుచేయుట తగును” అని సమాధాన మిచ్చెను.
13. పిమ్మట యేసు ఆ ఊచచేయి వానితో “నీ చేయి చాపుము” అనెను. అతడట్లే చాపెను. దానికి స్వస్థత చేకూరి రెండవ చేయివలె నుండెను.
14. పరిసయ్యులంతట వెలుపలికి వెళ్ళి, “ఆయనను ఎటు అంత మొందింతుమా!,” అని కుట్ర చేయసాగిరి.
15. యేసు అది గ్రహించి, అచట నుండి వెడలి పోయెను. అనేకులు ఆయనను వెంబడించిరి. రోగుల నెల్ల ఆయన స్వస్థపరచి,
16. తననుగూర్చి తెలుప వలదని వారిని ఆజ్ఞాపించెను.
17. యెషయా ప్రవచనము ఇట్లు నెరవేరెను. అది ఏమన:
18. " ఇదిగో ఇతడు నా సేవకుడు, నేను ఎన్నుకొన్నవాడు, నాకు ప్రియమైనవాడు. ఇతనిని గూర్చి నేను ఆనందించుచున్నాను. ఇతనిపై నా ఆత్మను నిలిపెదను. ఇతడు జాతులకు నా న్యాయమును ప్రకటించును.
19. వివాదములాడడు, కేకలువేయడు, వీధులలో ఎవరును అతని స్వరమును వినరు.
20. అతడు నలిగిన రెల్లును విరువడు. మకమకలాడుచున్న దీపమునార్పడు. న్యాయమునకు విజయము చేకూర్చునంతవరకు పట్టువిడువడు.
21. జాతులు అతని నామమునందు విశ్వసించును.”
22. అంతట పిశాచగ్రస్తుడగు ఒక గ్రుడ్డి, మూగ వానిని యేసు వద్దకు జనులు తీసికొని వచ్చిరి. యేసు అతనిని స్వస్థపరుపగా మాటలాడుటకు, చూచుటకు, అతడు శక్తిగల వాడాయెను.
23. అచటి ప్రజలెల్ల విస్మయమొందిరి. “ఈయన దావీదు కుమారుడు కాడా?” అని చెప్పుకొనుచుండిరి.
24. పరిసయ్యులు ఆ మాట విని, “ఇతడు దయ్యములకు అధిపతియగు బెల్జబూలు వలననే దయ్యములను వెడలగొట్టు చున్నాడు” అనిరి.
25. యేసు వారి తలంపులను గ్రహించి “అంతఃకలహములతో విభక్తమయిన ఏ రాజ్యమయినను నాశనమగును; ఏ పట్టణమయినను, ఏ కుటుంబమయినను స్థిరముగా నిలువజాలదు.
26. అట్లే సైతానునే సైతాను వెడలగొట్టినచో స్వధర్మ విరుద్ధముగా విభక్తమయినట్లే గదా! అట్లయిన, వాని రాజ్యము ఎట్లు నిలుచును?
27. నేను బెల్జబూలు వలన దయ్యములను వెడలగొట్టినచో, మీ కుమారులు ఎవరి సాయముతో వానిని వెడలగొట్టుచున్నారు? కావున ఇందు వారే మీకు న్యాయకర్తలు.
28. నేను దేవుని ఆత్మవలన దయ్యములను వెడలగొట్టుచున్న యెడల దేవునిరాజ్యము మీయొద్దకు వచ్చియున్నది అని గ్రహింపుడు.
29. ఎవడేని, బలవంతుని మొదట బంధించిననే తప్ప, వాడు ఆ బలశాలి ఇంటిలో ప్రవేశించి సామగ్రిని దోచుకొనజాలడు. నిర్బంధించిన పిమ్మట గదా కొల్ల గొట్టునది!
30. “నా పక్షమున ఉండనివాడు నాకు ప్రతి కూలుడు. నాతో ప్రోగుచేయనివాడు చెదరగొట్టువాడు.
31. అందువలన, మానవులు చేయు సర్వపాపములు, దేవదూషణములు క్షమింపబడునుగాని, ఎవ్వడేని పవిత్రాత్మను దూషించినయెడల వానికి క్షమాభిక్ష లభింపదు.
32. ఎవ్వడైనను మనుష్య కుమారునకు వ్యతిరేకముగా మాట్లాడిన క్షమింపబడునుగాని, పవిత్రాత్మకు ప్రతికూలముగా పలికిన వానికి ఈ జీవితమందైనను, రాబోవు జీవితమందై నను మన్నింపులేదని మీతో నిశ్చయముగా వక్కాణించు చున్నాను.
33. "పండు మంచిదైన చెట్టు మంచిదనియు, పండు చెడుదైన చెట్టు మంచిదికాదనియు చెప్పుదురు. పండునుబట్టి చెట్టు స్వభావమును తెలిసికొందురు.
34. ఓ సర్పసంతానమా! దుష్టులైన మీరు మంచిని ఎట్లు మాట్లాడగలరు? హృదయ పరిపూర్ణత నుండి కదా నోటిమాట వెలువడునది!
35. మంచివాడు తమ మంచి నిధినుండి మంచి విషయములను తెచ్చును; చెడ్డవాడు తన చెడు నిధినుండి చెడు విషయములను తెచ్చును.
36. తీర్పుదినమున ప్రతియొక్కడు తాను పలికిన ప్రతి వ్యక్తమైన మాటకు సమాధానము యివ్వవలసియున్నదని నేను మీతో చెప్పుచున్నాను.
37. నీ మాటలనుబట్టి నీవు దోషివో, నిర్దోషివో కాగలవు.”
38. “బోధకుడా! నీవు ఒక గుర్తును చూపవలెనని మేము కోరుచున్నాము” అని కొందరు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు యేసుతో పలికిరి.
39. అప్పుడు యేసు ప్రత్యుత్తరముగా "దుష్టులు, దైవభ్రష్టులునగు వీరు ఒక గుర్తును కోరుచున్నారు. కాని, యోనా ప్రవక్త చిహ్నముకంటె వేరొకటి వీరికి అనుగ్రహింపబడదు.
40. యోనా ప్రవక్త మూడు పగళ్ళు, మూడు రాత్రులు తిమింగిల గర్భములో ఉన్నట్లు, మనుష్యకుమారుడును మూడుపగళ్ళు, మూడు రాత్రులు భూగర్భములో ఉండును.
41. నీనెవె పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయపరివర్తనము చెందిరి. కనుక, తీర్పుదినమున వారు ఈ తరము వారి యెదుట నిలిచి వీరిని ఖండింతురు. ఇదిగో! యోనా కంటె గొప్ప వాడొకడు ఇచట ఉన్నాడు.
42. తీర్పుదినమున దక్షిణదేశపు రాణి ఈ తరము వారి ఎదుట నిలిచి వీరిని ఖండించును. ఏలయన, ఆమె సొలోమోను విజ్ఞానమును గూర్చి వినుటకై దూరప్రాంతమునుండి పయనించి వచ్చెను. ఇదిగో! ఆ సొలోమోను కంటె గొప్పవాడు ఒకడు ఇచట ఉన్నాడు!
43. “దుష్టాత్మ ఒక మనుష్యుని విడిచిపోయినపుడు అది నిర్జన ప్రదేశములందు సంచరించుచు, విశ్రాంతి స్థలమునకై వెదకును. అది దొరకనప్పుడు,
44. 'నేను విడిచి వచ్చిన నా యింటికి తిరిగిపోదును' అని పలుకును. వచ్చి చూడగా ఆ ఇల్లు నిర్మానుష్యమై, శుభ్రపరుపబడి, సక్రమముగా అమర్చబడియుండెను.
45. అపుడది పోయి తనకంటె దుష్టులైన మరి ఏడు ఆత్మలను కూర్చుకొని వచ్చి, లోపల ప్రవేశించి, నివాస మేర్పరచుకొనును. ఈ కారణముచే ఆ మనుష్యుని పూర్వపు స్థితికంటె తదుపరి స్థితి హీనముగా ఉండును. ఇట్లే ఈ దుష్టసంతతి వారికిని సంభవించును” అని పలికెను.
46. యేసు ఇంకను జనసమూహముతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు, ఆయన సోదరులును అచటికివచ్చి ఆయనతో సంభాషింపకోరి, వెలుపల నిలిచియుండిరి.
47. అప్పుడు ఒకడు “మీ తల్లియు, సోదరులు వచ్చి మీతో మాటలాడుటకై వెలుపల వేచి యున్నారు” అని చెప్పెను.
48. యేసు అతనితో ప్రత్యుత్తరముగా, “నా తల్లి యెవరు? నా సోదరులు ఎవరు?" అని,
49. తన శిష్యులవైపు చూపుచు “వీరే నా తల్లి, సోదరులు” అని చెప్పెను.
50. మరియు “పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు, నా సోదరి, నా తల్లి” అని పలికెను.
1. ఆ దినముననే యేసు ఇల్లు వెడలి సముద్ర తీరమున కూర్చుండెను.
2. అప్పుడు జనులు గుంపులు గుంపులుగా ఆయన చుట్టును చేరగా ఆయన ఒక పడవనెక్కి కూర్చుండెను. జనులందరును తీరమున నిలుచుండిరి.
3. ఆయన వారికి అనేక విషయములు ఉపమానరీతిగా చెప్పెను. “విత్తువాడొకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను.
4. అతడు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వానిని తినివేసెను.
5. మరికొన్ని చాలినంత మన్నులేని రాతి నేలపై పడెను. అవి వెంటనే మొలిచెను
6. కాని, సూర్యుని వేడిమికి మాడి, వేరులేనందున ఎండి పోయెను.
7. మరికొన్ని ముండ్లపొదలలో పడెను. ఆ ముండ్లపొదలు ఎదిగి వానిని అణచివేసెను.
8. ఇంకను కొన్ని సారవంతమైన నేలపై పడెను. అవి పెరిగి ఫలింపగా నూరంతలుగా, అరువదంతలుగా, ముప్పదంతలుగా పంటనిచ్చెను.
9. వినుటకు వీనులున్నవాడు వినునుగాక!” అని యేసు పలికెను.
10. అంతట శిష్యులు యేసు వద్దకు వచ్చి, “మీరు ప్రజలతో ప్రసంగించునపుడు ఉపమానములను ఉపయోగించుచున్నారేల?” అని ప్రశ్నించిరి.
11. అందులకు ఆయన ప్రత్యుత్తరముగా “పరలోకరాజ్య పరమరహస్యములను తెలిసికొనుటకు అనుగ్రహింపబడినది మీకే కాని వారికి కాదు.
12. ఏలయన, ఉన్నవానికే మరింత ఇవ్వబడును. వానికి సమృద్ధి కలుగును. లేనివానినుండి వానికున్నదియు తీసి వేయబడును.
13. వారు చూచియుచూడరు; వినియు వినరు, గ్రహింపరు. కనుక, నేను వారితో ఉపము రీతిగా మాటలాడుచున్నాను” అని చెప్పెను.
14. “వారిని గూర్చి యెషయా ప్రవచనమిట్లు నెరవేరెను అది ఏమన: ఎంతగా విన్నను మీరు గ్రహింపరు. ఎంతగా చూచినను మీరు గమనింపరు.
15. ఏలయన కనులార చూచి, చెవులార విని, మనస్సుతో గ్రహించి, హృదయపరివర్తనము చెంది, నా వలన స్వస్థత పొందకుండునట్లు, వారి బుద్ధి మందగించినది. వారి చెవులు మొద్దుబారినవి. వారి కన్నులు పొరలు క్రమ్మినవి.”
16. “మీరెంత ధన్యులు! మీ కన్నులు చూడ గలుగుచున్నవి. మీ చెవులు వినగలుగుచున్నవి.
17. మీరు చూచునది చూచుటకు, వినునది వినుటకు ప్రవక్తలనేకులు, నీతిమంతులనేకులు కాంక్షించిరి. కాని వారికి అది సాధ్యపడలేదు.
18. “కనుక విత్తువాని ఉపమాన భావమును ఆలకింపుడు.
19. రాజ్యమును గూర్చిన సందేశమును విని, దానిని గ్రహింపని ప్రతివాడు త్రోవ ప్రక్కన పడిన విత్తనమును పోలియున్నాడు. దుష్టుడు వచ్చి, వాని హృదయములో నాటిన దానిని ఎత్తుకొనిపోవును.
20. రాతినేలపై బడిన విత్తనము సందేశమును వినిన వెంటనే సంతోషముతో దానిని స్వీకరించువానిని సూచించుచున్నది.
21. అయినను, వానిలో వేరు లేనందున అది కొలదికాలమే నిలుచును. ఆ సందేశము నిమిత్తమై శ్రమయైనను, లేదా హింసయైనను సంభవించిన ప్పుడు అతడు వెంటనే తొట్రిల్లును.
22. ముండ్లపోదలలో పడిన విత్తనమును పోలినవాడు సందేశమును వెంటనే ఆలకించును. కాని, ఐహికవిచారము, ధనవ్యామోహము దానిని అణచివేయును. కనుక, వాడు నిష్ఫలుడగును.
23. సారవంతమైన నేల యందు పడిన విత్తనమును పోలినవాడు సందేశమును విని, గ్రహించి, నూరంతలుగము, అరువదంతలుగను, ముప్పదంతలుగను ఫలించును."
24. యేసు వారికి మరియొక ఉపమానము చెప్పెను: “పరలోకరాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వానిని పోలియున్నది.
25. జనులు నిద్రించువేళ వాని పగవాడు వచ్చి, గోధుమలలో కలుపుగింజలు చల్లిపోయెను.
26. పైరు మొలచి వెన్నువిడుచునపుడు కలుపు మొక్కలు కూడ కనిపింపసాగెను.
27. అపుడు ఆ యజమానుని సేవకులు అతని యొద్దకు వచ్చి, 'అయ్యా! నీ పొలములో మంచి విత్తనములు చల్లితివి కదా! అందులో కలుపుగింజలు ఎట్లు వచ్చిపడినవి?” అని అడిగిరి.
28. అందుకు అతడు 'ఇది శత్రువు చేసినపని' అనెను. అంతట వారు 'మేము వెళ్ళి, వానిని పెరికి కుప్ప వేయుదుమా?”అని అడిగిరి.
29. 'వలదు, వలదు. కలుపు తీయబోయి గోధుమను కూడ పెల్లగింతు రేమో!
30. పంటకాలము వరకు రెంటిని పెరుగనిండు. అపుడు కోతగాండ్రతో 'ముందుగా కలుపుతీసి వానిని అగ్నిలో వేయుటకు కట్టలు కట్టుడు. గోధుమలను నా గిడ్డంగులలో చేర్పుడు' అని చెప్పెదను" అనెను.
31. ఆయన మరియొక ఉపమానమును ఇట్లు వారితో చెప్పెను: “పరలోకరాజ్యము పొలములో నాటబడిన ఒక ఆవగింజను పోలియున్నది.
32. అన్ని విత్తనముల కంటె అతి చిన్నదైనను, పెరిగినపుడు అది పెద్ద గుబురై, వృక్షమగును. దాని కొమ్మలలో పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకొని నివసించును.”
33. ఆయన వారికి మరియొక ఉపమానమును ఇట్లు చెప్పెను: “ఒక స్త్రీ పులిసిన పిండిని మూడు కుంచముల పిండిలో ఉంచగా, ఆ పిండి అంతయు పులియబారెను. పరలోక రాజ్యము దీనిని పోలి యున్నది.”
34. యేసు జనసమూహములకు ఈ విషయములన్నియు ఉపమానములతో బోధించెను. ఉపమానములు లేక వారికి ఏమియు బోధింపడాయెను.
35. ప్రవక్త పలికిన ఈ క్రింది ప్రవచనము నెరవేరునట్లు ఆయన ఈ రీతిగ బోధించెను. “నేను ఉపమానములతో బోధించెదను. సృష్టి ఆరంభమునుండి గుప్తమైయున్న వానిని బయలుపరచెదను."
36. అపుడు యేసు ఆ జనసమూహములను వదలి ఇంటికి వెళ్ళెను. శిష్యులు ఆయనను సమీపించి గోధుమలు, కలుపుగింజల ఉపమానమును వివరింపుము అని కోరిరి.
37. అందుకు యేసు “మంచి విత్తనమును విత్తువాడు మనుష్యకుమారుడు.
38. పొలము ఈ ప్రపంచము. మంచివిత్తనము అనగా రాజ్యమునకు వారసులు. కలుపుగింజలు దుష్టుని సంతానము.
39. వీనిని విత్తిన శత్రువు సైతాను. పంటకాలము అంత్యకాలము. కోతగాండ్రు దేవదూతలు.
40. కలుపు మొక్కలు ఎట్లు ప్రోవుచేయబడి అగ్నిలో వేయబడునో, అట్లే అంత్యకాలమందును జరుగును.
41. మనుష్యకుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యమునుండి పాపభూయిష్టములైన ఆటంకములను అన్నిటిని, దుష్టులను అందరను ప్రోగుచేసి,
42. అగ్ని గుండములో పడద్రోయుదురు; అచ్చట వారు ఏడ్చుచు, పండ్లు కొరుకుకొందురు.
43. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె ప్రకాశింతురు. వీనులున్నవాడు వినును గాక.
44. “పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమువలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని అచటనే దాచియుంచి, సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను.
45. "ఇంకను పరలోకరాజ్యము ఆణిముత్యములు వెదకు వర్తకునివలె ఉన్నది.
46. ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని, వెళ్ళి తనకున్నది అంతయు అమ్మి దానిని కొనెను.
47. "ఇంకను పరలోకరాజ్యము సముద్రములో వేయబడి, అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది.
48. వల నిండినపుడు దానిని ఒడ్డునకు లాగి అచట కూర్చుండి మంచి చేపలను బుట్టలలో వేసి, పనికిరాని వానిని పారవేయుదురు.
