ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజులు రెండవ గ్రంధము

 1. అహాబు మరణానంతరము మోవాబు మండలము యిస్రాయేలుపై తిరుగబడెను.

2. అహస్యా రాజు సమరియాలోని తన ప్రాసాదముమీది వసారానుండి క్రిందపడి గాయపడెను. అతడు ఫిలిస్తీయా దేశములోని ఎక్రోను నగరమందలి బాల్సెబూబు దేవతను సంప్రదించి తనకు ఆరోగ్యము చేకూరునో లేదో తెలిసికొనిరండని దూతలనంపెను.

3. కాని ప్రభువు దూత తిష్బియుడగు ఏలీయా ప్రవక్త వద్దకు వచ్చి “నీవు పోయి అహస్యా దూతలను కలిసికొని 'మీరు ఎక్రోను దేవత బాల్సెబూబును సంప్రదింప పోనేల? యిస్రాయేలు దేశమున దేవుడు లేడనియా?

4. ప్రభువు మీ రాజునకిట్లు సెలవిచ్చుచున్నాడు. నీవు పడకనుండి క్రిందికి దిగజాలవు. నీవు తప్పక చత్తువని చెప్పుము' " అని పలికెను. ఏలీయా దేవదూత చెప్పినట్లే చేసెను.

5. దూతలు అహస్యా వద్దకు తిరిగిరాగా అతడు “మీరేల మరలి వచ్చితిరి?” అని అడిగెను.

6. వారు అహాస్యాతో “మేము త్రోవలో ఒకనిని కలిసికొంటిమి. అతడు మమ్ముచూచి మీ రాజు వద్దకు వెళ్ళి ప్రభువు పలుకులుగా ఇట్లు తెలియజేయుడు 'నీవు ఎక్రోను దేవత బాల్సెబూబును సంప్రదింపపోనేల? యిస్రాయేలు దేశమున దేవుడు లేడనియా? నీవు పడకనుండి క్రిందికి దిగజాలవు. నీవు తప్పక చతువు అని పలికెను' ” అని చెప్పగా

7. “మీకు కనిపించిన వాని వాలకమెట్టిది?” అని రాజు దూతలను ప్రశ్నించెను.

8. వారు "అతడు గొంగళి కప్పుకొని, తోలు నడికట్టు కట్టుకొనియుండెను” అని చెప్పిరి. ఆ మాటలకు రాజు “అతడు ఏలీయాయై ఉండును” అని పలికెను.

9. రాజు ఏలీయాను కట్టి తెచ్చుటకై ఏబదిమంది బంటులతో సేనాపతిని పంపెను. వారు వచ్చునప్పటికి ఏలియా ఒక కొండపై కూర్చుండియుండగా, సేనాపతి ఎక్కి అతనిని సమీపించి “దైవభక్తుడా! రాజు నిన్ను క్రిందికి దిగిరమ్మని ఆజ్ఞాపించుచున్నాడు” అని అనెను.

10. ఏలీయా అతనితో “నేను దైవభక్తుడనేని మింటి నుండి నిప్పు దిగివచ్చి నిన్ను, నీ ఏబదిబంటులను కాల్చివేయునుగాక!” అని పలికెను. వెంటనే నిప్పు దిగి వచ్చి సైన్యాధిపతిని అతని బంటులను కాల్చివేసెను.

11. “అంతట రాజు ఏబదిమంది బంటులతో మరొక సైన్యాధిపతిని పంపెను. అతడు ఏలీయావద్దకు వెళ్ళి “దైవభక్తుడా! రాజు నిన్ను వెంటనే క్రిందికి దిగిరమ్మని ఆజ్ఞాపించుచున్నాడు” అనెను.

12. కాని ఏలీయా “నేను దైవభక్తుడనేని మింటినుండి నిప్పు దిగివచ్చి నిన్ను, నీ ఏబదిమంది బంటులను కాల్చివేయును గాక!" అని పలికెను. వెంటనే నిప్పు దిగివచ్చి సైన్యాధిపతిని అతని బంటులను కాల్చివేసెను.

13. రాజు మరల ఏబదిమంది బంటులతో వేరొక సైన్యాధిపతిని పంపగా, ఏబదిమందిమీద అధిపతియైన ఆ మూడవ వాడు వచ్చి ఏలీయా యెదుట మోకాళ్ళూని, “దైవ భక్తుడా! మమ్ము కరుణించి మా ప్రాణములు కాపా డుము.

14. ముందు వచ్చిన ఇద్దరు సైన్యాధిపతులను, వారి బంటులను ఆకాశమునుండి వచ్చిన నిప్పు కాల్చివేసెను. కావున నీవు మా ప్రాణములను కాపాడవలెను” అని వేడుకొనెను.

15. అప్పుడు ప్రభువుదూత ఏలీయాతో “నీవు భయపడక ఇతనితో వెళ్ళుము” అని చెప్పెను. ఏలీయా సైన్యాధిపతితో రాజు వద్దకు వెళ్ళేను.

16. అతడు రాజుతో “ప్రభువు సందేశమిది. యిస్రాయేలు దేశమున దేవుడు లేడో అన్నట్లు నీవు ఎకోను దేవత బాల్సెబూబును సంప్రదించుటకు దూతలనంపితివి. కనుక నీవు పడుకనుండి క్రిందికి దిగజాలవు. నీవు తప్పక చత్తువు” అని పలికెను.

17. ప్రభువు ఏలీయా ద్వార నుడివినట్లే రాజు మరణించెను. అహస్యాకు కుమారులు లేరు. కనుక అతని తమ్ముడు యెహోరాము రాజయ్యెను. యూదా రాజ్యమున యెహోషాఫాత్తు కుమారుడు యెహోరాము పరిపాలన కాలమున రెండవయేట ఈ సంఘటన జరిగెను.

18. అహస్యాను గూర్చి ఇతరాంశములు యిస్రాయేలు రాజుల చరితమున లిఖింపబడియే యున్నవి.

 1. ప్రభువు ఏలీయాను సుడిగాలిలో ఆకాశమునకు కొనిపోవుసమయము ఆసన్నమయ్యెను. అప్పుడు ఏలీయా, ఎలీషా గిల్లాలునుండి బయలుదేరిరి.

2. ఏలీయా ఎలీషాతో “నీవిచట ఆగుము. ప్రభువు నన్ను బేతేలునకు వెళ్ళమనెను” అని చెప్పెను. కాని ఎలీషా 'సజీవుడైన యావే తోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువను” అనెను. వారిరువురు బేతేలునకు వెళ్ళిరి.

3. బేతేలున వసించు ప్రవక్తల సమాజము ఎలీషా వద్దకు వచ్చి “నేడు ప్రభువు నీ యజమానుడైన ఏలీయాను కొనిపోనున్నాడు. ఈ సంగతి నీకు తెలి యునా?" అనడిగిరి. ఎలీషా “నాకు తెలియును. కాని మనము ఆ సంగతి ఎత్తగూడదు” అనెను.

4. ఏలీయా ఎలీషాతో “నీవిచట ఆగుము. ప్రభువు నన్ను యెరికోకు వెళ్ళమనెను” అని చెప్పెను. కాని ఎలీషా “సజీవుడైన యావే తోడు, నీ జీవము తోడు నేను నిన్ను విడువను” అనెను. వారిరువురు యెరికోకు వెళ్ళిరి.

5. యెరికో యందలి ప్రవక్తలసమాజము ఎలీషా వద్దకు వచ్చి, “నేడు ప్రభువు నీ యజమానుడు ఏలీయాను కొని పోనున్నాడు. ఈ సంగతి నీకు తెలియునా?” అనడి గిరి. ఎలీషా “నాకు తెలియును. కాని మనము ఈ సంగతి ఎత్తగూడదు” అనెను.

6. ఏలీయా ఎలీషాతో “నీవిచటాగుము. ప్రభువు నన్ను యోర్డానునకు వెళ్ళు మనెను” అని చెప్పెను. కాని ఎలీషా “సజీవుడైన యావే తోడు, నీ జీవముతోడు. నేను నిన్ను విడువను” అని పలికెను. వారిరువురు కలిసి యోర్దానునకు వెళ్ళిరి.

7. ప్రవక్తల సమాజము నుండి ఏబదిమంది ప్రవక్తలుకూడ వారివెంటవెళ్ళి యోర్డానునకు కొంచెము దూరముగా నిలుచుండిరి. ఏలీయా, ఎలీషా యోర్దాను నదిచెంత ఆగిరి.

8. ఏలీయా తన ఉత్తరీయమును తీసి చుట్టగా చుట్టి దానితో యోర్దాను జలమును మోదగా నీళ్ళు రెండుగా విడిపోయి దారి ఏర్పడెను. అతడు, ఏలీషా పొడిదారిన నడచిపోయి నది ఆవలి దరిని చేరిరి.

9. అటుల నదిని దాటిన పిదప ఏలీయా ఎలీషాతో “ప్రభువు నన్ను కొనిపోకముందే నేను నీకేమి ఉపకారము చేయవలయునో కోరుకొమ్ము” అనెను. ఎలీషా “నాకు నీ ఆత్మలో రెండుపాళ్ళు దయచేయుము” అని అడిగెను.

10. ఏలీయా అతనితో “నీ కోరికను తీర్చుట కష్టము. ప్రభువు నన్ను నీ చెంత నుండి కొనిపోవునప్పుడు నీవు నన్ను చూతువేని నీ కోరిక నెరవేరును. చూడజాలవేని నీ కోరిక సిద్ధింపదు” అనెను.

11. వారింకను మాటలాడుకొనుచు ముందుకు సాగిపోవుచుండగా నిప్పు గుఱ్ఱములు లాగు అగ్నిరథమొకటి అకస్మాత్తుగా వారి నడుమ ప్రవేశించెను. వెంటనే సుడిగాలిచేత ఏలీయా ఆకాశమునకు ఆరోహణమాయెను.

12. ఆ దృశ్యమును చూచి ఎలీషా “ఓ నాతండ్రీ! ఓ నాతండ్రీ! యిస్రాయేలునకు రథమును దాని సారధియు నీవే!” అని అరచెను. ఆ మీదట ఏలీయా అతనికి కన్పింపలేదు. ఎలీషా సంతాపముతో తన అంగీని రెండుముక్కలుగా చించివేసెను.

13. అతడు ఏలీయా వెళ్ళిపోవుచుండగా జారిపడిన గొంగళిని ఎత్తుకొనిపోయి యోర్దానునది ఒడ్డున నిలుచుండెను.

14. ఎలీషా ఏలీయా గొంగళితో నీటిని మోది “ఏలీయా దేవుడైన యావే ఎక్కడున్నాడు?” అని, అతడు కూడ నీటిని మోదగా నీరు రెండుగా విడిపోయెను. అతడు నది ఆవలి ఒడ్డునకు నడచిపోయెను.

15. యెరికోనుండి వచ్చిన ఏబదిమంది ప్రవక్తలు అతనిని చూచి “ఇకనేమి? ఏలీయా ఆత్మ ఎలీషాకు సంక్రమించినది” అనుకొనిరి. వారు ఎలీషాచెంతకు వెళ్ళి అతని ముందటసాగిలపడి,

16. “మేము మొత్తము ఏబదిమందిమి. అందరము జవసత్వములు కలవారము. నీవు అనుమతిచ్చినచో మేము వెళ్ళి నీ యజమానుని వెదకి వత్తుము. ప్రభువాత్మ ఏలీయాను కొనిపోయి ఏ కొండమీదనో ఏ లోయలోనో జారవిడిచి యుండును” అనిరి. ఎలీషా “మీరెవరు పోవలదు” అనెను.

17. కాని వారు నిర్బంధింపగా కడకు అతడు సమ్మతించెను. ఆ ఏబదిమంది వెడలిపోయి మూడు దినములు ఏలీయాను గాలించిరి గాని అతని జాడ తెలియలేదు.

18. అటుపిమ్మట వారు యెరికో నగరమున బసచేయుచున్న ఎలీషా చెంతకురాగా అతడు వారితో “నేను ముందుగనే మీరు వెళ్ళవలదని చెప్పలేదా?” అనెను.

19. అటు తరువాత యెరికో పౌరులు ఎలీషా వద్దకు వచ్చి "అయ్యా! ఇది సుందరమైన నగరము. కాని ఇచ్చటి నీరు మంచిదికాదు. భూములు నిస్సారమగుచున్నవి” అని పలికిరి.

20. ఎలీషా “మీరు క్రొత్త పాత్రలో కొంచెము ఉప్పువేసి నా యొద్దకు కొనిరండు” అని చెప్పగా వారట్లే చేసిరి.

21. అతడు పట్టణపు నీటిబుగ్గవద్దకు వెళ్ళి ఉప్పును నీటిలో పడవేసి “ఇది ప్రభువాజ్ఞ. నేను ఈ జలమును నిర్మలము చేసితిని. ఇకమీదట ఈ నీళ్ళు చావునుగాని, గర్భపాతమునుగాని కలిగింపవు” అని పలికెను.

22. ఎలీషా నుడివినట్లే ఆ నీళ్ళు నేటివరకును ఆరోగ్యకరముగనే ఉన్నవి.

23. ఎలీషా యెరికోనుండి బేతేలునకు వెళ్ళుచుండగా త్రోవలో కొందరు చిన్నపిల్లలు అతనిని గేలిచేయుచు “పో పో బట్టతలకాయా!” అని అరచిరి.

24. అతడు కోపముతో ఆ పిల్లలవైపు తిరిగి యావే పేరిట వారిని శపించెను. వెంటనే అడవిలో నుండి రెండు ఆడు ఎలుగుబంటులు వెడలివచ్చి నలువది ఇద్దరు పిల్లలను ముక్కలు ముక్కలుగా చీల్చివేసెను.

25. ఎలీషా అచటినుండి కర్మెలు కొండకు పోయి అక్కడినుండి సమరియాకు తిరిగివచ్చెను.

 1. యూదా రాజ్యమున యెహోషాపాతు పరిపాలన కాలములో పదునెనిమిదవ యేట, యిస్రాయేలు రాజ్యమున అహాబు కుమారుడు యెహోరాము రాజై సమరియా నగరము నుండి పండ్రెండేండ్లు పరిపాలించెను.

2. ఇతడును యావే ఒల్లని దుష్కార్యములు చేసెను. అయినను ఈ రాజు తన తల్లిదండ్రులంత దుర్మార్గుడు కాడు. అతడు బాలు పూజకొరకు తన తండ్రి నిర్మించిన స్తంభమును పడగొట్టించెను.

3. అయినను పూర్వము నెబాతు కుమారుడు యరోబామువలే యెహోరామును ప్రజలను పాపమునకు పురికొల్పెను. తాను దుష్కార్య ములు చేయుట మానడయ్యెను.

4. మోవాబు రాజైన మేషా గొఱ్ఱెల పెంపకదారుడై విస్తారమైన మందలుకలిగి, ఏటేటా లక్ష గొఱ్ఱె పిల్లలను, లక్షపొట్టేళ్ళ ఉన్నిని యిస్రాయేలు రాజునకు కప్పముగా సమర్పించెడివాడు.

5. కాని అహాబు చనిపోగానే మోవాబు రాజు యిస్రాయేలు రాజునకు ఎదురు తిరిగెను.

6. వెంటనే యెహోరాము సమరియా నుండి తన సైన్యములన్నిటిని సమావేశపరచెను.

7. అతడు యూదా రాజగు యెహోషాఫాత్తు వద్దకు దూతలనంపి “మోవాబు నాకు ఎదురు తిరిగినాడు. నేను అతని మీదికి దాడిచేసినచో నీవు నాకు తోడ్పడెదవా?” అని అడిగించెను.

8. యూదా రాజు “తప్పక తోడ్పడుదును. నేను నీవాడినే, నా ప్రజలు నీ ప్రజలే, నా గుఱ్ఱములు నీ గుఱ్ఱములే. నా సైన్యములు, గుఱ్ఱములు, మీ బలములతో కలిసిపోరాడును. కాని మనము ఏ మార్గమున యుద్ధమునకు పోవలెనో తెలుపుము” అని ప్రత్యుత్తరము పంపెను. “ఎదోము ఎడారిగుండ పోవుదము” అని యిస్రాయేలు రాజు మరల జవాబు పంపెను.

9. ఆ రీతిగా యిస్రాయేలు, యూదా, ఎదోము రాజులు యుద్ధమునకు వెడలిరి. ఏడు దినములు ప్రయాణము చేసిన పిదప వారి సైన్యమునందలి యోధులకును, పశువులకును నీరు కొరతపడెను.

10. యెహోరాము రాజు “హా! చెడితిమికదా! యావే మన ముగ్గురిని శత్రువుల చేతికి అప్పగించుటకే పిలిచెనేమో!” అనెను.

11. కాని యెహోషాఫాత్తురాజు “యావేను సంప్రదించుటకు ఇచట ప్రవక్త ఎవడును దొరకడా?" అని అడిగెను. యెహోరాము సైనికోద్యోగి ఒకడు “షాఫాత్తు కుమారుడు ఎలీషా ఉన్నాడు. పూర్వము అతడు ఏలీయాకు పరిచారకుడుగా ఉండెడివాడు” అని చెప్పెను.

12. యెహోషాఫాత్తు “ఇకనేమి, అతడు ప్రభువు సందేశమును విన్పింపగలడు” అనెను. కనుక ఆ ముగ్గురు రాజులు ఎలీషా వద్దకు వెళ్ళిరి.

13. కాని ఎలీషా యిస్రాయేలు రాజుతో “నేను నీకెందుకు తోడ్పడవలయును? నీవు వెళ్ళి మునుపు మీ తల్లిదండ్రులు సంప్రదించిన ప్రవక్తలనే సంప్ర తింపుము" అనెను. యిస్రాయేలు రాజు యెహోరాము "అయ్యా! నీవు ఇట్లనవలదు. ప్రభువు మమ్ము ముగ్గురిని మోవాబురాజు చేతికి అప్పగించినాడు” అని పలికెను.

14. ఎలీషా “సైన్యాములకధిపతియగు యావే సాన్నిధ్యమున నేను నిలబడియున్నాను. ఆయన జీవము తోడు! యూదారాజైన ఈ యెహోషాఫాత్తు మొగము చూచి నీ మాటలు ఆలింపవలసి వచ్చినదికాని లేకున్న నిన్ను కన్నెత్తియైన చూచి ఉండను.

15. సరియే! ఇప్పుడొక సంగీతకారుని నా యొద్దకు కొనిరండు” అనెను. ఆ పాటగాడు వాద్యమును వాయింపగా ఎలీషా యావే బలమును పొంది.

16. "వినుడు! దైవ సందేశమిది. ఈ లోయనిండ గోతులు త్రవ్వుడు.

17. గాలిగాని, వానగాని లేకున్నను లోయ నీటితో నిండును. మీరును, మీ సైనికులును, మీ జంతువులును తృప్తిగా నీళ్ళు త్రాగవచ్చును.

18. ఇంకను వినుడు. త్రాగుటకు నీటినిచ్చుట ప్రభువునకు తేలికైనపని. పైగా అతడు మోవాబీయులను గూడ మీ చేతికి అప్పగించును.

19. మీరు ముఖ్యమైన మోవాబీయుల సురక్షిత పట్టణములన్నిటిని జయింతురు. వారి పండ్ల చెట్లనన్నిటిని నరుకుదురు. నీటి బుగ్గలను అన్నిటిని పూడ్చివేయుదురు. సారవంతమైన పంటపొలములన్నిటిని రాళ్ళు రప్పలు పడవేసి పాడుచేయుదురు” అని పలికెను.

20. మరునాటి ఉదయకాలబలి నర్పించు సమయమునకు ఎదోమువైపునుండి నీరు పొరలివచ్చి ఆ ప్రదేశమునంతటిని క్రమ్మివేసెను.

21. ముగ్గురు రాజులు తమను ఎదిరింపవచ్చిరని విని మోవాబీయులు పిల్లలనక, పెద్దలనక ఆయుధములు చేపట్టగలవారందరు ప్రోగైవచ్చి తమ పొలిమేర మీద గుమికూడిరి.

22. వారు మరునాటి ప్రొద్దుట నిద్దురలేచి చూడగా ఉదయించు సూర్యుని కిరణములు సోకి ఆవలినీరంతయు నెత్తురువలె ఎఱ్ఱగా కన్పించెను.

23. అప్పుడు మోవాబీయులు “అది నెత్తురుసుమా! ముగ్గురురాజులు తమలో తాము పోరాడుకొని చచ్చి యుందురు. మనము వెళ్ళి వారి శిబిరమును దోచుకొందము” అనుకొనిరి.

24. కాని మోవాబీయులు శిబిరము చెంతకు రాగానే యిస్రాయేలీయులు వారిని తరిమికొట్టిరి. వారిని వెన్నాడి చిక్కినవారిని చిక్కినట్లు ఖండఖండములుగా తునియలు చేసిరి.

25. వారి పట్టణములను నాశనము చేసిరి. యిస్రాయేలు సైన్యమున ప్రతివాడు మోవాబీయుల పంటపొలముల మీద రాళ్ళుపడవేసెను. ఇంకను వారి నీటిబుగ్గలను పూడ్చివేసి, పండ్ల చెట్లను నరికివేసిరి. కడకు వారి రాజధాని కీర్- హరేసేతు మిగులగా ఒడిసెల విసరు యిస్రాయేలు సైనికులు దానినికూడ ముట్టడించిరి.

26. మోవాబు రాజు తనకు ఓటమి కలుగనున్నదని గ్రహించి ఏడువందలమంది ఖడ్గధారులను వెంటనిడుకొని శత్రుసైన్యముగుండ సిరియారాజు నొద్దకు పారిపోజూచెను. కాని అది అతని వలన కాకపోయెను.

27. అంతట అతడు యువరాజగు తన జ్యేష్ఠ కుమా రుని నగరప్రాకారముమీద దహనబలిగా సమర్పించెను. యిస్రాయేలీయుల మీదికి కోపము ప్రేరేపితముకాగా, నగరమును ముట్టడించుటకు వెరచి, తమ దేశమునకు మరలివచ్చిరి.

 1. ప్రవక్తల సమాజమునకు చెందిన ఒక శిష్య ప్రవక్త ఇంటి విధవరాలు ఎలీషా వద్దకు వచ్చి "అయ్యా! నా పెనిమిటి చనిపోయినాడు. అతడెంత దైవభక్తుడో నీవెరుగుదువు! ఇప్పుడు ఋణదాత ఒకడు వచ్చి నా ఇద్దరు కుమారులను బానిసలుగా కొనిపోనున్నాడు” అని పలికెను.

2. ఎలీషా ఆమెతో “అమ్మా! నీకు నేనేమి ఉపకారము చేయవలయునో చెప్పుము. ఇప్పుడు మీ ఇంట ఏమియున్నది?” అని అడిగెను. ఆమె “ఒక దుత్తెడు నూనె మాత్రమున్నది” అనెను.

3. ప్రవక్త ఆమెతో “మొదట నీవు వెళ్ళి మీ ఇరుగుపొరుగు వారి ఇండ్లనుండి నీకు దొరికినన్ని ఖాళీ దుత్తలు ప్రోగుజేసికొనిరమ్ము.

4. ఆ మీదట నీవు నీ కుమారులు మీ ఇంటిలోపలికి వెళ్ళి తలుపులు బిగించు కొని ఆ ఖాళీ దుత్తలన్నిటిని నూనెతో నింపుడు. ఒక్కొక్క దుత్త నిండగనే దానిని ప్రక్కన పెట్టుడు” అని చెప్పెను.

5. ఆమె ఆ రీతిగనే కుమారులతో ఇంటి లోపలికి వెళ్ళి తలుపు బిగించుకొనెను. కొడుకులు దుత్తలనందించు చుండగా తాను వాటిని నూనెతో నింపెను.

6. అన్ని నిండిన పిదప ఆమె ఇంకను దుత్తయేదైన ఉన్నదా అని కుమారుని అడుగగా అతడు ఏదియులేదని చెప్పెను. వెంటనే ఇంటనున్న దుత్త నుండి నూనె పొర్లుట ఆగిపోయెను.

7. ఆ వితంతువు ప్రవక్త వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పగా అతడు "ఆ నూనెను అమ్మి మీ బాకీ తీర్చుకొనుడు. ఋణముతీరగా మిగిలిన సొమ్ముతో నీవును, నీ కుమారులును బ్రతుకవచ్చును” అని చెప్పెను.

8. ఒకనాడు ఎలీషా షూనేము నగరమునకు వెళ్ళగా అచటవసించు ఒక సంపన్నురాలు అతనిని భోజనమునకు రమ్మని బలవంతపెట్టెను. అప్పటినుండి ఎలీషా ఆ దెసగా పయనించినపుడెల్ల ఆమె ఇంటనే భోజనము చేసెడివాడు.

9. ఆమె తన పెనిమిటితో “ఈ అతిథి ఇన్నిసారులు మన ఇంటికి వచ్చి పోవు చున్నాడు. ఇతడు దైవభక్తుడు.

10. మన ఇంటిమీద ఒక గది కట్టించి దానిలో మంచము, బల్ల, కుర్చీ, దీపము అమర్చుదము. అతడు మన ఇంటికి వచ్చినపు డెల్ల ఆ గదిలో విశ్రమించును” అని చెప్పెను.

11. ఒకసారి ఎలీషా షూనేమునకు వచ్చి తనకొరకు నిర్మించిన గదిలో విశ్రాంతి తీసికొనెను.

12. అతడు తన సేవకుడగు గేహసీని పిలిచి ఈ షూనేమీయురాలిని పిలువమనగా, ఆమె వచ్చి ప్రవక్త దాపున నిలుచుండెను.

13. అతడు గేహసీతో “ఆమెతో ఇట్లనుము. నీవు మాయందు భక్తిశ్రద్ధలు చూపితివికదా! నేను నీకేమి చేయవలయును? రాజునొద్దగాని, సైన్యాధిపతి యొద్ద గాని నీవు విన్పించుకోగోరిన మనవులేమైన ఉన్నచో మేముపోయి వారితో మాట్లాడివచ్చెదము” అని అడుగమని గేహసీకి ఆజ్ఞఇవ్వగా, వాడు ఆ ప్రకారముగా ఆమెను అడిగెను. కాని ఆమె “నేను నాసొంత జనుల మధ్యనున్నాను, నా అక్కరలన్నియు వారే తీర్తురు” అనెను.

