ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

లూకా సువార్త | Telugu Catholic Bible

 1. ఘనత వహించిన తెయోఫిలూ! మనమధ్య జరిగిన సంఘటనలను వ్రాయుటకు అనేకులు ప్రయత్నించిరి.

2. వారు వ్రాసిన ఈ సంఘటనలను మొదటినుండియు ప్రత్యక్షముగా చూచిన వారివలన, సువార్తను బోధించిన వారివలన మనము వినియున్నాము.

3. కావున, అన్ని విషయములను మొదటి నుండి జాగ్రత్తగా పరిశీలించిన పిదప, వానిని నీ కొరకు వరుసగా వివరించి వ్రాయుట సముచితమని నాకును తోచినది.

4. నీకు ఎరుకచేయబడిన విషయములను గూర్చిన వాస్తవమును నీవు గ్రహించు టకై ఈ గ్రంథమును వ్రాయుచున్నాను.

5. యూదయాదేశపు రాజగుహేరోదు కాలమున అబీయా వర్గమునకు చెందిన జెకర్యా అను యాజకుడు ఒకడుండెను. అతని భార్య అహరోను వంశీయురాలగు ఎలిశబేతమ్మ.

6. వారిద్దరు దేవుని దృష్టిలో నీతిమంతులై, ఆయన ఆజ్ఞలకును, నియమములకును బద్దులైయుండిరి.

7. ఎలిశబేతమ్మ గొడ్రాలగుటచే వారికి సంతానములేదు. ఇద్దరును కడువృద్దులు.

8. ఒక దినము జెకర్యా తనవర్గము వంతు ప్రకారము దేవునిసన్నిధిలో యాజకవిధిని నెరవేర్చు చుండెను.

9. ఆనాటి యాజకసంప్రదాయానుసారముగ అతనికి దేవాలయములోనికి వెళ్ళి ధూపము వేయువంతు వచ్చెను.

10. అతడు ధూపమువేయు సమయమున ప్రజలు వెలుపల ప్రార్థనలు చేయు చుండిరి.

11. అపుడు ధూపపీఠమునకు కుడిప్రక్కన దేవదూత ప్రత్యక్షమాయెను.

12. దేవదూతనుగాంచి జెకర్యా తొట్రుపడి భయపడెను.

13. అపుడు దేవదూత అతనితో “జెకర్యా! భయపడకుము. నీ ప్రార్థన ఆలకింపబడినది. నీ భార్య ఎలిశబేతమ్మ ఒక కుమారుని కనును. అతనికి “యోహాను” అను పేరు పెట్టుము.

14. నీవు ఆనందముతో ఉప్పొంగెదవు. అతని జన్మము అనేకులకు సంతోషకారణమగును.

15. ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడగును. ద్రాక్షరసమునుగాని, మద్యమునుగాని పానము చేయడు. తల్లి గర్భముననే పవిత్రాత్మతో నింపబడును.

16. అతడు యిస్రాయేలు సంతతిలో అనేకులను ప్రభువగు దేవునివైపు మరలించును.

17.అతడు ఏలీయా ఆత్మయును, శక్తియును గలవాడై ప్రభువునకు ముందుగా నడచును. తల్లి దండ్రులను, బిడ్డలను సమాధానపరచును. అవిధేయు లను నీతిమంతుల మార్గమునకు మరల్చును. ప్రభువు కొరకు సన్నద్ధులైన ప్రజలను సమాయత్తపరచును" అనెను.

18. అంతట జెకర్యా దేవదూతతో “ఇది ఎట్లు జరుగును? నేనా ముసలివాడను. నా భార్యకు కూడ వయస్సు వాలినది” అని పలికెను.

19. అపుడు దేవదూత "నేను గబ్రియేలును, దేవుని సన్నిధిలో ఉండు వాడను. ఈ శుభసమాచారమును నీకు అందజేయుటకు పంపబడితిని.

20. నీవు దేవుని విశ్వసింప నందున అది నెరవేరువరకు మూగవాడవై ఉందువు” అని పలికెను.

21. ఇంతలో వెలుపలి ప్రజలు జెకర్యా కొరకు వేచియుండి 'దేవాలయమున అతను ఇంత జాగు చేయుటకు కారణమేమిటా!' అని ఆశ్చర్యపడిరి.

22. జెకర్యా కొంత సేపటికి దేవాలయము వెలుపలకు వచ్చెను. కాని అతడు మాటలాడలేకపోయెను. అది చూచి జనులు అతనికి దేవాలయములో దివ్యదర్శనమైనదని తెలిసికొనిరి. జెకర్యా మూగవాడై సైగలు చేయుచుండెను.

23. పరిచర్యదినములు ముగియగనే జెకర్యా తన ఇంటికి వెళ్ళిపోయెను.

24. కొన్ని దినములు గడచిన పిదప జెకర్యా భార్య ఎలిశబేతమ్మ గర్భము ధరించెను. అయిదు మాసములవరకు ఆమె పరుల కంటబడకుండెను.

25. “ఈనాటికి ప్రభువు నాపై కరుణచూపెను. ప్రజల మధ్య నా నిందను పోగొట్టెను” అని ఆమె పలికెను.

26. తదుపరి ఆరవమాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలీయసీమయందలి నజరేతు నగరమునకు పంపెను.

27. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ.

28. దేవదూత లోపలికి వచ్చి, ఆమెతో “అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. ఏలినవారు నీతో ఉన్నారు” అనెను.

29. మరియమ్మ ఆ పలుకులకు కలతచెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా

30. దేవ దూత “మరియమ్మా! భయపడకుము. నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు.

31. ఇదిగో! నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు 'యేసు' అని పేరు పెట్టుము.

32. ఆయన మహనీయుడై, మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు, తండ్రియైన దావీదు సింహాసన మును ఆయనకు ఇచ్చును.

33. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు” అనెను.

34. అంతట మరియమ్మ “నేను పురుషుని ఎరుగను కదా! ఇది ఎట్లు జరుగును?" అని దూతను ప్రశ్నించెను.

35. అందుకు ఆ దూత ఇట్లనెను: “పవిత్రాత్మ నీపై వేంచేయును. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్రశిశువు 'దేవుని కుమారుడు' అని పిలువబడును.

36. నీ చుట్టమగు ఎలిశబేతమ్మను చూడుము. ఆమెకు వయస్సు మళ్ళి నదిగదా! గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసము.

37. ఏలయన, దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు”

38. అంతట మరియమ్మ “ఇదిగో నేను ప్రభువు దాసురాలను. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక!” అనెను. అంతట ఆ దూత వెళ్ళి పోయెను.

39. ఆ దినములలో మరియమ్మ యూదా సీమలో పర్వతప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను.

40. ఆమె జెకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిశబేతమ్మకు వందనవచనము పలికెను.

41. ఆ శుభవచనములు ఎలిశబేతమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను.

42. పిమ్మట ఎలిశబేతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను: “స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడినదానవు. నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను.

43. నా ప్రభువు తల్లి నాయొద్దకు వచ్చుట నాకు ఏలాగు ప్రాప్తించెను?

44. నీ వందనవచనములు నా చెవిని సోకగనే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను.

45. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు!”

46. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను: “నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది.

47. నా రక్షకుడగు దేవునియందు నాయాత్మ ఆనందించుచున్నది.

48. ఏలయన, ఆయన తనదాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇకనుండి తరతరములవారు నన్ను ధన్యురాలని పిలిచెదరు.

49. ఏలయన, సర్వశక్తిమంతుడు నాయెడల గొప్పకార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది.

50. ప్రభువుపట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరములవరకు ఉండును.

51. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్చిన్నము కావించెను.

52. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి, దీనులను లేవనెత్తెను.

53. ఆకలిగొన్నవారిని సంతృప్తిపరచి, ధనవంతులను వట్టిచేతులతో పంపివేసెను.

54. మన పితరులగు అబ్రహామునకు, అతని సంతతివారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము

55. తన కనికరమును బట్టి తన సేవకుడగు యిస్రాయేలునకు సహాయము చేసెను”.

56. మరియమ్మ మూడుమాసములు ఎలిశబేతమ్మతో ఉండి, పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను.

57. ప్రసవకాలము రాగానే ఎలిశబేతమ్మ కుమా రుని కనెను.

58. ప్రభువు ఆమెయందు గొప్ప కనికర మును చూపెనని విని, ఇరుగుపొరుగువారును, బంధువులును ఆమెతో కలసి సంతసించిరి.

59. ఎనిమిదవనాడు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చిరి. తండ్రి పేరుననుసరించి 'జెకర్యా' అను పేరు పెట్టదలచిరి.

60. కాని బాలుని తల్లి వారితో “అట్లుకాదు 'యోహాను' అను పేరు పెట్టవలయును” అని పలికెను.

61. అంతట వారు “మీ బంధువులలో ఆ పేరు గలవారు ఎవ్వరును లేరుగదా!” అని,

62. “శిశువునకు నీవు ఏ పేరు పెట్టగోరుచున్నావు?” అని సైగలతో తండ్రిని అడిగిరి.

63. అతడు పలక తెప్పించి, 'అతని పేరు యోహాను' అని వ్రాయగా, వారందరు ఆశ్చర్యపడిరి.

64. వెంటనే అతని నోరు తెరువబడి నాలుక పట్టుసడలి దేవుని స్తుతించుచు మాట్లాడసాగెను.

65. ఇరుగుపొరుగువారు ఈ అద్భుత మునకు భయపడిరి. ఈ సమాచారము యూదయా పర్వత ప్రాంతములందంతటను వ్యాపించెను.

66. ఈ విషయములను వినిన వారందరు 'ఈ పని బాలుడు ఎట్టివాడగునో!' అని మనసులో అనుకొనిరి. ఏలయన, దేవునిహస్తము అతనికి తోడైవుండెను.

67. ఆ బాలుని తండ్రి జెకర్యా పవిత్రాత్మపూర్ణుడై ఇట్లు ప్రవచించెను:

68. “ప్రభువగు యిస్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక! ఏలయన, ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేసెను.

69. తన సేవకుడగు దావీదువంశమున మన కొరకు శక్తిసంపన్నుడైన రక్షకుని ఏర్పరచెను.

70. తరతరములనుండి పవిత్ర ప్రవక్తల మూలమున ఆయన తెలియచేసినది ఇదియే.

71. ఆయన మనలను శత్రువులనుండి రక్షించుటకు, మనలను ద్వేషించువారి నుండి తప్పించుటకు రక్షకుని అనుగ్రహించెను.

72. మన పితరులను కనికరముతో చూచెను. తన పరిశుద్ధ నిబంధనమును స్పురణకు తెచ్చుకొనెను.

73-75. మనలను శత్రువుల బారినుండి విముక్తులను కావించి, నిర్భయముగా ఆయనను సేవించునట్లును, మనము జీవితాంతము పవిత్రులముగా , నీతిమంతులముగా జీవించునట్లును చేసెదనని, మనపితరుడైన అబ్రహాముతో ఆయన ప్రమాణము చేసెను.

76. కుమారా! నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు. ప్రభువు మార్గమును సిద్ధపరచుటకు వెళ్ళుదువు.

77. పాప క్షమాపణ మూలమున రక్షణ కలుగునని, ప్రజలకు తెలియచేయుటకు, ఆయనకు ముందుగా వెళ్ళుదువు.

78. దేవుడు దయార్ద్రహృదయుడు. ఆయన రక్షణపు వెలుగును మనపై ప్రకాశింపచేసి,

79. శాంతిమార్గమున మనలను నడిపించుటకు అంధకారములోను, మరణపు నీడలోను ఉన్నవారిపై దానిని ప్రసరింపచేయును.”

80. ఆ బాలుడు వృద్ధిచెందుచు, ఆత్మయందు బలసంపన్నుడాయెను. యిస్రాయేలు ప్రజలకు ప్రత్యక్షముగా ప్రబోధించువరకు అతడు ఎడారిలో ఉండెను. 

 1. తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరింపవలెనని అగుస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చెను.

2. ఈ మొదటి జనాభాలెక్కల సేకరణ కురేనియ, సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగెను.

3. అందులో పేర్లు వ్రాయించుకొనుటకు ప్రజలందరు తమతమ పట్టణములకు వెళ్ళిరి.

4. యోసేపు, దావీదు వంశస్తుడైనందున గలిలీయసీమలోని నజరేతునుండి యూదయా సీమలో ఉన్న దావీదునగరమగు బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకొనుటకై,

5. తనకు ప్రధానము చేయబడినట్టియు, గర్భవతియునైన మరియమ్మనుకూడ వెంటబెట్టుకొని వెళ్ళెను.

6. వారచట ఉన్నపుడు మరియమ్మకు ప్రసవకాలము సమీపించెను.

7. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఏలయన వారికి సత్రములో చోటు లేకుండెను.

8. ఆ ప్రాంతమున గొఱ్ఱెలకాపరులు రాత్రివేళ పొలములో గొఱ్ఱెల మందలను కాయుచుండిరి.

9. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయెను. ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి.

10. దేవదూత వారితో ఇట్లనెను: “మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభసమాచారమును మీకు వినిపించెదను.

11. నేడు దావీదునగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు, ప్రభువు.

12. శిశువు పొత్తి గుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇదేయే మీకు ఆనవాలు” అనెను.

13. వెంటనే ఆ దేవదూతతో పరలోకదూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించెను:

14. 'మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులగువారికి శాంతి కలుగుగాక!'

15. దేవదూతలు తమయొద్దనుండి పరలోకము నకు వెళ్ళిన పిదప “ప్రభువు మనకు ఎరుకపరచిన సంఘటనను చూచుటకు బేత్లెహేమునకు వెళ్ళుదము” అని గొఱ్ఱెలకాపరులు తమలో తాము అనుకొనిరి.

16. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను, యోసేపును, తొట్టిలో పరుండియున్న శిశువును కనుగొనిరి.

17. వారు శిశువునుగురించి విన్న విషయములనెల్ల వెల్ల డించిరి.

18. గొఱ్ఱెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరు మిక్కిలి ఆశ్చర్యపడిరి.

19. కాని, మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరచుకొని మననము చేయుచుండెను.

20. గొఱ్ఱెలకాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని, చూచినవానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి.

21. ఎనిమిదిదినములు గడచిన పిమ్మట శిశువునకు సున్నతిచేసి, ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు 'యేసు' అని పేరు పెట్టిరి.

22. మోషే చట్టప్రకారము వారు శుద్ధిగావించు కొనవలసినదినములు వచ్చినవి.

23. 'ప్రతి తొలి చూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును' అని ప్రభువు ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసికొనిపోయిరి.

24. చట్టప్రకారము “ఒక జత గువ్వలనైనను, రెండు పావురముల పిల్లలనైనను” బలిసమర్పణ చేయుటకు అచటకు వెళ్ళిరి.

25. యెరూషలేములో సిమియోను అను ఒక నీతిమంతుడు, దైవభక్తుడు ఉండెను. అతడు యిస్రాయేలు ఓదార్పుకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందుండెను.

26. ప్రభువు వాగ్దానము చేసిన క్రీస్తును చూచువరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను.

27. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అపుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచారవిధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసికొనిరాగా,

28. సిమియోను ఆ బాలుని హస్తములలోనికి తీసికొని దేవుని ఇట్లు స్తుతించెను:

29. “ప్రభూ! నీమాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము.

30-31. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరచిన రక్షణను నేను కనులారగాంచితిని.

32. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు; నీ ప్రజలగు యిస్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు.”

33. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతనితల్లియు, తండ్రియు ఆశ్చర్యపడిరి.

34. సిమియోను వారిని ఆశీర్వదించి, ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లనెను: “ఇదిగో! ఈ బాలుడు యిస్రాయేలీయులలో అనేకుల పతనమునకు, ఉద్దరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడియున్నాడు.

35. అనేకుల మనోగతభావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసికొనిపోనున్నది.”

36. అపుడు అచట అన్నమ్మయనెడి ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫనూయేలు పుత్రిక. ఆమె కడువృద్ధురాలు. వివాహమైన పిదప ఏడు సంవత్సరములు సంసారము చేసి,

37.ఆ తరువాత ఎనుబదినాలుగు సంవత్సరము లుగా విధవరాలై దేవాలయముచెంతనే ఉండిపోయెను. ఉపవాసములు, ప్రార్థనలు చేయుచు, రేయింబవళ్లు దేవుని సేవలో మునిగియుండెను.

38. ఆమె ఆ క్షణముననే దేవాలయములోనికి వచ్చి, దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను.

39. వారు ప్రభువు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి, గలిలీయప్రాంతములోని తమ పట్టణమగు నజరేతు నకు తిరిగివచ్చిరి.

40. బాలుడు పెరిగి దృఢకాయుడై, పరిపూర్ణ జ్ఞానము కలవాడాయెను. దేవుని అను గ్రహము ఆయనపై ఉండెను.

41. ఆయన తల్లిదండ్రులు ప్రతిసంవత్సరము పాస్కపండుగకు యెరూషలేమునకు వెళ్ళెడివారు.

42. యేసు పండ్రెండేండ్ల వయస్సు గలవాడైనపుడు వారు తమ ఆచారము ప్రకారము పండుగకు వెళ్ళిరి.

43. పండుగదినములు ముగిసిన పిదప, వారు తిరుగు ప్రయాణమైరి. కాని, బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది ఎరుగరైరి.

44. యేసు యాత్రికుల సమూహములో ఉండునని భావించి, ఒకనాటి ప్రయాణము కొనసాగించిరి. అపుడు వారు తమ బంధువులలోను. పరిచితులలోను బాలుని వెదుకనారంభించిరి.

45. వెదకివెదకి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగివచ్చిరి.

46. మూడుదినములైన తరువాత దేవాలయములో వేదబోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలను ఆలకించుచు, తిరుగు ప్రశ్నలువేయుచున్న ఆయనను వారు కనుగొనిరి.

47. ఆయన సమాధానములను వినినవారు ఆయన వివేకమునకు విస్మయమొందిరి.

48. యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్య పడిరి. అపుడు తల్లి ఆయనతో “కుమారా! ఎందులకు ఇట్లు చేసితివి? నీ తండ్రియు, నేనును విచారముతో నిన్ను వెదకుచుంటిమి” అనెను.

49. “మీరు నాకొరకు ఏల వెదకితిరి? నేను నా తండ్రి పనిమీదనుండ అవశ్యమని మీకు తెలియదా?” అని ఆయన బదులు పలికెను.

50. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి.

51. అంతట యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి, తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నియు మనస్సున పదిలపరచుకొని ఉండెను.

52. యేసు జ్ఞానమందును, ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును, ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. 

 1. అది తిబేరియ చక్రవర్తి పరిపాలన కాలములో పదునైదవ సంవత్సరము. యూదయా మండలమునకు పోంతు పిలాతు పాలకుడు. గలిలీయకు హేరోదు, ఇతూరయా, త్రకోనితిసు ప్రాంతములకు అతని సోదరుడు ఫిలిప్పు, అబిలేనేకు లిసాన్యా అధిపతులు.

2. అన్నా, కైఫా ప్రధానార్చకులు. అప్పుడు ఎడారిలో ఉన్న జెకర్యా కుమారుడగు యోహానుకు దేవుని వాక్కు వినిపించెను.

3. అతడు యోర్దాను నదీ పరిసర ప్రదేశములందంతట సంచరించుచు పాపక్షమాపణ పొందుటకై పరివర్తనముచెంది, బప్తిస్మము పొందవలెనని ప్రకటించుచుండెను.

4. యెషయా ప్రవక్త గ్రంథమందు ఇట్లు వ్రాయబడెను: 'ప్రభువు మార్గమును సిద్ధమొనర్పుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు' అని ఎడారిలో ఒక వ్యక్తి కేకలిడుచుండెను.

5. ప్రతిలోయ పూడ్చబడును, పర్వతములు, కొండలు సమము చేయబడును, వక్రమార్గములు సక్రమము చేయబడును, కరకు మార్గములు నునుపు చేయబడును.

6. సకల మానవులు దేవుని రక్షణమును గాంచుదురు.

7. తనవలన బప్తిస్మము పొందుటకు వచ్చిన జనసమూహములతో యోహాను “ఓ సర్పసంతానమా! రానున్న కోపాగ్నినుండి తప్పించుకొను మార్గమును మీకు సూచించినదెవరు?

8. మీరు ఇక హృదయ పరివర్తనమునకు తగిన పనులుచేయుడు. 'అబ్రహాము మా తండ్రి' అని మీలోరు తలపవలదు. దేవుడు ఈ రాళ్ళనుండి సైతము అబ్రహామునకు సంతానము కలుగజేయగలడని మీతో చెప్పుచున్నాను.

9. ఇప్పుడే వృక్షములను కూకటి వేళ్ళతో పెకలించి, ఛేదించుటకు గొడ్డలి సిద్ధముగా ఉన్నది. మంచిపండ్లను ఈయని ప్రతి వృక్షము నరకబడి అగ్నికి ఆహుతి అగును” అని చెప్పెను.

10. అందులకు జనులు “మేము ఏమిచేయ వలయును?” అని యోహానును అడుగగా,

11. “రెండు అంగీలున్న వ్యక్తి ఏమియు లేనివానికి ఒక దానిని ఈయవలయును. భోజనపదార్ధములు ఉన్న వాడు కూడ అట్లే చేయవలయును” అని యోహాను సమాధానము ఇచ్చెను.

12. ఆ తరువాత సుంకరులు బప్తిస్మము పొందుటకు వచ్చి, “బోధకుడా! మా కర్తవ్యము ఏమి?” అని అడుగగా

13. అతడు వారితో “నిర్ణయింపబడిన పన్నుకంటే అధికముగా మీరు ఏమియు తీసికొనవలదు” అని పలికెను.

14. రక్షకభటులు కొందరు వచ్చి, “మేము ఏమి చేయవలెను?" అని ప్రశ్నింపగా, “బలాత్కారముగాగాని, అన్యాయా రోపణవలనగాని, ఎవ్వరిని కొల్లగొట్టవలదు. మీ వేతనముతో మీరు సంతృప్తిపడుడు” అని యోహాను వారికి సమాధానము ఇచ్చెను.

15. ఇది చూచిన ప్రజలు ఈ యోహానే క్రీస్తేమో! అని తమలోతాము ఆలోచించుకొనుచుండగా

16. యోహాను వారితో ఇట్లనెను: “నేను నీటితో మీకు బప్తిస్మము ఇచ్చుచున్నాను. కాని, నాకంటె అధికుడు ఒకడు రానున్నాడు. నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను. ఆయన మీకు పవిత్రాత్మతోను, అగ్నితోను జ్ఞానస్నానము చేయించును

17. తూర్పారబట్టుటకు ఆయన చేతియందు చేట సిద్ధముగా ఉన్నది. ఆయన తన గోధుమధాన్యమును తూర్పారపట్టి గింజలను గిడ్డంగులయందు భద్రపరచి, పొట్టును ఆరనిఅగ్నిలో వేసి కాల్చివేయును.”

18. ఇట్లు యోహాను అనేక విధముల ప్రజలను హెచ్చరించుచు సువార్తను ప్రబోధించుచుండెను.

19. అధిపతియగు హేరోదును, అతని సోదరుని భార్య హేరోదియా విషయమునను, అతని ఇతర దుష్కార్యముల విషయమునను యోహాను మందలించెను.

20. ఈ దుష్కార్యములు చాలక, హేరోదు యోహానును కారా గారమున బంధించెను.

21. జనులందరు బప్తిస్మముపొందిన పిదప యేసు కూడ బప్తిస్మముపొంది, ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరువబడి

22. పవిత్రాత్మ శరీరరూపమున పావురమువలె ఆయనపై దిగివచ్చెను. ఆ సమయ మున “నీవు నా ప్రియమైన కుమారుడవు. నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను” అని ఆకాశమునుండి ఓ దివ్యవాణి విన వచ్చెను.

23. యేసు బోధింప ఆరంభించినపుడు ఆయనకు రమారమి ముప్పదిసంవత్సరముల ప్రాయము ఉండెను. ఆయన యోసేపు కుమారుడని చెప్పబడుచుండెను. యోసేపు హేలీకి,

24. హేలీ మత్తతకు, మత్తత లేవీకి, లేవీ మెల్కికి, మెల్కి యన్నయికు, యన్నయి యోసేపునకు,

25. యోసేపు మత్తతియాకు, మత్తతియా ఆమోసునకు, ఆమోసు నహూమునకు, నహూము ఎస్లికి, ఎస్లి నగ్గయికి,

26. నగ్గయి మయతునకు, మయతు మత్తతియనకు, మత్తతియ సిమియనకు, సిమియ యోసేకునకు, యోసేకు యోదానకు,

27. యోదా యోహననునకు, యోహనను రేసానకు, రేసా సెరుబ్బాబెలునకు, సెరుబ్బాబెలు షయల్తీయేలునకు, షయల్తీయేలు నేరికి,

28. నేరి మెల్కికి, మెల్కి అద్దికి, అద్ది కోసామునకు, కోసాము ఎల్మదామునకు, ఎల్మదాము ఏరునకు,

29. ఏరు యోషువానకు, యోషువా ఎలీయెజెరునకు, ఎలీయెజెరు యోరీమునకు, యోరీము మత్తతునకు, మత్తతు లేవికి,

30. లేవి సిమియోనుకు, సిమియోను యూదాకు, యూదా యోసేపునకు, యోసేపు యోనామునకు, యోనాము ఎల్యాకీమునకు,

31. ఎల్యాకీము మెలెయానకు, మెలేయా మెన్నానకు, మెన్నా మత్తతానకు, మత్తతా నాతానునకు, నాతాను దావీదునకు,

32. దావీదు యీషాయికి, యీషాయి ఓబేదునకు, ఓబేదు బోవజునకు, బోవజు శల్మానునకు, శల్మాను నయసోనునకు,

33. నయసోను అమ్మినాదాబునకు, అమ్మినాదాబు ఆరామునకు, ఆరాము ఎస్రోమునకు, ఎస్రోము పెరెసుకున, పెరెసు యూదాకు,

34. యూదా యాకోబునకు, యాకోబు ఈసాకునకు, ఈసాకు అబ్రహామునకు, అబ్రహాము తేరాకు, తేరా నాహోరునకు,

35. నాహోరు సెరూగునకు, సెరూగు రయూనకు, రయూ వెలేగునకు, పెలేగు హెబెరునకు, హెబెరు శేలేనకు,

36. శేలే కేయినానునకు, కేయినాను అర్పక్షదునకు, అర్పక్షదు షేమునకు, షేము నోవాకు, నోవా లెమెకునకు,

37. లెమెకు మెతూషెలనకు, మెతూషెల హనోకునకు, హనోకు యెరేదునకు, యెరేదు మహలలేలునకు, మహలలేలు కైనానునకు,

38. కైనాను హేనొసునకు, హేనొసు షేతునకు, షేతు ఆదామునకు కలిగిరి. ఈ ఆదాము దేవునకు కుమారుడు.

 1. యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగివచ్చి, ఆత్మ ప్రేరణవలన ఎడారి ప్రదేశమునకు నడిపింపబడెను.

2. అచట నలువది దినములు సైతానుచే శోధింపబడెను. ఆ దినములలో ఆయన ఏమియు తినలేదు. ఆ దినములు గడిచిన అనంతరం ఆకలిగొనెను.

3. అపుడు సైతాను యేసుతో “నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాయిని రొట్టెగా మార్చుము” అనెను.

4. అందుకు యేసు: “ 'మనుష్యుడు కేవలము రొట్టె వలననే జీవింపడు' అని వ్రాయబడి ఉన్నది” అని వానికి సమాధానము ఇచ్చెను.