49. అటులనే అంత్యకాలమందును జరుగును; దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతులనుండి వేరుపరచి,
50. అగ్ని గుండములో పడద్రోయుదురు. అచట వారు ఏడ్చుచు, పండ్లు కొరుకుకొందురు.”
51.“వీనినన్నింటిని మీరు గ్రహించితిరా?” అని యేసు అడిగెను. “అవును” అని వారు సమాధాన మిచ్చిరి.
52. ఆయన “పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన, పురాతన వస్తువులను వెలికితెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడు” అనెను.
53. యేసు ఈ ఉపమానములను ముగించి అచటనుండి వెడలి,
54. తన పట్టణమును చేరెను, అచట ప్రార్థనామందిరములో ఉపదేశించుచుండగా, ప్రజలు ఆశ్చర్యచకితులై, “ఇతనికి ఈ జ్ఞానము, ఈ అద్భుత శక్తి ఎచటనుండి లభించినవి?” అని అనుకొనిరి.
55. “ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాలు ఇతని సోదరులుకారా?
56. ఇతని సోదరీమణులు అందరు మన మధ్యనలేరా? అటులయిన ఇవి అన్నియు ఇతడు ఎట్లు పొందెను?” అని
57. ఆయనను తృణీకరించిరి. అపుడు యేసు వారితో “ప్రవక్త స్వదేశమందును, స్వగృహమందును తప్ప మరెందును సన్మానింపబడకపోడు” అని పలికెను.
58. ఆ ప్రజల అవిశ్వాసమువలన ఆయన అచట ఎక్కువగా అద్భుతములను చేయలేదు. .
1. ఆ కాలమున గలిలీయ ప్రాంత పాలకుడగు హేరోదు యేసు ప్రఖ్యాతిని విని,
2. “ఇతడు స్నాప కుడగు యోహానే. అతడే మృతులనుండి లేచియున్నాడు. కావున, అద్భుతశక్తులు ఇతనియందు కనిపించు చున్నవి” అని తన కొలువుకాండ్రతో చెప్పెను.
3. హేరోదు తన సోదరుడగు. ఫిలిప్పు భార్యయైన హేరోదియ కారణముగా యోహానును బంధించి చెరలో వేయించెను.
4. ఏలయన, “ఆమెను నీవు ఉంచుకొనుట ధర్మముకాదు” అని యోహాను హేరోదును హెచ్చరించుచుండెను.
5. . యోహానును చంపుటకు హేరోదు నిశ్చయించెను. కాని అతడు ప్రవక్తయని ప్రఖ్యాతిగాంచుటచే ప్రజలకు భయపడెను.
6. హేరోదు జన్మదినోత్సవమున హేరోదియ కుమార్తె సభలో నాట్యమాడి అతనిని మెప్పింపగా,
7. ఆమె ఏమి కోరినను దానిని ఆమెకు ఒసగెదను అని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను.
8. అపుడు ఆమె తన తల్లి ప్రోత్సాహమువలన “స్నాపకుడగు యోహాను శిరస్సును ఒక పళ్ళెరములో ఇప్పుడు ఇప్పింపుము” అని అడిగెను.
9. అందుకు ఆ రాజు దుఃఖించెను. కాని, తన ప్రమాణముల కారణముగ, అతిథుల కారణముగ ఆమె కోరిక తీర్చ ఆజ్ఞాపించి,
10. సేవకులను పంపి చెరసాలలోనున్న యోహానును శిరచ్చేదనము గావించెను.
11. వారు అతని తలను పళ్ళెములో తెచ్చి ఆ బాలికకు ఇవ్వగా ఆమె దానిని తన తల్లికి అందించెను.
12. అంతట యోహాను శిష్యులు వచ్చి, అతని భౌతిక దేహమును తీసికొనిపోయి భూస్థాపనము చేసిరి. పిమ్మట వారు యేసు వద్దకు వెళ్ళి ఆ విషయమును తెలియచేసిరి.
13. యేసు ఈ వార్తవిని, అచటనుండి పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమాయెను. ప్రజలు ఈ వార్త విని తమ పట్టణములనుండి బయలుదేరి సరస్సు తీరమున కాలి నడకన ఆయనను వెంబడించిరి.
14. యేసు ఒడ్డునుచేరి గొప్ప జన సమూహమును చూచి, జాలిపడి, వారిలోని వ్యాధి గ్రస్తులను స్వస్థపరచెను.
15. సాయంసమయమున శిష్యులు ఆయన సముఖమునకు వచ్చి “ఇది నిర్జన ప్రదేశము. వేళ అతిక్రమించినది. ఇక వారిని పంపివేయుడు. పల్లె పట్టులకు వెళ్ళి, వారికి కావలసిన ఆహారపదార్ధములను సమకూర్చుకొందురు” అని మనవి చేసిరి.
16. అప్పుడు యేసు “వీరిని పంపివేయవలసిన అవసరము లేదు. మీరే వీరికి భోజన సదుపాయములను చేయుడు” అని శిష్యులతో అనెను.
17. “మా వద్ద ఐదు రొట్టెలు, రెండు చేపలు తప్ప మరేమియు లేవు” అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి.
18. “వాటిని ఇచటకు తీసికొని రండు” అని చెప్పి
19. యేసు ఆ జనసమూహములను పచ్చిక బయళ్ళమీద కూర్చుండుడని ఆజ్ఞాపించెను; ఆ అయిదు రొట్టెలను, రెండు చేపలను తీసికొని ఆకాశమువైపు చూచి వాటిని ఆశీర్వదించి, త్రుంచి శిష్యులకు ఇచ్చెను. వారు వాటిని ప్రజలకు పంచి పెట్టిరి.
20. వారందరు భుజించి సంతృప్తి చెందిన మీదట మిగిలిన ముక్కలను పండ్రెండు గంపల నిండ ఎత్తిరి.
21. భుజించి సంతృప్తి చెందిన వారిలో స్త్రీలు పిల్లలు కాక, దాదాపు అయిదువేల మంది పురుషులు వున్నారు.
22. యేసు తాను జనసమూహములను పంపివేయులోగా శిష్యులను పడవనెక్కి తన కంటె ముందుగా ఆవలి దరికి చేరవలయునని ఆజ్ఞాపించెను.
23. ఆ జనసమూహములను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుకొనుటకై ఏకాంతముగా కొండమీదికి వెళ్ళెను. సాయంసమయము వరకు ఆయన ఏకాంతముగా అచటనే ఉండెను.
24. ఇంతలో గాలి ప్రతికూలముగా వీచుట వలన పడవ అలలలో కొట్టుకొని చాలదూరము పోయెను.
25. వేకువజామున యేసు నీటిపై నడచుచు వారి వద్దకు వచ్చెను.
26. అది చూచిన శిష్యులు భయభ్రాంతులై “ఇది భూతము” అని కేకలు వేసిరి.
27. వెంటనే యేసు వారితో, “భయపడకుడు, ధైర్యము వహింపుడు, నేనే కదా!” అని పలికెను.
28. పేతురు- అంతట “ప్రభూ! నిజముగా నీవే అయిన నీటిమీద నడచి నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞ యిమ్ము” అనెను.
29. ఆయన రమ్మనగానే పేతురు ఆ పడవ దిగి, నిటిపై నడచి, ఆయన యొద్దకు వచ్చుచుండెను.
30. కాని, ఆ పెనుగాలికి భయపడెను. నీటిలో మునిగి పోవుచు “ప్రభూ! నన్ను రక్షింపుము" అని కేకలు వేయసాగెను.
31. వెంటనే ప్రభువు చేయి చాచి పట్టుకొని, “అల్పవిశ్వాసీ! నీవేల సందేహించి తివి?” అనెను.
32. అంతటవారు పడవనెక్కగా గాలి అణగి పోయెను.
33. పడవలో నున్న శిష్యులు “నీవు నిజముగా దేవుని కుమారుడవు” అని పలికి ఆయనను ఆరాధించిరి.
34. వారు దరికి చేరి గెన్నెసరేతు ప్రాంతమునకు వచ్చిరి.
35. అచట జనులు ఆయనను గుర్తించినపుడు పరిసర ప్రాంతమంతటికి ఆ వార్తను పంపి వ్యాధిగ్రస్తులనందరిని ప్రభుసన్నిధికి తీసికొని వచ్చిరి.
36.. వారిని కనీసము ఆయన అంగీ అంచునైనను తాకనీయుము అని ఆయనను ప్రార్థించిరి. అట్లు తాకినవారెల్లరును స్వస్థతపొందిరి.
1. అంతట యెరూషలేము నుండి కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చి
2. “మీ శిష్యులు చేతులు కడుగుకొనకయే భోజనము చేయుచున్నారు. వారు ఏల ఇట్లు పూర్వుల ఆచారమును మీరుచున్నారు?” అని అడిగిరి.
3. అందుకు యేసు “పూర్వుల ఆచారమును ఆచరించునపుడు మరి మీరు మాత్రము దైవాజ్ఞలను మీరుటలేదా?
4. "ఏలయన, దేవుడు ఇట్లు ఆజ్ఞాపించెను: “నీ తల్లిని, తండ్రిని గౌరవింపుము. తల్లిదండ్రులను దూషించువాడు మరణించుగాక!
5. ఎవ్వడేని తన తండ్రితోగాని, తన తల్లితోగాని, 'నానుండి మీరు పొందవలసినది దైవార్పితమైనది' అని చెప్పినచో, అట్టివాడు తన తల్లిదండ్రులను ఆదుకొననవసరము లేదని మీరు బోధించుచున్నారు.
6. ఈ రీతిని మీరు పూర్వుల ఆచారముననుసరించు నెపమున దేవుని వాక్కును నిష్ప్రయోజనము చేయుచున్నారు.
7. వంచకులారా! యెషయా మిమ్మును గూర్చి యెంత యథార్థముగా ప్రవచించెను!
8. 'ఈ ప్రజలు పెదవులతో నన్ను స్తుతించుచున్నారు కాని, వారి హృదయములు నాకు కడు దూరముగా ఉన్నవి.
9. మానవ కల్పిత నియమములను దైవాజ్ఞలుగా బోధించుచున్నారు. కావున వీరి ఆరాధన నిరర్ధకము."
10. అపుడు యేసు జనసమూహమును తన చెంతకు పిలిచి “మీరు ఈ పలుకులను ఆలకించి గ్రహింపుడు.
11. మనుష్యుని మాలిన్యపరచునది నోటి నుండి వెలువడునదియే కాని, నోటిలోనికి పోవునది కాదు” అనెను.
12. అపుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, “పరిసయ్యులు నీ మాటలకు మండిపడుచున్నారని నీకు తెలియునా?” అని ప్రశ్నించిరి.
13. అందుకు ఆయన “నా పరలోక తండ్రి నాటని ప్రతిమొక్క వేరుతో పెల్లగింపబడును.
14. వారిని అట్లుండనిండు. వారు గ్రుడ్డి నాయకులు. గ్రుడ్డివానికి గ్రుడ్డివాడు మార్గము చూపినచో వారు ఇరువురును గుంతలో కూలుదురు” అని సమాధానమిచ్చెను.
15. ఈ ఉపమానమును వివరింపుమని పేతురు ఆయనను అడిగెను.
16. యేసు ప్రత్యుత్తరముగా, “మీకు కూడ ఇంతవరకు అర్థము కాలేదా?
17. నోటిలోనికి పోవునదంతయు ఉదరములో ప్రవేశించి, ఆ పిమ్మట విసర్జింపబడు చున్నదని మీకు తెలియదా?
18.నోటినుండి వెలువడునది హృదయమునుండి వచ్చును. అదియే మనుష్యుని మాలిన్యపరచును.
19. ఏలయన, హృదయమునుండి దురాలోచనలు పుట్టుచున్నవి. వీని మూలమున నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధపు సాక్ష్యములు, దూషణములు కలుగుచున్నవి.
20. మనుష్యుని మాలిన్య పరచునవి ఇవియేగాని, చేతులు కడుగుకొనకుండ భుజించుట కాదు.”
21. యేసు అచట నుండి తూరు, సీదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను.
22. ఆ ప్రాంతమున నివసించుచున్న కననీయ స్త్రీ ఒకతె ఆయన వద్దకు వచ్చి, “ప్రభూ! దావీదు కుమారా! నాపై దయచూపుము. నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది” అని మొరపెట్టుకొనెను.
23. ఆయన ఆమెతో ఒక్క మాటైనను మాట్లాడలేదు. అపుడు ఆయన శిష్యులు సమీపించి “ఈమె మన వెంటబడి అరచుచున్నది, ఈమెను పంపివేయుడు” అనిరి.
24. “నేను యిస్రాయేలు వంశమున చెదరిపోయిన గొఱ్ఱెలకొరకు మాత్రమే పంపబడితిని” అని ఆయన సమాధానము ఇచ్చెను.
25. అపుడు ఆమె వచ్చి, ఆయన పాదములపై పడి “ప్రభూ! నాకు సాయపడుము” అని ప్రార్థించెను.
26. “బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయతగదు” అని ఆయన సమాధానమిచ్చెను.
27. అందుకు ఆమె, “అది నిజమే ప్రభూ! కాని తమ యజమానుని భోజనపు బల్లనుండి క్రిందపడిన రొట్టెముక్కలను కుక్క పిల్లలును తినునుగదా!" అని బదులు పలికెను.
28. యేసు ఇది విని “అమ్మా! నీ విశ్వాసము మెచ్చదగినది. నీ కోరిక నెరవేరునుగాక!” అనెను. ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను.
29. యేసు అక్కడ నుండి గలిలీయ సముద్ర తీరమునకు వచ్చి, కొండపైకి ఎక్కి కూర్చుండెను.
30. అపుడు జనులు గుంపులు గుంపులుగా కుంటివారిని, వికలాంగులను, గ్రుడ్డివారిని, మూగవారిని, రోగులను అనేకులను తీసికొనివచ్చి, ఆయన పాదసన్నిధికి చేర్చగా ఆయన వారిని స్వస్థపరచెను.
31. అపుడు మూగవారు మాటాడుటయు, వికలాంగులు అంగపుష్టి పొందుటయు, కుంటివారు నడచుటయు, గ్రుడ్డివారు చూచుటయు జనసమూహము కాంచి, విస్మయ మొంది, యిస్రాయేలు దేవుని స్తుతించిరి.
32. అనంతరము యేసు తన శిష్యులను పిలిచి, “ఈ జనులు మూడుదినములనుండి ఇక్కడ ఉన్నారు. వీరికి తినుటకు ఏమియులేదు. వీరిని చూడ నాకు జాలి కలుగుచున్నది. వీరు మార్గమధ్యమున అలసి సొలసి పడిపోవుదురేమో! వీరిని పస్తుగా పంపి వేయుట నాకు ఇష్టము లేదు” అనెను.
33. అపుడు శిష్యులు, “ఈ ఎడారిలో ఇంతటి జనసమూహమునకు కావలసినంత ఆహారము మనము ఎచటనుండి కొనిరాగలము?" అని పలికిరి.
34. అంతట యేసు “మీయొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి?” అని వారిని అడిగెను. “ఏడు రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఉన్నవి” అని శిష్యులు పలికిరి.
35. ఆయన జనసమూహమును నేలమీద కూర్చుండుడని ఆజ్ఞాపించెను.
36. పిమ్మట ఆయన ఆ ఏడు రొట్టెలను చేపలను తీసికొని ధన్యవాదములు అర్పించి, త్రుంచి, తన శిష్యులకు ఈయగా వారు ఆ జన సమూహమునకు పంచిపెట్టిరి.
37. వారు అందరు భుజించి సంతృప్తి చెందిరి. పిమ్మట మిగిలిన ముక్కలను ఏడు గంపలనిండ ఎత్తిరి.
38. స్త్రీలు, పిల్లలు మినహా భుజించినవారు నాలుగువేల మంది పురుషులు.
39. తరువాత యేసు జనసమూ హమును పంపివేసి పడవనెక్కి మగ్ధలా ప్రాంతమునకు వెళ్ళెను.
1. శోధించు తలంపుతో పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసు దగ్గరకువచ్చి "పరలోకమునుండి ఒక గురుతును చూపుము" అనిరి.
2. ఆయన వారికి ప్రత్యుత్తరముగా, “సంధ్యా సమయమున ఆకాశము ఎఱ్ఱగా ఉన్నది. కనుక వాతావరణము బాగుండు ననియు,
3. ప్రాతఃకాల సమయమున ఆకాశము మబ్బుపట్టి ఎఱ్ఱగా ఉన్నది కనుక గాలివాన వచ్చు ననియు మీరు చెప్పుదురు. ఆకాశమును చూచి వాతావరణమును గుర్తింపగలిగిన మీరు ఈ కాలముల సూచనలను గుర్తింపలేకున్నారా?
4. వ్యభిచారులైన దుష్టతరమువారు ఒక గురుతును చూడగోరుచున్నారు. కాని యోనా గుర్తు తప్ప వేరొక గురుతు వారికి అనుగ్రహింప బడదు” అని వారిని వీడి వెళ్ళిపోయెను.
5. ఆయన శిష్యులు సరస్సుదాటి ఆవలి ఒడ్డునకు పోవునపుడు రొట్టెలు తీసికొనిపోవుట మరచిరి.
6. “పరిసయ్యుల, సద్దూకయ్యుల పులిసిన పిండిని గూర్చి మీరు జాగరూకులైయుండుడు” అని యేసు వారితో చెప్పెను.
7. “మనము రొట్టెలు తీసికొని పోవుట మరచిపోయినందున ఆయన ఇట్లు పలికెను కాబోలు!" అని తమలో తాము మాటలాడుకొనిరి.
8. యేసు అది గ్రహించి, “అల్పవిశ్వాసులారా! రొట్టెలు లేవని మీరేల విచారించుచున్నారు?
9. మీరు ఇంతలోనే మరచితిరా? ఐదురొట్టెలను ఐదువేలమందికి పంచి పెట్టినపుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్ని గంపలకు ఎత్తలేదు!