14. ప్రవక్త “మరి మనము ఈమెకు ఏమి సహాయము చేయుదుము?" అని గేహసీ నడిగెను. అతడు “ఈమెకు సంతానములేదు. పెనిమిటి కూడ ముసలివాడయ్యెను” అని చెప్పెను.

15. ప్రవక్త ఆమెను నా ఎదుటికి పిలువుమని చెప్పెను.

16. ఆమెవచ్చి తలుపుచెంత నిలువబడగా ప్రవక్త “రానున్న యేడు ఇదే సమయమునకు నీ కౌగిట బిడ్డడుండును” అని పలికెను. ఆమె “అయ్యా! నీవు దైవభక్తుడవు. నాతో అబద్దములాడవలదు” అనెను.

17. అటు పిమ్మట ఆమె గర్భవతియై సరిగా ఎలీషా చెప్పిన సమయమునకే కుమారుని కనెను.

18. శిశువు పెరిగి పెద్దవాడయ్యెను. ఒకనాడు ఆ అతడు పొలమున కోతగాండ్రతో పంట కోయించు తండ్రివద్దకు వెళ్ళెను.

19. అక్కడ బాలుడు తలవని తలంపుగా “నాయనా! నాకు తలనొప్పిగా ఉన్నది” అని అరచెను. తండ్రి ఒక సేవకుని పిలిచి బిడ్డను తల్లి వద్దకు కొనిపొమ్మనెను.

20. సేవకుడు బాలుని తల్లివద్దకు కొనిపోయెను. ఆమె బిడ్డను మధ్యాహ్నము వరకు ఒడిలో కూర్చుండబెట్టుకొనెను. అటు తరువాత అతడు చనిపోయెను.

21. తల్లి బాలుని ఎలీషా గదిలోనికి మోసికొనిపోయి దైవభక్తుని పడుకమీద పరుండబెట్టి గది తలుపులు మూసివేసెను.

22. అంతట ఆమె పెనిమిటిని పిలిచి "నాకొక గాడిదయు, సేవకుడును కావలయును. నేను శీఘ్రమే దైవభక్తుని యొద్దకు వెళ్ళివచ్చెదను” అని చెప్పెను.

23. భర్త ఆమెతో “నీవు నేడు ప్రవక్త యొద్దకుపోనేల? ఈ దినము విశ్రాంతి దినమును కాదు, అమావాస్యయును కాదు గదా!” అనెను. ఆమె “కాకున్నను పరవాలేదు” అని పలికెను.

24. అంతట ఆ ఇల్లాలు గాడిదపై జీను వేయించెను. సేవకునితో “గాడిదను త్వరగా నడిపింపుము. నేను చెప్పనిదే ఆపవలదు” అని చెప్పెను.

25. ఆ రీతిగా ఆమె పయనమై వచ్చి కర్మేలు కొండపై నున్న ఎలీషా తావును చేరుకొనెను.

26. ప్రవక్త ఆమెను అల్లంతదూరము నుండియే గుర్తుపట్టి సేవకుడగు గేహసీతో “అదిగో! ఆ షూనేమీయురాలు వచ్చుచున్నది. నీవు పరుగెత్తుకొనిపోయి ఆమె, పెనిమిటి, పిల్లవాడు క్షేమముగా ఉన్నారో లేదో తెలిసి కొనిరమ్ము” అనెను. గేహసీ ఎదురువచ్చి తనను కలిసికొనగా ఆమె అందరును కుశలముగనే ఉన్నామని చెప్పెను.

27. కాని ఆ గృహిణి ప్రవక్తచెంతకు వచ్చి అతని పాదములు పట్టుకొనెను. గేహసీ ఆమెను ప్రక్కకు తొలగింపబోయెనుగాని ఎలీషా అతనితో “నీవు ఈ ఇల్లాలిజోలికి వెళ్ళవలదు. ఈమె హృదయము సంతాపముతో నిండియున్నది. కారణమేమో యావే నాకు తెలియజేయడయ్యెను” అని అనెను.

28. ఆ గృహిణి అతనితో "అయ్యా! ఆనాడు నేను బిడ్డను కోరుకొంటినా? నన్ను వంచింపవద్దని మనవిచేయలేదా?” అని అనెను.

29. ఎలీషా గేహసీతో “నీవు నడికట్టు కట్టుకొని నా చేతికఱ్ఱను తీసికొని వెంటనే పయనమైపొమ్ము. దారిలో ఎవ్వరిని పలుకరింపవలదు. నిన్ను పలుకరించిన వారికి సమాధానముకూడ చెప్పవలదు. తిన్నగా ఆ ఇంటికి వెళ్ళి బాలునిపై నా కఱ్ఱచాపుము" అని చెప్పెను.

30. కాని ఆ ఇల్లాలు “యావే జీవముతోడు! నీ జీవముతోడు! నేను నిన్ను వదలిపెట్టను” అని పలికెను. కనుక ఎలీషా ఆమె వెంటవెళ్ళెను. .

31. గేహసీ వారికి ముందుగా పోయి బాలునిపై కఱ్ఱచాపెను గాని మృతదేహమునుండి శబ్దములేదు, సమాధానమును లేదు. కనుక అతడు ఎలీషాను కలిసికొన ఎదురు వెళ్ళి బాలుడు మేల్కొనలేదని విన్నవించెను.

32. ఎలీషా ఆ ఇంటికి రాగానే పడకపైనున్న మృతదేహము కనిపించెను.

33. అతడు గదిలోనికి వెళ్ళి లోపలినుండి తలుపులు బిగించి ప్రభువును ప్రార్థించెను.

34. అంతట ప్రవక్త మంచము మీదికెక్కి బాలునిపై బోరగిల పరుండెను. అతని నోరు, కన్నులు, చేతులు బాలుని నోటిని, కన్నులను, చేతులను తాకుచుండెను. అతడు ఆ రీతిగా కాలు సేతులు చాచుకొని చిన్నవానిపై పరుండగా బాలుని శరీరమున ఉష్ణము పుట్టెను.

35. ఎలీషా మంచముదిగి గది నలువైపుల కొంచెముసేపు పచార్లు చేసెను. మరల మంచము ఎక్కి కాలుసేతులు చాచు కొని చిన్నవానిపై బోరగిలపరుండెను. ఈమారు బిడ్డడు ఏడుసార్లు తుమ్మి కన్నులు విప్పిచూచెను.

36. అంతట అతడు గేహసీతో ఆ షునామీయురాలును పిలువుమని చెప్పెను. ఆమె రాగా ఎలీషా “ఇదిగో నీ బిడ్డడు! తీసికొనిపొమ్ము” అనెను.

37. ఆమె అతని పాదముల చెంత సాగిలపడెను. బిడ్డను తీసికొని పైగదినుండి వెలుపలికి వచ్చెను.

38. ఒకమారు యిస్రాయేలు దేశమంతటిని కరువు పీడించుచుండెను. అప్పుడు ఎలీషా గిల్గాలునకు తిరిగివచ్చి ప్రవక్తల సమాజమునకు బోధించు చుండెను. అతడు సేవకుని పిలిచి పొయ్యిమీద పెద్ద కాగు పెట్టి ప్రవక్తలకు పులుసు వండుమని చెప్పెను.

39. ఆ ప్రవక్తలలో ఒకడు కూర ఆకులేమైన దొరుకునేమో అని పొలమునకు పోయెను. అక్కడ ఒక పిచ్చితీగ కాయలు కాసియుండెను. అతడు ఒడినిండ కాయలు కోసికొని వచ్చి వానిని ముక్కలుగా తరిగి పులుసులో కలిపెను. అవి ఏమి కాయలో ఆ ప్రవక్తకు తెలియదు.

40. అటుతరువాత పులుసును వంచిరి. కాని ప్రవక్త శిష్యులు దానిని నోటబెట్టుకొనగనే ఎలీషాను చూచి "అయ్యా! ఈ పులుసునకు విషమెక్కినది” అని అరచిరి. ఇక వారు దానిని ముట్టుకోరైరి.

41. ఎలీషా “కొంచెము పిండిని నాయొద్దకు కొనిరండి” అని చెప్పెను. అతడు ఆ పిండిని పులుసు కాగులో పడవేసి “ఈ మారు వంపుడు” అనెను. ఆ పులుసు వారికి ఎట్టి హానియు చేయదయ్యెను.

42. మరియొకమారు బాల్షాలిషా నుండి ఒకడు ఇరువది రొట్టెలను, ధాన్యపు వెన్నులను తీసికొనివచ్చి ఎలీషాకు కానుక పెట్టెను. ఆ రొట్టెలు ఆ సంవత్సరము క్రొత్తగా తొక్కించిన యవధాన్యముతో చేయబడినవి. ఎలీషా సేవకుని పిలిచి రొట్టెలను, వెన్నులను ప్రవక్త లకు పంచిపెట్టుమని చెప్పెను.

43. కాని సేవకుడు “వంద మందికి ఇవియేపాటి?” అని అడిగెను. ఎలీషా “వానిని వీరికి పంచి పెట్టుము. ప్రభువు వాక్కు ఇది: వీరు ఈ రొట్టెలను తిన్నపిమ్మట ఇంకను కొన్ని మిగులును” అని పలికెను.

44. అతడు రొట్టెలను పంచి పెట్టెను. ప్రభువు చెప్పినట్లే, వారు భుజించిన పిమ్మట ఇంకను కొన్ని రొట్టెలు మిగిలెను.

 1. సిరియారాజు సైన్యాధిపతి నామాను. ఈ నామాను ద్వారా ప్రభువు సిరియా దేశమునకు విజయము ప్రసాదించెను. కనుక రాజునకు అతడనిన మిక్కిలి గౌరవము. నామాను మహాశూరుడు. కాని కుష్ట రోగి.

2. ఒకమారు సిరియనులు యిస్రాయేలు దేశముమీద దాడిచేసి వారి బాలికనొకతెను చెరగొనిరి. ఆ పిల్ల నామాను భార్యకు దాసి అయ్యెను.

3. ఆమె ఒకనాడు యజమానురాలితో “మన యజమానుడు నమరియాలోని ప్రవక్త యొద్దకు వెళ్ళిన ఎంత బాగుండునో! ఆ దైవభక్తుడు మన దొర వ్యాధి నయము చేయును గదా!” అనెను.

4. నామాను రాజునొద్దకు వెళ్ళి యిస్రాయేలు దేశము నుండి వచ్చిన పనిపిల్ల ఇట్లు పలికినదని విన్నవించెను.

5. రాజు అతనితో “నీవు యిస్రాయేలు దేశపు రాజునొద్దకు వెళ్ళుము. నేను అతనికి కమ్మ వ్రాసిచ్చెదను" అని చెప్పెను. కనుక నామాను ముప్పదివేల వెండినాణెములు, ఆరువేల బంగారు కాసులు, పదిజతల పట్టుబట్టలు కానుకగా తీసికొని యిస్రాయేలు దేశమునకు పయనమై వచ్చి రాజునకు కమ్మనందించెను.

6. దానియందు ఇట్లున్నది “నా ఉద్యోగియైన నామానును ఈ లేఖతో నీ చెంతకు పంపుచున్నాను. నీవు అతని కుష్ఠమును నయము చేయవలసినది."

7. యిస్రాయేలు రాజు ఆ జాబు చదివి బట్టలుచించుకొనెను. కొలువుకాండ్రతో “వింటిరా! సిరియారాజు నేనితని కుష్ఠము నయము చేయవలయును అని అనుచున్నాడు. చావునుగాని, బ్రతుకును గాని కలిగించుటకు నేను దేవుడనాయేమి? అతడు నాతో జగడము పెట్టుకొనుటకే ఈ పన్నాగము పన్నెనని స్పష్టమగుటలేదా?” అనెను.

8. కాని రాజు బట్టలు చించుకొన్నాడని విని దైవభక్తుడైన ఎలీషా అతనియొద్దకు కబురుపంపి “నీవు బట్టలు చించుకోనేల? నామానును నాయొద్దకు పంపుము. యిస్రాయేలు దేశమున ప్రవక్త ఒకడు ఉన్నాడని అతడు గుర్తించును” అని చెప్పెను.

9. నామాను రథములతో, గుఱ్ఱములతో వెడలివచ్చి ఎలీషా ఇంటిద్వారము ముందట నిలువగా,

10. ఎలీషా అతనివద్దకు తన సేవకునిపంపి “నీవు వెళ్ళి యోర్దాను నదిలో ఏడుసార్లు స్నానముచేయుము. నీ శరీరమునకు మరల ఆరోగ్యము చేకూరును” అని చెప్పించెను.

11. కాని ఆ మాటలు విని నామాను ఉగ్రుడయ్యెను. అతడు “ప్రవక్త వెలుపలికి వచ్చి, నా ఎదుట నిలుచుండి, తన దేవుని ప్రార్ధించి, కుష్ఠము సోకిన భాగముపై తనచేయి త్రిప్పి, నా వ్యాధి నయము చేయుననుకొంటిని.

12. దమస్కు నందలి అబానా, ఫర్పరు నదులు ఈ యిస్రాయేలు నదికంటె గొప్పవి కావా? నేను ఆ నదులలో స్నానముచేసి ఆరోగ్యము పొందలేనా?” అనుచు అచ్చటి నుండి వెడలిపోజొచ్చెను.

13. అప్పుడు సేవకులలో ఒకడు అతనికి అడ్డుపడి 'అయ్యా! ప్రవక్త నిన్నేదైన కష్టమైన కార్యము చేయుమని ఆజ్ఞాపించినయెడల నీవు తప్పక చేసియుండెడివాడవే గదా? ఇప్పుడతడు చెప్పినట్లు నదిలో స్నానముచేసి శుద్ధిపొందుట సులభముగాదా?" అనిరి.

14. ఆ మాటలు ఆలించి నామాను యోర్దాను నదికి వెళ్ళెను. ప్రవక్త ఆదేశించినట్లే నదిలో ఏడుసార్లు మునిగి స్నానముచేసెను. వెంటనే అతని శరీరము శుద్ధిపొంది పసిబిడ్డ దేహమువలె అయ్యెను.

15. అంతట నామాను తన పరిజనముతో ఎలీషా చెంతకువచ్చి "అయ్యా! ఈ భూమి మీద యిస్రాయేలు దేవుడుతప్ప మరియొక దేవుడు లేడని నాకిప్పుడు స్పష్టమైనది. నేను నీకొక కానుకను సమర్పించు కోగోరెదను, చిత్తగింపుము” అనెను.

16. కాని ఎలీషా “నేను కొలుచు సజీవుడైన యావే తోడు! నీ కానుక లేమియు నాకక్కరలేదు” అనెను. నామాను ఎంత బ్రతిమాలినను ప్రవక్త అతని బహుమతిని అంగీకరింపలేదు.

17. నామాను “నీవు నా కానుకను అంగీకరింపవైతివి. ఇచ్చటినుండి రెండు కంచర గాడిదలు మోయునంత మట్టినైనను ' మా దేశమునకు కొనిపోనివ్వవా? నేటినుండి నేను ప్రభువునకు తప్ప మరియే అన్యదైవములకు బలులుగాని, దహనబలులుగాని సమర్పింపను.

18. మా ప్రభువగు సిరియారాజు రిమ్మోను దేవళమునకు వెళ్ళినపుడు నేనును అతని వెంట పోవలయును. అతడు నా భుజములపై వ్రాలి రిమ్మోనును ఆరాధించునపుడు నేనును ఆ దేవునకు మ్రొక్కవలయును. ఈ ఒక్క కార్యమునకుగాను యావే ప్రభువు నన్ను మన్నించుగాక!” అని పలికెను.

19. ఎలిషా అతనితో “నీవు నిశ్చింతగా వెళ్ళిరమ్ము” అని చెప్పగా నామాను తన దేశమునకు పయనమయ్యెను.

20. అతడు కొంచెము దూరము పోయెనో లేదో, ఎలీషా సేవకుడు గేహసీ “యజమానుడు కానుక పుచ్చుకొనకయే ఈ సిరియా సైన్యాధిపతిని పంపివేసెనుగదా! సజీవుడైన యావే తోడు! నేను అతని వెంట పరుగెత్తి ఏదైన బహుమానమును అడిగి పుచ్చు కొందును” అని తలంచెను.

21. కనుక గేహనీ నామాను వెనువెంట పరుగెత్తాను. నామాను తన వెనుక ఎవరో పరుగెత్తుకొని వచ్చుచున్నారని గమనించి రథము దిగి గేహసీని కలిసికొని “అందరు క్షేమముగా నున్నారా?” అని ప్రశ్నించెను.

22. గేహసీ “మేము అందరము కుశలముగనే ఉన్నాము. ఇప్పుడే ఎఫ్రాయము మన్నెమునందలి ప్రవక్తల సమాజము నుండి ఇరువురు ప్రవక్తలు మా ఇంటికి వచ్చిరి. వారికి గాను మూడు వేల వెండినాణెములు, రెండుజతలు పట్టుబట్టలు ఈయవలసినదని మా యజమానుడు నిన్నడుగు చున్నాడు” అని చెప్పెను.

23. నామాను "అయ్యా! మూడువేలేమి, ఆరువేలనాణెములు గైకొనుము" అని గేహసీని బ్రతిమాలెను. అతడా నాణెములు రెండు సంచులలో పోసెను. ఆ సంచులను, రెండు జతల పట్టుబట్టలను ఇదరు సేవకుల నెత్తికెత్తించెను. వారు ఆ కానుకలను మోసికొనుచు గేహసీ ముందు నడచి వచ్చిరి.

24. వారు కొండచెంతకు రాగానే గేహసీ ఆ సంచులను తన ఇంటచేర్చుకొని నామాను సేవకులను పంపివేసెను.

25. తరువాత గేహసీ ఎలీషా వద్దకు వెళ్ళెను. ప్రవక్త  “ఓయి! నీవెక్కడికి వెళ్ళితివి?” అని అతని నడిగెను. గేహసీ "నేనెక్కడికిని వెళ్ళలేదు” అనెను.

26. కాని ఎలీషా “అతడు రథముదిగి నిన్ను కలసికొనినపుడు నా మనసు నీతో రాలేదనుకొంటివా? డబ్బు, ఉడుపులు, ఓలివుతోటలు, ద్రాక్షతోటలు, గొఱ్ఱెల మందలు, గొడ్లమందలు, దాసదాసీజనములు కానుకగా స్వీకరించుటకు ఇది అదననుకొంటివా?

27. నామానునకు సోకిన కుష్ఠము తరతరముల వరకు నిన్నును నీ వంశీయులను పట్టి పీడించునుగాక!” అని పలికెను. గేహసీ యజమానుని ఇంటినుండి వెలుపలికి వచ్చునప్పటికి కుష్ఠము సోకగా అతని ఒడలు మంచు వలె తెల్లనయ్యెను.

 1. ఒకనాడు ప్రవక్తల సమాజములోని శిష్యులు ఎలీషాతో "అయ్యా! మనము వసించు ఈ తావు చాల ఇరుకుగా ఉన్నది.

2. నీవు అనుమతి ఇచ్చినచో మేము యోర్దాను నదికి వెళ్ళి కట్టు నరుకుకొనివచ్చి క్రొత్త ఇండ్లు కట్టుకొందుము” అనిరి. అతడు 'అట్లే పొండు' అనెను.

3. వారిలో ఒకడు ఎలీషాను కూడ తమతో రమ్మని బతిమాలగా అతడు అంగీకరించెను.

4. వారందరును కలిసివెళ్ళి యోర్దాను చేరుకొని అచట కఱ్ఱ నరకుచుండిరి.

5. అపుడు ప్రవక్త ఒకడు చెట్టును నరకుచుండగా అతని ఇనుపగొడ్డలి జారి క్రింది నీటిలో పడెను. అతడు ఎలీషాతో "అయ్యా! ఇది ఎరవు గొడ్డలి. నేనిక ఏమి చేయుదును!” అనుచు సంతాప పడెను.

6. ఎలీషా అది ఎక్కడ పడినదో చూపుమనెను. అతడు గొడ్డలిపడిన తావును చూపెను. ఎలీషా ఒక కొమ్మ నరికి ఆ తావున పడవేయగా ఇనుపగొడ్డలి నీటిపై తేలియాడెను.

7. అతడు గొడ్డలిని తీసికొమ్మనగా చెట్టు కొట్టినవాడు చేయిచాచి దానిని వెలుపలికి తీసెను.

8. సిరియారాజు యిస్రాయేలుపై దండెత్త, అతడు తన ఉద్యోగులతో సంప్రతించి ఒకానొక అనువైన తావున శిబిరము పన్నెదమని చెప్పెను.

9. కాని దైవజనుడు ఎలీషా “అచట సిరియనులు పొంచి ఉన్నారు. కనుక నీవు ఆ తావునకు వెళ్ళవలదు” అని యిస్రాయేలు రాజునకు కబురంపెను.

10. కనుక యిస్రాయేలు రాజు ఆ శిబిరము ప్రాంతమున వసించు తన ప్రజలను ముందుగనే హెచ్చరింపగా వారు అపాయము నుండి తప్పించుకొనిరి. ఇట్లు చాలాసార్లు జరిగెను.

11. కడకు సిరియారాజు విసిగిపోయి తన సైనికోద్యోగులను పిలిపించి “మీలో ఎవడో మనగుట్టు యిస్రాయేలు రాజునకు ఎరిగించుచున్నాడు, అతడు ఎవడు?” అని ప్రశ్నించెను.

12. వారిలో ఒకడు “ప్రభూ! మన వారెవ్వరు ఇక్కడి రహస్యములను పొక్కనీయరు. కాని ప్రవక్త ఎలీషా నీవు పడకగదిలో రహస్యముగా పలికిన మాటలుకూడ గ్రహించి యిస్రాయేలు రాజునకు తెలియజేయుచున్నాడు” అని చెప్పెను.

13. రాజు “మీరు వెళ్ళి అతని జాడ తెలిసి కొనిరండు. నేనతనిని పట్టి తెప్పింతును” అనెను. అప్పుడు ఎలీషా దోతానున వసించుచున్నాడని తెలియ వచ్చెను.

14. కనుక రాజు రథములతో, గుఱ్ఱములతో మహా సైన్యమును అచటికి పంపెను. ఆ పటాలము రాత్రివేళవచ్చి నగరమును ముట్టడించెను.

15. ఎలీషా సేవకుడు వేకువనే నిద్రలేచి ఇంటినుండి వెలుపలికి వచ్చి చూడగా రథములతో, గుఱ్ఱములతో సిరియాదండు నగరమును చుట్టుముట్టియుండెను. అతడు ఎలీషాతో "అయ్యా! మనకు చావుమూడినది. ఇక ఏమిచేయుదము?" అనెను.

16. కాని ఎలీషా అతనితో “నీవు భయపడకుము. వారి వైపున పోరాడు వారికంటె మనవైపున పోరాడువారే ఎక్కువమంది యున్నారు” అనెను.

17. అతడు దేవుని ప్రార్ధించి “ప్రభూ! ఇతనికి దృష్టి దయచేయుము” అని మనవి చేసెను. ప్రభువు ఆ సేవకునకు చూపునొసగగా అతడు కొండ అంతయు అగ్నిరథములతోను గుఱ్ఱములతోను నిండియుండుటను చూచెను. అవన్నియు ఎలీషా చుట్టునున్నట్లుగా కూడ కన్పించెను.

18. అంతట సిరియనులు తన సమీపమునకు వచ్చుట చూచి ఎలీషా “ప్రభూ! వీరికి కనుచూపు పోవునట్లు చేయుము” అని ప్రార్థించెను. అతడు మనవిచేసినట్లే ప్రభువు సిరియా సైనికులను గ్రుడ్డివారిని చేసెను.

19. ఎలీషా ఆ సైనికులచెంతకు వెళ్ళి “నాయనలార! మీరు త్రోవతప్పితిరి. మీరు ముట్టడింప గోరిన నగరము ఇదికాదు. మీరు పట్టుకోగోరినవాని చెంతకు నేను మిమ్ము తోడ్కొనిపోయెదను, నా వెంట రండు” అనెను. కాని అతడు వారిని సమరియా నగరమునకు నడిపించుకొనిపోయెను.

20. ఆ దండు నగరము ప్రవేశింపగనే ఎలీషా “ప్రభూ! వీరికి చూపు దయచేయుము” అని ప్రార్ధించెను. అతడు కోరినట్లే ప్రభువు సైనికులకు దృష్టి ప్రసాదింపగా వారు తాము సమరియా నగరమున ఉన్నట్లు గుర్తించిరి.

21. యిస్రాయేలు రాజు సిరియా సైన్యమును చూచి "అయ్యా! వీరిని సంహరింపమందువా?” అని అడిగెను.

22. ప్రవక్త "వలదు వలదు నీ కత్తి, బాణము సహాయమున ఖైదీలను నిర్బందించి వారిని నీవు చంపుదువా? వారు భుజించుటకు రొట్టెలను, త్రాగుటకు నీటిని ఒసగుము. అటుపిమ్మట వారు తమ రాజునొద్దకు వెడలిపోవుదురు” అనెను.

23. కనుక యిస్రాయేలు రాజు వారికి గొప్పవిందు చేసెను. వారు అన్న పానీయములు సేవించి తమ రాజునొద్దకు మరలిపోయిరి. అటుతరువాత సిరియా దండులు యిస్రాయేలు దేశము మీద మరల దాడిచేసి ఎరుగవు.

24. అటుపిమ్మట సిరియా రాజు బెన్హ్-దదు సర్వ సైన్యముతో యిస్రాయేలు మీదికి దండెత్తి వచ్చి సమరియాను ముట్టడించెను.

25. ఈ ముట్టడి ఫలితముగా పట్టణమున ఆహారపదార్థములు కొరతపడి పెద్ద కరువురాగా, ఒక్క గాడిద తల ఎనుబది వెండినాణెములు, అరపావు పావురపురెట్ట' ఐదు వెండి నాణెములకు అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసియుండిరి.

26. ఒకనాడు యిస్రాయేలురాజు పట్టణ ప్రాకారముపై తిరుగుచుండగా ఒకానొక స్త్రీ "ప్రభూ! నన్ను రక్షింపుము" అని కేక వేసెను.

27. రాజు “అమ్మా! ప్రభువే నిన్ను రక్షించనపుడు నేనెట్లు రక్షింపగలను? నా ఇంట గోధుమలు, ద్రాక్షసారాయము ఉన్నవి కనుకనా? అయినను నీ బెడదయేమి?” అని అడిగెను.

