1. ప్రియులారా! కపట ప్రవక్తలు చాలమంది లోకమంతట వ్యాపించి ఉన్నారు. కనుక ప్రతిఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షింపుడు. 2. అది దేవుని ఆత్మ అగునో కాదో మీరు ఇట్లు తెలిసికొనగలరు: యేసు క్రీస్తు మానవశరీరము ధరించివచ్చెనని ఒప్పుకొను ప్రతిఆత్మ దేవుని సంబంధమైనది. 3. కాని క్రీస్తును గూర్చి ఈ విషయము అంగీకరింపని ప్రతి ఆత్మ దేవుని సంబంధమైనది కాదు. అట్టిఆత్మ క్రీస్తు విరోధినుండి ఉద్భవించినది. అది వచ్చుచున్నదని దీనిని గూర్చియే మీరు వినియున్నారు. ఇప్పటికే అది లోకములోకి వచ్చియున్నది. ఈ 4. కాని చిన్నబిడ్డలారా! మీరు దేవునకు చెందిన వారై అసత్య ప్రవక్తలను ఓడించితిరి. లౌకికులగు వారిలోనుండు ఆత్మకంటె, మీలో ఉండు ఆత్మ శక్తిమంతమైనది. 5. వారు లౌకిక వ్యవహారములను గూర్చియే ముచ్చటింతురు. అయినను, వారు లౌకికులగుటచే లోకము వారిని శ్రద్ధతో వినును. 6. కాని మనము దేవునకు సంబంధించినవారము. దేవుని ఎరిగిన ప్రతివ్యక్తియు మనలను వినును. దేవునితో సంబంధము లేనివాడు మనలను ఆలకింపడు. కనుక సత్యాత్మ, అసత్యాత్మల తారతమ్యమును మనము ఇట్లు గుర్తింపవచ్చును. 7. ప్రియులారా! ప్రేమ దేవునినుండి పుట్టినది. కనుక మనము పరస్పరము ప్రేమింత...