5. అంతట సైతాను ఆయనను పైకి తీసికొని పోయి రెప్పపాటుకాలములో ప్రపంచములోని రాజ్య ములను అన్నిటిని చూపి,

6. “ఈ రాజ్యముల సర్వాధికారమును, వాని వైభవములనెల్ల నీకు ఇచ్చెదను. అట్టి అధికారము నాకు కలదు. నేను కోరినవానికి వాటిని ఈయగలను.

7. కనుక, నీవు నన్ను ఆరాధించినచో ఇదిఅంతయు నీ సొత్తు అగును” అనెను.

8. అందుకు యేసు: " 'నీ దేవుడైన ప్రభువును నీవు ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలయును' అని వ్రాయబడియున్నది” . అని పలికెను.

9. పిమ్మట సైతాను యేసును యెరూషలేమునకు తీసికొని వెళ్ళి దేవాలయ శిఖరమున నిలిపి ఇట్లనెను: “నీవు దేవుని కుమారుడవైనచో ఇచ్చటనుండి క్రిందికి దూకుము.

10. ఏలయన, ఇట్లు వ్రాయబడి ఉన్నది: 'నిన్ను రక్షింప దేవుడు తనదూతలకు - ఆయిచ్చియున్నాడు.

11. మరియు, నీవు రాళ్ళపై పడి గాయపడకుండునట్లు, నిన్ను వారు తమచేతులతో ఎత్తి పట్టుకొందురు' ".

12. అందులకు యేసు: “ 'ప్రభువైన నీ దేవుని శోధింప రాదు' అని చెప్పబడినది గదా!” అనెను.

13. ఇట్లు ఆ సైతాను అనేక విధముల శోధించిన పిదప, తగిన సమయమునకై ఆయనను విడిచివెళ్ళెను.

14. పిదప యేసు ఆత్మబలముతో గలిలియ సీమకు తిరిగి వెళ్ళెను. ఆయన కీర్తి పరిసరములందంతటను వ్యాపించెను.

15.  ఆయన వారి ప్రార్థనా మందిరములలో ఉపదేశించుచు, ప్రజలందరి మన్నన లను పొందుచుండెను.

16. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనామందిరమునకు వెళ్ళెను. అచట ఆయన చదువుటకు నిలుచుండగా,

17. యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచన ములు కనపడెను.

18. “ప్రభువు ఆత్మ నాపై ఉన్నది. పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగ చేయుటకును,

19. ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను.”

20. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్ధనా మందిరములోని వారందరు, ఆయనవంక తేరి చూచుచుండగా,

21. ఆయన వారితో “నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది” అని పలికెను.

22. అది వినిన ప్రజలందరు దయాపూరితములగు ఆయన మాటలకు ఆశ్చర్యపడి “ఇతడు యోసేపు కుమారుడు కాడా?” అని చెప్పుకొనసాగిరి.

23. అంతట యేసు వారితో ' ఓ వైద్యుడా! నీకు నీవే చికిత్స చేసికొనుము' అను సామెతను చెప్పి, “ 'నీవు కఫర్నాములో ఏ యే కార్యములు చేసితివని మేము వింటిమో, ఆ కార్యములనెల్ల ఇచట నీ స్వదేశములో సైతము చేయుము' అని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు.

24. ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడడని మీతో నిశ్చయముగా పలుకు చున్నాను.

25. వాస్తవము ఏమనగా, ఏలీయా కాలమున మూడు సంవత్సరముల ఆరు మాసములు అనావృష్టివలన దేశమంతట గొప్పకరువు వ్యాపించి నది. ఆనాడు యిస్రాయేలీయులలో పెక్కుమంది విధవరాండ్రు ఉండినను,

26. సీదోనులోని సరెఫాతు గ్రామమున నివసించు విధవరాలి యొద్దకు మాత్రమే ఏలీయా పంపబడెను.

27. ప్రవక్తయగు ఎలీషా కాలములో యిస్రాయేలీయులలో చాలామంది కుష్ఠురోగులు ఉన్నను, సిరియా నివాసియగు నామాను తప్ప మరి ఎవ్వరును స్వస్థతపొందలేదు” అని పలికెను.

28. అపుడు ప్రార్థనామందిరములోని ప్రజలు అందరు యేసు మాటలను విని మండిపడిరి.

29. వారు లేచి యేసును నగరము వెలుపలకు నెట్టుకొనిపోయి, తమ నగరము నిర్మింపబడిన పర్వతాగ్రమునకు తీసికొని వెళ్ళి, అచట నుండి తలక్రిందుగా పడత్రోయతలచిరి.

30. కాని, యేసు వారి మధ్యనుండి తొలగి తనదారిన తాను వెళ్ళిపోయెను.

31. పిదప ఆయన గలిలీయసీమలోని కఫర్నామునకు వచ్చి, విశ్రాంతిదినమున ప్రజలకు బోధించు చుండెను.

32. ఆయన బోధకు వారందరు ఆశ్చర్య పడిరి. ఏలయన, ఆయన అధికారపూర్వకముగా బోధించుచుండెను.

33. ఆ ప్రార్థనామందిరములో దయ్యముపట్టిన వాడొకడు కేకలువేయుచు,

34. “ఆహా! నజరేతు నివాసియగు యేసూ! మాతో నీకేమి పని? మమ్ము నాశనము చేయవచ్చితివా? నీవు ఎవరవో నేను ఎరుగుదును. నీవు దేవుని పవిత్రమూర్తివి” అని అరచెను.

35. “నోరు మూసుకుని వీనినుండి వెడలిపొమ్ము” అని యేసు ఆ దయ్యమును గద్దింపగా అందరి ఎదుట అది వానిని విలవిల లాడించి వానికి ఏ హానియు చేయక వెళ్ళిపోయెను.

36. ఇది చూచి జనులందరు ఆశ్చర్యపడి “ఇతడు అధికారముతోను, శక్తితోను, అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగనే అవి వెడలిపోవుచున్నవి” అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి.

37. అపరిసరములందంతట ఆయనను గూర్చిన సమాచారము వ్యాపించెను.

38. పిదప యేసు ప్రార్థనా మందిరమును వీడి, తిన్నగా సీమోను ఇంటికి పోయెను. అపుడు సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో మంచము పట్టియుండెను. వారు ఆమె విషయము ఆయనకు మనవి చేసికొనిరి.

39. అపుడు ఆయన ఆమెచెంత నిలిచి జ్వరమును గద్దింపగా అది విడిచిపోయెను. ఆమె వెంటనే లేచి వారికి పరిచర్యచేయసాగెను.

40. ప్రొద్దుగ్రుంకుచుండగా నానావిధ రోగ పీడితులైన వారినందరిని వారివారి బంధువులు యేసు వద్దకు తీసికొనివచ్చుచుండిరి. అపుడు ఆయన వారిలో ఒక్కొక్కనిమీద తన హస్తమునుంచి వారినందరిని స్వస్థపరచెను.

41. అనేకుల నుండి దయ్యములు “నీవు దేవుని కుమారుడవు” అని ఆర్భటించుచు వదలి పోయెను. అవి ఆయన క్రీస్తు అని ఎరిగియుండుట వలన ఆయన వానిని గద్దించి, మాటాడనీయలేదు.

42. వేకువనే లేచి యేసు ఒక నిర్జనప్రదేశమునకు వెళ్ళెను. ప్రజలు ఆయనను వెదకుచు వచ్చి, తమను విడిచిపోవలదని అనగా,

43. ఆయన వారితో “నేను ఇతర పట్టణములలోకూడ దేవుని రాజ్యమును గురించి బోధింపవలసివున్నది. అందులకే నేను పంపబడితిని” అని పలికెను.

44. పిమ్మట యేసు యూదయా ప్రార్థనా మందిరములలో బోధించుచుండెను. 

 1. యేసు ఒక పర్యాయము గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచియుండగా జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయనయొద్దకు నెట్టు కొనుచు వచ్చిరి.

2. ఆయన అచట రెండు పడవలను చూచెను. జాలరులు వానినుండి దిగి తమ వలలను శుభ్రపరచుకొనుచుండిరి.

3. అందులో ఒకటి సీమోను పడవ. యేసు ఆ పడవనెక్కి దానిని ఒడ్డుననుండి లోనికి త్రోయుమని, అందు కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించెను.

4. ఉపదేశించుట ముగించిన పిదప యేసు సీమోనుతో “మీరు పడవను ఇంకను లోతునకు తీసికొని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు” అనెను

5. అందుకు సీమోను “బోధకుడా! మేము రాత్రి అంతయు శ్రమించితిమి. కాని ఫలితము లేదు. అయినను మీ మాట మీద వలలను వేసెదము” అని ప్రత్యుత్తరము ఇచ్చెను.

6. వల వేయగనే, వల చినుగు నన్ని చేపలు పడెను.

7. అంతట జాలరులు రెండవ పడవలోనున్న తమ తోటివారికి, వచ్చి సహాయము చేయుడని ప్రాధేయపడగా, వారు వచ్చి రెండు పడవ లను చేపలతో నింపగనే పడవలు మునుగునట్లు ఉండెను.

8. సీమోను పేతురు ఇది చూచి యేసు పాదములపై పడి “ప్రభూ! నేను పాపాత్ముడను. నన్ను విడిచిపొండు” అని పలికెను.

9. ఇన్ని చేపలుపడుట చూచి సీమోను, అతని తోటివారు ఆశ్చర్యపడిరి.

10. సీమోనుతో ఉన్న జెబదాయి కుమారులు యాకోబు, యోహానులును అట్లే ఆశ్చర్యపడిరి. యేసు అపుడు సీమోనుతో “భయపడవలదు.ఇక నుండి నీవు మనుష్యు లను పట్టువాడవై ఉందువు” అనెను.

11. ఆ జాలరులు పడవలను ఒడ్డునకుచేర్చి తమ సమస్తమును విడిచి పెట్టి యేసును అనుసరించిరి.

12. యేసు ఒకానొక పట్టణమున ఉండగా కుష్ఠ రోగి ఒకడు ఆయనయొద్దకు వచ్చి సాగిలపడి, “ప్రభూ! తమ చిత్తమైనచో నన్ను ఆరోగ్యవంతుని చేయగలరు” అని ప్రార్థించెను.

13. యేసు తన చేయి చాపి, అతనిని తాకి, “అది నాకు ఇష్టమే. నీవు స్వస్థుడవు కమ్ము” అని పలికెను. వెంటనే అతని కుష్ఠముపోయి స్వస్థత కలిగెను.

14. యేసు అపుడు “ఎవరితోను నీవు ఈ విషయమును చెప్పరాదు” అని ఆజ్ఞాపించి “నీవు వెళ్ళి యాజకునకు కనిపింపుము. నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను సమర్పింపుము” అని వానిని పంపివేసెను.

15. అయినను ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. ఆయన ఉపదేశములను వినుటకు, రోగవిముక్తు లగుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి.

16. కాని యేసు నిర్జనస్థలములకు వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేసికొనెను.

17. ఒకనాడు ఆయన బోధించుచుండగా యెరూషలేము, గలిలీయ, యూదయాలోని గ్రామముల నుండి వచ్చిన పరిసయ్యులును, ధర్మశాస్త్ర బోధకులును ఆయన ఎదుట కూర్చుండియుండిరి. స్వస్థతనిచ్చు ప్రభుశక్తి ఆయనయందుండెను.

18. అపుడు కొందరు పక్షవాత రోగినొకనిని పడకపై మోసికొని వచ్చి, ఇంటిలోపల బోధించుచున్న ఆయనచెంతకు చేర్చ ప్రయత్నించిరి.

19. ఆ ఇల్లు జనసమూహముచే క్రిక్కిరిసి ఉన్నందున అది వారికి సాధ్యపడలేదు. అపుడు వారు ఇంటి పైకి ఎక్కి కప్పును తీసివేసి మంచముతో పాటు రోగిని ఆయనముందట దించిరి.

20. యేసు వారి విశ్వాసమును చూచి, “ఓయీ! నీ పాపములు క్షమింపబడినవి” అని అతనితో చెప్పెను.

21. అందుకు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు "దైవ దూషణములు పలికెడి ఇతడెవరు? దేవుడుతప్ప మరెవ్వరు పాపములు క్షమింపగలరు?" అని లోలోన తర్కించుకొనసాగిరి.

22. యేసు వారి ఆలోచనలను గ్రహించి “మీ హృదయ ములలో ఏల తర్కించుకొనెదరు?

23. ఏది సులభ తరము? నీ పాపములు క్షమింపబడినవి అనుటయా? లేక లేచి నడువుము అనుటయా?

24. కాని, భూలోక మున మనుష్యకుమారునకు పాపములు క్షమించు అధికారము కలదని మీకు నిరూపింతును” అని చెప్పి, పక్షవాత రోగితో “నీ పడకను ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పుచున్నాను” అని పలికెను.

25. ఆ పక్షవాత రోగి తక్షణమే లేచి, పడకను తీసికొని దేవుని స్తుతించుచు తన ఇంటికి వెళ్ళెను.

26. వారందరు ఆశ్చర్యచకితులై భయపడుచు “నేడు మనమెట్టి వింత లను చూచితిమి” అని దేవుని పొగడిరి.

27. అటుపిమ్మట యేసు అచటనుండి వెడలి సుంకపు మెట్టుకడ కూర్చుండియున్న 'లేవి' అను సుంకరిని చూచి, అతనితో “నన్ను అనుసరింపుము" అనెను.

28. అతడు అంతయు విడిచి పెట్టి లేచి ఆయనను అనుసరించెను.

29. లేవి తనఇంట ఆయనకు గొప్పవిందుచేసెను. అనేకమంది సుంకరులు, ఇతరులు ఆయనతో కలిసి విందులో పాల్గొనిరి.

30. అపుడు పరిసయ్యులును, వారికి చెందిన ధర్మశాస్త్ర బోధకులును, సణగుకొనుచు “సుంకరులతోను, పాపులతోను, మీరేల తిని త్రాగుచున్నారు?” అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి.

31. అపుడు యేసు “వ్యాధిగ్రస్తులకే కాని, ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదుగదా!

32. హృదయపరివర్తనము పొందుటకై నేను పాపులను పిలువ వచ్చితినికాని, నీతిమంతు లను పిలుచుటకు రాలేదు” అని సమాధానమిచ్చెను.

33. “యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ములు, ప్రార్థనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులును చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము తిని త్రాగుచున్నారేల?” అని కొందరు యేసును ప్రశ్నించిరి.

34. అందుకు యేసు “పెండ్లికుమారుడు ఉన్నంతవరకు విందునకు వెళ్ళినవారు ఉపవాసము చేయుదురా? పెండ్లికుమారుడు తమవెంట ఉన్నంత వరకు ఆ ఇంటి వారిచేత ఉపవాసము చేయింప గలరా?

35. పెండ్లికుమారుడు వారిని ఎడబాయు కాలము వచ్చును. అపుడు వారు ఉపవాసము చేయు దురు” అని వారితో పలికెను.

36. యేసు వారికి ఇంకను ఈ ఉపమానమును చెప్పెను: “ప్రాతగుడ్డకు మాసికవేయుటకు క్రొత్తగుడ్డను ఎవరు చింపుదురు? అటుల చేసినయెడల క్రొత్తగుడ్డ చినిగి పోవుటయేకాక, అది ప్రాతగుడ్డకు అతుకు కొనదు.

37. అట్లే కొత్త ద్రాక్షరసమును ప్రాతతిత్తులలో ఎవరును పోయరు. అటుల పోసినయెడల ఆ ప్రాత తిత్తులు పిగులును, ఆ రసము నేలపాలగును, తిత్తులు నశించిపోవును.

38. కనుక, క్రొత్త రసమును క్రొత్తతిత్తులలోనే ఉంచవలయును.

39. ప్రాత రసమునకు అల వడినవాడు క్రొత్తరసమును తాగుటకు ఇష్టపడడు. అతడు ప్రాతరసమే మేలు అనును.”

 1. యేసు ఒక విశ్రాంతిదినమునపంటచేల గుండ పోవుచుండగా శిష్యులు వెన్నులు త్రుంచి చేతితో నులిమికొని తినసాగిరి.

2. “విశ్రాంతిదినమున నిషేధింపబడిన కార్యమును మీరుఏల చేయుచున్నారు?” అని పరిసయ్యులలో కొందరు ప్రశ్నించిరి.

3. అందుకు యేసు వారితో “దావీదు, అతని అనుచరులు ఆకలిగొనినపుడు ఏమి చేసినది మీరు ఎరుగరా?

4. అతడు దేవుని ఆలయములో ప్రవేశించి, యాజకులు తప్ప, ఇతరులు తినగూడని నైవేద్యపు రొట్టెలను తాను తిని, తన అనుచరులకును పెట్టెనుగదా!

5.మరియు మనుష్య కుమారుడు విశ్రాంతిదినమునకు అధిపతి” అని చెప్పెను.

6. యేసు మరియొక విశ్రాంతిదినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళి ఉపదేశింపనారంభించెను. అచట కుడిచేయి ఊచపోయినవాడు ఒకడు ఉండెను.

7. విశ్రాంతిదినమున స్వస్థపరచినచో యేసుపై నేరము మోపవచ్చునని ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు పొంచియుండిరి.

8. వారి ఆలోచనలను గ్రహించిన యేసు ఊచచేయివానితో "లేచి మా మధ్యన నిలువబడుము” అనెను. వాడు అట్లే లేచి నిలబడెను.

9. ఆయన వారితో “విశ్రాంతిదినమున మేలుచేయుట ధర్మమా? కీడుచేయుట ధర్మమా? జీవితమును రక్షించుట న్యాయమా? జీవితమును నాశనము చేయుట న్యాయమా? అని మిమ్ము ప్రశ్నించుచున్నాను” అని చుట్టుప్రక్కల

10. కలియచూచి, వానితో “నీ చేయి చాపుము” అనెను. వాడు అటులనే చేయిచాచెను. వాని చేయి రెండవ చేతివలె బాగుపడెను.

11. అది చూచి వారు వెట్టికోపముతో యేసును ఏమిచేయు దమా? అని మంతనములు సలుపసాగిరి.

12. ఆ రోజులలో యేసు ప్రార్థన చేసికొనుటకై కొండకు వెళ్ళెను. రాత్రి అంతయు దైవప్రార్ధనలో మునిగియుండెను.

13. ప్రాతఃకాలమున తన శిష్యులను పిలిచి, వారిలో పండ్రెండుమందిని ఎన్నిక చేసి వారికి అపోస్తలులు అను పేరు పెట్టెను.

14. వారు: పేతురు అనబడు సీమోను, అతని సోదరుడగు అంద్రియ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తోల్లోమయి,

15. మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, దేశభక్తుడనబడు సీమోను,

16. యాకోబు సోదరుడైన యూదా, ఆయనను అప్పగించిన ద్రోహి యూదాఇస్కారియోతు.

17. అటుపిమ్మట యేసు వారితోగూడ కొండ దిగివచ్చి, పెక్కుమంది అనుచరులతో మైదానమున నిలుచుండెను. యూదయా దేశమంతటనుండియు యెరూషలేమునుండియు, తూరు సీవోను అను సముద్రతీరపు పట్టణములనుండి ప్రజలు అనేకులు అచట చేరియుండిరి.

18. వారు యేసు ఉపదేశములను ఆలకించుటకు, రోగముల నుండి విముక్తి పొందుటకు వచ్చిరి. అపవిత్రాత్మలచే పీడింపబడువారు వచ్చి స్వస్థత పొందిరి.

19. యేసు నుండి మహాశక్తి వెలువడి అందరిని స్వస్థపరచుటవలన జనులెల్లరు ఆయనను తాకుటకై తహతహలాడుచుండిరి.

20. యేసు కనులెత్తి శిష్యులవైపు చూచి , ఇట్లు ఉపదేశింప ఆరంభించెను: “పేదలగు మీరు ధన్యులు. దేవరాజ్య ము మీది.

21. ఇపుడు ఆకలిగొనియున్న మీరు ధన్యులు. మీరు సంతృప్తి పరపబడుదురు. ఇపుడు శోకించు మీరు ధన్యులు, మీరు ఆనందింతురు.

22. మనుష్యకుమారుని నిమిత్తము, మనుష్యులు మిమ్ము ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడగొట్టినపుడు మీరు ధన్యులు.

23. ఆరోజున మీరు ఆనందపడుడు. మహానందపడుడు. ఏలయన, పరలోకమున మీ బహుమానము గొప్పది. వారి పితరులు ప్రవక్తలపట్ల ఇట్లే ప్రవర్తించిరి.

24. అయ్యో! ధనికులారా! మీకనర్థము. మీరు మీ సుఖములను అనుభవించియున్నారు.

25. అయ్యో! ఇపుడు కడుపునిండినవారలారా! మీకు అనర్ధము. మీరు ఆకలితో అలమటింతురు. అయ్యో! ఇపుడు నవ్వుచున్నవారలారా! మీరు దుఃఖించి ఏడ్చెదరు.

26. ప్రజలెల్లరు మిమ్ము ప్రశంసించినప్పుడు మీకు అనర్థము, వీరి పితరులు కపట ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి.

27. “కాని, మీతో నేను చెప్పునది ఏమన: మీ శత్రువును ప్రేమింపుడు. మిమ్ము ద్వేషించువారికి మేలు చేయుడు.

28. మిమ్ము శపించువారిని ఆశీర్వదిం పుడు. మిమ్ము బాధించువారికై ప్రార్థింపుడు.

29. నిన్ను ఒక చెంపపై కొట్టినవానికి రెండవ చెంషను కూడా చూపుము. నీ పైబట్టను ఎత్తుకొనిపోవు వానిని నీ అంగీనికూడ తీసికొనిపోనిమ్ము.

30. నిన్ను అడిగిన ప్రతివానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొనిపోవు వానిని తిరిగి అడుగవలదు.

31. ఇతరులు మీకు ఎట్లు చేయ వలెనని మీరు కోరుదురో అట్లే మీరును ఇతరులకు చేయుడు.

32. మిమ్ము ప్రేమించినవారిని మాత్రమే మీరు ప్రేమించినచో యిందు మీ ప్రత్యేకత ఏమి? పాపులు సహితము అటుల చేయుటలేదా?

33. ఉపకారికి మాత్రమే ప్రత్యుపకారము చేసినయెడల అందు మీ ప్రత్యేకత ఏమి? పాపులు సహితము అటుల చేయుటలేదా?

34. తిరిగి ఈయగల వారికే ఋణము ఇచ్చుటలో మీ ప్రత్యేకత ఏమి? పాపులును అటుల పాపులకు ఇచ్చుటలేదా?

35. కనుక, మీరు మీ శత్రువులను ప్రేమింపుడు. వారికి మేలు చేయుడు, అప్పు ఇచ్చి తిరిగిపొందవలెనని ఆశపడకుడు. అపుడు మీకు గొప్ప బహుమానము లభించును. మీరు సర్వోన్న తుడగు దేవుని బిడ్డలగుదురు. ఏలయన, ఆయన కృతజ్ఞతలేని వారికిని, దుష్టులకును మేలుచేయును.

36. మీ తండ్రివలె మీరును కనికరము గలవారై యుండుడు.

37. "పరులనుగూర్చి మీరు తీర్పుచేయకుడు. మిమ్మును గూర్చియు తీర్పుచేయబడదు. పరులను ఖండింప కుడు. అపుడు మీరును ఖండింపబడరు. పరులను క్షమింపుడు. మీరును క్షమింపబడుదురు.

38. పరులకు మీరు ఒసగుడు. మీకును ఒసగబడును, కుదించి, అదిమి, పొర్లిపోవు నిండుకొలమానముతో ఒసగబడును. మీరు ఏ కొలతతో కొలుతురో, ఆ కొలతతోనే మీకును కొలువబడును” అని యేసు పలికెను.

39. ఆయన మరల వారికి ఉపమాన పూర్వక ముగా ఇట్లు చెప్పెను. "గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి మార్గము చూపగలడా? అటుల చేసినచో వారు ఇరువు రును గోతిలో పడుదురుగదా!.

40. శిష్యుడు తన గురువుకంటె గొప్పవాడు కాడు. సంపూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు తన గురువువలె ఉండును.

41. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరుని కంటిలోని నలుసును వేలెత్తి చూపెదవేల?

42. నీ కంటిలోని దూలమును గమనింపక, నీ సోదరునితో, 'సోదరా! నీ కంటిలోని నలుసును తీసి వేయనిమ్ము' అని ఎట్లు చెప్పగలవు? కపట వేషధారీ! ముందుగా నీకంటిలోని దూలమును తీసివేసికొనుము. అపుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగానుండును.

43. “మంచిచెట్టు చెడుపండ్లను, చెడు చెట్టు మంచిపండ్లను ఈయజాలదు. పండును బట్టియే ప్రతి వృక్షము గుర్తింపబడును.

44. ముండ్లపొదలనుండి అత్తిపండ్లు లభింపవు. కోరింద పొదలనుండి ద్రాక్ష పండ్లు లభింపవు.

45. సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును. దుర్జనుడు తన దుష్కోశ మునుండి దుర్వస్తువులను తెచ్చును. ఏలయన, హృదయ పరిపూర్ణతనుండి నోటిమాట వెలువడును.

46. “నేను చెప్పినట్లు చేయక, 'ప్రభూ! ప్రభూ!' అని నన్ను ఊరక పిలుచుచున్నారేల?

47. నాయొద్దకు వచ్చి, నాబోధలను ఆలకించి, ఆవిధముగా ఆచరించు వాడు ఎవనిని పోలియుండునో మీకు వివరించెదను.

48. వాడు లోతుగా త్రవ్వి, రాతిమీద పునాది వేసి, ఇల్లు కట్టుకొనిన వానిని పోలియుండును. వరదవచ్చి, ప్రవాహము ఆ ఇంటిని వడిగా కొట్టినను, అది గట్టిగా కట్టబడి ఉండుటచే చెక్కుచెదరలేదు.

49. కాని నా బోధలు వినియు, ఆచరింపనివాడు, పునాది వేయక నేలపై ఇల్లు కట్టినవానిని పోలియున్నాడు. వరద వచ్చి ప్రవాహము వడిగా ఆ ఇంటిని కొట్టినంతనే, అది కూలిపోయెను. ఆ వినాశనము ఎంత భయంకరము!" 

 1. అంతట యెరూషలేమునుండి వచ్చిన కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి.

2. వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుగుకొనకయే భోజనము చేయుటను చూచిరి.

3. పూర్వుల సంప్రదాయము ప్రకారము యూదులకు, ముఖ్యముగా పరిసయ్యులకు చేతులు కడుగు కొనక భుజించు ఆచారములేదు.

4. అంగటినుండి కొనివచ్చిన ఏ వస్తువునైనను వారు శుద్ధిచేయక భుజింపరు. అట్లే పానపాత్రలను, కంచుపాత్రలను శుభ్రపరుపవలయునను ఆచారములు ఎన్నియో వారికి కలవు.

5. కనుక పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు “తమ శిష్యులు పూర్వుల సంప్రదాయములను లెక్క చేయక మలినహస్తములతో భుజించుచున్నారేమి?” అని యేసును ప్రశ్నించిరి.

6. అందుకు ఆయన వారితో "కపట భక్తులారా! మిమ్ముగూర్చి యెషయా ప్రవక్త ఎంతసూటిగా ప్రవచించెను. ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు కాని వీరి హృదయములు నాకు దూరముగానున్నవి.

7. మానవులు ఏర్పరచిన నియమములను దైవప్రబోధములుగా బోధించుచున్నారు. కావున వారుచేయు ఆరాధన వ్యర్ధము.

8. దేవుని ఆజ్ఞను నిరాకరించి, మానవనియమ ములను అనుసరించుచున్నారు”అని పలికెను.

