1. పారశీకదేశరాజైన కోరెషు ఏలుబడి మొదటి యేట ప్రభువు ఆ రాజు అంతరంగమున ప్రబోధించెను. కనుక అతడొక లిఖితరూపమైన చట్టమును జారీచేసి దానిని తన రాజ్యము నలుమూలల ఈ క్రింది విధముగా ప్రకటన చేయించెను. ప్రభువు ముందుగానే యిర్మియా ద్వారా పలికినపలుకు నెరవేరునట్లు ఈ సంఘటన జరిగెను.
2. "పారశీక ప్రభువైన కోరెషు ఆజ్ఞ ఇది. ఆకాశమందలి దేవుడు నన్ను ఈ భూలోకమంతటికిని అధిపతిని చేసెను. ఆయన యూదా రాజ్యమందలి యెరూషలేమున నన్నొక దేవాలయము నిర్మింపుమని ఆజ్ఞను ఇచ్చెను.
3. మీలో ఆ ప్రభువును కొలుచు ప్రజలెల్లరికిని ఆయన బాసటయైయుండునుగాక! ఆ ప్రభువును సేవించు ప్రజలెల్లరును యెరూషలేమునకు తిరిగిపోయి ఆయన దేవాలయమును పునర్నిర్మింపుడు.
4. మీ మధ్య నివసించువారు యూదా దేశమందున్న యెరూషలేమునకు పోవువారికి స్వేచ్చార్పణగాక, వెండి బంగారములను, వస్తుసామాగ్రిని, పశుగణమును, యెరూషలేము దేవాలయము నిర్మించుటకు సహాయము చేయవలయును.”
5. అపుడు యూదా బెన్యామీను తెగల అధిపతులును, యాజకులును, లేవీయులును, ప్రభువువలన ప్రేరేపింపబడిన వారందరును ప్రభుమందిరమును పునర్నిర్మించుటకై యెరూషలేమునకు వెళ్ళుటకు సంసిద్దులైరి.
6.ఇరుగుపొరుగువారు ఆ భక్తులకు వెండి బంగారములు, వస్తుసామాగ్రి, పశువులు, విలువగల బహుమతులు ఇచ్చివారికి సహాయము చేసిరి.
7.మునుపు నెబుకద్నెసరురాజు యెరూషలేము నుండి కొనివచ్చి తన దేవళమున అర్పించిన పాత్ర లను గూడ కోరెషురాజు ఆ భక్తులకు తిరిగి ఇచ్చి వేసెను.
8. రాజు పాత్రములను తన కోశాధికారియైన మిత్రెదాతుకు ఈయగా, అతడు వానినన్నిటిని లెక్కిడి యూదాపాలకుడగు షేష్బస్సరునకు ఒప్పచెప్పెను.
9-10. ఆ లెక్కల వైనమిది: బంగారుపాత్రలు-30 వెండి పాత్రలు-1000 ధూపపాత్రలు-29 పానీయార్పణమునకు వాడు బంగారుపాత్రలు-30 పానీయార్పణమునకువాడు వెండిపాత్రలు-410 ఇతర పాత్రలు-1000
11. ఇవి మొత్తము కలిపి 5,400 వెండి, బంగారు పాత్రలు. షేష్బస్సరు, ఇతర భక్తులు బబులోనియా ప్రవాసమునుండి యెరూషలేమునకు తిరిగివచ్చినప్పుడు ఈ పాత్రములన్నింటిని తమతో కొనివచ్చిరి.
1. చాలమంది ప్రవాసితులు బబులోనియానుండి యెరూషలేము, యూదారాజ్యములందలి తమతమ పట్టణములకు తిరిగివచ్చిరి. పూర్వము నెబుకద్నెసరు బందీలుగా కొనిపోయినప్పటినుండి వారు బబులోనియా లో వసించుచుండిరి.
2. అటుల తిరిగివచ్చినవారి నాయకులు సెరుబ్బాబెలు, యేషువా, నెహెమ్యా, సెరాయా, రేలాయా, మొర్దెకయి, బిల్షాను, మిస్పారు, బిగ్వయి, రెహూము, బానా అనువారు. ప్రవాసము నుండి తిరిగి వచ్చిన ఆయా యిస్రాయేలు కుటుంబముల పెద్దల పేర్లు వారి వంశస్థుల సంఖ్యలు ఇవి:
3-20. పరోషు -2172; షేపట్య-372; ఆర-775, యేషువ, యోవాబు వంశస్థుడు పహత్మోవబు-2812; ఏలాము-1254; సత్తు-945; సక్కయి-760; బాని-642; బేబయి-623; అస్గాదు-1222; అదోనీకాము-666; బిగ్వయి-2056; ఆదీను-454; హిజ్కియా అను ఆతేరు-98; బెసయి-323; యోరా-112; హాషుము-223; గిబ్బారు-95;
1. ఏడవనెల వచ్చునప్పటికి యిస్రాయేలీయులందరు వారివారి నగరములలో స్థిరపడిన పిదప వారందరు ఏకముగ యెరూషలేమున ప్రోగైరి.
2. యోసాదాకు కుమారుడగు యేషూవయు, తోడి యాజ కులును షలీయేలు కుమారుడైన సెరుబ్బాబెలును అతని బంధువులును కలిసి యిస్రాయేలు దేవుని బలి పీఠమును పునర్నిర్మించిరి. దైవభక్తుడు మోషే ధర్మ శాస్త్రమునందు లిఖించిన రీతిగా ఆ బలిపీఠము మీద దహనబలులు అర్పించుటకు సిద్ధమైరి.
3. నిర్వాసితులు అంతకు పూర్వమునుండియు ఆ నేలమీద వసించుచున్న ప్రజలకు భయపడిరి. అయినను వారు ధైర్యముచేసి పూర్వస్థానముననే బలిపీఠమును పునర్నిర్మించిరి. దానిమీద ఉదయ సాయంకాలములందు దహన బలులు సమర్పించిరి.
4. ధర్మశాస్త్ర గ్రంథము ఆదేశించినట్లు గుడారముల పండుగ చేసి కొనిరి. ఏ రోజు అర్పింపవలసిన దహనబలులను ఆ రోజు అర్పించిరి.
5. ఇంకను మామూలుగా సమర్పింపవలసిన సంపూర్ణ దహన బలులను, అమావాస్య నాడు అర్పింపవలసిన బలులను, ప్రభువు పేర ఉత్స వము చేసికోనున్నప్పుడు అర్పింపవలసిన బలులను, స్వేచ్చగా సమర్పించు బలులను కూడ అర్పించిరి.
6. దేవాలయ పునర్నిర్మాణము ఇంకను ప్రారంభము కాలేదు. అయినను ఏడవనెల మొదటి దినమున వారు బల్యర్పణము మొదలు పెట్టిరి.
7. వారు తాపీ పనివారికిని, వడ్రంగులకును వేతనములిచ్చిరి. తూరు సీదోను పట్టణవాసులకు అన్న పానీయములను, ఓలీవునూనెను పంపిరి. పై వస్తువులకు బదులుగా ఆ నగరముల ప్రజలు లెబానోను దేవదారుకొయ్యను సముద్రముమీదుగా యొప్పా రేవునకు పంపవలయును. ఇదియంతయు పారశీక ప్రభువైన కోరెషు అనుమతి మేరకు జరిగెను.
8. బబులోనియానుండి వచ్చి యెరూషలేము దేవాలయమును చేరుకొనిన నిర్వాసితులు వారు వచ్చిన రెండవ యేడు రెండవ నెలలో పనిని ప్రారంభించిరి. ఫెయలీ యేలు కుమారుడైన సెరుబ్బాబెలు, యోసాదాకు కుమా రుడగు యేషూవ, వారి తోడిజనము, యాజకులు, లేవీయులు, యెరూషలేము చేరుకొనిన నిర్వాసితులందరు దేవాలయ పునర్నిర్మాణము ప్రారంభించిరి. ఇరువదియేండ్లు మొదలుకొని అంతకు పైబడిన లేవీయులు మందిరనిర్మాణమున పర్యవేక్షకులుగా పని చేసిరి.
