1. దావీదు పండు ముదుసలి అయ్యెను. కంబళ్ళతో కప్పినను అతని దేహమునకు వేడి పుట్టదయ్యెను.
2. కావున దావీదు కొలువుకాండ్రు అతనితో “ప్రభూ! నీకొక పడుచును కొనివత్తుము. ఆమె మీ యొద్దనే యుండి మీకు పరిచారము చేయును. మీ ప్రక్కలో పరుండి మీ మేనికి వేడి పుట్టించును” అని చెప్పిరి.
3. వారు అందమైన పడుచు కొరకై యిస్రాయేలు దేశమెల్ల గాలించిరి. కడన షూనేమున అబీషగు అను యువతి దొరకగా ఆమెను రాజు వద్దకు కొనివచ్చిరి.
4. అబీషగు మిక్కిలి అందగత్తె. ఆమె రాజు వద్దనే ఉండి అతనికి పరిచర్యలు చేసెను. రాజు అబీషగును కూడలేదు.
5. దావీదునకు హగ్గీతు వలన కలిగిన కుమారుడు అదోనీయా. అతనికి పొగరెక్కగా తానే రాజు కావలెనని కోరుకొనెను. కావున అదోనియా రథమును, గుఱ్ఱములను చేకూర్చుకొనెను. తన ముందు హెచ్చరికలు చేయుటకై ఏబదిమంది బంటులను నియమించెను.
6. దావీదు అదోనీయాను ఎప్పుడును మందలించి ఎరుగడు. అతడు మిగుల రూపవంతుడు. అబ్షాలోము తరువాత హగ్గీత్తు అతనిని కనెను.
7. అదోనియా సెరూయా కుమారుడగు యోవాబును, యాజకుడగు అబ్యాతారును రాజ్యవిషయమై సంప్రదించెను. వారు అతని సహాయము తీసికొనిరి.
8. కాని యాజకుడైన సాదోకు, యెహోయాదా కుమారుడగు బెనాయా, ప్రవక్తయగు నాతాను, షిమీ, రేయి, దావీదుని యోధులు అతనివైపు చేరలేదు.
9. ఒకనాడు అదోనీయా ఎన్రోగేలు చెంతనున్న “సర్పశిల" అను చోట పొట్టేళ్ళను, ఎద్దులను, బలిసిన కోడెలను వధించి బలిఅర్పించెను. అతడు తన సోదరులగు రాజకుమారులను, యూదా సీమనుండి రాజు కొలువున కుదిరిన ఉద్యోగులను విందుకు ఆహ్వానించెను.
10. కాని ప్రవక్త నాతానును, బెనాయాను, రాజు యోధులను, సోదరుడగు సొలోమోనును పిలువలేదు.
11. నాతాను సొలోమోను తల్లి బత్షెబ వద్దకు వెళ్ళి “మన ప్రభువగు దావీదునకు తెలియకుండగనే హగ్గీతు కుమారుడు అదోనియా రాజయ్యెను. ఈ సంగతి నీవు వింటివా?
12. ఇపుడు నీ ప్రాణమును, నీ కుమారుని ప్రాణమును దక్కించుకోగోరెదవేని నా మాటలు వినుము.
13. నీవు వెంటనే రాజు చెంతకు వెళ్ళి 'ప్రభూ! మీ తరువాత నా కుమారుడు సొలోమోను రాజగుననియు, అతడే మీ సింహాసనముపై అధిష్ఠించుననియు ప్రభువులవారు మాట ఈయలేదా? మరి ఇప్పుడు అదోనియా రాజగుట ఎట్లు?' అని అడుగుము.
14. నీవు ప్రభువుతో మాటలాడుచుండగనే నేనును వచ్చి నీ పలుకులు సమర్ధింతును" అని చెప్పెను.
15. కనుక బత్షెబ రాజుతో మాట్లాడుటకై అతని పడకగదికి వెళ్ళెను. అప్పటికి దావీదు ముదుసలి. షూనేమునుండి వచ్చిన పడుచు అబీషగు అతనికి పరిచర్య చేయు చుండెను.
16. బత్షెబ సాగిలపడి రాజునకు నమస్కరించెను. అతడు ఏమి పనిమీద వచ్చితివి అని అడిగెను.
17. ఆమె “ప్రభూ! మీ తరువాత నా కుమారుడు సొలోమోను రాజగునని, అతడే మీ సింహాసనముపై కూర్చుండునని ప్రభువుల వారు యావే పేర బాస చేయలేదా?
18. అయినను ఇప్పుడు అదోనియా రాజయ్యెనుకదా! ఏలినవారికి ఈ సంగతి ఏమియు తెలియనట్లున్నది.
19. అతడు గొఱ్ఱెపోతులను, ఎడ్లను, బలిసినకోడెలను మిక్కుటముగా వధించి బలి అర్పించెను. రాజకుమారులను, యాజకుడగు అబ్యాతారును, సైన్యాధిపతియగు యోవాబును విందునకు ఆహ్వానించెను. కాని మీ కుమారుడు సొలోమోనును మాత్రము పిలువడయ్యెను.
20. ప్రభూ! మీ తరువాత ఎవరు రాజు అగుదురో తెలిసికోవలయునని యిస్రాయేలీయులందరు ఉవ్విళ్ళూరుచున్నారు.
21. ఈ సంగతిని ప్రభువులవారు ఇప్పుడే నిర్ణయింపరేని తమరు కన్నుమూసిన పిదప నేను నా కుమారుడు సొలోమోను రాజద్రోహులముగా లెక్కింపబడుదుము" అని పలికెను.
22. ఆమె రాజుతో ఇట్లు మాట్లాడుచుండగనే ప్రవక్త నాతాను కూడ వచ్చెను.
23. ప్రవక్త వచ్చెనని పరిచారకులు రాజునకు విన్నవించిరి. నాతాను రాజు ఎదుటికి వచ్చి తలవంచి దండము పెట్టెను.
24. అతడు “ప్రభూ! మీ తరువాత అదోనీయా రాజు కావలెనని తమరు ఆజ్ఞాపించితిరా?
25. అతడు నేడే పొట్టేళ్ళను, ఎడ్లను, బలిసిన కోడెలను మిక్కుటముగా వధించి బలిఅర్పించెను. రాజకుమారులను సైన్యాధిపతియగు యోవాబును, యాజకుడగు అబ్యాతారును విందునకు ఆహ్వానించెను. అదిగో! చూడుడు! వారిప్పుడే విందారగించుచున్నారు. మా రాజు అదోనియాకు దీర్ఘాయువు అని అరచుచున్నారు.
26. కాని వారు నన్నుగాని, యాజకుడు సాదోకునుగాని, బెనాయాను గాని, సొలోమోనునుగాని ఆహ్వానింపరైరి.
27. ప్రభూ! ఇది అంతయు మీ అనుమతితోనే జరిగినదా? అట్లయిన ఏలినవారు తమ కొలువుకాండ్రకు ఈ సంగతి తెలుపరైతిరేమి?" అని అడిగెను.
28. దావీదు బత్షెబను పిలిపింపగా ఆమె వచ్చి అతనియెదుట నిలుచుండెను.
29. అతడు ఆమెతో “నన్ను సకల ఆపదలనుండి కాపాడిన సజీవుడగు దేవుని పేర ప్రమాణము చేయుచున్నాను వినుము.
30. నా తరువాత నా కుమారుడు సొలోమోను నిక్కముగా రాజగునని యిస్రాయేలు దేవుని పేర మునుపు నేను నీకిచ్చిన మాట ఈ దినముననే నెరవేర్చుదును” అని చెప్పెను.
31. బత్షెబ సాగిలపడి రాజునకు నమస్కరించి “ప్రభువులవారు కలకాలము జీవింతురు గాక!” అని అనెను.
32. అంతట రాజు యాజకుడైన సాదోకును, ప్రవక్తయైన నాతానును, బెనాయాను పిలిపింపగా వారు అతని చెంతకు వచ్చిరి.
33. రాజు వారితో “నా కుమారుడు సొలోమోనును నా కంచర గాడిదపై ఎక్కించుకొని గీహోను చెలమవద్దకు తీసికొనిపొండు. నా కొలువుకాండ్రను కూడ మీ వెంట కొనిపొండు.
34. అచట యాజకుడైన సాదోకు, ప్రవక్తయైన నాతాను సొలోమోనును యిస్రాయేలు రాజుగా అభిషేకింపవలయును. తరువాత బాకాను ఊదించి 'సొలోమోనునకు దీర్ఘాయువు!' అని ప్రకటన చేయుడు.
35. అటుపిమ్మట మీరందరు సొలోమోను వెంటనడచుచు, సింహాసనముపై కూర్చుండబెట్టుటకై అతనిని ఇచటకు కొనిరండు. అతడు నాకు బదులుగా రాజగును. యిస్రాయేలును, యూదాను పరిపాలించుటకై నేను సొలోమోనును నియమించితిని” అని చెప్పెను.
36. ఆ మాటలకు బెనాయా “ఏలినవారు చెప్పినట్లే చేయుదుము. మీరు కొలుచు యావే ప్రభువు మీ మాటను స్థిరపరచునుగాక!
37. ప్రభువు మీకు తోడైయున్నట్లే సొలోమోనునకు కూడ తోడైయుండు గాక! అతడు మీకంటెను ప్రసిద్ధుడగును గాక!” అని అనెను.
38. అంతట యాజకుడైన సాదోకు, ప్రవక్తయైన నాతాను, యెహూయాదా కుమారుడగు బెనాయా, రాజు అంగరక్షకులగు కెరెతీయులు, పెలెతీయులు సొలోమోనును రాజుగారి కంచరగాడిదపై కూర్చుండ బెట్టి గీహోను చెలమవద్దకు తోడ్కొనిపోయిరి.
39. ప్రభు గుడారమునుండి కొనివచ్చిన కొమ్ములోని నూనెతో యాజకుడైన సాదోకు సొలోమోనును అభిషేకించెను. అటుపిమ్మట బాకానూదింపగా జనులెల్లరు 'సొలోమోను రాజునకు దీర్ఘాయువు!” అని నినాదములు చేసిరి.
40. అంతట ప్రజలు పిల్లనగ్రోవులూదుచు, సంతోషము మిన్నుముట్టగా నేల దద్దరిల్లిపోవునట్లు కేకలిడుచు సొలోమోనును రాజసౌధమునకు తీసికొనివచ్చిరి.
41. అచట చాకిరేవు చెంత అదోనియా, అతని అనుచరులు విందు ముగించుచుండగా ప్రజల పొలి కేకలు వినిపించినవి. యోవాబు బాకానాదము విని “పట్టణములో ఆ కోలాహలమేమిటి' అని ప్రశ్నించెను.
42. అతడు ఇంకను ప్రశ్నించుచుండగనే అబ్యాతారు కుమారుడు యోనాతాను వచ్చెను. అతనిని చూచి అదోనీ, “రా రమ్ము! నీవు యోగ్యుడవు కనుక మాకు మంచివార్తలనే తెచ్చియుందువు” అని అనెను.
43. యోనాతాను “అవును, మన ప్రభువగు దావీదు సొలోమోనును రాజును చేసెను.
44. సొలోమోను వెంట యాజకుడైన సాదోకును, ప్రవక్తయైన నాతానును, బెనాయాను, కెరెతీయులను, పెలెతీయులను రాజు పంపెను. వారతనిని రాజుగారి కంచర గాడిదపై ఎక్కించుకొనిపోయిరి.
45. యాజకుడైన సాదోకు, ప్రవక్తయైన నాతాను అతనిని ఊహోనున రాజుగా అభిషేకించిరి. అటు తరువాత వారందరు సంతోషముతో కేకలు వేయుచు పట్టణమునకు మరలివచ్చిరి. నగరమంతయు అల్లకల్లోలముగానున్నది. మీరు వినిన నినాదమదియే.
46. ఇపుడు సొలోమోను సింహాసనముపై ఆసీనుడైయున్నాడు.
47. పైపెచ్చు కొలువుకాండ్రు దావీదును దర్శింపవచ్చి 'దేవుడు సొలోమోనును మీకంటె అధికుని జేయుగాక! అతని రాజ్యమును మీ రాజ్యముకంటె సుప్రసిద్ధము చేయుగాక!' అని దీవించిరి.
48. ఆ మాటలకు దావీదురాజు పడుక పైనుండియే సాగిలపడి నమస్కరించి 'యిస్రాయేలు ప్రభువైన దేవునికి స్తుతి కలుగునుగాక! ప్రభువు నేను చూచుచుండగనే నేడు నా కుమారుని సింహాసనముపై కూర్చుండబెట్టెనుకదా' అని పలికెను!” అని చెప్పెను.
49. ఆ మాటలు విని అదోనీయా, అతిథులు మిగుల భయపడి ఎవరిత్రోవన వారు వెడలిపోయిరి.
50. అదోనియా సొలోమోనునకు భయపడి ప్రభు మందిరము ప్రవేశించి బలిపీఠము కొమ్ములకు' పెనవేసికొనెను.
51. అదోనీయా సొలోమోనునకు వెరచి బలిపీఠము కొమ్ములను ఆశ్రయించెననియు, రాజు తనను చంపనని మాటయిచ్చిననే కాని అచటనుండి కదలననుచున్నాడనియు సొలోమోనునకు తెలియజేసిరి.
52. సొలోమోను “అదోనియా విశ్వాసయోగ్యముగా ప్రవర్తించినచో అతనిమీద ఈగైన వ్రాలదు. కాని అతడు కపటబుద్ది అయ్యెనేని తప్పక ప్రాణములు కోల్పోవలసినదే” అని అనెను.
53. అంతట రాజు సేవకులనంపగా వారు అదోనియాను బలిపీఠము వద్దనుండి తీసికొనివచ్చిరి. అదోనియా సొలోమోనునకు సాష్టాంగపడి నమస్కరించెను. రాజతనితో “ఇక నీ ఇంటికి వెడలిపొమ్ము” అనెను.
1. దావీదునకు మరణము ఆసన్నముకాగా అతడు సొలోమోనును పిలిపించి ఇట్లు ఆజ్ఞాపించెను:
2. “నాయనా! నేను కన్నుమూయు గడియలు వచ్చినవి. నీవు ధైర్యముతో, సామర్థ్యముతో మెలగవలయును.
3. ప్రభువునకు లోబడియుండుము. మోషే ధర్మశాస్త్రమునందలి ఆజ్ఞలన్నిటిని పాటింపుము. అపుడు నీవు చేపట్టిన కార్యములన్నియు సఫలమగును. నీవు పోయిన తావులందెల్ల విజయము సిద్ధించును.
4. నీవు ప్రభువు ఆజ్ఞ పాటింతువేని యావే నాకు చేసిన వాగ్దానము తప్పక నెరవేరును. ప్రభువు 'నీ సంతతి వారు ధర్మమార్గమున వర్తించుచు, పూర్ణహృదయముతో, నిండుమనసుతో నా ఆజ్ఞలను పాటించినంత కాలము యిస్రాయేలు దేశమును పరిపాలించుచునే యుందురు' అని నాకు మాటయిచ్చెను.
5. మరియు వినుము. సెరూయా కుమారుడు యోవాబు చేసిన దుర్మార్గము నీవు ఎరుగుదువు. అతడు యిస్రాయేలు సైన్యాధిపతులను ఇద్దరిని చంపెను. వారు నేరు కుమారుడగు అబ్నేరు, యేతేరు కుమారుడగు అమాసా. అతడు యుద్ధసమయము అయినట్లుగా శాంతికాలమున వారిరువురి రక్తమును చిందించి దానిని తన దట్టిమీదను, తన పాదరక్షల మీదను పడజేసెను. అతడు నిరపరాధులను హత్యచేయగా దాని దుష్పలితమును అనుభవించు వాడను నేనైతిని.
6. కనుక నీవు యోవాబునకు తగినరీతిన బుద్ధి చెప్పుము. అతనిని ఈ ముసలితనమున ప్రశాంతముగా కన్నుమూయనీయరాదు.
7. కాని గిలాదు దేశీయుడు బెర్సిల్లయి పుత్రులను మాత్రము కొంచెము కనిపెట్టి యుండుము. వారికి అన్నపానీయముల కొరత యేర్పడ నీయకుము. నాడు నేను నీ అన్న అబ్షాలోమునకు వెరచి పారిపోవుచుండగా వారు నన్ను ఆదరించిరి.
8. ఇంకను వినుము. బెన్యామీను మండలములోని బహూరీము నగరమునకు చెందిన గెరా కుమారుడగు షిమీ నేను మహనాయీమునకు పోవునపుడు నన్ను దారుణముగా శపించెను. కాని తరువాత షిమీ నన్ను యోర్దాను నదిచెంత కలిసికొనగా నేను అతనిపై కత్తి యెత్తనని యావే పేర బాసచేసితిని.
9. అయినను నీవు మాత్రము షిమీని వదలరాదు. నీవు వివేకవంతుడవు గనుక నీకు తోచినరీతిని అతనికి బుద్ధిచెప్పుము. వానిని ముసలితనమున ప్రశాంతముగా కన్నుమూయ నీయరాదు."
10. తరువాత దావీదు కన్నుమూసి తమ పితరులను చేరుకొనెను. అతనిని దావీదునగరముననే పాతి పెట్టిరి.
11. దావీదు నలుబది ఏండ్లు యిస్రాయేలీయులను ఏలెను. అతడు హెబ్రోనున ఏడేండ్లు, యెరూషలేమున ముప్పదిమూడేండ్లు పరిపాలించెను.
12. సొలోమోను తన తండ్రి దావీదు సింహాసనమును ఎక్కెను. అతని రాజ్యాధికారము సుస్థిరమయ్యెను.
13. ఒకనాడు హగ్గీత్తు కుమారుడు అదోనీయా సొలోమోను తల్లియగు బత్షెబను చూడవచ్చెను. ఆమె అతనిని “నాయనా! నీవు స్నేహబుద్దితోనే వచ్చితివా?” అని ప్రశ్నించెను. అతడు అవునని బదులుపలికి,
14. “నాకొక కోరిక కలదు” అని అనెను. ఆమె అడుగుము అనెను.
15. అదోనియా "నేనే రాజును కావలసినది. యిస్రాయేలీయులు అందరు నేనే రాజునగుదునని భావించిరి. కాని దైవచిత్తము వేరుగానున్నందున నా తమ్ముడు సొలోమోను రాజయ్యెను.
16. ఇప్పుడు నాదొక మనవి కలదు. నీవు దానిని కాదనరాదు” అని పలికెను. బత్షెబ “చెప్పుము విందము” అనెను.
17. అదోనీయా “షూనేము నుండి వచ్చిన అబీషగును నాకు భార్యగా ఇమ్మని నీవు సొలోమోను రాజును అడుగుము. రాజు నీమాట త్రోసిపుచ్చడు” అనియనెను.
18. బత్షెబ “మంచిది. నీ మనవిని రాజునకు విన్నవింతును” అని చెప్పెను.
19. అటు తరువాత బత్షెబ అదోనియా కోరికను ఎరిగించుటకై సొలోమోను వద్దకు వెళ్ళెను. ఆమెను చూచి రాజు సింహాసనము దిగెను. తల్లికి నమస్కారము చేసి మరల ఆసనముమీద కూర్చుండెను. రాజుకు కుడిప్రక్క బత్షెబకు మరియొక ఆసనము వేయగా ఆమె దానిపై కూర్చుండెను.
20. బత్షెబ సొలోమోనుతో “నాయనా! నాదొక చిన్న మనవి. నీవు దానిని త్రోసివేయరాదు” అనెను. అతడు “అమ్మా! నీ మనవి నేను త్రోసిపుత్తునా? అదియేమో తెల్పుము” అని పలికెను.
21. ఆమె “అబీషగును నీ సోదరుడు అదోనియాకు భార్యగానిమ్ము” అని అడిగెను.
22. సొలోమోను “అబీషగును ఒక్కతెనే ఈయమందువేల? అతడు నా అన్న కావున అతని కొరకును, యాజకుడైన అబ్యాతారు కొరకును, సెరూయా కుమారుడైన యోవాబు కొరకును రాజ్యమును అడుగుము” అని తన తల్లికి బదులిచ్చెను.
23. మరియు రాజు “ఇట్టి కోరిక కోరుకొన్నందులకు అదోనీయాను ప్రాణములతో బ్రతుకనిత్తునేని యావే నాకు అధిక కీడు చేయునుగాక!
24. ప్రభువు తాను మాట ఇచ్చి నట్లే నా తండ్రి దావీదు సింహాసనముపైన నన్ను కూర్చుండబెట్టెను. ఈ రాజ్యము నాకును, నాసంతతి వారికిని దక్కునట్లు చేసెను. కనుక సజీవుడైన యావే తోడు. అదోనియాను నేడే చంపింతును” అని శపథము చేసెను.
25. అపుడు సొలోమోను ఆజ్ఞపై బెనాయా వెడలిపోయి అదోనియాను వధించివచ్చెను.
26. సొలోమోను యాజకుడు అబ్యాతారుతో “ఓయీ! నీవిక అనాతోతు గ్రామముననున్న నీ ఇంటికి వెళ్ళిపొమ్ము. నీవు మరణపాత్రుడవు. కాని మా తండ్రితోనున్నపుడు దైవమందసమును కాపాడితివి గనుక, ఆయనతో నీవును వెతలను అనుభవించితివి గనుక నిన్నిపుడు చంపింపను” అని అనెను.
27. సొలోమోను అబ్యాతారును యాజక పదవినుండి తొలగించెను. ఈరీతిగా ప్రభువు షిలోనగరమున ఏలీ వంశమునకు పెట్టిన శాపము నెరవేరెను.
28. యోవాబు అబ్షాలోము పక్షము వహించలేదు. కాని అదోనియాను సమర్ధించెను. అతడు జరిగిన సంగతులన్నివిని మిగుల భయపడి ప్రభువు గుడారమునకు పరుగిడి బలిపీఠము కొమ్ములకు పెనవేసికొనెను.
29. యోవాబు ప్రభువుగుడారమునకు పారిపోయి బలిపీఠము వద్ద పడియున్నాడని విని సొలోమోను, దూతనంపి “నీవు బలిపీఠమును ఆశ్ర యింపనేల?” అని అడిగించెను. యోవాబు “నేను నీకు వెరచి యావే శరణుజొచ్చితిని” అని జవాబిచ్చెను. సొలోమోను అంతట యోవాబును వధించి రమ్మని బెనాయాను పంపెను.
30. అతడు ప్రభుగుడారము నొద్దకు వచ్చి “రాజు నిన్ను గుడారమునుండి వెలుపలికి రమ్మని ఆజ్ఞాపించుచున్నాడు” అని అనెను. కాని యోవాబు "నేను రాను. నన్ను ఇక్కడనే చావనిమ్ము” అని పలికెను. బెనాయా రాజు వద్దకు పోయి యోవాబు బలిపీఠమును వీడి వెలుపలికి రాననుచున్నాడు” అని తెలిపెను.
31. సొలోమోను అతనితో “యోవాబు కోరినట్లే చేయుము. అతనిని వధించి పాతి పెట్టుము. అప్పుడుగాని యోవాబు నిర్దోషులను చంపుటవలన కలిగిన పాపము నన్నును నా కుటుంబమును పీడింపక వదలిపోదు.
32. యోవాబు మా తండ్రి అనుమతి లేకయే నరహత్యకు పాల్పడినందున ప్రభువు అతనిని శిక్షించును. అతడు యిస్రాయేలు సైన్యాధిపతియగు అబ్నేరును యూదా సైన్యాధిపతియగు అమాసాను కత్తితో పొడిచిచంపెను. వారిరువురు నిర్దోషులు, అతని కంటె యోగ్యులు.
33. కనుక యోవాబు, అతని సంతతివారు తరతరములదాక ఈ నరహత్యలు తెచ్చి పెట్టు శిక్ష అనుభవింతురుగాక. కాని దావీదునకు, అతని సంతతికి, అతని రాజ్యమునకు ప్రభువు కరుణ వలన యెల్లకాలము భద్రములే కలుగునుగాక!” అని పలికెను.
34. అంతట బెనాయా ప్రభు గుడారమునకు పోయి యోవాబు మీదపడి అతనిని మట్టుపెట్టెను. మైదానముననున్న యోవాబు ఇంటనే అతని శవమును పాతిపెట్టిరి.
35. రాజు యోవాబునకు బదులుగా బెనాయాను సైన్యాధిపతిని చేసెను. అబ్యాతారునకు మారుగా సాదోకును యాజకునిగా నియమించెను.
36. రాజు షిమీని పిలిపించి “యెరూషలేమున ఇల్లు కట్టుకొని యిక్కడనే వసింపుము. నీవు ఈ నగరమును వీడరాదు.
37. ఎన్నడైన ఈ పట్టణమును వీడి కీద్రోను వాగునకు ఆవల అడుగుపెట్టెదవేని ఇక ప్రాణములతో బ్రతుకవు. అప్పుడు నీ మరణమును నీవే కొని తెచ్చుకొందువు” అని చెప్పెను.
38. ప్రభువుల వారి ఆజ్ఞ ప్రకారముగనే చేసెదనని చెప్పి షిమీ వెడలి పోయెను. అతడు చాలకాలముదాక యెరూషలేమును వీడి వెలుపలికి వెళ్ళలేదు.
39. ఇట్లు మూడేండ్లు గడిచిన తరువాత ఒకనాడు షిమీ బానిసలిద్దరు పారిపోయి గాతు దేశపురాజు మాకా కుమారుడగు ఆకీషువద్ద తలదాచుకొనిరి. తన బానిసలు గాతున నున్నట్లు షమీకి తెలియవచ్చినది.
40. వెంటనే అతడు గాడిదనెక్కి తన బానిసలను కొనివచ్చుటకై గాతు దేశమునేలు ఆకీషు నొద్దకు వెళ్ళెను. ఆ బానిసలను కనుగొని వారిని ఇంటికి తీసికొనివచ్చెను.
41-42. షిమీ యెరూషలేమును వీడి గాతునకు వెళ్ళెనని విని సొలోమోను అతనిని పిలువనంపి “నీవు యెరూషలేమును వీడి వెళ్ళరాదని యావే పేర నీతో ప్రమాణము చేయింపలేదా? నా ఆజ్ఞ మీరిననాడు నీవు తప్పక చచ్చెదవని నేను నీతో చెప్పలేదా? నీవు నా మాట పాటించెదనని నాకు ప్రమాణము చేయలేదా?
43. మరి నీ ప్రమాణమును ఏల నిలుపుకోవైతివి? నా మాటనేల జవదాటితివి?
44. నీవు మా తండ్రి దావీదునకుచేసిన ద్రోహము, నీ హృదయమున మెదలు కీడంతయు నీకు ఎరుకయే. నీ నెత్తికే నీ అపరాధము చుట్టుకొనును.
45. కాని యావే నన్ను దీవించును. దావీదు రాజ్యము కలకాలము వరకు సుస్థిరముగానుండును” అని పలికెను.
46. అంతట రాజు ఆజ్ఞపై బెనాయా షిమీని మట్టుపెట్టెను. అంతటితో సొలోమోను రాజ్యము సురక్షితమయ్యెను.