9. మరియు ఆయన వారితో “ఆచారముల నెపముతో మీరు దేవుని ఆజ్ఞలను నిరాకరించుచున్నారు.

10. 'తల్లిదండ్రులను గౌరవింపుడు, తల్లిదండ్రులను దూషించువాడు మరణదండనకు గురియగును' అని మోషే ఆజ్ఞాపించెనుగదా!

11. ఎవ్వడేని తన తండ్రితోగాని, తనతల్లితోగాని 'నానుండి మీరు పొందవలసినది దైవార్పితమైనది' అని చెప్పినచో

12. అట్టి వాడు తనతండ్రినిగాని, తల్లినిగాని ఆదుకొను అవసరములేదని మీరు బోధించుచున్నారు.

13. ఈ రీతిని మీరు పూర్వసంప్రదాయమును అనుసరించు నెపమున దైవవాక్కునే అనాదరము చేయుచున్నారు. ఇట్టివి అనేకములు మీరు చేయుచున్నారు” అని చెప్పెను.

14. పిదప, ఆయన జనసమూహమును తిరిగి పిలిచి “మీరు విని, గ్రహించుకొనగలరు.

15. వెలుపల నుండి లోపలికిపోయి మనుష్యుని అపవిత్రునిగా చేయ గలిగినది ఏదియును లేదు. కాని, లోపలినుండి బయలువెళ్ళునవే మనుష్యుని అపవిత్రునిగా చేయును.

16. వినుటకు వీనులున్నవారు విందురుగాక!” అని అనెను.

17. ఆయన ఆ జనసమూహమును వీడి గృహమున ప్రవేశించినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమాన భావమును వివరింపమని అడిగిరి.

18. అంతట యేసు శిష్యులను చూచి, “మీరును ఇంతటి మందమతులా? మానవుడు భుజించునది ఏదియు అతనిని మాలిన్య పరచదు.

19.ఏలయన, అది హృదయములో ప్రవేశింపక ఉదరములో ప్రవేశించి, ఆ పిమ్మట విసర్జింపబడు చున్నది. అన్ని పదార్ధములు భుజింపదగినవే” అని ఆయన పలికెను.

20. “మానవుని మాలిన్యపరచునది వాని అంతరంగమునుండి వెలువడునదియే.

21. ఏలయన, హృదయమునుండి దురాలోచనలు, వేశ్యాసంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము,

22. దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్స ర్వము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును.

23. ఇట్టి చెడుగులు అన్నియు మానవుని అంతరంగమునుండియే వెలువడి అతనిని మలిన పరచును” అని పలికెను.

24. అపుడు ఆయన ఆ స్థలమునువీడి, తూరు, సీదోను ప్రాంతములకు వెళ్ళెను. ఆయన ఒక గృహమున ప్రవేశించి, అచట ఎవ్వరికి తెలియకుండ ఉండగోరెను. కాని అది సాధ్యపడలేదు.

25. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తెగల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వచ్చి, ఆయన పాదములపై బడెను.

26. దయ్యము పట్టిన తన కుమార్తెను స్వస్థపరుప ప్రార్ధించెను. ఆమె గ్రీసు దేశీయురాలు, సిరో పెనిష్యాలో పుట్టినది.

27. అందుకు యేసు “పిల్లలు మొదట తృప్తిచెందవలెను. పిల్లల రొట్టెను తీసి కుక్కపిల్లలకు వేయుట తగదు” అని పలికెను.

28. అప్పుడు ఆమె “అది నిజమే స్వామీ! కాని, పిల్లలు పడవేయు రొట్టెముక్కలను భోజనపు బల్లక్రింద ఉన్న కుక్కపిల్లలును తినునుగదా!” అని బదులు పలికెను.

29.అందుకు ఆయన, నీ సమాధానము మెచ్చదగినది. నీ కుమార్తె స్వస్థత పొందినది. ఇక నివు పోయిరమ్ము” అని చెప్పెను.

30. అంతట ఆమె  ఇంటికి వెళ్ళి దయ్యము వదలిపోయినందున తన కుమార్తె ప్రశాంతముగా పరుండియుండుటను చూచెను.

31. పిమ్మట యేసు తూరు ప్రాంతమునువీడి, సీదోను, దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలీయ సరస్సు తీరమును చేరెను.

32. అపుడు అచటిజనులు మూగ,చెవిటివానిని ఆయనయొద్దకు తీసికొనివచ్చి, వాని మీద ఆయన హస్తమునుంచుమని ప్రార్థించిరి.

33. యేసు వానిని జనసమూహమునుండి ప్రక్కకు తీసికొనిపోయి, వాని చెవులలో తన వ్రేళ్ళు పెట్టి, ఉమ్మి నీటితో వానినాలుకను తాకి,

34. ఆకాశమువైపు కన్నులెత్తి, నిట్టూర్చి “ఎప్పతా” అనెను. అనగా “తెరువ బడుము” అని అర్థము.

35. వెంటనే వాని చెవులు తెరువబడెను. నాలుక పట్టుసడలి వాడు తేలికగా మాటాడసాగెను.

36. “ఇది ఎవరితో చెప్పరాదు” అని ఆయన వారిని ఆదేశించెను. ఆయన వలదన్నకొలది మరింత ఎక్కువగా దానిని వారు ప్రచారముచేసిరి.

37. “చెవిటివారు వినునట్లుగా, మూగవారు మాటాడు నట్లుగా సమస్తమును ఈయన చక్కపరచియున్నాడు” అని అందరును మిక్కిలి ఆశ్చర్యపడిరి. 

 1. ఆ తరువాత యేసు పట్టణములందును, గ్రామములందును పర్యటించుచు, దైవరాజ్యమును గురించిన సువార్తను బోధించుచుండెను. పన్నిద్దరు శిష్యులును,

2. అపవిత్రాత్మలనుండియు, రోగముల నుండియు స్వస్థులైన కొందరు స్త్రీలును ఆయన వెంట ఉండిరి. ఏడుదయ్యములనుండి విముక్తి పొందిన మగ్దలేన అనబడు మరియమ్మ,

3. హేరోదు గృహ నిర్వాహకుడగు 'ఖూజా' భార్యయగు యోహాన్నయు, సూసన్నయు, మరియు వారిసొంత వనరులనుండి వారి నిత్యావసరములకు తోడ్పడుచున్న పెక్కుమంది ఇతర స్త్రీలును వెంట ఉండిరి.

4. ప్రతి పట్టణమునుండి పెద్ద ప్రజా సమూహము యేసువద్దకు వచ్చెను.

5. అపుడు ఆయన ఉపమాన రీతిగా ఇట్లు చెప్ప నారంభించెను: “విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు బయలు దేరెను. అతడు విత్తనములు చల్లునపుడు కొన్ని విత్తన ములు త్రోవప్రక్కనపడగా అవి తొక్కివేయబడెను, పక్షులువచ్చి వాటిని తినివేసెను.

6. మరికొన్ని రాతినేలమీద పడగా తేమ లేనందున అవి మొలకలు ఎత్తగనే ఎండి పోయెను.

7. మరికొన్ని విత్తనములు ముండ్లపొదల మధ్య పడినవి. కాని మొక్కలతో పాటు ముండ్లపొదలు ఎదిగి ఆ మొక్కలను అణచివేసినవి.

8. ఇంకను కొన్ని విత్తనములు సారవంతమైన నేలపై పడి మొలిచి పెరిగి నూరంతలుగా ఫలించినవి” అని చెప్పి, “వినుటకు వీనులున్నవాడు వినునుగాక!” అనెను.

9. యేసు శిష్యులు అపుడు ఈ ఉపమానము యొక్క భావము ఏమిటని ఆయనను అడిగిరి.

10. “పరలోకరాజ్య పరమరహస్యముల జ్ఞానము అను గ్రహింపబడినది మీకే, ఇతరులు చూచియు చూడ కుండుటకు, వినియు గ్రహింపకుండుటకు, వారికి ఉపమానముల మూలమున బోధింపబడును.

11. “ఈ ఉపమానములోని భావము ఏమనగా, విత్తనము దేవుని వాక్కు.

12. త్రోవప్రక్కనపడిన విత్తనములను పోలినవారు దేవునివాక్కులను ఆలకింతురుగాని, వారు నమ్మి రక్షింపబడకుండునట్లు సైతాను వారి హృదయమునుండి వాటిని ఎత్తుకొని పోవును.

13. దేవుని వాక్కును ఆలకించి సంతోషముతో స్వీకరించువారు, రాతిమీదపడిన విత్తనముల వంటివారు. వేరు లేనందున అట్టివారు కొలదికాలము మాత్రమే విశ్వసించి శోధనకాలమున పతనమగుదురు.

14. ముండ్లపొదల మధ్యన పడిన విత్తనము లను పోలినవారు సందేశమును ఆలకింతురుగాని, వారు ప్రాపంచిక చింతలచేత, ధనవ్యామోహముచేత, సుఖభోగములచేత అణచివేయబడి తగుఫలమును ఈయరు.

15. సారవంతమైన నేలపైబడిన విత్తనము లను పోలినవారు, యోగ్యమైన మంచిమనస్సుతో దేవుని వాక్కును ఆలకించి, అవలంబించి ఓర్పుతో ఫలించువారు.

16. ఎవడైనను దీపమును వెలిగించి దానిమీద మూతపెట్టడు లేదా మంచము క్రింద ఉంచడు. లోనికి వచ్చువారికి వెలుగునిచ్చుటకై దానిని దీపస్తంభముపై ఉంచును.

17. దాచబడినది ఏదియు బయలుపడక పోదు.రహస్యమైనది ఏదియు బట్టబయలు కాకపోదు.

18. ఉన్నవానికే ఈయబడును, లేనివానికి తనకు ఉన్నది అని అనుకొనునది కూడ తీసివేయబడును. కనుక మీరు ఎట్లు వినుచున్నారో గమనింపుడు.

19. యేసు తల్లియు, సోదరులును ఆయన యొద్దకు వచ్చిరి. జనులు క్రిక్కిరిసి ఉండుటవలన ఆయనను కలసికొనలేకపోయిరి.

20. “నీ తల్లియు, సోదరులును, నీతో మాటలాడుటకై వెలుపల వేచియున్నారు” అని ఒకరు చెప్పిరి.

21. అందుకు యేసు వారితో “దేవుని వాక్కును ఆలకించి, పాటించువారె నా తల్లియు నా సోదరులు" అని పలికెను.

22. ఒక రోజు యేసు శిష్యసమేతముగా పడవ నెక్కి వారితో “మనము సరస్సు ఆవలితీరమునకు పోవుదము" అనెను. వారు అటులనే పయనమైరి.

23. పడవపై వారు పోవుచుండగా యేసు అందు నిద్రించుచుండెను. అంతలో గాలివాన వీచినందున పడవ నీటితోనిండి పెద్ద ప్రమాదమునకు గురి ఆయెను.

24. అప్పుడు వారు యేసు దగ్గరకు వచ్చి ఆయనను నిదురనుండి మేలుకొలిపి “ప్రభూ! ప్రభూ! మేము నశించిపోవుచున్నాము” అనిరి. యేసు మేలుకొని గాలిని, అలలను గద్దింపగా అవి నిలచిపోయి, ప్రశాంతత కలిగెను.

25. యేసు “మీ విశ్వాసము ఎక్కడ?" అని వారితో అనెను. అప్పుడు వారు భయ పడుచు ఆశ్చర్యముతో “గాలియు, అలలు సహితము ఈయనకు లోబడుచున్నవి. ఈయన ఎవరో” అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి.

26. ఆ తరువాత వారు ఆవలి తీరమందు గలిలీయకు ఎదురుగా ఉన్న గెరాసేనుల ప్రాంతము నకు వచ్చిరి.

27. ఆయన తీరమున కాలుమోపగానే పిశాచపీడితుడు ఒకడు కనిపించెను. వాడు చాల రోజులనుండి బట్టలు కట్టుకొనక, ఇంటిలో కాకుండ సమాధుల మధ్యలోనే నివసించుచుండెను.

28. వాడు యేసును చూడగానే ఆయన యెదుట సాగిలపడి, “సర్వోన్నతుడవగు దేవునికుమారా! యేసూ! నాతో నీకేమిపని? నన్ను హింసింపవలదని ప్రార్థించు చున్నాను” అని కేకలు పెట్టెను.

29. వానినుండి వెంటనే వెలికిరమ్మని ఆయన ఆ అపవిత్రాత్మను ఆదేశించెను. ఏలన అది పదేపదే వానిని ఆవహించుచుండెను. ప్రజలు వానిని ఇనుప గొలుసులతో కట్టి కాపలాలో ఉంచిరి. కానివాడు తన బంధములను ట్రెంపుకొనెడి వాడు. అపుడు దయ్యము వానిని ఎడారికి తరుముకొని పోయెడిది.

30. “నీ పేరేమి?" అని యేసు ప్రశ్నించెను. అనేక భూతములు వానిని ఆవహించి ఉండుటచే వాడు తన పేరు 'దళము' అని చెప్పెను.

31. “మేము అగాధమున ప్రవేశించునట్లు ఆజ్ఞాపింపవలదు” అని అవి ఆయనను అర్థించెను.

32. అపుడు అచటకొండచరియపై పెద్ద పందుల మంద ఒకటి మేయుచుండెను. “ఆ పందులలో ప్రవేశించుటకు మాకు అనుమతి నొసగుడు" అని దయ్యములు ప్రార్థింపగా యేసు అందుకు అను మతించెను.

33. అపుడు ఆ భూతములు వానిని విడిచి పందులలో చొచ్చెను. వెంటనే అవి ఆ కొండ చరియనుండి వేగముగా పరుగెత్తి సరస్సులోపడి, మునిగిచచ్చెను.

34. పందుల కాపరులు అది చూచి పరుగెత్తుకొనిపోయి పట్టణములలోను, పరిసర ప్రాంతములలోను ఈ విషయమును వెల్లడించిరి.

35. ప్రజలు ఈ వింతను చూచుటకై యేసు వద్దకు వచ్చి దయ్యములు పట్టినవాడు వస్త్రములు ధరించి స్వస్థుడై కూర్చుండి ఉండుట చూచి భయభ్రాంతులైరి.

36. అంతకుముందు అది చూచినవారు దయ్యముల నుండి వాడు ఎట్లు విముక్తుడై స్వస్థత నొందెనో వారికి వివరించిరి.

37. గెరాసేనులోని జనులెల్లరు మిక్కిలి భయపడి తమను విడిచిపొమ్మని ఆయనను ప్రార్థించిరి. కనుక యేసు పడవ ఎక్కి తిరుగు ప్రయాణమాయెను.

38. దయ్యములనుండి విముక్తి పొందినవాడు “నన్ను మీతో ఉండనిండు” అని ఆయనను వేడుకొనెను.

39. కాని యేసు వానితో “నీవు ఇంటికిపోయి దేవుడు నీకు చేసిన మహోపకారమును జనులకు తెలుపుము" అనెను. వాడు వెళ్ళి యేసు తనకు కావించిన మహో పకారమును గూర్చి పట్టణమంతటను ప్రచారము గావించెను.

40. జనసమూహము యేసు కొరకు ఎదురు చూచుచుండెను. కనుక ఆయన తిరిగివచ్చినపుడు వారు ఆయనకు స్వాగతమిచ్చిరి.

41. ప్రార్థనామందిర అధికారియగు యాయీరు వచ్చి యేసు పాదములపై బడి తన ఇంటికి రమ్మని ప్రార్ధించెను.

42. ఎందుకన, సుమారు పండ్రెండేండ్ల ప్రాయముగల అతని ఏకైక పుత్రిక మరణావస్థలో ఉండెను. ఆయన పోవుచుండగా ప్రజలు తొక్కిసలాడుచు ఆయన వెంట వెళ్ళిరి.

43. పండ్రెండేండ్లనుండి రక్తస్రావమగుచు బాధ పడుచున్న స్త్రీ ఒకతె తనకున్న ధనమంతయు వెచ్చించి నను, ఏ వైద్యునివలనను స్వస్థత పొందజాలక పోయెను.

44. వెనుక ప్రక్కగా వచ్చి ఆమె యేసు అంగీ అంచును తాకెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను.

45. "నన్ను తాకినది ఎవరు?” అని యేసు అడుగగా అందరు "మేము ఎరుగము" అనిరి. అపుడు పేతురు “బోధకుడా! నీ చుట్టును ప్రజలు క్రిక్కిరిసియున్నారు గదా!” అనెను.

46. అందుకు యేసు “నన్ను ఎవరో తాకిరి. నాలోనుండి శక్తి వెలువడినది" అని పలికెను.

47.తాను ఇక రహస్యముగా ఉండజాలనని గ్రహించిన ఆ స్త్రీ వణకుచు ఆయన పాదముల పై పడి, తాను ఎందుకు ఆయనను తాకినదియును, వెంటనే ఎట్లు స్వస్థత పొందినదియును, జనులందరియెదుట వివరించెను.

48. అపుడు ఆయన "కుమారీ! నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది. ఇక సమాధానముగా పొమ్ము" అనెను.

49. యేసు అట్లు చెప్పుచుండగనే యాయీరు గృహము నుండి ఒకడు వచ్చి "మీ కుమార్తె మరణించి నది. ఇంకను బోధకుని శ్రమపెట్టకుడు” అని అతనితో చెప్పెను.

50. యేసు ఆ మాటవిని యాయీరుతో “భయపడవలదు. విశ్వసింపుము. నీ కుమార్తె స్వస్థత పొందును” అనెను.

51. ఇంటికి వచ్చిన తరువాత పేతురు, యాకోబు, యోహానులను ఆ బాలిక తల్లి దండ్రులను తప్ప మరెవ్వరిని తనవెంటలోనికి రానీయలేదు.

52. అందరు ఆమె కొరకు ఏడ్చుచు, శోకించుచుండగా, “మీరు ఏడువవలదు. ఈ బాలిక నిద్రించుచున్నది కాని చనిపోలేదు”అని యేసు వారితో పలికెను.

53. ఆ బాలిక చనిపోయినదని వారికి నిశ్చయముగా తెలియును. కనుక వారు ఆయనను హేళనచేసిరి.

54. కాని యేసు ఆమె చేయిపట్టుకొని “బాలికా లెమ్ము” అని చెప్పగా,

55. వెంటనే ఆ బాలికకు ప్రాణములు తిరిగివచ్చి లేచి కూర్చుండెను. అప్పుడు ఆయన ఆమెకు తినుటకు ఏమైన పెట్టుడని ఆదేశించెను.

56. ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యచ కితులైరి. ఈ సంఘటన ఎవరికిని తెలుపవలదని యేసు వారిని ఆజ్ఞాపించెను. 

 1. యేసు తనపన్నిద్దరు శిష్యులను చెంతకు పిలిచి దయ్యములను పారద్రోలుటకు, వ్యాధులను పోగొట్టుటకు వారికి శక్తిని, అధికారమును ఇచ్చెను.

2. దేవుని రాజ్యము ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను.

3. “మీరు ప్రయాణము చేయునపుడు ఊతకట్టనుగాని, జోలెనుగాని, రొట్టెను గాని, ధనమునుగాని, రెండు అంగీలనుగాని తీసికొని పోరాదు.

4. మీరు ఒక ఇంట ప్రవేశించినపుడు తిరిగి పోవువరకు అచటనే ఉండుడు.

5. ఎవరు మిమ్ము ఆహ్వానింపరో, వారి తిరస్కార భావమునకు సూచనగా మీ పాదధూళిని అచట విదిలించిపొండు” అని యేసు వారికి ఉపదేశించెను.

6. అంతట వారు వెళ్ళి గ్రామగ్రామమున సువార్తను ప్రకటించుచు, రోగులను స్వస పరచుచు అంతట పర్యటింపసాగిరి.

7. ఆ కాలమున గలిలీయ రాజ్యపాలకుడగు హేరోదు యేసునుగూర్చి అంతయు విని కలవర పడెను. ఏలయన, స్నాపకుడగు యోహాను మృతుల నుండి జీవముతో లేపబడెనని కొందరు.

8. ఏలీయా అవతరించెనని మరికొందరు, పూర్వ ప్రవక్తలలో ఒకడు సజీవుడై లేచెనని ఇంకను కొందరు చెప్పుకొనుచుండిరి.

9. “నేను యోహాను తలతీయించితినిగదా! మరి నేను వినుచున్న వార్తలన్నియు ఎవరిని గురించియై ఉండ వచ్చును” అని తలంచుచు హేరోదు ఆయనను చూడగోరెను.

10. శిష్యులు తిరిగివచ్చి తాము చేసిన పనులన్నియు వివరించినపిదప ఆయన వారిని మాత్రమే వెంటబెట్టుకొని బెత్సయిదా గ్రామమునకు వెళ్లెను.

11. జనసమూహములు ఈ విషయమును తెలిసికొని వారిని వెంబడించెను. యేసు వారిని చేరబిలిచి దేవునిరాజ్యమును గురించి వివరించుచు రోగులను స్వస్థపరచెను.

12. ప్రొద్దుగ్రుంక నారంభించినప్పుడు పన్నిద్దరు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, “ఇది నిర్జన ప్రదేశము. ఇక వీరిని పంపివేయుడు; పల్లెపట్టులకు వెళ్లి, వారికి కావలసిన భోజనవసతులను చూచుకొందురు” అని ఆయనతో చెప్పిరి.

13. “మీరే వీరికి భోజనము పెట్టుడు” అని ఆయన పలుకగా “మా యొద్ద ఉన్నవి అయిదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే. మేము పోయి, వీరికి అందరకు కావలసిన ఆహారపదార్థములు కొనితెత్తుమా?” అని శిష్యులు అడిగిరి.

14. అచ్చట రమారమి అయిదువేలమంది పురుషులుండిరి. వారిని పంక్తులుదీర్చి, పంక్తికి ఏబదిమంది చొప్పున కూర్చుండ బెట్టుడని ఆయన శిష్యులతో చెప్పగా

15. వారు అట్లే కూర్చుండబెట్టిరి.

16. పిమ్మట యేసు ఆ అయిదు రొట్టెలను, రెండుచేపలను తీసికొని, ఆకాశమువైపు చూచి, వానిని ఆశీర్వదించి, త్రుంచి 'ప్రజలకు వడ్డింపుడు' అని శిష్యులకు ఇచ్చెను.

17. వారందరు భుజించి, సంతృప్తిపడిన పిదప మిగిలిన ముక్కలను శిష్యులు పండ్రెండుగంపలకు ఎత్తిరి.

18. ఒక పర్యాయము యేసు ఒంటరిగా ప్రార్థన చేసికొనుచుండగా ఆయన శిష్యులుకూడ అచట ఉండిరి. అపుడు ఆయన వారిని “ప్రజలు నేను ఎవరినని భావించుచున్నారు?” అని అడిగెను.

19. “స్నాపకుడగు యోహాను అని కొందరు; ఏలీయా అని మరికొందరు; పూర్వ ప్రవక్తలలో ఒకడు సజీవుడై లేచి వచ్చెనని ఇంకను కొందరు అనుకొనుచున్నారు” అని వారు సమాధానము ఇచ్చిరి.

20. యేసు వారిని “మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు?” అని తిరిగి ప్రశ్నించెను. అందుకు పేతురు “నీవు దేవుని క్రీస్తువు” అని బదులు ఇచ్చెను.

21. పిమ్మట యేసు వారిని “ఈ సంగతి ఎవరికిని తెలుపకుడు” అని ఆజ్ఞాపించి

22. “మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింప బడి, చంపబడి, మూడవదినమున ఉత్థానమగుట అగత్యము” అని పలికెను.

23. మరియు వారందరితో “నన్ను అనుసరింప కోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన సిలువను ఎత్తికొని నన్ను అనుసరింపవలయును.

24. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును. నానిమిత్తమై తన ప్రాణమును ధారపోయువాడు దానిని దక్కించుకొనును.

25. ఒకడు లోకమంతటిని సంపాదించి తనను తాను కోల్పోయిన లేక తాను నశించిపోయినయెడల ప్రయోజనమేమి?

26. నన్ను గూర్చియు, నా సందేశమును గూర్చియు సిగ్గుపడువానిని గూర్చి, మనుష్యకుమారుడు తన మహిమతోను, తన తండ్రి మహిమతోను, దేవదూతల మహిమతోను, వచ్చినపుడు సిగ్గుపడును.

27. ఇచట ఉన్న వారిలో కొందరు దైవరాజ్యమును చూచువరకు మరణింపబోరని నిశ్చయముగా చెప్పుచున్నాను” అని యేసు శిష్యులతో పలికెను.

28. ఈ బోధలు చేసిన పిదప దాదావు ఎనిమిది దినములకు పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని ఆయన ప్రార్థన చేసికొనుటకై పర్వతముపైకి వెళ్ళెను.

29. ఆయన ప్రార్థన చేసికొనుచుండగా యేసు ముఖరూపము మార్పుచెందెను. ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను.

30. అప్పుడు ఇరువురు పురుషులు ఆయనతో సంభాషించుచుండిరి. వారు మోషే, ఏలీయా అనువారు.

31. వారిద్దరు మహిమతో కనిపించి యేసు యెరూషలేములో మరణింప వలసిన విషయమును గూర్చి ఆయనతో ముచ్చటించుచుండిరి.

32. పేతురు, అతని తోటివారును నిద్ర మత్తులో ఉండిరి. వారు మేలుకొనినపుడు యేసు మహిమను, ఆయన చెంతనున్న ఆ పురుషులిద్దరిని చూచిరి.

33. వారిద్దరు ఆయనయొద్దనుండి వెళ్ళిపోవు చుండగా, పేతురు "ప్రభూ! మనము ఇచ్చట ఉండుట మంచిది. ఒకటి మీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలీయాకు మూడు పర్ణశాలలను నిర్మింతుము” అని తాను పలుకునది తనకే తెలియక మాట్లాడుచుండెను.

34. అతడు ఇట్లు పలుకుచుండగా ఒక మేఘము దిగివచ్చి ఆ శిష్యులను ఆవరించెను. అపుడు వారు భయపడిరి.

35. ఆ మేఘమునుండి ఒక వాణి “ఈయన నా కుమారుడు. నేను ఎన్నిక చేసికొనినవాడు. ఈయనను ఆలకింపుడు” అని వినిపించెను.

36. ఆ వాణి వినిపించిన పిమ్మట వారు యేసును మాత్రమే చూచిరి. శిష్యులు ఆ రోజులలో ఆ విషయ మును ఎవ్వరికిని చెప్పలేదు.

37. మరునాడు యేసు పర్వతము దిగివచ్చినపుడు గొప్పజనసమూహము ఆయనయొద్దకు వచ్చెను.

38. ఆ జనసమూహమునుండి ఒకడు ఎలుగెత్తి “బోధకుడా! నా పుత్రుని పై కనికరము చూపుము. వాడు నాకు ఏకైక కుమారుడు.

39. ఒక దయ్యము వానిని పట్టి పీడించుచున్నది. అపుడు వాడు ఉన్నట్లుండి కేకలువేయును. అది వానిని నురుగులు క్రక్కునట్లు విలవిలలాడించి గాయపరచుచున్నది. వానిని విడిచి పోవుటలేదు.

40. ఈ దయ్యమును వెడలగొట్టవలసినదిగా నేను మీ శిష్యులను కోరితిని. కాని వారికి అది సాధ్యపడలేదు" అని మొరపెట్టెను.

41. అందుకు యేసు “మీరు విశ్వాసములేని దుష్టజనము! నేను మీతో ఎంతకాలము ఉందును? ఎంత వరకు మిమ్ము సహింతును?” అని, వానితో “నీ కుమారుని ఇక్కడకు తీసికొనిరమ్ము" అని పలికెను.