9. యేషూవ, అతని కుమారులును, బంధువులును; కద్మీయేలు అతని కుమారులును; హోదవ్యా అతని కుమారులును; హేనదాదు అతని కుమా రులును; లేవీయులైన వారి బంధువులును కలిసి ఏకమొత్తముగా పనివారిచేత పనిచేయించు టకు నియమింపబడిరి.
10. పనివాండ్రు దేవాలయమునకు పునాదులు వేయుచుండగా యాజకులు అర్చన వస్త్ర ములు తాల్చి, చేత బాకాలుపూని చెంతనిలుచుండిరి. ఆసాపు వంశజులైన లేవీయులు చిటితాళములతో ప్రక్కన నిలుచుండిరి. వారు దావీదురాజు సంప్రదాయము చొప్పున ప్రభువును స్తుతించిరి.
11. ప్రభువును కొనియాడిగానము చేయుచు, “ప్రభువు మంచివాడు ఆయన కృప యిస్రాయేలీయులపై శాశ్వతముగా నిలుచును" అని వంతపాటపాడిరి. దేవాలయమునకు పునాదులు వేయబడుట చూచిన ఆ ప్రజలు మహానాదముతో ప్రభుని స్తుతించిరి.
12. వారిలో చాలమంది యాజకులు, లేవీయులు, వంశనాయకులు మునుపటి దేవాలయమును కనులార జూచిన వృద్ధులు ప్రస్తుతము వేయబడిన దేవాలయ పునాదులను చూచి వెక్కివెక్కి యేడ్చిరి. కాని మిగిలినవారు మాత్రము సంతోషము పట్టజాలక పెద్ద పెట్టున అరచిరి.
13. ఆ జనసమూహములో సంతోషస్వర మేదియో, దుఃఖ స్వరమేదియో గుర్తించుట సాధ్యము కాదయ్యెను. ఆ ప్రజల అరుపులు, కేకలుచాల దూరమువరకు విన్పించెను.
1. ప్రవాసము నుండి తిరిగి వచ్చిన నిర్వాసితులు యిస్రాయేలు దేవుడైన యావేకు దేవళమును పునర్నిర్మించుచున్నారని యూదీయుల మరియు బెన్యామీనీయుల శత్రువులు వినిరి.
2. వారు సెరుబ్బా బెలును, వంశనాయకులను కలిసికొని “మేమును మీతో కలిసి మందిరము నిర్మింతుము. మేమును మీరు కొలుచుదేవునే కొలుచుచున్నాము కదా! అస్సిరియా రాజు ఏసర్హద్దొను మాకిట నివాసము కల్పించినప్పటి నుండియు మేము ఈ దేవునికే బలులు అర్పించుచున్నాము” అనిరి.
3. కాని సెరుబ్బాబెలు, యేషూవ మరియు వంశనాయకులు వారితో “మా దేవునికి మందిరము నిర్మించుటకు మీ నహాయము అవసరము లేదు. పారశీక ప్రభువైన కోరెషు ఆజ్ఞయిచ్చినట్లు మేమే మా దేవళమును కట్టుకొందుము” అనిరి.
4. ఆ మాటలు విని అంతకు పూర్వమునుండి ఆ రాజ్యమున వసించు ప్రజలు యిస్రాయేలీయులను భయపెట్టి నిరుత్సాహపరచిరి. ఆ రీతిగా వారు మందిర నిర్మాణమును సాగనీయరైరి.
5. ఇంకనువారు పారశీక రాజోద్యోగులకు లంచము ఇచ్చి వారిని యిస్రాయేలీయుల మీదికి పురికొల్పిరి. పారశీకరాజు కోరెషు పరిపాలనాకాల మంతయు మరియు దర్యావేషు పరిపాలనాకాలము వరకును ఇట్లే జరిగెను.
6. అహష్వేరుషు రాజయినప్పుడు కూడ వారు యూదా, యెరూషలేము మండలములందు వసించు యిస్రాయేలీయులమీద నేరములు వ్రాసిపంపిరి.
7. మరల అర్తహషస్త ప్రభువు కాలమున గూడ బిస్లాము, మిత్రేదాతు మరియు టబియేలు వారి అనుచరులు యిస్రాయేలీయులమీద నేరముమోపి జాబును అరమాయికు లిపిలో వ్రాసి, అరమాయికు భాషలో వివరణ ఇచ్చిరి.
8. మరియు రాష్ట్రపాలకుడగు రెహూము, రాష్ట్ర కార్యదర్శియైన షింషయి యెరూషలేమును గూర్చి పారశీక రాజైన అర్తహషస్తకు ఇట్లు లేఖ వ్రాసిరి:
9-10. “రాష్ట్రపాలకుడగు రెహూము, రాష్ట్ర కార్యదర్శియైన షంషయి, వారి అనుచరులు, న్యాయా ధిపతులు పారసీకులు బబులోనియా దేశమునందలి ఏంకునుండి ఏలాము దేశమునందలి సూసానుండి వచ్చిన అధికారులు, సుప్రసిద్ధుడు పరాక్రమశాలియైన అషూర్భనిపాలు ప్రభువు తీసికొనివచ్చి సమరియా నగరమునందు యూఫ్రటీసు నదికి పశ్చిమతీరము నందును స్థిరపరచిన వివిధజాతులవారు విన్నవించు కొనునది.”
11. వారు పంపిన లేఖ నకలు ఇట్లున్నది: “చక్రవర్తి అర్తహషస్తకు యూఫ్రటీసు నదికి పశ్చిమ తీరమున వసించు దాసులు చేయు విన్నపము.
12. మీ రాజ్యమునుండి యిటకు తరలివచ్చిన యూదులు యెరూషలేమున స్థిరపడి, ఈ నగరమును పునర్నిర్మించుచున్నారని ప్రభువుల వారు గుర్తింపవలయును. ఇది ఎప్పుడును తిరుగుబాటు చేయుటకు అలవాటు పడిన దుష్టపట్టణము. ప్రస్తుతము వారు ప్రాకారము మీద పనిచేయుచున్నారు. కొలదికాలముననే దాని నిర్మాణమును పూర్తిచేయుదురు.
13. ఈ పట్టణమును, దాని ప్రాకారములను పునర్నిర్మింతురేని ఈ ప్రజలిక పన్నులు చెల్లింపరు. కనుక, ఏలినవారి ఆదాయము తగ్గిపోవును.
14. మేము ఈ ఉప్పు తిని బ్రతుకువారమగుటచే ప్రభువుల వారికి ఈ కీడు వాటి ల్లుట మేము సహింపజాలము. కనుకనే మేమీ సమా చారము పంపుచున్నాము.
15. మీ మట్టుకు మీరు, మీ పూర్వులు పదిలపరచి యుంచిన చారిత్రకాంశముల దస్తావేజులను ఒకమారు పరిశీలింపుడు. అప్పుడు మీకే తెలియును. ఇది ఎప్పుడును తిరుగు బాటు చేయునగరముగాను, పురాతనకాలము నుండియు రాజులను, రాజ్యపాలకులను ముప్పతిప్పలు పెట్టిన పట్టణముగాను, ఈ నగర పౌరులెప్పుడు కుట్రలు పన్నువారేననియు, కనుకనే ఈ పురమును నాశనము చేసిరనియు రాజ్యపు దస్తావేజుల ద్వారానే తమకు తెలియనగును.
16. ఇప్పుడు ఈ నగరమును దీని ప్రాకారములను పునర్నిర్మింతురేని ఇక ఈ యూఫ్రటీసు నదికి పశ్చిమ తీరమున ప్రభువుల వారికి రాజ్యము మిగులదని విన్నవించుచున్నాము.”