10. ఏడు రొట్టెలను నాలుగువేల మందికి పంచిపెట్టినపుడు మిగిలిన వాటిని మీరు ఎన్ని గంపలకు ఎత్తలేదు!
11. నేనిపుడు రొట్టెలను గూర్చి ప్రస్తావించుటలేదని మీరు ఏలా గ్రహింపరు? కావున పరిసయ్యుల, సద్దూకయ్యుల పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త వహింపుడు” అనెను.
12. అప్పుడు శిష్యులు పులిసిన పిండిని గాక పరిసయ్యుల, సదూకయ్యుల బోధను గూర్చి ఆయన ప్రస్తావించెనని గ్రహించిరి.
13. తరువాత యేసు ఫిలిప్పు కైసరయా ప్రాంతమునకు వచ్చెను. “ప్రజలు మనుష్యకుమారుడు ఎవ్వరని భావించుచున్నారు?” అని తన శిష్యులను ఆయన అడిగెను.
14. అందుకు వారు “కొందరు స్నాపకుడగు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు యిర్మీయా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు” అనిరి.
15. “మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు?” అని యేసు వారిని అడిగెను.
16. అందుకు సీమోను పేతురు, “నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు” అని సమాధానమిచ్చెను.
17. "యోనా పుత్రుడవగు సీమోను! నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని, రక్తమాంసములు కావు.
18. నీవు పేతురువు, ఈ రాతిమీద నా సంఘమును నిర్మించెదను. నరకశక్తులు దీనిని జయింపజాలవు.
19. నేను నీకు పరలోకరాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో, అది పరలోకమందును బంధింపబడును; భూలోకమందు నీవు దేనిని విప్పుదువో, అది పరలోక మందును విప్పబడును.”
20. ఇట్లు చెప్పి, తాను క్రీస్తునని ఎవ్వరితోను చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను.
21. అప్పటినుండి యేసు శిష్యులతో తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దలవలన, ప్రధానార్చకుల వలన, ధర్మశాస్త్ర బోధకులవలన పెక్కు బాధలను అనుభవించి, మరణించి మూడవదినమున పునరుత్తానుడగుట అగత్యమని వచించెను.
22. అంతట పేతురు ఆయనను ప్రక్కకు కొనిపోయి, “ప్రభూ! దేవుడు దీనిని నీకు దూరము చేయునుగాక! ఇది ఎన్నటికిని నీకు సంభవింపకుండునుగాక!” అని వారింపసాగెను.
23. అందుకు ఆయన పేతురుతో “ఓ సైతానూ! నా వెనుకకు పొమ్ము, నీవు నా మార్గమునకు ఆటంకముగా నున్నావు. నీ భావములు మనుష్యులకు సంబంధించినవే కాని, దేవునికి సంబంధించినవికావు” అనెను.
24. “నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని, తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను.
25. తన ప్రాణమును కాపాడు కొనచూచువాడు, దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును ధారపోయువాడు, దానిని దక్కించు కొనును.
26. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఈయగలడు?
27. మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతియొక్కనికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును.
28. ఇచ్చటనున్న వారిలో కొందరు మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చు దృశ్యమును చూచునంతవరకు మరణింప బోరని నిశ్చయముగా చెప్పుచున్నాను” అని యేసు శిష్యులతో పలికెను.
1. ఆరుదినములు గడచిన పిమ్మట యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడగు యోహానును తనవెంట తీసికొని, ఒక ఉన్నతపర్వతము పైకి ఏకాంతముగా వెళ్ళెను.
2. అచట వారియెదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లగానయ్యెను.
3. ఆయనతో మోషే, ఏలియాలు సంభాషించుచున్నట్లు వారికి కనబడిరి.
4. అప్పుడు పేతురు "ప్రభూ! మనము ఇచటనుండుట మంచిది. నీకు అనుమతియైనచో నేను నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి మూడు శిబిరములను నిర్మింతును” అని పలికెను.
5. అంతలో ఒక కాంతి వంతమైన మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో ఆ మేఘము నుండి “ఈయన నా కుమారుడు. నాకు ప్రియమైనవాడు. ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని. ఈయనను ఆలకింపుడు,” అను వాణి వినిపించెను.
6. ఇది వినిన శిష్యులు మిక్కిలి భయభ్రాంతులై బోరగిలపడిరి.
7. అప్పుడు యేసు వారి కడకు వచ్చి, వారిని తట్టి, “లెండు, భయపడకుడు” అని పలికెను.
8. అంతట వారు కనులెత్తిచూడగా వారికి యేసు తప్ప మరెవ్వరును కనిపించలేదు.
9. వారు ఆ పర్వతమునుండి దిగి వచ్చుచుండగా యేసు వారితో “మనుష్యకుమారుడు మృతులనుండి లేపబడువరకు మీరు ఈ దర్శనమును గూర్చి ఎవ్వరితో చెప్పరాదు” అని ఆజ్ఞాపించెను.
10. అపుడు శిష్యులు “అట్లయిన ఏలియా ముందుగా రావలెనని ధర్మశాస్త్ర బోధకులు ఏల పలుకుచున్నారు?” అని ప్రశ్నించిరి.
11. అందుకు ఆయన “తప్పక ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కదిద్దును.
12. అయితే మీ చెప్పున దేమనగా ఏలియా వచ్చియేయున్నాడు. కాని ప్రజలు అతనిని గుర్తింపక అతని పట్ల తమకు ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించిరి. మనుష్య కుమారుడును అట్లే వారివలన శ్రమలు పొందబోవుచున్నాడు” అనెను.
13. శిష్యులు అపుడు యేసు తమతో ప్రస్తావించినది స్నాపకుడగు యోహానును గూర్చి అని గ్రహించిరి.
14. వారు అపుడు జనసమూహమును చేరగా, అందు ఒకడు యేసు ముందు మోకరిల్లి,
15. “ప్రభూ! నా పుత్రుని కరుణింపుము. మూర్చరోగమువలన తీవ్రముగ బాధపడుచు అనేక పర్యాయములు నిప్పు లోను, నీళ్ళలోను పడుచున్నాడు.
16. నేను ఇతనిని తమ శిష్యుల వద్దకు తీసికొనివచ్చితిని; కాని వారు ఇతనిని స్వస్థపరుపలేకపోయిరి” అనెను.
17. అందుకు యేసు వారితో “మీరెంత అవిశ్వాసులు! ఎంత భ్రష్టులు! నేను మీతో ఎంతకాలము ఉందును? ఎంతవరకు మిమ్ము సహింతును? వానిని నా యొద్దకు తీసికొని రండు” అని చెప్పెను.
18. యేసు ఆ పిశాచమును గద్దింపగా అది వదలిపోయెను. ఆ గడియనుండి ఆ బాలుడు స్వస్థత పొందెను.
19. శిష్యులు యేసుతో ఏకాంతముగా, “ఆ పిశాచమును మేమేల పారద్రోల లేకపోతిమి?” అని అడిగిరి.
20. యేసు వారితో “మీ అల్పవిశ్వాసమే అందుకు కారణము, ఆవగింజంత విశ్వాసము మీకుండినయెడల ఈ పర్వతముతో 'నీవిక్కడ నుండి తొలగుము' అని పలికినచో అది అప్పుడే తొలగిపోవును. మీకు అసాధ్యమైనది ఏదియు ఉండదని మీతో వక్కాణించుచున్నాను.
21. అయినను ఇట్టి దానిని ప్రార్ధనతోను, ఉపవాసముతో తప్ప మరి ఏ విధమునను వెడలగొట్ట శక్యముకాదు” అనెను.
22. పిమ్మట వారు గలిలీయలో తిరుగుచుండగా యేసు “మనుష్యకుమారుడు శత్రువులకు అప్పగింప బడబోవుచున్నాడు.
23. వారు ఆయనను చంపుదురు. కాని, మూడవదినమున లేపబడును” అని వారితో చెప్పగా వారు మిక్కిలి దుఃఖించిరి.
24. అంతట వారు కఫర్నాము చేరినపుడు దేవాలయపు పన్నులు వసూలు చేయువారు పేతురు దగ్గరకు వచ్చి, “మీ గురువు పన్ను చెల్లింపడా?” అని ప్రశ్నింపగా,
25. “చెల్లించును” అని పేతురు ప్రత్యుత్తరమిచ్చెను. అతడింటికి వచ్చిన వెంటనే యేసు “సీమోను! నీకేమి తోచుచున్నది? భూలోకమందలి రాజులు ఎవరినుండి పన్ను వసూలు చేయుచున్నారు? తమ పుత్రులనుండియా? ఇతరులనుండియా?” అని ప్రశ్నించెను.
26. పేతురు అందుకు “ఇతరుల నుండియే” అని ప్రత్యుత్తర మిచ్చెను. “అయితే పుత్రులు దీనికి బద్దులుకారుగదా!
27. వారు మనలను అన్యధా భావింపకుండుటకై నీవు సముద్రమునకు వెళ్ళి గాలము వేయుము. మొదట పడిన చేప నోటిని తెరచి నపుడు అందొక నాణెమును చూతువు. దానిని మన ఇద్దరి కొరకు సుంకముగా చెల్లింపుము” అని యేసు సీమోనును ఆదేశించెను.
1. ఆ సమయమున శిష్యులు యేసువద్దకు వచ్చి, “పరలోకరాజ్యమున అందరికంటె గొప్పవాడు ఎవ్వడు?” అని అడిగిరి.
2. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారిమధ్యన నిలిపి,
3. “మీరు పరివర్తనచెంది చిన్నబిడ్డలవలె రూపొందిననే తప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని మీతో వక్కాణించు చున్నాను.
4. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలునివలె రూపొందువాడే పరలోకరాజ్యమున గొప్పవాడు.
5. ఇట్టి చిన్నవానిని నా పేరిట స్వీకరించు వాడు నన్ను స్వీకరించుచున్నాడు.
6. “నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఎవ్వనినైన పాపమునకు ప్రేరేపించుటకంటె అట్టివాని మెడకు తిరుగటిరాయి కట్టి అగాధ సముద్రములో పడద్రోయుట వానికి మేలు.
7. ఆటంకములతో కూడిన ప్రపంచమా! అనర్థము! ఆటంకములు తప్పవు. కాని అందుకు కారకుడైన వానికి అనర్థము!
8. నీ చేయికాని, నీ కాలుకాని నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము. కాళ్ళు, చేతులతో ఆరని ఆగ్నిలో దహింపబడుటకంటె, అంగహీనుడవై అమరజీవము పొందుట మేలు.
9. నీ కన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయుము. రెండు కనులతో నీవు నరకాగ్నిలో దహింపబడుటకంటె ఒంటికంటితో నిత్య జీవము పొందుట మేలు.
10. ఈ చిన్నవారిలో ఎవ్వరిని తృణీకరింపకుడు. ఏలయన వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచియున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
11. “మనుష్యకుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షింప వచ్చియున్నాడు.
12. ఒకడు తనకున్న నూరు గొఱ్ఱెలలో ఒకటి తప్పిపోయినచో, తక్కిన తొంబది తొమ్మిదింటిని ఆ పర్వత ప్రాంతముననే విడిచి దానిని వెదకుటకు పోడా?
13. అది దొరికినపుడు తప్పిపోని తక్కిన తొంబది తొమ్మిదింటికంటె దాని విషయమై ఎక్కువగా సంతసించును అని నిశ్చయముగా చెప్పుచున్నాను.
14. ఆ రీతిగా ఈ పసిబాలురలో ఒకడైనను నాశనమగుట పరలోకమందుండు మీ తండ్రి చిత్తము కాదని తెలిసికొనుడు.
15,“నీ సోదరుడు నీకు విరుద్ధముగ తప్పిదము చేసినయెడల నీవు పోయి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధిచెప్పుము. నీ మాటలు అతడు ఆలకించినయెడల వానిని నీవు సంపాదించు కొనిన వాడవగుదువు.
16. నీ మాటలను అతడు ఆలకింపనియెడల ఒకరిద్దరను నీ వెంట తీసికొని పొమ్ము. ఇట్లు ఇద్దరు ముగ్గురు సాక్షులు పలుకు ప్రతిమాట స్థిరపడును.
17. అతడు వారి మాట కూడ విననియెడల సంఘమునకు తెలుపుము. ఆ సంఘ మును కూడ అతడు లెక్కింపనియెడల, వానిని అవిశ్వా సునిగను, సుంకరిగను పరిగణింపుము.
18. భూలోకమందు మీరు వేనిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూలోకమందు మీరు వేనిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను.
19. భూలోకమున మీలో ఇద్దరు ఏకమనస్కులై ఏమి ప్రార్థించినను, పరలోకమందుండు నా తండ్రి వారికి అది ఒసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
20. ఏలయన, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరట కూడుదురో అక్కడ నేను వారిమధ్య ఉన్నాను” అనెను.
21. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, "ప్రభూ! నా సహోదరుడు నాకు ద్రోహము చేయుచుండ నేనెన్ని పర్యాయములు అతనిని క్షమింపవలెను? ఏడు పర్యాయములా?” అని అడిగెను.
22. అందుకు యేసు “ఏడు కాదు, ఏడు డెబ్బది పర్యాయములు” అని సమాధానమిచ్చెను.
23. ఏలయన పరలోకరాజ్యము ఇట్లున్నది: ఒక రాజు - తన సేవకులనుండి లెక్కలు సరిచూచుకొనగోరెను.
24. ఆ రాజు లెక్కలు చూచుకొన ప్రారంభింపగనే కోటివరహాల' ఋణస్థుడొకడు అతని సముఖమునకు తీసికొని రాబడెను.
25. వానికి ఋణము చెల్లించు శక్తి లేనందున రాజు వాని భార్యను, బిడ్డలను, వానికి ఉన్నదంతయును విక్రయించి, ఆ ఋణము తీర్పవలెనని ఆజ్ఞాపించెను.
26. అపుడు ఆ సేవకుడు అతని కాళ్ళపై పడి 'కొంత ఓపిక పట్టుము. నీ ఋణమునంతయు చెల్లింతును' అని వేడుకొనెను.
27. ఆ రాజు వానిపై దయచూపి అతనిని విడిచి పెట్టెను. వాని అప్పును కూడ క్షమించెను. "
28. కాని, అదే సేవకుడు వెలుపలికి వెళ్ళి, తనకు కొంత ధనము' ఋణపడియున్న తన తోడి సేవకులలో నొకనిని చూచి, 'నీ అప్పు చెల్లింపుము' అని గొంతు పట్టుకొనెను.
29. ఆ తోడి సేవకుడు అపుడు సాగిలపడి 'కొంచెము ఓపిక పట్టిన నీ ఋణ మంతయు చెల్లింతును' అని ప్రాధేయపడెను.
30. అందులకు వాడు అంగీకరింపక ఋణము తీర్చు వరకు వానిని చెరసాలలో వేయించెను.
31. ఇది చూచిన తోటి సేవకులు ఎంతో బాధపడి, జరిగినది అంతయు తమ యజమానునకు ఎరిగించిరి.
32. అపుడు ఆ యజమానుడు వానిని పిలిపించి 'నీచుడా! నీవు నన్ను ప్రార్ధించుటచే నీ ఋణమంతయు క్షమించితిని.
33. నేను నీపట్ల దయచూపినట్లు నీవు నీ తోటి సేవకునిపై దయచూపవలదా?' అని
34. మండిపడి బాకీనంతయు చెల్లించువరకు వానిని తలారులకు అప్పగించెను.
35. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల పరలోకమందలి నా తండ్రియు మీ యెడల అటులనే ప్రవర్తించును.”
1. తన ఉపదేశమును ముగించిన పిదప, యేసు గలిలీయ సీమను వీడి, యోర్దాను నదికి ఆవల నున్న యూదయా ప్రాంతమును చేరెను.
2. గొప్ప జనసమూహములు ఆయనను వెంబడింపగా వారిని అచట స్వస్థపరచెను.
3. యేసును పరీక్షించుటకై పరిసయ్యులు వచ్చి “ఏ కారణము చేతనైన ఒకడు తన భార్యను పరిత్య జించుట చట్టబద్ధమా?” అని ప్రశ్నించిరి.
4. ప్రారంభము నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులనుగా సృజించి నట్లు మీరు చదువలేదా?
5. ఈ కారణము చేతనే పురుషుడు తల్లిని, తండ్రిని, విడిచి తన భార్యను హత్తుకొనియుండును. వారు ఇరువురు ఏకశరీరులై యుందురు.
6. కనుక వారిరువురు భిన్న శరీరులు కాక, ఏకశరీరులైయున్నారు. దేవుడు జతపరచిన జంటను మానవమాత్రుడు వేరుపరుపరాదు” అని యేసు పలికెను.
7. "అటులైన విడాకుల పత్రము నిచ్చి భార్యను విడనాడవచ్చునని మోషే ఏల ఆజ్ఞా పించెను?" అని పరిసయ్యులు తిరిగి ప్రశ్నించిరి.
8. “మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను మీరు విడనాడుటకు మోషే అనుమతించెనే కాని, ఆరంభమునుండి ఇట్లు లేదు.
9. వ్యభిచార కారణమున తప్ప, తన భార్యను విడనాడి మరియొకతెను వివాహమాడువాడు వ్యభిచారియగును” అని యేసు ప్రత్యుత్తర మిచ్చెను.
10. అపుడు శిష్యులు, “భార్య, భర్తల సంబంధము ఇట్టిదైనచో వివాహమాడకుండుటయే మేలుతరము” అనిరి.
11. అందుకు యేసు “దైవానుగ్రహము కలవారికేగాని మరెవ్వరికిని ఇది సాధ్యపడదు.
12. కొందరు పుట్టుకతోనే నపుంసకులుగా పుట్టుచున్నారు. మరికొందరు పరులచే నపుంసకులుగా చేయబడు చున్నారు. పరలోకరాజ్యము నిమిత్తమై తమకు తాము నపుంసకులు అయిన వారును కొందరున్నారు. గ్రహింపగలిగినవాడు గ్రహించునుగాక!” అని పలికెను.
