ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యోబు

 1. ఊజు దేశమున యోబు అను పేరుగల నరుడొకడు ఉండెడివాడు. అతడు ఋజువర్తనుడును, న్యాయవంతుడును మరియు దేవునిపట్ల భయభక్తులు కలిగి, పాపమునకు దూరముగా ఉండువాడు.

2. అతనికి ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు కలిగిరి.

3. అతనికి ఏడువేల గొఱ్ఱెలు, మూడువేల ఒంటెలు, ఐదు వందల జతల ఎద్దులు, ఐదువందల ఆడుగాడిదలు, చాలమంది సేవకులుండిరి. తూర్పు దేశీయులందరికంటే అతడు మహాసంపన్నుడు.

4. యోబు కుమారులు తమ ఇండ్లలో వంతులవారిగా విందులు ఏర్పాటు చేసెడివారు. వారు ఆ విందులను తమ ముగ్గురు ఆడు తోబుట్టువులతో కలిసి అన్నపానీయములు ఆరగించుటకు ఆహ్వానించెడివారు.

5. వారివారి విందుదినములు ముగియగనే యోబు కుమారులను పిలిపించి శుద్ధిచేయించెడివాడు. వేకువనే లేచి ఒక్కొక్కపుత్రుని కొరకు దహనబలిని అర్పించి, ఒకవేళ తన కుమారులు పొరపాటున దేవుని నిందించి పాపము కట్టుకొనిరేమోయని భయపడి, వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెడివాడు. ఇట్లు యోబు ఎల్లప్పుడును చేయుచుండెడివాడు.

6. ఒక దినము దేవదూతలు దేవుని సమక్షమునకు వచ్చిరి. వారితోపాటు సాతానుకూడ వచ్చెను. వచ్చిరి. వారితోపాటు సాతానుకూడ వచ్చెను.

7. దేవుడు సాతానుని నీవు ఎక్కడనుండి వచ్చితివి అని అడుగగా అతడు నేను భూలోకమున అటునిటు సంచారము చేసి వచ్చితిని అని ప్రత్యుత్తరమిచ్చెను.

8. దేవుడతనితో “నీవు నా సేవకుడైన యోబును చూచితివా? అతడు ఋజువర్తనుడును, న్యాయవంతుడును మరియు దేవునిపట్ల భయభక్తులు కలిగి, పాపమునకు దూరముగా ఉండువాడు. అట్టివాడు మరియొకడు భూలోకమునలేడు” అనెను.

9. అతని గురించి నీవెప్పుడైనా ఆలోచించితివా? అని అడుగగా, సాతాను దేవునితో "యోబు ఉట్టినే దేవుని యందు భయభక్తులు చూపువాడా?

10. నీవు అతనికిని, అతని కుటుంబమునకును, అతని సిరిసంపదలకును చుట్టు కంచెవేసి కాపాడుచున్నావు కదా? నీవు అతడు చేపట్టిన కార్యములనెల్ల దీవించుటచే, అతనికున్నదెల్ల దేశములో బహుగా వృద్ధిచెందినది.

11. అయినను నీవు ఇపుడు నీ చేయిచాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తినచో, నీ ముఖముననే నిన్ను దూషించి నిన్ను విడనాడును” అని పలుకుగా

12. దేవుడు సాతానుతో “సరియే, అతనికి కలిగిన సమస్తమును నీ ఆధీనమున నున్నది. నీవు మాత్రము అతనిమీద చేయిచేసికోవలదు” అని చెప్పెను. అంతట సాతాను దేవునిసన్నిధినుండి వెడలి పోయెను.

13. ఒక దినము యోబు కుమారులు, కుమార్తెలు వారి పెద్దన్న ఇంట విందును ఆరగించుచు ద్రాక్షసారాయములను సేవించుచుండిరి.

14. అప్పుడు సేవకుడొకడు యోబు చెంతకు వచ్చి "అయ్యా! నీ ఎడ్లు పొలము దున్నుచున్నవి. వాని ప్రక్కనే నీ గాడిదలు మేయుచున్నవి.

15. ఇంతలో షబాయీయులు వచ్చి పడి ఆ పశువులన్నిటిని తోలుకొనిపోయిరి. వారు నీ సేవకులనెల్ల ఖడ్గములతో పొడిచి చంపివేసిరి. నేనొక్కడనే తప్పించుకొని వచ్చి నీకు ఈ సంగతి చెప్పుచున్నాను” అనెను.

16. అతడు తన మాటలను ముగించెనో లేదో మరియొక సేవకుడు వచ్చి "అయ్యా! ఆకాశము నుండి ఒక మెరపువచ్చి నీ గొఱ్ఱెలను వాని కాపరులను కాల్చి వేసినది. నేనొక్కడనే తప్పించుకొని వచ్చి నీకు ఈ వార్త తెలుపుచున్నాను” అని పలికెను.

17. అతడు తన మాటలను ముగింపకమునుపే వేరొక సేవకుడు వచ్చి “అయ్యా! కల్దీయులు మూడుదండులుగా వచ్చి నీ ఒంటెలమీదపడి వానిని అపహరించుకొనిపోయిరి. వారు నీ సేవకులను కూడ కత్తులతో పొడిచి చంపి వేసిరి. నేనొక్కడనే తప్పించుకొని వచ్చి నీకు ఈ విషయమును తెలియజేయుచున్నాను" అని పలికెను.

18. అతడు తన పలుకులను ముగింపక పూర్వమే ఇంకొక సేవకుడు వచ్చి “అయ్యా! నీ కుమారులు, కుమార్తెలు వారి పెద్దన్న ఇంట విందారగించుచు ద్రాక్షసారాయమును సేవించుచుండిరి.

19. అంతలో ఎడారినుండి ఒక ప్రచండమైన సుడిగాలివచ్చి ఆ ఇంటి నాలుగుమూలలను బాదెను. ఇల్లుకూలి యువకుల మీద పడగా వారందరును చనిపోయిరి. నేనొక్కడనే తప్పించుకొని వచ్చి నీకు ఈ సంగతి విన్నవించుకొనుచున్నాను” అని పలికెను.

20. ఆ మాటలు విని యోబు లేచి సంతాప సూచకముగా పై వస్త్రమును చించుకొనెను. తల గొరిగించుకొనెను. నేలపై బోరగిలపడి దేవునికి దండము పెట్టి:

21. “నేను దిగంబరుడనుగానే తల్లి కడుపు నుండి వెలువడితిని, దిగంబరుడనుగానే ఇచ్చటి నుండి వెడలిపోయెదను. ప్రభువు ఇచ్చెను, ప్రభువే తీసుకొనెను. ప్రభువు నామమునకు స్తుతి కలుగునుగాక!” అని పలికెను.

22. ఇన్ని దురదృష్టములును వాటిల్లి నను యోబు ఏ పాపమును కట్టుకొనలేదు, దేవుడు అన్యాయము చేసెను అని పెదవులతో సైతము పలుకలేదు.

 1. దేవదూతలు మరల దేవుని సమక్షమునకు వచ్చిరి. వారితోపాటు సాతానుకూడ వచ్చెను

2. దేవుడు సాతానుని నీవు ఎక్కడనుండి వచ్చితివి అని అడుగగా అతడు నేను భూలోకమున అటునిటు సంచారము చేసి వచ్చితిని అని ప్రత్యుత్తరమిచ్చెను.

3. దేవుడతనితో “నీవు నా సేవకుడైన యోబును చూచితివా? అతడు ఋజువర్తనుడును, న్యాయవంతు డును మరియు దేవునిపట్ల భయభక్తులు కలిగి, పాపమునకు దూరముగా ఉండువాడు. అట్టివాడు మరియొకడు భూలోకమునలేడు. నీవే నిష్కారణముగా నాచే అతనిని నాశనము చేయుటకు నన్ను ప్రేరేపించినను, అతడు ఇంకను తన నీతిని వదలక, తన నడవడికలో నిలకడగా ఉన్నాడు” అనెను.

4.సాతాను “నరుడు తన చర్మమును కాపాడుకొనుటకు చర్మమును, తన ప్రాణములను దక్కించుకొనుటకు సమస్తమును త్యజించును.

5. ఇంకొకసారి నీవు చేయిచాపి అతని దేహమును మొత్తినయెడల, అతడు నీ ముఖమెదుటనే నిన్ను దూషించి నిన్ను విడనాడును” అని పలికెను.

6. దేవుడు సాతానుతో “సరియే. యోబును నీ ఆధీనమున ఉంచుచున్నాను. నీవు అతని ప్రాణము జోలికి మాత్రము పోవలదు” అని చెప్పెను.

7. అంతట సాతాను దేవుని సమక్షమునుండి వెడలిపోయెను. అతడు యోబును అరికాలినుండి నడినెత్తివరకు వ్రణములతో నింపెను.

8. యోబు కసవు దిబ్బమీద కూర్చుండి చిల్లపెంకుతో తన ప్రణములను గోకుకొన నారంభించెను.

9. అతని భార్య “నీవింకను యదార్థత తను వదలవా? దేవుని దూషించి మరణించుము” అనెను.

10. అందుకు యోబు “నీవు మూరురాలు మాట్లాడినట్లు మాట్లాడుచున్నావు. దేవుడు మనకు మేలులు దయచేసినపుడు స్వీకరించితిమి, మరి కీడు లను పంపినపుడు స్వీకరింపవలదా?” అనెను. ఇన్ని దురదృష్టములు వాటిల్లినను, యోబు ఏ పాపమును కట్టుకొనలేదు, దేవుడు అన్యాయము చేసెను అని పెదవులతో సైతము పలుకలేదు.

11. యోబునకు దుర్దినములు ప్రాప్తించినవని అతడి ముగ్గురు స్నేహితులు విని, అతనికొరకు దుఃఖించు టకును, అతనిని ఓదార్చుటకును వారు తమతమ పట్టణములనుండి బయలుదేరిరి. వారు తేమాను నగరవాసి ఎలీఫసు, షూహా దేశీయుడు బిదు, నామా దేశీయుడు సోఫరు. వారు మువ్వురు ఒకచోట కలిసి కొని, యోబు వద్దకు పోవుటకు నిర్ణయించుకొనిరి.

12. ఆ మిత్రులు యోబుని దూరమునుండి చూచిరి. కాని అతడిని గుర్తుపట్టజాలరైరి. కనుక వారు పెద్దగా శోకించి బట్టలు చించుకొని, తలమీద దుమ్ము చల్లుకొనిరి.

13. వారు యోబు ప్రక్కనే నేలమీద చతికిలబడి ఏడురాత్రులు, ఏడు పగళ్ళు మౌనము వహించిరి. యోబు తీవ్రమైన బాధను అనుభవించుచుండెనని గ్రహించి ఆ స్నేహితులతడితో ఒక్క పలుకైనను పలుకజాలరైరి.

 1. కడన యోబు నోరు విప్పెను.

2. అతడు తాను పుట్టిన దినమును శపించుచు ఇట్లనెను:

3. “నా తల్లి గర్భద్వారమును అది మూయనందుకు నా నేత్రములకు అది బాధను మరుగుచేయనందులకు నేను పుట్టినదినము లేకపోవునుగాక! 'ఒక మగబిడ్డ ఆమె కడుపునపడెను'.  అని ఒకడు చెప్పిన రేయి లేకపోవునుగాక!

4. పైనున్న దేవుడు ఆ రోజును స్మరింపకుండుగాక! ఆ దినము అంధకారబంధురమగుగాక! దానికి వెలుగు ప్రాప్తింపకుండుగాక!

5. తమస్సును, మృత్యుఛాయయు దానిని కప్పివేయుగాక! మేఘము దానినావరించుగాక! దానికి సూర్యప్రకాశము కలుగకుండుగాక!

6. చీకట్లు ఆ రేయిని అలముకొనుగాక! దానిని సంవత్సర దినములలో గణింపకుందురుగాక! . మాసదినములలో లెక్కింపకుందురు గాక!

7. ఆ రేయి గొడ్డుబోవుగాక! ఆ రాత్రి ఆనందనాదమేదియు విన్పింపకుండుగాక!

8. సముద్రభూతమును మేలుకొల్పు మాంత్రికులు ఆ రేయిని శపింతురుగాక!

9. ఆ రాత్రి సంధ్యానక్షత్రకాంతిని కోల్పోవును గాక! దానికి ప్రకాశము సోకకుండుగాక! వేకువ వెలుగు ప్రాప్తింపకుండుగాక!

10. ఆ రేయి మా తల్లి గర్భకవాటమును మూసివేసి నాయీశోకమును వారింపజాలదయ్యెను.

11. నేను మా తల్లి కడుపున ఉన్నపుడే యేల చావనైతిని? లేదా, పురిటిలోనే యేల కన్నుమూయనైతిని?

12. మా అమ్మ నాడు మోకాళ్లూని నన్ను స్వీకరింపనేల? స్తన్యమిచ్చి నన్ను పోషింపనేల?

13. నేనప్పుడే చనిపోయి ఉండినచో ఇప్పుడు శాంతికి నిలయమైన సుఖనిద్రను అనుభవించుచుండెడి వాడనేకదా!

14. తమ కొరకు బీడుభూములయందు భవనములు నిర్మించుకొనిన రాజులతోను, మంత్రులతోను కలిసి నిద్రించుచుండెడివాడనేకదా!

15. తమ భవనములో వెండిబంగారములు కూడబెట్టుకొనిన రాజకుమారులతో కలిసి శయనించుచుండెడివాడనే కదా!

16. తల్లి కడుపునుండి చనిపోయిపుట్టి , వెలుగు కాంచజాలని మృతపిండముతో కలిసి నిద్రించుచుండెడివాడనే కదా!

17. ఆ పాతాళలోకమున దుర్మార్గులితరులను పీడింపజాలరు. అచట అలసిపోయిన పనివారు విశ్రాంతి చెందుదురు.

18. అక్కడ బందీలుకూడ అధికారి ఆజ్ఞలకు గురికాక విశ్రాంతిని అనుభవింతురు.

19. అచట అధికులు, అల్పులు కూడ ఉందురు. యజమానుల పీడ విరగడైన సేవకులు ఉందురు

20. ప్రభువు విచారగ్రస్తులకు వెలుగు ఈయనేల? దుఃఖితులకు జీవనభాగ్యము దయచేయనేల?

21. వారు మృత్యువు కొరకు వేచియున్నను, అది వారి చెంతకు రాదు, నిధికొరకువలె చావుకొరకు గాలించినను అది వారికి దొరకదు.

22. వారు తమ సమాధిని గాంచి ఆనందింప గోరుదురు. తమ గోరీని చేరుకొని సంతసింపగోరుదురు.

23. కన్నులతో మార్గముచూడలేని వానికి, దేవుడు చుట్టుకంచెవేసిన వానికి వెలుగునివ్వనేల? ఆ మార్గములన్నీ నిరోధించినచో, వానికి వెలుగేల?

24. సంతాపమే నాకు ఆహారమైనది. నా నిట్టూర్పులకు అంతమేలేదు.

25. నేను దేనికి వెరతునో, దేనిని గూర్చి భయపడుదునో, అదియే నాకు జరుగుచున్నది.

26. నాకు శాంతిసమాధానములు లేవు నా శ్రమలకు అంతము లేదు.”

 1. అటు తరువాత తేమాను నగరవాసి ఎలీఫసు మాట్లాడుచు ఇట్లనెను:

2. "అయ్యా! నేను మాటలాడినచో నీకు బాధ కలుగదుగదా! | నేను ఇక మౌనము వహింపజాలను.

3. పూర్వము నీవు చాలమందికి సద్బోధ చేసి బలహీనమైన చేతులను బలపరిచినవాడవు

4. కాలుజారి పడువారికి నీ మాటలు సత్తువ నొసగెను. కాళ్ళు వణకువారికి నీ పలుకులు ధైర్యము నొసగెను.

5. కాని ఇప్పుడు నీ వంతు రాగా నీవు ధైర్యము కోల్పోయితివి. ఆ బాధలు నిన్ను పట్టి పీడింపగా నీవు దుఃఖితుడవైతివి.

6. నీ దైవభీతి నీ కేల నమ్మకము పుట్టింపలేదు? యదార్ధవర్తనమైన నీ జీవితము నీకేల ఓదార్పు నొసగలేదు?

7. ఋజువర్తనుడు నాశనమగుటగాని న్యాయవంతుడు చెడుటగాని నీవు ఎన్నడైన కంటివా?

8. నేను చూచిన సంగతి చెప్పుచున్నాను వినుము. దుష్టత్వమను పొలమునుదున్ని దుర్మార్గమను పైరువేసిన వారు, కడన పాపపు పంటనే కోసికొందురు.

9. దేవుని శ్వాసము వారిని నాశనము చేయును. అతని ఉగ్రశ్వాసమువలన వారు బుగ్గియగుదురు

10. వారు సింహమువలె గర్జించి ఆర్భటింతురు. కాని దేవుడు వారి కోరలను విరుగగొట్టును.

11. వారు తిండి దొరకని సింగమువలె చత్తురు. వారు సింహము పిల్లలువలె చెల్లాచెదరగును.

12. నాకొక సందేశము విన్పించినది. నా చెవులొక మెల్లని స్వరమును ఆలకించినవి.

13. నరునికి కలలు వచ్చువేళ, గాఢముగా నిద్రపట్టువేళ ఈ సంఘటన జరిగినది.

14. అపుడు నేను మిగుల భయపడి గడగడ వణకితిని నా దేహమంత భీతితో కంపించిపోయినది.

15. నా మొగము మీదుగా మెల్లనిగాలి వీచినది. వెంటనే నా శరీరము గగుర్పొడిచినది.

16. నా ఎదుట ఎవ్వరో నిల్చియున్నట్లు కన్పించినది. నేను ఆయన రూపురేఖలను కాంచజాలనైతిని. ఆయన మాత్రము నా ఎదుట నిల్చియున్నట్లు చూపట్టెను. కొంతతడవు నిశ్శబ్దము అంతట నేనొక స్వరము వింటిని:

17. "ఏ నరుడైనను దేవుని యెదుట నీతిమంతునిగా కన్పింపగలడా? ఎవడైనను సృష్టికర్త ముందట పవిత్రుడుగా చూపట్టగలడా?

18. దేవుడు స్వరములోని తన సేవకులనే నమ్మడు. ఆయన దేవదూతల గణములోనే తప్పుపట్టును

19. అట్టివాడు మట్టి ఇండ్లలో జీవించే మర్త్యుని, దుమ్ముతో తయారైన నరుని, చిమ్మటవలె చితికిపోవు మానవుని నమ్మునా?

20. నరుడు ఉదయముండి, సాయంకాలమునకు గతించును. ఇక శాశ్వతముగా కనుమరుగైపోవును. ఆ మీదట అతనిని ఎవ్వరును జ్ఞప్తియందు ఉంచుకొనరు.

21. వారి ఘనత కొట్టివేయబడగా వారు జ్ఞానహీనులై నశించుదురు."

 1. నీ వేడుకోలును ఆలకించువారు ఎవరైన ఉన్నచో మొర పెట్టుకొనుము. ఏ దేవదూతయైన నీ గోడును ఆలకించునేమో చూడుము.

2. కోపము వలన బుద్దిహీనుడు నశించును. అసూయ వలన తెలివితక్కువవాడు చెడును.

3. బుద్దిహీనులు మొదట సురక్షితముగా ఉన్నట్లే కన్పించిరి. అంతలోనే నేను వారి ఇండ్లను శపింతును.

4. ఒక్క దెబ్బతో వారి తనయులు నిరాశ్రయులైరి. ఇక వారికి ఆదరువు చేకూర్చువారు ఎవరునులేరైరి

5. ఆ మందమతుల పంట ఆకలిగొనినవారి పాలయ్యెను దేవుడు వారిని ఆ పంటను అనుభవింపనీయడయ్యెను. దప్పికగొనినవారు వారి సంపదను ఆశించిరి.

6. వ్యధలు మట్టిలో నుండి పుట్టుకరావు. తిప్పలు నేలలోనుండి మొలకెత్తవు.

7. నిప్పురవ్వ ఆకాశమునకు ఎగిసినంత సులువుగా నరుడు తన తిప్పలను తానే కొనితెచ్చుకొనును.

8. నాకు నేను దేవుని వెదకి, నా గోడును అతడికి విన్పించుకొందును.

9. ఆయన మనము గ్రహింపలేని మహాకార్యములు చేయును. ఆయన అద్భుతకార్యములకు అంతమే లేదు.

10. ఆయన భూమిమీద వానలు కురియించును. పొలముల మీద నీళ్ళు కుమ్మరించును.

11. దీనులను ఆసనముల మీదికి ఎక్కించును. దుఃఖితులకు ఆనందమును ఒసగును.

12. మోసగాండ్ర పన్నాగములు వమ్ముచేయును. వారి కుతంత్రములను రూపుమాపును.

13. లౌకికులు వారి వలలలో వారే చిక్కుకొనునట్లు చేయును. వంచకుల కార్యములు విఫలమగునట్లు చేయును

14. వారికి మధ్యాహ్నముకూడ రాత్రివలె చూపట్టును వారు పట్టపగలుకూడ , దారి తెలియక తడుములాడుదురు.

15. ఆయన పేదలను మృత్యువు బారినుండి కాపాడును. దరిద్రులను పరపీడనమునుండి రక్షించును.

16. దీనుల ఆశలను చిగురింపజేయును. దుర్మార్గుల నోళ్ళు మూయించును.

17. దేవుడు శిక్షించి చక్కదిద్దిన నరుడు ధన్యుడు. కనుక నీవు ప్రభువు శిక్షకు కోపింపవలదు.

18. దేవుడు గాయపరచువాడు, కట్టుగట్టువాడుకూడ దెబ్బలు కొట్టువాడు, చికిత్స చేయువాడుకూడ.

19. ఆయన ఆరున్నొక్క కష్టములలో నిన్ను కాపాడును. కనుక పదిన్నొక్క కష్టములలో నీ కెట్టి కీడు వాటిల్లదు.

20. కరువుకాలములో ఆయన నిన్ను చావునుండి కాపాడును. యుద్ధకాలములో ఖడ్గమునుండి తప్పించును.

21. ఆయన కొండెములు చెప్పువానినుండి నిన్ను రక్షించును. దుర్మార్గుల దుండగములనుండి నిన్ను బ్రోచును,

22. దౌర్జన్యము, ఆకలియు నిన్ను బాధింపజాలవు. వన్యమృగములు నిన్ను భయపెట్టజాలవు.

23. నీవు పొలములోని రాళ్ళతో సఖ్యముగా ఉందువు క్రూరమృగములు నీతో చెలిమిచేయును.