17. ఆ లేఖకు రాజు ప్రతిలేఖను పంపెను: “రాష్ట్రపాలకుడైన రెహూమునకు, రాష్ట్ర కార్యదర్శి యైన షింషయికి, సమరియా యందును, యూఫ్రటీసు నదికి పశ్చిమ తీరమున వసించు వారి అనుచరులకు శుభములు.
18. మీరు వ్రాసిన జాబును తర్జుమా చేసి నాకు చదివి వినిపించిరి.
19. నా ఆజ్ఞపై మా ఉద్యోగులు మా కార్యాలయమును పరిశీలించిరి. మొదటినుండి యెరూషలేము అను పట్టణము రాజుల మీద తిరుగబడుచు వచ్చిన మాట నిజమే. తిరుగు బాటునకు, కుట్రకు ఆ పట్టణము పెట్టినది పేరు అని మాకు అగుపడినది.
20. అచట పరాక్రమవంతులైన రాజులు పరిపాలించిరి. వారు యూఫ్రటీసు నదికి పశ్చిమతీరము నందలి మండలమునుండి సుంకములు వసూలు చేసిరి.
21. ఇపుడానగర నిర్మాణమును ఆపివేయ వలసినదని మీరు ప్రజలకు ఆయిండు. నేను మరల అనుమతి యిచ్చువరకు ఆ పట్టణనిర్మాణమును ప్రారంభింపరాదు.
22. నా రాజ్యమునకు ముప్పు వాటిల్లకుండునట్లు మీరు నగర నిర్మాణమును వెంటనే ఆపు చేయింపుడు.”
23. చక్రవర్తి అర్తహషస్త వ్రాసిన జాబు నకలు రెహూము, షింషయి, వారి అనుచరులకు చదివి వినిపింపబడగా వారు వెంటనే యెరూషలేమునకు వెళ్ళి ఆయుధములతో నిర్మాణకార్యక్రమమును ఆపు చేయించిరి.
24. ఈ రీతిగా యెరూషలేము దేవాలయ నిర్మా ణము కుంటుపడెను. పారశీకరాజు దర్యావేషు రాజు పరిపాలనాకాలము రెండవయేటి వరకును ఆ పని అటులనే ఆగిపోయెను.
1. ప్రవక్తలయిన హగ్గయియు, ఇద్ధో కుమారుడైన జెకర్యాయు యూదా, యెరూషలేము మండలములలో నున్న యూదులకు యిస్రాయేలు దేవుడైన ప్రభువు ప్రవచనము వినిపింపనారంభించిరి.
2. షల్తీయేలు కుమారుడగు సెరుబ్బాబెలు, యోసాదాకు కుమారుడైన యేషూవ వారి సందేశములు విని దేవాలయ పునర్ని ర్మాణమును ప్రారంభించిరి. ప్రవక్తలిద్దరు వారికి బాసటగా నుండిరి.
3. వెంటనే పశ్చిమ యూఫ్రటీసు మండలమునకు అధికారియైన తత్తనాయి, షెతర్బోస్నాయి మరియు వారి తోడి ఉద్యోగులు యెరూషలేమునకు వచ్చి “మీరు ఈ దేవాలయమును కట్టుటకును, ఈ వడ్రంగము పనిచేయించుటకును ఎవరు అనుమతి నిచ్చిరి?” అని ప్రశ్నించిరి.
4. ఆ అధిపతులు దేవాలయ నిర్మాణమునకు పెత్తనదారులైన వారి పేర్లు కూడ అడిగి తెలిసికొనిరి.
5. కాని ప్రభువు యూదా నాయకులకు బాసటయైయుండెను. కనుక అధికారులు మందిర నిర్మాణమును ఆపు చేయింపలేదు. వారు దర్యావేషునకు జాబు వ్రాసి ఆ ప్రభువు సమాధానము కొరకు వేచియుందమనుకొనిరి.
6. పశ్చిమ యూఫ్రటీసు రాష్ట్ర పాలకుడు తత్తనాయి, షెతర్బోస్నాయి, వారి తోడి అధికారులు రాజునకు పంపిన లేఖ యిది:
7. “దర్యావేషు ప్రభువునకు శాంతిభద్రతలు సిద్ధించుగాక!
8. రాజు గారికి తెలియజేయుట ఏమనగా మేము యూదామండలమునకు వెళ్ళి చూడగా అచటి ప్రజలు గండశిలలతోను, గోడలలోనికి చొన్పిన దూలములతోను వారి మహాదేవునకు మందిరము కట్టుచున్నారు. వారు నైపుణ్యముతో పనిచేయుచున్నారు. ఆ పని కూడ చకచక సాగిపోవుచున్నది. కనుక మేము ఈ సంగతిని ప్రభువుల వారికి తెలియజేయుచున్నాము.
9. దేవాలయమును కట్టుటకు, ప్రాకారములను నిల్పుటకు, పనిచేయించుటకు మీకెవరు అనుమతిచ్చిరని మేము వారి నాయకులను ప్రశ్నించితిమి.
10. దేవరవారికి తెలుపవలయునన్న తలంపుతో మేము వారి నాయకుల పేర్లు కూడ అడిగి తెలిసికొంటిమి.
11. మా ప్రశ్నకు వారు చెప్పిన జవాబిది: మేము భూమ్యాకాశములకు అధిపతియైన ప్రభువును సేవించు భక్తులము. ఈ దేవాలయమును పెక్కేండ్ల క్రితమే ఒక సుప్రసిద్ధుడైన రాజు నిర్మించిపోయెను. దానినే ఇప్పుడు మేము పునర్నిర్మాణము చేయుచున్నాము.
12. మా పూర్వులు పరలోకమందలి దేవునికి కోపము రప్పించుటవలన అతడు కల్దీయ రాజవంశీయుడు బబులోనియా రాజు నెబుకద్నెసరునకు వారు లొంగిపోవునట్లు చేసెను. ఆ రాజు వారి దేవళమును పడగొట్టి వారిని బబులోనియాకు చెరగొనిపోయెను.
13. అటు తరువాత కోరెషు ప్రభువు బబులోనియాకు చక్రవర్తియైనమొదటియేట ఈ దేవాలయమును పునర్నిర్మింపవలెనని ఆజ్ఞయిచ్చెను.
14. పూర్వము నెబుకద్నెసరు యెరూషలేము దేవాలయమునుండి కొనిపోయి బబులోనియా దేవళమున కానుకగా సమర్పించిన వెండి, బంగారు పాత్రలను గూడ కోరెషురాజు తిరిగి ఇచ్చి వేసెను. యూదాకు మండలపాలకుడుగా నియమింపబడిన షేష్బస్సరునకు అతడు పాత్రముల నొప్పగించెను.
15. అతడు ఈ విధముగా ఆజ్ఞాపించెను; ఈ పాత్రలను తీసికొనిపోయి యెరూషలేము దేవాలయము నందు ఉంచవలెను మరియు దేవాలయము మరల యథాస్థానముననే నిర్మించవలెను.
16. ఆ రీతిగా షేస్బస్సరు యెరూషలేమునకొచ్చి దేవాలయమునకు పునాదులెత్తెను. అప్పటినుండి ఇప్పటివరకును నిర్మా ణము కొనసాగుచునేయున్నది. కాని యింతవరకు పూర్తి కాలేదు'.
17. ప్రభువుల వారికి సమ్మతియగునేని బబులోనియా యందలి చారిత్రకాంశముల దస్తా వేజులను పరిశీలించి కోరెషురాజు ఈ దేవాలయమును పునర్నిర్మించుటకు ఆజ్ఞ ఇచ్చెనో లేదో తెలిసికొనుడు. అటుపిమ్మట దేవరవారి నిర్ణయమును మాకు తెలియజేయుడు.”