13. ఆ సమయమున కొందరు తమ బిడ్డలపై చేతులు చాచి ప్రార్థింపుమని యేసువద్దకు తీసికొని రాగా, శిష్యులు వారిని ఆటంకపరచిరి.
14. “చిన్న బిడ్డలను నాయొద్దకు రానిండు. వారలను ఆటంక పరుపకుడు. ఏలయన, అట్టివారిదే పరలోక రాజ్యము” అని పలికి,
15. వారిమీద చేతులుంచి యేసు అచట నుండి వెడలిపోయెను.
16. అంతట ఒక యువకుడు యేసును సమీపించి, “బోధకుడా! నిత్యజీవము పొందుటకు నేను చేయ వలసిన మంచిపనియేమి?” అని ప్రశ్నించెను.
17. “మంచిని గూర్చి నన్నేల ప్రశ్నించెదవు? మంచివాడు ఒక్కడే. నిత్యజీవము పొందగోరినచో దైవాజ్ఞలను ఆచరింపుము” అని యేసు సమాధానమిచ్చెను.
18. “ఆ దైవాజ్ఞలు ఏవి?” అని అతడు తిరిగి ప్రశ్నించెను. అందుకు యేసు, “నరహత్య చేయకుము. వ్యభిచరింపకుము. దొంగిలింపకుము. అబద్దసాక్ష్యములు పలుక కుము.
19. తల్లితండ్రులను గౌరవింపుము. నిన్ను నీవు ప్రేమించుకొనునట్లే నీ పొరుగువానిని నీవు ప్రేమింపుము” అనెను.
20. అంతట అతడు యేసుతో "ఇవియన్నియు ఆచరించుచుంటిని. ఇంకను నాకు లోటు ఏమి?” అని అడిగెను.
21. నీవు పరిపూర్ణుడవు కాగోరినచో, వెళ్ళి నీ ఆస్తిని అమ్మి, భీదలకు దానము చేయుము. అపుడు పరలోకమందు నీకు ధనము కలుగును. పిమ్మట నీవు వచ్చి నన్ను అనుసరింపుము” అని ఆయన సమాధానమిచ్చెను.
22. ఆ యువకుడు అధిక సంపదగలవాడగుటచే, ఈ మాట విని బాధతో వెళ్ళిపోయెను.
23. అంతట యేసు తన శిష్యులతో, “ధనవంతుడు పరలోకరాజ్యమున ప్రవేశించుట కష్టము.
24. ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటె, ఒంటె సూది బెజములో దూరిపోవుట సులభతరము అని మరల మీతో రూఢిగా చెప్పుచున్నాను” అనెను.
25. శిష్యులు ఈ మాటలువిని మిక్కిలి ఆశ్చర్యపడి, “అట్లయిన ఎవడు రక్షణము పొందగలడు?” అనిరి.
26. అందుకు యేసు వారిని ఆదరముతో చూచి వారితో, “మానవులకు ఇది అసాధ్యము. కాని దేవునికి సమస్తమును సాధ్యమే” అని పలికెను.
27. అపుడు పేతురు యేసుతో, “మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి. - మాకు ఏమి లభించును?” అనెను.
28. అందుకు యేసు వారితో “పునఃస్థితిస్థాపన సమయమున మనుష్యకుమారుడు తన మహిమాన్వితమైన సింహాసనమున ఆసీనుడై నపుడు, నన్ను అనుసరించిన మీరును పండ్రెండు ఆసనములపై కూర్చుండి, యిస్రాయేలు పండ్రెండు గోత్రములకు తీర్పుతీర్చెదరు.
29. నా నిమిత్తము గృహములనుగాని, సోదరులనుగాని, సోదరీలనుగాని, తల్లినిగాని, తండ్రినిగాని, పిల్లలనుగాని, భూములనుగాని త్యజించిన ప్రతివాడును నూరంతలు పొంది, నిత్య జీవమునకు వారసుడగును.
30. అయినను 'మొదటి వారు అనేకులు కడపటివారు అగుదురు, కడపటివారు మొదటివారు అగుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అనెను.
1. “పరలోకరాజ్యము ఈ ఉపమానమును పోలి యున్నది: ఒక యజమానుడు తన ద్రాక్షతోటలో పని చేయుటకు పనివారలకై ప్రాతఃకాలమున బయలు దేరెను.
2. అతడు రోజునకు ఒక దీనారము చొప్పున ఇచ్చెదనని కూలీలతో ఒప్పందము చేసికొని, వారిని తన తోటకు పంపెను.
3. తిరిగి ఆ యజమానుడు తొమ్మిదిగంటల' సమయమున బయటకు వెళ్ళి, అంగడి వీధిలో పనికొరకు వేచియున్న కొందరిని చూచి,
4. 'మీరు నా తోటకు వెళ్ళి పనిచేయుడు. న్యాయముగా రావలసిన వేతనమును ఇచ్చెదను' అనెను. వారు అటులనే వెళ్ళిరి.
5. తిరిగి పండ్రెండు గంటలకు, మరల మధ్యాహ్నం మూడుగంటలకు ఆ యజమానుడు అట్లే మరికొందరు పనివారిని పంపెను.
6. రమారమి సాయంకాలము ఐదుగంటల సమయమున వెళ్ళి, సంతవీధిలో ఇంకను నిలిచియున్నవారిని చూచి, 'మీరు ఏల రోజంతయు పనిపాటులు లేక ఇచట నిలిచియున్నారు?' అని ప్రశ్నించెను.
7. 'మమ్మేవ్వరు కూలికి పిలువలేదు' అని వారు ప్రత్యుత్త రమిచ్చిరి. అంతట ఆ యజమానుడు 'అటులైన మీరు కూడ నా ద్రాక్షతోటలో పనిచేయుటకు వెళ్ళుడు' అనెను.
8. సాయంత్రమున ఆ యజమానుడు తన గృహ నిర్వాహకునితో 'ద్రాక్షతోటలో పని చేసినవారిని పిలిచి, చివర వచ్చిన వారితో ప్రారంభించి, తొలుత వచ్చిన వారి వరకు వారివారి కూలినిమ్ము' అనెను.
9. అటులనే సాయంత్రము అయిదు గంటలకు పనిలో ప్రవేశించిన వారికిని తలకొక దీనారము లభించెను.
10. తొలుత పనిలో ప్రవేశించినవారు తమకు ఎక్కువ కూలి వచ్చునని తలంచిరి. కాని, వారుకూడ తలకొక దీనారమునే పొందిరి.
11. వారు దానిని తీసికొని, యజమానునితో
12. 'పగలంతయు మండుటెండలో శ్రమించి పనిచేసిన మాకును, చిట్టచివర ఒక గంట మాత్రమే పనిలో వంగినవారికిని, సమానముగా కూలి నిచ్చితివేమి'? అని గొణగుచు పలికిరి.
13. అంతట యజమానుడు వారిలో నొకనిని చూచి, 'మిత్రమా! నేను నీకు అన్యాయము చేయలేదు. దినమునకు ఒక దీనారము చొప్పున నీవు ఒప్పుకొనలేదా?
14. నీ కూలి నీవు తీసికొని పొమ్ము. నీకు ఇచ్చినంత కడపటి వానికిని ఇచ్చుట నా యిష్టము.
15. నా ధనమును నా యిచ్చవచ్చినట్లు వెచ్చించుకొను అధికారము నాకు లేదా? లేక నా ఉదారత నీకు కంటగింపుగానున్నదా?' అని పలికెను.
16. ఇట్లే మొదటివారు కడపటి వారగు దురు. కడపటివారు మొదటివారగుదురు” అని యేసు పలికెను.
17. యేసు యెరూషలేమునకు పోవుచు మార్గ మధ్యమున పన్నిద్దరు శిష్యులతో ఇట్లనెను:
18. “ఇదిగో! మనము ఇప్పుడు యెరూషలేమునకు పోవుచున్నాము. అచట మనుష్యకుమారుడు ప్రధానార్చకులకు, ధర్మశాస్త్ర బోధకులకు అప్పగింపబడును వారు ఆయనకు మరణదండన విధించి,
19. జనులకు అప్పగింతురు. వారు ఆయనను అవహేళలు మొనర్చి, కొరడాలతో కొట్టి, సిలువ వేయుదురు. కాని ఆయన మూడవదినమున లేపబడును.”
20. అంతట జెబదాయి కుమారుల తల్లి, తన కుమారులతో యేసు వద్దకు వచ్చి, మోకరించి, ఒక మనవి చేయబోగా,
21. “నీ కోరిక యేమి?” అని యేసు ఆమెను అడిగెను. అందుకు ఆమె, “నీ రాజ్య ములో నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపునను, ఒకడు నీ ఎడమ వైవునను కూర్చుండ సెలవిమ్ము" అని మనవిచేసెను.
22. అందులకు యేసు, “మీరు కోరినదేమియో మీరెరుగరు. నేను పానము చేయు పాత్రమునుండి మీరు పానము చేయగలరా?” అని పలుకగా, “చేయగలము” అని వారి రువురును సమాధానమిచ్చిరి.
23. అందుకు యేసు, “మీరు నా పాత్రమునుండి పానము చేసెదరు. కాని, నా కుడిఎడమల గూర్చుండ జేయునది నేను కాదు; నా తండ్రి యేర్పరచిన వారికే అది లభించును” అనెను.
24. తక్కిన పదుగురు శిష్యులు దీనిని వినినపుడు ఆ ఇద్దరు సోదరులపై కోపపడిరి.
25. యేసు శిష్యులను కూడబిలిచి వారితో ఇట్లనెను: “ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశముగా పరిపాలించుచున్నారు. పెద్దలు వారిపై అధికారము చెలాయించుచున్నారు. ఇది మీకు తెలియునుగదా!
26. కాని మీరు ఇట్లుండరాదు. మీలో ఎవడైనను గొప్పవాడు కాదలచిన, అతడు మీకు సేవకుడుగా ఉండవలయును.
27. మరియు మీలో ఎవడైనను ప్రథముడు కాదలచిన, అతడు మీకు దాసుడై ఉండ వలయును.
28. అట్లే మనుష్యకుమారుడు సేవించుటకే కాని సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్ధము తన ప్రాణమును ధార పోయుటకు వచ్చెను.”
29. యేసు యెరికోనుండి పయనమై పోవు చుండగా, మహాజనసమూహము ఆయనను వెంబడించెను.
30. యేసు ఆ మార్గమున పోవుచున్నాడని విని త్రోవ ప్రక్కన కూర్చుండిన ఇద్దరు గ్రుడ్డివారు, “ప్రభూ! దావీదు కుమారా! మాపై దయజూపుము” అని కేకలు వేసిరి.
31. జనసమూహము గ్రుడ్డివారిని “ఊరకుండుడు” అని కసరుకొనెను. కాని, వారు “దావీదు కుమారా! ప్రభూ! మమ్ము కరుణింపుము" అని మరింత బిగ్గరగా అరచిరి.
32. అపుడు యేసు నిలిచి, వారిని పిలిచి, “నేను మీకేమి చేయగోరు చున్నారు?” అని అడిగెను.
33. అంతట వారు "ప్రభూ! మాకు దృష్టిని దయచేయుడు” అని మనవి చేసికొనిరి.
34. యేసు కనికరించి వారి నేత్రములను తాకెను. వెంటనే వారు దృష్టిని పొంది, ప్రభువును వెంబడించిరి.
1. వారు యెరూషలేము సమీపించుచు, ఓలివు కొండ దగ్గరనున్న 'బెత్ఫగే' అను గ్రామము చేరిరి. యేసు తన శిష్యులను ఇద్దరిని పంపుచు వారితో,
2. “మీరు ఎదుటనున్న ఆ గ్రామమునకు వెళ్ళుడు. వెళ్ళిన వెంటనే మీరచట కట్టివేయబడియున్న ఒక గాడిదను, దాని పిల్లను చూచెదరు. వానిని విప్పి నాయొద్దకు తోలుకొని రండు.
3. ఎవడైనను మిమ్ము ఆక్షేపించిన యెడల, ప్రభువునకు వాటితో పనియున్నదని తెల్పుడు. వెంటనే అతడు వాటిని తోలుకొనిపోనిచ్చును” అని చెప్పెను.
4. ప్రవక్త పలికిన ప్రవచనము నెరవేరునట్లు ఇది జరిగెను.
5. “ఇదిగో! నీ రాజు నీయొద్దకు వచ్చుచున్నాడు. అతడు వినమ్రుడు. గాడిదపై భారవాహకమగు దాని పిల్లపై ఎక్కి వచ్చుచున్నాడు అని సియోను కుమార్తెతో చెప్పుడు.”
6. కాబటి శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి.
7. వారు ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటిపై తమ వస్త్రములను పరవగా యేసు వాటిపై కూర్చుండెను.
8. జన సమూహములో అనేకులు దారిపొడవున తమ వస్త్రములను పరచిరి. కొందరు చెట్ల రెమ్మలను నరికి మార్గమున పరచిరి.
9. యేసుకు ముందు వెనుక వచ్చుచున్న జనసమూహము "దావీదు కుమారా హోసన్న! ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక! సర్వోన్నతమున హోసన్న!” అని విజయధ్వానములు చేయుచుండెను.
10. ఆయన యెరూషలేము నగరము ప్రవేశించి నపుడు “ఈయన ఎవరో!” అని ప్రజలలో కలకలము కలిగెను.
11. “ఈయన గలిలీయలోని నజరేతునుండి వచ్చిన ప్రవక్తయగు యేసు” అని ఆ జనసమూహము పలికెను.
12. అంతట యేసు దేవాలయములో ప్రవే శించి, క్రయవిక్రయములను చేయువారిని బయటికి వెడలగొట్టి, రూకలు మార్చు వారి బల్లలను, పావురములను అమ్మువారి పీటలను పడద్రోసి,
13. “ 'నా ఆలయము ప్రార్ధనాలయము అన బడును' అని వ్రాయబడియున్నది. కాని, మీరు దానిని దొంగల గుహగా చేయుచున్నారు” అనెను.
14. గ్రుడ్డివారు, కుంటివారును దేవాలయ ములో ఆయనవద్దకు రాగా ఆయనవారిని స్వస్థపర చెను.
15.ఆయన చేయుచున్న ఆశ్చర్యకరమైన పనులను, "దావీదు కుమారునకు హోసన్న!” అని దేవాలయములో నినాదముచేయుచున్న పిల్లలను చూచి, ప్రధానార్చ కులు, ధర్మశాస్త్ర బోధకులు కోపముతో మండిపడి,
16. “వీరి మాటలు వినుచున్నావా?" అనియేసును అడుగగా, "అవును, వినుచున్నాను. . 'నీవు పిల్లలనోట, పసిపిల్లలనోట స్తుతులు వెలువరింపజేసితివి' అనునది మీరు ఎన్నడును చదువలేదా?” అని యేసు వారికి సమాధానమిచ్చెను.
17. అంతట యేసు వారిని వీడి, ఆ పట్టణమునుండి బెతానియాకు వెళ్ళి అచట ఆ రాత్రి గడిపెను.
18. మరునాటి ఉదయమున ఆయన పట్టణమునకు తిరిగి వచ్చుచుండగా ఆకలిగొనెను.
19. ఆ త్రోవప్రక్క నున్న అంజూరపు చెట్టును చూచి, దానిని సమీపించి, దానికి ఆకులు తప్ప మరేమియు లేకుండుట చూచి, “నీవు ఎన్నటికి ఫలింపకుందువు గాక!” అని శపించెను. తక్షణమే అది ఎండిపోయెను.
20. శిష్యులు అదిచూచి, “ఈ అంజూరపు చెట్టు ఇంతలో ఎంత త్వరగా ఎండిపోయెను!” అని ఆశ్చర్య పడిరి.
21. అందుకు యేసు వారితో, “అనుమానింపక విశ్వసించినయెడల ఈ అంజూరపు చెట్టుకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ పర్వతమును సహితము 'నీవు లేచి సముద్రమున పడుము' అని పలికినయెడల అది అటులనే జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
22. మీకు విశ్వాసమున్నయెడల మీరు ప్రార్థనలో ఏమి అడిగినను దానిని పొందుదురు” అనెను.
23. ఇట్లు చెప్పి, యేసు దేవాలయమున ప్రవేశించి బోధించుచుండగా, ప్రధానార్చకులు పెద్దలు వచ్చి "ఏ అధికారముతో నీవు ఈ పనులు చేయు చుంటివి? నీకు ఈ అధికారమిచ్చిన వాడెవడు?” అని ఆయనను ప్రశ్నించిరి.
24. అందుకు యేసు “నేను కూడ మిమ్ము ఒకమాట అడిగెదను. దానికి మీరు సమాధానమిచ్చినయెడల నేను ఏ అధికారముతో ఈ పనులు చేయుచున్నానో మీకు చెప్పెదను.
25. యోహాను బప్తిస్మము ఎచట నుండి వచ్చినది? పరలోకము నుండియా? లేక మానవుని నుండియా?” అని తిరిగి ప్రశ్నించెను. అంతట వారు తమలో తాము ఇట్లు తర్కించుకొనిరి: “పరలోకము నుండి వచ్చెను అని సమాధానమిచ్చితిమా! 'అటులయిన మీరేల ఆయనను విశ్వసింపలేదు?' అనును.
26. లేదా, 'మానవులనుండి' అని చెప్పితిమా! ప్రజలందరును యోహానును ప్రవక్తగా భావించుచున్నారు. వారి వలన మనకేమి ముప్పుకలుగునో” అని భయపడి,
27. “అది మాకు తెలియదు” అని పలికిరి. అపుడు ఆయన వారితో “అట్లయిన, ఏ అధికారముతో ఈ పనులు చేయుచుంటినో నేనును చెప్పను” అనెను.
28. “ఒకనికి ఇద్దరు కుమారులుండిరి. అతడు పెద్దవానితో, 'కుమారా! నేడు నీవు మన ద్రాక్షతోట లోనికి పోయి పనిచేయుము' అని చెప్పగా,
29. మొదట అతడు'వెళ్ళుట నాకిష్టము లేదు' అని చెప్పినను, పిమ్మట తన మనస్సు మార్చుకొని వెళ్ళెను.