24. నీ గుడారము క్షేమముగా ఉన్నదని తెలుసుకొందువు నీ మందను పర్యవేక్షించి ఏదీకూడా పోగొట్టుకోలేదని తెలుసుకొందువు.

25. నీ సంతానము తామరతంపరగా వృద్ధి చెందును నీ బిడ్డలు పొలములోని పచ్చికవలె వర్దిల్లుదురు

26. పంటకారువరకు పండి నిలిచిన గోధుమ పైరువలె నీవు పండువంటి నిండు జీవితము గడపుదువు.

27. అయ్యా! మేమీ సంగతులనెల్ల పరిశీలించి తెలిసికొంటిమి. ఇవి సత్యములు గావున నీవు వీనిని గ్రహించుట మంచిది."

 1. తరువాత యోబు మాటలాడుచు ఇట్లనెను:

2. “నా బాధలను తూచగలమేని, నా వ్యధలను తక్కెడలో పెట్టి తూయగలుగుదుమేని,

3. అవి సముద్రపు ఇసుక దిబ్బలకంటె ఎక్కువ బరువుగా ఉండును. కనుకనే నేను దుడుకుగా మాట్లాడితిని.

4. ప్రభువు అంబులు నా దేహములో గ్రుచ్చుకొనినవి. నా హృదయమువాని విషముతో నిండిపోయినది ప్రభువు పంపు యాతనలు నా మీదికి బారులుతీరి వచ్చుచున్నవి.

5. పచ్చిక దొరకిన గాడిద ఓండ్రపెట్టునా? ఎండుగడ్డి దొరకిన ఎద్దు రంకెవేయునా?

6. ఉప్పులేని చప్పిడి భోజనము ఎవరికి రుచించును? కోడిగుడ్డులోని తెలుపులో రుచిగలదా?

7. నేను ముట్టుకొనని వస్తువులు నాకు హేయములు అయినను, అవియే నాకు భోజనపదార్ధములు అయినవి.

8. ప్రభువు నా మొర ఆలకించి నా వేడుకోలును అనుగ్రహించును గాక!

9. ప్రభువు తన చిత్తమువచ్చినట్లు నన్ను ఛిద్రము చేయునుగాక! అతడు నన్ను నాశనము చేసిన ఎంత మేలగును!

10. అట్లయిన నేనెంతయో సంతసించియుందును. నా బాధ ఎంత గొప్పదయినను ఉపశాంతి పొంది ఉందును. నేను పవిత్రుడైన ప్రభువు శాసనములను మీరలేదు

11. నా బలము ఏపాటిది? నేను కనిపెట్టుకొనుట ఏల? నా అంతము ఏపాటిది? నేను తట్టుకొనుట ఏల?

12. నేనేమి శిలనా? నాది ఇత్తడి దేహమా ఏమి?

13. ఇక నాలో ఏమి శక్తి మిగిలియున్నది! ఇక నాకేమి దిక్కు కలదు?

14. నిరాశవలన దేవుని నమ్మలేనివారికి స్నేహితుల అండదండలు ఎంతయో ఆవశ్యకముకదా?

15. నా సోదరమిత్రులు ఎండినవాగువలె, పారీపారని జలప్రవాహములవలె నమ్మకూడని వారైరి.

16. అట్టి ప్రవాహములు కరిగిపోయిన మంచుగడ్డలతో హిమముతో అంచులవరకు పొంగిపారును.

17. కాని బెట్టవేడిమివలన ఆ యేరులు ఎండిపోవును వానిలోని నీరెల్ల యింకిపోవును.

18. బిడారులు ఎడారిలో ఆయేరులకొరకు గాలింతురు వాని కొరకు చాలదూరమువరకు పోయి నాశనమగుదురు.

19. తేమా, షేబా బిడారులు ఆ యేరుల కొరకు ఆశతో గాలింతురు.

20. కాని ఆ ఎండిపోయిన యేరులను చేరుకొనగానే వారి ఆశలెల్ల నిరాశలగును.

21. మీరును నాపట్ల ఆ యేరులవంటివారలు అయితిరి మీరు నన్ను గాంచి భయముతో వెనుదీయుచున్నారు.

22. 'నేను మిమ్ము ఏమైనా ఈయుడు' అని అడిగితినా? నా నిమిత్తము 'మీ కలిమినుండి లంచమును ఈయుడు' అంటినా?

23. శత్రువు బారినుండి నన్ను రక్షింపుడని అంటినా? హింసకుని బానిసత్వమునుండి నన్ను విడిపింపుమంటినా?

24. మీరు నాకు బోధచేయుడు, నేను మౌనముగా విందును. నా దోషము ఎట్టిదో మీరే నిరూపింపుడు.

25. యథార్థము చెప్పిన సహింపవచ్చును. కాని మీ వాదముతో మీరు నన్ను ఇట్లు నిందింపనేల?

26. నిరుత్సాహముతోనున్న నా మాటలు పొల్లువలె ఎగిరిపోవు తేలికమాటలు కనుక వానిని చులకన చేయవచ్చునని మీ భావమా?

27. మీరు అనాధ శిశువులను బానిసలుగా కొన చీట్లువేసెదరు. మీ మిత్రులవలన లాభము బడయజూతురు.

28. మీరు నా మొగములోనికి చూచి మాటలాడుడు. నేను కల్లలాడువాడను కాను.

29. ఆగుడు! న్యాయముగా నన్ను విచారింపుడు నాయెడ తప్పిదములేదు. కనుక నేను దోషినని తీర్పుచెప్పకుడు.

30. నేను అబద్దములాడితినని మీరు అనుకొంటిరా? మంచిచెడ్డలకుగల వ్యత్యాసము నాకు తెలియదనుకొంటిరా?

 1. మానవజీవితము యుద్ధమున నిర్బంధపోరాటము వంటిదికాదా? కూలివాడు కూలికి పనిచేయుట వంటిదికాదా?

2. బానిస నీడకొరకు తపించుచు శ్రమచేయుట వంటిది. పనివాడు జీతముకొరకు కాయకష్టము చేయుట వంటిది.

3. ఎట్టి ఆశయు లేకయే నేను నెలలు గడపితిని. విచారముతో రాత్రులు వెళ్ళబుచ్చితిని.

4. నేను పరుండినపుడు 'పగలెప్పుడు వచ్చునా' అనుకొందును. తిరిగి 'ఎప్పుడు లేచెదనా' అనుకొందును. వేకువదాక నిద్దురపట్టక బాధపడుదును.

5. నా ఒడలి నిండ పుండ్లు లేచి పురుగులు పడినవి. నా చర్మము పగిలి రసికారుచున్నది.

6. నా రోజులు నేతగాని నాడెకంటె వేగముగా పరుగిడుచున్నవి. అవి నాకెట్టి ఆశ మిగుల్పకుండనే వెడలిపోవుచున్నవి.

7. ప్రభూ! నా జీవితము శ్వాసవలె క్షణికమైనది. నా కన్ను ఇక మేలును చూడదు.

8. పూర్వము నన్నెరిగినవారికి నేనిక కన్పింపబోను. నీవు నన్ను చూచుచుండగనే మరుగైపోయెదను.

9. మబ్బు కరిగి మాయమైపోవును. అట్లే పాతాళమునకు పోవువాడు మరల పైకి రాజాలడు.

10. అతడు తన ఇంటికి తిరిగిరాడు. ఇక అతడినెవరు జ్ఞప్తియందుంచుకొనరు.

11. ఇట్టి పరిస్థితులలో నేను మౌనముగా ఉండజాలను నా బాధలలో నేను మాటలాడక తప్పదు. నా మనోవేదనలో నేను మొరపెట్టెదను.

12. ప్రభూ! నన్ను నిరంతరము నీ అదుపులో ఉంచుకొనుటకు నేనేమి సముద్రమును అనుకొంటివా లేక సముద్రములోని మహాసర్పమనుకొంటివా?

13. 'నేను పడకపై పరుండి విశ్రాంతి పొందగోరెదను. నా బాధలనుండి ఉపశాంతి చెందగోరెదను'.

14. కాని నీ స్వప్నములతో నీవు నన్ను భయపెట్టుచున్నావు. నీ దర్శనములతో నన్ను కలవరపెట్టుచున్నావు.

15. ఈ వేదనలు అనుభవించుటకంటె నేను చచ్చుట మేలు. ఎముకల గూడునైన నేను మరణమును ఆశించుచున్నాను.

16. నాకు నిరాశకలిగినది, ఇక జీవించి లాభములేదు నీవిక నా జోలికి రాకుము, నా జీవితము నిరర్ధకమైనది.

17. నీవు ఇంతగా పట్టించుకొనుటకు, ఇంతగా పరిశీలించి చూచుటకు, నరుడు ఏ పాటివాడు? అతని బండారమెంత?

18. నీవు ప్రతిదినము అతనిని పరీక్షించి చూడవలయునా? ప్రతిక్షణము అతనిని పరిశీలించి చూడవలయునా?

19. నీ నేత్రములను నానుండి ప్రక్కకు త్రిప్పవా? కనీసము గుటక వేయునంత కాలమైన నన్ను విడిచిపెట్టవా?

20. నీవేమో అహోరాత్రులు నరులను గమనించుచున్నావుగాని, నేను తప్పుచేసినను నా పాపము నిన్నెట్లు బాధించినదో చెప్పుము. నీవు నన్ను నీ కోపమునకు గురిచేయవలయునా? నేను నీకు అంత భారమైతినా?

21. నీవు నా పాపమును సహింపలేవా? నా దోషమును మన్నింపలేవా? నేను శీఘ్రమే మట్టిలో కలిసిపోయెదను. నీవు నన్ను వెదకుదువుగాని నేను నీ కంటబడను”

 1. అటుతరువాత షూహా నగరవాసి బిల్థదు మాటలాడుచు ఇట్లనెను:

2. "అయ్యా! నీ మాటలకు అంతములేదా? నీ నోటి పలుకులు సుడిగాలివలె ఉన్నవి.

3. దేవుడు న్యాయమును చెరచునా? ఆయన ధర్మమును మంటగలుపునా?

4. నీ కుమారులు దేవునికి ద్రోహము చేసియుందురేని ఆయన వారిని తగిన రీతిగనే శిక్షించెను.

5-6. నీవిపుడు దేవునికి మొర పెట్టుకొనుము. నీవు నిజముగా భక్తుడవేని ప్రభువు నీకు తప్పక తోడ్పడును. నీ కుటుంబమును కాపాడును.

7. నీవు కోల్పోయిన దానికంటె అదనముగనే సిరిసంపదలు ఆయన దయచేయును.

8. నీవు పూర్వయుగముల వారిని ప్రశ్నించి చూడుము. మన పూర్వుల విజ్ఞానమును పరిశీలించి చూడుము

9. నిన్న మొన్నటి వారలమైన మనకేమి తెలియును? మన జీవితము నీడవలె సాగిపోవునది.

10. కాని ఆ పూర్వులను అడిగినచో వారు నీకు బోధచేయుదురు. వారు నీతో చెప్పు సంగతులివి.

11. జమ్ము బురదలోతప్ప వేరు తావున పెరుగునా? నీరులేని తావున తుంగలు ఎదుగునా?

12. నీరెండిపోగానే ఆ గడ్డిమొక్కలు వాడిపోవును. ఇతర గడ్డిమొక్కలకంటె వేగముగనే మాడిపోవును

13. దేవుని విస్మరించువాడును ఇట్లేయగును. ఆయనను నమ్మనివాడు సర్వనాశనమగును.

14. వాని నమ్మకము నూలుపోగువలె సన్నమైనది, సాలీడు గూడువలె పేలవమైనది.

15. అతడు తన ఇంటికి ఆనుకొనినచో అది నిలువదు. దానిమీదికి ఒరిగినచో అది కూలిపోవును.

16. అతడు సూర్యకిరణములకు చెట్టువలె ఎదిగి తోట అంతట కొమ్మలు చాచును.

17. ఆ చెట్టు వ్రేళ్ళు రాళ్ళలోనికి ప్రాకి శిలలను పెనవేసికొనును.

18. కాని ఆ చెట్టును అచటినుండి పెరికివేసినచో దాని పూర్వస్థానము ఎవరికిని గుర్తుండదు.

19. ఇదే అతని సంతోషకర జీవనవిధానము ఆ భూమినుండి వేరొకరు వచ్చెదరు.

20. ప్రభువు సన్మార్గులను చేయివిడువడు. దుర్మార్గులను ఆదరింపడు.

21. ప్రభువు నీవు మరల సంతసముతో నవ్వునట్లు చేయును. నీవు ఆనందముతో ప్రేలునట్లు చేయును.

22. కాని అతడు నీ శత్రువులను అవమానమున ముంచును. వారి నివాసములను సర్వనాశనము చేయును.”

 1. అటుతరువాత యోబు మాట్లాడుచు ఇట్లనెను:

2. “నీవు చెప్పినది నిజమే. నరుడు దేవునితో వాదించి నెగ్గగలడా?

3. ఎవరైన దేవునితో వాదమునకు దిగినయెడల ఆయన వేయి ప్రశ్నలడుగును వానిలో ఒక్కదానికి మనము జవాబు చెప్పలేము.

4. ఆయన విజ్ఞాననిధి, శక్తి సంపన్నుడు, ఆయనను ఎవరు ఎదిరింపగలరు?

5. అతడు కొండలకు చెప్పకుండనే వానిని కదలించును. కోపముతో వానిని క్రింద పడద్రోయును.

6. భూకంపములను పంపి నేలను కదలించును. భూమిని భరించు స్తంభములను గడగడ వణకించును.

7. ఆయన ఆజ్ఞాపించి సూర్యోదయమును నిరోధింపగలడు. చుక్కలను ప్రకాశింపనీయకుండ అడ్డుపడగలడు.

8. ఆయనే ఆకాశమును దుప్పటివలె విప్పును. అలలను అణగదొక్కి సముద్రమును అదుపులో పెట్టుకొనును.

9. ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అనువాటిని, దక్షిణ నక్షత్రరాసులను చేసినవాడు. "

10. ఆయన లెక్కలకందని మహాకార్యములు చేయును గణింపశక్యముకాని అద్భుతకార్యములు సల్పును

11. ఆయన నా ప్రక్కగా వెడలిపోయిన, నేను ఆయనను గుర్తింపలేను. ఆయన గమనమును కనిపెట్టజాలను.

12. ఆయన తాను తీసికోదలచినది తీసికొనును. నీవు చేయుచున్నదేమిటి?' అని ఎవరును ఆయనను అడ్డగింపజాలరు.

13. ఆయన కోపమునకు తిరుగులేదు. ఆయన తన శత్రువులనెల్ల నేలబెట్టి కాలరాచును.

14. అట్టి ప్రభువుతో నేను వాదింపగలనా? ఆయనకు బదులు చెప్పుటకు నాకు మాటలు దొరకునా?

15. నేను నిర్దోషినైనను, నన్ను నేను సమర్ధించుకోగలనా? న్యాయాధిపతియైన దేవుని కరుణింపుమని వేడుటకన్న నేను చేయగలిగినది ఏమున్నది?

16. ఆయన నన్ను మాటలాడనిచ్చినను నా పలుకులు ఆలించునా?

17. ఆయన నాకు కష్టములను పంపి నిష్కారణముగా నన్ను బాధించుచున్నాడు.

18. గ్రుక్కకూడ త్రిప్పుకోనీయకుండ నన్ను కడగండ్లపాలు చేయుచున్నాడు.

19. దేవునిమీద నా బలమును చూపెద ననుకొన్నచో ఆయన మహాశక్తిమంతుడు. ఆయన మీద వ్యాజ్యెమాడెదనన్న ఆయన నెవరు పిలుచుకొనివత్తురు?

20. నేను నిర్దోషినైనను నా నోరు నన్ను ఖండించును. నాయందు తప్పులేకున్నను ఆయన వాక్కు నన్ను దోషినిచేయును.

21. నేనసలు నిర్దోషినేనా? నాకే తెలియరాకున్నది. ఈ జీవితము నాకు దుర్బరముగా నున్నది.

22. అంతయు ఒకటే కావున దోషిని, నిర్దోషినిగూడ ఆయన సమముగనే నాశనము చేయునని నేనంటిని,

23. నిర్దోషి తలవని తలంపుగా నాశనముకాగా దేవుడు నవ్వి ఊరకుండును.

24. ఆయన దేశమును క్రూరుడైన పాలకుని వశము కావించి అందలి న్యాయాధిపతుల ముఖములను కప్పివేయును. అతడు కాకున్న ఈ కార్యమును మరి ఎవరు చేయుదురు?

25. నా దినములు మహావేగముగా పరుగిడుచున్నవి. వానివల్ల ప్రయోజనమేమియు లేదు.

26. జమ్ముతో చేసిన నావవలె వేగముగా వెడలిపోవును పక్షి మీదికి దుముకు డేగవలె త్వరగా పరుగిడుచున్నవి.

27. 'నేను నా విచారమును మరచిపోయి నగుమోమును చూపెట్టాలనుకొన్నచో

28. నా బాధలన్ని తిరిగి వచ్చుచున్నవి. దేవుడు నన్ను దోషినిగా గణించుచున్నాడు.

29. నేను దోషినైనచో ఇక ఈ వ్యర్థప్రయాసలన్ని ఎందులకు?

30. నేను మంచుతో శుద్ధిచేసికొనినను, నా చేతులను సబ్బుతో తెల్లగా కడుగుకొనినను లాభములేదు.

31. దేవుడు నన్ను మురికిగుంటలో పడద్రోసెను. నా బట్టలు నన్ను చూచి సిగ్గుపడుచున్నవి.

32. ఆయన నావలె నరుడుకాడు గనుక నేను ఆయనతో వాదింపజాలను. ఆయనతో వ్యాజ్యెమాడజాలను.

33. ఆయనకూ నాకు రాజీ కుదుర్చు మధ్యవర్తి ఎవడును లేడు కనుక

34. ఆయన తన దండమును నానుండి తీసివేయవలయును. నేను భయపడకుండ ఆయనమహాత్మ్యములు నాకు అగుపించవలెను.

35. అయినను నేను వెరవక మాటలాడెదను. ఏలయనగా నేను అట్టివాడను కానని అనుకొనుచున్నాను.

 1.నాకు జీవితము మీద విసుగు పుట్టినది. మిత్రమా! నీవు నా మొరలాలింపుము. నేను నా ఆవేదన కొలది మాటలాడెదను. నేను దేవునితో ఇట్లు పలుకుదును:

2. "ప్రభూ! నీవు నన్ను దోషిగా నిర్ణయింపవలదు. అసలు నా అపరాధమేమిటో తెలియజెప్పుము.

3. నీవు స్వయముగా కలిగించిన నన్ను అనాదరముచేసి ఇప్పుడు ఈ రీతిగా బాధించుట న్యాయమా? నీవు దుర్మార్గుల పన్నాగములను అనుమతింతువా?

4. నీ కన్నులు మా కన్నుల వంటివేనా? నీవు నరులు చూచిన చూపున చూతువా?

5. నీ జీవితము నరుల జీవితమువలె హ్రస్వకాలికమైనదా? నీ రోజులు నరుల రోజులవలె సాగిపోవునవా?

6. కానిచో నీవు నా దోషములను విచారింపనేల? నా అపరాధములను గాలింపనేల?

7. నేను నిర్దోషినని, నీ చేతినుండి నన్నెవరు విడిపింపలేరని నీవెరుగుదువు.

8. నీవే నన్ను సృజించి నాకు ఈ రూపము నిచ్చితివి కాని నీవే నన్నిపుడు నాశనము చేయబూనితివి.

9. నీవు నన్ను మట్టినుండి మలిచితివి. తిరిగి నన్ను మట్టిపాలు కావింతువా? "

10. పాలనుండి వెన్న ఏర్పడినట్లుగా నీవు నన్ను మాతృగర్భమున రూపొందించితివి.

11. నీవు నాకు వస్త్రమువలె చర్మము తొడిగితివి. ఎముకలతో, నరములతో నన్ను బట్టవలె నేసితివి

12. అటుపిమ్మట నాకు ఊపిరి పోసి ప్రేమతో నన్ను పరామర్శించితివి.

13. కాని ఇంత చేసియు నీవు మోసముతో వర్తించి, నాకు హానిచేయుటకు సమయము కొరకై వేచియుంటివని ఇప్పుడు నేను గుర్తించితిని.

14. నేను పాపము చేసినచో, ఆ నాకు క్షమాభిక్ష నిరాకరింపవచ్చునని, నీవు కనిపెట్టుకొనియుంటివి.

15. కనుక నేను తప్పుచేసినచో సర్వనాశనమయ్యెదను నేను నీతిమంతుడనైనను తలెత్తుకోలేకున్నాను. నేను బాధావమానములతో క్రుంగిపోవుచున్నాను

16. నేనొకవేళ తల ఎత్తుకొని తిరిగినా నీవు సింహమువలె నన్ను వేటాడి  నీ విజయములను హెచ్చించుకొందువు

17. నీవు నామీదకు మరలమరల దాడిచేసి నన్ను దెబ్బమీద దెబ్బకొట్టుదువు

18. నీవసలు నన్ను మాతృగర్భమునుండి వెలికితీయనేల? నేనపుడే చనిపోయినచో నన్నెవరు చూచియుండెడివారుకారు.

19. నేను మాతృగర్భమునుండే నేరుగా సమాధి కేగినచో, అసలు జన్మింపకనే ఉండెడివాడనుకదా?

20. నా రోజులు ముగియనే ముగిసినవి. నీ చూపునిక నా నుండి మరల్పుము. ఈ మిగిలిన స్వల్పకాలమైన, నేను కొంచెము ఊరడిల్లెదను.

21. నేనిక నరులు తిరిగిరాని చోటికి వెళ్ళిపోయెదను. అంధకార విషాదములు అలముకొనిన తావును చేరుకొందును. 

22. అచట కటికచీకటి, నీడలు గందరగోళము ఉండును వెలుతురు కూడ గాఢ తమస్సువలె ఉండును.”

 1. అటు పిమ్మట నామా దేశీయుడు సోఫరు ఇట్లనెను:

2. "అయ్యా! నీ పలుకులకు జవాబులేదనుకొంటివా? అతిగావాగివాని వాదమే ఒప్పుకానక్కరలేదు కదా?

3. నీ ప్రలాపములు ఆలించి ఊరకుండుటకు మేమేమి మూగవారలమా? నీ అపహాసవాక్యములను మేము ఖండింప లేమనుకొంటివా?