1. దర్యావేషు రాజు ఆజ్ఞపై అతని ఉద్యోగులు బబులోనియాలోని చారిత్ర కాంశముల దస్తావేజులను పరిశీలించిరి.
2. అపుడు మేదియా మండలములోని ఎక్బటానా నగరమున లభించిన ఒక లిఖిత పత్రములో ఈ క్రింది రాజశాసనము కన్పించెను:
3. "కోరెషురాజు తన యేలుబడి మొదటియేట ఈ శాసనము చేసెను. యెరూషలేము దేవాలయ మును పునర్నిర్మింపవలయును. అచట బలులు, దహనబలులు అర్పింపవచ్చును. ఆ మందిరము ఎత్తు అరు వది మూరలు, వెడల్పు అరువది మూరలు ఉండ వలెను.
4. గోడలను మూడువరుసలు గండరరాతి తోను, ఒక వరుసకొయ్యతోను నిర్మింపవలెను. ఖర్చులన్నియు రాజకోశాగారమే భరింపవలెను.
5. నెబుకద్నెసరు రాజు బబులోనియాకు కొనివచ్చిన వెండి బంగారు పాత్రలను మరల యెరూషలేము దేవాలయమునకు చేర్చి వాటిని పూర్వస్థానముననే పదిలము చేయవలయును."
6. అంతట దర్యావేషురాజు ఈ క్రింది రీతిగా జవాబు వ్రాసి పంపెను: “పశ్చిమ యూఫ్రటీసు రాష్ట్ర పాలకుడగు తత్తనాయికి, షెతర్బోస్నాయికి, తోడి ఉద్యోగులకు దర్యావేషు వ్రాయునది. మీరు ఆ దేవాలయము జోలికి పోవలదు.
7. మందిర నిర్మాణమునకు అడ్డుపడవలదు. యూదా మండలపాలకుని, యూదుల పెద్దలను పూర్వస్థానముననే దేవాలయమును కట్టుకొన నీయుడి.
8. ముఖ్యముగా దేవుని మందిరము కట్టించు యూదులపెద్దలకు మీరు చేయవలసిన సహాయము గూర్చిన శాసనమేమనగా: నది అవతలనుండి ప్రోగు చేసిన పన్నులనుండి మందిర నిర్మాణమునకగు ఖర్చులను వెంటనే చెల్లింపుడు. ధనము లభింపకపోవుటచే నిర్మాణ కార్యక్రమము కుంటుపడిపోరాదు.
9. యెరూషలేములోని యాజకులకు కావలసిన వస్తు సామగ్రిని కూడ ప్రతిదినము మీరే సమకూర్పవలెను. ఆకాశమందలి దేవునికి దహనబలిగా సమర్పింప వలసిన కోడెదూడలు, పొట్టేళ్ళు, గొఱ్ఱెపిల్లలు, గోధుమ ధాన్యము, ఉప్పు, ద్రాక్ష సారాయము, ఓలివునూనె మొదలైనవన్నియు మీరే సరఫరా చేయవలెను.
10. వీనితో వారు ఆకాశమందలి దేవునికి ప్రీతికరమైన బలులు సమర్పించి నాకును, నా కుమారులకును మేలు చేకూరునట్లు విన్నపములు చేయుదురు.
11. ఎవడైన ఈ నా ఆజ్ఞలను ధిక్కరించెనేని వాని ఇంటి దూలమును పెరికి నేలలోనాటి దానిపై వానిని ఉరితీయించవలెను. అతని యింటిని పెంటదిబ్బగా మార్చివేయుడు.
12. యెరూషలేమును తన నామమునకు స్థానముగా ఏర్ప రచుకొనిన ఈ దేవుడే, యీ నాఆజ్ఞలను పాటింపక ఆ నగరమునందలి దేవాలయమును ధ్వంసము చేయబూనిన ఏ రాజునైనను, ప్రజలనైనను నాశనము చేయును గాక! దర్యావేషు ప్రభుడనైన నేను ఈ శాసనము చేసితిని. ఎల్లరును ఈ నియమమునకు సంపూర్ణముగా సత్వరమే బద్దులై ఉందురుగాక!"
13. పశ్చిమ యూఫ్రటీసు రాష్ట్రపాలకుడైన తత్తనాయి, షెతర్బోస్నాయి, వారి తోడి ఉద్యోగులు రాజాజ్ఞాపించినట్లే చేసిరి.
14. ప్రవక్తలు హగ్గయి, జెకర్యా ప్రోత్సహించుచుండగా నాయకులు చకచక దేవాలయమును కట్టించిరి. యిస్రాయేలు దేవుడైన ప్రభువు, పారశీక రాజులైన కోరెషు, దర్యావేషు, అర్తహషస్త ఆజ్ఞాపించినట్లే మందిరమును పూర్తి చేసిరి.
15. దర్యావేషు రాజు ఏలుబడి ఆరవయేట, అదారు నెల మూడవరోజున కట్టడములు ముగించిరి.
16. అంతట యాజకులు, లేవీయులు, ప్రవాసమునుండి తిరిగివచ్చిన యిస్రాయేలీయులందరును ఉత్సాహముతో దేవాలయమును ప్రతిష్ఠించిరి.
17. మందిర ప్రతిష్ఠను పురస్కరించుకొని నూరు కోడెలు, రెండువందల పొట్టేళ్ళు, నాలుగు వందల గొఱ్ఱపిల్లలు బలిగా సమర్పించిరి. ఒక్కొక్క తెగకు ఒక్కటి చొప్పున పండ్రెండు మేకపోతులను పాపపరి హారబలిగా సమర్పించిరి.
18. మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞాపించినట్లు యెరూషలేము దేవాలయమున కైంకర్యము చేయుటకు యాజకులను, లేవీయులను క్రమ ముగా నియమించిరి.
19. ప్రవాసము నుండి తిరిగివచ్చిన నిర్వాసితులు మొదటి నెల పదునాల్గవ దినమున పాస్క పండుగ జరుపుకొనిరి.
20. యాజకులు, లేవీయులు తమనుతాము శుద్ధిగావించుకొనిరి. ప్రవాసము నుండి తిరిగివచ్చిన యిస్రాయేలీయులందరి కొరకును, యాజకులకొరకును, తమకొరకును లేవీయులు పాస్క పశువును వధించిరి.
21. ప్రవాసమునుండి వచ్చిన వారందరును, ప్రవాస దేశమునందలి అన్యజాతుల ఆచారములను వదులుకొని యిస్రాయేలు దేవుని కొలుచుటకు వచ్చినవారందరు నైవేద్యములను భుజించిరి.
22. వారు ఏడుదినములపాటు ఉత్సాహముతో పొంగని రొట్టెల పండుగ చేసికొనిరి. ప్రభువు అస్సిరియా రాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారి దేవాలయమును నిర్మించునట్లు చేసెను గనుక వారి ఆనందము మిన్నుముట్టెను.
1-5. ఈ సంఘటనలు ముగిసిన తరువాత, అర్తహషస్త పారశీకదేశమును పరిపాలించుకాలమున సెరాయ కుమారుడగు ఎజ్రా బబులోనియా దేశము నుండి యెరూషలేము నగరమునకు వచ్చెను. అతని వంశకర్తలు క్రమముగా- అసర్యా కుమారుడగు సెరాయ, అసర్యా, హిల్కియా, షల్లూము, సాదోకు, అహీటూబు, అమర్యా, అసర్యా, మెరాయోతు, సెరాహియా, ఉజ్జీ, బుక్కీ ఫీనెహాసు, ఎలియెజెరు, ప్రధానయాజకుడగు అహరోను.
6. ఈ ఎజ్రా యిస్రాయేలు దేవుడైన ప్రభువు మోషేకు ప్రసాదించిన ధర్మశాస్త్రమున పండితుడు. ప్రభువు ఎజ్రాను చల్లనిచూపు చూచెను గనుక రాజు అతడు కోరినదంతయు ఒసగెను.