28. ఆ స్త్రీ “ఇదిగో ఈమె 'నేడు నీ బిడ్డను తిందము, రేపటికి నా బిడ్డను తిందము' అనెను.

29. అట్లే నా బిడ్డను వండి తింటిమి. మరునాడు ఆమె బిడ్డను తిందమని అడుగగా తాను వానినెక్కడనో దాచినది” అని చెప్పెను.

30. ఆ మాటలాలించి రాజు విచారముతో బట్టలు చించుకొనెను. అప్పుడు రాజు ప్రాకారముపై నుండెనుకదా! అక్కడి జనులు అతడు వెలుపలి దుస్తుల మాటున గోనె తొడుగుకొని ఉండుటను గమనించిరి.

31. అతడు కోపముతో మండిపడుచు “నేడు ఎలీషా తల తీయింపనేని ప్రభువు నన్ను శిక్షించుగాక!” అని పలికెను.

32. అప్పుడు ఎలీషా కొందరు పెద్దలతో తన ఇంట కూర్చుండి ఉండెను. రాజు ఎలీషాను పట్టి తెచ్చుటకై దూతనంపెను. కాని ఆ దూత తన ఇల్లు చేరక మునుపే ఎలీషా పెద్దలతో “చూచితిరా! ఈ నరహంతకుని కుమారుడు నా తల నరకుకొని పోవుటకు దూతనంపుచున్నాడు. ఆ బంటు ఇచటికి వచ్చినపుడు మీరు తలుపుమూయుడు. వానిని లోనికి రానీయకుడు. వాని వెనుకనే వాని యజమానుని అడుగులచప్పుడు వినబడునుగదా!” అని చెప్పుచుండ గనే

33. రాజు వచ్చి “ప్రభువే మనకు ఈ కీడు వాటిల్లునట్లు చేసెను. నేనింకను అతనిని నమ్ముకొని కూర్చుండనేల?” అని పలికెను.

 1. ఎలీషా రాజుతో "ప్రభువు సందేశము వినుము. రేపీపాటికే సమరియా అంగడిలో ఒక మానిక మంచి గోధుమపిండి, రెండు మానికల యవలను ఒక వెండి నాణెమునకు అమ్మెదరు” అనెను.

2. ఆ మాటలకు రాజు అంగరక్షకుడు “ప్రభువు వెంటనే ఆకాశకిటికీలు తెరిచిననూ, నీవు చెప్పినంత చౌకగా ధాన్యము అమ్ముడు పోదు” అనెను. ఎలీషా “నీ కన్నులారా చూతువు కాని నీవు మాత్రము ఆ ధాన్యముతో వండిన భోజనమును ముట్టుకోజాలవు” అని మారు పలికెను.

3. అప్పుడు కుష్ఠరోగులు నలుగురు సమరియా నగరద్వారమువద్ద పడిఉండిరి. వారు తమలో తాము “మనము ఆకలితో చచ్చు వరకు ఇకుడనే పడి ఉండనేల?

4. నగరమున ప్రవేశించినచో, నగరమున కరువు ఉన్నందున అక్కడను చత్తుము. అటులని ఇక్కడున్నను చావు తప్పదు. కనుక ఇపుడు సిరియనుల శిబిరమునకు వెళ్ళుదము రండు. వారు మనలను చంపినచో చత్తుము. బ్రతుకనిచ్చినచో బ్రతుకుదుము” అనుకొనిరి.

5. ఇట్లనుకొని వారు సందె చీకటిన శత్రు శిబిరమునకు పోయి చూచెదమని లేచి, శిబిరమును చేరిచూడగ అచట ఎవ్వరును కన్పింపలేదు.

6. ప్రభువు సిరియనులకు రథములతో, గుఱ్ఱములతో వచ్చు మహా సైన్యనాదము వంటి ధ్వని విన్పడునట్లు చేయగా, ఆ శబ్దము విని సిరియనులు యిస్రాయేలు రాజు జాతీయ రాజులకును, ఐగుప్తు రాజులకును బత్తెమిచ్చి తమమీద పడుచున్నాడు కాబోలునని కలవరపడిరి.

7. కనుక వారు తమ గుడారములను, గుఱ్ఱములను, కంచరగాడిదలను విడనాడి శిబిరమును ఉన్నదానిని ఉన్నట్లు వదలి పెట్టి బ్రతుకుజీవుడా అని సందె చీకటిలో పారిపోయిరి.

8. కుష్ఠరోగులు పాళెము చొచ్చి ఒక గుడారమున జొరబడి అచటనున్న అన్న పానీయములు పుచ్చుకొనిరి. అచట దొరకిన వెండి బంగారములు, వస్త్రములు దోచుకొనిపోయి ఒక తావున దాచివచ్చిరి. మరల ఇంకొక గుడారమున ప్రవేశించి దానినిగూడ దోచుకొనిపోయిరి.

9. అంతట ఆ నలుగురు ఒకరితోనొకరు “మనము పాడుపని చేయుచున్నాముకదా! ఇది నేడు పట్టణమున వినిపింపదగిన శుభసందేశము. అయినను మనము నోరు కదుపుటలేదు. రేపు ప్రొద్దు పొడుచువరకు ఈ సంగతిని దాచెదమేని అధికారులు మనలను దండింతురు. కావున వెంటనే వెళ్ళి జరిగిన సంగతిని రాజోద్యోగులకు తెలియజేయుదము” అని తమలో తాము మథనపడిరి.

10. కనుక వారు శిబిరమునుండి సమరియా నగరద్వారము వద్దకు వచ్చి అచట కాపున్న ద్వారపాలకులతో “మేము సిరియనుల మకామునకు వెళ్ళితిమి. కాని అచట ఎవరును కన్పింపలేదు. జనసందడి కూడలేదు. గుఱ్ఱములు, గాడిదలు కట్టిపడియున్నవి, గుడారములు ఎక్కడివక్కడే నున్నవి” అని చెప్పిరి.

11. ద్వారపాలకులు ఆ వార్తను రాజసౌధమున వినిపింపజేసిరి.

12. అప్పటికింకను చీకట్లు విచ్చిపోలేదు. అయినను రాజు పడక నుండి లేచి తన ఉద్యోగులతో “మీరు ఈ సిరియనుల పన్నాగము నెరిగితిరా? మనమిక్కడ కరవుతో చచ్చిపోవుచున్నాము కదా! కనుక వారు శిబిరము వీడిపోయినట్లు నటించి ఎక్కడనో పొలమున దాగుకొని ఉందురు. మనము భోజనపదార్థములు సేకరించుకొనుటకు నగరము వీడివత్తుమని వారి తలపు. అప్పుడు మనమీదపడి మనలను బంధించి, మన నగరమును స్వాధీనము చేసికొనవచ్చునని వారి కుట్ర” అనెను.

13. అప్పుడు రాజోద్యోగి ఒకడు “ప్రభూ! ఇక ఈ పట్టణమున మిగిలియున్నవారును గతించినవారివలె చచ్చుట నిక్కము. కనుక ఆ మిగిలియున్న అయిదు గుఱ్ఱములపై కొందరిని శత్రు శిబిరమునకు పంపుదము. వారు వెళ్ళి ఏమి జరిగినదో తెలిసికొనివత్తురు” అనెను'.

14. అంతట ఉద్యోగులు జనులను కొందరిని ఎన్నుకొనగా రాజు వారిని రెండు రథములపై పంపి, మీరుపోయి సిరియనుల శిబిరమున ఏమి జరిగినదో తెలిసికొనిరండని చెప్పెను.

15. అటుల వెళ్ళిన వారు సిరియనులను గాలించుచు యోర్దాను వరకు వెళ్ళిరి. శత్రువులు పారిపోవుచు త్రోవలో జారవిడిచిన బట్టలను సామగ్రిని చూచిరి. వారు తిరిగివచ్చి తాము చూచినదంతయు రాజునకు విన్నవించిరి.

16. వెంటనే యిస్రాయేలు పౌరులు ఒక్కుమ్మడిగా పరుగెత్తుకొనిపోయి సిరియా శిబిరమును దోచుకొనిరి. అపుడు ప్రభువు చెప్పినట్లుగనే నగరమున ఒకమానిక మంచి గోధుమపిండి, రెండుమానికల యవలు ఒకవెండినాణెమునకు అమ్ముడుపోయెను.

17. ఆ సమయమున రాజు తన అంగరక్షకునే నగరద్వారమునకు కాపుంచి ఉండెను. కాని ప్రజలు శిబిరమునకుపోవు సంబరమున అతనిని తొక్కివేసిరి. మునుపు రాజు తనను చూడబోయినప్పుడు ఎలీషా ప్రవచించినట్లే ఆ అంగరక్షకుడు మరణించెను.

18. రేపు ఈ పాటికి సమరియా అంగడిలో ఒక మానిక మంచి గోధుమపిండి, రెండుమానికల యవలు ఒక వెండినాణెమునకు అమ్ముడుపోవునని ప్రవక్త రాజుతో చెప్పెనుకదా! అతడు చెప్పినట్లే జరిగెను.

19. అపుడు రాజు అంగరక్షకుడు ప్రభువు వెంటనే ఆకాశ కిటికీలు తెరిచిననూ నీవు చెప్పినంతచౌకగా ధాన్యము అమ్ముడు వోదు అనెను. అందుకు ఎలీషా “నీ కన్నులారా చూతువు కాని నీవు మాత్రము ఆ ధాన్యముతో వండిన భోజనమును ముట్టుకోజాలవు” అని నుడివెను గదా!

20. అతడు చెప్పినట్లే జరిగెను. నగరద్వారమున ప్రజలు అంగరక్షకుని తొక్కుకొని పోగా అతడు మరణించెను.

 1. షూనేమున వసించు ధనవంతురాలి బిడ్డను ఎలీషా జీవముతో లేపెనుగదా! ఒకనాడు అతడామెతో “ప్రభువు ఈ నేలమీద ఏడేండ్ల పాటు కరువు రప్పించును. కనుక నీవు నీ కుటుంబము ఇక్కడినుండి వెడలిపోయి ఎక్కడనైన తలదాచుకొనుడు” అని చెప్పెను.

2. ప్రవక్త చెప్పినట్లే ఆమె ఫిలిస్తీయా దేశమునకు వలసపోయి అచట ఏడేండ్లు తలదాచుకొనెను.

3. ఏడేండ్లు గడచిన తరువాత ఫిలిస్తీయా దేశమునుండి ఆ ఇల్లాలు, పరివారము యిస్రాయేలు దేశమునకు తిరిగివచ్చి తన పొలమును, ఇంటిని స్వాధీనము చేయింపుమని మనవి చేసికొనుటకై రాజువద్దకు వెళ్ళెను.

4. ఆమె వెళ్ళునప్పటికి రాజు ఎలీషా శిష్యుడైన గేహసీతో మాట్లాడుచు ప్రవక్త చేసిన అద్భుతకార్యములను వినిపింపుమని అడుగుచుండెను.

5. అతడు ఎలీషా ఒక మృతుని జీవముతో లేపెనని చెప్పుచుండగనే ఆ ఇల్లాలుకూడ వచ్చి తన ఇంటిని పొలమును తిరిగి ఇప్పింపుమని రాజును వేడుకొనెను. అప్పుడు గేహసీ "ప్రభూ! ఎలీషా జీవముతో లేపినది ఈమె బిడ్డనే” అని తల్లిని, కుమారుని చూపించెను.

6. రాజు “నిజమేనా” అని ఆ స్త్రీని ప్రశ్నింపగా ఆమె “అవును” అని రాజుతో జరిగిన సంగతంతయు వివరించెను. రాజు ఒక ఉద్యోగిని పిలిపించి “ఈమె ఆస్తినంతటిని ఈమె పరముచేయుడు. అంతేకాదు. ఏడేండ్లలో ఈమె పొలమున పండిన పంటకు వెలకట్టి ఆ సొమ్ముకూడ ముట్టజెప్పుడు” అని ఆజ్ఞాపించెను.

7. ఎలీషా దమస్కునకు వచ్చెను. అప్పుడు సిరియా రాజగు బెన్హదదునకు జబ్బుగానుండెను. అతడు ఎలీషా ప్రవక్త వచ్చెనని వినెను.

8. తన ఉద్యోగియైన హసాయేలును పిలిచి “నీవు కానుకలు తీసికొని ప్రవక్త యొద్దకు వెళ్ళుము. ప్రభువును సంప్రతించి నా వ్యాధి నయమగునో లేదో తెలియ చెప్పుమని అతనిని అడుగుము” అని ఆదేశించెను.

9. కనుక హసాయేలు దమస్కున లభించు మేలివస్తువులన్నిటిని సేకరించుకొని ఆ బహుమతులను నలువది ఒంటెలమీద ఎక్కించుకొని ఎలీషా వద్దకు వచ్చెను. అతడు “నీ దాసుడు బెన్హ్-దదు తన వ్యాధి నయమగునో లేదో తెలియజెప్పుమని వేడుకొనుచున్నాడు” అని మనవి చేసెను.

10. ఎలీషా అతనితో “ప్రభువు అతడు చనిపోవుననియే తెల్పుచున్నాడు. అయినను నీవు రాజుతో అతని వ్యాధి కుదురునని చెప్పుము” అనెను.

11. అంతట ఎలీషా మొగము బిగిసికొనిపోగా హసాయేలు మొగము చిన్నబోవు నంతగా అతనిని తదేకముగా చూచుచూ కన్నీరు కార్చెను.

12. హసాయేలు “అయ్యా! నీవెందుకు విలపించుచున్నావు?” అని అడిగెను. ప్రవక్త ఓయీ! నీవు యిస్రాయేలునకు మహాపకారము చేయుదువు. నీవు వారి కోటలు కాల్చివేయుదువు. వారి పని కందులను నేలపై మోది నజ్జునజ్జు చేయుదువు. వారి చూలాలుల కడుపులు నిలువున చీల్చివేయుదువు” అనెను.

13. హసాయేలు ""అయ్యా! నేను అల్పుడను. నేనెక్కడ, నీవు పేర్కొనిన ఈ కార్యములన్నిటిని చేయు టెక్కడ?” అని అడిగెను. ప్రవక్త “నీవు సిరియాకు రాజువు అగుదువని ప్రభువు నాకు తెలియజేసెను” అనెను."

14. అంతట ఎలీషాను విడచివెళ్ళి హసాయేలు రాజునొద్దకు వెళ్ళగా అతడు ప్రవక్త నీతో ఏమిచెప్పెనని ప్రశ్నించెను. అతడు “ప్రవక్త నీ వ్యాధి కుదురునని పలికెను” అని బదులు చెప్పెను.

15. కాని మరునాడు హసాయేలు రాజు ముఖమును తడిసిన జమకాణముతో కప్పిపెట్టగా అతడు ఊపిరాడక చనిపోయెను. అంతట బెన్హ్-దదుకు మారుగా హసాయేలు నిరియాకు రాజయ్యెను.

16. యిస్రాయేలు రాజ్యమున అహాబు కుమారుడు యెహోరాము పరిపాలనాకాలము ఐదవయేట, యెహోషాఫాత్తు కుమారుడు యెహోరాము యూదా రాజ్యమునకు రాజయ్యెను.

17. యెహోరామునకు అప్పటికి ముప్పది రెండేండ్లు. అతడు యెరూషలేము రాజధానిగా ఎనిమిదేండ్లు పరిపాలించెను.

18. ఆ రాజు అహాబు కుమార్తెను పెండ్లియాడెను, అహాబు కుటుంబమువలె, యిస్రాయేలు రాజులవలె అతడును దుష్టుడై యావే ఒల్లని దుష్కార్యములు చేసెను.

19. ప్రభువు దావీదునకు నీ వంశస్తులు కలకాలము రాజ్యము పాలింతురని మాట ఇచ్చెను గనుక అతడు యూదా రాజ్యమును నాశనము చేయలేదు.

20. యెహోరాము పరిపాలనా కాలమున ఎదోము తిరుగుబాటుచేసి స్వతంత్ర రాజ్యమయ్యెను.

21. యెహోరాము రథములతో సేయీరునకు వెళ్ళగా ఎదోమీయులు అతనిని చుట్టుముట్టిరి. కాని రాత్రివేళ అతడును అతని రథాధిపతులును శిబిరమునుండి తప్పించుకొని పారిపోయిరి. అతని సైనికులును పారి పోయి తమ నివాసములు చేరుకొనిరి.

22. నాటి నుండి నేటివరకు ఎదోము స్వతంత్ర రాజ్యముగనే ఉన్నది. ఇదే సమయమున లిబ్నా పట్టణము కూడ తిరుగబడెను.

23. యెహోరాము చేసిన ఇతర కార్యములు యూదా రాజుల చరితమున లిఖింప బడియే ఉన్నవి.

24. యెహోరాము తన పితరులతో నిద్రించగా, దావీదు నగరమున పితరుల సమాధిలోనే పూడ్చిపెట్ట బడెను. అతని తరవాత అతని కుమారుడు అహస్యా రాజయ్యెను.

25. యిస్రాయేలు రాజ్యమున అహాబు కుమారుడు యెహోరాము పరిపాలనాకాలమున పండ్రెండవ యేట, యెహోరాము కుమారుడు అహస్యా యూదా రాజ్యమునకు రాజయ్యెను.

26. అప్పటికి అతని వయస్సు ఇరువది రెండేండ్లు. అతడు యెరూషలేము నుండి ఒక యేడు పరిపాలించెను. అతని తల్లి అతల్యా. ఆమె యిస్రాయేలు రాజగు ఒమ్రి కుమార్తె.

27. అహస్యా అహాబు కుటుంబములోని పడుచును పెండ్లియాడెను గనుక అతడును వారివలెనే యావే ఒల్లని నీచపనులు చేసెను.

28. అహస్యా యిస్రాయేలురాజు యెహోరాముతో కూడి సిరియారాజు హసాయేలుతో యుద్ధముచేసెను. ఇరుపక్షముల సైన్యములు రామోతుగిలాదు వద్ద పోరాడెను. ఆ పోరున యెహోరాము గాయపడెను.

29. అతడు యెస్రెయేలు నగరమునకు తిరిగివచ్చి గాయములకు చికిత్స చేయించుకొనుచుండెను. అహస్యా యెహోరాము రాజును చూడబోయెను.

 1. ఎలీషా ఒక యువప్రవక్తను పిలిచి “నీవు ప్రయాణమునకు సన్నద్ధుడవై గిలాదునందలి రామోతునకు పొమ్ము. ఈ తైలపాత్రముగూడ నీవెంట కొని పొమ్ము.

2. అక్కడకు వెళ్ళినపిదప నింషీ మనుమడు యెహోషాఫాత్తు కుమారుడునగు యెహూ ఎక్కడ నున్నాడో తెలిసికొనుము. అతనిని మిత్రుల మధ్యలో నుండి లేపి లోపలిగదిలోకి తోడ్కొనిపొమ్ము.

3. ఈ తైలమును అతని తలమీద పోసి 'ప్రభువు నిన్ను యిస్రాయేలునకు రాజుగా అభిషేకించితినని సెలవిచ్చుచున్నాడు' అని చెప్పుము. వెంటనే నీవు తలుపు తెరచి శీఘ్రముగా పారిపొమ్ము” అని ఆదేశించెను.

4-5. ఆ యువకుడు రామోతుగిలాదు చేరుకొను నప్పటికి సైన్యాధిపతులందరు ప్రోగై యుద్ధ విషయములు ముచ్చటించుకొనుచుండిరి. అతడు "సైన్యాధిపతీ! నీకొక సందేశము కొనివచ్చితిని” అనెను. యెహూ “ఓయీ! నీ సందేశము మాలో ఎవరికి వినిపింప గోరెదవు?” అని ప్రశ్నించెను. అతడు “నీకే” అని బదులు చెప్పెను.

6. యెహూ లేచి లోపలి గదిలోనికి వెళ్ళెను. అచట యువప్రవక్త యెహూ తలపై తైలము పోసి, అతడు యెహూతో “యిస్రాయేలు దేవుడైన యావే ప్రభువు మాట ఇది. నేను నిన్నభిషేకించి నాప్రజ యిస్రాయేలునకు రాజుగా నియమించితిని.

7. నీవు నీ యజమానుడగు అహాబుని కుమారుని వధింపవలయును. యెసెబెలు నా ప్రవక్తలను నా సేవకులను చంపినందుకుగాను నేను ప్రతీకారము చేసితీరెదను.

8. కనుక అతని కుటుంబము అతని వంశజులందరు చావవలసినదే. అతని వంశీయులు, వారు బానిసలైనను, స్వేచ్ఛాపరులైనను, అందరును చావవలసినదే.

9. నెబాతు కుమారుడు యరోబాము కుటుంబము వలెను, అబీయా కుమారుడు బాషా కుటుంబము వలెను, అహాబు కుటుంబమును కూడ వేరంట పెరికివేయుదును.

10. యెసెబెలు శవమును పాతి పెట్టువారుండరు. యెస్రెయేలు మండలమున కుక్కలు ఆమె శవమును తినును” అని పలికి వెంటనే తలుపు తెరిచి పారిపోయెను.

11. యెహూ సైన్యాధిపతుల వద్దకు రాగానే వారతనితో “అందరు సురక్షితమేగదా. ఆ పిచ్చివానికి నీతో ఏమి పనికలిగినది?” అని అడిగిరి. యెహూ “అతడెందుకు వచ్చెనో మీరెరుగుదురు గదా!” అనెను.

12. కాని వారు “నీవు మాతో చతురాడవలదు. అతడు నీతో ఏమి చెప్పెనో తెలుపుము" అని అడిగిరి. యెహూ “ప్రభువు నన్ను యిస్రాయేలునకు రాజుగా అభిషేకించెనని అతడు నాతో చెప్పెను” అనెను.

13. వెంటనే తోడి సైన్యాధిపతులు తమ వస్త్రములను యెహూ కాళ్ళముందట మెట్లపైన పరచిరి. బాకాలు ఊది యెహూ రాజయ్యెనని నినాదము చేసిరి.

14. యెహూ యెహోరామురాజు మీద కుట్ర పన్నెను. అప్పుడు యెహోరాము యెస్రెయేలున వసించుచుండెను. యెహోరామును, యిస్రాయేలీయులందరును కలసి హసాయేలుతో పోరాడి రామోతును స్వాధీనము చేసుకొనుటకు వ్యూహము పన్నిరి.

15. అయితే యెహోరాము రామోతు వద్ద సిరియారాజు హసాయేలుతో జరిగిన పోరాటమున గాయపడి యెస్రెయేలున చికిత్స పొందుచుండెను. అపుడు యెహూ తోడి సైన్యాధిపతులతో “మీరు నా పక్షమున చేరగోరుదురేని ఈ రామోతునుండి ఎవరుగాని వెళ్ళి ఇక్కడ జరిగిన సంగతులను యెస్రెయేలునందు తెలుపకుండునట్లు చూడుడు” అని ఆజ్ఞాపించెను.

16. వెంటనే అతడు రథమునెక్కి యెస్రెయేలునకు పయనమయ్యెను. అచట యెహోరామునకు గాయము ఇంకను మానలేదు. యూదారాజు అహస్యాకూడ ఆ సమయముననే యెహోరామును సందర్శింప వచ్చి యుండెను.

17. యెస్రెయేలున కోటబురుజుపైనున్న గస్తీ వాడు యెహూ సైన్యముతో వచ్చుట చూచి ఎవరో వచ్చుచున్నారని యెరిగించెను. యెహోరాము ఒక బంటును గుఱ్ఱముపై పంపి మనపక్షము వారి క్షేమము తెలిసికొనుడని ఆజ్ఞ యిచ్చెను.

18. వెంటనే ఒక ఆశ్వికుడు వెళ్ళి యెహూను కలసికొని “మన పక్షము వారందరు సురక్షితముగా ఉన్నారా అని రాజు ప్రశ్నించుచున్నాడు” అని పలికెను. కాని యెహూ “ఆ సంగతి నీకెందులకు? నీవుకూడ వెనుకకు పోయి సైన్యములో చేరుము” అని నుడివెను. కావలివాడు “మన అశ్వికుడు వెళ్ళి వారిని కలసికొనెను గాని తిరిగి వచ్చుటలేదు” అని చెప్పెను.

19. రాజు మరియొక రౌతును పంపగా అతడును వెళ్ళి యెహూతో “మన పక్షమువారందరు సురక్షితముగా ఉన్నారాయని రాజు ప్రశ్నించుచున్నాడు” అని పలికెను. యెహూ “ఆ సంగతి నీకెందుకు? నీవు కూడ వెనుకతట్టు పోయి సైన్యములో చేరుము” అని పలికెను.

20. మరల కావలివాడు “మన రౌతు వెళ్ళి వారిని కలిసికొనెను గాని తిరిగి వచ్చుటలేదు. ఆ వచ్చువారి నాయకుడు మన యెహూ వలె వెఱ్ఱెత్తినట్లు రథము తోలుచున్నాడు” అని చెప్పెను.

21. యెహోరాము రథము సిద్దము చేయుడని ఆజ్ఞాపించెను. అతడును, అహస్యారాజును. తమతమ రథములనెక్కి యెహూను కలిసికొనుటకే వెళ్ళిరి. వారు నాబోతు పొలమున అతనిని కలిసికొనిరి.

22. యెహోరాము “మన వారందరికి కుశలమే కదా?” అని యెహూను ప్రశ్నించెను. యెహూ “మీ అమ్మ యెసెబెలు ప్రారంభించిన జారత్వము, మంత్ర విద్య ఇంత విపరీతముగా వ్యాప్తి చెందుచుండగా ఇక మన వారికి కుశలమెక్కడిది?” అని బదులు పలికెను.

23. వెంటనే యెహోరాము రథము త్రిప్పి "అహస్యా! రాజద్రోహము, రాజద్రోహము!” అని అరచుచు పారిపోజొచ్చెను.

24. యెహూ విల్లెక్కుపెట్టి సత్తువ కొలది యెహోరాము భుజములమధ్య కొట్టగా బాణము అతని గుండెగుండా దూసుకొనిపోయెను. అతడు రథము మీదనే కూలి ప్రాణములువిడచెను.

25. యెహూ తన అంగరక్షకుడైన బిద్కరుతో “అతని శవమును నాబోతు పొలమున పడవేయుము. ఒక మారు మనమిద్దరము ఇతని తండ్రి అహాబు వెనుక గుఱ్ఱముపై పోవుచుండగా ప్రభువు

26. 'నిన్న నేను నాబోతు వధను అతని కుమారుల వధను కన్నులార జూచితిని. అందులకుగాను నిన్నుగూడ ఈ పొలముననే శిక్షింతును” అని పలికెను. నీకు జ్ఞప్తియున్నదా? అది ప్రభువు వాక్కు. కనుక ఇప్పుడు యెహోరాము శవమును నాబోతు పొలమున పడవేయుము. ప్రభువు పలుకు నెరవేరితీరును” అని చెప్పెను.