4. 'నా పలుకులు సత్యములని దేవుని దృష్టిలో నేను పవిత్రుడననియు' అని నీవు వాదించుచున్నావు.

5. కాని దేవుడు నోరు విప్పి నీకు బదులు చెప్పినచో విజ్ఞాన మర్మములు నీకు తెలియజేసినచో,నీ తెలివితేటలు ఎందుకు కొరగాకుండబోవును

6. నీ తప్పిదములకుగాను అతడు నిన్ను లెక్క అడుగునని నీవు గ్రహింతువు.

7. అసలు నీవు దేవుని మర్మమును గ్రహింపగలవా? ఆయన మహాత్మ్యమును తెలిసికోగలవా?

8. అది ఆకాశముకంటె ఉన్నతమైనది. నీవు దానినెట్లు గ్రహింతువు? పాతాళముకంటె గంభీరమైనది. నీవు దానినెట్లు గుర్తింతువు?

9. అది పుడమికంటెను నిడువైనది. సాగరముకంటెను విశాలమైనది.

10. దేవుడు నిన్ను తీర్పుకు రమ్మని పిల్చినచో ఆయనను ఎవరు వారింపగలరు?

11. దేవుడు నరుని కోరగాని తనమును ఎరుగును. మనుషుని దోషములను బాగుగా గుర్తించును.

12. అయితే అడవి గాడిదపిల్ల నరుడై, పుట్టవచ్చునేమోగాని, బుద్దీహీనుడు వివేకికాడు.

13. ఓయి! నీవు నీ హృదయమును సరిదిద్దుకొని ఆ ప్రభువు ముందు చేతులు జోడింపుము.

14. నీ దోషమును విడనాడుము.  అధర్మమును నీ ఇంటినుండి వెడలింపుము.

15. అప్పుడు నీవెట్టి భయమునకు గురికాక, లోకమందు తలయెత్తుకొని తిరుగుదువు.

16. అప్పుడు దాటిపోయిన వరదలవలె నీ వ్యధలను విస్మరింపగలుగుదువు.

17. నీ జీవితము మిట్టమధ్యాహ్నపు సూర్యతేజమువలె ప్రకాశించును. తమస్సులు విచ్చిపోయి, ఉషోదయము ప్రాప్తించును

18. నీవు నమ్మకముతో భద్రముగా బ్రతుకుదువు. ప్రభువు నిన్ను సురక్షితముగా కాపాడును.

19. ఇక శత్రువు లెవరు నిన్ను భయపెట్టజాలరు. ఎల్లరు నీ మన్ననల నాశింతురు.

20. కాని దుర్మార్గులు మాత్రము నలువైపులు పరికించి తప్పించుకొనుమార్గము లేదని గ్రహించి చావుకు సంసిద్ధులగుదురు.”

 1-2. తరువాత యోబు ఇట్లనెను; “ఓయి! లోకములోని నరుల భావములే నీనోట వచ్చుచున్నవి అసలు విజ్ఞానము నీతోనే అంతరించునేమోనని అన్పించుచున్నది

3. నాకుకూడ నీపాటి తెలివితేటలున్నవి. నేను నీకంటె తక్కువవాడను కాను. నీవు చెప్పిన సంగతులెల్లరికిని తెలిసినవే.

4. నా స్నేహితులిపుడు నన్ను చూచి నవ్వుచున్నారు. నేను నిర్దోషినైనప్పటికీ నవ్వులపాలయితిని. అంకాని పూర్వము దేవుడు నా మొర ఆలకించెను.

5. నీకు చీకుచింతలేదు కనుక నన్ను గేలిచేయుచున్నావు. కాలుజారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది.

6. కాని లోకములో దోపిడిమూకలు హాయిగా బ్రతుకుచున్నవి. దేవుని లక్ష్యపెట్టనివారు సురక్షితముగా జీవించుచున్నారు. వారెల్లరు తమ స్వీయశక్తియే తమకు దేవుడనుకొందురు.

7. నీవింకను తెలిసికోగోరెదవేని మృగములను అడుగుము. పక్షుల నడుగుము అవియెల్ల నీకు నేర్పును.

8. నేలనడిగిన నీకు బోధచేయును. సముద్రమునందలి చేపలు నీకు పాఠము చెప్పును

9. ప్రభువే తమను చేసెనని ప్రాణులకెల్ల తెలియును

10. జీవించు ప్రతి ప్రాణి ప్రాణము, ప్రతి నరుని ఊపిరి, ఆయన ఆధీనములో ఉన్నది.

11. జిహ్వ భోజనపు రుచివలన సంతసించినట్లే శ్రవణము వినికిడివలన సంతుష్టిచెందును.

12. వృద్ధులు విజ్ఞానమును ఆర్జింతురు. పెద్ద ప్రాయమువలన వివేకము పుట్టును.

13. కాని దేవునియందు విజ్ఞానమును,శౌర్యమును కలదు ఆయన వివేకవంతుడు క్రియాపరుడుకూడ.

14. ఆయన కూలద్రోసిన ఇంటినెవ్వరు తిరిగి కట్టజాలరు. ఆయన చెరగొనిన నరునెవ్వరు విడిపింపజాలరు

15. ఆయన వానలను ఆపివేయగా అనావృష్టి కలుగుచున్నది. జలములను వదలివేయగా వరదలు వచ్చి నేలను పాడుచేయును.

16. ఆయన బలాఢ్యుడు విజేతకూడ, మోసగాడు, మోసమునకు గురియైనవాడుకూడ ఆయనకు లొంగుదురు.

17. ఆయన సలహాదారుల తెలివిని వమ్ముచేయును. న్యాయాధిపతులను మూర్ఖులను చేయును.

18. రాజులను కూలద్రోసి బందీలను చేయును.

19. యాజకులకు తలవంపులు తెచ్చును. ఆ బలాడ్యులను లొంగదీసికొనును.

20. మాటకారులను మూగలను చేయును. వృద్ధులు వివేకమును కోల్పోవునట్లు చేయును.

21. అభిజాత్యము కలవారిని మన్ను గరపించును. రాజుల బలము గాలికి పోవునట్లు చేయును.

22. అగాధములలోని తమస్సులను తొలగించును. జ్యోతిని గాఢాంధకారముతో కప్పివేయును.

23. జాతులను వృద్ధిలోనికి తెచ్చి మరల జారవిడుచును ప్రజలకు పెంపుదయచేసి తిరుగచేయి విడుచును

24. దేశనాయకులకు బుద్ధిమాంద్యము కలిగించి, వారు దారులులేని ఎడారులలో తిరుగాడునట్లు

25. వెలుతురులేని చీకటితావులలో కొట్టుమిట్టాడునట్లు తప్పత్రాగినవారివలె తూలిపడిపోవునట్లు చేయును

 1. ఈ సంగతులెల్ల నేను కన్నులార చూచియు చెవులార వినియు తెలిసికొంటిని.

2. మీరెరిగిన అంశములు నేను ఎరుగుదును. నేను మీ కంటే తక్కువవాడనేమి కాదు.

3. కాని నేను మీతోగాక దేవునితో మాట్లాడగోరెదను. నేను వాదింపగోరినది ప్రభువుతోనే.

4. మీరు అబద్దాలతో మీ వాదనలను సమర్థించుకొనుచున్నారు. వ్యాధులను కుదర్పలేని వైద్యుల వంటివారు మీరు.

5. మీరిక నోరు మూసికొనినచో బాగుగానుండును. మౌనమే మీకు విజ్ఞతయగునుగాక!

6. మీరిక నా వాదమును వినుడు. నా పెదవుల మనవుల నాలకింపుడు.

7. మీరు మీ మిథ్యావచనములతో దేవుని తరపున వాదింపనక్కరలేదు.

8. పక్షపాత బుద్ధికలవారు ఆయన క్షమున న్యాయవాదులుగా వ్యవహరింపగలరా?

9. ఆయన మీ లోగుట్టును తెలిసికోలేడా? నరులనువలె దేవుని వంచింపగలమా?

10. మీరు రహస్యముగా పక్షపాతము చూపించినచో ప్రభువు మిమ్ము తీవ్రముగా మందలించును.

11. ఆయన వైభవమును చూచి మీరు భయభ్రాంతులై భీతితో కంపించిపోవుదురు

12. మీ విజ్ఞానసూక్తులు బూడిదవలె విలువ లేనివి. మీ వాదములు మట్టివలె బలము చాలనివి.

13. మీరిక మౌనము వహించి నన్ను మాటాడనిండు. నాకు జరగబోవునది జరుగును గాక!

14. నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసుకొనవలెను ఈ పట్టున ప్రాణములు ఒడ్డుటకు నేను వెనుకాడనుగాని ప్రాణములకు తెగించి మాట్లాడుదును.

15. నేను ఆశలనెల్ల విడనాడితిని. దేవుడు నన్ను చంపిన చంపుగాక! ఆయన ముందు నేను నిర్దోషినని మాత్రము నిరూపించుకొందును.

16. దైవభక్తిలేని వాడెవడును దేవుని ఎదుటికి రాజాలడు కనుక నా ఈ సాహసము నన్ను రక్షించిన రక్షింపవచ్చును.

17. మీరు నా మాటలు ఆలకింపుడు. నా పలుకులు సావధానముగా వినుడు.

18. నేను నిరపరాధినన్న నమ్మకము నాకు ఉన్నది కనుక నా అభియోగమును విన్నవించుకొందును.

19. దేవుడు నా మీద నేరము మోపుటకు వచ్చిన రానిండు. మౌనముగా ప్రాణములు త్యజించుటకు నేను సంసిద్దుడనే.

20. ప్రభూ! నీవు నాకు రెండు వరములు దయచేయుము. నేను నీనుండి దాచి పెట్టునది ఏమియులేదు.

21. మొదట నీవు నన్ను బాధించుట మానుకొనుము. నీ భయమును నాయొద్దనుండి తొలగింపుము.

22. ఆ పిమ్మట నీవు నన్ను ప్రశ్నింపుము. నేను నీకు బదులు చెప్పెదను. లేదా నేనే నిన్ను ప్రశ్నింతును, నీవు నాకు బదులు చెప్పుము.

23. నేనేమి తప్పులు చేసితిని? ఏమి పాపములు కట్టుకొంటిని? ఏ అపరాధములు సల్పితిని? ఏ ఆజ్ఞలు మీరితిని?

24. నీవు ఇపుడు మొగము చాటుచేసికోనేల? నన్ను నీ శత్రువునిగా భావింపనేల?

25. గాలికెగిరిపోవు ఈయాకునా నీవు భయపెట్టునది? ఎండిపోయిన ఈ తాలునా నీవు వెంటాడునది?

26. నేను బాలుడిగా ఉన్నప్పుడు చేసిన పాపములకు నీవు నామీద ఘోరమైన నేరములుమోపుచున్నావు

27. నీవు నా పాదములను బండకొయ్యలో బిగించితివి. నేను పోవు మార్గములను, నా అడుగుజాడలను గుర్తుపట్టితివి.

28. నేను చివికిపోయిన కొయ్యవలెను, చిమ్మటలు కొట్టిన వస్త్రములవలెను తుత్తునియలు అయితిని. నా ప్రవర్తననంతయు నీవు గిరిగీసి కనిపెట్టుచున్నావు

 1. నారికి జన్మించిన నరులు అల్పాయుష్కులు, బహువేదనలకు గురి అయ్యెడి వారలుకూడ.

2. వారు పూలవలె వికసించి అనతికాలముననే వాడిపోవుదురు. కదలిపోవు నీడవలె శీఘ్రమే కనుమరుగై పోవుదురు

3. ప్రభూ! ఇట్టి నరుడినా నీవు లక్ష్యము చేయునది? ఇట్టివానినా నీవు తీర్పునకు పిల్చునది?

4. అశుద్దుడైన నరునినుండి , శుద్ధగుణమునెవడు వెలికి తీయగలడు?

5. నరుడెంతకాలము జీవించునో నీవు ముందుగనే నిర్ణయించితివి. అతడు జీవించు నెలలను నిశ్చయించితివి. దాటరాని ఢిల్లలను అతనికి విధించితివి.

6. కనుక ఆ పేదనరుని ఇక వదలిపెట్టుము. వాని తిప్పలు వాడుపడును. బానిసవలె తన దినములు ఎలాగో ముగించుకొనును

7. నరికిన చెట్టు మరల చిగిర్చి తిరుగ కొమ్మలుసాచునను ఆశకలదు.

8. దాని వ్రేళ్ళు ఎండిపోయినను, మ్రోడు శిథిలమైపోయినను

9. నీరు తగులగనే అది మరల చిగురించి లేత మొక్కవలె కొమ్మలు వేయును.

10. కాని నరుడు చనిపోయిన పిమ్మట ఏమి మిగులును? మానవుడు మరణించిన పిమ్మట ఇక ఎక్కడనుండును?

11. నదులు ఎండిపోయినట్లు, సరస్సులు ఇంకిపోయినట్లు నరులు మట్టిలోగలిసి పోవుదురు వారు పండుకొని తిరిగిలేవరు.

12. పైన ఆకాశము ఉన్నంతకాలము వారు మరల లేవరు, దీర్ఘనిద్రనుండి మేల్కొనరు.

13. ప్రభూ! నీ కోపము చల్లారినవరకు నీవు నన్ను పాతాళమున దాచియుంచి, అటుపిమ్మట నన్ను జ్ఞప్తికి తెచ్చుకొనిన ఎంత బాగుండును?

14. చచ్చిన నరుడు మరల బ్రతుకునా? కాని నేను మంచిరోజులకొరకు వేచియుందును. నా కష్టములు తీరువరకు కాచుకొనియుందును

15. అప్పుడు నీవు నన్ను పిలువగా నేను నీకు బదులు పలుకుదును. నీవు స్వయముగా సృజించిన నన్ను నీవు మరల దర్శింపగోరుదువు.

16. ఇప్పుడు నీవు నా చర్యలను జాగ్రత్తగా గుర్తించుచున్నావు. కాని అప్పుడుమాత్రమునా పాపములను గణింపవు

17. నా అపరాధములను పూర్తిగా క్షమించి నా దోషములనెల్ల తుడిచివేయుదువు.

18. కానికాలము రాగా, కొండలు కూలిపోవును. శిఖరములు శిథిలములై పోవును.

19. జలప్రవాహములు కొండలను అరగదీయును, కుంభవర్షములు నేలను కోసివేయును. అట్లే నీవు నరుని జీవితాశను నాశనము చేయుదువు.

20. నీవు నరుని అణుగదొక్కి అతనిని శాశ్వతముగా నాశనము చేయుదువు. మనుజుని రూపుమాపి అతనిని నీ సమక్షము నుండి బహిష్కరింతువు.

21. ఆ మీదట అతని తనయులు పేరుప్రతిష్ఠలు తెచ్చుకొన్నను, అపకీర్తి తెచ్చుకొన్నను అతనికేమియు తెలియదు

22. అతడు తన దేహబాధనుమాత్రముస్మరించుకొనును తన ప్రాణమును గూర్చి మాత్రము తాను పరితపించును.”

 1. అటు పిమ్మట తేమాను వాసి అయిన ఎలీఫసు ఇట్లనెను:

2. “విజ్ఞాని అయినవాడు ఇట్టి వాదము చేయుచు వ్యర్థపు మాటలు వినియోగించునా?

3. తెలివిగల వాడెవడైన నీవలె నిరర్థక పదజాలముతో తననుతాను సమర్ధించుకొనునా?

4. నీకు దైవభయము లేదు. దేవునికి మొరపెట్టుకోవలెనన్న కోరికయు లేదు.

5. నీవు దోషివి కనుకనే ఇట్టి పలుకులు పలికి కపటముతో నీ తప్పును కప్పిపెట్టుకోగోరుచున్నావు

6. నేను గాదు, నీ మాటలే నీవు దోషివని నిరూపించుచున్నవి.

7. నీ పలుకులే నీకు వ్యతిరేకముగా సాక్ష్యమిచ్చుచున్నవి నీవు లోకములో మొట్టమొదట జన్మించిన నరుడవా? లేక దేవుడు పర్వతాలను సృజింపకముందే పుట్టినవాడవా?

8. నీవు దేవుని ఆలోచనకర్తలలో ఒకడవా? విజ్ఞానమునకు నీవే కాణాచిననుకొంటివా?

9. నీకు తెలిసినంత మాకును తెలియును. నీవు గ్రహించినంత మేమును గ్రహింతుము.

10. తల నరసిన ముదివగ్గులనుండియే మేము జ్ఞానమును ఆర్జించితిమి. వారు మీ తండ్రికంటె వయోవృద్ధులు సుమా!

11. ప్రభువు నీకు ఉపశాంతి నొసగగా నీవు కాదందువా? మేము నీతో ఎంత మృదువుగా సంభాషింపలేదు?

12. కాని నీవు కోపముతో మండిపోవుచున్నావు, మిడిగ్రుడ్లతో మా వైపు తేరిచూచుచున్నావు,

13. నీవు దేవునిమీద ఆగ్రహము తెచ్చుకొని ఇట్టి వాదములు చేయుచున్నావు.

14. అసలు ఏ నరుడు నిష్కళంకుడో చెప్పుము? నారికి జన్మించిన నరులలో పుణ్యశీలుడు ఎవడు?

15. ప్రభువు దేవదూతలనే నమ్మడు. దూతగణములే అతని కంటికి నిర్దోషములుగా కన్పింపవు.

16. అట్లయినచో పాపమును నీటినివలె మ్రింగివేయు దబ్బరజాతికి చెందిన నికృష్టమానవుడా అతని దృష్టిలో నిర్మలుడు?

17. ఓయి! నీవు నా సందేశమును ఆలకింపుము. నేను నా అనుభవమును చెప్పెదను.

18. విజ్ఞులు వారి పితరుల బోధలు నాకెరిగించిరి. ఆ ఉపదేశములనే నేను నీకు విన్పించెదను.

19. వారికాలమున అన్యదేశీయులు మన నేలమీద వసింపలేదు. ఈ దేశమున వారు మాత్రమే వారసముగా నివసించిరి.

20. దుర్మార్గుడు నిరంతరము బాధలను అనుభవించును పరపీడకుడు జీవితాంతము వేదనలకు గురియగును.

21. అనవరతము భీకరధ్వనులు అతని చెవులలో మారుమ్రోగును. తాను సురక్షితముగా ఉన్నానని తలంచినపుడే దోపిడిగాండ్రువచ్చి అతనిమీద పడుదురు.

22. అతడిక చీకటినుండి తప్పించుకోజాలడు. తాను కత్తివాత బడుదునని గ్రహించును.

23. 'ఆహారమెక్కడ దొరకునా'యని అతడు దాని కొరకు తిరుగులాడును. అంధకార దినము సమీపించుచున్నదని వానికి తెలియును.

24. దురదృష్టములు, వేదనలు అతనిని భయపెట్టును వినాశము బలాఢ్యుడైన రాజువలె అతని మీదికెత్తి వచ్చును.

25. ఆ దుర్మార్గుడు ప్రభువు నెదిరించి ఆయనను సవాలు చేసెను.

26. దళసరి డాలు చేతబూని ప్రభువు మీదికి పోరాటమునకు వచ్చెను.

27. వాని ముఖము క్రొవ్వు పట్టి ఉన్నది. వాని నడుముచుట్టు క్రొవ్వు కండలు పెరిగి ఉన్నవి

28. అతడు నగరములను పట్టుకొని యజమానులు వీడిపోయిన గృహములను స్వాధీనము చేసికొనెను. కాని ఈ నగరములును, గృహములును నేలమట్టమగును.

29. అతని సంపదలు దీర్ఘకాలము నిలువవు. అతని ఆస్తిపాస్తులు మంట గలిసిపోవును. అతడి పొలము పంటతో బరువెక్కి నేలకు వంగదు.

30. అతడు చీకటిని తప్పించుకొనడు. అగ్నిజ్వాల అతని లేతకొమ్మలను దహించును. అతని చిగురులు గాలిచే రాలిపోవును.

31. అతడు స్వీయబలమును నమ్ముకొనెనేని ఆ నమ్మకము వ్యర్థమే అగును.

32. అతడు తన ఆయుస్సు తీరకముందే వాడిపోయిన కొమ్మవలె ఎండిపోవును. ఆ కొమ్మ మరల చిగురింపనేరదు.

33. అతడు పిందె రాలిపోయిన ద్రాక్షతీగవంటివాడును, పూత రాలిపోయిన ఓలివుచెట్టు వంటివాడును అగును.

34. దుర్మార్గుల సంతానము వృద్ధి చెందదు. లంచములతో కట్టిన ఇండ్లు మంటలలో కాలిపోవును

35. దుష్టులు దురాలోచనతో దుష్కార్యములు చేయుదురు వారి యెదలో కపటము గూడుకట్టుకొని ఉండును.”

 1. తరువాత యోబు ఇట్లనెను:

2. "ఇట్టి మాటలు నేను మునుపే వినియుంటిని. నాకు మీ వలన ఓదార్పు గాక బాధయే కలుగుచున్నది

3. ఎంత కాలము మీరీ అర్ధములేని పలుకులు వల్లించెదరు. కడన మీ వాదమునే నెగ్గించుకోవలెననియా మీ కోరిక?

4. నేను కూడ మీ స్థానములో నున్నచో మీవలె మాటలాడి ఉందును. మీవలె తల ఆడించి ఉందును. దీర్ఘవాదములతో మిమ్ము తికమకలు పెట్టి ఉందును

5. ఉపశమనవాక్యములతో మీకు ఉపదేశము చేసియుందును.

6. కాని, నేను మాటలాడినచో నా బాధ తగ్గదు. మౌనముగా ఉన్నను ఉపశాంతి కలుగదు.

7. ఇపుడు నా స్నేహితుడు నన్ను విసిగించుచున్నాడు. అతడు, అతని తోడివారు నన్ను హింసించుచున్నారు

8. నా దేహమంతయు ముడతలు పడునట్లు చేసియున్నావు ఇది కూడా నా మీద సాక్ష్యముగానున్నది. నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుచున్నది.

9. అతడు నా శరీరమును ముక్కలు ముక్కలుగా చీల్చివేసి, పండ్లు కొరకుచు నావైపు రౌద్రముగా చూచుచున్నాడు. నా శత్రువులు నాపై క్రూరచూపులను ప్రసరించుచున్నారు

10. వారెల్లరు ఏకమైనా చెంపలు వాయించుచున్నారు

11. ప్రభువు నన్ను దుర్మార్గుల వశముచేసెను. దుష్టుల చేతికి నన్ను చిక్కించెను.