30. తరువాత తండ్రి రెండవ కుమారునితో అట్లే చెపెను అపుడు అతడు 'నేను వెళ్ళుచున్నాను' అని చెప్పియు వెళ్ళలేదు.
31. ఆ యిద్దరు కుమారులలో తండ్రి ఆజ్ఞను పాటించినదెవరు?” అని ఆయన వారిని ప్రశ్నింపగా “మొదటివాడు” అని సమాధానము ఇచ్చిరి. అపుడు యేసు వారితో, “సుంకరులును, జారిణులును మీ కంటెను ముందు దేవునిరాజ్యములో ప్రవేశింపబోవు చున్నారు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
32. యోహాను మీకు నీతిమార్గము చూపుటకు వచ్చెను కాని, మీరతనిని విశ్వసింపరైతిరి. సుంకరులు, జారిణులు అతనిని విశ్వసించిరి. అది చూచియు మీరు హృదయపరివర్తనము చెంది అతనిని నమ్మరైతిరి” అని పలికెను.
33. “మరియొక ఉపమానమును ఆలకింపుడు. యజమానుడొకడు ద్రాక్షతోటను నాటించి, చుట్టు కంచెవేయించెను. గానుగ కొరకు గోతిని త్రవ్వించి, గోపురము కట్టించి, కాపులకు కౌలుకిచ్చి దూర దేశమునకు వెడలెను.
34. ద్రాక్షపండ్లు కోతకు వచ్చినపుడు, తన భాగమును తెచ్చుటకై కౌలుదార్ల యొద్దకు తన సేవకులను పంపెను.
35. కాని, వారు యజమానుని సేవకులను పట్టుకొని ఒకనిని కొట్టిరి; ఒకనిని చంపిరి; మరియొకనిని రాళ్ళదెబ్బలకు గురి చేసిరి.
36. అపుడు ఆ యజమానుడు ముందటి కంటె ఎక్కువమంది సేవకులను పంపెను. కౌలుదార్లు వారిని కూడ అటులనే చేసిరి.
37. అప్పుడు ఆ యజమానుడు తన కుమారుని వారు అంగీకరింతురని తలంచి, అతనిని వారి యొద్దకు పంపెను.
38. అపుడు ఆ కౌలుదార్లు ఆ కుమారుని చూచి 'ఇదిగో ఇతడే వారసుడు. ఇతనిని తుదముట్టింతము రండు. ఈ ఆస్తి మనకు దక్కును', అని తమలో తాము చెప్పుకొని,
39. వానిని పట్టుకొని ద్రాక్షతోట వెలుపల పడద్రోసి చంపిరి.
40. “కాబట్టి, ద్రాక్షతోట యజమానుడు వచ్చినపుడు ఆ కౌలుదార్లను ఏమిచేయును?" అని యేసు ప్రశ్నించెను.
41. “ఆ దుషులను మట్టుపెట్టి, కోతకాలమున తన భాగమును చెల్లింపగల కౌలుదార్లకు ఆ భూమిని గుత్తకిచ్చును” అని వారు సమాధానమిచ్చిరి.
42. అపుడు యేసు వారితో, “మీరు లేఖనములందెన్నడు చదువలేదా? 'ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి ఆయెను. ఇది ప్రభువు ఏర్పాటు. - ఇది ఎంత ఆశ్చర్యకరము!'
43. అందువలన దేవుని రాజ్యము మీనుండి తొలగింపబడి తగిన ఫలములనిచ్చువారికి ఈయ బడునని నేను మీతో చెప్పుచున్నాను.
44. ఎవడు ఈ రాతిమీదపడునో, వాడు తునాతునకలగును. ఎవనిపై ఈ రాయిపడునో, వాడు నలిగి నుగ్గగును” అనెను.
45. ప్రధానార్చకులు, పరిసయ్యులు, యేసు ఉపమానములను విని, ఇవన్నియు తమను గూర్చియే అని గ్రహించిరి.
46. వారు ఆయనను బందీగా పట్టుటకు ప్రయత్నించిరి. కాని, యేసు ప్రవక్తయని భావించిన జనసమూహములకు భయపడిరి.
1. యేసు ప్రజలకు మరల ఉపమాన రీతిగా ప్రసంగింప ఆరంభించెను.
2. "పరలోక రాజ్యము ఇట్లున్నది: ఒక రాజు తన కుమారుని పెండ్లికి విందును సిద్ధపరచి,
3. ఆహ్వానింపబడిన వారిని 'విందుకు బయలుదేరిరండు' అని చెప్పుటకు తన సేవకులను పంపెను. కాని, వారు వచ్చుటకు నిరాకరించిరి.
4. అందుచే అతడు, 'ఇదిగో! నా విందు సిద్ధపరుపబడినది. ఎద్దులును, క్రొవ్వినదూడలును వధింపబడినవి. అంతయు సిద్ధముగా ఉన్నది. కనుక విందుకు రండు' అని మరియొకమారు వారితో చెప్పుడని మరికొందరు సేవకులను పంపెను.
5. కాని పిలువబడినవారు దానిని లక్ష్యపెట్టక, తమ తమ పనులకు పోయిరి. ఒకడు తన పొలమునకు, మరియొకడు తన వ్యాపారమునకు వెళ్ళెను.
6. తక్కినవారు అతని సేవకులను పట్టుకొని కొట్టిచంపిరి.
7. అపుడు ఆ ప్రభువు మండిపడి తన సైన్యమును పంపి ఆ హంతకులను హతమార్చి వారి పట్టణమును తగుల బెట్టించెను.
8. అంతట, తన సేవకులను పిలిచి, 'నా విందు సిద్ధముగా ఉన్నది. కాని, నేను ఆహ్వానించిన వారు దానికి యోగ్యులు కారు.
9. ఇప్పుడు మీరు వీధి మార్గములకు పోయి, కనపడిన వారినందరిని పిలుచుకొనిరండు' అని పంపెను.
10. ఆ సేవకులు పురవీధుల లోనికి వెళ్ళి, మంచి, చెడు తేడా లేక తమ కంటబడిన వారినందరను తీసుకొనివచ్చిరి. ఆ కల్యాణమండపము అతిథులతో నిండెను.
11. అతిథులను చూచుటకు రాజు లోనికి వెళ్ళి, వివాహవస్త్రములేని వానిని ఒకనిని చూచి,
12. 'మిత్రమా! వివాహవస్త్రము లేకయే నీవిచటికి ఎట్లు వచ్చితివి?” అని అతనిని ప్రశ్నించెను. అందుకు అతడు మౌనము వహించియుండెను.
13. అపుడు ఆ రాజు తన సేవకులతో, 'ఇతనిని కాలుసేతులు కట్టి వెలుపల నున్న చీకటిలోనికి త్రోసివేయుడు. అచట జనులు విలపించుచు పండ్లు కొరుకుకొందురు' అనెను.
14. పిలువబడిన వారు అనేకులు, కాని, ఎన్నుకొనబడిన వారు కొందరే."
15. పరిసయ్యులంతట వెలుపలికి వెళ్ళి, యేసును మాటలలో చిక్కించుకొనవలెనని పన్నుగడపన్ని,
16. హేరోదీయులతో తమ శిష్యులను కొందరను ఆయన వద్దకు పంపిరి. వారు వెళ్ళి “బోధకుడా! నీవు సత్య వంతుడవు; దేవుని మార్గమును గూర్చిన వాస్తవమును బోధించువాడవు; ఎవరికిని భయపడవు; మోమో టము లేనివాడవు;
17. చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయసమ్మతమా? కాదా? నీ అభిప్రాయమేమి?" అని అడిగిరి.
18. యేసు వారి దురాలోచనలను గుర్తించి, “వంచకులారా! నన్ను ఏల పరీక్షించుచున్నారు?
19. సుంకము చెల్లించు నాణెమును నాకు చూపుడు” అని అడుగగా, వారొక దీనారమును ఆయనకు అందించిరి.
20. ఆయన వారిని “ఈ రూపనామధేయ ములు ఎవరివి?” అని ప్రశ్నింపగా,
21. “చక్రవర్తివి” అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. “మంచిది. చక్రవర్తివి చక్రవర్తికి, దేవునివి దేవునకు చెల్లింపుడు” అని ఆయన వారితో చెప్పెను.
22. ఇది విని, వారు ఆశ్చర్యపడి ఆయనను వీడి అటనుండి వెడలిపోయిరి.
23. ఆ రోజుననే మృతులకు పునరుత్థానము లేదను కొందరు సదూకయ్యులు యేసు వద్దకు వచ్చి,
24. “బోధకుడా! 'ఒకడు సంతానము లేక మర ణించిన, వాని సోదరుడు ఆ వితంతువును పెండ్లాడి అతనికి సంతానము కలుగజేయవలెను.' అని మోషే ఉపదేశించెను గదా!
25. మాలో ఏడుగురు సహోదరులుండిరి. మొదటివాడు పెండ్లాడి చనిపోయెను. అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను చేసికొనెను.
26. ఇదే రీతి రెండవ వానికి, మూడవవానికి వరుసగా ఏడవవాని వరకు సంభవించెను.
27. తుట్టతుదకు ఆమెయు మరణించెను.
28. వారందరును ఆమెను వివాహమాడిరి. అట్లయిన పునరుత్థానమందు ఆమె వారిలో ఎవరి భార్య అగును?” అని ప్రశ్నించిరి.
29. అందుకు యేసు, “లేఖనములనుగాని, దేవుని శక్తినిగాని ఎరుగక మీరు పొరబడుచున్నారు.
30. ఏలయన, పునరుత్థాన మందు స్త్రీ పురుషుల మధ్య వివాహములు ఉండవు. వారు పరలోకమందలి దూతలవలె ఉందురు.
31. మృతుల పునరుత్థానమును గూర్చి దేవుడు ఏమి సెలవిచ్చెనో, మీరు ఎన్నడును చదువలేదా?
32. “ 'నేను అబ్రహాము దేవుడను, ఈసాకుదేవుడను, యాకోబుదేవుడను' అని ఆయన పలికెనుగదా! ఆయన సజీవులకే దేవుడుకాని, మృతులకు దేవుడు కాదు” అని సమాధానమిచ్చెను.
33. జనసమూహములు ఆ మాటలువిని ఆయన ఉపదేశమునకు ఆశ్చర్యపడిరి.
34. యేసు సద్దూకయ్యుల నోరు మూయించెనని పరిసయ్యులు విని, వారు అచటికి కూడి వచ్చిరి.
35. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ఆయనను పరీక్షింపవలెనని,
36. “బోధకుడా! ధర్మశాస్త్రము నందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది?” అని అడిగెను.
37. అందుకు యేసు ప్రత్యుత్తరముగా "నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణహృదయముతోను, పూర్ణాత్మ తోను, పూర్ణమనస్సుతోను ప్రేమింపవలెను.”
38. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ.
39. 'నిన్ను నీవు ప్రేమించు కొనునట్లు నీ పొరుగువానిని ప్రేమింపవలెను' అను రెండవ ఆజ్ఞయు ఇట్టిదే.
40. మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ఉపదేశములు అన్నియు ఈ రెండాజ్ఞల పైననే ఆధారపడియున్నవి” అని సమాధానమిచ్చెను.
41. పరిసయ్యులందరు ఒక్కుమ్మడిగా వచ్చిన పుడు యేసు వారిని,
42. "క్రీస్తును గూర్చి మీరేమి తలంచుచున్నారు? ఆయన ఎవరి కుమారుడు?” అని ప్రశ్నించెను. “ఆయన దావీదు కుమారుడు” అని వారు సమాధానమిచ్చిరి.
43. “అట్లయిన దావీదు పవిత్రాత్మ ప్రేరణతో ఆయనను 'ప్రభువు' అని ఏల సంబోధించెను?
44. 'నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచువరకు నీవు నా కుడిప్రక్కన కూర్చుండుము అని ప్రభువు నా ప్రభువుతో పలికెను.” ఇవి దావీదు పలుకులు గదా!
45. క్రీస్తును తన ప్రభువు అని సంబోధించిన దావీదునకు అతడు కుమారుడు ఎట్లగును?” అని యేసు వారిని ప్రశ్నించెను.
46. అందుకు ప్రత్యుత్తరముగా ఎవడును ఒక్కమాటైనను పలుకలేదు. ఆ దినమునుండి ఆయనను ఎవరును, ఏమియును అడుగుటకు సాహసింపలేదు.
1. అప్పుడు యేసు జనసమూహములతోను, తన శిష్యులతోను ఇట్లనెను:
2. "ధర్మశాస్త్ర బోధకులును, పరిసయ్యులును మోషే ధర్మాసనమున కూర్చొని ఉన్నారు.
3. కాబట్టి వారి క్రియలనుగాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు. ఏలయన వారు బోధించునది వారే ఆచరింపరు.
4. వారు మోయ సాధ్యముకాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కాని ఆ భారములను మోయువారికి సాయపడుటకు తమ చిటికెనవ్రేలైనను కదపరు.
5. తమ పనులెల్ల ప్రజలు చూచుటకై చేయుదురు. ధర్మసూత్రములను వారు మైదాల్పులుగా ధరింతురు. అంగీయంచులు పొడవు చేసికొందురు.
6. విందుల యందు అగ్రస్థానములను, ప్రార్థనా మందిరముల యందు ప్రధానాసనములను కాంక్షింతురు.
7. అంగడి వీధులలో వారు వందనములను అందుకొనుటకును, 'బోధకుడా,” అని పిలిపించు కొనుటకును తహతహ లాడుదురు.
8. మీరు 'బోధకులు' అని పిలిపించు కొనవలదు. ఏలయన, మీకు బోధకుడు ఒక్కడే. మీరందరు సోదరులు.
9. ఈ లోకమున మీరు ఎవ్వరిని గాని 'తండ్రీ' అని సంబోధింపవలదు. మీ తండ్రి ఒక్కడే. ఆయన పరలోకమందున్నాడు.
10. మీరు 'గురువులు' అని పిలిపించుకొనవలదు. ఏలయన క్రీస్తు ఒక్కడే మీ గురువు.
11. మీ అందరిలో గొప్ప వాడు మీకు సేవకుడైయుండవలయును.
12. తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును. తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. యేసు ధర్మశాస్త్ర బోధకులను, - పరిసయ్యులను గద్దించుట
13. “వంచకులయిన ధర్మశాస్త్ర బోధకులారా! పరిసయ్యులారా! మీరు మనుష్యులయెదుట పరలోక ద్వారమును మూసివేయుచున్నారు. మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశింప ప్రయత్నించువారిని ప్రవే శింపనీయరు.
14. అయ్యో! కపట భక్తులైన ధర్మశాస్త్రి పదేశకులారా! పరిసయ్యులారా! మీరు పరులు చూడ వలెనని దీర్ఘజపములు జపించుచు, వితంతువుల యిండ్లను దోచుకొనుచున్నారు. కావున కఠిన శిక్షకు గురియగుదురు.
15. అయ్యో! కపట భక్తులైన ధర్మ శాస్తోపదేశకులారా! పరిసయ్యులారా! మీరు ఒకనిని మీ మతములో కలుపుకొనుటకు సముద్రములు దాటి ఎన్నోదేశములు చుట్టివత్తురు. అది సఫలమైన పిదప, మీకంటె రెండింతలుగా నరకముపాలు చేయుదురు.
16. “అయ్యో! అంధులైన మార్గదర్శకులారా! యా కట్టువడియుండనక్కరలేదనియు, దేవాలయమందున్న బంగారముతో ఒట్టుపెట్టిన అతడు దానికి కట్టుబడి యుండవలయుననియు మీరు బోధింతురు.
17. అంధులైన అవివేకులారా! బంగారము గొప్పదియా? బంగారమును పవిత్రముచేయు దేవాలయము గొప్ప దియా?
18. ఒకడు బలిపీఠముతో ఒట్టు పెట్టుకొనిన అతడు దానికి కట్టువడియుండనవసరములేదనియు, బలిపీఠముపై ఉన్న నైవేద్యము తోడని ప్రమాణము చేసిన అతడు దానికి కట్టువడియుండవలెననియు మీరు ఉపదేశింతురు.
19. మీరు ఎంత గ్రుడ్డివారు! నైవేద్యము గొప్పదియా? లేక నైవేద్యమును పవిత్ర పరచు బలిపీఠము గొప్పదియా?
20. బలిపీఠము తోడని ప్రమాణము చేయువాడు దానితోను, దాని పైనున్న నైవేద్యములన్నిటితోను ప్రమాణము చేయు చున్నాడు.
21. దేవాలయము తోడని ప్రమాణము చేయువాడు ఆ దేవాలయముతోను, దానియందు నివసించు వానితోను ప్రమాణము చేయుచున్నాడు.
22. పరలోకముతోడని ప్రమాణము చేయువాడు దేవుని సింహాసనముతోను, దానిపై ఆసీనుడగు దేవునితోను ప్రమాణము చేయుచున్నాడు.
23. “అయ్యో! మోసగాండ్రయిన ధర్మశాస్త్ర బోధకులారా! పరిసయ్యులారా! మీరు పుదీనా, సోంపు, జీలకఱ్ఱ మొదలగు వానిలో గూడ పదియవవంతును చెల్లించుచున్నారు. కాని, ధర్మశాస్త్రమునందలి అతి ప్రధానమైన చట్టమును, న్యాయమును, దయను, విశ్వాసమును నిర్లక్ష్యము చేయుచున్నారు. వానిని చెల్లింపవలసినదే కాని, వీనిని ఏ మాత్రము నిర్లక్ష్యము చేయరాదు.
24. అంధులైన మార్గదర్శకులారా! మీరు వడబోసి దోమను తీసివేసి, ఒంటెను దిగమ్రింగు చున్నారు.