27. యూదారాజు అహస్యా యెహోరాము చావును చూచి భయపడి బేతహగ్గాను మార్గము పట్టి పారిపోయెను. కాని యెహూ, అహస్యాను వెన్నాడి “వీనిని కూడ వధింపుడు” అని ఆజ్ఞాపించెను. అహస్యా యీబ్లెయాము వద్ద మెరక మీదనున్న గూరు నగరమునకు పోవుమార్గమున రథము నడుపుచుండగా యెహూ సైనికులు అతనిని గాయపరిచిరి. అతడు మెగిద్ధో వరకు పారిపోయి అచట ప్రాణములు విడిచెను.

28. రాజోద్యోగులు అతని శవమును రథము మీద యెరూషలేమునకు తీసికొనిపోయి దావీదునగరము నందు అతని పితరుల సమాధులలో అతనిని పాతి పెట్టిరి.

29. యిస్రాయేలు రాజ్యమున అహాబు కుమారుడు యెహోరాము పరిపాలనాకాలము పదు నొకండవఏడు యూదా సీమలో అహస్యా రాజయ్యెను.

30. యెహూ యెస్రెయేలు నగరమునకు తిరిగి వచ్చెను. యెసెబెలు యెహూ వచ్చెనని విని ముఖమునకు రంగుపూసుకొని, శిరోభూషణము ధరించి ప్రాసాదము కిటికీ చెంత నిలుచుండి దారివైపు పారజూచు చుండెను.

31. అంతలో యెహూ ప్రాసాదద్వారము వద్దకు రాగా యెసెబెలు “స్వామి హంతకుడా! సిమ్రీ వంటివాడా!' నీవు సమాధానముగా వచ్చుచున్నావా?” అని ప్రశ్నించెను.

32. యెహూ కిటికీ వైపు పారజూచి “నా పక్షము చేరువారెవరు?" అని అడిగెను. రాజ ప్రాసాదరక్షకులలో ఇద్దరు ముగ్గురు నపుంసకులు అతనివైపు చూచిరి.

33. యెహూ “దానిని క్రిందకు పడద్రోయుడు” అని అరచెను. వారు యెసెబెలును క్రిందకు పడద్రోసిరి. ఆమెనెత్తురు గోడమీదను గుఱ్ఱములమీదను చిందిపడెను. యెహూ తన రథములను, గుఱ్ఱములను ఆమె శవముమీదుగా తోలెను.

34. అతడు ప్రాసాదమును ప్రవేశించి భోజనము చేసెను. అటుపిమ్మట సేవకులతో “ఆ నికృష్టురాలిని కొనిపోయి పాతిపెట్టుడు. ఎంత దౌర్భాగ్యురాలైనను రాజపుత్రికగదా!” అనెను.

35. కాని సేవకులు పోయిచూడగా ఆమె శవమున కపాలమును, పాదములును, అరిచేతులును తప్ప మరియేమియు కనపడలేదు.

36. ఆ వార్త విని యెహూ “యెస్రెయేలు పొలమున కుక్కలు యెసెబెలు ప్రేతమును తిని వేయును.

37. ఆమె శరీరఅవశేషములను పొలమున పెంటవలె చల్లుదురు. వానిని చూచి ఆమె యెసెబెలు అని యెవరును గుర్తింపజాలరని ప్రభువు ఏలియా ప్రవక్త ద్వారా పలికెనుగదా! ఇకనేమి ప్రభువు చెప్పినదంతయు జరిగినది” అని పలికెను.

 1. అహాబు కుమారులు డెబ్బదిమంది సమరియా నగరమున నివసించుచుండిరి. యెహూ లేఖ వ్రాసి సమరియా నగరపాలకులకు పట్టణమునందలి ప్రముఖ వ్యక్తులకు, అహాబు కుమారుల సంరక్షకులకు పంపెను. ఆ లేఖయందలి వృత్తాంత మిది:

2-3. “మీరు రాజవంశస్తులకు సంరక్షకులు గదా! రథములు, గుఱ్ఱములు, ఆయుధములు, సురక్షిత పట్టణములు మీ ఆధీనమున ఉన్నవి. ఈ లేఖ మీకు చేరినవెంటనే మీ రాజపుత్రులలో యోగ్యు డైనవానిని ఒకనిని రాజును చేయవచ్చును. నా దాడి నుండి అతనిని రక్షించుటకు మీరందరు పోరాడ వచ్చును."

4. ఆ వార్త విని సమరియా పాలకులు నిలువున నీరై “ఇద్దరురాజులు యెహూను ఎదిరింపలేకపోయిరి. ఇక మనబోటివారము ఇతనితో పోరాడగలమా?” అని అనుకొనిరి.

5. కనుక ప్రాసాద రక్షకులు, నగరపాలకులు, పౌరులలో ప్రముఖులు, రాజవంశజుల సంరక్షకులు కూడబలుకుకొని "అయ్యా! మేము నీ దాసులము. నీవు చెప్పినట్లు చేయగల వారము. మేమెవరిని రాజుగా అభిషేకించుటలేదు. ఇక నీ ఇష్టము వచ్చినట్లు చేయుము” అని యెహూకు సందేశమంపిరి.

6. యెహూ “మీరు నా పక్షమునజేరి, నా ఆజ్ఞలను పాటింపగోరెదరేని రేపీపాటికి ఆహాబు కుమారుల శిరములను యెస్రెయేలునకు కొనిరండు” అని వారికి రెండవసారి ఉత్తరము వ్రాసెను. అహాబు కుమారులు డెబ్బదిమంది కదా! ప్రముఖులైన సమరియా పౌరులు వారిని పెంచి పెద్దచేయుచుండిరి.

7. యెహూ జాబు అందగనే వారు డెబ్బదిమంది రాజకుమారులను చంపి వారితలలను గంపలలో పెట్టి యెస్రెయేలున ఉన్న యెహూవద్దకు పంపిరి.

8. యెహూ రాజకుమా రుల తలలు చేరినవని విని వానిని నగరద్వారముచెంత రెండుకుప్పలుగా పేర్చి రేపు ప్రొద్దుటివరకు అచటనే ఉండనిండని ఆజ్ఞాపించెను.

9. మరునాటి ప్రొద్దుట యెహూ నగరద్వారము వద్దకు వెళ్ళి అచటి జనులతో “యెహోరాము రాజును నేనే కుట్రపన్ని వధించితిని. అతని చావునకు మీరు బాధ్యులుకారు. కాని వీరినందరిని చంపినదెవరు?

10. ప్రభువు అహాబు వంశజులను గూర్చి పలికినదంతయు నెరవేరి తీరునుగదా! అతడు ఏలియా ప్రవక్తద్వారా వచించినదంతయు సిద్దించినది” అనెను.

11. యెహూ యెస్రెయేలున వసించుచున్న అహాబు బంధువులను, ఉద్యోగులను, మిత్రులను, యాజకులను మట్టు పెట్టెను. వారిలో ఒక్కరిని కూడ ప్రాణములతో మిగులనీయలేదు.

12. యెహూ యెస్రెయేలు నుండి సమరియా వెళ్ళుచుండగా త్రోవలో బేత్తెకేదులో “కాపరుల మకాము” అనుచోట అహస్యారాజు బంధువులు కొందరు అతని కంటబడిరి.

13. అతడు మీరెవ్వరని ప్రశ్నింపగా వారు "మేము అహస్యారాజు చుట్టాలము. యెసెబెలు సంతానమును, రాజవంశజులను సందర్శించుటకు యెస్రెయేలునకు వెళ్ళుచున్నాము” అని చెప్పిరి.

14. యెహూ “వీరిని సజీవులుగా బంధింపుడు” అని ఆజ్ఞాపింపగా సేవకులు వారిని బంధించిరి. యెహూ వారినందరిని అచటి మడుగువద్ద వధించెను. వారందరు కలిసి నలువది ఇద్దరు. వారిలో ఒక్కడును తప్పించుకోలేదు.

15. యెహూ అచటి నుండి బయలుదేరి వెళ్ళు చుండగా రేకాబు కుమారుడైన యెహోనాదాబు దారిలో అతనిని కలిసికొనెను. యెహూ అతనిని కుశలమడిగి “నాకు నీపట్లవలె నీకు నాపట్ల సుహృద్భావము కలదా?” అని ప్రశ్నించెను. అతడు 'ఉన్నది' అని బదులు చెప్పెను. యెహూ “అటులయిన నా చేతిలో చేయివేయుము” అనగా యెహోనాదాబు అతని చేతిలో చేయివేసెను. యెహూ యెహోనాదాబు చేయి పట్టుకొని అతనిని రథము మీదికి ఎక్కించుకొనెను.

16. “నీవు నా వెంట రమ్ము. ప్రభువుపట్ల నాకు గల ఆసక్తిని నీవే కన్నులార చూడగలవు” అని యెహూ నుడివెను. ఆ రీతిగా వారిరువురు సమరియాకు వెళ్ళిరి.

17. ఆ నగరము చేరుకోగానే యెహూ మిగిలియున్న అహాబు బంధువులనందరిని చంపివేసెను. ప్రభువు ఏలియాప్రవక్త ద్వారా చెప్పినట్లే అంతయు జరిగెను.

18. యెహూ సమరియా పౌరులను ప్రోగుజేసి “అహాబు బాలు దేవతను కొద్దిగనే పూజించెను. నేను అతనిని అధికముగా పూజింతును.

19. కనుక బాలు ప్రవక్తలను, ఆరాధకులను, అర్చకులను అందరిని పిలి పింపుడు. ఎవ్వరును నా పిలుపును త్రోసిపుచ్చరాదు. నేను బాలునకు మహాబలి సమర్పింపగోరితిని. దీనిలో పాల్గొననివారికి చావుమూడును” అని చెప్పెను. బాలు ఆరాధకులను నాశనము చేయుటకు యెహూ పన్నిన పన్నాగమది.

20. యెహూ బాలు పేరిట ఉత్సవము జరుగునని చాటింపుడు అనగా ప్రజలట్లే ప్రకటన చేసిరి.

21. అతడు యిస్రాయేలు దేశ మందంతట వార్తపంపగా బాలు భక్తులందరు ఒక్కడు కూడ తప్పి పోకుండ పండుగకు వచ్చిరి. వారందరు బాలు దేవళము ప్రవేశించిరి. గుడి భక్తులతో క్రిక్కిరిసిపోయెను.

22. యెహూ వస్త్రశాలాధికారి యాజకుని పిలిచి వస్త్రములు తెమ్మనిచెప్పగా అతడు తెచ్చి భక్తులకు తొడిగించెను.

23. అటుపిమ్మట యెహూ రేకాబు కుమారుడు యెహోనాదాబుతో దేవాలయములోనికి పోయి “ఇక్కడ బాలు భక్తులు మాత్రమే ఉండవలయును. యావే భక్తులలో ఒక్కడుకూడ ఈ చోటికి రాకూడదు. జాగ్రత్త!” అని హెచ్చరించెను.

24. అటుపిమ్మట అతడు, యెహోనాదాబు దహనబలులు సమర్పించిరి. అంతకుముందే అతడు ఎనుబది మంది బంటులను దేవాలయము వెలుపల కాపుంచి “మీరు బాలు భక్తులను అందరిని వధింపవలయును. వారిలో ఎవరిని గాని తప్పించుకొని పోనిత్తురేని వారి ప్రాణములకు బదులుగా మీ ప్రాణములు తీయింతును” అని చెప్పెను.

25. అతడు బలి అర్పించిన పిమ్మట “మీరు వీరినందరిని పట్టి వధింపుడు. ఎవరిని తప్పించుకొని పోనీకుడు” అని తన ఉద్యోగులకును, బంటులకును ఆజ్ఞ ఇచ్చెను. వారు బాలు భక్తులనందరిని చిత్రవధ చేసి వారి శవములను బయటికి లాగివేసిరి.

26. పిమ్మట బాలు ఆలయములోనికి వొచ్చి నిలువెత్తు విగ్రహములను వెలుపలికి కొనివచ్చి కాల్చివేసిరి.

27. అటుల బాలు పీఠమును దేవళమును నాశనము చేసి దానిని మరుగుదొడ్డిని చేసిరి. నేటికి ఆ దేవళము దొడ్డిగనే ఉన్నది.

28. ఆ రీతిగా యెహూ యిస్రాయేలు రాజ్యమున బాలు ఆరాధనను తుదముట్టించెను.

29. మునుపు యరోబామురాజు బేతేలు, దాను నగరములలో బంగారు దూడలను నెలకొల్పి యిస్రాయేలు ప్రజలను వాని ఆరాధనకు పురికొల్పి పాపము కట్టుకొనెనుగదా! యెహూ కూడ ఈ పాపమున చిక్కుకొనెను.

30. ప్రభువు అతనితో “నీవు నేను కోరినట్లే అహాబు వంశమును నాశనముచేసి నాకిష్టుడవైతివి. కనుక నాలుగవతరము వరకు నీ వంశజులు యిస్రాయేలు మండలమును పరిపాలింతురు” అని చెప్పెను.

31. కాని యెహూ యిస్రాయేలు దేవుడైన యావే ప్రభువు ఆజ్ఞలను చిత్త శుద్ధితో పాటింపలేదు. అతడు యరోబామువలె చెడుత్రోవతొక్కి యిస్రాయేలీయులను కూడ పాపమునకు పురికొల్పెను.

32. కనుక ప్రభువు యిస్రాయేలు దేశమును తగ్గించి వేసెను. హసాయేలు రాజు యోర్దానునకు తూర్పున ఉన్న గాదు, రూబేను తెగలకు చెందిన గిలాదు ప్రాంతమంతటిని, అర్నోనునది దగ్గరినున్న అరోయేరు మొదలు కొని మన దేశములోను అనగా గిలాదులోను, బాషానులోను వారిని ఓడించెను.

33. గాదు, రూబేను, మనష్షే తెగవారు వసించుచుండిన గిలాదు, బాషాను మండలములు అతని వశమయ్యెను.

34. యెహూ చేసిన ఇతర కార్యములు అతని వీర కృత్యములు యిస్రాయేలు రాజుల చరితమున లిఖింప బడియేయున్నవి.

35. యెహూ తన పితరులతో నిద్రించగా, సమరియా నగరముననే సమాధి చేయబడెను. యెహూ తరువాత అతని కుమారుడు యెహోవాపసు రాజయ్యెను.

36. యెహూ యిస్రాయేలునకు రాజై ఇరువది ఎనిమిదేండ్ల పాటు సమరియా నుండి పరిపాలనచేసెను.

 1. అహస్యా తల్లియగు అతల్యా తన కుమారుని హత్యచేసిరని విని రాజవంశజులనందరిని చంపించెను.

2. అహస్యా కుమారుడగు యోవాసు మాత్రము తప్పించుకొనెను. అతనినిగూడ మిగిలిన రాజకుమారులందరితో పాటు చంపియుండెడివారే గాని, యెహోరాము కూతురును అహస్యా చెల్లెలునగు యెహోషెబ బాలుని అతని దాదిని కొనిపోయి పడుకగదిలో దాచియుంచెను. అతల్యా కంటబడలేదు గనుక ఆ బాలుడు చావు తప్పించుకొనెను.

3. అతల్యా పరిపాలనకాలమున ఆరేండ్లవరకు అతడు దాదితో కూడ దేవాలయముననే దాచియుంచబడెను.

4. ఏడవయేట యాజకుడగు యెహోయాదా సైన్యాధిపతులను ప్రాసాదరక్షకులను దేవాలయమునకు పిలిపించి తన పథకమును అంగీకరించునట్లు వారితో ఒప్పందము గావించి, ఆ ప్రకారము వారిచే ప్రమాణము చేయించెను. అటుపిమ్మట అహస్యా కుమారుడగు యోవాసును వారికి చూపించెను.

5. అతడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: “మీరు చేయవలసినదేనమగా, విశ్రాంతిదినమున లోనికి ప్రవేశించు మీరు మూడుభాగములై, ఒకభాగము రాజమందిరమునకు కావలికాయుడు.

6. మరొక భాగము సూరు ద్వారము వద్దను, చివరిభాగము కేడములు ధరించియున్నవారి వెనుక ద్వారము వద్దను ఉండవలెను. ఇట్లు జాగరూకులై మందిరము అన్ని వైపుల కావలియుండవలయును.

7. మరియు విశ్రాంతిదినమున కావలినుండి వెడలిపోవు రెండు భాగములు రాజుచెంత ప్రభువు మందిరమునకు కావలికాయుడు.

8. ఈ రెండు భాగముల వారు ఆయుధములు ధరించి రాజును సంరక్షింపవలయును. మీరు రాజుచుట్టు కాచుకొనియుండి, అతడు ఎటు పోయిన మీరును అటుపోవలయును. మీ దరిదాపులకు వచ్చు వారినందరిని చంపివేయుడు” అని చెప్పెను.

9. సైన్యాధిపతులు యెహోయాదా చెప్పినట్లే చేసిరి. వారు విశ్రాంతిదినమున కావలి ప్రారంభించు సైనికులను, కావలి ముగించుకొను సైనికులను యెహోయాదా వద్దకు కొనివచ్చిరి.

10. అతడు దేవాలయమున ఉంచిన దావీదు రాజు బల్లెములను, కవచములను వారికి అప్పగించెను.

11. వారు సాయుధులై రాజును రక్షించుటకు దేవాలయము ఉత్తర, దక్షిణములందు కాపుండిరి.

12. అంతట యెహోయాదా రాజకుమారుని కొలువుకాండ్ర ఎదుటికి కొనివచ్చెను. అతని తలమీద కిరీటము పెట్టి ధర్మ శాస్త్రమును చేతికిచ్చెను. అందరి ఎదుట యోవాషును రాజుగా అభిషేకించి ప్రకటించెను. ప్రజలందరు చప్పట్లు కొట్టి రాజునకు దీర్ఘాయువని నినదించిరి.

13. ఆ నినాదములు విని అతల్యా పరుగు పరుగున దేవాలయమునకు వచ్చి అచట జనులు ప్రోగైయుండుట గమనించెను.

14. ఆమె పైకి చూడగా ఆనాటి ఆచారముచొప్పున రాజు స్తంభము ప్రక్కన నిలుచుండియుండెను. రాజోద్యోగులు, బాకాలనూదు వారు అతని చుట్టు గుమిగూడి ఉండిరి. సామాన్య జనులందరు సంతోషముతో శృంగధ్వనులు చేయుచుండిరి. అతల్యా బట్టలు చించుకొని “రాజద్రోహము, రాజద్రోహము” అని అరచెను.

15. యెహోయాదా ఆమెను దేవాలయ ఆవరణమున చంపదలుచు కోలేదు. కనుక అతడు “ఈమెను కావలిబంటుల నడుమనుండి వెలుపలికి కొనిపొండు. ఈమెను రక్షించుటకు వచ్చినవారిని పట్టి చంపుడు" అని సైన్యాధిపతులను ఆజ్ఞాపించెను.

16. వారు ఆమెను పట్టుకొని రాజప్రాసాదములోనికి గుఱ్ఱములు ప్రవే శించు మార్గమున దారి ఇచ్చి, అచట ఆమెను వధించిరి.

17. అపుడు యెహోయాదా-ప్రజలు యావేవారని ఆయన పేర రాజుతోను, ప్రజలతోను నిబంధనము చేయించెను. మరియు అతడు రాజు పేర ప్రజలతో నిబంధనము చేయించెను.

18. తరువాత ప్రజలు బాలు దేవళమునకు వెళ్ళి దానిని కూలద్రోసిరి. దాని లోని బలిపీఠములను, విగ్రహములను పగులగొట్టిరి. బాలు పరిచారకుడైన మత్తానును బలిపీఠముల ముందే వధించిరి. యెహోయాదా దేవాలయముచెంత సైన్యమును కాపుంచెను.

19. అటు తరువాత అతడు, రాజోద్యోగులు, సేనాపతులు, ప్రాసాద రక్షకులు, సామాన్యప్రజలు రాజును ప్రదక్షిణముతో ప్రాసాదమునకు కొనిపోయిరి. రాజు కావలిభటుల ద్వారము వెంటపోయి ప్రాసాదము ప్రవేశించి సింహాసనముపై ఆసీనుడయ్యెను.

20. రాజు పట్టాభిషేకమును చూచి జనులందరు హర్షించిరి. నగరము ప్రశాంతముగా నుండెను. అంతకుముందే అతల్యాను ప్రాసాదము చెంత వధించిరిగదా!

21. యోవాసు ఏడేండ్ల ప్రాయమున యూదా రాజ్యమునకు రాజయ్యెను.

 1. యిస్రాయేలు రాజ్యమున యెహూ పరిపాలనాకాలము ఏడవయేట యోవాసు యూదా రాజ్యమునకు పాలకుడై నలువదియేండ్లు పరిపాలించెను. అతని తల్లి పేరు సిబ్యా. బేర్షేబా నగరమునకు చెందినది.

2. యోవాసు యాజకుడైన యెహోయాదా ఉపదేశించిన కాలమంతయు యావే దృష్టిలో సరిగానే ఉండెను.

3. అయినను ఉన్నత స్థలములు నిర్మూలింపబడక నిలిచియుండెను. ప్రజలు ఇంకను ఉన్నతస్థలములందు బలులు అర్పించుచు ధూపము వేయుచునే ఉండిరి.

4. యోవాషు యాజకులను పిలిపించి యావే ఆలయములోనికి తేబడు నివేదిత కానుకల విలువను అనగా తలపన్నును, వంతుచొప్పున ప్రతివానికి నిర్దేశింపబడిన సొమ్మును, స్వేచ్ఛాపూరిత అర్పణ సొమ్మును అట్టిపెట్టవలయునని ఆజ్ఞాపించెను.

5. ప్రతి యాజకుడును తాను పరిచర్య చేయునపుడు ఆలయమునకు వచ్చు ప్రజలు సమర్పించిన డబ్బును జాగ్రత్తగా జమకట్టి ఆ సొమ్మును దేవాలయ మరమ్మతులకు వాడవలయునని ఆజ్ఞ ఇచ్చెను.

6. కాని యోవాసు పరిపాలనాకాలము ఇరువది మూడవ ఏటి వరకు యాజకులు గుడి మరమ్మత్తులకు పూనుకోరైరి.

7. కనుక అతడు యెహోయాదాను ఇతర యాజకులను పిలిపించి “మీరు మందిరమును బాగుచేయుటకు పూనుకొనరైతిరేల? అర్పించు వారివద్దనుండి ఇక సొమ్ము ఏమాత్రమును అంగీకరింపక, దేవాలయములో శిధిలమైన స్థలములను బాగుచేయుటకై ఇంత వరకు మీరు పుచ్చుకున్న సొమ్మును అప్పగించుడు” అని ఆజ్ఞనిచ్చెను.

8. కనుక యాజకులు ఇకను జనులు అర్పించు సొమ్ము పుచ్చుకొనుటకుగాని, దేవాలయ మరమ్మత్తులు చేయుటకుగాని అంగీకరించరైరి. .

9. అంతట యెహోయాదా పెద్ద పెట్టెను గొనివచ్చి దానిమూతకు కన్నము తొలిపించి యావే ఆలయమున ప్రవేశించువారి కుడివైపున బలిపీఠము చెంత దానినుంచెను. దేవాలయ ద్వారమువద్ద నుండు యాజకులు భక్తులు కొనివచ్చిన సొమ్మునంతటిని ఆ పెట్టెలో వేసెడివారు.

10. దేవళమునున్న పెట్టె నిండగనే రాజ ప్రధానలేఖికుడును, ప్రధానయాజకుడును వచ్చి నాణెములను లెక్కించి, సంచులు కట్టెడి వారు.

11-12. రాబడినంతటిని లెక్కచూచి, ఆ సొమ్మును దేవాలయము మరమ్మతులు చేయించు వారికి ముట్టజెప్పెడివారు. వారు దానిని దేవాలయమున పనిచేయు వడ్రంగులకు తాపీ పనివారికి రాళ్ళు చెక్కువారికి చెల్లించెడివారు. కలపను, రాళ్ళను, కొనుటకు ఇతర మరమ్మతు ఖర్చులకు ఆ సొమ్మునే వినియోగించెడివారు.

13. కాని ప్రభు మందిరమునకు వలయు వెండిగిన్నెలు, పాత్రలు, బాకాలు, దీపముల పనిముట్లు చేయించుటకుగాని, మరి ఏ ఇతరములైన వెండిబంగారు పాత్రములను తయారు చేయించుటకు గాని ఆ ద్రవ్యమును వాడెడివారుకారు.

14. మరమ్మతుకు సంబంధించిన పనివారికి, వస్తుసామగ్రికి మాత్రమే ఆ సొమ్మును వాడిరి.

15. మరమ్మతులు చూచుకొను అధికారులు మిగుల చిత్తశుద్ధి కలవారు. కనుక వారినుండి లెక్కలు అడుగవలసిన అవసరము కలుగదయ్యెను.

16. జనుల దోషపరిహారబలులకు గాని, పాపపరిహారబలులకు గాని సమర్పించిన సొమ్మును ప్రభు మందిరములోనికి తేబడలేదు. ఆ డబ్బును యాజకులే తీసికొనెడివారు.

17. ఆ కాలమున సిరియారాజు హసాయేలు గాతును ముట్టడించి పట్టుకొనెను. అతడు యెరూషలేమును గూడ ఆక్రమింపగోరెను.

18. యోవాసు రాజు, తన పితరులైన యెహోషాఫాత్తు, యెహోరాము, అహస్యా అను యూదారాజులు దేవాలయమునకు సమర్పించిన కానుకలను, తాను స్వయముగా అర్పించిన కానుకలను, దేవాలయములోని, ప్రాసాదములోని భాండాగారములందున్న బంగారమును గైకొని హసాయేలునకు కానుకగా పంపెను. ఆ బహుమతులు స్వీకరించి హసాయేలు యెరూషలేమును ముట్టడింపక వెడలిపోయెను.

19. యోవాసు చేసిన ఇతర కార్యములు యూదారాజుల చరితమున లిఖింపబడియే ఉన్నవి.