12. నేను నిశ్చింతగా జీవించుచుండగా ప్రభువు నన్ను నేలకు విసిరికొట్టి ముక్కలుచేసెను. నా మెడపట్టి లాగి తన బాణములకు నన్ను గురిచేసెను.

13. ఆయన నలువైపులనుండి నా మీద అంబులు రువ్వి నిర్దయతో నన్ను తీవ్రముగా గాయపరచెను. నా పైత్యపు నీరు కారి నేలబడునట్లు చేసెను.

14. అతడు ప్రతిపక్ష యోధునివలె నామీద పడి నన్ను దెబ్బమీద దెబ్బకొట్టెను.

15. నేను దిగులుతో గోనె తాల్చితిని. ఓడిపోయి ఈ మంటిమీద బోరగిలబడితిని.

16. ఏడ్చి ఏడ్చి నా మొగము కందినది. నా కన్నులు వాచి నల్లబడినవి.

17. అయినను నేనేపాపము చేయలేదు. నా ప్రార్ధనలో చిత్తశుద్ధి లోపింపలేదు.

18. ఓ భూమీ! నా రక్తమును కప్పివేయకుము. న్యాయముకొరకు నేనుచేయు ఆక్రోశమును అణచివేయవలదు.

19. ఇకమీదట పరలోకమున నా పక్షమున ఒక సాక్షి నిలిచి ఉండి నన్ను సమర్థించి మాటలాడును.

20. నా కన్నులు అశ్రువులు కార్చుచుండగా నా ఆక్రోశమే న్యాయవాదియై దేవునియెదుట నన్ను సమర్ధించును,

21. నరుడు తన స్నేహితుని కొరకువలె నా కొరకు దేవునితో ఎవరైన మనవి చేసిన ఎంత బాగుండును!

22. నా కాలము సమీపించినది , నేను నరులు తిరిగిరాని చోటికి వెడలిపోనున్నాను

 1. నా రోజులు ముగిసినవి, నా శ్వాసము మందగించినది. నాకు సమాధి సిద్ధముగా ఉన్నది.

2. ఎల్లరు నన్ను అపహాసము చేయుచున్నారు. వారికి నాపట్లగల అయిష్టమును, నేను గమనించితిని.

3. నాకు హామీగానుండువాడు ఎవడునులేడు కనుక ప్రభూ! నీవే నా పక్షమున హామీగా నిలువుము.

4. నీవు నా మిత్రుల బుద్ధిని మందగింపచేసితివి. వారు నన్ను అణగదొక్కకుండునట్లు చేయుము.

5. సొంతకుమారులు ఆకలితో అలమటించుచుండగా తండ్రి తన ఆస్తిని మిత్రులకు పంచియిచ్చినట్లయ్యెను.

6. ప్రజలెల్లరు నన్ను ఎగతాళి చేయుచున్నారు. నా మొగముమీద ఉమ్మి వేయుచున్నారు.

7. ఏడ్చియేడ్చి నా కన్నులకు చీకట్లు క్రమ్ముచున్నవి. నా శరీరావయవములన్ని చిక్కి శల్యమైపోయినవి

8. దైవభక్తులము అనుకొనువారు నన్ను చూచి విస్తుపోవుచున్నారు. నేను పాపినని నన్ను నిందించుచున్నారు

9. ధర్మాత్ములు అనుకొనువారు నన్ను గూర్చిన తమభావనలే నిజమని రూఢిగా నమ్ముచున్నారు.

10. కాని వారెల్లరు నా సమక్షమునకు వచ్చినచో వీరిలో సుజ్ఞాని ఒక్కడు లేడని రుజువగును.

11. నా జీవితము నేను తలవని రీతిగా సాగిపోయినది నా హృదయతంత్రులు తెగిపోయినవి. ఆశయములు అణగారినవి.

12. చీకటి వ్యాపింపగా , వెలుగు సమీపించెననుచున్నారు వెలుతురు చీకటిని పారద్రోలునని జనులు చెప్పుదురు.

13. కాని నేను మాత్రము మృతలోకము చేరుకోవలసినదే. అచటి పెనుచీకటిలో నిదురింపవలసినదే.

14. నా సమాధి 'నాకు తండ్రి' అని, నన్ను తినివేయు పురుగులు 'నాకు తల్లి, తోబుట్టువులు' అని నేను చెప్పుకొందును

15. ఇక నాకు ఆశ ఎక్కడిది? నాకు మంచి రోజులున్నవని ఎవరైన ఊహింతురా?

16. ధూళిలో నిదురింపగా అది పాతాళపు , అడ్డకమ్ములయొద్దకు దిగుచున్నది”.

 1. తరువాత షూహా నివాసి బిల్డదు ఇట్లనెను:

2. “ఓయీ! ఈ మాటలిక చాలింపరాదా? నీవు మౌనముగానున్నచో మేము మాటలాడుదుము.

3. మేమేమి జ్ఞానములేని పశువులమనుకొంటివా? మాట్లాడలేని మూగ గొడ్డులమనుకొంటివా?

4. కోపముతో నిన్ను నీవు ముక్కలు ముక్కలుగా చీల్చుకొనినను నీ కొరకు ఈ ప్రపంచము నిర్మానుష్యము కాబోదు. దేవుడు నీ కొరకు కొండలను కదలింపబోడు.

5. దుష్టుని దీపము మాత్రము ఆరిపోవును. దానిని మరల ముట్టింప సాధ్యముకాదు.

6. అతని గుడారములోని దీపము మసకలు కమ్మును అతనికి వెలుగునిచ్చు వత్తి ఆరిపోవును.

7. అతడు బలము కూడగట్టుకొని అడుగులు వేసినను కూలి పడిపోవును. అతని కపటమే అతనికి వినాశము తెచ్చిపెట్టును.

8. అతడు నడిచి తనకుతానే ఉరులలో తగుల్కొనును. స్వయముగా వెళ్ళి వలలో చిక్కుకొనును.

9. అతని మడమ వలలో తగుల్కొనగా ఉచ్చు బిగుసుకొనిపోవును.

10. అతనిని పట్టుకొనుటకుగాను కంటికి కన్పింపని రీతిగా నేలమీద ఉచ్చు పన్నుదురు. అతని త్రోవలో బోనును అమర్తురు.

11. భయము అతనికి ఎల్లవైపుల పొంచి ఉండును. అది అడుగడుగున అతనిని వెన్నంటి వెళ్ళును.

12. అతడు ఆకలితో అలమటించును. వినాశనము అతని దరిదాపులలోనే కాచుకొని ఉండును.

13. అతని దేహము రోగముచే క్షీణించగా కాలుసేతులు పడిపోవును.

14. అతడు నమ్ముకొన్న తన ఇంట సురక్షితముగా వసించుచుండగా అచటినుండి ఈడ్చుకొనిపోయి క్రూరరాజైన మృత్యువు ఎదుట నిల్పుదురు.

15. అతని నింటిని గంథకముతో శుద్ధి చేసిన పిమ్మట దానిలో అన్యులెవరైన వసింతురు.

16. అతని క్రింది వ్రేళ్ళు ఎండిపోవును, పై కొమ్మలు వాడిపోవును.

17. భూమిమీద అతని పేరు మాసిపోవును. ఆ మీదట అతని నామమెవరును స్మరింపరు.

18. అతనిని వెలుగునుండి చీకటిలోనికి నెట్టివేయుదురు. జీవవంతుల లోకమునుండి గెంటివేయుదురు.

19. అతని సంతానము నిలువదు. అతని ఇంట అతని వారుసులెవరును వసింపజాలరు.

20. తూర్పు దేశీయులు, పశ్చిమ దేశీయులు గూడ అతడి దుర్గతినిగూర్చి విని భయముతో కంపింతురు

21. దేవుని లక్ష్యము చేయని దురాత్ములిట్టి అధోగతి పాలగుదురు.”

1. తరువాత యోబు ఇట్లనెను:

2. “ఎంతకాలము మీరు నన్నిట్లు హింసింతురు? మీ పలుకులతో నన్నెంత దనుక వేధింతురు?

3. తేపతేపకు మీరు నన్ను అవమానపరుచుచున్నారు నన్ను వేధించుచున్నామన్న ఇంకితజ్ఞానముకూడ మీకు లేదు.

4. ఒకవేళ నేను తప్పు చేసిన ఆ తప్పు నాదేకాని మీది కాదుగదా?

5. మీరు నాకంటె పుణ్యపురుషులము అనుకొనుచు, నా అపరాధముకుగాను నాకు ఈ గతి పట్టినదని ఎంచినచో

6. నన్ను అణగదొక్కినవాడు దేవుడేనని తెలిసికొనుడు నన్ను బంధించుటకు వలపన్నినవాడు ఆయనే.

7. నేను ఆయన దౌర్జన్యముగూర్చి మొరపెట్టినను, వినువాడు లేడు. న్యాయముకొరకు ఆక్రోశించినను ఆలించువాడు లేడు.

8. ఆయన నా త్రోవకు అడ్డము కల్పించెను. నా మార్గమును చీకటితో కప్పివేసెను.

9. నా పరువు మంటగలిపి, నా పేరు ప్రఖ్యాతులు నాశనము చేసెను.

10. నలువైపుల నుండి నన్నెదిరించి కూలద్రోసెను. నా ఆశను మొక్కనువలె పెరికివైచెను.

11. ఆయన కోపము నా మీద రగుల్కొనినది. ఆయన నన్ను తన శత్రువుగా భావించెను.

12. ఆయన సైన్యము నా మీదికి ఎత్తివచ్చి, నా నివాసమును ముట్టడించినది.

13. ఆయన నా సోదరులు నన్ను వీడిపోవునట్లు చేసెను. ఇరుగుపొరుగువారు నన్ను పరిత్యజించునట్లు చేసెను

14. నా బంధుమిత్రులు నన్ను విడనాడిరి.

15. నా అతిథులు నన్ను విస్మరించిరి. నా పనికత్తెలు నన్ను పరునివలెను, అన్యదేశీయునివలెను చూచుచున్నారు.

16. నా సేవకుని పిలిచినను పలుకుటలేదు. బతిమాలినను, నా మాట వినుటలేదు.

17. నా భార్య నా శ్వాసములోని దుర్గంధమును భరింపజాలకున్నది. నాసొంత సోదరులే నన్ను చీదరించుకొనుచున్నారు

18. నా పిల్లలే నన్ను అనాదరముతో చూచుచున్నారు. నేను కన్పించినపుడెల్ల కొంటెతనముతో నవ్వుచున్నారు.

19. నా ఆప్తమిత్రులు నన్ను అసహ్యించుకొనుచున్నారు నేను అనురాగముతో చూచినవారు నాకెదురు తిరుగుచున్నారు.

20. నా ఎముకలు నా చర్మమును, నా మాంసమును అంటియున్నవి. పంటిబిగువున నా ప్రాణము నిలిచి ఉన్నది.

21. ప్రభువు హస్తము నన్ను దారుణముగా శిక్షించినది. జాలిచూపుడు మిత్రులారా! మీరు నా మీద జాలి చూపుడు.

22. ప్రభువువలె మీరుకూడ నన్ను హింసింపవలయునా? ఇంతవరకు మీరు నన్ను వేధించినది చాలదా?

23-24. ఎవరైన నా ఈ పలుకులను గ్రంథమున వ్రాసి ఉంచినచో, లేదా వానిని ఉలితో రాతిపై చెక్కి పదిలపరచినచో, ఎంత బాగుండును? 

25. అయినను, నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును.

26. ఈ నా దేహము క్షీణించిపోయిన ఈ శరీరముతోనే నేను ప్రభువును దర్శింతును.

27. నా నేత్రములు స్వయముగా ఆయనను చూచును. నాలో నా అంతర్యింద్రములు కృశించినవి.

28. నాకు జరిగిన ఈ విషయములకు కారణము నాలోనే ఉన్నదనుకొని, మీరు ఆయనను ఎలా వెంటాడెదము? అని తలంచినయెడల

29. మీరు ఖడ్గమునకు భయపడుడు. దేవుని శాపము మీపై రగుల్కొనినది. మీకు తీర్పు తీర్చువాడొకడున్నాడని మీరు గుర్తింపుడు.” 

 1. తరువాత నామా దేశీయుడైన సోఫరు ఇట్లనెను:

2. “ఓయి! నేను నీకు సత్వరమే జవాబు చెప్పవలయును. నీకు బదులు చెప్పుటకునేను వేగిరపడుచున్నాను.

3. నీ వాదము నాకు ఎంతమాత్రమును నీకెట్లు ప్రత్యుత్తరమియ్యవలెనో నాకు తెలియును.

4. నరుడు భూమి మీద అవతరించిన ఆదిమకాలమునుండ ఈ సత్యము రుజువగుచున్నది ఇది నీకును తెలియును.

5. దుర్మార్గుడు స్వల్పకాలము మాత్రము సంతసించును. వాని సంబరము కొద్దికాలము మాత్రమే నిలుచును

6. దుష్టుడు ఆకాశమువరకు ఎదిగి మేఘమండలమును తాకవచ్చుగాక! 

7. కాని అతడు మలమువలె నశించిపోవును. పూర్వము అతనిని ఎరిగియున్నవారు ఇప్పుడు అతడు ఏమయ్యెను' అని ప్రశ్నింతురు.

8. అతడు స్వప్నమువలె మరుగైపోవును. నిద్రలో కన్పించిన దృశ్యమువలె మాయమైపోవును

9. పూర్వము అతడినెరిగినవారు మరల అతనిని చూడజాలరు. అతడు వసించిన గృహమునను మరల అతనిని కాంచజాలదు.

10. అతని సంతతి పేదల దయను కాంక్షింతురు. వారి చేతులు అతని ఆస్తిని తిరిగి అప్పగించును.

11. పూర్వమతని శరీరము యవ్వనబలముతో విరాజిల్లినది. కాని ఇప్పుడది మన్నయి పోనున్నది,

12-13. దౌష్ట్యము అతనికి తీపిగా ఉండెను కనుక దానిని తన నాలుక క్రింద నానబెట్టుకొని జారిపోనీకుండ చప్పరించెను.

14. కాని ఆ భోజనము అతని ఉదరమునకు చేటు తెచ్చెను అది అతని కడుపులో సర్పవిషముగా మారిపోయెను

15. అతడు తాను మ్రింగిన సొత్తునంతటిని కక్కివేయవలసినదే. ప్రభువే అతనికి వాంతి పుట్టించి ఆ సొమ్మును కక్కించును.

16. అతడు నాగుపాము విషమును మ్రింగెను, కనుక విషసర్పము కాటువలన చచ్చితీరును.

17. అతడిక ఏరులైపారుచున్న పాలుతేనెలతో ప్రవహించు నదులనుగాని చూడజాలడు.

18. తాను సంపాదించిన సొత్తునంతటిని విడనాడవలసినదే. తాను కూడబెట్టిన సొమ్మును తాను అనుభవింపజాలడు

19. అతడు పేదలను పీడించి పిప్పిచేసెను. తాను కట్టని ఇండ్లను స్వాధీనము చేసికొనెను.

20. అతని దురాశకు అంతము లేదయ్యెను. కాని అతడు కూడబెట్టిన సొమ్ము ఇప్పుడతనిని రక్షింపజాలదు.

21. ఇప్పుడతనికి తినుటకు ఏమియు లేదు. అతని ఐశ్వర్యమంతయు మంటగలసి పోయినది

22. ఉచ్చదశనందుకొనినంతనే సంకటములు అతనిని చుట్టుముట్టినవి.

23. ప్రభువు కోపము అతనిమీద రగుల్కొనెను. ప్రభువు అతనిపై అమ్ములను ముమ్మరముగా రువ్వెను.

24. అతడు ఇనుపకత్తినుండి తప్పించుకొనినను, ఆ కంచువిల్లు వానిని పడగొట్టకమానదు.

25. అతని వీపున అమ్ము దిగబడును. మిలమిల మెరయు బాణపుమొన అతని పిత్తమున దిగబడును. అతడు భయభ్రాంతుడగును.

26. అతని ధననిధులను అంధకారము కమ్మివేయును. మెరపుతాకిడికి అతని ఇల్లు బుగ్గియగును.

27. ఆ దుర్మార్గుని పాపమును దివి బట్టబయలు చేయును అతడు ద్రోహియని భువిసాక్ష్యము చెప్పును.

28. ప్రభువు కోపము వరదవలె వచ్చి చుట్టుముట్టగా, అతని సంపదలన్ని కొట్టుకొనిపోవును.

29. దుర్జనునికి పట్టెడి దుర్గతి ఇట్టిది. ప్రభువతనికి విధించెడి శిక్ష ఇట్టిది.”

 1. తరువాత యోబు ఇట్లనెను:

2. “మీరు నా పలుకులను సావధానముగా విన్నచో నన్ను ఓదార్చునంత పుణ్యము.

3. మీరు మొదట ఓర్పుతో నా వచనములు ఆలింపుడు అటుపిమ్మటనా మాటలకు నవ్విన నవ్వుదురుగాక!

4. నేను వాదమాడునది నరులతోగాదు. నేను తాల్మిని కోల్పోవుటకు కారణమున్నది.

5. నా మాటలను బాగుగా విన్నచో మీరు విస్తుపోయి నోటిమీద వ్రేలు వేసికొందురు.

6. నాకు జరిగిన సంగతులను చూచి నేనే భీతిచెంది, కంపించుచున్నాను.

7. దుర్మార్గుల జీవితము కొనసాగనేల? వారి ఆయుస్సుతోపాటు వారి సంపదలుకూడా పెరుగుటలేదా?

8. వారి సంతానము వృద్ధి చెందుచున్నది. వారి పిల్లలు వారి కన్నులెదుటనే పెరుగుచున్నారు

9. వారి కుటుంబములకు ఎట్టి ప్రమాదము కలుగుటలేదు. దేవుని దండము వారిమీద పడుటలేదు.

10. వారి ఎడ్లు దాటగా తప్పక చూలు కలుగును. ఆ ఆవులు చూడితప్పక దూడలను ఈనుచున్నవి

11. వారి పిల్లలు గొఱ్ఱె పిల్లలవలె పరుగిడుచు, ఆటలాడి నాట్యము చేయుచున్నారు.

12. తంత్రీవాద్యములు మీటుచు, పిల్లనగ్రోవుల నూదుచు, ఆ బాలబాలికలు ఆడిపాడుచున్నారు.

13. వారు తమ దినములను సమృద్ధిగా గడుపుదురు. సమాధానముతో పాతాళమునకు పోవుదురు.

14. అయినను ఈ దుర్మార్గులు దేవుని అలక్ష్యము చేసిరి ఆయన ఆజ్ఞలు పాటించుటకు నిరాకరించిరి.

15. దేవుని సేవింపనక్కరలేదనియు, ఆయనకు ప్రార్థనచేసిన ఫలితము దక్కదనియు భావించిరి.

16. వారు స్వీయశక్తితోనే విజయము సాధించితిమనుకొనిరి. కాని వారి వాదమును నేను ఎంతమాత్రము అంగీకరింపను.

17. అయినను తరచుగా దుర్జనుల దీపము ఆరిపోదేల? వారికి వినాశనము దాపురింపదేల? దైవకోపము వారిని నాశనము చేయదేల?

18. వారు గాలికి గడ్డిపోచవలె, సుడిగాలికి కల్లములోని పొటువలె కొట్టుకొని పోరేల?

19. 'దేవుడు తండ్రి తప్పులకు తనయుని శిక్షించును' అని మీ వాదము. అటులకాదు, తప్పుచేసినవాడే శిక్షను అనుభవింపవలయును

20. దుర్మార్గుడు తన వినాశమును తాను కన్నులార చూడవలయును. దేవుని కోపాగ్నికి తాను స్వయముగా గురికావలయును.

21. నరుడు చనిపోయిన తరువాత తన తనయులు సౌఖ్యముగా ఉన్నారా లేదా అని విచారించునా?

22. కాని మనము దేవునికి బోధచేయు నంతటివారలమా? ఆయన దేవదూతలకుగూడ తీర్పు విధించునుకదా!

23-24. కొందరు చనిపోవువరకు ఆరోగ్యముగా నుందురు." సంతోషముగా కాలము వెళ్ళబుచ్చుచు, కండబలముతో పుష్టిగా ఉండి, నిరాయాసముగా కడన ప్రాణము విడతురు.

25. కాని కొందరు సుఖములకు నోచుకోక, సంతాపముతో ప్రాణములు విడనాడుదురు.

26. అయినను ఆ ఇరుతెగలవారిని ప్రక్కప్రక్కనే పాతి పెట్టెదరు. ఆ రెండు వర్గముల వారిని అవే పురుగులు తినివేయును.

27. మీ మనసులో ఏమేమి భావములు మెదలుచున్నవో, మీరు నాతో ఏమేమి వాదింపగోరెదరో నేనెరుగుదును.

28. 'పేరు ప్రఖ్యాతులతో వెలిగిపోవు వాని భవనమేమైనది? పాపి నివాసము ఇప్పుడెచటనున్నది?” అని మీరడుగుదురు.

29. మీరు దేశదేశములు తిరుగు ప్రయాణికులతో మాట్లాడలేదా? వారి కథనము వినియుండలేదా?

30. ఉగ్రత దినమున నరులను శిక్షించునపుడు దేవుడు దుర్మార్గుని మాత్రము వదలివేయునా?

31. కనుక దుష్టుని నిలదీసి అడుగు వాడెవడులేడు. అతని దుష్కార్యములకు తగినట్లుగా అతనికి బుద్ధిచెప్పువాడును లేడు.

32. దుర్జనుని పాతి పెట్టుటకు కొనిపోయినపుడు చాలామంది అతని సమాధివద్ద ప్రోగవుదురు.

33. వేలాది ప్రజలు అతనికి ముందు వెనుకల నడతురు. అతనిమీద మట్టి పెళ్ళలనుగూడ మృదువుగానే విసరుదురు.

34. కనుక మీరు నన్ను ఓదార్చుటకు వెఱ్ఱివాదములు చేసితిరి. మీ మాటలన్ని పచ్చి అబద్ధములని రుజువైనదికదా?”

1. తరువాత తేమాను నగరవాసి ఎలీఫసు ఇట్లనెను:

2. 'నరుని వలన దేవునికేమి ఉపయోగమున్నది? విజ్ఞానియైన నరుడుగూడ ఆయనకు ఉపయోగపడడు.

3. నీవు ధర్మాత్ముడవైనందున దేవునికి ఏమి లాభము? నీవు పుణ్యపురుషుడవైనందున ఆయనకు ఏమి ఫలము?