42. వారు వచ్చు చుండగా దయ్యము వానిని క్రింద పడద్రోసి విలవిలలాడించెను. యేసు అపవిత్రాత్మను గద్దించి, వానిని స్వస్థపరచి తండ్రికి అప్పగించెను.

43. దేవుని మహాశక్తికి జనులు ఎల్లరును ఆశ్చర్యచకితులైరి. ప్రజలందరు యేసు అద్భుతకార్యములకు ఆశ్చర్య పడుచుండ ఆయన తన శిష్యులతో ఇట్లనెను:

44. “చెవియొగ్గి ఆలకింపుడు. మనుష్యకుమారుడు ప్రజల చేతికి అప్పగింపబడబోవుచున్నాడు” అని పలికెను.

45. శిష్యులకు ఇది బోధపడలేదు. వారు గ్రహింప కుండునట్లు అది వారికి మరుగు చేయబడెను. కాని ఆ విషయమై ఆయనను అడుగుటకు వారు భయ పడిరి.

46. “మనలో అధికుడు ఎవడు?” అని శిష్యులు తమలో తాము చర్చించుకొన మొదలిడిరి.

47. యేసు వారి ఆలోచనలను గ్రహించి ఒక చిన్నబిడ్డను తన చెంత నిలుపుకొని,

48. “నా పేరిట ఈ చిన్న వానిని స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. నన్ను స్వీకరించువాడు నా తండ్రిని స్వీకరించును. ఏలయన, మీ అందరిలో అత్యల్పుడైనవాడు' అందరికంటే అధికుడు” అని వారితో పలికెను.

49. అపుడు యోహాను “ప్రభూ! మీ పేరిట ఒకడు దయ్యములను పారద్రోలుట చూచి మేము వానిని వారించితిమి. ఏలయన, అతడు మనలను అనుసరించువాడు కాడు” అని చెప్పెను.

50. అందుకు యేసు “వానిని వారింపవలదు. మీకు ప్రతికూలుడు కానివాడు మీకు అనుకూలుడే” అనెను.

51. మోక్షారోహణ దినములు సమీపించినపుడు యేసు యెరూషలేమునకు వెళ్ళుటకు అభిముఖుడై

52. తనకు ముందుగా దూతలను పంపెను. వారు యేసు కొరకు అంతయు సిద్ధపరుప, ఒక సమరియా గ్రామమునకు వెళ్ళిరి.

53. కాని, ఆయన యెరూషలేమునకు వెళ్ళ అభిముఖుడైనందున అచటి ప్రజలు ఆయనను ఆహ్వానింపరైరి.

54. ఆయన శిష్యులగు యాకోబు, యోహానులు అది చూచి “ప్రభూ! మేము ఆకాశమునుండి అగ్నిని రప్పించి, వీరిని నాశనముచేయుమని ఆజ్ఞాపించుట నీకు సమ్మ తమా?” అని అడిగిరి.

55. అందుకు యేసు వారి వైపు తిరిగి వారిని గద్దించెను.

56. అంతట వారందరు మరొక గ్రామమునకు వెళ్ళిరి.

57. అటుల వారు మార్గమున పోవునప్పుడు ఒకడు యేసుతో “మీరు ఎక్కడకు వెళ్ళినను నేను మిమ్ము వెంబడించివత్తును” అని పలికెను.

58. అందుకు యేసు “నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు. కాని మనుష్యకుమారునకు తలదాచుకొనుటకు ఇసుమంతైనను తావులేదు” అని సమాధానము ఇచ్చెను.

59. అపుడు ఆయన మరియొకనితో “నన్ను అనుసరింపుము" అని అనెను. అందుకు అతడు “ప్రభూ! నేను ముందుగా వెళ్ళి నా తండ్రిని సమాధిచేసి వచ్చుటకు సెలవిమ్ము” అని మనవిచేసెను.

60. అందుకు యేసు “మృతులు తమ మృతులను సమాధి చేయనిమ్ము. కాని నీవు వెళ్ళి దేవునిరాజ్యమును ప్రకటింపుము” అనెను.

61. మరియొకడు యేసుతో "ప్రభూ! నేను మిమ్ము అనుసరింతును కాని, మొదట నా కుటుంబములోని వారికి చెప్పి వచ్చెదను, సెలవిండు" అని పలికెను.

62. యేసు వానితో “నాగటిమీద చేయి పెట్టి వెనుకకు చూచువాడు ఎవ్వడును దేవుని రాజ్యమునకు యోగ్యుడు కాడు” అనెను. 

 1. ఆ పిమ్మట ప్రభువు డెబ్బది ఇద్దరిని నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు, ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపెను.

2. ఆయన వారితో ఇట్లనెను: “పంట విస్తారము కాని పనివారు తక్కువ. కనుక తన పంటపొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు.

3. మీరు పొండు. ఇదిగో! తోడేళ్ళ మధ్యకు గొఱ్ఱెపిల్లలవలె మిమ్ము పంపుచున్నాను;

4. మీరు జాలెనైనను, జోలెనైనను, పాదరక్షలనైనను తీసుకొనిపోరాదు. మార్గమధ్యమున మీరు ఎవరిని కుశలప్రశ్నలు అడుగవలదు.

5. మీరు ఏ ఇంట ప్రవేశించినను ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక! అని చెప్పుడు.

6. శాంతికాముడు అచ్చట ఉన్నయెడల మీశాంతి అతనికి కలుగును. లేనిచో అది తిరిగి మీకే చేరును.

7. ఆ ఇంటివారు మీకు పెట్టు అన్నపానీయములను తినుచు, త్రాగుచు అచటనే ఉండుడు. పనివాడు తనకూలికి పాత్రుడుగదా! మీరు ఇల్లిల్లు తిరుగరాదు.

8. మీరు ఏ పట్టణము లోనైన ప్రవేశించునపుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి, మీముందు పెట్టునదేదో దానిని భుజింపుడు.

9. అచటి రోగులను స్వస్థపరచి దేవుని రాజ్యము మీ సమీపము నకు వచ్చినదని చెప్పుడు.

10. కాని మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు మిమ్ము ఆహ్వానింపనియెడల ఆ పట్టణ వీధులలోనికి వెళ్ళి

11. 'మా కాళ్లకు అంటిన మీ పట్టణమందలి దుమ్మును మీకు విరుద్ధముగా ఇచ్చటనే దులిపివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని గ్రహింపుడు” అని వారితో చెప్పుడు.

12. తీర్పుదినమున ఆ పట్టణపు గతికంటె సొదొమ పట్టణపు గతి ఓర్వదగినదిగా ఉండునని మీతో చెప్పుచున్నాను”.

13. “అయ్యో! కొరాజీనువురమా! నీకు అనర్థము! అయ్యో! బెత్సయిదాపురమా! నీకు అనర్థము! మీమధ్య చేయబడిన అద్భుతకార్యములు తూరు, సీదోను పట్టణములలో చేయబడినయెడల ఆ పట్టణ వాసులు ఎప్పుడో పశ్చాత్తాపపడుచు గోనెపట్టలు ధరించి, బూడిద పూసికొని ఉండెడివారే.

14. కాని తీర్పుదినమున మీ గతికంటె తూరు సీదోనుల గతి ఓర్వదగినదిగా ఉండును.

15. ఓ కఫర్నాముపురమా! నీవు ఆకాశమును అంటదలచితివా! నీవు పాతాళ మునకు పడద్రోయబడుదువు.

16. “మీ మాట ఆలకించువాడు నా మాటలను ఆలకించును. మిమ్ము నిరాకరించువాడు నన్నును నిరాకరించును. నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించును” అని పలికెను.

17. ఆ డెబ్బది ఇద్దరు తిరిగి వచ్చి “ప్రభూ! మీ పేరిట పిశాచములు కూడ మాకు లోబడుచున్నవి” అని చెప్పిరి.

18. అందుకు యేసు “సైతాను ఆకాశము నుండి మెరుపువలె పడిపోవుట కాంచితిని.

19. నేను మీకు పాములను, తేళ్ళను నలగదొక్కుటకును, శత్రువు బలమును అణగదొక్కుటకును అధికారమును ఇచ్చితిని. అవి యేవియు మీకు హాని చేయజాలవు.

20. దుష్టాత్మలు మీకు వశమగుచున్నవని ఆనందింపక, మీపేర్లు పరలోకమందు వ్రాయబడియున్నవని ఆనందింపుడు” అనెను.

21. ఆ గడియలోనే యేసు పవిత్రాత్మయందు ఆనందించి, “ఓ తండ్రీ! పరలోకభూలోకములకు అధిపతీ! ఈ విషయములను నీవు జ్ఞానులకును, వివేకులకును మరుగుపరచి, పసిబిడ్డలకు వీనిని తెలియపరచినందులకు నీకు ధన్యవాదములు. అవును తండ్రీ! ఇది నీ అనుగ్రహపూర్వక సంకల్పము.

22. నా తండ్రి నాకు సమస్తము అప్పగించియున్నాడు. తండ్రి తప్ప మరెవ్వరును కుమారుని ఎరుగరు. కుమారుడు తప్ప మరెవ్వరును తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు” అనెను.

23. అపుడు యేసు శిష్యులవైపు తిరిగి వారిని మాత్రమే ఉద్దేశించి: “మీరు చూచెడి ఈ సంఘటనలను చూడగలిగిన నేత్రములు ఎంత ధన్యమైనవి!

24. ప్రవక్తలు, రాజులు అనేకులు మీరు చూచుచున్నవి చూడగోరిరి. కాని చూడలేకపోయిరి. మీరు వినుచు న్నవి వినగోరిరి. కాని వినజాలకపోయిరి” అని పలికెను.

25. అంతట ఒక ధర్మశాస్త్ర బోధకుడు లేచి, “బోధకుడా నిత్యజీవము పొందుటకు నేను ఏమి చేయవలయును?” అని యేసును పరీక్షింపగోరి ప్రశ్నించెను.

26. అందుకు యేసు “ధర్మశాస్త్రమున ఏమని వ్రాయబడియున్నది? అది నీకెట్లు అర్థమ గుచున్నది?” అని తిరుగు ప్రశ్న వేసెను.

27. అందుకు అతడు, " 'నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణఆత్మతోను, నీ పూర్ణశక్తితోను, నీ పూర్ణమనస్సుతోను ప్రేమింపుము. నిన్ను నీవు ప్రేమించుకొనునట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము' అని వ్రాయబడియున్నది” అని పలికెను.

28. “నీవు సరిగా సమాధానమిచ్చితివి. అటులనే చేయుము. నీవు జీవింతువు” అని యేసు వానితో చెప్పెను.

29. కాని అతడు తనను సమర్థించుకొనుటకై “నా పొరుగువాడు ఎవడు?" అని యేసును అడిగెను.

30. యేసు ఇటుల సమాధానమిచ్చెను: “ఒకానొకడు యెరూషలేము నుండి యెరికో నగరమునకు వెళ్ళుచుండెను. త్రోవలో అతనిని దొంగలు చుట్టుముట్టి, దోచుకొని, గాయ పరచి, కొనఊపిరితో విడిచిపోయిరి.

31. ఆ తరువాత ఒక యాజకుడు ఆ మార్గమున వెళ్ళుచు, వానిని చూచియు, తప్పుకొనిపోయెను.

32. అటులనే ఒక లేవీయుడు అటు వచ్చి వానిని చూచి తొలగిపోయెను.

33. పిదప ఒక సమరీయుడు అటు పయనమైపోవుచు అతనిని చూచెను. వానిని చూడగనే అతడు జాలిపడి,

34. వాని దగ్గరకు వెళ్ళి గాయములకు తైలము, ద్రాక్షారసము పోసి కట్టుకట్టెను. పిమ్మట వానిని తన వాహనముపై కూర్చుండబెట్టి, ఒక సత్రమునకు తీసికొనిపోయి పరామర్శించెను.

35. అతడు మరు నాడు రెండు దీనారములు సత్రపుశాల యజమానుని చేతిలో పెట్టి 'వీనిని పరామర్శింపుము. నీకు ఎక్కువ వ్యయమైనచో తిరిగివచ్చిన పిమ్మట చెల్లింపగలను' అని చెప్పెను.

36. దొంగల చేతిలో పడినవానికి పై ముగ్గురిలో పొరుగువాడు ఎవ్వడు?” అని యేసు అడిగెను.

37. “కనికరము చూపినవాడే” అని ధర్మశాస్త్ర బోధకుడు సమాధానమిచ్చెను. యేసు అతనితో “నీవును వెళ్ళి అటులనే చేయుము” అని పలికెను.

38. వారు ప్రయాణము చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను.

39. ఆమెకు మరియమ్మ అను ఒక సోదరి కలదు. ఆమె ప్రభువు పాదములచెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెను.

40. మార్తమ్మ పెక్కుపనులతో సతమత మగుచు ఆయనయొద్దకు వచ్చి “ప్రభూ! నా సహోదరి పనులన్నియు నాపై వదలి మీచెంత కూర్చొని ఉండుట మీరు గమనించుటలేదా? నాకు సహాయము చేయుటకు ఆమెను పంపుడు” అనెను.

41. అందుకు యేసు “మార్తమ్మా! మార్తమ్మా! నీవు ఎన్నో పనులనుగూర్చి విచారించుచు ఆతురపడుచున్నావు.

42. కాని అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్ను కొనినది. అది ఆమెనుండి తీసివేయబడదు” అని సమాధానమిచ్చెను. 

 1. యేసు ఒకచోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ముగియుటతోడనే ఆయన శిష్యుడు ఒకడు “ప్రభూ! యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరును మాకు ప్రార్థనచేయుట నేర్పుడు” అని అడిగెను.

2. అందుకు ఆయన వారితో, “మీరిట్లు ప్రార్థింపుడు: తండ్రీ! నీ నామము పవిత్రపరుపబడుగాక! నీ రాజ్యము వచ్చునుగాక!

3. మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిదినము దయచేయుము.

4. మా పాపములను క్షమింపుము. ఏలయన, మేమును, మా ఋణస్టులందరను క్షమించుచున్నాము. మమ్ము శోధనలో చిక్కుకొన నీయకుము” అని చెప్పెను.

5. యేసు ఇంకను వారితో ఇట్లు పలికెను: “మీలో ఒకడు అర్ధరాత్రివేళ తన మిత్రుని యొద్దకు వెళ్ళి ఇట్లు చెప్పెననుకొనుడు. 'మిత్రమా! నీవు నాకు మూడురొట్టెలు బదులు ఇమ్ము.

6. నా స్నేహితుడు ఒకడు ప్రయాణమైపోవుచు, నా ఇంటికి వచ్చి యున్నాడు. అతనికి పెట్టుటకు నాయొద్ద ఏమియును లేదు.'

7. అపుడు ఆ మిత్రుడు లోపలనుండి 'నన్ను తొందరచేయకుము. తలుపులు మూసి ఉన్నవి. పిల్లలు నాయొద్ద పక్కమీద ఉన్నారు. నేను ఇప్పుడు లేచి ఇయ్యజాలను' అని సమాధానము ఇచ్చెననుకొనుడు.

8. నేను మీతో చెప్పునది ఏమన, అతడు మిత్రుడై ఉండియు లేచి ఏమియు ఈయక పోయినను, పదేపదే ప్రాధేయపడి అడిగినందున లేచి అతని అవసరము తీర్చును.

9. అట్లే మీరును 'అడుగుడు. మీకు అనుగ్రహింపబడును, వెదకుడు మీకు దొరకును. తట్టుడు మీకు తెరవబడును.

10. అడిగిన ప్రతివానికి ఈయబడును. వెదకువానికి దొరకును. తట్టువానికి తెరవ బడును' అని మీతో చెప్పుచున్నాను.

11. మీలో ఏ తండ్రియైన కుమారుడు చేపను అడిగినచో పామును ఇచ్చునా?

12. గ్రుడ్డును అడిగినచో తేలును ఇచ్చునా?

13. మీరు ఎంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చుట మీకు తెలియునుగదా! పరలోక మందున్న మీ తండ్రి తనను అడుగువారికి ఇంక ఎంతగా పవిత్రాత్మను ఇచ్చునో ఊహింపుడు.”

14. ఆయన ఒక మూగదయ్యమును పార ద్రోలుచుండెను. దయ్యము పారిపోవగానే మూగవాడు మాటలాడుటను చూచి ప్రజలు ఆశ్చర్యపడిరి.

15. కొందరు “ఇతడు దయ్యములకు అధిపతియగు బెల్లబూలువలననే దయ్యములను వెడలగొట్టుచు న్నాడు” అనిరి.

16. మరి కొందరు ఆయనను పరీక్షింపగోరి “పరలోకమునుండి ఒక గురుతును చూపుము” అనిరి.

17. యేసు వారి ఆలోచనలను గ్రహించి, వారితో ఇట్లనెను. “అంతఃకలహములకు గురియైన ఏ రాజ్యమైనను నాశమగును. కలహ మునకు గురియైన ఏ గృహమైనను కూలిపోవును.

18. సైతాను రాజ్యము అంతఃకలహమునకు గురియైనచో అది ఎటుల నిలువగలదు? నేను బెల్జబూలు తోడ్పాటుతో దయ్యములను పారద్రోలుచున్నానని మీరు అనుచున్నారు.

19. అటులైన మీ కుమారులు ఎవరి వలన పారద్రోలుచున్నారు? కనుక, వారే మీకు న్యాయాధిపతులు.

20. నేను దేవుని ప్రభావమువలన దయ్యములను వెడలగొట్టుచున్నాను, కాబట్టి దైవ రాజ్యము మీ సమీపమునకు వచ్చియున్నది.

21. బలవంతుడు ఆయుధములను ధరించి తన ఇంటికి కావలికాచుకొనినచో అతని సంపద సురక్షితముగా నుండును.

22. కాని అతనిని మించిన బల వంతుడు ఒకడు అతనిపై పడి జయించినయెడల, అతడు నమ్ముకొనియున్న ఆయుధములను స్వాధీనము చేసికొని, అతడు దోచుకొనిన సంపదను పంచి పెట్టును.

23. నా పక్షమున ఉండనివాడు నాకు ప్రతికూలుడు. నాతో ప్రోగుచేయనివాడు చెదరగొట్టువాడు.

24. “అపవిత్రాత్మ ఒక మనుష్యుని వీడిపోయి నపుడు అది విశ్రాంతికై వెదకుచు, నీరులేని ప్రదేశము లలో తిరుగుచుండును. అది దొరకనపుడు 'నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగిపోయెదను' అని చెప్పును.

25. వచ్చినపుడు ఆ ఇల్లు శుభ్రముగా ఊడ్చి అమర్చబడి ఉండుటచూచి,

26. వెళ్ళి తనకు మించిన మరి ఏడు దయ్యములను తీసికొనివచ్చి, అక్కడ నివాసము ఏర్పరచుకొనును. అందువలన ఆ మనుష్యుని పూర్వ స్థితికంటె కడపటి స్థితి మిక్కిలి హీనముగా ఉండును.”

27. ఆయన ఇట్లు పలికినప్పుడు జనసమూహ ములో ఒక స్త్రీ “నిన్ను మోసిన గర్భమును, నీకు పాలిచ్చిన స్తనములును ధన్యమైనవి” అని ఎలుగెత్తి పలికెను.

28. కాని యేసు “దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు” అనెను.

29. ప్రజలు అనేకులు అచట చేరగా, యేసు ఇట్లు చెప్పనారంభించెను : “ఈ తరము దుష్టమైనది. ఇది ఒక గురుతును కోరుచున్నది. కాని యోనా సూచనకంటె వేరొకటి అనుగ్రహింపబడదు.

30. ఏలయన నేనెవె వాసులకు యోనా సూచన అయినట్లే ఈ తరమునకు మనుష్యకుమారుడును ఒక సూచన యగును.

31. తీర్పుదినమున దక్షిణదేశపు రాణి వీరి ఎదుట నిలిచి వీరిని ఖండించును. ఏలయన, ఆమె సొలోమోను విజ్ఞానవాక్కులు వినుటకై దిగంతముల నుండి వచ్చెను. ఇదిగో! ఆ సొలోమోనుకంటె అధికుడు ఇచ్చట ఉన్నాడు.

32. నీనెవె పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయపరివర్తనము చెందిరి. కనుక, తీర్పుదినమున వారు వీరిఎదుట నిలిచి, వీరిని ఖండింతురు. ఇదిగో! యోనా కంటె గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు.

33. దీపమును వెలిగించి ఎవడును చాటున గాని, కుంచము క్రిందగాని ఉంచడు. లోనికి వచ్చు వారికి వెలుతురును ఇచ్చుటకు దీపస్తంభముపై ఉంచును.

34. నీ కన్ను నీ దేహమునకు దీపము. అది తేటగ ఉన్నయెడల నీ దేహమంతయు కాంతి మంతమై ఉండును. నీ కన్ను దుష్టమైనచో నీ దేహమంతయు చీకటిమయమగును.

35. కనుక నీలో ఉన్న వెలుగు చీకటిగా మారకుండుటకు నీవు అప్రమ త్తుడవై ఉండుము.

36. అంధకారము ఏమియు లేక నీ శరీరమంతయు వెలుగుతో నిండినయెడల, దీపము తన కిరణములతో కాంతిని వెదజల్లునట్లు నీ దేహము అంతట ప్రకాశించును.”

37.ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడ భుజించుటకు రండని ఆయనను ఆహ్వానించెను. ఆయన లోనికి వెళ్ళి భోజనమునకు కూర్చుండెను.

38. భోజనమునకుముందు ఆయన కాళ్ళుచేతులు కడుగుకొనకపోవుట చూచి పరిసయ్యుడు ఆశ్చర్యపడెను.

39. అందుకు యేసు అతనితో ఇట్లనెను: “మీ పరిసయ్యులు గిన్నెలకు పళ్ళెములకు బాహ్యశుద్ధిచేయుదురు. కాని మీ అంతరంగము మాత్రము దౌర్జన్యముతోను, దుష్టత్వముతోను నిండియున్నది.

40. అవివేకులారా! వెలుపలి భాగమును చేసినవాడు లోపలిభాగమును కూడ చేయలేదా?

41. కనుక మీకున్న దానిని పేదలకు ఒసగుడు. అప్పుడు అంతయు శుద్ధియగును.

42. “అయ్యో పరిసయ్యులారా! మీకు అనర్గము. మీరు పుదీనా, సదాప మొదలగు ప్రతి ఆకుకూరలోను పదియవవంతును చెల్లించుచున్నారు. కాని, న్యాయ మును, దైవప్రేమను ఉపేక్షించుచున్నారు. వానిని చెల్లింపవలసినదే. కాని వీనిని నిర్లక్ష్యము చేయరాదు.

43. అయ్యో పరిసయ్యులారా! మీకు అనర్ధము. మీరు ప్రార్థనామందిరములందు ప్రధానఆసనములను, అంగడి వీధులయందు వందనములను అందుకొనుటకు కాంక్షింతురు.

44. అయ్యో పరిసయ్యులారా! మీకు అనర్థము. ఏలయన మీరు కనబడని సమాధులవలె ఉన్నారు. అవి సమాధులు అని తెలియకయే మనుష్యులు వానిపై నడచుచున్నారు.”

45. అపుడు ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు “బోధకుడా! ఇట్టి మాటలతో నీవు మమ్ములను కూడ నిందించుచున్నావు” అనెను.

46. అందుకు యేసు “అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా! మీకు అనర్గము. మీరు మోయసాధ్యముకాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కాని, వారు ఆ భారములను మోయుటకు వారికి సహాయముగా మీ చిటికెన వ్రేలైనను కదపరు.

47. అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా! మీకు అనర్ధము. మీ పితరులు చంపిన ప్రవక్తలకు మీరు సమాధులు కట్టుచున్నారు.

48. ఈ విధమున మీరు మీపితరులు చేసిన పనులకు సాక్షులై వారితో ఏకీభవించుచున్నారు. ఏలయన, వారు ప్రవక్తలను చంపిరి. మీరు వారికి సమాధులను కట్టుచున్నారు.

49. ఇందువలననే దేవుని జ్ఞానము ఇట్లు చెప్పుచున్నది: 'నేను వారి వద్దకు ప్రవక్తలను, అపోస్తలులను పంపెదను. వారిలో కొందరిని వారు చంపెదరు. కొందరిని హింసించే దరు',

50-51. ప్రపంచ ప్రారంభమునుండియు, అనగా హేబెలు హత్య మొదలుకొని, ఆలయమునకు బలిపీఠమునకు మధ్య జరిగిన జెకర్యా హత్యవరకును చిందింపబడిన ప్రవక్తల రక్తమునకు ఈ తరమువారు విచారింపబడుదురు అని మీతో నిశ్చయముగా చెప్పు చున్నాను.

52. అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా! మీకు అనర్ధము. మీరు జ్ఞానాలయపు ద్వారమును బిగించి, తాళపుచెవిని మీ స్వాధీనము చేసికొని ఉన్నారు. మీరు ప్రవేశింపలేదు. ప్రవేశించువారిని మీరు అడ్డగించితిరి" అని చెప్పెను.

53. యేసు అక్కడినుండి బయలుదేరి నప్పుడు ధర్మశాస్త్ర బోధకులును, పరిసయ్యులును ఆయనపై పగబట్టి ఎట్లయిన ఆయనలో తప్పుపట్ట వలెనని ఒత్తిడి చేయుచు ప్రశ్నింపసాగిరి.

54. ఇట్లు వారందరు ఆయనను మాటలలో చిక్కించుకొనవలయునని పొంచియుండిరి. 

 1. అంతలో వేలాది ప్రజలు గుమిగూడి తొక్కిసలాడుచుండగా యేసు శిష్యులను ఇట్లు హెచ్చరింప ఆరంభించెను: “పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి, అనగా కపట ప్రవర్తనను గూర్చి, మీరు జాగరూకులై ఉండుడు.

2. దాచబడినది ఏదియు బయటపడకపోదు. రహస్యమైనది ఏదియు బట్ట బయలు కాకపోదు.

3. మీరు చీకటిలో చెప్పునది అంతయు వెలుతురులో వినబడును. మీరు మారు మూలల గుసగుసలాడునది అంతయు మిద్దెలపై నుండి చాటబడును.

4."మిత్రులారా! నేను మీతో చెప్పునదేమన, మీరు శరీరమును నాశనము చేయువారికి భయపడకుడు. వారు అంతకుమించి ఏమియు చేయజాలరు.

5. మీరు ఎవనికి భయపడవలెనో చెప్పెదను. మిమ్ములను చంపి, నరకకూపమున పడవేయగల వానికి భయ పడుడు. అవును, వానికి భయపడుడు అని నేను చెప్పుచున్నాను.

6. రెండు కాసులకు ఐదు పిచ్చుకలు అమ్మ బడుటలేదా? కాని, వానిలో దేనినైనను దేవుడు విస్మరింపడు.

7. మీ తలవెంట్రుకలు గూడ లెక్కింపబడి ఉన్నవి. భయపడవలదు. మీరు అనేక పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.”

8. “నన్ను మనుష్యులయెదుట అంగీకరించు వానిని మనుష్యకుమారుడు కూడ దేవదూతలయెదుట అంగీకరించును.

9. కాని మనుష్యులయెదుట నన్ను నిరాకరించువాడు దేవదూతలయెదుట నిరాకరించ బడును.

10. మనుష్యకుమారునికి వ్యతిరేకముగా పలుకువాడు క్షమింపబడును. కాని, పవిత్రాత్మను దూషించు వాడు క్షమింపబడడు.

11. వారు మిమ్ము ప్రార్థనామందిరములకు, పెద్దల యొద్దకును, అధిపతులయొద్దకును కొనిపోయి నపుడు, మీరు ఎట్లు ఏమి సమాధానము చెప్ప వలయునా అని విచారింపకుడు.