1. సొలోమోను ఐగుప్తు రాజగు ఫరో కుమార్తెను వివాహమాడి అతనితో సంధి కుదుర్చుకొనెను. తన ప్రాసాదమును, దేవాలయమును, పురప్రాకారములను నిర్మించువరకు ఫరో కుమార్తెకు దావీదు నగరముననే నివాసము ఏర్పరచెను.
2. ప్రభువునకు దేవాలయము ఇంకను నిర్మింపబడలేదు. కనుక ఆనాటి ప్రజలు ఉన్నత స్థలములలో బలులర్పించుచుండిరి.
3. సొలోమోను ప్రభువును ప్రేమించెను. తన తండ్రి అయిన దావీదు ఉపదేశమును పాటించెను. కాని అతడు కూడ ఉన్నత స్థలముల యందు బలులు అర్పించుచు, సాంబ్రాణి పొగ వేయుచునుండెను.
4. సొలోమోను గొప్ప ఉన్నత స్థలమైన గిబ్యోను నందు బలి అర్పింపబోయెను. రాజు అచటికి పోయి ఆ బలిపీఠము మీద వెయ్యి దహనబలులను అర్పించెను.
5. ఆ రాత్రి ప్రభువు అతనికి కలలో కనిపించి నీకేమి కావలయునో కోరుకొనుము అనెను.
6. సొలోమోను “ప్రభూ! నీవు మా తండ్రి దావీదును మిక్కిలి కరుణించితివి. నీ సేవకుడగు దావీదు నీ ఆజ్ఞలు పాటించెను. నీతివర్తనుడై చిత్తశుద్ధితో జీవించెను. అతని కుమారుడే నేడు సింహాసనముపై కూర్చుండి పరిపాలనము చేయు చున్నాడనగా నీవు దావీదును నేటివరకు కరుణించితివనుట నిక్కముకదా!
7. ప్రభూ! ఇప్పుడు మా తండ్రికి బదులు నన్ను రాజును చేసితివి. అయినను నేను చిన్నవాడను. ఈ ప్రజలను ఎట్లు పరిపాలింపవలయునో నాకు తెలియదు.
8. నీవు నీ సొంత ప్రజలుగా ఎన్నుకొనిన ఈ జనులు లెక్కకు అందనివారు. నేను వీరితో మనువాడను.
9. కావున నీ ఈ సేవకునకు మంచిచెడ్డలనెంచి పరిపాలించు వివేకమును ప్రసాదింపుము. లేదేని నీవు ఎన్నుకొనిన ఈ మహాప్రజను పాలించుట నా తరముకాదు” అనెను.
10. సొలోమోను కోరుకొనిన కోరిక ప్రభువునకు ప్రీతికలిగించెను.
11. యావే అతనితో “నీవు దీర్ఘాయువునుగాని, సిరి సంపదలనుగాని, శత్రువినాశనమునుగాని కోరుకోవైతివి. ప్రజలను న్యాయబుద్దితో పరిపాలించుటకు వివేకమును మాత్రము అడుగుకొంటివి.
12. నేను నీ కోర్కెను తప్పక తీర్తును. నీ ముందటి వారిలోగాని, నీ తరువాతి వారిలోగాని ఎవ్వరికిని లేని వివేకమును, విజ్ఞానమును నీకు ప్రసాదింతును.
13. నీవు అడుగకున్నను ఈ వరమునుగూడ నీకిత్తును. ఏ రాజునకు లభింపని ఐశ్వర్యము, ప్రఖ్యాతి జీవితకాలమెల్ల నీకు లభించును.
14. నీ తండ్రివలె నీవును నా ఆజ్ఞలు పాటించుచు నాకు విధేయుడవై ఉందువేని నీకు దీర్ఘాయువు ప్రాప్తించును” అని చెప్పెను.
15. అంతట సొలోమోను మేల్కొని అది కల అని తెలిసికొనెను. అటు తరువాత అతడు యెరూషలేమునకు తిరిగివచ్చి ప్రభుమందసము ఎదుటనిలిచి దహన బలులను, సమాధానబలులను సమర్పించెను. తన సేవకులకందరికి విందుచేసెను.
16. ఒకమారు పడుపువృత్తితో జీవించు స్త్రీలు ఇరువురు సొలోమోను వద్దకు అభియోగము కొనితెచ్చిరి.
17. వారిలో ఒకతె “ప్రభూ! నేను, ఈమె ఒక ఇంటనే వసింతుము. మేము ఇరువురము కలసి ఉండగా నాకొక మగకందు పుట్టెను.
18. నాకు బిడ్డ పుట్టిన మూడుదినములకు ఈమెకును ఒక మగబిడ్డ పుట్టెను. ఆ ఇంట మేమిద్దరము తప్ప ఇతరులు ఎవ్వరును లేరు.
19. ఈమె ఒకనాటిరేయి దాని పడకలో ప్రమాదవశాత్తు తన బిడ్డపై పొరలి వానిని చంపి వేసినది.
20. కాని తాను మధ్యరాత్రి లేచివచ్చి నేను నిద్రించుచుండగా నా ప్రక్కలోనున్న నా బిడ్డను కొనిపోయి తన ప్రక్కమీద పరుండబెట్టుకొనెను. చనిపోయిన శిశువును తెచ్చి నాప్రక్కన పెట్టిపోయెను.
21. నేను వేకువనే మేల్కొని బిడ్డకు చన్ను గుడుపబోగా వాని మేనిలో ప్రాణము లేదయ్యెను. తెల్లవారగనే నేను శిశువును జాగ్రత్తగా పరిశీలించి చూడగా, వాడు నేను కన్నబిడ్డడు కాదని తేలిపోయినది” అని చెప్పెను.
22. ఆ మాటలకు రెండవ వేశ్య “నీ పలుకులు నిజముగాదు. బ్రతికియున్నవాడు నా బిడ్డ. చనిపోయిన వాడే నీ బిడ్డ” అని పలికెను. అందుకు మొదటివేశ్య “నీ మాట సరికాదు. చనిపోయినవాడు నీ బిడ్డ. బ్రతికియున్నవాడే నా బిడ్డ” అని వాదించెను. ఈ రీతిగా వారిరువురు రాజు ఎదుట గొడవజేసిరి.
23-25. రాజు “ఈమె చనిపోయిన శిశువు నీ బిడ్డ, బ్రతికి యున్నవాడు నా బిడ్డ అని చెప్పుచున్నది. ఆమె ఈమె మాటను త్రోసిపుచ్చి బ్రతికియున్నవాడు తన బిడ్డడే, చచ్చినది నీ బిడ్డ అని వాదించుచున్నది” అని నుడివి, కత్తిని కొనిరమ్మని సేవకుని ఆజ్ఞాపించెను. అతడు కత్తి తీసికొనిరాగా రాజు “ఈ బిడ్డను రెండు తుండెములుగా నరికి ఒక ముక్కను ఈమె కిమ్ము. ఇంకొక ముక్కను ఆమెకిమ్ము” అని పలికెను.
26. ఆ మాటలకు కన్నతల్లి ప్రేగులు తరుగుకొనిపోయెను. ఆమె రాజుతో “దేవరా! బిడ్డను చంపవలదు. వానిని ఈమెకే ఇచ్చివేయుడు” అనెను. కాని రెండవయామె “ఈ బిడ్డ మన ఇరువురిలో ఎవరికిని దక్కకూడదు. వీనిని రెండు ముక్కలుగా నరికి వేయవలసినదే” అనెను.
27. అప్పుడు రాజు “శిశువును చంపవలదు. వానిని మొదటి ఆమెకే ఇచ్చివేయుడు. కన్నతల్లి ఆమెయే” అని తీర్పు చెప్పెను.
28. యిస్రాయేలు ప్రజలు రాజు చెప్పిన తీర్పు వినిరి. ప్రభువు రాజునకు న్యాయము నిర్ణయించు వివేకము ఒసగెనని గుర్తించి అతనికి భయపడిరి.
1-6. సొలోమోను యిస్రాయేలీయులందరికి రాజయ్యెను. అతని రాజకీయోద్యోగుల పేరులివి. - సాదోకు కుమారుడు అసర్యా యాజకుడు. - షీషా కుమారులగు ఎలీహోరెపు, అహియా కార్యదర్శులు. -అహీలూదు కుమారుడగు యెహోషాపాతు లేఖకుడు. -యెహోయాదా కుమారుడగు బెనాయా సైన్యాధిపతి. - సాదోకు, అబ్యాతారు అనువారు యాజకులు. - నాతాను కుమారుడగు అసర్యా ముఖ్యపాలకుడు. - నాతాను కుమారుడగు సాబూదు మంత్రియు, రాజునకు మిత్రుడు. - అహీషారు ప్రాసాదపాలకుడు. - అబ్దా కుమారుడగు అదోనీరాము వెట్టిచాకిరి చేయువారికి అధిపతి.
7. సొలోమోను పండ్రెండుమంది ఉద్యోగులను మండల పాలకులనుగా నియమించెను. వారు ఒక్కొక్కరు ఒక్కొక్క నెల రాజునకు, అతని పరివారమునకు భోజన పదార్థములను సరఫరా చేయుచుండిరి.
8-19. ఆ ఉద్యోగుల పేర్లు, వారు పాలించిన మండలముల పేర్లు ఇవి: - ఎఫ్రాయీము మన్యమునందు-బెన్హురు. -మాక్సా, షాల్బీము, బేత్-షేమేషు, ఏలోను బెత్షానాను పట్టణములు-బెండేకరు. -అరుబోతు, సోకోతు, హేఫేరు పట్టణములు -బెన్హసెదు. -దోరు మన్యప్రదేశమందు -సొలోమోను కుమార్తె టాపాతు భర్త అయిన బెన్అబీనాదాబు. -తానాకు, మెగిద్ధో, బేత్-షియాను ప్రదేశము, యెస్రేయేలుకు దక్షిణమున సెరితాను ప్రక్కనున్న బేత్-షియాను పట్టణము నుండి ఆబెల్మెహోలా వరకు, యోక్మెయాము ఆవలి పట్టణములు -అహీలూదు కుమారుడు బానా. -రామోతు గిలాదు, మనష్షే కుమారుడగు యాయీరునకు చెందిన గిలాదు పట్టణములు, బాషానున నున్న అర్గోబు, ప్రాకారములు మరియు ఇత్తడి అడ్డగడలు గల అరువది రక్షిత పట్టణములు -బెన్గబేరు. -మహనాయీము -ఇద్ధో కుమారుడు అహీనాదాబు. -నఫ్తాలి -సొలోమోను కుమార్తె బాసెమతును పెండ్లియాడిన అహిమాసు. -ఆషేరు, బేయాలోతు -హూషయి కుమారుడు బానా. -యిస్సాఖారు మండలము -పారువా కుమారుడు యెహోషాఫాత్తు. -బెన్యామీను మండలము -ఏలా కుమారుడు షిమీ. -బాషాను రాజు ఓగు, అమోరీయుల రాజు సీహోను పాలించిన బాషాను మండలము -ఊరి కుమారుడు గెబేరు. వీరు గాక ఈ మండలములన్నిటికి పై అధికారిగ ఒక రాష్ట్రపాలకుడు గూడ నియమింపబడెను.
20. యూదీయులు, యిస్రాయేలీయులు సముద్ర తీరమునందలి ఇసుక రేణువులవలె అసంఖ్యాకులుగా విస్తరిల్లిరి. వారందరు అన్నపానీయములు సేవించుచు హాయిగా కాలము గడిపిరి.
21. తూర్పున యూఫ్రటీసు నదివరకు, పడమట ఫిలిస్తీయా వరకు, దక్షిణమున ఐగుప్తు సరిహద్దులవరకు గల జాతులన్ని సొలోమోను రాజ్యమున చేరిపోయెను. వారందరు అతనికి కప్పము కట్టిరి. సొలోమోను జీవితకాలమెల్ల వారందరు అతనికి లొంగియుండిరి.
22-23. ప్రతిదినము సొలోమోను సౌధమునకు చేరు భోజన పదార్థముల వివరమిది: 150 కుంచముల గోధుమపిండి, 300 కుంచముల ముతకపిండి, బలసిన కోడెలు పది, పొలమున తిరుగాడు కోడెలు ఇరువది, పొట్టేళ్ళు నూరు. ఇవిగాక జింకలు, దుప్పులు, లేళ్ళు, కోళ్ళు గలవు.
24. సొలోమోను యూఫ్రటీసు నదికి పడమట నున్న దేశమంతటిని పరిపాలించెను. తిఫ్సా నుండి గాజా వరకు గల రాజులందరు అతనికి లోబడి యుండిరి. తన సరిహద్దుననున్న దేశములన్నిటితో అతనికి చెలిమి కుదిరెను.
25. సొలోమోను బ్రతికియున్నంతకాలము దాను నుండి బేర్షెబా వరకుగల యిస్రాయేలీయులు, యూదీయులు ఎవరెవరి అంజూరపు తోటలతో, ద్రాక్షతోటలతో వారు చీకు చింత లేకుండ జీవించిరి.
26. సొలోమోనునకు నలువదివేల అశ్వములు, పండ్రెండు వేలమంది ఆశ్వికులు గలరు.
27. పండ్రెండు మంది మండలాధిపతులు, ఒక్కొక్కరు ఒక్కొక్క నెల కాలము, సొలోమోనునకు అతని సౌధమునకు కావలసిన భోజనసామగ్రిని సరఫరా చేయుచువచ్చిరి. రాజైన సొలోమోను భోజనబల్లయొద్దకు వచ్చినవారికి అందరికిని ఏ కొరతయు కలుగనీయరైరి.
28. పైపెచ్చు ప్రతి మండలాధిపతియొక్క గుఱ్ఱములకు, చాకిరి గొడ్డులకు కావలసిన యవలను, పశుగ్రాసమును కూడ పంపుచువచ్చిరి. "
29. ప్రభువు సొలోమోనునకు అద్భుతమైన వివేకము నొసగెను. అతనికి అపారమైన తెలివితేటలు దయచేసెను.
30. తూర్పు దేశముల విజ్ఞానులకంటె ఐగుప్తు విజ్ఞానులకంటె గొప్పజ్ఞాని సొలోమోను.
31. అతడు అందరినిమించిన విజ్ఞాని. ఎస్రహీయుడగు ఏతానుకంటెను, మహోలు పుత్రులైన హేమాను, కల్కోలు, దర్థ అనువారికంటెను గొప్పజ్ఞాని. సొలోమోను కీర్తి చుట్టుపట్లనున్న దేశములందెల్ల వ్యాపించెను.
32. అతడు మూడువేల సామెతలు చెప్పెను. పదివందల ఐదు కీర్తనలు కట్టెను.
33. అతడు లెబానోనున పెరుగు దేవదారులు మొదలుకొని మదురుపై ఎదుగు మొక్కల వరకుగల మహావృక్షములు, చెట్టుచేమలు అన్నిటిని గూర్చి మాట్లాడగలడు. మృగములు, పక్షులు, ప్రాకుడు జంతువులు, చేపలు మొదలైన ప్రాణికోటినంతటిని గూర్చి ఉపన్యసింపగలడు.
34. ప్రపంచమునందలి సకల జాతిజనులు సొలోమోను విజ్ఞానవాక్యములు వినుటకువచ్చిరి. అతడు తన విజ్ఞాన బోధను ఆలించిన రాజులనుండి బహుమతులు పొందెను.
1. తూరు రాజైన హేరాము దావీదునకు ఆప్త మిత్రుడు. హీరాము, దావీదు స్థానములో సొలోమోను రాజయ్యెనని విని అతని దగ్గరకు రాయబారులను పంపెను.
2-3. సొలోమోను హీరామునకు సందేశము పంపి “ప్రభువునకు మా తండ్రి దావీదు మందిరము నిర్మింపలేకపోయెను. చుట్టుపట్లనున్న శత్రువులతో పోరాడి ప్రభుకృపవలన వారిని గెలుచుటతోనే ఆయన కాలమంతయు చెల్లిపోయెను.
4. కాని ఇపుడు ప్రభువు మా దేశపు సరిహద్దులందెల్ల శాంతి నెలకొల్పేను. నాకు శత్రువులు లేరు. ఇక ఏ కీడులు కలుగవు.
5. 'నీ తరువాత నేను నీ కుమారుని సింహాసనము ఎక్కింతును, అతడే నాకు దేవాలయము కట్టును' అని ప్రభువు మా తండ్రికి మాట ఇచ్చెను. కావున నేను ఇపుడు మా దేవుడైన ప్రభువునకు మందిరము నిర్మింప నిశ్చయించుకొంటిని.
6. నీవు నాకొరకై లెబానోనున ఎదుగు దేవదారులను నరికింపవలయును. నా సేవకులు నీ సేవకులతో కలసి పని చేయుదురు. నీ పనివారికి నీవు నియమించిన వేతనములు నేను చెల్లింతును. నీ పనివారైన సీదోనీయుల వలె చెట్లుకొట్టగల నేర్పరులు మా వారిలో లేరు” అని చెప్పించెను.
7. సొలోమోను వర్తమానము విని హీరాము మిక్కిలి సంతసించి “మహాజాతిగా విస్తరిల్లిన దావీదు ప్రజలను పరిపాలించుటకై అతనికి వివేకవంతుడైన కుమారుని ప్రసాదించిన ప్రభువునకు స్తుతి కలుగును గాక!” అని అనెను.
8. అతడు “నీ సందేశము అందినది. నీవు కోరినట్లుగనే దేవదారులను సరళ వృక్షములను కొట్టింతును.
9. మా పనివారు కలపను లెబానోనునుండి సముద్రతీరమునకు చేర్చెదరు. దూలములను తెప్పలుకట్టి నీవు కోరుకొన్న తావునకు పంపుదురు. అచట మా పనివారు తెప్పలను విప్పగా మీ పనివారు కొయ్యను కొనిపోవచ్చును. నీవు మాత్రము మా పనివారికి భోజన సదుపాయములు ఒనర్పుము” అని సొలోమోనునకు బదులు మాటపంపెను.
10. ఈరీతిగా హీరాము సొలోమోనునకు కావలసినంత దేవదారు, సరళవృక్షముల కలపను సరఫరా చేసెను.
11. సొలోమోను హీరాము పనివారికి ఏటేట లక్ష కుంచముల గోధుములను, లక్ష పదివేల సీసాల అచ్చమైన ఓలివు నూనెను పంపించెను.
12. ప్రభువు తాను వాగ్దానము చేసినట్లే సొలోమోనునకు వివేకము నొసగెను. సొలోమోనునకు హీరామునకు పొత్తు కుదిరెను. వారిరువురును ఒడంబడిక కూడ చేసికొనిరి.
13-14. సొలోమోను యిస్రాయేలీయుల నుండి ముప్పదివేలమంది వెట్టిచాకిరి చేయువారిని ప్రోగుచేసి అదోనీరామును వారికి అధిపతిగా చేసెను. అతడు వారిని ఒక్కొక్క గుంపున పదివేలమంది చొప్పున మూడు గుంపులుగా విభజించెను. ఒక్కొక్కగుంపు లెబానోనున ఒకనెల, ఇంటివద్ద రెండునెలలు గడపెను.
15. సొలోమోను పనివాండ్రు ఎనుబది వేలమంది కొండలలో రాళ్ళుచెక్కిరి. డెబ్బదివేలమంది ఆ రాళ్ళను మోసికొనివచ్చిరి.
16. ఆ రాతిపని వారిమీద మూడు వేల మూడువందల మంది పర్యవేక్షకులువుండిరి.
17. సొలోమోను ఆజ్ఞపై రాతిపనివారు దేవాలయ పునాదులకు అత్యంత ఖరీదైన, పెద్దరాళ్ళను మలిచి సిద్ధముచేసిరి.
18. సొలోమోను పనివాండ్రు, హీరాము పనివాండ్రు, గిబాలీయుల పనివాండ్రు దేవాలయ నిర్మాణమునకు కావలసిన రాళ్ళను, కొయ్యనుచెక్కి సిద్ధముచేసిరి.
1. యిస్రాయేలీయులు ఐగుప్తు వీడివచ్చిన నాలుగువందల ఎనుబదియేండ్లకు, సొలోమోను పరిపాలనము నాలుగవయేట, సీపు అను రెండవ నెలలో సొలోమోను మందిరమును కట్టనారంభించెను.
2. మందిరము పొడవు అరువదిమూరలు. వెడల్పు ఇరువది మూరలు. ఎత్తు ముప్పదిమూరలు.
3. ముఖ మంటపము పొడవు ఇరువది మూరలు, మందిరమునకు ముందుగా వెడల్పు పదిమూరలు.
4. దేవాలయపు గోడలలో నగిషీపని చేసిన గవాక్షములు కలవు.
5. దేవాలయపు వెలుపల, దానికి ఇరుప్రక్కల వెనుక వైపు అనగా పవిత్ర స్థలమునకును, గర్భగృహమునకును చుట్టు మూడంతస్తుల శాలను నిర్మించెను.
6. క్రింది అంతస్తు వెడల్పు ఐదుమూరలు. రెండవ అంతస్తు ఆరుమూరలు. మూడవ అంతస్తు వెడల్పు ఏడుమూరలు. ఈ శాల మందిరపు గోడలోనికి ఆనకుండునట్లు మందిరపు గోడచుట్టు వెలుపలి తట్టున చిమ్మురాళ్ళు ఉంచబడెను.
7. దేవాలయము కట్టుటకు కావలసిన రాళ్ళను గని వద్దనే చెక్కించిరి. కనుక దేవాలయమున సమ్మెట పోటుగాని సుత్తెదెబ్బగాని మరి ఏ ఇతర పనిముట్టుతో కొట్టిన శబ్దముగాని విన్పింపలేదు.
8. చుట్టునున్న శాలయందలి క్రింది అంతస్తులోనికి పోవలెనన్న దేవాలయమునకు దక్షిణమునుండి ప్రవేశింపవలయును. అచటి నుండి రెండవ అంతస్తుకు మూడవ అంతస్తుకు ఎక్కిపోవుటకు వలయాకార మెట్లు కలవు.
9. సొలోమోను దేవాలయమును కట్టి ముగించెను. దేవదారు మ్రానులతోను, పలకలతోను దాని కప్పు నిర్మించెను.
10. దేవాలయము చుట్టు మూడంతస్తుల గదులశాల నిర్మించెను. ఒక్కొక్క అంతస్తు ఎత్తు ఐదు మూరలు. ఈ శాల దేవదారు దూలములతో దేవాలయమునకు జోడింపబడెను.
11-12. ప్రభువు సొలోమోనుతో “నీవు నా విధులన్నిటిని పాటింతువేని నేను నీ తండ్రి దావీదునకు చేసిన ప్రమాణములను నిలబెట్టుకొందును.
13. నేను నా ప్రజలైన యిస్రాయేలీయుల మధ్య ఈ దేవాలయమున నివసించెదను. వారిని ఎన్నటికిని విడనాడను” అని చెప్పెను.
14. ఈ విధముగా సొలోమోను దేవాలయమును కట్టి ముగించెను.
15. దేవాలయము లోపలివైపున గోడలు పైకప్పు నుండి నేలవరకు దేవదారు పలకలతో కప్పబడెను, నేలపై సరళవృక్షపు పలకలను పరచిరి
16. దేవాలయమునకు వెనుక తట్టున గర్భగృహము నిర్మింపబడినది. దాని ఎత్తు ఇరువదిమూరలు. ఈ గర్భగృహమునకు దేవాలయమునకు మధ్య ఒక గోడ కలదు. అది నేల మీదినుండి పైకప్పువరకు దేవదారు పలకలతో నిర్మింప బడెను.
17. దేవాలయ అంతర్భాగము పొడవు నలుబదిమూరలు.
18. మందిరము లోపలనున్న దేవదారు పలకలపై గుబ్బలను, వికసించిన పూలను చెక్కిరి. లోపలిభాగమునెల్ల దేవదారు పలకలతో కప్పి వేయుటచే గోడలలోని రాళ్ళు కన్పింపలేదు.
19. దేవాలయమునకు అంతర్భాగాగ్రమున యావే నిబంధన మందసమునుంచుటకై గర్భగృహము సిద్ధపరచెను.
20. ఈ గర్భగృహము పొడవు ఇరువదిమూరలు, వెడల్పు ఇరువదిమూరలు, ఎత్తు ఇరువదిమూరలు, దాని లోపలివైపున బంగారముపొదిగిరి.
21. నిబంధన మందసము ముందట బంగారపు గొలుసులు వ్రేలాడు విభజన (తెర) చేయించి, బంగారముతో దానికి పొదిగించెను. దేవదారు కొయ్యతో పీఠముచేసి దానిని బంగారముతో పొదిగించి గర్భగృహము ముందు నిలిపిరి.
22. సొలోమోను మందిర లోపలిభాగమునంతటిని మేలిమి బంగారముతో పొదిగించెను.
23. సొలోమోను ఓలివుకొయ్యతో రెండు కెరూబు దూతల ప్రతిమలను చేయించి వానిని గర్భాలయమున ఉంచెను. వాని ఒక్కొక్కదాని పొడవు పది మూరలు.
24-26. పరిమాణమున, ఆకారమున, ఆ ప్రతిమలు రెండు సమానముగా నుండెను. వానిలో ఒక్కొక్కదానికి ఐదుమూరల పొడవు గల రెక్కలు రెండు కలవు. ఒక రెక్క కొననుండి మరియొక రెక్క కొనవరకు పదిమూరలు.
27. ఆ కెరూబు దూతల ప్రతిమలను గర్భగృహమున ఒకదానిప్రక్క ఒకటి అమరునట్లుగా నుంచిరి. వాని లోపలి రెక్కలు రెండు గర్భగృహ మధ్యమున ఒకదానినొకటి తాకుచుండును. వెలుపలి రెక్కలు రెండు ఇరువైపులనున్న గోడలకు తాకుచుండును.
28. ఆ ప్రతిమలను అతడు బంగారముతో పొదిగించెను.
29. దేవాలయము గోడలపైన, గర్భగృహము గోడలపైన కెరూబు దూతలను ఖర్జూర వృక్షములను పూలను చెక్కించెను.
30. దేవాలయమునందలి నేలమీద కూడ బంగారపు పూత పూయించెను.
31. గర్భగృహము ద్వారమును ఓలివుకొయ్యతో చేయించెను. దానికి రెండు తలుపులు కలవు. ఆ ద్వారముపై అడ్డుకమ్మి మరియు నిలువుకమ్ములు పంచకోణాకారములో ఉండెను.
32. తలుపులపైన కెరూబుదూతల ప్రతిమలను, ఖర్జూర వృక్షములను, వికసించిన పూలను చెక్కించెను. తలుపులను, వానిమీది కెరూబు దూతలను, ఖర్జూర వృక్షములను బంగారముతో పొదిగించెను.
33. దేవాలయ ద్వారమునకు ఓలివు కొయ్యతో నాలుగు కోణములుగల ద్వారబంధము చేయించెను. ఇది గోడ వెడల్పులో నాలుగవవంతు వెడల్పు ఉండెను.
34. దానిలో రెండుగా మడచుటకు వీలయిన తలుపులు రెండిటిని అమర్చెను. అవి దేవదారు కొయ్యతో చేసినవి.
35. ఆ తలుపులమీద కూడ కెరూబు దూతలను, ఖర్జూర వృక్షములను, వికసించిన పూలను చెక్కించి ఆ చిత్రములను సమ పాళ్ళలో బంగారముతో పొదిగించెను.