7. అర్తహషస్త ఏలుబడి ఏడవయేట యిస్రాయేలీయులు కొందరు, యాజకులు కొందరు, లేవీయులును, దేవాలయ గాయకులును, దేవాలయ ద్వారసంరక్షకులును, నెతీనీయులును' బయలుదేరి యెరూషలేమునకు వచ్చిరి.
8-9. వారు మొదటి నెల మొదటిదినమున బబులోనియా నుండి పయనమైరి. ఐదవనెల మొదటిరోజున యెరూషలేము చేరుకొనిరి. ప్రభువు వారికి తోడైయుండెను.
10. ఎజ్రా నిష్ఠతో ధర్మశాస్త్రమును పరి శోధించి, దానిని ఆచరించుటకును, అందలి నియమములన్నిటిని యిస్రాయేలీయులకు నేర్పుటకును నిశ్చయించుకొనెను.
11. అర్తహషస్త, యాజకుడును ధర్మశాస్త్ర పండితుడునైన ఎజ్రాకిచ్చిన శాసనమిది. ఈ ఎజ్రా యిస్రాయేలునకు ప్రభువు ప్రసాదించిన ధర్మశాస్త్రవిధులను క్షుణ్ణముగా ఎరిగినవాడు,
12. “రాజాధిరాజైన అర్తహషస్త, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమున కోవిదుడును యాజకుడునైన ఎజ్రాకు శుభములు పలికి వక్కాణించునది;
13. నీకు తెలిసియున్న ధర్మశాస్త్రమును యూదా, యెరూషలేమువాసులైన యూదులు ఎంతవరకు పాటించుచున్నారో తెలిసికొనుటకు నీవు రాజు చేతను, అతని ఏడుగురు మంత్రులచేతను పంపబడితివి. కనుక మేము చేసిన నిర్ణయమేమనగా,
14. మా రాజ్యములోను ఉండు యిస్రాయేలీయులలో వారి యాజ కులలోను, లేవీయులలోను యెరూషలేము పట్టణ మునకు వెళ్ళుటకు హృదయపూర్వకముగా ఇష్టపడు వారెవరో వారందరును నీతోకూడ వెళ్ళవచ్చును.
15. యెరూషలేములో నివాసముగల యిస్రాయేలీయులు దేవునకు సమర్పించు వెండి బంగారు కానుకలను నీవు అచటకు కొనిపోవలయును.
16. పైగా నా రాజ్యమున నీవు సేకరించు వెండి బంగారములను, ఇచటి యిస్రాయేలీయులు, వారి యాజకులు యెరూషలేమునందలి దేవాలయమునకు సమర్పించు కానుకలను నీవు అచటకు కొనిపోవలయును.
17. ఈ సొమ్ముతో నీవు కోడెలను, పొట్టేళ్ళను, గొఱ్ఱెపిల్లలను, ధాన్యమును, ద్రాక్షసారాయమును కొని యెరూషలేమునందలి బలిపీఠము మీద బలిగా సమర్పింపుము.
18. మిగిలిన సొమ్మును మీ దేవుని చిత్త ప్రకారముగా నీవు, మీ దేశీయులు కోరుకొని నట్లుగా వెచ్చింపవచ్చును.
19. దేవాలయమున విని యోగించుటకు నీకీయ బడిన పాత్రలన్నిటిని నీవు యెరూషలేము దేవాలయమున అర్పింపవలయును.
20. దేవాలయమునకు వలసిన ఇతర వస్తువులేమైన కావలయునేని మా రాజ్య ధనాగారమునుండి నీకు ఇయ్యబడును.
21. మరియు రాజునైన అర్తహషస్త అను నేను యూఫ్రటీసు నదికి పశ్చిమమునయున్న కోశాధికారులందరికి ఇచ్చు ఆజ్ఞ: “ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమున కోవిదుడును, యాజకుడునైన ఎజ్రా కోరినదంతయు క్రమము తప్పక సమకూర్ప వలయును.
22. వారతడు కోరిన వస్తువులను 7,500 వెండి నాణెములవరకు, 500 కుంచముల గోధుమల వరకు, 550 బుడ్డు ద్రాక్షసారాయము వరకు, 500 బుడ్లు ఓలివునూనె వరకు సమకూర్పవలయును. ఉప్పు అడిగినంత ఈయవలెను.
23. ఆకాశమందలి దేవుడు తన దేవాలయార్చనకు కోరుకొనునదంత రాజోద్యో గులు సమకూర్పవలెను. ఆ దేవుడు నా మీదగాని, నా అనుయాయుల మీదగాని కినుక పూనరాదు.
24. దేవాలయమున కైంకర్యము చేయు యాజకులు, లేవీయులు, గాయకులు, ద్వారసంరక్షకులు, దేవా లయ పనివాండ్రనుండి రాజోద్యోగులు పన్నులు వసూలు చేయరాదు.
25. ఓయి ఎజ్రా! నీవు మీ దేవుడు నీకు ప్రసాదించిన వివేకముతో పశ్చిమ యూఫ్రటీసు రాష్ట్రమున యావే ప్రభువు ధర్మశాస్త్ర మును అనుసరించి జీవించు ప్రజలందరికి పాలకులను, న్యాయాధిపతులను నియమింపుము. తెలియనివారికి నీవు ధర్మశాస్త్రమును బోధింపుము.
26. ఎవరైనను దేవుని ధర్మశాస్త్రములకును, ఈ నాఆజ్ఞలకును బద్దులుకారేని వారికి ఉరికంబము, ప్రవాసము, ఆస్తిజప్తు, చెర మొదలైన శిక్షలను విధింపవలయును.”
27. అప్పుడు ఎజ్రాయిట్లనెను: “మన పితరుల దేవుడు స్తుతింపబడును గాక! ఆయన యెరూషలేము నందలి మన ప్రభువు దేవాలయమును రాజు గౌరవించునట్లు చేసెను.
28. ప్రభువు కృపవలన నేను ఆ రాజు, అతని సలహాదారులు, ఉన్నతోద్యో గులు మొదలగు వారి ఆదరమునకు నోచుకొంటిని. ప్రభువు నాకు ధైర్యమును ప్రసాదించెను. కనుకనే నేను చాలా మంది యిస్రాయేలీయులను నా వెంట కొనిరాగలిగితిని.”
1. అర్తహషస్త కాలమున బబులోనియా ప్రవాస మునుండి ఎజ్రాతోపాటు యెరూషలేమునకు తిరిగి వచ్చిన వంశనాయకుల పేర్లివి:
2-14. ఫీనెహాసు వంశీకుడు గెర్షోము; ఈతామారు వంశీకుడు దానియేలు; దావీదు వంశీకుడు హత్తూషు, షెకన్యా; ఫరోషు వంశీకుడు జెకర్యా, అతని కుటుంబపురుషులు నూటఏబదిమంది; పహత్మోవబు వంశీకుడు సెరహ్యా కుమారుడు ఎల్యోయేనయి, అతని కుటుంబ పురుషులు రెండువందలమంది; సట్టు వంశీకుడు యహానీయేలు కుమారుడు షెకన్యా, అతని కుటుంబపురుషులు మూడువందలమంది; ఆదీను వంశీకుడు యోనాతాను కుమారుడు ఎబెదు, అతని కుటుంబ పురుషులు ఏబది మంది; ఏలాము వంశీకుడు అతల్యా కుమారుడు యెషయా, అతని కుటుంబ పురుషులు డెబ్బది మంది; షెఫట్యా వంశీకుడు మికాయేలు కుమారుడు సెబద్యా, అతని కుటుంబపురుషులు ఎనుబది మంది; యోవాబు వంశీకుడు యెహీయేలు కుమారుడు ఓబద్యా, అతని కుటుంబపురుషులు రెండువందల పదునెనిమిది మంది; బాని వంశీకుడు షెలోమీతు కుమారుడు యెసిపియా, అతని కుటుంబ పురుషులు నూట అరువది మంది;- బేబై వంశీకుడు బేబై కుమారుడు జెకర్యా, అతని కుటుంబపురుషులు ఇరువది ఎనిమిది మంది; అస్గాదు వంశీకుడు హక్కాటాను కుమారుడు యోహానాను, - అతని కుటుంబపురుషులు నూట పదిమంది మంది; అదోనీకాము వంశీకులు ఎలీఫేలెటు, యెయూయేలు, షేమయా, వారి కుటుంబపురుషులు అరువది మంది; బిగ్వయి వంశీకులు ఉతాయి, సక్కూరు, వారి కుటుంబపురుషులు డెబ్బది మంది.