20. యోవాసు ఉద్యోగులు అతనిమీద కుట్రపన్నిరి. యెరూషలేమునకు తూర్పున పల్లమునుపూడ్చి, మిల్లో కట్టిన తావున, సిల్లాకు పోవు త్రోవప్రక్కన వారు రాజును హత్యచేసిరి.

21. షిమాతు కుమారుడగు యోసాకారు, షోమేరు కుమారుడగు యెహోసాబాదు అను అతని సేవకులు అతనిని చంపిరి. జనులు అతనిని దావీదు నగరమున అతని పితరుల సమాధులలో పాతి పెట్టిరి. అతని తరువాత అతని కుమారుడు అమస్యా రాజయ్యెను.

 1. యూదారాజ్యమున అహస్యా కుమారుడు యోవాడు ఏలుబడి ఇరువది మూడవయేట, యిస్రాయేలున యెహూ కుమారుడగు యెహోవాహాసు రాజై సమరియా నగరమునుండి పదునేడేండ్లు పరిపాలించెను.

2. పూర్వము యరోబాము రాజువలె యెహోవాహాసు కూడ దుష్కార్యములు చేసి ప్రజలను పాపమునకు ప్రేరేపించెను. అతడు జీవితాంతము వరకు పాపకార్యములు చేయుట మానడయ్యెను.

3. కనుక ప్రభువు యిస్రాయేలు మీద కోపించెను. సిరియా రాజు హసాయేలును, అతని కుమారుడు బెన్హ్-దదును పదేపదే యిస్రాయేలును ఓడించునట్లు చేసెను.

4. యెహోవాహాసు ప్రభువునకు మనవి చేసికొనెను. ప్రభువు సిరియారాజు యిస్రాయేలును దారుణముగా పీడించుట చూచి మనసు కరగి యెహోవాహాసు మొర ఆలించెను.

5. ప్రభువు యిస్రాయేలునకు ఒక విమోచకుని ప్రసాదింపగా అతడు సిరియనుల గర్వమణచెను. యిస్రాయేలీయులు మునుపటివలెనే శాంతిభద్రతలతో జీవించిరి.

6. అయినను వారు నాడు యరోబాము యిస్రాయేలీయులచే చేయించిన పాపకార్యములను ఎంతమాత్రమును మానరైరి. సమరియా యందు అషేరా దేవత విగ్రహమునకు పూజలర్పించిరి.

7. యెహోవాహాసు సైన్యములో మిగిలినవారు ఏబదిమంది రౌతులు, పదిరథములు, పదివేలమంది కాల్బలము మాత్రమే. మిగిలిన సైన్యమునంతటిని సిరియా రాజు కాలిక్రింది ధూళివలె అణగదొక్కెను.

8. యెహోవాహాసు చేసిన ఇతర కార్యములు, అతని సాహసకృత్యములు యిస్రాయేలు రాజుల చరితమున లిఖింపబడియే ఉన్నవి.

9. యెహోవాహాసు తన పితరులతో నిద్రించి, సమరియాలో పాతి పెట్ట బడెను. అటుతరువాత అతని కుమారుడు యెహోవాసు రాజయ్యెను.

10. యూదా రాజ్యమున యోవాసు ఏలుబడి ముప్పది యేడవయేట యెహోవాహాసు కుమారుడగు యెహోవాసు యిస్రాయేలు సీమకు రాజై సమరియా నుండి పదునారేండ్లు పరిపాలించెను.

11. ఇతడు కూడ యావే ఒల్లని దుష్కార్యములు చేసెను. యిస్రాయేలును పాపమునకు పురికొల్పిన యరోబామువలె కానిపనులు చేసెను.

12. అతడు చేసిన ఇతర కార్యములు, యూదా రాజగు అమస్యాతో నడచిన యుద్ధమున అతడు చూపిన పరాక్రమము యిస్రాయేలు రాజుల చరితమున లిఖింపబడియే యున్నవి.

13. యెహోవాసు తన పితరులతో నిద్రించగా అతనిని సమరియాయందు పాతి పెట్టిరి. అటుపిమ్మట అతని కుమారుడు యరోబాము రాజయ్యెను.

14. ఎలీషా ప్రవక్త మరణాపాయకరమైన వ్యాధికి గురియై మంచము పట్టియుండగా యిస్రాయేలు రాజైన యెహోవాసు అతనిని చూడబోయెను. అతడు “ఓ నా తండ్రీ! ఓ నా తండ్రీ! యిస్రాయేలునకు రథమును రాజులు రెండవ గ్రంథం దాని సారధియు నీవే!” అని అంగలార్చెను.

15. ప్రవక్త విల్లు బాణములు తీసికొనిరమ్మని ఆజ్ఞాపింపగా రాజు వానిని కొనివచ్చెను.

16. ఎలీషా విల్లెక్కు పెట్టుమనగా రాజు ఎక్కుపెట్టెను. ప్రవక్త వింటిపైన పెట్టిన రాజు చేతులమీద తన చేతులు మోపెను.

17. అతడు తూర్పుదిక్కుననున్న కిటికీ తెరువుమనగా రాజు అట్లే తెరచెను. ప్రవక్త కిటికీగుండ బాణము విడువుమనగా రాజు విడిచెను. అప్పుడు ఎలీషా యెహోవాసుతో “ఇది ప్రభువు సంరక్షణ బాణము. నీ ద్వారా ప్రభువు సిరియాను ఓడించును. నీవు ఆఫెకు చెంత సిరియనులతో పోరాడి వారిని గెలుతువు” అని నుడివెను.

18. అటుపిమ్మట ఎలీషా రాజుతో “మిగిలిన బాణములతో నేలను కొట్టుము” అనెను. రాజు మూడు సారులు నేలను బాణములతో కొట్టి అంతటితో ఆగి పోయెను.

19. ఎలీషా రాజుమీద కోపపడి “నీవు అయిదారుసార్లు నేలను కొట్టవలసినది. అప్పుడు సిరియాను పూర్తిగా అణగదొక్క గలిగెడివాడవుగదా! ఇప్పుడు నీవు ఆ దేశమును మూడుసార్లు మాత్రమే ఓడింపగలవు” అనెను.

20. తరువాత ఎలీషా చనిపోగా అతని శవమును సమాధిలో పాతి పెట్టిరి. ఆ రోజులలో మోవాబు దండులు ప్రతియేడు యిస్రాయేలుపై దాడిచేసెడివి.

21. ఒక పర్యాయము యిస్రాయేలీయులు ఒక శవమును పాతిపెట్టబోవుచుండగా మోవాబుదండు వారి కంటబడెను. వారు శవమును ఎలీషా సమాధిలో పడ వేసి వేగముగ పారిపోయిరి. కాని ఆ ప్రేతము ఎలీషా అస్థికలకు తగులగనే జీవముతో లేచి నిలుచుండెను.

22. యెహోవాహాసు పరిపాలన కాలమందంతట హసాయేలు యిస్రాయేలీయులను పీడించి పిప్పిచేసెను.

23. కాని ప్రభువు కరుణామయుడు కనుక వారిని నాశనము కానీయలేదు. తాను అబ్రహాము, ఈసాకు, యాకోబులతో చేసుకొనిన నిబంధనను స్మరించుకొని యిస్రాయేలీయులకు తోడ్పడెనేగాని, వారిని చేయివిడువ లేదు.

24. హసాయేలు తరువాత అతని కుమారుడు బెన్హ్-దదు సిరియాకు రాజయ్యెను.

25. యెహోవాషు బెన్హ్-దదును మూడుసార్లు జయించెను. తన తండ్రి యెహోవాహాసు కాలమున బెన్హ్-దదు ఆక్రమించుకొనిన నగరములను మరల స్వాధీనము చేసికొనెను.

 1. యిస్రాయేలున యెహోవాహాసు కుమారుడు యెహోవాసు పరిపాలనాకాలము రెండవయేట యూదాసీమలో యోవాసు కుమారుడు అమస్యా రాజయ్యెను.

2. రాజగునప్పటికి అమస్యా ప్రాయము ఇరువది ఐదేండ్లు. అతడు యెరూషలేము నుండి ఇరువది తొమ్మిది యేండ్లు యేలెను. అతని తల్లి యెరూషలేమునకు చెందిన యెహోవద్దీను.

3. అతడు ప్రభువునకు ప్రీతికలిగించు కార్యములు చేసెను. అయినను అమస్యా దావీదు వంటివాడు కాదు. అన్ని విషయములలో తన తండ్రి యెవాషు చేసిన ప్రకారము జరిగించెను.

4. అతడు ఉన్నత స్థలములను తొలగింపలేదు. ప్రజలు ఆ మందిరములలో బలులర్పించి సాంబ్రాణి పొగ వేయుచునే ఉండిరి.

5. అమస్యా తన పరిపాలనను సుస్థిరము చేసికొనగనే పూర్వము తన తండ్రిని చంపిన వారిని మట్టుపెట్టెను.

6. కాని వారి పిల్లలను వధింపలేదు. “బిడ్డలదోషములకు తండ్రులనుగాని, తండ్రుల దోషములకు బిడ్డలనుగాని వధింపరాదు. ఎవరి పాపమునకు వారినే శిక్షింపవలయును” అను మోషే ధర్మశాస్త్ర విధిని పాటించెను.

7. అతడు మృతసముద్రమునకు దక్షిణమున నున్న ఉప్పులోయలో వేయిమంది ఎదోమీయులను జయించి వారి మండలమునందలి సేలా నగరమును పట్టుకొని దానికి యోక్తేలు అని పేరు పెట్టెను. నేటికిని ఆ నగరమునకు అదియే పేరు.

8. అమస్యా యిస్రాయేలు రాజు యెహోవాషు వద్దకు దూతలనంపి అతనిని యుద్ధమునకు సవాలు చేసెను.

9. కాని యెహోవాపు ప్రతి సందేశము పంపి “ఒకమారు లెబానోను కొండమీది ముండ్లపొద 'నీ కుమార్తెను నా కుమారునకిచ్చి పెండ్లి చేయుము' అని దేవదారు వృక్షమునకు కబురంపెను. అంతలో ఒక అడవి మృగము వచ్చి ఆ పొదను కాళ్ళతో తొక్కి వేసెను.

10. ఓయి అమస్యా! నీవు ఎదోమీయులను జయించితినని పొంగిపోవుచున్నావు. నీ ఇంటిపట్టున పడియుండి విజయగర్వముతో విఱ్ఱవీగుము. మాతో చెలగాటమాడితివా నీకును, నీప్రజలకును ముప్పు తప్పదు” అని చెప్పించెను.

11. ఐనను అమస్యా ఊరుకోడయ్యెను. కనుక యెహోవాసు తన బలముతో వచ్చి యూదానందలి బెత్సెమెషు పట్టణము దగ్గర అమస్యా నెదిరించెను.

12. ఆ పోరాటమున అమస్యా ఓడిపోగా అతని భటులందరు పారిపోయిరి.

13. యెహోవాసు అమస్యాను బంధించి, యెరూషలేము మీదికి దాడి చేసి నగర ప్రాకారమును, ఎఫ్రాయీము ద్వారమునుండి మూల ద్వారము వరకు రెండువందల గజముల పొడవున పడగొట్టించెను.

14. ఆ రాజు తనకు దొరికిన వెండి బంగారములను, దేవాలయమున వాడు పరికరములను, ప్రాసాద భాండాగారమునందలి నిధులను ప్రోగు జేసికొని బందీలను వెంటనిడుకొని సమరియాకు వెడలిపోయెను.

15. యెహోవాసు చేసిన ఇతర కార్య ములు, యూదారాజయిన అమస్యాతో యుద్ధమున అతడు చూపిన పరాక్రమము, యిస్రాయేలు రాజుల చరితమున లిఖింపబడియేయున్నవి.

16. అంతట యెహోవాసు తన పితరులతో నిద్రించి సమరియా యందు రాజసమాధులలో పాతి పెట్టబడెను. అటు తరువాత అతని కుమారుడు యరోబాము రాజయ్యెను.

17.యూదా రాజు అమస్యా యిస్రాయేలు రాజు యెహోవాసు గతించిన పిమ్మట పదునైదు ఏండ్లు జీవించెను.

18. అతడు చేసిన కార్యములు యూదా రాజులచరితమున వ్రాయబడియే ఉన్నవి.

19. శత్రువులు అమస్యాను యెరూషలేమున హత్యచేయబోగా అతడు లాకీషునకు పారిపోయెను. కాని శత్రువులు లాకీషునకు కొందరిని అతనితో పంపగా, వారుపోయి అచట అమస్యాను వధించిరి.

20. అతని శవమును గుఱ్ఱముమీద కొనివచ్చి దావీదు నగరమున అతని పితరుల సమాధులలో పాతి పెట్టిరి.

21. యూదీయులందరు అమస్యా కుమారుడు అజర్యాను రాజునుచేసిరి. అతనికి అప్పుడు పదునారేండ్లు.

22. అతడు తండ్రి మరణానంతరము ఏలతు నగరమును జయించి పునర్నిర్మించెను.

23. యూదా రాజ్యమున, యోవాషు కుమారుడు అమస్యా పరిపాలనాకాలము పదునైదవయేట, యెహోవాషు కుమారుడు యరోబాము యిస్రాయేలునకు రాజై సమరియానుండి నలువది ఒకయేండ్లు పరిపాలించెను.

24. పూర్వము యిస్రాయేలును పాపమునకు పురికొల్పిన నెబాతు కుమారుడు యరోబాము వలె ఇతడును యావేకు గిట్టని దుష్కార్యములు చేసెను.

25. ఈ యరోబాము ఉత్తరమున హమాతు దిక్కు నుండి దక్షిణమున మృతసముద్రమువరకు గల యిస్రాయేలు దేశభాగములను శత్రువులనుండి మరల స్వాధీనము చేసికొనెను. యిస్రాయేలు దేవుడైన ప్రభువు, గాతుహేఫేరునకు చెందిన అమిత్తయి కుమారుడగు యోనా ప్రవక్త ద్వారా, ఈ విజయము గురించి ముందుగనే ఎరిగించెను.

26. యిస్రాయేలీయులు పడు అగచాట్లను వారిని ఎవ్వరును ఆదుకొనుటకు రాకపోవుటను ప్రభువు గుర్తించెను.

27. ప్రభువు యిస్రాయేలీయులను నేలమీదినుండి తుడిచి వేయదలచుకోలేదు. కనుక యరోబాము ద్వారా వారిని రక్షించెను.

28. యరోబాము చేసిన ఇతర కార్యములు, పరాక్రమవంతమైన అతని యుద్ధములు, అతడు దమస్కు హమాతులను యిస్రాయేలునకు సంపాదించి పెట్టిన తీరు యిస్రాయేలు రాజుల చరితమున లిఖింపబడియే ఉన్నవి.

29. యరోబాము తన పితరులతో నిద్రించిన తరువాత అతని కుమారుడు జెకర్యా రాజయ్యెను.

 1. యిస్రాయేలున యరోబాము పరిపాలనా కాలము ఇరువదియేడవ యేట, అమస్యా కుమారుడైన అజర్యా యూదా రాజ్యమునకు రాజు అయ్యెను.

2. అప్పటికి అతనికి పదునారేండ్లు. అతడు యెరూషలేము నుండి ఏబది రెండేండ్లు పరిపాలించెను. యెరూషలేము నివాసి యెకోల్యా అతని తల్లి.

3. అతడు తన తండ్రి అమస్యావలెనే ధర్మబద్దముగా జీవించి యావేకు ఇష్టుడయ్యెను.

4. కానీ అజర్యా ఉన్నత స్థలములను మాత్రము తొలగింపలేదు. ప్రజలు అచట బలులర్పించి సాంబ్రాణి పొగ వేయుచునేయుండిరి.

5. ప్రభువు అజర్యాకు కుష్ఠువ్యాధితో పీడ కల్పించెను. జీవితాంతము వరకు ఆ రోగము అతనిని వదలలేదు. అందుచేత అతడొక ప్రత్యేక భవనమున వసించెను. అతని కుమారుడు యోతాము రాజ్యభారము వహించి దేశమును పరిపా లించెను.

6. అజర్యా చేసిన ఇతర కార్యములు యూదా రాజుల చరితమున లిఖింపబడియే ఉన్నవి.

7. అంతట అజర్యా తన పితరులతో నిద్రించి దావీదు నగరమున రాజ సమాధులలో పాతి పెట్టబడెను. అటుతరువాత అతని కుమారుడు యోతాము రాజయ్యెను.

8. యూదాసీమ యందు అజర్యా పరిపాలనా కాలము ముప్పది ఎనిమిదవయేట, యరోబాము కుమారుడు జెకర్యా యిస్రాయేలునకు రాజై సమరియా నగరమునుండి ఆరునెలలు పరిపాలించెను.

9. ఆ రాజుకూడ తన పూర్వులవలె యావే మెచ్చని దుష్కార్య ములు చేసెను. పూర్వము యిస్రాయేలును పాపమునకు పురికొల్పిన నెబాతు కుమారుడు యరోబామువలె అతడును కానిపనులు చేసెను.

10. యాబేషు కుమారుడగు షల్లూము జెకర్యామీద కుట్రపన్ని ఈబ్లేయాము వద్ద అతనిని వధించి తాను రాజయ్యెను.

11. జెకర్యా చేసిన ఇతర కార్యములు యిస్రాయేలు రాజులచరితమున లిఖింపబడియేయున్నవి.

12. “నీ కుమారులు నాలుగవతరమువరకు సింహాసనముమీద కూర్చుందురు” అని ప్రభువు యెహూకు మాటయిచ్చెను గనుక ఆ మాట చొప్పుననే అంతయు జరిగినది.

13. యూదా రాజ్యమున ఉజ్జీయా పరిపాలనా కాలము ముప్పది తొమ్మిదవయేట, యాబేషు కుమా రుడు షల్లూము యిస్రాయేలునకు రాజై సమరియా నుండి ఒక్కనెల మాత్రమే పరిపాలించెను.

14. గాదీ కుమారుడు మెనహేము తీర్సానుండి సమరియాకు వెళ్ళి షల్లూమును హత్యచేసి తాను రాజయ్యెను.

15. షల్లూము చేసిన ఇతర కార్యములు, అతడు పన్నిన కుట్ర, యిస్రాయేలు రాజుల చరితమున లిఖింపబడియే ఉన్నవి.

16. ఈ సమయముననే మెనహేము తపువా పట్టణమును, దానిలోని పౌరులను దాని పరిసర ప్రాంతములను మొదలంట నాశనము చేసెను. ఎందుకనగా ఆ నగరము అతనికి లొంగలేదు. అతడు పట్టణమునందలి చూలాండ్ర కడుపులుగూడ చీల్చివేసెను.

17. యూదారాజు అజర్యా పరిపాలనాకాలము ముప్పది తొమ్మిదవయేట గాదీ కుమారుడు మెనహేము యిస్రాయేలునకు రాజై సమరియానుండి పదియేండ్లు పరిపాలించెను.

18. పూర్వము నెబాతు కుమారుడు యరోబాము జీవితాంతమువరకు యిస్రాయేలీయులచే పాపము చేయించెనుగదా! మెనహేము కూడ అతనిమార్గమునే అనుసరించెను.

19. అతని కాలమున అస్సిరియా ప్రభువు తిగ్లత్-పిలేసెరు యిస్రాయేలు మీదికి దండెత్తివచ్చెను. మెనహేము అతనికి ముప్పది ఎనిమిది బారువులవెండి సమర్పించుకొని యిస్రాయేలు మీద తన అధికారమును సుస్థిరము చేసికొనెను.

20. అతడు ఆ సొమ్ముకొరకై తన దేశమునందలి ధనవంతులందరు ఒక్కొక్కరు ఏబది వెండినాణెములు చెల్లించునట్లు నిర్బంధముచేసెను. తిగ్లత్-పిలేసెరు ఆ సొమ్ముపుచ్చుకొని తన దేశమునకు వెడలిపోయెను.

21. మెనహేముచేసిన ఇతర కార్యములు యూదా రాజుల చరితమున లిఖింపబడియే ఉన్నవి.

22. మెనహేము తనపితరులతో నిద్రించగా, అతని కుమారుడు పెకహ్యా రాజయ్యెను.

23. యూదారాజు అజర్యా పరిపాలనాకాలము ఏబదియవ ఏట మెనహేము కుమారుడు పెకహ్యా యిస్రాయేలునకు రాజై సమరియానుండి రెండుయేండ్లు పరిపాలించెను.

24. యిస్రాయేలును పాపమునకు పురికొల్పిన నెబాతు కుమారుడు యరోబామువలె ఇతడును యావే ఒల్లని దుష్కార్యములు చేసెను.

25. పెకహ్య సేనానాయకుడును, రెమల్యా కుమారుడునగు పెక, ఏబదిమంది గిలాదీయులతో కలిసి రాజుపై కుట్రపన్ని అతనిని సమరియా యందలి రాజసౌధపు అంతర్భాగమున హత్యచేసెను.

26. పెకహ్యా చేసిన ఇతర కార్యములు యిస్రాయేలు రాజుల చరితమున లిఖింప బడియే ఉన్నవి.

27. యూదారాజైన అజర్యా పరిపాలనాకాలము ఏబది రెండవయేట రెమల్యా కుమారుడగు పెక యిస్రాయేలునకు రాజై సమరియానుండి ఇరువదేండ్లు పరిపాలించెను.

28. ఇతడు కూడ యిస్రాయేలును పాపమునకు పురికొల్పిన నెబాతు కుమారుడు యరోబామువలె యావే ఒల్లని దుష్కార్యములు చేసెను.

29. పేక పరిపాలన కాలముననే అస్పిరియా ప్రభువు తిగ్లత్-పిలేసెరు దండెత్తివచ్చి ఇయోను, ఆబెల్బెత్మాకా, యనోవా, కేదేషు, హాసోరు నగరములను గిలాదు, గలిలీ, నఫ్తాలి సీమలను జయించి అచటనున్న యిస్రాయేలీయులను అస్సిరియాకు బందీలుగా కొనిపోయెను.

30. యూదా రాజ్యమున ఉజ్జీయా కుమారుడు యోతాము పరిపాలనాకాలము ఇరువదియవయేట ఏలా కుమారుడైన హోషేయ పెక మీద కుట్రపన్ని అతనిని హత్యచేసి తాను రాజయ్యెను.

31. పెక చేసిన ఇతర కార్యములు యిస్రా యేలు రాజుల చరితమున లిఖింపబడియేఉన్నవి.

32. యిస్రాయేలు రాజైన రెమల్యా కుమారుడగు పెక పరిపాలనాకాలము రెండవయేట ఉజ్జీయా కుమారుడు యోతాము తన ఇరువది ఐదవ యేట యూదాకు రాజయ్యెను.

33. అతడు యెరూషలేము నుండి పదునారేండ్లు పరిపాలించెను. అతని తల్లి సాదోకు కుమార్తెయగు యెరూషా.

34. అతడు తన తండ్రి ఉజ్జియావలె ధర్మబద్దముగా జీవించి యావే దృష్టికి నీతిగా ప్రవర్తించెను.

35. అయినను అతడు ఉన్నత స్థలములను పడగొట్టింపలేదు. ప్రజలు అచట బలులుఅర్పించి సాంబ్రాణిపొగ వేయుచునేయుండిరి. దేవాలయపు ఎత్తైనద్వారమును నిర్మించినది ఈ యోతామే.

36. యోతాము చేసిన ఇతర కార్యములు యూదా రాజుల చరితమున లిఖింపబడియే ఉన్నవి.

37. అతడు రాజుగానున్న కాలమున ప్రభువు సిరియా రాజగు రెసీనును, యిస్రాయేలు రాజగు పెకను యూదా మీదికి దండెత్త పంపనారంభించెను.

38. యోతాము తన పితరులతో నిద్రించి దావీదు నగరమున తన పితరుల సమాధులలో పాతిపెట్టబడెను. అతని అనంత రము అతని కుమారుడు ఆహాసు రాజయ్యెను.

 1. యిస్రాయేలు రాజ్యమున రెమల్యా కుమారుడగు పెక పరిపాలనాకాలమున పదునేడవయేట యోతాము కుమారుడైన ఆహాసు యూదాకు రాజయ్యెను.

2. అతడు ఇరువదియవయేట రాజై యెరూషలేము నుండి పదునారేండ్లు పరిపాలించెను. ఆ రాజు తన పితరుడైన దావీదువలె ధర్మబద్దముగా జీవింపడయ్యెను.

3. పైగా యిస్రాయేలు రాజుల దుశ్చరితములను అనుకరించెను. తన సొంత కుమారునే విగ్రహములకు దహనబలిగా సమర్పించెను. యిస్రాయేలీయులు కనాను మండలములో ప్రవేశించినపుడు ప్రభువు అచటినుండి తరిమివేసిన ప్రజలు ఇట్టి చెడ్డపనులు చేసెడివారు.

4. ఉన్నత స్థలములలోను, పచ్చని చెట్ల క్రిందను ఆహాసు బలులర్పించి సాంబ్రాణి పొగవేసెను.

5. ఆ రోజులలో సిరియారాజగు రెసీను, యిస్రాయేలు రాజగు పెక యెరూషలేమును ముట్టడించిరి. కాని దానిని ఆక్రమించుకోలేకపోయిరి.

6. ఆ కాలముననే ఎదోమురాజు ఏలాతు నగరమును మరల ఆక్రమించి అచట వసించు యూదీయులను వెడలగొట్టెను. ఎదోమీయులు ఏలాతున స్థిరపడి నేటికిని అచటనే నివసించుచున్నారు.

7. ఆహాసు అస్సిరియా రాజు తిగ్లత్-పిలేసెరు వద్దకు దూతలను పంపి “నన్ను నీ దాసునిగాను, కుమారునిగాను భావింపుము. సిరియా యిస్రాయేలు రాజులు నా మీదికి దండెత్తివచ్చిరి. నీవు స్వయముగా వచ్చి వారి బారినుండి నన్ను కాపాడుము" అని అర్థించెను.

8. అతడు దేవాలయ కోశాగారము నందు, ప్రాసాద కోశాగారమునందు ఉన్న వెండిబంగారములను గైకొని అస్సిరియా రాజునకు కానుకగా పంపించెను.

9. తిగ్లత్-పిలేసెరు అతని మనవిని ఆలించి దమస్కుపై దాడిచేసి, ఆ నగరమును జయించి రెసీను రాజును వధించెను. ఆ దేశ ప్రజలను చెరగొని కీరు నగరమునకు కొనిపోయెను.