36. అతడు లోపలి ఆవరణమును మూడుఅరలు రాళ్ళు, ఒకఅర దేవదారు దూలముతో నిర్మించెను.
37. సొలోమోను పరిపాలనకాలము నాలుగవ యేట, సీపు అను రెండవ మాసమున దేవాలయమునకు పునాది వేసిరి.
38. 'అతని పరిపాలనకాలము పదుకొండవయేట, బూలు అను ఎనిమిదవ మాసమున ముందు నిర్ణయించినట్లే దేవాలయ నిర్మాణము పూర్తి చేయబడెను. సొలోమోనునకు దేవాలయమును కట్టించుటకు ఏడేండ్లు పట్టినది.
1. సొలోమోను ప్రాసాదమును కూడ కట్టించెను. దానిని ముగించుటకు పదమూడేండ్లు పట్టినది.
2. ఆ మేడలో “లెబానోను అరణ్యము” అను పేరుగల శాల కలదు. దాని పొడవు వందమూరలు, వెడల్పు యాబదిమూరలు, ఎత్తు ముప్పదిమూరలు. దానికి ఒక్కొక్క వరుసకు పదునేను చొప్పున నాలుగువరుసల దేవదారుస్తంభములు కలవు. ఈ స్థంభములపై దేవదారు దూలములను నెలకొల్పిరి.
3. పైకప్పు కూడ దేవదారుపలకలతోనే నిర్మించిరి. ఈ కప్పు స్తంభములపై నిలిచెను.
4. ప్రక్కలనున్న రెండు గోడలలో, మూడేసి వరుసలలో గవాక్షములు ఒకదానికొకటి ఎదురెదురుగా నుండెను.
5. ద్వారములకు, గవాక్షములకు నాలుగు కోణముల చతురస్రాకార ద్వారబంధములు కలవు. రెండు గోడలలో మూడువిభాగములు గల గవాక్షములుండెను. మూడు వరుసలలో గవాక్షములు ఒకదానికొకటి ఎదురెదురుగానుండెను.
6. ప్రాసాదమున స్తంభములచావడి కలదు. దాని పొడవు యాబది మూరలు, వెడల్పు ముప్పదిమూరలు దాని ఎదుట స్తంభములపై నిలిచిన వసారా కలదు. దానియెదుట ఒక మంటపము ఉండెను.
7. సొలోమోను న్యాయ విచారణము జరుపుశాలకు సింహాసనశాల లేక న్యాయశాల అని పేరు. అతడు దానిని క్రిందినేలనుండి మీది దూలములవరకు దేవదారు పలకలతో కప్పించెను.
8. ఈ న్యాయశాలకు వెనుక సొలోమోను నివసించు గృహము కలదు. దానిని కూడ ప్రాసాదములోని ఇతర భవనములవలె నిర్మించిరి. అతడు పెండ్లియాడిన ఐగుప్తురాజు కుమార్తెనకు కూడ తన భవనమువంటి భవనమునే కట్టించెను.
9. ఈ భవనమునకు పునాదినుండి మీది కప్పు వరకు కావలసిన మేలిరకపు రాళ్ళనన్నిటిని గనిలోనే చెక్కించిరి. ఆ రాళ్ళను పరికరములతో పగుల కొట్టించి, వాని అంచులు చదరముగానుండునట్లు రంపముతో కోయించిరి.
10. పునాదులకుగాను గని వద్దనే తయారుచేయించిన పెద్దరాళ్ళను వాడిరి. వీనిలో కొన్ని పదిమూరలు, మరికొన్ని ఎనిమిది మూరల పొడవుకలిగి, మిక్కిలి వెలగలవి.
11. వీనిపైని కావ లసిన కొలతలలో పగులకొట్టించిన చిన్నరాళ్ళను పేర్చిరి. వానిమీద దేవదారుదూలములు నిలిపిరి.
12. వెలుపలి ఆవరణముకూడ, దేవాలయ ఆవరణము, ముఖమంటపమువలెనె గోడలకు మూడు వరుసలు రాళ్ళు, ఒక వరుస దేవదారు దూలములు నుండెను.
13-14. సొలోమోనురాజు తూరు పట్టణము నుండి హీరాము అను ఇత్తడి పనివానిని పిలిపించెను. హీరాము తల్లి నఫ్తాలి తెగకు చెందినది. అతని తండ్రి తూరు పట్టణ పౌరుడు, ఇత్తడిపనికి పేరుమోసినవాడు. కాని అతడు గతించెను. హీరాము తెలివితేటలు, అనుభవముగల ఇత్తడి పనివాడు. అతడు సొలోమోను ఆహ్వానమునందుకొని అతనికి ఇత్తడి పనులన్నిటిని చేసిపెట్టెను.
15. హీరాము రెండు ఇత్తడి స్తంభములను పోతపోసెను. అవి ఒక్కొక్కటి పదునెనిమిది మూరల ఎత్తు, పన్నెండుమూరల చుట్టుకొలతనుండెను. అతడు వానిని దేవాలయము ఎదుట నిలిపెను.
16. ఐదు మూరల ఎత్తుగల రెండు ఇత్తడిపీటలను కూడ పోత పోసి వానిని ఆ ఇత్తడిస్తంభములపై నిలిపెను.
17-18. ఆ స్తంభముల పైభాగమును గొలుసు కట్టులతో, రెండువరుసల దానిమ్మపండ్లతో అల్లికగా అలంకరించెను.
19-20. స్తంభములమీద పీటలు నాలుగు మూరలవరకు కలువపూల నగిషి కలిగియుండెను. వానిని స్తంభములపై గొలుసుకట్టుకు పైగా నిలిపిరి. ఒక్కొక్కపీటకు రెండువందల దానిమ్మపండ్లు రెండేసి వరుసలలో అమర్చబడెను.
21. హీరము పై స్తంభ ములు రెండిటిని దేవాలయ మంటపములో నిలిపెను. దక్షిణ దిక్కున ఉన్నదానికి యాకీను' అని, ఉత్తర దిక్కుననున్నదానికి బోవసు' అని పేర్లు.
22. కలువ పూవులవలెనున్న ఇత్తడిపీటలు స్తంభములపై అమర్చ బడెను. ఈ రీతిగా స్తంభములు పూర్తిచేయబడెను.
23. హీరాము సముద్రమంత పెద్ద తొట్టిని ఇత్తడితో పోతపోసెను. అది గుండ్రముగానుండెను. దాని లోతు ఐదుమూరలు, పై అంచులమధ్య దూరము పదిమూరలు, చుట్టుకొలత ముప్పదిమూరలు.
24. ఆ తొట్టిచుట్టు వెలుపలిభాగమున ముప్పదిమూరలు పొడవున రెండు వరుసలలో గుబ్బలు వ్రేలాడుచుండెను. ఈ గుబ్బలను కూడ తొట్టితో కలిసిపోవునట్లుగా పోత పోసెను.
25. ఈ తొట్టిని పండ్రెండు ఇత్తడి ఎద్దులమీద నిలిపెను. ఆ ఎద్దులన్ని వెలుపలికి చూచుచున్నట్లుగా చేయబడెను. మూడేసి ఎద్దులు ఒక్కొక్కదిక్కుకు అభి ముఖములై యుండెను.
26. తొట్టి మందము అర చేతిమందముండెను. దాని అంచు పూవురేకులవలె గుండ్రముగా వెనుకకు వంగియుండెను. ఆ తొట్టిలో వేయి బుంగల నీళ్ళుపట్టును.
27. హీరాము పది ఇత్తడి స్తంభములను తయారు చేసెను. ఒక్కొక్క స్తంభము పొడవు నాలుగు మూరలు, వెడల్పు నాలుగు మూరలు, ఎత్తు మూడు మూరలు.
28. వాటి ప్రక్క పలకలు కలిగియుండెను. పలకలు చట్రముల మధ్య అమర్చబడెను.
29. పలకల మీద మరియు చట్రముల మీదను, సింహములు, ఎద్దులు, కెరూబులు ఉండెను. వాటిపైన మరియు క్రిందను వ్రేలాడు దండలవంటి నగిషీ పని కలిగి యుండెను.
30. ప్రతి స్తంభమునకు నాలుగు ఇత్తడి చక్రములు, ఇత్తడి ఇరుసులు కలిగియుండెను. దాని నాలుగు మూలలును దిమ్మెలుకలవు. ఈ దిమ్మెలు తొట్టిక్రింద అతికిన ప్రతి తావుదగ్గర దండలవంటి నగిషీ పనితో పోతపోయబడెను.
31. దాని మూతి పైకి మూరెడు నిడివి కలిగిన జవలమధ్య మూరెడున్నర లోతున గుండ్రని సందు కలిగిన పీఠమువలె నుండెను. ఆ మూతిమీది ప్రక్క పలకలు గుండ్రనివికాక, చచ్చౌవుకముగ చెక్కినవైయుండెను.
32. ప్రక్క పలకల క్రింద నాలుగు చక్రములు కలవు. చక్రముల ఇరుసులు స్తంభములలో అతుకబడియుండెను. ఒక్కొక్క చక్రము మూరెడున్నర నిడివి కలదైయుండెను. ఈ చక్రములు రథచక్రముల పనివలెనుండెను.
33. దాని ఇరుసులు, అడ్డలు, పూటీలు, ఆకులు పోతపనివై యుండెను.
34. ఒక్కొక్కస్తంభపు నాలుగు మూలలును నాలుగు దిమ్మెలు కలవు. ఈ దిమ్మెలును, స్తంభములును ఏకాండముగా నుండెను.
35. బండ్ల పైభాగమున అరమూర గుండ్రని ఇత్తడిబద్ధకలదు. స్తంభముపైనున్న చట్రములు, ప్రక్క పలకలు దానితో ఏకాండముగా నుండెను.
36. దాని చట్రములమీదను, ప్రక్క పలకల మీదను ఖర్జూరవృక్షములతోను, సింహములతోను, కెరూబుదూతల చిత్రములతోను, గుండ్రని బొమ్మలతోను దానిదాని స్థలమునుబట్టి చుట్టు దండలతో నగిషీపనిగా అలంకరింపబడెను.
37. ఈ రీతిగా అతడు పదిస్తంభములను తయారుచేసెను. వాని పరిమాణము, కొలతలు, పోత ఒకే రీతిగా నుండెను.
38. హీరాము ఒక్కొక్క స్తంభమునకు ఒక్కొక్కటి చొప్పున పది ఇత్తడి తొట్లనుకూడ చేసెను. అవి ఒక్కొక్కటి ఇరువది బుంగలు నీళ్ళుపట్టును. వాని చుట్టుకొలత నాలుగుమూరలు.
39. అతడు దేవాలయమునకు దక్షిణమున ఐదు స్తంభములను ఉత్తరమున ఐదు స్తంభములను ఉంచెను. పెద్ద ఇత్తడి తొట్టిని దేవాలయమునకు ఆగ్నేయపు మూలన ఉంచెను.
40-45. హీరాము బిందెలను, గరిటెలను, గిన్నెలను తయారుచేసెను. అతడు సొలోమోను కోరినట్లు దేవాలయమునకు కావలసిన పరికరములను అన్నిటిని సిద్ధము చేసెను. అతడు చేసిన వస్తువులు ఇవి: రెండు స్తంభములు, వాని పైనినుంచుటకు రెండు గిన్నెలవంటి పీటలు, స్తంభములమీది భాగమునకు గొలుసుకట్లు, ఒక్కొక్క స్తంభమునకు అవి రెండు వరుసలు. ఒక్కొక్క వరుసకు వందచొప్పున మొత్తము నాలుగు వందల దానిమ్మపండ్లు, పది స్తంభములు, పది తొట్లు, సముద్రమువంటి యొక పెద్ద తొట్టి, దానిని మోయుటకు పండ్రెండుఎడ్లు, బిందెలు, గరిటెలు, గిన్నెలు. సొలోమోను ఆజ్ఞనుననుసరించి హీరాము దేవాలయమునకు గాను చేసిన ఈ పరికరములన్నిటిని మేలిమి ఇత్తడితోనే చేసెను.
46. రాజు ఈ పరికరములన్నిటిని సుక్కోత్తున సారెతానునకు నడుమగల యోర్దాను లోయలోనున్న జిగటిమన్నులో పోత పోయించెను.
47. సొలోమోను ఈ ఇత్తడి పరికరములను తూయించలేదు. పరికరములు చాల ఉన్నందున వానిని తూచుట కష్టసాధ్యమయ్యెను.
48-50. సొలోమోను దేవాలయమునకు బంగారు పరికరములను కూడ చేయించెను. అవి బంగారు ధూపపీఠము, సన్నిధి రొట్టెలకుగాను బల్ల. మేలిమి బంగారముతో చేసి మందిరమున కుడిప్రక్కన ఐదు, ఎడమప్రక్కన ఐదు ఉంచిన పది దీపస్తంభములు, వాని బంగారుపూలు, ప్రమిదెలు, పట్టుకారులు, సాంబ్రాణిపొగ కాల్చుటకు బంగారు పాత్రములు, కత్తెరలు, గిన్నెలు, నిప్పుకణికలను తెచ్చు పళ్ళెరములు, గర్భగృహమునకు, మందిరమునకు ద్వారబంధములు.
51. ఈ రీతిగా సొలోమోను ప్రభువునకు దేవాలయము కట్టి పూర్తిచేసెను. అతడు తన తండ్రి దావీదు మందిరమునకు సమర్పించిన వెండిని, బంగారమును, పరికరములను కొనివచ్చి దేవాలయ ఖజానాకు అర్పించెను.
1. సొలోమోను యెరూషలేము నుండి యిస్రాయేలు తెగల పెద్దలనందరిని తన చెంతకు పిలిపించెను. దావీదు నగరమైన సియోను నుండి ప్రభు మందసమును తెప్పింపవలెనని వారితో చెప్పెను.
2. ఏతానీము అనబడు ఏడవనెలలో గుడారముల పండుగ జరుగునప్పుడు. యిస్రాయేలు పెద్దలందరు సొలోమోను చెంతకు వచ్చిరి.
3-4. అపుడు యాజకులు ప్రభు మందసమును ఎత్తి దేవాలయమునకు కొనివచ్చిరి. వారితోపాటు లేవీయులు గుడారమును, దాని పరికరములనుకూడ కొనివచ్చిరి.
5. సొలోమోను రాజు, యిస్రాయేలు ప్రజలు యావేమందసము ఎదుటప్రోగై లెక్కలేనన్ని పొట్టేళ్ళను, ఎడ్లను బలిగా సమర్పించిరి.
6. అంతట యాజకులు నిబంధన మందసమును ఎత్తి దేవాలయమునందలి మహా పవిత్రమయిన గర్భగృహమున కెరూబుదూతల ప్రతిమల రెక్కల క్రింద ఉంచిరి.
7. ఆ కెరూబుదూతల రెక్కలు నిబంధన మందసమును, దానిని మోయు గడలనుకూడ కప్పుచుండెను.
8. ఆ గడలు చాల పొడవుగా ఉన్నందున గర్భగృహమునకు ఎదురుగా దేవాలయములోని పవిత్రస్థలము నందు నిలబడి చూచువారికి కూడ కనిపించునంత నిడివిగలవై యుండెను. కాని బయట నిలబడి చూచువారికి మాత్రము కనిపింపవయ్యెను. నేటికిని అవి అక్కడనే యున్నవి.
9. హోరేబు కొండవద్ద మోషే ఉంచిన రెండు రాతిపలకలు తప్ప మందసమున మరియేమియు లేవు. యిస్రాయేలీయులు ఐగుప్తునుండి వెడలివచ్చి నప్పుడు ప్రభువు ఆ కొండచెంతనే వారితో నిబంధన చేసికొనెను.
10. యాజకులు దేవాలయము నుండి వెలుపలికి రాగానే మేఘము ఆ దేవాలయమున క్రమ్ముకొనెను.
11. ప్రభువుతేజస్సు నిండుకొనియుండుటచే వారు మరల దేవాలయమున ప్రవేశించి అర్చన చేయలేకపోయిరి.
12-13. అపుడు సొలోమోను ఇట్లు ప్రార్థించెను. “ప్రభూ! కారుమబ్బున నెలకొనియుండుట నీకిష్టము. నేను నీకొక మందిరము నిర్మించితిని. నీవు ఎల్లవేళల వసించుటకు ఒక దేవళము కట్టితిని."
14. అంతట సొలోమోను యిస్రాయేలు సమాజమువైపు మరలి వారిని దీవించెను.
15. అతడు వారితో ఇట్లనెను “ప్రభువు మా తండ్రియైన దావీదునకు చేసిన ప్రమాణములను నిలబెట్టుకొనెను. ఆయన స్తుతింపబడునుగాక!
16. అతడు 'నా ప్రజలను ఐగుప్తు నుండి తరలించుకొని వచ్చినప్పటి నుండియు యిస్రాయేలు దేశమున ఏ పట్టణమున గూడ నా నామము దాని యందుండునట్లు ఏ దేవాలయమును నిర్మించుటకు నేను అంగీకరింపలేదు. కాని నా ప్రజలను పరిపాలించుటకు దావీదును ఎన్నుకొంటిని' అనెను.
17. మా తండ్రి దావీదు యిస్రాయేలు దేవుడైన యావేను కొలుచుటకై మందిరమును కట్టగోరెను.
18-19. కాని ప్రభువు అతనితో 'నీవు నాకు మందిరమును కట్టగోరితివి. అది మంచి కోరికయే. అయినను నీవు నాకు దేవాలయమును కట్టజాలవు. నీకు పుట్టబోవు కుమారుడు నాకు దేవాలయము నిర్మించును' అని చెప్పెను.
20. యావే తాను చేసిన వాగ్దానమును నిలబెట్టుకొనెను. మా తండ్రి దావీదు స్థానములో నేను యిస్రాయేలీయులకు రాజునైతిని. యిస్రాయేలు దేవుడు యావేను ఆరాధించుటకై నేను దేవాలయమును నిర్మించితిని.
21. అందులో యావే నిబంధన మందసమునకు స్థలమును ప్రత్యేకించితిని. ప్రభువు మన పితరులను ఐగుప్తునుండి తరలించుకొని వచ్చినపుడు వారితో చేసుకొనిన నిబంధన అందులోనే యున్నది.
22. సొలోమోను యిస్రాయేలీయుల నడుమ యావే బలిపీఠమునకు ఎదురుగా నిలుచుండి చేతులు పైకెత్తి ఇట్లు ప్రార్థించెను.
23. “యిస్రాయేలు ప్రభుడవైన దేవా! పై ఆకాశమునందుగాని, క్రింది భూమినందుగాని నీ వంటి దేవుడు లేడు. నీవు చెప్పిన నిబంధన వాగ్దానములను నెరవేర్చుకొందువు. పూర్ణహృదయముతో నీ ఆజ్ఞలను పాటించు భక్తులను ఆదరముతో చూతువు.
24. నీవు మా తండ్రి దావీదునకిచ్చిన మాట నిలబెట్టుకొంటివి. ఈనాడు నీ వాగ్దానములు క్రియాపూర్వకముగా నెరవేరినవి.
25. యిస్రాయేలు ప్రభుడవైన దేవా! నీవు మా తండ్రికి చేసిన మరియొక వాగ్దానమును కూడ నిలబెట్టుకొనుము. 'నీవలె నీసంతతి వారును నా ఆజ్ఞలను పాటింతురేని, నీ తరువాత యిస్రాయేలును పరిపాలించుటకై వీరినుండి ఎప్పుడును ఒక రాజును ఎన్నుకొనుచునే ఉందును' అని నీవు బాసచేసితివి!
26. కనుక ప్రభూ! నీ సేవకుడును, మా తండ్రియైన దావీదునకు నీవిచ్చిన ఈ మాటపట్టునుకూడ దక్కించుకొనుమని మనవి చేయుచున్నాను.
27. అయినను దేవుడు భూమిమీద వసించునా? ప్రభో! ఆకాశమహాకాశములు సహితము నిన్ను ఇముడ్చుకోజాలవనిన ఇక నేను కట్టిన ఈ కొద్దిపాటి దేవాలయమున నీవు ఇముడుదువా?
28. ప్రభో! ఈ సేవకుని దీనాలాపములు ఆలింపుము. చెవియొగ్గి ఈ భక్తుని మొరవినుము.
29. రేయింబవళ్ళు ఈ దేవాలయమును కాచి కాపాడుచుండుము. కనుక నేడు నీ సేవకుడు ఈ దేవళమునందు చేయు ప్రార్ధననాలింపుము.”
30. “ప్రభో! నీ సేవకుడనైననేను, నీ ప్రజలైన ఈ యిస్రాయేలీయులు ఈ దేవాలయమునుండి చేయు ప్రార్థనలను వినుము. ఆకాశమునందలి నీ నివాసమునుండి మా వేడికోలు ఆలింపుము. ఆలించి మా తప్పిదములను మన్నింపుము.
31. ఎవడైనను తన తోడినరునికి అపరాధము చేసినచో, ఆ తోటినరుడు అతనిని ఈ దేవాలయమునందలి బలిపీఠమెదుటికి కొనివచ్చి అతనిచే ప్రమాణము చేయించినచో,
32. ఆకాశమునుండి నీవు వారి పలుకులు ఆలింపుము. ఆలించి దోషులను కఠినముగా శిక్షింపుము. నిర్దోషులను తగినరీతిగా సన్మానింపుము.
33. నీ ప్రజలైన యిస్రాయేలీయులు పాపము చేసినందున తమ శత్రువులచేత ఓడిపోయి మరల నీ శరణుజొచ్చి ఈ దేవళమున నిన్ను స్తుతించి క్షమాపణము అడుగుకొన్నచో,
34. ఆకాశమునుండి నీవు వారి వేడుకోలును ఆలింపుము. వారి తప్పిదమును మన్నింపుము. నీవు వారి పూర్వులకిచ్చిన ఈ నేలకు వారిని మరల చేర్చుము.
35. ఈ ప్రజలు తప్పిదము చేసినందున నీవు వానలు కురియింపనిచో, వారు ఈ దేవళమునకు వచ్చి నిన్ను స్తుతించి తమ పాపములకు పశ్చాత్తాపపడినచో,
36. నీవు ఆకాశమునుండి వారి మొరలను ఆలకింపుము. రాజు, ప్రజలు చేసిన పాపములను క్షమింపుము. వారు నడువవలసిన మార్గమును చూపింపుము. నీ ప్రజలకు వారసత్వభూమిగా ఇచ్చిన ఈ నేలమీద మరల వానలు కురిపింపుము.
37. ఈ దేశమున కరువుగాని, అంటువ్యాధిగాని అలముకొనుట, బెట్టవలనగాని, చిత్తడివలనగాని, మిడుతలదండు లేక చీడపురుగువలనగాని పైరు నాశనమగుట, శత్రువులు వచ్చి పట్టణములను ముట్టడించుట, వ్యాధులు సోకుట - మొదలైన
38. ఉపద్రవములు కలుగగా ఈ ప్రజలు నీకు మొర పెట్టుకొన్నచో నీవు వారి వేడికోలును ఆలింపుము. నీ ప్రజలైన యిస్రాయేలీయులలో ఎవరైన పూర్ణ పశ్చాత్తాపముతో ఈ దేవాలయమువైపు చేతులెత్తి ప్రార్థనచేసినచో నీవు ఆకాశమునుండి
39. వారి మనవి నాలకింపుము. వారి తప్పిదములను మన్నించి వారికి మేలుచేయుము. ఎవరెవరి శీలమునకు తగినట్లుగా వారిని సన్మానింపుము. నరుల హృదయములు తెలిసినవాడవు నీవొక్కడివే.
40. ఇటులయినచో ఈ జనులు, నీవు మా పితరులకిచ్చిన ఈ నేలమీద వసించునంత కాలము నీయెడల భయభక్తులు చూపుదురు.
41. దూరదేశములందు నివసించు అన్యజాతిజనులు నీ కీర్తిని విని,
42. ఈ ప్రజలను రక్షించుటకై నీవు చేసిన గొప్ప కార్యములను తెలిసికొని, నిన్ను ప్రార్థించుటకు ఈ దేవళమునకు వచ్చినచో
43. నీవు వారి మొరనాలింపుము. ఆకాశమునందలి నీ నివాసమునుండి వారి వేడుకోలు విని వారి కోర్కెలు తీర్చుము. ఇట్లయినచో ప్రపంచములోని అన్యజాతి జనులెల్లరు నీ సొంత ప్రజలవలె నీయెడల భయభక్తులు వెల్లడింతురు. నేను నిర్మించిన ఈ దేవాలయములోనే నీ పేరు ప్రసిద్ధమైనదని వారెల్లరు తెలిసికొందురు.
44. నీవు పంపిన నీ ప్రజలు శత్రువులమీదికి యుద్ధమునకు పోయినపుడు, ఏ మార్గములోనైనా వారిని నీవు పంపినపుడు, నీ వెన్నుకొనిన ఈ పట్టణమువైపు, నేను నిర్మించిన ఈ దేవాలయమువైపు తిరిగి నిన్ను ప్రార్థించినచో,
45. ఆకాశమునుండి నీవు వారి మొరనాలకింపుము. వారికి విజయమును ప్రసాదింపుము.
46. నరులలో పాపము చేయనివారెవరును లేరు కనుక ఈ ప్రజలు నీకు ద్రోహముగా పాపముచేయగా, నీవు వీరిపై కోపించి వీరిని శత్రువులపాలుచేయగా, ఆ శత్రువులు వీరిని దూరముననో, దగ్గరనో ఉన్న తమదేశమునకు చెరగొనిపోగా,
47. ఆ పరదేశమున వీరు పశ్చాత్తాపపడి తాము దుర్మార్గపు పనులు చేసిన పాపులమని ఒప్పుకొని నిన్ను ప్రార్థించినచో నీవు వీరి మొర ఆలింపుము.
48. ఆ శత్రుదేశమున వీరు చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడి, నీవు పితరులకిచ్చిన ఈ నేలవైపు నీవు ఎన్నుకొనిన ఈ పట్టణము నుండి నేను కట్టిన ఈ దేవాలయమువైపు తిరిగి ప్రార్థన చేయగా,
49. ఆకాశమునందలి నీ నివాసస్థలమునుండి నీవు వీరి వేడుకోలు ఆలింపుము.
50. ఈ ప్రజల తప్పిదమును, వీరు నీ మీదచేసిన తిరుగుబాటును, మన్నింపుము. వీరి శత్రువులు వీరిని దయతో ఆదరించునట్లు చేయుము.
51. వీరు ఐగుప్తునుండి ఆ దేశప్రజల ఇనుప పిడికిళ్ళనుండి నీవు కొనివచ్చిన నీ సొంత జనము.
52. నీ ప్రజలైన యిస్రాయేలీయులుగాని, నీ దాసుడనైన నేనుగాని నీకు మొర పెట్టుకోగా నీవు ఆదరముతో ఆలకించి వారి ఇక్కట్టులను తొలగింపుము.
53. నీవు మా పితరులను ఐగుప్తునుండి తరలించుకొని వచ్చినపుడు నీ సేవకుడు మోషేతో చెప్పినట్లుగా సమస్త జాతుల నుండి ఈ ప్రజను నీ సొంత జనముగా ఎన్నుకొంటివిగదా!”