4. నిన్ను ఆయన శిక్షించినదిగాని, నీకు తీర్పు విధించినదిగాని నీవు ఆయనపట్ల భయభక్తులతో జీవించుటచే కాదు.

5. అనంతమైన నీ దుష్టవర్తనమునకుగాను, లెక్కల కందని నీ దుష్కార్యములకుగాను నిన్ను ఆయన దండించుచున్నాడు.

6. తోడివారు నీ వద్ద అప్పుతీసికొన్న సొమ్మునకుగాను నీవు వారి బట్టలను కుదువ సొమ్ముగా పుచ్చుకొని వారిని దిగంబరులను గావించితివి.

7. ఆకలి గొన్నవారికి పిడికెడుకూడు పెట్టవైతివి. దప్పిక గొన్నవారికి గ్రుక్కెడు నీళ్ళీయ వైతివి,

8. బాహుబలము కలవానికే భూమి దక్కును. ఘనుడని ఎంచబడినవాడు దానిలో నివసింతురు.

9. వితంతువులను వట్టిచేతులతో పంపివేసితివి. అనాథలకు అన్యాయము చేసితివి.

10. కనుకనే శత్రువులు నీకు అన్నివైపుల ఉచ్చులు పన్నిరి. అకస్మాత్తుగా భయములు నిన్ను ఆవరించినవి.

11. నీ చుట్టు చీకట్లు క్రమ్ముకొనగా నీవు మార్గము కనజాలవైతివి. జల ప్రవాహములు నిన్ను ముంచియెత్తినవి.

12. దేవుడు మహోన్నతమైన స్వర్గసీమన వసించును గదా! ఉన్నతముననున్న నక్షత్రములను అవలోకించుటకు క్రిందికి పారచూచును.

13. అయినను 'అంత ఎత్తున నున్న దేవునికి ఏమి తెలియును. మేఘములు అడ్డుపడుట వలన మనము ఆయనకు కనుమరుగైపోమా?” అని నీవు అడుగుచున్నావు. 

14. ప్రభువు ఆకాశపుటంచుల మీద నడచునప్పుడు, గాఢ మేఘములు ఆయన దృష్టిని నిరోధించునని నీవు ఎంచుచున్నావు.

15. పూర్వమునుండి దుష్టులు నడచుచు వచ్చిన దుర్మార్గముననే నీవుకూడ పయనింపగోరెదవా?

16. ఆ నీచులను వారికాలము రాకమునుపే మహాప్రవాహము తుడిచిపెట్టినది.

17. 'మా నుండి తొలగిపొమ్ము. ఆ సర్వశక్తుడు మాకు చేయునదేమి?" అని ఆయన తమ్ము కదిలింపజాలడని వారు ఊహించిరి.

18. అయినను ఆ దుర్జనులను ధనాఢ్యులుగ చేసినది ప్రభువే. వారు మాత్రము ఆయనను తలంపునకు తెచ్చుకోరైరి

19. ఆ దుష్టుల పతనమును జూచి పుణ్యపురుషులు సంతసించిరి. ధర్మాత్ములు మందహాసము చేసిరి.

20. వారి సంపదలు అన్నియు నాశనమైనవి. వారి సొత్తంతయు బుగ్గియైనది.

21. కనుక మిత్రమా! నీవు దేవునితో రాజీపడుము. అప్పుడు నీకు క్షేమము కలుగును.

22. ఆయన ఆజ్ఞలు చేకొనుము. ఆయన ఆదేశమును నీ యెదలో పదిల పరచుకొనుము.

23. వినయముతో దేవుని వద్దకు తిరిగిరమ్ము. నీ ఇంటినుండి పాపకార్యమునెల్ల పోద్రోలుము.

24. నీ బంగారమును ధూళిగానెంచి బయట పారవేయుము. నీ ఓఫీరు మేలిమి బంగారమును ఏటి యొడ్డున దొరకు చిన్నరాళ్ళనుగా భావించి బయటికి విసరివేయుము.

25. అప్పుడు నీకు దేవుడే బంగారమగును. ఆ ప్రభువే నీకు వెండికుప్ప అగును.

26. అప్పుడు దేవుడు నీకు ఆనందనిధి అగును. నీవు ఆయన వైపు తలెత్తగలవు.

27. నీవు ఆయనను వేడుకొందువు, ఆయన నీ మొరాలకించును. నీవు పట్టిన వ్రతములను తీర్చుకొందువు.

28. నీవు తలపెట్టిన కార్యములెల్ల విజయవంతములగును. నీ మార్గమున వెలుగు ప్రకాశించును.

29. గర్వాత్ముల పొగరును అణగదొక్కు ప్రభువే వినయవంతులకు రక్షణము దయచేయును.

30. ప్రభువు నిరోషియగు నరుని రక్షించును. పాపకార్యములకు పాల్పడవేని నిన్ను కూడ ఆదుకొనును.”

1. తరువాత యోబు ఇట్లనెను:

2. "నేనింకను దేవుని కెదురుతిరిగి నిష్ఠురములు పలుకుచున్నాను. నా మూలుగులను అణచుకోజాలకున్నాను.

3. ఆ ప్రభువును సమీపించు మార్గము, ఆయనను చేరుకొను విధానము తెలియవచ్చిన ఎంత బాగుండును!

4. అప్పుడు నా అభియోగమును ఆయనకు తెల్పుకొందును. నావాదములన్నిటిని ఆయనకు విన్పించుకొందును

5. ఆయన తన వాదమునెట్లు సమర్ధించుకొనునో చూతును. ఆయన నాతో నుడువు పలుకులను జాగ్రత్తగా ఆలింతును.

6. ఆయన బలముగా వాదించి నా నోరు మూయించునా? అట్లు చేయడు, నా పలుకులు ఆలకించితీరును.

7. తాను నిజవర్తనునితో మాటాడుచుంటినని ఆయన గ్రహించును. కనుక నేను ఎన్నటికి నా న్యాయాధిపతిచే శిక్షింపబడను.

8. నేను తూర్పునకు వెళ్ళినచో ప్రభువు అచట కన్పించుట లేదు. పడమటికి వెళ్ళినచో అచటను కన్పించుట లేదు.

9. ఉత్తరమువైపు వెదకినచో అచట పొడచూపుట లేదు. దక్షిణపు వైపు వెదకినచో అచటను దొరకుట లేదు.

10. అయిననునా కార్యములన్ని ఆయనకు తెలియును ఆయన నన్ను పరీక్షించినచో నేను నిర్దోషినని తెలియును.

11. నేను ప్రభువు నిర్ణయించిన మార్గముననే నడచితిని కుడియెడమలకు బెత్తడైనను జరుగనైతిని.

12. ఆయన ఆజ్ఞలనెల్ల పాటించితిని. అతని చిత్తమును అనుసరించి జీవించితిని.

13. కాని ప్రభువు సంకల్పమును ఎవ్వరును మార్పజాలరు. ఆయన చేయనెంచిన కార్యమును ఎవ్వరును ఆపజాలరు.

14. కావున ఆయన నాకు చేయగోరిన కార్యమును చేసితీరును. ఆయన ఇతర నిర్ణయమువలె ఇదియు జరిగిపోవును

15. అందుచే నేను ఆయన సమక్షమున భీతితో కంపించుచున్నాను. ఈ సంగతిని తలచుకొన్న కొలది నాకు భయమెక్కు వగుచున్నది.

16. ప్రభువు నా గుండెను నీరు చేసెను. నన్ను భయముతో నింపివేసెను.

17. చీకటి ఆయనను నానుండి మరుగుచేయుచున్నది అయినను నేను తమస్సునకుగాక దేవునికే భయపడుచున్నాను.

1. ప్రభువు న్యాయము తీర్చు దినమును నిర్ణయింపడేల? తన సేవకులకు తీర్పుచెప్పు రోజును నియమింపడేల?
2. దుర్మార్గులు పొలములోని గట్టురాళ్ళను ఊడబీకుచున్నారు. గొఱ్ఱెలను వాని కాపరులను గూడ అపహరించుచున్నారు.
3. అనాథల గాడిదలను తోలుకొని పోవుచున్నారు. వితంతువుల ఎడ్లను కుదువ సొమ్ముగా కొనిపోవుచున్నారు.
4. పేదలకు న్యాయము జరుగకుండ అడ్డుపడుచున్నారు, నిరుపేదలు పారిపోయి దాగుకొనునట్లు చేయుచున్నారు.
5. పేదలు కూటి కొరకు గాలించుచు, అడవిగాడిదలవలె ఎడారిలో తిరుగాడుచున్నారు. వారిబిడ్డలకు మరి ఎచ్చటను కూడు దొరకును?
6. పేదలు దుర్మార్గుల పొలములలో కోతకోయవలయును. దుష్టుల ద్రాక్షతోటలలో పండ్లు కోయవలెను.
7. వారు రేయి చలికి బాధ చెందుచు, బట్టలు కప్పుకొనకయే నిద్రింపవలెను.
8. కొండలలో కురియు వానలు వారిని , తడిపి ముద్దజేయును. వారు దిక్కులేక కొండ బండల మాటున ఒదుగుకొందురు.
9. అనాథలను బానిసలుగా కొనిపోవుచున్నారు. బాకీలు తీర్పని పేదల పిల్లలను లాగుకొని పోవుచున్నారు.
10. పేదలు బట్టలులేక దిగంబరులుగానే పనికి పోవలెను. ఆకలితో నకనకలాడుచు పైరుకోసి కట్టలు కట్టవలెను.
11. వారు ఓలివులను చిదిమి నూనె తీయుదురు. ద్రాక్షలను చిదిమి రసము తీయుదురు. కాని వారికి మాత్రము త్రాగుటకేమియు దొరకదు
12. నగరములలో మరణించువారు బాధతో మూల్గుదురు. గాయపడిన వారు గొంతెత్తి అరచుదురు. కాని దేవుడు వారి వేడుకోలును ఆలించుట లేదు.
13. కొందరు వెలుగును ద్వేషింతురు. వారు జ్యోతిని గ్రహింపరు, దాని మార్గమున నడువరు.
14. నరహంత వేకువనేపోయి పేదవానిని చంపును. రేయి పరులసొమ్ము దొంగిలించును.
15. వ్యభిచారి మసక చీకటికై కాచుకొని ఉండును. ఇతరులు తన్ను గుర్తింపకుండుటకుగాను ముసుగు వేసికొని తిరుగును.
16. రాత్రివేళ దొంగలు ఇండ్లకు కన్నము వేయుదురు పగటిపూట మాత్రము వెలుతురును పరిహరించి దాగుకొనియుందురు.
17. వారికి పగటి వెలుగు చావునీడలా భయము పుట్టించును. రాత్రి దారుణములకు మాత్రము వారు స్నేహితులు.
18. “దుష్టులను వరదలు ముంచివేయును. వారి పొలములను దేవుడు శపించును. కనుక వారిక తమ ద్రాక్షతోటలో పనిచేయజాలరు.
19. వేడికి, బెట్టకు మంచు కరిగిపోయినట్లే  దుర్మార్గుడు సజీవుల లోకమునుండి మాయమగును.
20. కన్నతల్లికూడ అతనిని స్మరింపదు. పురుగులు అతనిని తినివేయును. పడిపోయిన చెట్టువలె అతడు నాశనమగును.
21. వితంతువులను పీడించి, గొడ్రాళ్ళను నిరాదరణము చేసెను గనుక దుష్టుడిట్టి కడగండ్ల వాతపడును.
22. ప్రభువు బలవంతులనుగూడ నాశనము చేయును అతడు చేయిచేసికొనగా దుష్టుడు కన్నుమూయును
23. ప్రభువు దుర్మార్గుని సురక్షితముగా బ్రతకనిచ్చినను, అతనిని ఒక కంట కనిపెట్టియే ఉండును.
24. పాపి తాత్కాలికముగా వృద్ధిచెందినను, పెరికివేసిన కలుపు మొక్కవలె వాడిపోవును, కోసిన వెన్నువలె ఎండిపోవును.
25. ఈ సంగతులను ఎవరైన కాదనగలరా? నా పలుకులు అసత్యములని ఎవరైన నిరూపింపగలరా?"

1. తరువాత షూహా దేశీయుడు బిల్టదు ఇట్లనెను:

2. “మహాశక్తిమంతుడైన ప్రభుని చూచి ఎల్లరును కంపింతురు. ఆయన ఉన్నత స్థలములో శాంతిని నేలకొల్పెను.

3. ఆయన దూతగణముల నెవడు లెక్కింపగలడు? అతని జ్యోతి ప్రకాశింపని స్థలమెందైనగలదా?

4. దేవుని దృష్టిలో ఏ నరుడైన పుణ్యాత్ముడుగా గణింపబడునా? నారికి జన్మించిన నరుడెవడైన విశుద్ధుడుగా పరిగణింపబడునా?

5. ఆ ప్రభువు దృష్టిలో చంద్రునకు ప్రకాశము చాలదు. చుక్కలకు నిర్మలత్వము చాలదు.

6. అట్టిచో క్రిమియు, కీటకమునైన దుర్బలమానవుడు దేవుని దృష్టిలో ఏపాటివాడు?”

1. తరువాత యోబు ఇట్లనెను:

2. “ఓయి! దుర్బలుడనైన నాకు నీవు ఎంతటి సాయము జేసితివి! బలహీనుడనైన నాకు నీ వెంతటి ఆశ్రయము నొసగితివి!

3. జ్ఞానములేనివానికి నీవెంత మంచి సలహాలిచ్చితివి నా మేలుకొరకు నీ భావములను ఎంత చక్కగా వివరించితివి!

4. కాని నీ మాటలను ఎవరాలింతురు? ఎవరి సాయమున నీవిట్టి పలుకులు పలికితివి?

5. పాతాళ వాసులు గడగడ వణుకుదురు. పాతాళజలములు అందలి భూతములు కంపించును

6. పాతాళమునందలి మృతులు దేవునికి స్పష్టముగా కన్పింతురు. ఆయన కంటికి కన్పింపకుండ వారిని దాచగలిగినది ఏదియును లేదు.

7. ఆకాశ ఉత్తరభాగమును వ్యాపింపచేసినవాడు ఆయనే భూమిని శూన్యమున వ్రేలాడదీసినవాడు ఆయనే

8. ప్రభువు మేఘములను నీటితో నింపును. అయినను అవి జలభారముచే పిగిలిపోవు.

9. ఆయన పూర్ణచంద్రుని మబ్బుతో కప్పివేయును.

10. సముద్రము మీద ఒక వలయమునేర్పరచి, వెలుగును చీకటినుండి వేరుపరచును.

11. ఆయన ఆకాశమును భరించు స్తంభములను గద్దింపగా అవి భీతితో కంపించును.

12. ఆయన మహాబలముతో సముద్రమును జయించెను. నేర్పుతో రాహాబును హతమార్చెను.

13. తన శ్వాసతో ఆకాశమును జ్యోతిర్మయము గావించెను. పారిపోవు మహాసర్పమును స్వహస్తముతో మట్టు పెట్టెను.

14. ఈ కార్యములన్నియు ఆయన బల సూచకములు మాత్రమే. మనము వినునది ఆయన అస్పష్ట శబ్దములు మాత్రమే ఆ ప్రభువు మహాబలమునెవరు గుర్తింపగలరు?”