12. ఆ గడియలో ఏమి చెప్పవలయునో పవిత్రాత్మ మీకు నేర్పును.”

13. జనసమూహమునుండి ఒకడు “బోధకుడా! పిత్రార్జితమున నాకు పాలుపంచుమని నా సహోదరునితో ఒక మాట చెప్పుము” అనెను.

14. అందుకు యేసు “నన్ను ఎవడు మీకు తీర్పరిగాను లేక పంపిణీ దారునిగాను నియమించెను?

15. జాగరూకత వహింపుడు. ఎట్టి లోభమునకును లోనుకాకుడు. ఏలయన, మానవ జీవితము సిరిసంపదల సమృద్ధిలో లేదు” అని చెప్పెను.

16. యేసు ఇంకను వారితో ఒక ఉపమానమును చెప్పెను: “ఒక ధనవంతునికి సమృద్ధిగా పంటలు పండినవి.

17. అతడు ఇట్లనుకొనెను: 'నేను ఏమి చేయవలయును? పంటలు భద్రపరచుకొనుటకు నాకు చాలినంత స్థలము లేదు.

18. ఒక పని చేసెదను. కొట్లు పడగొట్టించి వానిని ఇంకను పెద్దవిగా కట్టెదను. అందు నా ధాన్యమును, సరకులను అన్నిటిని భద్రపరచెదను'.

19. నాతో ఇట్లని చెప్పుకొందును. 'నా ప్రాణమా! నీకు అనేక సంవత్సరములకు సరిపడు గొప్ప సంపదలున్నవి. సుఖముగా ఉండుము. తిని, త్రాగి ఆనందింపుము.'

20. కాని దేవుడు అతనితో 'ఓరి! అవివేకి! ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును. అపుడు నీవు కూడబెట్టినది ఎవనికి చెందును?” అనెను.

21. తన కొరకు ధనము కూడబెట్టుకొనువారి స్థితి ఇట్లే ఉండును. వారు దేవుని దృష్టిలో భాగ్య వంతులు కారు” అని చెప్పెను.

22. పిమ్మట యేసు తన శిష్యులతో, “జీవితమునకు అవసరమైన అన్నపానీయములకై, దేహమునకు అవసరమైన వస్త్రములకై చింతింపకుడు.

23. మీ జీవితము ఆహారముకంటెను, మీ దేహము వస్త్రములకంటెను విలువయినవి కావా?

24. ఆకాశమున సంచరించు పక్షులను చూడుడు. అవి విత్తనములను నాటవు. నూర్పిడులు చేయవు. గిడ్డంగు లలో ధాన్యమును నిలువచేయవు. అయినను దేవుడు వానిని పోషించుచున్నాడు. మీరు పక్షులకంటె ఎంతో విలువైన వారు కారా?

25. మీలో ఎవడైన చింతించు టవలన తన ఆయువును ఒక్క గడియయిన పెంపుచేసి కొనగలడా?

26. మీరు ఇంత స్వల్పకార్యమైనను చేయలేనపుడు ఇతర విషయములను గురించి ఏల చింతించెదరు?

27. లిల్లీ పుష్పములు ఎట్లు పెరుగు చున్నవో చూడుడు. అవి తమకై శ్రమపడుటలేదు, వస్త్రములు చేయుటలేదు. అయినను సకల వైభవ సమేతుడగు సొలోమోను సైతము వీనిలో ఒక్కదాని వలెనైనను అలంకరింపబడలేదని మీతో చెప్పుచు న్నాను.

28. అల్పవిశ్వాసులారా! నేడు పొలములో పుట్టి రేపు పొయ్యిలో గిట్టు గడ్డిపోచను సైతము దేవుడు ఇట్లు తీర్చిదిద్దగా, అంతకంటే ఎక్కువగా మిమ్ము గురించి యోచింపడా?

29. కావున, ఏమి తినెదమా, ఏమి త్రాగెదమా అని మీరు కలత చెందకుడు.

30. వీనిని అన్నిటిని ఈ లోకపు జనులు కాంక్షింతురు. ఏలయన, పరలోకమందుండు మీ తండ్రి ఈ మీ అవసరములనెల్ల గుర్తించును.

31. మొదట ఆయన రాజ్యమును వెదకుడు. అప్పుడవన్నియు మీకు సమకూర్పబడును.

32. “ఓ చిన్నమందా! భయపడవలదు. మీకు రాజ్యమును ఇచ్చుట మీ తండ్రికి ఇష్టము.

33. మీ ఆస్తులను అమ్మి దానముచేయుడు. మీ కొరకు చినిగిపోని సంచులను సమకూర్చుకొనుడు. మీ సంపదను పరలోకమున పదిలపరచుకొనుడు. చెద పురుగులు తినివేయవు.

34. మీ సంపద ఉన్న చోటనే మీ హృదయముండును.

35. “మీ నడుములు కట్టుకొనుడు. మీ దీపములను వెలుగుచుండనిండు.

36. తమ యజమానుడు వివాహమహోత్సవమునుండి తిరిగివచ్చి తట్టగనే తలుపు తీయుటకు ఎదురుచూచు వారివలె ఉండుడు.

37. యజమానుడు వచ్చునప్పుడు మేల్కొని సిద్ధముగా ఉన్న సేవకులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని, వారిని భోజనమునకు కూర్చుండబెట్టి, తానే వచ్చి వారలకు వడ్డించును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

38. అతడు అర్ధరాత్రివేళ వచ్చినను, ఆ తరువాత వచ్చినను అట్లు వేచియున్న సేవకులు ధన్యులు.

39. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానునికి తెలిసినయెడల అతడు మేల్కొని యుండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలిసికొనుడు.

40. కనుక, మీరు సిద్ధపడి ఉండుడు. ఏలయన, మనుష్యకుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును” అని చెప్పెను.

41. “ప్రభూ! మీరు ఈ ఉపమానమును మాకు మాత్రమేనా? లేక అందరికిని చెప్పుచున్నారా?” అని పేతురు ప్రశ్నించేను.

42. అందుకు యేసు ఇట్లనెను: “విశ్వాసపాత్రుడును, వివేకవంతుడునైన సేవకుడెవడు? యజమానునిచే తన ఇంటివారికి భోజనము వేళకు పెట్టుటకు నియమింపబడినవాడే.

43. యజమానుడు ఇంటికి తిరిగివచ్చినపుడు తన కర్తవ్యమునందు నిమగ్నుడైన సేవకుడు ధన్యుడు.

44. అట్టివానికి తన సమస్తముపై యాజమాన్యము నొసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

45. కాని, యజమానుడు చాలకాలమునకు గాని తిరిగిరాడు అని సేవకుడు తనలోతాను అనుకొని, తన తోటి దాసులను, దాసురాండ్రను కొట్టుచు, తిని, త్రాగి, మత్తుగాపడి ఉండిన యెడల,

46. అతడు ఊహింపని సమయములో, యోచింపని గడియలో యజమానుడు తిరిగివచ్చి, ఆసేవకుని చిత్రవధ చేయించి అవిశ్వాసులలో ఒకనిగా చేయును.

47. యజమానుని ఇష్టమెరిగియు సిద్ధముగ ఉండనట్టియు, యజమానుని ఇషానుసారము నడుచుకొననట్టియు సేవకుడు కొరడా దెబ్బలకు గురియగును,

48. కాని తెలియక దెబ్బలు తినదగిన పనిచేసిన వానికి అంత కఠిన శిక్ష ఉండదు. మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో, వానినుండి మరి ఎక్కువగా అడుగుదురు,

49. “నేను భూమిమీద నిప్పు అంటించుటకు వచ్చియున్నాను. అది ఇప్పటికే రగుల్కొని ఉండవలసి నది.

50. నేను శ్రమలతో కూడిన జ్ఞానస్నానము పొందవలయును. అది నెరవేరునంతవరకు నామనస్సు నకు శాంతిలేదు.

51. నేను భూమిమీద శాంతి నెలకొల్పుటకు వచ్చితినని మీరు తలంచుచున్నారా? లేదు. విభజనలు కలిగించుటకే వచ్చితినని మీతో చెప్పుచున్నాను.

52. ఇకనుండి ఒకే ఇంటియందు ఐదుగురున్నచో వారిలో ముగ్గురికి వ్యతిరేకముగా ఇద్దరు, ఇద్దరికి వ్యతిరేకముగా ముగ్గురు విరోధులగుదురు.

53. తండ్రి కుమారుని, కుమారుడు తండ్రిని, తల్లి కుమార్తెను, కుమార్తె తల్లిని, అత్త కోడలిని, కోడలు అత్తను ఎదిరించును.”

54. యేసు జనసమూహములతో ఇంకను ఇట్లు చెప్పెను: “పడమట మబ్బుపట్టుట చూచిన తక్షణమే వాన కురియునని మీరు చెప్పెదరు. అట్లే జరుగును.

55. దక్షిణపు గాలి వీచుటచూచి, వడగాలి కొట్టునని చెప్పెదరు. అది అట్లే జరుగును.

56. కపట వేషధారులారా! మీరు భూమ్యాకాశలక్షణములను గుర్తింప గలరు. మరి ఈ కాలములను ఏల గుర్తింపలేరు?

57. “ఏది సముచితమో మీరు స్వయముగ నిర్ణయించుకొనలేరేమి?

58. నీపై నీ శత్రువు వ్యాజ్యెము తెచ్చి న్యాయాధిపతియెదుటకు నిన్ను కొని పోవునపుడు మార్గమధ్యముననే అతనితో సఖ్యపడుము. లేనిచో అతడు నిన్ను న్యాయాధిపతియొద్దకు ఈడ్చుకొని పోవును. న్యాయాధిపతి నిన్ను బంట్రోతు చేతికి అప్పగించును. అతడు నిన్ను కారాగారమున బంధించును.

59. నీవు చెల్లింపవలసిన ఋణములో కడపటి కాసు చెల్లించువరకు నీవు చెరసాలలోనే ఉందువు అని నేను మీతో చెప్పుచున్నాను.” 

1. యేసు దేవాలయము నుండి వెళ్ళుచుండగా శిష్యులలో ఒకడు “బోధకుడా! ఈ రాళ్ళు ఎట్టివో, ఈ కట్టడములు ఎట్టివో చూడుడు” అనెను.

2. “మీరు చూచు ఈ గొప్ప కట్టడములు రాతిమీద రాయి నిలువక నేలమట్టమగును” అని యేసు పలికెను.

3. యేసు ఓలివుకొండపై దేవాలయమునకు ఎదురుగా ఏకాంతమున కూర్చుండి ఉండగా పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయలు వచ్చి,

4. “ఇవి అన్నియు ఎప్పుడు సంభవించును? వీని రాకడకు సూచన ఏమి?” అని అడిగిరి.

5. యేసు వారితో ఇట్లు చెప్పసాగెను: “మిమ్ము ఎవ్వరును మోసగింపకుండ మెలకువ కలిగిఉండుడు.

6. అనేకులు నాపేరిట వచ్చి 'నేనే ఆయనను' అని ఎందరినో మోసగింతురు.

7. మీరు యుద్ధములను గూర్చియు, వానికి సంబంధించిన వార్తలను గూరియు వినునపుడు కలవరపడకుడు. ఇవి అన్నియు జరిగి తీరును. అంతలోనే అంతము రాదు.

8. జాతికి జాతి. రాజ్యమునకు రాజ్యము విరుద్ధముగా లేచును. అనేక ప్రదేశములందు భూకంపములు కలుగును. క్షామములు సంభవించును. ఇవి అన్నియు వేదనలకు ప్రారంభ సూచనలు.

9. “మీరు మెలకువతో వర్తింపుడు. ప్రజలు మిమ్ము బంధించి న్యాయస్థానమునకు అప్పగింతురు. ప్రార్థనామందిరములలో మిమ్ము చెండాడుదురు. అధిపతుల ఎదుట, రాజుల ఎదుట మీరు నాకు సాక్షులై నిలిచెదరు.

10. కనుక ముందుగా సమస జాతుల వారికి సువార్త ప్రకటింపబడవలెను.

11. మిమ్ము అప్పగింప పట్టుకొనిపోవునపుడు 'మేము ఏమి చెప్పవలెను?' అని మీరు ఆతురపడవలదు. ఆ సమయమున మీకు ఒసగబడిన దానినే మాట్లాడుడు. ఏలయన, మాటాడునది మీరు కాదు, పవిత్రాత్మయే.

12. సోదరుడు సోదరుని, తండ్రి కుమారుని మృత్యువునకు అప్పగించును. కన్నబిడ్డలే తల్లిదండ్రులకు వ్యతిరేకముగా నిలిచి చంపింతురు.

13. నా నామము నిమిత్తము మిమ్ము అందరును ద్వేషింతురు. అయినను తుదివరకు నిలిచినవాడే రక్షింపబడును.

14. “మీరు హేయమైన వినాశనము నిలువరాని చోట నిలుచుట చూచినపుడు (వఠించువాడు గ్రహించుగాక!) యూదయా సీమలో ఉన్నవారు పర్వత ములకు పారిపోవలెను.

15. మిద్దెపై నున్నవాడు సామగ్రికొరకు ఇంటిలోనికి దిగిరాకూడదు.

16. పొలములో పనిచేయువాడు తన పైవస్త్రము తీసి కొనుటకు వెనుకకు మరలిపోరాదు.

17. ఆ దినములందు గర్భిణులకు, బాలింతలకు ఎంత బాధాకరము?

18. మీ పలాయనము శీతకాలమందు కాకుండునట్లు ప్రార్ధింపుడు.

19. ఆ దినములందు సంభవింపనున్న ఆపదలు, సృష్టి ఆరంభమునుండి నేటివరకును రాలేదు, ఇక ముందును రావు.

20. దేవుడు ఆ దినముల సంఖ్యను తగ్గింపకున్నచో ఎవ్వడును జీవింపడు. కాని, ఎన్నుకొనబడినవారి నిమిత్తము అవి తగ్గింపబడెను.

21. అప్పుడు మీలో ఎవడైన 'ఇదిగో! క్రీస్తు ఇక్కడ ఉన్నాడు. లేక అక్కడ ఉన్నాడు' అని చెప్పిన మీరు నమ్మవద్దు.

22. కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు బయలు దేరి సాధ్యమయినయెడల దేవుడు ఎన్నుకొనిన వారిని మోసగించుటకు గొప్ప వింతలను మహత్కార్యములను చేయుదురు.

23. మీరు జాగరూకులైయుండుడు. ఇదిగో ముందుగానే సమస్తము మీతో చెప్పియున్నాను.

24. “ఆ రోజులందు ఆ మహా విపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకారబంధురుడగును. చంద్రుడు కాంతిహీనుడగును.

25. అంతరిక్షము నుండి నక్షత్ర ములు రాలును. అంతరిక్ష శక్తులు కంపించును.

26. అపుడు మనుష్యకుమారుడు మహాశక్తితో మహా మహిమతో మేఘారూఢుడై వచ్చుటను జనులెల్లరు కాంతురు.

27. అపుడు ఆయన దూతలను పంపి భూలోకము మొదలుకొని ఆకాశమువరకు నలుదిశల నుండి తాను ఎన్నుకొనిన వారిని ప్రోగుచేయించును.

28. “అంజూరపు చెట్టు నుండి ఈ గుణపాఠము నేర్చుకొనుడు: దాని రెమ్మలు లేతవై చిగురించినపుడు వసంతకాలము వచ్చినదని గుర్తింతురు.

29. అట్లే వీనిని అన్నింటిని మీరు చూచునపుడు ఆయన సమీపముననే, వాకిటనే ఉన్నాడని గ్రహింపుడు.

30. ఇవన్నియు నెరవేరునంతవరకు ఈ తరము గతింపదని మీతో వక్కాణించుచున్నాను.

31. భూమ్యాకాశములు గతించిపోవునుగాని నా మాటలు గతించిపోవు.

32. " ఆ దినము, ఆ ఘడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందు దూతలుగాని, కుమారుడుగాని, మరెవ్వరునుగాని ఎరుగరు.

33. ఆ సమయము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కావున జాగరూకులై ఉండుడు.

34. ఆ గడియ ఇట్లుండును: ఒకానొకడు దేశాటనము వెళ్ళుచు, తన సేవకులను, ఆయా కార్య ములందు నియమించి,మెలకువతో ఉండుమని ద్వార పాలకుని హెచ్చరించెను.

35. యజమానుడు సంధ్యా సమయముననో, అర్థరాత్రముననో, కోడికూయు  వేళనో, ప్రాతఃకాలముననో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కనుక మేలుకొని ఉండుడు.

36. ఒక వేళ అతడు అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రించు చుండుట చూడవచ్చును.

37. మీకు చెప్పునదే అందరికి చెప్పుచున్నాను. జాగరూకులై ఉండుడు!" 

 1. యేసు ఒక విశ్రాంతిదినమున పరిసయ్యుల అధికారులలో ఒకని యింట భోజనమునకు వెళ్ళెను. ప్రజలు ఆయనను గమనించుచుండిరి.

2. అప్పుడు జలోదర రోగపీడితుడు ఒకడు యేసు వద్దకు వచ్చెను.

3. “విశ్రాంతిదినమున స్వస్థపరచుట ధర్మమా? కాదా?” అని యేసు ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులను పశ్నించెను.

4. దానికి వారు ప్రత్యుత్తరమీయక మిన్నకుండిరి. అప్పుడు ఆయన రోగిని చేరదీసి స్వస్థ పరచి, పంపివేసి

5. వారితో, “మీ కుమారుడుగాని, మీ ఎద్దుగాని, బావిలో పడినపుడు విశ్రాంతిదినమైనను వెంటనే దానిని బయటకు తీయనివారు మీలో ఎవరున్నారు?" అనెను.

6. వారు అందుకు సమాధానము ఈయజాలక పోయిరి.

7. ప్రధాన ఆసనముల కొరకు చూచుచున్న అతిథులను చూచి యేసు వారికి ఒక ఉపమానము చెప్పెను:

8. “ఎవరైనను నిన్ను పెండ్లి విందుకు పిలిచినపుడు ప్రధాన ఆసనముపై కూర్చుండవలదు. ఒకవేళ అతడు నీ కంటే గొప్పవాడగు వానిని పిలిచి ఉండవచ్చును.

9. మీ ఇద్దరిని పిలిచిన వ్యక్తి వచ్చి నీతో ఇతనికి చోటు ఇమ్ము' అనును. అపుడు నీవు సిగ్గుతో కడపటిచోటున కూర్చుండవలసివచ్చును.

10. అందుచేత నీవు పిలువబడినపుడు అందరికంటె కడపటి చోటున కూర్చుండుము. అపుడు మిమ్ము పిలిచినవాడు వచ్చి నీతో స్నేహితుడా!ముందుకు వెళ్ళి కూర్చుండుము' అని చెప్పును. అపుడు అతిథులందరి యెదుట నీకు గౌరవము కలుగును.

11. తనను తాను హెచ్చించు కొనువాడు తగ్గింపబడును. తననుతాను తగ్గించు కొనువాడు హెచ్చింపబడును” అనెను.

12. యేసు తనను భోజనమునకు పిలిచిన వానితో, “నిన్ను తిరిగి పిలువగలరను భావముతో నీవు భోజనముకైనను, విందునకైనను నీ మిత్రులను, సోదరులను, బంధు వులను, ఇరుగుపొరుగు ధనికులను పిలువవలదు.

13. నీవు విందు చేయునపుడు పేదలను, వికలాంగు లను, కుంటివారిని, గ్రుడ్డివారిని పిలువుము.

14. వారు నీకు ప్రతిఫలమును ఈయలేరు. కనుక నీవు ధన్యుడవు అగుదువు. నీతిమంతుల పునరుత్థాన కాల మున దీనికి ప్రతిఫలము లభించును” అనెను.

15. ఈ మాటలకు ఆయన ప్రక్కన కూర్చున్న అతిథి ఒకడు “దైవరాజ్యమున భుజించువాడెంత ధన్యుడు!” అనెను.

16. అందుకు యేసు అతనితో, “ఒకమారు ఒకడు గొప్ప విందుచేసి అనేకులను పిలిచెను.

17. విందువేళకు అతడు, ఆహ్వానించిన వారికి 'అన్నియు సిద్ధమైనవి, బయలుదేరి రండు' అని సేవకునిద్వార వార్తను పంపెను.

18. కాని వారందరు సాకులు చెప్పసాగిరి. మొదటివాడు 'నేనొక పొలమును కొంటిని. దానిని చూచిరావలయును. కనుక నన్ను క్షమింపుము' అని మనవి చేసికొనెను.

19. రెండవవాడు 'నేను ఐదు జతల ఎడ్లను కొంటిని. వాటిని పరీక్షింప పోవుచున్నాను.కనుక నన్ను క్షమింపుము' అని అర్థించెను.

20. మరియొకడు 'నేను వివాహము చేసికొంటిని. కనుక రాలేను' అని చెప్పెను.

21. సేవకుడు తిరిగివచ్చి, ఈ విషయమును యజమానునికి తెలియజేయగా ఆ యజమానుడు మండిపడి, తన సేవకునితో 'నీవు వెంటనే నగరవీధులకు పేటలకు వెళ్ళి, పేదలను, అవిటి, గ్రుడ్డి, కుంటివారిని ఇక్కడకు తీసికొనిరమ్ము' అని ఆజ్ఞాపించెను.

22. అంతట సేవకుడు 'అయ్యా! నీవు ఆజ్ఞాపించినట్లు చేసితిని. కాని, ఇంకను స్థలమున్నది' అని చెప్పెను.

23. అందుకు ఆ యజమానుడు సేవకునితో 'రాజ మార్గములందును వీధిసందులందును వెదకి, అక్కడ కనబడిన వారిని బలవంతముగ తీసికొనివచ్చి నా ఇల్లు నిండునట్లు చూడుము.

24. ఏలయన, ఆహ్వా నింపబడిన వారు ఎవ్వరును నా విందు రుచి చూడరని మీతో చెప్పుచున్నాను” అనెను.

25. అపుడు గొప్ప జనసమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను. ఆయన వెనుకకు తిరిగి వారితో ఇట్లనెను:

26. “నన్ను వెంబడింపగోరి, తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, కడకు తన ప్రాణమునైనను త్యజింపని వాడు నా శిష్యుడు కానేరడు.

27. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు యోగ్యుడు కాడు.

28. గోపురము కట్టదలచినవాడు కూర్చుండి వ్యయము గుణించి, దానిని పూర్తిచేయు సాధనసంపత్తి తనవద్ద ఉన్నదా, లేదా అని పర్యాలోచన చేయడా?

29. అటులకాక, పునాది వేసిన పిదప, నిర్మాణము పూర్తిచేయజాలని యెడల చూచువారు,

30. 'ఇతడు ఆరంభశూరుడే కాని కార్యసాధకుడు కాలేకపోయెను' అని పరిహసించెదరు.

31. ఒక రాజు యుద్ధమునకు వెళ్ళుటకు ముందు, ఇరువదివేల సేనతో తనపై దండెత్తి వచ్చు శత్రురాజును తన పదివేల సేనతో ఎదుర్కొనగలనా అని ఆలోచింపడా?

32. అంత బలములేనియెడల, శత్రురాజు సమీపించక పూర్వమే రాయబారము పంపి అతనితో సంధి చర్చలు జరుపును.

33. కనుక తన సమస్తము త్యజించిననే తప్ప ఎవడును నా శిష్యుడు కానేరడు.”

34. “ఉప్పు శ్రేష్ఠమైనదే. కాని అది ఉప్ప దనమును కోల్పోయినయెడల, దానిని తిరిగి ఎట్లు పొందగలదు?

35. ఆ ఉప్పు భూమికిగాని, ఎరువునకుగాని ఉపయోగపడదు. ప్రజలు దానిని బయట పారవేయుదురు. వినుటకు వీనులున్నవాడు వినును గాక!” అని వారితో చెప్పెను. 

 1. సుంకరులు, పాపులు అందరును యేసు బోధలు వినుటకు ఆయనవద్దకు వచ్చుచుండిరి.

2. అది చూచి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు “ఇతడు పాపులను చేరదీయుచు, వారితో కలిసి భుజించుచున్నాడు” అని సణుగుకొనసాగిరి.

3. అపుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను:

4. “ఒకడు తనకు ఉన్న నూరు గొఱ్ఱెలలో ఒకటి తప్పిపోయినచో, తక్కిన తొంబది తొమ్మిదింటిని ఆ అరణ్యముననే విడిచి పెట్టి, దానిని వెదకుటకై పోవునుగదా!

5. అది దొరికినపిమ్మట వాడు సంతోషముతో దానిని భుజములపై వేసికొని, ఇంటికి తీసికొని వచ్చి,

6. తన మిత్రులను, ఇరుగు పొరుగు వారలను పిలిచి, 'తప్పిపోయిన నా గొఱ్ఱె దొరకినది. నాతోపాటు ఆనందింపుడు' అని చెప్పును.

7. అట్లే హృదయపరివర్తనము లేని తొంబది తొమ్మిది మంది నీతిమంతులకంటె, హృదయపరివర్తనము పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండునని నేను మీతో నిశ్చయ ముగా చెప్పుచున్నాను.

8. “పది వెండినాణెములున్న స్త్రీ అందులో ఒకటి పోగొట్టుకొనినయెడల, దీపము వెలిగించి, ఇల్లు ఊడ్చి, అది దొరకునంతవరకు పట్టుదలతో వెదకదా?

9. అది దొరకగనే స్నేహితురాండ్రను, ఇరుగుపొరుగు స్త్రీలను చేరబిలిచి 'నాతో పాటు ఆనందింపుడు. నేను పోగొట్టుకొనిన నాణెము దొరకినది' అని చెప్పును.

10. అట్లే హృదయపరివర్తనము చెందు ఒక పాపాత్ముని విషయమై దేవదూతలు సంతోషింతురు అని మీతో చెప్పుచున్నాను.”

11. యేసు ఇంకను వారితో ఇట్లనెను: “ఒకనికి ఇద్దరు కుమారులుండిరి.

12. వారిలో చిన్నవాడు తండ్రితో,  తండ్రీ ఆస్తిలో నా భాగము నాకు పంచి పెట్టుము' అనెను. తండ్రి అట్లే వారిరువురికి ఆస్తిని పంచియిచ్చెను.

13. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసికొని దూరదేశమునకు వెళ్ళెను. అక్కడ భోగవిలాసములతో ఆ ధనమంతయు దుర్వినియోగము చేసి,

14. తన ఆస్తిని అంతటిని మంట కలిపెను. అపుడు అచట దారుణమైన కరువు దాపురించుటచే వాడు ఇబ్బందులు పడెను.

15. అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమానుని ఆశ్రయింపగా, అతడు వానిని తన పొలములో పందులను మేపుటకు పంపెను.

16. వాడు పందులుతిను పొట్టుతో పొట్ట నింపుకొన ఆశపడుచుండెను. కాని ఎవరును ఏమి యును ఇయ్యలేదు.

17. అపుడు అతనికి కనువిప్పు కలిగి తనలోతాను ఇట్లు అనుకొనెను: “నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనము లభించు చున్నది. కాని నేను ఇక్కడ ఆకలికి మలమలమాడు చున్నాను.

18. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, 'తండ్రీ! నేను పరలోకమునకు విరోధముగాను, నీ యెదుటను పాపము చేసితిని.

19. ఇప్పుడు నేను నీ కుమారుడను అనిపించుకొనదగను. నీ పని వారలలో ఒకనిగా పెట్టుకొనుము అని చెప్పెదను' అని తలచి,

20. వాడు లేచి, తన తండ్రి వద్దకు బయలు దేరెను. కాని వాడు ఇంకను దూరమున ఉండగనే తండ్రి అతనిని చూచి మనసుకరిగి, పరుగెత్తి వెళ్ళి, కుమారుని మెడమీద పడి ముద్దుపెట్టుకొనెను.