10. ఆహాసు దమస్కున నున్న తిగ్లత్-పిలేసెరు దర్శింపబోయినపుడు అచట ఒక బలిపీఠమును చూచెను. అతడు అన్ని వివరములతో ఆ బలిపీఠము నమూనాను తయారుచేయించి యెరూషలేమున నున్న యాజకుడు ఊరియా వద్దకు పంపెను.

11. ఆహాసు మరలి రాక ముందే ఊరియా ఆ బలిపీఠము నమూనా ప్రకారము ఒక బలిపీఠమును తయారు చేయించెను.

12. రాజు దమస్కునుండి తిరిగివచ్చి బలిపీఠము సిద్ధమైయుండుట చూచి, దానిని సమీపించి, దానిని ఎక్కి బలులర్పించెను.

13. దహనబలిని, ధాన్యబలిని, సమాధానబలి పశువు రక్తమును దానిమీద ధారపోసెను.

14. పూర్వము ప్రభువుసాన్నిధ్యమున నున్న కంచుబలిపీఠము దేవళము ముంగిటనుండు స్థలమునుండి తాను తయారు చేయించిన నూతన బలిపీఠమునకును, ప్రభువు దేవళమునకును మధ్యనుండి తొలగించి, ఆ నూతన బలిపీఠమునకు ఉత్తరదిశకు మరలించెను.

15. అతడు యాజకుడైన ఊరియాతో “ఇకమీదట ఉదయకాలపు దహనబలిని, సాయంకాలపు ధాన్యబలిని, రాజు, ప్రజలు సమర్పించు దహనబలులు, ధాన్యబలులు, ప్రజల అర్పణ ఈ పెద్దబలిపీఠము మీదనే అర్పింపవలయును. బలిపశువుల నెత్తురు ఈ బలిపీఠము మీదనే కుమ్మరింపవలయును. ఆ కంచు బలిపీఠ మును మాత్రము నేను దేవుని చిత్తమును తెలిసికొను పరికరముగా వాడుకొందును” అని చెప్పెను.

16. యాజకుడు ఊరియా ఆహాసురాజు చెప్పినట్లే చేసెను.

17. ఆహాసు దేవాలయమున ఉపయోగించు ఇత్తడిబండ్లను వానిమీది సిబ్బెలను తొలగించెను. పండ్రెండు కంచు ఎద్దుల మీద నిలిచియున్న కంచు తొట్టిని గూడ తొలగించి దానిని రాతిదిమ్మెల మీద నిలిపెను.

18. అతడు అస్సిరియా రాజునకు భయపడి విశ్రాంతిదినపు ఆచరణ కొరకై మందిరములో కట్టబడిన మండపమును దేవాలయము నుండి తొలగించెను. ప్రాసాదము నుండి దేవాలయమునకు పోవుటకు రాజు స్వయముగా వాడుకొను మార్గమును కూడ మూయించెను.

19. ఆహాసు చేసిన ఇతర కార్యములు యూదారాజులచరితమున లిఖింపబడియే ఉన్నవి.

20. ఆహాసు తన పితరులతో నిద్రించి, దావీదు నగరమున తన పితరుల సమాధులలో పాతి పెట్టబడెను. అటుపిమ్మట అతని కుమారుడు హిజ్కియా పాలించెను.

 1. యూదాసీమలో ఆహాసు పరిపాలనా కాలము పండ్రెండవయేట ఏలా కుమారుడు హోషేయ యిస్రాయేలుకు రాజై సమరియా నుండి తొమ్మిదేండ్లు పరిపాలించెను.

2. అతడును యావే ఒల్లని దుష్కార్యములు చేసెను. అయినను అతడు పూర్వపు యిస్రాయేలు రాజులంతటి దుర్మార్గుడు కాదు.

3. అస్సిరియా రాజు షల్మనేసెరు అతనిమీదికి దండెత్తివచ్చెను. హోషేయ అతనికి లొంగి ఏటేట కప్పము కట్టుటకు అంగీకరించెను.

4. కాని ఒక యేడు హోషేయ ఐగుప్తు రాజు సో వద్దకు దూతలనంపి షల్మనేనెరునకు కట్టవలసిన కప్పమును ఎగగొట్టెను. ఈ గోడమీదిపిల్లి వాలకమును చూచి అస్సీరియారాజు హోషేయను అతని కుతంత్రమునకు గాను బంధించి చెరలో వేయించెను.

5. అంతట షల్మనేసెరు యిస్రాయేలు మీదికి దండెత్తివచ్చి సమరియాను ముట్టడించి మూడేండ్ల పాటు దానిని ఆక్రమించుకోజూచెను.

6. మూడవ యేట, అనగా హోషేయ యేలుబడి తొమ్మిదవయేట, అస్సిరియా రాజు సమరియాను పట్టుకొనెను. అతడు యిస్రాయేలీయులను అస్సిరియాకు బందీలుగా కొనిపోయి కొందరికి హాల నగరమునను, కొందరికి గోజాను సీమలోని హాబోరు నదీప్రాంతమునను, కొందరికి మేదియా సీమలోను నివాసములు కల్పించెను.

7. ప్రభువు ఐగుప్తునుండి, ఫరో దాస్యము నుండి యిస్రాయేలీయులను విడిపించెనుగదా! అయినను వారు ప్రభువును లక్ష్యము చేయలేదు. కనుక సమరియా కూలిపోయెను.

8. వారు అన్యదేవతలను కొలిచిరి. ఆ ప్రభువు యిస్రాయేలీయుల సమక్షమునుండి తరిమి వేసిన స్థానిక జాతుల దుష్టాచారములను పాటించిరి.

9. యిస్రాయేలు ప్రజలు నియమించుకొనిన రాజులు, యావే సహింపని పాపకార్యములు చేసిరి. వారు చిన్న పల్లెలు మొదలుకొని పెద్ద పట్టణముల వరకు అన్ని తావులందు అన్యదైవములకు బలిపీఠములు నిర్మించిరి.

10. ప్రతి కొండమీద ప్రతి పచ్చని చెట్టు క్రింద అషేరా దేవతస్తంభములు, ప్రతిమలు స్థాపించిరి.

11. ప్రభువు ఆ నేల మీదినుండి వెడలగొట్టిన స్థానిక జాతుల ఆచారము ననుసరించి అన్యదైవములకు ధూపమువేసిరి. పలు దుష్కార్యములుచేసి ప్రభువు కోపము రెచ్చగొట్టిరి.

12. ప్రభువు ఆజ్ఞ మీరి విగ్రహముల నారాధించిరి.

13. ప్రభువు తన దూతలద్వారా, ప్రవక్తల ద్వారా యిస్రాయేలీయులను, యూదీయులను హెచ్చరించెను. “మీ దుష్కార్యములనుండి వైదొలగి నేను ప్రవక్తల ద్వారా మీ పితరులకిచ్చిన ధర్మాజ్ఞలను పాటింపుడు” అని మందలించెను.

14. అయినను వారు ప్రభువు మాట పాటింపరైరి. తమ పితరులవలె తామును తలబిరుసుతనముతో యావేను నమ్మరైరి.

15. ప్రభువు ఉపదేశమును పెడచెవిన పెట్టిరి. ప్రభువు పితరులతో చేసికొనిన నిబంధనను మీరిరి. అతని హెచ్చరిక లను లక్ష్యము చేయరైరి. వ్యర్థమైన విగ్రహములను అనుసరించుచు తామును వ్యర్ధులైరి. ప్రభువు వలదన్నను వినక ఇరుగుపొరుగు జాతుల ఆచారములను అనుసరించిరి.

16. ప్రభువు ఆజ్ఞలన్నిటిని కాదని లోహముతో రెండు కోడెదూడలను చేయించి పూజించిరి. పైగా అషీరాదేవత విగ్రహమును చేయించిరి. ఆకాశములోని నక్షత్రములను కొలిచిరి. బాలును పూజించిరి.

17. తమ కుమారులను, కుమార్తెలను అన్యదైవములకు దహనబలిగా అర్పించిరి. శకునములు చెప్పించు కొనిరి. జ్యోతిష్కులను సంప్రతించిరి. చేయరాని దుష్కార్యములెల్ల చేసి ప్రభువు కోపమును రెచ్చగొట్టిరి.

18. కనుక ప్రభువు యిస్రాయేలీయులమీద మండి పడి, వారిని తన సమక్షమునుండి గెంటివేసెను. యూదా తెగగాక మరియ ఏ తెగయు శేషించియుండలేదు.

19. యూదీయులు కూడ ప్రభువు ఆజ్ఞలను లెక్కచేయలేదు. వారు కూడ యిస్రాయేలీయులవలె చెడుబ్రోవన పోయిరి.

20. కనుక ప్రభువు యిస్రా యేలీయులనందరిని చేయివిడిచెను. వారిని కఠినముగా శిక్షించి దోపిడిగాండ్ర వశముచేసెను. వారిని తన యెదుటినుండి త్రోసివేసెను.

21. ప్రభువు యిస్రాయేలును యూదా రాజ్యమునుండి వేరుచేసెను. యిస్రాయేలీయులు నెబాతు కుమారుడు యరోబామును రాజును చేసిరి. అతడు యిస్రాయేలీయులను ప్రభువు నుండి వైదొలగించి వారిచేత ఘోరపాపము చేయించెను.

22. వారు యరోబామును అనుకరించి అతడు చేసిన పాడు పనులెల్ల చేసిరి.

23. కట్టకడకు ప్రభువు వారిని తన సన్నిధినుండి బహిష్కరించెను. ప్రభువు ఈ శిక్షను ప్రవక్తలద్వారా ముందుగనే యెరిగించెను. కనుక యిస్రాయేలీయులు అస్సిరియాకు బందీలుగా పోయి నేటివరకు అక్కడనే నివసించుచున్నారు.

24. అస్సిరియా రాజు బబులోనియా, కూతా, అవ్వా, హమాతు, సెఫర్వాయీము నగరముల నుండి రప్పించిన ప్రజలు యిస్రాయేలీయులకు మారుగా సమరియా సీమలో స్థిరపడిరి. ఆ దేశనగరములలో కాపురముండిరి.

25. అయితే వారు కాపురముండ ఆరంభించినపుడు యావే యెడల భయభక్తులు లేని వారు కనుక ప్రభువు వారిమీదికి సింహములను పంపగా అవి వారిలో కొందరిని చంపెను.

26. తాను సమరియా మండలమునకు పంపిన ప్రజలు ఆ దేశపు దేవుని పూజింపలేదని, కనుక ఆ దేవుడు సింహములను పంపి ఆ క్రొత్త ప్రజను నాశనము చేయించెనని అస్సిరియా రాజు వినెను.

27. కనుక అతడు “మనము ఇచటికి బందీలుగా కొనివచ్చిన యాజకులలో ఒకనిని సమరియాకు పంపుడు. అతడు ఆ మండలమునకు పోయి అచటి ప్రజలతో వసించి ఆ దేవుని విధివిధానముల తీరును వారికి తెలియజేయును” అని చెప్పెను.

28. కావున సమరియా నుండి బందీగా కొనిపోబడిన యిస్రాయేలు యాజకుడొకడు బేతేలు క్షేత్రమునకువచ్చి యావే యెడల భయ భక్తులు చూపవలసిన తీరును ప్రజలకు తెలియజేసెను.

29. కాని సమరియా మండలమున స్థిరపడిన క్రొత్త జాతులు తమకు నచ్చిన విగ్రహములను తయారు చేసికొని వానిని ఇంతకు పూర్వము యిస్రాయేలీయులు నిర్మించిన దేవళములలో ప్రతిష్ఠించిరి. ప్రతి జాతి తాను వసించుచున్న నగరములలో క్రొత్త దేవతా విగ్రహములను చేయించెను.

30. బబులోనియా నగరమునుండి వచ్చినవారు సూక్కోత్బెనోత్తును, కూతా నగరవాసులు నెర్గలును, హమాతువాసులు అషీమాను చేయించిరి.

31. అవ్వా నివాసులు నిబహసును, తర్తాకును వారివారి దేవతలను చేసుకొనిరి. సెఫర్వాయీము పురవాసులు తమ బిడ్డలను అద్రెమ్మెలెకు, అనమ్మెలెకు దేవతలకు దహనబలిగా అర్పించిరి.

32. వీరు యావే ప్రభువునుగూడ ఆరాధించిరి. పైగా వారు తమ జాతివారినే ఉన్నతస్థలములమీది మందిరములలో యాజకులనుగా నియమించిరి. ఆ యాజకులు వీరి తరపున బలులు అర్పించిరి.

33. ఆ రీతిగా వారు ఒక వైపు యావే యెడల భయము కలవారైయుండియు మరియొకవైపు తాము పూర్వముండిన స్థలములలోని ఆయా దేవతలను గూడ కొలిచిరి.

34. ఈనాటికిని వారు తమ సంప్రదాయములను పాటించుచునేయున్నారు. వారు ప్రభువుయెడల భయ భక్తులు చూపలేదు. యిస్రాయేలు అనబడిన యాకోబు సంతతివారికి ప్రభువు అనుగ్రహించిన కట్టడలు పాటింపరు.

35. “మీరు అన్యదైవములను కొలువవలదు. వారిని ఆరాధించి బలులర్పింపవలదు.

36. మీరు నన్ను సేవింపుడు. మహాబలసామర్థ్యములతో నాడు ఐగుప్తునుండి మిమ్ము విడిపించుకొని వచ్చినది నేనే. కనుక మీరు నన్ను ఆరాధించి నాకు బలులర్పింప వలయును.

37. నేను మీకు వ్రాసియిచ్చిన ఆజ్ఞలను మీరు సదా పాటింపవలయును. అంతేగాని మీరు అన్యదైవములను కొలువరాదు.

38. నేను మీతో చేసి కొనిన నిబంధనను విస్మరింపరాదు. అన్యదేవతలను ఆరాధింపరాదు.

39. మీ ప్రభువును, దేవుడనైన నన్నే మీరు సేవింపవలయును. శత్రువులనుండి మిమ్ము కాపాడువాడను నేనే” అని యిస్రాయేలీయులతో ఆయన నిబంధనము చేసికొనెను.

40. అయినను ఆ ప్రజలు ప్రభువు మాట లక్ష్యపెట్టక తమ పూర్వ సంప్రదాయమునే పాటించిరి.

41. ఆ రీతిగా వారు యావే యెడల భయభక్తులు చూపినను, తమకు ఇష్టమొచ్చిన దైవములనుగూడ పూజించిరి. వారి వంశీయులును ఈనాటికిని అదేపని చేయుచున్నారు.

 1. యిస్రాయేలునందు ఏలా కుమారుడు హోషేయ పరిపాలనాకాలమున మూడవయేట, అహాసు కుమారుడు హిజ్కియా యూదా రాజ్యమునకు రాజయ్యెను.

2. అతడు ఇరువదియైదవ యేట రాజ్యమునకు వచ్చెను. యెరూషలేమునుండి ఇరువది తొమ్మిదియేండ్లు పరిపాలించెను. అతని తల్లి జెకర్యా కుమార్తె అబీ.

3. అతడు తన పితరుడు దావీదువలె ధర్మబద్దముగా జీవించి యావేకు ఇష్టుడయ్యెను.

4. ఆ రాజు ఉన్నత స్థలములమీది మందిరములను తొలగించెను. విగ్రహములను నిర్మూలించెను. అషెరా దేవతావృక్షములను నరికించెను. మోషే చేయించిన కంచుసర్పమును గూడ ముక్కముక్కలు గావించెను. దాని పేరు నెహుష్టాను. అంతవరకును యిస్రాయేలీయులు దానికి ధూపమువేయుచునే యుండిరి.

5. హిజ్కియా యిస్రాయేలు దేవుడు యావేను నమ్మెను, యూదాను ఏలిన రాజులలో అతనికి ముందుగాని, అతనికి వెనుకగాని అతని వంటివారు లేరు.

6. అతడు ప్రభువునకు అనుచరుడయ్యెను. ప్రభువు మోషేద్వారా  ప్రసాదించిన ఆజ్ఞలను పూర్తిగా పాటించెను.

7. యావే హిజ్కియాకు బాసటయై ఉండెను గనుక అతడు తల పెట్టిన కార్యములన్నియు సఫలమయ్యెను. ఆ రాజు అస్సిరియారాజుమీద తిరుగబడి అతనికి కప్పము కట్టడయ్యెను.

8. ఫిలిస్తీయులను ఓడించి వారి గ్రామములను, పట్టణములను జయించెను. గాజాను, దాని పరిసరప్రాంతములనుగూడ వశము చేసికొనెను.

9. హిజ్కియా యేలుబడి నాలుగవయేట, అనగా యిస్రాయేలున హోషేయ యేలుబడి ఏడవయేట, అస్సిరియారాజైన షల్మనే సెరు యిస్రాయేలుమీదికి దండెత్తి వచ్చి సమరియాను ముట్టడించెను.

10. ముట్టడి మూడవయేట సమరియా ఓడిపోయెను. ఇది హిజ్కియా పరిపాలనమున ఆరవయేడు, హోషేయ పరిపాలనమున తొమ్మిదవయేడు.

11. అస్సిరియా రాజు యిస్రాయేలీయులను తన దేశమునకు బందీలనుగా కొనిపోయెను. వారిలో కొందరికి హాల నగరమునను, కొందరికి గోషాను మండలములోని హాబోరు నదీప్రాంతమునను, కొందరికి మేదియా సీమలోను నివాసములు కల్పించెను.

12. యిప్రాయేలీయులు ప్రభువు మాటను పాటింపరైరి. అతని నిబంధనమును మీరిరి. ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞలను ధిక్క రించిరి. వారు ఆ ఆజ్ఞలను విననూ లేదు, పాటింపనూ లేదు, కనుకనే సమరియా నాశనమయ్యెను.

13. హిజ్కియా యేలుబడి పదునాలుగవ యేట అస్సిరియా రాజు సన్హారీబు యూదా రాజ్యములోని సురక్షిత పట్టణములను ముట్టడించి జయించెను.

14. హిజ్కియా లాకీషున నున్న సన్హారీబునొద్దకు దూతల నంపి “నేను తప్పుచేసితిని. నీ దాడి చాలింపుము. నేను నీవు విధించిన పన్ను చెల్లింతును" అని చెప్పించెను. అస్సిరియా రాజు హిజ్కియాను పది బారువుల వెండిని, ఒక బారువు బంగారమును చెల్లింపుమని కోరెను.

15. యూదారాజు దేవాలయ కోశాగారమునను, ప్రాసాద కోశాగారమున ఉన్న వెండిని ప్రోగుజేసి పంపించెను.

16. దేవాలయ ద్వారములకును, ద్వారబంధములకును పొదిగిన బంగారమునుగూడ ఒలిపించి అస్సిరియా రాజునకు పంపెను.

17. అస్సిరియారాజు యెరూషలేమును ముట్టడించుటకై లాకీషునుండి తన ప్రతినిధులు తర్తాను, రబ్సారీసు, రబ్షాకె అనువారికి జతగా పెద్ద సైన్యమును పంపెను. వారు యెరూషలేము చేరుకొని, మీది చెరువు నుండి వచ్చిన నీరు నిలుచు కోనేటివద్ద విడిదిచేసిరి. అచ్చటనే చాకిరేవును కలదు.

18. అచటినుండి వారు రాజును పిలిపించిరి. కాని హిజ్కియాకు మారుగా రాజోద్యోగులు ముగ్గురు వారి వద్దకు వెళ్ళిరి. వారు రాజప్రాసాద పాలకుడును, హిల్కియా కుమారుడునగు ఎల్యాకీము, ధర్మశాస్త్ర బోధకుడగు షెబ్నా, రాజు లేఖకుడైన ఆసాపు కుమారుడగు యోవా.

19. అపుడు రబ్షాకె వారితో ఇట్లనెను “అస్సీరియా మహాప్రభువు మీ రాజుతో ఇట్లు చెప్పుమనుచున్నాడు. 'ఓయి! నీవు ఏమి చూచుకొని ఇంత మదించితివి?

20. యుద్ధము చేయుటకు బలముండవలెనుగాని వట్టిమాటలతో ఏమి లాభము? నీవు ఎవరిని నమ్ముకొని మామీద తిరుగ బడితివి?

21. ఐగుప్తు నీకు తోడ్పడుననుకొంటివి కాబోలు. ఆ దేశమును నమ్ముకొనుట రెల్లుకాడను ఊతకఱ్ఱగా వాడుకోగోరుటయే. ఆ కాడ విరిగి చేతిలో గ్రుచ్చుకొనును. ఐగుప్తు ఫరోను నమ్ముకొనువారికి చేకూరు ఫలితమును అంతే.

22. ఒకవేళ మీరు మీ దేవుడైన యావే ప్రభువును నమ్ముకొంటిమని మీరు నాతో చెప్పుదురేమో! యూదా వాసులును, యెరూషలేము పౌరులును ఇకమీదట యెరూషలేముననే ప్రభువుని ఆరాధింపవలయునని ఆజ్ఞాపించి హిజ్కియా ఎవరి ఉన్నత స్థలములను, బలిపీఠములను పడగొట్టెనో ఆయనే కదా యావే!'

23. మా రాజు తరపున నేను మీతో పందెము వేయుచున్నాను, వినుడు. నేను మీకు రెండువేల గుఱ్ఱములను ఉచితముగా ఇత్తును. కాని వానిని ఎక్కుటకు మీకు రెండువేలమంది రౌతులు మీ వద్ద కలరా?

24. అటుల కానియెడల మీరు మా యజమానుని అత్యల్పులలో అధిపతి అయిన ఒకనిని ఎట్లు ఎదిరింపగలరు? అయినను ఐగుప్తు మీకు రథములు, గుఱ్ఱములు పంపునని కాచుకొని యున్నారు. ఎంత వెఱ్ఱి!

25. నేను మీ దేవుని అనుమతి లేకయే మీ దేశము మీదికి దండెత్తి వచ్చితినను కొంటిరా! యావే ప్రభువు నన్ను మీ దేశముపై దండెత్తి మిమ్ము నాశనము చేయుమని చెప్పెను” అని పలికెను.

26. అప్పుడు హిల్కియా కుమారుడైన ఎల్యాకీము, షెబ్నా, యోవా అతనితో "అయ్యా! నీవు మాతో అరమాయికు భాషలో మాటలాడుము. మాకు ఆ భాష తెలియును. నీవు హీబ్రూభాషలో మాటలాడెద వేని ప్రాకారముమీదనున్న జనులెల్లరు అర్థము చేసికొందురు” అనిరి.

27. కాని అతడు వారితో “మీతోను మీ రాజుతోను మాత్రమే మాట్లాడుటకు మా ప్రభువు నన్నిటకు పంపెననుకొంటిరా? నేను ఆ ప్రాకారము మీద కూర్చున్నవారితో గూడ మాట్లాడవలయును. మీ వలె వారును అనతికాలములోనే తమ మలమూత్రములను తినవలసివచ్చును” అనెను.

28. అంతట రబ్షాకె లేచి నిలుచుండి జనులందరు వినునట్లు హీబ్రూ భాషలో పెద్దగా ఇట్లు పలికెను: “ప్రజలారా! అస్సిరియా మహాప్రభువు పలుకులు వినుడు!

29. ఈ హిజ్కియా రాజు మిమ్ము మోసగించుచున్నాడు. అతడు ఏ విధమునైనను మా రాజు దాడినుండి మిమ్ము కాపాడలేడు.

30. ఈ పట్టణము అస్సిరియనుల చేజిక్కకయుండునట్లు యావే మనలను రక్షించునను మాటలతో హిజ్కియా మిమ్ము నమ్మించుచున్నాడు.

31. మీరు హిజ్కియా మాట వినవద్దు. మా రాజు వచనములాలింపుడు. నాతో సంధికి నగరము వీడివచ్చి అస్సిరియా రాజునకు లొంగిపొండు. అప్పుడు మీరు మీ ద్రాక్షతోటలలో కాసిన పండ్లను భుజింతురు. మీ అంజూరముల మీద ఫలించిన పండ్లను తిందురు. మీ బావులలోని నీళ్ళు త్రాగుదురు.

32. అటుపిమ్మట మా రాజువచ్చి మిమ్ము మరొక దేశమునకు కొనిపోయి అచట స్థిర నివాసము కల్పించును. ఆ భూమికూడ మీ నేల వంటిదే. ఇక్కడివలె అక్కడను ద్రాక్షలు కాయును. గోధుమ పండును. ఓలివు తోటలు పెరుగును. తేనె లభించును. మా రాజు మాట పాటింతురేని మీరు సుఖముగా జీవింతురేకాని నాశనముకారు. హిజ్కియా పలుకులాలించి యావే మిమ్ము రక్షించునని నమ్మి మోసపోకుడు.

33. లోకములో ఇన్ని జాతులున్నవి కదా! మీరే చెప్పుడు, ఆ జాతులు కొలుచుదైవములు మా రాజు బారినుండి వారి దేశములను కాపాడగల్గిరా?

34. హమాతు, అర్పాదు దైవములేరి? సెఫర్వాయీము, హెనా, ఇవ్వా అనువారి దైవములెక్కడ? ఇంత ఎందులకు? మారాజు దాడినుండి సమరియాను ఏ దైవము రక్షించెను?

35. ఈ దేశముల దైవములలో ఎవరైన మారాజు దాడినుండి తమ రాజ్యములను కాపాడు కోగళారా? మరి యావే నేడు మీ యెరూషలేమును మాత్రమెట్లు కాపాడగలడు?"

36. ప్రజలు అస్పిరియా వాని మాటలకు జవాబు చెప్పలేదు. హిజ్కియా వారిని నోరు మెదపవద్దని ముందుగనే ఆఙ్ఞాపించియుండెను.

37. ఎల్యాకీము, షెబ్నా, యోవా శత్రువు మాటలువిని బట్టలు చించుకొనిరి. తమ రాజువద్దకు వెళ్ళి రబ్షాకె పలికిన పలుకులు విన్పించిరి.

 1. వారి మాటలు విని హిజ్కియా విచారముతో బట్టలుచించుకొని గోనెపట్టను తాల్చి ప్రభుమందిర మున ప్రవేశించెను.

2. అతడు ప్రాసాదరక్షకుడు ఎల్యాకీమును, రాజలేఖకుడు షెబ్నాను, వృద్ధులైన యాజకులను ఆమోసు కుమారుడగు యెషయా ప్రవక్త వద్దకు పంపెను. వారందరు గోనెలను తాల్చియే వెళ్ళిరి.