54. సొలోమోను బలిపీఠము ముందు మోకాళ్ళూని చేతులెత్తి పై విధముగా ప్రభుని ప్రార్థించెను. అటుతరువాత అతడు లేచినిలుచుండెను.
55. అతడు గొంతెత్తి యిస్రాయేలు సమాజమును దీవించుచు ఇట్లనెను:
56. “ప్రభువు తాను మాటఇచ్చినట్లే యిస్రాయేలు ప్రజలకు శాంతిని ప్రసాదించెను. యావే తన సేవకుడు మోషేద్వారా చేసిన మంచి మాటపట్టులన్నియు నెరవేరినవి. ఆయనకు స్తుతికలుగు గాక!
57. ప్రభువు మన పితరులకువలె మనకు బాసటయై ఉండునుగాక! ఆయన మనల చేయివిడువకుండునుగాక!
58. ప్రభువు మనపితరులకిచ్చిన ఆజ్ఞలన్నియు మనము పాటించునట్లును, నిరంతరము ఆయనకు విధేయులమై యుండునట్లును మన హృదయములకు ప్రబోధము కలిగించుగాక!
59. నేనిపుడుచేసిన ఈ వేడికోలు రేయింబవళ్ళు మన దేవుడైన యావే సన్నిధిని ఉండునుగాక! ఆయన యిస్రాయేలును, వారి రాజును ఎల్లవేళల గుర్తుంచుకొనుచు, ప్రతిదినము వారి కోర్కెలు తీర్చుచుండునుగాక!
60. ఈ రీతిగా జరిగినచో భూమిమీది జనులెల్లరు ప్రభువు తప్ప మరొక దేవుడు లేడని విశ్వసింతురు.
61. మీరు కూడ నేటివలె ఎల్లప్పుడును ప్రభువు అజ్ఞలను పాటించుచు ఆయనమీదనే మనసునిలిపి జీవింతురుగాక!”
62. సొలోమోను రాజు, యిస్రాయేలు ప్రజలు ప్రభువునకు బలులర్పించిరి.
63. అతడు ఇరువది రెండువేల ఎడ్లను, లక్ష ఇరువదివేల పొట్టేళ్ళను సమా ధానబలిగా సమర్పించెను. ఆ రీతిగా రాజు ప్రజలు కలిసి దేవాలయమును ప్రతిష్ఠించిరి.
64. రాజు ఆ రోజుననే దేవాలయమునకు ముందటనున్న ఆవరణపు మధ్యభాగమును కూడ దేవునికి ప్రతిష్ఠించెను. అచటనే అతడు దహనబలులు, ధాన్యబలులు, క్రొవ్వువేల్చిన సమాధానబలులు సమర్పించెను. దేవాలయము ఎదుటనున్న ఇత్తడి బలిపీఠము చిన్నదైనందున దాని మీద ఈ బలులన్నిటిని సమర్పించుటకు వీలుపడలేదు.
65. అంతట సొలోమోను, ఉత్తరమున హమాతు కనుమ నుండి దక్షిణమున ఐగుప్తు సరిహద్దు వరకు గల దేశమునుండి వచ్చిన యిస్రాయేలు మహా జనులందరును కూడి ప్రభు సమక్షమున ఏడురోజులపాటు గుడారముల పండుగ జరుపుకొనిరి.
66. ఎనిమిదవ దినమున సొలోమోను ప్రజలను పంపివేసెను. వారు ప్రభువు తన సేవకుడైన దావీదునకును, యిస్రాయేలు ప్రజలకును చేసిన మంచికార్యములు తలచుకొని సంతోషించుచు, రాజును కొనియాడుచు, తమ తమ నివాసములకు వెడలిపోయిరి.
1-2. సొలోమోను దేవాలయమును, ప్రాసాదమును, మిగిలిన భవనములను కట్టి ముగించిన పిదప, గిబియోనున ప్రత్యక్షమైనట్లు యావే మరల రెండవసారి అతనికి ప్రత్యక్షమయ్యెను.
3. ప్రభువు అతనితో “నేను నీ ప్రార్థన, విన్నపములను ఆలకించితిని. నన్ను సదా ఆరాధించుటకై నీవు నిర్మించిన ఈ దేవాలయమును పవిత్రము చేసితిని. నేను దీనిని నిత్యము ఆదరముతో చూచి సంరక్షించుచుందును.
4. నీ తండ్రి దావీదువలె నీవును పూర్ణహృదయముతో, చిత్తశుద్ధితో నన్ను కొలుచుచు నాకు విధేయుడవై నా ఆజ్ఞలను పాటింతువేని.
5. 'నీ వంశీయుడొకడు నిత్యము నీ సింహాసనముపై కూర్చుండి యిస్రాయేలీయులను పరిపాలించును' అని నేను పూర్వము నీ తండ్రి దావీదునకు చేసిన ప్రమాణమును నిలబెట్టుకొందును.
6. కాని నీవుగాని, నీ అనుయాయులుగాని నన్ను విడనాడి నా ఆజ్ఞలను మీరి అన్యదైవములను ఆరాధింతురేని,
7. యిస్రాయేలును నేనిచ్చిన ఈ నేల మీదనుండి తొలగింతును. నా ఆరాధనకుగాను నేను పవిత్రముచేసిన ఈ దేవాలయమును కూడ విడనాడు దును. అపుడు జనులెల్లరు యిస్రాయేలును చూచి నవ్విపోదురు. వారిని గడ్డిపోచతో సమానముగా చూతురు.
8. ఇక ఈ మహాదేవాలయమును చూచి, ఇటువైపు వచ్చు వారందరు ముక్కుపై వ్రేలిడుకొని ప్రభువు ఈ నేలకు, ఈ దేవళమునకు ఏమిగతి పట్టించెనో చూడుడని ఢీ కొట్టుదురు.
9. అప్పుడు చుట్టుపట్లనున్న వారు “ఈ ప్రజలు తమ పితరులను ఐగుప్తునుండి తరలించుకొని వచ్చిన ప్రభువును విడనాడి అన్యదైవములను ఆశ్రయించి వారిని కొలిచిరి. కనుక ప్రభువు వీరిని ఈ రీతిగా శిక్షించెను' అని పలుకుదురు” అనెను.
10. సొలోమోను దేవాలయమును, ప్రాసాదమును కట్టి ముగించుటకు ఇరువదియేండ్లు పట్టెను.
11. తూరు దేశపు రాజగు హీరాము సొలోమోనునకు కావలసిన దేవదారు కలప, సరళవృక్షముల కలప, బంగారము సమకూర్చి పెట్టెను. సొలోమోను అతనికి గలిలీసీమలోని ఇరువది పట్టణములిచ్చెను.
12. హీరాము తూరు దేశమునుండి వచ్చి ఆ పట్టణములను పరిశీలింపగా అవి అతనికి నచ్చవయ్యెను.
13. అతడు సొలోమోనుతో “తమ్ముడా! నాకెటువంటి పట్టణములు ఇచ్చితివోయి!” అనెను. కావుననే ఆ ప్రాంతమును నేటివరకు కాబూలు' అని పిలుచుచున్నారు.
14. హీరాము సొలోమోనునకు పండ్రెండు బారువుల బంగారము పంపెను.
15. సొలోమోను దేవాలయమును, రాజగృహమును కట్టుటకు, పురప్రాకారమును నిర్మించుటకు, పట్టణమునకు తూర్పువైపుననున్న పల్లము పూడ్చుటకు అనగా మిల్లో నిర్మాణమునకు ప్రజలచేత వెట్టిచాకిరి చేయించెను. ఆ రీతిగానే హాసోరు, మెగిద్ధో, గేసేరు పట్టణములను పునర్నిర్మాణము చేయుటకు జనులతో వెట్టిచాకిరి చేయించుకొనెను.
16. ఐగుప్తు రాజు ఫరో గేసేరును ముట్టడించి వశముచేసికొనెను. ఆ నగరమందు నివసించు కనానీయులను చంపి పట్టణమును తగులబెట్టించెను. అతడు తన కుమార్తెను సొలోమోనుకిచ్చి పెండ్లి చేసినపుడు ఆ పట్టణమును ఆమెకు కానుకగా ఇచ్చెను.
17. సొలోమోను దానిని పునర్నిర్మాణము చేసెను
18. ఈ వెట్టిచాకిరితోనే అతడు దిగువనున్న బేత్-హోరోనును, బాలాతును, యూదా ఎడారిలోని తడ్మోరు పట్టణమును కట్టించెను.
19. అతడు భోజనపదార్దములకై ఏర్పాటుచేసిన శాలలు, సైన్యములను నిలిపిన పట్టణములు, రథములను గుఱ్ఱములనుంచిన పట్టణములు, యెరూషలేముననేమి, లెబానోనుననేమి, సామ్రాజ్యమందలి ఇతర ప్రాంతాలలోనేమి కట్టించిన భవనములు వెట్టి చాకిరితోనే నిర్మింపబడెను.
20-21. అతడు కనాను మండలమందలి నానా జాతులవారిని ఈ వెట్టిచాకిరికి ఉపయోగించుకొనెను. యిస్రాయేలీయులు ఈ మండలములను ఆక్రమించుకొనినప్పుడు అమోరీయులు, హిత్తీయులు, పెరిస్సీయులు, హివ్వీయులు, యెబూసీయులు మొదలైన ఈ జాతులను పూర్తిగా నాశనము చేయలేకపోయిరి. వీరినే సొలోమోను వెట్టిచాకిరికి వాడుకొనెను. వీరి సంతతివారు నేటికిని బానిసలుగనే బ్రతుకుచున్నారు.
22. సొలోమోను యిస్రాయేలీయుల చేత వెట్టిచాకిరి చేయించుకోలేదు. వారతనికి సైనికులు, అంగరక్షకులు, సైన్యాధిపతులు, రథాధిపతులు, ఆశ్వికులుగా పనిచేసిరి.
23. సొలోమోనునకు వెట్టిచాకిరి చేయువారిమీద అయిదువందల యేబదిమంది పర్యవేక్షకులుండిరి.
24. ఐగుప్తు రాజైన ఫరో కుమార్తె దావీదు నగరమును వీడి సొలోమోను క్రొత్తగా నిర్మించిన భవనమున నివసించుట మొదలిడిన తరువాత అతడు నగరమునకు తూర్పువైపుననున్న పల్లమునుపూడ్చి మెరకగా జేసెను.
25. సొలోమోను తానునిర్మించిన బలిపీఠముపై ఏడాదికి మూడుసారులు దహనబలులు, సమాధాన బలులు సమర్పించెడివాడు. ప్రభువెదుట సాంబ్రాణి పొగ వేసెడివాడు. అతడు దేవాలయమును చక్కగా మరమ్మతు చేయించెడివాడు.
26. ఎదోముమండలమునందలి రెల్లు సముద్రము తీరముననున్న ఎలతు పట్టణము వద్దగల ఏసోసోన్గెబరు రేవు నందు సొలోమోను నావలను నిర్మించెను.
27. సొలోమోను నావికులతో పనిచేయుటకై, హీరాము తన నావికులలో నేర్పరులను కొందరినిపంపెను.
28. ఈ నావికులు ఓఫీరు రేవువరకు సముద్ర యానము చేసి సొలోమోనునకు నలుబది రెండు బారువుల బంగారము తెచ్చియిచ్చిరి.
1. షెజారాణి సొలోమోను ప్రసిద్ధిని గూర్చి విని అతనిని చిక్కుప్రశ్నలతో పరీక్షింపవచ్చెను.
2. ఆమె చాలమంది సేవకులను వెంటనిడుకొని సుగంధ ద్రవ్యములను ఒంటెల పైకి ఎక్కించుకొనివచ్చెను. రత్నములను, పెద్దమొత్తము బంగారమును గూడ కొని వచ్చెను. రాణి సొలోమోనును కలిసికొని తాను అడగ గోరిన ప్రశ్నలన్నియు అడిగెను.
3. అతడు ఆమె ప్రశ్నలన్నిటికి జవాబు చెప్పెను. ఆ ప్రశ్నలలో అతనికి తెలియనిదేదియులేదు.
4-5. సొలోమోను విజ్ఞానము, అతడు నిర్మించిన ప్రాసాదము, అతని భోజనశాలలో భోజనము, అతనికి కొలువుచేయు ఉద్యోగులు, అతని పరిచారకుల నేర్పరితనము, వారు తాల్చిన వస్త్రములు, అతనికి ద్రాక్షసారాయము అందించు సేవకులు, అతడు సమర్పించు దహనబలులను చూచుసరికి ఆమెకు నోటమాట రాలేదు.
6. ఆమె అతనితో “నిన్నుగూర్చి, నీ విజ్ఞానము గూర్చి నేను మా దేశమున విన్నవారలెల్ల నిజములే.
7. కాని నేనిచటికి వచ్చి నా కళ్ళతో చూచు వరకు ఆ వార్తలను నమ్మలేదు. అయినను వారు నాకు నీ గొప్పతనములో సగమైనను తెలుపలేదు. నీ విజ్ఞానమును, వైభవమును నేను వినిన దానికంటెను ఎక్కువగానున్నవి.
8. నిత్యము నీ ఎదుట నిలిచి నీ విజ్ఞానసూక్తులు ఆలకించుచున్న నీ జనులు, నీ సేవకులెంత అదృష్టవంతులో!
9. నిన్ను చల్లనిచూపు చూచి యిస్రాయేలు సింహాసనముపై నిలిపిన యావే ప్రభువు స్తుతింపబడునుగాక! ప్రభువు యిస్రాయేలును శాశ్వతముగా ప్రేమించెను. కనుకనే వారిని నీతి నియమములతో, న్యాయముతో పరిపాలించుటకు నిన్ను రాజునుచేసెను” అనెను.
10. షెబారాణి సొలోమోనునకు పండ్రెండు బారువుల బంగారము, సుగంధ ద్రవ్యములు, రత్నములను బహుమతిగా ఇచ్చెను. ఆ రాణి కానుకచేసినన్ని సుగంధ ద్రవ్యములను మరెవ్వరును సొలోమోనునకు ఇచ్చియుండలేదు.
11. హీరాము నావికులు ఓఫీరునుండి బంగారమునే గాక వారు అక్కడినుండి విస్తారమైన మంచి గంధపు చెక్క రత్నములను గూడ కొనివచ్చిరి.
12. సొలోమోను ఆ గంధపుకొయ్యతో దేవాలయమునకు, రాజనగరునకు పైకప్పులను చేయించెను. మరియు దానితో సంగీతకారులకు పిల్లనగ్రోవులు, వీణలు చేయించెను. నేటివరకు అటువంటి చందనపుకొయ్య మరల ఇక్కడ కనిపింపలేదు.
13. సొలోమోను కూడ షెబారాణి కోరుకొనిన వస్తువులెల్ల ఆమెకు బహుమతిగా ఇచ్చెను. అతడు తన రాజవైభవమునకు తగినట్లుగా ఆమెకు కానుకలు ఇచ్చెను. అటుతరువాత రాణి తన సేవకులతో షెబా రాజ్యమునకు వెడలిపోయెను.
14. సొలోమోనునకు ఏటేటా ఇంచుమించు అరువది ఆరు బారువుల బంగారము లభించెడిది.
15. వర్తకులమీద విధించిన కప్పములనుండి, వర్తకుల నుండి, అరేబియా రాజునుండి, రాష్ట్ర పాలకులనుండి లభించిన బంగారము ఈ లెక్కలో చేరలేదు.
16. అతడు సుత్తితో కొట్టిన బంగారముతో రెండువందల పెద్దడాలులను చేయించెను. వానికి ఒక్కొక్కదానికి ఆరువందల తులముల బంగారమువాడెను.
17. సుత్తితో కొట్టిన బంగారముతోనే మూడు వందల చిన్న డాలులనుగూడ చేయించెను. వానికి ఒక్కొక్కదానికి నూటఏబది తులముల బంగారమువాడెను. వానినన్నిటిని “లెబానోను అరణ్యము” అను పేరుగల మందిరమున నుంచెను.
18. అతడు దంతముతో సింహాసనము చేయించి దానిని మేలిమి బంగారమున పొదిగించెను.
19-20. ఈ సింహాసనమునకు ఆరుమెట్లు కలవు. ఒక్కొక్క మెట్టునకు రెండు సింహముల చొప్పున మొత్తము పండ్రెండు సింహముల బొమ్మలు కలవు. సింహాసనమునకు వెనుకతట్టున ఎద్దు తలను చెక్కించెను. సింహాసనము రెండు చేతులకు ప్రక్క రెండు సింహముల బొమ్మలు కలవు. ఏ రాజు ఇటువంటి సింహాసనము చేయించి ఎరుగడు.
21. సొలోమోను పానపాత్రములన్నియు, 'లెబానోను అరణ్యము' అనుపేరుగల మందిరములోని పాత్రములన్నియు మేలిమి బంగారముతోనే చేయబడెను. సొలోమోను కాలమున వెండికి విలువలేదు గనుక దానితో అతడు వాడిన పాత్రలలో దేనిని చేయరైరి.
22. సొలోమోనునకు నావలు గలవు. అవి హీరాము నావలతోపాటు సముద్ర యానము చేసెడివి. ప్రతి మూడేండ్లకొకసారి అతని ఓడలు వెండి బంగారములతో, దంతములతో, రకరకముల మర్కటములు, నెమళ్ళతో తిరిగివచ్చెడివి.
23. విజ్ఞానముననేమి, వైభవమున నేమి సొలోమోను ఈ నేలను పాలించిన రాజులలోకెల్ల గొప్పవాడు.
24. ప్రభువు అతనికి అనుగ్రహించిన విజ్ఞాన సూక్తులను వినుటకై ప్రపంచములోని జనులెల్లరు వచ్చెడివారు.
25. అతనిని చూడవచ్చినవారు వెండి బంగారు వస్తువులను, ఆయుధములను, సుగంధ ద్రవ్యములను, గుఱ్ఱములను, గాడిదలను బహుమతులుగా కొనివచ్చిరి. ఏటేట ఇట్లే జరుగుచుండెడిది.
26. సొలోమోనునకు గొప్పరథబలమును గలదు. అతడు పదునాలుగు వందల రథములను తయారు చేయించెను. పండ్రెండువేల గుఱ్ఱములను సంపాదించెను. వానిలో కొన్నిటిని రథనగరములందు నిలిపియుంచెను. కొన్నిటిని యెరూషలేముననే ఉంచెను.
27. అతనికాలమున యెరూషలేమున వెండి రాళ్ళవలె లభించెడిది. దేవదారుకొయ్య సాదా మేడికఱ్ఱవలె దొరకెడిది.
28. ఐగుప్తునుండి, సిలీష్యా నుండి అతనికి గుఱ్ఱములను కొనితెచ్చెడివారు. అతని ఉద్యోగులు సిలీష్యా నుండి నిర్ణీతమూల్యమునకు గుఱ్ఱములు కొని పంపిడివారు.
29. ఆ కాలమున ఐగుప్తునుండి దిగుమతి చేయబడిన రథములకు ఒక్కొక్కదానికి ఆరు వందల వెండినాణెములు, గుఱ్ఱములకు ఒక్కొక్కదానికి నూటయేబది వెండినాణెములు చెల్లించిరి. ఇట్లు దిగుమతియైన గుఱ్ఱములను రాజోద్యోగులు మరల హిత్తీయరాజులకు, సిరియా రాజులకు అమ్మెడివారు.
1. సొలోమోను అన్యదేశ స్త్రీలను వలచెను. అతడు ఐగుప్తు రాజు ఫరో కుమార్తెను మాత్రమే గాక హిత్తీయ, మోవాబు, అమ్మోను, ఎదోము, సీదోను స్త్రీలనుగూడ వివాహమాడెను.
2. ప్రభువు అన్యజాతుల పిల్లలను యిస్రాయేలీయులు గాని, యిస్రాయేలీయుల పిల్లలను అన్యజాతుల వారుగాని పరిణయమాడరాదనియు, అట్టి వివాహములు జరిగినచో యిస్రాయేలీయులు అన్యజాతులు పూజించు దైవములను ఆరాధింతురనియు చెప్పెను. అయినను సొలోమోను అన్య జాతి స్త్రీలను పరిణయమాడి వారియెడల గాఢానురాగము చూపెను.
3. అతడు ఏడువందలమంది రాజ పుత్రికలను వివాహమాడెను. పైగా అతనికి మూడు వందలమంది ఉపపత్నులుకూడ గలరు. వీరందరు అతనికి ప్రభువు మీద భక్తి సన్నగిల్లి పోవునట్లు చేసిరి.
4. సొలోమోను వృద్దుడు అగునప్పటికి భార్యలు అతడు అన్యజాతుల వారి దైవములను ఆరాధించునట్లు చేసిరి. అతడు తన తండ్రి దావీదువలె పూర్ణహృదయముతో యావేయెడల ఉండలేకపోయెను.
5. ఆ రాజు సీదోనీయులు కొలుచు అష్టారోతు దేవతను, అమ్మోనీయులు కొలుచు పాడుదైవము మిల్కోమును పూజించెను.
6. అతడు ప్రభువునకు ద్రోహముచేసెను. తన తండ్రి దావీదువలె ప్రభువును పూర్ణహృదయముతో ఆరాధింపడయ్యెను.
7. మోవాబీయులు కొలుచు హేయమైన దైవము కెమోషును ఆరాధించుటకై యెరూషలేమునకు తూర్పువైపుననున్న కొండపై ఒక ఉన్నత స్థలమును నిర్మించెను. ఆ రీతిగనే అమ్మోనీయులు కొలుచు హేయమైన మెలెకునకును నిర్మించెను.
8. అతడు తాను పెండ్లియాడిన అన్యజాతి స్త్రీలు బలులు అర్పించుకొనుటకు సాంబ్రాణి పొగవేయుటకు అతడు ఈ విధముగా చేసెను.
9. రెండుసార్లు ప్రత్యక్షమైన యావేను, యిస్రాయేలు ప్రభువును సొలోమోను విడనాడెను. కనుక యావే అతనిపై కోపించెను.
10. అన్యదైవముల నారాధింప నిషేధించినను యావేమాట వినలేదు.
11. యావే అతనితో “నీవు నా నిబంధనమును మీరి నాఆజ్ఞలను జవదాటితివి గనుక నేను ఈ రాజ్యమును నీ అధీనమునుండి తొలగించి నీ సేవకునికి ఇచ్చి వేసెదను.
12. అయినను నీ తండ్రి దావీదు పైగల అభిమానముచే నీ కాలమున కాదుగాని నీ కుమారుని పరిపాలన కాలమున ఈ కార్యమును జరిగింతును.
13. కాని ఈ రాజ్యమంతటిని నీ కుమారుని అధీనము నుండి తొలగింపను. నా సేవకుడగు దావీదును చూచి, నేనెన్నుకొనిన ఈ యెరూషలేము పట్టణమును చూచి ఒక్క తెగను మాత్రము నీ కుమారునివశమున ఉంచెదను” అని చెప్పెను.
14. ప్రభువు ఎదోము రాజవంశమునకు చెందిన హదదును పురికొల్పగా అతడు సొలోమోనునకు శత్రువయ్యెను.
15-16. అంతకు పూర్వమే దావీదు ఎదోమును జయించెను. అతని సైన్యాధిపతియగు యోవాబు మృతవీరులను పూడ్చిపెట్టుటకై అచటికి వెళ్ళెను. యోవాబు అతని అనుచరులు ఎదోమున ఆరు మాసములు ఉండిరి. ఆ కాలమున వారు ఎదోము నందలి మగవారినందరిని చంపివేసిరి.
17. కాని హదదు, అతని తండ్రికి కొలువుచేయు ఎదోము సేవకులు మాత్రము తప్పించుకొని ఐగుప్తునకు పారిపోయిరి. అప్పటికి హదదు పసివాడు.
18. అతడు అతని అనుచరులు మిద్యానునుండి బయలుదేరి పారాను ఎడారి చేరిరి. అక్కడ మరికొందరు వారితో చేరగా అందరు కూడి ఐగుప్తు చేరుకొనిరి. హదదు ఫరోను కలసికొనగా ఆ రాజు అతనికి ఇల్లువాకిలి, పొలము పుట్ర ఇప్పించి భోజనవసతి కల్పించెను.
19. హదదు రాజునకు ఇష్టుడయ్యెను. ఫరో తన రాణి తహ్పెనేసు చెల్లెలినే అతనికిచ్చి పెండ్లి చేసెను.
20. హదదుకు ఆమెవలన గెనుబతు అను కుమారుడు కలిగెను. రాణి ఆ శిశువును ఫరో ప్రాసాదముననే పెంచెను. బాలకుడు రాజకుమారులతో పెరిగెను.
21. దావీదు, అతని సైన్యాధిపతియైన యోవాబు మరణించిరని వినిన హదదు, ఫరో వద్దకు వెళ్ళి “నన్ను నా దేశమునకు వెళ్ళిపోనిమ్ము” అని అడిగెను.
22. రాజతనితో ఇచట నావలన నీకేమైన కొరతకలిగినదా? ఇపుడు నీవు మీ దేశమునకు తిరిగిపోనేల?” అని అనెను. అతడు రాజుతో “ఇక్కడ నాకు ఏ లోటును లేదు. అయినను నన్ను వెళ్ళిపోనిమ్ము” అనెను. తరువాత హదదు ఎదోమునకు రాజయ్యెను. అతడు యిస్రాయేలీయులను మిగుల ఈసడించుకొనెను గనుక వారికి కీడు తెచ్చి పెట్టెను.
23. ప్రభువు ఎల్యాదా కుమారుడు రెసోనును గూడ సొలోమోనునకు శత్రువును చేసెను. ఈ రెసోను తన యజమానుడు, సోబా రాజునగు హదదెసరునుండి పారిపోయి,
24. కొందరు తిరుగుబాటుదారులకు నాయకుడయ్యెను. దావీదు హదదె సెరును జయించి అతని మిత్రులైన అరామీయులను మట్టు పెట్టిన తరువాత ఈ సంఘటనము జరిగెను. రెసోను అతని అనుచరులు దమస్కునకు పోయిరి. రెసోను సిరియా దేశమునకు రాజయ్యెను.
25. సొలోమోను జీవించి ఉన్నంతకాలము అతడు యిస్రాయేలీయులకు ప్రబల శత్రువుగా నుండెను.
26.యరోబాము ఎఫ్రాయీము మండలములోని సెరెదా పట్టణవాసియైన నెబాతు కుమారుడు, అతని తల్లి పేరు సెరువా. ఆమె విధవ. అతడు సొలోమోను సేవకుడై కూడ అతనిమీద తిరుగబడెను.
27. ఆ తిరుగుబాటు వైనమిది: సొలోమోను యెరూషలేమునకు తూర్పువైపున నున్న పల్లమును పూడ్పించి అనగా మిల్లోను నిర్మించి పట్టణ ప్రాకారమును పొడిగించుచుండెను.
28. అప్పటికి మరోబాము సమర్థుడైన యువకుడు. అతడు సంతృప్తికరముగా పనిచేయుట చూచి సొలోమోను అతనిని మనష్షే ఎఫ్రాయీము మండలములలోని భారమైన పనులు చేయగల వెట్టిచాకిరి వారికందరకు నాయకుని చేసెను.