25. “అయ్యో! వంచకులయిన ధర్మశాస్త్ర బోధకు లారా! పరిసయ్యులారా! మీరు గిన్నెను, పళ్ళెమును బాహ్యశుద్ది చేయుదురు గాని, మీ అంతరంగము పూర్తిగా దౌర్జన్యముతోను, దురాశతోను నిండి యున్నది.
26. గ్రుడ్డి పరిసయ్యుడా! గిన్నెయు పళ్ళెమును వెలుపలకూడ శుద్ధియగునట్లు ముందు వాని లోపల శుద్ధిచేయుము.
27. అయ్యో! కపట భక్తులైన ధర్మశాస్త్రపదేశ కులారా! పరిసయ్యులారా! మీరు సున్నముకొట్టిన సమాధులవలె ఉన్నారు. అది బయటకు అందముగా ఉన్నను, లోపల మృతుల ఎముకలతోను, దుర్గంధ పదార్దముతోను నిండియుండును.
28. అటులనే మీరును బయటకు నీతిమంతులవలె కని పెట్టినను, లోపల కపటముతోను, కలుషముతోను నిండియున్నారు.
29. “అయ్యో! కపట భక్తులైన ధర్మశాస్త్రాపుదేశకులారా! పరిసయ్యులారా! మీరు ప్రవక్తలకు సమాధులను, నీతిమంతులకు చక్కని స్మారక చిహ్నములను నిర్మింతురు.
30. 'మా పితరుల కాల మందు మేము జీవించియున్నయెడల ప్రవక్తలను చంపుటలో మేము వారితో భాగస్థులమై ఉండెడి వారము కాము' అని మీరు చెప్పుదురు.
31. వాస్తవముగా ప్రవక్తలను చంపిన వారి వారసులమని మీకు మీరే రుజువుచేసికొనుచున్నారు.
32. కావున మీ పూర్వులు ప్రారంభించిన పనిని పూర్తిచేయుడు.
33. సర్పములారా! సర్పసంతానమా! నరక శిక్షనుండి మీరు ఎట్లు తప్పించుకొనగలరు?
34. అందుచేత ఇదిగో! నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, ధర్మశాస్త్ర బోధకులను పంపుచున్నాను. వారిలో కొందరిని మీరు చంపెదరు, కొందరిని సిలువ వేసెదరు, మరికొందరిని మీ ప్రార్థనా మందిరములలో కొరడాలతో కొట్టించి, ఒక పట్టణమునుండి మరియొక పట్టణమునకు తరిమెదరు.
35. దీని ఫలితముగా నీతిమంతుడగు హేబెలు హత్య మొదలుకొని, ఆలయమునకు, బలి పీఠమునకు మధ్య మీరు గావించిన బరాకియా కుమారుడగు జెకర్యా హత్యవరకును, చిందించిన నీతిమంతుల రక్తాపరాధము మీపై పడును.
36. వీటన్నిటికిగాను ఈ తరము వారు శిక్షను అనుభవించి తీరుదురని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను”.
37. "ఓ యెరూషలేమా! యెరూషలేమా! నీవు ప్రవక్తలను చంపి, దేవుడు పంపిన ప్రతినిధులపై రాళ్ళు రువ్వుచున్నావు. కోడి రెక్కలు చాపి తన పిల్లలను ఆదుకొనునట్లు, నేను ఎన్ని పర్యాయములు నీ పిల్లలను చేరదీయగోరినను, నీవు అంగీకరింపకపోతివి.
38. ఇదిగో! నీ గృహము నిర్మానుష్యమగును.
39. “ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక!' అని సన్ను తించువరకు నీవు నన్ను చూడజాలవు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”
1. యేసు దేవాలయమునుండి వెళ్ళుచుండగా, ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపింపవచ్చిరి.
2. “వీటిని అన్నిటిని మీరు చూచుచున్నారుగదా! ఇది రాతిపై రాయి నిలువకుండ పడగొట్టబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అని యేసు పలికెను.
3. ఓలివు కొండపై యేసు కూర్చుండియుండగా ఆయన వద్దకు శిష్యులు ఏకాంతముగా వచ్చి "ఇవి అన్నియు ఎప్పుడు సంభవించును? నీ రాకకు, లోకాంతమునకు సూచనయేమి?” అని అడిగిరి.
4. యేసు వారికిట్లు ప్రత్యుత్తరమిచ్చెను: “మిమ్ము ఎవ్వరు మోసగింపకుండునట్లు మెలకువతో ఉండుడు.
5. అనేకులు నా పేరట వచ్చి 'నేనే క్రీస్తును' అని ఎందరినో మోసగింతురు.
6. మీరు యుద్ధములను గూర్చియు, వాటికి సంబంధించిన వార్తలనుగూర్చియు విందురు. కాని కలవరపడవలదు. ఇవి అన్నియు జరిగితీరును. కాని అంతలోనే అంతము రాదు.
7. ఒక జాతి మరియొక జాతిపై, ఒక రాజ్యము మరియొక రాజ్యముపై దాడిచేయును. అనేక ప్రదేశము లందు కరువులు, భూకంపములు వచ్చును.
8. ఇవి అన్నియు ప్రసవవేదన ప్రారంభసూచనలు.
9. అపుడు జనులు మిమ్ము శ్రమలపాలు చేసి చంపుదురు. నా నిమిత్తము అందరు మిమ్ము ద్వేషింతురు.
10. ఆ దినములలో అనేకులు పతనమగుదురు. ఒకరి నొకరు మోసగించుకొందురు, ద్వేషించుకొందురు.
11. కపట ప్రవక్తలు అనేకులు బయలుదేరి, ఎందరినో మోసగింతురు.
12. అక్రమములు ఇంతగా విస్తరి ల్లుటచే అనేకుల ప్రేమ చల్లారును.
13. కట్టకడవరకు నిలకడగా ఉన్నవాడే రక్షణము పొందగలడు.
14. రాజ్యమును గూర్చిన ఈ సువార్త సర్వజాతులకు సాక్ష్య ముగా ప్రపంచమంతట ప్రబోధింపబడును. అపుడు అంతము వచ్చును.
15. "ప్రవక్తయగు దానియేలు వచించిన భయంకర వినాశమును పరిశుద్ధ స్థలమందు నిలిచియుండుట మీరు చూచెదరు. (దీనిని చదువరి గ్రహించుగాక!)
16. అపుడు యూదయా సీమలో ఉన్నవారు పర్వతములకు పారిపోవలయును.
17. మిద్దెపైనున్నవారు తమసామగ్రిని తీసికొనుటకు క్రిందకు దిగి రాకూడదు.
18. పొలములో పనిచేయువాడు తన పై వస్త్రమును తీసికొనుటకు వెనుకకు మరలిపోరాదు.
19. గర్భిణు లకు, బాలెంతలకు ఆ రోజులలో ఎంత బాధ?!
20. మీ పలాయనము శీతకాలమునందైనను విశ్రాంతి దినమునందైనను కాకుండునట్లు ప్రార్ధింపుడు.
21. ప్రపంచ ప్రారంభమునుండి ఇప్పటివరకు లేనట్టియు, ఇక ముందెన్నడును రానట్టియు మహోపద్రవము అప్పుడు సంభవించును.
22. దేవుడు ఆ దినముల సంఖ్యను తగ్గింపకున్నచో ఎవడును జీవింపడు. కాని ఎన్నుకొనబడిన వారి నిమిత్తము అవి తగ్గింపబడును.
23. అప్పుడు మీలో ఎవడైనను “ఇదిగో! క్రీస్తు ఇక్కడ ఉన్నాడు” లేక “అక్కడ ఉన్నాడు” అని చెప్పినను మీరు నమ్మవద్దు.
24. కపటక్రీస్తులు, కపట ప్రవక్తలు బయలుదేరి సాధ్యమయినయెడల దేవుడు ఎన్నుకొనిన వారిని సైతము మోసగించుటకు గొప్ప మహత్కార్య ములను, వింతలను చేయుదురు.
25. ఇదిగో! నేను ముందుగానే మీకు తెలియజేసితిని.
26. అతడు ఎడారియందు ఉన్నాడని చెప్పినను మీరు పోవలదు. రహస్యస్థలమందున్నాడని చెప్పినను మీరు నమ్మవలదు.
27. ఏలయన, మనుష్యకుమారుని రాకడ తూర్పు నుండి పడమటి వరకు మెరుపు మెరసినట్లుండును.
28. కళేబరము ఎచట ఉండునో అచటికి రాబందులు చేరును.
29. “ఆ రోజుల మహావిపత్తు గడిచిన వెంటనే సూర్యుడు అంధకారబంధురుడగును, చంద్రుడు కాంతి హీనుడగును, అంతరిక్షమునుండి నక్షత్రములు రాలును, అంతరిక్ష శక్తులు కంపించును.
30. అపుడు ఆకాశమందు మనుష్యకుమారుని చిహ్నము పొడగట్టును. భూమియందలి సర్వజాతుల వారు ప్రలాపింతురు. మనుష్యకుమారుడు శక్తితోను, మహామహిమతోను అంతరిక్షమున మేఘారూఢుడై వచ్చుట వారు చూతురు.
31. ఆయన తన దూతలను పెద్ద బూరధ్వనితో పంపును. వారు ఆయన ఎన్ను కొనిన వారిని నలుదెసలనుండి ప్రోగుచేయుదురు.
32. “అంజూరపు చెట్టు నుండి ఈ గుణపాఠము నేర్చుకొనుడు: దాని రెమ్మలు లేతవై చిగురించినపుడు వసంతకాలము వచ్చినదని మీరు గుర్తింతురు.
33. ఇట్లే వీనిని అన్నింటిని మీరు చూచునపుడు ఆయన సమీపముననే ద్వారమువద్ద ఉన్నాడని గ్రహింపుడు.
34. ఇవి అన్నియు నెరవేరునంతవరకు ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
35. భూమ్యాకాశములు గతించిపోవును గాని నా మాటలు ఎన్నడును గతించిపోవు.
36. “ఆ దినము ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందలి దూతలుగాని, కుమారుడుగాని, మరెవ్వరునుగాని ఎరుగరు.
37. నోవా దినములయందు ఎట్లుండెనో, అటులనే మనుష్య కుమారుని రాకడయు ఉండును.
38. జలప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించువరకు జనులు తినుచు, త్రాగుచు, వివాహమాడుచుండిరి.
39. జల ప్రళయము ముంచెత్తి వారిని కొట్టుకొనిపోవువరకు వారు ఎట్లు ఎరుగకుండిరో, అట్లే మనుష్యకుమారుని రాకడయు ఉండును.
40. ఆ సమయమున ఇరువురు పొలములో పనిచేయుచుండ ఒకడు కొనిపోబడును, మరియొకడు విడిచిపెట్టబడును.
41. ఇద్దరు స్త్రీలు తిరుగలి త్రిప్పుచుండగా, ఒకతె కొనిపోబడును, మరియొకతె విడిచిపెట్టబడును.
42. కనుక మీరు జాగరూకులై యుండుడు. ఏలయన, మీ ప్రభువు ఏ దినమున వచ్చునో మీరు ఎరుగరు.
43. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానునికి తెలిసినయెడల అతడు మేల్కొనియుండి, తన ఇంటికి కన్నము వేయనీయడు.
44. కనుక, మీరును సిద్ధముగా ఉండుడు, ఏలయన, మనుష్యకుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును.
45. "విశ్వాసపాత్రుడును, వివేకవంతుడును అగు సేవకుడు ఎవడు? యజమానునిచే తన యింటి వారందరికి వేళకు భోజనము పెట్టుటకు నియమింప బడినవాడే.
46. యజమానుడు యింటికి తిరిగివచ్చి నపుడు తన కర్తవ్యమునందు నిమగ్నుడైన సేవకుడు ధన్యుడు.
47. యజమానుడు అట్టివానికి తన ఆస్తి యంతటిపై యాజమాన్యము నొసగునని మీతో నిశ్చయ ముగా చెప్పుచున్నాను.
48. సేవకుడు దుష్టుడైనచో యజమానుడు చాలకాలమువరకు తిరిగిరాడని తనలో తాననుకొని,
49. తన తోడి సేవకులను కొట్టుటకు, త్రాగుబోతులతో తినుటకు, త్రాగుటకు మొదలిడును.
50. అతడు ఊహింపని దినములలో, యోచింపని గడియలో యజమానుడు తిరిగివచ్చి,
51. ఆ సేవకుని శిక్షించి వంచకులతో జమకట్టును. అచట జనులు ఏడ్చుచు, పండ్లు కొరుకుకొందురు.
1. "పరలోకరాజ్యము ఇట్లుండును: పదిమంది కన్యలు తమ కాగడాలతో పెండ్లికుమారునకు స్వాగతమీయ ఎదురేగిరి.
2. అందు అయిదుగురు వివేకవతులు, మరియైదుగురు అవివేకవతులు.
3. అవివేకవతులు తమ కాగడాలతోపాటు నూనెను తీసికొనిపోలేదు.
4. వివేకవతులు తమ కాగడాలతో పాటు పాత్రలలో నూనెను తీసికొనిపోయిరి.
5. పెండ్లి కుమారుని రాక ఆలస్యముకాగా, వారెల్లరు కునికి పాట్లు పడుతు నిద్రించుచుండిరి.
6. అర్ధరాత్రి సమయమున 'ఇదిగో! పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు. అతనికి ఎదురు వెళ్ళుడు' అను కేక వినబడెను.
7. అపుడు ఆ కన్యలందరు నిదురనుండి మేల్కొని తమ కాగడాలను సవరించు కొనసాగిరి.
8. అవివేకవతులు వివేకవతులతో 'మా కాగడాలు కొడిగట్టుచున్నవి. మీ నూనెలో కొంత మాకీయుడు' అని కోరిరి.
9. అందుకు ఆ వివేకవతులు, 'మాకును మీకును ఇది చాలదు. అంగడికి వెళ్ళి కొనితెచ్చుకొనుడు' అనిరి.
10. వారు కొనుటకు పోయిరి. ఇంతలో పెండ్లి కుమారుడు రానే వచ్చెను. సిద్ధముగనున్నవారు అతని వెంట వివాహోత్సవమునకు వెళ్ళిరి. ఆపై తలుపు మూయబడెను.
11. తరువాత మిగిలిన కన్యలు వచ్చి 'ప్రభూ! ప్రభూ! తలుపుతీయుడు' అని మొర పెట్టిరి.
12. ఆయన 'నేను మిమ్ము ఎరుగనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను' అనెను.
13. కనుక మెలకువతో ఉండుడు. ఏలయన, ఆ దినమును, ఆ గడియను మీరెరుగరు.
14. "ఒకడు దూరదేశమునకు ప్రయాణమె పోవుచు సేవకులను పిలిచి, తన ఆస్తిని వారికి అప్పగించెను.
15. వారివారి సామర్థ్యమును బట్టి ఒకనికి ఐదులక్షలు' వరహాలను, మరియొకనికి రెండు లక్షలు వరహాలను, ఇంకొకనికి ఒక లక్ష వరహాలను ఇచ్చివెళ్ళెను.
16. ఐదు లక్షల వరహాలను పొందిన వాడు వెంటనే వెళ్ళి వ్యాపారముచేసి మరియైదు లక్షలు సంపాదించెను.
17. అట్లే రెండులక్షల వరహాలను పొందినవాడు మరి రెండు లక్షలను సంపాదించెను.
18. కాని ఒక లక్ష వరహాలను పొందినవాడు వెళ్ళి నేలను త్రవ్వి తన యజమానుని ద్రవ్యమును దాచెను.
19. చాలకాలము గడిచిన తరువాత ఆ సేవకుల యజమానుడు తిరిగివచ్చి, వారితో లెక్కలు సరిచూచు కొననారంభించెను.
20. ఐదులక్షల వరహాలను పొందిన సేవకుడు మరి యైదులక్షల వరహాలను తెచ్చి, 'స్వామీ! తమరు నాకు అయిదులక్షల వరహాలను ఇచ్చితిరి. ఇదిగో! మరియైదులక్షలు సంపాదించితిని' అనెను.
21. అపుడు ఆ యజమానుడు వానితో 'మంచిది, నీవు ఉత్తముడవు. నమ్మినబంటువు. స్వల్ప విషయములందు శ్రద్ధవహించితివి. కనుక అనేక విషయములను నీకు అప్పగింతును. నీ యజమానుని ఆనందములో నీవు పాలుపంచుకొనుము' అనెను
22. రెండు లక్షల వరహాలను పొందినవాడు వచ్చి, “స్వామీ! మీరు రెండు లకల వరహాలను ఇచ్చితిరి గదా! ఇదిగో! మరి రెండు లక్షలు సంపాదించితిని' అనెను.
23. అప్పుడు ఆ యజమానుడు అతనితో, 'మంచిది, నీవు ఉత్తముడవు. నమ్మినబంటువు. స్వల్ప విషయము లందు శ్రద్ధవహించితివి. కనుక అనేక విషయములను నీకు అప్పగింతును. నీ యజమానుని ఆనందములో పాలుపంచుకొనుము' అనెను.
24. పిదప ఒక లక్ష వరహాలను పొందినవాడు వచ్చి, 'అయ్యా! నీవు కఠినుడవని నేను ఎరుగుదును. నీవు నాటని చోట కోయువాడవు. విత్తనములను చల్లనిచోట పంటకూర్చు కొనువాడవు.
25. కనుక నేను భయపడి, వెళ్ళి నీ లక్ష వరహాలను భూమిలో దాచితిని. ఇదిగో నీ ధనమును నీవు తీసికొనుము' అని పలికెను.
26. అపుడు ఆ యజమానుడు వానితో, 'ఓరీ దుష్ట సేవకా! సోమరీ! నేను నాటనిచోట పంట కోయువాడననియు, విత్తనములు చల్లనిచోట పంట కూర్చుకొనువాడననియు నీవు ఎరుగుదువు కదా!
27. అట్లయిన నా ధనమును వడ్డీకిచ్చియుండవలసినది. నేను తిరిగివచ్చినపుడు వడ్డీతో సహా సొమ్ము పుచ్చుకొనియుందునుగదా!'