3. రాజు యెషయాకు పంపిన సందేశమిది: “ఈనాడు మనకు ఇక్కట్టులు చుట్టుకొన్నవి. శత్రువులు మనలను శిక్షించి అవమానముపాలు చేయుచున్నారు. ప్రసవకాలమువచ్చి, బలములేక బిడ్డలను కనజాలని గర్బిణివలె మనము ఉన్నాము.

4. అస్సిరియా రాజు పంపిన రబ్షాకె సజీవుడైన ప్రభువును తూలనాడెను. నీవు కొలుచు ప్రభువు ఈ నిందావాక్యములను ఆలించుగాక! వానిని పలికినవారిని శిక్షించుగాక! నీవు మాత్రము శేషముగా మిగిలియున్నవారిని కరుణింపుము అని ప్రభువునకు మనవిచేయుము.”

5. యెషయా ఆ సందేశము విని రాజునకు ఈ ప్రతిసందేశము పంపెను:

6. "ప్రభువుసందేశమిది. అస్సిరియా రాజు సేవకులు నన్ను దూషించి పలికిన మాటలు విని నీవు భయపడవలదు.

7. నేను ఆ రాజునకు దుష్టప్రేరణము కలిగింతును. అతడొక వదంతివిని తన దేశమునకు మరలిపోవును. తన దేశముననే కత్తివాదరకు ఎరయగును. ఇది అంతయు నా వలన జరుగును.”

8. అస్సిరియా ప్రతినిధి రబ్షాకె తన రాజు లాకీషు నుండి వెడలిపోయి లిబ్నా నగరమును ముట్టడించు చున్నాడని వినెను. కనుక అతడు రాజును సంప్రదించుటకై అచటికి వెళ్ళెను.

9. అంతలోనే ఇతియోపియా రాజు తిర్హకా అస్సిరియా మీదికి దండెత్తి వచ్చుచున్నా డని వార్త వచ్చెను. ఆ వార్త అందినపిమ్మట అస్సిరియా రాజు మరల దూతలనంపి యూదారాజు హిజ్కియాను ఇట్లు ఆజ్ఞాపించెను:

10. “నీవు నమ్ముకున్న యావే ప్రభువు యెరూషలేము నా వశముకాదని నుడువుచున్నాడు అను మాటలు నమ్మి నీవు మోసపోవలదు.

11. ఇంతవరకు అస్సిరియా రాజులు నానారాజ్యములను ఎట్లు మట్టిపాలు గావించిరో నీవు వినియే ఉందువు. నీవు మాత్రము నా దాడి నుండి తప్పించుకోగలవా?

12. మా పూర్వులు గోషాను, హారాను, రెసెపు పట్టణములను నాశనము చేసిరి. తెలాస్సారున వసించుచున్న బేతేదేను ప్రజలను సంహరించిరి. వారి దైవములు వారిని రక్షింపగలిగిరా?

13. హమాతు, అర్పాదు, సెఫర్వాయీము, హెనా, ఇవ్వారాజులు ఇప్పుడేమైరి?" ,

14. హిజ్కియా రాజు దూతలనుండి ఆ జాబు నందుకొని చదివెను. అంతట అతడు దేవాలయమునకు వెళ్ళి లేఖను ప్రభు సమక్షమున పెట్టి ఇట్లు ప్రార్ధించెను:

15. “యిస్రాయేలు దేవుడవైన ప్రభూ! నీవు వైభవోపేతమైన సింహాసనముపై ఆసీనుడవై యుందువు. నీవొక్కడవే దేవుడవు. సామ్రాజ్యములన్నిటిని ఏలువాడవు నీవే. భూమ్యాకాశములను సృజించిన వాడవు నీవే.

16. ప్రభూ! వీనులొగ్గి వినుము, కన్నులు విప్పి కనుము. సజీవ దేవుడవైన నిన్ను కించపరచుటకు సన్హారీబు పలికిన పలుకులు ఆలింపుము.

17. అస్సిరియా రాజులు నానాజాతులను జయించి నానా దేశములను నాశనము చేసిరనుట నిజమే.

18. ఆ జాతుల దైవములను కాల్చివేసిరి. కాని వారు నిజముగా దైవములా? నరులు మలిచిన రాతి ప్రతిమలును, కొయ్యబొమ్మలే కదా!

19. కనుక ప్రభూ! ఇప్పుడు నీవు మమ్ము అస్సిరియా రాజు దాడినుండి కాపాడుము. అప్పుడు సకల రాజ్యములు నీవొక్కడవే నిక్కముగా దేవుడవని గుర్తించును.”

20. అంతట ఆమోసు కుమారుడు యెషయా హిజ్కియా వద్దకు సేవకుని పంపి 'అస్సిరియారాజు నుండి కాపాడుమని నీవు పెట్టిన మొరను ప్రభువు అలించెను' అని చెప్పెను.

21. అస్సిరియా రాజు సన్హరీబునుగూర్చి ప్రభువు పలికిన పలుకులు ఇవి: “ఓయి! యెరూషలేము కన్య నిన్నుచూచి నవ్వుచున్నది. నిన్ను చిన్నచూపు చూచుచున్నది. తలాడించుచున్నది.

22. నీవెవరిని అవమానించి దూషించితివో గుర్తించితివా? కన్నుమిన్ను గానకెవరిని నిందించితివో తెలిసికొంటివా? నీవు నీ దూతలతో ప్రభువును గేలిచేసితివి. యిస్రాయేలు పరిశుద్ధదేవుడనైన నన్నే తృణీకరించితివి.

23. 'నా రథములతో నేను ఎత్తయిన కొండలనెక్కితిని. లెబానోనును అధిరోహించితిని. అచటి దేవదారులను, తమాల వృక్షములను నరికించితిని. ఆ అడవుల అంచులవరకు వెళ్ళితిని.

24. అన్యదేశములలో  బావులు త్రవ్వించి నీళ్ళు త్రాగితిని. నా సైన్యముల పాద తొక్కుడులవలన ఐగుప్తునదులు ఎండిపోయినవి' అని నీవు నా యెదుట ప్రగల్భములాడితివి.

25. కాని ఈ విజయములన్నిటిని నేను పూర్వమే నిర్ణయించితిని. ఇప్పుడు క్రియాపూర్వకముగా నిర్వహించితిని. నీవు సాధనమాత్రుడవై సురక్షిత పట్టణములను కూలద్రోసితివి. '

26. ఆ పట్టణములందలి జనులు భయపడి నిశ్చేష్టులైరి. వారు తూర్పుగాలికి సోలిపోవు పొలములోని పైరువలె, బీళ్లలోను, మిద్దెలమీద నెదుగు గడ్డివలె గడగడలాడిరి.

27. నిన్ను గూర్చి నాకు బాగుగా తెలియును. నీ రాకపోకలు, నీ చేతలు నేనెరుగుదును. నీవు నామీద రంకెలువేయుట నేను గుర్తించితిని.

28. నేను నీ అహంకారమును గూర్చి వింటిని. నేను నీకు ముక్కుత్రాడు వేయింతును. నీ నోటికి కళ్ళెము వేయింతును. నీవు వచ్చిన త్రోవనే వెడలిపోయెదవు.

29. హిజ్కియా! నీవు ఈ గురుతును గమనింపుము. ఈ యేడు రాబోవు యేడుగూడ మీకు దానంతటది పడి మొలిచిన ధాన్యమే లభించును. కాని మూడవయేడు మీరు పైరువేసి కోతకోయుదురు. ద్రాక్షలు పెంచి పండ్లు కోసికొందురు.

30. యూదా రాజ్యమున తప్పించుకొనిన శేషము నేలలోనికి వ్రేళ్ళు జొన్ని, మీద పండ్లుకాయు వృక్షమువలె వృద్ధి చెందుదురు.

31. శేషిత ప్రజలు యెరూషలేమున నుండి బయలుదేరుదురు, తప్పించుకొనిన వారు సియోను కొండలలో నుండి బయలుదేరుదురు. ప్రభువు ఈ కార్యమును సాధింప సమకట్టెను.

32. అస్సిరియా రాజు గూర్చి ప్రభువు పలుకు ఇది: అతడు ఈ పట్టణమున ప్రవేశింపజాలడు. దాని మీద ఒక్క బాణమునైనను వదలజాలడు. డాలుతో దానిచెంతకు రాజాలడు. దానిచుట్టు ముట్టడికి మట్టిదిబ్బలు పోయజాలడు.

33. అతడు తాను వచ్చిన త్రోవపట్టి వెడలిపోవును. ఈ నగరమున ఎంతమాత్రమును ప్రవేశింపజాలడు. ప్రభుడనైన నా పలుకులు ఇవి.

34. నా గౌరవార్థము నా సేవకుడు దావీదు నిమిత్తము నేను ఈ నగరమును రక్షింతును.”

35. ఆ రాత్రి ప్రభువుదూత అస్సిరియా శిబిరమునకు పోయి లక్ష ఎనుబది ఐదు వేలమంది సైనికులను సంహరించెను. వేకువనే లేచి చూడగా వారందరు చచ్చి పడియుండిరి.

36. అంతట అస్సిరియా రాజు సైన్యమును తరలించుకొని నీనెవెకు మరలిపోయెను.

37. అచట ఒకనాడు సన్హరీబు తన దేవత నిస్రోకుకు మ్రొక్కుచుండగా అతని కుమారులు అద్రెమ్మెలెకు, షరెసేరు అతనిని కత్తితో వధించి అరారాతు దేశమునకు పారి పోయిరి. అటుపిమ్మట అతని మరియొక పుత్రుడు ఏసర్హద్ధోను తండ్రికి బదులుగా రాజయ్యెను.

 1. ఆ రోజులలో హిజ్కియారాజు జబ్బుపడి ప్రాణాపాయ స్థితిలో నుండెను. అపుడు ఆమోసు కుమారుడును ప్రవక్తయునైన యెషయా రాజును చూడబోయి “ప్రభువు సందేశమిది. నీవిక బ్రతుకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుము” అని చెప్పెను.

2. హిజ్కియా గోడవైపు మొగము త్రిప్పి,

3. "ప్రభూ! ఇన్నాళ్ళు నిన్ను చిత్తశుద్ధితో సేవించితిని. నీ చిత్తము చొప్పున నడుచుకొంటిని" అని ప్రార్థన చేయుచు మిక్కిలి దుఃఖించెను.

4. యెషయా రాజును వీడ్కొని రాజప్రాసాద మధ్య భాగమును దాటిపోకమునుపే ప్రభువు వాణి యెషయాతో “నీవు వెనుకకు తిరిగిపోయి నా ప్రజలను ఏలు హిజ్కియాతో ఇట్లు చెప్పుము:

5. ప్రభువు సందేశమిది. నీ పితరుడు దావీదు దేవుడను, ప్రభుడనైన నేను నీ మొరవింటిని, నీ కన్నీళ్ళను నా కన్నులార జూచితిని. నేను నీకు ఆరోగ్యమును ప్రసాదింతును. నీవు మూడుదినములలో దేవాలయమునకు పోవుదువు.

6. నేను నీ ఆయువును ఇంకను పదునైదేండ్లు పొడిగింతును. అస్సిరియారాజు నుండి నిన్ను నీ పట్టణమును కాపాడుదును. నా గౌరవార్థము, నా సేవకుడగు దావీదు నిమిత్తము, నేను ఈ నగరమును రక్షింతును” అని చెప్పెను.

7. అంతట యెషయా "అత్తి పండ్ల గుజ్జును తెండు. రాజు వ్రణముపై ఉంచుడు. అతనికి ఆరోగ్యము చేకూరును” అనెను.

8. హిజ్కియా “ప్రభువు నావ్యాధిని నయము చేయుననుటకును, మూడు రోజులపిదప నేను దేవాలయమునకు పోవుదుననుటకును గుర్తు ఏమిటి?” అని ప్రవక్త నడిగెను.

9. యెషయా “ప్రభువు తన మాట నిలబెట్టుకొనును. దానికి గుర్తిది. సూర్యుని నీడను పదిమెట్లు ముందుకు జరుపమందువా లేక పదిమెట్లు వెనుకకు జరుపమందువా?” అని అడిగెను.

10. హిజ్కియా "పదిమెట్లు ముందుకు జరుపుట సులభమేగదా! కనుక పదిమెట్లు వెనుకకు జరిపిన చాలును” అనెను.

11. అప్పుడు యెషయా ప్రభువును ప్రార్థింపగా సూర్యుని నీడ ఆహాసు మెట్లపై పదిమెట్లు వెనుకకు పోయెను.

12. అదే కాలమున బబులోనియా రాజును బలదానుకుమారుడునగు మెరోదక్బలదాను హిజ్కియా రాజు జబ్బుపడెనని విని అతనికొక లేఖ వ్రాసి బహుమతి పంపెను.

13. హిజ్కియా ఆనందముతో ఆ రాజదూతలను ఆహ్వానించి వారికి తన కోశాగార మందలి వెండి బంగారములను, సుగంధ ద్రవ్యములను, పరిమళ తైలములను, రక్షణాయుధములను చూపించెను. తన ప్రాసాదమునగాని, రాజ్యమునగాని హిజ్కియా వారికి చూపింపని వస్తువులేదు.

14. అంతట యెషయా హిజ్కియా రాజునొద్దకు వెళ్ళి "వీరు ఎచ్చటినుండి వచ్చిరి? నీతో ఏమి చెప్పిరి?” అని అడిగెను. హిజ్కియా “వారు దూరదేశమైన బబులోనియా నుండి వచ్చిరి” అని జవాబు చెప్పెను.

15. “వారు నీ ప్రాసాదమున ఏమేమి చూచిరి?” అని యెషయా అడిగెను. రాజు “అంతయు చూచిరి. కోశాగారమున నేను వారికి చూపని వస్తువు ఒక్కటియు లేదు” అనెను.

16. యెషయా “అయినచో ప్రభువువాక్కు వినుము.

17. మీ ఇంటనున్న వస్తువులన్నింటిని నేటి వరకు మీ పూర్వులు కూడబెట్టిన వస్తుసామగ్రినంతటిని బబులోనియాకు కొనిపోయెదరు. ఇక నీకేమియు మిగులదు.

18. నీ వంశజులను గూడ బబులోనియాకు తీసికొనిపోయెదరు. అచట వారు రాజప్రాసాదమున నపుంసకులుగా బ్రతుకుదురు” అని పలికెను.

19. కాని హిజ్కియా తన పరిపాలన కాలమున శాంతిభద్రతలు నెలకొనియుండిన అదియే చాలును అనుకొనెను. కనుక అతడు ప్రవక్తతో “ప్రభువు సందేశము మంచిదే” అని అనెను.

20. హిజ్కియా చేసిన ఇతర కార్యములు అతని సాహస కృత్యములు, అతడు చెరువును, సొరంగమును త్రవ్వించి పట్టణమునకు మంచినీటిని సరఫరా చేయించుట మొదలగునవి అవన్నియు యూదారాజుల చరితమున లిఖింపబడియేయున్నవి.

21. హిజ్కియా తన పితరులతో నిద్రించగా అతని కుమారుడు మనష్షే రాజయ్యెను.

 1. మనష్షే రాజగునప్పటికి పండ్రెండేండ్లవాడు. అతడు యెరూషలేము నుండి యేబదియైదేండ్లు పరిపాలించెను. అతని తల్లి పేరు హెఫ్సీబా

2. యిస్రాయేలీయులు కనాను మండలమును ఆక్రమించుకొన్న కొలది ప్రభువు స్థానిక జాతులను అచ్చటినుండి వెడల గొట్టేనుగదా! మనష్షే ఆ జాతుల దురాచారములన్నిటిని అనుసరించెను.

3. ఆ రాజు తన తండ్రి పడగొట్టించిన ఉన్నతస్థలములమీది మందిరములను మరల నిర్మించెను. యిస్రాయేలు రాజు అహాబువలె అతడు బాలు దేవరకు బలిపీఠమును, అషేరా దేవతకు విగ్రహమును నెలకొల్పెను. నక్షత్రములకుగూడ మ్రొక్కెను.

4. యావే తన నామమునకు నివాస స్థానముగ ఎంచుకొనిన యెరూషలేము దేవళముననే మనష్షే అన్యదైవములకు బలిపీఠములు నెలకొల్పెను .

5. దేవాలయపు రెండు ప్రాంగణములందు నక్షత్రములకు బలిపీఠములు కట్టించెను.

6. అతడు తన కుమారుని దహనబలిగా సమర్పించెను. మాంత్రికులతో శకునములు చెప్పించుకొనెను. జ్యోతిష్కులను, భూతవైద్యులను సంప్రతించెను. ప్రభువునకు గిట్టని దుష్కార్యములుచేసి అతని కోపమును రెచ్చగొట్టెను.

7. అషేరా దేవత విగ్రహములను దేవాలయమున ప్రతిష్ఠించెను. గతమున ఈ దేవాలయమును గూర్చి ప్రభువు దావీదుతో, అతని కుమారుడు సొలోమోనుతో ఇట్లు నుడివియుండెను: “ఈ యెరూషలేమున, ఈ దేవాలయమున మీరు నన్ను పూజింపవలయును. యిస్రాయేలు దేశమున ఈ తావును, నేను స్వయముగా ఎన్నుకొంటిని.

8. యిస్రాయేలీయులు నా కట్టడలన్నిటిని పాటింతురేని, నా సేవకుడగు మోషే నియమించిన ఆజ్ఞలన్నిటిని అనుసరింతురేని, నేను యిస్రాయేలీయులను వారి పితరులకు ధారాదత్తము చేయబడిన నేలమీద నుండి వెడలగొట్టను.”

9. అయినను యూదావాసులు ప్రభువుమాట పాటింపలేదు. మనష్షే ప్రోద్బలమువలన యూదీయులు ప్రభువు వెడలగొట్టిన స్థానిక జాతులకంటె అధికముగా ఘోర పాపములు చేసిరి.

10. అపుడు ప్రభువు తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఇట్లు నుడివెను:

11. “మనష్షే రాజు యిట్టి హేయమైన పనులు చేసెను. కనానీయుల కంటె గూడ కానిపనులు చేసెను. విగ్రహములను చేయించి యూదీయులను కూడ పాపమునకు పురికొల్పెను.

12. కనుక యిస్రాయేలు ప్రభుడనైన నేను యెరూషలేమును, యూదాను దారుణముగా శిక్షింతును. ఆ శిక్షను జూచి జనులెల్లరు విస్తుపోవుదురు.

13. సమరియాను కొలిచిన కొలత్రాడును, అహాబు వంశమును సరిచూసిన సూత్రపుగుండును యెరూషలేము మీదికి చాచుదును. యెరూషలేములోని జనులందరిని తుడిచి వేయుదును. ఆ పట్టణము తుడిచివేయబడి బోర్లించిన పళ్ళెరమువలె నగును.

14. ఇచట మిగిలియున్న జనమును చేయివిడుతును. వారిని శత్రువులవశము చేయుదును. శత్రువులు వారిని జయించి వారి దేశమును దోచు కొందురు.

15. ఈ ప్రజలు తమ పితరులు ఐగుప్తునుండి బయలుదేరి వచ్చిన నాటి నుండియు దుష్కార్యములు చేసి నా కోపమును రెచ్చగొట్టిరి గనుక నేను వారికి శాస్తి చేసి తీరుదును.”

16. మనష్షే చంపించిన నిరపరాధుల నెత్తురు యెరూషలేము వీధులలో వెల్లువలైపారెను. పైపెచ్చు అతడు యెరూషలేము ప్రజలను విగ్రహారాధనకు పురికొల్పి ప్రభువు రోషమును రెచ్చగొట్టెను.

17. మనష్షే చేసిన ఇతర కార్యములు, అతని దుష్కృత్యములు యూదా రాజులచరితమున లిఖింప బడియే ఉన్నవి.

18. మనష్షే చనిపోగా రాజోద్యాన వనమున పాతిపెట్టిరి. దానికి ఉస్సా ఉద్యానవనమని పేరు. అటు తరువాత అతని కుమారుడు ఆమోను రాజయ్యెను.

19. యూదాకు రాజగునప్పటికి ఆమోను ఇరువది రెండేండ్ల వాడు. అతడు యెరూషలేము నుండి రెండేండ్లు పరిపాలించెను. యోత్బా నగరమునకు చెందిన హారూసు పుత్రిక మెషుల్లెమెతు అతని తల్లి.

20. ఆమోను కూడ తన తండ్రివలె దుష్టుడై యావే ఒల్లని దుష్కార్యములు చేసెను.

21. తండ్రివలె అతడును విగ్రహములను పూజించెను.

22. తన పితరులు కొలిచిన యావేను అతడు కొలువలేదు. ప్రభువు ఆజ్ఞలను పాటింపలేదు.

23. కొలువుకాండ్రు ఆమోను మీద కుట్రపన్ని రాజసౌధముననే అతనిని వధించిరి.

24. కాని యూదా ప్రజలు ఆమోను హంతకులను వధించి అతని కుమారుడు యోషీయాను రాజును చేసిరి,

25. ఆమోను చేసిన ఇతర కార్యములు యూదారాజుల చరితమున లిఖింపబడియే ఉన్నవి.

26. ఆమోనును ఉస్సా ఉద్యానవనమున అతనికి కలిగిన సమాధి యందు అతనిని పూడ్చిపెట్టిరి. అటు తరువాత అతని కుమారుడు యోషీయా రాజ్యమును ఏలెను.

 1. యోషీయా ఎనిమిదవ యేట రాజయ్యెను. అతడు ముప్పదియొక్క యేండ్లు యెరూషలేము నుండి పరిపాలించెను. బొస్కత్తు నగరవాసి అదాయా కుమార్తె యెదీదా అతని తల్లి.

2. అతడు ధర్మబద్దముగా జీవించి యావేకు ఇష్టుడయ్యెను. తన పితరుడైన దావీదును అనుసరించెను. ప్రభువు ఆజ్ఞలన్నిటిని నిష్ఠతో పాటించెను.

3. యోషీయా రాజు తన యేలుబడి పదునెనిమిదియవ యేట మెషుల్లాము మనుమడు, అసల్యా కుమారుడునగు షాఫాను అను కార్యదర్శిని దేవాలయమునకు పంపి,

4. “నీవు ప్రధానయాజకుడైన హిల్కీయావద్దకు పోయి దేవాలయ ప్రాంగణమున నుండు ద్వారపాలకులు భక్తులనుండి ఎంత సొమ్ము వసూలుచేసిరో వివరములు తెలిసికొని రమ్ము.

5. ఆ సొమ్మును దేవాలయమున మరమ్మతులు చేయించు అధికారులకు ముట్టజెప్పుమనుము.

6. వారు వడ్రంగులకును, రాళ్ళను చెక్కువారికిని, తాపీ పనివారికిని వేతనములీయవలయును. మరమ్మత్తులకు వలయు కలపను, రాళ్ళను కొనుటకు ఈయవలయును.” అని చెప్పెను.

7. మరమ్మత్తు చేయు అధికారులు నమ్మదగినవారు. వారియొద్ద నుండి జమాఖర్చుల లెక్క అడుగకయుండిరి.

8. అంతట ప్రధానయాజకుడైన హిల్కీయా యావే దేవళమున ధర్మశాస్త్ర గ్రంథమును కనుగొంటినని శాస్త్రియైన షాఫానుతో చెప్పెను. షాఫాను అతని యొద్దనుండి గ్రంథమునందుకొని చదివెను.

9. అతడు రాజునొద్దకు వెళ్ళి "యాజకులు దేవళములోని సొమ్మును లెక్కించి మరమ్మతు చేయించు అధికారులకు ముట్టజెప్పిరి.

10. ఇదిగో, నాకు ఈ గ్రంథమును యాజకుడైన హిల్కీయా ఇచ్చెను” అని ధర్మశాస్త్ర గ్రంథమును విప్పి రాజునెదుట ఆ గ్రంథమును బిగ్గరగా చదివెను.

11. ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచున్నప్పుడు అందులోగల మాటలు వినినపుడు రాజు పశ్చాత్తాపముతో బట్టలు చించుకొనెను.

12. యోషీయారాజు ప్రధాన యాజకుడగు హిల్కీయాను, షాఫాను కుమారు డగు అహీకామును, మీకాయా కుమారుడగు అక్బోరును, శాస్త్రియైన షాఫానును, రాజపరిచారకుడైన అసాయాను పిలిపించి,

13. “మీరు వెళ్ళి నా తరపునను, యూదా ప్రజల తరపునను ప్రభువును సంప్రదింపుడు. ఈ గ్రంథభావమేమో తెలిసికొనిరండు. మన పూర్వులు ఈ గ్రంథమునందలి బోధల ప్రకారము జీవింపలేదు గనుక ప్రభువు మనమీద మిక్కిలి కోపించెను” అని చెప్పెను.

14. కావున యాజకుడైన హిల్కీయా, షాఫాను, అహీకాము, అక్బోరు, అసాయా ప్రవక్తియైన హుల్దా వద్దకు వెళ్ళిరి. ఆమె యెరూషలేము నగరము క్రొత్త భాగమున వసించుచుండెను. ఆమె హర్హాషు మనుమడును తిక్వా కుమారుడైన షల్లూము భార్య. ఈ షల్లూము దేవాలయ వస్త్రాగారమునకు అధిపతి. దూతలు తాము వచ్చిన పనిని ప్రవక్తితో చెప్పగా ఆమె,

15. “మీరు పోయి రాజుతో ఇట్లు నుడువుడు.

16. ప్రభువు సందేశమిది. రాజు గ్రంథమున చదివినట్లు గనే నేను యెరూషలేమును ఆ నగరవాసులను శిక్షింతును.

17. వారు నన్ను నిరాకరించి అన్యదైవములకు బలులర్పించి నా కోపమును రెచ్చగొట్టిరి. ఈ నగరముపై రగుల్కొను కోపాగ్ని ఇక చల్లారదు.

18. మిమ్ము పంపిన యూదారాజును గూర్చి ప్రభుడనైన నా వాక్కు ఇది: నీవు ఆ గ్రంథములోని సందేశమును ఆలించితివి.

19. నేను యెరూషలేమును శిక్షింతు నంటిని. ఆ పట్టణము బీడుపడిపోవుననియు, దాని నామము శాపవచనముగా పరిణమించుననియు పలికితిని. ఆ మాటలాలించి నీవు నా సమ్ముఖమున వినయమును ప్రదర్శించితివి. బట్టలుచించుకొని కన్నీరు కార్చితివి. నేను నీ మొరాలించితిని.