29. ఒకనాడు యరోబాము యెరూషలేమునుండి పయనమై వచ్చుచుండగా షిలో నివాసియైన అహీయా ప్రవక్త పొలములోని త్రోవలో అతనిని కలసికొనెను. అప్పుడు వారిద్దరుతప్ప మరియెవ్వరును అచటలేరు. అహీయా ప్రవక్త క్రొత్త వస్త్రమును వేసుకొనియుండెను.
30. అతడు ఆ క్రొత్త వస్త్రమును పట్టుకొని పండ్రెండుముక్కలుగా చించివేసి యరోబాముతో
31. “వీనిలో పదిముక్కలు నీవు తీసికొనుము. యిస్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లను చున్నాడు: 'ఈ రాజ్యమును సొలోమోనునుండి తొలగించి దానిలో పదితెగలను నీ పరము చేసెదను.
32. నా సేవకుడు దావీదును చూచి, యిస్రాయేలు నేలమీది నుండి నా సొంత నగరముగా ఎన్నుకొనిన యెరూషలేమునుచూచి, ఒక్కతెగను మాత్రము సొలోమోను వశమున నుంచెదను.
33. సొలోమోను నన్ను విడనాడి సీదోనీయుల దేవత అష్టారోతును, మోవాబీయుల దైవమగు కెమోషును, అమ్మోనీయుల దైవమగు మిల్కోమును పూజించెను. అతడు నన్ను ధిక్కరించి నా మార్గమును విడనాడెను. తన తండ్రి దావీదువలె నా ఆజ్ఞలను పాటింపడయ్యెను.
34. కాని రాజ్యమంతటిని సొలోమోను వశమునుండి తొలగింపను. పైగా నేనెన్నుకొనిన దావీదును చూచి, అతడు నా ఆజ్ఞలు పాటించిన దానిని చూచి సొలోమోను జీవించినంతకాలము అతనిని రాచరికమునుండి తొలగింపను.
35. కాని సొలోమోను కుమారుని వశమునుండి రాజ్యమును తొలగించి తీరుదును. నీకు దానిలో పది తెగలను ఇత్తును.
36. సొలోమోను కుమారునికి ఒక్క తెగనిత్తును. ఇట్లు చేసినచో, నా నామమును అచట ఉంచుటకు నేను ఎన్నుకొనిన యెరూషలేమున నా సేవకుడైన దావీదు వంశీయుడు ఒకడు నిత్యము పరిపాలన చేయుచుండును.
37. నిన్ను నేను యిస్రాయేలునకు రాజును చేసెదను. నీకు ఇష్టము వచ్చినంత రాజ్యమును నీవు పరిపాలింప వచ్చును.
38. నీవు పూర్ణహృదయముతో నాకు విధేయుడవై నా మార్గమును అనుసరించుచు నా సేవకుడైన దావీదువలె నా ఆజ్ఞలను పాటించెదవేని నేను నీకు తోడుగా యుందును. నిన్ను యిస్రాయేలునకు రాజును చేసెదను. దావీదు వంశీయులవలె నీ వంశీయులును శాశ్వతముగా పరిపాలనము చేయుదురు.
39. ఈ రీతిగా దావీదు వంశీయులకు బుద్ధిచెప్పెదను. కాని నేను వారిని శాశ్వతముగా శిక్షింపను' " అని పలికెను.
40. సొలోమోను యరోబామును చంపజూచెను గాని అతడు ఐగుప్తునకు పారిపోయి సొలోమోను మర ణించువరకు షీషకు రాజుచాటున తలదాచుకొనెను.
41. సొలోమోను జీవితములోని ఇతర అంశ ములు - అతడు చేసినపనులు, అతడు చూపిన విజ్ఞానము “సొలోమోను చరిత్రము"నందు లిఖింపబడియేయున్నవి.
42. అతడు యెరూషలేము నుండి నలుబది యేండ్లు యిస్రాయేలీయులందరిని పరి పాలించెను.
43. సొలోమోను తన పితరులతో నిద్రించి, తన తండ్రియైన దావీదు నగరమున సమాధి చేయబడెను. అతని తరువాత అతని కుమారుడు రెహబాము అతనికిమారుగా రాజయ్యెను."
1. రెహబాము షెకెమునకు వెళ్ళెను. యిస్రాయేలీయులందరు అతనికి పట్టాభిషేకము చేయుటకై అచట ప్రోగయిరి.
2. నెబాతు కుమారుడు యరోబాము సొలోమోను చెంతనుండి పారిపోయి ఐగుప్తున వసించుచుండెనుగదా! అతడు ఈ వార్తలువిని ఐగుప్తునుండి తిరిగివచ్చెను.
3-4.యిస్రాయేలీయులు రెహబాముతో “నీ తండ్రి సొలోమోను మా నెత్తిన పెద్దభారము మోపెను. నీవు ఈ బరువును తొలగింతువేని మేము నీకు దాసులమైయుందుము” అనిరి.
5. రెహబాము ప్రజలతో “మూడు దినములయిన తరువాత నన్ను కలిసికొండు” అని చెప్పగా వారందరు వెడలిపోయిరి.
6. అంతట రెహబాము తన తండ్రి సొలోమోనునకు కొలువుచేసిన వృద్ధులను పిలిపించి ఈ ప్రజలకేమి సమాధానము ఈయవలెనో చెప్పుడనెను.
7. వారు అతనితో “నీవు ఈ జనులకు సేవచేయకోరెదవేని ఇపుడు వీరికి ప్రీతికలుగునట్లు మాట్లాడుము. ఆ మీదట వీరు జీవితాంతము నీకు బానిసలైయుందురు” అని చెప్పిరి.
8. కాని రెహబాము ఆ వృద్ధుల ఆలోచనను త్రోసిపుచ్చి తనతో పెరిగి తనకు కొలువు చేయుచున్న యువకులను ఉపదేశమడిగెను.
9. “ఈ ప్రజలు తమ బరువును తొలగింపుమని అడుగుచున్నారు, నేను వీరికేమి బదులు ఈయవలయునో తెలియచెప్పుడు” అనెను.
10. వారతనిని చూచి "నీవు ఈ ప్రజలతో 'మా తండ్రి నడుముకంటె నా చిటికెన వ్రేలు లావుగలది.
11. మా తండ్రి మీపై పెద్దబరువు మోపినచో నేనంతకంటే పెద్దబరువునే మోపెదను. అతడు మిమ్ము చండ్రకోలలతో కొట్టించినచో నేను మిమ్ము కొరడాలతో బాధించెదను' అని చెప్పుము” అని పలికిరి.
12. మూడు రోజులైనపిమ్మట రెహబాము కోరినట్లే యిస్రాయేలీయులందరు అతనివద్దకు వచ్చిరి.
13. రెహబాము పెద్దల ఉపదేశము త్రోసిపుచ్చి ప్రజలను నొప్పించే విధముగా మాట్లాడెను.
14. అతడు తన మిత్రులైన యువకుల మాటలువిని ప్రజలతో “మా తండ్రి మీపై పెద్దబరువును మోపినచో నేనంత కంటె పెద్దబరువునే మోపెదను. అతడు మిమ్ము చండ్రకోలలతో కొట్టించినచో నేను మిమ్ము కొరడాలతో బాధించెదను” అనెను.
15. ఈ రీతిగా రెహబాము ప్రజల మనవిని త్రోసిపుచ్చుట యావే నిర్ణయించిన కార్యము. ప్రభువు షిలో నివాసియగు అహీయా ముఖమున యరోబామునకు చేసిన వాగ్దానమును నెరవేర్చుటకే ఇట్లు జరిగెను.
16. రెహబాము తమ మనవిని విననందున ప్రజలు “మనకు దావీదు సొత్తులో పాలులేదు, యిషాయి కుమారుని వారసమున పొత్తులేదు, మన నివాసములకు మనము వెడలిపోవుదము రండు. ఇక దావీదు వంశీయులు వారి తిప్పలు వారు పడుదురుగాక!” అని పలికి వెడలిపోయిరి.
17. రెహబాము యూదా రాజ్యములోని యిస్రాయేలీయులకు రాజయ్యెను.
18. అతడు వెట్టిచాకిరి చేయువారికి పర్యవేక్షకుడుగా నున్న అదోరామును తిరుగుబాటుదారుల మీదికి పంపెను గాని వారతనిని రాళ్ళతో కొట్టిచంపిరి. రెహబాము గబగబ రథమెక్కి యెరూషలేమునకు పారి పోవలసివచ్చెను.
19. అప్పటినుండి యిస్రాయేలీయులు దావీదు వంశీయుల ఏలుబడిలో లేరు.
20. యిస్రాయేలీయులు యరోబాము ఐగుప్తు నుండి తిరిగివచ్చెనని విని అతనిని తమ సమావేశమునకు పిలిపించి రాజుగా అభిషేకించిరి. యూదా తెగ మాత్రమే దావీదువంశీయులకు లొంగియుండెను.
21. రెహబాము యెరూషలేమునకు మరలివచ్చి యూదా, బెన్యామీను తెగలనుండి నూటఎనుబది వేలమంది వీరులను ప్రోగుచేసికొని యిస్రాయేలీయుల మీదికి దాడివెడలెను.
22-24. కాని ప్రభువు తన ప్రవక్తయైన షేమయాతో “నీవు వెళ్ళి సొలోమోను కుమారుడు, యూదా రాజునగు రెహబాముతోను, యూదా బెన్యామీను తెగలకు చెందిన యిస్రాయేలీయులతోను, 'మీ సోదరులైన యిస్రాయేలీయుల మీదికి యుద్ధమునకు పోవలదు. ఇది నేను నిర్ణయించిన కార్యము కనుక మీరందరు వెనుకకు మరలి పొండు' అని చెప్పుము” అని పలికెను. యూదీయులందరు ప్రభువు మాట పాటించి వెనుదిరిగిపోయిరి.
25. మరోబాము ఎఫ్రాయీము మండలమున నున్న షెకెము అను పట్టణమును కట్టించి, అచట కొన్నాళ్ళు నివసించెను. తరువాత అతడు పెనూవేలు పట్టణమును నిర్మించెను.
26-27. అతడు తనలో తాను “ఈ ప్రజలు యెరూషలేము దేవాలయమునకు వెళ్ళి అచట ప్రభువునకు బలులర్పింతురేని వారు యూదారాజయిన రెహబామునే రాజుగా అంగీకరించి నన్ను చంపివేయవచ్చును” అనుకొనెను.
28. ఇట్లు తలపోసి అతడు రెండు బంగారు కోడెదూడలను చేయించెను. తన ప్రజలతో “మీరు యెరూషలేమునకు వెళ్ళుట ఇక చాలింపుడు. మిమ్ము ఐగుప్తునుండి తోడ్కొనివచ్చిన దైవములు వీరే, చూడుడు” అనెను!.
29. అతడు ఒక బంగారుదూడను బేతేలునను, మరియొక దానిని దానునందును నెలకొల్పెను.
30. ఇట్లు చేయుట ప్రజలకు పాపకారణమయ్యెను. వారు ఆ దైవములను ఆరాధించుటకు బేతేలునకు, దానునకు వెళ్ళెడివారు.
31. యరోబాము ఉన్నతస్థలములపై మందిరములను కూడ నిర్మించెను. లేవీ తెగకు చెందని సామాన్య కుటుంబమునుండియే ఆ మందిరములకు యాజకులను నియమించెను.
32. యరోబాము యూదామండలమునవలె యిస్రాయేలు సీమలోకూడ ఎనిమిదవనెల పదునైదవ దినమున ఒక పండుగను నెలకొల్పెను. అతడు బేతేలున తాను నెలకొల్పిన బంగారు దూడలకు బలులు అర్పించెను. ఉన్నతస్థలములో యాజకులుగా తాను నియమించిన వారినే బేతేలున కూడ యాజకులనుగా చేసెను.
33. అతడు తనకు తానుగా నియమించుకొనిన ఎనిమిదవనెల పదునైదవ దినమున బేతేలునకు వెళ్ళి పండుగ జరిపి బలిపీఠముపై బలులను అర్పించెను. మరియు యిస్రాయేలు వారికి ఒక పండుగను నిర్ణయించి, ధూపము వేయుటకై తానే బలిపీఠమునెక్కెను.
1. యరోబాము బేతేలు బలిపీఠము పై సాంబ్రాణి అర్పింపబోవుచుండగా ప్రభువు పిలుపుపై యూదానుండి దైవభక్తుడొకడు అచటికివచ్చెను. ప్రభువు అనుమతిపై అతడు యరోబాము బలి పీఠమును తెగనాడుచు,
2. “ఓ బలిపీఠమా! బలి పీఠమా! వినుము. దావీదు వంశమున యోషీయా అను బిడ్డడు పుట్టును. అతడు నీపైన ధూపమువేసిన ఉన్నత స్థలముల యొక్క యాజకులను పట్టి, నీ మీదనే బలియిచ్చును. అతడు నీమీద నరుల ఎముకలను కాల్చివేయును” అనెను.
3. ఆ భక్తుడు ఇంకను “వినుడు! ప్రభువు నా ద్వారా మాట్లాడెననుటకు మీకిదే గురుతు. ఈ బలిపీఠము బద్దలైపోవును. దాని మీది బూడిద నేలలో కలసిపోవును” అని పలికెను.
4. ఆ రీతిగా దైవభక్తుడు బలిపీఠమునుగూర్చి తెలిపిన తెగనాడుట చూచి యరోబామురాజు అతనివైపు చేయి చాచి “ఇతనిని పట్టుకొనుడు” అని ఆజ్ఞాపించెను. వెంటనే రాజుచేయి చాచినది చాచినట్లుగనే కొయ్య బారిపోయెను. అతడు దానిని మరల ముడుచుకోలేక పోయెను.
5. దైవభక్తుడు దేవుని పేరుమీదుగా గురుతు నిచ్చినట్లే బలిపీఠము బద్దలైపోయెను. దానిమీది బూడిద క్రిందబడిపోయెను.
6. అపుడు రాజు “నీ దేవునికి మనవిచేసి నా చేతిని నయముచేయుము” అని ప్రవక్తను వేడుకొనెను. దైవభక్తుడు దేవునికి మనవి చేయగా రాజు చేయి యథాపూర్వకముగా ఆయెను.
7. రాజు అతనితో “నీవు మా ఇంటికి వచ్చి భోజనము చేయుము. నేను నిన్ను సత్కరించి పంపెదను” అనెను.
8. కాని దైవభక్తుడు రాజుతో “నీ సంపదలో సగము ఇచ్చినను నేను నీ వెంటరాను. మీ ఇంట అన్నపానీయములు ముట్టుకొనను.
9. ప్రభువు నేనిచట కూడునీళ్ళు ముట్టుకొనకూడదనియు, నేను వచ్చిన త్రోవవెంట తిరిగి వెళ్ళకూడదనియు ఆజ్ఞాపించెను” అని చెప్పెను.
10. అంతట అతడు తాను వచ్చిన త్రోవనువిడనాడి మరియొక త్రోవవెంట వెడలిపోయెను.
11. బేతేలున ఒక వృద్ధప్రవక్త కలడు. అతని కుమారులు ఆ రోజు బేతేలున దైవభక్తుడు ఏమి చేసి నది, అతడు రాజుతో ఏమి చెప్పినది తమ తండ్రికి తెలియ జేసిరి.
12. అతడు ఏ త్రోవలో పోయెనని తండ్రి కుమారులను అడిగెను. దైవభక్తుడు వెడలిన త్రోవను వారు తండ్రికి తెలియజెప్పిరి.
13. అతడు కుమారులచే గాడిదమీద జీనువేయించుకొని దానిపై ఎక్కిపోయెను.
14. ప్రవక్త దైవభక్తుని వెదకుచుపోయి, ఒకచోట అతడు సింధూరవృక్షము క్రింద కూర్చుండి యుండగా చూచెను. ప్రవక్త “యూదానుండి వచ్చిన దైవభక్తుడవు నీవేనా?” అని అడుగగా అతడు 'నేనే' అని చెప్పెను.
15. నీవు మా ఇంటికివచ్చి భోజనము చేయుమని ప్రవక్త అతనిని ఆహ్వానించెను.
16. అతడు “నేను నీ వెంట రాకూడదు. ఈ తావున కూడు నీళ్ళు ముట్టుకోగూడదు.
17. ప్రభువు నేనిక్కడ కూడునీళ్ళు ముట్టుకొనకూడదనియు, నేను వచ్చిన త్రోవవెంట తిరిగిపోకూడదనియు ఆజ్ఞాపించెను” అని పలికెను.
18. ప్రవక్త దైవభక్తునితో “నేనును నీవలె ప్రవక్తనే. ప్రభువు ఆజ్ఞపై అతని దూత నిన్ను మా ఇంటికి కొని వచ్చి ఆతిథ్యమిమ్మని నాతో చెప్పెను” అని పలికెను. కాని అతడు అబద్దమాడెను.
19. అయితే దైవభక్తుడు ప్రవక్తతో వెనుదిరిగిపోయి అతని ఇంట అన్నపానీయములు పుచ్చుకొనెను.
20. వారు భోజనమునకు కూర్చుండియుండగా ప్రభువు దివ్యవాణి ప్రవక్తను ప్రేరేపించెను.
21. అతడు యూదానుండి వచ్చిన దైవభక్తునితో “నీవు దేవునిమాట మీరితివి. ఆయన ఆజ్ఞను పాటింపవైతివి.
22. నా వెంట వెనుదిరిగివచ్చి ప్రభువు వద్దన్నచోట అన్నపానీయములు పుచ్చుకొంటివి. ఇందుకుగాను నీ శవము మీ పితరుల సమాధిని చేరబోదు” అని పలి కెను.
23. దైవభక్తుడు భోజనముచేసిన తరువాత ప్రవక్త గాడిదపై జీనువేసెను.
24. భక్తుడు దానినెక్కి వెడలిపోవుచుండగా త్రోవలో ఒక సింహము అతనిని చంపివేసెను. అతని శవము త్రోవలో పడియుండెను. గాడిద, సింహము పీనుగ ప్రక్కనే నిలుచుండియుండెను.
25. ఆ దారినబోవు జనులు ప్రేతమును, దాని ప్రక్కన నిలుచుండియున్న సింహమునుచూచి ఊరిలోనికి వచ్చి వృద్ధప్రవక్తకు చెప్పిరి.
26. అతడు ఆ సంగతివిని “ఆ దైవభక్తుడు ప్రభువుమాట పాటింపడయ్యెను. దేవుడు అతనిని సింహము వాతపడవేసెను. ప్రభువు నుడివినట్లే సింహము అతనిని ముక్కలు ముక్కలుగా చీల్చి చంపివేసినది కాబోలు” అనెను.
27. అతడు వెంటనే కుమారులచేత గాడిదకు జీను కట్టించెను.
28. దానిపై ఎక్కిపోయి త్రోవలో పడియున్న శవమును దాని ప్రక్కనే నిలిచియున్న గాడిదను, సింహమును చూచెను. సింహము శవ మును తినలేదు. గాడిదను అంటుకోలేదు.
29. ప్రవక్త దైవభక్తుని ప్రేతమును గాడిదపై నిడుకొని ఇంటికి కొనివచ్చెను. అతడు భక్తునికొరకు శోకించి శవమును పూడ్చి పెట్టుదుననుకొనెను.
30. ప్రవక్త తన కుటుంబ సమాధిలోనే భక్తుని శవమును పూడ్చిపెట్టెను. అతడు, అతని కుమారులు “హా సోదరా! హా సోదరా!”అనుచు భక్తునికొరకు పెద్దగా విలపించిరి.
31. అతనిని ఖననము చేసిన తరువాత ప్రవక్త తన కుమారులతో “నేను చనిపోయిన తరువాత నన్నుకూడ ఈ సమాధిలోనే పూడ్చి పెట్టుడు. నా ఎముకలను అతని అస్థికల ప్రక్కనే ఉండనిండు.
32. దేవుని ఆనతిపై బేతేలు బలిపీఠమును సమరియా మండలములోని పూజామందిరములను నిరసించుచు ఇతడు పలికిన పలుకులన్నియు నెరవేరి తీరును” అని చెప్పెను.
33. ఈ సంగతి జరిగిన తరువాత కూడ యరోబాము తన పాడుపనిని మానుకోలేదు. అతడు తాను కట్టించిన పూజామందిరములకు సాధారణ కుటుంబములనుండియే యాజకులను నియమించుచు వచ్చెను.
34. ఈ దుష్కార్యమువలన పాపము సోకి అతని రాజవంశము మొదలంట నాశనమయ్యెను.
1. యరోబాము కుమారుడైన అబీయాకు జబ్బుచేసెను.
2. యరోబాము తన భార్యతో “నీవు రాణివని గుర్తుపట్టని విధముగా మారువేషము వేసికొని షిలో నగరమునకు పొమ్ము. నేను రాజునగుదునని ముందుగనే ఎరిగించిన అహీయా ప్రవక్త అచట నివసించుచున్నాడు.
3. అతనికి పది రొట్టెలు, అప్ప ములు, దుత్తెడు తేనె కొనిపొమ్ము. మన బిడ్డకేమి సంభ వించునో అతడు నీకు తెలియజెప్పును” అనెను.
4. ఆ విధముగనే యరోబాము భార్య మారువేషము వేసుకొని నగరమునకుపోయి అహీయా ఇల్లు చేరుకొనెను. అహీయాకు పెద్దప్రాయము వచ్చినందున దృష్టి మందగించియుండెను.
5. "యరోబాము భార్య మారువేషములో మరియొక స్త్రీవలె నటించుచు జబ్బుగా ఉన్న బిడ్డకు ఏమిసంభవించునో విచారించుటకై నీ వద్దకు వచ్చుచున్నది” అని ప్రభువు ముందుగనే అహీయాకు తెలియజేసెను. ప్రవక్త ఆమెతో ఏమి చెప్పవలయునోకూడ ముందుగనే తెలిపెను.
6. కనుక రాణి తనింటికి రాగానే అహీయా ఆమె అడుగుల చప్పుడు విని “అమ్మా! లోనికి రమ్ము. నీవు యరోబాము భార్యవని నేనెరుగుదును. నీవు మరొక స్త్రీ వలె నటింపనేల? నేను నీకు దుఃఖకరమైన వార్త విన్పింపవలెను.
7. యరోబామునకు నీవు ప్రభువు పలుకులు ఇట్లు విన్పింపవలెను 'నేను సామాన్య జనులనుండి నిన్నెన్నుకొని నా ప్రజలైన యిస్రాయేలీయులకు రాజును చేసితిని.
8. దావీదువంశీయుల నుండి రాజ్యమును గైకొని నీ వశము చేసితిని. అయినను నీవు నా ఆజ్ఞలను పాటించుచు పూర్ణహృదయముతో నన్ను సేవించి, నాకు ప్రీతికరమైన కార్యములు చేసిన దావీదు చేసినట్లు చేయక,
9. నీ పూర్వరాజులకంటెను అధికముగా దుష్కార్యములు చేసితివి. నన్ను లెక్కచేయవైతివి. రాతి బొమ్మలను, పోతబొమ్మలను పూజించి నాకు కోపమును రెచ్చగొట్టితివి.
10. కనుక నేను నీ ఇంటివారిని మొదలంట నిర్మూలించెదను. పెద్దలు పిన్నలు అనక నీ కుటుంబమునకు చెందిన మగవారినందరిని మట్టుపెట్టెదను. వేయేల? నీసంతతి వారినందరిని కసవూడ్చినట్లు ఊడ్చివైచెదను.
11. నీ కుటుంబీకులెవరైన పట్టణమున చచ్చినచో వారిని కుక్కలు పీకుకొనితినును. పొలమున చచ్చినచో వారిని రాబందులు పొడిచితినును. ఇది ప్రభుడనైన నా పలుకు'.
12. అమ్మా! నీవిక మీ ఇంటికి వెడలిపొమ్ము . నీవు పట్టణము చేరగానే బిడ్డడు చనిపోవును.
13. బిడ్డ మృతికిగాను యిస్రాయేలీయులు శోకించి అతనిని పాతి పెట్టుదురు. యరోబాము కుటుంబమున గౌరవప్రదముగా భూస్థాపనము జరుగునది ఈ బిడ్డనికి ఒక్కనికే. అతని కుటుంబమంతటిలోను యిస్రాయేలు దేవుడైన ప్రభువునకు ప్రీతిపాత్రుడైనవాడు ఇతడొక్కడే.
14. ప్రభువు యిస్రాయేలీయులకు ఇంకొక రాజును నియమించును. అతడు యరోబాము వంశమును తుదముట్టించును.
15. ప్రభువు యిస్రాయేలీయులను శిక్షించును. వారు ఏటిలోని రెల్లువలె భయముతో కంపించిపోదురు. ప్రభువు పితరులకిచ్చిన ఈ బంగారు నేలమీదినుండి యిస్రాయేలీయులను కూకటి వ్రేళ్లతో పెకిలించివేయును. వారిని యూఫ్రటీసు నదికి ఆవలివైపున చెల్లాచెదరుచేయును. ఆ ప్రజలు అషేరా దేవతను పూజించి ప్రభు కోపమును రెచ్చగొట్టిరి.
16. యరోబాము తాను పాపము చేసినది చాలక యిస్రాయేలీయుల చేతను పాపముచేయించెను గనుక ప్రభువు వారిని చేయివిడిచెను" అనెను.
17. అంతట యరోబాము భార్య తీర్సా పట్టణమునకు వెడలి పోయెను. ఆమె తన ఇంట అడుగిడుచుండగనే బిడ్డ చనిపోయెను.
18. ప్రభువు తన సేవకుడైన అహీయా ప్రవక్త ముఖమున నుడివినట్లే యిస్రాయేలీయులు ఆ బిడ్డ మృతికి శోకించి అతనిని పాతి పెట్టిరి.
19. యరోబాము జీవితమునందలి ఇతరాంశములు, అతడు చేసిన యుద్ధములు, పరిపాలించినతీరు, యిస్రాయేలు రాజులచరిత్రలో లిఖింపబడియే యున్నవి.
20. యరోబాము ఇరువది రెండేండ్లు పరిపాలించెను. అతడు తన పితరులతో నిద్రించగా అతని తరువాత అతని కుమారుడు నాదాబు రాజయ్యెను.
21. యూదామండలమున సొలోమోను కుమా రుడు రెహబాము రాజ్యము చేసెను. రాజగునప్పటికి అతని వయస్సు నలుబది ఒకటేండ్లు. అతడు యెరూషలేము నుండి పదిహేడేండ్లు పరిపాలించెను. యిస్రాయేలు దేశమంతటినుండి ప్రభువు తన నామమును నివాసస్థానముగా ఎన్నుకొనిన నగరమిది. రెహబాము తల్లి అమ్మోనీయురాలగు నామా.
22. యూదీయులు తమ పితరులకంటె అధికముగా దుష్కార్యములు చేసి ప్రభువు కోపమును రెచ్చగొట్టిరి.
23. వారు ఉన్నతస్థలములపై బలిపీఠములను నిర్మించిరి. కొండలమీదను, వృక్షముల క్రిందను రాతి స్థంభములను, కొయ్య స్తంభములను పాతి వానికి పూజలు చేసిరి.