21. కుమారుడు తండ్రితో 'తండ్రీ! నేను పరలోకమునకు విరోధము గాను, నీ యెదుటను పాపము చేసితిని ఇక నేను నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను' అని పలికెను.

22. కాని తండ్రి సేవకులతో 'త్వరగా వీనికి మేలివస్త్రములను కట్టబెట్టుడు. వ్రేలికి ఉంగరమును, పాదములకు చెప్పులను తొడుగుడు.

23. క్రొవ్విన కోడెదూడను వధింపుడు. మనము విందారగించి, వేడుక చేసికొందము.

24. ఏలయన, మరణించిన ఈ నా కుమారుడు మరల బ్రతికెను. పోయినవాడు తిరిగి దొరకెను' అని చెప్పెను. పిమ్మట వారు విందు చేసికొనసాగిరి.

25. అతని పెద్ద కుమారుడు పొలమునుండి ఇంటికి వచ్చుసరికి సంగీతనృత్యముల ధ్వని వినిపించెను.

26. అతడు ఒక పనివానిని పిలిచి 'ఇది అంతయు ఏమిటి?' అని అడిగెను.

27. 'నీ తమ్ముడు వచ్చెను. కుమారుడు క్షేమముగ తిరిగివచ్చినందుకు నీ తండ్రి క్రొవ్వినకోడెదూడను కోయించెను' అని అతడు చెప్పెను.

28. అందుకు పెద్దకుమారుడు మండిపడి, లోపలకు అడుగు పెట్టుటకు ఇష్టపడ కుండెను. తండ్రి వెలుపలకు వచ్చి అతనిని బ్రతిమాల సాగెను.

29. అందుకు పెద్దకుమారుడు తండ్రితో 'ఇదిగో! నేను ఇన్ని సంవత్సరములనుండి నీ పని పాటులను చేయుచున్నాను. ఎన్నడును నీ ఆజ్ఞను మీరి ఎరుగను. అయినను నేను నా మిత్రులతో విందు జరుపుకొనుటకు నీవు ఎన్నడును ఒక్క మేకపిల్లనైనను ఇచ్చియుండలేదు.

30. కాని, నీ సంపదను వేశ్యలతో పాడుచేసిన ఈ నీ కుమారుడు తిరిగివచ్చినంతనే, వాని కొరకు నీవు క్రొవ్వినకోడెదూడను కోయించితివి' అనెను.

31. తండ్రి అందులకు బదులుగా "కుమారా! నీవు ఎల్లప్పుడును నాతో ఉన్నావు. నాకు ఉన్నదంతయు నీదే కదా!

32. మనము విందు జరుపుకొనుట యుక్తమే. ఏలయన, చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను. తప్పిపోయినవాడు మరల దొరికెను” అని అతనితో చెప్పెను. 

 1. యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పెను: “ఒక ధనవంతుని వద్ద గృహనిర్వాహకుడు ఒకడు ఉండెను. అతడు యజమానుని సంపదను వృథా చేయుచున్నాడని అతనిపై నేరము మోపబడెను.

2. యజమానుడు అతనిని పిలిచి, 'నిన్నుగూర్చి నేను వినుచున్నది ఏమిటి? లెక్కలు అప్పగింపుము. ఇకపై నీవు గృహనిర్వాహకుడుగా ఉండ వీలుపడదు' అని చెప్పెను.

3. అతడు లోలోపల ఇట్లు అనుకొనెను: 'ఇపుడు నేనేమి చేయుదును? యజమానుడు నన్ను ఈ పదవి నుండి తొలగించుచున్నాడు. శ్రమించుటకు నాకు శక్తి లేదు. బిచ్చమెత్తుటకు నాకు సిగ్గుగా ఉన్నది.

4. గృహనిర్వాహకత్వము నుండి తొలగింపబడినప్పుడు అందరివలన ఆశ్రయము పొందుటకు నేను ఇట్లు చేసెదను' అని,

5. యజమానుని ఋణస్టులను ఒక్కొక్క రిని పిలిపించి, మొదటివానితో 'నీవు నా యజమానునికి ఎంత ఋణపడి ఉన్నావు?” అని అడిగెను.

6. వాడు 'నూరు మణుగుల నూనె' అని చెప్పెను. అపుడు అతడు వానితో 'నీ ఋణపత్రము తీసికొని, వెంటనే దానిపై ఏబది అని వ్రాసికొనుము' అని చెప్పెను.

7. అంతట అతడు రెండవవానితో 'నీవు ఎంత ఋణ పడి ఉంటివి?' అని అడిగెను. వాడు 'నూరుతూముల గోధుమలు' అని బదులుపలికెను. అపుడు వానితో 'నీ ఋణపత్రము తీసికొని ఎనుబది అని వ్రాసికొనుము' అనెను.

8. ఆ గృహనిర్వాహకుడు యుక్తిగా వర్తించినందులకు యజమానుడు మెచ్చుకొనెను. ఏలయన, ఈ తరమున ఈ లోక సంబంధులైన ప్రజలు వెలుగు సంబంధులగు ప్రజలకంటె యుక్తిపరులు.

9. “అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకొనుడు. ఏలయన, ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్యనివాసములో మిమ్ము చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను.

10. స్వల్ప విషయములలో నమ్మదగినవాడు, గొప్ప విషయములలోను నమ్మదగినవాడుగా ఉండును. అల్పవిషయములలో నమ్మదగనివాడు, గొప్ప విషయములలోను నమ్మదగనివాడుగా ఉండును.

11. కనుక, ఈ లోక సంపదలయందు మీరు నమ్మదగినవారు కానిచో, పరలోక సంపదలను ఎవడు మీకు అప్పగించును?

12. పరుల సొమ్ము విషయములో మీరు నమ్మదగినవారు కానిచో, మీ సొంతమైనది మీకు ఎవడు ఇచ్చును?

13. “ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపజాలడు. ఏలయన, వాడు ఒకనిని ద్వేషించు ను, వేరొకనిని ప్రేమించును. లేదా, ఒకనిని అను సరించును, వేరొకనిని తృణీకరించును. మీరు దైవ మును, ద్రవ్యమును సేవింపలేరు.”

14. ధనలోభులగు పరిసయ్యులు ఈ మాటలు అన్నియు విని ఆయనను హేళనచేయుచుండగా,

15. యేసు వారితో ఇట్లు పలికెను: “మనుష్యుల యెదుట మీకై మీరు నీతిమంతులము అని చెప్పు కొనుచున్నారు. అయితే మీ అంతరంగములను దేవుడు ఎరుగును. మనుష్యులకు గొప్పదైనది దేవుని దృష్టిలో అసహ్యముగా ఉండును.

16. “యోహాను కాలమువరకు మోషే ధర్మ శాస్త్రము, ప్రవక్తల ప్రవచనములు ఉన్నవి. ఆనాటి నుండి, దేవునిరాజ్య సువార్త ప్రచారము చేయబడుచునే ఉన్నది. ప్రతి ఒక్కడు అందులో ప్రవేశింప గట్టి ప్రయత్నము చేయుచున్నాడు.

17. ధర్మశాస్త్రమునుండి ఒక్క పొల్లుపోవుటకంటె భూమ్యాకాశములు గతించుట సులభతరము.

18. “తన భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహమాడువాడు వ్యభిచరించుచున్నాడు. పరిత్య జింపబడిన స్త్రీని వివాహమాడువాడును వ్యభిచరించు చున్నాడు.

19. “ధనవంతుడొకడు పట్టువస్త్రములు ధరించి నిత్యము విందులతో, వినోదములతో కాలము గడుపుచుండెను.

20. అతని వాకిట లాజరు అను నిరుపేద పడియుండెను. అతని దేహమంతయు ప్రణములతో నిండియుండెను.

21. వాడు ఆ ధనికుని బల్ల మీదనుండి జారిపడు మెతుకులకొరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను.

22. ఆ నిరుపేద మరణింపగా, దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. ధనికుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను.

23. అప్పుడతడు బాధపడుచు పాతాళమునుండి సుదూరములో అబ్రహాము రొమ్మున ఆనుకొని వున్న లాజరును కన్నెత్తి చూచెను.

24. అతడు అంగలార్చుచు 'తండ్రీ అబ్రహామా! నన్ను కనికరింపుము. నేను ఈ మంటలలో మాడి పోవుచున్నాను. తన వ్రేలికొనను నీటిలో ముంచి, నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము' అనెను.

25. అందుకు అబ్రహాము, 'కుమారా! మరువకుము. నీ జీవితములో నీవు సకలసంపదలను అనుభవించు చుండ, లాజరు అష్టకష్టములను అనుభవించెను. అందుచే నీవు ఇపుడు కష్టపడుచుండ, అతడు సుఖపడుచున్నాడు.

26. అంతేకాక, మనమధ్య దాటుటకు వీలులేని అగాధము ఉన్నది. అందువలన అచటివారు ఇచటకు రాలేరు. ఇచటివారు అచటకు పోలేరు' అని పలికెను.

27-28. అందుకు ధనవంతుడు 'అట్లయిన నాదొక మనవి. నాకు ఐదుగురు సహోదరులున్నారు. వారు కూడ ఈ ఘోరనరకమునకు రాకుండ హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి యింటికి పంపుము' అనెను.

29. అందుకు అబ్రహాము 'వారిని హెచ్చరించుటకు మోషే, ప్రవక్తలు ఉన్నారు. వారి హెచ్చరికలను ఆలకించిన చాలును' అని సమాధానమిచ్చెను.

30. 'అది చాలదు తండ్రీ! అబ్రహామా! మృతులలోనుండి ఎవరైన వారి వద్దకు వెళ్ళినయెడల వారికి హృదయ పరివర్తనము కలుగును' అని అతడు మరల పలికెను.

31. అందులకు అబ్రహాము 'మోషే, ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిని పెట్టువారు, మృతులలోనుండి ఒకడు సజీవుడై, వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు' అని ప్రత్యుత్తరమిచ్చెను”. 

 1. యేసు తన శిష్యులకు ఉపదేశించుచు: “పాపపు శోధనలు రాకతప్పవు. కాని అందుకు కారకుడైన వానికి అనర్ధము.

2. ఈ చిన్నవారిలో ఎవ్వని నైన పాపము చేయుటకు పురిగొల్పినచో, అట్టివాడు మెడకు తిరుగటిరాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు.

3. జాగరూకులు కండు. నీ సోదరుడు తప్పిదము చేసినయెడల అతనిని మంద లింపుము. అతడు పశ్చాత్తాప పడినయెడల అతనిని క్షమింపుము.

4. అతడు దినమునకు ఏడు పర్యాయ ములు నీపట్ల తప్పిదము చేసి, ఏడుమార్లు నీ వద్దకు వచ్చి 'నేను పశ్చాత్తాప పడుచున్నాను' అని నీతో చెప్పిన యెడల, వానిని క్షమింపుము" అని చెప్పెను.

5. శిష్యులు ప్రభువుతో “మా విశ్వాసమును పెంపొందింపుము” అని కోరిరి.

6. “మీకు ఆవగింజంత విశ్వాసమున్నచో, ఈ కంబళి చెట్టును 'వేరుతో పెల్లగిల్లి సముద్రములో నాటుకొనుము' అని ఆజ్ఞాపించిన అది మీకు లోబడును.

7. “అప్పుడే పొలమునుండి ఇంటికి వచ్చిన లేక మందను మేపి వచ్చిన సేవకునితో మీలో ఎవడైనను వెంటనే వచ్చి భోజనము చేయుము అని చెప్పునా?

8. అట్లుగాక, యజమానుడు అతనితో 'వడ్డన వస్త్రము ధరించి నాకు భోజనము సిద్ధపరుపుము.నా భోజనము ముగియువరకు వడ్డన చేయుచు, వేచియుండుము. ఆ పిమ్మట నీవు వెళ్ళి భుజింపుము' అని చెప్పును గదా!

9. తన ఆజ్ఞను శిరసావహించిన సేవకునికి యజమానుడు కృతజ్ఞత తెలుపడుగదా!

10. అట్లే మీరును మీ బాధ్యతలను నిర్వహించిన మీదట 'మేము అయో గ్యులమగు సేవకులము. మేము మా కర్తవ్యమునే నెరవేర్చితిమి' అని పలుకుడు” అనెను.

11. యేసు సమరియా, గలిలీయ ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను.

12. ఒక గ్రామమున అడుగు పెట్టగనే పదిమంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురైరి. వారు దూరమున నిలుచుండి,

13. గొంతెత్తి, “ఓ యేసుప్రభువా! మమ్ము కనికరింపుము" అని కేకలు పెట్టిరి.

14. యేసు వారిని చూచి “మీరు వెళ్ళి యాజకులకు కనిపింపుడు” అని చెప్పెను. వారు మార్గమధ్యముననే శుద్ధిపొందిరి.

15. అపుడు వారిలో ఒకడు తాను స్వస్థుడగుట గమనించి, ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగివచ్చి,

16. యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. అతడు సమరీయుడు.

17. అపుడు యేసు “పదిమంది శుద్ధులు కాలేదా? మిగిలిన తొమ్మిదిమంది ఎక్కడ?

18. తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా?” అనెను.

19. పిదప యేసు అతనితో “నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది. లేచి వెళ్ళుము” అనెను.

20. దేవునిరాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిసయ్యులు ప్రశ్నింపగా యేసు ఇట్లు సమాధానము ఇచ్చెను: “దేవుని రాజ్యము కంటికి కనబడునట్లు రాదు.

21. 'ఇదిగో! ఇక్కడ ఉన్నది. లేక అదిగో! అక్కడ ఉన్నది' అని ఎవ్వడును చెప్పజాలడు. ఏలయన, అది మీ మధ్యనే ఉన్నది.”

22. యేసు మరల తన శిష్యులతో ఇట్లు చెప్పెను: “మీరు మనుష్యకుమారుని కాలములో ఒక దినమునైనను చూడగోరుదురు. కాని మీరు చూడరు.

23. ఇదిగో! అతడు ఇక్కడ ఉన్నాడు. లేక అదిగో! అక్కడ ఉన్నాడు అని ప్రజలు చెప్పుదురు. కాని మీరు వెళ్ళవలదు. వారి వెంట పరుగెత్తవలదు.

24. ఏలయన మెరపు మెరసి ఒక దిక్కునుండి మరొక దిక్కు వరకు ప్రకాశించునట్లు మనుష్యకుమారుని రాకడ ఉండును.

25. ముందుగా అతడు అనేక శ్రమలను అనుభవించి ఈ తరమువారిచే నిరాకరింపబడవలెను.

26. నోవా దినములయందు ఎట్లుండెనో, మనుష్య కుమారుని దినములందును అట్లే ఉండును.

27. జలప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు, త్రాగుచు, వివాహమాడుచు ఉండిరి. జలప్రళయము వారిని నాశనము చేసినది.

28. ఇట్లే లోతు కాలమున కూడ జరిగినది. ప్రజలు తినుచు, త్రాగుచు, క్రయవిక్రయములు చేయుచు, సేద్యము చేయుచు, గృహములను నిర్మించుకొనుచు ఉండిరి.

29. కాని లోతు సొదొమనుండి విడిచిపోయిన దినముననే ఆకాశమునుండి అగ్ని గంధకము వర్షింపగా అందరు నాశనమైరి.

30. మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమునను ఇటులనే ఉండును.

31. ఆ నాడు మిద్దె మీద ఉన్నవాడు సామగ్రి కొరకు క్రిందికి దిగి రాకూడదు. పొలములో ఉన్నవాడు ఇంటికి మరలి పోరాదు.

32. లోతు భార్యను గుర్తు చేసికొనుడు.

33. తన ప్రాణమును కాపాడుకొన యత్నించువాడు దానిని కోల్పోవును. తన ప్రాణమును కోల్పోవువాడు దానిని కాపాడుకొనును.

34.' ఆ రాత్రి ఒకే పడకమీద ఉన్న యిద్దరిలో ఒకడు కొనిపోబడును. ఒకడు విడిచిపెట్టబడును.

35. ఇద్దరు స్త్రీలు తిరుగలి త్రిప్పుచుండ, ఒకరు కొనిపోబడును. మరియొకరు విడిచి పెట్టబడును.”

36-37. “ప్రభూ! ఇది ఎక్కడ జరుగును?” అని శిష్యులు ప్రశ్నించిరి. “కళేబరమున్న చోటనే రాబందులు చేరును” అని యేసు చెప్పెను. 

 1. ఎల్లప్పుడు ప్రార్ధన సలుపుటకు, నిరుత్సాహ పడకుండుటకు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను:

2. “ఒకానొక పట్టణమున న్యాయాధిపతి ఒకడు కలడు. అతడు దేవుడనిన భయపడడు.  మానవులను లక్ష్యపెట్టడు.

3. అచ్చట ఒక వితంతువు ఉండెను. ఆమె అతని వద్దకు వచ్చి 'నాకు న్యాయము చేకూర్చుము. నా ప్రత్యర్థినుండి కాపాడుము' అని తరచుగా మొరపెట్టుకొనుచుండెడిది.

4. అతడు కొన్నాళ్ళు ఆమె మొరను పెడచెవిని పెట్టెను. కాని అతడు 'నేను దేవునికి భయపడను. మానవులను గౌరవింపను.

5. అయినను ఈ విధవరాలు నన్ను పీడించుచున్నందున, ఈమె పదేపదే వచ్చి నన్ను బాధ పెట్టకుండుటకై, ఈమెకు న్యాయము చేకూర్చెదను' అని తలంచెను.”

6. అంతట యేసు ఇట్లనెను: “అవినీతి పరుడైన ఈ న్యాయాధిపతి ఏమిపలికెనో వింటిరిగదా!

7. అట్లే రేయింబవళ్ళు తనకు మొరపెట్టుకొను తన ప్రజలకు దేవుడు న్యాయము చేకూర్చక ఉండునా? వారికి న్యాయము చేయుటలో ఆలస్యము చేయునా?

8. దేవుడు త్వరలోనే వారికి న్యాయము చేకూర్చునని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్యకుమారుడు వచ్చునపుడు ఈ భూమిమీద ఆయన అట్టి విశ్వాసము చూడగలుగునా?”

9. పిమ్మట యేసు తాము నీతిమంతుల మనియు, తక్కినవారు నీచులనియు ఎంచుకొను కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను:

10. “ప్రార్థనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు. మరొకడు సుంకరి.

11. పరిసయ్యుడు నిలుచుండి తనలోతాను 'ఓ దేవా! నేను ఇతరులవలె లోభిని, అన్యాయము చేయువాడను, వ్యభిచారిని కాను. ఈ సుంకరివంటివాడను కాను. అందులకు నీకు కృతజ్ఞుడను.

12. నేను వారమునకు రెండుమారులు ఉపవాస ముందును. నా ఆదాయము అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నాను' అని ప్రార్ధించెను.

13. కాని సుంకరి దూరముగా నిలువబడి కన్నులనైనను పైకెత్తు టకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, 'ఓ దేవా! ఈ పాపాత్ముని కనికరింపుము' అని ప్రార్ధించెను.

14. దేవుని ఎదుట నీతిమంతునిగ పరిగణింప బడి, ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కాని ఆ పరిసయ్యుడు కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలయన తననుతాను హెచ్చించు కొనువాడు తగ్గింపబడును. తనను తాను తగ్గించు కొనువాడు హెచ్చింపబడును.”

15. ఆ సమయమున కొందరు తమ బిడ్డలను తాకవలెనని యేసు వద్దకు తీసికొనిరాగా, శిష్యులు వారిని గద్దించిరి.

16. కాని యేసు ఆ బిడ్డలను తన యొద్దకు చేరబిలిచి, “చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు. వారిని ఆటంకపరపకుడు. ఏలయన అట్టి వారిదే పరలోకరాజ్యము.

17. పసిబిడ్డవలె దేవుని రాజ్యమును స్వీకరింపనివాడు ఎన్నటికిని అందులో ప్రవేశింపజాలడు అని మీతో నిశ్చయముగా చెప్పు చున్నాను” అనెను.

18. అంతట ఒక అధికారి యేసును సమీపించి, “సత్పురుషుడా! నిత్యజీవము పొందుటకు నేను చేయవలసినదేమి?” అని ప్రశ్నించెను.

19. అందులకు యేసు నన్ను “సత్పురుషుడా అని ఏల సంబోధించెదవు? దేవుడు ఒక్కడే తప్ప, మరియెవ్వడును సత్పురుషుడు కాడు.

20. దైవాజ్ఞలు నీకు తెలియునుకదా! వ్యభిచరింపకుము, నరహత్య చేయకుము, దొంగి లింపకుము, అబద్దసాక్ష్యములు పలుకకుము, నీ తల్లిదండ్రులను గౌరవింపుము” అని పలికెను.

21. అపుడు అతడు “నేను వీటినన్నిటిని యవ్వనము నుండియు పాటించితిని” అని బదులు పలికెను.

22. అందుకు యేసు “నీలో ఇంకను ఒక కొరత ఉన్నది. వెళ్ళి, నీ సమస్తమును. అమ్మి పేదలకు దానము చేయుము. అపుడు పరలోకమందు నీకు ధనము చేకూరును. అపుడు వచ్చి నన్ను వెంబడింపుము" అని చెప్పెను.

23. ఆ యువకుడు మిక్కిలి ధనవంతుడు అగుటచే ఈ మాట విని బాధపడెను.

24. యేసు అతనిని చూచి ఇట్లు పలికెను: “ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము!

25. ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కంటె, ఒంటె సూది బెజ్జమున దూరిపోవుట సులభ తరము” అనెను.

26. అది వినుచున్నవారు “అటులయిన ఎవడు రక్షణ పొందగలడు?” అని ప్రశ్నించిరి.

27. అందుకు యేసు “మానవునకు అసాధ్యమయినది దేవునకు సాధ్యమగును” అని బదులు చెప్పెను.

28. పేతురు యేసుతో “మేము మా సమస్తమును విడిచి పెట్టి మిమ్ము అనుసరించితిమి" అని పలికెను.

29. అందుకు యేసు “దేవునిరాజ్యము నిమిత్తము ఇంటిని, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, తల్లిదండ్రులను పరిత్యజించిన ప్రతివాడు

30. ఇహలోకమున ఎన్నో రెట్లు ప్రతిఫలమును, పరలోకమున నిత్యజీవమును పొందును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అని పలికెను.

31. పిమ్మట యేసు పన్నిద్దరితో పయనమై పోవుచు ఇట్లు చెప్పెను: “ఇదిగో! మనము ఇప్పుడు యెరూషలేమునకు పోవుచున్నాము. ప్రవక్తలు మనుష్య కుమారునిగురించి వ్రాసినవి అన్నియు నెరవేరును.

32. ప్రజలు ఆయనను అన్యజనులకు అప్పగింతురు. వారు ఆయనను పరిహసించి, దూషించి, ఆయనపై ఉమియుదురు.

33. కొరడాలతో కొట్టి చంపుదురు. మూడవదినమున ఆయన ఉత్థానుడు అగును.”

34. ఈ విషయములు ఏమియు వారికి బోధపడలేదు. అందలి అంతరార్థము వారికి తెలియజేయబడ నందున వారు గ్రహింపలేకపోయిరి.

35. యేసు యెరికో పట్టణమును సమీపించు చుండగా త్రోవప్రక్కన ఒక గ్రుడ్డివాడు కూర్చుండి భిక్షము అడుగుకొనుచుండెను.

36. వాడు  ప్రజలు గుంపులుగా నడచుచప్పుడు విని “విశేషమేమి?" అని అడిగెను.

37. “నజరేతు నివాసియగు యేసు వెళ్ళు చున్నాడు” అని ప్రజలు వానికి చెప్పిరి.

38. అంతట వాడు “యేసూ! దావీదుకుమారా! నన్ను కరుణింపుము” అని కేకలు వేసెను.

39. ముందు నడచు ప్రజలు వానిని ఊరకుండుమని కసరుకొనిరి. వాడు ఇంకను బిగ్గరగా “దావీదుకుమారా! నన్ను కనికరింపుము” అని కేకలు పెట్టసాగెను.

40. యేసు నిలచి వానిని తన వద్దకు తీసికొనిరమ్మని ఆజ్ఞాపించెను.

41. వాడు దగ్గరకు రాగానే యేసు వానితో “నేను నీకేమి చేయ కోరుదువు?” అని అడిగెను. "ప్రభూ! నాకు దృష్టి దానము చేయుడు” అని వాడు బదులు పలికెను.

42. "అట్లే నీ చూపును పొందుము. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది” అని యేసు పలికెను.

43. ఆ క్షణమే వాడు దృష్టిని పొంది, దేవుని పొగడుచు ఆయనను అనుసరించెను. ఇది చూచిన ప్రజలందరు దేవుని స్తుతించిరి.

 1. యేసు యెరికో పట్టణమున ప్రవేశించి దానిగుండ వెళ్ళుచుండెను.

2. అక్కడ సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య అను పేరు గల ధనికుడు ఒకడు ఉండెను.

3. అతడు యేసును చూడవలెనని యత్నిం చెను. కాని పొట్టివాడగుటచేతను, జనసమూహము ఎక్కువగా ఉండుటచేతను చూడలేకపోయెను.

4. కనుక అతడు ముందుకు పరుగుదీసి, ఆ దారిన పోవనున్న యేసును చూచుటకై, ఒక మేడిచెట్టును ఎక్కెను.

5. యేసు అచటకు వచ్చినపుడు పైకి చూచి, అతనితో “జక్కయ్యా! త్వరగా దిగిరమ్ము. ఈ దినము నేను నీ ఇంటిలోనుండ తలంచితిని” అని చెప్పెను.

6. అతడు వెంటనే దిగివచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతము పలికెను.

7. ఇది చూచిన వారందరు “ఈయన పాపియొద్దకు అతిథిగా వెళ్ళెను” అని సణుగుకొనసాగిరి.

8. జక్కయ్య నిలబడి యేసుతో, “ప్రభూ! నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదును. నేను ఎవనికైనను అన్యాయము చేసినచో నాలుగురెట్లు అతనికి ఇచ్చివేయుదును” అని చెప్పెను.

9. అందుకు యేసు “నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఏలయన, ఇతడును అబ్రహాము కుమారుడే.

10. మనుష్యకుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చియున్నాడు” అని అతనితో చెప్పెను.

11. యేసు యెరూషలేమును సమీపించు చుండుటవలన, పరలోకరాజ్యము వెంటనే అవతరింపనున్నదని ప్రజలు తలంచుచుండుటవలన, ప్రజలు వినుచుండగా యేసు వారికి ఒక ఉపమానమును చెప్పెను.

12.యేసు ఇట్లు చెప్పనారంభించెను: “గొప్ప వంశస్తుడు ఒకడు రాజ్యము సంపాదించుకొని రావలయునని దూరదేశమునకు వెళ్ళెను.

13. అతడు తన పదిమంది సేవకులను పిలిచి తలకొక నాణెమును ఇచ్చి, 'నేను తిరిగివచ్చువరకు ఈ ధనముతో వ్యాపారము చేసికొనుడు' అని చెప్పెను.

14. ప్రజలు అతనిని ద్వేషించిరి. అందుచేవారు 'ఇతడు మమ్ములను పరి పాలించుటమాకు సమ్మతముకాదు' అని రాయబారులతోచెప్పి పంపిరి.

15. అతడు రాజ్యమును సంపాదించుకొని తిరిగి వచ్చినపుడు, ఒక్కొక్కడు ఎటుల వ్యాపారము చేసినది తెలిసికొనుటకు, తాను ధనమిచ్చిన సేవకులను తన వద్దకు పిలిపించెను.