20. నేను ఈ నగరమును నాశనము చేయుటను నీవు కంటితో చూడవు. దానికి ముందే నీవు ప్రశాంతముగా కన్ను మూయుదువు” అని చెప్పెను. దూతలు ఆ సందేశమును ఆలించి రాజు నొద్దకు తిరిగివచ్చిరి.

 1. రాజు యెరూషలేమునుండియు, యూదా నుండియు పెద్దలను పిలిపించెను.

2. అతడు యెరూషలేము పౌరులతో, యూదీయులతో యావే మందిరమునకు వెళ్ళెను. యాజకులు, ప్రవక్తలు, పెద్దలు, పిన్నలందరును కలిగియే వెళ్ళిరి. రాజు దేవాలయమున దొరికిన నిబంధన గ్రంథమును ఆ ప్రజలందరి యెదుట చదివి విన్పించెను.

3. యోషీయా స్తంభమునొద్ద నిలుచుండి ప్రభువు సన్నిధిని ఒడంబడిక చేసికొనెను. అతడు ప్రభువునకు విధేయుడనై యుందుననియు, ప్రభువు ఆజ్ఞలను పూర్ణ హృదయముతోను, పూర్ణఆత్మతోను ఆ గ్రంథమున నిర్దేశించిన విధులన్నిటిని అనుసరింతుననియు ప్రమాణము చేసెను. ప్రజలందరు ఆ నిబంధనమునకు సమ్మతించిరి.

4. అంతట యోషీయా ప్రధాన యాజకుడైన హిల్కీయాను, అతనికి సహాయముచేయు తోటి యాజకులను, దేవాలయ ప్రవేశమున కావలికాయు రక్షకభటులను పిలిపించి బాలును, అషేరాను, నక్షత్రములను పూజించుటకువాడు ఉపకరణములన్నిటిని దేవాలయమునకు కొనిరండని ఆజ్ఞాపించెను. అతడు ఆ ఉపకరణములను పట్టణము వెలుపలికి కొని పోయి కీడ్రోను లోయలో తగులబెట్టించెను. వాని బూడిదను బేతేలునకు పంపించెను.

5. యెరూషలేము ప్రాంతమున, యూదాసీమలోని నగరములందుగల ఉన్నత స్థలములలో ధూపమువేయుటకై పూర్వపు యూదారాజులు నియమించిన అర్చకులనేమి, బాలునకును, సూర్యచంద్రులకును, గ్రహములకును, నక్షత్రములకును ధూపమువేయు వారినేమి అతడు అందరిని నిలిపివేసెను.

6. అతడు యావే దేవాలయము నుండి అషేరా స్తంభమును వెలుపలికి గొనివచ్చి కీద్రోను నది లోయకు తీసికొనిపోయి అచట తగుల బెట్టించెను. దాని బూడిదను శ్మశానమున చల్లించెను.

7. దేవళ ములోని వేశ్యావృత్తినవలంభించిన పురుషుల గదులను కూలద్రోయించెను. అక్కడ వసించు స్త్రీలు అషేరా వనములలో అషీరాదేవతా క్షేత్రమునకు గుడారములు అల్లెడివారు.

8. అతడు యూదా రాజ్యములందలి యాజకుల నందరిని అవతలికి వెళ్ళగొట్టెను. గేబా నుండి బేర్షేబా వరకు యాజకులు ధూపము వేసిన ఉన్నత స్థలములను అతడు అమంగళముచేసి, పట్టణపు ద్వారమునొద్ద ఎడమ వైపుననున్న పట్టణపు అధికారి అయిన యెహోషువా నిర్మించిన ద్వారము దగ్గరనుండు ఉన్నత స్థలములను పడగొట్టించెను.

9. అయితే పై యాజకులకు యెరూషలేము దేవాలయమునందు యావే బలి పీఠమువద్ద అర్చనచేయు హక్కులేదు. కాని నగరము నందలి యాజకులకు లభించు పొంగనిరొట్టెలను మాత్రము వారు భుజింపవచ్చును.

10. రాజు హిన్నోము కుమారుల లోయలోని తో ఫెతు కొలిమిని గూడ అమంగళము గావించెను. అచటి దైవమైన మోలెకునకు తమ కొడుకులనుగాని, కూతుండ్రనుగాని ఎవరును దహనబలిగా సమర్పించుటకు వీలుపడనట్లు చేసెను.

11. యావే దేవళపు ప్రవేశమంటపమునొద్ద, సేవకుడైన నెతన్నెలకు యొక్క గది దగ్గర పూర్వము యూదా రాజులు సూర్యారాధనకు సమర్పించిన గుఱ్ఱములను తీసివేసి, సూర్యునికి ప్రతిష్ఠింపబడిన రథములనన్నిటిని కాల్పించెను.

12. యూదా రాజులు ప్రాసాదమునకు పైభాగమున, ఆహాసురాజు నిర్మించిన బలిపీఠములను యోషీయా కూలద్రోయించెను. మనష్షే రాజు దేవాలయమునందలి రెండు ఆవరణములలో కట్టించిన బలిపీఠములకును ఇదే గతి పట్టెను. అతడు ఆ పీఠములను పొడిపొడి చేయించి కీద్రోను లోయలో చల్లించెను.

13. యెరూషలేమునకు తూర్పుననున్న భ్రష్టాచారపు కొండకు దక్షిణ దిశన సొలోమోను నికృష్టమైన దేవతా విగ్రహములకు ఉన్నత స్థలములు నిర్మించెను. అవి సీదోనీయులు కొలుచు అష్టారోతు, మోవాబీయులు కొలుచు కేమోషు, అమ్మోనీయులు కొలుచు మిల్కోము విగ్రహములు. ఆ ఉన్నత స్థలములను యోషీయా పడగొట్టించెను.

14. అతడు అషీరాదేవత ప్రతిమను, శిలాస్తంభములను ముక్కలు ముక్కలు చేయించెను. ఆ దేవత పేర నాటించిన కొయ్య స్తంభములనుగూడ నరికించెను. ఆ తావును మనుష్యుల ఎముకలతో నింపెను.

15. యోషీయా బేతేలునందలి బలిపీఠమును, ఉన్నత స్థలమును అనగా యిస్రాయేలు ప్రజలు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడైన యరోబాము కట్టించిన ఆ ఉన్నతస్థలమును పడగొట్టించి, కాల్చి దాని రాళ్ళను పిండిచేయించెను. అషీరాదేవతకు నెలకొల్పిన ప్రతిమనుగూడ తగుల బెట్టించెను.

16. యోషీయా అటునిటు పారజూడగా ఉన్నత స్థలములో కొన్ని సమాధులు కనిపించెను. అతడు సమాధులలోని ఎముకలను తెప్పించి బలిపీఠము మీద కాల్పించి దానిని అమంగళపరచెను. పూర్వము యరోబాము ఉత్సవసమయమున ఈ బలిపీఠము చెంత నిలిచియున్నపుడు దైవభక్తుడు పలికిన ప్రవచనము ఈరీతిగా నెరవేరెను. రాజు మరల చుట్టుపట్ల పారజూడగా పై ప్రవచనము పలికిన దైవభక్తుని సమాధి కూడ కనిపించెను.

17. అతడు ఆ సమాధి ఎవరిదని ప్రశ్నింపగా బేతేలు పౌరులు “నాడు యూదా రాజ్యము నుండి వచ్చి ఇప్పుడు నీవు ఈ బలిపీఠమును కూలద్రోయించిన విధానమునంతటిని ముందుగనే ప్రవచించిన దైవభక్తుని సమాధి అదియే” అని చెప్పిరి.

18. అందుకు రాజు “ఆ సమాధిని అట్లే ఉండనిండు. అతని ఎముకలను తొలగింపవద్దు” అనెను. కనుక ఆ అస్థికలను ఎవరు ముట్టుకోలేదు. ఆ రీతిగనే సమరియా నుండి వచ్చిన ప్రవక్త అస్థికలనుకూడ ఎవరు అంటుకోలేదు.

19. సమరియా నగరములందలి ఉన్నత స్థలములలోని మందిరములనెల్ల యోషీయా నిర్మూలించెను. పూర్వము యిస్రాయేలు రాజులు ఈ మందిరములను నిర్మించి యావే కోపమును రెచ్చగొట్టిరి. ఆ మందిరములలోని బలిపీఠములకు కూడ బేతేలు బలిపీఠమునకు పట్టినగతియే పట్టెను.

20. అతడు ఉన్నతస్థలమునకు నియమింపబడిన యాజకులను అందలి బలిపీఠముల మీదనే వధించెను. ప్రతి పీఠముమీద ఎముకలను కూడ కాల్పించెను. అటుపిమ్మట రాజు యెరూషలేమునకు వెడలిపోయెను.

21. నిబంధన గ్రంథమున వ్రాయబడియున్నట్లే ప్రభువు పేర పాస్కబలిని జరుపుడని రాజు ప్రజలను ఆజ్ఞాపించెను.

22. న్యాయాధిపతుల పరిపాలనకాలము నుండియు యిస్రాయేలు రాజులుగాని, యూదా రాజులుగాని పాస్క ఉత్సవమును ఇంత వైభవముగా జరిపియుండలేదు.

23. యోషీయా రాజు ఏలుబడి పదునెన్మిదియవ యేట యెరూషలేమున పాస్క ఉత్సవము జరిగెను.

24. ప్రధానయాజకుడైన హిల్కీయా దేవాలయమున కనుగొనిన గ్రంథమునందలి ఆజ్ఞలను పాటించుటకై యోషీయా యెరూషలేమునుండి, యూదానుండి జ్యోతిష్కులను, చనిపోయినవారిని ఆవాహనముచేయు మాంత్రికులను వెళ్ళగొట్టించెను. గృహదేవతల విగ్రహములను, అన్య దేవతారాధనయందు వాడు పరికరములను నిర్మూలించెను.

25. యోషీయా వలె మోషే ఆజ్ఞలన్నిటిని పాటించి పూర్ణహృదయముతో, పూర్ణమనస్సుతో, పూర్ణశక్తితో ప్రభువును కొలిచినవాడు అతనికి పూర్వపు రాజులలో ఒక్కడునులేడు. అతని తరువాత వచ్చిన రాజులలోను ఎవడునులేడు.

26. అయినను మనష్షే చేసిన దుష్కార్యములవలన ప్రభువు కోపము యూదామీద ముమ్మరముగా రగుల్కొనెను.

27. కనుక అతడు “నేను యిస్రాయేలీయులను వలె యూదా ప్రజలనుగూడ నా సమక్షమునుండి వెడలగొట్టెదను. నేనెన్నుకొనిన యెరూషలేము నగరమును, నా నామమున ఎన్నుకొనిన దేవళమును పరిత్యజింతును”అనెను.

28. యోషీయా చేసిన ఇతర కార్యములు యూదా రాజులచరితమున లిఖింపబడియేఉన్నవి.

29. అతడు రాజుగా ఉన్న కాలమున ఐగుప్తురాజైన నెకో అస్పిరియా రాజునకు తోడ్పడుటకై సైన్యముతో యూఫ్రటీసునది వద్దకు వెళ్ళుచుండగ యోషీయా ఐగుప్తు సైన్యమును ఆపదలచి మెగిద్ధో వద్ద దానిని ఎదిరించెను. ఆ యుద్ధమున అతడు ప్రాణములు కోల్పోయెను.

30. రాజోద్యోగులు అతని శవమును రథము మీద యెరూషలేమునకు కొనిపోయి అతని సమాధియందు పాతిపెట్టిరి. యూదీయులు యోషీయా కుమారుడు యెహోవాహాసును రాజుగా ఎన్నుకొని అభిషేకించిరి.

31. రాజగునాటికి యెహోవాహాసునకు ఇరువది మూడేండ్లు. అతడు యెరూషలేమునుండి మూడునెలలు మాత్రము పరిపాలించెను. లిబ్నానగరపు యిర్మియా పుత్రిక హమూతలు అతని తల్లి.

32. అతడును తన పితరులవలెనె యావే సహించని దుష్కార్యములు చేసెను.

33. ఐగుప్తురాజగు ఫరో నెకో హమాతు మండలములోని రిబ్లా నగరమున యెహోవాహాసును బందీనిచేసెను. యూదా సీమకు నాలుగువందల వీసముల వెండిని, నాలుగు వీసముల బంగారమును పన్ను విధించెను.

34. ఫరో నెకోరాజు, యోషీయా కుమారుడు ఎల్యాకీమును తండ్రికి బదులుగా రాజును చేసెను. అతని పేరును మార్చి యెహోయాకీము అని క్రొత్త పేరు పెట్టెను. ఫరో నెకో యెహోవాహాసును ఐగుప్తునకు బందీగా కొనిపోగా అతడచ్చటనే మరణించెను.

35. ఐగుప్తురాజు విధించిన కప్పములను చెల్లించుటకై యెహోయాకీము ప్రజలనుండి వారివారికి నిర్ణీతమైన పన్నులు వసూలుచేసెను.

36. యెహోయాకీము రాజగునప్పటికి ఇరువది ఐదేండ్ల ఈడువాడు. అతడు యెరూషలేము నుండి పదునొకండేండ్లు పరిపాలించెను. రూమా నగరవాసి పెదాయా పుత్రిక సెబిదా అతని తల్లి.

37. ఆ రాజు కూడ తన పూర్వులవలె యావే సహించని దుష్కార్య ములు చేసెను.

 1. యెహోయాకీము రాజుగానున్న కాలమున బబులోనియారాజైన నెబుకద్నెసరు యూదామీద దాడి చేసెను. యెహోయాకీము మూడేండ్లపాటు అతనికి లొంగియుండెను. ఆ మీదట తిరుగబడెను.

2. కాని ప్రభువు బాబిలోనియా, సిరియా, మోవాబు, అమ్మోను దేశములనుండి యూదామీదికి యుద్ధ సైన్యములను రప్పించెను. ప్రభువు తన భక్తులైన ప్రవక్తల ద్వారా నుడివినట్లే ఈ ఉపద్రవము కలిగెను.

3. ఇది అంతయు ప్రభువు ఆజ్ఞపై జరిగెను. మనష్షే పాపములకుగాను ప్రభువు యూదీయులను తన సమక్షము నుండి వెడలగొట్టనెంచెను.

4. పైగా ఆ రాజు యెరూషలేమున నిర్దోషుల నెత్తురు వరదగా పారించెనుగదా! ఆ దుష్కార్యమును ప్రభువు క్షమింపలేదు.

5. యెహోయాకీము చేసిన ఇతర కార్యములు యూదారాజుల చరితమున లిఖింపబడియేఉన్నవి.

6. అతడు చనిపోగా అతని కుమారుడు యెహోయాకీను రాజయ్యెను.

7. యూఫ్రటీసునది నుండి ఐగుప్తు నది వరకు ఐగుప్తురాజు వశమున నున్న భూభాగమంతటిని బబులోనురాజు జయించగా, ఐగుప్తురాజు మరెన్నటికిని తన దేశమునుండి బయటకు వెడలలేదు.

8. యెహోయాకీను పదునెనిమిదవ యేట రాజై యెరూషలేము నుండి మూడునెలలు మాత్రము పరిపాలించెను. యెరూషలేము నగరవాసి ఎల్నాతాను కుమార్తె నెహుష్టా అతని తల్లి.

9. ఆ రాజు గూడ తన పితరులవలె యావే ఒల్లని దుష్కార్యములు చేసెను.

10. అతని కాలమున బబులోనియా నుండి నెబుకద్నెసరుయొక్క సైన్యాధిపతులు దండెత్తివచ్చి యెరూషలేమును ముట్టడించిరి.

11. సైన్యములు యెరూషలేమును ముట్టడించుచుండగా నెబుకద్నెసరు స్వయముగా వచ్చి నగరమును పట్టుకొనవచ్చెను.

12. యెహోయాకీను తనతల్లితో, సేవకులతో, ప్రాసాద సంరక్షకులతో, అధిపతులతో బబులోనియారాజునకు లోబడిపోయెను. ఆ రాజు తన పరిపాలనాకాలము ఎనిమిదవయేట యెహోయాకీనును బందీని చేసెను.

13. నెబుకద్నెసరు దేవాలయకోశాగారము నుండి, ప్రాసాదకోశాగారము నుండి సంపదనంతయు అపహరించుకొని బబులోనియాకు కొనిపోయెను. ప్రభువు నుడివినట్లే పూర్వము సొలోమోనురాజు దేవాలయముకొరకు చేయించిన బంగారు పాత్రలన్నిటిని పగులగొట్టించెను.

14. నెబుకద్నెసరు యెరూషలేము నగరవాసులను, రాజవంశీయులను, యుద్ధవీరులను మొత్తము పదివేలమందిని చెరగొని బబులోనియాకు కొనిపోయెను. ఇనుపపనిముట్లు తయారుచేయువారు మొదలైన చేతిపని వారినందరిని గూడ బందీలనుగా కొనిపోయెను. పేదసాదలను మాత్రమే యూదాలో ఉండనిచ్చెను.

15. యెహోయాకీనును, రాజు తల్లిని, రాజు భార్యలను, అతని సేవకులను, ప్రముఖులైన పౌరులను చెరగొని తీసికొనిపోయెను.

16. ఆ రాజు యూదానుండి పరాక్రమవంతులను ఏడువేలమందిని, ఇనుప పనిముట్లు చేయు చేతిపని వారిలో వేయి మందిని బందీలుగా కొనిపోయెను. ఆ బందీలందరు కండబలము కలవారు. యుద్ధముచేయ సమర్థులు.

17. నెబుకద్నెసరు యెహోయాకీను పినతండ్రియైన మత్తాన్యాను యూదాకు రాజును చేసి అతనికి సిద్కియా అని క్రొత్త పేరు పెట్టెను.

18. సిద్కియా ఇరువది ఒకటవ యేట రాజై యెరూషలేము నుండి పదకొండు యేండ్లు పరిపాలించెను. లిబ్నా నగరవాసి యిర్మీయా కుమార్తె హమూతలు అతని తల్లి.

19. యెహోయాకీను వలెనే సిద్కియాకూడ యావే సహించని దుష్కార్యములు చేసెను.

20. యూదాప్రజలపై, యెరూషలేము నగరవాసులపై ప్రభువునకు కలిగిన కోపమునుబట్టి ఆయన తన సమక్షము నుండి వారిని గెంటివేయు వరకు బబులోనురాజుపై సిద్కియా తిరుగబడెను.

 1. సిద్నియా అతని యేలుబడి తొమ్మిదవ యేడు పదియవనెల పదియవనాడు నెబుకద్నెసరు సర్వసైన్యముతో వచ్చి యెరూషలేమును ముట్టడించెను.

2. బబులోనీయులు పట్టణము వెలుపల శిబిరము పన్నిరి. నగర ప్రాకారము చుట్టు ముట్టడిదిబ్బలు పోయించిరి. సిద్కియా యేలుబడి పదకొండవయేటి వరకు ముట్టడికొనసాగెను.

3. ఆ యేడు నాలుగవ నెల, తొమ్మిదవనాడు కరువు మిక్కుటముకాగా ప్రజలకు తిండి దొరకదయ్యెను.

4. అంతట కల్దీయ శత్రువులు ప్రాకారములను కూల్చివేసిరి, బబులోనీయులు నగరమును చుట్టుముట్టియున్నను యూదారాజు, రాణువ వారు రాత్రివేళ పలాయితులైరి. వారు రాజోద్యాన వనము ప్రక్కగా రెండుప్రాకారముల మధ్యనున్న ద్వారముగుండ తప్పించుకొని యోర్దాను లోయలోనికి పారిపోయిరి.

5. కాని కల్దీయుల సైన్యము వారి వెంటబడి యెరికో మైదానమున సిద్కియాను పట్టుకొనిరి. అతని సైనికులందరు సిద్కియాను విడిచి పారిపోయిరి.

6. వారు రాజును పట్టుకొని రిబ్లా యందు విడిది చేయుచున్న నెబుకద్నెసరు వద్దకు కొనిపోయిరి. అచట బబులోనియారాజు యూదా రాజునకు శిక్ష విధించెను.

7. నెబుకద్నెసరు ఆజ్ఞపై సిద్కియా కన్నుల ఎదుటనే అతని కుమారులను వధించిరి. అటుపిమ్మట అతని కన్నులను పెకలించిరి. అతనిని ఇత్తడిగొలుసులతో బంధించి బబులోనియాకు కొనిపోయిరి.

8. నెబుకద్నెసరు పరిపాలనాకాలము పందొమ్మిదవయేట ఐదవనెల ఏడవనాడు, బబులోనియా రాజునకు అంగరక్షకుడును అధిపతియునైన నెబూసరదాను యెరూషలేమున ప్రవేశించెను.

9. అతడు దేవాలయమును, రాజప్రాసాదమును, పట్టణములోని ప్రముఖుల ఇండ్లను తగులబెట్టించెను.

10. అతనితోనున్న కల్దీయ సైనికులు పురప్రాకారములను పడగొట్టిరి.

11. నెబూసరదాను పట్టణమున మిగిలియున్న జనమును, చేతిపనివారిని, బబులోనియా పక్షమును అవలంబించిన వారిని బబులోనియాకు కొనిపోయెను.

12. కొందరు పేదవారిని మాత్రము యూదాలోని ద్రాక్ష తోటలను, పొలమును సాగుచేయుటకు వదలి వేసెను.

13. బబులోనీయులు దేవాలయములోని కంచుస్తంభములను, దిమ్మలను, కంచు సముద్రమును ముక్కలు ముక్కలు చేసిరి. ఆ కంచునంతటిని బబులోనియాకు కొనిపోయిరి.

14. మరియు వారు బలిపీఠము మీది బూడిదనెత్తు గరిటెలను, పళ్ళెములను, దీప సామగ్రిని, పశుబలులు అర్పించునపుడు నెత్తురుపట్టు పాత్రలను, సాంబ్రాణి పొగ వేయుటకు వాడు గిన్నెలను, ఇంకను దేవాలయమున వాడు రకరకముల కంచు పరికరములను బబులోనియాకు తీసికొనిపోయిరి.

15. వెండి బంగారములతో చేసిన పరికరములన్నిటిని కొని పోయిరి. నిప్పుకణికలను కొనిపోవుటకు వాడు చిన్నచిన్న గరిటెలను, పాత్రలనుగూడ తీసికొని వెళ్ళిరి.

16. సొలోమోను చేయించిన కంచువస్తువులు అనగా రెండుస్తంభములు, దిమ్మలు, పెద్దకుంట తూకము వేయుటకు సాధ్యపడనివి.

17. ఆ రెండుస్తంభములు ఒకేరీతిగానుండెడివి. వానియెత్తు పదునెనిమిది మూరలు. వానిమీద మరల మూడుమూరల ఎత్తున దిమ్మలుండెడివి. ఆ దిమ్మలచుట్టు కంచుతో చేయ బడిన అల్లికలుండెడివి. వానిని కంచు దానిమ్మపండ్లతో అలంకరించిరి.

18. నెబూసరదాను ప్రధానయాజకుడైన సెరాయాను, ఉపయాజకుడైన సెఫన్యాను, మరి ముగ్గురు దేవాలయోద్యోగులను చెరగొనెను.

19. పట్టణములోని సైన్యాధిపతిని, నగరమున ఉన్న రాజు సలహాదారులను ఐదుగురిని, ఆయుధ స్థలములమీది అధిపతిని, కార్యదర్శిని మరియు అరువదిమంది ప్రముఖులను చెరబట్టెను.

20. వారినందరిని నెబూసరదాను బబులోనియారాజు నొద్దకు కొనిపోయెను. ఆ రాజు అప్పుడు హమాతునందలి రిబ్లా నగరమున విడిదిచేసియుండెను.

21. రాజు అట వారిని హింసించి చంపెను. ఆ రీతిగా యూదీయులు తమ దేశము నుండి ప్రవాసమునకు కొనిపోబడిరి.

22. బబులోనియారాజు నెబుకద్నెసరు, షాఫాను మనుమడు, అహికాము కుమారుడునగు గెదల్యాను యూదా రాజ్యమునకు పాలకునిగా నియమించెను. యూదాసీమలో మిగిలియున్న వారికందరికి అతడు అధిపతి.

23. బబులోనీయులకు లొంగని సైనికులు, సైన్యాధిపతులు గెడల్యా యూదాకు అధికారి అయ్యెనని విని మిస్ఫాయొద్ద అతనిని కలిసికొనిరి. వీరు నెతన్యా కుమారుడగు యిష్మాయేలు, కారె కుమారుడైన యెహోనాను, తనుమెతు కుమారుడు సెరాయా, మాకతీయుడైన యసన్యా అనువారు.

24. గెదల్యా వారితో “మీరు బబులోనీయులకు వెరవనక్కరలేదు. ఈ సీమన వసించి బబులోనియా రాజునకు లొంగియుందురేని మీకు ఏ ఆపదయు వాటిల్లదు” అని శపథము చేసెను.

25. కాని ఆ యేడు ఏడవనెలలో రాజ వంశీయుడైన ఎలీషామా మనుమడు, నెతన్యా కుమారుడునగు యిష్మాయేలు పదిమందితో కలిసి మిస్ఫాకు వెళ్ళి గెదల్యాను సంహరించెను. అచట వసించుచున్న యూదులను మరియు కల్దీయులనుగూడ చంపెను.

26. అంతట యిస్రాయేలీయులు పేదలనక, ధనికులనక అందరు సేనాధిపతులతో సహా ఐగుప్తునకు పారిపోయిరి. వారు బబులోనీయులకు భయపడిరి.

27. యెహోయాకీను ప్రవాసకాలము ముప్పది యేడవ యేట పండ్రెండవ నెల ఇరువది యేడవనాడు ఎవీల్మెరోదకు బబులోనియాకు రాజయ్యెను. ఆ రాజు యూదారాజు యెహోయాకీనును క్షమించి అతనిని చెరనుండి విడిపించెను.

28. అతడు యెహోయాకీను మీద కరుణ జూపెను. నాడు ఆ దేశమున ప్రవాసములో నున్న రాజులందరికంటె అతనిని పెద్దచేసెను.

29. యెహోయాకీను ఖైదీ దుస్తులను తొలగించెను. నాటి నుండి యెహోయాకీను జీవితాంతమువరకు రాజ గృహముననే భుజించెను.

30. యెహోయాకీను బ్రతికియున్నంతకాలము రాజుచే నిర్ణయించబడిన అతని రోజువారి ఖర్చులకుగాను బబులోనీయులు సొమ్ము చెల్లించిరి.