28. అని పలికి సేవకులతో 'ఆ లక్ష వరహాలను వీనినుండి తీసివేసి పదిలక్షల వరహాలు కలవానికి ఈయుడు.
29. ఉన్న ప్రతివానికి ఇంకను ఈయబడును. అపుడు అతనికి సమృద్ధి కలుగును. లేనివాని నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును.
30. ఈ నిష్ప్రయోజకుడగు సేవకుని వెలుపలి చీకటిలోనికి త్రోసివేయుడు. అచట జనులు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు' అని పలికెను.
31. “మనుష్యకుమారుడు సమస్త దూతల సమేత ముగా తన మహిమతో వచ్చునపుడు తన మహిమా న్విత సింహాసనముపై ఆసీనుడగును.
32. అపుడు సకలజాతులవారు ఆయన సముఖమునకు చేర్చ బడుదురు. గొఱ్ఱెలకాపరి మేకలను, గొఱ్ఱెలను వేరు పరచునట్లు ఆయన వారిని వేరుపరచును.
33. ఆయన గొఱ్ఱెలను తన కుడిప్రక్కన, మేకలను తన ఎడమప్రక్కన నిలుపును.
34. అపుడు సింహాసనాసీనుడైన రాజు తన కుడిప్రక్కన ఉన్నవారితో 'నా తండ్రిచే దీవింప బడిన వారలారా! రండు. ప్రపంచ ప్రారంభమునుండి మీకై సిద్ధపరుపబడిన రాజ్యమును చేకొనుడు.
35. ఏలయన నేను ఆకలిగొనినపుడు మీరు ఆహారము నొసగితిరి, దప్పికగొనినపుడు దాహము తీర్చితిరి, పరదేశినైయున్నపుడు నన్ను ఆదరించితిరి,
36. నేను వస్త్ర హీనుడనైయున్నపుడు వస్త్రములను ఇచ్చితిరి, రోగినై ఉన్నపుడు నన్ను పరామర్శించితిరి, చెరసాలలో ఉన్నపుడు నన్ను దర్శింపవచ్చితిరి' అని పలుకును.
37. అపుడు ఆ నీతిమంతులు 'ప్రభూ! నీవు ఎప్పుడు ఆకలిగొనియుండుట చూచి, భోజనము పెట్టితిమి? దప్పికగొనియుండుట చూచి దాహము తీర్చి
38. ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి ఆదరించి తిమి? వస్త్రహీనుడవైయుండుట చూచి వస్త్రములను ఇచ్చితిమి?
39. ఎప్పుడు రోగివై యుండుట చూచి, పరామర్శించితిమి? చెరసాలలో ఉండగా దర్శింప వచ్చితిమి?' అని అడుగుదురు.
40. అందుకు రాజు 'ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినపుడు అవి నాకు చేసితిరి అని మీతో నిశ్చయముగా చెప్పు చున్నాను' అని వారితో చెప్పును.
41. అపుడు ఆయన తన ఎడమప్రక్కనున్న వారితో, 'శాపగ్రస్తులారా! నా నుండి తొలగి, పిశాచమునకు, దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పొండు.
42. ఏలయన నేను ఆకలిగొని యుంటిని, మీరు అన్నము పెట్టలేదు. దప్పికగొని యుంటిని, దాహము తీర్చలేదు.
43. పరదేశినై యుంటిని, నన్ను ఆదరింపలేదు. వస్త్రహీనుడనై యుంటిని, నాకు వస్త్రములను ఈయలేదు. రోగినై యుంటిని, నన్ను పరామర్శింపలేదు. చెరసాలలో ఉంటిని, నన్ను దర్శింపరాలేదు' అనును.
44. అపుడు వారు కూడ 'ప్రభూ! నీవు ఆకలి గొనియుండుట, దప్పికగొనియుండుట, పరదేశివై యుండుట, వస్త్రహీనుడవైయుండుట, రోగివై యుండుట, చెరసాలలో నుండుట, మేము ఏనాడు చూచి, పరిచర్య చేయక పోతిమి?' అని ప్రశ్నింతురు.
45. అందుకు ఆయన, 'ఈ అత్యల్పులలో ఒకనికైనను మీరివి చేయనప్పుడు నాకును చేయనట్లే' అని నిశ్చయముగా చెప్పు చున్నానని వారితో చెప్పును.
46. వీరు నిత్యశిక్షకు వెడలిపోవుదురు. నీతిమంతులు నిత్యజీవములో ప్రవేశింతురు” అని పలికెను.
1. యేసు ఈ విషయములనన్నిటిని బోధించిన పిదప శిష్యులతో,
2. “రెండు రోజులైన పిదప పాస్క పండుగ వచ్చునని మీరు ఎరుగుదురు. అప్పుడు మనుష్య కుమారుడు సిలువవేయబడుటకు అప్పగింపబడును" అని పలికెను.
3. అప్పుడు ప్రధానార్చకులును, ప్రజల పెద్దలును కైఫా అను ప్రధానార్చకుని సభామందిరమున సమావేశమై,
4. దొంగచాటుగా యేసును బంధించి, చంపవలెనని కుట్రచేసిరి.
5. కాని, “పండుగ దినములలో వలదు. అది ప్రజలలో అలజడి లేపవచ్చును” అని తలంచిరి.
6. యేసు బెతానియా గ్రామమున కుష్ఠరోగి యగు సీమోను ఇంటనుండెను.
7. ఒక స్త్రీ విలువైన పరిమళ ద్రవ్యముగల చలువరాతి పాత్రతో వచ్చి భోజనపంక్తియందున్న యేసు శిరమును అభిషేకించెను.
8. అది చూచిన శిష్యులు కోపపడి “ఈ వృథా వ్యయమెందుకు?
9. దీనిని అధిక వెలకు అమ్మి పేదలకు దానము చేయవచ్చును గదా!" అనిరి.
10. యేసు అది గ్రహించి, “మీరు ఏల ఈమె మనస్సు నొప్పించే దరు? ఈమె నాపట్ల ఒక సత్కార్యము చేసినది.
11. బీదలు ఎల్లప్పుడును మీతో ఉన్నారు. నేను ఎల్లప్పుడు మీతో ఉండను.
12. నా భూస్థాపనము నిమిత్తము ఈమె ఈ పరిమళద్రవ్యమును నా శరీరముపై క్రుమ్మరించినది.
13. సమస్త ప్రపంచము నందు ఈ సువార్త ఎచ్చట బోధింపబడునో, అచ్చట ఈమె చేసిన కార్యము ఈమె జ్ఞాపకార్థము ప్రశంసింప బడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అనెను.
14. పన్నిద్దరిలో ఒకడగు యూదా ఇస్కారియోతు ప్రధానార్చకుల యొద్దకేగి,
15. వారితో, “నేను ఆయనను మీకు అప్పగించినయెడల మీరు నాకు ఏమిత్తురు?” అని అడిగెను. వారు అతనికి ముప్పది వెండినాణెములను ఇచ్చిరి.
16. అప్పటినుండి వాడు, ఆయనను అప్పగింప తగిన సమయమునకై వేచియుండెను.
17. పులియని రొట్టెలపండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, “మేము ఎచట నీకు పాస్క భోజనము సిద్ధపరుపగోరెదవు?” అని ప్రశ్నించిరి.
18.“మీరు పట్టణమున ఒకానొక మనుష్యునియొద్దకు వెళ్ళి, 'నా సమయము ఆసన్నమైనది. నా శిష్యులతో నీ గృహమున పాస్క భోజనము భుజింతును అని గురువు చెప్పుచున్నాడు' అని అతనితో చెప్పుడు” అని యేసు పలికెను.
19. యేసు ఆజ్ఞానుసారము శిష్యులు పాస్క భోజనమును సిద్ధపరచిరి.
20. సాయంకాలము కాగా, ఆయన పన్నిదరు శిష్యులతో భోజనమునకు కూర్చుండెను.
21. వారు భుజించుచుండ యేసు “మీలో ఒకడు నన్ను శత్రువు లకు అప్పగింపనున్నాడని మీతో నిశ్చయముగ చెప్పు చున్నాను” అనెను.
22. అప్పుడు వారందరు మిగుల చింతించి “ప్రభూ! నేనా?” అని ఒక్కొక్కరు అడుగ సాగిరి.
23. అందులకు ఆయన 'నాతోపాటు ఈ పాత్రలో చేతిని ముంచినవాడు నన్ను అప్పగించును.
24. తనను గూర్చి వ్రాయబడినట్లు మనుష్యకుమారుడు చంపబడును. కాని మనుష్యకుమారుని అప్పగించువానికి అయ్యో అనర్ధము! అతడు జన్మింపక ఉండినచో మేలు అయ్యెడిది” అనెను.
25. అప్పుడు ఆయనను అప్పు గింపనున్న యూదా, “బోధకుడా! నేనా”? అని అడుగగా “నీవే చెప్పుచున్నావు” అని యేసు సమాధానము ఇచ్చెను.
26. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి, త్రుంచి, తన శిష్యులకు ఇచ్చుచు, “దీనిని మీరు తీసికొని భుజింపుడు. ఇది నా శరీరము” అనెను.
27. తరువాత ఆయన ఒక పాత్రను అందుకొని, కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి, వారికి ఇచ్చి, “దీనిలోనిది మీరు అందరు త్రాగుడు.
28. ఇది అనేకుల పాపపరిహారమునకై చిందబడనున్న నిబంధన యొక్క నా రక్తము.
29. ఇది మొదలుకొని మీతో గూడ నాతండ్రి రాజ్యములో నూతనముగా ద్రాక్షారసము పానము చేయువరకు దీనిని ఇక నేను త్రాగనని మీతో చెప్పుచున్నాను” అనెను.
30. వారొక కీర్తన పాడి ఓలీవు కొండకు వెళ్ళిరి.
31. అపుడు యేసు వారితో, “మీరు ఈ రాత్రి నా విషయమై వెరగొంది, నన్ను వదలిపెట్టి వెడలి పోయెదరు 'నేను గొఱ్ఱెల కాపరిని కొట్టుదును. మందలోని గొఱ్ఱెలు చెల్లాచెదరగును' అని వ్రాయబడియున్నది.
32. అయినను నేను ఉత్తానమైన పిదప మీకంటే ముందు గలిలీయ సీమకు వెళ్ళెదను” అని పలికెను.
33. “అందరు మిమ్ము విడిచి పెట్టి పోయినను నేను మాత్రము మిమ్ము ఎన్నటికిని విడనాడను" అని పేతురు పలికెను.
34. అందుకు యేసు “ఈ రాత్రి కోడి కూయకముందే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు పలికెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అనెను.
35. అపుడు పేతురు ఆయనతో, “నేను మీతో మరణింపవలసివచ్చినను మిమ్ము ఎరుగనని పలుకను” అనెను. అట్లే శిష్యులందరును అనిరి.
36. అపుడు యేసు శిష్యులతో గెత్సెమని తోటకు వచ్చి “నేను అల్లంత దూరముపోయి ప్రార్థన చేసికొని వచ్చువరకు మీరిచట కూర్చుండుడు” అని వారితో చెప్పెను.
37. పేతురును, జెబదాయి కుమారుల నిద్దరను తనతో పాటు తీసికొనిపోయెను. అపుడాయన చింతాక్రాంతుడై ఆవేదన పడసాగెను.
38. “నా ఆత్మ మరణవేదనను అనుభవించుచున్నది. మీరిచటనే యుండి, నాతో జాగరణము చేయుడు” అని పలికెను.
39. ఆయన మరి కొంతదూరము వెళ్ళి నేలపై సాగిలపడి "ఓ నా తండ్రీ! సాధ్యమైనయెడల ఈ పాత్రను నా నుండి తొలగిపోనిమ్ము. అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్ము” అని ప్రార్థించెను.
40. అంతట ఆయన శిష్యులయొద్దకు వచ్చి, వారు నిద్రించుట గమనించి పేతురుతో, “ఇదేమి! మీరు నాతో ఒక గంటయైనను మేలుకొని ఉండలేక పోయితిరా?
41. మీరు శోధనలకు గురికాకుండు టకు మేలుకొని ప్రార్ధింపుడు. ఆత్మ సిద్ధమైనను దేహము దుర్బలముగా ఉన్నది” అనెను.
42. మరల ఆయన రెండవమారు వెళ్ళి, “ ఓ తండ్రీ, నేను పానము చేసిననే తప్ప, ఈ పాత్రము నా నుండి తొలగిపోవ సాధ్యముకాని యెడల నీ చిత్తము నెరవేర నిమ్ము” అని ప్రార్థించి,
43. తిరిగివచ్చి వారు నిద్రించుచుండుట చూచెను. ఏలయన నిద్రా భారముచే వారి కన్నులు బరువెక్కెను.
44. ఆయన మరల వారలను వీడి, కొంత దూరము వెళ్ళి, మూడవ మారు కూడ అట్లే ప్రార్థించెను.
45. పిదప తన శిష్యులను సమీపించి, “మీరు ఇంకను నిద్రించుచు విశ్రాంతి తీసికొనుచున్నారా? మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడబోవు గడియ సమీపించినది.
46. లెండు, పోదము రండు. చూడుడు, నన్ను పట్టిచ్చువాడు సమీపముననే ఉన్నాడు” అనెను.
47. ఆయన ఇంకను మాట్లాడుచుండగా అదిగో! పన్నిద్దరిలో ఒకడగు యూదా వచ్చెను. ప్రధానా ర్చకులు, ప్రజల పెద్దలు పంపిన మహా జనసమూ హము కత్తులను, బడితలను చేతబూని అతనితో వచ్చెను.
48. “నేను ఎవరిని ముద్దు పెట్టుకొందునో అతడే ఆయన. అతనిని పట్టి బంధింపుడు” అని వారికి ఆ గురుద్రోహి ఒక గుర్తు చెప్పెను.
49. వెంటనే అతడు యేసును సమీపించి, “బోధకుడా! శుభమగును గాక!” అని ఆయనను ముద్దు పెట్టుకొనెను.
50. అపుడు యేసు వానితో, “స్నేహితుడా! నీవు వచ్చిన పని కానిమ్ము” అని అనగా, వారు ఆయనను పట్టుకొని బంధించిరి.
51. వెంటనే యేసు వద్దనున్నవారిలో ఒకడు తన కత్తి దూసి ప్రధానార్చకుని సేవకుని కొట్టి, వాని చెవి తెగనరికెను.
52. అతనితో యేసు “నీ కత్తిని ఒరలోవేయుము” కత్తిని ఎత్తువారు కత్తితోనే నశించెదరు.
53. నేను నా తండ్రిని ప్రార్థింపలేనను కొంటివా? ప్రార్ధించిన ఈ క్షణమున ఆయన పండ్రెండు దళముల కంటె ఎక్కువమంది దూతలను పంపడా?
54. ఇట్లు కాదేని, ఈ విధముగా జరుగవలెనను లేఖనములు ఎట్లు పరిపూర్ణమగును?” అనెను. -
55. ఆ సమయమున యేసు ఆ సమూహముతో “దొంగను పట్టుకొనుటకు వచ్చినట్లు కత్తులతోను, గుదియలతోను 'నన్ను పట్టుకొనుటకు వచ్చితిరేల? ప్రతిదినము నేను దేవాలయమున కూర్చుండి బోధించుచుంటిని కాని, మీరు అపుడు నన్ను పట్టు కొనలేదు” అనెను.
56. ప్రవక్తల లేఖనములు పరిపూర్ణములగునట్లు ఇదియంతయు జరిగెను. అపుడు శిష్యులందరును ఆయనను విడిచి పెట్టి పారిపోయిరి.
57. యేసును బంధించినవారు ఆయనను ప్రధానా యజకుడైన కైఫా వద్దకు తీసికొనిపోయిరి. అచట ధర్మశాస్త్ర బోధకులు, పెద్దలు సమావేశమైరి.
58. పేతురు దూరదూరముగా ఆయనను ప్రధానార్చకుని గృహప్రాంగణమువరకు అనుసరించి లోపల ప్రవేశించి, దాని పర్యవసానమును చూచుటకై కావలివారితో పాటు కూర్చుండెను.
59. యేసును చంపుటకై అచట ప్రధానార్చకులు, న్యాయసభ సభ్యులు అసత్యసాక్ష్యము వెదకిరి.
60. కూటసాక్షులు అనేకులు ముందుకు వచ్చినను వారికి ఏ సాక్ష్యమును దొరకలేదు. తుట్టతుదకు ఇద్దరు ముందుకు వచ్చి,
61. “నేను దేవళమును పడగొట్టి మూడు రోజులలో తిరిగి నిర్మించెదను అని ఇతడు చెప్పెను” అనిరి.
62. అపుడు ప్రధానార్చకుడు లేచి నిలిచి, “నీకు వ్యతిరేకముగా వీరు చెప్పునదేమి? దీనికి నీవు ప్రత్యుత్తర మీయవా?” అని యేసును ప్రశ్నించెను.
63. అందులకు యేసు మిన్నకుండెను. ప్రధాన యాజకుడు మరల “జీవము గల దేవునితో, ఆనబెట్టి అడుగుచున్నాను. నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువా? మాతో చెప్పుము” అని యేసును ప్రశ్నించెను.
64. అందుకు యేసు “నీవన్నట్లే. అయినను ఇక నుండి మనుష్యకుమారుడు సర్వశక్తి మంతుని కుడి ప్రక్కన కూర్చుండుటయు, ఆకాశము నుండి మేఘారూఢుడై వచ్చుటయు, మీరు చూచెదరని చెప్పుచున్నాను” అనెను.
65. అపుడు ఆ ప్రధాన యాజకుడు తన వస్త్రములను చింపుకొని “ఇతడు దేవదూషణము గావించెను. మనకిక సాక్షులతో పనియేమి? ఇదిగో మీరు ఇతని దేవదూషణము విని యున్నారు గదా!
66. మీ అభిప్రాయమేమి?" అని అడుగగా "ఇతడు మరణమునకు పాత్రుడు” అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి.