1. తరువాత యోబు ఇట్లనెను:
2. “నాకు న్యాయమును నిరాకరించి నా బ్రతుకును కడగండ్లపాలు చేసిన ప్రభువు పేరుమీదుగా బాసచేసి చెప్పుచున్నాను.
3. నా బొందిలో ప్రాణమున్నంతవరకు, నా ముక్కురంధ్రములలో దేవుని ఊపిరి నిల్చియున్నంతవరకు
4. నా పెదవులు అసత్యము పలుకవు. నా జిహ్వ అబద్దము చెప్పదు.
5. మీ పలుకులను నేనంగీకరింపను. కన్నుమూయువరకు నేను నిర్దోషిననియే వాదింతును
6. నేను నిర్దోషినన్న భావమును విడనాడను. నా అంతరాత్మ నా మీద నేరము మోపుటలేదు.
7. నా విరోధులకు దుర్మార్గులకు పట్టుగతి పట్టునుగాక! నా శత్రువులు దుష్టులవలె శిక్షననుభవింతురుగాక!
8. దేవుడు తన ప్రాణములను తీయబోవుచుండగా, ఇక దుర్జనునకు ఏమి ఆశ మిగులును?
9. వినాశము దాపురించినపుడు దేవుడు దుష్టుని వేడుకోలు ఆలించునా?
10. అతడు దేవుని తన ఆనందనిధిగా ఎన్నుకొనెనా? ఆయనకు ఏ ప్రొద్దునైనా మ్రొక్కుకొనెనా?
11. దేవుని మహత్త్వము ఎంత గొప్పదో ఆయన ప్రణాళికలు ఎట్టివో నేను మీకు తెలియజేయుదును.
12. ప్రభువు మార్గములను మీరు ఎరుగుదురుగదా? మరి ఇప్పుడు మీరిట్టి నిరర్థకపు పలుకులనేల పలికితిరి?
13. దేవుడు దుర్మార్గులకు పట్టించుగతి, . ఆయన పరపీడకులను శిక్షించు తీరు ఇట్టిది:
14. వారికెందరు పుత్రులున్నను, అందరు కత్తివాతబడుదురు. వారి బిడ్డలకు కడుపునిండ తిండి దొరకదు.
15. వారిలో మిగిలినవారికి గత్తరసోకును. వారు చచ్చినపుడు, వారి విధవరాండ్రుకూడ శోకింపరు.
16. దుష్టులు వెండిని ధూళివలె కుప్పలుగా ప్రోగుచేసికోవచ్చుగాక! దుస్తులను మట్టివలె సేకరించుకోవచ్చుగాక!
17. ఎవడో ఒక సత్పురుషుడు వారి బట్టలు తాల్చును ఎవడో ఒక సజ్జనుడు వారి వెండిని గైకొనును.
18. సాలీడు గూడు నేసినట్లుగా, పొలమునకు కావలికాయు బానిస గుడిసె వేసినట్లుగాను దుర్జనులు ఇళ్ళు కట్టుదురు.
19. వారు చివరిసారిగ ధనవంతులవలె నిద్రపోవుదురు కాని మేల్కొని చూచునప్పటికి వారి సొత్తు చిల్లిగవ్వయైన మిగులదు.
20. అకస్మాత్తుగా వచ్చిన వరదలవలె విపత్తులు వారిని చుట్టుముట్టును. రేయి సుడిగాలి వారిని లేపుకొనిపోవును.
21. వారు తమ ఇంటినుండి పెనుగాలికి కొట్టుకొనిపోవుదురు.
22. ఆ ప్రభంజనము నిర్దయతో వారిని తాడించును. దాని తాకిడికి తట్టుకోలేక వారు పారిపోజూతురు
23. మనుష్యులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు. వారి స్థలములలోనుండి వారిని ఢీకొట్టి తరిమివేయుదురు
1. వెండిని త్రవ్వుటకు గనులు కలవు. సువర్ణమును శుద్ధి చేయుటకు కుంపటి గలదు.
2. జనులు భూమినిత్రవ్వి ఇనుమును తీయుదురు. రాళ్ళను కరిగించి రాగిని తయారు చేయుదురు.
3. నరులు అంధకారమయమైన భూగర్భములో ప్రవేశించి అచట , చీకటిలో ఖనిజము త్రవ్వి తీయుదురు.
4. జనసంచారమునకు దూరముగా, కాలూనుటకైన వీలులేని గోతులలోనికి దిగి త్రాటికి వ్రేలాడుచు గనులు త్రవ్వుదురు.
5. భూమిమీద పంటలుపండునుకాని నరులు ఆ భూమి గర్భమునే చీల్చి చిందరవందర చేయుదురు.
6. భూగర్భములోని రాళ్ళలో మణులు ఉండును. అందలి మట్టి బంగారముతో నిండియుండును.
7. డేగలకు ఆ గనుల లోనికి పోవుమార్గము తెలియదు. రాబందులకు అచటికి వెళ్ళు త్రోవతెలియదు.
8. దర్పముగల వన్యమృగములు అచటికి పోజాలవు. సింహము అచటికి వెళ్లజాలదు.
9. నరులు కఠినశిలలను గూడ త్రవ్వుదురు. కొండపాదులను కుళ్ళగించి వేయుదురు.
10. జనులు కొండలలో సొరంగములు త్రవ్వి విలువగల మణులను వెలికితీయుదురు.
11. నదులను వాని జన్మస్థానము వరకును పరిశీలించి చూచి, భూమిలో దాగియున్న వస్తువులను వెలుపలికి కొనివత్తురు.
12. కాని విజ్ఞానమెచట కన్పించును? వివేకము ఎందు చూపట్టును?
13. విజ్ఞానమును చేరుమార్గము జనులకు తెలియదు అది నరలోకమున దొరుకునది కాదు.
14. అగాధమును అడుగగా విజ్ఞానము నా యొద్ద లేదు' అనును. సముద్రము నడుగగా అదియును అట్టిది నా యొద్ద లేదు' అనును.
15. విజ్ఞానమును బంగారముతో కొనలేము. వెండిని తూచియిచ్చి సంపాదింపలేము.
16. మేలిమి బంగారముగాని, గోమేధిక నీలమణులుగాని దాని వెలతో సరితూగజాలవు.
17. అది సువర్ణముకంటెను, స్ఫటికముకంటెను మేలైనది స్వర్ణపాత్రమును దానితో మారకమువేయజాలము
18. పగడములను, స్పటికములను దానితో సరిపోల్చజాలము. దానితో పోల్చినచో ముత్తెములు ఎందుకు పనికిరావు
19. శ్రేష్టమైన పుష్యరాగము పుటము వేసిన బంగారము దానికి సమముకాదు
20. కాని విజ్ఞానమెచట కన్పించును? అవివేకము ఎందు చూపట్టును?
21. జీవించియున్న ప్రాణి ఏదియు విజ్ఞానమును కాంచజాలదు. ఆకసమున ఎగురు పక్షులుగూడ దానిని చూడజాలవు.
22. మృత్యువును, వినాశమునుగూడ మేము విజ్ఞానమును గూర్చి వదంతిని మాత్రమే వినియుంటిమి' అని చెప్పును.
23. దేవునికి మాత్రమే దాని మార్గము తెలియును. అది దొరకు తావును ఆయన మాత్రమే ఎరుగును
24. ఆయన నేల నాలుగుచెరగులను పరిశీలించును మింటిక్రిందనున్న వస్తువులనెల్ల అవలోకించును.
25. ప్రభువు వాయువునకు బలమును దయచేసినపుడు జలరాశికి పరిమాణమును విధించినపుడు,
26. వానలు కురియుటకు నియమములు చేసినపుడు, ఉరుములకు మెరపులకు మార్గములు నియమించినపుడు,
27. విజ్ఞానమును కూడ పరికించి చూచెను. ఆయన దానిని పరీక్షించి చూచి తన సమ్మతిని తెలిపెను.
28. ప్రభువు నరునితో ఇట్లనెను: దేవునికి భయపడుటయే విజ్ఞానము, దుష్కార్యములను విడనాడుటయే వివేకము.' ”
1. యోబు ఇట్లు పలికెను:
2. “ప్రభువు నాకు సంరక్షకుడై ఉండిన ఆ పూర్వకాలము మరల వచ్చిన ఎంత బాగుండును!
3. నాడు ప్రభువు జ్యోతి నా ముందట ప్రకాశించి, చీకటిలో నాకు త్రోవ చూపినది.
4. ప్రభువు నా ఇంటికి సంరక్షకుడై ఉండి నన్ను వృద్ధిలోనికి తెచ్చిన శుభదినములవి.
5. నాడు ప్రభువు నాకు బాసటయై ఉండగా, నా బిడ్డలు నాచుట్టు తిరుగాడెడి వారు.
6. నా పశువులనుండి పాలు సమృద్ధిగా లభించెడివి కొండలలోని నా ఓలివుతోటలనుండి నూనె విస్తారముగా లభించెడిది.
7. నేను నగరద్వారము చెంతకుపోయి పట్టణపాలకుల సభలో కూర్చుండినపుడు,
8. నన్ను చూడగనే యువకులు గబగబ దాగుకొనెడివారు. వృద్దులు లేచి నిలుచుండెడివారు.
9. పుర ప్రముఖులు తమలోతాము మాటలాడుట చాలించి పెదవులను చేతితో కప్పుకొనెడి వారు.
10. నగరనాయకులు సంభాషణలు మాని నోరు కదపక ఉండెడివారు.
11. నన్ను గూర్చి వినిన వారెల్లరు నన్ను కొనియాడిరి. నన్ను గాంచిన వారెల్లరు నన్ను సన్నుతించిరి.
12. ఎందుకన నేను పేదల గోడు విని వారిని ఆదరించితిని. ఆదరువులేని అనాథలను ఆదుకొంటిని.
13. నాశనమునకు గురియైన వారు నా చేయూతకు గాను నన్ను దీవించిరి. నేను చేసిన మేలువలన వితంతువుల హృదయము ఉల్లసించినది.
14. నేను న్యాయమునే వస్త్రముగా తొడిగితిని. కనుక అది నన్ను ధరించినది. ధర్మమునే చొక్కాయిగ, తలపాగగా ధరించితిని.
15. నేను గ్రుడ్డి వారికి కన్నులైతిని, కుంటివారికి కాళ్ళయితిని.
16. పేదసాదలకు తండ్రినయితిని. అపరిచితుల మొరలు ఆలించితిని.
17. దుష్టుల కోరలు ఊడబెరికి, వారి చేతికి చిక్కిన వారిని విడిపించితిని.
18. నేను దీర్ఘకాలము జీవించి, కడన నా ఇంటనే సుఖశాంతులతో కన్ను మూయుదును అనుకొంటిని కాని హంసవలె నేను దీర్ఘాయువు కలవాడనగుదును.
19. నేను నీరందినదాక లోతుగా వ్రేళ్ళు జొన్పి మంచున తడిసిన కొమ్మలతో అలరారు మహావృక్షము వంటి వాడనైతిని.
20. నాకు ఎడతెగని ఘనత కలుగును. నా చేతిలో నావిల్లు ఎప్పటికిని బలముగా వుండును.
21. సభలో నేను సలహాను ఇచ్చుచుండగా సభ్యులెల్లరు మౌనము వహించి సావధానముగా వినెడివారు.
22. నేను మాట్లాడి ముగించిన పిదప ఇకనెవ్వరు నోరెత్తిడి వారు కారు. వాన చినుకులకువలె నా పలుకులకు వారి యెడదలు నానెడివి.
23. వేసవిలో వానకొరకువలె ఎల్లరునా పలుకుల కొరకు కనిపెట్టుకొని ఉండెడివారు.
24. నిరుత్సాహముగానున్నవారు నేను మందహాసము చేయగా, నా ముఖకాంతిని కాంచి ఉత్సాహము తెచ్చుకొనెడివారు.
25. నేను నాయకత్వము వహించి నిర్ణయములు చేసితిని రాజు సైన్యమువలె, నేనును ప్రజలను నడిపించితిని. నిరాశ చెందినవారికి ఆశలు చేకూర్చి పెట్టితిని.
1. కాని నాకంటే చిన్నవారే నన్నిపుడు ఎగతాళి చేయుచున్నారు. వారి తండ్రులెంతటి అల్పులనగా, నా మందలను గాసిన కుక్కలకు కూడా వారు సాటిరారు.
2. వారి చేతుల బలము నాకేల ఉపయోగపడును? వారి పౌరుషము పోయినది.
3. ఆకలితో నకనకలాడుచు, అడవుల వెంటబడి దుంపలేరుకొని తినినవారు,
4. అడవిలోని పిచ్చిమొక్కలు పీకుకొని తిని, ఆహారమునకు ఉపయోగింపని వెఱ్ఱిగడ్డలతో కడుపు నింపుకొనినవారు.
5. కేకలిడి దొంగలను తరిమివేసినట్లుగా ఎల్లరు వారిని తరిమికొట్టిరి.
6. వారు కొండగుహలలోను శిఖరములచెంత త్రవ్విన బొరియలలోను వసించిరి
7. అడవిలో మృగములవలె అరచిరి. పొదలలో గుంపులుగా దాగుకొనిరి.
8. వారు ఊరు పేరు లేని బికారులు, చిల్లిగవ్వచేయని వారు. స్వదేశమునుండి తరిమివేయబడినవారు.
9. అట్టివారిప్పుడు నన్ను గేలిచేయుచు పాటలు పాడుచున్నారు. నన్ను చులకనచేసి ఆడిపోసికొనుచున్నారు. నేను వారికి సామెతకు ఆస్పదముగా ఉన్నాను.
10. వారు నన్ను అసహ్యించుకొని దూరముగా తొలగిపోవుచున్నారు. నా మొగము మీద ఉమ్మి వేయుచున్నారు.
11. ప్రభువు నా బలము తగ్గించి నన్ను శిక్షించెను గనుక వారు రౌద్రముతో నా మీదికి వచ్చుచున్నారు
12. గుంపుగా నా మీదికి వచ్చి నన్ను తరుముచున్నారు నన్ను బెదిరించుటకై నా మీదికి ఎత్తివచ్చుచున్నారు
13. ఇక నేను తప్పించుకొను మార్గము లేదు. వారిని అడ్డగించువారును లేరు.
14. వారు నా కోటలో గండి పొడిచి లోనికి వచ్చుచున్నారు. ఇల్లు కూలినట్లుగా నా మీద పడుచున్నారు.
15. భయములు నన్నావరించినవి. నా ధైర్యము గాలివలె ఎగిరిపోయినది. నా భద్రత మేఘము వలె తేలిపోయినది.
16. నా ప్రాణము అవసానదశకు వచ్చినది. నా బాధకు ఉపశమనము లేదు.
17. రేయి నా ఎముకలలో నొప్పి పుట్టుచున్నది. నన్ను తొలిచివేయు వేదనకు అంతమే లేదు.
18. ప్రభువు నా చొక్కాయి మెడపట్టి పట్టుకొని  నా బట్టలను చిందరవందర చేసెను.
19. ఆయన నన్ను బురదలోనికి పడద్రోసెను. నేను ధూళితో సమానమైతిని.
20. ప్రభూ! నేను ఆర్తనాదము చేయగా నీవు పలుకవు నేను ప్రార్థన చేయగా నీవు ఆలింపవు.
21. నీవు నా యెడల క్రూరముగా ప్రవర్తించుచున్నావు ద్వేషముబూని నన్ను ఘోరముగా హింసించుచున్నావు.
22. నేను గాలికి కొట్టుకొని పోవునట్లు చేయుచున్నావు పెనుగాలిలో అల్లాడి పోవునట్లు చేయుచున్నావు.
23. నేనును ఎల్లప్రాణులకు గమ్యస్థానమైన మృత్యువువాత పడవలెననికదా నీ కోరిక.
24. పేదలు న్యాయము కొరకు ఆక్రోశించినపుడు, నేను వారికి అపకారము తలపెట్టితినా?
25. బాధితులను చూచి నేను కన్నీరు కార్చలేదా? పేదలను చూచి కంటతడి పెట్టలేదా?
26. నాకు ఆనందము చేకూరుననుకొనగా శ్రమలెదురైనవి నేను వెలుగును కాంతుననుకొనగా చీకట్లు అలముకొనినవి.
27. నేను బాధలతో క్రుంగిపోవుచున్నాను, నాకు ఉపశాంతి లేదు. ప్రతిదినము వేదనలు అనుభవించుచున్నాను.
28. నేను దుఃఖించుచున్నా ఎవరును నన్ను ఓదార్చుటలేదు. సభలో నిలుచుండి సాయముకొరకు చేతులు చాచుచున్నాను.
29. నా ఆక్రందన నక్కల అరుపువలె విచారసూచకమైనది . ఎడారిలోని ఉష్ణపక్షి యేడ్పులవలె నావి ఏకాకి యేడ్పులైనవి.
30. నా చర్మము నల్లబడి, నా మీదనుండి ఊడిపోవుచున్నది. కాకతో నా ఎముకలు కాగిపోవుచున్నది.
31. నా వీణ శోకగీతములకు సంసిద్ధమైనది. నా పిల్లనగ్రోవి విలాపగీతములకు ఆయత్తమైనది

1. నేను కామదృష్టితో ఏ యువతిని వీక్షింపగూడదని, నా నయనములతో నేను నియమము చేసికొంటిని.

2. ప్రభువు మనకేమి బహుమతిని ఇచ్చును? మన కార్యములకు ఆయనేమి ప్రతిఫలము నొసగును?

3. దుర్మార్గులను నాశనముచేసి దుష్టులను కడగండ్లపాలు చేయుటయేగదా ఆయన పని!

4. నేను చేయు కార్యములన్నిటిని ప్రభువు చూచును. నేను వేయు అడుగులన్నిటిని ఆయన పరిశీలించును.

5. నేను అసత్యబాటలు తొక్కితినా? మోసమునకు ఒడిగట్టితినా?

6. ప్రభువు నన్ను నిర్దిష్టమైన తులాభారముతో తూచెనేని నేను నిర్దోషినని తేలిపోవును.

7. నేను ధర్మమార్గమునుండి వైదొలగితినేని, నా హృదయము చెడ్డను కోరుకొని యుండెనేని, నా చేతులు పాపకార్యములకు పాల్పడెనేని,

8. నేను వేసిన పైరులు నాశనమగుగాక! నేను పండించిన పంటను ఇతరులు అనుభవింతురుగాక!

9. నేను పొరుగువాని భార్యను ఆశించి, వాని గుమ్మము కడ పొంచియుంటినేని,

10. నా భార్య పరునికి కూడు వండి, వాని పడకమీద పండుకొనునుగాక!

11. నేను అట్టి హేయమైనపనికి పాల్పడియుంటినేని, అది మహాదుష్టకార్యమై నన్ను మరణశిక్షకు పాత్రునిచేసెడిది.

12. అది వినాశము తెచ్చి పెట్టు మహాగ్నియై నా పైరులన్నిటిని తగులబెట్టెడిది.

13. నా సేవకుడుగాని, సేవకురాలుగాని తమ గోడును విన్పించుకోగా, నేను వారి మొరను ఆలించితిని.

14. లేదని, నేను ప్రభువు ఎదుట ఎట్లు నిలువగలను? ప్రభువు నాకు న్యాయము తీర్చునపుడు నేను ఆయనకేమి జవాబు చెప్పగలను?

15. దేవుడు నన్ను పుట్టించినట్లే వారినికూడ పుట్టించెను. ఆయనే అందరిని మాతృగర్భమునుండి పుట్టించుచున్నాడు.

16. నేను పేదలను ఏనాడును అనాదరము చేయలేదు వితంతువును ఏనాడును కంటతడి పెట్టనీయలేదు

17. అనాథలకు పెట్టకుండ ఒంటిగా భుజింపలేదు.

18. అనాథలు చిన్ననాటినుండి నన్ను తండ్రివలె భావింపగా నేను వారిని ఎల్లవేళల ఆదరముతో చూచుచు వచ్చితిని.

19. పేదలు బట్టలులేక బాధపడుచుండగా, కప్పుకొనుటకేమియు లేక వేదన పడుచుండగా,

20. నా మందలనుండి తయారయిన ఉన్ని బట్టలను నేను వారికిచ్చెడివాడను. వారు నన్ను హృదయపూర్వకముగా దీవించెడివారు

21. న్యాయసభలో సభ్యులు నన్నే సమర్థింతురన్న ధీమాతో నేను తండ్రిలేని వారికి అపకారము చేసి యుంటినేని,

22. నా ముంజేతులు మోచేతి కడకు విరిగిపోవుగాక! నా భుజములు జారిపడునుగాక!

23. దేవుని శిక్షకు వెరచువాడను గనుక, నేనట్టి చెయిదమునకు పాల్పడి ఉండను.

24. నేను బంగారమును నమ్ముకోలేదు. మేలిమి బంగారముమీద ఆధారపడలేదు.

25. నా చేతులు కూడబెట్టిన మహాసంపదలుచూచి నేను ఏనాడును మురిసిపోలేదు.

26. దీప్తిమంతముగా మెరయు సూర్యబింబమును జూచిగాని, సుందరముగా వెలుగు చంద్రబింబమును గాంచిగాని

27. హృదయ ప్రలోభమునకు గురియై వాటికి నేను చేతులెత్తి దండము పెట్టలేదు.

28. అట్లు చేయుట క్షమింపరాని నేరము అది సర్వోన్నతుడైన ప్రభువును నిరాకరించు చెయిదము.

29. నా విరోధుల కడగండ్లు చూచి నేను సంతసింపలేదు. వారికి కీడు వాటిల్లగా పొంగిపోలేదు.

30. వారు చావవలెనని శాపవచనములు పలికి నా నాలుకతో పాపము మూటగట్టుకోలేదు.

31. నేను ఎల్లప్పుడు అతిథులకు ఆతిథ్యము ఇచ్చెడివాడనని 'నేను పెట్టిన భోజనము తిని తృప్తినొందని అతిథులు లేరు' అని వారికెల్లరికిని తెలియును.

32. వీధులలో రేయి విడిది చేయవలసిన అవసరము లేకుండ బాటసారులను ఏ ప్రొద్దు అయినను నా ఇంటికి ఆహ్వానించెడివాడను.

33. నేను ఇతరులవలె నా దోషములను కప్పి పెట్టుకోలేదు. నా పాపములను నా యెదలోనే పదిలముగా దాచుకోలేదు.

34. ఇతరులు ఏమనుకొందురో అని భయపడలేదు. జనుల అపవాదమునకు వెరచి మౌనము వహింపనులేదు. ఇల్లు కదలక ఉండనులేదు.

35. నా పలుకులు ఆలించువారెవరును లేరా? ఇదిగో నా చేవ్రాలు. ఇదిగో నా ప్రత్యర్థికి వ్రాయవలసిన ఫిర్యాదు పత్రము, ప్రభువు నాకు బదులు చెప్పును గాక!

36. నా ప్రత్యర్థి నా నేరములను వ్రాసి చూపెనేని, నేను నిశ్చయముగా వానిని నా భుజములకు కట్టుకొందును. తలపాగావలె నా శిరస్సునకు చుట్టుకొందును.

37. నేను చేసిన కార్యములెల్ల నా ప్రతిపక్ష వ్యక్తికి ఎరిగింతును. తన ఎదుట ధైర్యముతో తలయెత్తుకొని ఠీవితో నిత్తును.

38'. నేను ఇతరుల పొలమును ఆక్రమించుకోగా, ఆ పొలము నన్ను తిట్టిపోసి, కన్నీటితో తన నాగటి చాళ్ళను నింపుకొనెనేని,

39. ఆ పొలమున పండిన పంటను నేను అనుభవించి దానిని పండించిన రైతుల కడుపు కొట్టితినేని,

40. ఆ పొలమున నేడు గోధుమలకు మారుగా ముళ్లపొదలును, యవపైరుకు మారుగా కలుపు మొక్కలు ఎదుగునుగాక! (ఇంతటితో యోబు పలుకులు ముగిసినవి) 