24. వేశ్యలవలె ప్రవర్తించు పురుషులు నాడు ఆ దేశముననుండిరి. యిస్రాయేలీయులు ఆ భూమిని ఆక్రమించుకొనినపుడు ప్రభవు అచటినుండి తరిమి వేసిన అన్యజాతిజనులు చేయు పాపకార్యములెల్ల యూదీయులును చేసిరి.
25. రెహబాము పరిపాలనాకాలము అయిదవ ఏట ఐగుప్తు రాజగు షీషకు యెరూషలేము మీదికి దండెత్తివచ్చెను.
26. అతడు దేవాలయమునుండియు రాజప్రాసాదము నుండియు ద్రవ్యమెల్ల దోచుకొని పోయెను. సొలోమోను చేయించిన బంగారుగాలులను గూడ కొల్లగొట్టెను.
27. వానికి మారుగా రెహబాము ఇత్తడి డాలులను చేయించి వానిని రాజప్రాసాద ద్వారమునకు కాపుండు బంటుల అధీనమునుంచెను.
28. యావే మందిరమునకు రాజు పోయినపుడెల, వారు ఆ ఇత్తడి డాలులను మోసికొని పోయెడివారు. తరువాత వానిని యథాస్థానమునకు చేర్చెడివారు.
29. రెహబాము జీవితమునందలి ఇతరాంశములు, అతడు చేసిన పనులు యూదా రాజుల చరిత్రలో లిఖింపబడియేయున్నవి.
30. రెహబాము, యరోబాము బ్రతికియున్నన్నినాళ్లు ఇరువురును ఒకరితో ఒకరు పోరాడుకొనుచునే యుండిరి.
31. రెహబాము తన పితరులతో కూడ నిద్రించి దావీదుపురమందున్న తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతని తల్లి అమ్మోనీయురాలగు నామా. అతని తరువాత అతని కుమారుడు అబీయాము రాజయ్యెను.
1. యిస్రాయేలు మండలమున యరోబాము పరిపాలనకాలము పదునెనిమిదవ యేట అబీయాము యూదా మండలమునకు రాజయ్యెను.
2. అతడు యెరూషలేమున మూడేండ్లు పరిపాలించెను. అతని తల్లి అబ్షాలోము కుమార్తె మాకా.
3. అబీయాము తన తండ్రివలె దుష్కార్యములు చేసెను. దావీదు హృదయ మువలె అతని హృదయము ప్రభువు మీద లగ్నము కాదయ్యెను.
4. అయినను దావీదు ముఖముచూచి ప్రభువు అతనికొక కుమారుని ప్రసాదించెను. ఆ కుమారుడు అబీయాము తరువాత యెరూషలేము నుండి పరిపాలనచేసి ఆ నగరమును సుస్థిరము చేయవలయునని ప్రభువు తలంచెను.
5. దావీదు హిత్తీయుడైన ఊరియా విషయమున తప్ప యావే దృష్టికి నీతి యుక్తముగా ప్రవర్తించి అతని ఆజ్ఞలను పాటించెను గనుక ప్రభువట్లు చేసెను.
6. అబీయాము రాజ్యము చేసినంతకాలము అతనికిని, యరోబామునకును బద్దవైరముగా నుండెడిది.
7. అబీయాము జీవితములోని ఇతర అంశములన్నియు యూదా రాజుల చరిత్రలో లిఖింపబడియేయున్నవి.
8. అంతట అబీయాము తన పితరులతో నిద్రించగ అతనిని దావీదు నగరముననే పాతి పెట్టిరి. అతని తరువాత అతని కుమారుడు ఆసా రాజయ్యెను.
9. యిస్రాయేలు దేశమున యరోబాము పరిపాలనకాలము ఇరువదియవయేట యూదా రాజ్య మున ఆసా రాజయ్యెను.
10. అతడు యెరూషలేము నుండి నలువదియేండ్లు పరిపాలించెను. అతని పితా మహి అబ్షాలోము కుమార్తెయైన మాకా.
11. ఆసా తన పితరుడైన దావీదువలె యావే దృష్టిలో నీతియుక్తముగా జీవించెను.
12. మరియు అతడు వేశ్యలవలె ప్రవర్తించు మగవారినందరిని తన రాజ్యమునుండి బహిష్కరించెను. తన పూర్వులు నెలకొల్పిన విగ్రహములను నాశనము చేసెను.
13. అతడు తన పితా మహి మాకా అషేరా దేవతకొక విగ్రహమును నెలకొల్పగా ఆమెను రాజమాత పదవినుండి తొలగించెను. ఆ విగ్రహమును ముక్కలు చేసి కీద్రోను నది ఒడ్డున కాల్చివేసెను.
14. ఆసా ఉన్నత స్థలములను నిర్మూలింపకున్నను అతని హృదయము మాత్రము పూర్తిగా యావేమీదనే లగ్నమయ్యెను.
15. అతడు తన తండ్రియును, తానును ప్రభువునకు అర్పించిన వెండి బంగారములను, ఇతర పరికరములను కొని వచ్చి దేవాలయమునకు ఒప్పగించెను.
16. ఆసారాజును, యిస్రాయేలు మండలము నేలిన బాషారాజును జీవితకాలమంతయు పోరాడు కొనుచునే ఉండిరి.
17. బాషా యూదా వారికి విరోధియై యుండి, యూదా నుండి ఎవరు రాకుండగను, తన రాజ్యములోని వారెవ్వరును ఆసాయొద్దకు పోకుండగను రామా పట్టణమును ప్రాకారములతో సురక్షితము చేసెను. దానితో యూదా మండలమునకు రాకపోకలకు ఆటంకము కలిగెను.
18. కనుక ఆసా, రాజభవనమునను, దేవాలయమునను మిగిలియున్న వెండి బంగారములను చేకొని సేవకులద్వారా సిరియా రాజగు బెన్హ్-దదునకు కానుకగా పంపించెను. ఈ రాజు తబ్రిమ్మోను కుమారుడు, హెస్యోనునకు మనుమడు.
19. ఆసా “మన తండ్రులవలె మనమును స్నేహితులముగానుందము. నేను నీకు వెండి బంగారములను కానుకగా పంపితిని. ఇకమీదట నీవు యిస్రాయేలు రాజైన బాషాతో పొత్తు విడువుము. అతడు నా రాజ్యమునుండి తన సైన్యమును మరలించుకొనిపోవలయును” అని బెన్హ్-దదునకు వర్తమానమంపెను.
20. బెన్హదదు ఆసాతో సంధిచేసికొని యిస్రాయేలు పట్టణముల మీదికి సైన్యాధిపతులను పంపెను. వారు ఇయ్యోను, దాను, ఆబేల్బెత్మాకా పట్టణములను, కిన్నెరెతు, నఫ్తాలి మండలములను వశము చేసికొనిరి.
21. ఈ ఉదంతము విని బాషా రామా పట్టణమును సురక్షితము చేయుట మానివేసి తీర్సా నగరమునకు వెడలిపోయెను.
22. అపుడు ఆసా యూదా మండలములోని ప్రజలనెల్ల పిలిపించి రామా నగరమును సురక్షితము చేయుటకై బాషా కొనివచ్చిన రాళ్ళను, కలపను మోయించుకొనివచ్చెను. ఆ సామగ్రితో అతడు బెన్యామీను మండలములోని గెబా, మిస్పా నగరములను సురక్షితము చేసెను.
23. ఆసా జీవితములోని ఇతరాంశములు, అతడు చూపిన పరాక్రమము, అతడు చేసిన పనులు, కట్టించిన పట్టణములు, యూదా రాజుల చరిత్రలో లిఖింపబడియేయున్నవి. ఆసా రాజు ముసలితనమున పాదములలో జబ్బుతో బాధపడెను.
24. అంతట ఆసా తన పితరులతో నిద్రించి, తన పిత రుడైన దావీదు నగరముననే పాతిపెట్టబడెను. అతని తరువాత అతని కుమారుడు యెహోషాఫాత్తు రాజయ్యెను.
25. ఆసారాజు యూదా రాజ్యమును పరిపాలించిన కాలము రెండవయేట మరోబాము కుమా రుడైన నాదాబు యిస్రాయేలు రాష్ట్రమునకు రాజై రెండేండ్లు పరిపాలించెను.
26. అతడు తన తండ్రి వలె యావే ఇష్టపడని దుష్కార్యములు చేసెను. ప్రజలనుకూడ పాపమునకు పురికొల్పెను.
27. యిస్సాఖారు తెగకు చెందిన అహియా పుత్రుడైన బాషా నాదాబుమీద కుట్రపన్నెను. నాదాబు తన సైన్యముతో ఫిలిస్తీయాలోని గిబ్బెతోను నగరమును ముట్టడించు చుండగా బాషా అతనిని చంపివేసెను.
28. ఆసా యూదా రాజ్యమును పరిపాలించిన కాలము మూడవ యేట ఈ సంఘటన జరిగెను. ఆ రీతిగా నాదాబును చంపి బాషా యిస్రాయేలు రాజ్యమునకు రాజయ్యెను.
29. రాజయిన వెంటనే బాషా యరోబాము వంశీయులనందరిని మట్టుపెట్టెను. ప్రభువు షిలో ప్రవక్తయైన అహీయా ద్వారా సెలవిచ్చినట్లే యరోబాము వంశమున ఒక్క పురుగుకూడ మిగులకుండ అందరు చచ్చిరి.
30. యరోబాము దుష్కార్యములు చేసి యిస్రాయేలీయులను కూడ పాపమునకు పురికొల్పి ప్రభుకోపమును రెచ్చగొట్టెను గనుక అతని వంశము మొదలంట నాశనమయ్యెను.
31. నాదాబు జీవితము లోని ఇతరాంశములు అతడుచేసిన పనులు, యిస్రాయేలు రాజులచరిత్రలో లిఖింపబడియేయున్నవి.
32. యూదా రాజగు ఆసా, యిస్రాయేలు రాజగు బాషా జీవితకాలమంతయు పోరాడుకొనుచునే యుండిరి.
33. ఆసా యూదా రాజ్యమున పరిపాలించిన కాలము మూడవయేట అహీయా కుమారుడగు బాషా యిస్రాయేలు రాజ్యమునకు రాజయ్యెను. అతడు తీర్సా పట్టణమునుండి ఇరువది నాలుగేండ్లు పరిపాలించెను.
34. యరోబామువలె అతడును యావే ఇష్టపడని దుష్కార్యములు చేసెను. ప్రజలను కూడ పాపమునకు పురికొల్పెను.
1. ప్రభువు హనానీ కుమారుడైన యెహూకు ప్రత్యక్షమై బాషాను గూర్చి ఈలాగు సెలవిచ్చెను.
2. “నేను నిన్ను దీనదశనుండి పైకి తీసికొనివచ్చి నా ప్రజలకు రాజుగా నియమించితిని. అయినను నీవు యరోబామువలె దుష్కార్యములుచేసి ప్రజలచే కూడ పాపము చేయించితివి. ప్రజలపాపములు నా కోపమును రెచ్చగొట్టినవి.
3. కనుక యరోబాము వంశమునువలె నిన్నును, నీ వంశమును నామరూపములు లేకుండా చేసెదను.
4. నీ కుటుంబీకులెవరైన పట్టణమున చచ్చినచో వారిని కుక్కలు పీకుకొనితినును. పొలమున చచ్చినచో వారిని రాబందులు పొడిచి తినును.”
5. బాషా చరిత్రలోని ఇతరాంశములు, అతని సాహసకృత్యములు యిస్రాయేలు రాజుల చరిత్రలో లిఖింపబడియే ఉన్నవి.
6. బాషా తన పితరులతో నిద్రించి తీర్సాలో సమాధిచేయబడెను. అతని తరు వాత అతని కుమారుడు ఏలా రాజయ్యెను.
7. ప్రభువు బాషాకును, అతని వంశమునకును ముప్పుదెచ్చుటకై యెహూ ప్రవక్తద్వారా తన సందేశమును వినిపించెను. బాషా దుష్కార్యములు చేసెను గదా! అతడు యరోబామువలె దుష్కార్యములుచేసి ప్రభువు కోపమును రెచ్చగొట్టుట మాత్రమేగాదు, యరోబాము కుటుంబమును కూడ నాశనము చేసెను.
8. యూదా రాజ్యమున ఆసా రాజు పరిపాలన కాలము ఇరువదియారవయేట యిస్రాయేలు రాజ్యమున బాషా కుమారుడు ఏలా రాజయ్యెను. అతడు తీర్సా నుండి రెండేండ్లు పరిపాలించెను.
9. అంతట రాజు రథబలమునందు అర్ధభాగమునకు అధిపతిగా నున్న సైనికోద్యోగి సిమ్రీ అనువాడు రాజైన ఏలాపై కుట్రపన్నెను. ఒకనాడు రాజు తీర్సా పట్టణమున రాజప్రాసాద సంరక్షకుడైన ఆర్సా ఇంట తప్పత్రాగి ఉండెను.
10. సిమ్రీ ఆర్సా ఇల్లుజొచ్చి రాజును హత్య చేసి తాను రాజయ్యెను. యూదా రాజ్యమున ఆసా పరిపాలనకాలము ఇరువది ఏడవయేట ఈ సంఘటనము జరిగెను.
11. సిమ్రీ రాజయి సింహాసనము ఎక్కినదే తడవుగా బాషా కుటుంబము వారినందరిని వధించెను. బాషా బంధువులలో మగవారును, అతని మిత్రులందరును చచ్చిరి.
12. ప్రభువు బాషాకు ముప్పుదెత్తునని ప్రవక్త యెహూ ముఖమున పలికినట్లే సిమ్రీ అతని వంశమునంతటిని హతమార్చెను.
13. బాషా మరియు అతని కుమారుడు ఏలా కూడా విగ్రహములను పూజించి, ప్రజలచే పాపము చేయించి యిస్రాయేలుదేవుడైన యావే కోపమును రెచ్చగొట్టిరి.
14. ఏలా జీవితములోని ఇతరాంశములు, అతడు చేసిన పనులు యిస్రాయేలు రాజులచరిత్రలో లిఖింపబడియే ఉన్నవి.
15. యూదారాజ్యమున ఆసా పరిపాలనకాలము ఇరువది ఏడవయేట యిస్రాయేలు రాష్ట్రమున సిమ్రీ రాజై తీర్సా పట్టణమునుండి ఏడుదినములు పరిపాలించెను. అప్పుడు యిస్రాయేలు సైన్యములు ఫిలిస్తీయా లోని గిబ్బెతోను నగరమును ముట్టడించుచుండెను.
16. సిమ్రీ కుట్రపన్ని రాజును వధించెనని విని సైనికులు తమ సైన్యాధిపతియైన ఒమ్రీని నాడే శిబిరమున రాజుగా ప్రకటించిరి.
17. ఒమ్రీ గిబ్బెతోను నుండి సైన్యముతో వెడలివచ్చి తీర్సా పట్టణమును ముట్టడించెను.
18. పట్టణము ఒమ్రీ వశముకాగానే సిమ్రీ రాజప్రాసాదము అంతర్భాగమునందలి రక్షణ గృహమునకు పారిపోయి రాజగృహమునకు నిప్పు అంటించెను. తానును ఆ మంటలలోనే ప్రాణము కోల్పోయెను.
19. సిమ్రీగూడ యరోబామువలె యావే ఒల్లని దుష్కార్యములుచేసి ప్రజలచేతకూడ పాపము చేయించెను. కనుక అతనికి ఈ రీతిగా శాస్తి జరిగెను.
20. సిమ్రి జీవితములోని ఇతరాంశములు, అతడు పన్నిన కుట్రలు యిస్రాయేలు రాజుల చరిత్రమున లిఖింపబడియే ఉన్నవి.
21. అంతట యిస్రాయేలు ప్రజలు రెండు విభాగములయ్యెను. ఒక పక్షము వారు గీనతు కుమారుడైన తిబ్నీని రాజును చేయగోరిరి. మరియొక పక్షమువారు ఒమ్రీ ని రాజును చేయగోరిరి.
22. చివరకు ఒమ్రీ పక్షమువారిదే పైచేయి అయ్యెను. కనుక తిబ్నీ చంపబడగా ఒమ్రీ రాజయ్యెను.
23. యూదా రాజ్యమున ఆసారాజు పరిపాలనా కాలము ముప్పది యొకటవయేట యిస్రాయేలు రాజ్యమున ఒమ్రీ రాజై పండ్రెండేండ్లు పరిపాలించెను. తొలి ఆరేండ్లు అతడు తీర్సా నుండియే రాజ్యము చేసెను.
24. అటు తరువాత అతడు షెమెరు అను వానియొద్ద నుండి ఆరువేల వెండినాణెములకు షోమ్రోను కొండను కొనెను. దానిమీద ఒక నగరమును నిర్మించి దానికి షెమెరు జ్ఞాపకార్ధముగా సమరియా అని పేరు పెట్టెను.
25. ఒమ్రీ కూడ యావే ఒల్లని దుష్కార్యములు చేసెను. తన పూర్వులందరి కంటెను దుర్మార్గుడయ్యెను.
26. అతడు యరోబామువలె యావే సహింపని దుష్కార్యములు చేసెను. ప్రజలను కూడ విగ్రహారాధనకు పురికొల్పి ప్రభువు కోపమును రెచ్చ గొట్టెను.
27. ఒమ్రీ జీవితములోని ఇతరాంశములు, అతని సాహసకృత్యములు యిస్రాయేలు రాజుల చరిత్రలో లిఖింపబడియేయున్నవి.
28. ఒమ్రీ తన పితరులతో నిద్రించగా అతనిని సమరియాలోనే సమాధియందు పాతిపెట్టిరి. అతని తరువాత అతని కుమారుడు అహాబు రాజయ్యెను.
29. యూదా రాజ్యమున ఆసా రాజు పరిపాలనకాలము ముప్పది యెనిమిదవయేట ఒమ్రీ కుమారుడు అహాబు యిస్రాయేలు రాష్ట్రమునకు రాజయ్యెను. అతడు సమరియానుండి ఇరువది రెండేండ్లు పరి పాలించెను.
30. కాని అహాబు తన పూర్యులందరి కంటె కూడ అధికముగా యావే ఒల్లని దుష్కార్యములు చేసెను.
31. అతడు యరోబామువలె దుష్కార్యములు చేయుట చాలదన్నట్లు, నీదోను రాజగు ఎత్బాలు కుమార్తె యెసెబెలును వివాహమాడి బాలు దేవతను కొలిచెను.
32. ఆ రాజు సమరియాలో బాలుదేవరకొక దేవళమునుకట్టి బలిపీఠము నెలకొల్పెను.
33. పైగా అషేరా దేవతను పూజించుటకు ఒక కొయ్యస్తంభమునుకూడ నెలకొల్పెను. తన పూర్వులైన యిస్రాయేలు రాజులందరికంటె కూడ అధికముగా అహాబు యావే కోపమును రెచ్చగొట్టెను.
34. అహాబు కాలమున బేతేలు నివాసియైన హీయేలు యెరికో నగరమును పునర్నిర్మించెను. ప్రభువు నూను కుమారుడైన యెహోషువద్వారా సెలవిచ్చినట్లే హీయేలు యెరికోకు పునాదులెత్తినపుడు తన పెద్ద కొడుకు అబీరాము చనిపోయెను. నగరద్వారములు నిర్మించినపుడు కడగొట్టు కొడుకు సేగూబు చనిపోయెను.
1. గిలాదు మండలమునందలి తిష్బీ నగర వాసియైన ఏలీయా ప్రవక్త అహాబు రాజుతో “నేను యిస్రాయేలు దేవుడగు యావేను కొలుచు భక్తుడను, నా పలుకులు వినుము. యావే జీవముతోడు, నేను ఆజ్ఞాపించిననే తప్ప ఈ దేశమున కొంతకాలము పాటు వానకాని, మంచుకాని కురియదు” అనెను.
2-3. ప్రభువువాణి ఏలీయాతో “నీవు ఇచటి నుండి వెళ్ళి తూర్పుదిక్కుగా పోయి యోర్దానునకు తూర్పున నున్న కెరీతు వాగు వద్ద దాగుకొనుము.
4. నీవు ఆ వాగులో నీళ్ళు త్రాగుము. నా ఆజ్ఞ ప్రకారముగా కాకులు నీకు భోజనము కొనివచ్చును” అని చెప్పెను.
5. అతడు యావే చెప్పినట్లే చేసి యోర్దానునకు తూర్పుననున్న కెరీతు వాగువద్ద వసించెను.
6. ప్రతిదినము ఉదయ సాయంకాలములందు కాకులు అతనికి రొట్టెను, మాంసమును కొనివచ్చెను. అతడు యేటిలోని నీళ్ళు త్రాగుచుండెను.
7. కాని వానలు లేనందున కొంతకాలమైనపిదప ఆ యేరుకూడ ఎండి పోయెను.
8-9. ప్రభువువాణి ఏలీయాతో “నీవు సీదోను చెంతనున్న సారెఫతు ఊరికి వెళ్ళి అక్కడ నివసింపుము. అచట కాపురముండు ఒక విధవరాలిని నీకు భోజనము పెట్టవలసినదిగా ఆజ్ఞాపించితిని” అని చెప్పెను.
10. ఏలీయా అట్లే సారెఫతుకు వెళ్ళెను. అతడు నగర ద్వారమును చేరుకొనునప్పటికి అక్కడ ఒక విధవరాలు పొయ్యిలోనికి పుల్లలేరుకొనుచుండెను. ప్రవక్త ఆమెతో “అమ్మా! చెంబుతో కొంచెము నీళ్ళు తీసికొనిరమ్ము” అనెను.
11. ఆ విధవరాలు వెళ్ళబోవుచుండగా మరల అతడామెను పిలిచి “కొంచెము రొట్టెను కూడ తీసికొని రమ్ము" అని చెప్పెను.
12. ఆమె ఏలీయాతో “సజీవుడైన యావే తోడు. మా ఇంట తయారైన రొట్టె ఏమియు లేదు. కుండలో కొంచెము పిండి, పిడతలో కొంచెము నూనె మాత్రము ఉన్నవి. నేనిక్కడ రెండుమూడు పుల్ల లేరుకొనుటకు వచ్చితిని. ఆ గుప్పెడుపిండితో రొట్టె కాల్చుకొని నా కుమారుడు, నేను ఇప్పటికి తిందుము. ఆ మీదట ఆకటితో ప్రాణములు విడుతుము” అనెను.
13. ఏలీయా ఆమెతో "అమ్మా! నీవు విచారింపవలదు. నీవు చెప్పినట్లే పోయి రొట్టెకాల్చుకోవచ్చును. కాని మొదట మీ ఇంటనున్న పిండితో చిన్నిరొట్టెను చేసి నాకు పెట్టుము. అటుపిమ్మట నీకు నీ కుమారునికి రొట్టె కాల్చుకొమ్ము.
14. యిస్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లు సెలవిచ్చుచున్నాడు: “యావే నేలపై వాన కురిపించువరకు కుండలోని పిండిగాని, పిడతలోని నూనెగాని తరిగిపోవు” అనెను.
15. ఆ విధవరాలు ఏలీయా చెప్పినట్లే చేసెను. విధవరాలు, ఆమె కుమారుడు చాలనాళ్ళవరకు రొట్టె భుజించు చువచ్చిరి.
16. ప్రభువు ఏలీయాతో చెప్పినట్లే కుండలోని పిండిగాని, పిడతలోని నూనెగాని తరిగిపోలేదు.
17. తరువాత కొంతకాలమునకు ఆ విధవ పుత్రునకు జబ్బుచేసెను. ఆ వ్యాధి నానాటికి ప్రబలము కాగా బిడ్డడు చనిపోయెను.
18. ఆమె అతనితో “అయ్యా! నీవు దైవభక్తుడవై ఉండికూడ నాకు ఈ అపకారము చేసితివేమి? నీవు నా పాపములను దేవునికి జప్తికి తెచ్చి నా కుమారునికి చావు తెచ్చిపెట్టితివి గదా!” అని నిష్ఠుర వాక్యములు పలికెను.
19. ఏలీయా “అమ్మా! నీ కుమారుని నా చేతికి ఇమ్ము” అని బిడ్డను ఆమె రొమ్ము మీదినుండి తీసికొని ఇంటిమీద తాను వసించు గదిలోనికి మోసికొనిపోయి మంచముపై పరుండబెట్టెను.
20. అతడు “ప్రభూ! నేను ఈ విధవ రాలి ఇంట తలదాచుకొనుచున్నానుగదా! నీవు ఈ దీనురాలి పుత్రుని చంపి ఈమెను బాధపెట్టెదవా?” అని ప్రార్థించెను.
21. అంతట ప్రవక్త బాలుని మృత దేహముపై మూడుసారులు బోరగిలపరుండి “ఓ ప్రభూ! నా దేవా! ఈ బాలునికి ప్రాణము మరల వచ్చునుగాక!” అని ప్రార్ధించెను.
22. ప్రభువు ప్రవక్త మొరాలకించెను. బాలుని జీవము తిరిగిరాగా అతడు మరల బ్రతికెను.
23. ఏలీయా బాలుని మీదిగది నుండి క్రిందికి తీసికొని వచ్చి తల్లికి అప్పగించి “ఇదిగో! నీ కుమారునికి ప్రాణము వచ్చినది చూడుము” అనెను.
24. ఆమె అతనితో “నీవు దైవభక్తుడవని ఇపుడు గ్రహించితిని, నీ నోట దేవునిమాట పొల్లుపోదు” అనెను.
1. కరువు ప్రారంభమైన మూడవ యేట ప్రభువువాణి ఏలీయాతో “నీవు వెళ్ళి అహాబును కలిసికొనుము. నేను దేశమున వాన కురియింతును” అని చెప్పెను.
2. కనుక ఏలీయా అహాబును చూడబోయెను. ఆ రోజులలో సమరియా దేశమున కరువు దారుణముగా నుండెను.
3. అహాబు ఓబద్యాను పిలిపించెను. ఇతడు రాజభవంతి రక్షకుడు, యావేయందు భయభక్తులు గలవాడు.
4. యెసెబెలు రాణి యావే ప్రవక్తలను చంపించుచుండగా, ఈ ఓబద్యా నూరు గురు ప్రవక్తలను, ఏబదిమంది ఏబదిమంది చొప్పున, కొండగుహలలో దాచియుంచి వారిని అన్నపానీయములతో పోషించుచువచ్చెను.
5. రాజు ఓబద్యాతో “మన దేశమునగల చెలమలను, వాగులను పరిశీలించి వచ్చెదము రమ్ము. మన గుఱ్ఱములకు, గాడిదలకు గడ్డి చాలినంత దొరకునో లేదో తెలిసికొందము. మేతచాలదేని మన పశువులను కొన్నిటిని పోగొట్టు కొనవలసియుండును” అనెను.
6. వారిరువురు దేశమును. చెరియొక భాగముచొప్పున పంచుకొని ఎవరి భాగమును వారు పరిశీలింపబోయిరి.
7. మార్గమున ఏలీయా ఓబద్యాను కలిసికొనెను. ఓబద్యా ప్రవక్తను గుర్తుపట్టి నమస్కారముచేసి “నీవు ఏలీయావే గదా!" అని అడిగెను.