16. మొదటివాడు వచ్చి 'అయ్యా! నీవిచ్చిన సొమ్ముతో ఇంకను పది నాణెములను సంపాదించితిని, అని చెప్పెను.

17. అందుకు అతడు ఆ సేవకునితో 'మంచిది. నీవు నమ్మినబంటువు. స్వల్ప విషయములందు శ్రద్ధవహించితివి. కనుక నిన్ను పది పట్టణములకు అధిపతిని చేసెదను' అనెను.

18. రెండవవాడు వచ్చి 'అయ్యా! నీవిచ్చిన సొమ్ముతో ఇంకను ఐదునాణెములను సంపాదించితిని' అని చెప్పెను.

19. 'నిన్ను ఐదు పట్టణములకు అధిపతిని చేసెదను' అని అతడు చెప్పెను.

20. మరొకడు వచ్చి 'అయ్యా! ఇదిగో నీ నాణెము. దీనిని మూటకట్టి ఉంచితిని.

21. నీవు కఠినుడవు. నీవు అనిన నాకు భయము. నీవు ఈయని దానిని తీసికొనెదవు. విత్తని దానిని కోయుదువు' అని చెప్పెను.

22. అందుకు అతడు 'ఓరీ దుష్టుడా! నీ మాటలతోనే నిన్ను నీవు దోషివని ఋజువు చేసికొను చున్నావు. కఠినుడనని, పెట్టని దానిని తీసికొనెదనని, విత్తని దానిని కోసికొనెదనని నీవు ఎరుగుదువు.

23. అట్లయినచో నా సొమ్మును ఎందుకు వడ్డీకి ఇవ్వలేదు? నేను తిరిగివచ్చినపుడు వడ్డీతో సైతము పుచ్చుకొనెడివాడను'

24. అని చెప్పి అతడు చెంతనున్న వారితో 'వానివద్దగల ఆ నాణెము తీసికొని, పది నాణెములున్న వానికిండు' అని చెప్పెను.

25. అపుడు వారు 'బోధకుడా! వానివద్ద ఇప్పటికే పది నాణెములున్నవి గదా!' అని పలికిరి.

26. అందుకు ఆయన 'ఉన్న వానికే ఇంకను ఇవ్వబడును. లేనివానినుండి వాని వద్దనున్న కొంచెముకూడ తీసికొనబడును.

27. మంచిది. నా పాలనను అంగీకరింపని నా శత్రువులను వెంటనే ఇచటకు తీసికొనివచ్చి నా సమక్షముననే వారి తలలు తీయుడు' అని అతడు చెప్పెను.

28. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వారికంటే ముందుగా పయనించెను.

29. ఆయన ఓలీవుకొండ చెంతనున్న బెత్పగా, బెతానియ అను గ్రామములను సమీపించినపుడు ఇద్దరు శిష్యులను పంపుచు,

30. “మీరు ఎదుటనున్న ఆ గ్రామమునకు వెళ్ళుడు. వెళ్ళిన వెంటనే, మీరు అచట కట్టివేయబడి ఉన్న ఒక గాడిద పిల్లను చూచెదరు. దానిపై ఎవడును ఎన్నడును ఎక్కియుండలేదు. దానిని విప్పి నా యొదకు తోలుకొనిరండు.

31. 'మీరు ఏల దానిని విప్పుచున్నారు?' అని ఎవరైన మిమ్ము ప్రశ్నించినచో, “ప్రభువునకు దానితో పని ఉన్నది' అని చెప్పుడు” అని ఆదేశించెను.

32. శిష్యులు వెళ్ళి యేసు తమకు చెప్పినట్లు కనుగొనిరి.

33. ఆ గాడిదపిల్లను విప్పుచుండగా దాని యజమానులు “మీరు దీనిని ఎందులకు విప్పుచున్నారు?” అని అడిగిరి.

34. “ప్రభువునకు దీనితో పని ఉన్నది” అని చెప్పి,

35. వారు దానిని యేసు వద్దకు తోలుకొని వచ్చిరి. దానిమీద తమ వస్త్రములను పరచి ఆయనను కూర్చుండబెట్టిరి.

36. ఆయన ముందుకు సాగిపోవుచుండ ప్రజలు దారిలో తమ వస్త్రములు పరచిరి.

37. ఆయన ఓలీవుకొండ సమీపమున ఉన్న పల్లపు ప్రదేశము చేరునప్పటికి శిష్యుల సమూహమంతయు తాము చూచిన అద్భుత కార్యములకు ఆనందపరవశులై ఎలుగెత్తి,

38. “ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక! పరలోకమున శాంతియు, మహోన్నతమున మహిమయు కలుగునుగాక!" అని దేవుని స్తుతింపసాగిరి.

39. అంతట జనసమూహమునుండి కొందరు పరిసయ్యులు "బోధకుడా! నీ శిష్యులను గద్దింపుము” అని చెప్పిరి.

40. అందుకు యేసు “వారు మౌనము వహించినయెడల ఈ రాళ్ళు ఎలుగెత్తి చాటగలవు అని చెప్పుచున్నాను” అని పలికెను.

41. యేసు యెరూషలేమును సమీపించి ఆ నగరమును చూచి ఇట్లు విలపించెను;

42. “నేడైనను నీవు శాంతికి అవసరమైన దానిని గుర్తించియుండిన యెడల బాగుండెడిది. నీవు అటుల చేయలేకపోతివి.

43.శత్రువులు నీ చుట్టు కందకములు త్రవ్వి, నిన్ను ముట్టడించి, అన్నివైపుల నిన్ను అరికట్టు కాలము వచ్చును.

44. వారు నిన్ను, నీలో నివసించు ని సంతానమును మట్టిపాలు చేయుదురు. నీలో రాతి మీద రాయిని నిలువనీయరు. ఏలన, ప్రభువు నిన్ను దర్శింపవచ్చిన కాలమును నీవు గుర్తింపలేదు.”

45. అపుడు యేసు దేవాలయమున ప్రవేశించి, అచట విక్రయదారులను వెళ్ళగొట్టుచు,

46. “ 'నా ఆలయము ప్రార్ధనాలయము అనబడును' అని వ్రాయబడియున్నది. కాని, మీరు దానిని దొంగల గుహగా చేసితిరి” అని పలికెను.

47. ఆయన దేవాలయమున ప్రతిదినము ఉప దేశించుచుండెను. అక్కడ ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రజల పెద్దలు ఆయనను నాశనము చేయజూచిరి.

48. కాని, ప్రజలందరును యేసు బోధలయందు నిమగ్నులైయున్నందున వారికి అది సాధ్యపడలేదు. 

 1. ఒకానొక రోజున యేసు దేవాలయములో ప్రజలకు బోధించుచుండగా ప్రధానార్చకులు, ధర్మ శాస్త్ర బోధకులు, ప్రజల పెద్దలు వచ్చి,

2. “ఏ అధికారముతో నీవు ఈ కార్యములను చేయు చుంటివి? నీకు ఈ అధికారమును ఇచ్చినవాడు ఎవ్వడు?” అని ప్రశ్నించిరి.

3. అందుకు యేసు, “నేనుకూడ మిమ్ము ఒకమాట అడిగెదను.

4. యోహాను బప్తిస్మము ఎచ్చటనుండి వచ్చినది? దేవుని నుండియా? లేక మానవుని నుండియా?” అని ప్రశ్నించెను.

5. వారు తమలో తాము, “దేవుని నుండి అని సమాధానము ఇచ్చితిమా, అట్లయిన, మీరేల ఆయనను విశ్వసింపలేదు? అనును.

6. అట్లుగాక, మానవులనుండి అని చెప్పితిమా ప్రజలు మనపై రాళ్ళు రువ్వెదరు. ఏలయన, వారు యోహానును ప్రవక్త అని గట్టిగా నమ్ముచున్నారు” అని తర్కించుకొనిరి.

7. అందుచేత వారు “అది మాకు తెలియదు” అని సమా ధానము ఇచ్చిరి.

8. అంతట యేసు వారితో “అట్లయిన ఏ అధికారముతో ఈ కార్యములు చేయుచుంటినో నేనును చెప్పను” అనెను.

9. యేసు ప్రజలకు ఈ ఉపమానమును వినిపించెను. “ఒకానొకడు ద్రాక్షతోటను నాటించెను. కాపులకు దానిని కౌలుకిచ్చి చాలకాలము దేశాటన మునకు వెడలెను.

10. పంటకాలమున తన భాగమును తెచ్చుటకై కౌలుదారులయొద్దకు తన సేవకుని పంపెను. కాని వారు వానినికొట్టి వట్టిచేతులతో పంపివేసిరి.

11. అతడు మరొక సేవకుని పంపెను. వారు వానిని కూడ కొట్టి, అవమానించి వట్టిచేతులతో పంపివేసిరి.

12. అతడు మూడవవానిని పంపెను. వారు వానిని గూడ గాయపరచి, బయటకు నెట్టివేసిరి.

13. అంతట 'నేను ఏమి చేయవలెను?' అని యజమానుడు అనుకొని 'నా ప్రియకుమారుని పంపెదను. ఒకవేళ వారు అతనిని గౌరవింపవచ్చును' అని తలంచెను.

14. కాని ఆ కౌలుదారులు అతనిని చూడగనే 'వీడే వారసుడు, వీనిని చంపివేసెదము. వీని ఆస్తి అంతయు మనకు దక్కును' అని ఒకరికొకరు చెప్పుకొనిరి.

15. కనుక, వారు అతనిని తోట వెలుపలికి నెట్టి చంపివేసిరి. ఇపుడు ద్రాక్షతోట యజమానుడు వారిని ఏమి చేయును?

16. అతడు వచ్చి ఆ కౌలుదారులను హతమార్చి తన ద్రాక్షతోటను ఇతరులకు కౌలు కిచ్చును గదా!" ఇది విని ప్రజలు “అటులెన్నడు జరుగకుండుగాక!" అనిరి.

17. యేసు వారివైపు తిరిగి “మీరు ఈ లేఖనమును చదువలేదా? 'ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి, ముఖ్యమయిన మూలరాయి అయ్యెను'.

18. ఎవడు ఈ రాతిమీద పడునో, వాడు తునాతున కలగును. ఎవనిపై ఈ రాయిపడునో వాడు నలిగి నుగును” అని పలికెను.

19. ధర్మశాస్త్ర బోధకులు, ప్రధానార్చకులు ఈ ఉపమానమును విని అది తమను గురించియే అని గ్రహించి, ఆయనను అపుడే పట్టుకొనుటకు ప్రయత్నించిరి. కాని ప్రజలకు భయపడిరి.

20. వారు పొంచియుండి, ఆయనను సంస్థాన పాలకునకు అప్ప గించుటకై మాటలలో చిక్కించుకొనవలయునని, నీతిమంతులుగా నటించుకొందరు గూఢచారులను ఆయన యొద్దకు పంపిరి.

21. వారు వచ్చి, “బోధకుడా! నీవు సత్యసంధుడవు. పక్షపాతము లేనివాడవు, దేవుని మార్గమును గూర్చిన వాస్తవము బోధించువాడవు.

22. చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయ సమ్మతమా? కాదా? అని అడిగిరి.

23. యేసు వారి కుతంత్రమును గుర్తించి, వారిని

24. “సుంకము చెల్లించు నాణెమును నాకు చూపుడు. దానిపై ఉన్న రూపనామధేయములు ఎవరివి?” అని అడిగెను. “చక్రవర్తివి” అని వారు చెప్పిరి.

25. “మంచిది. చక్రవర్తివి చక్రవర్తికి, దేవునివి దేవునకు చెల్లింపుడు" అని ఆయన వారితో అనెను.

26. ఈ విధముగా ప్రజలయెదుట ఆయన చెప్పిన మాటలతో అతనిని చిక్కించుకొనలేకపోయిరి. కాని ఆయన సమాధానము నకు వారు ఆశ్చర్యపడి మిన్నకుండిరి.

27. ఆ పిమ్మట పునరుత్థానమును విశ్వసింపని సదూకయ్యులు కొందరు యేసు వద్దకు వచ్చి,

28. “బోధకుడా! ఒకడు సంతానము లేక మరణించిన యెడల వాని సోదరుడు అతని భార్యను పెండ్లాడి, అతనికి సంతానము కలుగజేయవలెనని మోషే లిఖించెనుగదా!

29. అయితే మాలో ఏడుగురు సహోదరులు ఉండిరి. మొదటివాడు పెండ్లాడి సంతానము లేకయే చనిపోయెను.

30. పిమ్మట రెండవవాడు

31. ఆ పిదప మూడవవాడు, అట్లే ఏడుగురును ఆ స్త్రీని పెండ్లాడి సంతానము లేకయే మరణించిరి.

32. ఆ పిదప ఆమెయు మరణించినది.

33. ఏడుగురును ఆమెను వివాహమాడిరి కదా! పునరుత్థానమునందు ఆమె ఎవరి భార్య అగును?" అని అడిగిరి.

34. అందుకు యేసు “ఈ జీవితములో వివాహ ములకు ఇచ్చిపుచ్చుకొనుట జరుగును.

35. కాని పునరుత్థానమునకు యోగ్యులగువారు రానున్న జీవిత మున వివాహముకొరకు ఇచ్చిపుచ్చుకొనరు.

36. పునరుత్థానులగుటచే వారికి ఇక చావులేదు. పునరుత్థాన కుమారులగుట వలన వారు దేవదూతలతో సమానులు. దేవుని కుమారులు.

37. మండు చున్న ! పొదను గూర్చి మోషే ప్రస్తావించుచు, పునరుత్థాన విషయమై ప్రభువు అబ్రహాము దేవుడనియు, ఈసాకు దేవుడనియు, యాకోబు దేవుడనియు పలికెను.

38. దేవుడు జీవితులకేగాని, మృతులకు దేవుడు కాడు. ఏలయన, ఆయన దృష్టికి అందరు సజీవులే” అని వారికి సమాధానము ఇచ్చెను.

39. అపుడు ధర్మశాస్త్ర బోధకులు కొందరు “బోధకుడా! నీవు సరిగా సమాధానమిచ్చితివి" అనిరి.

40. ఆ పిదప, వారు ఆయనను మరేమియు అడుగుటకు సాహసింపలేదు.

41. కాని యేసు వారితో “క్రీస్తు దావీదు కుమా రుడని ప్రజలు ఎందుకు చెప్పుచున్నారు?

42. దావీదు స్వయముగా కీర్తనల గ్రంథములో ఇట్లు చెప్పియున్నాడు:

43. 'నేను నీ శత్రువులను , నీ పాదముల క్రింద ఉంచువరకును నీవు నా కుడి ప్రక్కన కూర్చుండుమని, ప్రభువు నా ప్రభువుతో పలికెను.'

44. తనను ప్రభువని సంబోధించిన దావీదునకు ఆయన కుమారుడు ఎట్లు అగును?” అని పలికెను.

45. ప్రజలందరు వినుచుండ యేసు తన శిష్యు లకు,

46. “మీరు ధర్మశాస్త్ర బోధకులను గురించి మెలకువగా ఉండుడు. వారు నిలువుటంగీలు ధరించి తిరిగెదరు. వీధులలో వందనములు, ప్రార్థనామందిర ములలో ఉన్నత స్థానములు, విందులలో ప్రధానాసనములు కోరుదురు.

47. వారు వితంతువుల ఇండ్లను దోచుకొందురు. ఆడంబరమునకై దీర్ఘ ప్రార్థనలు చేయునట్లు నటించుదురు. వారు కఠిన శిక్షకు గురియగుదురు” అని చెప్పెను. 

 1. దేవాలయమున కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనికులను యేసు చూచెను.

2. ఒక పేద వితంతువు అందు రెండు కాసులను వెయుట యేసు గమనించి,

3. “ఈ పేద వితంతువు అందరికంటెను ఎక్కువగా ఇచ్చినదని మీతో చెప్పుచున్నాను.

4. వారలు తమ సమృద్ధి నుండి కానుకలిచ్చిరి. కాని ఈమె తన పేదరికములో తన సమస్త జీవనమును సమర్పించినది” అని పలికెను.

5. కొందరు ప్రజలు ఆలయమును గురించి ప్రస్తావించుచు “చక్కని రాళ్ళతోను, దేవునికి అర్పింపబడిన వస్తువులతోను ఎంత అందముగా శోభిల్లు చున్నదో చూడుడు” అని చెప్పుకొనుచుండిరి.

6. అంతట యేసు వారితో “ఈ కట్టడమును మీరు చూచు చున్నారుగదా! ఇచ్చట రాతి పైరాయి నిలువని కాలము వచ్చును. అంతయు నాశనము చేయబడును” అనెను.

7. అప్పుడు వారు “బోధకుడా! ఇవన్నియు ఎప్పుడు సంభవించును? దానికి సూచనయేమి?" అని అడిగిరి.

8. అందుకు, ఆయన “మిమ్ము ఎవ్వరును మోసగింపకుండునట్లు మెలకువగా ఉండుడు. మోసపోకుడు. అనేకులు నాపేరిట వచ్చి నేనే ఆయనను అనియు, కాలము సమీపించినది అనియు చెప్పెదరు. కాని మీరు వారివెంట వెళ్ళవలదు.

9. యుద్ధములను, విప్లవములనుగూర్చి వినినపుడు మీరు భయపడవలదు. మొదట ఇవి అన్నియు జరిగి తీరును. కాని, అంతలోనే అంతమురాదు” అనెను.

10. ఇంకను ఆయన వారితో ఇట్లనెను: “ఒక జాతి మరియొక జాతిపై, ఒక రాజ్యము మరియొక రాజ్యముపై దాడి చేయును.

11. భయంకర భూకంపములు, పలుచోట్ల కరువులు, తెగుళ్ళు వ్యాపించును. ఆకాశమున భయంకరమైన దృశ్యములు, గొప్ప సూచనలు కనిపించును.

12. ఇవి అన్నియు సంభవింపక పూర్వము వారు మిమ్ము పట్టి, ప్రార్థనామందిరములకును, చెరసాలలకును అప్పగించి, హింసింతురు. నా నామము నిమిత్తము రాజులయొద్దకు, అధిపతులయొద్దకు మిమ్ములను తీసికొనిపోవుదురు.

13. ఇది మీరు సాక్షులుగ ఉండవలసిన సమయము.

14. మీరు అచట చెప్పవలసినదానిని గూర్చి కలవరపడకుడు.

15. విరోధి మీకు ఎదురాడుటకును, మిమ్ములను ఖండించుటకును వీలుకాని వాక్కును, వివేకమును ప్రసాదింతును.

16. తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులుకూడ మిమ్మును పట్టిఇచ్చెదరు. మీలో కొంతమందిని చంపించెదరు.

17. నా నామము నిమిత్తము మిమ్ములను అందరు ద్వేషింతురు.

18. కాని మీ తలవెంట్రుకకూడ రాలిపోదు.

19. మీ సహనమువలన మీరు మీ ప్రాణములను దక్కించు కొందురు.

20. “యెరూషలేము ముట్టడింపబడుటను కాంచినవుడు దానికి వినాశనము సమీపించినదని గ్రహింపుడు.

21. అపుడు యూదయా సీమలో ఉన్న వారు పర్వతములకు పారిపోవలయును. పట్టణము లో ఉన్నవారు వెలుపలకు వెళ్ళిపోవలయును. వెలుప లనున్నవారు పట్టణములో ప్రవేశింపరాదు.

22. అవి ప్రతీకారదినములు. ఆ దినములలో లేఖనములలో వ్రాయబడినవి అన్నియు జరిగితీరును.

23. ఆ రోజులందు గర్భిణులకు, బాలింతలకు ఎంత బాధ! ఏలయన భూమిపై ఘోరమైన విపత్తు సంభవించును. ప్రజలు దేవుని కోపమునకు గురియగుదురు.

24. జనులు ఖడ్గమునకు బలియగుదురు. బందీలుగా అన్ని దేశములకు కొనిపోబడుదురు. అన్యుల కాలము పరిపూర్తి అగువరకు అన్యులు యెరూషలేమును కాల రాచెదరు.

25. “సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును. భూమిపై జాతులకు గడ్డుకాలము దాపురించును. సముద్రతరంగ గర్జనలతో ప్రజలెల్ల అల్లకల్లోలమగుదురు.

26. ఏలయన అంతరిక్ష శక్తులు కంపించును. ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తులవలన భయముచే తమ ధైర్యమును కోల్పోవుదురు.

27. అపుడు మనుష్యకుమారుడు శక్తితోను, మహా మహిమతోను ఆకాశమున మేఘా రూఢుడై వచ్చుటను వారు చూచెదరు.

28. ఇవి అన్నియు సంభవింపనున్నప్పుడు ధైర్యముతో తలయెత్తి చూడుడు. ఏలయన, మీ రక్షణకాలము ఆసన్నమైనది."

29. ఆయన వారికి ఒక ఉపమానమును చెప్పెను: “అంజూరపు వృక్షమును, తదితర వృక్ష ములను చూడుడు.

30. అవి చిగురు తొడుగుట చూచినపుడు, వసంతకాలము సమీపించినదని తెలిసి కొందురు.

31. అట్లే ఇవి అన్నియు సంభవించుట మీరు చూచినపుడు దైవరాజ్యము సమీపించినదని తెలిసికొనుడు.

32. ఇవి అన్నియు జరుగునంతవరకును, ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

33. భూమ్యాకాశములు గతించిపోవును. కాని నా మాటలు ఎన్నటికిని గతించిపోవు.

34. “తుఛ్చ విషయాసక్తితోను, త్రాగుడుతోను, చీకుచింతలతోను మీరు మందమతులుగాక, అప్రమత్తులై ఉండుడు. లేనిచో ఆ దినము ఆకస్మికముగా ఉచ్చువలె వచ్చిపడును.

35. ఏలయన, ఆ దినము భూలోక వాసులందరిపైకి వచ్చును.

36. మీరు రానున్న సంఘటనలనుండి రక్షింపబడుటకును, మనుష్య కుమారుని సమక్షమున నిలువబడుటకు కావలసిన శక్తిని పొందుటకును ఎల్లప్పుడును జాగరూకులై ప్రార్థన చేయుడు."

37. ప్రతిదినమున యేసు దేవాలయమున ఉపదేశించుచు రాత్రి వెలుపలకు వెళ్ళి, ఓలివుపర్వత ముపై గడుపుచుండెను.

38. ఆయన బోధలు వినుటకై దేవాలయమునకు ప్రజలందరు ప్రాతఃకాలముననే వెళ్ళెడివారు. 

 1. పాస్క అనబడు పులియని రొట్టెల పండుగ సమీపించుచుండెను.

2. ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు ప్రజలకు భయపడుచున్నందున యేసును చంపుటకు అనువైన మార్గం వెదకుచుండిరి.

3. అపుడు పన్నిద్దరు శిష్యులలో ఒకడగు యూదా ఇస్కారియోతులో సైతాను ప్రవేశించెను.

4. అతడు బయటకు వెళ్ళి ప్రధానార్చకులను, ఆలయ అధికారులను కలిసికొని, తాను యేసును వారిచేతికి ఎటుల అప్పగింపనున్నాడో చెప్పెను.

5. వారు సంతసించి, అతనికి కొంత ధనమిచ్చుటకు సమ్మతించిరి.

6. కావున అతడు అంగీకరించి , ఆయనను వారికి అప్పగించుటకు జనసమూహములేని సమయమునకె వేచియుండెను.

7. పాస్కగొఱ్ఱెను బలి అర్పించవలసిన పులియని రొట్టెల పండుగరోజు వచ్చెను.

8. యేసు, పేతురు యోహానులతో “మీరు వెళ్ళి మనము భుజించుటకు పాస్కభోజనము సిద్ధము చేయుడు” అని చెప్పి పంపెను.

9.“మీరు భోజనము ఎక్కడ సిద్ధము చేయించుమని కోరుచున్నారు?” అని వారు అడిగిరి.

10. అందులకు ఆయన “మీరు పట్టణమున ప్రవే శింపగనే ళ్ళ కడవ మోసికొని పోవుచున్న ఒక వ్యక్తి మీకు ఎదురగును. అతడు ప్రవేశించు ఇంటికి మీరును అతని వెంటవెళ్ళుడు.

11. 'నేను నా శిష్యులతో గూడ పాస్కభోజనముచేయు అతిథిశాల ఎక్కడ ఉన్నది? అని బోధకుడు నిన్ను అడుగుచున్నాడు' అని ఆ యింటి యజమానునితో చెప్పుడు.

12. అతడు మీకు మేడ పైభాగమున అమర్చబడియున్న విశాలమైన ఒక గదిని చూపును. అచటనే మీరు భోజనము సిద్ధము చేయుడు” అనెను.

13. వారు వెళ్ళి యేసు చెప్పిన ప్రకారమే కనుగొని పాస్క భోజనము సిద్ధము చేసిరి.

14. ఆ గడియ వచ్చినపుడు యేసు శిష్యులతో భోజనమునకు కూర్చుండెను.

15. అపుడు ఆయన వారితో "నేను శ్రమలను అనుభవించుటకు ముందు మీతో ఈ పాస్కను భుజింపవలయునని ఎంతయో ఆశించితిని.

16. ఏలయన దేవునిరాజ్యములో ఇది నెరవేరువరకు నేను దీనిని మరల రుచిచూడను” అనెను.

17. అపుడు ఆయన పాత్రమును అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి, “దీనిని తీసికొని మీరు పానముచేయుడు.

18. ఏలయన, ఇది మొదలు దైవరాజ్యము వచ్చువరకు ఈ ద్రాక్షరసమును నేను చవిచూడనని మీతో చెప్పుచున్నాను” అనెను.

19. అపుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి, దానిని త్రుంచి వారికి ఒసగుచు “ఇది మీ కొరకు అర్పింపబడెడు నా శరీరము. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు” అనెను.

20. ఆయన అట్లే భోజనానంతరము పాత్రమును అందుకొని “ఈ పాత్రము మీ కొరకు చిందబడు నా రక్తముతో ముద్రితమైన నూతన నిబంధన” అనెను.

21. “ఇదిగో! నన్ను పట్టిచ్చువాడు ఇచటనే ఉన్నాడు.

22. నిశ్చ యింపబడిన విధమున మనుష్యకుమారుడు గతించును. కాని ఆయనను అప్పగించువానికి అనర్థము” అనెను.

23. అందుకు వారు “మనలో ఈ పనికి పూనుకొన్న వాడు ఎవడు?” అని ఒకరినొకరు ప్రశ్నించుకొన సాగిరి.

24. తమలో ఎవరు గొప్పవారు అను వివాదము వారిలో తలఎత్తెను.

25. యేసు వారికి ఇటుల చెప్పెను. “అన్యజనుల రాజులు వారిపై అధికారము చెలాయింతురు. వారి అధికారులు ఉపకారులని పిలువబడుచున్నారు.

26. కాని, మీరు అటుల చేయవలదు. మీలో గొప్పవాడు చిన్నవానివలెను, నాయకుడు సేవకునివలెను ఉండవలయును.

27. భోజనమునకు కూర్చున్న వ్యక్తియా? లేక వడ్డించు వ్యక్తియా? ఎవడు గొప్పవాడు? భోజనమునకు కూర్చున్న వ్యక్తియే కదా? నేను మీ మధ్య ఒక సేవకునివలె ఉన్నాను.

28. నా శ్రమలలో నాకు తోడుగా ఉన్నవారు మీరే.

29. నా తండ్రి నాకు రాజ్యమును ఇచ్చినట్లు, నేనును మీకు ఇచ్చుచున్నాను.

30. మీరు నా రాజ్యములో నాతోకూడ విందు ఆరగించుచు, సింహా సనములపై కూర్చుండి యిస్రాయేలీయుల పండ్రెండు గోత్రములకు తీర్పు తీర్చెదరు.