1. యోబు తనదృష్టికి తాను నిర్దోషినని విశ్వ సించియున్నాడని ఆ ముగ్గురు మిత్రులు గ్రహించి, అతడికి జవాబు చెప్పక మౌనము వహించిరి.
2. కాని యోబు తన్ను తాను సమర్ధించుకొని దేవుని తప్పుపట్టుటను చూచి బరకేయేలు కుమారుడు ఎలీహు కోపముతో మండిపడెను. అతడు బూసీయుడును, రాము వంశమునకు చెందినవాడు.
3. అతడు ఆ ముగ్గురు మిత్రులమీదకూడ ఆగ్రహము చెందెను. వారు యోబునకు సమాధానము చెప్పజాలక దేవునిదే తప్పు అన్నట్లుగా మౌనము వహించిరికదా!
4. వారెల్లరు ఎలీహు కంటే పెద్దవారు కనుక వారు మాట్లాడునపుడు అతడు మాటలాడడయ్యెను.
5-6. కాని ఆ ముగ్గురు యోబుకు జవాబునీయకుండిరి. కనుక ఎలీహు కోపము తెచ్చుకొని ఇట్లు బదులు పలికెను: “నేను చిన్నవాడను, మీరు వయోవృద్ధులు అగుటచే మీ ఎదుట నా అభిప్రాయమును వెలిబుచ్చజంకితిని.
7. పెద్దవారలే మాట్లాడవలయును, వృద్దులే విజ్ఞానవాక్యములు పలుకవలయును అని నేను భావించితిని.
8. కాని మహోన్నతుని ఆత్మయే నరులలో నెలకొనియుండి, వారికి విజ్ఞాన మొసగునని నేనిపుడు గ్రహించితిని
9. వృద్ధులైనంత మాత్రముననే విజ్ఞానము అలవడదు ఏండ్లు చెల్లినంతనే వివేకమబ్బదు.
10. కనుక మీరిపుడు నా పలుకులు ఆలింపుడు. నా అభిప్రాయము శ్రద్ధగా వినుడు.
11. నేను మీ పలుకులను ఓపికగా వింటిని. మీరు పదములను వెదకుకొని మాటలాడుట గుర్తించితిని.
12. మీ మాటలను సావధానముగా వింటిని, మీరు యోబును ఖండింపలేదు. అతని మాటలకు జవాబీయలేదు.
13. ఇక మీకు విజ్ఞానము కలదని నమ్ముట ఎట్లు? ఈ కార్యము మీవలన కాలేదు గనుక దేవుడే యోబునకు బదులు చెప్పవలయును.
14. యోబు నాతో వాదింపలేదు. నేను మీ మాటలనుబట్టి అతనికి జవాబునివ్వను.
15. యోబూ! వీరు విస్మయముతో నోరెత్త జాలరైరి. వీరి నోటివెంట మాటలు పెకలవయ్యెను.
16. వీరు మౌనము వహించిరి కనుక నేను ఊరకుండవలయునా? అదిగో! వీరు నోటమాట లేక నిలుచుండిరి.
17. కనుక నేనిపుడు జవాబు చెప్పెదను. నా అభిప్రాయము తెలియజేసెదను.
18. నా తల భావములతో నిండియున్నది. నాలోనిఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది.
19. నేను మాటాడనేని క్రొత్త ద్రాక్షసారాయము పోయుటవలన ఒత్తిడికి గురియైన తిత్తివలె పిగిలి పోవుదునేమో.
20. మాటలాడిననే తప్ప నాకిపుడు ఉపశమనము లేదు. కనుక నా అభిప్రాయము వెల్లడింతును.
21. నాకెవరిపట్ల పక్షపాతము లేదు. నేనెవరిని పొగడువాడను కాను.
22. పొగడుటకు నాకు నేర్పు కూడ లేదు. ముఖస్తుతికి పూనుకొందునేని దేవుడు నన్ను శిక్షించును.
1. యోబూ! నీవు శ్రద్ధతో నా పలుకులు ఆలింపుము. నా అభిప్రాయములను సాంతముగా వినుము.
2. నేను నోరువిప్పి నా మనసులోని భావములు, వెలిబుచ్చుటకు సంసిద్ధముగా ఉన్నాను.
3. నేను చిత్తశుద్ధితో మాట్లాడెదను. సత్యవాక్యములనే పలికెదను.
4. మహోన్నతుని ఆత్మ నన్ను సృజించినది. నాకు ప్రాణమొసగినది ఆ ఆత్మయే.
5. నీకు చేతనైనచో నా పలుకులను ఖండింపుము. నీ వాదములు సిద్ధము చేసికొనుము.
6. నీవును నేనును దేవుని యెదుట సరిసమానమే. మనమిరువురము ఒక్క మట్టినుండియే పుట్టితిమి.
7. కనుక నీవు నన్ను చూచి భయపడనక్కరలేదు. నేను వంచనతో నిన్ను ఓడించువాడను కాను.
8. నీ మాటలు నేను వింటిని. నీ పలుకులు నా చెవినబడినవి.
9. 'నేనెట్టి పాపము ఎరుగని నిరపరాధిని. నిర్మలమైన జీవితము గడపు నిర్దోషిని.
10. అయినను దేవుడు నా మీద తప్పులు మోపి నన్ను తన శత్రువుగా భావించుచున్నాడు.
11. నా పాదములను గుదిబండతో బంధించి, నా చేతలన్నిటిని జాగ్రత్తగా గమనించుచున్నాడు' అని నీవంటివి.
12. నా మాటలు వినుము. నీవిట్లు పలుకుట తప్పు. దేవుడు నరుని కంటె గొప్పవాడు.
13. దేవుడు నీ ఫిర్యాదులకు జవాబు చెప్పలేదని నీవు ఆయనమీద తప్పు మోపుదువా?
14. ప్రభువు నరులతో మాటిమాటికి మాట్లాడుచునే యుండును. కాని ఆయన పలుకులనెవడు విన్పించుకోడు.
15. రాత్రిలో నరుడు పడకమీద పరుండి నిద్రించునపుడు కలలు, దర్శనముల ద్వారా దేవుడు మాట్లాడును.
16. అవును, దేవుడు తన హెచ్చరికలను విన్పించును. ఆయన మందలింపు లాలించి నరులు భయపడుదురు.
17. నరులను పాపమునుండి వారించుటకును వారి పొగరు అణచుటకును దేవుడు వారితో సంభాషించును.
18. చావు వాతబడి మృతలోకము చేరుకొనుటయను దుస్థితి నుండి నరుని కాపాడవలెననియే అతని కోరిక.
19. దేవుడు నరుని వ్యాధిపాలు గావించి, అతని శరీరమును బాధతో నింపి అతనికి బుద్ధిచెప్పును.
20. రోగికి ఆకలిచెడును. మధురాహారముగూడ రుచింపదు.
21. అతని శరీరము కృశింపగా ఎముకల గూడు బయటపడును.
22. అతడు మృతలోకము చేరుటకు సంసిద్ధుడగును.
23. అప్పుడు నరులకు వారి బాధ్యతలను జ్ఞప్తికి తెచ్చు వేలాది దేవదూతలలో ఒకడు మధ్యవర్తిగా విచ్చేసి ఆ రోగిచెంత జేరి అతనికి సహాయపడును.
24. ఆ దేవదూత రోగిపై జాలిబూని  “ఇతనిని శిక్షనుండి విడిపింపుము. మృతలోక యాత్రనుండి ఇతనిని తప్పింపుము. ఇతనిని విడిపించుటకు వలసిన ప్రాయశ్చిత్తము నాయొద్ద ఉన్నది” అని ప్రభువునకు మనవి చేయును.
25. అప్పుడు ఆ రోగి మరల యవ్వన ప్రాభవమును బడసి యువకునివలె దృఢగాత్రుడగును.
26. అప్పుడు దేవుని ప్రార్థింపగా ప్రభువతని మొరవినెను. సంతోషముతో దేవుని సేవింపగా ప్రభువు అతనికి అభ్యుదయము దయచేసెను.
27. ఆ రోగి 'నేను ధర్మమును విడనాడి పాపము చేసితిని అయినను ప్రభువు నన్ను మన్నించి వదలివేసెను.
28. దేవుడు నన్ను మృతలోకము నుండి తప్పించెను గనుక నేనింకను బ్రతికి బట్టకట్టి తిరుగుచున్నాడను' అని బహిరంగముగా చాటిచెప్పుకొనును.
29. నరునికిట్టి ఉపకారమును దేవుడు మాటిమాటికి చేయును.
30. ప్రభువు నరుని చావునుండి తప్పించి తన జీవనజ్యోతిని అతనిపై ప్రకాశింపజేయును.
31. యోబూ! నా పలుకులను సావధానముగా వినుము.  మధ్యలో నాకు అడ్డురాక జాగ్రత్తగా ఆలింపుము.
32. కాని నీవేమైన చెప్పదలచుకొన్నచో చెప్పుము. నిన్ను నిరపరాధిగా గణించుటకు నేను సిద్ధముగనే యున్నాను.
33. కాని అట్టిదేదియు లేనిచో మౌనముగా నా మాటలు వినుము. నేను నీకు విజ్ఞానము బోధింతును.
1. ఎలీహు తన సంభాషణనిట్లు కొనసాగించెను:
2. “అయ్యలారా! విజ్ఞానవేత్తలు వివేకవంతులైన మీరు నా పలుకులు ఆలింపుడు.
3. నాలుక భోజనరుచులను ఎరిగినట్లే, శ్రవణము విజ్ఞాన వాక్యములను ఎరుగును.
4. కనుక మనమిప్పుడు న్యాయమేదియో పరిశీలింతము. మంచి యేదియో నిర్ణయింతము.
5. యోబు 'నేను నిర్దోషినైనను, దేవుడు నాకు న్యాయము జరిగించుట లేదాయెను.
6. నేను నీతిమంతుడనైనను అబద్దీకునిగా నెంచబడితిని. తప్పుచేయకున్నను దెబ్బలు తినవలసి వచ్చినది' అని మొరపెట్టుచున్నాడు.
7. ఈ యోబు వంటి వానిని మీరెందైన కంటిరా? అతనికి దేవునిపట్ల భయభక్తులు లేవు.
8. దుష్టులతో కలిసి తిరుగుచున్నాడు. దుర్మార్గులతో చేతులు కలుపుచున్నాడు.
9. 'దేవుని చిత్తమును పాటించుట వలన నరుని కెట్టి లాభము లేదు' అని వాదించుచున్నాడు.
10. విజ్ఞాన నిధులైన మీరు నా పలుకులు ఆలింపుడు ప్రభువు అన్యాయమునకు పాల్పడువాడు కాదు.
11. అతడు నరుల కార్యములకు తగిన బహుమతినిచ్చును. ఎవరికి తగినట్లుగా వారిని సంభావించును.
12. ప్రభువు అక్రమమునకు ఒడిగట్టడు, న్యాయమును చెరుపడు.
13. దేవునికెవడైన ఈ లోకముమీద పెత్తనమిచ్చెనా? జగత్తునెవడైన ఆయన ఆధీనమున ఉంచెనా?
14. ఆయన ప్రాణులకొసగిన ఊపిరిని తీసికొనెనేని, తానిచ్చిన ప్రాణములు తాను మరల చేకొనెనేని
15. జీవులన్నియు నశించును. నరుడు మట్టిలో కలిసిపోవును.
16. మీరు విజ్ఞానవేత్తలగుదురేని నా పలుకులు ఆలింపుడు.
17. న్యాయమూర్తియైన దేవుని మీరు ఖండింపగలరా? ఆయన న్యాయమును లెక్కచేయనివాడా?
18. ఎవడేని రాజుతో 'నీవు నిష్ప్రయోజకుడవు' అని చెప్పునా? పాలకులతో “మీరు దుర్మార్గులు' అని పలుకునా?
19. దేవుడు అధిపతుల కోపు తీసికొనడు. దరిద్రులకంటె ధనికులనెక్కువగా ఆదరింపడు. అందరిని కలిగించినవాడు ఆయనే కదా?
20. దేవుడు శిక్షింపగా నరులు అకస్మాత్తుగా చత్తురు. గొప్పవారు కూడ రేయి ప్రాణములు విడతురు. నిరంకుశుడైన పాలకుడుకూడ గతించును.
21. ప్రభువు కళ్ళు నరుల పోకడలనెల్ల గమనించును. వారి చర్యలనెల్ల గుర్తించును.
22. గాఢాంధకారముకూడ దేవుని కంటబడకుండ దుర్మార్గులను దాచియుంచలేదు.
23. నరుని తన చెంతకు పిలిపించి తీర్పు చెప్పుటకు, ఆయన ప్రత్యేకమైన కాలమేమియు నియమింపడు
24. ఆయన విచారణ జరిపింపకయే నాయకులను పదవినుండి తొలగించును. కొత్తవారికి ఆ పదవిని అప్పగించును.
25. ఆ నాయకుల చెయిదములు ఆయనకు తెలియును గనుక వారిని రాత్రికాలమున కూలద్రోసి నాశనము చేయును.
26. దేవుడు దుర్మార్గులను శిక్షించును. ఆ శిక్ష యెల్లరికి తెలియునట్లు చేయును.
27. వారు ప్రభువుకు లొంగరైరి కనుకను, ఆయన ఆజ్ఞలను పాటింపరైరి కనుకను,
28. పేదల మొఱ్ఱను ఆయనయొద్దకు వచ్చునట్లు చేసిరి దీనుల మొఱ్ఱను ఆయనకు వినబడునట్లు చేసిరి.
29. దేవుడు మౌనముగానున్నచో ఆయనను ఖండించగల వారెవరు? తన మొగమును దాచుకొన్నచో ఆయనను చూడగల వాడెవడు? అది దేశమైనను లేదా నరుడైనను కావచ్చు!
30. దుష్టులు పరిపాలింపకుండునట్లు వారు ప్రజలను పీడింపకుండునట్లు, బలవంతులను ఆయన నాశనము చేయును.
31. ఎవడేని దేవునితో 'నా అపరాధములు ఒప్పుకొంటిని, శిక్షనొందితిని, ఇట్టి తప్పులను మరల చేయనని బాసచేసితిని,
32. నా దోషములను తెలియజేయుమని అర్ధించుచుంటిని, ఇక మీద ఇట్టి దుష్కార్యములు చేయనని మాట ఇచ్చుచుంటిని' అని పలుకగలడా?
33. నీవేమో దేవుని చెయిదములను విమర్శించుచున్నావు. ఆయన నీవు చెప్పినట్లు చేయవలయునా ఏమి?
34. యోబు పలుకులలో విజ్ఞానము లేదనియు, ఆయన మాటలకు అర్థము పర్గము లేదనియు,
35. తెలివిగలవాడెవడైన అంగీకరించును. నా పలుకులు వినువాడెవడైనను ఒప్పుకొనును.
36. మీరు యోబు వాక్యములను పరిశీలించి చూడుడు అతడు దుర్మార్గునివలె మాటలాడుచున్నాడు.
37. పాపము చేసినది చాలక తిరుగుబాటును చేయుచున్నాడు. మన అందరి యెదుట పెద్దగొంతుచేసికొని చప్పట్లు కొట్టుచు దేవుని అవహేళన చేయుచున్నాడు”.
1. ఎలీహు తన సంభాషణను ఇట్లు కొనసాగించెను:
2. “యోబూ! నీవు దేవుని యెదుట నేను నిర్దోషినని వాదించుట సబబా?
3. నా పాపముల వలన దేవునికి ఏమి కీడు కలిగినది? నేను పాపమును విసర్జించుట వలన నాకేమి లాభము కలిగినది?” అని నీవు ప్రశ్నించుట తప్పుకాదా?
4. నీకును నీ మిత్రులకును గూడ , నేను జవాబు చెప్పెదను.
5. నీవు ఆకాశము వైపు చూడుము. మేఘములెంత యెత్తుగానున్నవో పరిశీలింపుము
6. నీవు పాపము చేసినచో దేవునికి కీడు కలుగదు. చాలమారులు తప్పులు చేసినా ఆయనకు హాని కలుగదు.
7. నీవు ధర్మాత్ముడవైనచో దేవునికేమి లాభము కలుగదు ఆయనకు నీతో నేమియు అక్కరలేదు.
8. నీ పాపకార్యములకు బాధచెందునదియు, నీ పుణ్యకార్యముల వలన లాభము పొందునదియు తోడినరులే. 
9. పరపీడననకు గురియైన నరులు అంగలార్చుచు మమ్ము కాపాడుడని ఎవరెవరినో అర్ధింతురు.
10. ఎవ్వడుకాని రాత్రివేళ కీర్తనలు గావింప ప్రేరేపించుచు, భూమిమీది జంతువులకంటె అధికముగా నేర్పించుచు,
11. ఆకాశపక్షులకంటె ఎక్కువగా విజ్ఞానము నందించుచు నన్ను సృజించిన దేవుడెక్కడున్నాడు' అని అడుగనేల? ,
12. వారు దుర్మార్గులు, అహంకారులు గనుక వారు మొర పెట్టినను దేవుడు వారి మొరనాలకింపడు.
13. కనుక వారు మొర పెట్టి లాభము లేదు. మహోన్నతుడు వారి గోడు విన్పించుకోడు.
14. యోబూ! దేవుడు నిన్ను గుర్తించుటలేదని నీ బాధ కాని ఓపికపట్టుము, నీ అభియోగమును అతడెరుగును
15. ప్రభువు నరులను శిక్షింపడనియు నరుల పాపములను లెక్కలోనికి తీసికొనడనియు నీ తలంపు.
16. కాని ఇట్టి పలుకుల వలన లాభము లేదు. నీవు విషయమును అర్థము చేసికొనకయే మాట్లాడుచున్నావు."
1. ఎలీహు తన సంభాషణనిట్లు కొనసాగించెను:
2. “నీవు నా పలుకులను ఓపికతో ఆలకింపుము. దేవునిపక్షమున నేనింకను మాట్లాడవలసిఉన్నది.
3. నన్ను సృజించిన దేవుడు న్యాయము తప్పడని నిరూపించుటకు బహువిస్తృతమైన, నా జ్ఞానమునుండి వాదములు చూపుదును.
4. నా వాదములలో తప్పులేమి ఉండబోవు. నీతో మాట్లాడునది విజ్ఞానవేత్తయని ఎరుగుము.
5. దేవుడు బలాఢ్యుడు, ఎవరిని చిన్నచూపు చూడనివాడు. ఆయనకు అన్ని విషయములు తెలియును.
6. ఆయన పాపులను దీర్ఘకాలము మననీయడు. పేదలకెల్లపుడు న్యాయము జరిగించును.
7. ధర్మాత్ములను కాచి కాపాడును. రాజులను సింహాసనమెక్కించును, ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును. వారు ఘనపరపబడుదురు.
8. కాని వారు గొలుసులతో బంధింపబడి బందీలుగా బాధపడుచుండిన
9. ఆ రాజులు చేసిన దుష్కార్యములను వారి అహంకారపు పోకడలను దేవుడు , వారికి జ్ఞప్తికి తెచ్చును.
10. వారు తన హెచ్చరికలను ఆలకించి పాపము నుండి వైదొలగునట్లు చేయును.
11. ఆ రాజులు దేవునిమాట విందురేని సంతోషముతోను, సిరిసంపదలతోను జీవించుదురు.
12. వారు ఆలకింపనియెడల బాణములచేత కూలినశించెదరు. జ్ఞానములేక చనిపోయెదరు.
13. దుర్మార్గులు దేవునిమీది కోపముతోనే కాలము వెళ్ళబుచ్చుదురు. ప్రభువు తమను శిక్షించినా వారు ఆయన సాయమును అర్ధింపరు.
14. అవమానముతో కూడిన జీవితమును భరింపజాలక చిన్నవయస్సుననే కన్ను మూయుదురు.
15. ఆయన శ్రమలద్వారా నరులకు పాఠములు నేర్పును. బాధలద్వారా వారి కన్నులు తెరిపించును.
16. పూర్వము దేవుడు నిన్ను ఇక్కట్టులనుండి గట్టెక్కించి సురక్షితముగా కాచి కాపాడెను. నీకు సమృద్ధిగా భోజనము దయచేసెను.
17. దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది. తీర్పు, న్యాయము నిన్ను చుట్టుముట్టును.
18. ఇకమీదట సంపదలను ఆశించి అపమార్గము తొక్కకుము. లంచములకు భ్రమసి మోసపోకుము.
19. నీ సంపదలు నీకు ఉపయోగపడవు. నీ అధికారము నిన్ను రక్షింపజాలదు.
20. రాత్రివేళ రాజ్యములే మటుమాయమైనచో నీవేమీ ఆశ్చర్యపడనక్కరలేదు.
21. నీవు దుష్కార్యములనుండి వైదొలగుము. చెడునడతయే నీ ఈ బాధలకు కారణమని ఎరుగుము.
22. దేవుని శక్తి గొప్పది. ఆయనవంటి బోధకుడు ఎవడును లేడు.
23. 'నీవిట్టి కార్యము చేయుము' అని ఆ ప్రభువునకు ఉపదేశము చేయువాడెవడు లేడు. ఆయన పనులను తప్పు పట్టువాడెవడును లేడు.
24. ప్రభువు చేసిన కార్యములకుగాను ఎల్లరు ఆయనను కొనియాడిరి కనుక నీవు ఆయనను సన్నుతింపుము.
25. ఆయన కార్యముల నెల్లరును వీక్షించిరి. దూరమునుండి మాత్రమే మన మీ కార్యములు చూడగలము.
26. దేవుని మహత్త్వమును మనము అర్థము చేసికోజాలము. అతనికెన్ని యేండ్లున్నవో గణించి చెప్పజాలము.
27. ప్రభువు నేలమీదినుండి నీటిని చేకొని దానిని వానబొట్టులుగా మార్చివేయును.
28. మబ్బులలోనుండి నీటిని కురియించి, నరులందరికి వర్షమును దయచేయును.
29. ఆకాశమున మబ్బులెట్లు తిరుగాడునో అంతరిక్షమున ప్రభువు నివాసము చుట్టు ఉరుములెట్లు గర్జించునో ఎవరికి తెలియును?
30. అతడు ఆకాశమును మెరుపులతో నింపును.  అగాధ సముద్రమునెట్లు కప్పివేయునో చూడుడు.
31. వీటి ద్వారా ఆ ప్రభువు ఆహారమును సమృద్ధిగా దయచేసి నరులకు తీర్పు ఇచ్చును.
32. మెరుపులను గుప్పిట పట్టుకొని అవి తాము చేరవలసిన గమ్యమును చేరునట్లు చేయును.
33. ఉరుములు రాబోవు ఆయన రాకడను తెలియజేయును. పశువులుకూడ ఆ రాకడను ముందుగనే గుర్తించును.

1. ఆ ఉరుములు గర్జన రాగానే నా గుండె వేగముగా కొట్టుకొని గడగడ లాడుచున్నది.

2. మీరెల్లరు ప్రభువు స్వరము వినుడు. ఆయన నోటినుండి వెలువడు గర్జనమును ఆలకింపుడు.

3. ఆయన ఆకాశమునుండి మెరుపులు పంపును. అవి నేలకొనల వరకు ప్రసరించును.

4. అటు తరువాత ఆయన స్వరము విన్పించును. అది ఉరుముల భీకరధ్వానము. మెరుపులు మాత్రము నిరతము మిరుమిట్లు గొలుపుచునే ఉండును.

5. ప్రభువాజ్ఞ ఈయగా అద్భుతకార్యములు జరుగును ఆయన మహాకార్యములను మనము అర్థము చేసికోజాలము.

6. ఆయన ఆజ్ఞాపింపగా నేలమీద మంచుపడును. వర్షము కురిసి భూమి జలమయమగును.

7. ఆయన నరుల కార్యములను స్తంభింపజేసి వారు తన శక్తిని గుర్తించునట్లు చేయును.

8. వన్యమృగములు పొదలలో దూరి, గుహలలో దాగుకొనును.

9. తుఫాను గాలులు దక్షిణమునుండి వచ్చును. చలిగాలులు ఉత్తరమునుండి వచ్చును.

10. దేవుడు తన ఊపిరి నూదగా నీళ్ళు చల్లనై మంచుగా మారిపోవును.

11. ఆయనే మబ్బులను నీటితో నింపును. వాని నుండి మెరుపులు మెరయును.

12. ఆయనే స్వయముగా ఆ మబ్బులను నడిపింపగా అవి ఎల్లయెడల తిరుగాడును. నేల నాలుగుచెరగుల సంచరించును. అవి ఆయన ఆజ్ఞను ఖండితముగా పాటించును.

13. నేలమీది నరులను శిక్షించుటకుగాను కరుణించుటకుగాను ఆయన మబ్బులను పంపును

14. యోబూ! ఒక్క క్షణము ఈ సంగతులెల్ల ఆలోచింపుము. ప్రభువు అద్భుతకార్యములను పరిశీలించి చూడుము.

15. దేవుడు ఆజ్ఞ ఈయగా మబ్బులలో నుండి మెరపులెట్లు మెరయునో నీకు తెలియునా?

16. దేవుని అద్భుతకౌశలము వలన మేఘములు ఆకాశమున ఎట్లు తేలియాడునో నీ వెరుగుదువా?

17. దక్షిణపు గాలి తోలి, నేల అట్టుడికినట్లు ఉడికిపోవునపుడు, నీ బట్టలు వేడియైనది నీకు తెలియదా?

18. దేవుడు ఆకాశమును విప్పారజేసి దానిని లోహపు దర్పణమువలె కఠినము గావించెనుగదా! మరి ఆ క్రియలో నీవు ఆయనకు సహాయపడగలవా?

19. దేవునికేమి చెప్పవలెనో నీవే తెల్పుము. మాకు ఆలోచనలు తట్టుటలేదు, మా నోట మాటలు రావు.

20. నేను మాటాడుదునని ఆయనతో ఎవడైన చెప్పునా? ఒకడు తాను నిర్మూలము కావలెనని కోరుకొనునా?

21. కొన్నిసారులు కారుమబ్బులడ్డుపడుటచే ఆకాశమునుండి వెలుగు ప్రసరింపదు. కాని ఇప్పుడు గాలివీచి మేఘములను తోలివేసినది ఆకాశము కాంతితో తళతళలాడుచున్నది.

22. ఉత్తరమున సువర్ణచ్ఛాయ వెలుగొందుచున్నది. దేవుని తేజస్సు మనలను భయభ్రాంతులను చేయుచున్నది.

23. మనము అగోచరుడైన ప్రభువును సమీపింపజాలము. ఆయన మహాశక్తిమంతుడు, ధర్మమూర్తి నీతినతిక్రమింపడు. నరులను న్యాయముతో చూచువాడు.