8. ప్రవక్త అతనితో “అవును, నేను ఏలీయానే. నీవు వెళ్ళి మీ రాజుకు నా సమాచారము తెల్పుము” అనెను.
9. ఓబద్యా అతనితో “అహాబు కోపమునకు గురియై నేను ప్రాణములు కోల్పోవలసి వచ్చును. అంతటి అపరాధమును నేనేమి చేసితిని?
10. సజీవుడైన యావే తోడు. రాజు నీ కొరకు ప్రతి దేశమును వెదకించెను. ఏ దేశీయులైన నీవు కన్పింపలేదని చెప్పగా ఆ మాట నిజమోకాదో అని రాజు వారిచే ప్రమాణముకూడ చేయించెడివాడు.
11. ఇపుడు నేను వెళ్ళి రాజునకు నీ సమాచారము ఎరిగింపవలెనా?
12. నేను వెళ్ళగనే దేవుని ఆత్మ నిన్నెక్కడికో కొనిపోవును. నేనుపోయి అహాబుతో నీవిక్కడ ఉన్నావని చెప్పగా, అటుపిమ్మట నీవిక్కడ కన్పింపక పోగా, అతడు నన్ను తప్పక చంపివేయును. నేను చిన్ననాటినుండి ప్రభువునే సేవించితినిగదా!
13. యెసెబెలు ప్రభువు ప్రవక్తలను చంపించుచుండగా నేను నూరుగురు ప్రవక్తలను ఏబదిమంది ఏబది మంది చొప్పున కొండగుహలలో దాచియుంచి అన్నపానీయములతో పోషించితినని నీవెరుగుదువు.
14. మరి ఇప్పుడు నీ నోటితో 'నీవు వెళ్ళి అహాబునకు నా సమాచారము ఎరిగింపుము' అని పలుకుదువా? అతడు నన్ను తప్పక చంపితీరును” అని అనెను.
15. ఏలీయా అతనితో “యిస్రాయేలు దేవుడైన యావే సన్నిధిని నేను నిలబడుచున్నాను. మహోన్నతుడైన యావే జీవముతోడు. ఈ దినము నేనే వెళ్ళి స్వయముగా రాజునకు కన్పింతును” అనెను.
16. ఓబద్యా అహాబును కలసికొని ఏలీయా ఉదంతమును ఎరిగించెను. రాజు ఏలీయాను చూడ బోయెను.
17. ఏలీయా తన కంటబడగనే అహాబు “యిస్రాయేలు దేశమునకు నీ పీడపట్టినది” అనెను.
18. కాని ఏలీయా (ప్రవక్త) అతనితో “యిస్రాయేలును పట్టి పీడించునది నీవును, నీ కుటుంబమేగాని నేను గాదు. నీవు దేవుని ఆజ్ఞ మీరి బాలుదేవతను కొలుచు చుంటివిగదా?
19. ఇక వినుము. యిస్రాయేలీయుల అందరిని కర్మెలు కొండమీద నన్ను కలిసికొమ్మని చెప్పుము. యెసెబెలు రాణి పోషించు బాలు ప్రవక్తలు నాలుగువందలఏబదిమందిని, అషేరా ప్రవక్తలు 'నాలుగువందలమందిని ఆ చోటికి తోడ్కొనిరమ్ము" అని పలికెను.
20. అహాబు యిస్రాయేలీయులందరిని, బాలు ప్రవక్తలను కర్మెలు కొండమీద ప్రోగుజేసెను.
21. అప్పుడు ఏలీయా ముందుకు వచ్చి “ఎన్నాళ్ళని మీరు ఇద్దరు దైవములను పూజింతురు? యావే దేవుడేని అతనిని పూజింపుడు. బాలు దేవుడేని అతనిని పూజింపుడు” అని పలికెను. కాని ప్రజలొక్క పలుకైన పలుకరైరి.
22. ఏలీయా మరల “ప్రభువు ప్రవక్తలలో మిగిలియున్నవాడను నేనొక్కడనే. కాని బాలు ప్రవక్తలు నాలుగువందలయేబది మంది ఉన్నారు.
23. మాకు రెండెడుల నిప్పింపుడు. వారినొక ఎద్దును తీసికొమ్మనుడు. వారు దానిని చంపి ముక్కలు ముక్కలుగా కోసి కట్టెలమీద పేర్చవలెను. నిప్పుమాత్రము అంటింపరాదు. నేను తీసికొన్న రెండవ ఎద్దునుకూడ అట్లే కట్టెలమీద పేర్చెదను గాని నిప్పంటింపను.
24. పిమ్మట బాలు ప్రవక్తలు వారి దేవుని ప్రార్థింతురు. నేను యావేను ప్రార్థింతును. ఆ ప్రార్ధనకు నిప్పు పంపించువాడెవడో అతడే మన దేవుడు” అనెను. ఆ సవాలుకు ప్రజలందరు సరియే అనిరి.
25. ఏలీయా బాలు ప్రవక్తలతో “మీరు చాలమందియున్నారు. కనుక మొదట మీ ఎద్దును కోసి కట్టెలపై పేర్పుడు. మీ దేవతను ప్రార్థింపుడు. నిప్పు మాత్రము అంటింపకుడు” అని పలికెను.
26. వారట్లే తమ ఎద్దును కోసి కట్టెలపై పేర్చి ప్రొద్దుటినుండి మధ్యాహ్నము వరకు బాలు దేవత పేర ప్రార్థనచేసిరి. “బాలూ! మా మొర వినుము" అని అరచిరి. తాము నిర్మించిన బలిపీఠము చుట్టు తిరిగి చిందులు తొక్కిరి. అయినను వారి దేవత పలుకలేదు.
27. మధ్యాహ్నమైన పిమ్మట ఏలీయా వారిని వేళాకోళము చేయుచు “మీరు కొలుచు బాలు దేవుడిని పెద్దగా పిలువుడు. పాపము! అతడేదో ఆలోచనలో పడియుండవచ్చును. లేదా ఏదో పనిలో మునిగి ఉండవచ్చును. ఒకవేళ ఎక్కడికైన ప్రయాణము కట్టి యుండవచ్చును లేదా నిద్రించుచుండవచ్చును. ఇప్పుడు మీ పలుకులు ఆలకించి మేల్కొనునులే!” అనెను.
28. ఆ మాటలువిని బాలు ప్రవక్తలింకను పెద్దగా కేకలువేయుచూ, తమ ఆచారముచొప్పున నెత్తురు కారువరకు కత్తులతో, బాకులతో శరీరము కోసికొనిరి.
29. మధ్యాహ్నము దాటిపోయెను. సాయంకాల నైవేద్యమర్పించు సమయమువరకు వారు ఆవేశముతో మంత్రములు వల్లించిరి. అయినను వారి దేవత పలుకలేదు. జవాబీయలేదు.
30. అంతట ఏలీయా ప్రజలను తన దగ్గరకు రమ్మని పిలువగా వారందరు అతని దగ్గరకు వచ్చిరి. అతడు పడిపోయియున్న యావే బలిపీఠమును మరమ్మతు చేయించెను.
31. యాకోబు కుమారులు పండ్రెండుమంది తెగనాయకుల పేరు మీదిగా పండ్రెండు రాళ్ళను ప్రోగుజేసికొనెను. ఈ యాకోబునకే ప్రభువు యిస్రాయేలని పేరు పెట్టెను.
32. ప్రభువు నామమున ఒక బలిపీఠమును నిర్మించి, దానిచుట్టు రెండుకడవల నీళ్ళుపట్టు కందకము త్రవ్వించెను.
33. అటుపిమ్మట బలిపీఠముమీద కట్టెలుపరచి వానిమీద ముక్కలు ముక్కలుగా కోసిన ఎద్దు కండతుండెములను పేర్చెను.
34. అటుతరువాత నాలుగు కడవల నీళ్ళు తెచ్చి కట్టెలమీదను, మాంసపుముక్కల మీదను కుమ్మరింపుడని ప్రజలనాజ్ఞాపించెను. వారట్లే చేసిరి. ఏలీయా రెండవసారి మూడవసారికూడ ప్రజలచే అట్లే నీళ్ళు పోయించెను.
35. నీళ్ళు బలిపీఠము మీది నుండి ధారలుగా కారి ప్రక్కనున్న కందకమును నింపెను.
36. సాయంకాల నైవేద్యము అర్పించు సమయమున ఏలీయా బలిపీఠమును సమీపించి “అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవుడవైన ప్రభూ! నీవు యిస్రాయేలు దేవుడవనియు, నీ భక్తుడనైన నేను నీ ఆజ్ఞపైననే ఈ పనులన్నిటిని చేసితిననియు ఇప్పుడు వెల్లడి చేయుము.
37. ప్రభూ! నా మొరాలింపుము. నీవే దేవుడవు అనియు, వీరిని మరల తిరిగి నీ చెంతకు రాబట్టుకొంటివనియు వీరి ఎదుట ఋజువు చేయుము” అని ప్రార్థించెను.
38. అప్పుడు ప్రభువు పంపిన అగ్ని బలిపీఠము పైకి దిగివచ్చి పీఠమును, కట్టెలను, కందకములోని నీటిని దహించెను.
39. ఆ అగ్నిని చూచి ప్రజలందరు నేలమీద బోరగిలపడి దండము పెట్టి “యావేయే దేవుడు. యావే ఒక్కడే దేవుడు” అని పలికిరి.
40. ఏలీయా “బాలు ప్రవక్తలను పట్టుకొనుడు. ఎవరిని తప్పించుకొని పోనీయకుడు” అనెను. ప్రజలు ఆ ప్రవక్తలను పట్టుకొనగా ఏలీయా వారినందరిని కీషోను వాగువద్దకు నడిపించుకొనిపోయి అక్కడ వధించెను.
41. ఏలీయా అహాబుతో “నీవు వెళ్ళి అన్నపానీయములు పుచ్చుకొనుము. నాకు వర్షధ్వని వినిపించుచున్నది” అనెను.
42. అహాబు భోజనము చేయబోగా ఏలీయా కర్మెలు కొండమీదికి ఎక్కిపోయెను. అక్కడ అతడు క్రిందికి వంగి తన తలను రెండు మోకాళ్ళమధ్య పెట్టుకొనెను.
43. తరువాత సేవకునితో “నీవు వెళ్ళి సముద్రమువైపు పారజూడుము” అని చెప్పెను. సేవకుడు వెళ్ళి తిరిగివచ్చి నాకేమియు కనిపింపలేదని పలికెను. ఏలీయా అతనిని ఏడు పర్యాయములు అట్లే పంపెను.
44. కాని సేవకుడు ఏడవసారి తిరిగివచ్చి “సముద్రము మీదినుండి మూరెడంత మబ్బు పైకి లేచుచున్నది” అని చెప్పెను. ఏలీయా అతనితో “నీవు పోయి వాన అడ్డము రాకమునుపే రథమునెక్కి ఇంటికి వెళ్ళిపోవలసినదని అహాబుతో చెప్పుము” అనెను.
45. వెంటనే ఆకాశమున కారుమబ్బులు క్రమ్మి గాలి వీచెను. పెద్దవాన కురిసెను. అహాబు రథమునెక్కి యెఫ్రాయేలునకు వెళ్ళిపోయెను.
46. అప్పుడు యావే హస్తము ఏలీయాను కదలింపగా అతడు నడుము బిగించుకొని అహాబు రథమునకంటె ముందుగా ఉరికి యెస్రెయేలు ప్రాకారమును చేరుకొనెను.
1. ఏలీయా ఉదంతము, అతడు ప్రవక్తలను చంపించిన తీరు అహాబు యెసెబెలునకు ఎరిగించెను.
2. ఆమె ప్రవక్తవద్దకు దూతనంపి “నీవు మా ప్రవక్తలను వధించినట్లే రేపీపాటికి నేను నిన్ను వధింపనేని దేవతలు నా ప్రాణములనే బలిగొందురుగాక!” అని వార్త పంపించెను.
3. ఏలీయా రాణి మాటలకు భయపడి ప్రాణములు దక్కించుకోగోరి సేవకుని తీసి కొని పారిపోయెను. అతడు యూదాలోని బేరైబ పట్టణము చేరుకొని సేవకుడిని అక్కడ వదలివేసెను.
4. తానొక్కడే అరణ్యమున ఒక రోజు ప్రయాణము సాగించెను. ఆ అడవిలో ఒక రేగుచెట్టు క్రింద కూర్చుండి ప్రాణములు విడువగోరెను. “ప్రభూ! ఈ బాధలు ఇకచాలు! నా ప్రాణములను తీసికొనుము. మా పూర్వులకన్నను నేను అధికుడనుగాను, ఇకచాలును" అని పలికెను.
5. అటుల పలికి చెట్టు క్రింద పడుకొని నిద్రించెను. అప్పుడొక దేవదూత అతనిని తట్టిలేపి “నీవు లేచి భుజింపుము" అని చెప్పెను.
6. అతడు మేల్కొని చుట్టును పారజూడగా నిప్పులమీద కాల్చిన రొట్టెయు, ముంతెడు నీళ్ళును తల ప్రక్కనే కన్పించెను.
7. ఏలీయా ఆ రొట్టె తిని, నీళ్ళు త్రాగి మరల నిద్రించెను. దేవదూత రెండవ మారుకూడ అతనిని తట్టి లేపి “లేచి భుజింపుము. నీవు చాలదూరము ప్రయాణము చేయవలయును సుమా!” అనెను.
8. ఏలీయా లేచి రొట్టెతిని, నీళ్ళు త్రాగెను. ఆ ఆహారపు బలముతో నలుబది రోజులు నడచి దేవుని కొండయైన హోరేబును చేరుకొనెను.
9. అతడొక కొండగుహ ప్రవేశించి అచట ఆ రాత్రి గడపెను. అప్పుడు ప్రభువు వాణి “ఏలీయా! నీవిక్కడ ఏమి చేయుచున్నావు” అని ప్రశ్నించెను.
10. ప్రవక్త “మహోన్నతుడవైన ప్రభూ! నా జీవిత కాలమంతయు నిన్నొక్కనినే కొలిచితిని. కాని యిస్రాయేలు ప్రజలు నీవు చేసిన ఒడంబడికను మీరిరి. నీ బలిపీఠమును కూలద్రోసి నీ ప్రవక్తలను చంపిరి. ఇపుడు నీకొరకు మహారోషము గలవాడనై నేనొక్కడిని మాత్రమే మిగిలియున్నాను. కాని వారు నా ప్రాణములనుగూడ తీయగోరుచున్నారు” అనెను.
11. ప్రభువు అతనితో “నీవు కొండమీదికి ఎక్కిపోయి అచట నా ముందట నిల బడుము” అని చెప్పెను. ఏలీయా కొండపైకి ఎక్కగా ప్రభువు అతని ముందట సాగిపోయెను. అపుడు పెను గాలివీచి కొండను బద్దలుగా చీల్చి రాళ్ళను ముక్కలు ముక్కలుగా చేసెను. అయినను ప్రభువు ఆ గాలిలో ప్రత్యక్షముకాలేదు. అటు తరువాత భూకంపము కలిగెను. అయినను ప్రభువు ఆ భూకంపములో ప్రత్యక్షముకాలేదు.
12. అటుపిమ్మట నిప్పు కనిపించెను. అయినను ప్రభువు ఆ నిప్పులో ప్రత్యక్షము కాలేదు. ఆ పిమ్మట నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినిపించెను.
13. ఆ స్వరమును వినగనే ఏలీయా తన అంగీఅంచుతో ముఖము కప్పుకొని వెలుపలికిపోయి కొండబొరియ అంచున నిలుచుండెను. “ఏలీయా! నీవు ఇక్కడ ఏమిచేయుచున్నావు?” అని ఒక స్వరము మాట్లాడెను.
14. ప్రవక్త “మహోన్నతుడవైన ప్రభూ! నా జీవితకాలమంతయు నిన్నొక్కనినే సేవించితిని. కాని యిస్రాయేలు ప్రజలు నీవు చేసిన ఒడంబడికను మీరిరి. నీ బలిపీఠమును కూలద్రోసి, నీ ప్రవక్తలను చంపిరి. నీకొరకు మహారోషముగలవాడనై నేనొక్కడిని మాత్రమే మిగిలియుండగా, వారు నా ప్రాణములను గూడ తీయగోరుచున్నారు” అనెను.
15. ప్రభువు ఏలీయాతో “నీవు తిరిగిపోయి దమస్కు చెంతనున్న అరణ్యము చేరుకొనుము. ఆ పట్టణములో ప్రవేశించి హసాయేలును సిరియాకు రాజుగా అభిషేకింపుము.
16. నిమీ కుమారుడైన యెహూను యిస్రాయేలునకు రాజుగా అభిషేకింపుము. ఆబేల్మెహోలా నివాసియగు షాఫాతు కుమారుడు ఎలీషాను నీ స్థానమున ప్రవక్తగా అభిషేకింపుము.
17. హసాయేలు కత్తిని తప్పించుకొనువారిని యెహూ చంపును. యెహూ కత్తిని తప్పించుకొనువారిని ఎలీషా చంపును.
18. యిస్రాయేలున బాలు ముందట మోకాలు వంచనివారు, అతని విగ్రహమును ముద్దిడు కొనని ఏడువేలమంది నాకు ఇంకను మిగిలియున్నారు” అని చెప్పెను.
19. ఏలీయా అక్కడి నుండి వెడలిపోయి పండ్రెండు అరకలతో దుక్కిదున్నించుచున్న ఎలీషాను చూచెను. ఎలీషా చివరిఅరక తోలుచుండెను. ఏలీయా అతని దగ్గరకు వెళ్ళి తన అంగీని తీసి అతనిపై కప్పెను.
20. ఎలీషా తాను దున్నుచున్న అరకను విడనాడి ఏలీయా వెంటబడి పరుగెత్తెను. అతడు "అయ్యా! నేను ఇంటికి పోయి మా తల్లిదండ్రులయొద్ద సెలవు తీసికొనివత్తును. అటుపిమ్మట నిన్ను అనుసరించెదను” అనెను. ఏలీయా “అట్లే వెళ్ళుము. నేను నీకు అడ్డు పడుట లేదుకదా!” అని పలికెను.
21. ఎలీషా అరక వద్దకు వెళ్ళి రెండెద్దులను చంపెను. అరక కొయ్యనే వంటచెరకుగా వాడి వాని మాంసమును వండి అనుచరులకు వడ్డింపగా వారు భుజించిరి. అటుపిమ్మట అతడు ఏలీయాకు శిష్యుడై అతనికి సేవచేసెను.
1. తనయొద్ద గుఱ్ఱములను, రథములను సమకూర్చుకొనిన ముప్పది ఇద్దరు రాజులు తోడుగా నుండ సిరియా రాజు బెన్హ్-దదు సైన్యమును ప్రోగు చేసుకొని సమరియాను ముట్టడించి వశము చేసికో పోయెను.
2. అతడు సమరియా పట్టణమందున్న యిస్రాయేలు రాజు అహాబు వద్దకు దూతనంపి “బెన్హ్-దదు ఆజ్ఞ ఇది.
3. నీ ఇంటనున్న వెండిబంగారములు, నీ భార్యలలోను, పిల్లలలోను సొగసైనవారు నా వారు” అని వార్త చెప్పించెను.
4. అందులకు అహాబు “నేను నీ ఆజ్ఞకు బద్దుడను. నేనును, నా సమస్తమును నీ సొత్తే” అని ప్రతివార్త పంపెను.
5. కాని సిరియా రాజు దూతలు ఆ ప్రతివార్తనందించి, అహాబువద్దకు మరల తిరిగివచ్చి “బెన్హ్-దదు ఆజ్ఞ ఇది. నీ వెండి బంగారములను, నీ భార్యలను బిడ్డలను నా వశము చేయవలయును.
6. రేపీపాటికి నా సేవకులు నీ వద్దకువత్తురు. వారు నీ ప్రాసాదమును, నీ ఉద్యోగుల భవనములను గాలించి నీ కంటికి విలువగల వానినెల్ల తీసికొందురు” అని చెప్పిరి.
7. అహాబు యిస్రాయేలు నాయకులనందరిని పిలిపించి “చూచితిరా! ఇతడు మనలను నాశనము చేయతలపెట్టెను. నేనితనికి వెండి బంగారములు మరియు భార్యలను, పిల్లలను వశము చేయననలేదు. ఇతడెట్లు హానిచేయ తలపెట్టుచున్నాడో తెలిసికొనుడు” అని పలికెను.
8. ఆ మాటలకు పెద్దలు, ప్రజలు “నీవు సిరియా రాజును లెక్కచేయవద్దు. అతనాజ్ఞను పాటింపవద్దు” అని సలహా ఇచ్చిరి.
9. కనుక అతడు బెన్హ్-దదు దూతలతో "మీ రాజునకిట్లు విన్నవింపుడు. నీ మొదటి ఆజ్ఞను నేనంగీకరించెదను. కాని రెండవ ఆజ్ఞనంగీకరింపజాలను” అనెను.
10. అప్పుడు బెన్హ్-దదు “నేను విస్తార సైన్యముతో వచ్చి నీ పట్టణమును నాశనము చేయుదును. నా సైనికులు నీ నగరమునందు రాళ్ళముక్కలను గూడ మిగులనీయరు. ఇట్లు చేయనేని దేవతలు నా ప్రాణములను బలిగొందురు” అని అహాబునకు ప్రతివార్త పంపెను.
11. యిస్రాయేలు రాజు “కవచమును తాల్చినవాడుకాదు, దానిని విప్పినవాడు శూరుడు” అని అతనికి మరల వార్తపంపెను.
12. బెన్హ్-దదు అతని అనుచరులగు రాజులు శిబిరములలో కూర్చుండి మద్యమును సేవించుచుండగా అహాబు పంపిన వార్త చేరెను. వెంటనే బెన్హ్-దదు తన సైనికులు శత్రుపట్టణమును ముట్టడించుటకు సిద్ధము కావలెనని ఆజ్ఞ ఇచ్చెను. సైనికులందరు యుద్ధమునకు సన్నద్ధులైరి.
13. అంతట ఒక ప్రవక్త యిస్రాయేలు రాజు నొద్దకు వచ్చి “యావే సందేశమిది. నీవు ఈ మహా సైన్యమును చూచి భయపడుచున్నావు కాబోలు. నేడే నీవు ఈ శత్రుబలమును జయింతువు. అప్పుడుగాని నేనే ప్రభుడనని నీవు గుర్తింపజాలవు” అని పలికెను.
14. అహాబు “నాకెవరి సహాయము వలన విజయము సిద్దించును?” అని ప్రశ్నించెను. ప్రవక్త “రాష్ట్రపాలకుల అధీనముననున్న యువ సైనికులు నీకు తోడ్పడుదురు” అని చెప్పెను. రాజు “ఈ యుద్ధమున సేనానాయకుడు ఎవడు?” అని అడుగగా ప్రవక్త “నీవే' అని జవాబిచ్చెను.
15. అహాబు ఆ యువ సైనికులను పరిశీలింపగా వారు రెండువందలముప్పదిఇద్దరుండిరి. అటుతరువాత అతడు యిస్రాయేలు సైన్యమును పరిశీలించి చూడగా ఏడువేలమంది తేలిరి.
16. ఆనాడు మధ్యాహ్నము యుద్ధము ప్రారంభమయ్యెను. అప్పుడు బెన్హ్-దదు అతని అనుచరులు ముప్పది ఇద్దరు రాజులు శిబిరములలో తప్పతాగి మత్తెక్కి ఉండిరి.
17. పోరు మొదలుకాగా, యువ సైనికులు ముందునడచిరి. సమరియానుండి కొందరు సైనికులు వచ్చుచున్నారని గూఢాచారులు బెన్హ్-దదునకు విన్నవించిరి.
18. పోరాటము కొరకొచ్చి నను, సంధికొరకొచ్చినను వారిని ప్రాణములతో పట్టి తీసుకొనిరండని బెన్హ్-దదు ఆజ్ఞ ఇచ్చెను.
19-20. యువ సైనికులు ముందునడువ యిస్రాయేలు సైన్యము వారివెంటనడచెను. వారందరు ఎవరికి ఎదురైన శత్రు సైనికులను వారు చంపివేసిరి. వారిదాడికి నిలువలేక సిరియా సైన్యము పారిపోయెను. యిస్రాయేలు సైన్యము వారిని వెన్నాడెను. బెన్హ్-దదు కొందరు రౌతులు వెంటరాగా గుఱ్ఱమునెక్కి పలాయితుడయ్యెను.
21. యిస్రాయేలు రాజు సిరియారాజు రథములను, గుఱ్ఱములను పట్టుకొనెను. సిరియారాజుకు పెద్ద ఓటమి కలిగెను.
22. అంతట ప్రవక్త అహాబునొద్దకు వచ్చి “నీవు ఇక ఇంటికి వెడలిపోయి నీ సైన్యమును బలపరచుకొ నుము. యుద్ధసన్నాహములు చేయుము. రానున్నయేడు సిరియా రాజు మరల నీపైకి దండెత్తివచ్చును” అని చెప్పెను.
23. అట సిరియారాజు బంటులు అతనితో “యిస్రాయేలు దేవుడు కొండలదేవుడు. కావుననే వారికి మనకంటె అధికబలము కలిగినది. మైదానమున పోరాడెదమేని మనము వారిని జయింపవచ్చును.
24. నీవు ఈ రాజులందరిని వదలించుకొని వీరికి బదులుగా సేనానాయకులను మన సైన్యమునకు అధిపతులుగా నియమింపుము.
25. నిన్ను వదలి పారిపోయినంత సైన్యమునే మరల ప్రోగుచేయుము. అన్ని గుఱ్ఱములను, అన్ని రథములను సమకూర్చు కొనుము. మేము యిస్రాయేలీయులతో మైదానమున పోరాడి వారిని జయింతుము” అనిరి. ఆ ఉపదేశమును విని రాజు వారు చెప్పినట్లే చేసెను.
26. మరుసటి ఏడు బెన్హ్-దదు సిరియా సైనికులను ప్రోగుచేసికొనివచ్చి ఆఫెకువద్ద యిస్రాయేలీయుల నెదిరించెను.
27. యిస్రాయేలీయులు, వారినెదుర్కొన వచ్చి శత్రుసైన్యమునెదుట రెండుదండులుగా విడిది చేసిరి. పొలమున విస్తారముగా వ్యాపించియున్న సిరియా సైన్యముతో పోల్చి చూడగా యిస్రాయేలు దండులు రెండు మేకలమందలవలె కనిపించెను.
28. అప్పుడొక ప్రవక్త అహాబునొద్దకు వచ్చి “యావే సందేశమిది. సిరియనులు నేను కొండల దేవుడననియు, మైదానము దేవుడను కాననియు పలికిరి. వారి మహాసైన్యమును నేను మీ వశము చేసెదను. అప్పుడు నీవు నీ ప్రజలు నేనే ప్రభుడనని గుర్తింతురు” అని చెప్పెను.
29. ఏడుదినములపాటు ఆ సైనికదళములు రెండు ఒకదానియెదుట ఒకటి మోహరించి యుండెను. ఏడవదినమున యుద్దము మొదలాయెను. యిస్రాయేలీయులు సిరియా బంటులను లక్షమందిని చంపిరి.