15. నేను అహవావైపు పారు ఏటి ఒడ్డున ప్రజలను ప్రోగుచేసితిని. అచట మేము మూడునాళ్ళు మకాముచేసితిమి. నేను ప్రజలను పరిశీలించి చూడగా వారిలో యాజకులు ఉన్నారుగాని లేవీయులులేరైరి.
16. వెంటనే వివేకవంతులైన నాయకులను కొందరిని పిలిపించితిని. వారు ఎలియెజెరు, అరియేలు, షేమయా, ఎల్నాతాను, యారీబు, ఎల్నాతాను, నాతాను, జెకర్యా, మెషుల్లాము.
17. వీరందరిని కాసిఫ్యయందలి యిస్రాయేలీయులకు అధికారియగు ఇద్ధో పంపితిని. అతనిని అతని అనుచరులను దేవాలయమున ఊడిగము చేయుటకు పనివారిని (నెతినీయులు) పంపుడని అడిగించితిని.
18. దైవకృపవలన వారు లేవీ కుమారుడైన మాహ్లి వంశీకుడు, సమర్ధుడు అయిన లేవీయుడు శరబ్యాను మావద్దకు పంపిరి అతని బంధువులు, కుమారులు కలిసి మరి పదునెనిమిది మంది వచ్చిరి.
19. వారు మెరారీ వంశీ కులు హషాబ్యాను యెషాయాను కూడ పంపిరి. వారి బంధువులు మరి ఇరువది మందివచ్చిరి.
20. ఇంకను రెండువందల ఇరువది మంది దేవాలయ సేవకులు గూడ ప్రోగైరి. వారి పూర్వులను దావీదురాజు అతని ఉద్యోగులు లేవీయులకు సహాయకులుగా నియమించి యుండిరి. ఈ ప్రజలందరిని వారివారి పేర్లతో నమోదు చేయించితిమి.
21. అహవా యేటి ఒడ్డున మా జనులెల్లరు ఉపవాసము చేయవలెనని దేవుని యెదుట వినయము చూపవలెనని ఆజ్ఞాపించి తిని. మేమును మాబిడ్డలును, మా వస్తుసామాగ్రితో సురక్షితముగా ప్రయాణము చేయుటకు దేవునకు మనవి చేయుడని కోరితిని.
22. దారిలో దొంగలబెడదనుండి మమ్ము కాపాడుటకు సైనికులను, రౌతులను వెంట పంపుడని రాజును వేడుకొనుటకు నాకు మొగము చెల్లదాయెను. ఎందు కనగా మా దేవుడు తనను నమ్మినవారిని దీవించునని, తన్ను నమ్మనివారిని కోపముతో శిక్షించునని అంతకు ముందే నేను రాజుతో చెప్పియుంటిని.
23. కనుక మేము ఉపవాసము చేసి మా మీద కరుణ చూపుమని దేవుని వేడుకొంటిమి. ఆయన మా మొరాలించెను.
24. యాజకులలో ముఖ్యులైన వారి నుండి షేరేబ్యాను, హషబ్యాను, మరి పదిమందిని ఎన్ను కొంటిని.
25. రాజు, అతని సలహాదారులును, ప్రధానాధికారులును, యిస్రాయేలు ప్రజలును దేవళము కొరకు ఇచ్చిన వెండి బంగారములను పాత్రములను వారెదుట తూకము వేయించితిని.
26-27. నేను వారి వశము చేసిన వస్తు సామాగ్రి ఇది: ఆరు వందల ఏబది మణుగుల వెండి, నూరు మణుగుల వెండి పాత్రలు, నూరు మణుగుల బంగారపు పాత్రలు, వెయ్యి తులముల ఇరువది బంగారు పాత్రలు, బంగారమువలె మెరయు రెండు రాగిగిన్నెలు.
28. నేను ఆ యాజకులతో “మీరు మీ పితరులదేవుడైన యావేకు నివేదితులు కదా! అట్లే జనులు స్వేచ్చగా యావేకు అర్పించిన ఈ వెండి బంగారు పాత్రలును ప్రతిష్ఠితములైనవి సుమా!
29. మీరు యెరూషలేము చేరుకొను వరకు వీనిని భద్రముగా నుంచుడు. అట యెరూషలేమున యావే మందిరస్థలమున వీనిని తూకమువేయించి యాజకులకు, లేవీయులకు, యెరూషలేమునందలి యూదుల నాయకులకు అప్పగించువరకు భద్రపరుపుడు” అని చెప్పితిని.
30. అంతట యాజకులు లేవీయులు యెరూషలేము దేవాలయమునకు కొని పోవుటకు ఆ వెండి, బంగారములను, పాత్రములను తూకము వేసిపుచ్చుకొనిరి.
31. మొదటినెల పండ్రెండవ దినమున మేమెల్లరము అహవా నదిని వీడి యెరూషలేమునకు బయలుదేరితిమి. ప్రభువు మమ్ము చల్లనిచూపు చూచెను. ప్రయాణమున శత్రుబాధనుండియు, దొంగల బాధ నుండియు మమ్ము కాపాడెను.
32. మేము యెరూషలేము చేరి అక్కడ మూడునాళ్ళు విశ్రమించితిమి.
33. నాలుగవనాడు దేవాలయమునకు వెళ్ళి వెండి బంగారములను, పాత్రలను తూకమువేసి యాజకుడును, ఊరియా కుమారుడునైన మెరేమోతుకు ముట్టజెప్పితిమి. అతనితోపాటు ఫీనెహాసు కుమారుడగు ఎలియాజరును, ఇద్దరు లేవీయులు, యేషూవ కుమారుడైన యోసాబాదు, బిన్నూయి కుమారుడైన నోవద్యాయు ఉండిరి.
34. ప్రతి వస్తువును లెక్కబెట్టి తూకము వేసిరి. ఆ తూకము లెక్కలను గూడ నమోదుచేసిరి.
35. ప్రవాసమునుండి వచ్చినవారందరును యిస్రాయేలు దేవునికి దహనబలి సమర్పించుటకై బలిపశువులను కొనివచ్చిరి. యిస్రాయేలీయులందరి తరపున పండ్రెండుకోడెలను, తొంబది ఆరు పొట్టేళ్ళను, డెబ్బది ఏడు గొఱ్ఱె పిల్లలను అర్పించిరి. పాప పరిహారమునకై పండ్రెండు మేకపోతులను గూడ అర్పించిరి.
36. రాజు ఇచ్చిన శాసనమును పశ్చిమ యూఫ్రటీసు అధికారులకును, సేనాధిపతులకును చూపగా వారు యిస్రాయేలు ప్రజలకును, దేవాలయమునకును సాయము చేయుటకు అంగీకరించిరి.