24. కావున ఎల్లరును ఆయనను చూచి గడగడలాడుదురు మేము జ్ఞానులమనుకొను వారిని ఆయన లెక్కచేయడు

1. అటుపిమ్మట యావేదేవుడు సుడిగాలిలోనుండి యోబుతో ఇట్లు పలికెను:
2. జ్ఞానహీనమైన పలుకులతో ఆలోచనను చెరపుచున్న వీడెవడు?
3. నీవిపుడు ధైర్యముతో నిలిచి నా ప్రశ్నలకు జవాబు చెప్పుము.
4. నేను ఈ భూమికి పునాదులెత్తినపుడు నీవు ఉంటివా? నీకంతటి విజ్ఞానమున్నచో నాకు జవాబుచెప్పుము
5. ఈ భూమి వైశాల్యమును నిర్ణయించినదెవరో, దానిని కొలచినదెవరో నీ వెరుగుదువా?
6. నేలను మోయు స్తంభములు దేనిమీద నిల్చునో, ఈ నేలకు పునాది వేసినదెవరో నీకేమైన తెలియునా?
7. ఆనాటి వేకువ చుక్కలు గుమిగూడి పాటలు పాడెను దేవదూతలు సంతోషముతో గానముచేసిరి.
8. భూగర్భము నుండి సముద్రము ఉద్భవించినపుడు దానిని కవాటములతో బంధించి ఉంచినదెవరు?
9. సాగరము మీద మేఘములనుకప్పి దానిని పొగమంచుతో నింపినది నేనుకాదా?
10. కడలికి ఎల్లలు నిర్ణయించి, అది నేను గీసిన గిరిదాటకుండునట్లు చేసితిని.
11. 'నీవింతవరకు మాత్రమే పొంగి పారవచ్చును. నీ బలమైన కెరటములిచ్చట ఆగిపోవలయును'. అని నేను కడలికి కట్టడచేసితిని.
12. యోబూ! నీ వెన్నడైనను దినమును ఆజ్ఞాపించి అది వేకువను కొనివచ్చునట్లు చేయగలిగితివా?
13. ఉదయము క్రమముగా భూమిని ఆక్రమించుకొని దుర్మార్గులను తమ స్థావరములనుండి వెళ్ళగొట్టునట్లుగా ఆజ్ఞలీయగలిగితివా?
14. ఉదయము వెలుగొందగా మిట్టపల్లములు బట్టలలోని మడతలవలె, మట్టిమీద వేసిన ముద్రవలె స్పష్టముగా కన్పించును.
15. వేకువ వెలుగు దుష్టుల పొగరణచి వారి దౌర్జన్యములను తుదముట్టించును.
16. నీవు సముద్రముల జన్మస్థలమును కాంచితివా? సాగరముల గర్భమున సంచరించితివా?
17. మృతలోక ద్వారములను వీక్షించితివా? ఆ తమోలోక ద్వారమును కనుగొంటివా?
18. ఈ లోకమెంత విశాలమైనదో నీకు తెలియునా? తెలియునేని నాకు జవాబు చెప్పుము.
19. తేజస్సు నివాసమెక్కడున్నది? తమస్సు గృహమెక్కడున్నది?
20. నీవు ఆ చీకటి వెలుగులను వాని గమ్యస్థానమునకు పంపగలవా? మరల వానిని పూర్వస్థానములకు కొనిరాగలవా?
21. ఈ కార్యములెల్ల చేయగలుగుదువేని, నీవు ఆ ప్రకృతిశక్తులు పుట్టినప్పుడే పుట్టి ఉందువు ఇప్పుడు చాల వయోవృద్ధుడవై ఉందువుకూడ.
22. నేను మంచును ఏ కొట్టులో దాచిఉంతునో, వడగండ్లను ఏ తావున భద్రపరతునో నీ వెన్నడైన చూచితివా?
23. కష్టదినములందును, యుద్ధకాలమునందును వినియోగించుటకు నేను వానిని అట్టిపెట్టి ఉంచుదును.
24. సూర్యుడెచటినుండి బయలుదేరునో తూర్పు వడగాలులు ఎచటినుండి పుట్టునో నీవెరుగుదువా?
25. పెనువానలకు మార్గములు కల్పించినదెవరు? పిడుగులకు త్రోవలు సిద్ధము చేసినదెవరు?
26. జనసంచారము లేని మరుభూములలోకూడ వర్షములు కురిపించునదెవరు?
27. ఎండి బీటలువారిన నేలలను నీటిచుక్కలతో తడిపి గ్రాసము ఎదిగించునదెవరు?
28. వానకు తండ్రి కలడా? పొగమంచుకు జనకుడు కలడా?
29. మంచునకు తల్లి కలదా? నేలపై పేరుకొనునూగుమంచునకు జనని కలదా?
30. ఆ మంచు వలన జలములు రాయివలె గట్టిపడును. అగాధజలము గడ్డకట్టుకొని పోవును.
31. నీవు కృత్తికా నక్షత్రములను , దండగా కూర్చగలవా? మృగశిర తారలను విభజించి వేరుపరపగలవా?
32. నక్షత్రరాశులను వాటివాటి సమయమునకు తగినట్లుగా నడిపింపగలవా? నక్షత్రమండలములకును, వారి ఉపనక్షత్రములకును దారి చూపగలవా?
33. ఆకాశమందలి నియమములను నీవెరుగుదువా? ఆ సూత్రములను భూమికిగూడ వర్తింపజేయగలవా?
34. నీవు మేఘముల నాజ్ఞాపింపగలవా? వానిచే కుండపోతగా వానలు కురియింపగలవా?
35. మెరపులను ఆజ్ఞాపింపగలవా? అవి నీ కట్టడలను పాటించునా?
36. అంతర్యింద్రియములలో జ్ఞానముంచిన వాడు ఎవడు? హృదయమునకు తెలివినొసగినదెవరు? శకున పక్షికి విజ్ఞానమిచ్చినదెవరు కోడిపుంజునకు తెలివినొసగినదెవరు?
37. ఆకాశములోని మేఘములను లెక్కించి వానిచే వానలు కురియించునదెవరు?
38. ఆ వానలు ఈ భూమిమీది ధూళిని గట్టి ముద్దగాజేసి మట్టిపెళ్ళలు గట్టిపడునట్లు చేయునుగదా!
39-40.గుహలలో దాగుకొని పొదలలో పొంచి ఉండెడి సింహములకు నీవు ఎరను చేకూర్చి పెట్టగలవా? సింగపు కొదములకు ఆహారము సంపాదించి పెట్టగలవా?
41. ఆకలితో తిరుగాడు కాకులను కలు పోషించునదెవరు? ఆ కాకుల పిల్లలు ఆకలిగొని నాకు మొరపెట్టగా వానికి తిండి పెట్టునదెవరు?
1. కొండమేకలు ఎప్పుడు పిల్లలను ఈనునో నీ వెరుగుదువా? అడవి జంతువులు పిల్లలను పెట్టుట నీవు చూచితివా?
2. అవి ఎన్ని మాసములు చూలు మోయునో ఎప్పుడు పిల్లలను పెట్టునోనీకేమైనా తెలియునా?
3. ఆ జంతువులు నేలకు మోకాళ్ళూని పిల్లలను ఈను వివరము నీకేమైన తెలియునా?
4. ఆ పిల్లలు అడవిలో పెరిగి పెద్దవగును. అవి తమ తల్లుల దగ్గరికి మరల తిరిగిరావు.
5. అడవి గాడిదలకు స్వేచ్ఛ నొసగి అవి యథేచ్చగా తిరుగునట్లు చేసినదెవరు?
6. నేను వానికి ఎడారిని నివాసభూమిగా చేసితిని. చవిటి నేలను వాసస్థలముగా నియమించితిని.
7. అవి రణగొణధ్వనిచేయు నగరముల చెంతకురావు నరులకు లొంగి పనిచేయవు కూడ.
8. ఆ మృగములు కొండలలో మేయును. అచట పచ్చని మొక్కల కొరకు గాలించును.
9. మనుబోతు నీకు పనిచేయునా? అది రేయి నీ కొట్టమున నిల్చునా?
10. నీవు దాని మెడకు త్రాడుగట్టి దానిచే పొలము దున్నింపగలవా?
11. అది మహాబలముగల జంతువైనను దానిచే చాకిరి చేయించుకోగలవా?
12. అది నీ పొలమున పండిన పంటను, నీ కళ్ళమున తొక్కించిన ధాన్యమును మోసికొని వచ్చునా?
13. నిప్పుకోడి రెక్కలు రెపరెప కొట్టుకొనిన అది బెగ్గురు పక్షివలె ఎగురజాలదుగదా?
14. అది నేలమీదనే గ్రుడ్లను వదలివేయగా భూమిలోని ఉష్ణమే వానిని పొదుగును.
15. ఏ ప్రాణి పాదమైన ఆ గ్రుడ్లను తొక్కివేయుననిగాని, ఏ వన్యమృగమైన వానిని నలగదొక్కునని గాని ఆ పక్షికి తెలియదు.
16. అది ఆ గ్రుడ్లు తనవి కావు అన్నట్లు క్రూరముగా ప్రవర్తించును. తన శ్రమ వ్యర్థమగుచున్నదే అనియు విచారింపదు
17. నేనా పక్షికి విజ్ఞానము నీయనైతిని. దానిని తెలివితక్కువ దానినిగా సృజించితిని.
18. కాని ఆ నిప్పుకోడి పరుగెత్తుటకు పూనుకొనినచో గుఱ్ఱమును దాని రౌతులనుగూడ పరిహసించును
19. గుఱ్ఱములకు మహాబలమునొసగి వాని మెడలమీద పొడుగాటి జూలును నిల్పినది నీవేనా?
20. అవి మిడుతలవలె ఎగిరి తమ సకిలింపులతో నరులను భయపెట్టునట్లు చేసినది నీవేనా?
21. అవి ఉత్సాహముతో లోయలగుండ కాలు దువ్వుచు పోవును. బలముతో యుద్ధరంగమున ఎగిరి దూకును.
22. గుఱ్ఱములు భయమును పరిహాసము చేయును. అవి కత్తినిచూచి వెనుకకు మరలవు.
23. రౌతులు వానిమీద మోసికొనిపోవు బల్లెములు, ఈటెలు తళతళ మెరయుచు, ఒకదానితో నొకటి ఒరసి కొనుచుండగా
24. అవి ఉద్రేకముతో పొంగిపోవుచు, యోజనములు నడచును. భేరీనాదము విన్పించినచో ఇక అవి మనమాట వినవు.
25. బాకానాదము వినినపుడెల్ల అవి సకిలించి దూరమునుండే పోరును పసికట్టును. సైన్యాధిపతుల ఆర్భాటమును ఆలించును.
26. రెక్కలు విప్పి దక్షిణ దిక్కుగా ఎగురు డేగకు ఆకాశగమనమును నేర్పినది నీవేనా?
27. గండభేరుండము పర్వతశిఖరములలో గూడు కట్టుకొనునది నీ ఆజ్ఞను బట్టియేనా?
28. అది శిఖరాగ్రములపై గూడు కట్టుకొనును. మొనలుదేరిన కొండకొమ్ములపై నివాసము చేయును
29. అచటినుండి అది యెరకొరకు పరికించి చూచును. దాని దృష్టి చాల దూరము వరకు ప్రసరించును.
30. అది శవములపై వాలును, తన పిల్లలను నెత్తుటితో పోషించును.”
1. యావే దేవుడు యోబుతో మరియు ఇట్లనెను:
2. “ఆక్షేపణలు చేయుజూచువాడు సర్వశక్తిమంతుడగు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇపుడు ప్రత్యుత్తరమీయవలయును.”
3. అంతట యోబు ప్రభువుతో ఇట్లనెను:
4. “చిత్తగించుము, నేను నీచుడను, నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చెదను? నా నోటిమీద నా చేతిని ఉంచుకొందును.
5. నేనొకసారి మాటాడితిని మరల మాట్లాడను. ఒక్కసారి కంటే అధికముగా సంభాషింపను.”
6. ప్రభువు సుడిగాలిలో నుండి యోబుతో ఇట్లు పలికెను
7. “ఓయి! నీవు ధైర్యముతో నిలిచి నా ప్రశ్నలకు జవాబు చెప్పుము.
8. నేను న్యాయము పాటింపలేదని నీవు రుజువు చేయుదువా? నాది తప్పని, నీది ఒప్పని నిరూపింతువా?
9. నీవు నాయంతటి బలాఢ్యుడవా? నీ వాక్కు నా వాక్కువలె గర్జింపగలదా?
10. అట్లయినచో గౌరవప్రతిష్ఠలతో నిలువుము. నీ వైభవప్రాభవములను చూపింపుము.
11. నీ కోపమును ప్రజ్వలింపజేసి, గర్వాత్ములను మన్ను గరపింపుము.
12. వీక్షణ మాత్రమున వారి పొగరు అణగింపుము. దుష్టులను ఉన్నవారినున్నట్లు నాశనము చేయుము
13. ఆ దుర్మార్గులనందరిని నేలలో పాతి పెట్టుము వారినెల్లరిని మృతలోకమున బంధించియుంచుము
14. నీ దక్షిణహస్తమే నిన్ను రక్షించినదని, నీవే స్వయముగా విజయము సాధించితివని నేను ఒప్పుకొందును.
15. నీటి గుఱ్ఱమును అవలోకింపుము. అది ఎద్దువలె గడ్డిమేయును.
16. దాని శక్తి దాని నడుములో ఉన్నది. దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది.
17. దాని తోక దేవదారు కొయ్యవలె బిరుసుగా నుండును దాని తొడలనరములు దిట్టముగా సంధింపబడి యున్నవి.
18. దాని ఎముకలు ఇత్తడివలె గట్టిగానుండును. కాళ్ళు ఇనుప కడ్డీలవలె నుండును.
19. అది దేవుడు సృష్టించిన ప్రాణులలో గొప్పది. దానిని సృష్టించిన దేవుడే ఖడ్గమును దానికి ఇచ్చుటలో దేవుని సృష్టిలోని వైవిధ్యమునకు నాంది అయ్యెను.
20. పర్వతములలో దానికి మేత లభించును. అరణ్య జంతువులన్ని అచట ఆడుకొనును.
21. కనుక అది నీటిలోని ముండ్లపొదలలో ఉండిపోవును. మడుగులలోని తుంగల మరుగున దాగుకొనును.
22. జలములలోని ముండ్లపొదలు దానికి నీడనిచ్చును నీటి ఒడ్డున ఎదుగు చెట్లనీడ దానిని కాపాడును.
23. నదులు పొంగి పారినను దానికి భయము లేదు. యోర్డానునది తన నెత్తిన విరుచుకొనిపడిన అది జంకదు.
24. ఆ మృగము కనులుగప్పి దానిని ఎవరైన పట్టగలరా? దాని ముట్టెనెవరైన బోనులో బంధింపగలరా?
1. మొసలిని నీవు గాలముతో పట్టగలవా? దాని నాలుకను త్రాటితో కట్టగలవా?
2. దాని ముక్కురంధ్రములలో త్రాటిని దూర్చగలవా? దాని దౌడలకు కొక్కెము వేయగలవా?
3. మకరము తన్ను విడిపింపుమని నిన్ను బతిమాలునా? తనమీద దయచూపుమని నిన్ను వేడుకొనునా?
4. అది నీతో ఒప్పందము చేసికొని, జీవితాంతము నీకు సేవచేయుటకు అంగీకరించునా?
5. దానిని నీవు పెంపుడు పక్షినివలె బంధింపగలవా? నీ పనికత్తెలు దానితో ఆటలాడుకోగలరా?
6. బెస్తలు దానిని బేరమాడికొందురా? వ్యాపారులు దానిని ముక్కలు ముక్కలుగా కోసి అమ్ముదురా?
7. నీవు దాని చర్మమును ఈటెతో గ్రుచ్చగలవా? దాని తలను శూలముతో పొడువగలవా?
8. నీవు ఒకసారి దానిని చేతితో తాకితివా, మరల దానిమీద వ్రేలుపెట్టవు. అది నీతో సలుపు పోరును ఏనాటికిని మరువవు. \
9. మకరమును కంటితో చూచినవాడు గుండెలవిసి నేలకొరగును.
10. దానిని రెచ్చగొట్టితిమా అది ఉగ్రస్వరూపము తాల్చును. దానిని ఎదిరించుటకెవడు సాహసింపడు.
11. దానితో పోరుకు తలపడి ప్రాణములు దక్కించుకొనువాడు ఈ విశాల ప్రపంచమున ఒక్కడును లేడు.
12. మకరము అవయవములను వర్ణింతును. అనన్యమైన దాని బలమును నీకు విశదము చేయుదును. 
13. దాని చర్మమును చీల్చువాడెవడును లేడు. దాని కవచమును తూట్లు పొడువగలవాడు ఎవడును లేడు.
14. మకరము ముఖద్వారమును తెరవగల వాడెవడు? దాని దంతాల వరుసలో భయము నాట్యమాడుచుండును.
15. దాని వీపు ఒకదానితో నొకటి పేర్చిన డాళ్ళవరుసలవలెనుండి పాషాణమన్నట్లు గట్టిగా నుండును.
16. ఆ వరుసలు ఒకదాని కొకటి దగ్గరగా అతుకుకొని ఉండును. వాని మధ్య గాలి కూడ దూరజాలదు.
17. ఆ వరుసలు ఒకదానితో నొకటి కలిసి ఉండును. వానిని విడదీయను ఎవరితరము కాదు.
18. అది తుమ్మినపుడు ప్రకాశము వెలువడును దాని నేత్రములు ఉదయభానునివలె తేజరిల్లును
19. దాని నోటి నుండి జ్వాలలు వెలువడును. అగ్నికణములు పైకెగయును.
20. నిప్పుల మీద కాగు డేగిస నుండి వలె దాని ముక్కురంధ్రములనుండి పొగలు వెలువడును
21. దాని ఉచ్చ్వాసములు అగ్నినెగజిమ్మును. దాని నోటినుండి మంటలు బయల్వెడలును.
22. మొసలి మెడ మహాబలముగా ఉండును. దాని గమనమును చూచిన వారెల్ల భయభ్రాంతులగుదురు.
23. దాని చర్మమున మెత్తని భాగముండదు. అంతయు ఇనుమువలె గట్టిగానుండును.
24. దాని గుండె రాయి వలె కర్కశముగా నుండును. తిరుగటి రాయివలె కఠినముగా ఉండును.
25. అది లేచి నిలుచుండినపుడు, బలాడ్యులే భయపడి వెనుకకు మళ్ళుదురు.
26. కత్తులు దానిని గాయపరచలేవు. ఈటెలు బల్లెములు బాణములు దానిని బాధింపలేవు.
27. అది ఇనుమును తృణప్రాయముగను, ఇత్తడిని పుచ్చిన కొయ్యవలె గణించును.
28. అది బాణమునకు జడిసి పరుగెత్తదు. రాళ్ళురువ్వినచో గడ్డిపోచలతో మోదినట్లుగా భావించును
29. గుదియతో మోదినచో గడ్డిపరకతో కొట్టినట్లుగా నెంచును. ఈటెను విసిరినచో పరియాచకము చేసి ఊరకుండును.
30. దాని ఉదరము చిల్లపెంకులతో, కప్పినట్లుగా నుండును. అవి బురదను గొర్రుతో దున్నినట్లుగా గోకివేయును
31. మకరము సముద్రమును చిలకగా దాని జలము సలసల మరుగుచున్న నీళ్ళవలె కన్పించును. చిటపట మరుగుచున్న చమురువలె చూపట్టును
32. అది ఈదిన చోట తళతళ మెరయు దారి కన్పించును.  సముద్రము తెల్లని నురగతో నిండును.
33. భువిలో మొసలికి సాటి ప్రాణి లేదు. భయమననేమో దానికి తెలియదు.
34. అది పొగరుగల మృగములనుగూడ  చిన్నచూపు చూచును. వన్యమృగములన్నిటికి అదియే రాజు.”
1. అప్పుడు యోబు ప్రభువుతో ఇట్లనెను:
2. "ప్రభూ! నీవు సర్వశక్తిమంతుడవు. నీవు తలపెట్టిన కార్యములెల్ల చేయగలవు , అని నేను తెలుసుకొంటిని.
3. జ్ఞానహీనమైన పలుకులతో ఆలోచనను నిరర్ధకము చేయువీడెవడు? అలాగు నాకు విజ్ఞానము చాలకున్నను నేను నీ కార్యములను గూర్చి ప్రశ్నించితిని. నాకు అర్థముగాని అంశములగూర్చి సంభాషించితిని. నేను గ్రహింపజాలని మహాద్భుత విషయములగూర్చి . ఇంతతడవు వదరితిని.
4. ఇప్పుడు నేను మాట్లాడగోరుచున్నాను నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగెదను. దానిని నాకు తెలియజెప్పుము.
5. 'పూర్వము వినికిడి వలన మాత్రమే నేను నిన్నెరిగితిని. కాని ఇప్పుడు నా కన్నులతో నిన్ను చూచితిని.
6. కనుక నేను పలికిన పలుకులకు అసహ్యపడుచున్నాను. దుమ్ము, బూడిదపైన చల్లుకొని పశ్చాత్తాపపడుచున్నాను.”
7. ప్రభువు యోబుతో మాట్లాడి చాలించిన పిదప ఎలీఫసుతో “ఓయి! నాకు నీ పట్లను, నీ యిరువురి మిత్రుల పట్ల ఆగ్రహము కలుగుచున్నది. మీరు నా భక్తుడైన యోబువలె నన్నుగూర్చి యథార్థము చెప్పరైతిరి.
8. కనుక మీరు ఏడు కోడెలను, ఏడు పొట్టేళ్ళను యోబు వద్దకు కొనిపోయి, మీ మేలుకొరకు దహన బలిగా అర్పింపుడు. యోబు మీ కొరకు ప్రార్థన చేయును. నేను అతని వేడుకోలునాలించి మీ అవి వేకమును మన్నింతును. మీరు యోబువలె నన్ను గూర్చి యథార్థము చెప్పరైతిరి” అనెను.
9. తేమాను నగరవాసి అయిన ఎలీఫసు, షూహా దేశీయుడు బిల్టదు, నామా దేశీయుడు సోఫరు ప్రభువు చెప్పినట్లే చేసిరి. ప్రభువు యోబు మనవి నాలకించెను.
10. యోబు తన ముగ్గురు మిత్రులకొరకు ప్రార్థనచేసిన పిదప ప్రభువు అతనిని మరల సంపన్నుని చేసెను. పూర్వముకంటె రెట్టింపుగా సిరిసంపదలు దయచేసెను.
11. యోబు సోదరీ సోదరులు, పూర్వ స్నేహితులు అతనిని సందర్శించుటకు వచ్చి అతనితో విందును ఆరగించిరి. వారు అతనికి సానుభూతి చూపిరి. ప్రభువు అతనిని కడగండ్ల పాలు చేసి నందులకు గాను అతనిని ఓదార్చిరి. వారిలో ప్రతి వాడు యోబుకు కొంత సొమ్మును, బంగారపు ఉంగరమును బహూకరించెను.
12. ప్రభువు యోబు జీవితములో పూర్వముకంటె ఇప్పుడు ఎక్కువగా దీవించెను. అతడు పదునాలుగువేల గొఱ్ఱెలతోను, ఆరువేల ఒంటెలతోను, వేయి కాడిజతల ఎద్దులతోను, వేయి గాడిదలతోను విరాజిల్లెను.
13. అతనికి ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు కల్గిరి.
14. యోబు పెద్ద కుమార్తె పేరు యెమీమా, రెండవ కూతురు పేరు కేసియా, చిన్నకూతురు పేరు కెరెనప్పుకు.
15. లోకములో యోబు కుమార్తెలంత అందగత్తెలెవరును లేరు. యోబు పుత్రులతో పాటు పుత్రికలకును కూడ తన ఆస్తిలో భాగములు పంచి యిచ్చెను.
16. బాధలనుండి బయట పడిన తరువాత యోబు నూటనలుబది యేండ్లు జీవించెను. తన బిడ్డలను, బిడ్డల బిడ్డలను నాలగుతరముల వరకు చూచెను.
17. అతడు చాల యేండ్లు జీవించి పండువంటి నిండు ప్రాయమున కన్నుమూసెను.