30. మిగిలినవారు ఆఫెకు పట్టణమునకు పారిపోగా అచట ప్రాకారములు కూలిపడి ఇరువది ఏడువేలమంది చనిపోయిరి. బెన్హ్-దదు పట్టణమునకు పారిపోయి అట ఒక ఇంటిలోపలి గదిలో దాగుకొనెను.
31. ఆ రాజోద్యోగులు అతనితో "అయ్యా! యిస్రాయేలు ప్రభువులు దయాపరులని వింటిమి. మేము నడుమునకు గోనె కట్టుకొని, తలమీద త్రాళ్ళు వేసికొని, యిస్రాయేలు రాజు శరణుజొచ్చెదము. అతడు నిన్ను ప్రాణములతో విడువవచ్చును” అని పలికిరి.
32. రాజు అనుమతిపై వారట్లే అహాబు వద్దకు వెళ్ళి “నీ దాసుడు బెన్హ్-దదు ప్రాణభిక్ష వేడుచున్నాడు” అని పలికిరి. అహాబు “బెన్హ్-దదు ఇంకను బ్రతికియున్నాడా? సరియే, అతడు నాకు సోదరునివంటివాడు” అనెను.
33. ఆ ఉద్యో గులు ఏదైన శుభసమాచారము విన్పించునేమో అని కనిపెట్టుకొనియున్నవారగుటచే, అహాబు ఈ మాటలు పలుకగనే “అవును, బెన్హ్-దదు నీకు సోదరునివంటి వాడు” అని బదులుపలికిరి. రాజు “మీరు పోయి బెన్హ్-దదును తోడ్కొనిరండు” అనగా వారు వెడలిపోయి అతనిని వెంటబెట్టుకొని వచ్చిరి. బెన్హ్-దదు రాగానే అహాబు అతనిని తన రథముమీదికి ఎక్కించుకొనెను.
34. అతడు అహాబుతో “మాతండ్రి మీ తండ్రి యెద్ద నుండి స్వాధీనము చేసికొనిన పట్టణములను తిరిగి నీకిచ్చివేయుదును. మా తండ్రి మీ సమరియాలో వర్తక కేంద్రమును నెలకొల్పినట్లే, నీవును మా దమస్కున వర్తకకేంద్రము నెలకొల్పుకోవచ్చును” అనెను. అహాబు “ఈ షరతులపై నిన్ను స్వేచ్ఛగా వెడలిపోనిత్తును” అనెను. ఆ రీతిగా అహాబు బెన్హ్-దదుతో సంధిచేసికొని అతనిని స్వేచ్ఛగా వెళ్ళిపోనిచ్చెను.
35. అంతట యావే ఆజ్ఞపై, ప్రవక్తల సమాజమునకు చెందిన ప్రవక్తయొకడు తోడిప్రవక్తతో “నీవు నన్నుకొట్టుము” అనెను. కాని తోడి ప్రవక్త అతనిని కొట్టడయ్యెను.
36. అపుడు మొదటి ప్రవక్త రెండవ వానితో “నీవు యావే ఆజ్ఞ మీరితివి కనుక నన్ను వీడి వెళ్ళిపోగానే సింహము నిన్ను చంపివేయును” అని చెప్పెను. ఆ రెండవప్రవక్త మొదటి ప్రవక్తను వీడి వెళ్ళిపోగానే ఒక సింహము అతనిమీదబడి వానిని చంపివేసెను.
37. మొదటి ప్రవక్త మరల వేరొకని వద్దకు వెళ్ళి “నన్ను కొట్టుము” అనెను. ఆ రెండవవాడు అతనిని కొట్టి గాయపరచెను.
38. గాయపడిన ప్రవక్త తన్ను గుర్తించుటకు వీలుకానట్లు ముఖమునకు గుడ్డతో కట్టుకట్టుకొని పోయి రాజపథమున నిలబడి రాజు రాకకై ఎదురుచూచుచుండెను.
39. అంతట అహాబు ఆ మార్గమున రాగా అతడు రాజును గొంతెత్తి పిలిచి “ప్రభూ! నేను యుద్ధమున పోరాడుచుండగా తోడి సైనికుడు శత్రు సైనికునొకనిని చెరపట్టి నా వద్దకు కొనివచ్చెను 'నీవు వీనికి కావలి కాయుము. వీడు తప్పించుకొని పోయెనేని వీని ప్రాణములకు మారుగా నీ ప్రాణము పోవును, లేదా నీవు మూడువేల వెండినాణెములైన చెల్లింపవలెను' అని చెప్పెను.
40. కాని ఈ దాసుడు ఏదో పనిలో చిక్కు కొని కొంచెము ఏమరియుండగా శత్రు సైనికుడు తప్పించుకొని పోయెను” అని చెప్పెను. అహాబు అతనితో “ఇకనేమి, నీ శిక్షను నీవే నిర్ణయించుకొంటివి. అపరాధము చెల్లింపుము” అనెను.
41. వెంటనే అతడు తన ముఖముమీది కట్టువిప్పగా రాజు అతడు ప్రవక్తయని గ్రహించెను.
42. అంతట ప్రవక్త రాజుతో “యావే సందేశమిది. నేను శాపము పాలుచేసి చంపివేయుమని చెప్పిన నరుని నీవు ప్రాణములతో పోనిచ్చితివి. కనుక అతని ప్రాణమునకు బదులుగా నీ ప్రాణము చెల్లింతువుగాక! అతని సైనికులకు మారుగా నీ సైనికులు ప్రాణములు కోల్పోవుదురు” అని పలికెను.
43. ఆ మాటలు విని రాజు విచారముతో ముఖము చిన్నపుచ్చుకొని సమరియా నగరమందలి తన మేడకు వెడలిపోయెను.
1. యెస్రెయేలు నగరమున నాబోతు అనువానికి ఒక ద్రాక్షతోట కలదు. అది అహాబు రాజు ప్రాసాదము చెంతనే ఉండేను.
2. ఒకనాడు రాజు అతనితో “నీ తోట నా ప్రాసాదమునకు దగ్గరగా ఉన్నది. కనుక దానిని నాకిచ్చివేయుము. నేను దానిలో కూరగాయలు పండించుకొందును. దీనికంటె మంచి ద్రాక్షతోటని ఇంకొక దానిని నీకిత్తును. లేదా నీకు అనుకూలమైన యెడల దాని వెలయైన ఇత్తును” అనెను.
3. కాని నాబోతు “అయ్యా! ఇది నా పిత్రార్జితమైన నేల. యావే జీవముతోడు, ఈ తోటను నేను అమ్మను” అని పలికెను.
4. నాబోతు మాటలకు రాజు ముఖము చిన్న బుచ్చుకొని కోపముతో ఇల్లు చేరుకొనెను. అతడు పాన్పుపై పరుండి ఆవలివైపు ముఖము త్రిప్పుకొని అన్నపానీయములు ముట్టడయ్యెను.
5. అహాబు భార్య యెసెబెలు అతనిని సమీపించి “నీవింతగా విచా రించుచు, అన్నము మానివేయవలసినంత ఆపద ఏమి వచ్చినది?” అని అడిగెను.
6. అతడు ఆమెతో “నేను నాబోతును ద్రాక్షతోట అమ్ముమని అడిగితిని. దాని వెలగాని లేదా దానికి బదులు మరియొక తోటగాని ఇచ్చెదనంటిని. కాని అతడు ఆ ద్రాక్షతోటను అమ్మ ననెను” అని చెప్పెను.
7. ఆమె అతనితో “యిస్రాయేలు రాజు సామర్థ్యము ఇంతేనా? నీవు పడకమీదినుండి లేచి భోజనముచేసి ఉత్సాహము తెచ్చుకొనుము. నాబోతు తోటను నేనే నీకిప్పించెదను” అని అనెను.
8. ఆమె అహాబు పేరుతో జాబులు వ్రాసి వాని మీద రాజముద్ర వేసెను. జాబులను యెస్రెయేలు నందలి అధికారులకును, పెద్దలకును పంపించెను.
9. ఆ జాబులలో “మీరు ఉపవాసదినమును ప్రకటించి ఆ రోజున ప్రజలను ప్రోగుచేయుడు. నాబోతును ప్రజల ఎదుటికి కొనిరండు.
10. అతడు దేవుని, రాజును దూషించెనని ఇద్దరు దుర్మార్గులచేత కూటసాక్ష్యము చెప్పింపుడు. అటుపిమ్మట నాబోతును నగరము వెలుపలికి కొనిపోయి రాళ్ళతో కొట్టి చంపింపుడు” అని వ్రాసెను.
11. యెస్రెయేలు నగరపు అధికారులు, పెద్దలు యెసెబెలు వ్రాసి పంపినట్లే చేసిరి.
12. వారు ఉప వాసదినమును ప్రకటించిరి. ఆనాడు ప్రజలను ప్రోగు చేసి నాబోతును వారి ముందునిల్పిరి.
13. ఇద్దరు దుర్మార్గులు నాబోతు ఎదుటికి వచ్చి అతడు దేవుని, రాజును దూషించెనని అబద్దసాక్ష్యము పలికిరి. ప్రజలు నాబోతును పట్టణము వెలుపలికి కొనిపోయి రాళ్ళతో కొట్టిచంపిరి.
14. అటుపిమ్మట వారు నాబోతును రాళ్ళతో కొట్టి చంపితిమని యెసెబెలునకు వార్త పంపిరి.
15. ఆ వార్తను అందుకొనగనే యెసెబెలు అహాబుతో “నీవు వెళ్ళి నాబోతు అమ్మననిన తోటను స్వాధీనము చేసికొనుము. అతడు ప్రాణములు విడిచెను” అని చెప్పెను.
16. నాబోతు చనిపోయెనని తెలిసికొని అహాబు తోటను స్వాధీనము చేసికొనుటకు యెస్రెయేలునకు వెళ్ళెను.
17-18. అంతట ప్రభువు వాణి తిప్పీయుడగు ఏలీయా ప్రవక్తతో “నీవు సమరియా రాజు అహాబు నొద్దకు వెళ్ళుము. అతడు నాబోతు ద్రాక్షతోటను స్వాధీనము చేసికొనబోయినాడు. ఆ తోటలోనే అతనిని కలిసికొనుము,
19. నా మాటలుగా అతనితో ఇట్లు చెప్పుము 'నీవొక నరుని చంపి అతని పొలమును స్వాధీనపరచుకున్నావు. నాబోతు నెత్తుటిని కుక్కలు నాకిన తావుననే నీ నెత్తురును కూడ కుక్కలు నాకును. ప్రభువైన నా పలుకులివి' అని చెప్పుము” అనెను.
20. ఏలీయా కనబడగానే అహాబు అతనితో “నీవు నాకు శత్రుడవు. నన్ను గుర్తుపట్టి ఇక్కడికి వచ్చితివా?” అనెను. ఏలీయా “అవును. నీవు ప్రభువు ఆజ్ఞ మీరి దుష్కార్యములకు పాల్పడితివి.
21. ప్రభువు పలుకులు వినుము. నేను నిన్ను నాశనము చేయుదును. నీ వంశము వారిని అందరిని రూపుమాపుదును. నీ కుటుంబమున పుట్టిన మగవారినందరిని పెద్దలనక పిల్లలనక సర్వనాశనము చేసితీరుదును.
22. నీ కుటుంబము నెబాతు కుమారుడగు యరోబాము రాజ కుటుంబమువలెను, అహీయా కుమారుడగు బాషా రాజు కుటుంబమువలెను పూర్తిగా కానరాకుండ పోవును. నీవు యిస్రాయేలును పాపమునకు పురికొల్పితివి. నా కోపమును రగుల్కొల్పితివి.
23. మరియు యెసెబెలునుగూర్చి ప్రభువిట్లు నుడువుచున్నాడు. యెస్రెయేలు పట్టణమున కుక్కలామె శవమును పీకు కొని తినును.
24. నీ బంధువులెవరైన పట్టణమున చత్తురేని శునకములు వారిని తినివేయును. ఎవరైన పొలమున చత్తురేని రాబందులు వారిని తినివేయును” అని పలికెను.
25. అహాబువలె దేవునాజ్ఞ మీరి దుర్మార్గపు పనులు చేసినవాడు మరొకడులేడు. అతడు తన భార్య యెసెబెలు ప్రోద్బలము వలన కానిపనులు చేసెను.
26. విగ్రహారాధనకు పాల్పడి సిగ్గుమాలినపనులు చేసెను. పూర్వము అమోరీయులు ఇట్టి సిగ్గుమాలిన పనులు చేయుచుండగా ప్రభువు వారిని ఓడించి యిస్రాయేలీయుల ఎదుట నిలువకుండ తరిమి వేసెను.
27. ఏలీయా ఇట్లు పలుకగా అహాబు బట్టలు చించుకొని గోనెకట్టుకొనెను. ఉపవాసము ఉండెను. గోనె మీదనే పండుకొని నిద్రించెను. విచారముతో మెల్లగా అడుగులు వేసెను.
28-29. అంతట ప్రభువు వాణి ఏలీయా ప్రవక్తతో “చూచితివా! అహాబు నాకు జడిసి వినయము తెచ్చుకొనెను. అహాబు నాకు లొంగెను కనుక అతనిని తన జీవితకాలమున శిక్షింపను, కాని అతని కుమారుని కాలమున అతని కుటుంబమును నాశనము చేయుదును” అని చెప్పెను.
1. యిస్రాయేలు సిరియా దేశముల మధ్య మూడేండ్లపాటు యుద్ధములేమియు జరుగలేదు.
2. మూడవఏట యూదారాజగు యెహోషాఫాత్తు యిస్రాయేలు రాజగు అహాబును చూడవచ్చెను.
3. అప్పుడు అహాబు తన ఉద్యోగులతో “రామోతుగిలాదు మనదే గదా! అయినను సిరియా రాజునుండి దానిని ఇంత వరకు స్వాధీనము చేసికోమైతిమి” అనెను.
4. మరియు అహాబు “నేను రామోతు మీదికి యుద్ధమునకు పోయినచో నీవు నాకు సహాయము చేయుదువా?” అని యెహోషాఫాత్తును అడిగెను. అతడు “నీవు యుద్ధమునకు సిద్ధపడినచో నేను మాత్రమురానా? నేను నీవాడినే, నా ప్రజలు నీ ప్రజలే, నా గుఱ్ఱములు నీ గుఱ్ఱములే.
5. కాని మొదట ప్రభువును సంప్రతించి చూడుము” అని చెప్పెను.
6. కనుక అహాబు తన నాలుగువందల మంది ప్రవక్తలను పిలిపించి “నేను రామోతుమీదికి దండెత్తి పోవచ్చునా పోగూడదా?” అని ప్రశ్నించెను. వారందరు “దండెత్తుము. ప్రభువు ఆ నగరమును నీ స్వాధీనము చేయును” అనిరి.
7. కాని యెహోషాఫాత్తు “ప్రభువును సంప్రతించుటకు ఇక్కడ ఇతర ప్రవక్తలు లేరా?” అని అడిగెను.
8. అహాబు “ఇమ్లా కుమారుడు మీకాయా ఉన్నాడు. అతని ద్వారా గూడ దేవుని సంప్రతింపవచ్చును. కాని మీకాయా నన్ను గూర్చి చెడునే చెప్పును గాని మంచి మాట ఒక్కటియు చెప్పడు. అతడనిన నాకుగిట్టదు” అనెను. ఆ మాటలకు యెహోషాఫాత్తు “ప్రభువు అటుల అనరాదు” అనెను.
9. అపుడు అహాబు సేవకుని పిలిచి “నీవు వెళ్ళి మీకాయాను త్వరగా తోడ్కొనిరమ్ము" అని చెప్పెను.
10. రాజులిద్దరు రాజవైభవముతో విలువగల దుస్తులు దాల్చి సమరియా నగరద్వారమునకు వెలుపల నున్న కళ్ళమువద్ద సింహాసనములపై ఆసీనులై యుండిరి. ప్రవక్తలందరు వారి ఎదుట ప్రోగై ప్రవచనములు చెప్పుచుండిరి.
11. కెనానా కుమారుడగు సిద్కియా ప్రవక్త ఇనుపకొమ్ములు చేయించుకొనివచ్చి, అతడు అహాబుతో “యావే సందేశమిది. నీవు సిరియనులను ఈ కొమ్ములతో పొడిచి రూపుమాపుదువు" అని చెప్పెను.
12. ఇతర ప్రవక్తలు అతని పలుకులను సమర్థించుచు “నీవు రామోతు మీదికి దండెత్తిపోయి దానిని జయింపుము. ప్రభువు ఆ నగరమును నీ వశము చేయును” అని పలికిరి.
13. మీకాయాను తోడ్కొని రాబోయిన సేవకుడు అతనితో “ప్రవక్తలందరు ఏకకంఠముతో రాజునకు విజయము కలుగునని పలికిరి. నీవును అట్లే చెప్పుము” అనెను.
14. కాని మీకాయా అతనితో “యావే జీవముతోడు. నేను ప్రభువు నాచే పలికించిన పలుకులే పలికెదను” అని నుడివెను.
15. అతడు రాగానే రాజు “మీకాయా! నీవేమందువు? మేము రామోతు మీదికి దండెత్తిపోవచ్చునా, పోగూడదా?” అని యడిగెను. కాని మీకాయా “పొండు, మీకు విజయము సిద్ధించును. ప్రభువు నగరమును మీ వశము చేయును” అనెను.
16. కాని అహాబు “ఓయి! నీవు ప్రభువు పేర సత్యమునే చెప్పవలెనని నేనెన్నియో మారులు నిన్ను హెచ్చరింపలేదా?” అని అతనిని మందలించెను.
17. అప్పుడు మీకాయా ఇట్లు పలికెను: “యిస్రాయేలీయులు కాపరిలేని మందవలె కొండల మీద చెల్లాచెదరైరి. అది చూచి ప్రభువు 'ఈ ప్రజలకు నాయకుడులేడు, కనుక వీరిని నిశ్చింతగా ఇంటికి వెళ్ళిపొమ్మనుడు' "అనెను.
18. ఆ మాటలువిని అహాబు యెహోషాఫాత్తుతో “వింటివా! ఇతడు నన్ను గూర్చి ఒక్క మంచిమాట చెప్పడు. ఇతడు చెప్పునవన్ని చేటుమాటలే అని నీతో చెప్పలేదా!” అనెను.
19. అప్పుడు మీకాయా ఇంకా ఇట్లు చెప్పెను. “ప్రభువు పలుకులు వినుము. యావే సింహాసనాసీనుడై ఉండగా చూచితిని. పరలోక సైన్యము అంతయు ఆయనకు ఇరువైపుల కొలువుదీరి ఉండుట చూచితిని.
20. అప్పుడు ప్రభువు “అహాబును మోసపుచ్చి అతడు రామోతు యుద్ధమునకు పోయి అచ్చట ప్రాణములు కోల్పోవునట్లు చేయువారెవ్వరు?” అని ప్రశ్నించెను. ఆ ప్రశ్నకు కొందరుఇట్లని, మరికొందరు అట్లని సూచనలు చేసిరి.
21. కడన ఒక ఆత్మ దేవుని ముందు నిలుచుండి 'నేను అతనిని మోసగింతును' అనెను.
22. ప్రభువు 'నీవెట్లు మోసగింతువో చెప్పుము' అని అడుగగా ఆ ఆత్మ 'నేను వెళ్ళి అహాబు ప్రవక్తలందరు నోరార అబద్దమాడునట్లు చేసెదను' అనెను. ప్రభువు ఆ ఆత్మతో 'అట్లే వెళ్ళి అహాబును మోసగింపుము. నీ పని నెరవేరును” అనెను.
23. ఈ రీతిగా ప్రభువు నీ ప్రవక్తలు కల్లలాడునట్లు చేసెను. కాని ప్రభువు మాత్రము నిన్ను నాశనము చేయ నెంచెను." .
24. ఆ పలుకులాలించి కెనానా కుమారుడగు సిద్కియా మీకాయా చెంతకు వెళ్ళి అతని చెంపలు వాయించి “నాయనా! దేవుని ఆత్మ నన్ను వదలిపెట్టి నీతో మాట్లాడినదా? అది ఎప్పటినుండి?” అని అడిగెను.
25. మీకాయా “నీవు లోపలగదిలో దాగు కొనుటకై పారిపోయిన రోజున నీకే తెలియును?” అని జవాబిచ్చెను.
26-27. అంతట అహాబురాజు తన ఉద్యోగితో “మీకాయాను బంధించి నగర పాలకుడు ఆమెను వద్దకును రాజకుమారుడు యోవాషు నొద్దకును కొనిపొమ్ము. ఇతనిని చెరలో త్రోయింపవలసినదనియు, నేను యుద్ధమునుండి సురక్షితముగ తిరిగివచ్చువరకు చాలీచాలని రొట్టె, నీళ్ళు మాత్రమే ఈయవలెననియు వారితో చెప్పుము” అని పలికెను.
28. కాని మీకాయా “నీవు సురక్షితముగా తిరిగి వత్తువేని ప్రభువు నా ద్వార మాట్లాడలేదు. ఇచటి వారెల్లరు నా పలుకులు ఆలింపుడు” అని అనెను.
29. యిస్రాయేలు రాజగు అహాబు, యూదా రాజగు యెహోషాపాతు గిలాదునందలి రామోతును ముట్టడింపబోయిరి.
30. అహాబు యెహోషాఫాత్తుతో “నేను మారు వేషమున యుద్ధమునకు వత్తును. నీవు రాజవస్త్రములతోనే రమ్ము” అని చెప్పెను. తాను చెప్పినట్లే అహాబు మారువేషమున వచ్చెను.
31. అట సిరియా రాజు తన ముప్పదిద్దరు రథాధిపతులతో యిస్రాయేలు రాజును తప్ప మరెవ్వరిని పోరున ఎదిరింపవలదని చెప్పెను.
32. ఆ అధిపతులు యెహోషాఫాత్తును చూచి యిస్రాయేలు రాజు అన్న అను భ్రమతో అతనిని ఎదిరించిరి. వారిని చూచి యెహోషాఫాత్తు బిగ్గరగా అరచెను.
33. ఆ వీరులు అతడు యిస్రాయేలు రాజు కాదని గుర్తించి అతనిని వదలి వేసిరి.
34. అప్పుడొక సిరియా సైనికుడు యాదృచ్ఛికముగా విల్లెక్కుపెట్టి బాణమువేయగా అది అహాబు రాజు కవచపు అతుకుల మధ్యలో గ్రుచ్చు కొనెను. రాజు తన సారథితో “నాకు గాయము తగిలినది. రథమును యుద్ధభూమినుండి ఆవలికి తరలింపుము" అనెను.
35. పోరు ముమ్మరముగా సాగుచుండగా అహాబు సిరియా సైన్యమువైపు మళ్ళి రథముమీద ఆనుకొని నిలుచుండియుండెను. అతని గాయమునుండి నెత్తురు ధారగా కారి రథమును తడిపి వేసెను. ఆ మాపటిపూట అతడు మరణించెను.
36. సాయంకాలమగునప్పటికి యిస్రాయేలు సైన్యమున “మన సైనికులందరు ఎవరి మండలములకు, పట్టణములకు వారు తిరిగిపొండు” అను కేక విన్నించెను.
37. అహాబు శవమును సమరియా నగరమున పాతిపెట్టిరి.
38. రాజు రథమును సమరియా మడుగున కడుగగా అతని రక్తమును కుక్కలు నాకెను. ఆ రక్తపు నీటనే వేశ్యలు స్నానమాడిరి. ప్రభువు చెప్పినట్లే ఇది అంతయు జరిగెను.
39. అహాబు చేసిన ఇతర కార్యములు అనగా అతడు దంతపు మేడను కట్టుట, పట్టణములను నిర్మించుట-యిస్రాయేలు రాజుల చరితమున వర్ణింప బడియేయున్నవి.
40. అహాబు మరణానంతరము అతని కుమారుడు అహస్యా రాజయ్యెను.
41.యిస్రాయేలు రాజ్యమున అహాబు రాజుగానున్న నాలుగవయేట ఆసా కుమారుడగు యెహోషాఫాత్తు యూదా రాజ్యమునకు రాజయ్యెను.
42. అప్పుడు అతని వయస్సు ముప్పది ఐదేండ్లు. అతడు యెరూషలేమున ఇరువది ఐదేండ్లు పరిపాలించెను. అతని తల్లి షీల్హీ కుమార్తెయైన అసూబా.
43. తన తండ్రి ఆసావలె యెహోషాఫాత్తు కూడ సత్కార్యములు చేసి ప్రభువునకు ఇష్టుడయ్యెను.
44. కాని అతడు అన్య దైవములను కొలుచుటకు ఉన్నతస్థలముమీద నిర్మించిన బలిపీఠములను తొలగింపలేదు. వాని యందు ప్రజలు బలులు సమర్పించి సాంబ్రాణిపొగ వేయుచునే యుండిరి.
45. యెహోషాఫాత్తునకును యిస్రాయేలునకును మధ్య సంధి కుదిరెను.
46. యెహోషాఫాత్తు చేసిన ఇతర కార్యములు, అతడు చూపిన పరాక్రమము, చేసిన యుద్ధములు యూదారాజుల చరితమున వర్ణింపబడియేయున్నవి.
47. అతడు వేశ్యలవలె ప్రవర్తించు మగవారిని మట్టుపెట్టెను. వీరు తన తండ్రి ఆసా గతించినప్పటి నుండి మిగిలియున్నవారు.
48. ఆ కాలమున ఎదోమునకు రాజులేడు. యూదా రాజు నియమించిన రాజప్రతినిధి ఆ దేశమును పరిపాలించెను.
49. యెహోషాఫాత్తు తర్షీషు ఓడలను నిర్మించి బంగారమును కొనితెచ్చుటకు వానిని ఓఫీరు మండలమునకు పంపనెంచెను. కాని అవి త్రోవలో ఏసోన్గబెరున బ్రద్దలైపోయినందున గమ్యము చేరలేదు.
50. యిస్రాయేలు రాజు అహస్యా తన నావికులను యెహోషాఫాత్తు నావికులతో పంప నెంచెను గాని అతడందుకు సమ్మతింపలేదు.
51. యెహోషాఫాత్తు తన పితరులతో నిద్రించి, తన పితరుడైన దావీదుపురముననే పాతి పెట్టబడెను. అటుపిమ్మట అతని కుమారుడు యెహోరాము రాజయ్యెను.
52. యూదా రాజ్యమున యెహోషాపాత్తు పరిపాలనకాలము పదునేడవయేట, యిస్రాయేలు రాజ్యమున అహాబు కుమారుడగు అహస్యా రాజు అయ్యెను. ఆ రాజు సమరియా నగరమున రెండేండ్లు పరిపాలించెను.
53. అతడు ప్రభువు ఆజ్ఞ మీరి దుష్కార్యములు చేసెను. అహస్యా తన తల్లిదండ్రులిద్దరి ప్రవర్తనను, యిస్రాయేలు ప్రజలను పాపమునకు పురికొల్పిన నెబాతు కుమారుడు యరోబామును అనుకరించి చెడుపనులు చేసెను.
54. బాలు దేవతను కొలిచి, తన తండ్రివలె తానును యిస్రాయేలు దేవుడైన ప్రభువు కోపమును రెచ్చగొట్టెను.