67. అపుడు వారు ఆయన ముఖముపై ఉమిసి, పిడికిళ్ళతో గ్రుద్దిరి. మరికొందరు ఆయన చెంపపై కొట్టుచు,
68. “మెస్సయా! ప్రవచింపుము! నిన్ను కొట్టినదెవరో చెప్పుము” అనిరి.
69. పేతురు ఆ గృహప్రాంగణమున కూర్చుండి యుండెను. అపుడొక దాసి అతని వద్దకు వచ్చి “నీవును గలిలీయ నివాసియగు యేసుతో ఉన్నవాడవుగదా!” అనెను.
70. అతడు అందరి యెదుట బొంకుచు, “నీవు చెప్పునదేమో నాకు తెలియదు” అనెను.
71. అతడు ద్వారము వద్దకు వచ్చినపుడు మరియొక పనికత్తె అతనిని చూచి, “వీడు కూడ నజరేయుడగు యేసుతో ఉన్నవాడు” అని అచటివారికి చెప్పెను.
72. అతడు మరల బొంకుచు, “ఆ మనుష్యుని నేను ఎరుగను” అని ప్రమాణముచేసి చెప్పెను.
73. కొంత సమయము అయిన తరువాత అచ్చట నున్నవారు పేతురు చుట్టుచేరి, “నిస్సందేహముగా నీవు కూడా ఆయన సహచరులలో ఒకడవు. నీ మాటల తీరుతెన్నులు దీనిని వ్యక్తపరచుచున్నవి” అనిరి.
74. అపుడతడు “నేను ఆ వ్యక్తిని ఎరుగనే ఎరుగను” అని ప్రమాణము చేయుచు తనను తాను శపించుకొనసాగెను. వెంటనే కోడి కూసెను.
75. “కోడి కూయకముందే నీవు మూడుసార్లు నన్ను ఎరుగనందువు” అని యేసు చెప్పిన మాటను పేతురు జ్ఞప్తికి తెచ్చుకొని, వెలుపలకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చెను.
1. ప్రాతః కాలమున ప్రధానార్చకులు, ప్రజల పెద్దలు అందరు యేసును చంపుటకు ఆలోచన చేసిరి.
2. వారు ఆయనను సంకెళ్ళతో బంధించి, తీసికొని పోయి, అధిపతియగు పిలాతునకు అప్పగించిరి.
3. గురుద్రోహియగు యూదా యేసునకు శిక్ష విధింపబడుట చూచి, పశ్చాత్తాపమొంది, ఆ ముప్పది వెండినాణెములను తిరిగి ప్రధానార్చకులయొద్దకు, పెద్దల యొద్దకు తెచ్చి,
4. "నేను నిర్దోషి రక్తమును అప్పగించి పాపము కట్టుకొంటిని” అని చెప్పెను. వారు “అది మాకేల? నీవే చూచుకొనుము” అనిరి.
5. అపుడు అతడు ఆ వెండినాణెములను దేవాలయములో విసరికొట్టి, పోయి, ఉరి వేసికొనెను.
6. ప్రధానార్చకులు ఆ నాణెములను తీసుకొని “ఇది రక్తపు డబ్బు కనుక, దీనిని కానుకల పెట్టెలో వేయుట తగదు” అనుకొని,
7. తమలో తాము ఆలోచించి దానితో పరదేశీయుల భూస్థాపన కొరకు కుమ్మరివాని పొలము కొనిరి.
8. అందువలన ఆ పొలము “రక్తపుపొలము” అని నేటికి కూడ పిలువ బడుచున్నది.
9. యిర్మీయా ప్రవక్త ప్రవచనము ఇట్లు నెరవేరెను: “యిస్రాయేలీయులలో కొందరు అతని వెలగా నిర్ణయించిన ముప్పది వెండినాణెములు వారు తీసికొని,
10. ప్రభువు నాకు ఆదేశించినట్లు కుమ్మరి వాని పొలము కొనుటకు వినియోగించిరి”.
11. యేసు అధిపతి ఎదుట నిలువగా, “నీవు యూదుల రాజువా?” అని అతడు ప్రశ్నించెను. “నీవన్నట్లే” అని యేసు సమాధాన మొసగెను.
12. ప్రధానార్చకులు, పెద్దలు ఆయనపై నేరము మోపిరి. కాని, ఆయన వారికెట్టి ప్రత్యుత్తరమును ఈయలేదు.
13. అపుడు పిలాతు, “వారు నీపై మోపుచున్న నేరములను వినుటలేదా?” అని ఆయనను ప్రశ్నించెను.
14. ఒక్క నిందారోపణకైనను యేసు బదులు పలుక కుండుటను చూచి, పిలాతు ఆశ్చర్యపడెను.
15. పండుగలో జనులుకోరిన ఒక బందీని విడుదల చేయు ఆచారము అధిపతికి కలదు.
16. అపుడు అచట బరబ్బయను పేరు మోసిన బందీ ఒకడు కలడు.
17. ప్రజలందరు గుమికూడి రాగా, “నేను ఎవరిని విడుదల చేయవలెనని మీరు కోరు చున్నారు? బరబ్బనా? క్రీస్తు అనబడు యేసునా?" అని పిలాతు వారిని అడిగెను.
18. అసూయ వలన వారు ఆయనను అప్పగించిరని అతడు గ్రహించెను.
19. అతడు న్యాయపీఠముపై కూర్చుండినపుడు అతని భార్య “నేడు నేను కలలో ఆయన కారణముగ మిగుల బాధపడితిని. కనుక, ఆ నీతిమంతుని విషయమున నీవు ఏమియు జోక్యము చేసికొనవలదు” అని వార్త పంపెను.
20. ప్రధానార్చకులును, పెద్దలును, బరబ్బను విడిపించుటకు, యేసును చంపుటకు అడుగవలెనని జనసమూహమును ఎగద్రోసిరి.
21. “ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడిపింపవలెనని మీరు కోరుచున్నారు?” అని అధిపతి అడుగగా, వారు “బరబ్బనే” అనిరి.
22. “అట్లయిన క్రీస్తు అనబడు యేసును నేను ఏమి చేయవలయును?" అని పిలాతు వారిని అడుగగా, “సిలువవేయుడు” అని వారు కేకలువేసిరి.
23. “అతడు ఏమి దుష్కార్యము చెసెను?” అని అడుగగా “వానిని సిలువ వేయుడు” అని వారు మరింత బిగ్గరగా కేకలు వేసిరి.
24. అపుడు పిలాతు తాను ఏమియు చేయజాలననియు, ప్రజలలో తిరుగుబాటు రాగలదనియు తెలిసికొని నీరు తీసికొని, వారి యెదుట చేతులు కడుగుకొని, “ఈ నీతిమంతుని రక్తము విషయమున నేను నిరపరాధిని. అది మీరే చూచుకొనుడు” అనెను.
25. “ఆయన రక్తము మాపై, మా బిడ్డలపై పడునుగాక!” అని వారందరును కేకలు పెట్టిరి.
26. అపుడు అతడు బరబ్బను విడుదలచేసి, యేసును కొరడాలతో కొట్టించి, సిలువ వేయుటకు ఆయనను వారికి అప్పగించెను.
27. అపుడు అధిపతి యొక్క సైనికులు, యేసును రాజభవన ప్రాంగణమునకు తీసికొనిపోయి, ఆయన చుట్టు సైనికులనందరను సమకూర్చిరి.
28. వారు యేసు వస్త్రములను ఒలిచి, ఎఱ్ఱని అంగీని ధరింపజేసిరి.
29. ముండ్లకిరీటమును అల్లి ఆయన శిరముపై పెట్టిరి. కుడిచేతిలో వెదురు కోలనుంచిరి. మరియు ఆయన ముందు మోకరిల్లి “యూదుల రాజా! నీకు జయము!” అని అవహేళనము చేసిరి.
30. ఆ సైనికులు ఆయనపై ఉమిసి, ఆయన చేతిలోని వెదురు కోలను తీసికొని, తలపై మోదిరి.
31. వారిట్లు పరిహసించిన పిమ్మట అంగీని తీసివేసి, ఆయన వస్త్రములను ఆయనకు ధరింపజేసి, సిలువవేయుటకై తీసుకొనిపోయిరి.
32. మార్గమధ్యమునవారు కురేనియా సీమోనును చూచి, సిలువను మోయుటకు అతనిని బలవంతపరచిరి.
33. వారు 'కపాలస్థలము' అను నామాంతరము 'గొల్గొతా' అను స్థలమునకు చేరిరి.
34. చేదు కలిపిన ద్రాక్షరసమును ఆయనకు త్రాగనిచ్చిరి. కాని దానిని రుచిచూచి ఆయన త్రాగుటకు ఇష్టపడక పోయెను.
35. వారు ఆయనను సిలువవేసిరి. చీట్లు వేసి కొని ఆయన వస్త్రములను పంచుకొనిరి.
36. వారచట కూర్చుండి కావలి కాయుచుండిరి.
37. 'ఇతడు యూదుల రాజు యేసు' అను నిందారోపణ ఫలకమును ఆయన తలకు పై భాగమున ఉంచిరి.
38. ఆయనతో పాటు కుడి ఎడమల ఇద్దరు దొంగలు సిలువ వేయబడిరి.
39. వచ్చిపోవువారు తలలూపుచు, ఆయనను దూషించుచు,
40. “దేవాలయమును పడగొట్టి మూడు దినములలో మరల నిర్మించువాడా! నిన్ను నీవు రక్షించుకొనుము. దేవుని కుమారుడవైనచో సిలువ నుండి దిగిరమ్ము" అని పలికిరి.
41. అలాగే ప్రధానా ర్చకులు, ధర్మశాస్త్ర బోధకులతోను, పెద్దలతోను కలసి
42. “ఇతను ఇతరులను రక్షించెనుగాని, తనను తాను రక్షించుకొనలేడాయెను. ఇతడు యిస్రాయేలీయుల రాజుగదా! ఇపుడు సిలువనుండి దిగిరానిమ్ము, అపుడు మేము విశ్వసింతుము” అని హేళనచేసిరి.
43.“ఇతడు దేవుని నమ్మెను. 'నేను దేవుని కుమారుడను' అని చెప్పెను. కనుక దేవునికిష్టమైన, ఇతనిని ఇప్పుడు రక్షింపనిమ్ము" అనిరి.
44. అదే విధముగ ఆయనతో పాటు సిలువపై కొట్టబడిన దొంగలు కూడ ఆయనను అటులనే దూషించిరి.
45. అపుడు పగలు పండ్రెండు గంటలనుండి మూడుగంటలవరకు ఆ దేశమంతట చీకటి క్రమ్మెను.
46.ఇంచుమించు పగలు మూడుగంటల సమయమున “ఏలీ, ఏలీ, లామా సబకాని” అని యేసు బిగ్గరగా కేక పెట్టెను. “నా దేవా! నా దేవా! నీవు నన్నేల విడనాడితివి?” అని దీని అర్థము.
47. అచట నిలువబడిన కొందరు అది విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనిరి.
48. వెంటనే ఒకడు పరుగెత్తి, నీటిపాచి తీసుకొని, పులిసిన ద్రాక్షారసములో ముంచి, ఒక కోలకు తగిలించి, ఆయనకు త్రాగనిచ్చెను.
49. మరికొందరు “తాళుడు, ఏలియా వచ్చి ఇతనిని రక్షించు నేమో చూతము” అనిరి.
50. యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణమువీడెను.
51. అపుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. భూమి కంపించెను. బండలు బలాయెను.
52. సమాధులు తెరువ బడెను. మరణించిన పరిశుద్ధులలో అనేకుల దేహములు లేపబడెను.
53. యేసు పునరుత్థానము తరువాత, వారు సమాధులనుండి బయటకువచ్చి, పవిత్ర నగరమున ప్రవేశించి, అనేకులకు కనిపించిరి.
54. శతాధిపతియు, అతనితో యేసును కావలి కాయుచున్న సైనికులును, భూకంపము మొదలుగా సంభవించిన సంఘటనలు చూచి, మిక్కిలి భయపడి, “నిశ్చయముగా ఇతడు దేవుని కుమారుడే”అని పలికిరి.
55. యేసుకు పరిచర్య గావించుటకై గలిలీయనుండి ఆయనను వెంబడించిన స్త్రీలు అనేకులు దూరమునుండి చూచుచుండిరి.
56. వారిలో మగ్ధలా మరియమ్మ, యాకోబు, యోసేపుల తల్లియగు మరియమ్మ, జెబదాయి కుమారుల తల్లియును ఉండిరి.
57. సాయంసమయమున యేసు శిష్యుడు, ధనికుడునగు, అరిమత్తయి వాసియగు యోసేపు,
58. పిలాతువద్దకుపోయి యేసు భౌతికదేహమును ఇప్పింపు మని కోరగా అతడు అందులకు అంగీకరించెను.
59. యోసేపు యేసు భౌతికదేహమును సరిక్రొత్త నార వస్త్రముతో చుట్టి,
60. తాను రాతిలో, తన కొరకు తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో ఉంచెను. ఆ సమాధి ద్వారమునకు అడ్డముగా పెద్దరాతిని దొర్లించి వెడలిపోయెను.
61. అపుడు ఆ సమాధికెదురుగా మగ్ధలా మరియమ్మయు వేరొక మరియమ్మయు కూర్చుండియుండిరి.
62. ఆయత్త దినమునకు మరునాడు ప్రధానా ర్చకులును, పరిసయ్యులును కలిసి పిలాతునొద్దకు వచ్చి
63. "అయ్యా! ఆ మోసగాడు జీవించి ఉన్నపుడు, 'నేను మూడుదినముల తరువాత సజీవుడవై లేతును' అని చెప్పినట్లు మాకు జ్ఞాపకమున్నది.
64. అతని శిష్యులు అతనిని రాత్రి సమయమున దొంగిలించు కొనిపోయి, 'మృతుల నుండి బ్రతికి లేచెను' అని జనులకు చెప్పుదురేమో! అపుడు మొదటి మోసముకంటె, కడపటి మోసము ఘోరముగా నుండును. కనుక మూడవ దినమువరకు సమాధిని భద్రపరుప నాజ్ఞాపింపుము" అని చెప్పిరి.
65. అందుకు పిలాతు, “మీకు కావలి వారున్నారుగదా! పోయి, మీ చేతనైనంతవరకు సమాధిని భద్రము చేసికొనుడు” అని వారితో పలికెను.
66. వారు పోయి రాతిపై ముద్రవేసి, కావలివారిని పెట్టి సమాధిని భద్రపరచిరి.
1.విశ్రాంతిదినము గడచిన పిదప ఆదివారము ప్రాతఃకాలమున మగ్ధలా మరియమ్మయు, వేరొక మరియమ్మయు సమాధిని చూడవచ్చిరి.
2. అదిగో! అపుడు పెద్ద భూకంపము కలిగెను. ఏలయన, పరలోకమునుండి దేవదూత దిగివచ్చి, ఆ రాతిని దొర్లించి, దానిపై కూర్చుండెను.
3. అతని రూపము మెరుపువలెను, వస్త్రము మంచువలెను తెల్లగా ఉండెను.
4. కావలివారు భయపడి మరణించిన వారివలె పడిపోయిరి.
5. కాని దూత ఆ స్త్రీలతో “భయపడకుడు. మీరు సిలువవేయబడిన యేసును వెదకుచున్నారు అని నేను ఎరుగుదును.
6. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్లు సమాధినుండి లేచెను. ఆయనను ఉంచిన స్థలమును చూడుడు.
7. మీరు తక్షణమే వెళ్ళి ఆయన మృతులలోనుండి లేచెనని శిష్యులకు తెలుపుడు. ఇదిగో! మీ కంటే ముందు యేసు గలిలీయకు వెళ్ళుచున్నాడు. అచట మీరు ఆయనను దర్శింతురు. అదియే నేను మీతో చెప్పునది” అనెను.
8. అపుడు వారు భయానందములతో, వారి శిష్యులకు ఈ సమాచారము తెలుపుటకై సమాధి యొద్ద నుండి పరుగెత్తుచుండగా,
9. యేసు వారిని సమీపించి, “మీకు శుభము” అని పలికెను. వారు ముందుకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆరాధించిరి.
10. యేసు వారితో “భయపడవలదు, మీరు వెళ్ళి, నా సోదరులతో గలిలీయకు పోవలయునని చెప్పుడు. వారచట నన్ను చూడగలరు” అనెను.
11. ఆ స్త్రీలు వెళ్ళుచుండగా, సమాధిని కావలి కాయుచున్న సైనికులు కొందరు నగరములోనికి వెళ్ళి, జరిగినదంతయు ప్రధానార్చకులకు తెలిపిరి.
12. ప్రధానార్చకులు పెద్దలతో సమావేశమై ఆలోచన చేసి సైనికులకు చాలా ధనమిచ్చి ఇట్లనిరి:
13. 'మేము నిదురించుచుండ అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతని శరీరమును ఎత్తుకొనిపోయిరి' అని చెప్పుడు.
14. ఇది అధిపతియొక్క చెవినబడిన అతనిని మేము ఒప్పింతుము. మీకు ఏ మాత్రము ప్రమాదము కలుగదు” అని పలికిరి.
15. వారు ధనమును తీసికొని చెప్పినట్లు చేసిరి. ఈ వదంతి నేటికిని యూదులలో వ్యాపించి యున్నది.
16. యేసు ఆజ్ఞానుసారము పదునొకండుగురు శిష్యులు గలిలీయలోని పర్వతమునకు వెళ్ళిరి.
17. అపుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి. కాని కొందరు సందేహించిరి.
18. యేసు వారి దగ్గరకు వచ్చి వారితో “ఇహపరములందు నాకు సర్వాధికార మీయబడినది.
19. కనుక మీరు వెళ్లి సకల జాతి జనులకు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నాన మొసగుచు, వారిని నా శిష్యులను చేయుడు.
20. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు. ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో నుందును” అని అభయ మొసగెను.