1. ఈ కార్యములన్ని జరిగిన తరువాత ప్రజానాయకులు కొందరు నా యొద్దకు వచ్చి "అయ్యా! మన ప్రజలు, యాజకులు, లేవీయులు చెడుపనులు చేయు అన్యజాతి జనులతో తెగతెంపులు చేసికోరైరి. కనాను, మోవాబు, అమ్మోను, ఐగుప్తు దేశములతో, హిత్తీయులు పెరిస్సీయులు, యెబూసీయులు, అమోరీయులు మొదలగు జాతులనుండి వేరుపడకుండ, వారితో కలిసి అసహ్యమైన కార్యములను చేయుచూ,
2. యూదులు ఇతరజాతుల ఆడుపడుచులను పెండ్లియాడి ప్రభువు పవిత్ర ప్రజలను భ్రష్టము చేసిరి. మన నాయకులును, అధికారులును ఈ పాపమును అధికముగా మూటకట్టుకొనిరి” అని చెప్పిరి.
3. ఆ మాటలు విని నేను విచారముతో బట్టలు చించుకొంటిని. తల వెంట్రుకలను, గడ్డపువెంట్రుకలను పెరికి వేసికొంటిని. విషాదముతో నేలపై చతికిలబడితిని.
4. సాయంకాలము దహనబలి సమర్పించు సమయమువరకు నేనట్లే దిగులుతో చతికలబడియుంటిని. నిర్వాసితుల పాపమును గూర్చి దేవుడుపలికిన పలుకులు విని భయపడిన యిస్రాయేలీయులందరు క్రమముగా వచ్చి నా చుట్టు ప్రోగైరి.
5. సాయంకాలబలిని సమర్పించునపుడు నేను చతికిలబడియున్న తావు నుండి ఎట్టకేలకు పైకి లేచితిని. ఆ చినిగిన బట్టలతోనే మోకాళ్లూని యావే వైపు చేతులెత్తి,
6. "ఓ దేవా, నాదేవా, నాదేవా! నీ ఎదుట తలెత్తుటకు గూడ నాకు సిగ్గుగానున్నది. మా పాపములు మా తలల కంటె ఎత్తుగా కుప్పలు పడియున్నవి. మా దోష రాశులు ఆకాశమంతయెత్తుగానున్నవి.
7. మా పితరుల కాలమునుండి మేము ఘోర పాతకములు చేసితిమి. మా అపరాధముల వలన మేమును, మా రాజులును, మా యాజకులును అన్యజాతిరాజులకు చిక్కిపోతిమి. వారు మమ్ము కత్తులతో పొడిచిరి. ప్రవాసమునకు కొనిపోయిరి. మా ఆస్తిపాస్తులను దోచుకొనిరి. మమ్ము అవమానపరచిరి. నేటికి మేము ఈ దురవస్థలోనే ఉన్నాము.
8. అయితే ఇప్పుడు మా దేవుడు మా కన్నులకు వెలుగునిచ్చి, మా దాస్యము నుండి మేము కొంచెము ఉపశమనము పొందునట్లును, మాలో ఒక శేషజనమును ఉండనిచ్చునట్లుగాను, తన పవిత్రస్థలమునందు మమ్ము స్థిరపరచునట్లుగాను, మా దేవుడైన యావే కొంతమట్టుకు మా మీద దయచూపెను.
9. మేము బానిసలము. అయినను నీవు మమ్ము బానిసలుగానే వదిలివేయలేదు. నీ దయవలన పారశీక రాజు మమ్మాదరముతో చూచెను. అతడు మమ్ము తెగటార్పలేదు. యెరూషలేమున శిథిలమైయున్న నీ దేవాలయమును మరలకట్టుటకును, యూదా రాజ్యమందు, యెరూషలేము పట్టణమునందు సురక్షితముగా వసించుటకును అతడు మాకు అనుమతినిచ్చెను.
10. మా దేవా! ఇంత కృపనొందిన పిమ్మట ఇక మేమేమి చెప్పగలము? మేము నీ ఆజ్ఞలను ధిక్కరించిన అపరాధులము.
11. మేము వసింపబోవు దేశము అపవిత్రమైనదని ప్రవక్తలద్వారా నీవు ముందు గనే యెరిగించితివి. ఆ దేశీయులు ఆ నేల నాలుగు చెరగులను అపవిత్ర కార్యములతో నింపివేసిరని నీవు పలికితివి.
12. మేము మా కుమార్తెలను వారి కుమారులకు వియ్యమొందరాదని మరియు మా కుమారులకు, వారి కుమార్తెలను పుచ్చుకొనరాదని నీ ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించితివి. మేము వృద్ధిచెంది ఈ దేశమునందలి భూములను మా సంతానమునకు వారసత్వముగా ఈయగోరెదమేని ఆ అన్య దేశీయులకు అభ్యుదయమునుగాని, శాంతి భద్రతలనుగాని తలపెట్టరాదని ఆజ్ఞాపించితివి.
13. మేము చేసిన మహాపాపములకుగాను మాకీ శిక్షలు ప్రాప్తించినవి. అయినను నీవు మా దోషములకు తగినట్లుగా మమ్ము దండింపవైతివి. నేటి వరకు మాలో కొందరిని ప్రాణములతో బ్రతుకనిచ్చితివి.
14. ఇదంతయు చాల దోయన్నట్లు మేము మరల నీ ఆజ్ఞ మీరి ఈ దుష్ట జనముతో పెండ్లి పొత్తు కుదుర్చుకొనుట యెట్లు? ఇట్లు చేసినచో నీవు మహాకోపముతో మమ్మందరిని నాశన ముచేయవా? ఎవరిని మిగులకుండ మమ్మందరిని మట్టుపెట్టవా?
15. యిస్రాయేలు దేవుడవైన ప్రభూ! నీవు న్యాయవంతుడవు కనుకనే నేడు మాలో కొందరము ఇంకనుబ్రతికిబట్టగట్టియున్నాము. చిత్తగించుము! నీ యెదుట మా పాపములను ఒప్పుకొనుచున్నాము. పాపులమైన మాకు నీ యెదుట నిలుచుటకట్టి యోగ్యతలేదు” అని ప్రార్ధించితిని.
1. ఈ రీతిగా ఎజ్రా దేవాలయము ముందట నేలమీదికివంగి దిగులుతో, పశ్చాత్తాపముతో ప్రార్ధన చేయుచుండగా యిస్రాయేలు ప్రజలు, పురుషులు, స్త్రీలు, చిన్న పిల్లలందరును అతని యెదుట ప్రోగైరి. ఎజ్రాను చూచి వారు కూడ వెక్కివెక్కి యేడ్చిరి.
2. అపుడు ఏలాము కుమారులలో ఒకడగు యహీయేలు కుమారుడైన షెకన్యా, ఎజ్రాతో “మేము అన్యజాతి స్త్రీలను పరిణయమాడి యావేకు ద్రోహము చేసితిమి. అయినను ఈ తప్పును సవరించుకొను మార్గము కలదు.
3. ఇపుడు ఈ పరజాతి స్త్రీలను వారికి కలిగిన సంతానమును వదలివేయుదుమని యిస్రాయేలు దేవునియెదుట ప్రమాణము చేయుదుము. మేమెల్లరము నీవును, దేవుని ఆజ్ఞలు భయభక్తులతో పాటించు పెద్దలును కోరినట్లే చేయుదుము. అందరము యావే ఆజ్ఞలకు బద్దులమైయుందుము.
4. ఈ వివాహములను చక్కదిద్దుట నీ బాధ్యత. మేము నీతో సహకరింతుము. నీవు మాత్రము ధైర్యముతో కార్యనిర్వహణకు పూనుకొనుము” అనెను.
5. అంతట ఎజ్రా లేచి ప్రధానయాజకుల చేతను, లేవీయులచేతను, యిస్రాయేలీయులందరిచేతను ఆ మాట ప్రకారముగ చేయునట్లుగా వారిచేత ప్రమాణము చేయించెను.