31. “సీమోనూ! సీమోనూ! మిమ్ము గోధుమల వలె జల్లెడ పట్టుటకు సైతాను ఆశించెను.

32. కాని, నీ విశ్వాసము చెదరకుండుటకును నేను నీకై ప్రార్ధించితిని. నీకు హృదయపరివర్తనము కలిగినపుడు, నీ సోదరులను స్థిరపరపుము" అనెను.

33. అందుకు అతడు “ప్రభూ! నేను మీతోకూడ చెరసాలకు పోవుటకు, మరణించుటకు సైతము సిద్ధముగా ఉన్నాను" అని చెప్పగా

34. యేసు, "పేతురూ! నేడు కోడికూతకు ముందు, నీవు నన్ను ఎరుగను అని ముమ్మారు బొంకెదవని నేను నీతో చెప్పుచున్నాను” అనెను.

35. “నేను మిమ్ము జాలెను, జోలెను, పాదరక్షలను లేకుండ పంపినపుడు మీకు ఏదైన తక్కువ పడినదా?” అని యేసు వారిని అడిగెను. 'లేదు' అని వారు బదులు పలుకగా

36. జాలె ఉన్నవాడు జాలెను, అట్లే జోలెను కొనిపోవలయును. కత్తి లేనివాడు తన వస్త్రమును అమ్మి దానిని కొనవలయును.

37. ఏలయన, 'అతడు అపరాధులలో ఒకడుగ పరి గణింపబడెను' అను లేఖనము నాయందు నెరవేర వలసియున్నది. నన్ను గూర్చి వ్రాయబడినవి అన్నియు నెరవేరనున్నవని మీతో చెప్పుచున్నాను అని యేసు చెప్పెను.

38. “ప్రభూ! ఇదిగో ఇక్కడ రెండు ఖడ్గములు ఉన్నవి” అని వారు చెప్పిరి. “చాలును” అని యేసు బదులు పలికెను.

39. ఆయన అక్కడనుండి బయలుదేరి తన అలవాటు చొప్పున ఓలీవుకొండకు వెళ్ళుచుండగా శిష్యులు ఆయనను అనుసరించిరి.

40. ఆ స్థలమునకు చేరినపిమ్మట యేసు వారితో “శోధనలకు గురికాకుండుటకు ప్రార్ధనలు చేయుడు” అని చెప్పెను.

41. పిమ్మట ఆయన రాయివేటు దూరము వెళ్ళి మోకరిల్లి,

42. "తండ్రీ! నీ చిత్తమైనచో ఈ పాత్రను నా నుండి తొలగింపుము. కాని నా యిష్టము కాదు. నీ చిత్తమే నెరవేరునుగాక!” అని ప్రార్ధించెను.

43. అపుడు  పరలోకమునుండి ఒక దూత ప్రత్యక్షమై ఆయనను బలపరచెను.

44. ఆయన బాధతో ఇంకను దీక్షగా ప్రార్థన చేయసాగెను. ఆయన చెమట రక్తబిందువుల వలె భూమిమీద పడుచుండెను. )

45. ప్రార్థన ముగించి యేసు శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖభారముచే అలసిసొలసి నిద్రకు లోనగుట చూచెను.

46. యేసు వారితో “మీరు ఏల నిద్రించుచున్నారు? రెండు, శోధనకు గురికాకుండుటకై ప్రార్థన చేయుడు” అని చెప్పెను.

47. యేసు ఇంకను మాట్లాడుచుండగనే అచటకు ఒక గుంపు వచ్చెను. పన్నిద్దరు శిష్యులలో ఒకడగు యూదా, వారికి ముందుగా నడచుచుండెను. అతడు యేసును ముద్దుపెట్టుకొనుటకు దగ్గరకు రాగా,

48. యేసు వానితో “యూదా! నీవు ముద్దుతో మనుష్య కుమారుని పట్టి యిచ్చుచున్నావా?” అనెను.

49. అపుడు అక్కడ ఉన్నవారు జరుగబోవునది గ్రహించి “ప్రభూ! మమ్ము కత్తి దూయమందురా?” అని అడిగిరి.

50. వారిలో ఒకడు ప్రధానార్చకుని సేవకుని కొట్టి, వాని కుడిచెవిని తెగనరికెను.

51. కాని యేసు 'ఇకచాలు' అని, వాని చెవిని తాకి స్వస్థపరచెను.

52. పిమ్మట యేసు తనను పట్టుకొనవచ్చిన ప్రధానార్చకు లతోను దేవాలయపు అధికారులతోను, పెద్దలతోను ఇట్లు అనెను: “మీరు బందిపోటు దొంగ పైకి వచ్చినట్లు కత్తులతోను, గుదియలతోను నన్ను పట్టుకొనుటకు వచ్చితిరా?

53. ప్రతిదినము దేవాలయములో మీతో ఉన్నపుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు, అంధకారపు శక్తియునై ఉన్నది.”

54. వారు యేసును బంధించి ప్రధానార్చకుని భవనమునకు తీసికొనివచ్చిరి. పేతురు దూరముగా వెనుక వచ్చుచుండెను.

55. వారు భవనము ముంగిట మంటవేసి చుట్టును కూర్చుండగా, పేతురు కూడ వారి మధ్య ఉండెను.

56. అతడు అచట వెలుతురులో కూర్చుండి ఉండుట ఒక దాసి చూచి, అతని వంక తేరిపార చూచుచు “ఇతడు కూడ అతని వెంట ఉన్నవాడే” అనెను.

57. కాని, అతడు “అమ్మా! నేను అతనిని ఎరుగను” అని బొంకెను.

58. కొంచెము సేపటికి మరొకడు వచ్చి అతనిని చూచి “నీవు కూడ వారిలో ఒకడవు” అనగా “ఓయి! నేను కాదు” అని పేతురు చెప్పెను.

59. ఇంచుమించు ఒక గంట తరువాత ఇంకొకడు “నిస్సందేహముగ ఇతడును అతని అనుచరుడే. ఏలయన, ఇతడును గలిలీయ నివాసియే" అని రూఢిగా చెప్పెను.

60. అందుకు పేతురు “ఓయి! నీవు చెప్పునది నాకు తెలియదు” అనెను. వెంటనే, అతడు అటుల చెప్పుచుండగనే, కోడి కూసెను.

61. ప్రభువు వెనుకకు తిరిగి పేతురును చూచెను. “నేడు కోడి కూయుటకు ముందు ముమ్మారు నన్ను ఎరుగనని బొంకెదవు” అని ప్రభువు చెప్పిన మాటను పేతురు జ్ఞప్తికి తెచ్చుకొని,

62. వెలుపలికి వెళ్ళి వెక్కివెక్కి ఏడ్చెను.

63. అపుడు భటులు యేసును పరిహసించి, కొట్టి,

64. ఆయన కనులకు గంతకట్టి “ప్రవచింపుము! నిన్ను కొట్టినది ఎవరో చెప్పుము” అని అడిగిరి.

65. వారింకను ఎన్నియో విధముల ఆయనను దూషించిరి.

66. ఉదయముననే ప్రజల పెద్దలు, ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు సమావేశమైరి. వారు ఆయనను న్యాయసభలోనికి తీసికొనివచ్చి,

67. “నీవు క్రీస్తువైనచో మాతో చెప్పుము” అని అనిరి. “మీతో చెప్పినను మీరు నన్ను విశ్వసింపరు.

68. నేను మిమ్ములను ప్రశ్నించినను మీరు సమాధానము చెప్పరు.

69. కాని ఇప్పటినుండి మనుష్యకుమారుడు సర్వశక్తి సంపన్నుడైన దేవుని కుడిప్రక్కన కూర్చుండును” అని యేసు బదులు పలికెను.

70. "అట్లయిన నీవు దేవుని కుమారుడవా?" అని వారు ఒక్కుమ్మడిగా ప్రశ్నించిరి. “మీరన్నట్లే” అని యేసు సమాధానమిచ్చెను.

71. అపుడు వారు “మనకు ఇంక ఏమి సాక్ష్యము కావలెను, మనము స్వయముగా అతని నోటినుండియే వింటిమికదా!" అని పలికిరి. 

 1. అప్పుడు వారందరు లేచి యేసును పిలాతు వద్దకు తీసికొనిపోయిరి.

2. “ఇతడు మా జనములను తిరుగుబాటుచేయ పురిగొల్పుచూ కైసరునకు పన్ను చెల్లింపవద్దనియు, తన్ను తాను క్రీస్తు అను ఒక రాజుననియు చెప్పుకొనుట మేము స్వయముగా వినియున్నాము” అని ఆయనమీద నేరము మోపసాగిరి.

3. పిలాతు ఆయనను “నీవు యూదుల రాజువా?” అని అడుగగా అందుకు ఆయన “నీవే చెప్పుచున్నావు” అని బదులు పలికెను.

4. అపుడు పిలాతు ప్రధానార్చకులతో, ప్రజా సమూహములతో “నాకు ఇతనిలో ఏ నేరము కనిపించుటలేదు” అని పలికెను.

5. "ఇతడు గలిలీయ ప్రాంతము మొదలు, ఇచ్చట వరకును, యూదయాసీమ అంతట, బోధించుచు ప్రజలలో విప్లవము లేవదీయుచున్నాడు” అని వారు మరింత ఉద్రిక్తముగా ఆరోపించిరి.

6. ఆ మాటలు విని పిలాతు “ఇతడు గలిలీయ నివాసియా?” అని అడిగెను.

7. ఆయన హేరోదు పాలనకు చెందినవాడని తెలిసికొని పిలాతు ఆయనను హేరోదు వద్దకు పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేమునందుండెను.

8. యేసును చూచి హేరోదు మిక్కిలి సంతోషించెను. ఏలయన, ఆయనను గూర్చి చాలవిని ఉన్నందున చాల దినములనుండి ఆయనకొరకై ఎదురుచూచుచుండెను. ఆయన చేయు అద్భుతములలో ఒకటైనను చూడగోరి,

9. హేరోదు యేసును అనేక విషయములనుగూర్చి ప్రశ్నించెను. కాని, ఆయన సమాధానమేమియు ఈయలేదు.

10. ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, అక్కడ నిలుచుండి ఆయన మీద తీవ్రముగా దోషారోపణ చేయుచుండిరి.

11. అపుడు హేరోదు, అతని సైనికులు ఆయనను నిరాదరించి, పరిహాసముగా ఆడంబరమైన వస్త్రమును కప్పి, ఆయనను తిరిగి పిలాతు వద్దకు పంపిరి.

12. అంతకు పూర్వము శత్రువులుగా ఉన్న హేరోదు, పిలాతులు ఆనాడు పరస్పరము మిత్రులైరి.

13. అపుడు పిలాతు ప్రధానార్చకులను, అధికారులను, ప్రజలను పిలిపించి,

14. “ప్రజలను పెడత్రోవ పట్టించుచున్నాడని ఇతనిని నాయొద్దకు తీసికొనివచ్చితిరి. నేను మీయెదుట ఇతనిని పరీక్షించితిని. ఇతని మీద మీరు మోపిన నేరములు ఏమియు నాకు కనిపించుటలేదు.

15. హేరోదునకు కూడ ఆయన యందు ఏ దోషము కనిపింపలేదు. కనుక, ఇతనిని అతడు తిరిగి నా వద్దకు పంపెను. ఇతడు మరణశిక్షకు తగిన పని ఏదియు చేయలేదు.

16. అందుచేత ఇతనిని కొరడాలతో కొట్టించి విడిచి పెట్టెదను” అనెను.

17. పాస్క ఉత్సవములో ఒక బందీని విడుదలచేయు ఆచారము పిలాతునకు కలదు.

18. అంతట అందరు ఏకకంఠముతో “ఇతనిని చంపివేయుడు. మాకు బరబ్బను విడుదల చేయుడు” అని కేకలు పెట్టిరి.

19. బరబ్బ నగరములో జరిగిన ఒక తిరుగుబాటుకు, హత్యకు కారకుడగుటచే కారాగారమున ఉంచబడెను.

20. పిలాతు యేసును విడిచి పెట్టు ఉద్దేశముతో ప్రజలతో మరల మాట్లాడినను,

21. వారు “అతనిని సిలువ వేయుడు. సిలువ వేయుడు” అని కేకలు వేసిరి.

22. మూడవ పర్యా యము పిలాతు “ఇతడు చేసిన నేరమేమి? మరణ శిక్షకు తగిన నేరమేదియు ఇతనిలో నాకు కనిపింప లేదు. కనుక ఇతనిని కొరడా దెబ్బలు కొట్టించి విడచి పెట్టుదును” అని వారితో చెప్పెను.

23. కాని వారు “అతనిని సిలువవేయుడు” అని మరింత బిగ్గరగా కేకలు వేసిరి. వారి పంతమే గెలిచినది.

24. ప్రజలు కోరినట్లే పిలాతు యేసుకు మరణశిక్ష విధించెను.

25. తిరుగుబాటు, హత్య చేసినందుకు చెరసాలలో వేయబడిన వానిని ప్రజల కోరిక పై అతడు విడుదల చేసెను. కాని, యేసును వారి ఇష్టానుసారము చేసికొనుటకు వారికి అప్పగించెను.

26. వారు యేసును తీసికొని పోవుచున్నపుడు మార్గమధ్యమున పల్లె ప్రాంతమునుండి వచ్చుచున్న కురేనియ సీమోనును చూచిరి. యేసు వెంట సిలువను మోయుటకు వానిని బలవంతపరచిరి.

27. గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. అందు కొందరు స్త్రీలు ఆయన కొరకు రొమ్ములు బాదుకొనుచు విలపించుచుండిరి.

28. యేసు వారిని చూచి “యెరూషలేము కుమార్తెలారా! నా కొరకు ఏడువవలదు. మీ కొరకును మీ బిడ్డల కొరకును దుఃఖింపుడు.

29. ఏలయన, 'ఇదిగో! గొడ్రాళ్ళు, బిడ్డలను కనని గర్భములు, చనుబాలియ్యని స్తనములును ధన్యమైనవి' అని ప్రజలు చెప్పుదినములు రానున్నవి.

30. అపుడు ప్రజలు, 'మామీద పడుడు' అని పర్వతములతోను, 'మమ్ము కప్పివేయుడు' అని కొండలతోను చెప్పనారంభింతురు.

31. పచ్చి మ్రానుకే ఇట్లు సంభవించినపుడు ఎండిన మ్రానును గురించి ఏమి చెప్పగలము?” అనెను.

32. మరి ఇద్దరు గొప్ప నేరము చేసిన వారిని కూడ ఆయనతో చంపుటకు ఆయన వెంట కొనిపోయిరి.

33. 'కపాలము' అనబడు స్థలమునకు వచ్చినప్పుడు, అక్కడ వారు యేసును సిలువవేసిరి. నేరస్థులను కూడ యేసు కుడివైపున ఒకనిని, ఎడమ వైపున ఒకనిని సిలువవేసిరి.

34. అప్పుడు యేసు, "తండ్రీ! వీరు చేయునదేమో వీరు ఎరుగరు. వీరిని క్షమింపుము" అని పలికెను. వారు ఓట్లు వేసి యేసు వస్త్రములను పంచుకొనిరి.

35. ప్రజలు అచట నిలుచుండి ఇది అంతయు చూచుచుండిరి. “ఇతడు ఇతరులను రక్షించెను. కాని, ఇతడు దేవుడు ఎన్నుకొనిన క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకొననిమ్ము” అని అధికారులు ఆయనను హేళనచేసిరి.

36. సైనికులు కూడ ఆయనకు దగ్గరగా వచ్చి పులిసిన ద్రాక్షారసమును ఇచ్చి,

37. “యూదుల రాజువైనచో, నిన్ను నీవు రక్షించుకొనుము” అని పరిహసించిరి.

38. "ఇతడు యూదుల రాజు” అని ఫలకమున వ్రాసి సిలువ పైభాగమున ఉంచిరి.

39. సిలువవేయబడిన నేరస్తులలో ఒకడు. “నీవు క్రీస్తువు గదా! అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్ములనుకూడ రక్షింపుము” అని ఆయనను నిందింపసాగెను.

40. రెండవవాడు వానిని గద్దించుచు “నీవు దేవునికి భయపడవా? నీవు కూడ అదే శిక్షను పొందుచున్నావుగదా!

41. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పనులకు తగుఫలము అనుభవించుచున్నాము. కాని ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు” అని,

42. యేసు వంకకు తిరిగి, “యేసూ! నీవు నీ రాజ్యములో  ప్రవేశించునపుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము” అని విన్నవించెను.

43. యేసు వానితో “నేడే నీవు నాతో కూడ పరలోకమున ఉందువు అని నీతో నిశ్చయ ముగా చెప్పుచున్నాను” అనెను.

44. అది ఇంచుమించు మధ్యాహ్న సమయము. సూర్యుడు అదృశ్యుడాయెను. మూడుగంటల వరకు దేశమంతట చీకటి క్రమ్మెను.

45. దేవాలయపు తెర నడిమికి చినిగెను.

46. అపుడు యేసు బిగ్గరగా, “తండ్రీ! నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను” అని పలికి ప్రాణము విడిచెను.

47. దానిని చూచి శతాధిపతి దేవుని స్తుతించుచు “నిశ్చయముగ ఇతడు నీతిమంతుడు!” అనెను.

48. అచట గుమిగూడిన ప్రజలందరు ఈ సంఘటనలనుచూచి రొమ్ము బాదుకొనుచు తిరిగి ఇంటికి వెళ్ళిరి.

49. గలిలీయనుండి యేసు వెంటవచ్చిన ఆయన పరిచితులందరును, స్త్రీలును కొంతదూరము నుండి ఇదంతయు చూచు చుండిరి.

50. యూదుల పట్టణమగు అరిమత్తయి నివాసియైన యోసేపు అను ఒకడుండెను. అతడు యూదుల పట్టణసభ సభ్యుడు. మంచివాడు, నీతి మంతుడు,

51. అతడు ప్రజల ఆలోచనలకు వారి క్రియలకు సమ్మతింపనివాడు, దైవరాజ్యమునకై నిరీక్షించుచున్నవాడు.

52. అతడు పిలాతు వద్దకు వెళ్ళి, యేసు దేహమును అడిగెను.

53. యేసు శరీరమును సిలువ నుండి దించి, సన్నని నారబట్టతో చుట్టి, ఎవరును ఉంచబడని రాతిలో తొలచబడిన సమాధి యందుంచెను.

54. అది సిద్ధపడు దినము. విశ్రాంతి దినము ప్రారంభము కానుండెను.

55. అప్పుడు గలిలీయనుండి ఆయనవెంట వచ్చిన స్త్రీలు సమాధిని, యేసు దేహము ఉంచబడిన విధమును చూచిరి.

56. వారు తిరిగి వెళ్ళి, సుగంధ ద్రవ్యములను, తైలమును సిద్ధపరచిరి. ధర్మశాస్త్రానుసారము విశ్రాంతిదినమున విశ్రాంతి తీసికొనిరి. 

 1. ఆదివారము వేకువజామున ఆ స్త్రీలు తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యమును తీసికొని సమాధివద్దకు వచ్చిరి.

2. సమాధి ద్వారమును మూసి ఉన్న రాయి దొర్లింపబడి ఉండుట చూచిరి.

3. వారు సమాధిలోనికి వెళ్ళి చూడగా ప్రభువైన యేసు దేహము వారికి కనిపింపలేదు.

4. వారికి ఏమియు తోచలేదు. అప్పుడు ఇరువురు పురుషులు ప్రకాశవంతమైన వస్త్రములను ధరించి, వారిచెంత నిలిచి ఉండిరి.

5. వారు భయపడి తలలు వంచి సాగిలపడగా ఆ పురుషులు వారితో, “మీరు సజీవుడైన వానిని మృతులలో ఏల వెదకుచున్నారు?

6. ఆయన ఇక్కడ లేడు, లేచియున్నాడు.

7. మనుష్యకుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి, సిలువ వేయబడి, మూడవ దినమున సజీవుడై లేవవలయునని మీతో చెప్పెను గదా! ఆయన గలిలీయలో ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు స్మరింపుడు” అనిరి.

8. యేసు పలుకులు అపుడు వారికి జ్ఞప్తికి వచ్చినవి.

9. వారు సమాధి నుండి తిరిగివచ్చి, పదునొకండుమంది శిష్యులకు, మిగతా వారందరికి ఈ విషయములన్నియు తెలియ జేసిరి.

10. అటుల తెలియజేసినవారు: మగ్గలా మరియమ్మ, యోహాన్నా, యాకోబు తల్లి మరియమ్మ, వారితోనున్న తక్కిన స్త్రీలు.

11. వారు ఈ సంగతులను నమ్మక వానిని కట్టుకథలుగా భావించిరి.

12. కాని పేతురు లేచి, సమాధివద్దకు పరుగెత్తి పోయి, లోపలకు వంగిచూడగా నారబట్టలు మాత్రమే కనబడెను. ఈ సంఘటనకు ఆశ్చర్యపడుచు అతడు తిరిగివెళ్ళెను.

13. ఆ రోజుననే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఏడుమైళ్ళ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచు,

14. జరిగిన సంఘటనలను గురించి మార్గమున ముచ్చటించుకొనుచుండిరి.

15. వారు ఇట్లు తర్కించుకొనుచుండగా యేసు తనకు తానుగా వారిని సమీపించి వారివెంట నడవసాగెను.

16. వారు ఆయనను చూచిరి. కాని గుర్తింప లేకపోయిరి.

17. “మీరు నడుచుచు దేనినిగురించి మాట్లాడుకొనుచున్నారు?" అని ఆయన వారిని అడిగెను. వారు విచారముతో నిలిచిపోయిరి.

18. అప్పుడు వారిలో క్లియోపా అనునతడు “యెరూషలే ములో నీవు క్రొత్తవాడవా? ఈ దినములలో అక్కడ ఏమి జరిగినది నీకు తెలియదా?" అనెను.

19. "ఏమి జరిగినది?" అని ఆయన తిరిగి ప్రశ్నింపగా వారు ఇటుల చెప్పసాగిరి: “నజరేయుడైన యేసును గూర్చి వినలేదా? ఆయన ఒక ప్రవక్త, తన క్రియలయందును వాక్కునందును దేవునియెదుటను, ప్రజలందరి యెదుటను, శక్తిమంతునిగా పరిగణింపబడినవాడు.

20. మన ప్రధానార్చకులు, అధిపతులు ఆయనను మరణదండనకు అప్పగించి సిలువవేసిరి.

21. అయితే ఆయనయే యిస్రాయేలీయులను రక్షించునని మేము ఆశతో ఉంటిమి. ఈ సంగతులు జరిగి నేటికి మూడు దినములాయెను.

22. మాలో కొంతమంది స్త్రీలు ప్రాతఃకాలమున సమాధియొద్దకు వెళ్ళగా,

23. అక్కడ వారికి యేసు దేహము కనబడలేదు. అంతే కాకుండ వారికి దేవదూతలు ప్రత్యక్షమై ఆయన సజీవుడని చెప్పినట్లుగ వారువచ్చి చెప్పి మమ్ములను ఆశ్చర్య పరచిరి.

24. అంతట మాలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగానే ఉండుట చూచిరి. కాని యేసును మాత్రము చూడలేదు."

25. అపుడు యేసు ఆ ఇద్దరితో "ఓ అవివేకులారా! ప్రవక్తల వచనములను అన్నింటిని నమ్మని మందమతులారా!

26. క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యముకదా?” అనెను.

27. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తనను గూర్చి వ్రాయబడినవి అన్నియు వారికి వివరించెను.

28. ఇంతలో వారు చేరవలసిన గ్రామము సమీపించినది. యేసు ముందుకు సాగి పోదలచినట్లు కనబడెను.

29. అంతటవారు “ప్రొద్దు వాలిపోయినది. సంధ్యవేళ అగుచున్నది. మాతో ఉండుడు” అని ఆయనను బలవంతము చేయగా ఆయన అందులకు అంగీకరించెను.

30. యేసు వారితో కూడ భోజనమునకు కూర్చుండినపుడు ఆయన రొట్టెను తీసికొని ఆశీర్వదించి, త్రుంచి వారికి ఇచ్చెను.

31. దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించిరి. కాని ఆయన అదృశ్యుడయ్యెను,

32. అంతట వారు ఒకరితో ఒకరు “ఆయన మార్గములో మనతో మాట్లాడునపుడు, లేఖనము లన్నియు మనకు వివరించునపుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదా?" అనుకొనిరి.

33. వారు వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా

34. అక్కడ పదునొకండుమంది శిష్యులును, వారితో ఉండిన వారును “ప్రభువు వాస్తవముగ సజీవుడై లేచెను. సీమోనుకు కనిపించెను” అని చెప్పుకొనుచుండిరి.

35. అపుడు వారుకూడ మార్గమధ్యమున జరిగిన సంఘట నలను వివరించి, ఆయన రొట్టెను విరుచునపుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి.

36. వారు ఇటుల ముచ్చటించుకొనుచుండగనే యేసు వారిమధ్య నిలిచి, “మీకు శాంతి కలుగును గాక!” అనెను.

37. వారు భయభ్రాంతులై భూతమును చూచుచున్నట్లు భావించిరి.

38. అపుడు యేసు వారితో ఇట్లు పలికెను: “మీరు ఎందులకు కలవర పడుచున్నారు? మీ మనసులలో సందేహములు ఏల కలుగుచున్నవి?

39. నా కాళ్ళను చేతులను చూడుడు. నేను ఆయననే. నన్ను తాకి చూడుడు. ఈ విధముగా భూతములకు ఎముకలు, మాంసము ఉండవు”.

40. ఆయన ఇట్లు పలికి వారికి తన చేతులను కాళ్ళను చూపగా,

41. వారు ఆనంద ఆశ్చర్యములతో విభ్రాంతులై విశ్వసింపరైరి. అపుడు ఆయన “మీ వద్ద తినుటకు ఏమైన ఉన్నదా?” అని అడిగెను.

42. వారు ఆయనకు కాల్చిన చేపముక్కను ఇచ్చిరి.

43. యేసు దానిని తీసికొని, వారి ఎదుట భుజించెను.

44. ఆయన మరల ఇట్లు వారితో, “నేను మీతో ఉన్నపుడు మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనల గ్రంథములలోను, నన్ను గూర్చి వ్రాయబడినదంతయు నెరవేరవలయునని మీతో చెప్పిన మాటలు నెరవేరినవి" అని చెప్పెను.

45. అపుడు లేఖనములు అర్థమగునట్లు వారికి బుద్ధి వికాసము కలుగజేసి ఇట్లు చెప్పెను:

46. "క్రీస్తు కష్టములు అనుభవించుననియు, మూడవరోజు మృతులలోనుండి లేచుననియు

47. యెరూషలేము మొదలుకొని సకలజాతులకు ఆయన పేరిట హృదయపరివర్తనము, పాపక్షమాపణము ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది.

48. వీనికి అన్నిటికిని మీరే సాక్షులు.

49. ఇదిగో, నా తండ్రి చేసిన వాగ్దానమును మీకు అనుగ్రహించుచున్నాను. కాని, మీరు పైనుండి శక్తిని పొందునంతవరకును నగర ముననే ఉండుడు.”

50. పిమ్మట ఆయన వారిని బెతానియా వరకు తీసికొనిపోయి, తన చేతులెత్తి వారిని ఆశీర్వదించెను.

51. ఆయన వారిని ఆశీర్వదించుచుండగా పరలోకమునకు వెడలిపోయెను.

52. వారు ఆయనను ఆరాధించి మహానందముతో యెరూషలేమునకు తిరిగిపోయిరి.

53. అక్కడ వారు ఎడతెగక దేవాలయ మున దేవుని స్తుతించుచుండిరి.