6. అటు తరువాత అతడు దేవాలయము ముందటి నుండి వెడలిపోయి యెల్యాషిబు కుమారుడైన యోహానాను ఇల్లు చేరుకొనెను. యిస్రాయేలీయుల ద్రోహమునకు వగచుచు ఆ రాత్రి అచటనే గడిపెను. అతడు అన్న పానీయములు గూడ ముట్టుకోలేదు.
7. ప్రవాసమునుండి వచ్చిన నిర్వాసితులందరు యెరూషలేమున ప్రోగుకావలెననియు యూదా యెరూషలేము మండలములలో ప్రకటన చేయించిరి.
8. మూడురోజులలో ప్రోగుకానివారి ఆస్తి దేవుని ఆలయమునకు ప్రతిష్ఠింపబడుననియు, వారు విడుదలైన యిస్రాయేలు సమాజమునుండి బహిష్కరింప బడుదురనియు, అది పెద్దల ఆజ్ఞయని చాటింపు వేయించిరి.
9. ఆ చాటింపు విని యూదా, బెన్యామీను మండలములలో వసించు యూదులందరును మూడు నాళ్ళలో యెరూషలేము దేవాలయము ముందటి మైదానమున ప్రోగైరి. అది తొమ్మిదవనెల ఇరువదియవనాడు. ఆ రోజు ఒకవైపు కుండపోతగా వాన కురియుచున్నందున, మరియొకవైపు వివాహముల సమస్య వచ్చినందున ప్రజలందరును గడగడ వణకుచుండిరి.
10. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి ప్రజలతో “మీరు అన్యజాతి స్త్రీలను పెండ్లియాడి ప్రభువునకు ద్రోహము చేసితిరి.
11. యిస్రాయేలీయులకు పాపము మూట గట్టితిరి. కనుక ఇప్పుడు మీ పితరుల దేవుడునైన ప్రభువు ఎదుట మీ అపరాధమును ఒప్పు కొనుడు. ఆ ప్రభువు చిత్తము చొప్పున నడచుకొనుడు. మన నేలమీద వసించు అన్యదేశీయుల నుండి వైదొల గుడు. అన్యజాతి భార్యలను వదలివేయుడు” అని పలికెను.
12. అక్కడ గుమిగూడిన ప్రజలు మేమెల్లరము నీవు చెప్పినట్లే చేయుదుమని అరచిరి.
13. వారు ఇంకను ఇట్లనిరి. "అయ్యా! ఇక్కడ చాలమంది ప్రజలు ప్రోగై యున్నారు. మింటికిమంటికి ఏకధారగా వర్షము కురియుచున్నది. మేము ఈ వానలో వెలుపల నిలిచి యుండజాలము. ఇది ఒకటి రెండు రోజులలో తెగు సమస్యకాదు. ఈ పాపమును కట్టుకొనినవారు చాల మంది యున్నారు.
14. మా పెద్దలు యెరూషలేము ననేయుండి ఈ నేరమును చక్కదిద్దుదురు. ఆయా నగరముల నుండి అన్యజాతి భార్యలుగల యిస్రాయేలీయులందరు వారివారి పెద్దలతోను, న్యాయాధిపతులతోను నియమితదినమున ఇక్కడికి వత్తురు. ఇట్లు చేసినచో మనపై రగుల్కొనిన ప్రభువు కోపము చల్లారును” అనిరి.
15. ప్రజలెల్లరు ఆ సలహాను అంగీ కరించిరి. అషాయేలు కుమారుడైన యోనాతాను, తిక్వా కుమారుడైన యహస్యా మాత్రము ఆ సూచనను అంగీకరింపలేదు. మెషూల్లాము, లేవీయుడైన షబ్బెతయి ఇద్దరు ఈ యిరువురికి మద్దతునిచ్చిరి.
16. ప్రవాసమునుండి వచ్చిన నిర్వాసితులందరు పై సూచన నంగీకరించిరి కనుక ఎజ్రా ఆయా వంశాధికారులైన పెద్దలను పూటకాపులుగా నియమించి వారి పేరులు నమోదు చేసెను. ఆ పెద్దలు పదియవనెల మొదటిదినమున తమ విచారణను ప్రారంభించిరి.
17. మొదటినెల మొదటి రోజుకు అనగా మూడు నెలలలో వారు అన్యజాతి భార్యలు కలవారినందరిని పట్టివేసిరి.
18. అన్యజాతి భార్యలు కలవారి జాబితా ఇది: యాజకులు వంశముల వారిగా వీరు: యెసాదాకు కుమారులు యేషూవ, మరియు అతని సోదరుల వంశమునుండి మాసేయా, ఎలియెజెరు, యారీబు, గెదల్యా.
19. వారు తమ భార్యలను విడనాడుదుమని ప్రమాణముచేసి వారి అపరాధమునుబట్టి ఒక పొట్టేలును అర్పించిరి.
20. ఇమ్మేరు వంశమునుండి హనానీ, సెబద్యా.
21. హారిము వంశమునుండి మాసెయా, ఏలియా, షెమయా, యెహీయేలు, ఉజ్జీయా.
22. పషూరు వంశమునుండి యెల్యోయేనయి, మాసెయా, యిష్మాయేలు, నెతనేలు, యోసాబాదు, ఎలాసా.
23. లేవీయులు వీరు: యోసాబాదు, షిమీ, కెలితా అను పేరుగల కెలయా, పెతహియా, యూదా, ఎలియెజెరు.
24. గాయకుడు ఎల్యాషీబు, దేవాలయ ద్వారపాలకులు షల్లూము, తేలెము, ఊరి.
25. యిస్రాయేలు ప్రజ వీరు: పరోషు వంశమునుండి రమ్యా, ఇజ్జీయా, మల్కియా, మీయామిను, ఎలియెజెరు, హషబియా, బెనాయా.
26. ఏలాము వంశమునుండి మత్తన్యా, జెకర్యా, యెహీయేలు, ఆబ్దీ, యెరెమోతు, ఏలియా.
27. సత్తు వంశమునుండి ఎల్యోయేనయి, ఎల్యాషిబు, మత్తన్యా, యెరెమోతు, సాబాదు, అసీసా.
28. బేబై వంశమునుండి యోహానాను, హనన్యా, సబ్బయి, అత్లాయి.
29. బానీ వంశమునుండి మెషుల్లూము, మల్లూఖ, అదయా, యాషూబు, షేయాలు, యెరెమోతు.
30. పహత్మోవబు వంశమునుండి అద్నా, కేలాలు, బెనాయా, మాసేయా, మత్తన్యా, బెసలేలు, బిన్నుయి, మనష్షే,
31-32. హారిము వంశమునుండి ఎలియెజెరు, ఇయ, మల్కీయా, షమయా, షిమ్యోను, బెన్యామీను, మల్లూకు, షెమర్యా.
33. హాషుము వంశమునుండి మత్తెనయి, సాబాదు, ఎలీఫేలెటు, ఎరెమాయి, మనష్షే, షిమెయి
34-37. బానీ వంశమునుండి మాదయి, అమ్రాము, ఊయేలు, బెనాయా, ఫిద్యా, కెలూహి, వన్యా, మెరేమోతు, ఎల్యాషీబు, మత్తన్యా, మత్తెనయి, యాశు.
38-42. బిన్నుయి వంశమునుండి షిమీ, షెలెమ్యా, నాతాను, అదాయా, మక్నద్బయి, షాషై, షారాయి, అసరేలు, షెలెమ్యా, షెమర్యా, షల్లూము, అమర్యా, యోసేపు.
43. నేబో వంశమునుండి యెయియేలు, మతిత్యా, సాబాదు, సెబీనా, యద్దయి, యోవేలు, బెనయా,
44. పైన పేర్కొనిన వారందరికి అన్యజాతి భార్యలు కలరు. వారు ఆ స్త్రీలను, వారికి కలిగిన సంతానమును పరిత్యజించిరి.